27, సెప్టెంబర్ 2020, ఆదివారం

మరలి రాలేని ఏ మజిలీలకి తిరిగి రాలేని నీ బదిలీ?

 దాదాపు ఓ నెల క్రితం ఒంట్లో బాలేదని హాస్పిటల్లో చేరుతున్నావని విని - "ఆ పెద్దాయన  అమితాబ్బచ్చన్ ఇలా వెళ్ళి అలా వచ్చెయ్యలేదూ... ? ఈయన ఆయన కన్నా చిన్నవాడు కూడానూ. ముందు జాగ్రత్తగా వెళ్తున్నాడు. అంతే!" అని పదేపదే అనుకున్నాను, అన్నాను కూడా. 

నీ గురించి అట్టే మాట్లాడకుండా ఉంటూ, నీ గురించి రోజురోజూ వచ్చే వార్తలు వినకుండా ఉంటే - ఏదో ఓ మంచిరోజు ఇంటికొచ్చేసి - టీవీలో పువ్వులా నవ్వుతూ కనిపించి - "నేనొచ్చేశానర్రా, ఇంతకు ముందు ఎక్కడ ఆపామో అక్కణ్ణించి మన పాట పాడేసుకుందాం - సరి సరి... పద పదండి !" - అంటూ గలగల్లాడుతూ మువ్వలా మోగిపోతావనుకున్నాను. 

ఇప్పుడొస్తావు, అప్పుడొస్తావు అని తేదీలు మార్చుకుంటూ, నీ పాటనే పలవరించుకుంటూ ఎదురు చూస్తుండగానే - నువ్వెళ్ళిపోయావు అన్న మాట తెలిసింది. 

ఆ మాట వినగానే చెప్పలేని ఉక్రోషం. 

చేతులు నులుముకుంటూ "ఇదేంటి? ఇలా అయ్యిందేంటి?" అనుకుంటూ, అనుకుంటున్నది పైకే గట్టిగా అంటూ - ఏదో చెప్పలేని helplessness తో, ఎక్కడ మొదలయిందో చెప్పుకోలేని నొప్పితో - చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిన నీ మీద అలిగాను. 

మళ్ళీ - "నాకేమీ కాని నీ గురించి నేనెందుకు పట్టించుకుని ఏడవాలీ. అయినా... లోకంలో జరిగే ప్రతీ విషయం గురించి నాకో అభిప్రాయం ఉండాలీ అన్న పట్టింపే లేదు కదా నాకు! ఇంతకు ముందు ఎంతోమంది వెళ్ళిపోయారు. వాళ్ళలాగే ఈయన కూడా. ఉంటేగింటే వాళ్ళింట్లో వాళ్ళకి బాధుండాలి కానీ ఏమీ కాని మనకేం బాధ!" అని నాలో నేను  అదే పనిగా అనుకుంటూ, నాకే నేను పదేపదే చెప్పుకుంటూ - దూర లోకపు మజిలీకి మారిన నీ బదిలీ వార్తని పట్టించుకోకుండా ఉందామని ఎంతో ప్రయత్నించాను. 

కానీ అది అంత సులువైన పనిలా అనిపించలేదు. 

అందుకే - నువ్వెళ్ళిపోయావని తెలియగానే - అప్పటివరకు చెంగటనే ఉన్న చుట్టమెవరో చటుక్కున చేయి వదిలేసి తరలిపోయినట్టు - చెప్పుకోలేని బాధేసి - తలారా స్నానం చేసి వచ్చానా ?! 

అప్పట్నుంచి ఏదో తెలియని నొప్పి. ఏ పని చేస్తున్నా - నీదే ఆలోచన. 

తడిసి కురవబోయే కన్నుని ఊరుకోబెట్టటానికి "పల్లవించవా నా గొంతులో... పల్లవి కావా నా పాటలో..." అంటూ  నీ పాటలే పాడుకున్నా. పాడుకుంటూ నువ్వెక్కడికీ వెళ్ళిపోలేదని నన్ను నేనే మభ్యపెట్టుకున్నా.  

నువ్వు పాడిన పాటేదో పాడుకుందామనుకున్న నా ప్రయాస పాడలేని పాటై, నవ్వులాటగా మిగిలింది. పలకలేని నా నోట నలిగి నీ పాట పొగిలి పొగిలి ఏడ్చింది. . 

పాడలేని ఈ పూట నువ్వు నాకు పరిచయమయిన మొదటి రోజులు నెమరేసుకుందామనుకున్నాను. 

ఇంట్లో - అమ్మను కన్న అమ్మమ్మో, అమ్మో, నాన్నో, మమత పంచిన మామో - ఎవరో ఒకరు పాడుతున్న పాటలు వింటూ పెరుగుతున్న నాకు మాటలతో పాటే పాటలొచ్చాయి. నాకు పాటలొచ్చిన మొదటి రోజు నుంచి - అప్పటికి నీ పేరు తెలియకపోయినా నువ్వు నాకు తెలుసు. నీ గొంతు నాకు తెలుసు. 

నీ గొంతు వింటూ, నీ గొంతుతో నేనూ గొంతు కలిపి పాడుతూ పెరిగాను. ఆడుకుంటూ నీ పాటలే పాడుకున్నాను. నీ పాటలే పాడుకుంటూ ఆడుకున్నాను. 

"ఇదే పాట - ప్రతీ చోట ఇలాగే పాడుకుంటాను" అని నువ్వన్నట్టే - నువ్వు పాడిన ఏదో ఒక పాట ప్రతీ పూటా నేనూ పాడుకున్నాను - ఆ పాటలో మాటలకి అర్థాలు తెలీకపోయినా. అప్పుడు అలా  మొదలెట్టిన నీ పాటలు ఇప్పటికీ పదేపదే పాడుకుంటూనే ఉన్నాను. 

 అలా అని నువ్వు పాడిన పాటే పరమానందమన్నట్టు ప్రతీ పాటకీ పరవశించిపోయాననుకోకు. "వాయించు ఆదితాళం - మెప్పించు నేటి మేళం.... రంగన్నా ... రంగన్నా... రసాభాస చెయ్యకురా" అని నువ్వు పాడితే "ఎబ్బే! ఇలాంటి పాటలు సుబ్బయ్య పాడకపోతే తనకేం తక్కువయ్యేది?" అని ఆ పాట విన్న ప్రతీసారీ విసుక్కుంటాను. 

అన్నట్టు - నిన్ను నేను "సుబ్బయ్య" అని పిలుచుకుంటాను. నాకెంతో ఇష్టమైన పాటలు పాడిన నీ గొంతు వింటూ పెరిగానేమో... అంత ప్రత్యేకమైన ఇష్టానికి నాకు నచ్చి నేను పెట్టుకున్నపేరు "సుబ్బయ్య". 

నీకు - "బాలుగారు, ఎస్పీబీ, బాలసుబ్రహ్మణ్యం గారు" - ఇలా ఎన్నో పేర్లు ఉండొచ్చు గాక - ఆ పేర్లూ, ఆ పేర్ల వెనకాల గార్లూ నాకు పట్టవు. 

అసలు నువ్వు నాకేమౌతావూ అని ప్రశ్నించుకుంటే - నేనెవ్వరో నీకు తెలిసే అవకాశమే లేదు అన్నది సత్యం. నువ్వు పాటగా నాకు బాగా తెలుసు అన్నది నా తరఫు నుంచి నిత్యసత్యం. 

ఒకట్రెండు సార్లు నిన్ను కలిసి, దగ్గరిగా చూసి మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు కూడా నేను నీకు దగ్గరగా వచ్చి పలకరించను కూడా లేదు.  

ఒకవేళ వచ్చినా ఏం మాట్లాడతాను చెప్పు? 

సభామర్యాద కోసం "మీరు చాలా బాగా పాడతారండి! మీ పాటంటే నాకు బోల్డు ఇష్టమండి" అని ఏవో రెండు ముక్కలు ముక్కున పట్టుకొచ్చినట్టు మాట్లాడేశాననుకో - ఆ మాటలెంత పేలవం? ఆ శబ్దమెంత పలచన? 

ఎప్పుడూ ఆకాశంలో ఉండే ౘందమామ వాకిట్లో ఉన్న నూతి నీళ్ళలో చేతికందేలా కనిపిస్తే "నీ వెన్నెల ఎంత తెల్లగా ఉంటుందో! అది నాకెంత ఇష్టమో!" అని మామూలు మాటలు చెప్తామా? అలా చెప్తే మాత్రం నా ఉనికేమన్నా పెరుగుతుందా? నేనలా చెప్పకపోతే ఆ ౘందమామ విలువ ఏమన్నా తరుగుతుందా? 

గాలి బాటలో - అది సోకినంత మేరా - ఊగే చెట్టూ, కొమ్మా, రెమ్మా, ఆకూ, పువ్వూ, మొగ్గా - వాటికి తగిలిన గాలి - వాటిని మాత్రమే తాకిందనీ, వేటికి వాటికి ఆ గాలి తనదే అని మురిసిపోతాయి, కానీ వాటి మీదుగా వీచిన మలయమారుతానికి వాటి ఉనికి కూడా తెలియదేమో! నీ పాట కూడా ఆ గాలి లాంటిదే. అది తాకిందని మురిసిపోవడమే నాకు దక్కిన privilege.  

నీ పాట విన్న నేను - నువ్వు నాకు నేస్తమని - అనుకున్నాను - అంతే! కానీ అది తీసుకొచ్చి నీకు చెప్పగలిగే స్థాయి నాకు లేదు. 

నీళ్ళల్లో బెడ్డ వేస్తే కదిలే అలల్లాంటి నా లాంటి పరిచయాలు నీ దాకా రావక్కర్లేదు కూడా. 

అందుకే నీ దరిదాపుల్లోకి కూడా రాకుండా దూరంగానే ఉండి ఎప్పట్లాగే నీ మాటని, పాటని మాత్రం చెవుల్లో నింపుకెళ్ళాను. 

అన్నట్టు ఓ విషయం చెప్పాలి - ఇదొకలాంటి confession కూడా. 

ఓ పదేళ్ళుగా నువ్వు చేస్తున్న ఏ కార్యక్రమాలూ నేను చూడట్లేదు. నువ్వు పాడిన పాటలే మళ్ళీ మళ్ళీ ఎందరో వేదికల మీద పాడి నిన్నే మెప్పిస్తున్నా - అవి నువ్వు తప్ప ఇంకెవరు పాడినా - ఈ కొత్తకొత్త గొంతుల్లో వినీవినీ - నీ పాతపాట మీద ఇష్టం తగ్గుతుందేమో అని బెంగేసి కూడా - పాడుతా-తీయగాలూ, స్వరాభిషేకాలూ చూడడం కూడా మానేశాను. 

ఏమాటకామాట చెప్పుకోవాలి... 

నీ పాటే లేకపోతే సినిమా-హీరోలు అంత అందంగా కనిపించేవాళ్ళు కాదేమో! 

నీ పాటే లేకపోతే కన్నెపిల్లల కళ్ళకు అంత మంచి కలలు వచ్చేవి కావేమో!

నీ పాటే లేకపోతే కుఱ్ఱాళ్ళు కవ్వించే సోగ్గాళ్ళై  ఊగకపొయ్యేవాళ్ళేమో! 

నీ పాటే లేకపోతే ఎన్నో ప్రేమకథలు మొదలవకుండానే ఆగిపోయ్యేవేమో! 


పాట పాడి నవ్వించి, ఏడిపించి, కవ్వించి, మరిపించి, మురిపించి - మైమరపించి - అంత హఠాత్తుగా - పాడుతున్న పాట ఆపి అలా ఎలా వెళ్ళి పోయావు? 

పుట్టిన ప్రతి ప్రాణానికీ వెళ్ళిపోవడానికి ఒక నెపం కావాలి అనుకుంటే నీకు నీ ప్రాణమైన పాటే ఒక నెపమయ్యింది. 

నువ్వు లేని ఈ పూట 

పాట మూగబోయింది

పెగలలేని ఆ పాట  

కనుల కరిగి నీరయ్యింది 


అవునయ్యా! నువ్వేమన్నావ్ - ఒక్కసారి గుర్తు తెచ్చుకో! 


పాట నాకు సైదోడు పక్షి నాకు తోడు

విసుగు రాదు ఖుషీ పోదు 

వేసట లేనే లేదు

అసలు నా మరోపేరు ఆనంద విహారి  

- అనే కదా పాడావ్? 


అన్నట్టుగానే పాటే తోడుగా, సైదోడుగా -  మేఘాల్లో తేలిపోయే పక్షిలా "మనసైన చోట మజిలీ... కాదన్న చాలు బదిలీ"  అని పాడుకుంటూ పరవశించిపోయేవాడివి. 

అలా ఉన్నవాడివి ఉన్నచోట ఉండకుండా ఇప్పుడు మరి - మరలి రాలేని ఏ మజిలీలకి తిరిగి రాలేని నీ బదిలీ???


19, సెప్టెంబర్ 2020, శనివారం

త్వామనురజామి - 51 - మా మేటి చెలిమి ఒక కథ... కథ కాదు నిజము మా కల...

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 50 - ఒకరికొకరం మేలి-సగం!


దాదాపు నాలుగేళ్ళుగా రాగపూరిత రాగమై మోగుతున్న "త్వామనురజామి" ఇక్కడితో ఆగి - సరాగమవుతోంది. 

ఇది ఎప్పుడో మొదలయి జరిగిపోయిన - ఇప్పటికీ జరుగుతున్న కథ. 

ఇంతకు ముందు ఎవరో అన్నట్టు ముగింపు ముందే తెలిసినా - నా వైపు నుంచి అసలేం జరిగిందో నేను చెప్తే తప్ప ఎవరికీ తెలియని నా కథ ఇది. 

నే చెప్పిన నా కథే వెనక నుంచి చెప్పుకొచ్చినట్లు ఉంటే, అసలు నా కథ చెప్పాలని నాకెందుకు అనిపించిందో చెప్పాలంటే ఈ కథ మొదలెట్టిన నాలుగేళ్ళకు ఇంకో ఆరేళ్ళు వెనక్కెళ్ళాలి.  

ఓ పదేళ్ళ క్రితం శ్రావణమాసం. 

ఏడాదికి ఒకసారి నాకు నచ్చిన, మనసుకు దగ్గరగా వచ్చిన నలుగురినీ ఇంటికి పిలిచి కబుర్లాడుకోవడానికి వరలక్ష్మీవ్రతం నాకో అనువైన, అందమైన నెపం. 

ప్రతీ ఏడాది లాగే ఆ శుక్రవారం కూడా ఓ పదిహేను కుటుంబాలని భోజనానికి పిలిచాను. 

ఆ వచ్చిన వాళ్ళల్లో ఇద్దరు కొత్త పెళ్ళికూతుళ్ళు - వాళ్ళిద్దరూ కూడా నేను చేసే టీమ్ లోనే పని చేస్తుండేవాళ్ళు. అందులో ఒకరు  సిమ్లా-చిన్నది సరితా శర్మ, ఇంకొకరు జమేకా-సుందరి వేనెట్ బర్క్ . 

వచ్చిన వాళ్ళందరూ భోజనాలు చేసి - కబుర్లతో ఇల్లంతా గలగలలాడుతున్న సమయంలో - కొత్త పెళ్ళికూతుళ్ళు సరితని, వేనెట్టుని - మిగిలిన మేమందరం వాళ్ళ పెళ్ళి విశేషాలు అడుగుతూ, వాళ్ళిద్దరినీ సరదాగా ఆట పట్టిస్తూ - వేళాకోళాలాడుతుండగా - ఉక్రోషం వచ్చిన వేనెట్ హఠాత్తుగా నా కేసి తిరిగి "నన్నూ, సరితనీ అడగడం కాదు. ముందు నీ పెళ్ళి సంగతి చెప్పు. Gentleman బదరీని ఎలా వేధించి పెళ్ళి చేసుకున్నావో నాకు తెలీదనుకున్నావా?" అని దబాయిస్తూ - అటు పక్కగా కూర్చున్న సరిత కేసి చూస్తూ కన్ను గీటింది. 

దాంతో సరిత కూడా "ఏదో పెద్ద కథే ఉందన్నమాట! చెప్పాల్సిందే!" అని నా రెండు చేతులూ పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గర తనకీ, వేనెట్‌కీ మధ్యనున్న కుర్చీలో కూర్చోపెట్టేసింది. 

ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా చెప్పాల్సిందే అన్నట్టు, వాళ్ళు అప్పటిదాకా చెప్పుకుంటున్న కబుర్లు కూడా ఆపేసి నాకేసి చూస్తూ ఉన్నారు. 

నాకసలే - "శ్రీరామ" దగ్గర మొదలుపెట్టి "చిత్తగించవలెను" అన్న దాకా - కథలు వినిపిస్తూ కబుర్ల లోకి గెంతుతూ, కబుర్లు చెప్తూ కథల్లోకి దూకుతూ - అడిగినవారిది పుణ్యం అన్నట్టు - చెప్పినది చెప్పకుండా - బోల్డన్ని కబుర్లు చెప్పడం చాలా ప్రియమైన విషయం. 

మరీ ఇంతమంది చుట్టుముట్టేసి, నా చేయి పట్టి కట్టేసి "చెప్పూ, చెప్పఁవూ? చెబుదూ?" అని మొహమాటపెట్టేస్తే, ఆ మాటల-మోహం నుంచి విడిపించుకుని ఊరికే ఉండడం నా వశమా? నా కబుర్ల-మేఘం కురిపించే ముచ్చట్ల-వాన నుంచి తప్పించుకుని ఉరికి పారిపోవడం  ఇక అడిగినవారి తరమా?

చెప్పడం మొదలెట్టేశా.

నేను గుంటూరులో డిగ్రీ చదివేటప్పుడు రిక్షాలో కాలేజ్‌కి వెళ్తూ తన మొహం కూడా చూడకుండా, తనెవరో కూడా తెలీనప్పుడు బదరిని కసురుకోవడం, ఆ తర్వాత తిరుపతిలో MCA చేరినప్పుడు అక్కడే MBA చదవడానికొచ్చిన బదరి నన్ను చూడడం, నాకు మూగ అబ్బాయిగా పరిచయం కావడం - ఆ పరిచయం పెళ్ళి దాకా పెరగడం - ఒక అరగంట పైగా ఆపకుండా నేను చెప్తూనే ఉన్నాను. 

నా ముందున్న పేరంటాళ్ళు కంటి-రెప్ప వెయ్యకుండా నన్ను చూస్తూ, మధ్యలో ప్రశ్న లేస్తే నేను నా కథ లోంచి ఇంకే కబుర్లలోకో జారిపోతానని - అస్సలు నోరు విప్పి మాట్లాడకుండా - నేను చెప్పిన కథంతా విన్నారు. 

అంతా విన్న తర్వాత సరిత "లలితా! ఇంత unique ప్రేమకథ నేనింతకు ముందెప్పుడూ వినలేదు, ఏ సినిమాల్లోనూ చూడలేదు. ఇది మీరు కథగా రాయాల్సిందే!" అని తెగ సంబరపడింది. 

వేనెట్ కూడా "ఇది కథగా రాసి - నిన్నింత భరిస్తున్న బదరికి కానుకగా ఇవ్వు" అని మేలమాడింది. 

అప్పుడు అనుకున్నా "కదా! నా కథ నేనే ఎందుకు రాసుకోకూడదూ?!" అని. 

మరి కథ రాయాలంటే దానికో పేరు పెట్టాలి కదా! ఆ పేరు కూడా ఇప్పటివరకు ఎవరూ వినని పేరై ఉండాలి. నా కథలో నేను చెప్పబోయే నా ప్రేమ నాకెంత ప్రత్యేకమో, ఆ ప్రేమకథకి నేను పెట్టుకోబోయే పేరూ అంత ప్రత్యేకంగానూ ఉండాలి. 

ఇలా అనుకుని ఎంతెంతో ఆలోచించుకున్నా - ఎన్నెన్నో పేర్లు అనుకున్నా. దానికే ఓ నాలుగు రోజులు పట్టింది. అప్పటికి నాకు తట్టిన పేర్లలో ఏ ఒక్కటీ కూడా నాకు నచ్చలేదు.  

అప్పుడు google చేసి చూశా - I love you కి సంస్కృతంలో సమానార్థ వాక్యం ఏంటీ అని. అలా వచ్చిన వాటిల్లో "त्वामनुरजामि (tvāmanurajāmi)" నాకు చాలా నచ్చింది. 

వెంటనే "త్వామనురజామి" పేరుతో ఒక private blog మొదలుపెట్టి - ఓ మూడు episodes రాసి - ముచ్చటగా ముగ్గురంటే ముగ్గురు ఆప్తులతో పంచుకున్నా - అపర్ణ, లక్ష్మి, సుస్మిత. అది ఎప్పుడో 2012 లో జరిగిన సంగతి. 

ఆ మొదటి మూడు ఎపిసోడ్ల తర్వాత ఇంకేం రాయాలో, ఎలా రాయాలో తెలీక - ఆ కథ సాగక - అక్కడే ఆగిపోయింది. అప్పుడు సుస్మిత అననే అన్నారు "ఇలా రాస్తే మీ కథ మీ షష్టిపూర్తికి కూడా పూర్తి కాదు" అని. 

అప్పటికే "బోల్డన్ని కబుర్లు" కూడా మొదలు పెట్టాను. కానీ అది కూడా అంతంత మాత్రం గానే సాగుతోంది. 

2016 మార్చ్ నెలలో - బదరి ఇచ్చిన సలహా ప్రకారం ఎప్పుడైతే వారం, వారం బ్లాగ్ రాద్దామని అనుకున్నానో  - అప్పుడే -  త్వామనురజామి బ్లాగ్ పోస్టులని ప్రతీ నెల 19 వ తారీఖుకి రాద్దామని అనుకున్నా.  

పంథొమ్మిదే ఎందుకూ అంటే అది నన్ను బదరి కలిసిన మొదటి రోజు - డిసెంబర్ 19. 

అలా మొదలయింది ... నా "త్వామనురజామి" - 2016 May నెలలో.

ముందు మా ఇద్దరి ప్రేమకథగా మాత్రమే చెబ్దామనుకుని మొదలు పెట్టిన కథ - రాస్తూ రాస్తూ ఉండగా - జీవితం మీద మాకున్న ప్రేమకథగా మారి - మాతో పాటు మాకు కావల్సిన, మాతో కలిసొచ్చిన వాళ్ళందరి మీదా మాకున్న ప్రేమ కథగా సాగింది. 

(ఈ కొసరు-పాటకి అసలు పాటేదో కనిపెట్టేసుకుని పాడేసుకోండి మరి!)


మా మేటి చెలిమి ... ఒక కథ... 

కథ కాదు ... నిజము మా కల... 

మనసులోని - మాటలన్నీ... 

చెప్పకుంటే - మరి ఎలా?!


ఇంతకీ కథ దేని గురించి? 

నా గురించి... 

తెలిసీ తెలియని అమాయకపు రోజుల గురించి.  

అన్నీ తెలుసుననుకునే నా ఆరిందాతనం గురించి.  

అనుకున్నది అనుకున్నట్టుగా అవ్వాల్సిందే అన్న నా పంతం గురించి. 

ఇవన్నీ మా త్రమే కాదు - వీటన్నిటితో పాటు... 

నా మాట మన్నించిన  మా అమ్మా-నాన్నల గురించి. 

నన్నిష్టపడ్డ బదరికి వెన్నుదన్నుగా నించున్న మా అత్తగారి గురించి

నాతో ఆడిపాడిన నా చెల్లెళ్ళ గురించి.

నన్నభిమానించే నా మరిదీ, ఆడపడుచుల గురించి

"మా లల్లెమ్మ" అని నన్ను తలుచుకునే అయినవాళ్ళ ఆపేక్ష గురించి. 

నా కాలేజ్ స్నేహితుల అభిమానం గురించి.

నా ప్రియనేస్తం అపర్ణ గురించి.

అందరి కన్నా ముఖ్యంగా బదరిని నాకు పరిచయం చేసిన తన సీనియర్ రాజశేఖర్ గురించి. 

వీళ్ళలో ఏ ఒక్కరి గురించి చెప్పకపోయినా నా "త్వామనురజామి" పల్లవి మాత్రమే పాడేసి ఆపేసిన ఓ అసంపూర్ణ గీతమే!

నా కథలో ఎన్ని మంచి జ్ఞాపకాలు! 

ఏ జ్ఞాపకమైనా ఎవరి ప్రమేయమూ లేకుండా నాకై నాకే పుట్టెయ్యదుగా!

ఆ జ్ఞాపకాలు అంత అందంగా నాకందించిన ప్రతి ఒక్కరూ ఆయా జ్ఞాపకానికి సంబంధించిన కథకు - కథానాయికలూ, కథానాయకులూ. 

వాళ్ళందరికీ - వాళ్ళందరితో పాటు, నేను చెప్పిన నా కథని చదువుతూ - ప్రతీ నెల 19వ తారీఖుకి నేను బ్లాగ్ పోస్ట్ చేయడం ఆలస్యం అయితే "లలిత గారూ! ఇవాళ 19, మర్చిపోయారా?" అని గుర్తు చేసిన ఎంతో మంది బ్లాగ్-మిత్రులకి నా కృతజ్ఞతాభివందనాలు! 




ఇక్కడితో - నా జీవితానికి నేను చెప్పుకునే  "త్వామనురజామి" - ఇక్కడే ఒక పాటగా మోగుతూ ఉంటుంది. 

మన-సు-ఆత్రేయ రాసిన పాట నాకు ఇష్టాన్ని పంచిన ప్రతీ ఒక్కరి కోసం... పేరుపేరునా పాడుకున్నా ... పాడుకుంటున్నా... పాడుకుంటూనే ఉంటా... 


ఈ లేత హృదయాన్ని కదిలించినావు... 

నాలోన రాగాలు పలికించినావు 

నాకు తెలిసింది నీ నిండు మనసే... 

నేను పాడేది నీ పాటలే... 

అని ఎవరు అన్నది?

అది ఎవరు విన్నది?

నీ చిగురు చెవులకే గురుతు వున్నది...


13, సెప్టెంబర్ 2020, ఆదివారం

గీతం...సంగీతం...సతతహరితం - 6 - చల్‌తే-చల్‌తే... ఏలియల్లో... ఏలియల్లో... ఎందాకా?


అల్లల్లన అలలుగా 
అల్లనల్లన మెలమెల్లగా
అలవోకగ తగిలీ తగలక 
చెక్కిలి మీటి తట్టి పోయే చిరుగాలీ -  ఒక పాటే... 
చిరుగాలి పాటలో ఊయలలూగుతా 
ఊగుతూ ఊగుతూ తూలియాడుతా...

ఉన్నట్టుండి ఉలిక్కిపడేలా 
అదిరిపాటుగా హడావిడిగా 
ఉన్నచోట ఉండనీక 
చిందు వేయించి తరలిపోయే హోరుగాలీ -  ఒక పాటే...
హోరుగాలి పాటతో చిందేసి ఆడతా
ఆడుతూ ఆడుతూ సోలి వాలుతా...

*****************
*****************


ఒక్కో అప్పుడు ఒక్కో పాట వింటుంటే  ఆ పాటలో ఏముంటుందో ఏమో గానీ - నెయ్యంపు గాలి ఏదో తాకి - తనతో గొంతు కలిపి పదం పాడమని - కవ్వించినట్టనిపిస్తుంది.

ఇంకోసారి ఇంకేదో పాట విన్నప్పుడు - అల్లరల్లరి  గాలి వెళ్తూ వెళ్తూ  ఆకతాయితనంగా ఓ సారి చుట్టుముట్టి - నా చేయి పట్టి - తనతో నేను చెట్టాపట్టాగా - పాదం కలిపి ఆడేదాకా కుదురుగా ఉండనియ్యక - ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టనిపిస్తుంది.

అలాంటి పాటలకి నేను పెట్టుకున్న ముద్దుపేరు - గాలిపాటలు. ఒకప్పుడు రేడియోలో వివిధభారతి జనరంజని, మన్ చాహే గీత్, ఛాయా గీత్ కార్యక్రమాల్లో విన్న చాలా గాలిపాటలు ఇప్పుడు యూట్యూబ్ పుణ్యమా అని చూడడానికి వీలవుతోంది.

అప్పటివరకూ వింటూ, ఊహించుకుంటూ ఉన్న పాట చూస్తున్నపుడు - ఆ పాట అప్పటివరకూ అనుకున్న ఊహకి దగ్గర గానో, అంతకన్నా మెరుగ్గానో కనిపిస్తే - ఇహ అప్పుడు కలిగే ఆనందం ఏమని చెప్పాలి?! ఎంతని చెప్పాలి?!

ఎప్పట్నుంచో నా చెవిలో రొదరొదగా సందడి చేస్తూ, పెదవుల మీద చేరి పదేపదే పలుకుతున్న గాలిపాటలు ఓ రెండున్నాయి.

నా ఎత్తు మఱిగి, నా గొంతులో చేరి పూటపూటా నన్ను మోగేలా చేస్తున్న ఆ పాటల్ని -  బ్రతిమాలి, బామాలి, బుజ్జగించి -  మీకందరికీ అందేలా ఇక్కడ దించక పోతినా - ఆ రాలుగాయి పాటల రాగాలు నా నోట ఆగేలా లేవు.

మా నట్టింటిని ఆ రాగాల మోతలు వీడేలా లేవు.

ఇంట్లో వాళ్లందరికీ నిద్రలో కూడా ఆ పాటలే - కనులు తెరిచే వేళ పలకరింపులుగా - కనులు మూస్తే కలవరింతలుగా - కలల వేళ పలవరింతలుగా - వినబడుతున్నాయట.

అందుకే ఇవాళ ఆ పాటలు రెండిటికీ  - అల్లరి చేసిన పాపాయిల్ని మాట మార్చి ఏమార్చి కుదురుగా కూర్చోపెట్టటానికి వాళ్ళ గురించిన కథలే వాళ్ళకి చెప్పినట్లు - ఆ పాటల గురించిన కబుర్లే వాటికి చెప్పి ఊర్కోపెడితే కానీ నాకు కుదురుండేలా లేదు.

ఇంతకీ ఆ రెండు పాటలకీ  - భాష వేరు, భావం వేరు - రాగం వేరు, తాళం వేరు - రంగు వేరు, హంగు వేరు - సమయం వేరు, సందర్భం వేరు.

వాటికున్న చుట్టరికమూ, పోలిక అల్లా - ఆ రెండూ పాటలు కావడమే.

అందులో మొదటిది చల్‌తే చల్‌తే పాట - పాకీజా సినిమాలోది. పాట రాసినది ఉర్దూ కవి కైఫీ అజ్మీ.

(ఈ కైఫీ అజ్మీ పిల్లలే ప్రముఖ హిందీ నటి షబానా అజ్మీ, ఛాయాగ్రాహకుడు బాబా అజ్మీ. బాబా అజ్మీ భార్య తన్వీ అజ్మీ. దూరదర్శన్ సీరియళ్ళు చూసే రోజుల్లో మొట్టమొదటి సారిగా తన్వీ అజ్మీ షబానాకి వదిన అని తెల్సి - ఆ చిన్నపాటి celebrity titbit ఇచ్చిన excitement ఇప్పటికీ గుర్తు నాకు.

బాబా అజ్మీ, తన్వీ అజ్మీల పెళ్ళి గురించి ముళ్ళపూడి వెంకటరమణగారు "కోతికొమ్మచ్చి"లో ప్రస్తావించారు కూడా. బాబా అజ్మీ కజిన్ ఇషాన్ ఆర్యా బాపు సినిమాలు - ముత్యాలముగ్గు, గోరంతదీపం - సినిమాలకి కెమెరామన్.)

కైఫీ అజ్మీ రాసిన గుబాళించే ఉర్దూ కవితకి గులాబీ పరిమళాలని అద్దింది గులామ్ మొహమ్మద్ సంగీతం. పాటని గొంతులో గాలి అలలుగా వినిపించింది లతా మంగేష్కర్.

ఆకాశంలో ఉండే ౘందమామ -  తను అమ్మాయిగా మారితే ఎలా ఉంటానో చూసుకుందామని సరదా పడి - అలంకరించుకుని భూమ్మీదకి వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మీనాకుమారి ఈ పాటలో.

అలాసరదా పడి వచ్చి - పిల్లతెమ్మెర లాంటి పాట పాడుతూ - అలవోకగా - అందెల చిరుసవ్వడితో ఆడుతున్న తన ప్రతిబింబాన్ని అద్దంలో దొంగచాటుగా చూసుకుని మురుస్తున్నట్టుగా - ౘందమామ ఈ పాట సాగుతున్నంత సేపూ ఆకాశంలో దోబూచులాడుతూ కనిపిస్తూ ఉంటాడు.

ౘందమామ లాంటి మీనాకుమారి వెనకాల - వెన్నెల నద్దుకున్న మబ్బుతునకల్లా అలా-అలా అలల మీద జంట నావల్లా - కదిలీ కదలనట్లుగా ఉన్న - తేలిక పాటి కదలికలతో - నాట్యం చేస్తున్న అమ్మాయిలిద్దరి మీంచి చూపు మరల్చుకుందామన్నా మరలదే - అది ఏమి మాయో - మదిని మురిపించి మైమరపించే...  మరదే !

ముందు కనిపిస్తున్న మీనాకుమారి దెంత మురిపించే అందమైనా - ఆ వెనకున్న అమ్మాయిల హొయలుకి మైమఱచె నా డెందమే!

పాట మొదలు పెడుతూ - వహీ థమ్‌కే రహ్ గయీ హై అన్న చోట మీనాకుమారి ఒక చేతిని అలా చులాగ్గా కదుపుతూ, కళ్ళతో కనిపించీ కనిపించనట్లుగా చేసే ఒక చిన్న సైగతో... వాహ్! ఆ జాణతనం చూడాల్సిందే!

ఇంకా - కే ఫసానా బన్ గయీ హై ... మేరే బాత్ టల్‌తే-టల్‌తే అని పాడేటప్పుడు చేతుల తోనూ, ఒక పక్కకి కొద్దిగా వంచిన తల తోనూ కూడా కూడా నాట్యం చేయించేసింది మీనాకుమారి.

షబ్-ఏ-ఇంతెజార్ ఆఖిర్ - కభీ హోగీ ముఖ్తసర్ భీ అన్న చోట అంత అందంగా మందమారుతపు సాయంతో తూగుతున్న రాత్రి అక్కడితో ఆగిపోతుందేమోనని దిగులుతో - ౘందమామ - చిన్నబుచ్చుకున్న మొహంతో మబ్బుల చాటుకి వెళ్ళి పోతున్నట్టు కనిపిస్తాడు.

ఈ పాటలో నాకు బోల్డంత నచ్చింది ఏంటీ అంటే...ముగ్గురమ్మాయిలూ చేసిన డాన్స్.

ఆట్టే కదలకుండా ఎంత బాగా చేశారో... ఆ చల్లని వెన్నెల రాత్రిలో వెన్నెల తాగి మత్తిల్లిన వెన్నెలపులుగులు - చకోర పక్షుల్లా.

వాళ్ళకి తోడు  ఆ వెనకగా పాటకి ఆడుతున్న జలయంత్రపు నీళ్ళు, దాని పైగా కింద ఆడుతున్న వయ్యారిభామకి దీటుగా మబ్బుల మేలిముసుగులో దోబూచులాడుతున్న జాబిలి పోకళ్ళు - చూసిచూసి నా కళ్ళ ముందు కలలా నిలిచిపోయాయి ఆ తళుకులు, బెళుకులు, మెరుపులు, జిలుగులు.

ఇది మహా సొగసైన పాట.

ఈ పాట తెలుగులో రాస్తున్నంత సేపూ రాస్తున్న ఒక్కో మాట దగ్గర ఆగి - ముఖ్యంగా - సర్-ఏ-రాహ్, షబ్-ఏ-ఇంతెజార్, ముఖ్తసర్, చల్‌తే-చల్‌తే, టల్‌తే-టల్‌తే, ఢల్‌తే-ఢల్‌తే, జల్‌తే-జల్‌తే - అన్న మాటలు రాస్తూ నేనెంత మురిసిపోయానో నాకే తెలుసు.

ఈ పాటలో అక్కడక్కడ పెట్టిన three dots (ellipses), hyphens, line breaks అన్నీ కూడా - నేను రాస్తున్న పాటని ఎంత అందంగా ఎక్కెడెక్కడ ఆపితే ఇంకెంత అందంగా అర్థం స్ఫుటంగా ఊరిస్తూ స్ఫురిస్తుందో అనుకుంటూ పెట్టినవి.

అన్నట్టు ఇంకో మాట... హిందీ कोई ని మన తెలుగులో సాధారణంగా కోయీ అని రాసేదాన్ని. ఈ పాటలో మాత్రం అలా రాయడానికి మనసొప్పక తెలుగులో కూడా కోఈ అని రాసుకున్నాను.

రాస్తూ రాస్తూ ఈ పాట మీద నాకు కలిగిన మోహం, పెరిగిన వ్యామోహం మాటల్లోకి తర్జుమా చెయ్యాలంటే బోల్డన్ని కబుర్లు చెప్పే నాకే మాటలు దొరకట్లేదు.

ఇక్కడికి ఈ పాట గురించి చెప్పడం ఆపుతాను. అంతా దీని గురించే చెప్పేస్తే ఆ రెండో హోరుగాలి పాట అలుగుతుంది నా మీద.








చల్‌తే-చల్‌తే... చల్‌తే-చల్‌తే...
యు హీ కోఈ - మిల్ గయా థా!
యు హీ కోఈ - మిల్ గయా థా! 
సర్-ఏ-రాహ్... చల్‌తే-చల్‌తే... 
సర్-ఏ-రాహ్...  చల్‌తే-చల్‌తే...

వహీ థమ్‌కే - రహ్ గయీ హై
వహీ థమ్‌కే - రహ్ గయీ హై
మేరీ రాత్... ఢల్‌తే-ఢల్‌తే...  
మేరీ రాత్... ఢల్‌తే-ఢల్‌తే... 

జో కహీ గయీ న - ముఝ్‌సే 
జో కహీ గయీ న - ముఝ్‌సే
వో - జమానా కహ్ రహా హై   
వో - జమానా కహ్ రహా హై
 
కే ఫసానా... 
కే ఫసానా - బన్ గయీ హై   
కే ఫసానా - బన్ గయీ హై   
మేరీ బాత్... టల్‌తే-టల్‌తే   
మేరీ బాత్... టల్‌తే-టల్‌తే   
  
యు హీ కోఈ - మిల్ గయా థా!
యు హీ కోఈ - మిల్ గయా థా! 
సర్-ఏ-రాహ్... చల్‌తే-చల్‌తే... 
సర్-ఏ-రాహ్...  చల్‌తే-చల్‌తే... 

యు హీ కోఈ - మిల్ గయా థా!
సర్-ఏ-రాహ్...
చల్‌తే-చల్‌తే... చల్‌తే-చల్‌తే  
సర్-ఏ-రాహ్... 
చల్‌తే-చల్‌తే... చల్‌తే-చల్‌తే
     
చల్‌తే-చల్‌తే... చల్‌తే-చల్‌తే

చల్‌తే-చల్‌తే... చల్‌తే-చల్‌తే

చల్‌తే-చల్‌తే... చల్‌తే-చల్‌తే
  
చల్‌తే-చల్‌తే... చల్‌తే-చల్‌తే
యు హీ కోఈ - మిల్ గయా థా!
యు హీ కోఈ - మిల్ గయా థా! 

షబ్-ఏ-ఇంతెజార్ ... ఆఖిర్
షబ్-ఏ-ఇంతెజార్ ... ఆఖిర్
కభీ హోగీ ముఖ్తసర్ భీ... 
కభీ హోగీ ముఖ్తసర్ భీ...

యే చిరాగ్...  
యే చిరాగ్ - బుఝ్ రహే హై   
యే చిరాగ్ - బుఝ్ రహే హై   
మేరే సాథ్... జల్‌తే-జల్‌తే   
మేరే సాథ్...  జల్‌తే-జల్‌తే   
యే చిరాగ్ - బుఝ్ రహే హై  

యే చిరాగ్ - బుఝ్ రహే హై
యే చిరాగ్ - బుఝ్ రహే హై
యే చిరాగ్ - బుఝ్ రహే హై
యే చిరాగ్ - బుఝ్ రహే హై
యే చిరాగ్ - బుఝ్ రహే హై
మేరే సాథ్... జల్‌తే-జల్‌తే
మేరే సాథ్... జల్‌తే-జల్‌తే

*****************
*****************


నన్ను చుట్టుముట్టి ఊపేస్తున్న ఇంకో గాలిపాట - ప్రాణం ఖరీదు సినిమాలో ఏలియల్లో... ఏలియల్లో ... ఎందాకా ? పాట. 

ఈ పాట రాసినవారు జాలాది రాజారావు. పాడిన వారు జి. ఆనంద్, ఎస్పీ శైలజ. పాట మొదట్లో వచ్చే ఏలియల్లో  అంటూ వచ్చే రెండు లైన్లూ పాడింది డాక్టర్ కోనాల సువర్ణ చంద్రశేఖర్ గారట. 

ఈ పాటకి సంగీతం కూర్చినవారు స్వరరాగపూరితగానానువర్తి**- చక్రవర్తి. తెలుగు సంగీత దర్శకుల్లో నాకు చాలా ఎక్కువగా నచ్చే బాణీ చక్రవర్తిది. పాట ఎంత అలవోకగా ఆడుతూ పాడుతూ కట్టినట్లు ఉంటుందో! పాటలో ఉన్న మాటలు స్పష్టంగా వినిపించేలా - ఒకే రాగంతో అన్ని పాటలూ కట్టినట్లున్నా ఏ పాటకాపాటే తన రాగమేదో వేరన్నట్టుగా ఉంటుంది. 

(**స్వరరాగపూరితగానానువర్తి : ఇది సంగీతంలో ఓనమాలు కూడా దాటలేకపోయిన నేను కూడా పాడుకునేంత సులువైన రాగాలతో పాటలు కట్టిన చక్రవరి పాటల మీద ఇష్టంతో ఆయనకి నేను పెట్టుకున్న పేరు. )

ఇక పాటలో ఆడినవారు ప్రాణం ఖరీదు సినిమాకి నూతనతారలు - రేష్మీ, చిరంజీవి. 

పైన చెప్పుకున్న హిందీ పాటలో మీనాకుమారి వెన్నెల కురిసే జాబిలి కన్నె అయితే - ఈ తెలుగు పాటలో చిరంజీవి కళ్ళు మిరుమిట్లు గొలిపించే సూరీడు. 

గాలిలో....లీలగా ... అవలీలగా - చేసిన తన డాన్స్ చూస్తే ఇదసలు చిరంజీవికి - విడుదలైన మొట్టమొదటి సినిమా - అంటే నమ్మలేం. 

ఆ వెలిగే కళ్ళ నవ్వు మొహం, గాలిలో తేలుతున్నట్టుగా కదిలే పాదాలు, చేస్తున్న డాన్సులో చిరంజీవికే సొంతమైన ease, grace చూస్తే Gifted he is! అనిపించింది. 

ఇక పాటలో పల్లెటూరి మొనగాడు - కుచ్చుపంచెల చిరంజీవికి - జతగా ఆడిన జడకుచ్చుల పల్లెటూరి పిల్ల రేష్మి ఎంత బావుందో! 

గళ్ళచీర, బుట్ట చేతుల జాకెట్టు, పొడుగు జడ, మెళ్ళో ఆడే గుళ్ళపేరు, నున్నగా జడ దువ్వుకుని జతగా ఆడుతున్న సూరీడి వెలుగుని కొంచెం పంచుకుని మెరుస్తున్న ౘందమామ లాంటి మొహం - బంగారంలా మెరిసింది తెర మీద. 

ఈ గాలిపాటలో బంగారి రేష్మి కనిపించడమే - రెండు చేతులూ బారచాచి - తానే గాలేమో అన్నట్టు కమ్ముకుంటూ వస్తుంది. ఆ పరుగులో - ఒక విరుపు, ఒక మెరుపు, ఒక వెతుకులాట, ఒక వలపు పాట - కనిపిస్తాయి. 

పాట చూస్తున్నంత సేపూ - నలుపు-తెలుపుల పాటే అయినా - ఎఱ్ఱగా మెరుస్తున్న సూరీడు, ఎండ పొడన వెచ్చగా కాగుతున్న చెట్లూ కనిపిస్తాయి. వాటితో పాటే వెచవెచ్చని గాడుపు తగులుతున్నట్టనిస్తుంది. 

ఇక జాలాది రాసిన పాటలో నాకు నచ్చిన మాటలు రాయాలంటే పాట మొత్తం మళ్ళీ ఇక్కడ రాసెయ్యాల్సిందే. పాటలో ఎంత కవిత్వం!

తిరణాల గిలకలూ... 
ఎన్నెల్లో ఇల్లూ - చుక్కల్లో పక్కలూ... 
గీరెక్కిపోయిన గోరంకలూ...
మేజువాణి ఆడిన రోజువారి మోజులూ... 
రేతిరంత నిదర కాచి నవ్విన కలవపూలూ... 
పడమటేపు పడకేసి దొర్లి - తూరుపేపు తలుపు తీసి నవ్విన సూరిగాడూ....

ఏ మాట కవిత్వమని చెప్పను? ఏ మాట కవిత కాదని అనను? ఎంత సొంపైన మాటలు! ఏమి సొబగైన పాట!

యూట్యూబ్లో ఉన్న పాట చూడడానికి బావుంది. కానీ ఈ పాట వినడానికి మాత్రం చిమటా శ్రీనివాస్ గారి website కి వెళ్ళాల్సిందే: www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=9600

అక్కడ వినండి... ఇక్కడ చూడండి...






ఏలియల్లో ఏలియల్లో ఎందాకా?
ఎల మీరి పోయేనమ్మా గూటి సిలకా... 

ఓలమ్మ తిరణాల గిలకా - వగలాడి ఒయ్యారి మొలకా 
ఓలమ్మ తిరణాల గిలకా - వగలాడి ఒయ్యారి మొలకా 
ఎన్నెల్లో ఇల్లేయనా? చుక్కల్లో పక్కేయనా?
ఎన్నెల్లో ఇల్లేయనా? చుక్కల్లో పక్కేయనా?

గోరంక గోరంక తుమ్మెదా...గీరెక్కిపోయింది తుమ్మెదా.. 
గోరంక గోరంక తుమ్మెదా...గీరెక్కిపోయింది తుమ్మెదా.. 

ఓరయ్యో చంద్రయ్య కొడకా - పొద్దుల్లో నా యెంట పడకా 
ఓరయ్యో చంద్రయ్య కొడకా - పొద్దుల్లో నా యెంట పడకా 
ఆ మూడు ముళ్ళెయ్యరా - నూరేళ్ళ పడకెయ్యరా 
ఆ మూడు ముళ్ళెయ్యరా - నూరేళ్ళ పడకెయ్యరా

పాలమబ్బు గువ్వల మీద మెరుపు మెరిసి ఆడినట్టే
నీలికొండ గుండెల మీద వాన సుక్క జారినట్టే 

వాన సుక్క వాగులయ్యీ సముద్రాన కలిసినట్టే 
వాన సుక్క వాగులయ్యీ సముద్రాన కలిసినట్టే 
రోజువారి మోజులన్నీ మేజువాణి ఆడినట్టే 

ఓరయ్య నేనాడుకోనా ? ఒడి నిండ నేనుండిపోనా?
ఓరయ్య నేనాడుకోనా ? ఒడి నిండ నేనుండిపోనా?

ఏలియల్లో ఏలియల్లో ఎందాకా?
ఎల మీరి పోయేనమ్మాగూటి సిలకా... 

రేతిరంత నిదర కాచి కలవపూలు నవ్వినట్టే 
రేపు మాపు ఆకాశం ఆకు-వక్క వేసినట్టే 

పడమటేపు పడకేసి సూరిగాడు దొర్లినట్టే 
పడమటేపు పడకేసి సూరిగాడు దొర్లినట్టే 
తూరుపేపు తలుపు తీసి తొంగి సూసి నవ్వినట్టే 

సందెల్లో సిందేయనా? పొద్దల్లే ముద్దెట్టనా?
సందెల్లో సిందేయనా? పొద్దల్లే ముద్దెట్టనా?

ఓరయ్యో చంద్రయ్య కొడకా - పొద్దుల్లో నా యెంట పడకా 
ఓరయ్యో చంద్రయ్య కొడకా - పొద్దుల్లో నా యెంట పడకా 
ఎన్నెల్లో ఇల్లేయనా? చుక్కల్లో పక్కేయనా?
ఆ మూడు ముళ్ళెయ్యరా - నూరేళ్ళ పడకెయ్యరా 


ఏలియల్లో ఏలియల్లో ఎందాకా?
ఎల మీరి పోయేనమ్మాగూటి సిలకా...
ఏలియల్లో ఏలియల్లో ఎందాకా?
ఎల మీరి పోయేనమ్మాగూటి సిలకా...

*****************
*****************

అక్కడెక్కడో - ఆ పైన - ముందే చెప్పినట్టు ...

చిరుగాలి పాటలో ఊయలలూగుతా 
ఊగుతూ ఊగుతూ తూలియాడుతా... 

హోరుగాలి పాటతో చిందేసి ఆడతా
ఆడుతూ ఆడుతూ సోలి వాలుతా...

~ పాటల భైరవి
 

6, సెప్టెంబర్ 2020, ఆదివారం

డోంట్ ట్రై టు సే "C U Soon" ఇన్ తెలుగు, ప్లీజ్!

సినిమా - నాకొక ఇష్టమైన వ్యసనం.

వారమంతా ఆఫీసు పనిలోనూ, ఇంటి పనిలోనూ ఎంత హడావిడిగా గడిచిపోయినా శుక్ర, శనివారాలు సాయంత్రాల్లో ఒక్క రెండు సినిమాలు చూస్తినా....  ఆ వారం నాకు నచ్చినట్టు వచ్చిపోయినట్టే.

అందులోనూ నాకు దొరికిన ఇంకో సినీ-మా-అదృష్టం ఏంటంటే నాతో పాటు నాకిష్టమైన సినిమాలు చూడడానికి అంతే ఇష్టంగా సిద్ధపడే బదరి సినీ-మా-సాంగత్యం.

మేమిద్దరం కలిసి - కంబైన్డ్ స్టడీ లాగా సినిమాలు చూసేస్తూ ఉంటాం.
మా ఇద్దరికీ టైం కుదిరి కొన్ని సినిమాలు చూస్తే - మా టైం బాలేక కొన్ని సినిమాలు చూడాలనుకోకపోయినా చూసేస్తాం.

సినిమా ఎలాంటిదైనా ఒక్కటే ఒప్పందం. ఆట మొదలెడితే ఆపకూడదు.

ఈ మధ్య చేసుకున్న ఇంకో అలవాటు ఏంటంటే వారం మధ్యలో కూడా ప్రతీ సాయంత్రం ఒక అరగంట ఏదో ఒక సినిమా చూడడం. అంటే సినిమాలని డైలీ సీరియళ్ళలా చూస్తున్నాం.

ఈ వారం సీరియల్‌గా చూసిన సినిమాలు రెండు - ఒకటి పాత హిందీ సినిమా ముఘల్-ఏ-ఆజం,  రెండోది కొత్త తెలుగు సినిమా శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట.

మొదటి సీరియల్-సినిమా  ముఘల్-ఏ-ఆజం లో నాకు నచ్చినవి - అక్బర్ ఇలాగే ఉండేవాడేమో అనిపించేలా చేసిన పృథ్వీరాజ్ కపూర్, లేలేత దానిమ్మ పూవులాంటి మధుబాల అందం, అనార్కలిగా అలరించిన ఆమె అభినయం. ముఖ్యంగా కంటికి విందుగా తళుక్కుమన్న ముఘల్ అద్దాల అలంకరణల grandeur. ఇవన్నీ కాకుండా ఇంకొక్క తమాషా విషయం ఏంటంటే మన పాత తెలుగు సినిమాల్లో ఉండే సినిమా-వకుళ శాంతకుమారిలా ఉండే దుర్గా ఖోటే ముఘల్-ఏ-ఆజం సినిమాలో అక్బర్ భార్య జోధాబాయి. ఆవిణ్ణి చూస్తున్నంత సేపూ ఇటీవలి జోధాబాయి ఐశ్వర్యా రాయ్ కూడా జ్ఞాపకం వస్తూనే ఉంది. 

రెండో సీరియల్-సినిమా శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట లో కనిపించిన గోదారి-సీమ అందంగా ఉంది. అనాథగా పెరిగిన హీరో ఆర్నాల్డ్ ష్చ్వార్జ్‌నెగ్గర్ లాగా రెండరడజన్ల మందిని చితక్కొట్టేయడం, పల్లెటూళ్ళో ఉన్న ఆరున్నొక్క రోజుల్లోనే నాట్లేసేసి, అరక దున్నేసి, కుప్ప నూర్చేసి, తూర్పార పట్టేయటం - నేనిప్పటికీ అరిగించుకుని అర్థం చేసుకోలేకపోతున్న అద్భుతం. పైగా ఇంకెవరితోనో పెళ్ళి కుదిరిన అమ్మాయికి పాఠం చెప్పరా అంటూ హీరో లాంటి అబ్బాయిని హీరోయిన్ను తండ్రి బ్రతిమాలడం, వాళ్ళిద్దర్నీ ఊళ్ళో ఎక్కడ బడితే అక్కడ ట్యూషన్ చెప్పుకోండ్రా అని ఊరి మీదకి వదిలేయడం - అర్థం చేసుకుందామన్నా అరగని అపార్థం. చివరాఖరుగా చెప్పాలంటే ఈ సినిమా - ఎగిరెగిరి ఉట్టి కొట్టలేకపోతున్న హీరోని తన భుజాల మీదకి ఎక్కించుకుని ఉట్టి కొట్టించిన హీరోయిన్ నాన్నని చూసి అవాక్కయిన నేను - ఆ సినిమా అప్పటికప్పుడు కట్టేసి ఎందుకు walk-away చేయలేదూ అని అనుకుంటూనే - అనుభవించేసిన అనర్థం.

ఇంకొక్క సినిమా  - నిన్నంటే నిన్నే చూసిన "V" గురించి - మరీ ఎక్కువగా ఏమీ చెప్పను - కానీ.... నానీకో మాట...

నువ్వు విక్కీవో, విష్ణువో కానీ ... ఓ నానీ! నీ సినిమా నిండా అంత రక్తమేంటయ్యా బాబూ? నీ సినిమా అంటే ఎంచగ్గా పిల్లా-పాపలతో డ్రాయింగ్ రూంలో pillow లేసుకుని చూసే సినిమా అని తెగ మురిసిపోయేదాన్ని. ఇహిప్పట్నుంచీ అలా అనుకోవడానికి లేదని తెలిసిపోయింది.

నీ V కథ గురించి, అందులో ఇంట్లో కూడా కత్తులు పట్టుకు తిరిగే అమ్మాయీ, అమ్మ-నాన్నల గురించి, ఆ అమ్మాయి నాన్న మాట్లాడే తలా-తోకా లేని మాటల గురించి - ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో!

అసలయినా... మీరందరూ మాట్లాడిన డైలాగులేమిటో ఇప్పుడు సినిమా చూస్తే మీకైనా వినిపిస్తాయా? అర్థమవుతాయా?

చూసేది తెలుగు సినిమా, మన మాతృభాష - అనుకుంటూ సబ్-టైటిల్స్ పెట్టుకోవడానికి మొహమాట పడి - ఏం వింటున్నామో ఎంత సౌండ్ పెంచినా అర్థం కాక - ముందుకీ వెనక్కీ వెళ్తూ రెండున్నర గంటల సినిమాని మూడు గంటల సేపు చూశాం - నిద్రనాపుకుంటూ.

పోన్లే! మాలాంటి వాళ్ళం చూడకపోతే తెలుగు సినిమా పరిశ్రమకి పోయేదేం లేదు. ఇదే గొప్ప సినిమా అనుకుని తీసినవారికి వందనం! తెలుగు సినిమా ఇక మారదు అన్న నమ్మకాన్ని నిలబెట్టినందుకు అభివందనం!!


చిట్టచివరగా - ఈ వారం చూసిన ఇంకొక్క మలయాళం సినిమా "C U Soon" గురించి.

ఫహాద్ ఫాజిల్ సినిమా అని తెలియగానే చూడకుండా ఉండలేకపోయాం. చూశాక 'ఎంత బాగా తీశారు!' అనుకోకుండా ఉండలేకపోయాం. సినిమా టైటిల్స్ దగ్గర నుంచి సినిమా చివరివరకూ Google - Hangouts స్క్రీన్స్ లోనే కథని నడిపించిన - గంటన్నర సేపు సినిమాని ఎంతో imagination తో, creative గా తీసిన ఈ సినిమాని నిజ్జంగా కళ్ళార్పకుండా చూశాం.

అసలూ ... ఇదేం సినిమా అబ్బా?

మరీ కథే హీరో అనుకుంటూ గంటన్నరకే చుట్టేస్తారా? హన్నా! ఇదే మా తెలుగులో అయితేనా... కెవిన్‌కీ, వాళ్ళ ఆడబాస్ సంజనాకి ఓ డ్యూయెట్టు - జిమ్మీకి, అనూకి ఓ డ్యూయెట్టు - అనూకి ప్రిస్క్రిప్షన్ రాసిన డాక్టర్ ప్రశాంతుతో ఓ కామెడీ ట్రాకూ - జిమ్మీ ఇల్లు సోదా చెయ్యడానికొచ్చిన దుబాయి పోలీసులతో ఇంకో కామెడీ ట్రాకూ -  అనూకి ఎఱ్ఱ జిగేల్, జిగేల్ గౌను వేసినప్పుడు ఓ క్లబ్బుదో, పబ్బుదో ఓ డాన్సూ - అనూ ఎక్కిన విమానం రెక్కలు పట్టుకుని కిటికీలోంచి దూకి జిమ్మీ అనూని చేరే ఏక్షన్-ప్యాక్డ్-సీను  - అబ్బబ్బా! ఎన్ని పెట్టేవాళ్ళో! ఇంకో గంటన్నర అయినా కథ సాగేది. 

మంచు కొండల్లో లేకపోతే పోయే దుబాయి ఎడారి ఇసుకలో డ్యుయెట్లు పెట్టలేరూ? సినిమాకి తీసుకున్న కథ ప్రకారం ఎంతెంత OTT-type సీన్లు చూపించడానికి ఎంతో అవకాశం ఉన్నా మరీ అంత చెప్పీ-చెప్పకుండా చెప్పినట్టు అంత decent గా సినిమాని నడిపించెయ్యడమే! అనూ పడ్డ కష్టాలు వీడియోలో చూస్తూ కెవిన్ ఒక్క చుక్క కన్నీరు కార్చేసి, కళ్ళెఱ్ఱబరచుకున్నట్టు - అంత బరువైన సీన్ అసలు అలా అంత చులాగ్గా ఎలా తీసేశారో!?

పాదాల దగ్గర మొదలుపెట్టి పైకి కెమెరా పోనిస్తూ హీరోని కథ లోకి పట్టుకు రాకపోతే సినిమాల్లో ఇంకేం చూసేట్టు? అంటే...కథ బావుంటే ఎలాగైనా చూసేస్తామనే కదా వాళ్ళ ధీమా!!

ఏ మాటకామాట చెప్పుకోవాలి - సినిమా అంతా చూసేశాక - పోన్లేబ్బా! ఈ సినిమా ఉన్నదున్నట్టుగా తెలుగులో ఎవ్వరూ తియ్యరు, తియ్యలేరు - అని నమ్మకంగా అనిపించింది. అంతే కాకుండా ఇలా కూడా చెప్పాలనిపించింది... డోంట్ ట్రై టు సే "C U Soon" ఇన్ తెలుగు, ప్లీజ్!

చివరాఖరుగా ఓ మాట...

నా మటుక్కి నాకు - సిట్టసివరిదాకా - నిద్దరోకుండా  - మాటాడుకోకుండా .... సూసేదే అసలు-సిసలైన సినిమా... 

~ సినీ-మా-లక్ష్మి వ్రాలు