కలిమితో కబుర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కలిమితో కబుర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, మార్చి 2025, ఆదివారం

కాఫీ విత్ కలిమి - 8 - ఒమాప్ర - పమాజ

    

    ఇంతకు ముందు చెప్పిన బోల్డన్ని కలిమితో కబుర్లు

  1. కాఫీ విత్ కలిమి - 1 - ఫస్ట్ సిప్
  2. కాఫీ విత్ కలిమి - 2 - రెలిజియన్, పాలిటిక్స్, గ్రేట్ పంప్కిన్ ....అదే వరసలో... పిల్లలూ, ఫిల్ములూ...
  3. కాఫీ విత్ కలిమి - 3 - "కలి-మి"తో కబుర్లు
  4. కాఫీ విత్ కలిమి - 4 - టీనేజ్ vs. బీనేజ్
  5. కాఫీ విత్ కలిమి - 5 - అనగా వంచించారు - తినగా వంచినచారు
  6. కాఫీ విత్ కలిమి - 6 - హింసధ్వని విని ఆయె హంసానంది!
  7. కాఫీ విత్ కలిమి - 7 - A friend in teens is a friend in beens అన్న ఓ Guyయాళి



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

ఆ హోటల్మేడలో 
ఇరవైనాలుగో అంతస్తులో
ఇరునాలుగుల గదిలో...

నింగిలో చూపు సారించినంతటా కమ్ముకున్న నల్లనల్లని మొయిళ్లు
నేల మీద చూపానినంత మేరా పరచుకున్న నీలినీలి సంద్రపు నీళ్లు
ఆ నీటి మధ్య దీపాల దీవిలా మెరుస్తున్న అంతస్తుల మేడలు
ఆ నింగినీ - ఈ నేలనీ
మేడల కొమ్మున వేలాడే మిలమిలలాడే దీపాల దండల్నీ
కనులెదుట చిత్తరువులా నిలిపింది
నిలువెత్తు కిటికీ అద్దం...

చూపుకందినవి చేతికందక 
గాలి సోకనీయని గాజు తెరల మాటున
ఒంటికంబపు మేడలో చిక్కిన చిలకప్రాణంలా వుంది నా పరిస్థితి...

"కభీ తన్‌హాయియోం మే యూఁ
హమారీ యాద్ ఆఏగీ...
అంధేరే చా రహే హోంగే
కి బిజ్‌లీ కౌంధ్ జాఏగీ..."

ముబారక్ బేగం - ఓ... తెగ - పెదవుల మీద మూగి మోగిపోతోంది.

అప్పుడు మోగింది నా చేతిలో వున్న ఫోన్ - కలిసొచ్చే కాలానికి కలిమితో కబుర్లన్నట్టు. 




    ఇహ ఇవాళ్టి నా blog కబుర్లు... ఆరోజు  - కలిమితో  - మాటాడుకున్న - మాటలతో ఆడుకున్న  కబుర్లు...


    "హలో! ఎలా వున్నావ్? ఏం చేస్తున్నావ్?"

    "నేను బావున్నా. నువ్వూ?"

    "నేనూ బాగుగానున్నానూ...బాగుగానూ, నున్నగానూనూ" 

    "నువ్వు మరీనూ... నువ్వు నున్నేంటీ?"

    "నేన్నున్న కాక సన్నేంటీ? అద్సరే గానీ... మధ్యాహ్నం రెండయ్యింది....ఏమన్నా తిన్నావా?"

    "హ్మ్... తింటున్నా"

    "ఏం తింటున్నావ్?"

    "అన్నం"

    "ఏం వేసుకునీ?"

    "పచ్చడి"

    "ఏం పచ్చడీ?"

    "ఆవకాయ"

    "అబ్బా! 'ఏమన్నా తిన్నావా?' అన్న ప్రశ్నే సవివరముగా వివరింపుము అన్నట్టు లేదూ? దానికెంతైనా చెప్పొచ్చు కదా! అలా  అడిగితే ఒక్క వాక్యంలో 'ఇప్పటి దాకా తినలేదూ, ఇప్పుడే నీ ఫోన్ వచ్చేముందే మొదలుపెట్టి ఆవకాయ కలుపుకుని అన్నం తింటున్నాన'ని  చెప్పొచ్చు కదా?! ఇలా బిట్టు పేపర్లో సమాధానాల్లా ఒమాజలు ఇస్తావేంటీ?"

    "ఒమాజలు...? అంటే?"

    "ఓ పద్నిమిషాలు పోనీ...నీకే అర్థమౌతుంది. నేను ఫోన్ చేసి ఏమడుగుతానో, దానికి ఏం జవాబిస్తే దానికి ఇంకేమంటానో, ఎందుకొచ్చిన తలనొప్పని ముందే ఆలోచించుకుని - నేనేదడిగినా ఒక్కటంటే ఒక్క మాటలో మాత్రం బదులిద్దామనుకున్నట్టున్నావ్ కదూ!"

    "ఛా...అలా ఏం కాదు."

    "ఆ 'ఛా' అని ఒత్తి పలకడంలోనే తెల్సిపోతోంది - అది అలానే అని"

    "నువ్వైతే ఎలా చెప్తావు తల్లీ?"

    "నేనా...?! ఒక మార్కు ప్రశ్నక్కూడా పది మార్కుల జవాబు రాసే రకం"

    "క్లుప్తంగా చెప్తే బావుంటుందని. నువ్వే అంటుంటావు కదా Beauty lies in simplicity అని." 

    "అంటుంటాలే - కానీ అవి నా మాటలు కాదు. ఎవరో అన్నవి. నచ్చాయని అంటుంటా.  నేనైతే 'క్లు...కు....మీ...తె....' అంటా"

    "హహ్హహ్హహ్హా! "క్లు...కు....మీ...తె...." అంటే...?"

    "అంటే క్లుప్తత కుత్తుక మీదికి తెస్తుంది? నీకు చీమ కథ తెలుసు కదా?"

    "ఏ చీమ కథా?"

    "అనగనగా ... అనేకానేక చీమల్లో ఓ అనామక చీమ. శివుడాజ్ఞ లేందే కుట్టలేకపోతున్నానని కోపమొచ్చి ఆ శివుడి తోనే తేల్చుకుందామని తపస్సు చేసింది. శివయ్యొచ్చి 'చీమా ...చీమా ...! ఏం కావాలీ?' అనడిగితే బెట్టుకి పోయి క్లుప్తంగా 'కుట్టాలీ, చావాలీ' 'అంది. శివయ్య 'అలాక్కానీ' అన్నాడు. అంతే! అప్పటికప్పుడు కంటిక్కనిపించి-కాలికడ్డొచ్చినవాణ్ణొకణ్ణి కుట్టింది. వాడు చెయ్యెత్తి-చెళ్లున-చరిస్తే కిక్కురుమనకుండా టిక్కుమంది. అదే ఆ పిచ్చిమొహం చీమ అంత పోజు కొట్టకుండా 'నేను కుట్టాలీ, నే కుట్టినవాడు చావాలీ'' అనుంటే అంతటి చీమా అప్పట్నుంచీ ఇప్పటిదాకా బోల్డుమందిని కుట్టుకుంటూ బతికిపోయేది కదా? 


    "హహ్హహ్హహ్హా! భమే బావుంది నీ చీమ-కథ. అవునూ... ఇంతకీ నువ్వు తిన్నావా?"

    "నేనా...నేను ఇవాళసలే పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ చెయ్య లేదు. బాగా ఆకలేస్తోందని కొంచెం తొందరగా పదకొండింటికే భోంచేసేద్దామని అనుకున్నానా? అనుకోకుండా ఆఫీసు కాల్ ఒకటి బాగా సాగి అదయ్యేటప్పటికి దాదాపు పన్నెండున్నరైపోయింది. పోనీ అప్పుడైనా తిందామనుకుంటే ఇంతలో ఇంట్లో కిచెన్ సింక్ కుళాయి బాగు చెయ్యటానికి - అంటే అచ్చంగా ఇవాళే బాగు చెయ్యడానికి కాదూ - అసలు బాగు చెయ్యడానికి ఎంతవుతుందో ఎస్టిమేట్ ఇవ్వడానికి ప్లంబర్ ఒకతను వచ్చాడు. అతను అటు ఒంగీ, ఇటు ఒంగీ - ఆ కుళాయిని ఇటు వంచీ, అటు తిప్పీ అన్ని కోణాల్లోంచి పరీక్ష చేసి అదింక బాగుపడదూ, ఏ హోండిపోకో వెళ్లి కొత్తది తెచ్చుకున్నాక కబురు చెయ్యి , అప్పుడొచ్చి ఈ పాతది తీసి ఆ కొత్తది బిగించడానికి ఎంతవుతుందో చెప్తా అని చెయ్యూపి వెళ్లిపోయాడు. అప్పటికి గడియారం ముళ్లు పెద్దదీ, చిన్నదీ కూడా ఒకటి మీద ఒకటిగా కలిసిపోయాయి. అంటే అర్థమయింది కదూ...ఒంటిగంట దాటి ఐదు నిముషాలయింది. అంటే నీ కర్థం కాదని కాదూ...M.S. చేశావు, ఆ మాత్రం తెలీకుండా వుంటుందా? ఇంతకీ ...నువ్వడిగిన దానికి నేనింకా జవాబు చెప్పనేలేదు కదూ! ఇంకప్పటికి ఆకలి కూడా అటకెక్కినట్టనిపించింది - ఓ అరటిపండు తిని ఓ కప్పుడు పాలు తాగాను. అదీ నా భోజనం ఈ పూటకి."

    "ఊఁ "

    "హహ్హహ్హ! ఇంతవరకు చెప్పిందంతా అర్థమయిందని 'ఊఁ' అన్నావా? లేకపోతే ఇప్పటికైనా ఆపానని 'ఊఁ' అని నిట్టూర్చావా?"

    "నువ్వు మరీనూ...నీతో మాట్లాడుతుంటే ఊపిరి తీసుకోవడానికే gap ఉండదు - ఇంక నిట్టూర్పుల మాటెక్కడా?"

    "అవునూ...నువ్వు గమనించావా?"

    "ఏంటి?"

    "అదే ... 'నువ్వు తిన్నావా?' అన్న నీ చిన్ని ప్రశ్నకి 'అవునూ, కాదూ' అని ఒక్క మాటలో జవాబు చాలు కదా? కానీ అతి-సంకల్పిత-ప్రతీకారచర్యలా ఇంత పొడుగున పమాజ చెప్పా"

    "పమాజ...అంటే?"

    "అంటే...నీది ఐదు మార్కుల ప్రశ్నకి ఒమాజ ఐతే నాది ఒక మార్కు ప్రశ్నకి పమాజ."

    "అర్థం కాలే!"

    "అంటే ...ఇప్పుడు ఎవడైనా నన్ను మల్టిపుల్ చాయిస్ ప్రశ్నకి సమాధానం రాయమని అడిగాడనుకో...

ప్రశ్న: అన్నం తిన్నావా? 
ఆప్షన్ ఎ) తిన్నా, 
ఆప్షన్ బి) తింటా, 
ఆప్షన్ సి) తినబోతున్నా 
ఆప్షన్ డి) నన్ అఫ్ ది ఎబౌ

    నేనేం చేస్తానో తెలుసా 'ఆప్షన్ డి) నన్ అఫ్ ది ఎబౌ' మీద టిక్కు పెట్టి ఆ ప్రశ్నకి పైనా కిందా వున్న ఖాళీల్లో నేనా పైన చెప్పిందంతా ఇరికించి ఇరికించి మరీ రాస్తా. అడిగినవాడు తిండీ-తిప్పలు మర్చిపోయి నానుంచి తప్పించుకోవడానికన్నట్టు కుదిరితే తీర్థయాత్రకి , కుదరకపోతే తీహార్ జైలుకైనా వెళ్లిపోవడానికైనా సిద్ధపడి అడ్డదారిలో పరిగెట్టుకుని పారిపోతాడు."

    "హహ్హహ్హ....నువ్వున్నావే !"

    "ఆ...ఆ...వున్నానూ, వుండాల్సిందాననూనూ" 

    "ఇప్పుడర్థమైందిలే ! అందరూ పదిమార్కుల ప్రశ్నకి ఒక మార్కొచ్చే జవాబు రాస్తే నువ్వు మాత్రం ఒకమార్కు ప్రశ్నక్కూడా పదిమార్కుల జవాబు రాస్తానంటావ్, అంతేనా?"

    "అంతే...అంతే...ఈ రోజుకి ఈ ప్రసారం సమాప్తమంతే ...మళ్లీ ఇంకెప్పుడైనా మాట్లాడుకుందామంటే ఫర్వాలేదంటావా ఐతే?!"

    "సరే...  సరే ... నువ్వలా అంటే నేను 'ఊఁ' అంటానంతే"

    "Bye మరి!"

    "Bye...Bye"


చివరాఖరి సిప్పు:

Thank You,  Life,  for the kind of teacher you are! ~meSayIt

7, సెప్టెంబర్ 2019, శనివారం

కాఫీ విత్ కలిమి - 7 - A friend in teens is a friend in beens అన్న ఓ Guyయాళి

ఊసుపోని ఓ ఉదయం

కనిపించని ఆన్లైను నేస్తంతో ఆడేసుకుంటున్నాడు బుజ్జిజింక. వీడు ఈ ఏడాది హైస్కూల్కి వెళ్తున్నా ఇంకా బుజ్జిజింక-ఆఫ్-ద-హౌసే!

అనుకోకుండా చేరాల్సొచ్చిన ఆఫీసు కాన్ఫరెన్సు కాల్లో గడగడ మాట్లాడేసుకుంటున్నారు ఇంటి అయ్యగారింకో వంక.

ఇంకేముంది? అప్రకటిత నిర్బంధ కర్ఫ్యూ  మొదలు ఇంట్లో.

ఈ ఇద్దరు చేసే సందడి మధ్యా గిన్నె కదిలితే టంగుమంటుందని, గరిటాడితే టింగుమంటుందని వంట కూడా వాయిదా పద్ధతుల మీద చేస్తున్నాను.

పాట పాడలేక నోరాడక, అటూ ఇటూ కదలలేక కాలాడక- అలా అని కుదురుగా ఓ చోట కూర్చోలేక సతమతమౌతున్నాను.

ఇంకిలాక్కాదని పొంగీ పొంగని చిక్కటి పాలలో ఓ చెంచాడు బ్రూ, అరచెంచాడు పంచదార కలుపుకుని కుడిచేత కాఫీకప్పు, ఎడం చేత ఇంటి ఫోను పట్టుకుని ఆట్లాడుతున్న పిల్లాడికి, మాట్లాడుతున్న పిల్లాడి తండ్రికి కొంచెం ఎడంగా కూర్చుని, ఫోన్ మీటలు నొక్కి , భూమికవతలున్న కలిమితో మాటలు కలిపా.

భలే! ఊసుపోని ఉదయం కాస్తా ఊసులాడుకున్న ఉదయమైన వైనమేమన...

 "హలో... బావున్నావా? ఇంట్లో అందరూ ఎలా వున్నారు?"

"హాలొ-హలో. బావున్నాను. ఇంట్లో బావు న్నారు, బావున్నారు. ఇంట్లో వున్న అందరూ బావున్నారు."

"హహహ... ఏంటి విశేషాలు?"

"ఇంకో మూడు వారాల్లో నిన్ను చూడబోతున్నాను - అదే విశేషం. అన్నట్టు మర్చిపోయాను చెప్పడం Belated Happy Star Birthday! ఏం చేశావీసారి? Milestone Birthday కదా!"

"Milestone అని నువ్వే అన్నావు కదా అందుకే కొన్ని స్టోన్ లేవో కొనిపెట్టారు ఇంట్లో అందరూకలిసి"

"భలే! భలే! అలా అయితే నేనూ కొనుక్కుంటా... అప్పుడు మనిద్దరం రాళ్ళు కొన్న స్నేహితురాళ్ళనిపించుకుంటాం"

"కదా?! భలే!"

"ఒక్కో పుట్టినరోజు వచ్చినప్పుడల్లా... బావుంటుంది...కానీ ఇంకా రావాల్సిన బుద్ధేదో రాలేదేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ ముందు రోజుకీ, ఆ తర్వాత రోజుకీ ఇదో రోజు తక్కువ, అదో రోజు ఎక్కువ అనిపించడం తప్ప ఇంకే మార్పూ కనిపించదు."

"నాకూ అంతే! ఒక్కోసారి అది మంచిగా వున్నట్టనిపిస్తుంది, ఇంకోసారి ఏ తేడా లేకుండా ఉండడంలో ఏదో తేడా ఉందేమో అనిపిస్తుంది"

"అబ్బే! అదేం లేదు. మనమెలా పుట్టామో అలాగే వున్నాం...వుంటాం... మారాలని ప్రయత్నించడం, మారుతామని ప్రయాస పడడం మనకంతగా నప్పదు కానీ మనమిలాగే వుందాం."

"అంతే... అంతే!"

"అందుకే .... మనిద్దరం A friend in teens is a friend in beens లాగే కంటిన్యూ అవుదాం. నా Teenage-Beenage గుర్తుంది కదా?"

"ఎందుగ్గుర్తులేదూ? నాకూ భలే నచ్చిందా మాట."

"నీకింకో సంగతి చెప్పాలి... మొన్నో రోజు ఆఫీస్‌లో కాన్ఫరెన్స్ కాలొహటి  అయిపోతూ ఉండగా ఒకతను "Okay  Guys! Let's continue tomorrrow" అనగానే నేను "Okay Guys! You "guys only" continue tomorrow. I won't join"  అన్నా! వెంటనే ... వాళ్ళు పాపం మంచబ్బాయిలు కదా... అది సీరియస్‌గా తీసేస్కుని తెగ బాధ పడిపోబోయారు "We didn't mean that" అంటూ. నే వెంటనే  'ఇహహ్హహ్హా' అని నవ్వేసి "You didn't mean it, but I took that meaning because I'm mean" అని ఆ అపార్థసారథులనీ నవ్వించేసి call ని కంచికంపా!"

"అవునూ...నేనూ నోటీస్ చేశా ... ఈ మధ్యేంటీ నువ్వు 'ఇహహ్హహ్హా' అంటూ వికటాట్టహాసం చేస్తున్నట్లు నవ్వుతున్నావ్?"

"అది వికటాట్టహాసం కాదమ్మా... నటసామ్రాట్టాట్టహాసం"

"అర్థమైంది... కౌముదికి డీఎన్నారు-ఏఎన్నారు సిరీస్ రాసిరాసి ఇలా అయ్యానంటావ్!"

"అంతేగా... అంతేగా!"

"పిల్లా! ఇలా నువ్వు తప్ప ఇంకెవరూ మాట్లాడలేరు. ఇలా తప్ప నువ్వింకెలా మాట్లాడినా మజా ఉండదు...కానియ్! నీ నటసామ్రాట్టాట్టహాసం బహు-బాగు!"

"ఇంకా వుంది ఆగు... ఆ Guys విషయం బదరికి చెప్తూ 'బావా! మీరు Guy ఐతే మీకు ఆలిని Guyయాళిని అవుతానా?' అనడిగితే తన కళ్ళు భలే మెరిశాయి 'సరిగ్గా సరిపోయింది నీ defintion నీకే!' అంటూ"

"హహ్హాహ్హా ... నువ్వు Guyయాళివే - అక్షరాలా!"

"నీ నవ్వు వినడం బావుంది...చాలా రాత్రయిందీ ...ఇంక నవ్వుకుంటూ పడుక్కో...మళ్ళీ ఎప్పుడో ఇల్లాగే కాల్చేస్తా!"

"చెయ్ చెయ్... నువ్వు కాల్చేస్తే మళ్ళీ ఇలాగే మాటలతో ఆట్లాడేసుకుని మాట్లాడేస్కుందాం!"





చివరాఖరి సిప్పు:

A friendship grown from teens to been's is a treasure to be cherished. ~meSayIt




14, జులై 2019, ఆదివారం

కాఫీ విత్ కలిమి - 6 - హింసధ్వని విని ఆయె హంసానంది!



ఒక్కోసారి చెప్పుకోవాలీ అనుకునేవో, చెప్పేసుకోవాలీ అనిపించేవో, అవేవీ కాక ఊసుపోక ఉట్టినే చెప్పుకుందామనుకునేవో మాటలుంటాయి కానీ మాట్లాడే సమయమూ, వీలూ వుండవు - నాకో, నేను మాట్లాడాలీ అనుకున్న ౘనవైన చెలిమికో.

అల్లాంటప్పడు నేనేం చేస్తానంటే వాట్సాప్ వాడుకుంటా...
ఓ పక్కనో కాఫీ కప్పు, ఆరారగా ఆ కాఫీ సిప్పుతో పాటు, ఇంకో పక్క నా ఫోనులో మీట-నొక్కులతో పాట-పంపుల ఏర్పాటు చేసుకుంటా.
అందులోనే మధ్యమధ్యలో గొంతు సర్దుకుంటూ - పాటలతో మాట్లాడుకునే ఆటాడుకుంటా.
ఇందులో అసలు పాటలుంటాయి.
పాటల్లో మాటలు మార్చేసి పాడుకునే కొసరు పాటలూ ఉంటాయి.

కాకపోతే ఈ ఆటలో ఒక్కోసారి అవతలినుంచి బదులు రావడం ఆలస్యమైతే, అటు పక్కనుంచి <రికార్డింగ్> అని కనిపిస్తున్నా కూడా, అదొచ్చేదాకా ఆగలేక,  ప్రశ్నా- జవాబూ నావే అయ్యి రెండుపక్కలా నేనే ఆడే క్యారమ్ బోర్డు ఆటలా ఉంటుంది.

అయినా బావుంటుంది.

నాతో ఈ ఆటాడే చెలిమి-కలిమి కుదురైన రాగతాళభరిత శంకరాభరణం పాటైతే, నేను కుదురెరగని గాలిపాటల బీటన్నమాట.

నా బీటుకి కలిమి చెవికొచ్చు నీలిపన్ను-పోటన్నమాట.



అదెలాగంటే... 



"నీతో మాట్లాడాలనుంది. కానీ టైము లేదు. కొంచెం పనుంది. అందుకని నీకు వీలైతే దీనికి బదులుగా నీ వాయిస్ మెసేజ్ పంపించేం? లేపోతే ఓ పాట పాడి పంపించు. సరేనా?
'ఓ నేస్తం ... పాడవే హాయిగా ... నాకోసం ఈవేళా ... తీయగా ...'  నీ వరసేం బాలేదు అని నన్ను విసుక్కోక ఈ వరసలో వచ్చే అసలు పాటేదో కనుక్కో చూద్దాం!"


<... రికార్డింగ్>
"పైది హింసధ్వని పార్ట్ 1."

<... రికార్డింగ్>  

"నువ్వు బదులు-పాట పాడి పంపించలేదనుకో నీ పాట ... ఇలాగే నే పాటలు పాడి పంపిస్తూ వుంటాను. నీ పాట నాకొచ్చేదాకా నీకీ హింస తప్పదు. నీది హంసధ్వనైతే నాది హింసధ్వని. కాచుకో నీ ఇష్టం మరి... హహహ!"

"నువ్వూ...చాలా తెలివైందానివని అనుకున్నాను. అంటే బోల్డంత అమామయకత్వం వున్న అతి పెద్ద తెలివైందానివని అనుకున్నాను. కానీ నేను పప్పులో కాలేసేశానని  నాకర్ధమయ్యింది. ఎందుకంటే ... ఎవరైనా గానీ నువ్వు పాడి పంపించకపోతే నేనిలాగే పాడి పంపిస్తానంటే, అందులోనూ...నాలాంటిది బదులు పంపిస్తుందా? పంపించేస్తే, మళ్ళీ నువ్వు పంపించడం ఆగిపోతుందేమో అని పంపించను కదా? ఆ మాత్రం నీకెందుకు వెలగలేదూ ?
ఎన్ని పార్టులుంటాయో అన్ని పాటలూ పంపించేదాకా నేనూరుకోను కదా? నాకింకా ఇంకా కావాలంటాను కదా? నీకా విషయం తెల్సు కదా? ఎన్ని పాడతావో పాడు."
 
"హింసధ్వని పార్ట్ 2: 
'దాహమణగిన తత్త్వమెరిగెదనన్న... దాహమేలణగు?
ఆ తత్త్వమేమెరుగు? 
దేహంబు గల అన్ని దినములకును పదార్థ మోహమేలణగు? 
ఆ ముదమేల కలుగూ?    
కడలుడిపి నీరాడగా తలచు వారలకు 
కడలేని మనసుకు కడమ ఎక్కడిదీ?'

ఆ పైది నాకెంతో ఇష్టమైన అన్నమాచార్య కీర్తనలో ఓ ముక్కన్నమాట.

హింసధ్వని పార్ట్ 3:  
'ముందరెరిగిన వెనుక మొదలు మరచెదనన్న .... ముందరేమెరుగు? 
ఆ మొదలేల మరచు? 
అందముగా తిరు వేంకటాద్రీశు మన్ననల కందువెరిగిన మేలు కలనైన లేదు
కడలుడిపి నీరాడగా తలచు వారలకు 
కడలేని మనసుకు కడమ ఎక్కడిదీ?' "

" చాలా పెద్ద coincidence ఏంటంటే బాలకృష్ణప్రసాద్ గారి అన్నమయ్య కృతుల్లోకి నువ్వు పాడిన ఆ కృతి నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా ఆ ట్యూన్, ఆయన పాడిన విధానం చాలా చాలా ఇష్టం. కానీ నాకు పల్లవి తప్ప ఇంకేం రాదు." 
"This is హింసధ్వని పార్ట్ 4: 
'కుశలమా ... ? నీకు కుశలమేనా ? ఇంతసేపు ఆగలేక ఏదో ఏదో పాడాను అంతే... అంతే...' "

"అది నువ్వు హింసధ్వని అనుకుంటున్నావు కానీ నాకది హంసనాదంలా వుంది. అప్పుడేమో నేను హంసానంది అన్నమాట. సరే గానీ...ఇదిగో నీకూ నాకూ ఇష్టమైన అన్నమాచార్యులవారి పల్లవి... 
'కడలుడిపి నీరాడగా తలచు వారలకు కడలేని మనసుకు కడమ ఎక్కడిదీ? 
కడలేని మనసుకు కడమ ఎక్కడిదీ?' "


"పాట పాడమంటే నేను పాడిందే ఓ ముక్క పాడి తిప్పి పంపించడం కాదు. ఓ పే... ద్ద పాట - అంటే పల్లవి, అనుపల్లవి, చరణం పాడి పంపించాలి. అదీ పాటంటే సరేనా? బాలకృష్ణ ప్రసాద్ గారు పాడిన విధానం నచ్చుతుందని మెచ్చుకున్నావ్.  ఏం నాది బాలేదా? హన్నా!"

"ఆ రొంపట్టిన గొంతుతో పట్టిపట్టి పాడుతూ ఎంత తిక్కగా వున్నావ్, పిల్లా?! ఇంకా పాటలు రానీయ్! ఆపేశావేం?"

"ఒకే ఆత్మ ఉంటుంది... రెండు శరీరాలలో... 
ఒకే పాట పలుకుతుంది వేరువేరు గుండెల్లో 
ఒక్కటే దొరుకుతుంది జీవితంలో
అది ఓడిపోదు, వాడిపోదు కష్టసుఖాల్లో..."

<... రికార్డింగ్> 

"అవునూ.... ఇందులో 'ఒక్కటే దొరుకుతుంది జీవితంలో' అనెందుకన్నారో కదా? ఫ్రెండ్షిప్ బోల్డు చోట్ల దొరుకుతుంది కదా? ఒక్కచోటే కాదు కదా? ఆత్రేయ ఎందుకలా రాశారో? ఇప్పటికీ నాకర్థం కాదు. కానీ ఆ ప్రశ్న అడుగుదామని పాడానన్నమాట. 'స్నేహబంధమూ ఎంత మధురమూ..చెరిగిపోదు కరిగిపోదు జీవితాంతము' - ఇది ఇంతకు ముందు పాడిన చరణానికి పల్లవన్నమాట ...అందుకే పాడాను."

"ఇంత రాత్రి పూట ఆత్మల గురించి ఎందుగ్గానీ? ముందు పాడిన ఆ ఆత్మల చరణం కన్నా చివరిగా పాడావు చూడూ...  ఆ పల్లవి ముక్క బావుంది 'స్నేహబంధమూ ఎంత మధురమూ..' అంటూ.  ఆ లైను తర్వాత పాట ఎలా ఉంటుంది? నాకు చాలా సినిమా పాటలు అంతగా తెలీవు, ఇళయరాజావి తప్ప. ఈ పాటేదో బావుంది. రేపు వింటా.  సర్లే గానీ... నీకోసం ఏ పాట పాడనూ?"

"నీకు తెలిసిన ఇళయరాజా పాటల్లోదే ఓటి 'అరె ఏమైందీ? ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ' పాడు. అద్సరే నా హింసధ్వని పార్ట్ 1 లో పాట మాటేం చేశావ్? ఏంటా పాట? ఎవరు కట్టారా వరస?"

"మళ్ళీ అదే మాటా? హింసధ్వని కాదూ అన్నానా లేదా? అదీ... చెప్తానుండు...ఇళయరాజా కదా ... 'ఆమనీ పాడవే హాయిగా - మూగవైపోకు ఈ వేళా...' అది చెప్పేశాగా! ఇప్పుడు నువ్వడిగిన పాట పాడుతున్నా విను మరి ! 'అరె ఏమైందీ? ఒక ముక్కుకు రొంపొచ్చి తిక్క పెంచి గుచ్చుతోందీ...' "

"అహ్హహ్హహ్హ... నేనే అనుకుంటే పాటల్ని పాట్లు పెట్టడంలో నన్ను మించిపోయావ్... అసలు ఫోన్ కాల్ కన్నా ఈ వాట్సాప్ ఆట బావుంది కదా! చిన్నప్పుడు అగ్గిపెట్టెలకి దారం కట్టి ఆడుకున్న ఫోనాట గుర్తుకొస్తోంది ఎందుకో."

"నేనా పాట పాడింది నీ గురించే...అదేదో కల్లు తాగింది, ఆపై నిప్పు తొక్కింది, ఆపై తేలు కుట్టింది సామెత లాగా వుంది నీతో వ్యవహారం."

"అవునూ... నీకో సంగత్తెలుసా? కల్లు తాగి, నిప్పు తొక్కి, తేలుకుట్టిన మన పూర్వీకులవారి కన్నా రొంపట్టి, దగ్గొచ్చి, గొంతుపోయిన నేనే డేంజర్. ఇవాళ్టికింక నీ నీలిపన్నుకి  పోటెత్తించనులే! చివరాఖరిగా నీకో పాట- నీకు తెలియని చక్రవర్తి గారి వరసలే ... 'వాట్సాపులోనా వాయిస్ల వానా ... ఆ వాన లోనా మునిగేనా? తేలనా?' ఇదేం పాటో ఈసారి మాట్లాడినప్పుడు చెప్తా... అప్పటిదాకా నీకు నచ్చిన వరసలో పాడేస్కో!" 


"నీ నీలిపన్ను అన్న మాటకి ఓ రెండు వీరతాళ్ళు... Bye!"
"హహ్హహ్హ... నువ్వు నాకిచ్చిన ear-time కి, నీ వీనులకి ... 'ఏమివ్వనూ...నీకేమివ్వనూ?!'  ఇంకోసారెప్పుడైనా ఇలాగే పాట్లాడుకుందాం, Bye!!!" 

చివరాఖరి సిప్పు:
To lighten the heart...
To brighten a day...
Listen to a song!  
~meSayit
 

10, ఫిబ్రవరి 2019, ఆదివారం

కాఫీ విత్ కలిమి - 5 - అనగా వంచించారు - తినగా వంచినచారు

తోచీతోచని అసుర సంధ్య
మామూలు రోజుల్లో ఇప్పటికింకా వెలుగుండేదే
ముసురుకున్న మబ్బుల్లో చిక్కి సూర్యుడు తొలిగాడేమో
కమ్ముకోవడానికిదే అదనని అలముకున్న చిక్కనైన చీకటి
వెదకబోని దారిలో దొరకబోని రత్నాల్లా కనిపిస్తున్న ఇంటి కిటికీలోంచి కనిపిస్తున్న వచ్చీపోయే కార్ల హెడ్‌లైట్లు
అంత కన్నా మంచి సమయమేది కాఫీ పీనే కీ, కలిమితో బాతాఖానీకి?!
పొగలు కక్కే కాఫీ ఓ చేత, మీట నొక్కిన ఫోన్ ఓ చెంప
కలిమితో కబుర్లు మొదలిక...

"హలో!"

"హలో! హలో! ఎన్నాళ్ళకెన్నాళ్ళకి? ఏంటి విశేషం?"

"ఫోన్ చెయ్యగానే నువ్వు తీశావ్ చూడు  - అదే విశేషం! ఇప్పటిది ముత్యంగా మూడోసారి నేను నీతో మాట్లాడాలని ప్రయత్నించడం. ఏదీ నువ్వు దొరికితేగా! కలిమి... బా...గా బిజీ!"

"హహహ అదేం లేదులే. మొన్నెప్పుడో నువ్వు పెట్టిన మెసేజ్ విని తను నవ్వుకున్నారు కూడా - ఏమన్నావ్ -  అదే...  - 'తల్లీ! ఎన్నిసార్లు చేసినా VM కే వెళ్తోంది. ఇప్పటిప్పట్లో ఫోన్ చేసేలా లేవు, తీసేలా లేవు. ఇక నే చేయను. ఉలకని పలకని రాయిలా కాక పందార పలుకుల పావురాయిలా ఉందూ కొంచెం! నీ call-చెయ్యని తనంతో నన్ను కాల్చక గబగబా కాల్చెయ్యి మరీ' అని పెట్టావుగా. నేనే call చేద్దామనుకుంటున్నాను. ఇంతలో చేశావ్. పోన్లే! సరే గానీ ఏంటి ఇంతకీ విశేషాలు? మీకు టైం ఎంతయింది ఇప్పుడూ?"

"అసురసంధ్య వేళ కలిమి దొరికె దేవీ...కలిమి చెలిమి దొరికె దేవీ! "

"పాట వరస బావుంది. మీకిప్పుడు సాయంత్రం అన్నమాట! సర్లే. ఇంతకీ దాన్ని అసుర సంధ్య అనెందుకన్నారో, రాక్షసులు తిరిగే వేళనో, ఏమో కదా!?"

"అదేమో కానీ మా బదరి మాత్రం అది బారు-విహారులు తాగం-పానం-అల్లరి ఇంకా మొదలు పెట్టని వేళయి ఉంటుంది అందుకే అసుర సంధ్య అయింది అంటారు"

"సరి పోయింది ... మాటలల్లుకోవడంలో మీ ఇద్దరూ ఇద్దరే!"

"ఇంతకీ నువ్వెందుకు అంత బిజీయో చెప్పలేదు... ఏమన్నా రిలీజ్ నడుస్తోందా?"

"అదేం కాదు. మా అపార్టుమెంట్ కమ్యూనిటీలో ఒకళ్ళింట్లో పెళ్లి.  మా అందరిళ్ళలో హడావిడి అంతే. అన్నట్టు మరిచిపోయాను. వాళ్ళదీ గోదావరి పక్కే. అందుకే ఆవిడ వాళ్ళ పిల్లాణ్ణి  పెళ్ళికొడుకు చేసిందగ్గర్నుంచీ 'పెళ్ళికొడుకుని చేశాక నది దాటకూడదు, పొలం వెళ్ళకూడదు అని మా చిన్నప్పుడు చెప్పేవారు.' అని ఆ అబ్బాయిని ఇల్లు దాటనివ్వట్లేదనుకో. ఇప్పుడు నదులు, పొలాలు ఎక్కడున్నాయి. అయినా అప్పుడా ఆచారాలు ఎందుకు పెట్టారో. ఇప్పుడు కూడా అలాగే నడిపించాలంటే ఇప్పటి జెనరేషన్ వాళ్లకి నచ్చద్దూ?"

"ఊఁ "

"ఏంటి ఒట్టి 'ఊఁ' తో ఆపేశావ్?"

"వాళ్ళమ్మగారు చెప్పింది కరెక్టే! ఆ అబ్బాయి ఆవిడ మాట వినాలి"

"సరి! మీ గోదావరి వాళ్ళనా ఆవిణ్ణి వెనకేసుకొస్తున్నావ్?"

"గోదావరిని వెనకేసుకు రావడం, కావేరికి ఎదురీదడం కాదు. ఒకసారి పెళ్లి కుదిరాక, అందులోనూ పెళ్ళికొడుకుని చేశాక జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అప్పటికే ఇంకో అమ్మాయి జీవితం ఆ అబ్బాయితో ముడిపడింది. అనుకోనిది ఏమైనా జరిగితే రెండు కుటుంబాలు బాధ పడతాయి. అందుకే అలా చెప్పి వుంటారు మన పెద్దవాళ్ళు"

"కదా! నిజమే! నేనింత ఆలోచించలేదులే! నీకు భలే తడ్తాయి ఈ రీజనింగ్స్!"

"మెచ్చావు సరే! మేకతోలేది? హహహ!"

"అవునూ... మీ ఊళ్ళో ఎస్పీబీ లైవ్-ఇన్ కాన్సర్ట్ ఉందట కదా? వెళ్తున్నారా మీరు?"

"ఉహూ! నాకు ఆయన దగ్గరికి వెళ్లి పలకరించాలని, మాట్లాడాలని ఏమీ లేదు. అలా అని ఆయనకీ నేను తెలీదు. వెళ్లకపోతే ఏమనుకుంటారో అన్న మొహమాటాల్లేవు. ఇది వరకంటే సినిమాల వాళ్ళు అపురూపంగా కనిపించే వాళ్ళు కాబట్టి ఇలాంటి ప్రోగ్రాము లేమన్నా జరిగితే వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉండేదేమో...ఇప్పుడు పొద్దున్న లేస్తే టీవీల్లో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా వాళ్ళ ఇంటర్వ్యూలే. మన ఇంట్లో మనతో కూర్చుని వాళ్ళ విశేషాల్ని చెబుతున్నట్లే వుంటోంది. నాకు ముందు ఆ ప్రోగ్రాం గురించి తెలియగానే ఒక్క క్షణం వెళ్దామా  అనిపించింది. మళ్ళీ ఒద్దులేబ్బా అనేసుకున్నా"

"ఔనౌను ... నాగ్గుర్తుంది నీ సెలబ్రిటీస్-చార్మినార్ పోలిక. అది సరే! రథసప్తమి వస్తోంది కదా - రేపు పన్నెండో తారీఖు."

"ఔను కదా! చిన్నప్పుడు జిల్లేడు ఆకులు, రేగిపళ్ళు తల మీద పెట్టుకుని స్నానం చేయడం, ఆ తర్వాత చిక్కుడాక్కుల్లో బియ్యప్పరవాణ్ణం తినడం - అవన్నీ తలుచుకుంటే ఇప్పటికీ భలే మంచిగా అనిపిస్తుంది."

"కదా! ఇప్పుడలా చెయ్యాలి అని తెలిసినవాళ్ళూ, తెలిసినా చేసేవాళ్ళూ బాగా తగ్గిపోతున్నారు. అదే బాధ!"

"తల్లీ కలిమీ! మనకి మనకే బాధ పడాల్సిన విషయాలు సవాలక్ష. ఇప్పుడింకో కొత్త బాధ add చేసుకోకు. ప్రపంచంలో మనం తప్పకుండా చెయ్యాలి, చెయ్యకపోతే మన జీవితం బావుండదు అని చేసే rituals గురించి అస్సలు ఐడియాయే లేకుండా మన కన్నా ఆనందంగా, ఆరోగ్యంగా బతుకుతున్నవాళ్ళు కోటానుకోట్లు. నా వరకు నాకు తెలిసి తెలిసి ఎవరినీ ఇబ్బంది పెట్టకపోవడమే మంచి సంప్రదాయం - అది పూజైనా, పునస్కారమైనా!"

"నేనొప్పుకోను! నువ్వు మాత్రం రోజూ స్తోత్రాలు, పాడుకుంటావ్, లలిత నేర్చుకోవాలి పూర్తిగా అర్థం చేసుకుంటూ అంటావ్. నీకు లోపల్లోపల దేవుడంటే భయమే! ఆంటీ అంటుంటార్లే 'మా లల్లి పెళ్ళికి ముందు ఇలా ఉండేది కాదు, ఇప్పుడే ఇలా కొత్తగా మాటాడుతోంది' అని. నువ్వు మాత్రం ఆచారాలున్న background నుంచి రాలేదా? వాటినెప్పుడూ కాదనకుండా ఆచరించలేదా?"

"నువ్వన్నది నేను ఏదీ కాదనను."

"మరి..."

"అరె! నన్ను పూర్తిగా చెప్పనీయ్! చిన్నప్పుడు నాన్నమ్మతో గుడి కెళ్ళేదాన్ని. తర్వాత మా శివకోడు శివుణ్ణి చూడ్డానికీ వెళ్లేదాన్ని - ఎందుకంటే ఆ గుడిలో మా తాతగారు కట్టించిన మండపం, దాని పక్కనున్న బిళ్ళగన్నేరు చెట్టూ ఇష్టం కాబట్టి. మా అమ్మ పూజ్జేస్తుంటే పక్కనే కూర్చుని ఆవిడకి వరలక్ష్మీ వ్రత కథలూ, వినాయకచవితి కథలూ చదివేదాన్ని.  అది చదవడం మీద ఇష్టం, దేవుడు కొడతాడన్న భయంతో కాదు. తర్వాత్తర్వాత పెళ్లయ్యాక ఏదైనా చేయను అంటే దాంతో వచ్చే conflict ని భరించడంలో వున్న బాధ కన్నా - ఒక్క గంటో, అరగంటో నాది కాదనుకుని పెద్దవాళ్ళు చెప్పింది చెప్పినట్లు చేస్తే దాని వల్ల వాళ్ళకొచ్చే ఆనందం బావుందనిపించేది. అందులోనూ నాలా ఎవరైనా ఒక అబ్బాయి మాట్లాడితే 'Wow! ఎంత progressive గా మాట్లాడుతున్నాడు' అనుకునే వాళ్ళే ఆడపిల్లనైన నన్ను aggressive అనేస్కునే వారు తప్పకుండా. ఎందుకొచ్చిన తిప్పలు కదా! నా వరకు నాకు ఈ భక్తి, నమ్మకం అనే విషయాలు చాలా personal. అనవసరంగా వాటిని exhibit చేసి నేను ఏ ఒక్క groupకో మాత్రమే చెందుతానని అనిపించుకోవడం నచ్చదు."

"మరి స్తోత్రాల మాటో - అవెందుకో మరి?"

"ఇవాళ నన్ను ఒదిలిపెట్టేలా లేవు - హహహ!"

"మరి... ఎప్పుడూ మాట్లాటేనా? అప్పుడప్పుడూ నీతో ఇలా పోట్లాడితేనే సరదా!"

"అల్లాగే కానిద్దాం... కానీయ్. మాట్లాటో, పోట్లాటో నీతో ఏదైనా సరదాట్లాటే"

"నేనడిగిందానికి చెప్పు - మనసులో ఏమీ లేకుండానే ఈ భాగవతాలూ, భగవంతుడి స్తోత్రాలూ - వీటి సంగతి ఏంటి?"

"తల్లీ! భాషానురక్తికీ, భక్తికీ ముడిపెట్టకు. నాకు అర్థాలంకారాలూ, శబ్దాలంకారాలూ వుండేవి ఏవైనా చదవడం, పాడుకోవడం ఇష్టం. పోతన పద్యం, కృష్ణశాస్త్రి కవిత, ముళ్ళపూడి వచనం - ఇవన్నీ తీపి తీపి తెలుగు, అవి తేట తేట తెలుగు... అంతే! అది కృష్ణుడి కథా, కృష్ణశాస్త్రి వ్యథా అనే తేడా లేదు నాకు."

"హ్మ్ ...పోన్లే - ఇంక విసిగించనులే... అయినా చెప్పావుగా ఇంతకు ముందెప్పుడో - రెలిజియన్, పాలిటిక్స్, గ్రేట్ పంప్కిన్, పిల్లలూ, ఫిల్ములూ... కావవీ నా టాపిక్కులకి top-pick లని! ఇంతకీ ఇవాళ్టి ఘుమఘుమలేంటి నీ వంటింట్లో?"

"వంచించారు"

"ఏమది? ఏమని వచించావు. వంట చేయక యింటివారిని వంచించావా?"

"ఉండు మరి! నా పచనం గురించి ఈ  వచనం కూడా విను. ఇవాళ మా వంటింటి వంట బస్సారు, అంటే కన్నడంలో బగ్గిసువ సారు, దాన్నే తెలుగులో గబగబా అనగా వంచించారు  - తినగా వంచినచారు. ఆక్కూరలు ఉడికించిన నీళ్ళని వంచి (వార్చి), ఆ నీళ్లతో చేసే చారిది."

"తల్లీ! నీ పచనం, నీ వచనం, ఆ పైన నీ రచనం ...చేయబోయి నిర్వచనం - నేనాయె నిర్-వచనం"

"భలే!  చూశావా ...నాతో పోట్లాట అన్నావు కానీ మాటలతో ఆట్లాడుతున్నావ్!"

"నీతో మాటే ఒక ఆట. నాదేం లేదులే ... పూలల్లిన నారని. ఆ మాత్రం వాసనంటక పోదు"

"పూలల్లిన నారవి కాదు - పూవంటి నారివి, పూవింటి నారివి"

"ఆహా.. హా ... హా - నువ్వంటూ నే వింటూ ఉంటే బావుంటుంది సుమీ!"

"అలా నేనన్నది తలుచుకుంటూ నవ్వుకుంటూ అక్కడ నువ్వుండు. నువ్వన్నది బావుందనుకుంటూ వండుకుంటూ ఇక్కడ నేనుండు. టాటా...  వీడుకోలు. ఇప్పటికి bye - ఇంక సెలవు"

"హహహ ...bye bye"

చివరాఖరి సిప్పు

Love, affection, friendship... Give unconditionally - take nonjudgmentally ~meSayIt

4, నవంబర్ 2018, ఆదివారం

కాఫీ విత్ కలిమి - 4 - టీనేజ్ vs. బీనేజ్

ఎండ అపురూపమైన Autumn మధ్యాహ్నవేళ...



(శిశిరం మంచి మాటే...కానీ "Autumn" feels like a harsh-less word as even the mention of it brings a pallete of bright hues, painting the memory vividly - with all the shades that are: of red, of orange, of purple,  of maroon... which motivates me to use this English cousin of శిశిరం)

తలుపు తెరిచీ తెరవగానే పలకరించిందో ఆకురాల్చు గాలి
ఆగాల గాలి... ఈల రాగాల గాలి
చెదురుమదురుగా వున్న మబ్బుల్ని అదిలించిన గాలి
ఎంత సేపా ఊసుపోని తిరుగుడు?  కురిసిపొండని కసిరిన గాలి
దగ్గర జేరి చిక్కనైన మబ్బుల చూసి మురిసిన గాలి
కరిమబ్బు గొడుగు కింద ఎంతలేసి చెట్లనూ ఊపేస్తున్న గాలి
వున్న పుంజీడు ఆకులనీ రాల్చేస్తున్న రాలుగాయి గాలి
చలి గాలి -  బరువెక్కిన తడి గాలి
కుదురుండని పొగరు గాలి
ఉండుండి వీస్తూ ఈ చెంపని ముట్టి, ఇంకో చెక్కిలి తాకి
అక్కడక్కడే ఒంటిని చుట్టి ఒణికిస్తూ ఉంటే
ఆ ఆగకుండా వీచే గాలి దొరికింది కదా అని అదెటూ ఎక్కడికీ మోసుకుపోదు, ఒకవేళ ఆరాటంతో మోసుకెళ్లినా నోరు లేని గాలి వూరు దాటనియ్యదనే భరోసా వుండనే వుంది కదా!
అందుకే కబుర్లాడడం మొదలెట్టా.
నేనన్న మాటకి "ఊఁ ...ఆఁ " అన్నట్లు చిన్నిచిన్ని ఈలలూ, ఊళలే తప్ప ఇంకో మాటే మాట్లాడదే ఆ వెఱ్ఱిగాలి!?
నాదే సవాలు, నాకే జవాబు
కాస్సేపటికి విసుగు రానే వచ్చింది - నా ఒంటిగొంతు రాగం వినీ వినీ
చుట్టూ చూశా
కనుచూపుమేర ఇళ్ళు
ఇళ్ల చుట్టూ చెట్లూ
చెట్ల బారుల మధ్య దారులు
ఆ దారుల అప్పుడోటీ, అప్పుడోటీ సాగే కారులు
ఒక్కసారిగా బెంగొచ్చింది
ఒక్కదాన్నే వున్నానన్న దిగులేసింది

నేనేమన్నా మణులడిగానా, మాన్యాలడిగానా - PGW గారి Wooster మోస్తరులో - regular meals, a good show with decent music every now and then, one or two pals to totter round with, I ask no more - అనే కదా నేననేది? మీల్సూ, షోసూ ఉంటే సరిపోదుగా! ఊసుపోని వేళల ఊసులాడుకోవడానికి Pals తప్పనిసరే కదా!

చటుక్కున లేచి ఒక వేడివేడి కాఫీ కలుపుకున్నాను
చేత ఫోన్ పట్టి దూరానున్న చెలిమి-కలిమితో మాట కలుపుకున్నాను.


"హలో బావున్నావా?"

"నువ్వేనా? ఎంత కుదురుగా పలకరిస్తున్నావ్? ఇది నిజమేనా?"

"అబ్బా! అప్పుడప్పుడన్నా మంచిదాన్ననిపించుకోనీ. ఇంతకీ breakfast చేశావా?"

"ఎందుకూ? నీతో మాట్లాడడానికి strength వుందో లేదో అని పరీక్షిస్తున్నావా?"

"ఏదో మరి నా స్వార్థం! గాలితో ఊసులు చెప్పీ చెప్పీ ఉసూరుమంటున్నాను. మనిషితో మన్నికైన భాషలో కబుర్లకి కలవరిస్తున్నాను. ఆకలి కేకలు వెయ్యకపోతే ఇంకో నాలుగు మాటలెక్కువ చెప్తావని."

"బానే వుంది. మంచి టైంకే చేశావనుకో ఫోన్. ఇప్పుడే ఓట్లతో పోసిన అట్లు తిని వున్నా. నీతో మాట్లాటకి నేను సిద్ధం."

"ఓట్లతో అట్లు - rhyme భలేగా కుదిరింది."

"దానికే మురుస్తావే, మరి మిల్లెట్లతో పుల్లట్లు అంటే ఇంకేమంటావో?"

"ఏమంటాను ... దోశలే కాదు ప్రాసలూ బా వేస్తావంటాను. ఇంతకీ మీ ఊరెలా వుంది?"

"ఊరుకేం? ఊరికే వూరేగాలనిపించేలా వుంది. ఊరేగడమంటే గుర్తొచ్చింది. ఈసారి Halloween కి ఎప్పట్లానే నీ బుజ్జిజింకతో కలిసి ఊరేగావా?"

"అబ్బే... ఎక్కడా?! వాణ్ణి ఎంత అడిగానో - 'మళ్ళీ వచ్చే ఏడాది హైస్కూల్‌కి వెళ్తావూ, పెద్దవాణ్ణయ్యానంటావూ, అందుకని మనిద్దరం ఎంచక్కా వేషాలేసుకుని, అందర్నీ భయపెట్టేసి  సంచుల నిండా చాక్లెట్లు తెచ్చుకుందాం రారా' - అని"

"మరింతకీ వెళ్ళారా?"

"ఉహూఁ ! దానికి వాడేమన్నాడో తెలుసా? నేను టీనేజర్ని, రానన్నాడు. పైగా నేనైతే భయపెట్టాలంటే వేషం వేసుకోవాలి. నువ్వు మాత్రం నేనర్స్ అన్నట్లు ఎప్పుడూ ఎలా వుంటావో అలా వచ్చేసినా చాలు అన్నాడు చిలిపి నవ్వు బుగ్గసొట్టల్లో దాచేసుకుంటూ."

"హహ్హహ్హా... మాట్లాటలో నీకు వాడు సమవుజ్జీనే - అనుమానం లేదు. అయితే తండ్రీకొడుకులిద్దరూ నిన్నాటపట్టిస్తున్నారన్నమాట. మరి నువ్వు అలగలే?"

"అలకెందుకూ, ఉలుకెందుకూ? వున్నమాటేగా?! అయినా నిన్ను నిన్నుగా feaరించుటకూ, నీ రూపమె గాంచి దడిచేందుకు మేమున్నామని మందిగా పలికే వారెక్కడుండిన అదే భాగ్యమూ...అదే స్వర్గమూ... అన్నారు కదా!

"అలా నువ్వు తప్ప ఇంకెవరూ అనరు గానీ నీ జ్యేష్ఠుడేమంటాడు? వాడు నీ పార్టీనేనా?"

"వాడన్నదీ విను. మొన్నొక రోజు రాత్రి బుజ్జిజింకకి దుప్పటి కప్పి, ఇవతలకి వస్తూ 'లైట్ తీసేస్తాను కళ్ళు మూసుకో నాన్నా!'  అంటుంటే తమ్ముడికి Good Night చెప్పడానికి వచ్చిన అన్నగాడు 'తమ్ముడూ! A room with Amma in it is scarier than a room without light' అనడం దానికా తమ్ముడు గాల్లోకి కాళ్ళు లేపి మరీ చప్పట్లు కొట్టుకుంటూ నవ్వడం. నాకూ నవ్వొచ్చింది వాళ్ళిద్దరూ అలా కూడబలుక్కున్నట్లు నన్నాటపట్టించడం చూసి"

"బావుంది...  బావుంది... వాళ్ళు నిన్ను ఆట పట్టించడం. నువ్వు దాన్ని ఆనందించడం."

"వాళ్ళది టీనేజ్ అయితే నాది బీనేజ్ కదా మరి. వాళ్ళ మాటలు, పాటలు చూస్తూ I relive my past."

"టీనేజ్ అంటే తెలుసు నాకు. ఈ బీనేజ్ ఏంటి తల్లీ?"

"కనుక్కోకోలేకపోయావా? హహహ... బీనేజ్ అంటే ఏది విన్నా, ఏం చూసినా "been there once" అనిపించే ఏజ్. Teenage పిల్లలది, Beenage తల్లిది-తండ్రిది."

"హహహహహా... Teenage-Beenage సరి పోయింది!"

"ఇప్పటికే బోల్డుసేపైంది - ఇంక ఫోన్ పెట్టేస్తాను. ఇందాకే అడుగుదామనుకున్నాను మర్చిపోయాను. ఇందాక మిల్లెట్స్ అన్నావు. అంటే చిరుధాన్యాలు కదా! ఎక్కడ దొరుకుతున్నాయి? మా ఊళ్ళో ఇండియన్ స్టోర్లో ఉండేవి కానీ ఈ వారం వెళ్లినప్పుడు కనపళ్ళేదు."

"మాకు పొలాల్లో పండుతాయి. అమ్మావాళ్లు పంపిస్తారు తడవకి ఐదేసి కేజీలు అలా."

"మంచి మాట చెప్పావ్. పొలం వుందన్నావ్. ఎప్పటికీ ఉంచుకో. మా ఊళ్ళ పక్క పచ్చటి పొలాలు తవ్వుకుని చేపల చెరువులుగా చేసుకోవడమో, అమ్ముకుని అపార్టుమెంట్లు కట్టేసి అద్దెకిచ్చుకోవడమో చేస్తున్నారు. ముందుముందు తిండిగింజ దొరకని రోజులొస్తాయ్. తలుచుకుంటే బెంగగా ఉంటుంది. సర్లే! ఎన్నిటికని బెంగెట్టుకుంటాను కానీ ... ప్రస్తుతానికి నా మాటల బెంగ నీకు ఫోన్ చేశాక తగ్గింది. మళ్ళీ ఎప్పుడో ఇలాగే... వస్తా! మళ్ళొస్తా! మళ్ళీ పలకరిస్తా!"

"నాకూ బావుంది ఇలా మాట్లాడడం. వుంటాను మరి. Bye!"

"Bye !"

చివరాఖరి సిప్పు:

If you didn't have to start a conversation with a "Sorry" and end with a "Thank you", you definitely were talking with a friend.  ~meSayIt


15, జులై 2018, ఆదివారం

కాఫీ విత్ కలిమి - 3 - "కలి-మి"తో కబుర్లు





"హలో"

"హలో - చేరిపోయారా? ఫ్లైట్ ఆలస్యం అయింది కదా - ఇక ఫోన్ చెయ్యరేమో అనుకున్నాను."

"నిద్ర కూడా మానుకుని ఎదురు చూస్తూ ఉంటావు కదా - అందుకే ఒకసారి చేసి, చేరానని చెప్పి పడుకుందామని చేశాను."

"మంచి పని చేశారు - సరే అయితే!"

"సరే అయితే ఏంటి? ఇప్పుడే కదా చేశాను - ఓ పది నిముషాలు మాట్లాడొచ్చు కదా?"

"పది నిముషాలేం మహాభాగ్యం - గంట పది కొట్టేదాకా మాట్లాడుకుందాం. - మాటలే కదా - మనకి రాకపోతే కదా!"

"కదా మరి! అవును ఇంతకీ ఈ మధ్య కాఫీ తాగడం మానేశావా?"

"అసలు నేనెప్పుడు regular గా కాఫీ తాగాను? ఏదో ఎప్పుడైనా అలా... ఇంకందులో మానేయడానికి, మొదలుపెట్టడానికి ఏముంది?"

"ఓహో! అయితే నీ కాఫీ విత్ కలిమి సిరీస్ నీ కాఫీ అలవాటంతే erratic అన్నమాట!"

"దాన్నే irregularly-regular అంటాన్నేను. ఇప్పుడు గుర్తు చేశారుగా - తాగాలనిపిస్తోంది - ఇదిగో కలుపుకుంటానిప్పుడు"

"ఇప్పుడా? ఇంత రాత్రి పూట కాఫీ తాగితే ఇంక నిద్రొస్తుందా?"

"టీ తాగి పడుకునేదాన్ని - నా నిద్రకి కాఫీ ఒక అడ్డా? హహ్హహ్హ! ఆ బెంగేం లేదు - కావల్సినప్పుడు కాఫీ తాగానని బహు బాగా పట్టేస్తుంది నిద్ర."

"అయితే - ఇదింకో కాఫీ విత్ కలి... మి అన్నమాట!"

"అలాగే అనుకోండి - కానీ "కలి....మి" అని సాగదీశారెందుకు?"

"కలిమి అంటే అమ్మాయేమో కదా? నేను అబ్బాయిని కదా - అందులో కలికాలపు అబ్బాయిని - అంటే కలిపురుషుణ్ణి - అందుకే  - 'కలి-me'  అన్నా!"

"అబ్బా! మీరు మామూలు తెలుగు మాట్లాడండి బాబూ - కలియుగంలో పుట్టిన అబ్బాయిలందరూ కలిపురుషులు కారు - కలిపురుషుడంటే వేరే అర్థం వుంది."

"ఏయ్! మా గుంటూరు తెలుగు నేమీ అనకు - అసలు పుస్తకాల్లో, సినిమాల్లో వాడే తెలుగు గుంటూరు తెలుగే తెలుసా?"

"తెలుసు బాబూ - మీరు గొప్పే కానీ - ఇంకేంటి సంగతులు - ఇంతకీ డిన్నర్ చేశారా?"

"చేశాను కానీ - నిన్న పోస్టాఫీస్‌లో నీ పుస్తకం నీ ఫ్రెండ్స్ అందరికీ పంపిద్దామని పోస్టేజ్ ఎంతో కనుక్కోవడానికి వెళ్ళినపుడు ముందు ఒక్క పుస్తకమే తీసుకెళ్ళాం చూడు - అప్పుడు మన టికెట్ నంబర్ ఎంత?"

"ఇప్పుడదెందుకు?"

"అదే మరి! నాది వివిధ-స్కీం అని తెలుసు కదా - అలా టాపిక్కులోంచి టాపిక్కులోకి వెళ్ళిపోతూ ఉండాలి మరి - ఇంతకీ అదెంతో చెప్పు"

"పన్నెండు"

"మరి తర్వాత  మనం కార్లోంచి మిగిలిన అన్ని పుస్తకాలు తీసుకుని ఓ ఐదు నిముషాల్లో లోపలికి వెళ్లి ఇంకో టికెట్ తీసుకుంటే వచ్చిన నంబర్ ఎంత?"

"పాతిక"

"అంటే మనం బయటికొచ్చి లోపలికి వెళ్లిన ఐదు నిముషాల టైంలో ఆ మధ్యలో వున్న డజను నంబర్లు ఏమయినట్టు - లోపల ఐదారుగురికన్నా ఎక్కువమంది లేరు కదా?"

"ఏమో బాబూ - నాకేం తెలుసు -అయినా అదేమయినా అంత ఆలోచించాల్సిన విషయమా?"

"మరి - ప్రతిదాన్నీ 'ఎందుకు, ఏమిటి, ఎలా' అనాలోచించకపోతే మన జ్ఞానం ఎలా వృద్ధి చెందుతుంది?"

"అంత జ్ఞానం ఎందుకబ్బా?"

"ఎందుకేంటి - ఈ జన్మలో ఎన్ని ఎక్కువ విషయాలు ఎంత వీలయితే అంత తెలుసుకోవాలి మరి."

"ఎందుకూ? వచ్చే జన్మలో పుడుతూనే బోల్డన్ని తెలివితేటలతో పుడదామనా?"

"అవును మరి - వచ్చే జన్మలో నాకు ఆకాశంలో ఎగిరే గద్ద - అదే eagle లా పుట్టాలని ఉందని చెప్పాను కదా!  - అప్పుడు నేను the most intelligent eagle on the earth అవుతాను."

"గద్ద గానా పుట్టడం? అప్పుడు మీకు తెలివితేటలుంటే మటుకు ఎవరికి తెలుస్తుంది?"

"మిగిలిన గద్దలకి... ఏ జాతిలో పుట్టినా అందులో best గా ఉండాలి కదా మరి!"

"... .... .... "

"మరి ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నామనుకో ఆ పక్కనుంచి వెళ్ళే కుక్కో, పిల్లో మనల్ని చూసి 'అబ్బా! ఈ మనిషి ఎంత తెలివైనవాడో' అనుకోదు కదా! అందుకే నా గద్ద-తెలివితేటలు అప్పుడు గద్డలకే తెలుస్తాయి."

"బాబూ! మీకో దండం -నా కాఫీ అయిపోయింది -నేనింక పడుకుంటాను."

"హమ్మయ్య - నాకింకో పది గుణాలు పెరిగాయి"

"అదేంటి మళ్ళీ! మీ వివిధ-స్కీం లో ఇంకో టాపిక్-త్రెడ్డా ఇది?"

"నువ్వు నాకో దండం అన్నావు కదా - దండం దశగుణం భవేత్ - నీ దండంతో నాకో పది గుణాలు పెరిగాయి."

"అబ్బా! ఆ మాటలకర్థం అది కాదు!"

"నీకేంలే - నువ్వేమైనా అంటావు - మాట మార్చి మాటే కాదు - మాటకి మాటే కాదు - మాటంటే మాటన్నారంటావు, మాటనకపోతే మాట్లాడలేదంటావు. వింటున్నా వినట్లేదంటావు, వినపడలేదంటే వినిపించుకోలేదంటావు. నీ మాటలతో మాటల్లో చెప్పలేనంత మహా  చిక్కొచ్చి పడిందనుకో!"

"మహాప్రభూ! 'మాట' అన్న ఒక్క మాట పట్టుకుని నా నోట మాట వచ్చీ రాకుండానే నన్నిన్ని మాటలంటారని తెలిస్తే అసలు మాటాడకనే పోదును."

"అమ్మో - నువ్వు మాట్లాడకపోతే ఎలా? ఏదో - నేను పక్కన లేనని నోటికి తాళం వేసుకుని దిగులుగా ఉంటావేమోనని బెంగొచ్చి ఏదో ఒకటి మాట్లాడుతూ నిన్ను మాట్లాడిద్దామని ...కొంచెం సేపైనా... అంతే!"

"... ... ... ... "

"సరే మరింక! నీకు నచ్చిన పాటని తలుచుకుని పాడుకుంటూ బజ్జో! గుడ్ నైట్, బుజ్జాయ్!"

"వచ్చేయండి మరి తొందరగా... గుడ్ నైట్, బావా!"


7, ఏప్రిల్ 2018, శనివారం

కాఫీ విత్ కలిమి - 2 - రెలిజియన్, పాలిటిక్స్, గ్రేట్ పంప్కిన్ ....అదే వరసలో... పిల్లలూ, ఫిల్ములూ...




పైనున్న తలెత్తి చూస్తున్న ఆ ఐరిస్-రాణి గతకాలపు-వసంత వైభవం.
కిందున్న కొబ్బరి-బొండాల ముగ్గు పూల ముస్తాబు లేదని అలిగిన మా వాకిలిని మరిపించడానికి వేసిన రంగవల్లి.



ఈ యేడాది...
మార్చ్ నెల 21 వ తారీఖు Spring Equinox  ...
హడావిడిగా స్కూళ్ళకి సెలవులిచ్చారు - Spring Break అంటూ... 
చైత్రమాసం శుద్ధపాడ్యమి విళంబినామ ఉగాది ...
సందడిగా పండగ చేసుకున్నాం - ఉగాది పచ్చడి తిన్నాం... 
చుట్టుపక్కల చెట్లింకా శిశిరపు పసిడిని ఒదులుకోలేదు -
తేనెపట్టుల చుట్టాలింకా పుప్పొడి మిసిమిని మెదువుకోనేలేదు. 

ఆమని ఆగమించింది - పేరుకి అంతే!
ఫెళ్ళున ఎండ కాసి కొమ్మకొమ్మనా చిగుళ్ళు తొడిగి 
మొగ్గలొచ్చి పూలు విచ్చి రెమ్మ రెమ్మనా ఉవ్విళ్లూరే కోయిలలూయలలూగి 
ఆ వనప్రియ పాడిన పాటలకే చివుళ్ళొచ్చాయో 
చివుళ్ళ మేతకే ఆ కుహూకంఠపు కూతలు గీతాలయ్యాయో 
కూత ముందా చిగురు మేత ముందా 
అన్న బువ్వా-సవ్వడుల లెక్కలింకా మొదలెట్టనే లేదు ... 
అంతలోనే...
వాన మొయిలుల ఆగం మించింది - వూరిలో వింతే!
ఫెళ ఫెళ ఉరుములు తళ తళ మెరుపులు 
మబ్బులొచ్చి నేల తడిచి చినుకు చినుకునా చిందులాడే నీటి ముత్యాల వానవిల్లు మెరిసి 
ఆ నింగి చుట్టపు అంచున నేల మురిసిందా 
ఈ పుడమి మురిపానికే హరివిల్లు మెరిసిందా 
అన్న మెరుపూ-మురుపుల సందడికే మా వూరు నెలవయింది... 


కిటికీ కవతల చినుకుల చిందులాట - వానలో - కరిమబ్బు గొడుగులో
కిటికీ కివతల చెణుకుల సందడాట - ఫోనులో - కాఫీమగ్గు పొగలతో...

"హలో"

"హాయ్ - ఎన్నాళ్ళకెన్నాళ్ళకి?"

"ఎలా వున్నావ్?"

"బ్రహ్మాండం  - నువ్వో?"

"అండ-పిండి బ్రహ్మాండం"

"అచ్చుతప్పు అప్పు తెచ్చుకున్నావా?"

"అబ్బే - నేనన్నది సరిగ్గానే - అండ-పిండి బ్రహ్మాండం"

"అదేం లెక్క?"

"ఇంటి పట్టున ఉండి పకోడీ తిందామా, బజ్జీ లేద్దామా అనిపించే వాతావరణంలో వున్నాను మరి"

"సరి పోయింది ... ఇంతకీ ఏంటి విశేషాలు?"

"ఏముంటాయి - ఈ మద్య మాట్లాడ్డానికి టాపిక్కులే ఉండట్లేదు - ఇంకెక్కడి టాక్కులు?"

"అదేమలా?"

"తర్వాజ్జెప్తా కానీ ...ఇంతకీ నా బ్లాగ్ చదివావా?"

"అప్పుడే ఇంకో కొత్తది రాసేశావా? రెండ్రోజుల్నుంచీ ఇంటర్నెట్ ప్రాబ్లెమ్... వూరికే డ్రాప్ అయిపోతోంది - నీ కొత్త బ్లాగ్ పోస్టుని పక్కింటివాళ్ళ కృపతోనైనా చదివేయాలి"

"పక్కింటివాళ్ళ కృపా? అదేంటి"

"వాళ్ళ వై-ఫై వాడేస్తే దాన్నలాగే అంటార్లే - నీ బ్లాగ్ చదవడానికి enthusiasm ఎక్కువ - ethics తక్కువైనా పర్లేదులే - హహ్హహ్హ!"

"హహ్హహ్హ... ఇది వింటే మన చిన్నప్పటి ట్రంక్-కాల్ రోజుల్లో PP గుర్తుకొస్తోంది - PP అంటే పక్కింటివాళ్ళ-ఫోనుకి particular person అని ఒక నైసు పేరు"

"అద్సరే కానీ... ఇంతకీ ఏంటి ఈసారి టాప్పిక్కు?"

"టాప్పిక్కు - భలే ఉందీ మాట - ఆ మధ్య అక్షరం చేసిన అక్కరేంటో నీకు - దాన్నలా నొక్కి వక్కాణించావు?"

"ఏదైనా ఒక talk కి top గా pick చేసుకునే subject = టాప్పిక్కు అన్నారు కదండీ మరి?"

"అబ్బబ్బబ్బబ్బా...  నచ్చేసింది ... నిజంగా చెప్పాలంటే నా గాలికబుర్లకి టాకు-టాపిక్కు-టాప్పిక్కు అనేవేవీ ఉండవని నీకు తెల్సు కదా! టాపిక్కు అంటే ఇంకోటి గుర్తొచ్చింది - మాట్లాడడానికి - మాటలాడడానికి నాకు Linus ఆదర్శం"

"Linus అంటే మన Charlie Brown ఫ్రెండేనా?"

"అవును - వాడే... వాడెప్పుడో There are three things I have learned never to discuss with people: religion, politics, and the Great Pumpkin అన్నట్లుగా నేను రెలిజియన్, పాలిటిక్స్, గ్రేట్ పంప్కిన్లూ లాంటి ఎవరితోనైనా సరే గొడవైపోయే సంగతులే తేను నా మాటల్లోకి. Linus చెప్పిన ఆ మూడిటితో పాటు అదే వరసలో నావింకో రెండు - పిల్లలూ, ఫిల్ములూ"

"అదేం మాట ? పిల్లలూ-ఫిల్ములూ అంటూ పి-గుణింతం నేర్పుతున్నావా నీ తెలుగు-వెలుగు పథకంలో?"

"అలాంటి భాషోద్ధరణ ఏమీ లేదు కానీ - ఎందుకో మరి పిల్లల గురించిన ఏ టాపిక్కూ ఎవరితోనూ మాట్లాడాలనిపించదు. నేను గమనించిందేంటంటే పిల్లల పెంపకం విషయంలో ఎవరి అభిప్రాయాలు వారివి. మన చేతి ఐదు వేళ్ళూ ఒకలాగే ఎలా ఉండవో - పిల్లల విషయంలో తల్లుల అభిప్రాయాలూ అంతే varied గా అనిపిస్తాయి నాకు.  అందులో చాలా elements కలుస్తాయనుకుంటాను - చిన్నప్పట్నుంచీ పెరిగిన వాతావరణం, అందులో వాళ్ళు నేర్చుకున్నది, నేర్చుకుంటే బావుండును అనుకున్నది, పెరుగుతూ నేర్చుకున్నామనుకున్నది - ఇలా రకరకాల పాఠాలని తమ పిల్లలకి నేర్పే ప్రయత్నంలో - ఎవరి అనుభవం వారిది, ఎవరి ప్రత్యేకత వారిదే. అందుకని ఏదో పైపైన కబుర్లు తప్ప ఎవరి బొటనవేళ్ళూ తొక్కకుండా జాగ్రత్త పడుతూ వుంటాను. అప్పటికే కొన్ని తప్పులు చేశాననుకో - వూరికే ఉండలేక - అడిగారు కదా అని ఏవో సలహాలు చెప్పి. ఇప్పుడింక ఆ సరదా కూడా లేదు"

"బావుందమ్మాయ్ - నీ పిల్లా-సఫీ. ఒప్పుకుంటున్నాను. మరా ఫిల్ముల మాటేంటి?"

"ఆ ముచ్చట కూడాచెప్పాలి మరి నీకు ...అప్పుడెప్పుడో తాతగారి వారసత్వం పదే పదే గుర్తు చేసే మనవడి సినిమా ఏదో చూసి హాల్లోంచి బైటికి వస్తూ 'సినిమా ఎలా ఉందండి?" అని అడిగిన వారితో 'ఈ అబ్బాయి కొంచెం తాతలు తాగిన నేతుల గురించి - నేత అయిన తాత గురించి ఆట్టే చెప్పకుండా, ఆ అంక-తాడనం చేయకుండా సినిమా చేస్తే చూడాలని వుంది ఎప్పటికైనా' అన్నాను అంతే  - అంతకి ఎక్కువా కాదు, ఇంకో మాట తక్కువా కాదు. నన్నడిగి మరీ నా సమాధానం విన్నవారికి నేనన్నది నచ్చలేదు - ఇప్పటిదాకా మళ్ళీ నాతో మాట్లాడింది లేదు. అప్పుడర్థమయ్యింది Linus లిస్టుకి నే చేర్చిన పిల్లలతో పాటు ఫిల్ములు కూడా జత చెయ్యాలని - అంతే - అలా తయారయ్యింది - రెలిజియన్, పాలిటిక్స్, గ్రేట్ పంప్కిన్ ....అదే వరసలో... పిల్లలూ, ఫిల్ములూ... ! "

"మొత్తానికి నీ కబుర్లతో బోల్డంత టైం తెలీకుండా గడిచిపోయింది" 

"అవును ---నేనూ పెట్టెయ్యాలి గబగబా ఫోనింక - వాళ్ళొచ్చేస్తారింతలో -పచ్చడి చెయ్యాలి"

"ఆ!!!..."

"హహ్హహ్హ - వాళ్ళని కాదులే - టమాటాల్ని"

"హహ్హహ్హహ్హహ్హ .... నువ్వున్నావే .... హహ్హహ్హ"

"నేనున్నాలే - ఇలాగే అంటూనే నేనుంటుంటాలే ...bye మరి!"

"Bye !!!"


చివర్లో ఓ చిన్న సిప్పు - కరెంటు టాకు-టాపిక్కు-టాప్పిక్కు:

"పేపర్ చూశావా?"

"ఏముంది అందులో?"

"నార్త్ కొరియా కుడ్ బి ఏబుల్ టు న్యూక్ యూఎస్"

"కుడ్ బి ఏబుల్  ఏంటో కుడ్ అంటే చాలదూ? - అయినా ఆ కిమ్మొస్తే ఈ ట్రంపు కిమ్మనకుండా ఉంటాడా ఏంటి?"

"నిజంగా జరిగేది పెట్టేది ఏమీ లేదు - జనాలని వూరికే భయ పెట్టడానికి - ఏదో  సెన్సేషన్ క్రియేట్ చేయడానికి అంతే!"

"పేపరు - సెన్సేషన్ అంటే గుర్తొచ్చింది - సల్మాన్ ఖాన్‌ని జైల్లో పెట్టారట కదా -ఏడ్చాడట కూడా"

"అవును ఇరవై ఏళ్ళ తర్వాత"

"మరి అతన్ని పోలీసులు కొడతారా జైల్లో - మన సినిమాల్లో చూపిస్తారే అలా?"

"అసలేమనుకుంటున్నావ్ నువ్వు - కొట్టడమా ఏమన్నానా - పక్కన్నుంచుని సెల్ఫీలు తీసుకుంటారు అంతే"

"పోన్లెండి ఇప్పటికైనా జైల్లో పెట్టారు - పాపం ఫుట్-పాత్ మీద పడుకున్నవాళ్ళని చంపేశాడు కూడాను"

"ఇది జస్ట్ జోధ్‌పూర్ కోర్ట్ తీర్పు - ఇంకా బెయిళ్ళుంటాయి - పై కోర్టుకి అప్పీళ్ళుంటాయి - అప్పుడే ఏమైంది - అసలెన్ని రోజులు లోపలుంచగలుగుతారో చూడాలి"

"అయ్యో!  మరి ఈ ఇరవై ఏళ్ళ శ్రమ, అదేదో హైద్రాబాదాయన చేసిన కృష్ణజింక DNA టెస్టులు, దానికోసం  ఆయనకి  ఇచ్చిన ఫీజులు - బోల్డు డబ్బు, టైము ఖర్చు కదా - వేసిన శిక్ష ఐదేళ్ళు కాకుండానే అప్పుడే వదిలేస్తే?"

"జనాల డబ్బు అది - ఎవరికి పడుతుంది?"

"అసలెప్పటికి జనాలకి తెలుస్తుందో కదా? పాపం! తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు లేనివాళ్ళెంతమందో! అసలు సల్మాన్ ఖాన్‌ని కోర్టులు, జైళ్లు అని తిప్పకుండా తనింట్లో తనని ఉండనిస్తే కనీసం పబ్లిక్ మనీ వృధా అవదు."

"హ్మ్ !"

"నాకింకా అస్సలు నచ్చనిదేంటంటే - సల్మాన్ ఖాన్‌కి శిక్ష వేసింది మనుషుల్ని చంపినందుకు కాదు - కృష్ణజింకలని వేటాడినందుకు. మన దేశంలో స్టేటస్ లేని మనుషులకి అయ్యే డేంజర్ లెక్కలోకి రాదు కానీ జంతువులకి మాత్రం endangered స్టేటస్సు ! అస్సలు బాలేదిది - మనుషులని చంపినందుకు వారి తరఫున కేస్ పెట్టే దిక్కు లేదు. వాళ్ళని వచ్చే జన్మలో కృష్ణజింకలుగా పుట్టించమని కృష్ణుణ్ణి అడగాలి - అంతే అంతే !!"

26, జనవరి 2018, శుక్రవారం

కాఫీ విత్ కలిమి - 1 - ఫస్ట్ సిప్

అప్పుడప్పుడు పగళ్ళు మరీ పొడుగ్గా ఉంటాయి
సాయంత్రాలు కొంచెం దిగులుగా అనిపిస్తాయి
నడకలో అడుగులు కదలనని మొరాయిస్తాయి
గొంతులో పాటలు శృతి తప్పి విసిగిస్తాయి
అలాంటప్పుడు - కప్పుడు కాఫీ ఒక చేత -  ప్లెయిన్ ఓల్డ్ POTS లైనో, సెల్లుయుగపు స్మార్టు ఫోనో ఇంకో చేత బట్టి - మీటలు నొక్కగా - 'హలో' అంటూ కలిసే చెలిమి-తీగ కలిమి కాక మరేంటి?

ఆ చెలిమి-కలిమితో
కలిమి-చెలిమితో -
చేతిలోని కాఫీ కప్పుతో -
సిప్పు మీద సిప్పుతో -
కలిసిన మాట మీద మాట పెంచి -
ఎన్ని కబుర్లో!

ఎంత సేపని కాదు - ఎలాంటి కబుర్లనీ చెప్పడానికి లేదు - చెప్పుకున్నామా లేదా - అదీ లెక్క - అదే లెక్క!

అనగనగా మా వూళ్ళో ఉండేటప్పుడు -
గోడ వారగా ముక్కాలిపీటెక్కి -
పొద్దుటి నీరెండలో కళ్ళ-కమలాలు విచ్చుకుని -
పెదవి పగడాల నవ్వుల-ముత్యాల్ని దొర్లిస్తూ -
నేస్తంతో కబుర్లాడుకునే రోజుల్ని simulate చేసుకుంటూ -
ఇప్పుడూ ఆడుకుంటా కబుర్లు -
ఊసుపోని వేళల్లో
గాలివాటు పొద్దుల్లో 
ఉసురుసురనిపించినపుడల్లా
కుదిరితే పూసగుచ్చినట్టు - కుదరకపోతే నోటికొచ్చినట్టు
అచ్చమైన గాలికబుర్లు.
ఒక్కోసారి బావుంటాయి
ఒక్కోసారి.... ఉంటాయి
ఒక్కోసారి బోల్డుంటాయి
ఒక్కోసారి కొన్నే వుంటాయి
ఒక్కోసారి loooooong ear-time
ఒక్కోసారి quick (ear)bite
ఒక్కోసారి సిసలైన విశేషాలుంటాయి
ఒక్కోసారి అస్సలు విషయమే ఉండదు



అసల్చెప్పాలంటే - అప్పటికప్పుడు కాలక్షేపపు-బఠానీల-కరకరల్లా గలగలా నోట జాలువారే కబుర్ల వరస ఇదీ....

"హలో!"

"హలో"

"నీకు టైముందా? ఇప్పుడు మాట్లాడగలవా?"

"ఆ .. పర్లేదు - ఏంటి చెప్పు"

"హమ్మయ్య - ఐతే నీకు టైముంది - ఇప్పుడు చెప్పు - బావున్నావా?"

" బావున్నాను గాని - నువ్వెలా వున్నావ్? నాకు టైముందని చెప్తే కానీ కుశలమడగాలనిపించదా?"

"అవును మరి - నాతో నువ్వు మాట్లాడే sound నాకు వినిపించే టైం వున్నప్పుడే  నీకు sound mind in a sound body వుందో-లేదో నాక్కావాలి గానీ - ఉట్టప్పుడెల్లా ఉంటే నాకెందుకు?"

"మంచి దానివే! ఏం చేస్తున్నావింతకీ?"

"వంట చేస్తూ - నువ్వు గుర్తొచ్చావ్ - అంతే! కాఫీ కలుపుకుని నీకు ఫోన్ చేశా!"

"అయితే లైన్లో వుండు - నేనూ నా టీ కప్పు తెచ్చుకుంటా"

"వెళ్ళిరా మరి - తొరగా"

"తొరగానే - టీ మీద తొరక కట్టేలోగా వస్తా"

(అవతలి వాళ్ళొచ్చేలోగా ఇవతలవాళ్ళకి ear-time వృధా అయిపోతోందని బెంగ - అందుకే తనకి తనే పాడేసుకుని వినేసుకుంటుంది - వస్తా - వెళ్ళొస్తా - మళ్ళెప్పుడొస్తా - లైను కట్టయ్యేలోగ వస్తా అంటూ.)

"ఏంటీ - పాడేస్తున్నావ్?"

"మరెంత సేపేంటి? - నోరాడుతూనో, పాడుతూనో ఉండాలి"

(ఇటు పక్కనుంచి చుయ్-చుయ్ నేపథ్యసంగీతం - బూర్లుమూకుడులో మరుగుతున్న నూనె-లయకి చిటపటలాడుతున్న ఆవాల శృతితో.)

"నీ నోటాడేపాటా నా చెవులారా విన్నాను కానీ ... ఇంతకీ నీ కాఫీ తాగడం అయ్యిందా? స్టవ్ మీదేంటి? పోపేస్తున్నావా?"

"అర్రే! నీకెలా తెల్సింది?"

"స్మార్ట్ ఫోనమ్మా!"

"హహ హహ - బావుంది - వాసన పట్టేస్తుందన్నమాట"

"అదే గదా! దానికీ app ఉందమ్మా!  రకరకాల apps - అవెలా పని చేస్తాయో గుర్తుంచుకోడానికో app - ఆ app ఉందని గుర్తు చేయడానికో app - మొత్తానికి ఫోన్లు స్మార్ట్ అవుతున్నాయి - మనం అ-స్మార్ట్ అవుతున్నాము."

"కదా! - మొన్నెప్పుడో office లో ఏదో document చదువుతుంటే ఎవరికో ఫోన్ చేయాల్సి వచ్చింది - అప్పుడు నేనేం చేశానో తెల్సా - laptop keyboard మీద అంకెలు నొక్కి ఫోన్ పని చేయట్లేదేంటా అనేసుకున్నాను."

"అనుకున్నావూ! నువ్వలా అనుకోకపోతే అనుకోవాలి - అనుకుంటే అనుకోవడానికేమీ లేదు - సరే మరి - ఇంకేంటి విశేషాలు?"

"ఏం లేదూ... మొన్న నువ్వు ఫోన్ చేసినప్పుడు ఏం చేస్తున్నావూ అని నువ్వడిగినప్పుడు - కాఫీ తాగుతూ నీతో కబుర్లు చెప్తున్నాను అంటే "ఓహ్ అయితే కాఫీ విత్ మి అన్నమాట" అన్నావు కదా? ఆ మాట పట్టుకుని నేనొక కొత్త సిరీస్ మొదలు పెడదాం అనుకుంటున్నానని చెప్పాను కదా! దానికో పేరు కూడా పెట్టానని చెప్పాను కదా - కాఫీ విత్ కలిమి అని. ప్రస్తుతానికి అదే విశేషం."

"ఓ అదా ! హహ్హహ్హ"

"ఎందుకా నవ్వు?"

"ఏం లేదు - మొన్న దీనిమీదే జరిగిన నన్ను అవాక్కు చేసిన ఓ walk లో-వాక్కు గుర్తుకొచ్చి"

"ఎక్కడికా walk  - ఏంటా వాక్కు - నువ్వెందుకయ్యావ్ అవాక్కు???"

"చెప్తాగా! నీ ఈ పోస్టుకి అనుబంధంగా రాసుకో - నీకు copyrights ఇచ్చేశాను"

"భలే! నా Coffee-write కి నీ copyright! నచ్చేసిందమ్మాయ్!"

"ఇంకో పది నిముషాల్లో ఆఫీస్‌కి బయల్దేరాలి - మళ్ళీ మాట్లాడదాం!"

"బానే వుంది - భూమికవతలెక్కడో వున్నావు - పట్టుమని పది నిముషాలు కూడా మాట్లాడవ్ - ఈసారి నేను కూడా ఒక meeting request పంపిస్తా - అలా అయితేనే కుదిరేలా వుంది నీతో - bye మరి"

"Bye!"


Walk లో అవాక్కు చేసిన వాక్కు (Coffee-Write with Copyright ):

"లలిత కొత్త సిరీస్ మొదలు పెడుతోందట - కాఫీ విత్ కలిమి అని"

"ఆహా!"

"దానికి నేనే ఇన్స్పిరేషనట - అయినా ఫోన్ కబుర్లు అని రాయడానికి ఏముంటాయి కదా?"

"కబుర్లేముంటాయో తర్వాత సంగతి కానీ - నువ్వు ఇన్స్పిరేషన్  అవడం ఏంటి?"

"అంటే మేమిద్దరం కుదిరితే రోజూనో, కుదరకపోతే కుదిరిన రోజునో ఫోన్లో కబుర్లు చెప్పుకుంటాం కదా! అప్పుడు అటు పక్క తాను కాఫీ, ఇటు పక్క నేను టీ తాగుతూ చెప్పుకుంటామన్నమాట. అందుకని ఈ సిరీస్ అంతా ఫోన్ కాన్వర్సేషన్ లా నడుస్తుందన్నమాట - రకరకాల టాపిక్కులతో"

"ఐడియా బానే వుంది కానీ - నీకేమీ బాధగా అనిపించలేదా - ఆ సిరీస్‌కి పేరలా పెడితే?"

"పేరుకేమయింది - బానే ఉందిగా - కాఫీ విత్ కలిమి?"

" అదే - ఆ కలిమి అంటే నీకు ఏమీ అనిపించలేదా?"

"ఏమనిపించాలి?"

"అదంత మంచి మాట కాదు కదా ?"

"ఎందుకు కాదు?"

"కలిమి అంటే కష్టం కదా! కలిమిలేములు అంటే కష్టనష్టాలు కదా! నిన్ను అంత మాటనేసిందేంటి?  నీకేం అనిపించలేదా? పైగా ఆనందంగా చెప్తున్నావ్... కలిమి అని నా పేరే పెట్టింది అనీ..."

"అబ్బా! అసలు నిన్ను తెలుగులో పాస్ చేసిందెవరు? కలిమిలేములు అంటే okey-dokeyలాంటి usage కాదు. తెలుగులో ద్వంద్వసమాసం అది - కలిమి అంటే wealth, లేమి అంటే poverty."

"ఓ హో "

"లలిత వాడే అర్థంలో కాఫీ విత్ కలిమి అంటే talking to a friend over a cup of coffee"

"అర్థం అయింది"

"హ్మ్.... "

"ఏంటాలోచిస్తూ నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావ్? ఇదంతా లలితతో చెప్పేయాలనుకుంటున్నావా? చెప్పేస్తావా?"

"మరి... చెప్పక? నాకు దక్కిన ఈ నవ్వులు పంచక మా చెలిమి-కలిమిని లేమి చెయ్యనా?"

"తల్లీ ! నీకో దండం - మీది చెలిమి-కలిమి; నాది బుద్ధి-లేమి. ఒప్పుకుంటున్నాను"

<<ఈ పోస్ట్ మరియు సిరీస్ 100 శాతం  నా చెలిమి-కలిమికి బోల్డన్ని ధన్యవాదాలతో దఖలు>>