26, నవంబర్ 2017, ఆదివారం

మనసే జతగా పాడిందిలే - 6 - కవలపాటలు - 500 మైళ్ళూ ... తుమ్ దేనా సాథ్ మేరా...

అసలు-పాట:

ఉబుసుపోకకో వెతికి పట్టుకున్న కబురు
తోచీ తోచని వేళకో అతికీ అతకని మాట
కాలక్షేపానికో తాళం కుదిరీ కుదరని పాట
ఇలా ఎప్పుడూ...  ఏదో ఒక వంకన...  నోరాడుతూ-పాడుతూ ఉండాల్సిందే!
కానీ అవెంతసేపని? - నోర్నెప్పుట్టదూ?

అలాంటప్పుడు - సినిమా హాలుకి దారేదీ - మనం చూడక పోరాదేదీ - అనేసుకుని - కారేసుకుని - పొలోమని ఛలో అంటూ ఇంటిల్లిపాదీ - ఇరుతరాలూ - తరలెళ్ళి - తారలాడే తెరకి కళ్ళప్పగించి - తారలు పాడే పాటలకి చెవులప్పగించి - ఇంటికి తిరిగొచ్చేవేళకి ఒకటో రెండో పల్లవుల-పల్లకీలెత్తుకుని ఉంటాము.

ఒకసారలాగే  మా ఊరి సైన్స్‌సెంటర్‌ - OMNIMAX లో అర-పుష్కరం క్రితం Rocky Mountain Express అనే సినిమా చూడడానికి వెళ్ళాం. అప్పుడు విన్నామా పాట.

వింటూనే - నా పక్కనే కూర్చున్న - వయసులో అర్థ-పుష్కరుడూ (అప్పటికి), వాక్కులో పృచ్ఛ-పుష్కలుడూ (ఇప్పటికీ...) - అయిన బుజ్జిజింక - గుసగుసగా నా చెవిలో అడిగిన ప్రశ్న " Mama! Doesn't this sound like the song that Nannagaru plays in the car?" అంటూ.

అంత చీకట్లోనూ కవల -పాటని పట్టిన వెలుగు వాడి కళ్ళలో - వాడి గొంతులో excitement వినిపిస్తున్నంత - స్పష్టంగా - కనిపించింది.

ఒక్కోసారి - అది అదే మొదటిసారి వినడమే అయినా - ఒక్కోపాట మాకు పాత చుట్టమయినట్టూ, ఎప్పటినుంచో మా చుట్టుపక్కలే ఉన్నట్టూ - మమ్మల్ని చుట్టుముట్టేస్తుంది.

అలా చుట్టుముట్టిన ఆ కమ్మటి పాటని - పదిలంగా పట్టుకుని - మా వెంటబెట్టుకుని - ఇంటికి తెచ్చేసుకున్నాం - కూనిరాగాల్లో.

ఆపాతమధురమైన ఆ పాత చుట్టంలాంటి పాట - వినగా వినగా ఎంత ఇష్టం పెరిగిందో!

ఆ పాట సందర్భాన్నిబట్టి - తానెక్కిన రైలెక్కని ఆత్మీయులని తలచుకుంటూ పాడుకుంటున్న ఆ కష్టాన్ని తలపోసుకుంటూ - ఇంటిల్లిపాదిమీ - ఏ సావకాశపు రాత్రో మళ్ళీ మళ్ళీ విని - మళ్లింకొక్కసారి - ఆ పాటని మా స్వంతం చేసేసుకుంటూ ఉంటాం - మైళ్ళకావల - అనుకున్న పళాన వెళ్ళి చూడలేని ఆప్తులని తలుచుకుంటూ...

అసలు miss కాకూడని ఆ పాట - వింటూ పాడుకోవడానికి వీలుగా ... ఇదిగో ఇక్కడ...(1960's ఆల్బమ్ నుంచి):





If you miss the train I'm on
You will know that I am gone
You can hear the whistle blow a hundred miles
A hundred miles - a hundred miles - a hundred miles - a hundred miles
You can hear the whistle blow a hundred miles

Lord, I'm one, Lord, I'm two
Lord, I'm three, Lord, I'm four
Lord, I'm five hundred miles from my home
Five hundred miles - five hundred miles - five hundred miles - five hundred miles
Lord, I'm five hundred miles from my home

Not a shirt on my back
Not a penny to my name
Lord, I can't go a-home this a-way
This a-away - this a-way -  this a-way - this a-way
Lord, I can't go a-home this a-way

If you miss the train I'm on
You will know that I am gone
You can hear the whistle blow a hundred miles

కవల-పాట:

పైది పైడిలాంటి అసలు పాటైతే - కిందది అసలుపాట పల్లవి-కూర్పుని ఒడిసిపట్టిన పసిడిలాంటి సిసలుపాట.

అసలుపాట దూరమైన వారిని గుర్తుచేసి దిగులు పెంచితే - సిసలుపాట నీకు నేనున్నాననే వారున్నారనే భరోసా పెంచి ఓదారుస్తుంది.

పల్లవి మాత్రం అసలు పాట వరసలో ఉంటుంది - కానీ చరణాలు ఇదే అసలు పాటేమో అన్నంత హాయిగా ఉంటాయి.

ఈ అసలు-సిసలైన కవలపాట జుర్మ్ (1990) లోది - రాజేష్ రోషన్ సంగీతంలో కుమార్ సాను, సాధనా సర్‌గమ్ పాడినది.

రాజేష్ రోషన్ అనగానే - మున్ముందుగా గుర్తొచ్చేవి - జూలీ - పాటలు - దిల్ క్యా కరే జబ్ కిసీ (గానా) సే,  కీసీ కో ప్యార్ హో జాయే? - ఆ పాటల ప్రేమలో పడ్డ తర్వాత పాడుకోవడం తప్ప మనమేం చేయగలదు ? ఆ మనమున్న మనమేం చేయగలం - ఆ పాటకి తలూపుతూ తాళమేయడం తప్ప?

ఆ జూలీ పాటల గాన-మాంత్రికుడే - బెంగ-పాటకి ఓదార్పు-రంగునలది - మన వీనుల విందు కావించిన వైనమేదో విందామా మరి!




జబ్ కోయి బాత్ బిగడ్ జాయే - జబ్ కోయి ముష్కిల్ పడ్ జాయే
తుమ్ దేనా సాథ్ మేరా - ఓ హమ్-నవా...
జబ్ కోయి బాత్ బిగడ్ జాయే - జబ్ కోయి ముష్కిల్ పడ్ జాయే
తుమ్ దేనా సాథ్ మేరా - ఓ హమ్-నవా ...

న  కోయి హై  న కోయి థా - జిందగీ మే తుమ్హారె సివా
తుమ్ దేనా సాథ్ మేరా - ఓ హమ్-నవా ...
తుమ్ దేనా సాథ్ మేరా - ఓ హమ్-నవా ...

హో చాంద్‌ని జబ్ తక్ రాత్ - దేతా హై హర్ కోయి సాథ్
తుమ్ మగర్ అంధేరోం మే  - న ఛోడ్‌నా మేరా హాథ్
హో చాంద్‌ని జబ్ తక్ రాత్ - దేతా హై హర్ కోఈ సాథ్
తుమ్ మగర్ అంధేరోం మే  - న ఛోడ్‌నా మేరా హాథ్

జబ్ కోయి బాత్ బిగడ్ జాయే - జబ్ కోయి ముష్కిల్ పడ్ జాయే
తుమ్ దేనా సాథ్ మేరా - ఓ హమ్-నవా...

న  కోయి హై న కోయి థా - జిందగీ మే తుమ్హారె సివా
తుమ్ దేనా సాథ్ మేరా - ఓ హమ్-నవా


వఫాదారీ కీ వో రస్‌మే -  నిభాయేంగే హమ్ తుమ్ కస్‌మే
ఏక్ భీ సాస్ జిందగీ కీ - జబ్ తక్ హో అప్‌నే బస్ మే
వఫాదారీ కీ వో రస్‌మే -  నిభాయేంగే హమ్ తుమ్ కస్‌మే
ఏక్ భీ సాస్ జిందగీ కీ - జబ్ తక్ హో అప్‌నే బస్ మే

జబ్ కోయి బాత్ బిగడ్ జాయే - జబ్ కోయి ముష్కిల్ పడ్ జాయే
తుమ్ దేనా సాథ్ మేరా - ఓ హమ్-నవా ... 


న  కోయి హై  న కోయి థా - జిందగీ మే తుమ్హారె సివా
తుమ్ దేనా సాథ్ మేరా - ఓ హమ్-నవా


దిల్ కో మేరే  హువా యకీన్ - హమ్ పెహ్‌లే భీ మిలే కహీ
సిల్‌సిలా యే సదియోం  కా - కోఈ  ఆజ్ కీ  బాత్ నహీ
దిల్ కో మేరే  హువా యకీన్ - హమ్ పెహ్‌లే భీ మిలే కహీ
సిల్‌సిలా  యే సదియోం  కా - కోయి ఆజ్ కీ  బాత్ నహీ

జబ్ కోయి బాత్ బిగడ్ జాయే - జబ్ కోయి ముష్కిల్ పడ్ జాయే
తుమ్ దేనా సాథ్ మేరా - ఓ హమ్-నవా...
జబ్ కోయి బాత్ బిగడ్ జాయే - జబ్ కోయి ముష్కిల్ పడ్ జాయే
తుమ్ దేనా సాథ్ మేరా - ఓ హమ్-నవా ...

న  కోయి హై న కోయి థా - జిందగీ మే తుమ్హారె సివా
తుమ్ దేనా సాథ్ మేరా - ఓ హమ్-నవా ...
తుమ్ దేనా సాథ్ మేరా - ఓ హమ్-నవా ...


కొస(రాగపు)మెరుపు:

మొట్టమొదటిసారిగా - 2011 లో - Rocky Mountain Expressలో అసలుపాట విని - కవలపాటని పట్టిన బుజ్జిజింక ఇంటికి వచ్చీ రాగానే - వాడి బుల్లి బేబీ-కీబోర్డ్ తీసుకుని వాడి గదిలోకి వెళ్ళాడు.

ఒక గంట సేపు .... 
టంగ్ టాంగ్ ... టాంగ్
టింగ్ టింగ్ ... టీంగ్
టుంగ్ టుంగ్...టూంగ్

ఓ గంట - టాంగ్... టీంగ్.... టూంగ్ - గానా-బజానా అయ్యాక - వాడు పట్టుకున్నది, వాడికి పట్టుబడింది - ఏంటీ అంటే - ఆ 500 మైళ్ళ పాట.

అప్పుడు నా ఫోన్ స్మార్టుదీ కాదు - ఒకవేళ అది స్మార్టుది అయినా - వాడే నేను స్మార్టు కాకపోవడం వల్ల - ఆ కీబోర్డుమీద 500 మైళ్ళు-మొదటి-క్షణాన్ని పట్టుకోలేకయాను.

ఇవాళ - ఈ కవలపాటల పోస్ట్ రాస్తూ - బుజ్జిజింకని బతిమిలాడితే - నాకోసం ఎక్కడో దాచివుంచిన ఆ బేబీ-కీబోర్డ్ బేస్‌మెంట్‌లోంచి - మళ్ళీ పైకి తెచ్చి - వాడి వేళ్ళు, కీబోర్డ్ మెట్లూ మాత్రమే రికార్డ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకుని - వాడి మూడ్ మారిపోయేలోగా - గబగబా - ఆట్టే రీటేకులు అడక్కుండా ఫోన్లో ఒడిసిపట్టేసి యూట్యూబ్లో అట్టేపెట్టేసుకున్నా... 




అసలుపాట
సిసలైన కవలపాట
కొస(రాగపు)మెరుపు పాట
పాటల వరస  ఇదట
మీరు వినడమే తరువాయట
మీరలా వింటుంటే... నేనిలా ఉంటుంటూ...
మరెన్నో పాటలనందిస్తానట ...

Stay tuned ...

~పాటల భైరవి

23, నవంబర్ 2017, గురువారం

సౌజన్యానికో పూలపోగు...

తానా సంబరాలు ముగిసి దాదాపు ఆరునెలలు అయింది.
అప్పటి తానాలో పాల్గొన్నది నేనా?
అది నిజమేనా ?
నే కలగన్నానా?
ఆ కలని కలిమిలా దాచుకొందునా!
ఆ కలిమి పంచిన చెలిమిని కలలోనైనా మరువకుందునా !
ఆ చెలిమి పెంచిన కూరిమిని కలకాలం నిలుపుకుందునా?!

తానాని తలుచుకున్న ప్రతీసారీ ఇప్పటికీ ఇలాగే అనిపిస్తుంది ... 

తానా సమావేశాల్లో నాకు దక్కిన లాభం - కొన్ని అపురూప పరిచయాలు, ఇంకొన్ని ఆత్మీయ సాహచర్యాలు.

అందులో కొన్ని ఎదురెళ్ళి మరీ చేయి చాపి అందుకున్నవైతే - అనుకోకుండా దొరికిన వరాలు కొన్ని.

ఇంకొన్ని - అందుకుందామని మనసైనా - అవతలివారు పేరున్నవారు, పేరెన్నికగన్నవారు, సమావేశాల నిర్వహణలోనో, కార్యవర్గంలోనో సతమతమవుతున్నవారు - వెళ్ళి పలకరించాలా? పలకరించి ఏమని చెప్పుకోవాలి నా ప్రవర?

నేను ఫలానా ... నేను చేసేది ఫలానా ... ఇక్కడికొచ్చిన కారణం ఫలానా... అని చెప్పుకుని
మీ రాత ఇష్టం... అనో
మీ చేత ఘనం ... అనో
మీ పాట ప్రియం ... అనో - అని అన్న తర్వాత ఇంకేంటి?
ఇంకేం మిగిలింది?
అరె ...అసలేం గుర్తుకు రావే?
అసలేం చెప్పాలని ... ఏం అనిపించుకోవాలని వచ్చాను?

కొలనున రాయి వేస్తే చెదిరే అలలలాంటి పరిచయాలు, రెప్పపాటులో మది మరుగున మాటుమణిగే ఎఱుకలు - ఆ చిన్నపాటి అలజడి, కొన్ని కబుర్ల అలికిడి - నవ్వు పూసుకుని నాలుగు కబుర్లాడి వెనుదిరిగిన మరు నిముషంలో చెరిగిపోయే రూప-ముద్రలు, గడిచిపోయే భావ-ముద్రలు - అంతంత మాత్రపు సాంగత్యాలు అవసరమా?

అదిగో - అలా అనుకునే - ఉంటే కన్వెన్షన్ సెంటర్ - నూటముప్ఫైరెండవ గదిలో - లేకపోతే వచ్చిన సాహితీమూర్తులైన అతిథులకి కబురో - కాలక్షేపమో అందిస్తూ వారి వెంట నడవడమో తప్ప - తానాలో నా ఉనికిని ఎవరికీ తెలిపిందీ లేదు - ఇంకెవరి తానకి ఉరికిందీ లేదు.

అందులోనూ - అక్కడకు వచ్చిన వారు ఎవరి ప్రతిభాకాశానికి వారు తారలైనటువంటి వారు. మింటనున్న తారలను చూసి మురిసే నేను - ఈ భువి-తారలని చూసీ - చూశానని మురిశాను - అంతే!

తానా అయిపోయింది - నాకు తోచిన నాలుగు కబుర్లు రాయడం అయింది - ఇంకొన్ని రాయాలని పక్కన పెట్టడమూ అయింది. పక్కన పెట్టిన కబుర్లని జ్ఞాపకపు మాటు నుండి బయటికి తెచ్చి జ్ఞాపికగా రాసుకోవడానికి తగిన తీరిక దొరికే సెలవు రోజుల కోసం ఎదురు చూడడమూ - ఇంకా వుంది.

ఇలా తానా-తో నా జ్ఞాపకాలని నెమరు వేసుకున్న సందర్భాలెన్నో - ఈ ఆరు నెలల్లో.

నా తానా-తలుపుల ముచ్చటకి ఆసరాగా, ఆ సంబరానికి కొనసాగింపా అన్నట్లుగా రెండు వారాల క్రితం నా ఈ-మెయిల్లో ఒక ఆహ్వాన పత్రిక...






ఈ ఆహ్వానం చూడగానే - మళ్ళీ ఆలోచన.

పుస్తకాల మీద, తెలుగు అక్షరం మీద మక్కువతో - మంచి సాహిత్యాన్ని సృజించిన కవులని, రచయితలని ఒక్క చోట కలవగలిగే అపురూప వేదిక అని ఆశపడి - ఎదురొచ్చి మరీ పసుపులేటి రవిగారు అందించిన అవకాశాన్ని చాలా సంబరంగా అందుకున్నాను తానా-సాహిత్య సమితిలో ఒక చిన్న వలంటీరుగా.  ఒక్క రెండు రోజులు తానాలో పాలు పంచుకోగలగడమే పెద్ద achievement నాకు.

అందులోనూ ఆ రెండు రోజుల్లో కానీ, అంతకు ముందు కానీ చౌదరిగారి దంపతులని కలిసింది లేదు - వారికి నేను నామమాత్రంగా కూడా తెలిసే అవకాశమే లేదు. అందులోనూ వారిది మా వూరు కాదు - కారు-దారిలో వెళ్తే ఐదుగంటలు, కారు-మేఘపు దారిలో అయితే ఒక గంట లెక్కెట్టే దూరంలో ఉన్న షికాగో నగరం.  నాకందింది - షికాగో నుంచి వచ్చి మా ఊళ్ళో ఇవ్వబోతున్న విందుకి ఆహ్వానం.

నాకు అందిన ఈ ఆహ్వానాన్ని ఎలా తీసుకోవాలో నిజంగా తెలీలేదు నాకు. ముందు వెళ్ళొద్దనే అనుకున్నాను. మళ్ళీ బదరితో చెప్పినప్పుడు తను "వెళ్తే బావుంటుంది - మన తెలుగు వారినీ, తెలిసిన వారినీ కలిసినట్టు ఉంటుంది" - అంటే సరే! వెళ్దామంటే వెళ్దామని అనేసుకున్నాం.

ఎలాగూ వెళ్దామనుకున్నాం కదా - కొంచెం ముందుగా పరిచయం చేసుకుందాం అని - నా తానా బ్లాగ్ పోస్టుల లింకులు జంపాల చౌదరి గారికి పంపించాను. అంతకు ముందు ఒకసారి తెలుగునాడి గురించి రాసినప్పుడు పంపిన ఈ-మెయిల్‌ని గుర్తు చేస్తూ.

[తెలుగునాడి గురించి నేనెప్పుడో రాసిన కొన్ని కబుర్లు ఈ లింకులో చదవచ్చు: (ప్రవాసాంధ్ర భాషా జీవ నాడి - తెలుగు నాడి)]

తీరా వెళ్ళే సమయానికి బుజ్జిజింక రానన్నాడు - "నిజమే కదా పాపం వాడికి అక్కడ bore కొడుతుంది" అని వాడికి తోడుగా ఉండడానికి, వాడితో ఆడుకోవడానికి - తనింట్లో ఉంటానని చెప్పి - నన్ను మహాత్మాగాంధి సెంటర్ దగ్గర దింపి ఇంటికి వెళ్ళారు బదరి.

పన్నెండింటికి రమ్మని ఆహ్వానంలో ఉంటే - మరీ పన్నెండింటికే వెళ్తే - నేనొక్కదాన్నే అవుతానేమోనని - పన్నెండు దాటింతర్వాత పది నిముషాలకి - కొంచెం మొహమాట పడుతూనే వెళ్ళాను.

నన్నేమని చెప్పుకోవాలా అనుకుంటూ - ఆలోచిస్తూ గుమ్మం దగ్గరే ఆగాను.

అప్పటికే జంపాల చౌదరిగారు, వారి శ్రీమతి అరుణగారు - వచ్చిన వారిని పలకరిస్తూ, కుశలమడుగుతూ వున్నారు.

నేను కొంచెం పక్కగా నించుని వారిని పలకరించడానికి నా వంతు కోసం ఎదురుచూస్తున్నాను.

ఇంతలో చౌదరిగారు నా వైపు చూసి - అరుణగారిని పిలిచి నావైపుగా కదిలారు - "నమస్తే! నేను లలితనండి. సాహిత్య కమిటీలో వలంటీర్ని"- అనగానే - అరుణగారు - నా చేయి పట్టుకుని - "మనందరమూ వలంటీర్లమేనండి. రండి. ఇప్పటివరకు మిమ్మల్ని కలవలేకపోయాను" అని నొచ్చుకున్నారు.

పక్కనే వున్న appetizer తీసుకోమని చెప్పి - ఇంతలో వచ్సిన వారిని పలకరించడానికి ఆ దంపతులిద్దరూ జంటగా వెళ్ళారు.

నేను లోపలి వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చుని తెలిసినవాళ్ళు ఎవరైనా వచ్చారా అని చుట్టూ చూస్తూ వున్నాను.

ఇంతలో అరుణగారు ఒక ప్లేట్లో appetizer పెట్టి తీసుకుని నా దగ్గరికి వచ్చారు - "మీరిది తీసుకోకుండానే వచ్చారు - ఇప్పుడు తీసుకోండి" - అంటూ - అదేదో - నేను వారింటికి వచ్చిన ప్రత్యేక అతిథిలా.

నాకు నిజంగా ఆశ్చర్యంగా, సంభ్రమంగా అనిపించింది - ఆ క్షణం వరకు నేనెవరో కూడా ఆవిడకి తెలీదు. కానీ ఎంత ఆత్మీయంగా మాట్లాడారో మాటల్లో చెప్పలేను.

తానా సమావేశాలు జరిగిన ప్రతీ చోటా - అక్కడి వలంటీర్లందరితో కలిసి ఒక కుటుంబంలా పని చేసేవారో చెప్తూ సెయింట్‌లూయిస్‌లో - రకరకాల కారణాల వలన - అలా జరిగే అవకాశం లేకపోయినందుకు చాలా నొచ్చుకున్నరావిడ.

నేను కూడా ముందు రావాలనుకోకపోయినా - ఇప్పుడు వచ్చినందుకు, వారి దంపతులని స్వయంగా కలవగలిగినందుకు ఎంత ఆనందంగా వుందో చెప్తే చాలా సంతోషించారావిడ.

ఒక మూడున్నర గంటలసేపు అక్కడ అందరితో మనసారా మాట్లాడి, కడుపారా భోంచేసి  - వచ్చేసేముందు జంపాల చౌదరిగారికి, అరుణగారికి కృతజ్ఞతలు చెప్పి - ఒక మంచి-ఆదివారపు-జ్ఞాపకాన్ని నాతో తెచ్చుకున్నాను.

రాగానే బదరికి చెప్పాను - "తానా అయిపోయింది. అసలు జరిగిందన్న విషయమే ఒక జ్ఞాపకంలా మిగిలింది. తానా సమావేశాలని ఇష్టపడి, కష్టానికోర్చి నిర్వహించారు. వాళ్ళేమీ మన ఊరివాళ్ళూ కాదు - రేపెక్కడో కలిసి అడుగుతామేమో అన్న మొహమాటపడాల్సిన అవసరం ఉన్నవాళ్ళూ కాదు. కానీ ఏదో ఒక ఆత్మీయబంధాన్ని నెరవేర్చలేకపోయామన్న తలపుతో - వెనక్కి వచ్చి అందరినీ ఇంకొక్కసారి కలిసి - పేరుపేరునా పలకరించి, స్నేహపు-పన్నీరు చిలకరించి వెళ్ళారు. మరువలేనింక వాళ్ళని - వారి సౌజన్యాన్ని" - అంటూ.


ఘనమైన ఉనికి ఎందరిదో
మదికి సోకే ఆ ఉనికి యెఱుక - ఆ ఎందరినో ఎఱిగిన అందరిదీ
ఆ ఎఱుకలో మన్నికైన ఎన్నిక కొందరిదే  
ఆ ఎన్నికలో అనుపమైన ఎంపిక మాత్రం - అంతులేని సౌజన్యం ఉన్న వారికి...
అరుణగారు, చౌదరిగారి లాంటి - నూటికో కోటికో ఒకరిద్దరికి... 
అందరాని ఆకాశంలో ఉన్న చంద్రునికైతే నూలుపోగు -
మరి అంతులేని సౌజన్యం వున్నవారికేమివ్వగలం?
సౌజన్యానికో పూలపోగు ...


19, నవంబర్ 2017, ఆదివారం

త్వామనురజామి - 19 - बोलనంత సేపు స్నేహమా - నేను बोలాక కోపమా?

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 18 - పాడకున్న ఏమిలే - చదివేద్దాం రాతలే! 


పట్టాల వెంబడి చీకటి దారిని కొలుస్తూ వెళ్తున్న రైలు -
చుట్టం నేను - మామనని - నీ వెంటే నేనని - వెంట వస్తున్న ౘందమామ -
పట్టపగటిని మరపించేలా కాకపోయినా - చిమ్మచీకటి లేకుండా - కాసింత వెలుతురు కురిపిస్తూ కాస్తున్న వెన్నెల -

కట్టెదుట కాయితమ్మీద కలం కదులుతూ - "Now I have a surprise for you " అని రాసి - మళ్ళీ కాసేపు ఆగి - వేళ్ళ మధ్య పెన్ను కదుపుతూ - కాయితమ్మీద ఏదో రాయబోతూ... ఆగుతూ -
పట్టరాని ఉత్సుకతనూ - ఉద్వేగాన్ని కలిగిస్తుంటే  -

చుట్టుముట్టి వున్న నిశ్శబ్దానికి తోడు  - నిలవనీయని కలవరమో - సద్దు లేని కోలాహలమో - హద్దు దాటనీని కలకలమో ...
పట్టనట్లో, పట్టించుకోనట్లో ఉండాలన్నా ఉండనీయక -
టిక్... టిక్... టిక్... టిక్...

అదేంటో - మామూలుగా ఎప్పుడూ పట్టించుకోకపోయినా - ఇప్పుడు మాత్రం - నా  చేతికున్న వాచ్‌లోంచి నా గుండె చప్పుడేమో అన్నట్టుగా వినిపిస్తున్న సెకండ్ల ముల్లు చప్పుడు -

రాయబోయి ఆగుతున్న పెన్నుని చూసి - పెరుగుతున్న adrenaline rush -

దాంతో ఇంకుండలేక - హడావిడిగా పేపర్ లాగేసుకుని - "Tell me what it is - I really don't like suspense even in books - that's why I read the ending first. I wish you could speak. I wish you could say something"

- అంటూ గబగబా - మనసులోని ఉద్వేగం రాస్తున్న చేతులని వణికిస్తుంటే - వంకరటింకర రాతల్లో రాస్తూ నేను -

టిక్... టిక్... టిక్... టిక్...

వాచ్‌లో పెద్దముల్లు, చిన్నముల్లు పన్నెండు మీదికి చేరుతూ వున్నాయి....

కళ్ళజోడు ముక్కు మీద జారుతుంటే ఎడం చేతి చూపుడువేలు-మధ్య వేలు జతకట్టి దాన్ని పైకి నెట్టుకుంటూ ...
రాస్తున్న పెన్నునాపి - నెమ్మదిగా తలెత్తి... పెదవులమీంచి కళ్ళలోకి పాకుతున్న నవ్వుతో - ఆ నవ్వు పూస్తున్న మెరుపుతో మెరుస్తున్న కళ్ళతో - నాకేసి చూస్తూ - ఇంతలో తల వంచి - తన చేతికున్న వాచ్ చూసుకుని ...

సరిగ్గా -  పన్నెండింటికి - మృదుమేఘధ్వని - నిశ్శబ్దంలోంచి నా చెవులకి మాత్రమే వినిపించేలా - "What shall I say?" - అంటూ.

అప్పటిదాకా చుట్టమే అనిపించిన  ౘందమామ, చుట్టూ కాస్తూ వెలుతురనిపించిన వెన్నెల - ఉన్నట్టుండి ఒక్కసారిగా హారర్ సినిమాలో సీనులా అనిపించేసి  - అసలే అర్థరాత్రి పన్నెడుగంటల టైం - ఒక్క రెండు క్షణాల్లో - నాకెన్ని పాటలు గుర్తొచ్చాయంటే ...

వేటగాడు సినిమాలోంచి "ఇది పువ్వులు పూయని తోట" అని పాడేస్తున్న శ్రీదేవి వాళ్ళమ్మ -
నవమోహిని సినిమాలోంచి "ఎవరో ఎవరో నను చేరేవారెవరో" అంటూ ఉయ్యాలూగేస్తున్న రోహిణి -
అంతస్తులు సినిమాలో "నిను వీడని నీడను నేను...ఓ ఓ ఓ " అని రాగాల్తీసేస్తున్న పీసుశీల -
బీస్సాల్బాద్ సినిమాలో "కహి దీప్ జలే కహి దిల్ " అంటూ గజ్జెలు కట్టుకుని పరిగెడుతున్న వహీదా రెహ్మాన్ -

అప్పటిదాకా మాట్లాడగలిగితే బావుండును అనుకున్న మూగబ్బాయి ఒక్కటంటే ఒక్క ప్రశ్న వేయగానే - హడలిపోయి - literally ఏడ్చేశాను - ముందు ఒక్క క్షణం భయంతో - అదేదో సినిమాల్లో అర్థరాత్రి పన్నెండింటికి గడియారం గంటలు కొట్టగానే - మొదలయ్యే దెయ్యాల మాయలాంటిదేమో ఈ మూగబ్బాయిని మాట్లాడించింది  అనేసుకుని - తర్వాత ఉక్రోషంతో - అంత అమాయకంగా నమ్మేశానని.

వెంటనే పళ్ళు బిగపెట్టి కోపాన్నాపుకుంటూ - కళ్ళు తుడుచుకుంటూ - చాలా నెమ్మదిగా, మెల్లిగా - తనకి మాత్రమే వినబడేలా చెప్పాను - "పొద్దున్న గుంటూర్లో ట్రెయిన్ దిగేదాకా మాట్లాడడానికి వీల్లేదు. నన్నింక మా ఫ్రెండ్స్ తెగ tease చేస్తారు. ముఖ్యంగా నిరుపమ తిడుతుంది - తను చెప్తూనే వుంది - నేనే పిచ్చిదానిలా వినలేదు" - అంటూ.

తను అదే నవ్వుతో - ఏమీ మాట్లాడకుండా తలూపి - మేమప్పటివరకూ మాటల్రాసుకున్నకాయితమ్మీద Good Night, బుజ్జాయ్! అని రాసేసి తన బెర్త్ మీద కెక్కేసి పడుకున్నాడు.

నేనూ - "ఛ! నేనెందుకలా ఏడ్చాను - మరీ చిన్నపిల్లలా?!"- అని నన్ను నేనే తిట్టుకుంటూ - "పొద్దున్న లేవగానే ట్రెయిన్ దిగి అందరం ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోయేదాకా ఆ అబ్బాయి మాట్లాడకుండా ఉంటే బావుండును" - అని అనుకుంటూనే - "అమ్మో - నాకు చెప్పిన మాట మర్చిపోయి మాట్లాడేస్తే ఎలా?" అని బెంగ పెట్టేసుకుంటూ - రామ స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం - శయనేయ పఠేన్నిత్యం దుస్స్వప్నం తస్య నశ్యతి - అని చిన్నప్పుడు పడుకునే ముందు నాన్నమ్మ చెప్పించే శ్లోకం చదివేసుకుని - హారర్-ౘందమామ కళ్ళలో పడకుండా- కిటికీకి ఇవతలికి తిరిగి పడుకుండిపోయాను.

తెల్లవారినట్టుంది.

హఠాత్తుగా - మెలకువ వచ్చింది.

చుట్టూ సందడి.

పడుకుని వున్న నా పక్కనుంచి ఒకళ్ళొకళ్ళుగా సన్నగా మాట్లాడుకుంటూ ట్రెయిన్ దిగుతున్నారు.

నేనూ గబగబా లేచి - "అమ్మో - గుంటూరొచ్చేసినట్టుంది - గబగబా దిగాలి - అనుకుంటూ - నేను కప్పుకున్న దుప్పటి మడతేస్తుంటే - కిటికీ కవతల మా కాలేజ్ అమ్మాయిలు దిగి నించుని కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు.

తీరా చూస్తే అది తెనాలి స్టేషన్. ఎందుకో ఆ రోజు ఎప్పటికన్నా ఎక్కువసేపు ఆగింది ట్రెయిన్ అక్కడ.

ఇంతలో - ఆ న-మూగబ్బాయి ఎప్పుడులేచాడో - వెళ్ళి బ్రష్ చేసుకుని వస్తూ కనిపించాడు.

నన్ను చూస్తూనే - మళ్ళీ ఒక నవ్వు వరంగా ఇచ్చేసి - ప్లాట్‌ఫాం మీదకి వెళ్దామా - అన్నట్టు - తలని కుడిపక్కగా వంచి సైగ చేశాడు.

ఈ పూటకి అతనెక్కడ ఉంటే నేనూ అక్కడే ఉంటేనే మంచిది - మాట్లాడకుండా కాపు కాయొచ్చు అనుకుని - నేనూ తలూపి తనతో పాటు ట్రెయిన్ దిగాను.

మా కాలేజ్ అమ్మాయిలు కొంత మందికి అప్పటికే అపార్థమైపోయింది - మా మధ్య పరిచయం మూగమనుషుల మూకాభినయం స్థాయి దాటి మూగమనసుల మూగానుబంధం దాకా వెళ్ళిందనేసుకున్నారు.

నాకు మాత్రం ఈ పూట గడిస్తే చాలు - వాళ్ళేమైనా అనుకోనీ - అని ఆట్టే పట్టించుకోకుండా - నిశ్శబ్దంగా ఆ అబ్బాయి పక్కన నడుస్తూ ప్లాట్‌ఫాం మీద ఆ చివరి నుంచి ఈ చివరికి ఊరికే తిరుతున్నాను. (ఆ అబ్బాయి పేరు అప్పటికి మా పేప-రిచయాల వల్ల తెలిసినా - మాట్లాడే అవకాశం లేదు కాబట్టి పిలవలేదు ఆ రోజుకి - అందుకని ఆలోచనల్లో కూడా అనుకోకుండా "అబ్బాయి" గానే తలుచుకున్నాను - ఆ రోజుకి).

ఇంతలో-ముందు రాత్రి మా కబుర్లు చదివిన గిరిరాజ్ కూడా వచ్చి చేరాడు మాతో.

మేము సైలెంట్‌గా నడుస్తున్నాము - నడుస్తూనే వున్నాము.

గిరిరాజ్ మా ఇద్దరి మొహాలు చూస్తూ తనూ సైలెంట్‌గానే నడుస్తూ - మధ్యమధ్యలో నన్నేదో అడగబోయినా - నాకసలే ఉక్రోషంగా ఉందేమో - నేనంత ఫ్రెండ్లీగా మాట్లాడలేదు.

ఒక రెండు రౌండ్లు నడవగానే - ఈలోగా ట్రెయిన్ - నేనింక బయలుదేరుతున్నాను ఎక్కండింక - అంటూ కూసింది.

"హమ్మయ్య - ఇంకెంత ఒగ్గంటలో గుంటూర్లో దిగేస్తాం - ఈ మౌనవ్రతం బాధ తప్పుతుంది" అనేసుకుని ఇంకాట్టే శబ్దం చేయకుండా నా సైడ్-బెర్త్‌లో కూర్చుని కిటికీలోంచి బయటికి చూస్తూ - చూపు నా ముందున్న అబ్బాయిమీదకి అస్సలు పోనీయకుండా - ఎన్ని చెట్లు, కరెంటుస్తంభాలు లెక్కపెట్టానో లెక్కే లేదు.

ఈ లోగా రానే వచ్చింది - గుంటూరు స్టేషన్.

అంతదూరం నుంచే - కిటికీలోంచి - ప్లాట్‌ఫాం మీద నించుని - ఆగుతూ ఉన్న ట్రెయిన్‌లో ముందుకు వెళ్తున్న బోగీలని చూస్తూ - నా కంపార్ట్‌మెంట్ ఏదో అని తొంగి చూస్తున్న - నాన్న, పప్పి, కుట్టి, ప్రశాంతి కనిపించారు.

వాళ్ళని చూస్తూనే సంబరంగా చెయ్యూపేసి - శృంఖల-విముక్త-సూట్కేసుని పట్టుకుని - నేను దాన్ని మోస్తున్నానో, నన్ను అది లాక్కెళ్తోందో - పెద్ద పట్టించుకోకుండా నా బోగీ తలుపు దగ్గరికి వెళ్ళి నించున్నాను.

ట్రెయిన్ ఆగింది. నాన్న నా సూట్కేసుని, కుట్టి నా బాగ్గుని అందుకున్నారు.

పప్పి, కుట్టీలతో - కబుర్లు మొదలెట్టేసి - "ప్రశాంతి, దొడ్డ ఎప్పుడొచ్చారు? శ్రీనొచ్చాడా? బాబొస్తున్నాడా? పాపాయత్తయ్య వస్తాన్నారు - వచ్చారా?" - ఇలా అడిగేస్తూ ఉంటే - నాన్న - "ముందింటికి పద - తర్వాత సావకాశంగా మాట్లాడుకోవచ్చు" - అంటూ ముందుకి నడిచారు - మమ్మల్ని నడిపించారు.

నాన్న వెనకాల నడుస్తుంటే - కుట్టి నా పక్కకి వచ్చి - చెవి దగ్గర నెమ్మదిగా - "ఆ అబ్బాయేవరే బాబూ - నీకేసి అలా చూసేస్తున్నాడు?" అంటూ చూపించింది.

నేనటు చూసీ చూడనట్టు చూసి - "ఏమో నాకేం తెల్సు? పద" అనేసి మనసులో మాత్రం ... "నాకు bye చెప్పాలని అనుకున్నాడేమో - అందుకే అలా చూశాడేమో" అనుకుంటూ...

చెప్పాలనుకున్నావని  తెలిసి
చెప్తే కుదరదని తెలిసి
సతమతమైనామందుకే
కలిసి..  కలిసి కలిసి...

- అని పాడుకుంటూ ...కుంటూ ... కుంటూ - నేనింటికి.... వెళ్తుంటే...

ఆ టైటిల్ చరణం లైను ఏ పాటలోదో, ఈ కొసరు పాటేమిటో ననుకుంటూ - కనిపెట్టి పట్టి నాకు చెప్పి పాడుకుంటూ ...కుంటూ... కుంటూ - నా బ్లాగింట మీరుంటూ... ఉంటే ...

<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

10, నవంబర్ 2017, శుక్రవారం

Praveen Sattaru's Vision - PSV గరుడవేగ

కిందటి శుక్రవారం - అనుకోకుండా - అప్పటికప్పుడు అనేసుకుని - శనివారం నాడు వెళ్ళి - ఇంకో సినిమా చూసేశాం.

నెలలో మొదటి శుక్రవారం - బదరి స్నేహితులతో కులాసాగా గడుపు వారం.

బుజ్జిజింకా, నేనూ - Lego కబుర్లు చెప్పుకుంటూ మా సాయంకాలాన్ని కాలక్షేపం చేశాం.

ఇంటికి వస్తూనే బదరి చెప్పారు - "రాజశేఖర్ కొత్త సినిమా గరుడవేగ బావుందట - రేపు వెళ్దాం" - అని.

అమ్మో -  ఇంకో తెలుగు సినిమా అంటే బుజ్జిజింకని ఎన్ని కబుర్లు చెప్పి ఏమార్చాలో అనుకుంటూ - "అబ్బా అదేదో స్పై-థ్రిల్లర్ అని చదివాను - నాకలాంటివి నచ్చవు - ఓ ఆటా, పాటా, నవ్వులూ, రంగురంగుల పువ్వుల డ్రెస్సులూ  ఏమీ ఉండవు - ఈసారికి వద్దు" అంటూ నేనంటే -

"పాపం! కొత్తగా ట్రై చేశారట. చాలా బావుందట - ఈ మధ్య రాజశేఖర్‌కి అసలేం హిట్లు లేవట" అంటూ బదరి -

మొత్తానికి మా ఇంకో సినీ-ఓదార్పు-యాత్రకి అంకురారోపణ జరిగింది.

శనివారం మధ్యాహ్నం భోజనాలయేదాకా సినిమా మాటే ఎత్తలేదు నేను.

నా శనివారపు siesta అయి వచ్చేటప్పటికి - Destiny 2 ఆడుకుంటూ తనయుడు,  పక్కనే కూర్చుని వాడి ఆట చూస్తూ తండ్రి - కనిపించారు.

అప్పటికే సినిమాకి వెళ్దామా అని నాన్నగారు అడుగుటలూ, బుజ్జిజింక ఒడబడుటలూ - అన్నీ పూర్తయినట్టున్నాయి. 

నాకా సంగతి తెలీదు కదా - కొంచెం నెమ్మదిగానే - "ఇంతకీ ఇవాళ సాయంత్రం వెళ్తున్నామా సినిమాకి?" - అన్నానో లేదో - బుజ్జిజింక వాడి ఆట నుంచి తల తిప్పకుండానే - "వెళ్తున్నాం" - అంటూనే - "అమ్మా! నీకు ఎప్పట్నుంచీ కొరియన్ వార్ సినిమాలంటే ఇష్టం మొదలైంది?" - అనడిగాడు.

ఇంకా ఇలా కూడా అన్నాడు - "This movie's name sounds like the courier service that brings Ammamma's ఆవకాయ." -  అలా అంటూ - TORI లో వచ్చే గరుడవేగ కమర్షియల్ మొత్తం చెప్పాడు.

అప్పుడర్థమయింది - అంత తొందరగా వాడెలా ఒప్పుకున్నాడో - వాడు అదేదో - వారు , స్పైయ్యింగు - అని ఒప్పేసుకున్నాడు.

మొదటిసారిగా - effortlessగా -  చా...లా శాంతియుతంగా మా సినిమా-యాత్ర మొదలు.

సాయంత్రం చుక్క పొడిచీ పొడవకుండానే - ఆమ్ వండేసుకుని - నీకో ముద్ద, నాకో ముద్ద అనుకుంటూ తినేసి - ఆపిన స్టవ్వే ఆపానా లేదా అని చూసుకుని -  వేసిన తాళమే వేశామా లేదా అని తీసి వేసుకుని - తెల్లదీ, పెట్రోల్  తాగుటలో ఇంద్రుని వాహనానికి దీటైనదీ - అయిన మా కారైరావతాన్నెక్కి హుషారుగా సినీ-షికారు బయల్దేరాం - ఎనిమిదిన్నరకే.

తొలాట కాని మలాట తొమ్మిదింటికే మరి - తొక్కిసలాట ఉండదు కానీ పేర్లు పడే దగ్గర్నుంచీ సైన్మా చూస్తే ఆ మజాయే వేరు కదా మరి!

తీరా వెళ్ళేటప్పటికి - టికెట్ క్యూలో మా ముందున్న జంటకి ఆ కౌంటర్‌లో వున్న అబ్బాయి ముందున్న కుర్చీల-అమరిక-తెర మీద ఏదో చూపిస్తూ ఉంటే వాళ్ళు తల అడ్డంగా ఊపి బయటికి వచ్చేయడం కనిపించింది.

వాళ్ళ వెనకాలే వున్న బదరి - వాళ్ళు క్యూలోంచి ఇవతలికి రాగానే - తను ముందుకు వెళ్ళి ఆ టిక్కెటబ్బాయికి - నేనూ, మా బుజ్జాయి, మా బుజ్జిజింక వచ్చాము - అని ఎప్పుడో పెళ్లిరోజున గుమ్మం దగ్గర పేర్లు చెప్పినట్టు చెప్పగానే - టికెటబ్బాయి అడ్డంగా తలూపేశాడు - మా హాలులో సీట్లున్నవి ఇద్దరికే - అవి కూడా తొట్టతొలి వరసలో - అంటూ.

ఇంకేం చేస్తాం - ఇంటికెళ్ళిపోదాం అంటే - పాపం బదరి  - నేను నిజంగా డిజప్పాయింట్  అయిన దానికన్నా -  నేను  డిజప్పాయింట్ అయాననుకుని తను ఎక్కువ డిజప్పాయింట్ అయ్యారు  - "అయ్యో! సినిమాకొచ్చి చూడకుండా వెళ్ళిపోతే ఎలా ?"- అంటూ.

అప్పటికప్పుడు - ఆన్‌లైన్‌లో వెతికి దగ్గర్లో వున్న ఇంకో థియేటర్‌లో ఉన్న ఆమిర్‌ఖాన్ - సీక్రెట్ సూపర్‌స్టార్‌కి వెళ్దామన్నారు కానీ - నేను వద్దనేటప్పటికి ఇంటికి వచ్చేద్దామని బయల్దేరామో లేదో - అప్పుడే లోపలి వస్తున్న హనుమత్‌ప్రసాద్ కనిపించి పలకరించారు. తనతో ఒక రెండు నిముషాలు మాట్లాడి కారెక్కి ఇంటి దారి పట్టాము - పోన్లే రాజశేఖర్ సినిమా సోల్డ్-ఔట్ అంటే తెలుగు సినిమాకి మంచి సూచనే అనుకుంటూ.

తిరుగు-సవారీలోఅంతా నిశ్శబ్దం.

సరిగ్గా ఒక  పదిహేను నిముషాల్లో ...ట్రింగ్..ట్రింగ్....ట్రింగ్....ట్..ర్...ర్...ర్రింగ్ అంటూ బదరి ఫోన్ మోగింది.

నేను తీసేలోగా కట్ అయింది - ఎవరి దగ్గర్నుంచా అని చూస్తే - హనుమత్‌ప్రసాద్.

ఎందుకు చేశారో అనుకుంటూనే బదరి వెంటనే కాల్ చేస్తే - అవతల్నుంచి చెప్పారతను - ఈ థియేటర్ సోల్డ్-ఔట్ అని పక్కనే ఇంకో థియేటర్‌లో తొమ్మిదింపావుకి ఇంకో షో వేస్తున్నారని - వీలైతే ఆన్‌లైన్‌లో వెంటనే టికెట్లు బుక్ చేసుకోమని చెప్పారు.

నిజం చెప్పాలంటే - రాజశేఖర్ సినిమా సోల్డ్-ఔట్ అయి - వెంటనే ఇంకో థియేటర్ అదనంగా అప్పటికప్పుడు ఏర్పాటు చేయడం - నాకు తెలిసి మా ఊళ్ళో రికార్డే. మాకు భలే సంతోషంగా అనిపించింది రాజశేఖర్‌కి మంచిరోజులొచ్చాయని.

వెంటనే మా సవారీ-తెన్ను మారి  మళ్ళీ సినిమా-దరికి దారి మళ్ళింది.

తొమ్మిదిగంటల ఇరవై నిముషాలకి సినిమా-హాల్ప్రవేశం చేశాం - మూడు కుడికాళ్ళు లోపల పెట్టి.

అప్పటికే - ఓ అబ్బాయి ముందు పరిగెడుతూ వెళ్తూ ఉంటే అతని వెనకాల ఇద్దరు మోటార్ సైకిళ్ళమీద వెళ్ళినా అందుకోలేక అవస్థలు పడుతూ వున్న అతి-పరిచయమున్న తెలుగు-సినిమా-సూత్రంతో జరుగుతున్న మా-సినిమా-వీక్షణ మొదలు.

సినిమా చాలా బావుంది.

తెలుగు సినిమాకి కొత్త కథ.

చాలా సెన్సిబుల్‌గా వున్న దర్శకత్వం.

అద్భుతంగా వినిపించిన నేపథ్యసంగీతం.

ఉన్న రెండు పాటల్లో - ఏ పాటకా పాటకి సరిగ్గా కుదిరిన సంగీతం. 

దర్శకుడే కథా-నాయకుడై - అంతటా తానే అయి - మిగిలిన వాళ్ళందరూ కథకి అవసరమైన పాత్రల్లా - చాలా సహజంగా - గ్రిప్పింగ్‌గా కథ, కథనం ప్రధానాంశాలుగా  నడిపిన తీరు గొప్పగా వుంది.

సినిమా కథలో భాగంగా - ఒక చోట అమ్మాయిలు పాట పాడుతూ ఆడుతున్నప్పుడు - హుషారుగా వాళ్ళ చుట్టూ బోల్డుమంది ఆ పాటకి గొంతు కలుపుతూ - ఆ ఆటకి తాళం వేస్తుంటే - వాళ్ళ మధ్యకి రాజశేఖర్ పరిగెత్తుకొచ్చి తనూ స్టెప్పులేయకపోవడం - రొటీన్నుంచి ఓ పెద్ద రిలీఫ్. 

అన్నిటికన్నా ముఖ్యంగా - కొరియన్ వార్ లేకపోయినా - సినిమా మొత్తంలో ఒక్కసారంటే ఒక్కసారి వినిపించే నార్త్ కొరియా మాటని పట్టుకుని పొరపాటున వార్ సినిమా అన్చెప్పిన నాన్నగారిమీద అలక్కుండా -  బుజ్జిజింక సినిమాని తెగ ఎంజాయ్ చేస్తూ చూడడం - ఇంకా బాగా అనిపించింది.

సినిమా అయిపోయి ఇంటికి వస్తుంటే వాడి దృష్టికోణపు సమీక్ష ఏంటంటే: సినిమా చాలా బావుంది.

ముఖ్యంగా వాడికి నచ్చినదేంటంటే - చాలా ఇంటెన్స్‌గా, ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన - Political rally లో బాంబ్ diffuse చేసిన సీను - ఎందుకంటే ఎవరికీ దెబ్బ తగల్లేదు కాబట్టి.

మొత్తానికి చాలా రోజులతర్వాత మా ఇంటిల్లిపాదికీ నచ్సిన సినిమా - PSV గరుడవేగ.

ఇంత నచ్చినా - నాకున్న some-సందేహాలు, some-సంశయాలు, some-సంగ్రహాలు:

1) What does PSV stand for ? Praveen Sattaru's Vision ? సరైన జవాబు ఏంటో మరి!

2)  What is the meaning of 126.18M ?


3) What is NIA? దీనికోసం గూగుల్ చేస్తే మొట్టమొదటగా కనిపించింది National Institute on Aging. అబ్బే - ఇది అయ్యుండదేమో - అనుకుని NIA Inida అని వెతికితే - 2008 లో ఆవిర్భవించిన National Investigation Agency గురించి తెలిసింది. ఈ గరుడవేగ సినిమా పుణ్యమాని నాకు లోకజ్ఞానం పెరిగింది.

4) రాజశేఖర్‌ని చాలా ఏళ్ళ తర్వాత - అంటే అల్లరిప్రియుడు తర్వాత - హీరోగా చూశాం. సంతోషం. కానీ - పాపం! అతన్ని మోసేయడం కాకపొతే అంకుశం-ఆహుతి రోజుల angry-young-man ఎక్కడా? భార్య చాటు ఈ gingerly-old-dude ఎక్కడా? దీంతర్వాత అతనికి వచ్చే అవకాశాలు ఏంటబ్బా? అనిపించింది. బాండ్ సిరీస్ లాగా వేగా-సిరీస్ తీయబోరు కదా? ఈ సినిమా వల్ల సత్తారు సత్తా సినీ-ప్రపంచానికి తెలుస్తుందేమో కానీ రాజశేఖర్‌కి ఏంటి లాభమో అర్థం కాలేదు. నిజంగా చెప్పాలంటే - బదరి, నేనూ అనుకున్న మాట - హీరో ప్లేసులో ఎవరైనా సరిపోయేవారు - ఇప్పటి సెమి-వృద్ధ హీరోల్లో ఎవరో ఒకరు. అందరికన్నా కొంచెం ఎక్కువగా రవితేజా సరిపోయేవాడు.

4)  ఇంక హీరోయిన్ రోల్ - చీర కట్టుకుని, బుక్కులు చదువుకుంటూ, మొక్కలు పెంచుకుంటూ - టీవీల్లో వాళ్ళ ఆయన గొప్పదనాన్ని చూపిస్తున్నా - అసలతనేం ఉద్యోగం చేస్తున్నాడో కూడా తెలియకుండా ఉండడం - అతనికి బయటున్న టెన్షన్స్‌కి తోడు డివోర్స్ అంటూ ఆ గొడవేంటి? అమాయకత్వమా? ఏమీ పట్టనితనమా?

5) సినిమా మొదట్లో - ఆలీ కౌన్సెలింగ్ సీన్  - హీరో ఒకటి చెప్తే ఆలీ ఇంకోటి ఎలా ఊహించుకున్నాడో - అంటే హీరో చెప్పిన నక్షత్రతాబేళ్ళ స్మగ్లింగుకి, ఆలీ ఊహించుకున్న అదేదో dam దగ్గర drug-racketకి ముడి ఎలా కుదిరిందో అర్థం కాలేదు - బహుశా అంతకు ముందెప్పుడైనా ఆలీ పేపర్లలో చదివాడేమో అని సరిపెట్టుకుని-సర్దిపెట్టుకుందామనుకున్నా - ఆలీ చూసింది మరి హీరో-ఆలి ఎందుకు చూసి ఉండదు? చూస్తే ఎందుకు అర్థం చేసుకోకుండా విడాకులు అడుగుతోంది? 

6)  చీర కట్టుకున్నవాళ్ళు అలా అయోమయంగా ఉంటే - ఇంక హీరో టీమ్లో - dotలూ, dashలూ చూసి అది మోర్స్‌కోడ్ అని చెప్పడానికి - ఒక బోయ్-కట్ చేయించుకుని పాంటూ-టీచొక్కా వేసుకున్న అమ్మాయి.

నాకది చూడగానే వెం...ఠనే గుర్తుకొచ్చింది - ఎవరంటే - Cryptography లో PhDని అలవోకగా ఉప్పాడచీర కొంగున ముడేసుకున్న మా నిరుపమ.

Encrypted dataని crack చేసే smart అమ్మాయిలు లేటెస్ట్ మోడల్ smart phone లెక్కుండక్కర్లేదు భయ్! - అతి మామూలుగా కనిపిస్తూ - మన మధ్యలో తిరిగే ముద్దమందారాల్లా కూడా ఉండొచ్చు.

సినిమా వాళ్ళ ఫార్ములాల లెక్కలు మారితే బావుండును.

7)  ఈ స్పై-సినిమాలో అసలితను కనిపించడం అవసరమా అనిపించినా - తన నటనతో తనెక్కడైనా అనవసరం అనిపించడని - గుర్తుంచుకోవాల్సిన అవసరం నాక్కల్పించిన - అవసరాల శ్రీనివాస్ - ఉన్న కాసేపు - ఇతనిక్కడ అవసరమే - అనిపించాడు.

8) చివర్లో చీర కట్టుకున్న హీరోయిన్ని సముద్రంలో పడేసి - ఈదిస్తాడేమో అని భయపెట్టినా - ఆ పని చేయని దర్శకుడికి జేజేలు.

9) అలాగే ఈ తెలుగు ప్రేక్షకులు నేనెలా తీసేసినా చూసేస్తారు అన్న ధీమాతో అవసరం లేకపోయినా చిన్నచిన్న పిల్లలతో పెద్దపెద్ద మాటలు చెప్పించకుండా - అలాగే - చివర - షిప్పుని పేల్చేసే సీనులో పిల్లలని కూడా పట్టుకొచ్చి అక్కర్లేని హడావిడి సృష్టించకుండా ఉన్నందుకు - పిల్లలూ, అమ్మల తరపున ఇంకొన్ని జేజేలు.

10) బకెట్లో పట్టుకెళ్లి - high pressure tube లోంచి illogical గా - విసిరిన బాంబుల తాకిడికి పేలిన - అంత మొదటిరకం యురేనియం వున్న ఓడ - తాను పేలిపోతూ పక్కనే హీరో, హీరోయిన్, సెమి-హీరో వున్న బార్జ్‌ని ఏమీ చేయకపోవడం - హీరోచితంగా ఉన్నా - కథోచితంగా అనిపించలేదు. కానీ - సర్దేసుకున్నాం - ఎంతైనా సర్వేజనా-సుజనోభవంతు - సర్వే సుజనా సుఖినోభవంతు-స్లోగన్ ప్రమోటర్లం కదా!

ఇదిగో... ఇందుకే! నేను తెలివైన దర్శకుల సినిమాలు చూడను - అక్కర్లేని అనుమానాలొస్తాయ్ - అడిగినందుకు ఆవేశాలొస్తాయ్ - అపార్థాలకి అవకాశాలొస్తాయ్ - అవి వివరించలేక ఆయాసాలొస్తాయ్.

ఇన్నొచ్చినా - ఇవన్నీ వస్తే వచ్చాయిలే - అని సినిమా చూడడం - అనుమానాలాడగడం - ఆవేశాల విలాసాలు చూడడం  - అపార్థాల పాలబడడం - ఆయాసాల ఆవల కులాసాల కబుర్లాడడం - నాకో సరదా!

ఇంత జరిగాక...
ఇంకా-ఇంకా...
రాజశేఖర్ హీరోగా మరిన్ని సినిమాలు రావాలి గాని -
మరీ అదే మూసలో మరో NIA-టైపు సినిమా రాకుండుగాక
మళ్ళీ-మళ్ళీ మా ఊళ్ళో సినిమాహాళ్ళు - మెండుగా, రెండుగా - నిండుగాక 
సత్తారుగారి సత్తా - వెరైటీ - అనిపించే సినిమాలు తీయుగాక

అని కోరుకుంటూ....

~ సినీ-మా-లక్ష్మి

5, నవంబర్ 2017, ఆదివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 6 - అల్లరి, ఆటలు, ఇరవు, ఈదేసిన గోదారి

గతనెల కబుర్లు : అవతారంగారి నారాయణగారి బాబి - 5 - నా కథావస్థల్లో క్రీడావస్థ 


ఫిఫ్త్ ఫారం - ఎస్సెల్సీ లోఉన్నాం కదా

ట్యూషన్ సంగతి చెప్పాను కదా - ముక్కామల కృష్ణమూర్తి గారి దగ్గర. ఇంట్లో ట్యూషనూ అదీ పెట్టించారని.

అసలిక్కడింకో సంగతి చెప్పాలి.

ట్యూషన్‌కి అందరూ వచ్చేవాళ్ళు కదా - నారాయణమూర్తిగారి సత్తిగాడు, నాయనరాజుగారి సూరిగాడు, సుబ్బయ్య, మెహబుల్లా, గురుజ అర్జున్రావ్  - వీళ్ళందరూ వచ్చేవాళ్ళు.

చెప్పాను కదా! - రాత్రి పదిగంటల దాకా నిద్రపోయేవాణ్ణి కాదని?! మిగిలినవాళ్ళందరూ పడుకుండి పోయేవాళ్ళు.

గుఱ్ఱాలకి వెళ్ళే ముందు - వాళ్ళ అరిచేతులకి బొగ్గు రాసేసి - ముక్కులో పుల్ల పెట్టేవాణ్ణి. పెడితే - వాళ్ళు ముక్కు నలుపుకునేవాళ్ళు - నిద్రలోనే. చేతికున్న బొగ్గంతా మొహానికి పులిమేసుకునేవాళ్ళు. పొద్దున్న లేచి చూస్తే కొండముచ్చుల్లా వుండేవాళ్ళు. వాళ్ళకి అద్దం చూపెట్టేవాణ్ణి.

"ఎవర్రాశార్రా ఈ బొగ్గు ఎవర్రాశారు?" - అంటూ గగ్గోలెత్తిపోయేవాళ్లు. నేనేమీ ఎరగనట్టు -" ఏమో ఎవర్రాశారో ఏంటో" - అని ఇవతలికి వచ్చి తప్పించుకునేవాణ్ణి.

అన్నట్టు - ఇంతకు ముందు ఆటల్లో ఇంకోదాని గురించి చెప్పడం మర్చిపోయాను  - ఆకుతెచ్చేఆట.

ఇదెంతమందైనా ఆడుకోవచ్చు. ఆకుతెచ్చేఆటలో అనాతారంలో మణిగాడు , అయ్యగారి వెంకట్రావు, బుచ్చిమేష్టారి శేషు, రాజుల కుర్రాళ్ళు - మేమందరం ఉండేవాళ్ళం.

ఈ ఆకుతెచ్చేఆటలో దొంగైన వాడు - మనం చెప్పిన ఆకు తీసుకొచ్చి మనమీద పెట్టి ఔట్ చెయ్యాలి - ఈ రకంగా వుండేదన్నమాట. మావిడాకులు అవీ అంటే  కాళత్తయ్యగారి పెరట్లో ఉండేవి కాబట్టి అవి తెచ్చేసేవారు. మేమేం చేసే వాళ్ళమంటే జీడిమామిడాకు తెమ్మనేవాళ్ళం. జీడిమామిడాకంటే భీమనపల్లి వెళ్ళాలి. రెండు కిలోమీటర్లు వాడు నడిచో, సైకిలుమీదో వెళ్ళి - ఆ ఆకు తీసుకొచ్చి - అప్పుడు మమ్మల్ని ఔట్ చెయ్యాలి. భలే సరదాగా ఉండేది.

అనాతారంలో పంచ-బాబులు - మూల గున్నయ్యగారి బాబి, సిద్ధాంతిగారి బాబి, బుల్లినారాయణగారి బాబి - నేను, రామంగారి బాబి, నాయనరాజుగారి బాబి.  అందర్లోకీ నాయనరాజుగారి బాబి చిన్నవాడు శ్రీను వాళ్ళ క్లాస్‌మేట్.

మా నలుగురిలో మూల గున్నయ్యగారి బాబి, సిద్ధాంతిగారి బాబి - చాలా పెద్దవాళ్ళు నాకన్నా. ఇంక రామంగారి బాబి - వాణ్ణేమో పాపం పుల్లయ్య అనేవారు. వాడసలు పేరేంటో నాకు తెలీదు.

మనం ఏ అల్లరి పంజేసినా కూడా - "ఎవర్రా ఈ వెధవపని చేశారూ ? నారాయణగారి బాబేనా?" - అనెవరైనా పెద్దవాళ్ళు అడిగితే - "కాదండి" - అనేసేవారు  - ఎందుకంటే వాళ్లంతా  అంతా నా గ్యాంగ్ - అందుకని వాళ్ళందరూ కూడా - "లేదండి - రామంగారి బాబండి" -  అని వాడి మీదకి నెట్టేసేవాళ్ళం.

అలాగా - చిన్నప్పటినుంచి కూడా మనది కృష్ణావతారమే - అవతారంగారి మనవణ్ణి కదా. ఆ రకంగా ఆడించేహేవాణ్ణి.

అప్పుడప్పుడు శివకోడెళ్ళేవాణ్ణి.

శివకోళ్ళో కాపుల కుర్రాళ్ళు వాళ్ళు వుండేవారన్నమాట - శివకోడు ఊరంతా వాళ్ళే కదా - మేకల బాబులు, రమణ, మల్లిపూడి సత్తెంకాపు కొడుకులు - మల్లిపూడి బాబ్జీ, కొండయ్య - కస్తూరి పాపారావు - భాస్కరు - వీళ్ళంతా కూడా నాకు స్నేహితులే. ఎంచేతనంటే మా మేనమామగారి ఊరే అది - మా మాతామహుల ఊరు. మా అమ్మమ్మ, తాతగారు ఉండేవారు - మా అమ్మతో వెళ్ళేవాణ్ణి అక్కడికి.

వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఎక్కువ చెడుగుడు ఆడేవాళ్ళం వాళ్ళతోటి.

ఆ టీములో మా మేనబావ ప్రసాదు, నేను కూడా అపోజిషను. వాడు సైంటిస్టు. వాడేం చేసేవాడంటే ఒక సైకిలు హబ్బుకి దారం చుట్టబెట్టి - వాడేమో చేతిలో ఒక పుల్ల పట్టుకుని - ఈ దారం దానికి తగిలించి నన్నేమో పెడలు  తిప్పమనేవాడు.

నేను పెడలు తిప్పుతుంటే - ఆ చక్రం తిరిగి దారం వచ్చి ఆ పుల్లకి చుట్టుకునేదన్నమాట. నేనేం జేసే వాణ్ణంటే కాసేపు మెల్లిగా తిప్పి ఒక్కసారిగా గట్టిగా తిప్పేసేవాణ్ణి.

ఆ దారం తెగిపోయేది. దాంతోటి వాడేం చేసే వాడంటే -  "ఏయ్!  వెధవ ! దారం తెంపేశావ్ - ఠాట్ నీతోటి మాట్లాడను -అవతలికి ఫో - నీతో పచ్చి" - అని ఉక్రోషంగా తిట్టేసేవాడు.

"ఎహె పోతే పో" అనేసేవాణ్ణి.

ప్రసాద్ తమ్ముడు మణి మాత్రం నాతోనే ఉండేవాడు. నేనేం చెప్తే అది చేసేవాడు వీడు - నాకన్నా పదినెల్లు చిన్నాడు వీడు. ప్రసాదేమో నాకన్నా రెండేళ్ళు పెద్దాడు.

నేను చేసే అల్లరి పనులన్నింటికీ వ్యూహం రచించడమే నా వంతు  - పనులన్నీ మణి చేతే చేయించేవాణ్ణి - ఎందుకంటే రేప్పొద్దున ఎవడన్నా గొడవ పెట్టి కొట్టాడనుకో వాణ్ణి కొడతాడు, నన్ను కొట్టడు కదా! - కృష్ణుడు సారథ్యం చేసినట్టన్నమాట. కొట్టేవాడు అర్జునుడు, దెబ్బలు తింటే అర్జునుడు తింటాడు.

అందుకే మా మామయ్య పేర్లు పెట్టారు - "కృష్ణార్జునులు వీళ్ళిద్దరూ - ఆ బాబి కృష్ణుడు, ఈ మణిగాడు అర్జునుడు - వెధవ వ్యూహమంతా వాడిదేలే - ఏవమ్మో అక్కయ్యో - వెధవ తెలివితేటలన్నీ వాడివే - వాడు వ్యూహం వేస్తున్నాడు - వీడేమో పిచ్చోడు వీడేమో వెళ్ళి తన్నులు తింటున్నాడు" - అనేవారు మమ్మల్నిద్దరినీ చూసి.

శివకోడులో మణి ఎలాగో - అనాతారంలో పుల్లయ్య అంటే రామం గారి బాబిగాడు  - రెండు చోట్లా వ్యూహం మనది - తన్నులు తినేవాళ్ళు వాళ్ళు.

చిన్నప్పుడు ఎస్సెసెల్సీ వరకు - ఇవన్నీ జరిగేటప్పటికి ఏమైందంటే - ఈ ఆటలు, అల్లరి, వ్యవహారాలూ - ఈ గందరగోళంలో - ఎస్సెల్సీ తన్నేసింది 1961లో.

తన్నేసి - పోయిందేమిటీ - ఇంగ్లీషు, లెక్కలు. ఇంట్లో పెట్టుకున్న మేష్టారెవరూ ? ఇంగ్లీషు - లెక్కల మేష్టారే - హహ్హహ్హ  - అదీ జోకు.


సరే - వేటికైతే ప్రైవేటు పెట్టించారో - ఆ రెండు సబ్జెక్ట్లే తన్నేసినయ్ - మళ్ళీ సరే అక్టోబరు కట్టేం - మళ్ళీ అవే తన్నేసినయ్. తన్నేసింతర్వాత - మా నాన్నేమో - "సరే ఇప్పుడింకేం వద్దు. నిన్ను వైజాగ్ పంపించేస్తాను. మళ్ళీ వచ్చే మార్చిక్కట్టు (అంటే 63 మార్చి)" -  అన్నాక అందాకా మనకి తీరిక దొరికేసింది.

61 అక్టోబర్ అయిపోయింది కదా - 62 టోటల్ ఫ్రీ.  వైజాగ్ వెళ్ళిపోయి భారత్ ట్యుటోరియల్ కాలేజ్‌లో చేరిపోయాను. ఇక్కడితో స్వస్తి. తరవాయి కథ వాయలు వాయలుగా చెప్తాను.

చెల్లిన అల్లరి
ఆడిన ఆటలు
వెళ్ళిన ప్రతి నెలవు
అనువైన ఇరవు
వెరసి దాటొచ్చిన ప్రతిదారీ
ఈదేసిన గోదారి


<వచ్చేనెల తరువాయి కథ>