19, సెప్టెంబర్ 2019, గురువారం

త్వామనురజామి - 40 - పాటిక్కడ... మాటక్కడ...

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 39 - బెంగుళూరులో... బీటీఎస్సులో... ఫస్టు ప్రయాణం!

నాకు బెంగుళూర్లో బస్సు ప్రయాణం అంటే వున్న భయం, బెరుకు అన్నీ తగ్గాయి.  ఏ బెంగా లేకుండా ఎన్నేయల్‌కి వెళ్ళడం, రావడం అలవాటైంది.

ఇంటికి వచ్చేటప్పటికి రోజూ సాయంత్రం ఆరున్నర, ఏడూ అయ్యేది. ఆ పాటికి శ్రీను కూడా ఇంటికి వచ్చేసి ఉండేవాడు. నేను  ఫ్రెషప్ అయి వచ్చి కాసేపు తనతో, శ్యామలతో ఆఫీస్ కబుర్లు చెప్తూ, రీడర్స్ డైజెస్ట్ జోకులకి నవ్వుకుంటూ ఉండగానే ఎనిమిది అయేది. 

పప్పి, కుట్టి, అపర్ణల తర్వాత నేను ఎక్కువ టైం గడిపింది, కబుర్లు చెప్పింది నేను బెంగుళూరులో శ్యామల తోనే.  తను నాకన్నా రెండేళ్లు జూనియర్. పప్పి ఏజ్. అప్పట్లో అమలాపురం ఎస్కెబీఆర్ కాలేజ్‌కి టీవీఎస్ మీద  వెళ్ళిన చాలా తక్కువ మంది అమ్మాయిల్లో తనొకతి. నాకు తొందర్లోనే మంచి ఫ్రెండ్ అయిపోయింది. మా ఇద్దరికీ మాట్లాడుకోవడానికి బోల్డన్ని కబుర్లు. నా హాస్టల్ విశేషాలు, తన డిగ్రీ కాలేజ్ విశేషాలు ఎంత చెప్పుకున్నా తరిగేవి కావు. పైగా తను వీణ క్లాసులకి, టైలరింగ్ క్లాసులకి వెళ్తూ ఉండేది. వాటి గురించీ ఏవో కబుర్లు ఉండేవి. తనకీ నాకూ కూడా వున్న ఓ కామన్ ఇష్టం అమూల్ ఫ్రూట్ & నట్ చాక్లెట్ బార్స్. నేను రోజూ ఎన్నేయల్‌ స్టోర్లో ఓ బార్ కొని తెచ్చేదాన్ని రోజూ రాత్రి డిన్నర్ కాగానే మేమిద్దరం షేర్ చేసుకుని తినడానికి.

గుంటూరులో మా అమ్మకి కావాల్సిన కూరలేవో తరిగియ్యడం తప్ప నేనెప్పుడూ వంటింట్లోకి వెళ్ళలేదు. బెంగుళూరులో కూడా రోజూ కుదరకపోయినా - శనివారం, ఆదివారం సెలవులు కదా! అప్పుడు శ్యామలకి సాయంగా కూరలూ అవి తరిగిస్తూ, వంటింట్లో తను వంట చేస్తూ ఉంటే నేను కూడా అప్పుడప్పుడూ కూరలు అవీ కలుపుతూ ఉండేదాన్ని. తనకి కూడా వంట చేయడం కొత్తైనా కూడా చాలా తొందరగానే నేర్చుకుంది శ్యామల.

మేమిద్దరం కలిసి  వంట చేయడం అంటే చిన్నచిన్న గిన్నెల్లో గుజ్జనగూళ్ళకి ఆడుకుంటున్నట్లు ఉండేది.  అలా అని ప్రతిరోజూ నేనేమీ పెద్ద సాయమేమీ చేయలేదు శ్యామలకి - కాకపోతే శనాదివారాల్లో మాత్రం

ఆడుతు పాడుతు వండేస్తుంటే...
పాకం కుదిరేస్తున్నదీ ... 
ఇద్దరము కలిసి వంట వండితే
సరదాగున్నది... భలే బాగా ఉన్నదీ ..  - అన్నట్లుండేది.

మామూలుగా అయితే ప్రతిరోజూ నేను, శ్రీను ఇంటికి వచ్చేటప్పటికే శ్యామల వంట చేసేసి ఉండేది. డైనింగ్ టేబుల్ మీద బోల్డన్ని బుల్లిబుల్లి గిన్నెల్లో పప్పు, కూర, పచ్చడి, చారు, పెరుగు పచ్చడి - ఇలా బోల్డన్ని వెరైటీలు చేసేది తను. నేను పగలు ఎన్నేయల్ కాంటీన్లో మహా సాత్వికాహారం తినేదాన్నేమో సాయంత్రం ఇంటికి రాగానే శ్యామల చేసిన వంటలు మరీ రుచిగా అనిపించేవి.

రాత్రి భోజనం కాగానే నేను నా రూంలోకి వెళ్ళిపోయి ఓ గంటసేపు ఏమైనా పుస్తకం చదివి పడుకునేదాన్ని. అప్పుడే మొదటిసారిగా Gone with the Wind, The Coun of Monte Cristo నవలలు చదివాను. శ్రీను దగ్గర మంచి కలెక్షన్ ఉండేది. ఇంట్లో వున్న పుస్తకాలే కాకుండా విజయనగర్ మెయిన్ రోడ్ దగ్గరగా వున్న లెండింగ్ లైబ్రరీ నుంచి Archies comics తెచ్చుకుని చదివేదాన్ని. అవి తెచ్చుకోవడం కోసం రోజూ రాత్రి భోజనం కాగానే నేను, శ్రీను, శ్యామల నడుచుకుంటూ వెళ్ళొచ్చేవాళ్ళం.

నాకు చాలా చిన్నచిన్న విషయాల్లో పెద్దపెద్ద పట్టింపులు. నేనెప్పుడూ కోల్గెట్ ప్లస్ టూత్‌బ్రష్ వాడేదాన్ని. ఓ రోజు రాత్రి మేం ముగ్గురం వాకింగ్ కని వెళ్ళినప్పుడు శ్రీనుకి చెప్పాను నాకో కొత్త బ్రష్ కావాలని. ఎన్ని షాపులు తిరిగినా నాక్కావాల్సిన బ్రష్ దొరకలేదు. చివరికి దాదాపు షాపులు కట్టేసే టైంలో ఓ చిన్న కొట్లో దొరికింది. అంత సేపూ కూడా శ్రీను, శ్యామల "పోన్లే బ్రష్షే కదా ఏదో ఒకటి కొనుక్కోకూడదా?" అని అడిగుండొచ్చు. లేకపోతే "బాగా లేటయిపోయింది, రేపు కొనుక్కుందాం" అనుండొచ్చు. అస్సలలాంటివేమీ అనకుండా నన్ను ఓపిగ్గా అన్ని షాపులకి తీసుకెళ్ళారు.  నాక్కావాల్సిన కోల్గెట్ ప్లస్ టూత్‌బ్రష్ నేను కొనుక్కున్నాకే ఇంటికి తిరిగొచ్చాము. వస్తున్నప్పుడు శ్రీను అన్నాడు కూడా "ప్రపంచంలో రెండు రకాలవాళ్ళు వుంటారు. దొరికింది కావాలనుకునేవాళ్ళు. కావాలనుకున్నదే దొరకాలి అనుకునేవాళ్ళు - అంటే నీలాంటి వాళ్ళు. నీలాంటి వాళ్ళ వల్లే ఇన్నొవేషన్స్ ఎక్కువ జరుగుతాయి" అని. శ్రీను కదా ... అన్నిటిలోనూ తనక్కావల్సిన మంచి చూడ్డమే తనకలవాటు... అలా పాసయిపోయాం నేనూ, నా మొండితనం - మంచితనం మాటున :)

శ్రీను వాళ్ళున్న ఇంటి వెనకాల కొంచెం కిందగా ఇంకో ఇల్లుండేది. అక్కడ ఎవరుంటారో ఎప్పుడూ కనిపించేవారు కాదు కానీ రోజూ సాయంత్రం ఏడు గంటల టైంకి ఓ బుజ్జిబాబుకి వాళ్ళమ్మ చెప్పే పాఠాలు మాత్రం వినిపిస్తూ ఉండేవి. మిగిలిన పాఠాలేమో కానీ ఒక అంకెల్లెక్క మాత్రం భలే బావుండేది.

"Say the numbers" అమ్మ కొంచెం గంభీరంగా అడిగేది.

" Numbers వన్... టూ... తీ.. ఊఁ ... వన్ ...టూ... తీ..."

"ఇట్స్ నాట్ 'తీ'... బట్  'త్రీ'... Next ఏను?"

" తీ...తీ.. "  బుజ్జిబాబు 'తీ' దగ్గరే ఆగిపొయ్యేవాడు.

"వన్...  టూ...  త్రీ... ఫోర్...  ఫైవ్... సిక్స్... సెవెన్... ఎయిట్... నైన్... టెన్..."

ఇలా ఓ మూడు సార్లు చెప్పి, బుజ్జిబాబుతో అనిపించేది అమ్మ.

ఆ తర్వాత వాణ్ణే చెప్పమంటే పాపం! బాగానే చెప్పేవాడు.

 "వన్...  టూ...  త్రీ... ఫోర్...  ఫైవ్... సిక్స్... ఎయిట్ " అంటూ ఉండగా అమ్మ గట్టిగా వాడు మింగేసిన సెవెన్ గురించి గద్దించేది "What about Seven?" అంటూ.

వెంటనే వాడు కంఠం సవరించుకుని భలే కాన్ఫిడెంటుగా "వన్...  టూ...  త్రీ... ఫోర్...  ఫైవ్... సిక్స్... ఎయిట్, What about సెవెన్" అని ఆపేసి "డన్" అనేసేవాడు.

దాదాపుగా రోజూ ఇదే పాఠం. వాడి గొంతు వింటే వాడు చాలా బుజ్జివాడు అని తెలిసేది. వాళ్ళిద్దరినీ నేనెప్పుడూ చూళ్ళేదు కానీ ఆ అంకెల పాఠం విని భలే నవ్వుకునేదాన్ని.

సరే! ఈలోగా వినాయకచవితి వచ్చింది. ఆ రోజు ఇంటికి ఎవరో గెస్ట్ భోజనానికి వస్తున్నారని తెలిసింది. తీరా చూస్తే ఆ గెస్ట్ ఎవరో కాదు అంతకు ముందు డైనింగ్ టేబుల్ దగ్గర వింటర్వ్యూ చేసితను.

వినాయకచవితి రోజు శ్యామలకి పాలవెల్లి కట్టడానికి హెల్ప్ చేశాను. శ్రీను, తను పూజ చేస్తూ ఉంటే నేను కొంచెం అవతలగా డైనింగ్ టేబుల్ దగ్గర కాలిఫ్లవర్ క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే పూజైపోగానే శ్యామల వంట చేయాలి కదా...తనకి కొంచెం సాయం చేసినట్లుంటుంది అని. వాళ్లిద్దరూ పూజ  చేయడం అయిపోగానే వంట కూడా అయిపోయింది. ఇంతలో పండగ భోజనానికి ఆహ్వానింపబడ్డ అతిథి రావడం, అందరం కలిసి భోంచేయడం, ఆ తర్వాత నేను నా పుస్తకం పట్టుకుని చదువుకోవడం, మధ్యాహ్నం టీ తాగి గెస్టుగారు వెళ్లిపోవడం అన్నీ జరిగిపోయాయి. The most uneventful day was it!


ఆ రోజు రాత్రి ప్రతి పండక్కి చేసేట్టే ఇంటికి ఫోన్ చేశాను - విజయనగర్లో ఇంటి దగ్గరున్న ఎస్టీడీ బూత్ లోంచి.  

అవతల్నుంచి అమ్మ, నాన్న మాట్లాడ్డం అయ్యాక కుట్టి మాట్లాడింది.

"లల్లెమ్మా! పండక్కి ఏం చేశారే మీరందరూ?"

"శ్రీను, శ్యామల పూజ్జేశారు."

"మరి నువ్వు?"

"కాలిఫ్లవర్ క్లీన్ చేశా"

"మరి వినాయకుడికి పూజ?"

"పాలవెల్లి కట్టడానికి సాయం చేశా... పత్రి సర్దిపెట్టా. ఇంకేం చెయ్యాలి? పైగా దేవుడి గదిలో ఆట్టే ప్లేస్ లేదు"

"ఏదో ఒహటి చెప్పి తప్పించుకోకే. ఇలాగే పూజాలెగ్గొట్టు. వచ్చే జన్మలో ఆ కాలిఫ్లవర్లో పురుగు లాగే పుడతావ్"

"సర్లే! వండిన వంట ఆయనకే మహానైవేద్యం పెట్టాలి. ఏదో నా ఒంతు నేనూ చేశా పూజ"

"నీకు చెప్పలేమే బాబూ ...కనీసం ఆ పూజయ్యాక నెత్తిన అక్షింతలన్నా వేస్కున్నావా? లేకపోతే నీలాపనిందలొస్తాయి"

"వేరే వచ్చేదేముంది. ఇప్పుడు వచ్చేయలా నీ దగ్గర్నుంచి?"

ఇలా దాంతో కాసేపు అరువు దెబ్బలాడి ఫోన్ పెట్టేశా.

ఆ తర్వాత మూడ్రోజులకి శుద్ధ సప్తమి నా పుట్టినరోజు. అమ్మ అంతకు ముందు గుంటూరు నుంచి వచ్చేటప్పుడు కొనిచ్చిన లేత పసుప్పచ్చ రంగు మీద వంగపండు రంగు జ్యోతుల్లాంటి డిజైనున్న బంజారా ప్రింట్స్ చీర కట్టుకుని ఎన్నేయల్‌కి వెళ్ళాను. ఆ రోజు ఎండ వుంది, వేడి లేదు. గాలి వుంది, చలి లేదు. చుట్టూ వున్న గాలి గోరువెచ్చగా వుంది. మామూలుగా అయితే అలాంటి రోజున రోజూ కన్నా చురుగ్గా అనిపించేది. ఎంత పనున్నా చులాగ్గా అయిపోయినట్లుండేది. ఆవేళ మాత్రం నాకెందుకో కొంచెం దిగులుగా అనిపిస్తోంది. అమ్మా, నాన్న ఆఫీస్ ఫోన్‌కి కాల్ చేసి విషెస్ చెప్పారు. పప్పి, కుట్టి కూడా చెప్పారు.

బదరి దగ్గర్నుంచి ఫోన్ కాదు కదా ఏ రకమైన కమ్యూనికేషన్ లేదు. తన దగ్గర శ్రీను ఇంటి ఎడ్రెస్ వుంది కానీ మా ఇద్దరి మధ్య ఒక అలిఖిత ఒప్పందం ఏంటంటే తను బెంగుళూరులో ఉద్యోగం చూసుకోవడానికి వచ్చేవరకూ మా ఇద్దరికీ కటీఫ్! అని.

పెదవి మాట పలక
చెవుల పిలుపు సోక
కనుల నవ్వు చిలక
కినుక జాడ లేక 
పదము కలిపి నడక
ఎదలు ఎగసి పడగ
కలత మనక తొలగ
కలలు మనకు జతగ... 

అన్నట్టు తిరిగేవాళ్ళమే...

మరిప్పుడు...

మాట పలకని పెదవి
పిలుపు సోకని చెవి
నవ్వు మరచిన కనులు
నొవ్వు మఱగిన కినుకలు
నడకల పదములు విడి విడి
ఎగసిన ఎదలు విడి వడి
కలత మనగ జత పడి
కలలు తరలె కను విడి...

అన్నట్లు నేనిక్కడ బెంగుళూర్లో, తనక్కడ మెడ్రాస్లో...

తానక్కడ... నేనిక్కడ
పాటిక్కడ... మాటక్కడ
మేమెప్పుడొ కలిసేది బెంగుళూర్లో?!


 <<... మళ్ళీ నవంబర్ 19 కి ఇంకొన్ని కబుర్లు>>


15, సెప్టెంబర్ 2019, ఆదివారం

సెబాసు, పెన్సిల్ పార్థసారథీ! భలే గ్యాంగ్ నీది...

హలో పెన్సిల్ పార్థసారథీ!

నిన్ననే నిన్నూ, నీ గ్యాంగునీ మా ఊరి సినిమా తెర మీద చూసొచ్చా. మీరందరూ నాకు భలే నచ్చారు. మరి నచ్చినవి నచ్చినట్టు నచ్సినవారికి చెప్పకపోతే నాకు నిదరట్టదు.

ముందుగా నాకై నాకున్న ఓ రూలు గురించి చెప్పాలి. అదేంటంటే దేని గురించైనా చెడుగా విన్నా, కన్నా, ఎవరైనా నాతో అన్నా నేను కిమ్మన్ను. ఎందుకంటే వినీ విననట్టు, చూసీ చూడనట్టు ఉంటే చెడు ఆట్టే దూరం వెళ్ళలేదు. వున్న చోటే సమసిపోతుంది. అదే మంచి గురించి చెప్పలేదనుకో "మంచి అన్నది పెంచుమన్నా" అన్న గురజాడ గారి అడుగుజాడ అజా-పజా లేకుండా పోతుంది. అందుకే విషయమేదైనా నాకు మంచిగా అనిపిస్తే చెప్పేయాలబ్బా - అది పాటైనా, మాటైనా, సినిమా అయినా! 

సరే! ఇక నీ విషయానికి వస్తే నాకు నీ గురించి ఏం నచ్చిందో చెప్పాలి కదా!

అన్నిటికన్నా ముందుగా నువ్వూ, నీ పేరూ భలే వున్నాయి. నువ్వున్న ఇల్లూ, అందులో నువ్వు పేర్చిన డొల్ల-పుస్తకాలు ఇంకా బావున్నాయి. నీ ఇల్లున్న మేడ చుట్టూ వున్న పూల-పూల ఇనప గ్రిల్లు భలే వుంది. నువ్వు నీ నవలలకి పెట్టుకున్న పేర్లు - రసీదుని చంపు, వృద్ధులకు దేశం లేదు - లాంటి పేర్లు నాకు నచ్చేశాయి. పైగా సినిమాలు చూస్తూ సస్పెన్స్ నవలలు మక్కికి మక్కి దింపి మరీ రాస్తావు చూడు - ఆ ఐడియా ఎంత బావుందో!

అవునూ! పెన్సిల్ పార్థసారథి అని పేరు పెట్టుకుని ఎప్పుడూ బాల్‌పెన్ను టిక్కుటిక్కులాడిస్తూ కనిపించావే కానీ నీ పేర్లో వున్న "పెన్సిల్" చేతిలో ఏది? ఏదో ఉండబట్టలేకఅడిగాను. ఏమీ అనుకోకు. అది పెద్ద పట్టించుకోదగ్గ విషయమేమీ కాదులే!

అన్నట్టు నీకు భలే గ్యాంగ్ దొరికింది. మెట్లెక్కాలంటే నీ చేత ఎత్తుకు మోయించుకునే ఓ బామ్మ, ఆకలేసినప్పుడల్లా పులిహార కలిపే ఓ అమ్మ, నీ కోసం ఉంగరం వేలు ఖాళీ చేసుకునే ఓ అందమైన అమ్మాయి, తనకేం అనిపించినా నీకు టెక్స్ట్ చేసి మరీ చెప్పే చెల్లాయి, గిరజాల జుట్టుతో ముద్దొచ్చే ఓ పాపాయి... అందరూ భలే వున్నారు. ఈ ఐదుగురి బాక్‌గ్రౌండూ, వాళ్ళందరూ నీ దగ్గరికి ఎందుకు చేరారో నేనిక్కడ చెప్పనులే. అవి అందరికీ తెల్సిపోతే మజా ఏముంది కదా?!  కానీ వాళ్లందరితో పాటు నీకు నీ "శ్రావణి" కూడా నీకు తెలియకుండానే నీ గ్యాంగ్ తయారవడానికి, నువ్వు ఆ గ్యాంగ్‌కి లీడర్ అవడానికి ఒక కారణమైంది చూడు... అది నాకు భలే థ్రిల్ అనిపించింది. కానీ నీకు ఆ విషయం ఎప్పటికీ తెలీదేమో అని కూడా అనిపించింది.

వీళ్ళే కాకుండా నీ సస్పెన్స్ నవలలని పబ్లిష్ చేసి అసలు నవ్వడమే మర్చిపోయి, నువ్వొస్తున్నానంటే తను లేనని తన ఎసిస్టెంట్ మాణిక్యం చేత చెప్పించే నీ ఫ్రెండు, నువ్వు రాసిన నవలని ఐదు గంటలు వినలేక అయ్యగారు పైనున్నారని నిజం చెప్పేసే మాణిక్యం - ఇదో చిన్న సైడ్ గ్యాంగ్ - మరి వీళ్ళూ నీ వాళ్ళేగా!

ఇంకో విషయం మర్చిపోయాను. ఆ సంతూర్ శనక్కాయల వున్నాడు చూడూ అలాంటి వాళ్ళకి కొంచెం దూరంగా వుండు బాబూ! ఎందుకైనా మంచిది. వాడు చూడ్డానికి బానే వున్నాడు కానీ వాడి వాలకమే నాకు నచ్చలేదు "పెన్సిల్ గాడూ, పెన్సిల్ గాడూ" అనుకుంటూ.

మీ గ్యాంగుకి వాళ్ళ ఆశయం ఫలించేలా సహాయం చేస్తూ, వాళ్ళతో పాటు ఉంటూ వాళ్ళ కథనే రాస్తూ, ముందేం జరగబోతోందో ఊహించి రాస్తూ, అందులో రాబోయే కష్టమేదైనా ముందే తెలిస్తే ఆ రాతని చెరిపేస్తూ, వాళ్లకి ఏ కష్టమూ రాకుండా చూస్తూ భలే నడిపావబ్బాయ్ నీ ఇరవై తొమ్మిదో నవలని! అది ప్రింటులో ఎప్పుడొస్తుందో చెప్పు నేనూ కొనుక్కుంటా.

అవునూ ... నువ్వు నీ నవలని నీ అభిమానులకి సంతకం చేసి ఇచ్చే టైంలో ఆ డైరెక్టర్ సుకుమార్ వచ్చాడు కదా? అదే... నువ్వు ఆయన తీసిన "డ్రామాలాండ్" గురించి కూడా అడిగావూ... గుర్తొచ్చిందా? ఆయనేంటీ ...  నీ తర్వాతి నవలని సినిమా తీస్తానన్నాడా? అలా అయితే నువ్వే హీరోగా వుండాలని డిమాండ్ చెయ్యి. ఏం... ?

మీ ఇద్దరూ కలిసి మళ్ళీ ఓ డ్రామాలాండో, గుంపు నాయకుడో తీశారనుకో కళ్లారా చూసి నోరారా పొగుడుతా.  ఆలోచించుకో మరి! అవునూ... నీ ఇరవై తొమ్మిదో నవలకి ఇంతకు ముందు రాసిన ఇరవై ఎనిమిది నవలలకీ పెట్టినట్లు అచ్చతెలుగు పేరు "గుంపు నాయకుడు" అని పెట్టావా? లేకపోతే మీ గ్యాంగ్ గుర్తుగా "గ్యాంగ్ లీడర్" అనే ఉంచేశావా?

అద్సరే గానీ... ఆ కార్ రేసర్ దేవ్ ఎత్తులకు పైయ్యెత్తులు భలే వేశావ్! ఎంతైనా బోల్డన్ని సస్పెన్స్ నవలల "కాపీ-రైటు" నీది కదా! ఇక్కడో మాట చెప్పాలి మళ్ళీ నే మర్చిపోకముందే. అదేంటంటే ఆ దేవ్‌ని ఇంటర్వ్యూ చేస్తున్నట్టు నటిస్తూ రేసులు జరిగే చోటికి వెళ్ళినప్పుడు అక్కడో టీవీ కంపెనీ వేన్ వుంది కదా - "గీతా టీవీ" అంటూ?! ఆ వేన్ మీద ఓ పక్కగా గీతాచార్యుడు కృష్ణుడు - అదే పార్థసారథి - ఎక్కిన రథం లాంటి లోగో భలే వుందోయ్!

ఆ అనిరుద్ధుడెవరు బాబూ? చివర్లో ఒచ్చి నీతో పాటు పాట పాడుతూ గంతులేసిన ఆ పిల్లాడేనా? ఆయన చేసిన సంగీతమేంటబ్బా నీ కథకి? ఒక్క పాట పాటలా లేదు... మాటలని సాగదీసుకు పోయిన పడరాని పాటులా వుంది తప్ప. పైగా ఎక్కడ పడితే అక్కడ Peanuts theme music తెగ వాడేశాడు. ముఖ్యంగా నువ్వేదో కబుర్లు చెప్తూ ఉంటే మీ గ్యాంగ్ అంతా నీతో పాటు బాత్రూంలోకి వచ్చేస్తారు చూడు - అక్కడ వెనకాల వస్తున్న Peanuts వారి సంగీతం భలే వుంది కానీ దాని క్రెడిట్ మీ అనిరుద్ధుడు తాను కొట్టేయడం మాత్రం నాకు నచ్చలేదు. అదిమా ఇంట్లో మేం పదేపదే చూసే comic series, పైగా మా బుజ్జిజింకల కిష్టమైన ట్యూన్. అనిరుద్ధుడికి చెప్పు సంగీతాన్ని పీడించే  "కొలవెరి" తగదని.

అన్నట్టు ఇంకో విషయం - నువ్వూ, నిన్నిష్టపడీ పడనట్టున్న హీరోయిన్ను ఎక్కడికో వెళ్ళిపోయి చలిలో ఉల్లిపొర పరికిణీ-స్లీవులెస్సు జాకెట్టు వేసుకుని ఆవిడా, ఫుల్లుగా కోటూ-జాకెట్టూ తొడుక్కుని నువ్వూ ఒణుక్కుంటూ మంచుకొండల్లో స్టెప్పులేయలేదు చూడు - నాకది తెగ నచ్చేసింది.

ఆ చిన్నపాపాయి చిన్నూ పుట్టింరోజుకి తనాశ పడ్డ బుల్లి సైకిలు కొన్నావు. చాలా సంతోషం. అలా చెప్పీ చెప్పని విషయాల్ని చూసి గ్రహించి నువ్వు అందర్నీ సంతోషపెట్టడం భలే బాగా అనిపించింది.

మొత్తానికి భలే గ్యాంగ్ నీది...! ఆ దేవ్‌కి ఎంత కుళ్ళో చూడు... ఎంతసేపూ నిన్ను "గ్యాంగ్‌లో ఒకడు, గ్యాంగ్‌తో ఒకడు, గ్యాంగ్‌కి ఒకడు" అంటాడే కానీ నువ్వే "గ్యాంగ్ లీడర్ " అనడానికి వాడికి నోర్రాదే ! హన్నా! మొత్తానికి వాడికి బానే బుద్ధి చెప్పావ్! సెబాసు, పెన్సిల్ పార్థసారథీ!

ఇదిగో ... నువ్వూ, నీ గ్యాంగూ భలే నడిపారు కథ. నవ్వించేటప్పుడు నవ్వించారు, మీతో పాటు ఏడ్చేలా చెయ్యకపోయినా "అయ్యో! పాపం!" అనిపించేలా చేశారు. భలే తెలివైనవాళ్లు వీళ్ళు అనిపించారు. బామ్మ భలే వుంది. అమ్మ హాయిగా వుంది. అమ్మాయిలు పద్ధతిగా చూడముచ్చటగా ఆడపిల్లల్లా వున్నారు. ఆ చిన్నూ ముద్దుగా వుంది. ఏమాటకామాట చెప్పుకోవాలి - అంటా బానే వుంది కానీ - మీరంతా ఆ రేసర్ దేవ్ గాడి కంట్లో మీరు పడే వరకూ అలా బైనాక్యూలర్స్ పట్టుకుని మరీ చూస్తూ నించోవడం అంతవసరమా? అదేదో పాత సినిమాల్ లోహీరోయిన్ను గోడ చాటుగా నిలబడి విలన్ ప్లాన్ అంతా విని కిటికీలోంచి ఆ విలన్ కంట్లో పడి "నే వెళ్లి నీ సంగతి మా హీరోతో చెప్పేస్తా" అని కష్టాల్లో పడ్డ సీన్లు నువ్వెన్ని చూసుండవ్? మరి నువ్వూ అలా చేశావేంటా అనుకున్నా కానీ పోన్లే అలా చెయ్యకపోతే నీ కథ ఎలా నడిచేదీ అని సర్దేసుకున్నా!

ఇంకో మాట - ఇంత బావున్నా, ఎంత బాగా చేసినా "అంతా బానే వుంది కానీ..." అనే వాళ్ళు ఉంటూనే వుంటారు. వాళ్ళని ఆట్టే పట్టించుకోకు. నీకు "If you give a pig a pancake... " కథ తెలుసా? ఇచ్చే కొద్దీ ఇంకేదో కావాలని అడిగే వాళ్ళెప్పుడూ వుంటారు... అవన్నీ ఇవ్వాలంటే మూడుగంటలు సరిపోదు. అలాంటి వాళ్ళకి పిగ్గూ-పేన్కేకూ కథ చెప్పి  దండమెట్టెయ్.

మొత్తానికి నే చెప్పొచ్చేదేంటంటే ... సెబాసు, పెన్సిల్ పార్థసారథీ! భలే గ్యాంగ్ నీది...!!!

ఇట్లు,
సినీ-మా-లక్ష్మి వ్రాలు


11, సెప్టెంబర్ 2019, బుధవారం

ఒకటి నుంచి పదకొండూ - సెన్ థాయీ - సెల్ఫ్‌లెస్ సెల్ఫీ

దాదాపు ఓ నెల క్రితం వచ్చింది ఓ ఈమెయిలు - ప్రస్తుతానికి మీరు మీ కంప్యూటర్లో వాడుతున్న మైక్రోసాఫ్ట్ వారి కిటికీలు ఏడు ముందుముందు చాలవు, పదికి పెంచాల్సిందే అంటూ.

అప్పట్నుంచి ఆ కిటికీలు పెంచుటలో వున్న ఆపసోపాల గురించి చెప్పిన కథ చెప్పకుండా బోల్డంత మంది బోల్డన్ని కథలు  చెప్పి "లలితా! నువ్వు మాత్రం డౌన్‌టౌన్ ఆఫీసులో వున్న ఐక్యూ బారుకి వెళ్ళు, నీ పని చులాగ్గా ఐపోతుంది" అని చెప్పారు.

అసలా ఐక్యూ బారు పేరు విన్నప్పుడల్లా ఎప్పటికైనా అదేంటో చూద్దామని.

దాని గురించి బోల్డన్ని ఊహలు కూడా - ఐక్యూ బారు అంటే ఉండీ లేనట్లుండే మన ఐక్యూని సాగదీసి బారుగా పెంచుతుందా? లేకపోతె ఏజ్‌బార్ లాగా వున్న కొంచెం ఐక్యూ కూడా ఐక్యూబార్ అయిపోతుందా? అనుకుంటూ, నాలో నేనే నవ్వుకుంటూ. 

ఎందుకంటే నేను డౌన్‌టౌన్ ఆఫీసులో పని చేసేటప్పుడీ ఐక్యూ బార్ ఉండేది కాదు. మూడేళ్లకోసారి లాప్‌టాప్ లీజ్ అయిపోయి కొత్తది తీసుకోవాలంటే ఓ రెండతస్తులు పాతాళం లోకి వెళ్లి, వైరు చుట్టల మధ్య, చెక్క బల్లల మీద చుట్టూ కంప్యూటర్లు పెట్టుకుని తలొంచుకుని పని చేసే టెక్ సపోర్ట్ వాళ్ళు కనిపించేవారు.

ఇదే మొదటిసారి ఐక్యూ బారుకి వెళ్ళడం.

ముహూర్తం ఇవాళ కుదిరింది ఐక్యూ బారుకి వెళ్ళడానికి.

ఆ ముహూర్తానికి బోల్డన్ని అంకెల్లెక్కలు కుదిరాయి...భలే!

ఇవాళ్టి తారీఖు 9/11 - సెప్టెంబర్ 11.

పొద్దున్నే ఎనిమిదింటికల్లా వచ్చిన నల్లరథంలాంటి అలెక్స్ కాబ్ ఎక్కి 1010 పైన్ రోడ్డులో వున్న మా ఆఫీసు ముందు దిగా.

తొమ్మిదింటికి  ఐక్యూ బారులో నా ఎపాయింటుమెంటు.

అక్కడ నా లాప్‌టాప్ మీద జరగబోయేది విండోస్ 10 అప్‌గ్రేడ్.

నేనెళ్ళాల్సిన  ఐక్యూ బారు మూడో అంతస్తులో.

ఆ ఐక్యూ బారులో వున్నది నలుగురు టెక్ సపోర్ట్ వాళ్ళు.


విండోస్ 10 అప్‌గ్రేడ్ కోసం నేను అక్కడ ఉన్నది ఏడు గంటలు.

వెళ్ళిన పని అయ్యి నేనింటికి వచ్చేటప్పటికి టైము సాయంత్రం ఐదు గంటలు.   

పొద్దున్న వెళ్ళగానే నా లాప్‌టాప్ ఐక్యూ బార్ వాళ్ళ పరం చేసి, నేనొక loaner లాప్‌టాప్ తీసుకుని నే చేయాల్సిన డాక్యుమెంట్ పనేదో చేసుకున్నాను రోజంతా. ఇచ్చిందో లాప్‌టాప్, పుచ్చుకుందో లాప్‌టాప్ - వెరసి రెండు అవి.

మధ్యాహ్నం లంచ్ ఎక్కడ చేద్దామా అనాలోచిస్తూ ఉండగా బదరి ఫోన్ చేశారు - "సెన్-థాయి ఆ పక్కనే వుంది. . ఆఫీసులో ఎవరైనా కలిస్తే వాళ్ళతో కలిసి వెళ్ళు" అంటూ.

సెన్-థాయి నాకు చాలా ఇష్టమైన థాయి restaurant.  కానీ నాతో రావడానికి ఎవరూ లేరు. ఒక్కదాన్నే వెళ్ళాలి. గూగుల్ మాప్స్ తెరిచి "ఎక్కడ ఎక్కడ ఉందా హోటలూ?" అని వెతికితే - అక్కడే... ఆ పక్కనే... ఆరు నిముషాల నడక దూరంలో వాషింగ్టన్ అవెన్యూలో ఉన్నట్లు కనిపించింది. 

ఫోనులో గూగుల్ మాప్స్ పెట్టుకుని వెళ్తుంటే - అదేదో రోడ్డులో ఎడం పక్కకి తిరగమంది. నేను ఎన్ని ఎడమ పక్కలు తిరిగినా గూగుల్ దారి వెళ్లాల్సిన బాణం ముక్కలోకి వెళ్ళట్లేదు.

"ఫోనుని నమ్మితే ఏముంది? మనిషిని నమ్మితే ఎంతుందో? అడిగేందుకు ప్రశ్నుంటుందీ...చెప్పేందుకు బదులుంటుందీ... చూపేందుకు దారుంటుందీ... " అని దాసరి వారి వరసలో వరసగా "ది...దీ...దీ...దీ..." పాడుకుంటూ ముందుకెళ్లి అక్కడున్న ఎవరినో వాషింగ్టన్ అవెన్యూకి ఎటెళ్ళాలీ అనడిగితే అతనికి తెలీలేదు. సెన్-థాయికి ఎలా వెళ్ళాలీ అనగానే చటుక్కున అందుకుని  ఆ దారిలోనే ఓ నాలుగు బ్లాకుల అవతల ఎడం పక్కగా వెళ్తే కనిపిస్తుంది అని చెప్పాడు.

ఓ రెండు బ్లాకులు నడిచి అక్కడ నించున్న ఇద్దరమ్మాయిలని వాషింగ్టన్ అవెన్యూ ఎక్కడా అనడిగితే వాళ్ళు నేను సరైన దార్లోనే వెళ్తున్నాను అని భరోసా ఇచ్చారు.

ఇంకొక్క బ్లాక్ దాటగానే గాలి అలల తేలి వచ్చిన థాయి-తావిల మఱఁగి మురిసిన నా ముక్కే దారి చూపింది నా కాళ్ళకి.

గబగబా లోపలికెళ్ళి  థాయి-అబ్బాయి చూపించిన ఓ మూలనున్న టేబుల్ దగ్గర కూర్చుని - థాయి-అమ్మాయి తెచ్చిచ్చిన నూడుల్స్ తినేసి వచ్చేశా.

తినే ముందు - అమెరికా వచ్చిన ఇన్నేళ్ళలో - మొట్టమొదటిసారిగా - నేనొక్కదాన్నే - నా అంతట నేనే - సెయింట్ లూయిస్  డౌన్‌టౌన్‌లో సెన్-థాయికి నడుచుకుంటూ  వెళ్ళిన గుర్తుగా ఒక ఫోటో తీసుకుందామనుకుని - ఫోన్ కెమెరా నా కేసి తిప్పుకుని - జాగ్రత్తగా నేను అందులో లేకుండా నేను కూర్చున్న టేబుల్ వెనకాల వున్న కిటికీకి సెల్ఫీ తీశా.
ఆ పైనున్న - ఓ పార్కింగ్ మీటరు, మూడు చెట్లు, నాలుక్కార్లు... - అదీ నే తీసుకున్న సెల్ఫ్‌లెస్ సెల్ఫీ.  ఆ  పార్కింగ్ మీటర్ పక్కనున్న చెట్టు కింద ముగ్గేసినట్లున్న డిజైన్ నాకు భలే నచ్చింది.


ముక్తాయింపు: 

ఈ రోజు మొదలు పెట్టిన దగ్గర్నుంచీ ఒకటి నుంచి పదకొండు అంకెలూ  వచ్చేశాయి - వరసాగ్గా... ముందూ వెనగ్గా ఏదో వరసలో...

తొమ్మిదో నెల, పదకొండో తారీఖు, ఇంటి నుంచి బయల్దేరిన ఎనిమిది గంటల టైం, విండోస్ 10 అప్‌గ్రేడ్ , మూడో అంతస్తు, నలుగురు టెక్ సపోర్ట్, ఐక్యూ బార్లో వున్న ఏడు గంటలు, ఇంటికొచ్చిన సాయంత్రం ఐదు గంటల టైం,  సెన్ థాయికి నడిచిన ఆరు నిముషాలు, ఇవాళ వాడిన రెండు లాప్‌టాప్లు - నేనొక్కదాన్ని.

నేనొక్కదాన్నే సెన్-థాయికి వెళ్ళా...
నేనే లేని సెల్ఫ్‌లెస్ సెల్ఫీ ఓటి తీశా!
అవన్నీ కలిపి - వాటి గుర్తుగా - నేటి ఈ బ్లాగ్ రాశా
"ఒకటి నుంచి పదకొండూ - సెన్ థాయీ - సెల్ఫ్‌లెస్ సెల్ఫీ" అని పేరెట్టేశా!  


7, సెప్టెంబర్ 2019, శనివారం

కాఫీ విత్ కలిమి - 7 - A friend in teens is a friend in beens అన్న ఓ Guyయాళి

ఊసుపోని ఓ ఉదయం

కనిపించని ఆన్లైను నేస్తంతో ఆడేసుకుంటున్నాడు బుజ్జిజింక. వీడు ఈ ఏడాది హైస్కూల్కి వెళ్తున్నా ఇంకా బుజ్జిజింక-ఆఫ్-ద-హౌసే!

అనుకోకుండా చేరాల్సొచ్చిన ఆఫీసు కాన్ఫరెన్సు కాల్లో గడగడ మాట్లాడేసుకుంటున్నారు ఇంటి అయ్యగారింకో వంక.

ఇంకేముంది? అప్రకటిత నిర్బంధ కర్ఫ్యూ  మొదలు ఇంట్లో.

ఈ ఇద్దరు చేసే సందడి మధ్యా గిన్నె కదిలితే టంగుమంటుందని, గరిటాడితే టింగుమంటుందని వంట కూడా వాయిదా పద్ధతుల మీద చేస్తున్నాను.

పాట పాడలేక నోరాడక, అటూ ఇటూ కదలలేక కాలాడక- అలా అని కుదురుగా ఓ చోట కూర్చోలేక సతమతమౌతున్నాను.

ఇంకిలాక్కాదని పొంగీ పొంగని చిక్కటి పాలలో ఓ చెంచాడు బ్రూ, అరచెంచాడు పంచదార కలుపుకుని కుడిచేత కాఫీకప్పు, ఎడం చేత ఇంటి ఫోను పట్టుకుని ఆట్లాడుతున్న పిల్లాడికి, మాట్లాడుతున్న పిల్లాడి తండ్రికి కొంచెం ఎడంగా కూర్చుని, ఫోన్ మీటలు నొక్కి , భూమికవతలున్న కలిమితో మాటలు కలిపా.

భలే! ఊసుపోని ఉదయం కాస్తా ఊసులాడుకున్న ఉదయమైన వైనమేమన...

 "హలో... బావున్నావా? ఇంట్లో అందరూ ఎలా వున్నారు?"

"హాలొ-హలో. బావున్నాను. ఇంట్లో బావు న్నారు, బావున్నారు. ఇంట్లో వున్న అందరూ బావున్నారు."

"హహహ... ఏంటి విశేషాలు?"

"ఇంకో మూడు వారాల్లో నిన్ను చూడబోతున్నాను - అదే విశేషం. అన్నట్టు మర్చిపోయాను చెప్పడం Belated Happy Star Birthday! ఏం చేశావీసారి? Milestone Birthday కదా!"

"Milestone అని నువ్వే అన్నావు కదా అందుకే కొన్ని స్టోన్ లేవో కొనిపెట్టారు ఇంట్లో అందరూకలిసి"

"భలే! భలే! అలా అయితే నేనూ కొనుక్కుంటా... అప్పుడు మనిద్దరం రాళ్ళు కొన్న స్నేహితురాళ్ళనిపించుకుంటాం"

"కదా?! భలే!"

"ఒక్కో పుట్టినరోజు వచ్చినప్పుడల్లా... బావుంటుంది...కానీ ఇంకా రావాల్సిన బుద్ధేదో రాలేదేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ ముందు రోజుకీ, ఆ తర్వాత రోజుకీ ఇదో రోజు తక్కువ, అదో రోజు ఎక్కువ అనిపించడం తప్ప ఇంకే మార్పూ కనిపించదు."

"నాకూ అంతే! ఒక్కోసారి అది మంచిగా వున్నట్టనిపిస్తుంది, ఇంకోసారి ఏ తేడా లేకుండా ఉండడంలో ఏదో తేడా ఉందేమో అనిపిస్తుంది"

"అబ్బే! అదేం లేదు. మనమెలా పుట్టామో అలాగే వున్నాం...వుంటాం... మారాలని ప్రయత్నించడం, మారుతామని ప్రయాస పడడం మనకంతగా నప్పదు కానీ మనమిలాగే వుందాం."

"అంతే... అంతే!"

"అందుకే .... మనిద్దరం A friend in teens is a friend in beens లాగే కంటిన్యూ అవుదాం. నా Teenage-Beenage గుర్తుంది కదా?"

"ఎందుగ్గుర్తులేదూ? నాకూ భలే నచ్చిందా మాట."

"నీకింకో సంగతి చెప్పాలి... మొన్నో రోజు ఆఫీస్‌లో కాన్ఫరెన్స్ కాలొహటి  అయిపోతూ ఉండగా ఒకతను "Okay  Guys! Let's continue tomorrrow" అనగానే నేను "Okay Guys! You "guys only" continue tomorrow. I won't join"  అన్నా! వెంటనే ... వాళ్ళు పాపం మంచబ్బాయిలు కదా... అది సీరియస్‌గా తీసేస్కుని తెగ బాధ పడిపోబోయారు "We didn't mean that" అంటూ. నే వెంటనే  'ఇహహ్హహ్హా' అని నవ్వేసి "You didn't mean it, but I took that meaning because I'm mean" అని ఆ అపార్థసారథులనీ నవ్వించేసి call ని కంచికంపా!"

"అవునూ...నేనూ నోటీస్ చేశా ... ఈ మధ్యేంటీ నువ్వు 'ఇహహ్హహ్హా' అంటూ వికటాట్టహాసం చేస్తున్నట్లు నవ్వుతున్నావ్?"

"అది వికటాట్టహాసం కాదమ్మా... నటసామ్రాట్టాట్టహాసం"

"అర్థమైంది... కౌముదికి డీఎన్నారు-ఏఎన్నారు సిరీస్ రాసిరాసి ఇలా అయ్యానంటావ్!"

"అంతేగా... అంతేగా!"

"పిల్లా! ఇలా నువ్వు తప్ప ఇంకెవరూ మాట్లాడలేరు. ఇలా తప్ప నువ్వింకెలా మాట్లాడినా మజా ఉండదు...కానియ్! నీ నటసామ్రాట్టాట్టహాసం బహు-బాగు!"

"ఇంకా వుంది ఆగు... ఆ Guys విషయం బదరికి చెప్తూ 'బావా! మీరు Guy ఐతే మీకు ఆలిని Guyయాళిని అవుతానా?' అనడిగితే తన కళ్ళు భలే మెరిశాయి 'సరిగ్గా సరిపోయింది నీ defintion నీకే!' అంటూ"

"హహ్హాహ్హా ... నువ్వు Guyయాళివే - అక్షరాలా!"

"నీ నవ్వు వినడం బావుంది...చాలా రాత్రయిందీ ...ఇంక నవ్వుకుంటూ పడుక్కో...మళ్ళీ ఎప్పుడో ఇల్లాగే కాల్చేస్తా!"

"చెయ్ చెయ్... నువ్వు కాల్చేస్తే మళ్ళీ ఇలాగే మాటలతో ఆట్లాడేసుకుని మాట్లాడేస్కుందాం!"





చివరాఖరి సిప్పు:

A friendship grown from teens to been's is a treasure to be cherished. ~meSayIt




3, సెప్టెంబర్ 2019, మంగళవారం

నే...డ్డే చదవండి - 9 - బుచ్చిబాబు





గుండాబత్తుల అచ్చమ్మగారి బుచ్చిబేబీని, 
వారింట వండాలని వచ్చిన బుచ్చిబాబు -
పాటుపడి, పాట పాడి 
నటనమాడి, నాటకమాడి 
వలపాడి, మనువాడిన వైనం  
తెలుసుకోవాలంటే...


 నే...డ్డే చదవండి...
కౌముది మాసపత్రికలో ...
సెప్టెంబర్ నెల సంచికలో...
ఈ కింది లింక్ దారి వెంబడి నడిచి అలా అలా...
సెప్టెంబర్ నెల సరదా సిన్మాయణం


 ~ సినీ-మా-లక్ష్మి వ్రాలు