30, ఏప్రిల్ 2016, శనివారం

24వ కళ "వంట"బట్టిన విధం - ముక్తాయింపు

నాంది ఇక్కడ: 24వ కళ "వంట"బట్టిన విధం - నాంది 

... ఆ విధంగా మొదలయిన నా పాక కళా శాస్త్ర అధ్యయనం మా అమ్మ హైదరాబాదు నుంచి తిరిగి రావడంతో అక్కడే ఆగిపోయింది. 

చదువూ... అవుతూనే పెళ్ళీ అవడం, బెంగళూరు వెళ్ళడం, వెళ్ళీ వెళ్ళగానే ఉద్యోగం లో చేరకపోవడం - దానితో అప్పటిదాకా కాలేజ్ అనీ, ప్రాజెక్ట్ అనీ హడావిడిగా నడిచిన లైఫ్ ఒక్కసారిగా సుదీర్ఘ శలవు లా తోచడం, దానితో రోజంతా బోల్డంత టైం ఉన్నట్లు అనిపించేది. 

మామూలుగానే నాన్న ఇచ్చే పాకెట్ మనీ ఏ మాత్రం మిగిలినా, ఎవరైనా పెద్దవారు సందర్భాన్ననుసరించి (అంటే పుట్టిన రోజులు, దండాల పండగలు లాంటివి) ఇచ్చే డబ్బులు వున్నా వాటితో పుస్తకాలు కొనుక్కోవడం అలవాటు. అసలు నాకు గుర్తుండి పుస్తకం కొనుక్కోదగని సందర్భం ఏదీ లేదు నాకు. గుంటూరు లోని - నవోదయ, విశాలాంధ్ర, ప్రబోధ బుక్ స్టోర్స్- నా సర్వకాల దర్శనీయ స్థలాలు. 

ఆ వరసలో పెళ్ళవగానే మొదట కొనుక్కున్న పుస్తకం - మాలతీ చందూర్ రాసిన వంటలు-పిండివంటలు పుస్తకం. ఆ పుస్తకమూ, దానితో పాటు దొరికిన తీరికా - కోతికి కొబ్బరికాయ - దొరికినట్టే అయింది (ఈ సామ్యం ఎందుకు వాడానో అవమానం-1 లో తెలుస్తుంది). కొన్నాళ్ళు ఆవిడ పుస్తకం ఫాలో అయినా తర్వాత ఇంక వంట అంతా జిహ్వ-జ్ఞాపకం మీదే ఆధారపడి నేర్చుకున్నాను - అంటే చిన్నప్పుడు నాన్నమ్మ, అమ్మ వండి పెట్టిన వంటల రుచిని గుర్తు చేసుకుని దానికి తగినట్టు ingredients కలుపుకుంటూ మొత్తానికి బానే చేసేదాన్ని. 

నా 24 వ కళాధ్యయనం లో రాజపూజ్యావమానాలు:

{రాజపూజ్యం = మెచ్చుకోళ్ళు; అవమానం = పెద్ద చేశావులే - అనుకోళ్ళు)

రాజపూజ్యం - 1

అసలే ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ ఇష్టంగా చేసిన అలవాటేమో - going by rule book - అనేది వంటలో కూడా అనుసరించడం మొదలు పెట్టాను. కొత్త విద్య నేర్చుకునే ఉత్సాహమో, దానికి తోడు దొరికిన బదరి ప్రోత్సాహమో - కారణం ఏదైనా కానీ - రోజూ పొద్దున్నే నాలుగింటికి లేచి ఒక పప్పు, కూర, పెరుగు పచ్చడి, ఒక సింపుల్ గా చేయగలిగే రవ్వ లడ్డు టైప్ స్వీట్ - ఇన్ని చేసి నాలుగు గిన్నెలు హాట్ ప్యాక్ లో నింపి పెట్టేదాన్ని. బదరి ఇంటికి వచ్చి వాటి బాగోగులు చెప్పేదాకా పరీక్ష రాసి ఫలితానికి ఎదురు చూస్తున్నట్లుండేది. ఎప్పుడయినా తన ఆఫీసు వాళ్ళు కలిస్తే "లలితా! Was Chemistry your main subject? All your dishes are so perfect & taste very good as if you are preparing them to the correct measure in a lab" అనే వారు. కొంత మందేమో బదరి లంచ్ అంతా ఇవాళ మేమే తినేశాము అని చెప్పేవారు. 

అవమానం - 1

అదే ఉత్సాహం తో నేను చేసిన వంటలు మా ఇంటి ఓనర్ ముద్దమ్మ కి ఇచ్చేదాన్ని. వాళ్ళ కన్నడ వంటల కన్నా భిన్నంగా వున్న నా ఆంధ్ర వంటలు ఆవిడకి నచ్చి మెచ్చుకునేవారు. ఒకసారి ఆవిడ అదే మాట మేడ పైన వున్న ఒక్క గదిలో అద్దెకుండే ఇందిరమ్మ గారనే ఒక పెద్దావిడతో  అంటే ఆవిడ ಹಿಂಗೂ, ತೆಂಗೂ ಇದ್ರೇ ಮಂಗಾನೂ ಅಡಿಗೆ ಮಾಡತ್ತೇ (హింగూ, తెంగూ ఇద్రే మంగానూ అడిగే మాడత్తే - ఇంగువ, కొబ్బరి వుంటే కోతి కూడా వంట చేస్తుంది)  అన్నారు. ఇందిరమ్మ గారి మాట ముందు నాకర్థం కాలేదు - అప్పటికి ఇంకా కన్నడ అంత అలవాటు కాకపోవడం వల్ల.  అర్థం తెలిశాక -  ముందు కొంచెం నిరుత్సాహంగా అనిపించినా కన్నడ లో ఒక మంచి సామెత తెలిపినందుకు ఇందిరమ్మ గారిని కావాలని పలకరించి మరీ మాట్లాడేదాన్ని - ఆవిడ కన్నడ భాష నచ్చి. తర్వాత ఆవిడా ఒప్పుకున్నారు - నేను పాకకళా విశారదనే అని ;). 

రాజపూజ్యం - 2; అవమానం - 2:

ఆ  వంటోత్సాహపు తొలినాళ్ళలో బదరి ఒక ఆదివారం ఇద్దరు బెంగాలీ స్నేహితులని (కుందు, కార్తీక్ ) ఇంటికి భోజనానికి పిలిచారు. మొదటి సారిగా చపాతీలు చేద్దామని పిండి కలిపాను. మామూలు వంట (కూర , సాంబారు, స్వీటు etc.,) అంతా అయ్యాక చపాతీలు చేద్దామని కలిపిన పిండి తీస్తే ఎప్పటికీ వత్తడానికి రాదే !!! తీరా చూస్తే అర్థం అయింది ఏంటంటే - నాకు గోధుమ పిండి, శనగ పిండి మధ్య తేడా తెలీక చపాతీలకి శనగ పిండి కలిపాను. వెంటనే నా భుజం నేనే తట్టేసుకుని - చపాతీల కన్నా బజ్జీ చేయడం తేలిక కదా - ఏ పిండి కలిపినా మన మంచికే అనేసుకుని - బో .......ల్డన్ని బంగాళదుంప బజ్జీలు ఒక పెద్ద బేసిన్ నిండా చేసేశాను. 

కుందు, కార్తీక్ రాగానే అన్ని పదార్థాలతో పాటు ఆ బజ్జీల బేసిన్ కూడా - గొప్పగా ఎన్ని బజ్జీలు చేసేశానో చూపించడానికి  - వాళ్ళ ముందు పెట్టి భోజనం వడ్డించాను. షరా మామూలు అన్నట్లు ఆంధ్ర భోజనం మెచ్చుకుంటూ తిన్నారు వాళ్ళిద్దరూ. బజ్జీలు టీ టైం లో తింటామన్నారు.  బదరికి , నాకు పట్టలేనంత ఆనందం - మా మొదటి ఆతిధ్యం విజయవంతం అయినందుకు. భోజనం అయ్యాక కొంచెం సేపటికి టీ తో పాటు బజ్జీలు పెట్టాను. కుందు, కార్తీక్ చెరో ఐదు తిన్నారు మొదట. తర్వాత టీ అయిపోయినా బజ్జీలు తింటూనే వున్నారు. "పాపం! వీళ్ళు ఇంత రుచిగా వుండే బజ్జీలు ఎప్పుడో తినలేదేమో , ఎంత బాగా చేశాను నేను ?!!! పోన్లే మొత్తం వాళ్ళనే తిననీయ్ !" - అని లోలోపల సంతోషంతో ఉబ్బి తబ్బయిపోతూ పెడుతూ నేనూ, బజ్జీలు తినే కొద్దీ మారుతున్న ముఖ కవళికలతో వాళ్ళూ - మొత్తానికి బజ్జీల బేసిన్ ఖాళీ చేసేశాము. 

తర్వాత బదరి చెప్పారు - వాళ్ళిద్దరూ రెండు రోజులు ఆఫీసుకి శలవు పెట్టారని. అసలు సంగతేంటంటే - ఎవరైనా భోజనానికి పిలిస్తే పెట్టిందంతా తినకపోతే వారిని అవమానించినట్టు అవుతుందని నేను చేసిన బజ్జీలు అన్నీ ఒక్కటి కూడా వదలకుండా తినేసి వాళ్ళిద్దరికీ కడుపు నొప్పి వచ్చిందట :( అందుకే - ఒక అవమానం నా ఖాతాలో. 



అవమానం - 3:

అప్రతిహతం గా సాగుతున్న నా పాక కళారాధన చిరు దివ్వె నుంచి దివిటీ స్టేటస్ వచ్చింది - కోనసీమ, గుంటూరు, కర్ణాటక - conglomerate వంటలతో. 

ఎన్నో ఆతిథ్యాలు, pot luck లలో మెప్పులతో శాకాహార పాకాల జండాని అమెరికా గడ్డ మీద రెపరెపలాడిస్తున్న తరుణంలో మళ్ళీ ఒకసారి బదరి స్నేహితులిద్దరు డిన్నర్ కి వచ్చారు. దొండకాయ కొత్తిమీర కారం కూర, పాలకూర పప్పు వగైరా వగైరాలు వండి - వారు తింటూ వుండగా - బావుందాండీ - అనడిగాను. అంతే! ఊహించని సమాధానం -  మేము రోజూ తినే మా బ్రహ్మచారి వంటల కన్నా ఏదైనా బావుంటుంది లెండి - అని. 

ఆరోజు తర్వాత ఈ రోజు వరకూ ఇంకెప్పుడూ  నేను చేసిన వంట తినే అతిథులు ఎవ్వరినీ - వంట నచ్చిందా - అని అడగలేదు. 

రాజపూజ్యం - 4; అవమానం - 4

అప్పుడప్పుడు అంటే వీలయినప్పుడు రెండు మూడు కుటుంబాలని భోజనాలకి పిలవడం, సరదాగా వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ గడపడం తరచుగా జరిగేదే. అలాంటప్పుడు "వంట చాలా బావుంది లలితా " అనగానే పొంగిపోబోయే తరుణంలో "ఎలా అయినా చిన్నప్పట్నుంచీ వంట చేస్తే ఎలాగైనా ఒక mastery వస్తుంది. మా మిస్సెస్ కొంచెం బిజీ కదా - ఈ మధ్యే కొంచెం నేర్చుకుంటోంది" అన్న మాట వినగానే "మరే! నేను మరి గాడి పొయ్యి దగ్గర బొంత వేసుకు పుట్టాను - అందుకే ఇలా వండేస్తున్నాను" అనుకుని కుంగిపోతాను. వెంటనే  ఇంకో అవమానం వేసేసుకుంటాను లెక్కలో. 
 
ఇవన్నీ ఒక ఎత్తూ - నా రెండు పూటలా వండే అలవాటు ఇంకో ఎత్తు. అసలే మా అమ్మ వారానికి రెండు సార్లు ఫోన్ చేసినప్పుడల్లా పొరపాటున గొంతు ఏమన్నా కొంచెం నీరసం గా వినిపిస్తే వెంటనే "లల్లీ! కోటి విద్యలూ కూటికొరకే అన్నారు - work లో ఎంత బిజీగా వున్నా సరైన భోజనం లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. A sound mind in a sound body. తిండి కలిగితే కండ కలదోయ్ - కండ కలవాడేను మనిషోయ్ " అని ఆవిడకి తెలిసిన తిండికి సంబంధించిన సామెతలు, sayings, పాటలు అన్నీ గబగబా చెప్పేసి నాకు వంటెంకరేజుమెంటు తెగ ఇచ్చేస్తుంది. అదీ కాక చిన్నప్పట్నుంచీ ఆవిడ చేసిన అలవాటే - అన్నం పొగలు ఆరకుండా తినేయడం - దానితో ఎంత హడావిడి వున్నా ఒక నలభై నిముషాల్లో అయిపోయేలా రెండు పూటలా వండడం అలవాటు అయింది - మొదట్నుంచీ. 

ఇంత చేసినా నాకు మాట్లాడడానికి వంట ఒక టాపిక్ కాదు. బదరి మాత్రం ముచ్చటగా చెప్పుకుంటూ వుంటారు - తను లోకల్ ఆఫీసుకి వెళ్ళేటప్పుడు ఐదింటికి లేచి ఎలా  లంచ్ బాక్స్ పెడతానో. అలా చెప్పడం కొంచెం తక్కువ ఇష్టులని, మరి కొంచెం ఎక్కువ మనసు-కష్ట పెట్టుకున్నవారిని పరిచయం చేసింది. అందుకే ఎవరినైనా కలిసినప్పుడు అసలు food కి సంబంధించిన ఏ మాటా రాకుండా వుంటే చాలు అనుకుంటూ వుంటాను. 

 మహా రాజ పూజ్యం:

మా పిల్లలు చాలా picky భోజనం దగ్గర. ఎంతా అంటే వాళ్ళకి ప్రతీదీ Around the World in 80 Days లో Phileas Fogg లాగా should be at certain temperature & with a specific taste. అలాంటి వాళ్ళు  ఎక్కడికయినా వెళ్తే - అన్ని చోట్లా మనకి ఇష్టమయిన పదార్ధాలే వుండవుగా - అయినా సరే వాళ్ళ ఇబ్బందిని కొంచెం కూడా ప్రకటించకుండా పెట్టినది తినేసి ఇవతలకి వస్తారు. "ఇంట్లో రోజూ నువ్వు మాకిష్టమయినవి  చేసి పెడతావు కదా - We can live with it for one day అమ్మా!"- అంటారు.


అలా - ఇష్టులయిన వాళ్ళ, బదరి  ప్రోత్సాహంతో నా 24 వ (కళాధ్యయనం + కళాభ్యాసం)  మూడు పూటలు, నాలుగు శాకాలు , రెండు పాకాలుగా (24 = 3*4*2) అమోఘంగా ఘుమ ఘుమలాడుతూ జరుగుతోంది.





24, ఏప్రిల్ 2016, ఆదివారం

24వ కళ "వంట"బట్టిన విధం - నాంది

కొన్నిసార్లు నన్ను ఎవరైనా ఎలా గుర్తు పెట్టుకుంటారో తెలిస్తే హఠాత్తుగా నాకు నేనే కొత్తగా కనిపించడం మొదలవుతుంది. 

వారమంతా రోజు ఎప్పుడు మొదలయిందో ఎప్పుడు పూర్తయిందో తెలియనంత, తెలుసుకోలేనంత బిజీగా అయిపోయే ఆఫీసు లైఫ్ లో ఒక శుక్రవారం మధ్యాహ్నం మాత్రం ఒక గంట ప్రస్తుత + పాత స్నేహితులని ఆఫీసు IM లో పలకరించడం ఇష్టం గా కొనసాగిస్తున్న ఒక అలవాటు. 

నిన్న శుక్రవారం ఆ అలవాటు ప్రకారం పదకొండేళ్ళ క్రితం సెయింట్ లూయిస్ నుంచి కాలిఫోర్నియా వెళ్ళిన గాయత్రితో కొంచెం సేపు మాట్లాడడం కుదిరింది. హాయ్ అంటే హాయ్ అనుకుని కుశలప్రశ్నలు అయ్యాక పిల్లల గురించి ఒకరినొకరు అడుగుతూ ప్రస్తుతానికి ఎవరి పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకుని "Time flies!!!" అని ఆశ్చర్యపోయాము. ఇంతలో తను అన్నారు - I still remember how you used to teach Vedic Math to your little one....అని కొనసాగింపుగా - and your fresh food. Are you still cooking that way? టైప్ చేసిన ఆ వాక్యం చూడగానే నన్ను తను అలా గుర్తు పెట్టుకున్నందుకు ఆశ్చర్యం, అసలు ఏదో ఒకలా గుర్తున్నాను కదా అని ఆనందం, how I arrived at that "being-associated-with-fresh-food" అనే ఆలోచన అన్నీ ఒకసారి కలిగాయి. వెంటనే అసలు నాకీ ఇరవై నాలుగో కళ ఎలా "వంట" బట్టిందో .....ఇదిగో ఇలా మొదలు... 

డిగ్రీ చదివేటప్పుడు అమ్మకి కూరలు తరిగి ఇవ్వడం తప్ప ఇంక ఎప్పుడూ వంటింట్లోకి వెళ్ళింది లేదు. అమ్మ కూడా "రేపు పెళ్ళయితే ఎలాగో తప్పదు" అని పాపం - కుంచమంత కూతురుంటే మంచం లోనే కూడు (అంటే తల్లికి అని ఆవిడ అర్థం) అనే సామెతని నాకు నచ్చినట్టు - ఆ మంచం లో కూడు ఆ కుంచమంత కూతురుకే అనుకునేలా పెంచింది తన ముగ్గురాడపిల్లలని. 

అలాంటి అమ్మ ఒకసారి - అదే మొదటి సారి , అదే ఆఖరు సారీ కూడా - మా ముగ్గుర్ని వదిలి ఏదో పని మీద గుంటూరు నుంచి హైదరాబాదు వెళ్ళింది. వంట ఎలా చేయాలో తెలీదు. ఇంక మా నాన్న అత్యుత్సాహంగా ఆయన డైరెక్షన్ లో - హన్నా! ఆడపిల్లలకి వంట రాకపోతే ఎలా? మీ అమ్మ వచ్చేలోగా మీకు నేర్పేస్తా చూడండి అని దగ్గరుండి బియ్యం కడిగి కుకర్ లో అన్నం, పప్పు వండడం,  టొమాటో- బంగాళ దుంప కూర చేయడం నేర్పించారు. రెండు రోజులవగానే మా కుట్టికి అమ్మ మీద బెంగ, దాంతో పాటే బెల్లం గారెలు తినాలనే కోరిక కలిగేశాయి. 

బెల్లం గారెలు చేసి పెడితే అమ్మని మర్చిపోతుందేమో అనే ఆలోచన & ఆశ తో నాన్న నాతో మినప్పప్పు నానబోయించారు. అమ్మ లేకుండా బెల్లం గారెలు చేయబోతున్నాము అనే excitement తో నేను, పప్పీ , కుట్టీ, నాన్న నలుగురం యుద్ధ ప్రాతిపదిక మీద పొద్దున్న పదింటికి మినప్పప్పు నానబోసిన దగ్గర్నుంచీ అది నానిందా, లేదా అని అర గంటకొకసారి చెక్ చేస్తూ మూడింటికి అది నానేటప్పటికి సగం అయిపోయేలా తినేశాము. 

మొత్తానికి నానింది మా చేత "చిక్కి" సగమయిన మినప్పప్పు. నేనూ, పప్పీ మళ్ళీ నాన్న దర్శకత్వ పర్యవేక్షణలో సుమీత్ మిక్సీలో పిండి రుబ్బాము. 

అప్పటికే ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్ demonstrations అలవాటయిన నాకు నాన్న నూనె ఎంత కాగాలో, ఎలా గారెకి చిల్లు పెట్టాలో, ఎంత వేగాక తీయాలో చెబ్తూ వుంటే సైన్స్ ల్యాబ్ తో రిలేట్ చేసుకుని - అబ్బా! వంట కూడా ల్యాబ్ లో లాగే - అని మురిసిపోతూ విన్నాను. 

అలా ఒక పావుగంట పాకం గారెలు - వాటి తయారీ సెషన్ అయాక నాన్న ఇంక పాకం గారె practical మొదలు పెట్టారు. ఈ పాకం గారెల కోసం ఆఫీసు బోయ్ వెంకటేశ్వర్లు చేత బాదం ఆకులు కూడా తెప్పించారు. ఒక బాదం ఆకు మీద కొంచెం పిండి పెట్టి గుండ్రంగా వత్తారు. చిల్లు పెట్టబోతే కుదరలేదు. ఒక పది నిముషాలు స్పూనుతో, అట్లకాడతో రకరకాలుగా ప్రయత్నించి - గారె వేగక ముందు పెట్టినా, వేగాక పెట్టినా చిల్లు చిల్లే - అనే ఒక కొత్త సిద్ధాంతం ప్రతిపాదించి రుబ్బిన పిండంతా ఒక పాతిక గారెలు చేసి మా ముగ్గురి చేతికీ మూడు చిన్న, పెద్దా - వంటింట్లో వున్న అట్లకాడలన్నీ వెతికి ఇచ్చి దగ్గరుండి చూపించి మరీ చిల్లులు పెట్టించారు. 

ఈలోగా అంతకు ముందే కోరిన బెల్లం, నీళ్ళు గ్యాస్ స్టవ్ మీద పెట్టి పాకం పట్టారు. కాకపోతే నాన్నకి ఆ పాకం ఏ లెవెల్లో ఆపాలో తెలీలేదు. మేము సరే సరి - మా "రోలు" మోడల్ నాన్న. ఆయన పాకం అంటే పాకం, శాకం అంటే శాకం. మొత్తానికి పాతిక గారెలూ ఆ చిక్కగా వచ్చిన బెల్లం పాకం లో వేశారు. గారెలు భలే glazed గా వూరాయి. కుట్టమ్మ అసలే ఆకలీ-ఆత్రం మీద ఉందేమో గబగబా ఓ ఆరు గారెలు తినేసింది. ఆరో గారె సగంలో నాకేసి, పప్పీ కేసి మత్తుగా ఒకసారి చూసి హాల్లో తరగడ (అది తలగడే - కానీ మా ఇంట్లో తరగడ అనడం అలవాటు) వేసుకుని అలా నాలుగింటికి వాలిన పిల్ల రాత్రి తొమ్మిదింటికి లేచింది. లేచింది వూరికే లేచిందా - పడుకున్న పప్పీని, నన్ను లేపి - బట్టల స్టాండ్ మీద తగిలించి వున్న దాని ఇస్త్రీ చేసిన చుడీదార్ మాకు చూపించి మళ్ళీ పడుకుండిపోయింది. ఆ రాత్రి ఇంక మేమిద్దరం పడుకుంటే ఒట్టు. పాకం గారెలకి కుట్టికి ఏం తేడా చేసిందో - మళ్ళీ లేచి ఏం కలవరిస్తుందో అని. 

పొద్దున్న లేచాక - అదేంటే కుట్టీ! రాత్రి అలా చేశావూ- అనడిగితే - ఏమోనే! ఆ పాకం గారెలు తిన్నాక ఆ తీపికి చాలా సేపు పడుకుండిపోయాను. ట్యూషన్ కి వెళ్దామని లేచాను, కానీ తర్వాత ఏమయిందో ఇం తెలీదు - అంది. అంటే అది హేంగర్ చూపించడం అదంతా పాకం గారెల తీపి మత్తులో చేసింది. (ఇప్పటికీ పప్పీ, నేను కుట్టీని తలుచుకుంటే అది పంచే నవ్వుల్లో ఈ పాకం గారెల "తీపి" గుర్తు ఒకటి)

అలా మొదలయింది నా చతుర్వింశతితమ కళ  -  చిత్ర శాకాపూప భక్ష్య వికార క్రియ అధ్యయనం :)

ఇది నాంది మాత్రమే. ముక్తాయింపు వచ్చే వారాంతం లో ... 




8, ఏప్రిల్ 2016, శుక్రవారం

ఎసెస్. రీ - ఎసెస్. వూ


తెల్లవారింది .

ఎసెస్. వు   లేచి బెడ్రూం లోంచి బయటకి రాబోయి కాలు చటుక్కున లోపలి తీసుకున్నాడు. అలాగే వెళ్ళిపోతే ఇంకేమయినా ఉందా?! గబగబా వెనక్కి వెళ్లి వార్డ్రోబ్ లో తగిలించి వున్న నైట్-గౌన్ తీసి వేసుకుని ఈపాటికి చిన్న సైజ్ కిష్కింధలా కోలాహలంగా వుండాల్సిన ఇల్లు - అదీ ఆదివారం పూట ఇంత నిశ్శబ్దంగా వుందేంటా అనుకుంటూ ఎసెస్. రీ ని వెతుక్కుంటూ  వంటిటికి అవతల వున్న బాల్కనీ లోకి వెళ్ళాడు.

అక్కడ రెయిలింగ్ కి దగ్గరగా కుర్చీ వేసుకుని ఐఫోన్ చూసుకుంటూ ఎసెస్. రీ కనిపించింది.

అటు పక్కగా పనిమనిషి వాషింగ్ మెషీన్ లో బట్టలు వేస్తూ "నా నిన్నా మరియలారే" అని కన్నడ కంఠీరవ రాజకుమార్ పాటేదో పాడుకుంటోంది.

 ఎసెస్. వు రావడం చూసినా వాళ్ళిద్దరూ చూపు తిప్పలేదు - పాట ఆపలేదు - రెస్పెక్టివ్లీ.

ఒక నిముషం అక్కడే నించుని ఇంక ఉండబట్టలేక అడిగేశాడు - "సుందరీ - వైదేహి, విరించి ఏరీ?" అని.

 పెళ్ళైన పదేళ్ళకి రకరకాల వేడుకోళ్ళు-మొక్కుబళ్ళు అందరు దేవుళ్ళకి కిట్టించాక పుట్టిన వరప్రసాదాలు - వైదేహి, విరించి. లేవగానే వాళ్ళని చూడందే ఎసెస్. వు కి తోచదు.

"అబ్బ! హౌ మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యు వూ? కాల్ దెం హీ అండ్ చీ. ", ఫోన్ మీంచి చూపు తిప్పకుండానే విసుక్కుంది రీ.

ఒక ఆరు నెలలు ఆన్ సైట్ అమెరికా వెళ్లి వచ్చింది సీలా సుబ్బారావు గారి భార్య సీలా సుందరి. అక్కడ వున్నప్పుడు వాళ్ళ క్లైంట్ మేనేజర్ ఎప్పుడూ వాళ్ళ టీం లీడ్ చాంగ్ ని తెగ పొగిడే వాడట. పైగా టైగర్ మదర్ పుస్తకం రాసిన ఏమీ చౌ ఆ చాంగ్ కి స్వయానా కజిన్ అట. ఒక ఆటోగ్రాఫుడు కాపీ ఒకటి సుందరి కి ఇచ్చాడు. అసలు కజిన్స్ అయిన ఆ చాంగు, చౌవూ ఎంత దగ్గర కజిన్సో తెలీదు కానీ ఆ పుస్తకం చేతికి వచ్చిన దగ్గర్నుంచీ సీలా సుందరి కాస్తా  ఎసెస్. రీ అలియాస్ టైగర్ మామ్ (ఆవిడ వాట్సాప్ గ్రూప్ పేరు అదే మరి) గా మారిపోయింది.


ఇంక ఇండియా కి తిరిగి వచ్చినప్పటినుంచీ అందరి పేర్లూ మార్పించేసింది - అఫిడవిట్లూ, న్యూస్ పేపర్ , గజెట్ నోటిఫికేషన్స్ తో - అప్పటినుంచీ వాళ్ళు నలుగురూ - ఎసెస్. వు, ఎసెస్. రీ, ఎస్వీ. హి , ఎస్వీ. చి.

పేర్ల మార్పుతో పాటు ఇంకా రకరకాల మార్పులు తెచ్చింది తన ఇంటికి - వూ కి నైట్-గౌన్, తనకి బాత్ రోబ్ తో సహా. హాయిగా లుంగీ కట్టుకుని రంగురంగుల నెమలిలా తిరిగే వూ కి ఆ నైట్-గౌన్ అసలు నచ్చలేదు. కానీ రీని కాదనే ధైర్యం చేయలేకపోయాడు.

 అన్నిటికన్నా వూ కి ఎంతో ఇష్టమైన బారెడు జడని బాబ్ చేయించేసుకుంది. అదేంటీ అని బాధపడిన అమ్మ-అత్తలని "మీరేగా ఎప్పుడూ అనేవారు బుద్ధిమంతుల జుట్టు భుజాలు దాటదని" అని దబాయించేసింది.

ఎవరైనా అమెరికా అంటారు, లేకపోతే యూరప్ అంటారు నీకెందుకు చైనా అంటే అంత ఇష్టం అంటే - అమెరికా అంతటి దేశమే వాళ్ళ జండా దగ్గర్నుంచీ "మేడ్ ఇన్ చైనా" వస్తువులే వాడుతుంది. నాకందుకే చైనా నచ్చుతుంది - అంటుంది రీ. అంతకన్నా ఎక్కువ మాట్లాడితే ఎక్కడ చైనీస్ నేర్చుకుందామంటుందో - ఈ వయసులో ఆ బాధ పడలేను అని భయపడి దాదాపు ఆరడుగులు పొడుగుండే  సీలా సుబ్బారావు "పేరు"కే  కదా అని ఎసెస్. వు గా కుదించబడడానికి ఒప్పుకున్నాడు. పిల్లలదేముంది - అమ్మతో పాటు చీనా మాయ లో పడిపోయారు .

"ఓకే ఓకే ! వేర్ ఆర్ హీ అండ్ చీ ?"

"దే విత్ సుమీ మామీ డౌన్ స్టెయిర్స్ "

అమెరికా ఆన్ సైట్ వెళ్ళాల్సిన అమ్మాయికి పెళ్లి కుదరడం తో అనుకోకుండా అవకాశం వచ్చి వెళ్ళింది కానీ - సుందరమ్మది అచ్చ తెలుగు బ్రాండే. నోరారా చక్కగా పలకగల తెలుగు వచ్చినా - అబ్బే - అసలు పొరపాట్న కూడా అందమైన తెలుగుతనాన్ని ఒప్పదు - వచ్చీరాని ఇంగ్లీష్ లోనే ముద్దు ముద్దు గా "యా... యా...యయయ్య... యా...యా..." అని యా-భాషే టాకుతూ వుంటుంది.

"అదేంటి? ఇంత పొద్దున్నే వాళ్ళింటికి ఎందుకు వెళ్లారు? బ్రేక్ ఫాస్ట్ ఏమైనా తిన్నారా?"

"ఇవాళ ఇంట్లో నో కుకింగ్"

"బట్ వై?"

"టుడే మై స్టార్స్ ఆర్ నాట్ గుడ్"

"నీ నక్షత్రాలు బాలేదా? అదేంటి?" - వూ నోరు తెరిచేశాడు.
"7:49 టు 9:19 ఎయం - రాహుకాల; 12:54 టు 3:24 పీఎం యమగండ; 8:23 టు 9:46 పీఎం వర్జ్య"

నోరు తెరిచేశాడు ఎసెస్. వు "ఇదెప్పట్నుంచీ ?"


"యు డోంట్ నో వూ -  మై  టీం లీడ్ చాంగ్ వాంటెడ్ మీ టు  షిప్ హిం పంచాంగ. ఐ గో బై  దట్ టూ"

పొద్దున్నే శోష వచ్చినట్టయ్యి సీలా సుబ్బారావు / ఎసెస్. వు శిలలా నిల్చుండిపోయాడు. వంటక్కూడా నక్షత్రాలు, తిథులూ చూడడం మొదలు పెట్టింది అంటే తన జీవిత నౌకకి టైటానిక్ స్టేటస్ వచ్చినట్టు అనిపించి ఒక్క నిముషం ఉక్కిరిబిక్కిరి అయాడు.

ఇంతలో పనమ్మాయి పరిమళ పరిగెత్తుకుంటూ వచ్చింది - "అక్కా! హాలు - బుస్ బుస్! " అంటూ.

ఉత్తర కర్నాటక నుంచి వచ్చిన పరిమళకి కన్నడ, తుళు  తప్ప వేరే భాష రాదు. ఎసెస్. రీ తెలుగు నేర్వనివ్వదు.

గ్యాస్ స్టవ్ మీద పెట్టిన పాలు పొంగి పోతున్నాయి అని ఇంకెలా చెప్పాలో తెలీక అలా కన్నడలో అరుచుకుంటూ వచ్చింది.

ఒక్క ఉదుటున వంటింటిలోకి పరిగెత్తాడు ఎసెస్. వు - క్రితం సారి అలాగే అయితే స్టవ్ కడిగిన అనుభవం మరి.  అప్పటికే పాలు పొంగి వేడికి స్టవ్ మీద అట్ట  కట్టేశాయి.

గ్యాస్ స్టవ్ ఆపి ఇవతలకి రాగానే ఎసెస్. రీ ఎవరితోనో మాట్లాడుతోంది ఐఫోన్లో.

"వాట్? యు డోంట్ హావ్ స్కైప్ ఐడీ? వాట్ యార్ - యూ టెల్లింగ్  మీ నౌ?"

ఏదో చెప్పబోయిన వూ ని చెయ్యి పైకెత్తి మణికట్టు దగ్గర వంచి ఆపు అన్నట్టు సైగ  చేసింది.

పక్క నుంచి పరిమళ నెమ్మదిగా అంటోంది "అక్క ఈవత్తు వ్రత మాడ్తిద్దారె. అదిక్కే మక్కళన కెళగడె అవురి మనేగే కళుసిద్దారె" (అక్క ఈరోజు వ్రతం చేసుకుంటున్నారు. అందుకే  పిల్లలను కిందవారి ఇంటికి పంపారు"

దగ్గరలో పండగలేమీ లేవుగా ఏ వ్రతమో అర్థం కాక అమెరికా నుంచి వచ్చిన కొత్త అలవాటైన నైట్-గౌన్ ని జారిపోకుండా సర్దుకుంటూ, ఇంకో చేత్తో బుర్ర గోక్కుంటూ రీ మాటలు వింటూ నించున్నాడు వూ.

ఓ పది నిముషాలయాక స్కైప్ ఐడీ ఎలా క్రియేట్ చేయాలో చెప్పి "*$%!" అనుకుంటూ ఫోన్ ఆఫ్ చేసింది.

"ఏంటి రీ ఈ హడావిడి?"

"ఇవాళ ఈవెనింగ్ అయాం డూయింగ్ లక్ష లైకు నోం "

"అబ్బ సుందరీ ! ఈ ఒక్కసారికీ తెలుగు లో చెప్పవా ప్లీజ్ ! అమెరికా వెళ్లి వచ్సినప్పటినుంచీ నీ యాక్సెంట్ పట్టుకోవడం కష్టం అవుతోంది"

పడిపోయింది సుబ్బారావు మెచ్చుకోలుకి.

"అదే ! లక్ష లైకుల నోము"

"అదెక్కడి నోము ? మీ అమ్మ, మా అమ్మ ఎపుడూ చేసినట్టు గుర్తు లేదే" మేనమామ కూతుర్నే పెళ్ళాడిన సుబ్బారావు ఆలోచనతో కూడిన ఆక్రోశం.

"అదే మరి! అన్నీ పాతవే చేస్తామేంటి ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీ లో కూడా. ఇది నా డిజైనర్ నోము"

"నువ్వు డిజైన్ చేశావా?"

"ఊ ! నేనే . చాంగ్ పేటెంట్ కూడా చేయమన్నాడు"

"ఆ చాంగ్ కనిపిస్తే వాడిని మడిచి చిమీ చాంగా చేస్తాను" పళ్ళు కొరుక్కున్నాడు ఎసెస్. వు.

"అలా అయితే నేను చెప్పనంతే"

"అబ్బే! చాంగ్ ఎంత మంచి ఐడియా ఇచ్చాడో అని ఆశ్చర్య పోతున్నాను. నీకు తెలుసుగా ఐ అప్రిషియేట్ సచ్ క్రియేటివ్ ఐడియాస్. టెల్ మీ అబౌట్ లక్ష లైకు నోం"

"యూ ! చో చ్వీట్ " సుబ్బారావు బుగ్గని ఓ మైలు దూరం లాగి వదిలింది సుందరి.
పళ్ళ బిగువున భరించాడు.

"ఇవాళ సాయంత్రం అయిదింటికి మొన్న ఉత్సవ్ డాట్ కామ్ లో కొన్న పటోలా చీర కట్టుకుని నేను మన ఐమాక్ లో స్కైప్ ఆన్ చేసి కూర్చుంటాను. అదే టైం కి నా వాట్సాప్ టైగర్ మామ్ గ్రూప్ వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో స్కైప్ లో లాగిన్ అయి నా చీర చూసి వెంటనే ఫేస్బుక్ లో లైక్ కొడతారు. వెంటనే వాళ్ళ ఫేస్బుక్ ఫ్రెండ్స్ లైక్ కొడతారు. అలా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొట్టిన లక్ష లైకులు ఓ గంట లో వచ్చేస్తాయి. లక్ష లైకులూ పూర్తవ్వగానే అప్పుడు ఉద్యాపన చేసుకుంటాను"

"దీనికి స్కైప్ ఎందుకు? నీ ఫేస్ బుక్ లో పెడితే సరిపోతుంది కదా! మళ్ళీ ఆ ఉద్యాపన ఏంటి?"

"సర్లే  ! మొన్న ఆ శ్రీవారి ముచ్చట్ల బ్రాండ్ ఎంబాసడర్ లేడూ - అదే ఆఫీస్-స్పౌస్ వుందని పోజ్ కొడితే వున్న స్పౌస్ వదిలేసింది - ఆ భుజంగ రావు గారు - ఆయన "Without Spouse There Is No Spice in Life" అని ఫేస్-బుక్ స్టేటస్ పెడితే మా తింగర మేళం అంతా  కలిసి 100 లైకులు, కీపిటప్పులు పెట్టారు. ఎవరు ఏం పెట్టినా వాళ్లకి లెక్క వుండదు. అందుకే వాళ్ళ లైకుని లైవులో కేప్చర్ చేద్దామని ఈ వ్రతం డిజైన్ చేశా. స్కైప్ లో ముందు జాయిన్ అయిన రెండు డజన్ల మందికి స్క్రీన్-ప్రైజెస్ ఉంటాయని చెప్పా. అవి వుద్యాపనలో ఇస్తానని ఈ-వైట్ పంపా " ఎలా వుంది నా ఐడియా అన్నట్టు చూసింది రీ.

అసలే పొద్దున్నించి బాగాలేని గ్రహ-స్థితుల, వక్ర నక్షత్రాల గమనం వల్ల కనీసం కాఫీ కూడా అందక నీరసం గా వున్నాడేమో రీ పక్కనే వున్న కుర్చీలో నెమ్మదిగా కూర్చుని అడిగాడు - "ఇంతకీ ఎం ప్లాన్ చేశావు నీ స్క్రీన్-ప్రైజెస్ కి ?"

 "ఏముందీ! మొన్న వచ్చిన బోనస్ తో ఓ ఇరవై నాలుగు ఉప్పాడ చీరలు కొన్నా. ఇవాళ సాయంత్రం స్కైప్ లో లైకుల వ్రతం అయిపోగానే మనింటికి వస్తారు - నువ్వూ పిల్లలూ ఓ రెండు గంటలు ఎక్కడికయినా వెళ్లి రండి ... " అని ఇంకా ఏదో ప్లాన్ చెప్తూ వుంది రీ - అప్పటికే వూ కి వూపిరాడక శోషొచ్చి పడి పొయాడు .









7, ఏప్రిల్ 2016, గురువారం

దుర్ముఖి ... అవదా సుముఖి?

చల చల్లని మంచు ముద్దల శీతాకాలాన్ని అలా అలా మెల మెల్లని మాటల కరగింప జేసి సాగనంపి ఇదిగో ఇలా ఇలా వచ్చేసింది నులి వెచ్చని వసంతం. 

శిశిరపు భూమికి రంగులద్దే సరదాలో ఆకుల అలంకారాలు పుడమికి పంచిన చెట్లు మళ్ళీ వివిధ వర్ణ పత్ర, పుష్పాలంకృతలై బంగరపు ఎండల మేలిముసుగులో స్వయంవరం కోసం వేచి వున్న వృక్ష కన్యల్లా వరసగా దారికి అటూ ఇటూ నించుని వున్నాయి. 

అప్పటిదాకా చలికి ముడుచుకుని ఇళ్ళ కిటికీల లోంచి వచ్చేపోయే కార్లని లెక్కపెడుతూ రోజులు నెలలలా గడిపిన వాడిన ముఖాలు చిరు దరహాసపు మొలకలతో తలుపులు తెరచి వీధులలో నవ్వుల పువ్వులు పంచుదామని వచ్చి గల గలా మాటల పేరులు అల్లుతున్నారు. 

రంగు రంగు సీతాకోకచిలుకల్లా అల్లి బిల్లి ఆటలతో బుల్లి తువాయిల్లా గంతులేస్తూ దారికే పూచిన పూవుల్లా వున్నారు పిల్లలు. 

ప్రతీ ఉగాదికీ ఇదే చిత్రం మనసులో 
ప్రతీ ఉగాదికీ ఇదే ఆనందం బ్రతుకులో 
ఉగాది అంటే నోరారా మాటలే 
ఉగాది అంటే చిరు నవ్వుల వెలుగులే 
సంవత్సరం లో ఒక్క రోజు ముఖ-పుస్తకం కాక ముఖాలు చూస్తే 
ఏడాదిలో ఒక్క రోజు వాట్సాప్ వదిలి మాటలు కలిపితే 
పేరుకి దుర్ముఖి అయితే ఏం - ఉగాది పూటైనా అవదా సుముఖి?

శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభకామనలు!!!!

 

2, ఏప్రిల్ 2016, శనివారం

గ్రాఫులు - ఆటోగ్రాఫులు - ఫోటోగ్రాఫులు

గ్రాఫులు

చిన్నప్పుడు నాకు మాథ్స్ లో గ్రాఫులు గీయడం అంటే చాలా ఇష్టం గా వుండేది. మామూలుగా లెక్కలు చేసే తెల్ల కాగితాల పుస్తకం కాకుండా లేత ఆకుపచ్చ రంగులో చిన్న చిన్న గళ్ళతో నాన్నమ్మ కట్టుకునే వరయూరు చీరలా అనిపించే ఆ గ్రాఫు పేపర్ మీద X-యాక్సిస్ మీద ఒక చుక్క, Y-యాక్సిస్ మీద ఒక చుక్క పెట్టి స్కేల్ తో వాటిని కలుపుతూ గీత గీసి అదేదో లెక్కలకి సంబంధించిన కొత్త సూత్రమేదో నేనే కనిపెట్టేసినట్టు ఆనందపడిపోయేదాన్ని. ఇంతకీ అక్కడ గీసేది రెండు బిందువులని కలుపుతూ ఒక సరళరేఖ. అంత కన్నాఒక చుక్క ఎక్కువా కాదు. ఒక చుక్క తక్కువా కాదు.

తర్వాత్తర్వాత para-బోలాలు, hyper-బోలాలు అంటూ ఎంత గందరగోళం చేసినా ఋజు వర్తన కలిగిన సరళరేఖ మీద మక్కువ పోలేదు. అందుకే ఇప్పటికీ ఎన్ని చుక్కలు పెట్టయినా కమలాలు, గుమ్మడి కాయలు అంటూ సరళరేఖలతో కలపగలిగే ముగ్గులే వేస్తాను కానీ రెండు మెలికలు తిప్పగానే చేతి వేళ్ళు ముడిపడిపోయేలాంటి మెలికల ముగ్గుల జోలికే వెళ్ళను.

నాకు నేను గీసుకునే నా గ్రాఫు ఒకటి వుంది - వృద్ధి(X)-బుద్ధి(Y). ఇంత పెద్దయ్యాను ఎంతో బుద్ధి వచ్చేసింది అని అనుకుందామనుకుంటే ఏదో ఒక సందర్భం లో ఆ గ్రాఫు కొంచెం Y-యాక్సిస్ మీద ఒక్కోసారి ఫ్లాట్ అవుతున్నట్టు నాకే తెలుస్తూ వుంటుంది. అలాంటప్పుడు అమ్మతో "ఏంటో అమ్మా! ఎప్పటికప్పుడు ఏదో పాఠం నేర్చుకుంటున్నట్టే వుంటోంది. ఇంకెప్పుడు బుద్ధి వస్తుందో నాకు " అంటే ఆవిడ నన్ను మించిన ఆశాజీవి - "గోడ మీద రేపు అని రాసుకో లల్లీ !" అంటుంది.  

నాదైన గ్రాఫు కాకుండా వేరే వాళ్ళు గీసే నా గ్రాఫు సందర్భాన్ని బట్టి పడుతూ లేస్తూ వుంటుంది. అదేముందిలే - తానొకటి గ్రాఫితే తమరొకటి గ్రాఫారని - ఉండనే వుందిగా :)


ఆటోగ్రాఫులు

ఇంక నాకసలు అచ్చిరాని ఇంకో రకం గ్రాఫులు - ఆటోగ్రాఫులు.

ఆటోగ్రాఫులు అచ్చిరానివి ఎలా అయాయీ అంటే...
ఎవర్నైనా అడగాలంటే నాకు మొహమాటం
ఎవరికైనా నన్నడగాలంటే వాళ్లకి వెనకాటం (ఇది నా మాట - డిక్షనరీల్లో వుండదు).

నా జీవితం మొత్తం లో ముగ్గురే ముగ్గురి దగ్గర ఆటోగ్రాఫులు తీసుకున్నాను.

ఆ ముగ్గురూ ఎవరంటే -
ఇద్దరేమో  - నేను, అపర్ణ ఇంటర్మీడియట్ లో బోంబే-గోవా excursion  కి వెళ్ళినప్పుడు మా BH కాలేజ్ వాళ్ళు కుదుర్చుకున్న బస్సు డ్రైవ్ చేయడానికి వచ్చిన  డ్రైవర్ అంకుల్ & డ్రైవర్ తాత గారు. 
ఇంక మూడో వారు - నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు గారు.

వరసగా వాళ్ళిచ్చిన ఆటోగ్రాఫులు ఇవీ ...

డ్రైవర్ అంకుల్ - "May God Bless you !"
డ్రైవర్ తాతగారు - "మంచి బొమ్మలు లాంటి అమ్మాయి"
అక్కినేని : "Love Art"

మొదటి రెండిటినీ అర్థం చేసుకోవడానికి నాకేమీ కష్టం అనిపించలేదు కానీ మూడో దాన్ని అర్థం చేసుకోవడానికి నా ఇంటర్మీడియట్ బ్రెయిన్ కి ఉదాత్తత తగ్గి దాన్ని తెలుగులో "ప్రేమ కళ" అని చదువుకుని "ఇదేంటబ్బా - ఈయన ఇలా రాశారు? అంటే ప్రేమ నగర్, ప్రేమాభిషేకం సినిమాల్లో యాక్ట్ చేశారు కదా - అందుకే అలా రాసి వుంటారు" అని నాకు తోచిన అ(పా)ర్థాలేవో చేసేసుకున్నాను. తర్వాత ఎప్పటికో కొంచెం నా వృద్ధి(X)-బుద్ధి(Y) గ్రాఫు పెరిగాక అది ఒక Imperative Sentence అయిన "కళని ప్రేమించు" అని అర్థమయింది.

ఆ మూడు ఆటోగ్రాఫులు కూడా ఏదో అలా గుర్తు వుండి పోయాయి అంతే తప్ప వాటిని ఎక్కడ పడేసుకున్నానో కూడా గుర్తు లేదు.

ఆ తర్వాత కాలేజ్, యూనివర్సిటీ చదువులు అయాక - సీనియర్స్ , క్లాసు మేట్స్ కి ఆ చివరి రోజున Good Luck చెప్పడం తప్ప ఇంకే కాగితపు గుర్తులూ లేవు.

ఇప్పటికీ నా లైఫ్ గ్రాఫు లో చిన్ననాటి స్నేహితుల నుంచి యూనివర్సిటీ మిత్రుల దాకా - ఎవరో ఒకరితో - నెలకొకసారైనా జరిగే ఆత్మీయ సంభాషణల్లో నాకు దొరికే సంతోషం ఎక్కడో అలమారుల్లో దాచుకునే ఆటోగ్రాఫు పుస్తకాల కన్నా మిన్నగా అనిపిస్తుంది.



ఫోటోగ్రాఫులు



మొన్నొకరోజు ఫోటోలు చాలా వున్నాయి వాటిని కొంచెం సర్దుదామని అనిపించి బయటికి తీశాను.

ఎన్ని ఫోటోలు ...ఎన్ని ఫోటోలు ...

చిన్నప్పటివి
పప్పీ, కుట్టీలతో వున్నవి
మేం ముగ్గురం అమ్మా నాన్నలతో వున్నవి
కాలేజ్ లో ఫేర్ వెల్ పార్టీలవి
అపర్ణ నేను గుంటూరు న్యూ టోన్ స్టూడియో లో తీయించుకున్నవీ
పెళ్ళికి ముందువి
పెళ్లివి
పెళ్ళికి తరవాతవి
పిల్లలు పుట్టక ముందువి
పుట్టిన వెంటనేవి
పెరుగుతున్నప్పటివి
పెరుగుతూ వున్నప్పటివి
ఎప్పటివో
అప్పటివీ
ఇప్పటివీ...

అదిగో... అన్ని కనిపించాయి.

అవి కాక -
డిజిటల్ కెమెరా లో వున్నవి
మా దగ్గర వున్న మూడు ఐ-ఫోనుల్లో వున్నవి.

ఆ ఫోటోలన్నీ చూశాక అసలు సర్దడం మర్చిపోయి ఎక్కడివక్కడే వదిలేసి ఆ ఫోటోల మధ్యలో కూర్చుని చూడడం మొదలుపెట్టాను. టైం ఎలా గడిచిపోయిందో తెలీదు. ఒక గంట అయాక నేను గమనించింది ఏంటంటే ఎన్ని ఫోటోలు చూస్తున్నా- ఒక్కొక్కదాన్ని ఎంత మార్చి మర్చి చూస్తున్నా- ముందుగా ప్రతీ ఫోటోలో నేనున్నానా లేదా అని చూసుకుని , నేనుంటే ఆ ఫోటోకి అంతకు ముందు చూసిన ఫోటోకి నాలో మార్పు ఏముందా అని, ఎందులో ఏం కట్టుకున్నానా అని - ఇంతే - అంతా నా గురించే దృష్టి.

నవ్వొచ్చింది - తర్వాత ఆలోచిస్తే. ఏమని అంటే - ఎక్కడికి అయినా విహార యాత్రకి వెళ్లి వస్తే బోల్డన్ని ఫోటోలు తీసేసుకుని అందరికీ చూపించేసుకుంటామా!!
అప్పుడు - పక్క పక్కనే కూర్చుని ఒకే ఫోటో కేసి ఇద్దరం చూస్తుంటే - ఫోటోలో వున్నవారు ఫోటోలో ఎందరు వున్నా ముందు తమకేసే చూసుకుంటారు. 
ఫోటోలో లేకుండా కేవలం చూపిస్తున్నారు - చూడాలి కాబట్టి అని చూసేవాళ్ళు ఫోటోలో వున్నమనుషుల చుట్టూ వున్న పరిసరాలు - అసలెక్కడికి వెళ్ళారు, ఎంత బాగా తిరిగారు - అని చూస్తారు. ఫోటోగ్రాఫు ఒకటే అయినా దృష్టి గ్రాఫులు వేరే మరి :)

ఫోటోగ్రాఫులలో ఇంకో రకం సెలెబ్రిటి ఫోటోలు. నావరకు నాకు అవి మాన్యుమెంటల్ టైపు. క్రితం ఏడాది మా వూళ్ళో ఈ-టీవీ వాళ్ళ పాడుతా - తీయగా కార్యక్రమం జరిగితే అందరం చూడడానికి వెళ్ళాము. అందరూ SPB తో మాట్లాడడానికి, ఫోటోలు తీసుకోవడానికి సరదా పడుతున్నారు. నేను, పిల్లలు ఒక పక్కగా కూర్చుని చూస్తూ ఉన్నాము. నాకప్పుడు అనిపించింది - అప్పుడే కాక ఎప్పుడు ఏ సెలబ్రిటీ-లోడెడ్ కార్యక్రమానికి వెళ్ళినా అనిపించేది ఒకటే - ఏ హైద్రాబాదో వెళ్తే చార్మినార్ ముందు నిలబడో, బిర్లా మందిర్ దగ్గర కూర్చునో ఫోటో తీసుకుంటాము. దాన్ని మనం పదే పదే చూసుకుని, చూపించుకుని ఆనందపడతాం.   అది ఆ చార్మినార్ కి గానీ, బిర్లా మందిర్ కి గానీ తెలీను కూడా తెలీదు. ఒక వేళ తెలిసినా (తెలిసే అవకాశం లేదు కానీ just an abstract thought ) పట్టదు. సెలబ్రిటీ లతో నేను తీసుకునే ఫోటో అయినా అంతే. సెలబ్రిటీ లకి వాళ్లకి ఎవరు సెలబ్రిటీ లో వాళ్ళతో ఫోటోలు లెక్క గానీ నాతో తీయించుకునే గ్రాఫులు కాదు కదా :)