27, ఏప్రిల్ 2020, సోమవారం

మనసే జతగా పాడిందిలే - 19 - కవలపాటలు - తమిళ కడలి ఒడ్డున పాడిన కవితే... తెలుగు ఆరాధన

నీతో కలిసి పాడుకున్న
అప్పటి ...
పాట ఒకటి - గాలిలా తాకేది 
పాట ఒకటి - చినుకులా తగిలేది 
పాట ఒకటి - అలలుగా ఎగసేది 
పాట ఒకటి - తలపుగా ఒదిగేది 
పాట ఒకటి - మనసులో నిలిచేది 
పాట ఒకటి - వలపుగా మసలేది
************

నీతో పంచుకున్న ఊసుల
ఒకప్పటి...
ఆ పాటే... తెలిసిన దారుల తిప్పినది 
ఆ పాటే... తెలియని తీరుల మప్పినది 
ఆ పాటే... కంటి చెమ్మై తడిపినది 
ఆ పాటే... ఎంతో ప్రేమై తడిమినది 
ఆ పాటే... తొలివలపై మురిసినది 
ఆ పాటే ... చిరునగవై మెరిసినది
************

నువ్వు లేని ఈవేళ
ఇప్పుడూ... 
అదే పాట - మళ్ళొచ్చి పిలుస్తుంది
అదే పాట - మళ్ళించి మరిపిస్తుంది 
అదే పాట -  రమ్మని కవ్విస్తుంది 
అదే పాట - కమ్మగ నవ్విస్తుంది 
అదే పాట - ఇంతలోనే ఆటపట్టిస్తుంది 
అదే పాట - అంతలోనే పట్టరాని ఏడుపవుతుంది
************

అప్పుడుండి ... ఇప్పుడు లేక  ... ఇంకెప్పటికీ రాక...
నువ్వు లేక మనని మన-మై
పలకలేని మౌనమై
తోడులేని నా పాట
మరలిపోయిన వసంతమై
మరల కూడని యుగళమై  
పగిలిన గొంతుకై 
పిగిలిన గానమై
మరపురాని బాధై 
మరవలేని గాధై 
వీడలేని నీడలాగ 
వెన్నంటి ఉంటుంది 
వీడిపోయిన తోడులాగ 
వెంటాడి వేధిస్తుంది
************
************
 

ఒక జ్ఞాపకం...
ఒక తీగకి విరిసిన పువ్వుల్లా నవ్వుకున్న రోజుల్నాటిది.
మువ్వల్లా తుళ్ళుకుంటూ పాటల సవ్వడి చేసిన పూటల్నాటిది.
ఇప్పటికీ తలుచుకున్నప్పుడు నవ్వుగా విచ్చుకుంటుంది.
అల్లాంటప్పుడు విన్న పాటొకటి,  వింటుండగానే నచ్చిందొకటి గుర్తుకొస్తుంది.
ఆనాటి ఆ పాట గుర్తు - అచ్చు అప్పట్లాగే - నవ్వుగా విచ్చుకుంటూనే, అంతలోనే నొవ్వుగా గుచ్చుకుంటుంది.
అలాంటి ఓ జ్ఞాపకం... అప్పటి పాటే - ఈ పూటకి ఈ చోట... ఓ రెండు కవలపాటలుగా...

చైత్ర-వైశాఖ మాసములు - వసంతఋతువు. 
చెట్లు చిగిర్చి పూలు పూయును 
అది ప్రకృతి నియమం.  

లల్లి-పప్పి-కుట్టి హాసములు - మా సొంత ఋతువు. 
నవ్వులొలికి పాటలవును. 
ఇది మా శృతి సమయం. 

చిరుచిరు చలి రోజులు పాతబడి, సూరీడి పాలబడి, గాలి వెచ్చపడి, వేడెక్కి గాడుపై - విసిరి విసిరి - వట్టివేరు పరదాల దాటి రాలేక ఉడుకుమోత్తనంగా - విసిగి వేసారి - మా ఇంటి గడపల కావల కావలిగా చిందులాడేవేళ.
 
కన్నకడుపు మా అమ్మది. 

ఉసురుసురనిపించే వేసంగి మధ్యాహ్న వేళ - సనసన్నటి బియ్యపు రవ్వతో జావ కాచి, దానికి చలచల్లటి పల్చటి మజ్జిగ జేర్చి, ఆపై పులపుల్లటి నిమ్మరసం పిండి, దాంట్లో చిటికెడు రాతి ఉప్పేసి, వాటన్నిటినీ గరిటెతో తిప్పేసి - ఆ పుల్లమృతాన్ని తలో కప్పులో పోసి మా ముగ్గురి చేత బెట్టేది.

తిన్న మా కడుపుకి చలవది.

చేతిలో కడుపు నింపే చల్లని జావామృతం. 
పక్కనే టేప్ రికార్డర్లోంచి మనసు జిల్లుమను ఇళయరాజా-సంగీతామృతం. 
అప్పుడు విన్నది ఆ పాట. 
మొదటిసారి విన్నప్పుడే ఆకట్టేసుకుంది. 
పెదవుల చుట్టేసుకుంది. 
అర్థం అయీ అవక అవస్థ పెట్టేసింది. 
ఎక్కడికెళ్ళినా వెంటాడి వచ్చేసేది. 

గుంటూరు ఓవర్ బ్రిడ్జ్ వాలులో జారిపోతున్నట్టుగా నడుస్తూ తేలిపోతున్నప్పుడో - నవోదయా లోనో, ప్రబోధ లోనో కొత్తపుస్తకాల వాసనల మఱఁగి సోలిపోతున్నప్పుడో - అదాటుగా గుర్తుకొచ్చేసి - గాలి అలలుగా చుట్టుముట్టి - ఉక్కిరిబిక్కిరి చేసేసేది.

అప్పట్నుంచి ఆ పాట ఎన్నిసార్లు విన్నానో లెక్క లేదు. 
ఇప్పటికీ వింటుంటాను - దాదాపు రోజూ.
అప్పుడెప్పుడో పారేసుకున్న కల-పాటైన మా కుట్టి నవ్వుల్ని గుర్తు చేస్తుందనే ఇష్టంతో.
అలా కోరికోరి కొనితెచ్చుకునే కావాలనుకునే ఓ ఇష్టమైన నొప్పిలా అలవాటైపోయింది ఆ పాట.

ఆ పాటే - భారతీరాజా దార్శనిక "ఆరాధన" లోని "అరె, ఏమైందీ!" పాట.

ఈ పాటలో నాకిష్టమైనవి... 

ఆత్రేయ రాయుట...

ఎస్పీబీ, ఎస్జానకి పాడుట...

పాట మొదట్లో కనిపించే క్రిస్టియన్ హోమ్ - మా ఏసీ కాలేజ్‌ని గుర్తు చేస్తూ...

అప్పుడప్పుడే నడక నేరుస్తూ - తలలొంచుకుని కాళ్ళ కింద తరుగుతున్న నేలని చూసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ కాళ్ళని చుట్టేయాలనుకునే అల్లరిపిల్లల్లా - ఒడ్డుకి సాగి వస్తున్న అలల నురుగులు...

అందుకుందామన్నట్టు ఎగసి వచ్చే అలలకందక పైపైకి ఎగిరిపోయే పక్షులు... 

పాటంతా పరుచుకున్న సముద్రం, ఇసక, గాలి, వెండి ఎండ, వెచ్చటి సూర్యుడు, కురిసే వర్షం, పచ్చగ తడిసే చెట్లు...

వీటన్నిటి మధ్యా  - కాన రాని గుండె లోకి - కన్నమేసి వచ్చావు - అన్న మాటల దగ్గర - తన వలపు-దొంగతనాన్ని పట్టేసిన అమ్మాయి తన మీద మోపిన నేరాన్ని ఒప్పుకుంటున్నట్టుగా ఒక్క కంటి రెప్ప పాటులో చిరంజీవి చేసిన అభినయం... 

పాట పొడవునా మెరిసిన నవ్వులు...సుహాసిని పట్టుకున్న లేతరంగు గొడుగులు... 

బీడు లోన - వాన చినుకు - పిచ్చి మొలక వేసింది - అన్న దగ్గర టీచరమ్మతో దొరికిన సావాసాన్ని తలుచుకుని - కాలు ఊపుతున్న  చిరంజీవిలో కనిపించిన పట్టరాని సంతోషం ... 

అన్నిటికన్నా ఎక్కువగా ఇష్టమైనవి... రెండో చరణంలోని నాలుగు లైన్లు... 

బీడు లోన - వాన చినుకు - పిచ్చి మొలక వేసింది
పాడలేని - గొంతు లోన - పాట ఏదొ పలికింది
గుండె ఒక్కటున్న చాలు.. గొంతు తానె పాడగలదు
మాటలన్ని దాచుకుంటె - పాట నీవు రాయగలవు - ఇవి ఏ నీరెండ జాలుల్లోనో నాకు మాత్రమే కనిపించి - వానచినుకుల గలగలల్లో నాకు మాత్రమే వినిపించే మా కుట్టి నవ్వులా - అది లేకపోయినా నేను పాడుతూనే వుండాలని చెప్తున్నట్టుంటాయి... 


ఇవన్నీ మీరూ చూసెయ్యండి... 



అరె, ఏమైందీ?... 
అరె, ఏమైందీ?
ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది
అది ఏమైందీ?
తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలింది
కలగాని కలఏదొ కళ్ళెదుటె నిలిచింది...
అది నీలొ మమతను నిద్దుర లేపింది...
 ఆ ఆ ఆ ఆ ...
అరె, ఏమైందీ?
ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది
అది ఏమైందీ?

నింగి వంగి - నేలతోటి - నేస్తమేదొ కోరింది
నేల పొంగి - నింగి కోసం - పూలదోసిలిచ్చింది
పూలు నేను చూడలేను - పూజలేవి చేయలేను
నేల పైన కాళ్ళు లేవు - నింగి వైపు చూపు లేదు
కన్నెపిల్ల కళ్ళ లోకి ఎన్నడైన చూశావో!
కాన రాని గుండె లోకి - కన్నమేసి వచ్చావు
అది దోచావూ...
ల ల ల ల ....

బీడు లోన - వాన చినుకు - పిచ్చి మొలక వేసింది
పాడలేని - గొంతు లోన - పాట ఏదొ పలికింది
గుండె ఒక్కటున్న చాలు.. గొంతు తానె పాడగలదు
మాటలన్ని దాచుకుంటె - పాట నీవు రాయగలవు
రాత రాని వాడి రాత దేవుడేమి రాశాడో?!
చేతనైతె మార్చి చూడు - వీడు మారిపోతాడు
మనిషౌతాడూ..

అరె, ఏమైందీ?
ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది
అది ఏమైందీ?
తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలింది
కలగాని కలఏదొ కళ్ళెదుటె నిలిచింది...
అది నీలొ మమతను నిద్దుర లేపింది...
అరె, ఏమైందీ?
ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది
అది ఏమైందీ?
************
************ 

ఈ పాటకో కవల వుంది తమిళంలో. అసలదే ముందు పుట్టింది. 

సినిమా పేరు "కడలోర కవితైగళ్" - అంటే "కడలి తీరపు కవితలు" అని నాకొచ్చిన "కొంజం కొంజం తమిళ్" లో నా కర్థమైంది. 

సినిమా పేరు భలే poetic గా అనిపించి నచ్చేసింది. 

అందులోనూ పాటని ఇళయరాజా, ఎస్జానకితో కలిసి పాడడం ఇంకా నచ్చింది. ఇళయరాజా గొంతు rustic గా ఉండి సత్యరాజ్‌కి భలే సరిపోయింది. 

నాకు ఈ తమిళ్ పాటలో మాటలూ చాలా నచ్చాయి కానీ తప్పులు రాస్తానేమో అన్న భయంతో రాయట్లేదు. 

ఎవరైనా తమిళ్ వచ్చిన పెన్ తోళి నెవరినైనా అడిగి ఆ పాట రాసుకోవాలి. 

ఇప్పటికి నాతో పాటు మీరూ వినండి...సరేనా!

 


************
************ 

అదీ... 
తమిళ కడలి ఒడ్డున పాడిన కవితే ... తెలుగు ఆరాధన అయిన తీరు.. 
అని 
నేను చెప్తే వినాలి మీరు :)
 
ఇట్లు, 
~ పాటల భైరవి వ్రాలు


19, ఏప్రిల్ 2020, ఆదివారం

త్వామనురజామి - 46 - ఎంత మంచి మాటదో ..ఎంత తీపి కబురదో ..

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 45 - ఉన్నా.. వేచి ఉన్నా.. . ట్రింగుమనవేలనే - ఓ ఎన్నేయల్ ఫోనా!

నాన్న ఏదో చెప్పబోతుండగా కట్ అయిన ఫోను ఎప్పటికీ మోగదే!

ఇప్పుడు "ఎప్పటికీ" అనిపిస్తున్నది అప్పటికి మహా అయితే ఐదు నిముషాలయుంటుంది. అంతే!

ఆ ఐదు నిముషాల్లోనే చేతికున్న పదివేళ్ళ గోళ్ళూ కొరికేసుకున్నంత పని చేశాను. పక్కనే వున్న సునీత నా దగ్గరగా నిలబడి నా భుజమ్మీద చెయ్యి వేసి నిలబడింది - బహుశః కదిపితే ఏడ్చేసేలా వున్నానేమో - తన చూపులకి.

ఇంతలో ఫోన్ మోగింది.

గబగబా తీశాను. చేతులు కొంచెం ఒణుకుతున్నాయి.

"హలో!  లల్లీయేనా?"

అది నాకే! అవతల మాట్లాడుతున్నది నాన్నే...

"నేనే నాన్నా!" - ఇంకేమీ అనాలనిపించలేదు.

ఎందుకు చేశారని అడగాలనిపించలేదు.

ఎటూ కాని టైంలో ఇలా పొద్దున్నే ఫోన్ చేశారేంటా అని ఒకటే కంగారుగా ఉంది.

"ముందు ఆ డొక్కు ఫోన్ మార్పించమని చెప్పు ఆ ఎన్నేయల్ వాళ్ళకు. ఇప్పటికి అరగంట నుంచి ట్రై చేస్తుంటే ఓ పట్టాన లైను దొరకదు. దొరికితే పట్టుమని మూణ్ణిముషాలు మాట్లాడకుండానే కట్ అయిపోతోంది."

టెలిఫోన్ వైరు లోంచి నాన్న విసుగు వినిపిస్తోంది.

నేనేం మాట్లాడలేదు.

"అద్సరే కానీ ... మార్చ్ 11 న ముహూర్తం పెట్టించాను. నీకు, బదరికి పెళ్ళి. పదో తారీఖున పెళ్ళికూతుర్ని చేస్తారు. ఇది చెబ్దామనే చేశాను. ఆ తిరుపతిలో ప్రాజెక్టు సబ్‌మిట్ చేసేయగానే నారాయణాద్రిలో వచ్చేసేయ్. ఇప్పుడు నేను ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. నువ్వు సాయంత్రం నీ ఆఫీస్ అయిపోయాక వీలైతే ఇంటికి ఫోన్ చెయ్. అమ్మ మాట్లాడుతుంది."

నాన్న చెప్పిన మాట వినగానే - నేనేం వింటున్నానో అది నా మెదడులో సరిగ్గా register అయీ అవకుండా - నేనేం విన్నానో అది పూర్తిగా అర్థమయీ అవకుండా - వున్న - నా నోట్లోంచి వచ్చిన ఒకే ఒక మాట "అలాగే నాన్నా!".

అంత పెద్ద విశేషం నాకు చెప్పిన నాన్న అవతల్నుంచి  "సరే మరి... అంతే కదా! ఇక విశేషాలేం లేవు కదా! జాగ్రత్తగా ఇంటికొచ్చెయ్!" అని చెప్పి ఫోన్ పెట్టేశారు.

నేను ఫోన్ పెట్టి ఇవతలికి తిరిగేటప్పటికే సునీతకి అసలు సంగతి అర్థమయిపోయింది. నా చేతిని గట్టిగా పట్టుకుని ఊపేస్తూ "Congrats, లల్లీ!" అని బోల్డు సంతోషించింది.

అక్కణ్ణించి ఇద్దరం లంచ్ చెయ్యడానికి కేంటీన్‌కి వెళ్ళాం.

నాకు  అదేంటో తెలియని, ఇదీ అని చెప్పలేని ఒక గొ...ప్ప excitement!

అసలు నాన్న అంత హఠాత్తుగా ఫోన్ చేసి నా పెళ్ళి విషయం చెప్తారని నేను కలలో కూడా ఊహించలేదు. ఆయన అంత హడావిడిగా - అస్సలు కొంచెం కూడా hint ఇవ్వకుండా - అదేదో ఎప్పట్నుంచో అనుకుంటున్న విషయంలా - చాలా simple గా - మీకు పెళ్ళి చేసేద్దామనుకుంటున్నా - అని అలా చెప్పెయ్యడానికి కారణమేంటా అని కూడా ఆలోచించట్లేదు నేను.

దాదాపు మూడేళ్ళుగా ఎదురు చూస్తున్న రోజిది.

నాక్కావాలనుకున్నది నాకందుతోంది. అది ఎందుకు, ఎలా అని ఆలోచిస్తూ - అందినదేదో అందిందని ఆనందించకుండా, అందిందాన్ని ఆస్వాదించకుండా ఉండడానికి నేనేమీ లల్లీని కాకుండా ఇంకెవరో కాదుగా!

అందుకే... చుట్టూ వున్న మాటల సందడి, బైట కాస్తున్న ఎండా, వీస్తున్న గాలీ - అన్నీ కొత్తగా - రోజూ చూసేవే అయినా ఈ రోజుకి మాత్రం అవన్నీ అచ్చంగా నాకోసమే జరుగుతున్నట్టు ఏదో చెప్పలేని సంబరం మనసంతా...

పాదం నేల మీద మోపకుండా కుదురుగా 
గాలి అలల మీద తేలుతున్నట్టుగా చులాగ్గా 
నడక సాగుతోంది చురుగ్గా... 

దాచలేని ముదమేదో మిక్కిలిగా  
తేలితేలి నింగి కెగిసి ముసురుకునే మొగిలుగా
నవ్వు రాలుతోంది సడిగా సవ్వడిగా...

అందనిదేదో అందుకోవాలని 
అడరి అడరి అందించుకుని 
అందుకోవాలనుకున్నదేదో అందగ
అందినదాన్ని అందుకుని 
అందందే పొదువుకుని 
అదటున అల్లాగే ఒరిగిపోయి 
ఉండిపోవాలనిపించే తీపి అలసట 
నిలువెల్లా కమ్మె నన్ను... 
నేను నేనుగా ఉండలేని హాయి వేసట 
ఎదలో, ఎడదలో... చిమ్మె నాలో... 
 

ఇహ ఆ రోజుకి పనేమీ చెయ్యాలనిపించలేదు. సునీతా, నేను లంచ్ నుంచి తిరిగొచ్చాక, మా రూంలో వున్న అనంత్, రాజ్ బల్, జయ, మంజుళలకి నాకు పెళ్ళి కుదిరింది అన్న విషయం సునీత చెప్పగానే వాళ్ళందరూ నాకు Congrats చెప్పారు.

ఈ హడావిడి ముగిసేలోగా టీ టైం అయింది. సునీతా, నేను మళ్ళీ కేంటీన్‌కి వెళ్ళి చెరో కప్పు టీ తీసుకుని ఒక టేబుల్ దగ్గర బెంచ్ మీద కూర్చున్నాము.

ఇంతలో మా రాజశేఖర్ సర్ వచ్చారు. ఆయన రెండు వారాలకోసారి NAL వైపు వచ్చినప్పుడల్లా మమ్మల్ని పలకరించడానికి వచ్చేవారు. ఇప్పుడు కూడా అలాగే వచ్చారు. ఆయన కూడా టీ తెచ్చుకుని మాకు ఎదురుగుండా వున్న బెంచ్ మీద కూర్చున్నారు. ఆయనతో మాట్లాడుతూ వున్నప్పుడు సునీత నాకు బదరితో పెళ్ళి సెటిల్ అయినట్టు చెప్పగానే రాజశేఖర్ సర్ చాలా ఆనందించారు.

"ఓ!  ఆ అబ్బాయి మా SBM స్టూడెంటే! అంటే నాకు సబ్-సబ్-సబ్ జూనియర్. అసలు వాళ్ళ batch కి మా సీనియర్స్ అంటే హడల్!" అని ఉత్సాహంగా చెప్తున్నారు.

ఇంతలో... ఆయన వెనకగా వున్న కేంటీన్ తలుపు లోంచి వస్తూ కనిపించిందెవరూ అంటే... బదరి.

నేను తనకేసే చూస్తున్నాను. తను కూడా నన్ను చూస్తూ, వెలుగుతున్న నవ్వుతో వచ్చి,  మాతో మాట్లాడుతున్న రాజశేఖర్ సర్ పక్కనే కూర్చున్నారు. తన పక్కనే కూర్చున్న బదరిని చూడగానే - నేను భలే హాప్పీగా నవ్వుతూ - :నాన్న ఫోన్ చేశారివాళ" అనగానే తను వెంటనే "చేస్తారని నాకు తెలుసు" అన్నారు.

నాకింక ఏం మాట్లాడాలో తోచక బదరికి RS సర్‌ని చూపించి "మా రాజశేఖర్ సర్! ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటున్నాం" అనగానే బదరి RS సర్ కేసి చూసి "హలో అండీ! బావున్నారా?" అనడిగారు.

అప్పటిదాకా గలగలా మాట్లాడుతున్న RS సర్ బదరిని పలకరించి - ఇంకో ఐదు నిముషాల్లో టీ గబగబా తాగేసి - మా ఇద్దరికీ కంగ్రాట్స్ చెప్పి - నాకేసి తిరిగి - "లలితా... మిమ్మల్ని ప్రాజెక్ట్ వైవా కొచ్చినప్పుడు యూనివర్సిటీలో కలుస్తాను" అని చెప్పి వెళ్ళిపోయారు.

సునీత కూడా బదరికి కంగ్రాట్స్ చెప్పింది. ఆ రోజు తను నా work station దగ్గర బదరికి, నాకూ ఒక ఫోటో తీసింది  పసుపుపచ్చ బ్రాసో చీరలో నేను, లేతరంగుల stripes shirt లో బదరి - మేమిద్దరం కూడా నవ్వులతో మా కళ్ళు తళతళా వెలుగుతూ, పళ్ళు మిలమిలలాడిస్తూ - కెమెరా flash కే కళ్ళు బైర్లు కమ్మేలా మెరిశాం, మురిశాం.

సాయంత్రం నా ఆఫీస్ అయిపోయి మెజెస్టిక్ బస్సెక్కేకా, అప్పటిదాకా ఆపుకున్న ఆశ్చర్యం బోల్డన్ని మాటల్లో బయటికొచ్చేసింది.

"నాకు అసలు ఏమీ అర్థం కాలేదు తెలుసా... నాన్న మన పెళ్ళి అని చెప్పగానే! అసలు అమ్మా, నాన్న బెంగుళూరు నుంచి గుంటూరెళ్ళాక, మళ్ళీ ఆ తర్వాత సంక్రాంతికి నేను గుంటూరు వెళ్ళినప్పుడు - ఎప్పుడూ కూడా వాళ్ళిద్దరూ మీ గురించి మాటే తేలేదు. ఇవాళంతా కూడా పొద్దున్న నాన్న నాకు ఫోన్ చేయడం, పెళ్ళని చెప్పడం అదంతా కలలో కాదు కదా అని ఒకటే అనిపిస్తోంది"

ఇదే ధోరణిలో తన చెయ్యి పట్టుకుని ఊపేస్తూ చెప్తూ ఉంటే - ఎప్పట్లాగే చిరు-నవ్వుతూ "నాకు DSJ లో ఉద్యోగం వచ్చిందని అంకుల్‌కి ఫోన్ చేసి చెప్పాను. చెప్తూ ఆయన నాకు తిరుపతిలో చెప్పిన మాటలు గుర్తు చేశాను. 'అసలేమనుకుంటున్నారు మీరు? ఓ ఉద్యోగం లేదు. అసలు రేపెలా వుంటుందో ఆలోచన వున్నట్టే కనబడట్లేదు. ఇక మా లల్లీని మర్చిపోతే మంచిది' అన్నారు కదా! దానికి నేను 'సరే! అంకుల్... మళ్ళీ ఉద్యోగం వచ్చాకే మిమ్మల్ని కలుస్తాను' అని చెప్పానా! అదే ఆయనకి మళ్ళీ గుర్తు చేశాను. మీ లల్లీ కోసమే బెంగుళూరులో ఉద్యోగం కోసం వచ్చాను. నేను DSJ లో చేరాను అని వినగానే అదేంటీ అనడిగారు అంకుల్. అదొక షేర్ మార్కెట్ జర్నల్ అని చెప్పాను. ఆయనకది నచ్చినట్లే అనిపించింది. చాలా soft గా మాట్లాడారు" అంటూ ఇదంతా తన చిద్విలాస-హాస-లీల అన్నట్టు మాట్లాడారు బదరి.

భలే! అద్దీ సంగతి! అప్పుడెప్పుడో దూరంగా వున్నప్పుడు టెలిగ్రాంలో అన్నట్టే, ఇప్పుడు దగ్గరున్నప్పుడు ఎప్పుడూ నాతో అనేట్టే - నాన్నతో మాట్లాడలేని मेरा दुःख  తను తీసుకుని దాన్ని మా పెళ్ళి కుదర్చడమనే हमारा सुख చేసేశారన్నమాట బదరి.

ఎప్పుడూ ఏదో ఒకటి తన చెవిలో జోరీగలా गुन गुना తూ ఉండే నాకు ఈ రోజుకి ఇంకేమీ మాటలూ లేవు - ఉన్నా మాట్లాడాలనీ అనిపించట్లేదు. అందుకే ఏం మాట్లాడకుండా బస్సు కిటికీ లోంచి బయటికి చూస్తున్న నాకు అల్సూర్ దగ్గర తిరుగుతున్న మలుపులో లిడో థియేటర్లో కభీ-కభీ సినిమా పోస్టర్ కనిపించింది.

దాన్ని చూస్తూనే - తలతిప్పిన నాకు - నాకేసే చూస్తూ "వినిపించింది... నువ్వెప్పట్నుంచో చూద్దామనుకుంటున్నావ్... ఇప్పటి దాకా నీ లైఫ్‌లో ఇంత దగ్గర థియేటర్లో కభీ-కభీ రాలేదు.... ఈ శనివారం వెళ్దామా?" అని నవ్వుతున్న బదరిని చూడగానే నేనేమీ అనకుండానే వినగలిగే తన చెవుల మీద బోల్డు ప్రేమొచ్చేసింది.

"అవును బుజ్జాయ్! ఈ వారం నీకు సాగి వాళ్ళతో బయటికెళ్ళే ప్లాన్స్ ఏమీ లేవుగా? ఎందుకంటే మనిద్దరం సాయి, బాలాజీ వాళ్ళతో కలిసి కబ్బన్ పార్క్, విధాన్ సౌధ చూడ్డానికి వెళ్తున్నాం. నీకు విధాన్ సౌధ ముందు మెట్ల మీద కూర్చోవడం ఇష్టం కదా! శనివారం లిడోలో कभी-कभी, ఆదివారం కబ్బన్ పార్క్ में हम सभी... ఏమంటావ్! నీకిష్టమేనా?" అంటూ - తనన్నదానికి నేనిచ్చే సమాధానమేదో తనే "I looooove it" అని చెప్పుకుంటూ - ఈ నాటి నా మాటరాని-వేళని సరదా చేసుకుంటున్న బదరిని చూస్తూ...పొద్దున్నించీ జరిగినవి గుర్తు చేసుకుంటూ ... నాలో నేనే ...

ఎంత మంచి మాటదో ... ఎంత తీపి కబురదో ... 
ఎంత మంచి మాటదో ..
నాన్న మాట విన్నంతనే - కలలు పండేనే...
నా మనసు నిండెనే...

అంటూ పాడుకుంటూ...

మీరేమో నే పాడిన కొసరు పాట రాగాలకు అసలు పాట తీగలేవో పట్టుకుని ఇక్కడుంటే...

<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

12, ఏప్రిల్ 2020, ఆదివారం

అయ్యారే! అంటూ చూసేశాం... అయ్యప్పనుమ్ కోషియుమ్

ఈ వారం ఇద్దరు ముగ్గురు స్నేహితులు చాలా ఉత్సాహంగా నాకు మెసేజ్ చేశారు - లలితా! మీరు ఎదురు చూస్తున్న మధ అమెజాన్ ప్రైమ్‌లో వచ్చింది - అంటూ.

చెప్పొద్దూ... ముందే ఆ సినిమా psychological thriller అని విని వున్నానేమో... చూడాలనుకోలేదు.

ఇంతలో మా ఆడపడుచుతో ఫోన్‌లో మాట్లాడుతుంటే తను "మధ" చూసినట్టు చెప్పింది. చెప్తూ "నువ్వు చూడొద్దులే వదినా... చాలా మామూలు కథ - ఇంతకు ముందు చాలా సార్లు చాలా సినిమాల్లో చెప్పినదే. అంత గొప్పగా ఏమీ లేదు." అని మరీమరీ చెప్పింది కూడా.

సరే! నా మాట నాకే ఉందిగా... సీన్ సీన్ పే లిఖా హై దేఖ్‌నేవాలే కా నామ్! నా బతుకుపుస్తకపు పుటలో already నేను "మధ" చూడాలని రాసేసి ఉన్నట్లుంది.

నిజంగా చెప్పాలంటే మార్చ్ 14 నుంచే మా వూళ్ళో voluntary self-quarantine లో వున్నాం మేమందరం. 13 న "మధ" విడుదల అవుతుంది అని ముందే తెలుసు కదా... ఆ వారం మేము ఎంత తలుచుకున్నామో "పాపం! ఆ శ్రీవిద్య బసవ తన సినిమా మీద అంత hopes పెట్టుకుంది. ఇప్పుడు రిలీజ్ చెయ్యడానికి అసలు మంచి సమయమే కాదు" అని తెగ ప్చ్-ప్చ్-లాడిపోయాం.

సరే! మరి ..  just ఒక interview చూసి బోల్డంత excite అయి ఒక వారం ఆ సినిమా కబుర్లు కూడా రాసేశాను కదా ...  అంత రాసినందుకన్నా, ఉన్న డబ్బులన్నీ పెట్టి ఆ సినిమా తీసిన అమ్మ కోసం, అమ్మాయి కోసమైనా ఒకసారి చూద్దాం అనేసుకున్నాను. అదే మాట బదరితో అన్నాను. వెంటనే ఇద్దరం ఈ శుక్రవారం చూసేద్దాం అనేసుకున్నాం. అనుకున్నవాళ్ళం అనుకున్నట్టుగానే చూసేశాం.

"మధ" లో కొట్టొచ్చినట్టు కనిపించినవి నేపథ్యసంగీతం, సినిమా అంతా పరచుకున్న ఆకుపచ్చ రంగు.

అంతకు మించి నాకింకేమీ చెప్పుకోదగ్గవి కనిపించలేదు. సినిమా అంతా అయ్యాక "ఎందుకు ఈ సినిమాకి ఇన్ని అంతర్జాతీయ అవార్డులు వచ్చాయబ్బా?!" అని బదరీ, నేనూ ఓ రెండు నిముషాలు అనుకున్నాం.

అప్పటికీ బదరి అన్నారు కూడా - "పాపం! ఆ డైరెక్టర్ అమ్మాయి చాలా confuse అయినట్టు వుంది కథ రాసుకోవడంలో" అంటూ కొంచెం జాలిపడుతూ. అంటూనే వెంటనే ఇంకో ప్రశ్న తన నుంచే "ఒకవేళ థియేటర్లలో వచ్చినా కూడా ఎవరైనా చూస్తారా దీన్ని?" అంటూ.

మళ్ళీ వెంటనే "ఇప్పటికే ఓ రెండుగంటలు సినిమా-పాలు చేశాం. అదే ఎక్కువ" అనుకుని తలొకసారి విదిలించుకుని సినిమా తాలూకు తలపులని దులిపేసుకున్నాం. ఇంకేం చేస్తాం... ఇది మాకలవాటైన ఓ రకమైన self -inflicting సినీ-మా-ఓదార్పు యాత్ర

అదీ "మధ"సినిమా-చూపుల కథ.

Once bitten, twice shy అనేది సినిమాల విషయంలో అస్సలు వర్తించదు నాకు.

ఎన్నిసార్లు  - ఎందుకొచ్చిన "పిచ్చ"రిది - అనే లాంటివి ఎన్ని చూసినా, ఇంకోటి venture చేద్దామనే adventurous gene నాది - అనే emotion మళ్లీమళ్లీ  motion-picture చూసేలా చేస్తుంది.

భాషాభేదం లేకుండా చూడడం  
అదొక సినీ-మా-వినోదం 
నచ్చకపోతే మరి తలవక మర్చిపోవడం
అదొక సినీ-మా-విలాపం 
నచ్చితే మరిమరి తలుచుకుని మురిసిపోవడం 
అదొక సినీ-మాయా-విలాసం.


అందుకే... బదరి ఫ్రెండ్ సాయిప్రసాద్ బావుందని చెప్పిన మలయాళం సినిమా "అయ్యప్పనుమ్ కోషియుమ్" అమెజాన్  ప్రైమ్‌లో ఉంటే చూశాం.

"అయ్యప్పనుమ్ కోషియుమ్" నేను చూసిన మొట్టమొదటి మలయాళం సినిమా.



చూస్తున్నంత సేపూ...  కేరళ వాసుల సంస్కారం, మలయాళ ప్రేక్షకుల ఉన్నతాభిరుచి ఎంత గొప్పగా లేకపోతే ఇంత మంచి సినిమా తీయగలరో కదా అనిపించిన సినిమా.

చూస్తున్నంత సేపూ... కళ్ళలో కమ్మిన కేరళ అడవుల పచ్చదనం, మనసులో సినిమా తీసిన దర్శకుడు సాచీ మీద, సినిమాలో నటించిన బిజూ మీనన్, పృథ్వీరాజ్ సుకుమారన్ల మీద గౌరవం.

చూస్తున్నంత సేపూ... నాకు తెలీకుండా నేనే పదేపదే తలూపుకుంటూ, "భలే సినిమా" అని మెచ్చుకుంటూ, ఇంత మంచి సినిమా చూస్తున్నందుకు నన్ను నేనే నచ్చుకుంటూ - అయ్యప్పన్ నాయర్, కోషీ కురియన్ల మధ్య జరుగుతున్న ఎవరి అహాన్ని వాళ్ళు చల్లార్చుకోవటానికి ఒకరితో ఒకరు చేస్తున్న పోరాటంలో గెలుపెవరిదా అని ఆరాటపడుతూ, ఇద్దరూ గెలిస్తే బావుండునని ఆశ పడుతూ, మధ్యమధ్యలో నా పక్కనే కూర్చుని సినిమా చూస్తున్న బదరితో "చివరికి ఇద్దరికీ ఏమీ కాకుండా ఉంటే బావుంటుంది కదా!" అని అంటూ - ఎన్నో రోజుల తర్వాత చూస్తున్నంత సేపూ ఊపిరి బిగబట్టి కళ్ళు తిప్పకుండా చూసిన సినిమా - "అయ్యప్పనుమ్ కోషియుమ్".

సినిమా మొదలవుతూనే కనిపించేది - కమ్ముకొస్తున్న రాత్రి మాటున నిశ్శబ్దంగా నిల్చున్న వన-సాలభంజికల్లాంటి చెట్ల ఆకుపచ్చదనం.

వాటి మధ్యన మలుపుల మెలికలు తిరుగుతూ ఆట్టప్పాడి అడవి లోంచి ఊటీ వైపుగా వెళ్ళే ఘాట్ రోడ్.

ఆ రోడ్డు మీదుగా వెళ్తున్న కార్లో - ముందు సీట్లో డ్రైవర్ కుమార్, వెనక సీట్లో పడుకున్న కోషీ కురియన్.

కోషీ సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన హవల్దారు. కోషీది కాట్టప్పన్ అనే ఊరు. తనకి స్నేహితుడైన ఒక సినిమా దర్శకుడిని కలవడానికి కార్లో ఊటీ వెళ్తూ ఉంటాడు.

ఆట్టప్పాడి అడవి మద్యనిషేధం అమలులో వున్న ప్రాంతం.

అదే దారిలో నరసిముక్కు చెక్‌పోస్ట్ దగ్గర ఆట్టప్పాడి పోలీసులు, ఎక్సైజ్ డిపార్టుమెంటు వాళ్ళు కలిసి అటుగా వచ్చే వాహనాల్ని ఆపి చెక్ చేస్తూ వుంటారు.  దానికి నాయకత్వం వహిస్తున్నది ఎస్సై అయ్యప్పన్ నాయర్.

అటుగా వస్తున్న కోషీ కారుని కూడా చెక్ చేద్దామని ఆపిన వాళ్లకి, కారులో నిద్రపోతున్న కోషీ సీటు కింద పన్నెండు మద్యం సీసాలు కనిపిస్తాయి. వెంటనే అయ్యప్పన్ నాయర్, అతనితో వున్న పోలీసులు కోషీని, అతని డ్రైవర్ కుమారుని పోలీసు స్టేషనుకి తీసుకెళ్తారు. ఆ తీసుకెళ్ళే process లో పోలీసుల మీద చెయ్యి చేసుకున్న కొషీని అయ్యప్పన్ చెంప మీద కొడతాడు. కోషీ, కుమార్ దగ్గరున్న సెల్‌ఫోన్లు పోలీసులు తీసేసుకుంటారు. వాళ్ళ కార్లో దొరికిన మద్యం సీసాల్ని లక్కతో సీల్ చేస్తారు. స్టేషన్లో కొచ్చిన కోషీ మీద మద్యం తెస్తున్నందుకు, ఎక్సైజ్ జీప్ లైట్ పగలగొట్టినందుకు, ఎక్సైజ్ ఆఫీసర్ని, పోలీసులను కొట్టినందుకు కేసులు రాయమంటాడు అయ్యప్పన్. ఆ స్టేషన్లో ఇద్దరు మహిళా పోలీసులు కూడా వుంటారు. అందులో ఒకమ్మాయి పేరు జెస్సీ.

ఇంతలో జాయ్ కుట్టన్ అనే పోలీస్ చేతిలో వున్న కోషీ ఫోనుకి సినిమా దర్శకుడు జానీ ఆంటోనీ నుంచి ఫోన్ వస్తుంది. ఇంకా ఆ ఫోన్లో ఎవరెవరి ఫోన్ నంబర్లు ఉన్నాయా అని చూసిన జాయ్ కుట్టన్‌కి - కేరళ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇన్స్పెక్టర్ జనరల్ విజయన్ ఫోన్ నంబర్లు కనిపిస్తాయి. అవి చూడగానే అయ్యప్పన్ నాయరుకి కోషీ సమాజంలో పలుకుబడి వున్నవాడని తెలుస్తుంది. వెంటనే స్టేషన్ బయటికి వెళ్ళి తన పై అధికారి అయిన సీఐ (సర్కిల్ ఇన్స్పెక్టర్) సతీషుకి ఫోన్ చేస్తాడు అయ్యప్పన్. సతీష్ కోషీని కొంచెం జాగ్రత్తగా హేండిల్ చెయ్యమని చెప్తాడు అయ్యప్పన్‌కి. అలా చెప్తూనే కోషీకి ముందు జరగబోయే దాని గురించి (అంటే నిషేధ ప్రాంతంలో మద్యం తీసుకెళ్తున్నందుకు ఓ పన్నెండు రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది అనే దాని గురించి) అర్థమయేలా చెప్పమంటాడు.

అయ్యప్పన్ స్టేషన్ లోపలి వెళ్ళి కోషీని తన గదిలోకి రమ్మని చెప్పి, అతను వచ్చి కుర్చీలో కూర్చున్నాక - కోషీకి పది-పన్నెండు రోజుల దాకా శిక్ష పడుతుందని, ఇది non-bailable offence అని చెప్పగానే - ఇక అప్పుడు మొదలవుతుంది అసలు కథ.

అయ్యప్పన్ నాయర్, కోషీ కురియన్‌ల మధ్య మొదలైన ఒక చిన్న గొడవ చిలికి చిలికి గాలివానై, అందులో కోషీ నాన్న కురియన్ జాన్ ఓ పిడుగులా తోడై - చివరికి ఎంత దూరం వెళ్తుందో, చివరికి ఏమవుతుందో తెలుసుకోవాలంటే - "అయ్యప్పనుమ్ కోషియుమ్" సినిమా చూడాల్సిందే. ఓ మంచి సినిమా చూశామని మీకనిపించాలంటే నేనిక్కడ ఆపాల్సిందే!

కాకపోతే నాకు ఈ సినిమా ఎందుకు నచ్చిందో మచ్చుక్కొన్ని మెచ్చు-తునకలు మాత్రం చెప్తాను.

ఈ సినిమా చూశాక పోలీసుల మీద గౌరవం పెరిగింది నాకు. పోలీసుల్ని అంత గొప్పగా చూపించిన దర్శకుడు సాచీది ఎంతో గొప్ప సంస్కారం.

మహిళా పోలీసుల్ని - భారీకాయులుగానో, comic figures లానో కాకుండా - మంచి వ్యక్తిత్వమున్న అమ్మాయిల్లా చూపించడం, వాళ్ళని పై అధికారులైన SI అయ్యప్పన్, CI సతీష్ ఎంతో ఆప్యాయంగా పలకరించడం ఎంతో ఎంతో బావుంది. 

ఒకానొక సందర్భంలో తను చేయని తప్పుకి భయపడుతూ ఏడుస్తున్న జెస్సీని "నువ్వు unifrom లో వున్నావు - ఏడవకూడదు" అని SI అయ్యప్పన్ మర్యాదైన భాషలో మందలించడం విన్న నాకు ఇదసలు 2020లో వచ్చిన కొత్త సినిమాయేనా అని ఓ గొప్ప-అనుమానం వచ్చేసింది.

కోషీ వల్ల ఉద్యోగం లోంచి సస్పెండ్ అయి సెలవు మీద వెళ్ళాల్సొచ్చిన జెస్సీని వాళ్ళ ఊరు పంపడానికి స్టేషన్ లోంచి బయటికి తీసుకెళ్తున్న సుజిత్ అనే పోలీస్ తలొంచుకుని నడుస్తున్న జెస్సీతో "నువ్వు తలెత్తుకుని నడవాలి" అని చెప్పడం - భేష్! అప్పుడే ఎదురొచ్చి తనతో "నిన్ను ఇలా ఇబ్బంది పెట్టాలని నేననుకోలేదు" అని చెప్పబోయిన కోషీ మీద ఆడపులిలా అరుస్తున్న ఓ మామూలు పోలీసు జెస్సీ మీదకి రాబోతున్న తన స్నేహితుల్ని కోషీ ఆపి "ఆమెకి నన్ను తిట్టే హక్కుంది" అని చెప్పడం నేను ఓ contemporary సినిమాలో చూస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు. Kudos to the sensible directror, Sachy!


నాలుగు నెలల పసిపాపడిని ఎత్తుకుని స్టేషన్ దగ్గరికి వచ్చిన భార్యకి డబ్బులిస్తూ SI అయ్యప్పన్ పిల్లాడికి మందులు కొనుక్కోమని చెప్తుంటే - "అర్రే! ఇలా చూపిస్తున్నారేంటీ? తన స్టేషన్లో పని చేసే పోలీసుల చేత ఇంటికి సరుకులు తెప్పించుకోవడం, ఇంట్లో బట్టలు ఉతికించుకోవడం లాంటి పనులు చెయ్యాలి కదా సినిమా ఎస్సైలూ" అని ఎంతో ఆశ్చర్యమేసేసింది నాకు.

అప్పుడే స్టేషన్ దగ్గరకొచ్చిన CI సతీష్ SI అయ్యప్పన్ నాయర్ని "అయ్యప్పెట్టా! (అయ్యప్పగారూ)" అని పిలవడం, అయ్యప్పన్ భార్య కణ్ణమ్మని "చేచి (అక్కా)" అని సంబోధించి మర్యాదగా మాట్లాడడం - అవునూ... ఇది.. కలా ...నిజమా... ఇంత మర్యాద-మన్ననలున్న మర్యాదరామన్నలున్న సినిమాని - నేనేనా? చూస్తున్నానా? అని పదేపదే నన్ను నేనే తట్టి చూసుకున్నా!

తన భర్త SI అయ్యప్పన్ ఉద్యోగం పోయిందని తన ఇంటికొచ్చి చెప్పి మరీ హేళన చేస్తున్న కోషీని అతని దగ్గరికి వచ్చి మరీ "నీ వల్ల నీ తల్లి అవమానంతో చనిపోకుండా చూడు" అని చీవాట్లేసిన కణ్ణమ్మ కోపానికి silent గా ఊరుకున్న కోషీదెంత సంయమనం! అప్పుడు కోషీకి ఇలాంటి చీవాట్లు పడాల్సిందే అన్నట్టు చూసిన డ్రైవర్ కుమార్ చూపులు భలే మంచిగా అనిపించాయి.

సినిమాలో కనిపించిన ప్రతి రౌడీ పోలీసులంటే భయభక్తులతో మెలగడం, తప్పుకు తిరగడం - పోలీసుల్లోనే తమతో పని చేసే పోలీసులంటే, అధికారులంటే ఇష్టం, గౌరవం - వాళ్ళ కోసం ఏమైనా చెయ్యగలం అన్న ధీమా - సినిమాలో నటనే అయినా ఎంత బావుందో!

అంత antagonist లా కనిపించిన కోషీ కూడా అయ్యప్పన్ భార్య కణ్ణమ్మని ఇబ్బందుల్లో పెట్టబోయిన తన స్నేహితులతో "ఇది ఇద్దరు మగవాళ్ళ మధ్య జరిగుతున్న పోట్లాట. ఇందులోకి ఆడవాళ్ళని, కుటుంబాల్ని తీసుకురాకండి" అని గట్టిగా చెప్పడం - ప్రేక్షుకులుగా మేము గట్టిగా చప్పట్లు కొట్టిన సన్నివేశం.

అరవకుండా మర్యాదగా మాట్లాడే పోలీసుల్నీ
అమర్యాదకి చోటివ్వకుండా చూపించిన మహిళా పోలీసుల్నీ
తాము వేసుకున్న uniform కి గౌరవం ఇచ్చే పోలీసుల్నీ
పోలీసులని చూసి భయపడే రౌడీలనీ
హోదాకి కాకుండా మనిషి వ్యక్తిత్వానికి, వ్యక్తికీ ప్రాముఖ్యతనిచ్చే మనుషుల్నీ
ఏడవకుండా తలెత్తుకు నిలబడిన ఆడవాళ్ళని
ఆడవాళ్ళని తేలికగా మాట్లాడని మగవాళ్ళని
మీ సినిమాలో ముఖ్యపాత్రలుగా చేసుకుని...

అన్నిటి కన్నా ముఖ్యంగా -

అందంగా వున్నారని మగవాళ్ళ వెంటపడే ఆడపిల్లలు, ఆడపిల్లల కాళ్ళావేళ్ళా పడే మగపిల్లలూ లేని సినిమాని - తీసినందుకు ...

దర్శక సాచీ!  ... మీకు చేస్తున్నా వందనం తల వంచి...

మీ సినిమాలో ఏవో చిన్నచిన్న లోపాలుంటే వుండు గాక - వాటన్నిటినీ మించి - ఒక మంచి ఆలోచనతో కూడిన సంస్కారవంతమైన సినిమా తీయగల దర్శకులు ఇంకా వున్నారు అని మీరు మాకిచ్చిన భరోసా బహు గొప్పది!

ఇంత గొప్ప సినిమా గురించి మాకు తెలిసేలా చేసిన సాయిప్రసాద్‌కి బోల్డన్ని ధన్యవాదాలతో...

~ సినీ-మా-లక్ష్మి

5, ఏప్రిల్ 2020, ఆదివారం

పాకోత్సాహము...శాకహృదయము ననుసరించి వండగ...- 2 - సాంబారు సంబరం, ములగాకు చూర్ణం


ముందుమాటు కబుర్లు:పాకోత్సాహము...శాకహృదయము ననుసరించి వండగ...- 1 - నాంది



నీకు నే కనిపెట్టిన శాకహృదయం గురించి చెప్తానన్నాను కదా! దానికన్నా ముందు అసలీ శాకహృదయం అనే మాట ఎందుకు, ఎలా coin చేశానో చెప్తా విను.

నువ్వెప్పట్నుంచో చదువుదామనుకుంటున్న one of the greatest Indian epics మహాభారతం వుంది కదా... అందులో నలమహారాజు అని ఓ చక్రవర్తి గురించిన కథుంది.

నలమహారాజు అంటే చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పిన ఓ రెండు శ్లోకాలు గుర్తొస్తున్నాయి. నీక్కూడా అవి చెప్తా విను...


హరిశ్చంద్రో నలో రాజా పురుకుత్సః పురూరవః
సగరః కార్తవీర్యశ్చ షడేతే చక్రవర్తినః


కర్కోటకస్య నాగస్య దమయంతీ నలస్యచ 
ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం

అప్పుడెప్పుడో మనకు తెలియని కాలంలో ఆరుగురు చక్రవర్తులుండేవారట - వాళ్ళని షట్చక్రవర్తులనే వాళ్ళట - షట్ అంటే ఆరు.

షట్చక్రవర్తుల్లో రెండో వాడైన నలుడికి అశ్వహృదయం తెలుసునట. గుఱ్ఱాలు ఎంచగ్గా నలుడి మాట వినేసి ... ఏ చెఱువు దగ్గరికీ తీసుకెళ్ళినా "ఉహూఁ ...అహూ" అనకుండా బుద్ధిగా నీళ్ళు తాగేసేవట.

అదే నలుడు ఋతుపర్ణ మహారాజు దగ్గర అక్షహృదయం కూడా నేర్చుకున్నాడు. ... అసలు అక్షహృదయం అంటే ఏంటి...? ఓ చెట్టును చూసీ చూడగానే దానికి ఎన్ని కాయలు కాశాయో, ఎన్ని పూలు పూశాయో, ఎన్ని ఆకు లున్నాయో ఠక్కున లెక్క చెప్పేయడమే. అక్షహృదయం నేర్చుకోవడం వల్ల నలుడికి వంట్లో దూరిన కలి వదలి పెట్టాడు.

ప్రస్తుతానికి ఈ కలి కథ వదిలిపెట్టి మన ఆకలి తీర్చే curry-కథలు చెప్పుకుందామేం?

ఇహ నా శాకహృదయం దగ్గరకొస్తే ... నేన్నీకు చెప్తూ వుంటాను కదా - వంట చెయ్యడం అంటే కావల్సిన ingredients కొలిచి పెట్టుకోవడమే కాదు వాటిని మచ్చిక చేసి వంటకి సిద్ధం చెయ్యడం అని. అలా మచ్చిక చేసుకోవాలంటే మనం వండబోయే పప్పు లోనో, కూర లోనో వెయ్యబోయే కూరగాయనో, ఆకుకూరనో అర్థం చేసుకోవాలి కదా! అంటే ఎలాంటి కూరలు ఎంచుకోవాలీ, ఎంచుకున్న వాటిని ఎలా తరుక్కోవాలీ, అలా తరిగినవాటిని ఎంత సేపు వేయించాలీ లేక ఉడికించాలీ - ఇలాంటివన్నీ తెలిస్తేనే వండిన ఆ పప్పో, కూరో మన మాట విని మనకి నచ్చినట్టుగా వస్తుంది.

మనం వండుకునే కూరల్లో, పప్పుల్లో, పులుసుల్లో వేసే కూరగాయల్ని శాకములు అని కూడా అంటారు. అందుకే నలుడి అశ్వహృదయం, అక్షహృదయం లాగా నేనూ నేనర్థం చేసుకోగలిగి, నాకిష్టమైన రుచిలో వండుకోగలిగే కూరల గురించి శాకహృదయం అనే పేరు పెట్టేసుకున్నా.

సరే! ఇప్పటి దాకా ఉత్తుత్తి నోటిమాటలు బోల్డు చెప్పుకున్నాం... ఇంకిప్పుడు నోరూరించే కబుర్లకొద్దాం...

మామూలుగా మనం ఏదైనా తిన్నప్పుడు ముందుగా తెలిసే రుచులు ముఖ్యంగా రెండు - ఉప్పూ, కారం! అందుకే ఏదైనా వండుకున్నప్పుడు "ఉప్పూకారం సరిపోయాయో లేదో" అని ఒక్కసారైనా రుచి చూసుకుంటాం.

ఏ చెట్టుకీ కాయని ఉప్పుని పక్కన పెడితే కారం మాత్రం మొక్కక్కాసే మిరపకాయ నుంచి రావాల్సిందే కదా! అందుకని ఆ మిరపకాయ దగ్గరే మొదలెడదాం.

పచ్చి మిరపకాయలు ఎంత బావుంటాయో కదా! అందులోనూ మనకి దొరికే బుజ్జిబుజ్జి థాయ్ చిల్లీస్ చాలా రుచిగా ఉంటాయి. పచ్చిమిరపకాయ అంటే ఒట్టి కారమే కాదు - దానికే సొంతమైన ఒక acidic flavor ఉంటుంది - ఎంత చిన్నదైతే దాని flavor అంత గొప్పగా ఉంటుంది. పచ్చిమిరపకాయ బాగా సన్నగా, లోపల గింజలాట్టే లేకుండా ఉంటే ఏ చింతకాయ పచ్చడి అన్నం లోకో, మాగాయి కలిపిన అన్నం తోనో కొరుక్కు తినడానికి బావుంటాయి.

నేను వంట చేసేటప్పుడు ఎక్కువగా థాయ్ పచ్చిమిరపకాయలే వాడతాను. నేను చేసే dish ని బట్టి పచ్చిమిరపకాయని తరిగే తీరుంటుంది.

ఉప్మా లోకి - చిన్నచిన్న చక్రాల్లాగా...
చారు లోకి, రసం లోకి, ఆనపకాయ పులుసులోకి, పులిహార లోకి, ఆవపెట్టిన ఆకుకూర పులుసుల్లోకి, పప్పుపులుసు లోకి - చివరి దాకా నిలువుగా చీల్చి ...
అల్లం-పచ్చిమిరపకాయ వేసే ముద్దకూరల్లోకి, పచ్చిపులుసుల్లోకి, అవియల్ లోకి - కచ్చాపచ్చాగా దంచి ...

- ఇలా రకరకాలుగా తరుక్కుంటాను.

అంతే కాకుండా ఉల్లిపాయ పకోడీల్లోకి ప్రత్యేకంగా కత్తెర తోటి length-wise సన్నటి ముక్కలుగా తరుక్కుంటాను.

ఇన్ని రకాలుగా ఎందుకంటే - మనం తరిగే విధానాన్ని బట్టి cooking surface and depth మారతాయి. దాని వల్ల ఒక్కొక్క shape and size లో వుండే కూరగాయ రుచి కూడా మారుతుంది - అది మనం అంతగా పట్టించుకోని పచ్చిమిరపకాయ అయినా సరే!

ఎందులో వేసినా పచ్చిమిరపకాయని ఆకుపచ్చదనం వీడకుండా, మాడకుండా చూసుకోవాలి. 

అన్నట్టు ఇంకో ముఖ్యమైన విషయం - నాన్నగాడూ! ఏ కూర తరిగే ముందైనా దాన్ని ఓ పావుగంటైనా సరే ఉప్పు నీళ్ళలో నానబెట్టి అప్పుడు తరుగుతాను.

నాకు పచ్చిమిరపకాయ ఎంత ఇష్టమైనా కొన్నికొన్నిట్లో దాన్ని అస్సలు వాడను.

అవేంటంటే సాంబారు, వంకాయ-కారం పెట్టిన కూర, వంకాయ-మెంతికారం కూర, ఉల్లికారం కూర, వాంగీబాత్ ఎట్సెట్రా. వీటన్నిట్లో ఎండుమిరపకాయలు వాడతాను.

సాంబారు అంటే మనింట్లో అందరూ తల్చుకునేది ఎవరినంటే - నీకింతకు ముందు నలమహారాజు గురించిన శ్లోకాలు నాకు నేర్పారని చెప్పానే మా నాన్నమ్మ - ఆవిణ్ణే!

ఆవిడ సాంబారు ఎలా చేసేవారంటే ...

ఓ మూకుట్లో ఓ చిన్న కాఫీ గ్లాసుడు కందిపప్పు దోరగా వేయించి, ఆ దోరదోర కందిపప్పుని ఇత్తడి గుండుగిన్నెలో తెర్లుతున్న నీళ్ళలో పప్పు చేసేవారు. ఈలోగా ఇంకో చిన్న బూర్లమూకుళ్ళో రెండుచుక్కలు నూనె వేసి - అందులో - ఓ చిన్నగరిటెడు శనగపప్పు, అంతే ధనియాలు, అందులో సగం మినప్పప్పు, ఇంకా సగం జీలకఱ్ఱ, ఆరంటే ఆరు మెంతి గింజలు, పది మిరియాలు, ఓ మూడు ఎండు మిరపకాయలు, చిటికెడు ఇంగువ - ఇవన్నీ వేసి పోపు వేయించి పెట్టుకునేవారు.

కందిపప్పు ఉడకగానే, ఆ పప్పూ, ఈ వేయించి పెట్టుకున్న పోపూ పట్టుకెళ్ళి మన అనాతవరం ఇంట్లో నట్టింటి పక్కనున్న సందులో వున్న రోట్లో వేసి రుబ్బేవారు. ఆ రుబ్బేటప్పుడే కొన్ని పచ్చికొబ్బరి ముక్కలు కూడా వేసి రుబ్బేవారు. అసలు ముందుగానే కొన్ని పచ్చికొబ్బరిముక్కలు విడిగా రుబ్బి కొంచెం పచ్చిబొబ్బరి ముద్ద విడిగా పెట్టుకునేవాళ్ళు.

అలా రుబ్బిన సాంబారు ముద్దా, పచ్చికొబ్బరిముద్దా తీసుకొచ్చి వంటింట్లో ఓ పక్కన పెట్టేసుకునేవారు. ఈలోగా మా లలితదొడ్డ (అంటే అనాతవరం పెద్దమ్మమ్మ) పొడుగ్గా కోసిన పచ్చి అరటికాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, దూసిన కరివేపాకు ఓ కంచంలో తయారుగా ఉంచి నాన్నమ్మకి అందించేవారు. నాన్నమ్మ ఆ ముక్కల్ని ఎసట్లో పోసి, అవి సగం ఉడికాక ఉప్పు వేసేవారు. ఉప్పు వేసిన ముక్కలు ఇంకో పావువంతు సేపు ఉడికాక రుబ్బి పెట్టుకున్న సాంబారు ముద్ద వేసి, దాంతో పాటే చింతపండు పులుసు కూడా పోసేవారు. అందులో ఓ బెల్లంముక్క కూడా వేసేవారు. చింతపండు పులుసు పోశాక ముక్కలు ఆట్టే ఉడకవు. అందుకే మరీ మెత్తగా అయిపోకుండా ఆ ముక్కల్లో bite ఉంటుంది. తెలుగులో చెప్పాలంటే ఓ పదును మీద ఉడికుంటాయి. సాంబారు మరీ చిక్కగా ఉండకుండా కావాల్సినన్ని నీళ్ళు పోసుకుని ఓ రెండు పొంగులు రాగానే పైన విడిగా ఉంచిన కొబ్బరి చల్లేవాళ్ళు. అదీ మా నాన్నమ్మ సాంబారు.

ఈ సాంబారుతో పాటు combination గా మా నాన్నమ్మ తియ్యకొబ్బరి పచ్చడి కూడా చేసేవారు. దానికి కూడా పోపు అంతా సాంబారు పోపు లాగే - కాకపోతే మిరియాలు మాత్రం వుండవు. బెల్లం ఇంకో ముక్క ఎక్కువ పడుతుంది - తియ్యపచ్చడి కదా మరి!

నేను పైన "మా నాన్నమ్మ ఇలా చేసేవారూ" అని చెప్పిన సాంబారు recipe - నేను - ఆవిడ చేసిన సాంబారు రుచి గుర్తు తెచ్చుకుని - ఊహించుకున్నది. ఎందుకంటే ఆవిడ వంటింటికీ, రోటికీ మధ్య తిరగడం, రుబ్బడం - ఆవిడ  కూడాకూడా ఉంటూ చూసేదాన్ని కానీ ఆ వయసుకి ఆవిడేదో వంట చేస్తున్నారని తెలుసు కానీ అది ఏంటీ, ఎలా అని తెలిసేది కాదు.

అందుకే, నాన్నగాడూ - నాకు మనమెప్పుడూ చూసే Ratatouille సినిమాలో ఆ బుజ్జి chef ఎలుక రెమీ అంటే అంత ఇష్టం. అది కూడా భలే వాసనని బట్టి recipe సరిగ్గా ఉందొ, లేదో చెప్పెయ్యగలదు కదా!

సరే! మా నాన్నమ్మ సాంబారుకి నేను చేర్చిన enhancement  ఏంటంటే - already ముద్దలో రుబ్బిన ఇంగువే కాకుండా -  సాంబారు మొదటి పొంగు రాగానే ఇంకో చిటికెడు ఇంగువ వెయ్యడం, చివర్లో కొబ్బరి పైన చల్లాక - ఆవాలు, ఇంగువ, ఎండు మిరపకాయ పోపు వెయ్యడం.

ఇంకో విషయం ఏంటంటే నేను సాంబార్లో బెల్లం వెయ్యను.

మామూలుగా జరిగేదేంటంటే చింతపండు పులుసు వేసినప్పుడు ఆ పులుపు రుచి కొంచెం అటూఇటూ అవుతుందని, దాన్ని compensate చెయ్యడానికి బెల్లమో, పంచదారో వాడతారు. నేను మాత్రం అవేవీ లేకుండా ఎంత పులుపు వేస్తే సాంబారు రుచి balanced గా ఉంటుందో అంతే వేస్తాను.

కాకపొతే నేను కందిపప్పుని pressure cooker లో వండుతాను. సాంబారులో ముక్కల్ని మాత్రం మా నాన్నమ్మ లాగే ఎసట్లో వుడికిస్తాను - ఎందుకంటే అవి మరీ మెత్తగా వుడికిపోతే నాకు నచ్చదు. అలాగే దొరికితే అరటికాయ వేస్తాను. కానీ దొరికించుకుని మరీ సాంబారులో వేసేవి - ఆనపకాయ, ముల్లంగి ముక్కలు. ఉల్లిపాయ మాత్రం వెయ్యనే వెయ్యను - అది ఇడ్లీ సాంబారు అయితే తప్ప.

ఇడ్లీ కోసం చేసే సాంబార్లో ఉట్టి ఉల్లిపాయలే వేస్తాను. అందులో అదనంగా పోపులో ఓ రెండు లవంగాలు వేస్తాను.

అన్నట్టు మున్నుగాడూ! ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి - సాంబారు ఎప్పుడూ కూడా ఓ రెండు పొంగుల కన్నా ఎక్కువ కాచకూడదు. అలా చేస్తే చింతపండు రసం ఎక్కువగా కాగి సాంబారు కాఫీ డికాక్షన్ వాసనొస్తుంది. ఒకలాంటి నోటికి హితవు కాని పులుపెక్కుతుంది.

సాంబారు-సంబరం అది మరి! ఈలోగా ఇంకా నీకేమేం చెప్పాలో గుర్తు చేసుకుంటూ వుంటాను...

ప్రస్తుతానికి - మన పాకోత్సాహంలో నా సిన్మతీ గిద్యంతో ఓ పాకోత్సవం  ...



కూరాకుల తరిగేయుచు
బాగుబాగని తిన్నవారు నోరారనగా
బోలెడన్ని వంటలు
ఆరారగ వండివార్చి వడ్డించెద సిన్మతీ! 


కొస-రుచిరం: ములగాకు చూర్ణం

నేనీ మధ్య ప్రయత్నించిన ములగాకు పొడి రెసిపీ ఇక్కడ share చేస్తున్నాను. 

ఇదే నేను మొట్టమొదటిసారిగా కొలతలతో రాసిన రెసిపీ. 

దీని గురించి ఓ frend కి చెప్తూ "నేనెప్పుడూ ingredients ఉజ్జాయింపుగా వేసేస్తాను, మొదటిసారి కొలతలతో చేశాను" అని చెప్తుంటే - నా చెవి పక్క నుంచి మంద్రంగా "నువ్వెప్పుడూ 'బుజ్జాయింపుగా చేస్తాను' అని చెప్పాలి, బుజ్జాయ్!" అంటూ బదరి-ఉవాచ :)

 

Dry mulagaaku  1 cup (It has to be dried in shade)
Dhaniyalu 1/3 cup
Minappappu 1/3 cup (I used the ones with pottu)
Jeelakarra 1/6 cup
Vaamu 1 Table spoon
Mentulu 1/4 Tea spoon
Pasupu 1 tea spoon
Endu mirapakaya pieces 1/3 cup ( to be adjusted based on how hot the chilles are)
Chintapandu 1 small lemon sized
Vellulli 4 -6 cloves (should add only for subtle taste)
Salt - about a table spoon ( to be adjusted per taste )


Dry roast all the ingredients separately on a low flame (except salt, pasupu, vellulli & chintapandu).
Dry roast Mulagaaku just for 3 minutes. It should not fry.
Cool them & grind them to a fine powder.
Tastes good if mixed with oil in the rice.