22, మార్చి 2023, బుధవారం
మీ మనోశోభ కృతమగుగాక
1, నవంబర్ 2020, ఆదివారం
మరుగైన వెన్నెల ఆట - అట్లతద్ది
ఆశ్వీయుజ బహుళ తదియ - అట్లతద్ది.
ఆడే-పాడే ముగ్గురాడపిల్లలున్న మా ఇంట్లో అట్లతద్ది అంటే ఓ వారం ముందు నుంచే మహా హడావిడి.
మరి అట్లతద్దంటే మాటలా? అదసలే అచ్చమైన ఆడపిల్లల పండగ.
ఎన్ని కావాలి? ఎన్ని సమకూర్చుకోవాలి?
చెయ్యి పండడానికి గోరింటాకు కావాలా?!
మరి ఆ గోరింటాకు బాగా పండాలంటే అందులో వేసి రుబ్బడానికి కవిరి కావాలా?!
తెల్లవారుఝామునే లేచి కందిపచ్చడి అన్నం తినగానే నోరు పండడానికి తమలపాకులు ఉండాలా?!
గోరింటాకుతో పండిన చేతులూ, తాంబూలంతో పండిన నాలుకా చూసుకుని, చూపించి మురిసి పోవడానికి మనతో పాటే పొద్దున్నే లేచే అమ్మాయిలో ఇద్దరో, ముగ్గురో కావాలా?!
తెల్లపువ్వుల దీపంలా వెలుగుతున్న వెన్నెల్లో - ఒప్పులకుప్ప తిరగడానికి ఒక్కళ్ళూ, చెమ్మచెక్క ఆడడానికో ముగ్గురూ, నేలా-బండా అంటూ చిందులెయ్యడానికో ఆరుగురూ - ఇలా అంకె మీద అంకె పెంచుకుంటూ పోగుచేసుకోవాల్సిన నేస్తులో పదిమందైనా కావాలా?!
వీళ్లందరినీ లేపి తెల్లని వెన్నెల తెల్లారి వేకువయ్యేలోగా కనీసం తలో ఆట ఒక్కోసారైనా ఆడాలా?!
ఆ తర్వాత రోజంతా ఊగడానికి ఉయ్యాల - నాన్న వేసివ్వాలంటే - దానికో పెద్ద చేంతాడు, ఆ ఉయ్యాల వేసుకోవడానికి అనువైన దూలం వెతుక్కోవాలా?!
వీటన్నిటినీ మించి అట్లతద్ది రోజే పప్పి పుట్టినరోజు కూడా.
అందుకే మా ఇంట్లో అట్లతద్ది తెగ సందడిగా జరిగేది.
నాన్న అట్లతద్ది ముందు రోజు తమలపాకులు తెప్పించేవారు. అప్పటికి అద్దెకున్న ఇంటిని బట్టి ఇంటి వరండా లోనో, ఇంటి పక్కనున్న పాక లోనో ఓ చిన్న ఉయ్యాల వేయించేవారు.
సరే! ఇక గోరింటాకు సంగతి!
నాలుగేళ్ళకో బదిలీ, నచ్చిన చోట మజిలీ అనుకుంటూ - మా నాన్న ఉద్యోగం మమ్మల్ని తీసుకెళ్ళిన - నాలుగు (గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ప్రకాశం) జిల్లాల్లో - ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో ఎవరింట్లో గోరింటాకు చెట్లున్నాయో కనుక్కుని ముందుగానే ఫలానా రోజొచ్చి కోసుకుంటామని, ముగ్గురం ఉన్నాం కదా - మూడ్రెళ్ళారు చేతులకి పెట్టుకోవడానికి బోల్డు గోరింటాకు కావాలని - అనగానే - నాతో ఓ పాట పాడించుకుని - బదులుగా చెట్టెడు గోరింటాకు మాకే అట్టే పెడతామని మాట ఇచ్చేసేవాళ్ళు.
అట్లతద్దికి ముందు రోజు వెళ్ళి - పాట ఇచ్చి, పుచ్చుకున్న మాట ప్రకారంగా - చెట్టుకున్న చిగురాకు, దాని కిందున్న మారాకు, అటు పైనున్న అంతగా ముదరని ఆకు - రెమ్మ రెమ్మకున్న ఆకులన్నిటినీ - "ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు, ఇంత చిగురెయ్యమని రెమ్మెరెమ్మకూ" అని భావకవి వరసలో పాడుకుంటూ - నలగకుండా దూసి తెచ్చుకునేదాన్ని. దూసిన ఆకు కదా - చిన్నచిన్న ఈనెలూ, రెబ్బలూ ఉండేవి. వాటినలాగే ఉంచేస్తే రుబ్బిన గోరింటాకు మెత్తగా ఉండకుండా పీచుపీచుగా తయారయ్యేది. సరిగ్గా పండేది కాదు. అందుకని అవన్నీ తీసేసి శుభ్రం చేసి రుబ్బడానికి సిద్ధంగా ఉంచేదాన్ని.
అమ్మ అప్పుడే దాన్ని రుబ్బేస్తానంటే ఒప్పుకునేదాన్ని కాదు. రుబ్బిన తర్వాత ఎక్కువసేపు పెట్టుకోకుండా ఉంటే గోరింటాకు అంత బాగా పండదని నా నమ్మకం. అప్పుడే కాదు ఇప్పుడు కూడా అంతే!
ఆ రోజు రాత్రి భోజనాలు అన్నీ అయ్యాక - అప్పుడు మాత్రమే అమ్మ గోరింటాకు రుబ్బాలి. అలా రుబ్బేటప్పుడు అందులో కవిరి వెయ్యాలి. నోరు పండడానికి తాంబూలంలో వేసే కవిరి గోరింటాకులో వేస్తే బాగా పండుతుందట. రుబ్బేటప్పుడు ఓ చుక్క నీళ్ళు ఎక్కువ కాకూడదు, ఓ చుక్క తక్కువ కాకూడదు. రుబ్బిన గోరింటాకు ముద్ద అప్పుడే చిలికిన మజ్జిగ లోంచి తీసిన వెచవెచ్చటి వెన్నముద్దలా ఉండాలి. రోలుంటే మిక్సీలో రుబ్బకూడదు. ఇన్ని రకాల సిద్ధాంతాలు, నిబంధనలు, సూత్రాలు ఉండేవి గోరింటాకు రుబ్బడానికి.
మా అమ్మకేమో - ఓ పక్క రోట్లో ఒకే స్వరం మీద పదేపదే పలుకుతున్న పాటలా తిరుగుతున్న పొత్రం రొదా, దానికి నేపథ్యసంగీతంలా ఇంకో పక్క "ఇంకా నలగలేదు, ఇలా కాదు, ఇంకా మెత్తగా రావాలి, ఇలా అయితే నేను పెట్టుకోను" అంటూ ఆరోహణ-అవరోహణలతో నేను పెడుతున్న ఆరున్నొక్కరాగపు సొదా - రెండు చెవుల్లో విడివిడిగానూ, కలివిడిగానూ వినిపిస్తున్నా - ఆవిడ - అలవాటైన సంగీతమే కదా అని - అవేమీ పట్టించుకోకుండా - గోరింటాకు రుబ్బు-వ్రతాన్ని పూర్తి చేసి, ఆ రోటిని కడగ్గా వచ్చిన గోరింటాకు నీళ్ళని ఇంకో చిన్నగిన్నెలోకి తీసిపెట్టి - వంటింట్లోకి వెళ్ళి - మళ్ళీ వేడివేడిగా అన్నం వండేది. మరి తెల్లవారుఝామున చద్దన్నాలు తినాలి కదా!
అప్పుడు కూర్చుని - అమ్మ రుబ్బిన వెన్నముద్దలాంటి గోరింటాకు ముద్దని అటూఇటూ పాకకుండా జాగ్రత్తగా అద్దుకుంటూ, మధ్యమధ్యలో ఆ గోరింటాకు నీళ్లతోనే తడుపుకుంటూ - అరచేతిలో ౘందమామ, చుక్కలూ - చేతివేళ్ళకి రెండో కణుపు దాకా పొడుగాటి టోపీలు, వాటి కింద ఆశ్చర్యార్థకపు తోకల్లా ఇంకాసిని చుక్కలూ - పెట్టుకునే దాన్ని.
ఈలోగా పక్కనే కుట్టి దానికి తోచినట్లు ఎడమ చేతికి ఓ పెద్ద ౘందమామ, దాని చుట్టూ పెద్దపెద్ద చుక్కలూ పెట్టేసుకుని, కుడి చేతి నిండా గోరింటాకు పులిమేసుకునేది.
పప్పి మాత్రం నేను నా ఎడమ చేతికి పెట్టుకునే దాకా ఆగి దాని రెండు చేతులకీ నన్నే పెట్టమనేది. నేను అటు వంగి, ఇటు వంగి ఆపసోపాలు పడి మొత్తానికి ఒక చేత్తోనే పప్పి చేతులకి గోరింటాకు పెట్టేదాన్ని. మధ్యమధ్యలో నేను సరిగ్గా పెట్టట్లేదని దానికి అనుమానం వచ్చినప్పుడల్లా "నువ్వు సరిగ్గా పెట్టట్లేదు, ఇలా అయితే కడుక్కొచ్చేస్తాను" అని బెదిరిస్తూ ఉండేది. వెంటనే సర్దుకుని - బొమ్మని చెక్కుతున్నంత శ్రద్ధగా - దానికి గోరింటాకు పెట్టేదాన్ని. మరి దాని పుట్టినరోజు కదా!
అదవుతూనే - నా రెండు పాదాలకీ పారాణి కూడా పెట్టుకుని - చేతులూ, పాదాలూ - కొంచెం ఆరేదాకా కూర్చుని - ఇక అవి ఊడవు, రాలవు అని నమ్మకం కుదిరాక - అప్పుడు పడుకునేదాన్ని.
తెల్లవారుఝామున లేస్తూనే చేతులకి, పాదాలకి ఎండిపోయిన గోరింటాకుని నలిచేసి - మళ్ళీ నీళ్ళు తగిలితే రంగు తగ్గిపోతుందని బెంగ - వెంటనే కొబ్బరినూనె రాసేసుకునేదాన్ని. నాతో పాటే పప్పి, కుట్టి కూడా నూనె రాసుకుని - మేము ముగ్గురం మెరుస్తున్న చేతులని అమ్మకి చూపించగానే - సిందూరం రంగులో పండాయి - అని మురిసిపోయేది అమ్మ.
వేకువలో పూసిన ఆ సిందూరం రంగు కాస్తా పొద్దెక్కే కొద్దీ కుంకుమ వన్నెకి తిరిగేది.
పూసుకున్న గోరింటాకు చూసుకునే సంబరం పూర్తవుతూనే - ముందటి రాత్రి అమ్మ వండి పెట్టిన అన్నంలో కందిపచ్చడి కలుపుకుని తినేస్తూ - మేం తింటూ ఉండగానే వచ్చేసి ఇంటి ముందు తచ్చాడుతున్న ఇంటి ఓనర్ తాతగారి మనవరాలు రాధ, హిందీ టీచరుగారి అమ్మాయి విజయలక్ష్మీ ఆండాళ్‌లని చూడగానే - ఇంకా గబగబా తినేసి - అప్పటికే నాన్న సున్నం రాసి, చెక్కపొడి, కవిరి వేసి చుట్టి ఉంచిన తమలపాకుల తాంబూలాన్ని వేసుకుని - ఎవరి నాలుక ఎక్కువ పండిందో చూసుకుంటూ - బయటికి వచ్చి చూసేటప్పటికి ఎలా ఉండేదంటే...
వెన్నెల పూసుకుని వెల్లదైన మిన్ను
మిన్ను మీద అక్కడక్కడా దూదికుప్పల్లా ఉన్న మబ్బులు
మిన్ను మధ్యలో మెఱుగు పెట్టిన వెండిపళ్ళెంలా మెరుస్తూ చంద్రుడు -
మిన్ను జార్చిన జలతారు పరదాలా చుట్టుముట్టిన వెన్నెల...
ఎటు చూసినా వెల్లువై కమ్మిన చల్లని తెల్లదనం...
ఆ వెల్లదనంలో ఇళ్ళ పెరళ్ళలో పూసిన తెలతెల్లటి పూలన్నీ తళుకు తారలయ్యేవి.
అది చూస్తూనే పిల్లలమందరం వెన్నెలపులుగులయ్యేవాళ్ళం.
మా ఇంటి ముందున్న ఎఱ్ఱటి మట్టిరోడ్డు కూడా తెల్లబడి వెన్నెల ఏఱయ్యేది.
అప్పుడు - ఆ క్షణంలో -
కమ్మిన తెలుపువెలుగులో
కనిపించని రెక్కలేవో ఒంటికి మొలిచేవి.
పట్టరాని నవ్వేదో పొంగిపొర్లి పోయేది.
పట్టలేని సంబరంతో ఒళ్ళు మబ్బుపింజె అయేది.
చల్లగా తగులుతున్న గాలికి తేలేది, తూగేది.
అలా ... అలా... ఆ గాలి అలల్లో -
తేలుతూ, తూగుతూ - నవ్వుతూ తుళ్ళుతూ -
ఆడుకున్న ఆటలు వెన్నెల ఆటలు...
పాడుకున్న పాటలు వేకువ పాటలు...
ఆటలు ఆడుతూ ఉండగానే వెన్నెల వెల్ల జారి వేకువయ్యేది. మిగిలిన రోజంతా ఉయ్యాల-డోలలో తూగేది.
సాయంకాలానికి అమ్మ పెట్టే అట్ల దొంతర ఒకదానిమీదొకటిగా బోల్డన్ని ౘందమామలు పేర్చినట్లుగా ఉండేది.
అన్నట్టు - నా ఉపోషం సంగతి చెప్పకుండా అట్లతద్ది కబుర్లు ముగిస్తే ఎలా?
అప్పుడెప్పుడో - చిన్నప్పుడు - గణపవరంలో ఉన్నప్పుడు - ఓ సారి మా అమ్మ, అన్నపూర్ణమ్మ గారు అట్లతద్దికి "ఉపోషం ఉంటాం" అంటూ మాట్లాడుకుంటూ ఉంటే నాకు ఆ "ఉపోషం" అన్న మాట భలే తమాషాగా అనిపించి తెగ నచ్చేసింది.
వెంటనే నేను కూడా ఉపోషం ఉంటానన్నాను.
నాకు ఏడుపొస్తే అది ఆకలేసి వచ్చిందని నాకన్నా ముందుగా కనిపెట్టేసి నాకు కంచంలో అన్నం పెట్టేసే మా అమ్మ నేను ఉపోషం ఉంటాననగానే - "నువ్వుండలేవు లల్లీ! ఒద్దు" అనగానే బోల్డు ఉక్రోషం తెచ్చేసుకుని "నేనివాళ ఉపోషం ఉండాల్సిందే!" అని చెప్పేశా.
అది వినగానే మా అమ్మ "సరే ఉండు కానీ మధ్యాహ్నం దాకా ఉండు చాలు. నువ్వసలే ఆకలికి తట్టుకోలేవు." అంది.
మా అమ్మ అన్ని హింట్లు నాకిస్తున్నా - నాకప్పటికీ ఉపోషం (ఉపవాసం) అంటే సాయంత్రం దాకా ఏమీ తినకుండా ఉంటే ఎంత కష్టమో అన్న పాయింటు అర్థం కావట్లేదు.
"మరి నువ్వో?" అనగానే "నేను సాయంత్రం దాకా ఉంటాను. నువ్వూ నాలా అంతసేపు ఉండక్కర్లేదు. పెద్దవాళ్ళు చెప్పినట్లు చెయ్యాలి కానీ చేసినట్లు కాదు. " అని ఎప్పుడూ చెప్పే పాఠమే చెప్పింది అమ్మ.
నాకది వింటూనే - ఉపోషంలో ఏదో రహస్యం ఉంది. అదేంటో నాకు వీళ్ళెవ్వరూ చెప్పట్లేదు అందుకని నేనూ ఉపోషం ఉంటేనే కానీ నాకు తెలిసేలా లేదు - అనేసుకుని పట్టుపట్టి ఉపోషం వున్నాను.
కొంచెం ఎండెక్కే కొద్దీ బయట ఎండతో పాటు లోపల ఆకలి కూడా మండడం మొదలుపెట్టింది. ఆరారగా తింటున్న అరటిపళ్ళు అంతగా ఆనుతున్నట్టు లేవు. ఇక మా అమ్మని అరగంటకోసారి "ఉపోషం ఎప్పుడు అయిపోతుంది. సాయంత్రం తొందరగా అన్నం తినెయ్యొచ్చా?" అని అడగడం మొదలుపెట్టాను.
మా అమ్మేమో - అసలే ఉపోషం ఉందేమో - ఆ నీరసంతో నన్ను విసుక్కుని "చెప్తే విన్నావా? చంద్రుడొచ్చేదాకా ఉండాల్సిందే!?" అంది.
మేము అద్దెకున్న కరణం గారు, అన్నపూర్ణమ్మగార్ల రెండో అబ్బాయి పేరు చంద్రుడు. ఏ చిలకలూరిపేటో వెళ్ళుంటాడు, వస్తే కనిపిస్తాడు కదా అని నేనెప్పుడూ ఎక్కి కూర్చునే గోడెక్కి రోడ్డు కేసి చూస్తూ కూర్చున్నాను.
కాళ్ళూపుకుంటూ, పాటలు పాడుకుంటూ, అటూ ఇటూ చూసుకుంటూ ఓ గంట కూర్చున్నానేమో అలా. దూరంగా నడుచుకుంటూ చంద్రుడు వస్తూ కనిపించాడు. హమ్మయ్య!
నేను గబగబా గోడ మీంచి దిగి - పరిగెత్తుకుంటూ లోపల అన్నపూర్ణమ్మగారి వంటింటి పక్కనే ఉన్న రోట్లో సాయంత్రం కాల్చబోయే అట్లలోకి కొబ్బరికాయ-చింతకాయ పచ్చడి రుబ్బుతున్న అమ్మ దగ్గరికి వెళ్ళి "అమ్మా! నా ఉపోషం అయిపోయింది. చంద్రుడొచ్చేశాడు...చంద్రుడొచ్చేశాడు" అని గెంతుతూ ఉంటే పచ్చడి చేయడం ఆపేసి అమ్మ, అమ్మ పక్కనే ఉన్న అన్నపూర్ణమ్మగారు - అప్పుడే ఇంట్లోకి వచ్చిన చంద్రుణ్ణి చూసి - పకపకా నవ్వడం మొదలు పెట్టారు.
(ఈ ఉపోషం కథ రెండేళ్ళ క్రితం 2018 BC లో గణపవరంలో అన్నపూర్ణమ్మ గారిని చూడడానికి అమ్మతో వెళ్ళినప్పుడు - వాళ్ళింట్లో పిల్లల్లో పిల్లలా పెరిగిన నా చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటూ ఆవిడ చెప్పిన ముచ్చట.)
ఆ నవ్వుల పువ్వులు ఇప్పటికీ నా మీద నేనే రువ్వుకుని నవ్వుకుంటూ వుంటాను.
ఆనాటి అట్లతద్ది...
మెరుగు వెన్నెల ఆట
మదిని మ్రోగిన వేకువ పాట
ఈనాటికది -
మరుగైన వెన్నెల ఆట
మదిని కాగు వేకువ పాట
(కిందున్న జ్ఞాపకాలు ...
నిరుడు పూసిన గోరింటాకు పూతలవి ...
గతకాలపు గోరింట గరువపువి ...)
24, మార్చి 2020, మంగళవారం
శక్తినియ్యి శార్వరీ...
6, ఏప్రిల్ 2019, శనివారం
వికారిని...సహకారిని...
ఇంకెంత దూరమనక - ఇంకెక్కడ మజిలీ అనక
ఉన్న చోటుండక - ఉస్సురుస్సురనక
ఎప్పుడూ - ఎడతెగక - ఎక్కడా ఆగక
ఒంటరిననుకోక - ఒలపక్షం లేక
కదులుతూ ఉంటుంది
కాలమది - కలకాలముండునది
అందులో ఒక అంశమట తిథి
తిథుల్లో అనాదిగా ఆది ఐనది
చైత్రశుధ్ధపాడ్యమి
చాంద్రమాన పంచాంగంలో మొట్టమొదటి పుట దానిది
ఏడాదికి తొలి పండగది.
పేరట ఉగాది.
ఎన్ని కొత్త ఉగాదులొస్తున్నా, ప్రతి ఉగాదికీ గడిచిన ఉగాది రోజుల్ని నెమరేసుకోవడం, మరుగున పడ్డ జ్ఞాపకాల్ని ఓ సారి తలచుకుని నవ్వుకోవడం, ఆ నవ్వులతో ఉగాదిని గడుపుకోవడం ఎప్పుడూ జరిగినట్లే ఈ ఉగాదికీ...
అప్పట్లో...
పెరుగుతున్న పగళ్ళు
అప్పటివరకూ వెచ్చని పూతలా వున్న సూరీడి వెలుగు కాస్తా వేడి వాతలా అనిపిస్తూ
తరుగుతున్న రాత్రుళ్ళు
అప్పుడప్పుడే పెరుగుతున్న కరెంటు కోతలు
ఉక్కి ఉసురుసురనే ప్రాణాల విసురుతో ఊగే విసనకఱ్ఱలు
ఎర్రెర్రటి లేత ఆకులతో, పచ్చని పిందే-కాయలతో గుబురుగా నవనవలాడుతున్న మామిడి చెట్లు
వాటి కొమ్మల్లో ఎక్కడో కూర్చుని కూతకి బదులుగా కూసే మా పిల్లమూకతో పంతాలు పోయి ఇంకా ఇంకా కూసే కోయిల్లు
నిలువెల్లా పూసిన వేపచెట్లు
అప్పటివరకూ స్తబ్ధుగా వున్న లోకమేదో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచినట్లు అంతటా ఒకే సందడి, హడావిడి - ఉగాది వస్తోందంటూ.
ముందే తెచ్చి పెట్టిన పంచాంగాలు, పిడపర్తి వారిదోటి, నేమాని వారిదింకోటి. ఉగాది దాకా తెరవకూడదని, చదవకూడదని చెప్పేవారు నాన్న.
అసలు వెనకేం జరిగిందో, ముందేం జరగబోతోందో అక్కర్లేని, అసలేం జరుగుతున్నా లెక్క చెయ్యని చీకూ-చింతా లేని ప్రాణాలు మావి. అయినా ఆ అక్కర్లేనితనం లోనే పంచాంగంలో రాసిన కొత్త అక్షరాల్లో ఏం రాసుంటారా అనే కుతూహలం. అయినా నాన్న చెప్పారని ఉగాది రోజు కోసం ఎదురు చూసేవాళ్ళం. ఉట్టినే! అసలలా ఎదురు చూడ్డమెందుకంటే ...చెప్తా...చెప్తా... ముందు ఉగాది రోజు గురించి మొదలెట్టాక.
ఉగాది అనగానే అమ్మ కాటన్ చుడీదార్లు కొనేది. రాబోయే ఎండాకాలానికి హాయిగా వుంటాయని. ఒక ఉగాదికి అల్లాగే కుట్టించింది - నాకో ఆకుపచ్చ చారలది. నేను దానికో చిన్న పసుప్పచ్చ టెడ్డీబేర్ బ్రూచ్ కొనుక్కున్నాను ఎడం పక్క భుజం దగ్గర ఎక్కించుకోవడానికి. పప్పీదేమో పసుప్పచ్చ చారలది. పప్పి దాన్ని ఉగాది పూటకి పులివేషమనేది. మాకన్నా పొడుగ్గా వుండే కుట్టీకి కుట్టించక్కర్లేదు - రెడీమేడ్లో దొరికేసింది భలే మంచి డ్రెస్సు.
ఇక ఉగాది రోజు వేపపూత ఒలవడం, మామిడికాయ ముక్కలు తరగడం నా ఒంతు. బెల్లం కోరడం ఒంతులేసుకునే పప్పీ, కుట్టీల ఒంతు. మిగిలేదిక కొబ్బరికాయ. దాని చుట్టూ బోల్డంత పీచు. ఓ ఇనప అట్లకాడ నా చేతిలో పెట్టి "కోనసీమలో పుట్టావు, కొబ్బరికాయ ఒలవడం రావాలి" అంది అమ్మ ఓ సారి. ఓ పది నిముషాలు ఎలాగోలా అటు వంగి, ఇటు వాలి, "నేనసలు ఇంత పీచుతో పుట్టకపోయి ఉంటే బావుండేది" అని కొబ్బరికాయే వాపోయేలా మొత్తానికి పీచు-ఒలుచుడు కార్యక్రమం పూర్తయింది ఆ సారికి. తరవాత్తర్వాత కొబ్బరికాయకి ఆట్టే దెబ్బ తగలకుండా పీచు తీయడం, చేతికి నూనె రాసుకుని పనసపండు కోసి తొనలు తీయడం లాంటి వాటిల్లో ప్రత్యేక నైపుణ్యం సాధించా - అమ్మ మెప్పు కోసం.
మేము కిందామీదా పడి ఒలిచిచ్చిన, కోరిచ్చిన వాటితో మా అమ్మ ఉగాది పచ్చడి చేసిచ్చేది. అది తినేసి - అప్పుడు మొదలెట్టేవాళ్ళం మా పంచాంగపఠనం.
రాజులే పూజ్యమైన రోజుల్లో రాజపూజ్యం, అవమానం లెక్కలు తేల్చి చూసుకోవడం ఎలా? దానికి మా లెక్కేంటంటే... అడిగిన వెంటనే అమ్మ పెడితే రాజపూజ్యం ఎకౌంట్లో, "ఉండో నిముషం. కాస్సేపాగి పెడతాను" అంటే అవమానం కౌంట్లో వేసేసుకునే వాళ్ళం. నాన్న ఇచ్చే పాకెట్ మనీ ఏమో మా ఆదాయం, అమ్మ మా కోసం కొనేవన్నీ మాకే వ్యయం. అలా అల్లిబిల్లి లెక్కలేసేసుకుని అవి పంచాంగంలో మా రాశిఫలితాలకి సరిపోతాయో లేదో చూసుకునేవాళ్ళం.
ప్రతీసారీ ప్రతి ఒక్క రాశికీ "విద్యార్థులకి రెండో ఛాన్సులో విజయం" అనుండేది అందులో. అది చదువుకుని ఒకళ్ళనొకళ్ళం "ఈసారి నువ్వింక పాడుకోవాలి ఉందిగా సెప్టెంబర్ మార్చి పైనా " అంటూ, అనుకుంటూ, నవ్వుకుంటూ, ఉంటూ ఉండగా - ఇంతలో నాన్నొచ్చి "అంతెక్కువ నవ్వకండి, మూతి చెవులదాకా సాగిపోతుంది, పెళ్లిళ్లు చెయ్యలేను" అంటే దానికింకా నవ్వుకుంటూ, ఉంటూ ఉండగా గంట పది కొట్టేది.
అంతే! ముగ్గురం పంచాంగాలు మధ్యాహ్నభోజనానంతరపఠనానికి దాచుకుని టీవీ ముందు చేరేవాళ్ళం. ఎందుకూ? దూర్‌దర్శన్‌లో వచ్చే ఉగాది కవి సమ్మేళనం చూడడానికి. అది చూశాక మా ఇంటి మేడ మీద చేరేవాళ్ళం. అక్కడ మా కపి-సమ్మేళనం జరిగేది.
అలా గుర్తున్నదే అప్పటిది ఓ కవిత - ఇప్పటికీ పప్పి, నేనూ ఉగాది అంటే తలుచుకుని, తలుచుకుని మరీ నవ్వుకునే కవిత...
నీళ్లు నిండితే అది నది
నీళ్లు ఎండితే గోడల్లేని గది
నేనన్నది వినగానే ...
వహ్వా...వహ్వా అనేది పప్పి నవ్వు కప్పిన మెచ్చుకోలైతే
ఏం చెప్పావే లల్లెమ్మా!
ఇది విని పరిగెడతారే జనమా! - అనేది కుట్టి కప్పని మేకతోలు.
ఏ ఉగాదైనా అదే వరస. ఇప్పటికీ ఉగాది అంటే ఏదో అల్లిబిల్లి కవిత ఆల్లనిదే ఆనాడు ఉగాదిలా ఆనదు.
అందులోనూ ఈసారి ఉగాది పేరు విన్నప్పట్నుంచీ ఒకటే అనిపిస్తోంది - అసలు వికారి అనెందుకు దీన్నన్నారని. అదుగో ... అలా అలా అనుకుంటూ వికారితో నేనంటున్నట్టూ, వికారి నేనన్నది విని తిరిగి నాతో అంటున్నట్టూ... ఈ వికారి నామ నూతన సంవత్సర ఉగాదికి నే రాసుకున్న pun-చాంగం!
"ఉగాదీ!
అరవై పేర్ల బడాయీ!
ఏటేటా కొత్త పేరు నీకు, సంగతేంటది?
అందులోనూ ఈమాటు నీ పేరట వికారి
ఎబ్బే! ఏం పేరది?"
అని నేననుకున్నానో లేదో
నేనన్నది విందేమో అనిపించిన వికారి ఇలా అన్నట్లనిపించింది...
"కదిలే కాలంలో ఎప్పట్లానే ఓ పాలు నేను
నీకేదో ఇరవయి - అరవయ్యని- నువ్వేసిన లెక్క నేను
ఆ లెక్కేదో లెక్కే చెయ్యక సాగేది నేను
ఎబ్బే! అని నువ్వన్న నా పేరు నేనడిగి తెచ్చుకున్నది కాదు
అది లేదని నే నొచ్చుకున్నది కాదు
ఆ పేరు
నాకిచ్చినవారు
ఎవరో నీలాంటి నోరున్నవారు
నా పేరు బట్టి వారి తీరు మారుతుందనుకున్నవారు
మారని వారి తీరుకి నా పేరే కారణమనొచ్చనుకున్నవారు
ఇదీ నీ పేరని ఒకరన్నాక
ఆ పేరుతో మనక తప్పదు
ఆ పేరే నాదనుకోక తప్పదు
అందుకే... నేను వికారిని
చేతకాని నెపాలకి వికారిని...
చేవ కలిగిన జీవితాలకి సహకారిని..."
18, మార్చి 2018, ఆదివారం
విరోధాభాస విళంబి
ఈసారి మాత్రం తియ్యమావిడికాయ మాత్రమే దొరికింది.
మర్చిపోయిన కొబ్బరికాయ తెచ్చుకుందామని హర్ష ఇండియన్ గ్రోసరీ అంగడికి వెళ్ళి - కొనుక్కుని డబ్బులిచ్చి రాబోతుంటే - "అయ్యో - మరిచాను మీకిమ్మన్నారు ఇది" అంటూ సొరుగు లోపల్నుంచి - వడిలి బంగారపు రంగులో వున్న చిటికెడు వేపపూత తీసి బంగారంలా నాకందించాడు - ఆ కొట్టులోని బంగారుకొండ.
మురిసిపోతూ కార్లో ఎక్కిన నన్నూ, నాచేత భద్రంగా పట్టుకున్నఆ బుజ్జి పొట్లం చూడగానే బదరి - "ఒక ఫ్రెండ్ చెప్పాడు - ఆంధ్రాలో ఇంకా వేపపూత రానేలేదట - పల్లెటూళ్ళో కూడా కొనుక్కోవాల్సిన రోజులొచ్చాయి అని" అన్నారు.
అది వినగానే - ఔరా! విరోధాభాస విళంబీ - అనిపించింది.
మావి చిగురులు వేయనేలేదట
వేప ఇంకా పూయనే లేదట
పేరు లోనేనేమో విలంబం?!
ఊసుపోని కోయిల పాట విన్న సంబరమేమో?!
తొందరపడి ఒక పండగ ముందే వచ్చింది
సంబరపడి మనందరికీ విందులు మప్పింది
విరోధాభాస అయితేనేం విళంబి!
కొత్త సంవత్సరాన్ని కానుకగా ఇచ్చింది
నవజీవనపు భరోసా తెచ్చింది.
13, జనవరి 2018, శనివారం
గతించిన సంక్రాంతిని స్వాగతిస్తూ...
నెలపట్టు ముగ్గులు
ఇంటిముందు వేసిన ముగ్గులు - పద్మాలో, శివుడి మూడు కళ్ళో - ఆ ముగ్గుల్లో కుదురుకున్న గొబ్బెమ్మలు.
ఆ గొబ్బెమ్మలు చేయడానికి కావల్సిన ఆవుపేడ - అనాతవరంలోనో, శివకోడులోనో అయితే ఇంటిపాలేరో, పొలంలో పాలేరో తెచ్చిపెట్టేవాళ్ళు.
అదే అప్పటికి నాన్న ఉద్యోగరీత్యా వున్న వూళ్ళో ఆవుపేడ కావాలంటే ఆ ఊరి పెద్దరైతుల పశువులకొట్టాల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిందే -
తెల్లా ఆవమ్మా - గొబ్బి పేడియ్యవే
నల్లా ఆవమ్మా - నువ్వూ వేయవే
ముందుకి వస్తే - కొమ్ములు విసరకే
వెనకాల్నుంచి - తోకతో కొట్టకే -అనుకుంటూ.
ఒక్కోసారి ఆవుపేడ కోసం మిట్టమధ్యాహ్నం వెళ్ళాల్సి వచ్చేది.
అప్పుడైతే ఆవులు కొట్టాల్లో కాకుండా - ఏ ఆరుబయటో గడ్డి మేస్తూ ఉంటాయి - తాజా పేడ దొరుకుతుంది.
ఇలాంటి లాజిక్కులతో నేను, పప్పి, కుట్టి - ఒక ప్లాస్టిక్ బేసిన్ పట్టుకుని - మధ్యాహ్నం భోంచేసి అమ్మ ఏ పుస్తకమో చదువుకుంటూనో, లేకపోతే లక్ష్మి దొడ్డతో కలిసి పండక్కి పిండివంటలు చేయడానికి పిళ్ళూ అవీ కొట్టించే హడావిడిలో ఉండగానో - ఎర్రటి ఎండలో - ప్రపంచంలోకెల్లా అన్యోన్యమైన అక్కచెల్లెళ్ళకి నమూనాల్లా - మా గొబ్బి-పేడ-సేకరణకి బయలుదేరేవాళ్ళం.
అప్పటికి మేమున్న ఊరుని బట్టి ఏ రాధాయో (గణపవరం), హోటల్ వారి అమ్మాయి పద్మో (జంగారెడ్డిగూడెం), ఏడుకొండలో (టంగుటూరు) - మాతో పాటు - మేమందరం కలిసి ఊరేగింపు.
ఆ ఆవులేమో ఊరి చివర - వాగు పక్క సరివితోటల దగ్గరో, చింతచెట్ల కిందో గడ్డి మేస్తూ ఉండేవి.
వాటి దగ్గరికి వెళ్ళే దారి పొడుగునా - వెళ్ళేటప్పుడు మా ధ్యాసంతా పేడ మీదే ఉండేదేమో - మా కబుర్లన్నీ - అది కింద పడిన ఎంత సేపటి వరకు ఫ్రెష్షుగా ఉంటుంది? ఎక్కువ మట్టి అంటుకోకుండా పేడ ఎలా తియ్యాలి? - ఆవుల దగ్గర కాసేవాళ్ళతో ఎలా మాట్లాడితే ఎక్కువ పేడ ఇస్తారూ? - మేం ముగ్గురం అక్కచెల్లెళ్ళం అని చెప్పకుండా - విడివిడిగా తెచ్చుకుంటే బోల్డు పేడ తెచ్చుకుని పే...... ద్ద గొబ్బెమ్మలు ఎలా చేసుకోవచ్చో? - ఇల్లాంటి strategic planning - మీదే ఉండేవి.
తీరా అక్కడికి వెళ్ళాక - మా నక్షత్రాలు బావున్న రోజు - ఆ ఆవులు కాసేవాళ్ళ కడుపులు నిండి, అరమూత కళ్ళవాళ్ళై - ఏ చెట్టు కిందో కాలు మీద కాలేసుకుని పడుకుని - కాసేపు మా కాలక్షేపపు కబుర్లు విని - ఆ కబుర్లకి అక్షర-ముద్దలుగా ఆవుపేడని అనుగ్రహించేవారు.
ఇంక ఇంటికి తిరిగి వచ్చే దారిలో - ఎలా వచ్చేవో తెలీదు - చందమామ, బొమ్మరిల్లు కథలేవో చెప్పుకుంటూ వెళ్తుంటే - మాలో ఎవరో ఒకరు కచ్చితంగా - ఆ కథల్లోని తెల్లతోక దయ్యాల కబుర్లు మొదలుపెట్టేవారు. ఇంకంతే - సినిమాల్లో రాత్రి పూట తెల్ల చీర కట్టుకుని వచ్చే దెయ్యాల దగ్గర్నుంచి మిట్టమధ్యాహ్నపు కొరివిదయ్యాల దాకా - దెయ్యాలు, వాటిల్లో రకాలు, కాళ్ళ కేసి చూసి వాటిని గుర్తు పట్టటం ఎలా (వాటికాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయి మరి!) - లాంటి విషయాలన్నీ తెగ ధైర్యంగా మాట్లాడుకుంటూ వచ్చేవాళ్ళం. పగలే కదా అన్న ధైర్యం.
ఆ మాటలకి ఎవరికి వాళ్ళకి మనసులో ఏదో భయముంన్నా బయటపడేవాళ్ళం కాదు.
ఒకసారలాగే - ఎండలో వస్తూ ఉంటే దూరంగా ఒక ముసలావిడ ఎండకి చీర ముసుగేసుకుని వస్తూ కనిపించింది.
అంతే - మాలో మేము అనేసుకున్నాం - ఆవిడ దగ్గరికి రాగానే పాదాలు ఎటు తిరిగున్నాయో తప్పకుండా చూడాలని. తీరా ఆవిడ మాకు ఒక అడుగు దూరంలో వుండగా - ఆ రోజు - దెబ్బకి ఠా-దెయ్యం కబుర్లటా - అన్నట్లు కబుర్లన్నీ ఆపేసి - అప్పటికే నేర్చుకుని వున్న మంత్రం లంబాడి దెయ్యం - నాకేం భయ్యం పాడుకుంటూ - పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేశాం. అలా పరిగెట్టిన మమ్మల్ని చూసి విషయం అర్థం కాక ఆ ముసలావిడ హడిలిపోయింది - అది వేరే సంగతి.
ఎంత పరిగెత్తినా పేడ మాత్రం పదిలం పదిలం :))
సరి - గొబ్బెమ్మ తయారు.
మరి అలంకారం మాటేంటి? రోజూ పెట్టే గొబ్బెమ్మకి బంతిపూలు బానే ఉంటాయి.
కానీ ఏదో ఒక రోజు మనింట్లో గొబ్బెమ్మలు పెట్టామని అందర్నీ పిలుస్తాం కదా!
గొబ్బెమ్మ చుట్టూ తిరుగుతూ గొబ్బి పాటలు పాడి - ఆ ఆ తర్వాత అమ్మ చేసిచ్చిన పాఠోళీ ప్రసాదం పెడతాం కదా!
మరప్పుడు కూడా బంతిపూలే అంటే గొబ్బెమ్మ చిన్నబుచ్చుకుంటుంది కదా!
మధ్యలో పిల్లను మోసే తల్లిగొబ్బెమ్మకి, చుట్టూ పెట్టే నాలుగు గొబ్బెమ్మలకి కలిపి కనీసం ఐదు గుమ్మడిపూలు కావాలి కదా!
మరెవక్కడుంటాయి?
ఎత్తుగోడల కవతల పశువుల కొట్టాలుండి - వాటిమీదకి పాకించిన గుమ్మడిపాదులున్న మోతుబరి రైతులిళ్ళలో ఉంటాయి.
ఎలాగోలా ఆ రైతుల పెరళ్ళలో చేరి గుమ్మడిపూలు కోసుకొచ్చేవాళ్ళం.
పొరపాటున ఆ ఇంటివారో, వారి పాలేరో చూసి పూలు కోసినందుకు ఎందుకు కసిరేవారో అప్పుడు అర్థమయ్యేది కాదు. తర్వాతెప్పుడో ఇంకొంచెం హెడ్డు పైకొచ్చాక ఆ పూలే కాయలవుతాయని అర్ధమయ్యే టైంకి గొబ్బెమ్మలు పెట్టడం మానేశాం :)
ఇంక గొబ్బెమ్మలు పెట్టే రోజు - అప్పటికి రెండో, మూడో ఫిల్టులు వేసి కుట్టించి ఆరేళ్ళయ్యి - ఒక్కో ఫిల్టు విప్పుకుని ఇప్పటికి సరిపోయిన, ఇంకా కొత్తవాటిల్లా ఫెళఫెళలాడుతున్న నెమలికంఠపు రంగుకి గులాబీ రంగు అంచున్న పట్టు పరికిణి, నెమలికంఠం రంగు జాకెట్టు వేసుకుని, లక్ష్మిదొడ్డ వేసిన ఈతపాయల-రెండు-జడలకీ జడగంటలు వేసుకుని - గొబ్బీయళ్ళో... గొబ్బీయళ్ళో... దుక్కూ దుక్కూ దున్నారంట - ఏమీ దుక్కూ దున్నారంట - రాజావారి తోటలో జామ దుక్కూ దున్నారంట - అంటూ మొదలు పెట్టి
అటవీ స్థలముల కరుగుదమా అన్న పాటలో చల్లని గంధం తీయుదమా - సఖియా మెళ్ళో పూయుదమా - అని ఒకరి మెళ్ళో ఒకరు పూస్తున్నట్లు నటిస్తూ ఆ గిలిగింతకి నవ్వుకుంటూ
సుబ్బీ గొబ్బీమ్మా సుబ్బణ్ణీయవే అనడుగుతూ మొగలీ పువ్వంటి మొగుణ్ణీయవే అని సిగ్గులొలకబోస్తూ (అప్పటికి మొగుడంటే అస్సలేం తెలీకపోయినా...) - మా గొబ్బెమ్మ పెట్టడం అయ్యేది.
వారానికి ఒకరింట్లో - అందరం కలిసి - మళ్ళీ - అదే డ్రెస్సు - అదే ఆట - అదే పాట. ఏం వేసుకున్నామా అన్నది ఎప్పుడూ పట్టింపు లేదు - ఇస్త్రీ మడత వుండి, కలరాఉండల వాసనొస్తే - అవి కొత్త బట్టలే :)
ఈలోగా సంక్రాతిసెలవులొచ్చేవి.
ఎప్పుడైనా సంక్రాంతికి శివకోడులో ఉండడం కుదిరితే - మా భోగిదండలు మేమే చేసుకునేవాళ్ళం - మా చెల్లాయత్త ఆధ్వర్యంలో. గొబ్బెమ్మలు పెట్టడం - గొబ్బెమ్మలని రెండో రోజు వాటికి కేటాయించిన గోడకి కొట్డడం - సరిగ్గా చూసి మధ్యలో చిల్లు పెట్డడం- అవి ఎండేదాకా ఆగడం - ఎండిపోయాక గొబ్బిపిడక విరక్కుండా ఒలవడం - పురికొసకి గుచ్చి దండలు కట్టడం - ఇదీ వరస.
అదే అనాతవరపు సంక్రాంతి అయితే - అద్దెకున్న ఇంటివారికి మా అమ్మ-నాన్న "ఇంటికి వెళ్ళొస్తామండీ " అని చెప్పి - అందరం కలిసి బస్సెక్కి - మేం ముగ్గురం ఒక సీట్లో - వంతులు వేసుకుని - కిటికీ పక్కన కూర్చుని పాటలు పాడుకుంటూ - ఆగిన ప్రతి బస్టాండులో - ఈ బొమ్మ-మాట ఎక్కడుందో కనుక్కో చూద్దాం - అంటూ బస్టాండు గోడలమీద వున్నవన్నీ చదువుకుంటూ - సాయంత్రానికి అనాతవరం చేరేవాళ్ళం - భోగి ముందు రోజుకి.
అప్పటికే ఇంట్లో భోగిదండలు తయారుగా ఉండేవి.
తెల్లవారుఝామున నాలుగు గంటలకు నలుగుస్నానాలు - ఒకరి తర్వాత ఒకరు తయారయి, కొత్తబట్టలు వేసుకుని - భోగిదండలు పట్టుకుని భంగిమలు పెట్టుకుని - శ్రీనన్న ఫోటోలు తీస్తూ ఉంటే - పోటీలు పడి భోగిమంటల్లో దండలేసి - అక్కడే కాసేపు చలికాగి ఇంట్లోకి వచ్చేవాళ్ళం.
ఆ రోజు సాయంత్రం ఇంట్లో చిన్నపిల్లలని కుర్చీలో కూర్చోబెట్టి పోసిన భోగిపళ్లు - పేరంటం.
ఆ కుర్చీ దగ్గరగా కూర్చుని ఏరుకున్న రేగుపళ్ళు, అక్కడక్కడా దొరికిన ఐదు-పది పైసల బిళ్ళలు.
భోగి తర్వాత - పెద్ద పండగ - దండాల పండగ.
ఇంట్లో పెద్దలకి దండం పెడితే దీవెనలతో పాటు డబ్బులిచ్చే పండగ.
నాన్నమ్మ తప్పకుండా మున్సబుగారింట్లో వున్న ఇండియన్ ఓవర్సేస్ బ్యాంకునుంచి కొత్త రూపాయి బిళ్ళలు తెప్పించి మా అందరికీ పదేసి ఇచ్చేవాళ్ళు.
రవన్నకాళ్ళకి దండం పెడితే - జేబులో చెయ్యి పెట్టి చేతికి ఎంతొస్తే అంత ఇచ్చేవాడు. ముందుగా దండమెట్టిన వారికి దండిగా దొరికేది.
అప్ప, నాన్న, సోమేశ్వర్రావు తాతగారు (విస్సుబాబాయి వాళ్ళ నాన్నగారు) - వీళ్ళందరి దగ్గరా దండాలు పెట్టి డబ్బులు తీసుకున్న తర్వాత - పప్పి, కుట్టి, స్వాతి - రెడీగా వుండేవాళ్ళు - నువ్వు మాకన్నా పెద్దదానివి - నీ కాళ్ళకి మేం దండం పెడతాం అంటూ :)
దండాలపండగ అయ్యాక కనుమ రోజుకి శివకోడు ప్రయాణం - పుంతలో ముసలమ్మ తీర్థానికి.
అక్కడ కొనుక్కున్న రంగు కళ్ళజోళ్ళు, చేత్తో తిప్పితే గుయ్-గుయ్ మంటూ తిరిగే గిలక్కాయలు.
చెల్లాయత్త చేసిన గారెలు, ఆవళ్ళు.
ఒంటెద్దు బండిలో రాజోలు విహారాలు - పండగ సరదా అయినవారితో అలా తీరేది.
ఇన్నేళ్ళ తర్వాత - సంక్రాంతి వస్తోంది అంటే -
ఇన్ని వేలమైళ్ళ దూరంలో కూర్చుని
ఒకప్పటి ఉన్న ఊరుని తలుచుకుని
వీలైతే ఇంటి ముందో ముగ్గు వేసుకుని
వీల్లేని చలైతే కంటి ముందు గత-జ్ఞాపకాల-రంగవల్లులల్లుకుని
సంక్రాంతికి ఏమేం కావాలి ... అనుకుంటే - అని తలుచుకుంటే
తట్టినవి - పూలో, పళ్ళో, పాలో, ఇండియన్ స్టోర్లో దొరికే మామిడాకులో, వాట్సాపుల్లో forward-మెసేజులో కాదు -
నెమరేసుకున్న చిన్నప్పటి సరదా-ఆటల జ్ఞాపకాలు - మళ్ళీ పాడుకున్న గొబ్బిపాటలు.
ఆ జ్ఞాపకాలకు ఊతగా - గతించిన సంక్రాంతిని స్వాగతిస్తూ ...
మా చిన్నపాప్పిన్ని, జ్యోతి పిన్ని, చెల్లాయత్త ఆడి-పాడిన గొబ్బిపాట -
దానికి మా నాన్న వేసిన దరువు -
మా అమ్మ గొంతు-కలుపు -
చివర్లో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ చిన్నపాప్పిన్ని
శుభోజ్జయం అంటూ మా తంబి మామయ్య పలుకు ...
28, మార్చి 2017, మంగళవారం
ఉషస్సు ఎటూ లేదు - ఉగాది! నువ్వెక్కడ?
ముసురేసిన ఆకాశం
ముసుగేసిన ప్రకాశం
ఉషస్సు ఎటూ లేదు!
తగులు-మిగుళ్ల నిశిలో చైత్ర పాడ్యమి మసిబారింది
ఉన్నపళాన - నింగి నిచ్చెననెక్కి అందుకోలేని వేప్పూత ఆకాశకుసుమమైంది
తన తర్వాత అందుకోవడానికి విళంబి ఏడాదికావల వేచివుండగా
తనలో చేరిన మునుపెన్నడూ ఎరగని '(హే)మలంబ' ని పోల్చుకోలేక
తన పేరు తానే - ఇల్లలకకుండానే - మర్చిపోయి బిక్కమొహం వేసిన హేవిళంబి -
వెతుక్కోవాలేమో ఇక
ఉగాది! నువ్వెక్కడ?
పంచాంగాల పట్టింపుల్లో
మారు-పేర్ల ఉగాదుల్లో
నీరుకారిన మనసులో
మెరుపులా మెరిసింది
చిరునవ్వు మొలిచింది
ఈరోజు - ఈలాగుండునని
ఆ రోజే - ఊహించి రాశారేమో అనిపించి -
అనుకోకుండానే గుర్తొచ్చిన - కృష్ణశాస్త్రి గారి కవిత
కారుమబ్బు అంచున మెరిసిన తటిల్లత
భావమేదైతేనేం - పొల్లులేని ఆ భాష
నిలిపింది నా మదిన - వెల్లువైన వసంతం
చిరునవ్వు - చిరుజల్లు - కలిసి కురిసి
వెల్లవేయగా - హేవిళంబి ఉగాది - నా సొంతం
14, జనవరి 2017, శనివారం
(సమ్)(సన్)క్రాంతి కబుర్లు
"ఇవాళ సంక్రాంతా?"
"కాదు - భోగి - ఇండియా లో అయిపోయింది కూడా - రేపు సంక్రాంతి"
"ఊఁ "
"..."
అసలే సెయింట్ లూయిస్ లో ఇవాళ Winter Ice Storm alerts వున్నాయి.
Fox News లో వాతావరణ మాంత్రికుడు Dave Murray మహా ఉత్సాహంగా -
అదేదో ఆయనే బూజుకఱ్ఱ పట్టుకుని మబ్బులని మావూరి వైపుకి మళ్లించేస్తున్నట్టు -
అవొచ్చి ఆయన చెప్పిన చోటే కురిసేట్టు -
వర్షం వస్తుందని ఊరందరికీ చెప్పి ఆయన తన సొంత నర్సరీలో గప్-చుప్ గా నీళ్లు పెట్టుకుంటున్న విషయం మాకు తెలియనట్టు -
-----ఇలా రకరకాలుగా ఏంటేంటో మనసులో అనేసుకుంటూ రంగురంగుల మ్యాపులు చూపించేస్తూ - "ఇదిగో! ఇంకేముంది! మీ నెత్తిమీదే ఐసు గడ్డలు పడి మీరు గడ్డకట్టుకుపోతారు, జాగ్రత్త్త!!" - అని పదే పదే - ముందుకీ వెనక్కీ కదులుతూ - పడీ పడీ చెప్తున్నాడు.
ఆరో తరగతి చదివే బుజ్జిజింకకి బడి లేదు -
నిన్నటి గురువారపు సాయంత్రమే - బడినుంచి అమ్మానాన్నలకి చెరో e-mail
ఇద్దరి ఫోన్లకి చెరో SMS
ఇంటి ఫోన్ కి ఒక voice mail -
"మీ పిల్లాణ్ని బడికి పంపించాలని హడావిడి పడి లేవకుండా ఇంకో అరగంట ఎక్కువ పడుకోండొహో"
- అని వరమిచ్చేసిన స్కూల్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్
శీతాకాలపు సెలవులకి ఇంట్లో వున్న అన్నకి ఎలాగూ బడి లేదు - పదహేడు దాకా.
ఇద్దరూ రాత్రి పుస్తకాలు చదువుకుంటూ ఎప్పుడు పడుకున్నారో ఇంకా లేవలేదు.
అమ్మా, నాన్న లేచారు - ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవేమో గానీ - ఇంటినుంచి పని చేసేటప్పుడు - ఒక సాకెట్ లో రెండు లాప్టాప్ ప్లగ్గులు ఇమడక తప్పదు. వాటితో పాటు నాలుగు చెవుల్లో ఇయర్ ప్లగ్గులూ కావాలి ఎవరి - కాన్ఫరెన్స్ కాళ్లు - వాళ్లు ఏ interference - లేకుండా వినడానికి.
ఉద్యోగానికి - సహజ కవచ కుండలాల్లాంటి - ఆ ప్లగ్గులూ, ఇయర్ ప్లగ్గులూ ధరింపజేసి, ధరించి - కార్యోన్ముఖులయ్యేముందు బదరీకి వచ్చిన సందేహం (సన్-దేహం? సమ్-దేహం?) -
" సంక్రాంతి - అంటే అర్థం ఏంటి?"
"అంటే సూర్యుడు మకరరాశిలో సంక్రమణం చేస్తున్నాడని అంటే ప్రవేశిస్తున్నాడని"
"అది సన్-క్రాంతా? సమ్-క్రాంతా?"
"ఎందుకు అది మీకు?"
"అదే - అది సన్-క్రమణమా? సమ్-క్రమణమా?"
"ఏదో ఒకటి - మొత్తానికి 'సం' అది"
"అదే - సన్నా - సమ్మా"
బయటికి చూస్తే ఆకాశం పేద్ద మసకేసిన గాజుముక్కలా - అప్పుడే రాలుతున్న (కురుస్తున్న) ఐసు తుంపర కిటికీల మీద చిన్న చిన్న గాజు తునకలుగా రాలుతున్న శబ్దం.
దారి పొడుగునా సిటీ అధికారులు చల్లుతున్న మంచు కరిగించే - మంచునరిగించే ఉప్పుపోతలు.
డ్రైవ్-వే లో వున్న ఎర్రటి కారుకున్న నల్లటి చక్రం మీద అందంగా పేరుకున్న మంచుర-కత్తుల జాలు - చూడడానికి బావున్నా - ముందున్న చలి-పండగని తలుచుకుని బెంగ-తలపోతలు.
పవర్ పోతుందేమో -
వంట కాదేమో -
చలేస్తుందేమో -
డిష్-వాషర్ గబగబా వేయాలేమో -
కొవ్వొత్తులు తీసిపెట్టుకోవాలేమో -
పవర్ పోతే ఆఫీస్ లో ఇవాళ బోల్డన్ని కాన్ఫరెన్స్ కాల్స్ వున్నాయి miss అవుతానేమో -
ఇన్ని బెంగల మధ్య - ఈ సన్నా - సమ్మా ప్రశ్నలు.
"ఏమో బాబూ - నేనంత ఆలోచించలేదు - వదిలేయండి"
అలా వదిలేస్తే మజా ఏంటి కదా! కొనసాగింది వేరు-కారణ-విశ్లేషణ (root cause analysis) - వేరు మాటే లేకుండా ...
"అసలు సంక్రాతి, సంక్రమణం - word ఆరిజిన్ ఏంటా అని"
"ఏదో ఒకటి - మకర రాశిలో సంక్రమణమనే నాకు తెలుసు - అందుకే సంక్రాతి"
"అయితే - Happy మకర సంక్రాతి - అనే చెప్పాలి కదా - ఎందుకంటే ఇంకో పదకొండు సంక్రమణాలు వుంటాయి కదా - to be specific ?!"
"అబ్బా! ఇప్పుడు ఎవరికి చెప్తున్నారు మీరు? నేనెవరికీ చెప్పలేదు బాబూ - పుట్టినప్పట్నుంచీ చెప్పామా ఏంటి - Happy భోగి, Happy సంక్రాంతి, Happy కనుమ అని - ఇప్పుడు మాత్రం ఎందుకు? మీరేంటి - ఇప్పట్నించీ ప్రతి నెలా ప్రతి రాశి సంక్రమణానికి కూడా చెప్తారా ఏంటి?"
"నేనూ చెప్పట్లేదులే..."
వంటింటి - స్టవ్ ఆఫ్ కి, ఆఫీస్ లాప్టాప్ - లాగిన్ కి మధ్య పరుగు - ice storm పెరిగి పెద్దదయ్యేలోగా అన్ని పనులూ చక్కబెట్టేయాలని.
"మరైతే - ఇప్పటికి వదిలేయండి బాబూ - సన్నో, సమ్మో"
మీసాల చాటునుంచి నవ్వు - నా ఉడుకుమోత్తనం చూసి - "వూరికే అడిగాలే - ఏదో - ఉబుసుపోక కబుర్లు" అని సన్నగా అంటూ.
ఈలోగా తొమ్మిదవ్వడంతో - మా ఇద్దరి - కబుర్లు కట్టు - ఆఫీస్ కాల్ మొదలుపెట్టు...
7, ఏప్రిల్ 2016, గురువారం
దుర్ముఖి ... అవదా సుముఖి?
శిశిరపు భూమికి రంగులద్దే సరదాలో ఆకుల అలంకారాలు పుడమికి పంచిన చెట్లు మళ్ళీ వివిధ వర్ణ పత్ర, పుష్పాలంకృతలై బంగరపు ఎండల మేలిముసుగులో స్వయంవరం కోసం వేచి వున్న వృక్ష కన్యల్లా వరసగా దారికి అటూ ఇటూ నించుని వున్నాయి.
అప్పటిదాకా చలికి ముడుచుకుని ఇళ్ళ కిటికీల లోంచి వచ్చేపోయే కార్లని లెక్కపెడుతూ రోజులు నెలలలా గడిపిన వాడిన ముఖాలు చిరు దరహాసపు మొలకలతో తలుపులు తెరచి వీధులలో నవ్వుల పువ్వులు పంచుదామని వచ్చి గల గలా మాటల పేరులు అల్లుతున్నారు.
రంగు రంగు సీతాకోకచిలుకల్లా అల్లి బిల్లి ఆటలతో బుల్లి తువాయిల్లా గంతులేస్తూ దారికే పూచిన పూవుల్లా వున్నారు పిల్లలు.
ప్రతీ ఉగాదికీ ఇదే చిత్రం మనసులో
ప్రతీ ఉగాదికీ ఇదే ఆనందం బ్రతుకులో
ఉగాది అంటే నోరారా మాటలే
ఉగాది అంటే చిరు నవ్వుల వెలుగులే
సంవత్సరం లో ఒక్క రోజు ముఖ-పుస్తకం కాక ముఖాలు చూస్తే
ఏడాదిలో ఒక్క రోజు వాట్సాప్ వదిలి మాటలు కలిపితే
పేరుకి దుర్ముఖి అయితే ఏం - ఉగాది పూటైనా అవదా సుముఖి?
శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభకామనలు!!!!
27, ఫిబ్రవరి 2011, ఆదివారం
అనాతవరం సంక్రాంతి - అందమైన జ్ఞాపకం
గుంటూరు-అమలాపురం బస్సు దిగి
గుర్రబ్బండిలో ఇంటికి బయల్దేరితే
అనాతవరం గేటు దగ్గర్నుంచీ
చేతి వూపుతోనే ఊరివారు వేసే కుశలప్రశ్నలు
అవి అన్నీ అందుకుంటూ
మునసబుగారి ఇంటి సందు మలుపు తిరగగానే
బాబిగారొచ్చేస్తున్నారన్న కబురు ఇంటికి చేరుతుంది
దివాణం మెట్లెక్కి అలసిన మొహాలకి నవ్వులద్దేలోగా
"ఆహ! ఆహ! వచ్చారా పిల్లలూ!" అని ఉయ్యాలబల్ల దగ్గర్నుంచి
కళ్ళజోడు సర్దుకుంటూ కచ్చా పోసి కట్టిన చీరలో నాన్నమ్మ పలకరింపు
రేడియోగదిలోంచి చిరునవ్వుతో
వినీ వినిపించకుండా "ఇప్పుడేనా రావడం?" అంటూ వచ్చే అప్ప
"పొద్దున్నే కాకి అరుస్తే అనుకున్నాను - మీరే వస్తారని..."
అని ఇంటి మహాలక్ష్మిలా ఎదురొచ్చే లలిత దొడ్డ
"బాబయ్య, పిన్ని, పిల్లలు వచ్చారు - గుంటూరు నుంచి.
రవికి, శ్రీనుకి శలవు దొరకలేదట - పెద్ద పండగ రోజుకి దిగుతారు
భద్రు, బావగారు రేపు వస్తున్నారు"
అని వీధిలో వాళ్లకి సంబరంగా చెప్పే ప్రసాదు
నాన్న ఎప్పుడు బయటికి వస్తారా అని
ఆతృతగా ఎదురు చూసే బాల్యస్నేహితులు-
సత్తికొండ, శీనప్ప, కన్నప్ప, భూషిబాబు, భాస్కరం, నాగన్నలు
రామరాజుగారింట్లోంచి ఎదురొచ్చి పలకరించే సూరిబాబు, వెంకన్నలు
"కుట్టి! షటిల్ ఆడతావా?" అని అప్పట్నించే కవ్వించే
సత్తికొండగారి రాంబాబు, చంటిలు
పండగకి ఒకరోజు ముందు దిగే లలిత అత్తయ్య, స్వాతిలు
రాగానే "ఎప్పుడెళ్లిపోతారత్తయ్యా" అనడగడం -
వెళ్ళేటప్పుడు లలితత్తయ్య ఇచ్చే డబ్బులకోసం
లల్లి, పప్పీ, కుట్టి, స్వాతిలు చేసిన పొలంలో షికార్లు
లేతచలిలో శివాలయంలో, విష్ణాలయంలో
ధనుర్మాసపు పూజలు
నెలపట్టిన సందడిలో ఇంటిముందు వేసిన ముగ్గులు
లల్లి ముగ్గు పోత బావుంది అంటే పొంగిపోయి వేసిన ముగ్గులతో
ముస్తాబైన అనాతవరం రాజుల లోగిళ్ళు
"పిల్ల ముగ్గులేసి నలిగిపోతోందంటూ " ముద్దుగా విసుక్కున్న నాన్నమ్మ ప్రేమలు
ఆ ముగ్గులలో పెట్టిన గుమ్మడిపూల సొగసుల గొబ్బెమ్మలు
భోగిరోజు ఇంటిముందు వేసిన భోగిమంటలో
భోగిదండలతో పాటు వేసిన వెనకవీధినుంచి దొంగిలించిన పెరటి తలుపులు
ఇంట్లో చంటి పిల్లలకి పోసిన భోగిపళ్ళలోంచి ఏరుకున్న పైసలు
పెద్దపండగ రోజు "దండాల పండగ" అని
పెద్దలందరికీ దండాలు పెట్టి దండుకున్న డబ్బులు
బాంకులోంచి తెప్పించి నాన్నమ్మ మనవలకి పంచిన పది కొత్త రూపాయి కాసులు
సంక్రాంతి సాయంత్రం "సుబ్బీ గొబ్బెమ్మా! సుబ్బడ్నీయవే!" అని ముసిముసిగా నవ్వుతూ
తట్టిన గొబ్బిపాటలు - తర్వాత ప్రసాదంగా తిన్న శనగల పాఠోళి
కనుమనాడు అల్లంపచ్చడితో తిన్న మాషచక్రాలు
సాయంత్రం రెండెడ్ల బళ్ళలో వెళ్ళిన మురమళ్ళ ప్రభల తీర్థం
కొనుక్కున్న రంగు కళ్ళజోళ్ళు
ఇంతలో గొడవలకి పగిలిన గోళీసోడాబుడ్లు
బెదిరిన రెండెడ్ల బండిలో
బింకంగా వున్న ఫ్రం-హైదరాబాద్ సిటీ-కొత్త అల్లుళ్ళు
"భయపడకండి - ఇవన్నీ మామూలే బావగారూ" ఆరిందాలా ధైర్యం చెప్పిన చిట్టిమరదళ్ళు
ఆడుతూ పాడుతూ ఇంటికి చేరిన పిల్లబ్యాచులు
ముక్కనుమనాడు ప్రయాణం కూడదంటే
విరిసే పిల్లల మొహాలు
ఆరోజు తులసికోట దగ్గర అమ్మ వేసే జడతో పాటు
ఇంకోరోజు వుంటే బాగుంటుందని లల్లి పెట్టే మెలికలు
స్కూల్ పోతుందమ్మా మళ్ళీ వేసంగిలో వద్దువుగాని
అనే నాన్నమ్మతో పాటు సాగనంపే పాకపక్కన నేవేసిన చేమంతిమొక్కలు
తడిసిన కళ్ళతో - నేవెళ్ళనంటూ ఎన్నిసార్లు పంపినా
తలుపు చాటున నక్కే ఇంటి ఆడపడుచు అమ్మవారి గరగలా-
వదలలేక వదలలేక
మళ్ళీ రాబోయే వేసవి శలవులని తలుచుకుంటూ
మళ్ళీ అమలాపురం-గుంటూరు బస్సు ఎక్కే బాబిగారి ముగ్గురాడపిల్లలు....
5, ఫిబ్రవరి 2011, శనివారం
రథసప్తమి
తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం.
రథసప్తమి మన ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడి పుట్టిన రోజు. మాఘ మాసం లో శుద్ధ (శుక్ల) సప్తమి నాడు వస్తుంది ఈ పండగ. ఈ 2011 లో ఫిబ్రవరి 10 వ తారీఖున రథసప్తమి వచ్చింది.
మా చిన్నప్పుడు రథసప్తమికి ఒక రోజు ముందు హడావిడి మొదలయేది. ఇంటి చుట్టు పక్కల జిల్లేడు చెట్లు వెతుక్కుని వెళ్లి చాల జాగ్రత్తగా ఆ ఆకులు కోసి తెచ్చేవాళ్ళం. ఎంతవరకూ నిజమో తెలీదు కానీ జిల్లేడు పాలు కళ్ళలో పడితే కళ్ళు పోతాయి అనే భయం వుండేది. అందుకే ఆ చెట్టుని ఎక్కువ బాధించకుండా లెక్క పెట్టి మూడు ఆకులు- నాకు, పప్పీకి, కుట్టికి సరిపోయేలా కోసుకుని వచ్చేవాళ్ళం. అప్పటికే అమ్మ రేగు పళ్ళు కొని వుంచేది. మేము అద్దెకి వుండే కరణం గారి ఇంట్లో చిక్కుడు పాదుకి వున్న చిక్కుడు కాయలు, చిక్కుడు ఆకులు అన్నపూర్ణమ్మ గారిని (ఈవిడ కరణం గారి భార్య) అడిగి కోసుకుని వచ్చేస్తే 'హమ్మయ్య... రేపు రథసప్తమికి కావలసినవి అన్నీ వున్నాయి' అని ఆ రేపటి కోసం ఎదురు చూస్తూ నిద్ర పోయేవాళ్ళం.
రథసప్తమి రోజు ప్రొద్దున్నే లేచి జిల్లేడు ఆకులలో రెండు రేగు పళ్ళు పెట్టుకుని అవి తల మీద పెట్టుకుని "కాకి! నీ రూపు నువ్వు తీసుకుని నా రూపు నాకిచ్చేయి" అని స్నానం చేసేవాళ్ళం. శీతాకాలంలో ఒళ్ళు పగిలి కొంచెం ఎలాగైనా వడిలినట్లు అవుతుంది. రథ సప్తమి రోజు రాబోయే వసంతానికి ఆహ్వానం అలా పలికే వాళ్ళమన్నమాట.
స్నానం అయ్యాక మేము గొబ్బెమ్మలు పెట్టిన ఆవు పిడకలతో ఆరు బయట చిన్న పొయ్యి చేసి దాని మీద తళతళలాడే ఒక గుండు ఇత్తడి గిన్నె పెట్టి ఆవు పాలతో మా అమ్మ బియ్యం పరమాన్నం చేసేది. ఆ ఆవు పిడకల పొయ్యి పక్కనే చిక్కుడు గింజలు, ఈను పుల్లలతో రథం చేసి ఆ రథానికి జండాలాగా ఒక చిక్కుడాకు పెట్టేది. అది సూర్యుడి రథం అన్నమాట. బియ్యం పరమాన్నం ఉడికాక - సూర్యుడికి నైవేద్యం పెట్టి - వేడివేడిగా చిక్కుడాకులలో పెట్టి మా ముగ్గురికీ ఇచ్చేది. అలా ప్రతి ఏడాది రథ సప్తమి కూడా ఒక పండగలా జరిగేది.
ఇప్పుడు ఆలోచిస్తే అలాంటి చిన్న చిన్న ఆనందాలని ఎంత మిస్ అవుతున్నామో కదా అనిపిస్తుంది. ఒక వేళ పిల్లలకి తెలుస్తుంది మన పండగల గురించి అనుకుని చేద్దామన్నా ఏంటో అంతా సిములేటేడ్ పండగలా అనిపిస్తుంది కాని మనసుకి హాయిగా వుండదు. అలా ఎందుకు అనిపిస్తుందంటే ఇక్కడ జిల్లేడు ఆకులు, రేగు పళ్ళు, చిక్కుడు ఆకులు దొరకవు.వాటి బదులు ఏవో వాడాలి. అలా చేస్తే అది సిములేటేడ్ గానే అనిపిస్తుంది కానీ పండగ చేసిన ఫీలింగ్ రాదు.
ఈసారి నుంచి కనీసం నా ఈ కథని సుహాస్ కి, కిరణ్ కి చెప్పడం అనే ట్రెడిషన్ మొదలు పెడతాను.
అందరికీ రథసప్తమి శుభాకాంక్షలతో ...
~లలిత
