28, అక్టోబర్ 2016, శుక్రవారం

మలిగి వెలిగిన దీపం

"వడ్లమాని సోమేశ్వర రావూ, ఆగవయ్యా! అడుగులో అడుగు వేసుకుంటూ ఎందాకా ఆ నడకా?!"

"ఎవరదీ?! నన్నెరిగిన వాడవా, ఎరగని వాడవా?"

"ఆది నుంచి వున్నవాడినీ, అనాది అయిన వాడినీ - నిన్నెరిగిన వాడనే!"

"నన్నెరిగిన వాడవా? అయితే అదేం పిలుపు - నన్ను నాని అంటారని తెలీదా?"

"తెలుసనుకో!  ఏదో తమ్ముడికి తండ్రి తర్వాత తండ్రిలా నిలిచినవాడివి, కొడుకులకి తండ్రివి , మనవల తాతవీ - అని అలా పిలిచాననుకో."

"నా గురించిఅన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నావే - ఇంతకీ ఎవరు  నువ్వు - చూపసలే ఎందుకో ఇవాళ సరిగా ఆనట్లేదు"

"నీ గురించి నాకు తెలియకపోవడమేం ? నీ తమ్ముడి కూతురుందే  - అదే సొట్ట పూసలా బోల్డన్ని కబుర్లు చెప్తుందీ- లల్లీ - ఆ పిల్లే ... అయినా నాకు తెలీకడుగుతాను -  పై మెట్టు ఎక్కి గడపలోకి వచ్చే వేళ "అప్పా! బావున్నారా" అని పలకరించి - పసుపూ- కుంకుమ ఒడి నింపుకెడుతూ కాళ్లకి దండం పెట్టి వీడి వెళ్లే వేళ "వెళ్లొస్తానప్పా" అని చెప్పి-  "మళ్లీ చూడడమెప్పుడూ" అని నువ్వడిగితే - "ఎప్పుడో ఇలాగే, అప్పా!" అని కళ్ళు తుడుచుకుంటూ గడప దాటేదే - ఆ పిల్ల - నీతో ఆ మూడు ముక్కలు తప్ప ఇంకో మాట మాటాడిందీ? ఇప్పుడు చూస్తే ఊరూ-వాడా ఏకం చేసేలాంటి కబుర్లు చెప్తూవుంటుంది"

"మరీ బాగుంది - అది మా ఇంటి ఆడపిల్ల - మాటాడని మల్లెమొగ్గ"

"మరిప్పుడా కబుర్లేంటంటావ్ ?"

"ఆడపిల్లకి తండ్రి పోలిక వస్తే అదృష్టం - మా బాబీ చెప్పడూ - అదీ చెప్తుంది మరి - నా దగ్గరంటావా - దానికి  మాటలవసరం లేదు - మనసుతో చెప్పేది - వాళ్ల నాన్నా అంతే "

"బానే వుంది నీ సమర్ధింపు - అయినా ఏ మాటకామాట చెప్పుకోవాలిలే - నీ గురించి బానే చెప్పింది కబుర్లు - ఇటీవల నీకు నలతగా ఉందని తెలిశాక "అయ్యో  - చిన్నప్పట్నుంచీ అప్ప గురించి మనసులో అనుకోవడమే కానీ ఎప్పుడూ ఎదుటపడి -   చెప్పలేకపోయాను" అని బెంగ పడి నీకోసమే మొదలెట్టిందట నేర్పించిరి (చదివించని) గురువులు అంటూ కబుర్ల వరస. అది అలాగే కొనసాగిస్తుందట. పైగా - గాంధీ-నెహ్రూల గురించి ఎవరైనా రాస్తారు - మన ఇళ్లల్లో వుండే ఎవరూ ఎరగని మన మనుష్యుల మంచితనం గురించి మనమే కదా రాసుకోవాలి అని - అంటుంది కూడా "

"అవునవును - నేనూ చదివాను - మనవరాలు లలిత ప్రింటౌట్ తెస్తే - బారాసింది - నా గురించి నాకే చెప్పింది. అవునూ మా ఇంటి పిల్ల గురించి ఇన్నిమాట్లాడుతున్నావు - ఎవరసలు నువ్వు? "

"అది చెప్తా కానీ - మళ్లీ మరుస్తానేమో ఈ మాట నీ చెవిన వెయ్యనీ - తనది పెద్దలిచ్చగించని పెళ్లి అయినా వాళ్ల నాన్నకి అండగా -నీ చేత్తో మంగళసూత్రం, వెండి చుట్లు, మధుపర్కాలు కొని - పెళ్లిపందిరికి నువ్వూ-నీకొడుకులూ నాలుగు స్తంభాల్లా నించుని  తన పెళ్లి జరిపించారని ఇప్పటికీ తలచి-తలచి మురుస్తూ ఉంటుంది - ఈ ఒక్క మాట నీకెప్పుడూ చెప్పలేదని ఇప్పుడనుకుంటోంది."

"సర్లే - మాఇంటి ఆడపిల్ల - మా దివాణపు హోదాకి తగ్గట్టు వెళ్లాలి - వెళ్లింది - మా ఇంటి విషయాలింక ఆపి - ఇంతకీ నువ్వెవరో చెప్పు"

"ఆశ్వీయుజ మాసం  - బహుళ ఏకాదశి - బుధవారం - సమయం - మధ్యాహ్నం 2:15 - అప్పుడు మొదలయింది నీ ప్రయాణం నాతో"

"నువ్వెవరంటే - తిథివారనక్షత్రాలు చెప్తావేంటి? నువ్వేమన్నా"సీతారామాభ్యాంనమః" అంటూ ఇంటికొచ్చే యాయవారపు బ్రాహ్మణుడివా? నీ గొంతు గుర్తు ఆనవాలు పట్టలేకపోతున్నానే?!"

"ఆ... ఆ... నేనాయన్ని కాదు - బహుదూరపు బాటసారిని - ఏదో నా బాటలో కలిశావు - మాట కలిపితే మార్గాయాసం లేకుండా దాటిపోతావని - అంతే! "

"బానే వుంది వరస - ఎవరో చెప్తావా - నన్నాట్టే విసిగించకుండా నీ దారిన నువ్వెళ్తావా?"

"బావుందయ్యా, నానీ! - నీ విసుగు - సరే విను - నేను నీకు బాగా తెలిసిన వాడినే - దేవుడంటారు నన్ను - అసలెప్పుడైనా తలిచావా నన్ను?"

"ఎందుకూ తలవడం - నా సంగతి నేను చూసుకోలేనూ? అండగా తమ్ముడు, నా పిల్లలు ఉండనే వున్నారు"

"తెలుసులేవయ్యా - ఒక తల్లి కడుపున పుట్టిన రామలక్ష్మణులు - నువ్వూ నీ తమ్ముడూ - మనసుతో మాట్లాడుకుంటారు - ఇవన్నీ చెప్పావులే. ఎంత వాళ్ళందరూ వున్నా నేను నేనే కదా?"

"రాముడితో పోల్చావూ - అసలు నీతో ఒక సంగతి తేల్చుకోవాలి  - నువ్వేమో రాముడిగా పధ్నాలుగేళ్లు, నీ వాళ్లు - ఆ పాండవులకేమో - పోనీలే - బావమరిది - బతుకగోరేవాడు  అన్చెప్పి - ఓ రెండేళ్లు తగ్గించి పన్నెండేళ్లు - మరి నేనేనా కాని వాడినని యాభై ఏళ్లకు పైగా వనవాసం చేయించావు - ఆ అనాతవరంలో ? "

"భలే వుందయ్యా నీ నింద ! వనవాసమన్నావు కానీ ఏ ఒక్క రోజన్నా ఇలా కాదు-ఇంకోలా కావాలని అడిగావా - కనీసం అనుకున్నావా ? ఉన్నచోటే కైలాసం అనుకున్నావు - పైగా "జమీలు పోయినా దార్లు" మిగిలాయనుకుని తృప్తి పడ్డ జమీందారు బిడ్డవి- నన్నిప్పుడిలా దబాయిస్తావూ?"

" సర్సర్లే - అవన్నీ ఎందుకు గానీ - ఇప్పుడీ ప్రయాణమేంటి నాతో?"

"ఇది నీ ప్రయాణమే - అవునూ ఆ గొంతులో  రాచపుండొచ్చి నొప్పొచ్చినా నన్ను తలవలేదేమయ్యా - అది రాకుండా ఆపలేదని నామీద  కోపం రాలేదూ?"

"సరిపోయింది. అదేం నొప్పో - పిల్లలు జ్వరం వచ్చిందన్నారు - మందు రాస్తే తగ్గిపోతుందన్నారు - దానికి నువ్వేంచేస్తావు? ఇంతకీ అది రాచపుండా? బావుందయ్యా - నేనున్నది రాచపొరుగు, వచ్చింది రాచపుండు - బాగా కుదిరింది వరస"

"ఇదిగో - ఇలా అనేసుకుని ప్రతీ దానికీ సరిపెట్టేసుకుంటే నీతో నాకు కలహమేముంది - వినోదమేముంది? అసలు నువ్వు ఊరివారితో  మాట్లాడగా నేనెప్పుడూ వినలేదు - నేనేదో సుప్రభాతాలు-పవళింపు సేవల హడావిడిలో వినలేదేమో అనుకుంటే - మీ ఊరి చిన్నవాడు - అదే రాంబాబు మాష్టారు గారి రమేష్  - అతనిదీ అదే మాట"

"అదెప్పుడు నీకు చెప్పాడు - నువ్వెక్కడ విన్నావు?"

"సర్వాంతర్యామిని - నాకు తెలీనివి ఉండవని నీకు తెల్సనుకుంటాను. నీకు ఈ ఫోన్లూ-వాట్సాప్పులూ అలవాటు లేవు కదూ - అలవాటు అనేకన్నా - అక్కర్లేదు కదూ - అదిగో - అక్కడ - మీ వూరబ్బాయి - సతీష్ నడిపే - అనాతవరం గ్రూపులో రమేషేమన్నాడో - విను చదువుతాను

Very rare combination -highly educated, reserved, great humanity and values in one person in our village Never asked anyone to respect him, but none of us behaved badly when he is around. - రమేష్ ఓరుగంటి

"విన్నాను - సంతోషం "

"నువ్వేంటి - పిల్లల్నసలు ఏమనవా? అలా అయితే భయం-భక్తీ లేకుండా తయారవరూ?"

"పిల్లల్ని భయపెడితే భక్తి రాదు - ప్రేమిస్తే ప్రేమొస్తుంది తిరిగి"

"అర్థమయింది - ఇదిగో ఆ రమేష్ తమ్ముడు - ప్రసాద్ - నీగురించి ఏమన్నాడో విను:

నాకు తెలిసిన నాని గారు

నాని గారు గురుంచి కొన్ని నాకు తెలిసిన అనుభూతులు
ప్రసాద్ వాళ్ళ ఇంటి దగ్గెర క్రికెట్ ఆడినప్పుడుకాని, వాళ్ళ ఇంట్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లు చూస్తున్నపుడు, అప్పుడప్పుడు కుర్రాళ్లతో దూరదర్శన్ లో ఆదివారం సినిమాలు చూస్తున్నప్పుడు  నాని గారిని దగ్గెర నుండి చూసి అయన గురుంచి కొన్ని మీతో

నాని గారు మౌన ముని అంటే ఎక్కువ మాట్లాడరు కానీ అయన కి తెలియని ప్రపంచ విషయాలు ఏమి ఉండవు .అలాగే వాళ్ళఇంట్లో TV లు చూస్తున్నపుడు ఏ సచినో 6 కొట్టినా లేదా ఏ రవి శాస్త్రీ 6 లు ఇచ్చినా, అప్పుడు టీవీ చూస్తూ వచ్చే కుర్రాళ్ల గొంతులో ఆనందాన్ని లేదా అక్రాందాన్ని కూడా ఆయన సరిగా అర్ధం చేసుకుని ఏమి అనేవారు కాదు.ఇప్పటికి గుర్తు చిత్రలహరి లో మెగాస్టార్ ఆపద్భాందవుడు పాటని నాని గారి ఇంట్లో నేను అయన సోఫా మీద కూర్చుని చూడటం. 
కొందరికి నలుగురు తో ఉంటె  నాలెడ్జి వస్తుంది కొందరికి ప్రపంచమంతా తిరుగుతే వస్తుంది
నాని గారికి ఆ ప్రపంచ నాలెడ్జి ని తన నాలుగు రకాల న్యూస్ పేపర్స్ తో బంధించి ఇంటికి వచ్చిన ఆ నలుగురి కి ఆ నాలెడ్జిని షేర్ చేస్తూ  ఎప్పటికప్పుడు నేను కూడా Up to  Date అని చెప్పడం.  - ప్రసాద్ ఓరుగంటి


"....."

"నేను చదివేది నీకు నచ్చిందని నీ చిరునవ్వే చెప్తోంది - మీ ఊరి బిడ్డ - హనుమానూ అదేమాట - విను ఇది కూడా...

ప్రసాద్ నానీ గారి గురించి చక్కగా చెప్పావ్ ! నిజం గా  పుస్తకాలు చదవడం అక్కడే అలవాటు  అయ్యింది. నాకు తెలిసి మన ఊళ్ళో  కుర్రాళ్ళ అల్లరి ని ఆయన చిరునవ్వు తో చూసేవారు ఎవ్వరిన ఆయన ఏరోజు విసుక్కోలేదు.
తెల్లటి గ్లాస్కో పంచె లో ఎప్పుడూ పెదవి పై చిరుదరహసము ఉండే నానీ గారు లేరు అంటే మనసుకు చాలా బాధగా ఉంది. - హనుమాన్


 "....."

"ఇదిగో - బాండ్ అంటారు - అదే కుమార్ - నువ్విచ్చిన వాచీ కూడా చూపించాడు అందరికీ - నాని గారి  నుండి బహుమతిగా పొందినది - అంటూ...



"అవునూ - నీకు వారం క్రితం జ్వరం వచ్చి కళ్లు తెరిచాకైనా నన్ను తలుస్తావనుకుంటే నీకొడుకుని పిలిచి "ఆ బ్రాహ్మడికి ఓ కుంచెడు బియ్యం - పదిహేను రూపాయలు ఇచ్చి పంపించు - కూరలు కొనుక్కుంటాడు" - అని చెప్తావా? ఇంతకీ అక్కడ ఏ బ్రాహ్మడూ లేడు. నీ కలలో కూడా అడిగేవారు - వాళ్లకి - కళ్ళు తెరవగానే నువ్వు ఇవ్వమని పురమాయించడాలు - బాగు - బహు బాగు - ఇంక నీకు నన్ను తలుచుకోవడానికి సమయమేది?"

"ఇంతకీ నిన్ను తలుచుకుని నువ్వొస్తే నీకేం చెప్పాలి - అన్నీ వున్న నేను నిన్నేమని అడగాలి"

"కనీసం నొప్పి తగ్గించమని వేడొచ్చుకదా - అలా నీలో నువ్వే బాధ పడకపోతే?"

"సరి - ఇప్పటి నొప్పి సరే - ఇంతకు ముందెప్పుడూ నాకు నొప్పి రాలేదా- శరీరానికి కానీ - మనసుకి కానీ - మరప్పుడేమయ్యావు?"

"నాకు లోకమంతా సవాలక్ష మొక్కులు - మొక్కుబళ్లు, విన్నపాలు-సన్మానాలు - తీరిక లేకపోయింది"

"మరి అప్పుడు తీరిక లేని నువ్వు ఇప్పుడు మాత్రం పిలిస్తే వస్తావా - నా సాయమేదో నేనే పట్టుకున్నాను - అయినా నిన్ను పిలవలేదు కానీ - నిన్నేమీ కాదనుకోలేదే - అన్నిరకాలుగా నీ పట్ల నా ధర్మం నిర్వర్తించాను"

"అదీ - అదే మరి - నువ్వు అన్ని రకాలుగా నీ ధర్మం నిర్వర్తించి నన్ను మాత్రం ఏ సాయానికి పిలవలేదనే కదా - నా బాధ! సాయం వద్దు - నిన్నో మొన్నో మెలకువలో వున్నప్పుడు ఒక్కసారైనా మోక్షమిమ్మన్నావా?"

"ఎవరన్నా వింటే నవ్వుతారు - అదీ ఓ బాధే - చెప్తా విను - మోక్షం కోరడమూ ఓ కోరికే - నిన్నడగాలి -  అడిగితే ఇస్తావో - కాదంటావో. ఇస్తే సరే - కాదంటే మళ్లీ నువ్వెందుకు నాకివ్వాలో కారణాలు చెప్పి నిన్నొప్పించాలా? అలా చెప్పినా నువ్వు ఒప్పుకుంటావని ఏముంది?ఎందుకా లేనిపోని వాదన అని వూరుకున్నాను. అయినా చివరివరకూ ఇవ్వగలిగినంత ఇవ్వడంలో వున్న ఆనందం - పుచ్చుకోవడంలో వుండదులే"

"భేషైన మాట చెప్పావు ! ఇదిగో ఇప్పుడే చూశాను  - పేపర్లో వార్త. ఇందాకట్నుంచీ ఈ ఆకాశవీధిలో - కళ్లు మిరుమిట్లుగొల్పే ఈ నక్షత్ర కాంతిలో -  నీ చూపానట్లేదంటే ఏంటా అనుకున్నాను - కారణం తెల్సింది - వచ్చేటప్పుడు ఇచ్చే వచ్చావూ - మాటల్లో పడి నేను గమనించనే లేదు సుమీ  ... చదువుతాను విను ...






"83 ఏట దాకా కళ్ళజోడెరగను - అవి ఇంకొకరికి చూపానజేస్తే అంతకన్నా ఇంకేం కావాలి?"

"బానే వుంది సంబడం - ఓ మాట మాట్లాడవు - పుస్తకాలు తప్ప ఇంకే కాలక్షేపం లేదు - కళ్లు కూడా దానమిచ్చేస్తే నీకు కాలక్షేపమెలా?"

"చేసేవన్నీ చేసేసి ఏమీ ఎరగనట్టు నన్ను దబాయిస్తావేంటి? కథలు-కబుర్లు చెప్పే మా అమ్మని తీసుకెళ్ళావ్. నా ఇంటి మాలక్ష్మి-లలితనక్కడ చేర్చావ్. మోహనరాగం ఎంత బాగా పాడేదనీ?! - అదే మా కుట్టి - అందరికన్నా చిన్నదని కూడా చూడకుండా  పట్టుకెళ్లి అక్కడ చేర్చావు కదా - వాళ్లందరూ వుండగా నా కాలక్షేపానికి లోటేంటి?"

"సమయానికి బాగా గుర్తుచేశావ్ - మీ ఇంటి ఇంకో పిల్ల పప్పి ఏమందో విను -

అప్పకు నమస్సుమాంజలి అర్పిస్తూ - వారి అత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
అప్ప , దొడ్డ చక్కగ ఈ రెందు ఏళ్లు మిస్ అయిన కబుర్లు చెప్పుకుంటు వుండి వుంటారు. నేత్ర దానం సింప్లీ సుపర్బ్. I'm proud to be one of the Vadlamani family members!


గెలిచావయ్యా- నాని!! - ఉన్నన్నాళ్లూ  చప్పుడు చేయక - ఉనికి మాత్రమే తెలిసేలా - చుట్టూ వున్నవారికి  దీపంలా వెలుగు పంచి - ఇప్పుడు మలుగుతూ ఇంకో కంటికి వెలుగునివ్వబోతున్నావు - మీ వాళ్లన్నట్టు అమరజీవివే - ఈమాట దేవుణ్ణి నేను మాత్రమే కాదు - నిన్నెరిగిన వారందరూ అంటున్న మాట"






41 కామెంట్‌లు:

  1. మనసు బరువెక్కి మాట మూగబోయింది, కళ్ళు చెమర్చాయి, అసంకల్పితంగా. ధన్యజీవులు అరుదుగానే ఉంటారు :(

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ కళ్ల చెమర్పు - మా అప్ప నివాళికి మంచి చేర్పు. ధన్యవాదాలు.

      తొలగించండి
  2. వినూత్న నివాళి. మీ అప్ప గారి వ్యక్తిత్వాన్ని కళ్ళకి కట్టినట్లు చూపించారు. ☘

    రిప్లయితొలగించండి
  3. చాలా బాగా వ్రాసారు. ఇలాంటి మంచి తెలుగును చదివితే ఎంతో‌ ఆనందం‌ కలుగుతుంది. మీ వ్యాసంలోని నిర్మాణశిల్పమూ, శైలీ, భావుకతా, విషయమూ అన్నీ చాలా హృద్యంగా ఉన్నాయి.

    తలచుకొనెడు వార లున్న ధన్యుడగును నరుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ వ్యాఖ్య నాకు, నా బ్లాగుకు, నా తెలుగు భాషకి గొప్ప ప్రశంస. ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.
      మా అప్ప చాలా ధన్యులు!

      తొలగించండి


  4. మనసు బరువెక్కి మాటలు
    గనలేక తడబడెనోయి ఘనమగు వార
    ల్లెనలేని సేవలను జే
    సిన వారి కథలను చదువ చింతన గంటిన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. దీపం ఎప్పుడూ వెలుగునే పంచుతుంది నిశ్శబ్దం గానే!
    దీపం ఎప్పుడూ దారిని చూపుతుంది, మౌనం గానే!
    ఆ మౌన దీపానికి నీ మాటల నివాళి ఎంత బావుందో చెప్పడానికి,
    నా దగ్గర మాత్రం మాటలు లేవు.





    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాటలలో చెప్పలేని నీకు బదులివ్వడానికి నా దగ్గరా మాటలులేవు :(

      తొలగించండి
  6. Hi Lalitha.. excellent story about your appa.. chinna nati gnapakalu anni gurtuochayi.. chaala baaga rasavu.. Shyamala d/o buchi master

    రిప్లయితొలగించండి
  7. ఒక ధ్రువతార రాలిపోయి ఆ దివానము ముగపోయిన్ది !
    నందనవనం వదిలి అందనంత దూరము వెళ్ళిపోయారు
    కానీ మీరు మా అందరి మనసుల్లోనుంచీ వెళ్ళలేరు
    ఎంతో మంది విద్యార్దులుకి గుప్తదానం చేసేరు మీరు చేసే సహయం మీ మరోచేతికి కూడా తేలియనివ్వని మనసు మీది
    మీరు లేకపోవడం అటువంటి వాళ్ళకి లోటు.
    మీరు మమ్మలిని మోసమేచేసారు నవ్వుతూ మమ్మల్ని వదిలి వెళ్ళారు.

    రిప్లయితొలగించండి
  8. Mouna muni gurinchi raasi... maku nota matarakunda chesaru.... cheppadaniki mtalu chalavu

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాటలు రాని, చెప్పలేని పరిస్థితి అర్థం చేసుకున్నాను - థాంక్స్, శారద!

      తొలగించండి
  9. మంచోళ్ళే మారాజులు... మమతంటూ లేనోళ్లే నిరుపేదలు...
    ప్రేమే నీ రూపం... త్యాగం నీ ధర్మం...ఎవరేమి అనుకుంటే నీకేమిలే!...
    రాజువయ్యా... మహారాజువయ్యా!...రాజువయ్యా... మహారాజువయ్యా!...

    అని ఎవరన్నారో గాని ఈ చరణం లో వున్నభావం ఖచ్చితంగా మన నాని గారికి సరిపోతుంది.
    ఆయన అంతరంగం ఎవ్వరికి తెలియకపోయినా, నాకు తెలిసిన, నేను తెలుసుకున్న నాని గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక ఇంట్రోవెర్ట్( అంతర్ముఖుడు). ఈ పదం వాడి నేను పెద్ద సాహసం చేసానని అనుకోవడం కంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తిని మనలో నింపుకుని ముందుకు సాగడం ఎంతో ఆనందకరమైన అనుభవం అవుతుంది!...
    దివాణం మరియు జమిందారీ భావజాలం వలన ఆయన్ను చాలామంది ఒక EGO వున్న వ్యక్తిగా, ఎవ్వరితో మాట్లాడని వ్యక్తిగా చూసారే తప్ప, ఆయన గోయింగ్ టువార్డ్స్ యాటర్నిటీ(ఇన్ఫినిటీ) అని ఎంతమందికి తెలుసు...ఎందుకంటే EGO కి నేను అన్వయిన్చుకున్న అర్ధం ఇది మరి.....

    ప్రతి వారిలోను మంచినే తప్ప అచేతనంగా కూడా ఎవ్వరని తప్పుపట్టని, కోపగించుకోని వ్యక్తులను చూడడం చాలా అరుదు. అలాంటివారిలో మన నాని గారు ముందు వరసలో ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ వుండదనుకుంటుంన్నాను...

    మన స్నేహితుడు చెప్పినట్టు ఆయన ఒక మౌన మునే!... ఎందుకంటే గృహస్తు ఆశ్రమంలో ఉండికూడా " అస్తిత్వాన్ని గ్రహించడానికి ప్రయత్నిచడం" అంటే సామాన్యమైన విషయం కాదు..అది మహా పురుషులకే చెల్లు....

    ఆయనతో ఒక స్వీయ అనుభవం ఒకటి మీతో పంచుకుంటాను. మా అబ్బాయికి డయాబెటిక్ వచ్చినప్పుడు ఆయన నన్ను అడిగారు ఏమైంది, కారణం ఏమిటి, డాక్టర్లు ఏమ్మన్నారని... ఆ వయస్సులో రావడం చాల బ్యాడ్లాక్(BADLUCK) అని నేనన్నప్పుడు ఆయన నవ్వుకున్నారు...
    ఆ నవ్వులో అంతరార్ధం నాకు అప్పుడు అర్ధం కాలేదు కానీ ఆత్యాద్మిక ప్రపంచంలోకి వచ్చాకా గాని అర్ధం కాలేదు... నువ్వెందుకు "BE ADD LUCK " అనుకోకూడదు అని ఆయన నవ్వుకున్నారని....

    లల్లీఅక్క చెప్పినట్టు, ఆయన అమరజీవి, అజరామరుడే కాదు.. ఇంకా ముందుకి వెళ్లి చెప్పాలంటే ఆయన ఎప్పుడో అనంత విశ్వం వైపు చూసిన అంతర్ముఖుడు...

    లలితమ్మ గారు, నాని గారు వున్నప్పటి శోభ ఆ ఇంటికి ఇకముందు కూడా ఉండాలంటే, వాళ్ళ మార్గంలో నడిచే బాస్(ప్రసాద్) మరియు అరుణక్క మీద బాధ్యత చాలానే ఉంది అనుకుంటాను.

    లలితమ్మ గారు, నాని గార్లను భగవంతుడు తన లోకంలో మాట్లాడుకోమని మరలా కలిపినా, మనలోకములో మనలని విడిచి వెళ్లినందుకు చాలా బాధగానే ఉంది. వారి ఆత్మకు శాంతి కలగాలని మన్స్ఫర్తిగా కోరుకుంటూ...వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెల్పుతూ ... వారిచ్చిన స్పూర్తితో మనమందరం ముందుకు సాగాలని కోరుకుంటూ...

    నాగ రమేష్ పాలగుమ్మి(కర్ణం గారి సూరిబాబు గారి అబ్బాయి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మా అప్ప గురించి మీ జ్ఞాపకం పంచుకున్నందుకు ధన్యవాదాలు!

      తొలగించండి
  10. Lalli yentha baga cheppavu.inka yentha cheppinah thakkuve..alantivaru kotiki okkallu vuntaru.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండీ, లలిత పిన్ని! - ఎంత చెప్పినా తక్కువే.

      తొలగించండి
  11. Woow lalitagaruuuu chala bagundi...Nani garii atmakadha,,,,, ..... ila elaa alochinchi rasaru andii...... really nice....👌

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ గాయత్రి! - ఇది అంతగా ఆలోచించి రాసింది కాదు - అప్రయత్నంగా కుదిరింది.

      తొలగించండి
  12. ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్తి గా కోరుకుంటూ

    రిప్లయితొలగించండి
  13. Lalitha garu chala baga cheparu alanti vari kosam enta chepina takkuve🙏

    రిప్లయితొలగించండి
  14. ఎంత బాగా రాశారండీ, గుండెలకు హత్తుకొనే నివాళి. మీ పెదనాన్నగారి లాంటి ఉన్నత వ్యక్తిత్వం ఉన్నవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. మీకు ఇంత సునిశితంగా ఆలోచించే శక్తీ, ఇంత చక్కగా రాయగలిగే చదువూ ఇచ్చారు.

    మీ బ్లాగ్ నేను మొదటిసారి చదువుతున్నాను. ప్రతి ఒక్క పోస్ట్ బాగుంది. ఇంత చక్కని శైలితో ఇంట హృద్యంగా రాయగలిగే వారు అరుదయిపోతున్నారు. మీనుంచి మంచి పోస్టులు మరిన్ని వస్తాయని ఆశిస్తున్నాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా బ్లాగ్ చదువుతున్నందుకు, నచ్చినవి వచ్చి చెప్తున్నందుకు బోల్డన్ని ధన్యవాదాలు మీకు.

      తొలగించండి
  15. అద్భుతమైన నివాళి లలిత గారు.. మాటరాక మనసు మూగబోయింది..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాసేటప్పుడూ, మళ్లీ చదివినప్పుడూ నాదీ అదే పరిస్థితి - తిరిగి చూడలేని నా ముందు తరపు వ్యక్తిత్వాలని తలచుకుని :(

      తొలగించండి
  16. జ్ఞాపకాలు ఇంత అందగా కూడా వ్రాయవచ్చునా!!!
    బాగుంది బాగుంది.

    రిప్లయితొలగించండి
  17. ఎంత బాగా రాశారండి లలిత గారు._/\_

    రిప్లయితొలగించండి
  18. అప్పా వార్త వినగానే ఒక్కసారి గుండె గొంతుకలోకి వచ్చింది. నేను శ్రీను 10వరకు కలిసి చదువుకున్నాం, ఆ ఇంటితో మా ఇంటి అనుబంధం మాటల్లో చెప్పలేము. బుల్లెమ్మత్తయ్య గారు, లలితక్క, అప్పా మా సొంత మనుషుల్లా ఉంటారు అంత అలవాటు మాకు మా మామ్మ దగ్గరనించి. లలితక్క పేరి వాళ్ళ అమ్మాయని మా అమ్మ కి ప్రత్యేక అభిమానం, ఆవిడ కూడా పేరి వారి అమ్మాయే. అప్పా ఒక ధ్రువ నక్షత్రం అంతే లలితక్క అత్తయ్య గారూ భౌతికంగా మన మధ్య లేకపోయినా మన మనసుల్లో ఎప్పుడూ ఉంటారు. పోస్ట్ లో కామెంట్ పెడదామని మూడు సార్లు రాసి డిలీట్ చేసేసా మనసొప్పక. నదులన్నీ సముద్రంలో కలిసినట్టే అనాతవరం వీధులన్నీ ఆ ఇంటి గడప ముట్టినట్టే లెక్క. ఆ ఇల్లొక పాల సముద్రం ఇంటివారంతా వారి వారి స్థానాల్లో పదిలంగా ఎప్పటికీ అలానే ఉంటారు🙏🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మా ఇంటిని, మాఇంట్లోని వారిని ఇంత ఇష్టంగా తల్చుకుంటున్న మీరు నాకు ఆత్మీయులు.

      తొలగించండి
  19. మీ కుటుంబంలో ఎంత మంది లలితలండీ ? నాయనమ్మ పేరు కాబట్టి మాకు ఒక అరడజను లక్ష్మి లు ఉంటారు. చాలా బాగా వ్రాసారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాకన్నా పెద్దవారు ఇద్దరు, నా తర్వాత పుట్టినవారు ఇద్దరు - మొత్తం ఐదుగురు లలితలమండి - ధన్యవాదాలు.

      తొలగించండి