20, సెప్టెంబర్ 2026, ఆదివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 27 - వినా దైన్యేన జీవనం - అనాయాసేన మరణం

    నాతో నేను వుండడం 
    నాతో నేనుండి - నాలో నేనే మాట్లాడుకోవడం 
    నాతో నేనుండి - నాలో నేనే మాట్లాడుకుని - నేను అనుకున్నది నాకే నా బ్లాగులో చెప్పుకోవడం
    నాకు అతి ఇష్టమైన వ్యాపకాల్లో ఒకటి. 

    ఈ మధ్య చాలా రోజులుగా - నిజంగా చెప్పాలంటే గత రెండేళ్లుగా - మనసుకి దిలాసా, బతుకులో కులాసా - అరుదయ్యాయి. 

    నాతో నేను వుండడానికే భయపడ్డాను
    నా మాటలేవీ నాకు వినపడకూడదనుకున్నాను
    నాకు నచ్చని కబుర్లు నాతో నేనే ఏం చెప్పుకుంటాలే అని బ్లాగ్ జోలికే రాలేకపోయాను. 

    మళ్లీ ఇన్ని రోజులకి - మళ్లీ కొద్దికొద్దిగా నా కిష్టమైన కబుర్లు చెబ్దామనిపించింది. 
    
    అలా మొదలెట్టేటప్పుడు - నాన్న గురించి నాలుగు కబుర్లు చెప్పాకే ఇంకేమైనా చెప్పాలి అని కూడా అనిపించింది.      


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    గడుస్తున్న ప్రతి సాయంత్రం ...
    ఈ పడమటి దేశపు నడిబొడ్డు రాష్త్రంలో వున్న  మా ఇంటి వంటింటి కిటికీలోంచి 
    పడమటి మిన్నుల మీదుగా జారే సూరయ్యని చూస్తూ - 
    అలా చూస్తున్న నా కళ్లతో
    రాజమండ్రి ఇంటి మేడ మీద మార్నింగ్ వాక్ చేసింతర్వాత సిమెంట్ బెంచీ మీద కూర్చునే నాన్న కళ్లు కలిపినట్టే వుండి - 
    ఒకే వెలుగుని చూస్తున్నామూ - నాన్నా, నేనూ  - అన్నట్టనిపించేది
    వేల మైళ్ల దూరంలో వున్నా కూడా 
    వెలుగుదారుల చూపుల దారాలేవో కలిసినట్టే వుండి - 
    నాన్నతో నేనూ, నాతో నాన్నా - కలిసి వున్నట్టనిపించేది.


    పొడుస్తున్న ప్రతి పొద్దూ...
    మా ఇంటి మొగసాల కూర్చుని
    తూరుపు దిక్కున ఎఱుపెక్కే పగటివేల్పు వెచ్చదన్నాన్ని అద్దుకుంటూ 
    రాజమండ్రి ఇంటి బాల్కనీలో కుర్చీలో కూర్చున్న నాన్న పాడుతున్న నృసింహ శతకం...


అంత్యకాలమునందు - నాయాసమున నిన్ను
దలతునో తలపనో - తలతు నిపుడె
నరసింహ । నరసింహ । - నరసింహ । లక్ష్మీశ ।
దానవాంతక । కోటి భానుతేజ ।
గోవింద । గోవింద । గోవింద । సర్వేశ ।
పన్నగాధిపశాయి । పద్మనాభ ।
మధువైరి । మధువైరి । మధువైరి । లోకేశ ।
నీలమేఘశరీర । నిగమవినుత ।

ఈ విధంబున నీనామ మిష్టముగను
భజనసేయుచు నుందు నా భావమందు.
భూషణవికాస । శ్రీధర్మ పురనివాస ।
దుష్టసంహార । నరసింహ  దురితదూర ।

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

పాంచభౌతికము దుర్బలమైన కాయం బి
దెప్పుడో విడుచుట యెఱుకలేదు
శతవర్షములదాక మితము జెప్పిరి గాని
నమ్మరా దామాట నెమ్మనమున
బాల్యమందో మంచి ప్రాయమందో లేక
ముదిమియందో లేక ముసలియందొ
యూరనో యడవినో యుదకమధ్యముననో
యెప్పుడో విడుచుట యేక్షణంబొ

మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైన
దేహమున్నంతలో మిమ్ము దెలియవలయు.
భూషణవికాస । శ్రీధర్మపురనివాస ।
దుష్టసంహార । నరసింహ దురితదూర ।

    అంటూ....
    వెన్నెల రోజుల్లో వెలుగు పాటగా సాగుతూ- 
    అమాస మాపుల్లో చీకటి దాపుల మోగుతూ
    నా చెవుల సోకుతున్నట్టే అనిపించేది. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    ఇదంతా ఈ ఏడాది జనవరి 20 వ తారీఖు ముందటి మాట.

    జనవరి పండగలకి అనాతవరం వెళ్లొచ్చి పద్ధెనిమిదో తారీఖున "ఒకసారి నిన్ను చూడాలని వుంది - వీడియో కాల్ చేస్తా. కెమెరా ఆన్ చేసుకో" అంచెప్పి నాతో మాట్లాడిన ఆ 13 నిముషాలే నాన్న  ఆఖరి గురుతులవుతాయని ఎందుకు నాకు తట్టలేదో?

    ఎప్పుడూ "ఎలా వున్నారు నాన్నా?" అనడగ్గానే "బ్రహ్మాండంగా వున్నాను" అని చెప్పే నాన్న ఆ రోజు మాత్రం "అనాతవరంలో వున్నప్పట్నించీ ఒంట్లో బాలేదు - ఆయాసం వస్తోంది" అని నాకు చెప్తే - ఎప్పట్లా "మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అశ్రద్ధ చేయకుండా." అని గట్టిగా చెప్పకుండా - అదేదో మామూలు విషయమన్నట్టు "ఓహ్ అవునా! చలికాలం కదా నాన్నా. చలికి అలా అనిపించి వుంటుంది. జాగ్రత్త మరి!" అని ఎందుకు ఆపేశానో?

    జనవరి 20 న హైద్రాబాదు వెళ్త్తున్నాం అమ్మా-నేనూ అని నాన్న చెప్తే అడిగాను కూడా - "ఒంట్లో బావులేదంటున్నారు, ఇప్పుడు ప్రయాణం చెయ్యాలా, నాన్నా?" అని. 

"అబ్బే! అంతా సర్దుకుంటుందిలే. మా అక్కగారు పాపాయమ్మగారింట్లో  పెళ్లి. అందులోనూ బుజ్జికి ఒక్కతే కూతురు. దాని పెళ్ళికి తప్పకుండా వెళ్లాలి" అంటే "సరే! మీ ఇష్టం. జాగ్రత్త నాన్నా!" అనేసి వూరుకున్నానెందుకో?!

    పొడుగ్గా పెరిగిన తెల్లగడ్డంతో నాన్న అలసటగా కనిపిస్తుంటే "అదేంటి నాన్నా? ఆ గడ్డమేంటి? అలా వున్నారేంటి?" అనడిగిన నాతో "అడక్కపోయినా పెరిగేది అదొక్కటే కదా - పెరగనీ" అని నాన్న నవ్వేయగానే ఆయన అలసట గురించి అడగాలనుకున్నదేదో ఎలా మర్చిపోయానో?






*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    జనవరి 20 న బయల్దేరి అమ్మ, నాన్న హైద్రాబాదు వెళ్లారు.

    జనవరి 30 న -

వినా దైన్యేన జీవనం - జీవిత్వా
అనాయాసేన మరణం - ప్రాప్య
భీష్మ ఏకాదశిని దాటి 
ద్వాదశి ఘడియల్లో 
నాన్న వెళ్లిపోయారు
అంతకు ముందున్న నెలన్నర రోజులూ 
ఆయన గుండె అంపశయ్య మీదే వున్నా
అంత నొప్పినీ 
పెదవి దాటనియ్యలేదు

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    ఇంతకు ముందు ఎందరికో జరిగినదే...
    ఇక ముందూ అందరికీ జరిగేదే...
    ఎవరూ ఇచ్చగించకపోయినా నీడలా వెన్నంటి వుండేదే...
    ఎవరం ఎంచుకోకపోయినా BOGO offer లా కలిసి వచ్చేదే...

    కానీ నాన్న గురించి ఇలా ఒక్కసారి తలచుకోవాలనిపించింది. 
    ఇంతకు ముందు 26 భాగాలు నాన్న చెప్పిన కబుర్లు ఆయన మాటల్లోనే రాశాను. 
    ఆయన చెప్పుకోలేని ఇవాళ్టి కబుర్లతో ఈ సిరీస్‌ని ఇక్కడికి ముగిస్తున్నాను.

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***




8 కామెంట్‌లు:


  1. ఇది చదవడం నచ్చలేదు.

    Request: Uncle మాత్రమే చెప్పగలిగేవి మినహాయించి మిగిలినవి అన్నీ ఆంటీ నీ అడిగి రాయడం బాగుంటుంది. Please consider.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాకు ఇలా రాయడం తప్పలేదు. నాన్న చెప్పలేని కథని నేను రాయలేను. మీ అభిమానానికి చాలా thanks!

      తొలగించండి
  2. నాన్న జ్ఞాపకాలు చాలా చక్కగా రాశావు లలిత 👏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
  3. నాన్న చెప్పిన కబుర్లు ఇదే ఆఖరి భాగం అవడం విషాదంగా ఉందండి, ఎప్పటికయినా తప్పనిసరైనా సరే మన జీవితాల్లో తప్పని విషాదాలు అనుకుంటా ఇవన్నీ. మన పెద్దలే పిల్లల రూపంలో మనతో ఉంటారు అనేది నానమ్మ, ఇది కూడా అలానే అనుకోవాలేమో 🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తప్పని విషాదాన్ని ఒప్పుకుంటే కాని ముందుకి సాగలేననిపించి ఇలా రాసుకున్నానండి. చదివినందుకు మీకు చాలా థాంక్స్, శ్రీనివాస్ గారు!

      తొలగించండి
  4. May his soul attain moksha. Deep condolences, Lalitha garu. వారి గురించిన కబుర్లు చాలా సార్లు చదివాను. బాధగా ఉంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేనెప్పుడు బ్లాగ్ రాసినా తప్పకుండా చదివి నాకు చెప్తారు మీరు, దీపగారు! అందుకు మీకు బోల్డన్ని థాంక్స్! Thanks for your support!

      నాన్న కబుర్లు చదివినందుకు, ఇప్పుడిలా తలచుకున్నందుకు ఇంకా బోల్డన్ని thanks !!!!

      తొలగించండి