31, డిసెంబర్ 2017, ఆదివారం

Here is a new page to turn.../ రాసుకుందాం రండి తెరిచిన కొత్త పుటలో...[New Year Terzanelle / తరంగమాల (అలలదండ)]

రెండువేలపదిహేడు
కొద్దిసేపటి కిందటి ఈ-ఏడు
అయిందప్పుడే నిరుడు

రెండువేలపద్ధెనిమిది
పరుగెత్తుకుంటూ వచ్చేసిందిది
కొత్త ఆశలకి నాందిది


ఒక ఏడాది కాలం - ఎప్పట్లాగే - కొన్ని అనుకున్నవి అనుకున్నట్టు, ఇంకొన్ని అనుకోకపోయినా ఆగలేనట్లు - కొన్ని ప్రైజులు, ఇంకొన్ని సర్‌ప్రైజులు - నచ్చినా నచ్చకపోయినా - అది నాకు ఇవ్వాలనుకున్నవీ, నాకే చెందాలనుకున్నవీ - నాకిచ్చి - క్యాలెండర్లో తన అంకె మార్చుకుని గతమైపోయింది.

2017 ఆఖరి క్షణపు అంచున నిలబడి - వెనక్కి చూసుకుంటే...ఎన్నో జ్ఞాపకాలు ...
అందులో నవ్వులున్నాయి
నవ్వుల పక్కనే నొవ్వులూ వున్నాయి
ఎప్పటికన్నా ఈ ఏడాది కొంచెం ఎక్కువగానే ఎదకు కలిగిన నొప్పిని నవ్వుల మాటున కప్పి-
ఇంకేం మిగిలాయా అని లెక్కేస్తే -
అనుకోకుండా దొరికిన పరిచయాలు
అనుకుని పెంచుకున్న నెయ్యాలు
చెలిమిలో చిక్కిన పట్టు
కొలువులో ఎక్కిన మెట్టు
చదివేసిన పుస్తకాలు - చదవేస్తే పోని మతి
చదవగా చదవగా ఎంతుందో తెలిసిన బుద్ధి-మితి
రాసేసిన బ్లాగ్-పోస్టులు - రాశి పోసిన కబుర్లు
రాయగా రాయగా వాడుకైన వారం-వారం కబుర్లు
అర్థభాగంతో - సంపూర్ణమైన - కొన్నిఏకాభిప్రాయాలు, ఇంకొన్ని భేదాభిప్రాయాలు - వెరసి ఎడతెగని సంభాషణలు
ఆప్తులతో అపురూపంగానైనా కుదిరిన ఫోను-వేళలు
బుజ్జిజింకలతో కలిసి పేర్చుకున్న లెగో-బ్లాకులు
ఆర్రోజుల అతిథిగా అరుదెంచిన అన్నజింక నేస్తం - కెవిన్ అందించిన అరుదైన పొగడిక: "I wish I were like your mom - who could laugh at random things and be happy!".

చాలు - ఒక ఏడాది బాగా గడిచింది అని చెప్పుకోవడానికి ఈ లెక్క.

ఇంక పుట తిప్పుకోబోతున్న కొత్తసంవత్సరం గురించి నేనేమనుకుంటున్నానో చెప్పాలంటే ...

వచ్చినదాన్ని వదులుకోను
రానిదాన్ని తలుచుకోను
నాకు పంచిన నవ్వును పెంచుతాను
నాపై విసిరిన రాయిని దాచుతాను
ఎప్పటి సమస్య కప్పుడే వెతుక్కునే solution
ఎప్పట్లాగే నా మారని new year resolution.


2018కి చిగుళ్ళతో, ఆకులతో, పూవులతో, కొమ్మలతో, రెమ్మలతో ఎదుర్కోలు పలుకుతూ -
నేను పంచుకుంటున్న నా New Year Terzanelle / తరంగమాల (అలలదండ):  
Here is a new page to turn.../ రాసుకుందాం రండి తెరిచిన కొత్త పుటలో...




Here is a new page to turn...

A laugh to share, a tear to wipe
Old endings to new beginnings
Here is a new page to turn...

Gather the memories together
Let's bind the book of life
Old endings to new beginnings

A dash of smile, a pinch of sorrow
Jingling together the bells of joy
Let's bind the book of life

Tap your foot to the rhythm of delight
Sing away the blues outright
Jingling together the bells of joy

A dream to carry, a hurt to drop
Pitching a new note here and there -
Sing away the blues outright

Now is the time for us to bring
A laugh to share, a tear to wipe
Pitching a new note here and there -
Here is a new page to turn...

రాసుకుందాం రండి తెరిచిన కొత్త పుటలో...

పంచుకోవడానికో నగవు,  దాచిపెట్టిన వగపు
ముగిసిన పాత కథలో విరిసిన ఆశల కలలో
రాసుకుందాం రండి తెరిచిన కొత్త పుటలో

నిట్టూర్పులో ఓదార్పులో జ్ఞాపకాలు పోగు చేద్దాం
నూతన జీవితపు సంపుటి అచ్చు వేద్దాం
ముగిసిన పాత కథలో విరిసిన ఆశల కలలో

విచ్చుకున్న నవ్వులూ, నొచ్చుకున్నవేళలూ
జతజేసి కలగలిపి మువ్వల జేగంటల సంబరాల నడుమ
నూతన జీవితపు సంపుటి అచ్చు వేద్దాం

పదం కలిపి ఆనందపు శృతిలయకి
రాగపు మాటున విరాగాన్ని మూసి వుంచుదాం
జతజేసి కలగలిపి మువ్వల జేగంటల సంబరాల నడుమ

కలలు మోసుకెళ్దాం కలత జారవిడుద్దాం
రాగమాలికలల్లుకుంటూ వెదజల్లుకుంటూ -
రాగపు మాటున విరాగాన్ని మూసి వుంచుదాం

 ఎందుకింక ఆలస్యం? మోసుకెళ్దాం రండి
పంచుకోవడానికో నగవు,  దాచిపెట్టిన వగపు
రాగమాలికలల్లుకుంటూ వెదజల్లుకుంటూ -
రాసుకుందాం రండి తెరిచిన కొత్త పుటలో...



Terzanelle / తరంగమాల (అలలదండ) గురించి ఒక చిన్న వివరణ:

Terzanelle ఆంగ్లంలో పద్యం రాసే ఒక పధ్ధతి.
ఒక terzanelle లో మొత్తం ఆరు స్టాంజాలు ఉంటాయి.
మొదటి ఐదు స్టాంజాలలో ఒక్కొక్కదానికీ మూడు పాదాలు - ఆఖరిదీ, ఆరవదీ అయిన స్టాంజాలో నాలుగు పాదాలు ఉంటాయి.
ఇంకో విశేషం ఏంటంటే - ప్రతి స్టాంజాలోని మధ్య పాదం తరువాతి స్టాంజాలో చివరి పాదమవుతుంది.
అలాగే - మొట్టమొదటి స్టాంజాలోని మొదటి, ఆఖరి పాదాలు చివరి స్టాంజాలో రెండవ, నాల్గవ పాదాలు అవుతాయి.
మరిన్ని వివరాలకి: https://en.wikipedia.org/wiki/Terzanelle

2010 నుంచి ప్రతి ఏడాది నూతన ఆంగ్ల సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఒక terzanelle రాయడం - దాన్ని ఆత్మీయులకి నూతన సంవత్సర శుభకామనలతో పాటు పంపించడం ఒక ఇష్టమైన వ్యాపకంగా మారింది.

ఈసారి ఎప్పట్లాగే terzanelle రాసిన తర్వాత దాన్ని తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించాను.

తెలుగులో రాసిన terzanelle పద్య-రూపానికి ఒక పేరు పెట్టాలనుకున్నాను.

ఒక స్టాంజా / చరణంలోంచి తర్వాతి దానికి అలలలాగా ప్రయాణించే పద్యపాదాలు వున్న terzanelle కి మొదటగా తట్టినపేరు - నేను పెట్టుకున్న పేరు తరంగమాల - అచ్చతెలుగులో అలలదండ.


29, డిసెంబర్ 2017, శుక్రవారం

మనసే జతగా పాడిందిలే - 7 - కవలపాటలు - హిందీ ఇరాదాతో విరిసిన తెలుగు ఆశలు

కుదిరే వీకెండ్‌లోనో - సరదాగా సెలవుల్లోనో
పాటలు వింటూ చూడడానికో - చూస్తూ వినడానికో
యూట్యూబ్-జాకీ నేనై  - ఐ-ప్యాడ్ మీటలు కదపగా
భూకైలాస్ నుంచి బాహుబలి దాకా
Leonard Cohen - First We Take Manhattan నుంచి దేవిశ్రీప్రసాద్ - అ అంటే అమలాపురం దాకా
అదీ-ఇదీ అని లేక  - అన్ని కాలాల - నానా రకాల - సినిమాల - న-సినిమాల
పాటలు వింటూ - ఆ పాటలపై పాటలు గొంతు కలిపి పాడుతూ
నా పాట ఆపితే - నా రస-సిద్ధికి ఆటంకం కలిగి
నే వండే ఏ రసమైనా నీరసమవుతుందన్న ఎఱుకతో
నన్నాపక - నా పాటలతో పాటు ఇంట్లోవాళ్ళు గొంతులు కలుపుతూ
బృందగానాసక్తులై - నా పాటానురక్తులై
నా వంటిల్లు శ్రీరామనవమి పందిరై
చుట్టూ వున్న మొక్కలూ-బొమ్మలూ ఆ పందిరి రాటలై
అలరారే నా వంటింటి-గానలహరి కార్యక్రమంలో
నేను తప్పకుండా వింటూ - వినిపించే పాటలు రెండు
కవల పాటల విభాగానికి చెందు

అందులో మొదటిది - హిందీ సినిమా దో కలియా (1968) లో రవి సంగీత దర్శకత్వంలో వెన్న తిని పాడుతున్నారేమో అనిపించేంత మెత్తగా వినిపించే మహమ్మద్ రఫీ, పాటల-జలపాతం లతా మంగేష్కర్ పాడితే - తెలుగు కవలపాట - మూగనోము (1969)లో గోవర్ధనం సంగీత దర్శకత్వంలో ఖంగుమనే ఘంటసాల, తెలుగు-కోయిల్సుశీల వినిపించారు.

అసలుపాట:

దో కలియా సినిమా ముందొచ్చింది కాబట్టి హిందీలో వచ్చిన తుమ్హారీ నజర్ - క్యోం ఖఫా హో గయీ అన్న పాటకి అసలు పాట స్టేటస్ ఇచ్చేశాను. 

ఈ పాటలో ఆడినవారు - బిస్కెట్ హీరో బిశ్వజిత్, నేపాలీబాల మాలాసిన్హా. 

బిశ్వజిత్‌కి, బిస్కెట్‌కి ఏమీ సంబంధం లేదు - మొదటి అక్షరం బి కావడం తప్ప . 

నేను మొదటగా చూసిన బిశ్వజిత్‌ సినిమా - మా అమ్మ, పప్పి, కుట్టీలతో కలిసి - గుంటూరు మంగాథియేటర్లో మార్నింగ్‌షో - బీస్ సాల్ బాద్. అది చూసేటప్పుడే అనుకున్నాం మేం ముగ్గురు సిస్టర్లం  - ఈ హీరో మొహం పాలలో ముంచిన Marie బిస్కెట్‌లా ఉందని. అదీ బిస్కెట్  హీరో  వెనక బిట్టు-కథ. 

దో కలియా - ఎక్కడో జర్మన్ నవలకి - బ్రిటిష్ వాళ్ళూ - ఆ తర్వాత అమెరికా వాళ్ళు - సినిమా తీస్తే దాన్ని పట్టుకొచ్చి ముందు తమిళంలో, తర్వాత తెలుగులో, ఆ తర్వాత హిందీలో తీసిన కవలల కథ. 

సరదాకి  -  ఒక సినిమా జన్మరహస్యం:
>Erich Kästner's German novel Lottie and Lisa (1949)

>>బ్రిటిష్ సినిమా - Twice upon a time (1953)
>>>అమెరికన్ సినిమా - The Parent Trap (1961) 
>>>> తమిళ్ సినిమా - కుళందయ్యుం దైవమమ్ (1965)
>>>>> తెలుగు సినిమా - లేతమనసులు (1966)
>>>>>> హిందీ సినిమా - దో కలియా (1968)


తెలుగులో - లేతమనసులు - అంటూ జమున, హరనాథ్ నటించిన సినిమానే హిందీలో వచ్చిన దో  కలియా

ఈ తెలుగు లేతమనసులు సినిమాకి - నాకూ చెందిన ఇంకో బుల్లి కథ వుంది. 

లేతమనసులు సినిమాలో ఏకరూప-కవలల పేర్లు లల్లి-పప్పి. ఆ సినిమా చూశాక మా లక్ష్మిదొడ్డ లలితనైన నాకూ, నా తర్వాత పుట్టిన అరుణకు - లల్లి-పప్పి అని ముద్దుపేర్లు పెట్టింది. మా తర్వాత పుట్టిన కిరణ్మయి కుట్టి అయింది. 

సరే - నా పేరు-కబుర్లు పక్కన పెడితే - తుమ్హారీ నజర్ - క్యోం ఖఫా హో గయీ అంటూ గడ్డిమేట్ల మీద పాకుతూ, చెట్టు-ఊడలు పట్టుకు ఊగుతున్న పాటని చూస్తే - గుర్తుకొచ్చింది - ఇది లేతమనసులు సినిమాలో అందాల ఓ చిలకా - అందుకో నా లేఖ పాటకి సమాంతర-హిందీ-పాట అని. 

దో కలియా - లేతమనసులు ఒకటే కథ ఆధారంగా వచ్చిన కవల-సినిమాలు - కానీ వాటిల్లో కవల-పాటల్లేవు. 
దో కలియా - మూగనోము సినిమాల్లో కవల-పాటలు వున్నాయి కానీ - సినిమా కథలు వేరువేరు. 
అదొక ఆసక్తికరమైన త్రికోణ-సినిమా-సంబంధం. 

{ఇల్లాంటి త్రికోణ-సినిమా-సంబంధం ఇంతకు ముందు మనసే జతగా పాడిందిలే - 2 - కవలపాటలు - కలలు కన్న కన్నడ ప్రణయగీతం లో కూడా చెప్పాను. 

ఎరడు కనసు (తం నం తం నం పాట) - పూజ (నింగీ నేలా ఒకటాయెనే పాట) ఒకటే కథ ఆధారంగా వచ్చిన కవల-సినిమాలు - కానీ వాటిల్లో కవల-పాటల్లేవు. 
ఎరడు కనసు (తం నం తం నం పాట)- ప్రణయగీతం (రిం ఝిం - రిం ఝిం - రిం ఝిం పాట) సినిమాల్లో కవల-పాటలు వున్నాయి కానీ - సినిమా కథలు వేరువేరు.}


ఇంక అసలుపాటకొస్తే -... 
నేనేం తప్పు చేశాను - అంత కోపంగా వున్నావు - నా వల్ల తప్పేమన్నా జరిగితే మన్నించేయ్ అంటున్న అబ్బాయితో నీ తప్పే నీకు శిక్ష అవుతుంది - అని చిలిపి కయ్యాలాడుతున్న అమ్మాయి పాడుకుంటున్న ఆ హిందీ పాటని - వింటూ, చూస్తూ, చదువుతూ, పాడేసుకోవడానికి వీలుగా ... యూట్యూబ్ వీడియో, ఆడియో, తెలుగులో టైప్ చేసిన హిందీ పాట - పేష్ కర్ రహీ, పాటల భైరవి!





తుమ్హారీ నజర్ - క్యోం ఖఫా హో గయీ
ఖతా బక్ష్ దో ... గర్ ఖతా హో గయీ
తుమ్హారీ నజర్ - క్యోం ఖఫా హో గయీ
ఖతా బక్ష్ దో ... గర్ ఖతా హో గయీ


హమారా ఇరాదా తో - కుఛ్ భీ న థా
తుమ్హారీ ఖతా ... ఖుద్ సజా హో గయీ

హమారా ఇరాదా తో - కుఛ్ భీ న థా
తుమ్హారీ ఖతా ... ఖుద్ సజా హో గయీ


సజా హీ సహీ - ఆజ్ కుఛ్ తో మిలా హై
సజా మే భి ఇక్ ... ప్యార్ కా సిల్‌సిలా హై 

సజా హీ సహీ - ఆజ్ కుఛ్ తో మిలా హై
సజా మే భి ఇక్ ... ప్యార్ కా సిల్‌సిలా హై 
మొహబ్బత్ కా అబ్  కుఛ్ భి అన్‌జామ్  హో
ములాకాత్ కీ ... ఇబ్‌తిదా హో గయీ


తుమ్హారీ నజర్ - క్యోం ఖఫా హో గయీ
ఖతా బక్ష్ దో ... గర్ ఖతా హో గయీ


హమారా ఇరాదా తో - కుఛ్ భీ న థా
తుమ్హారీ ఖతా ... ఖుద్ సజా హో గయీ

ములాకాత్ పర్ - ఇత్‌నీ మగ్‌రూర్ క్యోం హో
హమారీ ఖుషామద్ పే - మజ్‌బూర్ క్యోం హో
ములాకాత్ పర్ - ఇత్‌నీ మగ్‌రూర్ క్యోం హో
హమారీ ఖుషామద్ పే - మజ్‌బూర్ క్యోం హో
మనానే కీ ఆదత్ ... కహా పడ్ గయీ
సతానే కీ తాలీమ్...  క్యా హో గయీ


తుమ్హారీ నజర్ - క్యోం ఖఫా హో గయీ
ఖతా బక్ష్ దో ... గర్ ఖతా హో గయీ


లా లలాల లలాల లలలలలా  లలాల లలాల లలలలలా ఉహుహుహుహూ

సతాతే న హమ్ తో ... మనాతే హి  కైసే
తుమ్హే అప్‌నే నజ్‌దీక్ లాతే హి  కైసే

సతాతే న హమ్ తో ... మనాతే హి  కైసే
తుమ్హే అప్‌నే నజ్‌దీక్ లాతే హి  కైసే
ఇసీ దిన్ కా చాహత్ కో అర్‌మాన్ థా
కుబూల్ ఆజ్ దిల్ కీ దువా హో గయీ


తుమ్హారీ నజర్ - క్యోం ఖఫా హో గయీ
ఖతా బక్ష్ దో ... గర్ ఖతా హో గయీ


హమారా ఇరాదా తో - కుఛ్ భీ న థా
తుమ్హారీ ఖతా ... ఖుద్ సజా హో గయీ


లాలాలలా లాలలా లాలలా ఉహుహూహుహూ ఊహుహూ ఊహుహు

కవలపాట: 

పూల చీర కట్టుకున్న కమలాక్షి జమున
నల్ల టై కట్టుకున్న విశాలాక్షుడు అక్కినేని
ఒక ఈతచెట్టు, ఒక కొబ్బరిచెట్టు
కొన్ని మావిడి(?) చెట్లు - వాటికి వేసిన రెండు ఉయ్యాళ్ళు
పరుగులెడుతూ - ఉయ్యాలలూగుతూ -
పాడుకున్న పాట - ఈ వేళ నాలో ఎందుకో ఆశలు. 

ఈ పాట మొదటి సారి వాడు విన్నప్పుడు - ఉయ్యాల జంపాల ఊగేములే అన్న వాక్యం దగ్గరికి రాగానే బుజ్జిజింక కొక సందేహం వచ్చింది - Why do they swing to die? అంటూ - జంపాల అన్న మాటని చంపాల అన్నట్లు అర్థం చేసుకుని. 

బుజ్జిజింక కప్పుడు - అదొక okey-dokey లాంటి వాడుక మాట - ఉయ్యాలూగడాన్ని తెలుగులో వివరించడానికి - అని చెప్పి ఒప్పించుకున్నాను.

మరి - ఈ కవలపాట కూడా - చూస్తూ, వింటూ, చదువుతూ, పాడుకోవడానికి వీలుగా - సమర్పిస్తున్నది, పాటల భైరవి!




ఈ వేళ నాలో ఎందుకో ఆశలు - లోలోన ఏవో విరిసెలే వలపులు
ఈ వేళ నాలో ఎందుకో ఆశలు - లోలోన ఏవో విరిసెలే వలపులు


నీలోని ఆశలన్నీ నాకోసమే - నా పిలుపే నీలో వలపులై విరిసెలే
నీలోని ఆశలన్నీ నాకోసమే - నా పిలుపే నీలో వలపులై విరిసెలే


నీ చూపులో స్వర్గమే తొంగి చూసే - నీ మాటలో మధువులే పొంగిపోయే
నీ చూపులో స్వర్గమే తొంగి చూసే - నీ మాటలో మధువులే పొంగిపోయే
నాలోని అణువణువూ నీదాయెలే -  బ్రతుకంతా నీకే అంకితం చేయనా


నీలోని ఆశలన్నీ నాకోసమే - నా పిలుపే నీలో వలపులై విరిసెలే


లా లలాల లలాల లలలలలా  లలాల లలాల లలలలలా ఉహుహుహుహూ

నీ రూపమే గుండెలో నిండిపోయే - నా స్వప్నమే నేటితో పండిపోయే
నీ రూపమే గుండెలో నిండిపోయే - నా స్వప్నమే నేటితో పండిపోయే
ఉయ్యాల జంపాల ఊగేములే - కలకాలం మనకు ప్రేమయే ప్రాణము


ఈ వేళ నాలో ఎందుకో ఆశలు - లోలోన ఏవో విరిసెలే వలపులు


లాలాలలా లాలలా లాలలా ఉహుహూహుహూ ఊహుహూ ఊహుహు

దేవులపల్లివారు ఆశించినట్లు -ఆశీర్వదించినట్లు
నాదైనా, మీదైనా - ఎవరిదైనా
బ్రతుకంతా - ప్రతి నిముషం - పాట లాగా సాగాలి 
అని కోరుకుంటూ ...

~ పాటల భైరవి




25, డిసెంబర్ 2017, సోమవారం

లెట్స్ గో లెగో - 1 - తాజా తాజ్‌ కబుర్లు

అప్పుడెప్పుడో పదేళ్ళ క్రితం దొరికేదట - లెగో తాజ్‌మహల్ (Lego 10189).

ఎప్పుడు గూగుల్లో వెతికినా - Discontinued by manufacturer అనే కనిపించేది.

లెగో-అభిమానుల నలరించి వారితో హార్దిక్య-వృద్ధికో, లేకపోతే ఈ హాలిడే సీజన్లో తన ఆర్థికలబ్ధికో - నవంబర్ నెల 27న మళ్ళీ కొత్త తాజ్‌మహల్ విడుదల చేస్తున్నాం - కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే అమ్ముతాం - అంటూ ప్రకటించింది లెగో.

ఆ వార్త చదివిన దగ్గర్నుంచీ నవంబర్ 27 ఎప్పుడొస్తుందా అని ఎదురుచూపులు.

ఈలోగా నేను చేసిన ఇంకొక పని ఏంటంటే బదరికి చెప్పి - తాజ్‌మహల్ - కొనుక్కోవడానికి కావల్సిన ఫండ్స్ శాంక్షన్ చేయించుకోవడం.

ఇంట్లో వున్నప్పుడు బుజ్జిజింక ఎదురుగుండా అడిగితే - తను "హన్నా! ఇప్పుడొద్దు" అంటే - ఎంత పెద్ద disappointment కదా! అందుకని - ఒక సాయంత్రం వాకింగ్ కని వెళ్ళినప్పుడు - ఇల్లు దాటి రెండడుగులు వేశామో లేదో - మళ్ళీ చెప్పడానికి అవకాశం వస్తుందో రాదో అన్నట్లు -  "బావా! నవంబర్ 27 న లెగో తాజ్‌మహల్ రిలీజ్ చేస్తున్నారు - దాదాపు పదేళ్ళ తర్వాత. ఇప్పుడే చెప్తున్నాను - నేనది ఆర్డర్ చేయబోతున్నాను - మీరు నాకు అవునని చెప్పాల్సిందే!" అని గబగబా చెప్పేశాను.

ఎప్పట్లాగే - ఒక చిరువ్వుతో - "నీకు, బుజ్జిగాడికి కాదని చెప్పే అవకాశం నాకెప్పుడిచ్చారు మీరు. కానీయండి" అన్నారు.

ఆ తర్వాత నా నడక నేలకు  అరంగుళం పైన అని వేరే చెప్పక్కర్లేదు :)

ఆ ఇరవైఏడు రానే వచ్చింది.

పొద్దున్నే ఏడున్నర గంటలకు లెగోడాట్కాంలో తాజ్‌మహల్ (Lego 10256) కొనబోతే అప్పటికే Backorder (temporarily out of stock) చూపిస్తోంది.

అది చూడగానే ఒక్క నిముషం - "అయ్యో! ఎవరో లెగో-భిమానులు రాత్రి డేట్ 26 నుంచి 27కి మారగానే కొనేసుకుని వుంటారు. నేను కూడా పన్నెండింటి దాకా ఉండి ఆర్డర్ చేసి పడుకోవాల్సింది. ఇప్పుడింక కొందామన్నా దొరుకుతుందో లేదో"  అనుకుంటూనే backorder చేశాను.

వెంటనే - మా దగ్గర తాజ్‌మహల్ కొన్నందుకు ధన్యవాదాలు అంటూ ఒక ఈ-మెయిలు, దాని వెనకాలే ఇంకో ఐదు నిముషాల్లో - మీరు కొన్నది temporarily out of stock కాబట్టి పంపించడం ఆలస్యం అవుతుంది, ఈ అసౌకర్యానికి మన్నించండి అంటూ ఇంకో ఈ-మెయిలు - లెగోవారినుంచి.

మొత్తానికి డిసెంబర్ ఆరు నాటికి అంకెలారా 5, 923 బ్లాకులున్న లెగో తాజ్‌మహల్ మా ఇంటికి చేరింది. దాంతో పాటు రెండు ఉచిత బహుమతులు - ఒకటి Nutcracker, ఇంకోటి బోల్డన్ని లెగో డబ్బాలు పట్టే లెగో-పాలియెస్టర్ సంచీ.

బుజ్జిజింక, నేను - శీతాకాలపు సెలవుల్లో build చేద్దాం అని ఓ పక్కన పెట్టాం - మా కొత్త లెగో-తాజ్‌మహల్‌ని.

అప్పుడే బదరి చెప్పారు - అన్నజింక సెలవులకి  ఇంటికి వచ్చాక అందరూ కలిసి చెయ్యండి అని.

అన్నజింక వచ్చాడు.

21 నుంచీ బుజ్జిజింకకూ, నాకు సెలవులు కూడా వచ్చాయి.

డిసెంబర్ 22 న మొదలుపెట్టి - ముగ్గురం కలిసి - ముక్కా ముక్కా చేర్చి - రెక్కా రెక్కా (wing of the build) పేర్చి - మూడు మూళ్ళ-తొమ్మిది గంటల పైన ఇంకో మూడిరవైలు - అరవై నిముషాలు - అంటే మొత్తం మీద నాలుగు రోజుల్లో పదిగంటలు వెచ్చించి -  ఈరోజుకి అంటే డిసెంబర్ 25కి మా లెగో-తాజ్‌మహల్ కట్టడం పూర్తి చేశాం.

మొదటి రోజుకి బేస్ మాత్రం పూర్తి చేయగలిగాం.



దీనికి ముందు ఎన్నో లెగో సెట్లు పూర్తి చేసినా, దీంతర్వాత ఇంకొన్ని చేయబోతాం అనుకున్నా - ఈ తాజా తాజ్ సెట్టుకి ఒక ప్రత్యేకత వుంది.

గత తొమ్మిదేళ్ళుగా బుజ్జిజింక, నేను బోల్డన్ని లెగో సెట్లు build చేసినా ఎప్పుడూ మాతో చేరే వీలు కుదరని అన్నజింక ఈసారి మా ఇద్దరితో కలిసి ఈ తాజ్‌మహల్ build చేశాడు. చేస్తున్నంతసేపూ దాన్ని డిజైనర్లని (లెగో) మెచ్చుకుంటూనే వున్నాడు.

పూర్తయిన తర్వాత కూడా పదేపదే - దాని ముందు నించుని - "ఎంత బావుంది కదా!" - అని తెగ ముచ్చట పడుతున్నాడు.



 ఎప్పట్నుంచో లెగో-కబుర్లు రాద్దామనుకుంటున్నా కుదరలేదు.

ఈ రోజిలా - అన్ని విధాలా ప్రత్యేకమైన ఈ తాజ్ build గురించి రాయగలగడం బావుంది.

బోల్డన్ని లెగో కబుర్లకి
ఈ పోస్ట్ ఒక లెట్-గో
కబుర్లు చెప్తూ లెగో కడుతూ -
లెట్స్ గో, లెగో!

23, డిసెంబర్ 2017, శనివారం

మురిపించిన మంౘుకారు మంచిదే సుమీ!


మార్గశిరమేగి  పుష్యమాసమొచ్చి నాలుగు రోజులు.

మార్గశిర పుష్యమాసములు - హేమంత ఋతువు - చలి మిక్కిలిగా ఉండును, మంచు కురియును - అని చిన్నప్పుడెప్పుడో ఎక్కాల పుస్తకంలో చదువుకున్న ఋతువులపాట - వల్లె వేసుకుంటూ - అంతగా చలెక్కని రోజులని లెక్కించుకుంటూ - నిరుడు కురిసిన హిమపాతాల ఫుటోపులు చూసుకుంటూ - మంచెప్పుడు కురుస్తుందా - అని ఎదురు చూడడంతోనే గడిచిపోయింది నిన్నటివరకూ.

ఉత్తర అమెరికాలో శీతాకాలపు మొదటిరోజు డిసెంబర్ 21 అయినా -మా ఊళ్ళో నవంబర్ నుంచే బాగా చలిగా ఉంటుంది - ఉండేది.


శీతవేళ రానీయకు -  అన్న దేవులపల్లివారి పాట నాకిష్టమే!

కానీ - దాంతో పాటే ఏ కాలానికా కాలం - కాలానికి తగినట్లు ఉండడమూ - అలా ఉండడమే ఇష్టం.

ఈ ఏడాది మాత్రం శీతవేళ శీతకన్నేసేసిందీసారి అని బెంగొచ్చేసింది - చలి అంతగా అనిపించక, వణికించక.

కరుగుతున్న ప్రతి క్షణం  చేర్చుకుని
పెరుగుతున్నకాలం ఎవరి కోసం ఆగనిదైనా
అందరినీ తనతో నడుపుతు
కొందరిని తనలో కలుపుకు  
తన దారిన తాను పోయేదైనా ...

కాలపు నడకలో మనిషి పెట్టుకున్న గురుతుల ప్రకారం -

మేరుజ్యోతి తూర్పున వెలగాలి
రేజోతి ఆ వెలుగందుకొని వెన్నెల కురవాలి
వేసంగి వెచ్చగా ఉండాలి
ఆమని పచ్చగా విరియాలి
వానకారు జల్లుల తడపాలి
మంౘుకారు వణకున అణకువ పెరగాలి (చలికి చేతులు కట్టుకు)

వీటిల్లో ఏవి తప్పినా - ఎక్కడో ఏదో తప్పిందనిపించేస్తుంది
ఆ తప్పిందాన్ని ఒప్పించి - నాకు ఒప్పేటట్లుగా నడిపించే దారి తెలీక దిగులుగా ఉంటుంది.

సెలవులకి గూటికి చేరిన అన్నజింక, వాడెక్కడుంటే అక్కడక్కడే కూడా కూడా తిరుగుతున్న బుజ్జిజింక - చెరొక పుస్తకం చదువుతూ - నచ్చినచోట ఒకరు చదివినదాన్నిఇంకొకరికి వినిపించుకుంటూ - గుడిగోపురాల్లో వినిపించే పావురాళ్ళ సందడిలా అనిపించే గుసగుసకబుర్లు, ముసిముసి నవ్వులతో - ఇల్లంతా శీతాకాలపు-పండగ హడావిడి.

నిన్నటి రోజు - ఎప్పట్లాగే బద్ధకంగా నడిచిన పగలు. దీపాలు వెలగ్గానే మేలుకున్న రాత్రి.

నాకెప్పుడూ రాత్రి - అందులోనూ సెలవు రోజుల్లో రాత్రి - పుస్తకంలో మునిగో, మాటల్లో తేలో, పాటల్లో సోలో - కనురెప్ప తానంతట అదే మూత పడేదాకా - పగటికి సాగనంపుగా కాక - కొనసాగింపుగా గడపడం - నాకు చాలా ప్రియం.

అలాంటి ప్రియమైన రాత్రి - నిన్నటిరాత్రి.

రాగాల సరాగాల పాటలతో మొదలుపెట్టి రాజకీయాల-కబుర్ల దాకా రాత్రిని సాగదీసి - అప్పటికే రేపటిలోకి జారుతున్న రాత్రికి వీడ్కోలు పలుకుతూ - Good Night చెప్పుకుంటున్న మా నలుగురికి అప్పటివరకూ మా కబుర్ల జోరులో వినిపించలేదు - కిటికీ అద్దాల మీద "చిటుకు చిటుకు" అంటున్న చిట్టి-చిట్టి ఐసు-ముక్కల శబ్దాలు.

అది వినగానే - మళ్ళీ ఇంకొన్ని కబుర్లు - "మంచు కురుస్తుంది కానీ - ఇల చేరగానే నిలవద"ని ఒకళ్ళు, "లేదు - precipitation ఉందని నా ఫోన్ చెప్తోంది, కురిసినది నిలిచి మురిపిస్తుంద"ని ఒకళ్ళూ - అంటూ, అనుకుంటూ - కిటికీల మీద తాకుతున్న చినుకుల-చిటుకు-శబ్దాలు లెక్కెట్టుకుంటూ బజ్జున్నాం.

అందరికన్నా ముందు లేచిన నాకు - కిటికీలోంచి చూడగానే కనిపించింది ఏంటంటే ...

తెల్లారిన వెలుగు పూత 
వెల్లగా మంచు తెలుపు పూత
ఈ ఏటికిది తొలి మంచు పూత 
నింగిని నేలకు ఒకటే అంచు పూత 



కురిపించి కారును ముంచిన మంచు ఇదే 
మురిపించిన మంౘుకారు మంచిదే సుమీ !





మంచు కురిసినవేళ 
ముగ్గు వేసిన గడపన 
మనసు మురిసేలా 
ముద్దులొలికే ముస్తాబుతో
కనిపించిన అనుకోని బహుమతి 
ఆత్మీయ జెఫ్ సౌజన్యమిది!






19, డిసెంబర్ 2017, మంగళవారం

త్వామనురజామి - 20 - ఆ పంథొమ్మిదికి baseఏదమ్మా ౘందమామా?

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 19 - बोलనంత సేపు స్నేహమా - నేను बोలాక కోపమా?

అప్పుడెప్పుడో - డిసెంబర్ 19.
అచ్చొచ్చిన రోజు.
నచ్చొచ్చిన రోజు.
అనుకోకుండా "కలిసొ"చ్చిన రోజు.
అన్నీ కుదిరి నాకు కుదురిచ్చిన రోజు.

మరి ఇవాళ - సరిగ్గా - అదే రోజు అంటే డిసెంబర్ 19.

ఇక్కడొక్కసారి ఆగి -
మరపురాని ఆ మైమరపు
మైమరపు మాటున తళుక్కుమనే జ్ఞాపకాల మెరుపు
మెరుపులా మెరిసే ఆనాటి తలపు
ఆ తలపు వలన - తలచినకొద్దీ కలిగే - మురుపు
ఇక్కడికిక్కడ ఇక్కడే ఇలాగే ఆగి -
ఆ రోజుని తల్చుకుంటూ -



ఆ పంథొమ్మిదికి baseఏదమ్మా ౘందమామా?
అరెరే - ఎన్నో పోస్టుల్లో ఉన్నాదమ్మా ౘందమామా 
ఏ పోస్టులో వుందో ఇప్పుడు చెప్పాలమ్మా - హేయ్
ఎన్నో పోస్ట్లో ? - ఎన్నో పోస్ట్లో ? - ౘందమామా !- హేయ్
ఏంటో ఆ కథ చెప్పేసెయ్యి ౘందమామా!
 

- అని పాడుకుంటూ జరిగిందంతా ఒకసారి సింహావలోకనం చేసుకుంటే - బోల్డన్ని ప్రశ్నలు, వాటికి జవాబులు - వెరసి ఒక నా బ్లాగుతో నా బ్లాగే చేసుకునే - కొంటెర్వ్యూ - తుంటర్వ్యూ.

ఒకటవప్రశ్న:  

అసలు అబ్బాయి మూగ అని అమ్మాయికి ఎవరు చెప్పారు?

ఒకటవజవాబు: 

ఎవరూ చెప్పలేదు. అమ్మాయికి - మామూలు గంతులతో పాటు - conclusion కి కూడా గంతేయటం అలవాటు కదా - అలవాటు ప్రకారం వేసేసింది. "He doesn't say anything - except smiling" - అని అన్నది అమ్మాయి వినిపించుకొన్నప్పుడు చెప్పినవాళ్ళు - చెప్పించినవాళ్ళు చాలా జాగ్రత్తగా - He He doesn't say anything అన్నారు - అనిపించారు కానీ - He cannot say anything అనలేదు. అసత్యదోషం వాళ్ళది కాదు - అపార్థ-దోషం అమ్మాయిది. ( త్వామనురజామి - 17 - మాట లేని రోజు అది - వాక్కు లేని walk అది!)

రెండవప్రశ్న:  

అసలలా చెప్పే అవసరం ఎందుకొచ్చింది? ఏంటి సంగతి?

రెండవజవాబు: 

దీనికి జవాబు చెప్పే ముందు ఓ రెండు పోస్టులిక్కడ ప్రస్తావించాలి.

మొదటగా అబ్బాయి - అమ్మాయిని  - సీనియర్ సంగీత TVS మీద ఎక్కించుకుని వెళ్తుండగా చూసి - "అరె! ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే - ఎక్కడబ్బా?" అని ఆలోచించడానికి తావిచ్చిన - అమ్మాయెళ్ళిన - Unix / Shell Scripts & C క్లాసులు. (త్వామనురజామి - 15 - వెళ్ళనా చదువు బాట - టీవీయస్సుపై ...పిలియనునై ఈ పూట!)

ఆ తర్వాత - SPIC-MACAY పనిమీద SBM కి వెళ్ళినప్పుడు ఇంకోసారి కనపడ్డ అమ్మాయిని  చూడగానే అబ్బాయికి గుర్తొచ్చేసింది - అమ్మాయెవ్వరో, ఇంతకు ముందెక్కడ చూశాడో. 

వెంటనే - అబ్బాయి తన పక్కనే వున్న ఇంకో గుంటూరబ్బాయి - తన సీనియరూ అయిన RS కి అమ్మాయిని  చూపించి - "ఈ అమ్మాయి గుంటూరమ్మాయే - తెలుసా?" అనడిగాడు.

"ఔను - నాకు తెలుసు" - అంటూ RS సమాధానం.

అబ్బాయికి పూర్వపు జ్ఞాపకమేదో కదిలి అమ్మాయికి - అద్దమే కాదు, అద్దం కనిపిస్తే లోకాన్ని మరిచే అమ్మాయిలు  మెచ్చే - తన నవ్వు-మొహం ఎలాగైనా అమ్మాయికి చూపించాలనిపించింది.

అనిపించిన తడవే -  "అయితే నన్నొకసారి ఆ అమ్మాయి దగ్గరికి తీసుకెళ్ళు మరీ!" అనడిగాడు RS ని.

RS కి వెంటనే గుర్తుకొచ్చింది అమ్మాయితో - అంతకుముందే  దసరా సెలవులకి ఇంటికి వెళ్ళేటప్పుడు - జరిగిన భేటీ. (త్వామనురజామి - 16 - సెలవులు రావాలి ...మేమంతా - ఇంటికి వెళ్ళాలి! )

అందుకే చెప్పాడు అబ్బాయికి - "ఆ అమ్మాయికి కోపమెక్కువ. నోటికొచ్చినట్లు తిట్టేస్తుంది. నేను రాను" అంటూ.

"ఈ ఒక్కసారికి రా - షేకీ!" అంటూ అబ్బాయి

"లేదు బాబూ - నీకూ కోపమెక్కువ - నిన్నక్కడికి తీసుకెళ్తే కచ్చితంగా మీ ఇద్దరూ మాట్లాడుకోరు - పోట్లాడుకుంటారు - నేను రాను" అంటూ RS.

ఇలా ఓ పదినిముషాలు వాదం-సంవాదం నడిచాక - అమ్మాయి దగ్గరికి వెళ్ళి,  కలిసి మాట్లాడి వెళ్ళేవరకూ అబ్బాయి మాట్లాడకూడదు అనే షరతుతో - RS అబ్బాయిని అమ్మాయి హాస్టల్‌కి - కలవడానికి తీసుకొచ్చాడు.

అదీ అబ్బాయి మాట్లాడకపోవడానికి కారణం.

మూడవ ప్రశ్న: 

ఇంతకు ముందు రెండవజవాబులో అబ్బాయికి కదిలిన "పూర్వజ్ఞాపకం" ఏంటి? ఏమా కథ?

మూడవజవాబు: 


అప్పుడెప్పుడో రాసిన మొట్టమొదటి పోస్ట్: త్వామనురజామి-1 - ఎవరేమన్నను - అపర్ణ తోడు రాకున్నను ఒంటరిగానే పో... ఒకసారి చదవాలి  మరి!

అస్సలే - ఆ రోజు - అపర్ణ తోడు లేని రోజు.

అమ్మాయికి ఒక్కతీ కాలేజ్‌కి వెళ్ళడానికి బెరుగ్గా, బెంగగా వున్నరోజు.

ఆ రోజేం చేసిందంటే - రిక్షాలో వెళ్తున్నప్పుడు "ఎవర్రా అనిల్ - ఈ అమ్మాయి" అన్న మాట వినగానే అన్నదెవరో చూడకుండానే - ఎవరో అప్పుడే కమెంట్ చేసేస్తున్నారు - ఎలాగైనా ధైర్యంగా ఉన్నట్టు కనిపించాలి , వినిపించాలి అనుకుని - మొహం అద్దంలో చూసుకోమని చెప్పేసింది కదా.

అంతకుముందెప్పుడూ ఏ అమ్మాయీ అలా అనడం - తను పడడం అలవాటులేని అబ్బాయి - పక్కనున్న అనిల్ కేసి తిరిగి "ఎవర్రా? నన్నే ఇలా అంటోంది?" అనడిగితే "వీళ్ళు ముగ్గురాడపిల్లలు - పద్ధెనిమిదో అడ్డరోడ్డులో వుంటారు" అన్న అనిల్ సమాధానం విని - అప్పుడు అంతగా పట్టించుకోని అబ్బాయికి - అదే అమ్మాయిని తిరుపతిలో చూడగానే - ఆ పూర్వ జ్ఞాపకంతో ఆ అమ్మాయి దగ్గరికెళ్ళి - తన మొహం ఎలా ఉంటుందో ఒకసారి చూపించాలనిపించింది. 

నాల్గవప్రశ్న: 

అబ్బాయి RS కిచ్చిన మాట ప్రకారం - సైలెంటుగా వుండి బాగానే అమలుపర్చాడు 19న - సరే! మరి 21 రైలు-ప్రయాణం రోజు కూడా ఎలా మేనేజ్ చేశాడు? 

నాల్గవజవాబు:

21 రైలు-ప్రయాణానికి అబ్బాయి పెట్టుకున్న ముద్దుపేరు - ఆర్గనైజ్‌డ్ క్రైమ్ :)

డిసెంబర్ పంథొమ్మిదవ తారీఖున మొట్టమొదటిసారిగా కలిసినప్పుడు - ఎప్పుడైతే అమ్మాయి 21న గుంటూరు వెళ్తున్నాను సంక్రాంతి సెలవులకి అని చెప్పిందో - హాస్టల్‌కి వెళ్ళి అబ్బాయి చేసిన మొదటి పని ఏంటంటే - ఆ రోజు రైల్లో అమ్మాయి పక్కన సీటు ఎలా సంపాదించాలా అని ఆలోచించడం. 


అబ్బాయికున్న బోల్డంత మంది మంచి ఫ్రెండుల్లో - తర్వాత్తర్వాత SPMVV అమ్మాయిల్లో చిరు-భాయ్‌గా పేరు తెచ్చుకున్న మోహన్‌కి తిరుపతి రైల్వే స్టేషన్లో ఒక ఫ్రెండు ఉండడం - 

అబ్బాయి, ఫ్రెండు-మోహన్ వెళ్ళి ఆ ఫ్రెండు ద్వారా అమ్మాయి పేరు మీద డిసెంబర్-21న  గుంటూరుకి ఏ బెర్త్ రిజర్వ్ అయిందో కనుక్కుని దాని పక్క బెర్త్ రిజర్వ్ చేసుకోవడం - 

21న రైల్వే స్టేషన్‌కి వచ్చే ముందే - అబ్బాయి - తన ఫ్రెండ్స్ అందరికీ - తనెలా మూగబ్బాయిలా నటించబోతున్నాడో చెప్పడం - 

వాళ్ళందరినీ కూడా పాత్రోచితంగా సాయం పట్టమని అడగడం - 

వాళ్ళందరూ కలిసి ఆస్కార్ లెవెల్లో నటించడం - 

అదంతా చూసి - అమ్మాయి - అబ్బాయి बोल-లేడు అనుకుని బోల్తా పడడం - 

ఇన్ని డం-డం-డం-ల తర్వాత - ఇంకేముంది? 

ఇక్కణ్ణుంచీ అసలు కథ మొదలవడం ... 


ఆ అసలు కథలోకి వెళ్ళేముందు - ఆ పైనున్న టైటిల్ పాట - ఈ కిందున్న కొసరు పాట ఏంటో కనిపెట్టి పాడేసుకుంటూ మీరుండడం ... 
నేనిలా వెళ్ళి మళ్ళీ నెలకి ఇంకొన్ని కబుర్లతో రావడం ... 

నా బ్లాగులో కబుర్లు రాయకపోతే 
సరదా ఏదమ్మా?
నే బోలెడు కబుర్లు నింపకపోతే 
కథలే ఏవమ్మా?
చెప్తే ... నువ్వు...నే వింటానమ్మా!
వింటూ ...నేనూ... వుంటా!


<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

16, డిసెంబర్ 2017, శనివారం

చానా చక్కని చానలు పలికిన నా తానా కైత

ఇప్పటికి ఇంకొన్ని తానా-కబుర్లు మిగిలిపోయాయి. 

అందులో ఒకటి - ఎప్పటినుంచో పోస్ట్ చేద్దాం అనుకుంటూనే ఉంటూ - రేపు రేపని పోస్ట్‌పోన్ చేసుకుంటూ వస్తున్న ప్రీ-తానా పోస్ట్ ఇది. 

అప్పుడెప్పుడో సంక్రాంతి పండక్కి - చిర్రావారి ఇంట జరిగిన సరదా-విందులో - చాలా రోజుల తర్వాత బోల్డంత మంది తెలుగువారిని కలిశాను. 

భోజనానికి ముందు, భోంచేస్తూ, ఆ తర్వాత - ఎన్నో కబుర్లు, ఎంతో కాలక్షేపం. 

అప్పుడే మొదటిసారిగా  - సెయింట్‌లూయిస్‌లో జరగబోతున్న తానా-2017 కమిటీ ఎంపికల విశేషాలు విన్నాను.  

ఆ కబుర్లలోనే నా బ్లాగ్ ప్రసక్తీ వచ్చింది. తెలుగులో రాస్తాననేసరికి ముచ్చట పడి బ్లాగ్ వివరాలు తీసుకున్నారు తెలుగు చదవగలిగిన కొందరు. 

ఆ కొందరిలో ఒకరు ప్రసన్న. 

ఆరోజు తర్వాత - ప్రసన్న ఒకసారి ఫోన్ చేసి తను lead చేయబోతున్న Arts & Crafts Committee లో చేరమని ఆహ్వానించారు.  

ఆట్టే కనిపించకుండా - ఎప్పుడో ఒకప్పుడు మాత్రం వినిపిస్తూ - అప్పుడప్పుడూ  నా బ్లాగ్ ద్వారా మాత్రం చదివించడమే నాకు సౌకర్యం - అని చెప్పి - సుమతీశతకకారుని స్ఫూర్తితో - తనని నొప్పించక - నే నొవ్వక  తప్పించుకు ధన్యురాలిని అనిపించుకున్నాను. 

ఆ తర్వాత ఇంకొన్ని రోజులకి ప్రసన్న మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళ కమిటీ గురించి చెప్పి, తానాలో ఆ కమిటీకి సంబంధించిన - తెలుగువారి పండగలూ, కళలూ, ఆచారవ్యవహారాలూ, ఆహారవిహారాలూ - ప్రదర్శనల గురించి చెప్పి -  కొన్ని వాక్యాలు నేనేమైనా రాసివ్వగలనా మరుసటి రోజుకల్లా - అనడిగారు  . 

అదుగో - అలా పుట్టింది తెలుగువారమండి... కైత 
వెలిగింది తానా కబుర్లలోనట
పలికింది చక్కని చానలట 
వెలిసింది నా బ్లాగున ఈ పూట  



పలికినవారు
మధు భాగవతుల,  కిరణ్మయి, శ్రీదేవి భూమా, సౌమ్య, శ్రీదేవి చిర్రా,  శృతి, విష్ణుప్రభ, 
ప్రియాంక, శివప్రియ,  ప్రసన్న, మానస, లావణ్య
 


                                 


చానా చక్కని చానలు పలికిన నా తానా కైత 

పలికిన పలుకులు
తెలుగు వారమండి
తానా తెలుగు వారమండి
చానా వెలుగు వారమండి
మా లలితకళలు హస్తకళలు
వెరసి వెలిగించు మీ కనులు
మన పండుగలు మన పబ్బాలు
మన పాటలు మన ఆటలు
సంక్రాంతి ముగ్గులేసే కొమ్మలు
సరదాల దసరాల బతుకమ్మలు
రెండు రాష్ట్రాల షడ్రుచులు
వండి వడ్డించె ఆదరణలు
ఎన్నెన్నో కళల కథలు రంగుల కలలు
వినిపించాలని చూపించాలని
కొలువు తీర్చాం మీకై ఇచ్చట
వేచి నిలిచాం సెయింట్‌లూయిస్‌ తానా ముంగిట


9, డిసెంబర్ 2017, శనివారం

స్వాతి కోసం ఒక శనివారం ఇచ్చుకోలు - ఊగిసలాడిన మదికో మెచ్చుకోలు - అ. రె. జ. ని. నచ్చుకోలు

స్వాతి కోసం ఒక శనివారం ఇచ్చుకోలు:

ఈ మధ్య వరసపెట్టి తెలుగు సినిమాలు తెగ చూసేస్తున్నాం. 

మా బుజ్జిజింకకీ అర్థం అయిపోయింది - Saturday అంటే శనివారమే కాదు తెలుగు-సినిమావారం అని.

నవంబర్ 17 శుక్రవారం బోల్డన్ని తెలుగు-హిందీ సినిమాలు విడుదల అవుతున్నాయని చెప్తూ - "సిద్ధార్థ సినిమా: గృహం, కార్తి సినిమా : ఖాకీ - బావున్నాయట - ఉంటే వెళ్దామా?" అనడిగారు బదరి.

గృహం - హారర్ - అంటే నాకు టెర్రర్
ఖాకీ - సీరియస్ - అంటే నాకు బోర్

అందుకని వెతికి వెతికి -
మన తెలుగమ్మాయి స్వాతి వుంది -
ఆ అమ్మాయికి పన్ను మీద పన్నుంటుంది -
ఆ అమ్మాయి మాటల్లో ఫన్నుంటుంది -
ఆ అమ్మాయున్న తెర కలర్-ఫుల్గా ఉంటుంది -
పైగా సినిమా బావుంది అన్న రివ్యూ ఉండనే వుంది -
ఈ మధ్య రివ్యూల మీద పెరిగిన మన నమ్మకమూ మన్నికగా వుంది -
అని ఉన్నవీ లేనివీ చెప్పేసి -
ఉన్నపళంగా ఆకేసి-పప్పేసి-కూరేసి అంటూ అన్నం కూరేసి -
ఇరవైఏడు మైళ్ళు కార్లో ఊరేగేసి -
మిడ్-రివర్స్ మాలుకి రివర్స్-గేర్ లేకుండా వెళ్ళేసి -
హడావిడిగా టిక్కెట్లు కోయించేసుకుని -
వున్న 14 సినిమా-తెరల్లో పన్నెండో-తెరలో తొమ్మిదింటికి మొదలవబోతున్న రెండోఆట సైన్మ - లండన్ బాబులు సినిమా - చూసేద్దామని వెళ్ళిన మొట్టమొదటివారం మేమే అయి -
అన్నిటికన్నా పై..... వరసలో కూర్చున్నామో లేదో -
ఇంతలో శోధనీ-శూర్ప-హస్తులై ఇద్దరు లోపలికి వస్తూ కనిపించారు.

అప్పటికి అర్థమయ్యింది - మాకు - చలనచిత్ర-ప్రదర్శనశాల-ప్రక్షాళనా-కార్యక్రమాసక్తులై వారొచ్చారని.

మా సిని-మా-ఆత్రానికి మాలో మేమే నవ్వేసుకుని బయటికి వెళ్ళి నించుని - అక్కడున్న వాల్-పోస్టర్లన్నీ కంబైన్డ్ స్టడీ చేసేసి - ఓ పది నిముషాల తర్వాత థియేటర్‌లోకి వెళ్తే - తొమ్మిదయినా హాలంతా నిశ్శబ్దం.

కనీసం రాబోయే-సినిమాలు అనో, వచ్చి-పోయిన సినిమాల్లో ట్రివియా అనో ఏదో ఒక సందడి వుండే తెర కూడా కిమ్మనకుండా ఉండడం చూసి - అందులోనూ మేం ముగ్గురం నింపిన సీట్లు తప్ప - మిగిలిన చోట అంతా నిండుకొన్న హాలు-వాలకం చూసి - ఇంతకీ సినిమా వేస్తారో వెయ్యరో అని బెంగెట్టేసుకుని - నే గోళ్ళు కొరికేసుకునే లోపు మొదలయింది తెర మీద "లండన్ బాబుల" సందడి.

చెప్పుకోదగ్గ విశేషాలు:

1. ఆ రోజు సినిమా-హాలులో మేం ముగ్గురమే - నిజ్జం-ఒట్టు!

2. తినడానికి చిప్స్ కూడా దొరకలేదు

3. దాహం వేసి కొన్న నీళ్ళు - బయట అర్థ-డాలర్ కూడా ఉండనివి ఇక్కడ ఐదు-డాలర్లు

4. సినిమాలో కలర్స్-స్వాతి వేసుకున్న కలర్ఫుల్ డ్రెస్సులు - అక్కడక్కడా మెరిసిన ఆ అమ్మాయి నటన

5. రెండు గంటల ఐదు నిముషాల సినిమాలో గుర్తున్న మాట-పాట-ఆట ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవడం

6. హాస్యం అంటే మనిషి రూపునో, రంగునో హేళన చేయడం అనే అపహాస్యపు-తరహా భరిస్తూ - లేచొచ్చేసే  వీలున్నా, నేనూ "ఇంటికెళ్ళిపోదామా?' అడిగితే - ఔననడానికి సిద్ధంగా వున్నానని ఆచూకీ అందినా కూడా - ఎలాంటి సినిమా అయినా కూడా "ఆరంభించరు నీచమానవులు" అన్న భర్తృహరి-సుభాషిత-స్ఫూర్తితో అంతు-చూసేదాకా (మాదో, సినిమాదో) - చూడాలనే నా కోసం కూర్చుని - పూర్తిగా చూసిన నా పతీ-పుత్రుల అపరిమిత-సహనం

7. మరుసటిరోజు ఇండియా ఫోన్ చేసినప్పుడు ఆ సినిమా పేరే వినలేదని బాలాజీ చెప్పారని బదరి ఒకటే నవ్వటం

.... వెరసి తెలుగమ్మాయి స్వాతి కోసం ఒక శనివారం ఇచ్చుకోలు!

ఊగిసలాడిన మదికో మెచ్చుకోలు:

Once bitten twice shy - అని ఎవరన్నా అంటే - అదెక్కడైనా కానీ సినిమా దగ్గర మాత్రం "వినపళ్ళా" అనే రకం నేను.

అందుకని యధావిధిగా అదేపనిగా - మధ్యలో అన్నజింక ఇంటికొచ్చిన థాంక్స్-గివింగ్ సెలవు రోజుల శనివారాన్నొదిలి - మళ్ళీ ఈ శనివారం అంటే డిసెంబర్ 2న - మళ్ళీ అనుకోకుండా అప్పటికప్పుడు బదరిని బతిమిలాడి ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేయించి - పేరలా వుంది కానీ సినిమా మంచిదే అని చెప్పి ఒప్పించడానికి ప్రయత్నిస్తున్న నన్ను - అనుమానంగా చూస్తూ "అమ్మా! You're not experienced in understanding reviews. You need to learn it from Anna" అనంటున్న బుజ్జిజింకని ఏమార్చడానికేవో కబుర్లు చెప్తూ - మళ్ళీ అదే ఇరవైఏడుమైళ్ళ దూరం కారేగి - ఆరుగంటల-తొలాటకి మళ్ళీ - పై... వరసలో మేం ముగ్గురం - కాకపోతే ఈసారి మాకన్నా ముందు ఇంకొక్కరంటే ఒక్కరు.

సినిమా మొదలైన పదిహేను నిముషాల్లో అప్పటికి వున్న నలుగురం - ఇంకో ఐద్నాలుగులూ - పైన ఇంకో నాలుగు మమ్మల్ని -  వేసుకుని ఇరవై-నలుగురమయ్యాం.

అదేదో మేము తీసిన సినిమానే చూడడానికి ఇంతమంది వచ్చారు అన్నట్టు మురిసిపోయాం ముగ్గురం.

చెప్పుకోకుండా ఉండలేని విశేషాలు:

1. కరకరా తినడానికి చిప్సూ-చీజూ దొరికాయి

2. హీరో, ఇద్దరు హీరోయిన్లూ - ఎవరి రోలు వాళ్ళు ఎంచక్కా రీళ్ళ కొద్దీ మెప్పించేశారు

3. సినిమాలో - అమ్మాయిలు మధ్యే-మధ్యే మద్యపానం చేసినా - ఈ మధ్య మనవాళ్ళ మధ్య కూడా ఇలాగే ఉందట - అని సర్ది చెప్పేసుకున్నాం

4. ఒక హీరోయిను ముంబై, హైదరాబాదు - అకేలాగా -  అలా చలాకీగా - ఓ బేగ్గేసేసుకుని చులాగ్గా - అబ్బాయిల గదుల్లోకి అలవోకగా, అలవాటుగా - వెళ్లిపోతున్నట్లు చూపిస్తే - "ఫర్వాలేదు - మందికి మది-వైశాల్యం పెరుగుతోందేమో ఈ మధ్య - మనమొదిలొచ్చిన దేశంలో" అనేసుకుని ముచ్చటపడిపోయాం

5. "పెళ్ళికి ముందు ఎక్కువగా కలుసుకోకూడదు తెలుసుకోకూడదు - ఒకసారి పెళ్ళైపోతే సర్దుకుపోవాలి" - అని సినిమామ్మతో చెప్పిస్తే - ఔనా? ఇదే తరం చెప్పిన మాట? - అని చెరో ముక్కు మీదా వేలేసుసుకున్నాం

6. అదే సినిమామ్మ "నీకన్నా మాకేమీ ముఖ్యం కాదు" అని కూతురికిచ్చిన భరోసాని చెరో తలా ఊపి మెచ్చేసుకున్నాం

7. "ఒక నిర్ణయం తీసుకునే ముందు ఏది పొందుతున్నామో కాక ఏది పోగొట్టుకుంటున్నామో తెలిసుండాలి" అన్న సినీ-నాన్న మాటలూ బహు-నచ్చాయి

8. ఇంకా ఇంకా నచ్చినవి - ఏంటంటే....
...  ఏడ్చి సాధించని అమ్మా-నాన్నలు
...  ఏదీ సాగతీయని హీరోయిన్లు
.... ఏం చేస్తాడో ఈ అబ్బాయి అనేలా ఊగిసలాడిన హీరో
....  ఒకరి-వైపు నుంచి ఒక పరి, ఇంకొకరి-వంక నుంచి ఇంకొకసారి - ముందూ వెనకలకి వెళ్తూ కథని కథకళి  ఆడించిన కథనం, దర్శకత్వం - ముఖ్యంగా ఇంటర్వల్ ముందూ-వెనకా
.... అలలు అలలుగా అలరించిన సంగీతం
.... అస్సలు కనిపించని అక్కర-అనిపించని నృత్యం
.... కళ్ళ నిండుగా రంగుల-కలలు-కళలు చిలికించిన ఫోటోగ్రఫీ

9. ఒకే ఒక్కటి - ఇలా కాకుండా అలా ఉంటే బావుండేదేమో అనిపించింది ఏంటంటే..... ఈ సినిమా పేరు - మెంటల్ మదిలో అని కాకుండా నా మది ఊగిసలాడే...  అనో ఊగిసలాడకె మనసా ... అనో పెడితే ఇంకా బావుండేది

(ఈ మెంటల్ మదిలో అనే పేరు ఓకేబంగారం పాట మన మన మన మెంటల్ మదిలో --- గణ గణ గణ గంటల సడితో - విని నచ్చేసి పెట్టేసుంటారనిపించింది.)

ఏదేమైతేనేం - మది ఊగిసలాడిన సినిమా నచ్చింది
ఆ నచ్చిన మాట వచ్చి ఇలా చెప్పాలా వద్దా అని ఊగిసలాట లేని ఆలోచనొచ్చింది
ఆ ఆలోచన బ్లాగున ఇలా సినీ-మా-లక్ష్మి పోస్టయ్యింది ...

Post పోస్ట్ (Postscript - PS కి కవల నా ఈ postpost - PP ):

అ. రె. జ. ని. నచ్చుకోలు  


లండన్‌బాబుల దెబ్బకి బెదిరిన మా మదులు మళ్ళీ శుక్రవారం సినిమాల-మెయిలు చూడ్డానికి మొరాయించాయి.


ఈ వారానికి మన ఇంటrtainment మనమే చూసుకుందాం అనేసుకుని థాంక్స్-గివింగ్ సెలవుల్లో సినిమాలు ఏమున్నాయా అని వెతుక్కుంటూ ఉంటే "జయమ్ము నిశ్చయమ్మురా" అనే సినిమా పేరు యూట్యూబులో కనిపించగానే - బదరికి గుర్తొచ్చింది - ఎక్కడో చదివిన రివ్యూ చాలా బావుందని. అందులోనూ "కింగ్" సినిమాలో బ్రహ్మానందం పక్కన అసిస్టెంటుగా చేసిన శ్రీనివాసరెడ్డి క్లీన్-కామెడీ అంటే మా ఇద్దరికీ ఇష్టం. మనిషి చక్కగా ఉంటాడు - చాలా subtle గా హాస్యాన్ని - తను తొణక్కుండా నటిస్తూ నవ్విస్తాడు.

ఒకసారి పెట్టి చూద్దాం - అంతగా బావుండకపోతే ఆపేద్దాం అనుకున్నవాళ్ళం - సినిమా నచ్చి - ఆపేద్దామన్న ఆలోచనే లేక పూర్తిగా చూశాం.

ఈ పాట బావుంది, ఈ మాట బావుంది అని విడివిడిగా గుర్తు లేకపోయినా మొత్తానికి ఒక మంచి సినిమా చూశాం అనిపించింది.

కొత్త కథ - ప్రతీ దానికి ఎవరో చెప్పిన మాటల మీదో, నమ్మకాలమీదో ఆధారపడి తన మీద తనకే నమ్మకం లేని ఒక అబ్బాయి చివరికి ఆత్మవిశ్వాసం ఎలా పెంచుకున్నాడో అనేదే ఈ సినిమా కథ.

సాధారణంగా మేం సినిమా చూసే టైం - రాత్రి పది గంటల తర్వాత. అప్పటికి భోజనాలు అయి - పిల్లలతో కబుర్లు చెప్పుకుని - మరుసటి రోజు ఆదివారం ఎలాగూ సెలవు కాబట్టి - వాళ్ళో పుస్తకం చదవడమో, మ్యూజిక్ వీడియోలు చూడ్డమో చేసే టైంలో - పదింటికి పెట్టి  సినిమా చూడడం అయేటప్పటికి రాత్రి ఒంటిగంట.

చూసింతర్వాత -  అంత రాత్రి పూటా ఇంకో పదినిముషాలు ఆ చూసిన సినిమా గురించి మాట్లాడుకున్నామూ అంటే - అది నచ్చిందని మాకు మాకే అర్థమయి నవ్వుకుంటాము.

"హీరోకో ఇమేజ్ వుంది" అనుకుంటూ - దాన్ని ఈజ్ చేసి కొత్త కథలు ప్రయత్నించకుండా - ఇంకా హీరోయిన్ల నడుముల మీద కన్నులో, హాస్యనటులు వీపుల మీద  తన్నులో, పంచుల పేరుతో ఫన్ను లేని పన్నులో - ఇంతే...సినిమా - అన్నట్లు బోల్డన్ని డబ్బులు పెట్టి తీసి ప్రపంచం మీద పారేస్తున్న - వారసత్వాల హీరో-త్వాల నుంచి ఊరడింపుగా - ఈ జయమ్ము నిశ్చయమ్మురా - కొత్త దర్శకులు, కొత్త హీరోలు - మంచి కథలు, కథనాలూ - ఉంటే ఇలాంటి సినిమాలకి ప్రేక్షకుల ఆదరమ్ము నిశ్చయమ్మురా అనిపించే సినిమా.

యూట్యూబ్‌లో సినిమా - అందులోనూ మంచి కొత్త సినిమా ఊరికే చూసినప్పుడల్లా - అనుకుంటాం - కనీసం ఆ దర్శకుడో, నిర్మాతో కొంచెం మంచిగా ప్లాన్ చేసుకుని - advertise చేసుకుని - "మా సినిమా బావుంది - రెండో, నాలుగో డాలర్లు పెట్టి చూడండి" - అని డబ్బులు చేసుకోగలిగితే బావుండును అని.

ఇలాంటి సినిమాలు దిగ్విజయంగా థియేటర్లలో ఆడి - అందరూ చూసి మెచ్చుకునే రోజు నిశ్చయంగా రావాలని కోరుకుంటున్నాను.

చివరిగా - ఈవారం - అంటే నిన్న రాత్రి చూసిన ఇంకో సినిమా గురించి.

అర్జున్ రెడ్డి - నాలుగు డాలర్లకి యూట్యూబ్లోనే చూశాం. 

కచ్చితంగా ఇది నంబర్-వన్ R-rated సినిమా.

పెద్దవాళ్ళు మాత్రమే చూడాల్సిన సినిమా.

పెద్దవాళ్ళు - చూడకూడని సినిమా అన్నారు కాబట్టి - తప్పకుండా చిన్నపిల్లలు చూసే - చూడాలనుకునే సినిమా. 

ఈ సినిమా చూసినంత సేపు - చాలా రోజుల తర్వాత - ఒక సినిమాని సినిమాలాగా - సినిమా అనే కళని ఇష్టపడే ప్రేక్షకుల్లా చూస్తూ - సినిమా కథని అంత శ్రద్ధగా, ఇష్టంగా రాసుకుని, దాన్ని అంతే committedగా తెర మీద అంత ధైర్యంగా చూపించడానికి దర్శకుడు ఎంత కష్టపడి ఉంటాడో, ఎన్ని పగళ్ళు-రాత్రులు ఆ కథని ఎలా ప్రెజెంట్ చేయాలో అని ఎంత ఆలోచించి ఉంటాడో - మాలో మేమే మాట్లాడేసుకుని తెగ మెచ్చేసుకున్నాము.

కథ ఎలా వుంది - కరెక్టా, కాదా  - అసలిలా జరుగుతుందా - జరిగినా ఇలా చూపించొచ్చా - అన్న ప్రశ్నలూ-ఆలోచనలూ పక్కన పెడితే - ఈ సినిమా సందీప్ రెడ్డి లాంటి అచ్చ తెలుగు దర్శకుడు కాకుండా - ఏ తమిళంలోనో, మళయాళంలోనో తీశారని చెప్పి డబ్ చేసి ఉంటే - ఇంకా ఇంకా పేరొచ్చేదేమో.

ఈ సినిమా పూర్తిగా దర్శకుడి సినిమా.

విజయ్ సాయి దేవరకొండ - అద్భుతమైన నటుడు. హీరోలా కాదు కథకి-నాయకుడై - కథానాయకుడై సినిమాని నడిపించినవాడు. ఆ అబ్బాయి కళ్ళలో వున్న ఇంటెన్సిటీ లాజవాబ్! ఈ సినిమా చూశాక ఇంకోసారిఈ అబ్బాయే act చేసిన పెళ్లిచూపులు - ఇంకోసారి చూద్దామనుకున్నాం - ఆల్రెడీ చూశామన్నట్టు గుర్తుంది కానీ ఏం చూశామో గుర్తు లేదు మరి :)

హీరోయిన్ - సాదా-సీదాగా - ఒక తుళు అమ్మాయిలా చాలా చక్కగా సరిపోయింది.  ఒక అమాయకమైన కాలేజ్ ఫ్రెషర్‌గా మొదలయి ఒక self-reliant వుమన్ గా -  ఆ అమ్మాయిని portray చేసిన విధానం చాలా బావుంది.

హీరో అన్న గౌతమ్ (కమల్ కామరాజు) తమ్ముడి పట్ల చూపించిన ఇష్టం, concern, స్నేహమంటే ఇదే అన్నట్లున్న ఫ్రెండ్ శివ (రాహుల్ రామకృష్ణ) , నాన్నమ్మ(కాంచన) - వీళ్ళే కాదు - ప్రతి ఒక్కరూ బాగా act చేసిన సినిమా ఇది.

ప్రత్యేకంగా చాలా ఏళ్ళ తర్వాత కనిపించిన కాంచన -  ఆవిడ నటన - majestic!

ఆవిడతో చెప్పించిన - Suffering is personal. Let him suffer - అన్న మాటలూ, అవి అనేటప్పుడు చూపించిన simple expressions, ఆవిడ ఇంగ్లీష్ ఉచ్చారణ (ఆవిడ ఒకప్పుడు air-hostess మరి!) - చాలా చాలా నచ్చేశాయి నాకు. 

హీరోయిన్‌కి కాల్లో గాజుపెంకు గుచ్చుకుంటే - హీరో ఎమోషనల్‌గా స్ట్రెచర్తోసుకుంటూ ఆపరేషన్ థియేటర్లో ముక్కుకి మాస్క్ కట్టుకుని ఎర్ర-బల్బ్ ఆరుతూ వెలుగుతూ ఉండగా చెమట తుడుచుకుంటూ ఆరుగంటలు ఆపరేషన్ చేసి - తర్వాత పొద్దున్నే ఇద్దరు హాస్యనటులతో - పూలూ పళ్ళూ గంపల్లో తీసుకెళ్ళి - హీరోయిన్ మీద పోసి - ఏ స్విజ్జర్లాండులోనో - దెబ్బ తగిలిన కాలుకి మాత్రం రంగురంగుల పీలికలు కట్టి - కట్టేసుకోబోయి నెట్టేసుకున్నాను - హరీ హరీ - అని పాడకుండా - అది పంథొమ్మిదేళ్ళ అమ్మాయికి ఎలా సెల్ఫ్-హీల్ అవుతుందో మెడికో-నాయకుడు సింపుల్గా తేల్చేస్తే - ఒక్క నిముషం తెలుగు సినిమానే చూస్తున్నామా - అని అనుమానం వచ్చిందండోయ్ - నిజం!

అన్నిటికన్నా - సినిమాని సెంటిమెంట్ల ఏడుపులతో నింపకపోవడం బావుంది.

ఉదాహరణకి  - అర్జున్ నాన్నమ్మ పోయినప్పుడు ఆవిడకిష్టమైన పాట వినిపించడం, ఆ మరణాన్ని వాళ్ళ నాన్న జీవితంలో ఎంత ముఖ్యమైన ఘట్టమో వివరించడం - అది కూడా loud గా లేని చిన్న-చిన్న మాటలు, gestures తో చూపించడం నచ్చింది.

ముఖ్యంగా విషాదాంతపు బారిన పడకపోవడం ఇంకా నచ్చింది. A good story with a  happy ending always plants a smile on my lips!


ఈ సినిమాలో ఒక చోట వినిపించిన బాంబే -జయశ్రీ గారి సుమనస వందిత సుందరి మాధవి  వెతుక్కుని బ్లాగ్లో అట్టేపెట్టేసుకోవాలనిపించేంతగా నచ్చేసింది.





అ. రె. జ. ని  - అంటే ఆమ్లజని, ఉదజనిలాగా రసాయనికవాయువు కాదు.

అ. రె. = అర్జున్ రెడ్డి
జ. ని = జయమ్ము నిశ్చయమ్మురా
నచ్చుకోలు = మాకు నచ్చిన ఆ రెండు సినిమాల గురించి కొన్ని కబుర్లు
వెరసి  అ. రె. జ. ని. నచ్చుకోలు!

స్వాతి కోసం  ఒక శనివారం ఇచ్చుకోలు -
ఊగిసలాడిన మదికో మెచ్చుకోలు -
అ. రె. జ. ని. నచ్చుకోలు -
ఈ వారపు నా పోస్ట్-కోలు!

~ సినీ-మా-లక్ష్మి

3, డిసెంబర్ 2017, ఆదివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 7 - బీటీలో గట్టెక్కిన ఎస్సెసెల్సీ

గతనెల కబుర్లు : అవతారంగారి నారాయణగారి బాబి - 6 - అల్లరి, ఆటలు, ఇరవు, ఈదేసిన గోదారి

1962 ఫిబ్రవరిలో మా అన్నగారు - నానిగారు ఒరిస్సాలో కటక్‌లో ఉద్యోగం చేసేవారు.

మా వదినగారికి శ్రీను పుట్టాడప్పుడు.

మా వదినగార్ని - విజయవాణ్ణుంచి - నేను, మా నాన్నగారు, మా వదినగారి చెల్లెలు లక్ష్మి - తీసుకుని మేం నలుగురం బయల్దేరి కటక్ వెళ్ళాం.

నేనొక పదిహేను రోజులు కటక్‌లో వున్నాను.

మా నాన్నేం చెప్పారంటే - "ఒరే! నీకింక అనాతవరం, భీమనపల్లి  చదువు పనికిరాదు - నేను విశాఖపట్నంలో చెప్తాను. నాని కూడా విశాఖపట్నంలో చదువుకున్నాడు. అంచేత నువ్వెళ్ళి భీమనపల్లి హైస్కూల్లో నీ పేపర్లు అవీ తీసుకుని విశాఖపట్నం రా -నేనెక్కడికి వస్తాను" - అని నన్ను బయల్దేరి వెళ్ళిపొమ్మన్నారు.

విశాఖపట్నంలో మా మేనత్త గారి ఇల్లు - మా అక్కగారు కూడా ఆ ఇంటి కోడలే.

మా పెద్దమామయ్య - అంటే మా మేనత్తగారి భర్తకి నేనంటే మంచి అభిమానం. వాళ్ళది ఉమ్మడి కుటుంబం - నలుగురు అన్నదమ్ములు. అంతా కలిసి ఒక పెద్దింట్లో వుండేవారన్నమాట.

సరే- నేను ఒరిస్సా నుంచి బయల్దేరి అనాతవరం వెళ్ళిపోయి - భీమనపల్లి హైస్కూలు కెళ్ళి ఆ పేపర్లూ అవన్నీ తీసేసుకుని - విశాఖపట్నం వచ్చాను.

ఈ లోపులో మా నాన్నగారు కూడా ఒరిస్సానుంచి విశాఖపట్నం వచ్చారు.వచ్చి నన్ను మా బావగారికి అప్పజెప్పారు  - "ఇక్కడే పెట్టి చదివించండి - వీడక్కడుంటే ఎందుకూ పనికిరాడు" - అని చెప్తే మా బావగారు BT కాలేజ్ అంటే భారత్ ట్యుటోరియల్ కాలేజ్ - డాబాగార్డెన్సులో ఉండేది - అందులో ఆయన ఫ్రెండ్ ఉండేవాడు - కందాళ శ్రీనివాస్ అని చెప్పేసి.

ఆయన కూడా లాయరు - మా బావగారి లాగే.

ఆయన దగ్గరుంటే బుద్ధిగా చదువుకుంటాననే ఉద్దేశ్యంతో BT కాలేజ్‌లో చేర్చారు.

అందులో - నేను , మా బాబాయిగారబ్బాయి నర్సింమూర్తి - మేమిద్దరం అక్కడ చేరాం.

బావగారు, ఆయన తమ్ముడు రామచంద్రం - నాకన్నా పెద్దవాళ్ళు.

ఇంట్లో ఇంకా మనకి ఫ్రెండ్స్ ఎవరంటే - మా రెండో మావయ్య - సూర్యనారాయణ గారు - సూరి మావయ్య అనేవాళ్ళం - ఆయన కొడుకు చిన్నభాస్కరం, సోమేశ్వర్రావు మావయ్య కొడుకు చిట్టిగాడు, నర్సింమూర్తి, వాడి అన్న రామసూర్యం, తర్వాత ఇంట్లోనే ఉండే - కోటి అని అనాతవరం నుంచి వచ్చాడు - కోటిగాయత్రి అని పాపం! కొంచెం బీదవాళ్ళు. ప్రభాత్ థియేటర్ అని ఉండేది - అక్కడ గేట్‌కీపర్‌గా పని చేసేవాడు. ఆ థియేటర్లో ఏ సినిమా వచ్చినా కూడా ఫ్రీగా వాడే పంపించేసేవాడు.

ఆ రకంగా విశాఖపట్నం కాలేజ్‌లో చేరాక నాకు ఇంగ్లీషు కొంచెం మెరుగుపడింది.

లెక్కల్లో ఇంక gem అయిపోయాను. భూతేశ్వర్రావు అని పేరు కూడా పెట్టానుఆయనకి - ఒరిస్సా నుంచి వచ్చారు - లెక్కల మాష్టారు - పాత్రుడు గారు. చాలా బాగా చెప్పేవారు లెక్కలు. ఆయన శిక్షణలో నాకు లెక్కల్లో ఎప్పుడూ తొంభైకి పైనే మార్కులు.

ఇంట్లో ఎక్కడ చూసినా కాయితాలన్నీ నా లెక్కలతోనే ఉండేవి. General Mathsలో నేను చేయలేని లెక్క ఉండేది కాదు.

నాకు సాయంత్రం ఉండేవి క్లాసులు. పగలంతా ఇంట్లోనే ఉండేవాణ్ణి. సాయంత్రం ఆరింటికి వెళ్ళి పదింటికి ఇంటికి వచ్చేవాణ్ణి.

BT కాలేజ్‌లో జోగయ్య మాష్టారు తెలుగు చెప్పేవారు. నరసింహారావుగారు సాంఘిక శాస్త్రం అంటే సోషల్ స్టడీస్ చెప్పేవారు.

జోగయ్య మాష్టారికి నేనంటే బాగా అభిమానం  నేను వ్యాకరణం - సంధులూ, సమాసాలూ, అలంకారాలూ - అవీ బాగా చెప్పేవాణ్ణని.
 

మా సోషల్ మాష్టారు నరసింహారావుగారు ఒకసారి చరిత్రలో అశోకుడి పాఠం చెప్పారు -  అశోకుడు మగధ సింహాసనం అధిష్టించాడు, చెట్లు నాటించాడు, బావులు తవ్వించాడు - అంటూ.

ఆయన మరుసటి రోజు పాఠం మొదలు పెట్టే ముందు - క్రితం రోజు చెప్పిన పాఠం గురించి ప్రశ్నలు వేసేవారు.

అలా ప్రశ్నలు అడుగుతూ నన్ను లేపి - "ఒరే వడ్లమానీ ! లే !  అశోకుడు మగధ సింహాసనం ఎక్కాక ఏం చేశాడో చెప్పు! " అన్నారు.

నేను వెంటనే - రెండు చేతులు కట్టుకుని - "కూర్చున్నాడండి -ఆయ్!" అన్నాను.

అంతకన్నా వెంటనే ఆయన "ఆరి భడవా! అశోకుడు సింహాసనం ఎక్కి కూర్చున్నాడా? అయితే నువ్వు బెంచెక్కి నించో! " అని నన్ను బెంచెక్కించి ఆ పీరియడంతా నన్ను బెంచీ మీద నించోబెట్టేశారు.

మా మాష్టార్లకి - కోనసీమ యాసలో - ఆయ్! అంటూ మాట్లాడే నా మాటలు ఎంతిష్టమో! మళ్ళీ మళ్ళీ మాట్లాడించి సరదాగా వింటుండేవాళ్ళు.

ఇలా సరదాగా చదువుకుంటూ BT కాలేజ్‌లో SSLC ఫస్టుక్లాసులో పాసయ్యాను - 1963 మార్చ్‌లో.

<వచ్చేనెల తరువాయి కథ>

26, నవంబర్ 2017, ఆదివారం

మనసే జతగా పాడిందిలే - 6 - కవలపాటలు - 500 మైళ్ళూ ... తుమ్ దేనా సాథ్ మేరా...

అసలు-పాట:

ఉబుసుపోకకో వెతికి పట్టుకున్న కబురు
తోచీ తోచని వేళకో అతికీ అతకని మాట
కాలక్షేపానికో తాళం కుదిరీ కుదరని పాట
ఇలా ఎప్పుడూ...  ఏదో ఒక వంకన...  నోరాడుతూ-పాడుతూ ఉండాల్సిందే!
కానీ అవెంతసేపని? - నోర్నెప్పుట్టదూ?

అలాంటప్పుడు - సినిమా హాలుకి దారేదీ - మనం చూడక పోరాదేదీ - అనేసుకుని - కారేసుకుని - పొలోమని ఛలో అంటూ ఇంటిల్లిపాదీ - ఇరుతరాలూ - తరలెళ్ళి - తారలాడే తెరకి కళ్ళప్పగించి - తారలు పాడే పాటలకి చెవులప్పగించి - ఇంటికి తిరిగొచ్చేవేళకి ఒకటో రెండో పల్లవుల-పల్లకీలెత్తుకుని ఉంటాము.

ఒకసారలాగే  మా ఊరి సైన్స్‌సెంటర్‌ - OMNIMAX లో అర-పుష్కరం క్రితం Rocky Mountain Express అనే సినిమా చూడడానికి వెళ్ళాం. అప్పుడు విన్నామా పాట.

వింటూనే - నా పక్కనే కూర్చున్న - వయసులో అర్థ-పుష్కరుడూ (అప్పటికి), వాక్కులో పృచ్ఛ-పుష్కలుడూ (ఇప్పటికీ...) - అయిన బుజ్జిజింక - గుసగుసగా నా చెవిలో అడిగిన ప్రశ్న " Mama! Doesn't this sound like the song that Nannagaru plays in the car?" అంటూ.

అంత చీకట్లోనూ కవల -పాటని పట్టిన వెలుగు వాడి కళ్ళలో - వాడి గొంతులో excitement వినిపిస్తున్నంత - స్పష్టంగా - కనిపించింది.

ఒక్కోసారి - అది అదే మొదటిసారి వినడమే అయినా - ఒక్కోపాట మాకు పాత చుట్టమయినట్టూ, ఎప్పటినుంచో మా చుట్టుపక్కలే ఉన్నట్టూ - మమ్మల్ని చుట్టుముట్టేస్తుంది.

అలా చుట్టుముట్టిన ఆ కమ్మటి పాటని - పదిలంగా పట్టుకుని - మా వెంటబెట్టుకుని - ఇంటికి తెచ్చేసుకున్నాం - కూనిరాగాల్లో.

ఆపాతమధురమైన ఆ పాత చుట్టంలాంటి పాట - వినగా వినగా ఎంత ఇష్టం పెరిగిందో!

ఆ పాట సందర్భాన్నిబట్టి - తానెక్కిన రైలెక్కని ఆత్మీయులని తలచుకుంటూ పాడుకుంటున్న ఆ కష్టాన్ని తలపోసుకుంటూ - ఇంటిల్లిపాదిమీ - ఏ సావకాశపు రాత్రో మళ్ళీ మళ్ళీ విని - మళ్లింకొక్కసారి - ఆ పాటని మా స్వంతం చేసేసుకుంటూ ఉంటాం - మైళ్ళకావల - అనుకున్న పళాన వెళ్ళి చూడలేని ఆప్తులని తలుచుకుంటూ...

అసలు miss కాకూడని ఆ పాట - వింటూ పాడుకోవడానికి వీలుగా ... ఇదిగో ఇక్కడ...(1960's ఆల్బమ్ నుంచి):





If you miss the train I'm on
You will know that I am gone
You can hear the whistle blow a hundred miles
A hundred miles - a hundred miles - a hundred miles - a hundred miles
You can hear the whistle blow a hundred miles

Lord, I'm one, Lord, I'm two
Lord, I'm three, Lord, I'm four
Lord, I'm five hundred miles from my home
Five hundred miles - five hundred miles - five hundred miles - five hundred miles
Lord, I'm five hundred miles from my home

Not a shirt on my back
Not a penny to my name
Lord, I can't go a-home this a-way
This a-away - this a-way -  this a-way - this a-way
Lord, I can't go a-home this a-way

If you miss the train I'm on
You will know that I am gone
You can hear the whistle blow a hundred miles

కవల-పాట:

పైది పైడిలాంటి అసలు పాటైతే - కిందది అసలుపాట పల్లవి-కూర్పుని ఒడిసిపట్టిన పసిడిలాంటి సిసలుపాట.

అసలుపాట దూరమైన వారిని గుర్తుచేసి దిగులు పెంచితే - సిసలుపాట నీకు నేనున్నాననే వారున్నారనే భరోసా పెంచి ఓదారుస్తుంది.

పల్లవి మాత్రం అసలు పాట వరసలో ఉంటుంది - కానీ చరణాలు ఇదే అసలు పాటేమో అన్నంత హాయిగా ఉంటాయి.

ఈ అసలు-సిసలైన కవలపాట జుర్మ్ (1990) లోది - రాజేష్ రోషన్ సంగీతంలో కుమార్ సాను, సాధనా సర్‌గమ్ పాడినది.

రాజేష్ రోషన్ అనగానే - మున్ముందుగా గుర్తొచ్చేవి - జూలీ - పాటలు - దిల్ క్యా కరే జబ్ కిసీ (గానా) సే,  కీసీ కో ప్యార్ హో జాయే? - ఆ పాటల ప్రేమలో పడ్డ తర్వాత పాడుకోవడం తప్ప మనమేం చేయగలదు ? ఆ మనమున్న మనమేం చేయగలం - ఆ పాటకి తలూపుతూ తాళమేయడం తప్ప?

ఆ జూలీ పాటల గాన-మాంత్రికుడే - బెంగ-పాటకి ఓదార్పు-రంగునలది - మన వీనుల విందు కావించిన వైనమేదో విందామా మరి!




జబ్ కోయి బాత్ బిగడ్ జాయే - జబ్ కోయి ముష్కిల్ పడ్ జాయే
తుమ్ దేనా సాథ్ మేరా - ఓ హమ్-నవా...
జబ్ కోయి బాత్ బిగడ్ జాయే - జబ్ కోయి ముష్కిల్ పడ్ జాయే
తుమ్ దేనా సాథ్ మేరా - ఓ హమ్-నవా ...

న  కోయి హై  న కోయి థా - జిందగీ మే తుమ్హారె సివా
తుమ్ దేనా సాథ్ మేరా - ఓ హమ్-నవా ...
తుమ్ దేనా సాథ్ మేరా - ఓ హమ్-నవా ...

హో చాంద్‌ని జబ్ తక్ రాత్ - దేతా హై హర్ కోయి సాథ్
తుమ్ మగర్ అంధేరోం మే  - న ఛోడ్‌నా మేరా హాథ్
హో చాంద్‌ని జబ్ తక్ రాత్ - దేతా హై హర్ కోఈ సాథ్
తుమ్ మగర్ అంధేరోం మే  - న ఛోడ్‌నా మేరా హాథ్

జబ్ కోయి బాత్ బిగడ్ జాయే - జబ్ కోయి ముష్కిల్ పడ్ జాయే
తుమ్ దేనా సాథ్ మేరా - ఓ హమ్-నవా...

న  కోయి హై న కోయి థా - జిందగీ మే తుమ్హారె సివా
తుమ్ దేనా సాథ్ మేరా - ఓ హమ్-నవా


వఫాదారీ కీ వో రస్‌మే -  నిభాయేంగే హమ్ తుమ్ కస్‌మే
ఏక్ భీ సాస్ జిందగీ కీ - జబ్ తక్ హో అప్‌నే బస్ మే
వఫాదారీ కీ వో రస్‌మే -  నిభాయేంగే హమ్ తుమ్ కస్‌మే
ఏక్ భీ సాస్ జిందగీ కీ - జబ్ తక్ హో అప్‌నే బస్ మే

జబ్ కోయి బాత్ బిగడ్ జాయే - జబ్ కోయి ముష్కిల్ పడ్ జాయే
తుమ్ దేనా సాథ్ మేరా - ఓ హమ్-నవా ... 


న  కోయి హై  న కోయి థా - జిందగీ మే తుమ్హారె సివా
తుమ్ దేనా సాథ్ మేరా - ఓ హమ్-నవా


దిల్ కో మేరే  హువా యకీన్ - హమ్ పెహ్‌లే భీ మిలే కహీ
సిల్‌సిలా యే సదియోం  కా - కోఈ  ఆజ్ కీ  బాత్ నహీ
దిల్ కో మేరే  హువా యకీన్ - హమ్ పెహ్‌లే భీ మిలే కహీ
సిల్‌సిలా  యే సదియోం  కా - కోయి ఆజ్ కీ  బాత్ నహీ

జబ్ కోయి బాత్ బిగడ్ జాయే - జబ్ కోయి ముష్కిల్ పడ్ జాయే
తుమ్ దేనా సాథ్ మేరా - ఓ హమ్-నవా...
జబ్ కోయి బాత్ బిగడ్ జాయే - జబ్ కోయి ముష్కిల్ పడ్ జాయే
తుమ్ దేనా సాథ్ మేరా - ఓ హమ్-నవా ...

న  కోయి హై న కోయి థా - జిందగీ మే తుమ్హారె సివా
తుమ్ దేనా సాథ్ మేరా - ఓ హమ్-నవా ...
తుమ్ దేనా సాథ్ మేరా - ఓ హమ్-నవా ...


కొస(రాగపు)మెరుపు:

మొట్టమొదటిసారిగా - 2011 లో - Rocky Mountain Expressలో అసలుపాట విని - కవలపాటని పట్టిన బుజ్జిజింక ఇంటికి వచ్చీ రాగానే - వాడి బుల్లి బేబీ-కీబోర్డ్ తీసుకుని వాడి గదిలోకి వెళ్ళాడు.

ఒక గంట సేపు .... 
టంగ్ టాంగ్ ... టాంగ్
టింగ్ టింగ్ ... టీంగ్
టుంగ్ టుంగ్...టూంగ్

ఓ గంట - టాంగ్... టీంగ్.... టూంగ్ - గానా-బజానా అయ్యాక - వాడు పట్టుకున్నది, వాడికి పట్టుబడింది - ఏంటీ అంటే - ఆ 500 మైళ్ళ పాట.

అప్పుడు నా ఫోన్ స్మార్టుదీ కాదు - ఒకవేళ అది స్మార్టుది అయినా - వాడే నేను స్మార్టు కాకపోవడం వల్ల - ఆ కీబోర్డుమీద 500 మైళ్ళు-మొదటి-క్షణాన్ని పట్టుకోలేకయాను.

ఇవాళ - ఈ కవలపాటల పోస్ట్ రాస్తూ - బుజ్జిజింకని బతిమిలాడితే - నాకోసం ఎక్కడో దాచివుంచిన ఆ బేబీ-కీబోర్డ్ బేస్‌మెంట్‌లోంచి - మళ్ళీ పైకి తెచ్చి - వాడి వేళ్ళు, కీబోర్డ్ మెట్లూ మాత్రమే రికార్డ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకుని - వాడి మూడ్ మారిపోయేలోగా - గబగబా - ఆట్టే రీటేకులు అడక్కుండా ఫోన్లో ఒడిసిపట్టేసి యూట్యూబ్లో అట్టేపెట్టేసుకున్నా... 




అసలుపాట
సిసలైన కవలపాట
కొస(రాగపు)మెరుపు పాట
పాటల వరస  ఇదట
మీరు వినడమే తరువాయట
మీరలా వింటుంటే... నేనిలా ఉంటుంటూ...
మరెన్నో పాటలనందిస్తానట ...

Stay tuned ...

~పాటల భైరవి

23, నవంబర్ 2017, గురువారం

సౌజన్యానికో పూలపోగు...

తానా సంబరాలు ముగిసి దాదాపు ఆరునెలలు అయింది.
అప్పటి తానాలో పాల్గొన్నది నేనా?
అది నిజమేనా ?
నే కలగన్నానా?
ఆ కలని కలిమిలా దాచుకొందునా!
ఆ కలిమి పంచిన చెలిమిని కలలోనైనా మరువకుందునా !
ఆ చెలిమి పెంచిన కూరిమిని కలకాలం నిలుపుకుందునా?!

తానాని తలుచుకున్న ప్రతీసారీ ఇప్పటికీ ఇలాగే అనిపిస్తుంది ... 

తానా సమావేశాల్లో నాకు దక్కిన లాభం - కొన్ని అపురూప పరిచయాలు, ఇంకొన్ని ఆత్మీయ సాహచర్యాలు.

అందులో కొన్ని ఎదురెళ్ళి మరీ చేయి చాపి అందుకున్నవైతే - అనుకోకుండా దొరికిన వరాలు కొన్ని.

ఇంకొన్ని - అందుకుందామని మనసైనా - అవతలివారు పేరున్నవారు, పేరెన్నికగన్నవారు, సమావేశాల నిర్వహణలోనో, కార్యవర్గంలోనో సతమతమవుతున్నవారు - వెళ్ళి పలకరించాలా? పలకరించి ఏమని చెప్పుకోవాలి నా ప్రవర?

నేను ఫలానా ... నేను చేసేది ఫలానా ... ఇక్కడికొచ్చిన కారణం ఫలానా... అని చెప్పుకుని
మీ రాత ఇష్టం... అనో
మీ చేత ఘనం ... అనో
మీ పాట ప్రియం ... అనో - అని అన్న తర్వాత ఇంకేంటి?
ఇంకేం మిగిలింది?
అరె ...అసలేం గుర్తుకు రావే?
అసలేం చెప్పాలని ... ఏం అనిపించుకోవాలని వచ్చాను?

కొలనున రాయి వేస్తే చెదిరే అలలలాంటి పరిచయాలు, రెప్పపాటులో మది మరుగున మాటుమణిగే ఎఱుకలు - ఆ చిన్నపాటి అలజడి, కొన్ని కబుర్ల అలికిడి - నవ్వు పూసుకుని నాలుగు కబుర్లాడి వెనుదిరిగిన మరు నిముషంలో చెరిగిపోయే రూప-ముద్రలు, గడిచిపోయే భావ-ముద్రలు - అంతంత మాత్రపు సాంగత్యాలు అవసరమా?

అదిగో - అలా అనుకునే - ఉంటే కన్వెన్షన్ సెంటర్ - నూటముప్ఫైరెండవ గదిలో - లేకపోతే వచ్చిన సాహితీమూర్తులైన అతిథులకి కబురో - కాలక్షేపమో అందిస్తూ వారి వెంట నడవడమో తప్ప - తానాలో నా ఉనికిని ఎవరికీ తెలిపిందీ లేదు - ఇంకెవరి తానకి ఉరికిందీ లేదు.

అందులోనూ - అక్కడకు వచ్చిన వారు ఎవరి ప్రతిభాకాశానికి వారు తారలైనటువంటి వారు. మింటనున్న తారలను చూసి మురిసే నేను - ఈ భువి-తారలని చూసీ - చూశానని మురిశాను - అంతే!

తానా అయిపోయింది - నాకు తోచిన నాలుగు కబుర్లు రాయడం అయింది - ఇంకొన్ని రాయాలని పక్కన పెట్టడమూ అయింది. పక్కన పెట్టిన కబుర్లని జ్ఞాపకపు మాటు నుండి బయటికి తెచ్చి జ్ఞాపికగా రాసుకోవడానికి తగిన తీరిక దొరికే సెలవు రోజుల కోసం ఎదురు చూడడమూ - ఇంకా వుంది.

ఇలా తానా-తో నా జ్ఞాపకాలని నెమరు వేసుకున్న సందర్భాలెన్నో - ఈ ఆరు నెలల్లో.

నా తానా-తలుపుల ముచ్చటకి ఆసరాగా, ఆ సంబరానికి కొనసాగింపా అన్నట్లుగా రెండు వారాల క్రితం నా ఈ-మెయిల్లో ఒక ఆహ్వాన పత్రిక...






ఈ ఆహ్వానం చూడగానే - మళ్ళీ ఆలోచన.

పుస్తకాల మీద, తెలుగు అక్షరం మీద మక్కువతో - మంచి సాహిత్యాన్ని సృజించిన కవులని, రచయితలని ఒక్క చోట కలవగలిగే అపురూప వేదిక అని ఆశపడి - ఎదురొచ్చి మరీ పసుపులేటి రవిగారు అందించిన అవకాశాన్ని చాలా సంబరంగా అందుకున్నాను తానా-సాహిత్య సమితిలో ఒక చిన్న వలంటీరుగా.  ఒక్క రెండు రోజులు తానాలో పాలు పంచుకోగలగడమే పెద్ద achievement నాకు.

అందులోనూ ఆ రెండు రోజుల్లో కానీ, అంతకు ముందు కానీ చౌదరిగారి దంపతులని కలిసింది లేదు - వారికి నేను నామమాత్రంగా కూడా తెలిసే అవకాశమే లేదు. అందులోనూ వారిది మా వూరు కాదు - కారు-దారిలో వెళ్తే ఐదుగంటలు, కారు-మేఘపు దారిలో అయితే ఒక గంట లెక్కెట్టే దూరంలో ఉన్న షికాగో నగరం.  నాకందింది - షికాగో నుంచి వచ్చి మా ఊళ్ళో ఇవ్వబోతున్న విందుకి ఆహ్వానం.

నాకు అందిన ఈ ఆహ్వానాన్ని ఎలా తీసుకోవాలో నిజంగా తెలీలేదు నాకు. ముందు వెళ్ళొద్దనే అనుకున్నాను. మళ్ళీ బదరితో చెప్పినప్పుడు తను "వెళ్తే బావుంటుంది - మన తెలుగు వారినీ, తెలిసిన వారినీ కలిసినట్టు ఉంటుంది" - అంటే సరే! వెళ్దామంటే వెళ్దామని అనేసుకున్నాం.

ఎలాగూ వెళ్దామనుకున్నాం కదా - కొంచెం ముందుగా పరిచయం చేసుకుందాం అని - నా తానా బ్లాగ్ పోస్టుల లింకులు జంపాల చౌదరి గారికి పంపించాను. అంతకు ముందు ఒకసారి తెలుగునాడి గురించి రాసినప్పుడు పంపిన ఈ-మెయిల్‌ని గుర్తు చేస్తూ.

[తెలుగునాడి గురించి నేనెప్పుడో రాసిన కొన్ని కబుర్లు ఈ లింకులో చదవచ్చు: (ప్రవాసాంధ్ర భాషా జీవ నాడి - తెలుగు నాడి)]

తీరా వెళ్ళే సమయానికి బుజ్జిజింక రానన్నాడు - "నిజమే కదా పాపం వాడికి అక్కడ bore కొడుతుంది" అని వాడికి తోడుగా ఉండడానికి, వాడితో ఆడుకోవడానికి - తనింట్లో ఉంటానని చెప్పి - నన్ను మహాత్మాగాంధి సెంటర్ దగ్గర దింపి ఇంటికి వెళ్ళారు బదరి.

పన్నెండింటికి రమ్మని ఆహ్వానంలో ఉంటే - మరీ పన్నెండింటికే వెళ్తే - నేనొక్కదాన్నే అవుతానేమోనని - పన్నెండు దాటింతర్వాత పది నిముషాలకి - కొంచెం మొహమాట పడుతూనే వెళ్ళాను.

నన్నేమని చెప్పుకోవాలా అనుకుంటూ - ఆలోచిస్తూ గుమ్మం దగ్గరే ఆగాను.

అప్పటికే జంపాల చౌదరిగారు, వారి శ్రీమతి అరుణగారు - వచ్చిన వారిని పలకరిస్తూ, కుశలమడుగుతూ వున్నారు.

నేను కొంచెం పక్కగా నించుని వారిని పలకరించడానికి నా వంతు కోసం ఎదురుచూస్తున్నాను.

ఇంతలో చౌదరిగారు నా వైపు చూసి - అరుణగారిని పిలిచి నావైపుగా కదిలారు - "నమస్తే! నేను లలితనండి. సాహిత్య కమిటీలో వలంటీర్ని"- అనగానే - అరుణగారు - నా చేయి పట్టుకుని - "మనందరమూ వలంటీర్లమేనండి. రండి. ఇప్పటివరకు మిమ్మల్ని కలవలేకపోయాను" అని నొచ్చుకున్నారు.

పక్కనే వున్న appetizer తీసుకోమని చెప్పి - ఇంతలో వచ్సిన వారిని పలకరించడానికి ఆ దంపతులిద్దరూ జంటగా వెళ్ళారు.

నేను లోపలి వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చుని తెలిసినవాళ్ళు ఎవరైనా వచ్చారా అని చుట్టూ చూస్తూ వున్నాను.

ఇంతలో అరుణగారు ఒక ప్లేట్లో appetizer పెట్టి తీసుకుని నా దగ్గరికి వచ్చారు - "మీరిది తీసుకోకుండానే వచ్చారు - ఇప్పుడు తీసుకోండి" - అంటూ - అదేదో - నేను వారింటికి వచ్చిన ప్రత్యేక అతిథిలా.

నాకు నిజంగా ఆశ్చర్యంగా, సంభ్రమంగా అనిపించింది - ఆ క్షణం వరకు నేనెవరో కూడా ఆవిడకి తెలీదు. కానీ ఎంత ఆత్మీయంగా మాట్లాడారో మాటల్లో చెప్పలేను.

తానా సమావేశాలు జరిగిన ప్రతీ చోటా - అక్కడి వలంటీర్లందరితో కలిసి ఒక కుటుంబంలా పని చేసేవారో చెప్తూ సెయింట్‌లూయిస్‌లో - రకరకాల కారణాల వలన - అలా జరిగే అవకాశం లేకపోయినందుకు చాలా నొచ్చుకున్నరావిడ.

నేను కూడా ముందు రావాలనుకోకపోయినా - ఇప్పుడు వచ్చినందుకు, వారి దంపతులని స్వయంగా కలవగలిగినందుకు ఎంత ఆనందంగా వుందో చెప్తే చాలా సంతోషించారావిడ.

ఒక మూడున్నర గంటలసేపు అక్కడ అందరితో మనసారా మాట్లాడి, కడుపారా భోంచేసి  - వచ్చేసేముందు జంపాల చౌదరిగారికి, అరుణగారికి కృతజ్ఞతలు చెప్పి - ఒక మంచి-ఆదివారపు-జ్ఞాపకాన్ని నాతో తెచ్చుకున్నాను.

రాగానే బదరికి చెప్పాను - "తానా అయిపోయింది. అసలు జరిగిందన్న విషయమే ఒక జ్ఞాపకంలా మిగిలింది. తానా సమావేశాలని ఇష్టపడి, కష్టానికోర్చి నిర్వహించారు. వాళ్ళేమీ మన ఊరివాళ్ళూ కాదు - రేపెక్కడో కలిసి అడుగుతామేమో అన్న మొహమాటపడాల్సిన అవసరం ఉన్నవాళ్ళూ కాదు. కానీ ఏదో ఒక ఆత్మీయబంధాన్ని నెరవేర్చలేకపోయామన్న తలపుతో - వెనక్కి వచ్చి అందరినీ ఇంకొక్కసారి కలిసి - పేరుపేరునా పలకరించి, స్నేహపు-పన్నీరు చిలకరించి వెళ్ళారు. మరువలేనింక వాళ్ళని - వారి సౌజన్యాన్ని" - అంటూ.


ఘనమైన ఉనికి ఎందరిదో
మదికి సోకే ఆ ఉనికి యెఱుక - ఆ ఎందరినో ఎఱిగిన అందరిదీ
ఆ ఎఱుకలో మన్నికైన ఎన్నిక కొందరిదే  
ఆ ఎన్నికలో అనుపమైన ఎంపిక మాత్రం - అంతులేని సౌజన్యం ఉన్న వారికి...
అరుణగారు, చౌదరిగారి లాంటి - నూటికో కోటికో ఒకరిద్దరికి... 
అందరాని ఆకాశంలో ఉన్న చంద్రునికైతే నూలుపోగు -
మరి అంతులేని సౌజన్యం వున్నవారికేమివ్వగలం?
సౌజన్యానికో పూలపోగు ...


19, నవంబర్ 2017, ఆదివారం

త్వామనురజామి - 19 - बोलనంత సేపు స్నేహమా - నేను बोలాక కోపమా?

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 18 - పాడకున్న ఏమిలే - చదివేద్దాం రాతలే! 


పట్టాల వెంబడి చీకటి దారిని కొలుస్తూ వెళ్తున్న రైలు -
చుట్టం నేను - మామనని - నీ వెంటే నేనని - వెంట వస్తున్న ౘందమామ -
పట్టపగటిని మరపించేలా కాకపోయినా - చిమ్మచీకటి లేకుండా - కాసింత వెలుతురు కురిపిస్తూ కాస్తున్న వెన్నెల -

కట్టెదుట కాయితమ్మీద కలం కదులుతూ - "Now I have a surprise for you " అని రాసి - మళ్ళీ కాసేపు ఆగి - వేళ్ళ మధ్య పెన్ను కదుపుతూ - కాయితమ్మీద ఏదో రాయబోతూ... ఆగుతూ -
పట్టరాని ఉత్సుకతనూ - ఉద్వేగాన్ని కలిగిస్తుంటే  -

చుట్టుముట్టి వున్న నిశ్శబ్దానికి తోడు  - నిలవనీయని కలవరమో - సద్దు లేని కోలాహలమో - హద్దు దాటనీని కలకలమో ...
పట్టనట్లో, పట్టించుకోనట్లో ఉండాలన్నా ఉండనీయక -
టిక్... టిక్... టిక్... టిక్...

అదేంటో - మామూలుగా ఎప్పుడూ పట్టించుకోకపోయినా - ఇప్పుడు మాత్రం - నా  చేతికున్న వాచ్‌లోంచి నా గుండె చప్పుడేమో అన్నట్టుగా వినిపిస్తున్న సెకండ్ల ముల్లు చప్పుడు -

రాయబోయి ఆగుతున్న పెన్నుని చూసి - పెరుగుతున్న adrenaline rush -

దాంతో ఇంకుండలేక - హడావిడిగా పేపర్ లాగేసుకుని - "Tell me what it is - I really don't like suspense even in books - that's why I read the ending first. I wish you could speak. I wish you could say something"

- అంటూ గబగబా - మనసులోని ఉద్వేగం రాస్తున్న చేతులని వణికిస్తుంటే - వంకరటింకర రాతల్లో రాస్తూ నేను -

టిక్... టిక్... టిక్... టిక్...

వాచ్‌లో పెద్దముల్లు, చిన్నముల్లు పన్నెండు మీదికి చేరుతూ వున్నాయి....

కళ్ళజోడు ముక్కు మీద జారుతుంటే ఎడం చేతి చూపుడువేలు-మధ్య వేలు జతకట్టి దాన్ని పైకి నెట్టుకుంటూ ...
రాస్తున్న పెన్నునాపి - నెమ్మదిగా తలెత్తి... పెదవులమీంచి కళ్ళలోకి పాకుతున్న నవ్వుతో - ఆ నవ్వు పూస్తున్న మెరుపుతో మెరుస్తున్న కళ్ళతో - నాకేసి చూస్తూ - ఇంతలో తల వంచి - తన చేతికున్న వాచ్ చూసుకుని ...

సరిగ్గా -  పన్నెండింటికి - మృదుమేఘధ్వని - నిశ్శబ్దంలోంచి నా చెవులకి మాత్రమే వినిపించేలా - "What shall I say?" - అంటూ.

అప్పటిదాకా చుట్టమే అనిపించిన  ౘందమామ, చుట్టూ కాస్తూ వెలుతురనిపించిన వెన్నెల - ఉన్నట్టుండి ఒక్కసారిగా హారర్ సినిమాలో సీనులా అనిపించేసి  - అసలే అర్థరాత్రి పన్నెడుగంటల టైం - ఒక్క రెండు క్షణాల్లో - నాకెన్ని పాటలు గుర్తొచ్చాయంటే ...

వేటగాడు సినిమాలోంచి "ఇది పువ్వులు పూయని తోట" అని పాడేస్తున్న శ్రీదేవి వాళ్ళమ్మ -
నవమోహిని సినిమాలోంచి "ఎవరో ఎవరో నను చేరేవారెవరో" అంటూ ఉయ్యాలూగేస్తున్న రోహిణి -
అంతస్తులు సినిమాలో "నిను వీడని నీడను నేను...ఓ ఓ ఓ " అని రాగాల్తీసేస్తున్న పీసుశీల -
బీస్సాల్బాద్ సినిమాలో "కహి దీప్ జలే కహి దిల్ " అంటూ గజ్జెలు కట్టుకుని పరిగెడుతున్న వహీదా రెహ్మాన్ -

అప్పటిదాకా మాట్లాడగలిగితే బావుండును అనుకున్న మూగబ్బాయి ఒక్కటంటే ఒక్క ప్రశ్న వేయగానే - హడలిపోయి - literally ఏడ్చేశాను - ముందు ఒక్క క్షణం భయంతో - అదేదో సినిమాల్లో అర్థరాత్రి పన్నెండింటికి గడియారం గంటలు కొట్టగానే - మొదలయ్యే దెయ్యాల మాయలాంటిదేమో ఈ మూగబ్బాయిని మాట్లాడించింది  అనేసుకుని - తర్వాత ఉక్రోషంతో - అంత అమాయకంగా నమ్మేశానని.

వెంటనే పళ్ళు బిగపెట్టి కోపాన్నాపుకుంటూ - కళ్ళు తుడుచుకుంటూ - చాలా నెమ్మదిగా, మెల్లిగా - తనకి మాత్రమే వినబడేలా చెప్పాను - "పొద్దున్న గుంటూర్లో ట్రెయిన్ దిగేదాకా మాట్లాడడానికి వీల్లేదు. నన్నింక మా ఫ్రెండ్స్ తెగ tease చేస్తారు. ముఖ్యంగా నిరుపమ తిడుతుంది - తను చెప్తూనే వుంది - నేనే పిచ్చిదానిలా వినలేదు" - అంటూ.

తను అదే నవ్వుతో - ఏమీ మాట్లాడకుండా తలూపి - మేమప్పటివరకూ మాటల్రాసుకున్నకాయితమ్మీద Good Night, బుజ్జాయ్! అని రాసేసి తన బెర్త్ మీద కెక్కేసి పడుకున్నాడు.

నేనూ - "ఛ! నేనెందుకలా ఏడ్చాను - మరీ చిన్నపిల్లలా?!"- అని నన్ను నేనే తిట్టుకుంటూ - "పొద్దున్న లేవగానే ట్రెయిన్ దిగి అందరం ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోయేదాకా ఆ అబ్బాయి మాట్లాడకుండా ఉంటే బావుండును" - అని అనుకుంటూనే - "అమ్మో - నాకు చెప్పిన మాట మర్చిపోయి మాట్లాడేస్తే ఎలా?" అని బెంగ పెట్టేసుకుంటూ - రామ స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం - శయనేయ పఠేన్నిత్యం దుస్స్వప్నం తస్య నశ్యతి - అని చిన్నప్పుడు పడుకునే ముందు నాన్నమ్మ చెప్పించే శ్లోకం చదివేసుకుని - హారర్-ౘందమామ కళ్ళలో పడకుండా- కిటికీకి ఇవతలికి తిరిగి పడుకుండిపోయాను.

తెల్లవారినట్టుంది.

హఠాత్తుగా - మెలకువ వచ్చింది.

చుట్టూ సందడి.

పడుకుని వున్న నా పక్కనుంచి ఒకళ్ళొకళ్ళుగా సన్నగా మాట్లాడుకుంటూ ట్రెయిన్ దిగుతున్నారు.

నేనూ గబగబా లేచి - "అమ్మో - గుంటూరొచ్చేసినట్టుంది - గబగబా దిగాలి - అనుకుంటూ - నేను కప్పుకున్న దుప్పటి మడతేస్తుంటే - కిటికీ కవతల మా కాలేజ్ అమ్మాయిలు దిగి నించుని కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు.

తీరా చూస్తే అది తెనాలి స్టేషన్. ఎందుకో ఆ రోజు ఎప్పటికన్నా ఎక్కువసేపు ఆగింది ట్రెయిన్ అక్కడ.

ఇంతలో - ఆ న-మూగబ్బాయి ఎప్పుడులేచాడో - వెళ్ళి బ్రష్ చేసుకుని వస్తూ కనిపించాడు.

నన్ను చూస్తూనే - మళ్ళీ ఒక నవ్వు వరంగా ఇచ్చేసి - ప్లాట్‌ఫాం మీదకి వెళ్దామా - అన్నట్టు - తలని కుడిపక్కగా వంచి సైగ చేశాడు.

ఈ పూటకి అతనెక్కడ ఉంటే నేనూ అక్కడే ఉంటేనే మంచిది - మాట్లాడకుండా కాపు కాయొచ్చు అనుకుని - నేనూ తలూపి తనతో పాటు ట్రెయిన్ దిగాను.

మా కాలేజ్ అమ్మాయిలు కొంత మందికి అప్పటికే అపార్థమైపోయింది - మా మధ్య పరిచయం మూగమనుషుల మూకాభినయం స్థాయి దాటి మూగమనసుల మూగానుబంధం దాకా వెళ్ళిందనేసుకున్నారు.

నాకు మాత్రం ఈ పూట గడిస్తే చాలు - వాళ్ళేమైనా అనుకోనీ - అని ఆట్టే పట్టించుకోకుండా - నిశ్శబ్దంగా ఆ అబ్బాయి పక్కన నడుస్తూ ప్లాట్‌ఫాం మీద ఆ చివరి నుంచి ఈ చివరికి ఊరికే తిరుతున్నాను. (ఆ అబ్బాయి పేరు అప్పటికి మా పేప-రిచయాల వల్ల తెలిసినా - మాట్లాడే అవకాశం లేదు కాబట్టి పిలవలేదు ఆ రోజుకి - అందుకని ఆలోచనల్లో కూడా అనుకోకుండా "అబ్బాయి" గానే తలుచుకున్నాను - ఆ రోజుకి).

ఇంతలో-ముందు రాత్రి మా కబుర్లు చదివిన గిరిరాజ్ కూడా వచ్చి చేరాడు మాతో.

మేము సైలెంట్‌గా నడుస్తున్నాము - నడుస్తూనే వున్నాము.

గిరిరాజ్ మా ఇద్దరి మొహాలు చూస్తూ తనూ సైలెంట్‌గానే నడుస్తూ - మధ్యమధ్యలో నన్నేదో అడగబోయినా - నాకసలే ఉక్రోషంగా ఉందేమో - నేనంత ఫ్రెండ్లీగా మాట్లాడలేదు.

ఒక రెండు రౌండ్లు నడవగానే - ఈలోగా ట్రెయిన్ - నేనింక బయలుదేరుతున్నాను ఎక్కండింక - అంటూ కూసింది.

"హమ్మయ్య - ఇంకెంత ఒగ్గంటలో గుంటూర్లో దిగేస్తాం - ఈ మౌనవ్రతం బాధ తప్పుతుంది" అనేసుకుని ఇంకాట్టే శబ్దం చేయకుండా నా సైడ్-బెర్త్‌లో కూర్చుని కిటికీలోంచి బయటికి చూస్తూ - చూపు నా ముందున్న అబ్బాయిమీదకి అస్సలు పోనీయకుండా - ఎన్ని చెట్లు, కరెంటుస్తంభాలు లెక్కపెట్టానో లెక్కే లేదు.

ఈ లోగా రానే వచ్చింది - గుంటూరు స్టేషన్.

అంతదూరం నుంచే - కిటికీలోంచి - ప్లాట్‌ఫాం మీద నించుని - ఆగుతూ ఉన్న ట్రెయిన్‌లో ముందుకు వెళ్తున్న బోగీలని చూస్తూ - నా కంపార్ట్‌మెంట్ ఏదో అని తొంగి చూస్తున్న - నాన్న, పప్పి, కుట్టి, ప్రశాంతి కనిపించారు.

వాళ్ళని చూస్తూనే సంబరంగా చెయ్యూపేసి - శృంఖల-విముక్త-సూట్కేసుని పట్టుకుని - నేను దాన్ని మోస్తున్నానో, నన్ను అది లాక్కెళ్తోందో - పెద్ద పట్టించుకోకుండా నా బోగీ తలుపు దగ్గరికి వెళ్ళి నించున్నాను.

ట్రెయిన్ ఆగింది. నాన్న నా సూట్కేసుని, కుట్టి నా బాగ్గుని అందుకున్నారు.

పప్పి, కుట్టీలతో - కబుర్లు మొదలెట్టేసి - "ప్రశాంతి, దొడ్డ ఎప్పుడొచ్చారు? శ్రీనొచ్చాడా? బాబొస్తున్నాడా? పాపాయత్తయ్య వస్తాన్నారు - వచ్చారా?" - ఇలా అడిగేస్తూ ఉంటే - నాన్న - "ముందింటికి పద - తర్వాత సావకాశంగా మాట్లాడుకోవచ్చు" - అంటూ ముందుకి నడిచారు - మమ్మల్ని నడిపించారు.

నాన్న వెనకాల నడుస్తుంటే - కుట్టి నా పక్కకి వచ్చి - చెవి దగ్గర నెమ్మదిగా - "ఆ అబ్బాయేవరే బాబూ - నీకేసి అలా చూసేస్తున్నాడు?" అంటూ చూపించింది.

నేనటు చూసీ చూడనట్టు చూసి - "ఏమో నాకేం తెల్సు? పద" అనేసి మనసులో మాత్రం ... "నాకు bye చెప్పాలని అనుకున్నాడేమో - అందుకే అలా చూశాడేమో" అనుకుంటూ...

చెప్పాలనుకున్నావని  తెలిసి
చెప్తే కుదరదని తెలిసి
సతమతమైనామందుకే
కలిసి..  కలిసి కలిసి...

- అని పాడుకుంటూ ...కుంటూ ... కుంటూ - నేనింటికి.... వెళ్తుంటే...

ఆ టైటిల్ చరణం లైను ఏ పాటలోదో, ఈ కొసరు పాటేమిటో ననుకుంటూ - కనిపెట్టి పట్టి నాకు చెప్పి పాడుకుంటూ ...కుంటూ... కుంటూ - నా బ్లాగింట మీరుంటూ... ఉంటే ...

<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

10, నవంబర్ 2017, శుక్రవారం

Praveen Sattaru's Vision - PSV గరుడవేగ

కిందటి శుక్రవారం - అనుకోకుండా - అప్పటికప్పుడు అనేసుకుని - శనివారం నాడు వెళ్ళి - ఇంకో సినిమా చూసేశాం.

నెలలో మొదటి శుక్రవారం - బదరి స్నేహితులతో కులాసాగా గడుపు వారం.

బుజ్జిజింకా, నేనూ - Lego కబుర్లు చెప్పుకుంటూ మా సాయంకాలాన్ని కాలక్షేపం చేశాం.

ఇంటికి వస్తూనే బదరి చెప్పారు - "రాజశేఖర్ కొత్త సినిమా గరుడవేగ బావుందట - రేపు వెళ్దాం" - అని.

అమ్మో -  ఇంకో తెలుగు సినిమా అంటే బుజ్జిజింకని ఎన్ని కబుర్లు చెప్పి ఏమార్చాలో అనుకుంటూ - "అబ్బా అదేదో స్పై-థ్రిల్లర్ అని చదివాను - నాకలాంటివి నచ్చవు - ఓ ఆటా, పాటా, నవ్వులూ, రంగురంగుల పువ్వుల డ్రెస్సులూ  ఏమీ ఉండవు - ఈసారికి వద్దు" అంటూ నేనంటే -

"పాపం! కొత్తగా ట్రై చేశారట. చాలా బావుందట - ఈ మధ్య రాజశేఖర్‌కి అసలేం హిట్లు లేవట" అంటూ బదరి -

మొత్తానికి మా ఇంకో సినీ-ఓదార్పు-యాత్రకి అంకురారోపణ జరిగింది.

శనివారం మధ్యాహ్నం భోజనాలయేదాకా సినిమా మాటే ఎత్తలేదు నేను.

నా శనివారపు siesta అయి వచ్చేటప్పటికి - Destiny 2 ఆడుకుంటూ తనయుడు,  పక్కనే కూర్చుని వాడి ఆట చూస్తూ తండ్రి - కనిపించారు.

అప్పటికే సినిమాకి వెళ్దామా అని నాన్నగారు అడుగుటలూ, బుజ్జిజింక ఒడబడుటలూ - అన్నీ పూర్తయినట్టున్నాయి. 

నాకా సంగతి తెలీదు కదా - కొంచెం నెమ్మదిగానే - "ఇంతకీ ఇవాళ సాయంత్రం వెళ్తున్నామా సినిమాకి?" - అన్నానో లేదో - బుజ్జిజింక వాడి ఆట నుంచి తల తిప్పకుండానే - "వెళ్తున్నాం" - అంటూనే - "అమ్మా! నీకు ఎప్పట్నుంచీ కొరియన్ వార్ సినిమాలంటే ఇష్టం మొదలైంది?" - అనడిగాడు.

ఇంకా ఇలా కూడా అన్నాడు - "This movie's name sounds like the courier service that brings Ammamma's ఆవకాయ." -  అలా అంటూ - TORI లో వచ్చే గరుడవేగ కమర్షియల్ మొత్తం చెప్పాడు.

అప్పుడర్థమయింది - అంత తొందరగా వాడెలా ఒప్పుకున్నాడో - వాడు అదేదో - వారు , స్పైయ్యింగు - అని ఒప్పేసుకున్నాడు.

మొదటిసారిగా - effortlessగా -  చా...లా శాంతియుతంగా మా సినిమా-యాత్ర మొదలు.

సాయంత్రం చుక్క పొడిచీ పొడవకుండానే - ఆమ్ వండేసుకుని - నీకో ముద్ద, నాకో ముద్ద అనుకుంటూ తినేసి - ఆపిన స్టవ్వే ఆపానా లేదా అని చూసుకుని -  వేసిన తాళమే వేశామా లేదా అని తీసి వేసుకుని - తెల్లదీ, పెట్రోల్  తాగుటలో ఇంద్రుని వాహనానికి దీటైనదీ - అయిన మా కారైరావతాన్నెక్కి హుషారుగా సినీ-షికారు బయల్దేరాం - ఎనిమిదిన్నరకే.

తొలాట కాని మలాట తొమ్మిదింటికే మరి - తొక్కిసలాట ఉండదు కానీ పేర్లు పడే దగ్గర్నుంచీ సైన్మా చూస్తే ఆ మజాయే వేరు కదా మరి!

తీరా వెళ్ళేటప్పటికి - టికెట్ క్యూలో మా ముందున్న జంటకి ఆ కౌంటర్‌లో వున్న అబ్బాయి ముందున్న కుర్చీల-అమరిక-తెర మీద ఏదో చూపిస్తూ ఉంటే వాళ్ళు తల అడ్డంగా ఊపి బయటికి వచ్చేయడం కనిపించింది.

వాళ్ళ వెనకాలే వున్న బదరి - వాళ్ళు క్యూలోంచి ఇవతలికి రాగానే - తను ముందుకు వెళ్ళి ఆ టిక్కెటబ్బాయికి - నేనూ, మా బుజ్జాయి, మా బుజ్జిజింక వచ్చాము - అని ఎప్పుడో పెళ్లిరోజున గుమ్మం దగ్గర పేర్లు చెప్పినట్టు చెప్పగానే - టికెటబ్బాయి అడ్డంగా తలూపేశాడు - మా హాలులో సీట్లున్నవి ఇద్దరికే - అవి కూడా తొట్టతొలి వరసలో - అంటూ.

ఇంకేం చేస్తాం - ఇంటికెళ్ళిపోదాం అంటే - పాపం బదరి  - నేను నిజంగా డిజప్పాయింట్  అయిన దానికన్నా -  నేను  డిజప్పాయింట్ అయాననుకుని తను ఎక్కువ డిజప్పాయింట్ అయ్యారు  - "అయ్యో! సినిమాకొచ్చి చూడకుండా వెళ్ళిపోతే ఎలా ?"- అంటూ.

అప్పటికప్పుడు - ఆన్‌లైన్‌లో వెతికి దగ్గర్లో వున్న ఇంకో థియేటర్‌లో ఉన్న ఆమిర్‌ఖాన్ - సీక్రెట్ సూపర్‌స్టార్‌కి వెళ్దామన్నారు కానీ - నేను వద్దనేటప్పటికి ఇంటికి వచ్చేద్దామని బయల్దేరామో లేదో - అప్పుడే లోపలి వస్తున్న హనుమత్‌ప్రసాద్ కనిపించి పలకరించారు. తనతో ఒక రెండు నిముషాలు మాట్లాడి కారెక్కి ఇంటి దారి పట్టాము - పోన్లే రాజశేఖర్ సినిమా సోల్డ్-ఔట్ అంటే తెలుగు సినిమాకి మంచి సూచనే అనుకుంటూ.

తిరుగు-సవారీలోఅంతా నిశ్శబ్దం.

సరిగ్గా ఒక  పదిహేను నిముషాల్లో ...ట్రింగ్..ట్రింగ్....ట్రింగ్....ట్..ర్...ర్...ర్రింగ్ అంటూ బదరి ఫోన్ మోగింది.

నేను తీసేలోగా కట్ అయింది - ఎవరి దగ్గర్నుంచా అని చూస్తే - హనుమత్‌ప్రసాద్.

ఎందుకు చేశారో అనుకుంటూనే బదరి వెంటనే కాల్ చేస్తే - అవతల్నుంచి చెప్పారతను - ఈ థియేటర్ సోల్డ్-ఔట్ అని పక్కనే ఇంకో థియేటర్‌లో తొమ్మిదింపావుకి ఇంకో షో వేస్తున్నారని - వీలైతే ఆన్‌లైన్‌లో వెంటనే టికెట్లు బుక్ చేసుకోమని చెప్పారు.

నిజం చెప్పాలంటే - రాజశేఖర్ సినిమా సోల్డ్-ఔట్ అయి - వెంటనే ఇంకో థియేటర్ అదనంగా అప్పటికప్పుడు ఏర్పాటు చేయడం - నాకు తెలిసి మా ఊళ్ళో రికార్డే. మాకు భలే సంతోషంగా అనిపించింది రాజశేఖర్‌కి మంచిరోజులొచ్చాయని.

వెంటనే మా సవారీ-తెన్ను మారి  మళ్ళీ సినిమా-దరికి దారి మళ్ళింది.

తొమ్మిదిగంటల ఇరవై నిముషాలకి సినిమా-హాల్ప్రవేశం చేశాం - మూడు కుడికాళ్ళు లోపల పెట్టి.

అప్పటికే - ఓ అబ్బాయి ముందు పరిగెడుతూ వెళ్తూ ఉంటే అతని వెనకాల ఇద్దరు మోటార్ సైకిళ్ళమీద వెళ్ళినా అందుకోలేక అవస్థలు పడుతూ వున్న అతి-పరిచయమున్న తెలుగు-సినిమా-సూత్రంతో జరుగుతున్న మా-సినిమా-వీక్షణ మొదలు.

సినిమా చాలా బావుంది.

తెలుగు సినిమాకి కొత్త కథ.

చాలా సెన్సిబుల్‌గా వున్న దర్శకత్వం.

అద్భుతంగా వినిపించిన నేపథ్యసంగీతం.

ఉన్న రెండు పాటల్లో - ఏ పాటకా పాటకి సరిగ్గా కుదిరిన సంగీతం. 

దర్శకుడే కథా-నాయకుడై - అంతటా తానే అయి - మిగిలిన వాళ్ళందరూ కథకి అవసరమైన పాత్రల్లా - చాలా సహజంగా - గ్రిప్పింగ్‌గా కథ, కథనం ప్రధానాంశాలుగా  నడిపిన తీరు గొప్పగా వుంది.

సినిమా కథలో భాగంగా - ఒక చోట అమ్మాయిలు పాట పాడుతూ ఆడుతున్నప్పుడు - హుషారుగా వాళ్ళ చుట్టూ బోల్డుమంది ఆ పాటకి గొంతు కలుపుతూ - ఆ ఆటకి తాళం వేస్తుంటే - వాళ్ళ మధ్యకి రాజశేఖర్ పరిగెత్తుకొచ్చి తనూ స్టెప్పులేయకపోవడం - రొటీన్నుంచి ఓ పెద్ద రిలీఫ్. 

అన్నిటికన్నా ముఖ్యంగా - కొరియన్ వార్ లేకపోయినా - సినిమా మొత్తంలో ఒక్కసారంటే ఒక్కసారి వినిపించే నార్త్ కొరియా మాటని పట్టుకుని పొరపాటున వార్ సినిమా అన్చెప్పిన నాన్నగారిమీద అలక్కుండా -  బుజ్జిజింక సినిమాని తెగ ఎంజాయ్ చేస్తూ చూడడం - ఇంకా బాగా అనిపించింది.

సినిమా అయిపోయి ఇంటికి వస్తుంటే వాడి దృష్టికోణపు సమీక్ష ఏంటంటే: సినిమా చాలా బావుంది.

ముఖ్యంగా వాడికి నచ్చినదేంటంటే - చాలా ఇంటెన్స్‌గా, ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన - Political rally లో బాంబ్ diffuse చేసిన సీను - ఎందుకంటే ఎవరికీ దెబ్బ తగల్లేదు కాబట్టి.

మొత్తానికి చాలా రోజులతర్వాత మా ఇంటిల్లిపాదికీ నచ్సిన సినిమా - PSV గరుడవేగ.

ఇంత నచ్చినా - నాకున్న some-సందేహాలు, some-సంశయాలు, some-సంగ్రహాలు:

1) What does PSV stand for ? Praveen Sattaru's Vision ? సరైన జవాబు ఏంటో మరి!

2)  What is the meaning of 126.18M ?


3) What is NIA? దీనికోసం గూగుల్ చేస్తే మొట్టమొదటగా కనిపించింది National Institute on Aging. అబ్బే - ఇది అయ్యుండదేమో - అనుకుని NIA Inida అని వెతికితే - 2008 లో ఆవిర్భవించిన National Investigation Agency గురించి తెలిసింది. ఈ గరుడవేగ సినిమా పుణ్యమాని నాకు లోకజ్ఞానం పెరిగింది.

4) రాజశేఖర్‌ని చాలా ఏళ్ళ తర్వాత - అంటే అల్లరిప్రియుడు తర్వాత - హీరోగా చూశాం. సంతోషం. కానీ - పాపం! అతన్ని మోసేయడం కాకపొతే అంకుశం-ఆహుతి రోజుల angry-young-man ఎక్కడా? భార్య చాటు ఈ gingerly-old-dude ఎక్కడా? దీంతర్వాత అతనికి వచ్చే అవకాశాలు ఏంటబ్బా? అనిపించింది. బాండ్ సిరీస్ లాగా వేగా-సిరీస్ తీయబోరు కదా? ఈ సినిమా వల్ల సత్తారు సత్తా సినీ-ప్రపంచానికి తెలుస్తుందేమో కానీ రాజశేఖర్‌కి ఏంటి లాభమో అర్థం కాలేదు. నిజంగా చెప్పాలంటే - బదరి, నేనూ అనుకున్న మాట - హీరో ప్లేసులో ఎవరైనా సరిపోయేవారు - ఇప్పటి సెమి-వృద్ధ హీరోల్లో ఎవరో ఒకరు. అందరికన్నా కొంచెం ఎక్కువగా రవితేజా సరిపోయేవాడు.

4)  ఇంక హీరోయిన్ రోల్ - చీర కట్టుకుని, బుక్కులు చదువుకుంటూ, మొక్కలు పెంచుకుంటూ - టీవీల్లో వాళ్ళ ఆయన గొప్పదనాన్ని చూపిస్తున్నా - అసలతనేం ఉద్యోగం చేస్తున్నాడో కూడా తెలియకుండా ఉండడం - అతనికి బయటున్న టెన్షన్స్‌కి తోడు డివోర్స్ అంటూ ఆ గొడవేంటి? అమాయకత్వమా? ఏమీ పట్టనితనమా?

5) సినిమా మొదట్లో - ఆలీ కౌన్సెలింగ్ సీన్  - హీరో ఒకటి చెప్తే ఆలీ ఇంకోటి ఎలా ఊహించుకున్నాడో - అంటే హీరో చెప్పిన నక్షత్రతాబేళ్ళ స్మగ్లింగుకి, ఆలీ ఊహించుకున్న అదేదో dam దగ్గర drug-racketకి ముడి ఎలా కుదిరిందో అర్థం కాలేదు - బహుశా అంతకు ముందెప్పుడైనా ఆలీ పేపర్లలో చదివాడేమో అని సరిపెట్టుకుని-సర్దిపెట్టుకుందామనుకున్నా - ఆలీ చూసింది మరి హీరో-ఆలి ఎందుకు చూసి ఉండదు? చూస్తే ఎందుకు అర్థం చేసుకోకుండా విడాకులు అడుగుతోంది? 

6)  చీర కట్టుకున్నవాళ్ళు అలా అయోమయంగా ఉంటే - ఇంక హీరో టీమ్లో - dotలూ, dashలూ చూసి అది మోర్స్‌కోడ్ అని చెప్పడానికి - ఒక బోయ్-కట్ చేయించుకుని పాంటూ-టీచొక్కా వేసుకున్న అమ్మాయి.

నాకది చూడగానే వెం...ఠనే గుర్తుకొచ్చింది - ఎవరంటే - Cryptography లో PhDని అలవోకగా ఉప్పాడచీర కొంగున ముడేసుకున్న మా నిరుపమ.

Encrypted dataని crack చేసే smart అమ్మాయిలు లేటెస్ట్ మోడల్ smart phone లెక్కుండక్కర్లేదు భయ్! - అతి మామూలుగా కనిపిస్తూ - మన మధ్యలో తిరిగే ముద్దమందారాల్లా కూడా ఉండొచ్చు.

సినిమా వాళ్ళ ఫార్ములాల లెక్కలు మారితే బావుండును.

7)  ఈ స్పై-సినిమాలో అసలితను కనిపించడం అవసరమా అనిపించినా - తన నటనతో తనెక్కడైనా అనవసరం అనిపించడని - గుర్తుంచుకోవాల్సిన అవసరం నాక్కల్పించిన - అవసరాల శ్రీనివాస్ - ఉన్న కాసేపు - ఇతనిక్కడ అవసరమే - అనిపించాడు.

8) చివర్లో చీర కట్టుకున్న హీరోయిన్ని సముద్రంలో పడేసి - ఈదిస్తాడేమో అని భయపెట్టినా - ఆ పని చేయని దర్శకుడికి జేజేలు.

9) అలాగే ఈ తెలుగు ప్రేక్షకులు నేనెలా తీసేసినా చూసేస్తారు అన్న ధీమాతో అవసరం లేకపోయినా చిన్నచిన్న పిల్లలతో పెద్దపెద్ద మాటలు చెప్పించకుండా - అలాగే - చివర - షిప్పుని పేల్చేసే సీనులో పిల్లలని కూడా పట్టుకొచ్చి అక్కర్లేని హడావిడి సృష్టించకుండా ఉన్నందుకు - పిల్లలూ, అమ్మల తరపున ఇంకొన్ని జేజేలు.

10) బకెట్లో పట్టుకెళ్లి - high pressure tube లోంచి illogical గా - విసిరిన బాంబుల తాకిడికి పేలిన - అంత మొదటిరకం యురేనియం వున్న ఓడ - తాను పేలిపోతూ పక్కనే హీరో, హీరోయిన్, సెమి-హీరో వున్న బార్జ్‌ని ఏమీ చేయకపోవడం - హీరోచితంగా ఉన్నా - కథోచితంగా అనిపించలేదు. కానీ - సర్దేసుకున్నాం - ఎంతైనా సర్వేజనా-సుజనోభవంతు - సర్వే సుజనా సుఖినోభవంతు-స్లోగన్ ప్రమోటర్లం కదా!

ఇదిగో... ఇందుకే! నేను తెలివైన దర్శకుల సినిమాలు చూడను - అక్కర్లేని అనుమానాలొస్తాయ్ - అడిగినందుకు ఆవేశాలొస్తాయ్ - అపార్థాలకి అవకాశాలొస్తాయ్ - అవి వివరించలేక ఆయాసాలొస్తాయ్.

ఇన్నొచ్చినా - ఇవన్నీ వస్తే వచ్చాయిలే - అని సినిమా చూడడం - అనుమానాలాడగడం - ఆవేశాల విలాసాలు చూడడం  - అపార్థాల పాలబడడం - ఆయాసాల ఆవల కులాసాల కబుర్లాడడం - నాకో సరదా!

ఇంత జరిగాక...
ఇంకా-ఇంకా...
రాజశేఖర్ హీరోగా మరిన్ని సినిమాలు రావాలి గాని -
మరీ అదే మూసలో మరో NIA-టైపు సినిమా రాకుండుగాక
మళ్ళీ-మళ్ళీ మా ఊళ్ళో సినిమాహాళ్ళు - మెండుగా, రెండుగా - నిండుగాక 
సత్తారుగారి సత్తా - వెరైటీ - అనిపించే సినిమాలు తీయుగాక

అని కోరుకుంటూ....

~ సినీ-మా-లక్ష్మి