చేసేది ఏ పని అయినా అది పాటు అనిపించకుండా వుండాలంటే పనికి తోడుగా ఓ పాట ఉండాల్సిందే! పనిపాటలు అని ఊరికే అన్నారా మరి?!
నా వరకు నాకు...
పాట లేని పని...
అది పడరాని పాటు
ఎప్పటికీ తగ్గని పోటు
నా మటుకు నాకు...
పనికి తోడు పాటుంటే...
అది కలిసి వచ్చు సాయంలే!
అదే చెప్పరాని హాయంతే!
*******
*******
అందుకే నేను ఏ పని చేస్తున్నా - నేనన్నా పాడుతుండాలి - లేదా ఏ పాటన్నా మోగుతుండాలి.
ఆ పూటకి నే చేస్తున్న పనిని బట్టి, అప్పటికి వున్న నా మతిని బట్టి నేనెంచుకునే పాట వుంటుంది.
అలాంటప్పుడు ఒక్కోసారి - పుస్తకాల్లో దాచిపెట్టి మరిచిపోయిన నెమలీక మెరుస్తూ కనిపించి మురిపించినట్లు - ఎప్పుడో పాడుకున్న పాట కూనిరాగమై మూగి వస్తుంది. ఇక ఆ రోజంతా అదే మోగిపోతుంది.
కిందటి వారంలో ఒక రోజు అలా గుర్తొచ్చిన పాట - "జిందగీ ఏక్ సఫర్ హై సుహానా...".
ఈ పాటని చిన్నప్పట్నుంచీ వినడమే కానీ ఎప్పుడూ టీవీలో చూడలేదు. ఏ సినిమాలోదో కూడా తెలీదు. మొన్న గుర్తు రాగానే వెంటనే యూట్యూబులో వెతికి చూశా.
హాచ్చెర్యం! అది రాజేష్ ఖన్నా మోటార్ సైకిల్ మీద వెనకాల హేమమాలినిని ఎక్కించుకుని బొంబాయి ఊరంతా తిరుగుతూ - మధ్యమధ్యలో పార్కుల్లో, బీచుల్లో, రెస్టారెంట్లో- అక్కడక్కడా నడుస్తూ - పాట పాడేస్తూ వుంటాడు. హేమ్మాల్ని తెగ నవ్వేస్తూ వుంటుంది. పాట మధ్యలో కొంచెం ముక్క అరేబియా సముద్రమే కాకుండా గేట్ వే ఆఫ్ ఇండియా గోడ ముక్కలు కూడా ఓ రెండు కనిపిస్తాయి.
అన్నట్టు మన తెలుగు సినిమాల్లో హీరోయిన్లకి పాటల్లో డాన్స్ ఆడేటప్పుడు చెప్పులు వేయనట్లే - ఈ పాటలో ఓ చోట బీచులో నడిచేటప్పుడు రాజేష్ ఖన్నా కాళ్ళకి నల్లబూట్లు వేశారు కానీ హేమ్మాల్ని పాదాల్ని ఏ చెప్పుల తోనూ కప్పకుండా తెల్లగా వుంచేశారు.
సరే! ఇప్పుడు పాట పుట్టుపూర్వోత్తరాలు.
పాట: "జిందగీ ఏక్ సఫర్ హై సుహానా..." సినిమా: అందాజ్ పాటలో కనిపించే హీరో-హీరోయిన్ను: రాజేష్ ఖన్నా - హేమమాలిని పాటలో కనిపించని హీరో: షమ్మీ కపూర్ పాట రచయిత: హస్రత్ జైపురి సంగీత దర్శకులు: శంకర్ - జైకిషన్ పాడిన వారు: Yodeling-king కిషోర్ కుమార్
ఈ పాట మధ్యలో yodeling వచ్చినప్పుడల్లా - అక్కడ కళ్ళ ముందు కనిపించే రాజేష్ ఖన్నా కన్నా - కనిపించకుండా పాడుతున్న కిషోర్ కుమారే చెవులకి ఆనుతున్నట్టు అనిపిస్తుంది నాకు.
కాకపోతే ఈ పాట చూడక ముందు ఎప్పుడూ ఇలా అనిపించలేదు కానీ చూశాక ఇలా రాశారేంటబ్బా అని మాత్రం ఎన్ని సార్లు అనిపించిందో!
పాట చూస్తుంటే - ఒక హీరో లాంటి అబ్బాయి తనకెంతో ఇష్టమైన డ్రీం గర్ల్ లాంటి అమ్మాయిని మోటార్ బైకు మీద కూర్చోబెట్టుకుని - షికారుకి తీసుకెళ్తూ హుషారుగా పాడుతున్న సందర్భంలా వుంటుంది.
పాడిన వింటుంటే ఉత్సాహం ఉరకలు వేస్తున్న గొంతుతో - పాడే పాటకి "ఓడ్లెయ్ ఓడ్లెయ్..." అని హంగులద్ది మరీ కిషోర్ కుమార్ పాడిన తీరు, అందులో మళ్ళీ బోల్డన్ని నవ్వులు.
తీరా పాటలో మాటలు చూస్తేనేమో ...
మరణం వస్తే రానీ...
ప్రాణం పోతే పోనీ...
ఇలాంటివంటే
భయపడడమేంటి?
రేపేమౌతుందో
ఎవరికి తెలుసేంటి?
అంటూ దాసరి-వారి-ప్రేమవైరాగ్యం మార్కు సాహిత్యం.
ఈ పాట గురించి రాయబోతున్నానని చెప్పగానే అపర్ణ చెప్పనే చెప్పింది - ఆ పాట చివర్లో ఏక్సిడెంట్ అవుతుందని. అందుకే హస్రత్ జైపురి జనన-మరణ-భయభయాల గురించి yodeling-సహితంగా రాసినట్టున్నారు.
నాకిప్పుడు ఒక సినిమా-సూత్రం తడుతోంది.
సినిమాల్లో ఏదైనా పాటలో హీరో-హీరోయిన్లు "నేను నిన్ను ప్రేమిస్తున్నా... నువ్వు నన్ను ప్రేమించు" అన్న ప్రేమ-బేరాల దగ్గరే ఆగిపోకుండా "మనకు పెళ్ళవుతుంది - ఆ పైన పిల్లలొస్తారు - మనకి ఒళ్ళు హూనమవుతుంది" అంటూ పెళ్ళి అయిపోతున్నట్టు ఆ పాట లోనే కలలు కనేస్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ సవ్యంగా పెళ్ళవ్వదు.
ఓ రెండు-మూడు ఉదాహరణలు ఏంటంటే ...
"మంచి మనసులు" సినిమాలో సావిత్రి-నాగేశ్వర్రావు పాడుకున్న "నన్ను వదిలి నీవు పోలేవులే" అన్న పాటలో "సిగ్గు తెరలలో కనులు దించుకుని తలను వంచుకుని బుగ్గ మీద పెళ్ళిబొట్టు ముద్దులాడ రంగులీను నీ మెడలో బంగరపు తాళి గట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే" అని ప్రాసల మీద ప్రాసలుగా పాడిన నాగేశ్వర్రావు అసలు సావిత్రినే పెళ్లి చేసుకోడు ఆ సినిమాలో.
అలాగే "ముత్యాలపల్లకి" సినిమాలో "సన్నజాజికి-గున్నమావికి పెళ్లి కుదరింది" అని పాడుతూ పాటలో పిల్లలు-మనవలు పుట్టేసినట్లు కలగన్న జయసుధ-నారాయణరావులకి ఆ పెళ్ళే సవ్యంగా జరగదు.
పుష్ప-ఫలేంద్రరావు తీసిన "త్రిశూలం" సినిమాలో "పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు" అని పాడుకున్న శ్రీదేవి-కృష్ణంరాజు సినిమా చివరి దాకా పెళ్ళే చేసుకోలేరు.
ఆ కిందున్న పాటలో మాటలు చూశారుగా - మీరు కూడా పాడేసుకోండి!
జిందగీ - ఏక్ సఫర్ - హై సుహానా
యహా కల్ క్యా హో - కిస్నే జానా?
జిందగీ - ఏక్ సఫర్ - హై సుహానా
యహా కల్ క్యా హో - కిస్నే జానా?
ఆ ... జిందగీ - ఏక్ సఫర్ - హై సుహానా
యహా కల్ క్యా హో - కిస్నే జానా?
అరె... ఓడ్లెయ్ ఓడ్లెయ్ ఓఓఓ
ఓడ్లెయ్ ఓడ్లెయ్ ఓఓఓ
చాంద్ తారోం సే - చల్నా హై ఆగే
ఆస్మానోం సే - బఢ్నా హై ఆగే
అరె... చాంద్ తారోం సే - చల్నా హై ఆగే
ఆస్మానోం సే - బఢ్నా హై ఆగే
పీఛే రహ్ జాయేగా - యే జమానా
యహా కల్ క్యా హో - కిస్నే జానా?
ఆ ... జిందగీ - ఏక్ సఫర్ - హై సుహానా
యహా కల్ క్యా హో - కిస్నే జానా?
అరె... ఓడ్లెయ్ ఓడ్లెయ్ ఓఓఓ
ఓడ్లెయ్ ఓడ్లెయ్ ఓఓఓ
హస్తే గాతే - జహా సే గుజర్
దునియా కీ - తూ పర్వాహ్ న కర్
హస్తే గాతే - జహా సే గుజర్
దునియా కీ - తూ పర్వాహ్ న కర్
ముస్కురాతే హుయే - దిన్ బితానా
యహా కల్ క్యా హో - కిస్నే జానా?
ఆ ... జిందగీ - ఏక్ సఫర్ - హై సుహానా
యహా కల్ క్యా హో - కిస్నే జానా?
డి డి డి డి ఓ ఓ ఓ
ఓడ్లెయ్ ఓడ్లెయ్ ఓడ్లెయ్ ఓ ఓ ఓ
మౌత్ ఆనీ హై - ఆయేగీ ఏక్ దిన్
జాన్ జానీ హై - జాయేగీ ఏక్ దిన్
అరె... మౌత్ ఆనీ హై - ఆయేగీ ఏక్ దిన్
జాన్ జానీ హై - జాయేగీ ఏక్ దిన్
ఐసీ బాతోం సే - క్యా ఘబ్రానా?
యహా కల్ క్యా హో - కిస్నే జానా?
ఆ ... జిందగీ - ఏక్ సఫర్ - హై సుహానా
యహా కల్ క్యా హో - కిస్నే జానా?
డి డి డి డి ఓ ఓ ఓ
ఓడ్లెయ్ ఓడ్లెయ్ ఓడ్లెయ్ ఓ ఓ ఓ
ఓడ్లెయ్ ఓడ్లెయ్ ఓడ్లెయ్ ఓడ్లెయ్
ఓడ్లెయ్ ఓడ్లెయ్ ఓడ్లెయ్ ఓడ్లెయ్
*******
*******
పైన చెప్పిన "జిందగీ ఏక్ సఫర్" పాట వింటుంటే చిన్నప్పుడెప్పుడో విన్న ఓ యోడెలింగ్ తెలుగు పాట గుర్తుకొచ్చింది.
వెంటనే ఆ పాట కోసం యూట్యూబ్లో వెతికేశా "మనసైన ఓ చిన్నదానా!" అని టైపు చేసి.
ఆ పాట "దత్తపుత్రుడు" సినిమా లోది. పాడిన వారు - ఘంటసాల, ఎల్లారీశ్వరి. సంగీతం టి. చలపతిరావు. పాటకి ఆడినవారు నాగేశ్వర్రావు, వాణిశ్రీ.
"మనసైన ఓ చిన్నదానా!" అన్న పాటకి, ఇంతకు ముందు చెప్పిన "జిందగీ ఏక్ సఫర్" పాటకీ చాలా పోలికలున్నాయి.
రెండూ హుషారైన పాటలే. హిందీ పాటలో మోటారు బైక్ వుంటే తెలుగు పాటలో స్కూటర్ వుంది. హీరోయిన్లకి వేసిన బట్టలు కూడా కొన్నిచోట్ల ఒకేలా వున్నాయి.
అన్నిటికన్నా ముఖ్యంగా ఆ యోడెలింగ్. హిందీలో "ఓడ్లెయ్ ఓడ్లెయ్ ఓడ్లెయ్ ఓ ఓ ఓ" కాస్తా తెలుగులో "ఎట్లా ఎట్లా ఎట్లా ఎట్లెట్లెట్లా - అట్లా గట్లా గట్లా అట్లట్లట్లా - ఒడిలెహీ.. ఒడిలెహీ.. ఒడిలెహీ.." గా మారింది.
తెలుగు పాటలో విశేషం ఏంటంటే ""ఎట్లా ఎట్లా ఎట్లా ఎట్లెట్లెట్లా -" అంటూ ఎల్లారీశ్వరి, "అట్లా గట్లా గట్లా అట్లట్లట్లా - " అనంటూ ఘంటసాల ఎట్లాగోట్లా సర్దేసినా అసలైన yodeling "ఒడిలెహీ.. ఒడిలెహీ.. ఒడిలెహీ.." చెయ్యడం మాత్రం వింటుంటే అది ఘంటసాల పాడినట్లు అస్సలు అనిపించలేదు నాకు, నా చెవులకు.
ఓ రెండు-మూడు సార్లు పట్టిపట్టి విన్న తర్వాత నా చెవుల్లో మెరిసిన మెరుపులు నా కళ్ళ దాకా పాకాయి. ఎందుకో తెలుసా?
తెలుగు పాటలో "ఒడిలెహీ.. ఒడిలెహీ.. ఒడిలెహీ.." అని పాడిన గొంతు మన ఆబాలగోపాల-మనోహర-గళ-సదాబాల-బాల సుబ్రహ్మణ్యం గొంతు.
అది వినగానే సంబరం పట్టలేక అపర్ణకి ఫోన్ చేసి ఈ రెండు పాటల్లో యోడలింగ్ గురించి చెప్పి - "ఈ పాటలు దొరగ్గానే - నా పరిస్థితి ]'కోతికి కొబ్బరికాయ దొరికినట్టుంది'. వెంటనే బ్లాగ్ రాయాలనుంది" అని నేననగానే "కలిసొచ్చే నీ బ్లాగ్ కాలానికి నడిచొచ్చే కోతి వీడియో ఒకటిస్తానిదిగో" అంటూ అపర్ణ ఒక కొబ్బరికాయ దొరికిన కోతి వీడియో ఒకటి పంపింది.
ప్రశ్న పరిధి మాత్రం అడిగిన సందర్భాన్ని బట్టి రకరకాల సమాధానాలు వచ్చేటంత పెద్దది.
ఉదాహరణకి కొత్తగా ఇంటికి రంగులేయించుకున్న వాళ్ళని అడిగామనుకోండి - వాళ్ళు "ఇంటికి వేసే వెల్ల సున్నాలు ఓ రకం" అని చెప్తారు.
అప్పుడే ఏ ప్యారడైజ్ బిర్యానీనో, ఏ శరవణ భవన్ ఇడ్లీ-దోశ కాంబోనో తిని - ఆ పక్కనే వున్న దేశీబజార్లో కిళ్ళీ కట్టించుకున్న భుక్తాయాస-వరులని అడిగామనుకోండి - వాళ్ళు "ఆకు-వక్కలకి తోడుగా నోరు పండించే, మరీ ఎక్కువైతే నోరు పొక్కించే తమలపాకుల సున్నం ఇంకో రకం" అని చెప్తారు.
అదే లెక్కలెక్కువ చేసేసి, లెక్కప్రకారం లెక్కల్లోనే బతికే వాళ్ళని అడిగామనుకోండి "ఒకటి నుంచి తొమ్మిది దాకా అంకె బరువు పెంచేసే నిండుసున్నాలూ వున్నాయి. అలాగే అనుకోకుండా పరీక్షల్లో వచ్చేసి అమాంతం పరువు దించేసే దశాంకపు గుండుసున్నాలూ వున్నాయి" అని చెప్పేస్తారు.
ఇహ తెలుగు భాషని అబ్బురంగా చదువుకునే తెలుగులని అడిగితే "అ పక్కన మొదలెట్టి క నుంచి ఱ వరకు - అం, కం, ఱం అంటూ - అక్షరాల పక్కన పెట్టే అనుస్వారపు నిండుసున్నాలు మరింకో రకం" అని చెప్తారు.
అసలూ ... శంకరాభరణం శంకరశాస్త్రిగారు అరుగు మీద కూర్చుని హార్మణీ వాయిస్తున్న దాసుకి ఏం చెప్పారో జ్ఞాపకం వుందా? "ఒక్కొక్క అనుభూతికి ఒక్కో నిర్దిష్టమైన నాదం వుంది, శృతి వుంది, స్వరం వుంది" అని కదా!
దాన్ని నా సున్నాలకి అన్వయిస్తే "ఒక్కొక్క 'సున్నాలు' అనే పదానికి ఒక్కో నిర్దిష్టమైన అర్థం వుంది, భావం వుంది, జ్ఞాపకం వుంది" గా మారుతుంది.
కద... కదా!
*******
*******
చిన్నప్పుడు - అంటే ఇంకా హెడ్డు పైకి రానప్పుడు (literally & figuratively ) "సున్నా ఉభయాక్షరం" అని చదివినప్పుడు తెలుగులోనూ, లెక్కల్లోనూ వస్తుంది కాబట్టి అలా అంటారనుకునేదాన్ని.
తెలుగులోనూ, లెక్కల్లోనూ సున్నా వస్తుంది అంటే నేను రాసిన పరీక్షల్లో మార్కుల రూపంలో కాదండీ... కాదు...
"అ పక్కన సున్నా పెడితే అం" అని తెలుగులో చదువుతాం; "ఒకటి పక్కన సున్నా పెడితే పది" అని లెక్కల్లో నేర్చుకుంటాం - కదా! అందుకే సున్నాని "ఉభయాక్షరం" అంటారు అనుకునేదాన్ని.
తర్వాత్తర్వాత కొంచెం పెద్ద తరగతుల్లో తెలుగు వ్యాకరణం చదువుకున్నప్పుడు నాకర్థమైన విషయాలు ఏంటంటే...
"అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః" అని చదువుకున్న అచ్చుల్లో చివరగా వచ్చే "అం అః -
లు" రెండూ అచ్చంగా అచ్చులే కాదని.
ఆ రెండిటినీ అచ్చుల్లో కలిపేశారు కానీ అవి అచ్చులకీ, హల్లులకీ - చెందిన, చెందని, చెందీచెందని - ఉభయాక్షరాలని.
అంతే కాకుండా అవి రెండూ కూడా ఉభయాక్షరాలు అనబడే "అరసున్న, నిండుసున్న, విసర్గ" అన్న మూడక్షరాల గుంపు లోవని తెలిసింది.
ప్రస్తుతానికి అరసున్న, విసర్గ జోలికి వెళ్ళను కానీ చూపులకి గుండ్రంగా, అందంగా కనిపించి - పలుకులకి నిండుగా, చందంగా వినిపించే నిండుసున్న గురించి ఇన్నేళ్ళకి నే నేర్చుకున్న విశేషాన్ని గురించిన బోల్డన్ని కబుర్లు చెప్పేసుకుంటా.
*******
*******
*******
*******
అసలు "నిండుసున్న" అన్నమాట వింటే నాకు మొట్టమొదటగా గుర్తొచ్చేది ఏంటో తెలుసా? గుండ్రంగా వుండి, కనిపించినంత మేరా పండువెన్నెల పంచి పెట్టేసే నిండుచందమామ.
ఆ వెంటనే, వెనువెంటనే గురొచ్చేది "సున్నాలెయ్" పాట.
కాసేపు నా సున్నా-కబుర్లు పక్కనెట్టి ఈ "సున్నాలెయ్" పాట కబుర్లు చెప్తా. It takes all sorts to make a blog అన్నది నా-నుడి కాబట్టి. అంతే కాకుండా variety is the spice of blog కూడా కాబట్టి.
అందుకే ఇవాళ్టి కబుర్లు రకరకాల సున్నాల గురించి - కలగాపులగంగా.
మొదటగా "సున్నాలెయ్" పాట గురించి.
అనగనగా ఓ పాత హిందీ సినిమా. దాని పేరేమో "గోరా ఔర్ కాలా".
ఇందులో ఒక తెల్లరాజేంద్రకుమారు, ఇంకో నల్లరాజేంద్రకుమారు వుంటారు.
అందులో ఓ రాజేంద్రకుమారుకి రాజకుమారిగా ఉట్టుట్టినే నవ్వేసే హేమ్మాల్ని వుంటుంది.
ఇంకా అందులో ఓ పాటుంటుంది.
ఆ పాటనేమో పచ్చచొక్కా వేసుకున్న తెల్లరాజేంద్రకుమారూ. మిలమిల మెరిసే ఎఱ్ఱటి గౌనేసుకున్న హేమ్మాల్నీ - గడ్డిలో చెట్లకి వేళ్ళాడుతున్న తీగలు పట్టుకునీ, పడకుండా వుండడానికి ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని నడిచేస్తూ పాడేసుకుంటుంటారు. ఆ పక్కనే కత్తి చేత్తో పట్టుకుని తిరుగుతూ నల్లరాజేంద్రకుమారు కూడా కనిపిస్తాడండోయ్ - కొంచెం జాగ్రత్తగా చూస్తే.
ఆ పాటే "ధీరే ధీరే బోల్ .... కోయీ సున్ న లే...సున్ న లే - కోయీ సున్ న లే".
కానీ ఆ పాట ఎప్పుడు పాడుకున్నా "ధీరే ధీరే బోల్ ....కోయీ సున్నాలెయ్... సున్నాలెయ్...కోయీ సున్నాలెయ్" అనే నే పాడుకుంటా!
అలా పాడుకున్నప్పుడల్లా - ఒక్కోసారి - "ఎదురింటికి సున్నాలెయ్ - బోల్డు సున్నాలెయ్" అంటూ పరమానందయ్యగారి శిష్యులని గుర్తుతెచ్చుకుంటా.
ఇంకొక్కోసారి "చేయని లెక్కలకి సున్నాలెయ్ - బోల్డు సున్నాలెయ్" అంటూ అప్పుడెప్పుడో డిగ్రీ ఫస్టియర్లో ఔటాఫ్-సిలబస్ పేపర్ రాయలేక డ్రాప్ చేస్తే నాకు లెక్కల్లో వచ్చిన మొట్టమొదటి-చిట్టచివరి గుండుసున్నా జ్ఞాపకంగా పాడుకుంటా.
*******
*******
ఇహ ఇప్పుడు కాస్సేపు తమలపాకుల సున్నం గురించి ఓ రెండు ముక్కలు.
అదే చిన్నప్పుడు అట్లతద్ది రోజునాడు నాన్న తెచ్చినప్పుడో, శ్రావణమాసం పేరంటాల్లో అమ్మకిచ్చిన తాంబూలాల్లో వచ్చినప్పుడో తమలపాకులు వేసుకునేవాళ్ళం చూడండి ... అప్పుడు ఇంట్లో ఒక లేతగులాబీ రంగు డబ్బాలో మంచి సువాసన వస్తుండే సున్నం వుండేది. దాన్ని కొనేటప్పుడు అమ్మ "సెంటెడ్ సున్నం" అని అడిగి మరీ కొనేది. నీటిచుక్క తగిలి వెన్నలా మారేది ఆ సున్నం. అది తాంబూలంలో ఎంత బావుండేదో!
వెన్నలాంటి సున్నం అంటే గుర్తుకొచ్చింది ఇంకో విషయం.
చిన్నప్పటి పాఠాల్లోనో, చిట్కాల్లోనో ఎక్కడ చదివానో సరిగ్గా గుర్తు లేదు కానీ "కొబ్బరినూనెలో కలిపిన సున్నాన్ని నవనీతం అంటారని, దాన్ని దెబ్బలకి రాసుకుంటే తొందరగా తగ్గిపోతాయని" చదివిన జ్ఞాపకం సున్నాన్ని ఉన్నతంగా చూపిస్తూ - సున్నం ఎంతో సున్నితంగా అనిపిస్తుంది.
*******
*******
సున్నా గురించి ఏదో విన్నా - సున్నా గురించి ఎంతో నేర్చుకున్నా... అనుకున్నా.
నేననుకున్నదేదో మీతో చెబ్దామనుకున్నా.
చెబ్దామనుకున్నదేదో మర్చిపోయి "నా చిన్నప్పటి సున్నాలు" అంటూ సినిమాల్లోలా ఫ్లాష్-బ్యాక్ సున్నాలు చుట్టుకుంటున్నా.
ఇలాగే సున్నాల మీద పన్నాల కొద్దీ పన్నాలు వల్లించడం ఆపి ఇహ అసలు సున్నాల విషయానికొచ్చేస్తున్నా.
*******
*******
"అ పక్కన సున్నా పెడితే అం" అన్నంతవరకు బాగానే వుంది కానీ హల్లుల పక్కన సున్నా పెట్టినప్పుడు ఆ పదాలని పలికేటప్పుడు నాకు వ్యాకరణమూలాలు అంతగా తెలియకపోయినా ఒక్కో పదంలో సున్నాని ఒక్కోలా పలుకుతున్నానని నాకు తెలిసేది.
అదెలా అంటే... ముందో రెండు మాటలు తీసుకుంటాను. అందులో ఒకటి "అందరం". ఇంకోటి "అంబరం". ఈ మాటలు పలికేటప్పుడు "అందరం" అనే మాటని "అన్+దరం" అనీ, "అంబరం" అనే మాటని "అమ్+బరం" అని పలుకుతున్నానని నాకే అనిపిస్తూ వుండేది.
కానీ కొన్ని "సున్నా"తో కూడిన అక్షరాలున్న మాటలు పలికేటప్పుడు ఆ శబ్దం "న్", కాదు, "మ్" కూడా కాదు అనిపించేది.
అవెలాంటి మాటలంటే "కంకణం, గంగ, కంచర" లాంటివి. క పక్కన సున్నా పెట్టి పలికితే అది కచ్చితంగా కన్నో, కమ్మో ("కన్" ఓ, "కమ్" ఓ) కాదనిపించేది.
అసలే నాకో సందేహం - క పక్కన సున్నా పెడితే కన్నా, కమ్మా అని. దానికి సాయం బద్రికి వచ్చిన ఇంకో సందేహం "సంక్రాంతి" లో "సం" - అది సన్నా (సన్) లేక సమ్మా (సమ్) అని.
అప్పటి ఆ సందేహానికి ఇప్పుడు సమాధానం దొరికింది. ఈ మధ్యనే "సంస్కృతభారతి" వారి రెండు సంవత్సరాల "సంభాషణతః శాస్త్రపర్యంతం" అనే ఓ సంస్కృత దూరవిద్యా తరగతుల్లో విద్యార్ధినిగా చేరాను.
ఆ course లో భాగంగా వున్న నోట్సులో (టిప్పణి) చదివినప్పుడు తెలిసింది అనునాసికాక్షరాలు తమతమ వర్గాక్షరాల పక్కన అనుస్వారాలుగా మారతాయి అని.
అదెలా అంటే...
సంస్కృతంలో లాగే తెలుగులో ఐదు ప్రత్యేకమైన అక్షరాలు ఉన్నాయి.
అవి "ఙ; ఞ; ణ; న, మ".
ఈ ఐదు అక్షరాలని ముక్కుతో అంటే నాసికతో పలుకుతాం కాబట్టి వీటిని "అనునాసికాక్షరాలు" అంటారు.
ఈ ఐదు అనునాసికాలుకూడా హల్లుల్లో "క నుంచి "మ" వరకు వుండే వర్గాక్షరాల్లో వున్న ఐదు వర్గాల్లో వుండే చివరి అక్షరాలు.
అదెలాగో ఈ కింద చెప్తాను.
క వర్గం: క ఖ గ ఘ ఙ
చ వర్గం: చ ఛ జ ఝ ఞ
ట వర్గం: ట ఠ డ ఢ ణ
త వర్గం: త థ ద ధ న
ప వర్గం: ప ఫ బ భ మ
ఇప్పుడు ఈ అనునాసికాలు సున్నాలు ఎలా అవుతాయంటే ఒక పదంలో సున్నా పక్కన వెంటనే వచ్చే అక్షరాన్ని బట్టి ఆ సున్నా శబ్దం నిర్ణయించబడుతుంది.
అ పక్కన సున్నా పెడితే "అం" అంటాము. కానీ ఆ సున్నా పక్కన వచ్చే అక్షరాన్ని బట్టి ఆ "అం" కి వచ్చే శబ్దం నిర్ణయించబడుతుంది.
అంకణం=అ+ఙ+కణం (క ఖ గ ఘ ఙ)
అంచనా=అ+ఞ+చనా(చ ఛ జ ఝ ఞ)
అండము=అ+ణ్+డము (ట ఠ డ ఢ ణ)
అందము=అ+న్+దము (త థ ద ధ న)
అంబరం=అ+మ్+బరం (ప ఫ బ భ మ)
కాకపోతే ప్రస్తుతం మనం మాట్లాడే తెలుగు వ్యావహారికంలో ఙ, ఞ, ణ్శబ్దాలువచ్చే అనుస్వార (నిండుసున్నా) శబ్దం సాధారణంగా "న్" గా వినిపిస్తుంది.
*******
*******
ఇక్కడ ఇంకో విషయం.
మా అమ్మ పేరు పేరిందేవి. నాకు ఆ పేరు చాలా ఇష్టం - మా అమ్మ పేరు కాబట్టి.
అంతే కాకుండా ఆ ఇష్టానికి ఇంకో కారణం చిన్నప్పుడు చదువుకున్న పల్నాటి యుద్ధపు కథల్లో నాయకురాలు నాగమ్మకే ఎదురునిలిచి తిట్టెయ్యగలిగిన పేరిందేవి (అలరాజు భార్య) కూడా.
సరే! ఇంతకీ ఇక్కడ మా అమ్మ పేరు గురించి ఎందుకు చెప్తున్నానంటే మా అమ్మ తన పేరు ఇంగ్లీషులో రాసేటప్పుడు "PERIMDEVI" అని రాస్తుంది. కానీ నాకు అది "PERINDEVI" అయితే బాగుండునేమో అనిపించేది. అలా ఎందుకు అనిపించేదో మాత్రం నాకు అర్థం అయ్యేది కాదు.
కానీ ఇప్పుడు ఈ అనుస్వార సూత్రం తెలిశాక నాకు మా అమ్మ పేరు "PERINDEVI" అని రాయాలనిపించడం నాకు తెలియకుండానే తెలుగుని నేను సరిగ్గా అర్థం చేసుకున్నాననిపించి భలే సంతోషంగా అనిపించింది.
పేరిందేవి = పేరి+న్+దేవి (త థ ద ధ న)
హమ్మయ్య! నాకిప్పుడు ఇక సంక్రాంతి గురించి ఏ సన్దేహమూ లేదు - అది కచ్చితంగా "స+ఙ+క్రా+న్ +తి".
*******
*******
నాకు ఈ బ్లాగ్ పోస్ట్ రాసేటప్పుడు మరొక్కసారి గట్టిగా అనిపించినదేమిటంటే చెప్పాలనుకోవాలే గానీ - శూన్యం లోంచి కూడా కబుర్లు పుట్టించొచ్చని.