28, జులై 2019, ఆదివారం

మనసే జతగా పాడిందిలే - 16 - కవలపాటలు - మళై తెచ్చు తమిళ మేఘాన్ని మోసుకొచ్చిన తెలుగు చిరుగాలి

పిలిచే చోట పిల్లలూ, కొలిచే చోట దైవమూ ఉంటారని అంటుంది అమ్మ.
దానికి కొనసాగింపూ, నాదైన మాటొకటి అంటింపూ - పలికే చోట పాట ఉంటుందని.
అది నిజం!

చిన్నప్పట్నుంచీ ఇప్పటిదాకా కొన్ని వేల పాటలు వినుంటాను. ఇంకా వింటూ వున్నాను. ఇక మీదట వింటూనే వుంటాను.

అన్ని పాటల్నీ అన్నివేళలా మోసుకు తిరగలేను కాబట్టి తడవకో పది పాటల్ని వేళ్ళ మీద లెక్కించుకుని, పలువరసల మీటల మోగించుకుంటూ, పెదవుల మీదెక్కించుకుని, పూటకో పది పాటలుగా, మరీ నచ్చితే ఒకే పాట పదేపదే పది పూటలుగా పాడుకుంటూ, పలుక్కుంటూ పాటని నాతో పట్టి వుంచుకుంటుంటానని అనుకుని మురుస్తానే కానీ ఎక్కడో ఏదో పాటని ఆదమఱపున వదిలేసే వుంటాను.

నే పలకలేదని ఆ పాట అలిగే ఉంటుంది. అమ్మ పట్టించుకోలేదని అలిగిన బుజ్జిపాపాయిలా ఏ మఱపు తెరల మాటునో దోబూచులాడుతూ ఆదమరచి అక్కడే ఉండిపోయుంటుంది.

నే పలకలేదని అలిగిన పాట ఎన్నాళ్ళో అలాగే ఉండిపోదు.

గానే గానే పే లిఖా హై సున్‌నేవాలే కా నామ్ అని కదా నా పలుకుబడి?!

ఎలాగోలా నన్ను వెతుక్కుంటూ వస్తుంది. "నేన్నీకు గుర్తున్నానా?" అని పలకరించాలనుకుంటుంది కానీ నేను పలకడం మరిచానని అలిగింది కదా - తనంతట తను నా దగ్గరికి రావాలంటే  బెట్టన్నమాట!

అందుకని ఏం చేస్తుందంటే నాలాంటి పాటిష్టులింకెవరున్నారా అని వెతుకుతుంది.తనని ఇష్టంగా పట్టుకున్న వాళ్ళ చేత  "ఇదిగో..ఈ పాటుంది చూశారూ?!" అని నాతో ఓ మాటనేలా చేస్తుంది. మళ్ళీ నాకు చిక్కేస్తుంది. నాతో నేస్తు కట్టేస్తుంది.

అదుగో...అలా నన్ను వెతుక్కుంటూ వచ్చిన పాటే... పయనించే ఓ చిరుగాలీ! 


అసలు పాట:

తమిళ సినిమా: మనిదరిల్ ఇత్తనై నిరంగళా?
తమిళ పాట రాసినవారు: కణ్ణదాసన్
తమిళ పాట కట్టినవారు: శ్యామ్
తమిళ పాట పాడినవారు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ
తమిళ పాటకి నడుస్తూ పెదవులు కదిపినవారు: మురళీమోహన్
తమిళ పాటకి నడకలో పదములు మాత్రం కదిపిన వారు: శ్రీదేవి


మొట్టమొదటగా చెప్పుకోవాల్సిందేంటంటే ఈ తమిళ సినిమా పేరు మనిదరిల్ ఇత్తనై నిరంగళా? (ఒక మనిషిలో ఇన్ని రంగులా?) , అందులో మళై తరుమో ఎన్ మేఘం? (ఈ మేఘం వర్షాన్ని తెస్తుందా?) అంటూ మొదలయ్యే పాట నాకు భలే పొయెటిక్‌గా అనిపించాయి.

"ఎనక్కు కొంజెం కొంజెం తెరియుమ్" అంటూ కూడబలుక్కుని పలికే నాకు అంత మాత్రం తమిళం అర్థమయిందీ అన్న ఆనందం ఓ పక్కా, ఆ పదాల అందం ఇంకో పక్కా  ఎప్పుడెప్పుడు ఈ పాట గురించి రాసి అట్టేపెట్టుకుందామా అనిపించేలా చేశాయి. అందుకే ఈ పూటకిలా నా రాతలో ఈ పాట కిలకిలా!

తమిళ పాట నా రాతలో రాస్తే ఏ చెలువైన మాటైనా పొల్లవుతుందేమోనని నా భయం. అందుకే ఇప్పటికి చూసి, విని ఆనందించండి. ముందెప్పుడో నేను ఇంకా కొంజెం తమిళం నేర్చుకున్నాక మళ్ళొచ్చి ఆ పాటా రాస్తా.






సిసలు పాట:

తెలుగు సినిమా: పట్నంపిల్ల
తెలుగు పాట రాసినవారు: వేటూరి సుందరరామ మూర్తి
తెలుగు పాట కట్టినవారు: చక్రవర్తి 
తెలుగు పాట పాడినవారు: జి. ఆనంద్, ఎస్పీ శైలజ
తెలుగు పాటకి నడుస్తూ పెదవులు కదిపినవారు: మురళీమోహన్
తెలుగు పాటకి నడకలో పదములు మాత్రం కదిపిన వారు: శ్రీదేవి


ఏమాటకామాట చెప్పుకోవాలంటే అసలు పాట పాడిన ఎస్పీబీ పాట కన్నా జి. ఆనంద్ గొంతు లోనే ఈ పాట అందంగా వినిపించింది నాకు.

అపురూపంగా పాడే అవకాశం దొరికితే జి. ఆనంద్ ఎంత ప్రాణం పెట్టి ఈ పాట పాడుంటారు కదా! అని కూడా అనిపించింది. ముఖ్యంగా తమిళ పాట మొదటి లైనులో "మళై తరుమో ఎన్ మేఘం?" అనడుగుతున్న ఎస్పీబీ సందేహం కన్నా తెలుగు పాటలో "పయనించే ఓ చిరుగాలీ!" అంటూ జి. ఆనంద్ చేసిన విన్నపం వినసొంపుగా వుంది. పైగా పాటలో కనిపించిన పల్లెటూరి వాతావరణానికి జి, ఆనంద్ గొంతులో వున్న ఓ subtle rustic tinge చాలా చక్కగా సరిపోయింది.

పాట మధ్యలో గొంతు కలిపిన శైలజ కూడా చాలా హాయిగా వినిపించింది. ఆ గొంతు వింటే గాల్లో తేలుతున్నట్లుగా అనిపించింది.

ఇక పాటలో కనిపించిన తమిళ అడ్డ లుంగీ కట్టుకున్న మురళీ మోహన్, తమిళ అడ్డబొట్టు పెట్టుకున్న శ్రీదేవిల గురించి చెప్పుకోవడానికి ఆట్టే ఏమీ లేదు కానీ బావున్నారు. పాటంతా నడుస్తూ పాటని నడిపించారు.

ఇన్నేళ్ల తర్వాత గుర్తొచ్చిన, ఇంతగా నాకు నచ్చిన తెలుగు పాట ఇదిగో, ఇక్కడ మీకోసం - చూచుటకు, చూస్తూ పాడుకొనుటకు!




పయనించే చిరుగాలీ!
నా చెలి సన్నిధికే చేరీ...
నా పిలుపే వినిపించాలీ
నా ప్రేమే తెలపాలీ
వలపుల పూలవాన జల్లే కురియాలీ...

ఆ హ హా ... ఓ హొ హో ... ఊఁ ఉ ఊఁ...

అందమంతా ఆరబోసి ఆ చిన్నది
అందకుండా కందకుండా పోతున్నది
అందమంతా ఆరబోసి ఆ చిన్నది
అందకుండా కందకుండా పోతున్నది
మనసున మోహం రేపి మాటాడకున్నది
జవరాలి అందం వేసేను బంధం
జవరాలి అందం వేసేను బంధం
క్షణమైన ఆగలేనని చెలితో తెల్పవా?

పయనించే చిరుగాలీ!
నా చెలి సన్నిధికే చేరీ...
నా పిలుపే వినిపించాలీ
నా ప్రేమే తెలపాలీ
వలపుల పూలవాన జల్లే కురియాలీ...

ఆ హ హా ... ఓ హొ హో ... ఊఁ ఉ ఊఁ...

గుండెలోన ప్రణయదేవి కొలువైనది
నిండువలపు స్వీకరించే తరుణం ఇది
గుండెలోన ప్రణయదేవి కొలువైనది
నిండువలపు స్వీకరించే తరుణం ఇది
ఏకాంత సమయం లోనా ఈ మౌనమేలా?
నా లోన రేగే మోహాల జ్వాల
నా లోన రేగే మోహాల జ్వాల
మనసారా ఏలుకొమ్మని చెలితో తెల్పవా?

పయనించే చిరుగాలీ!
నా చెలి సన్నిధికే చేరీ...
నా పిలుపే వినిపించాలీ
నా ప్రేమే తెలపాలీ
వలపుల పూలవాన జల్లే కురియాలీ...

ఆ హ హా ... ఓ హొ హో ... ఊఁ ఉ ఊఁ... 


నా మీద అలిగి, నన్ను వదిలి ఎక్కడో దాగి, ఇంకెక్కడో తిరుగుతున్న ఈ పాటని మళ్ళీ నాగ్గుర్తు చేస్తూ, ఇదే పాట తమిళంలోనూ, తెలుగులోనూ ఉందని చెప్పి, నా కవలపాటల సరణికి ఇంకో మంచి పాటల సరాన్ని చేర్చే వీలు కల్పించిన మా ఆత్మీయ నేస్తం, మా సాటి పాటిష్టు, ఓ మంచి గిటారిస్టు గిరిరాజ్‌కి బోల్డన్ని పాటాభినందనలు, పాటాభివందనాలు! (సమాసాలు దుష్టైనా, పాటల మీద నా ఇష్టాన్ని చూసి మన్నించేయండేం?!)

 ~ పాటల భైరవి


19, జులై 2019, శుక్రవారం

త్వామనురజామి - 38 - రూఠియే న, నాన్నా! ఆప్ యూ రూఠియే న!


కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 37 - సాయంత్రానికి ఏమి జరుగునో...



శ్రావణ భాద్రపదాలు వర్షఋతువు - వర్షములు విశేషముగా ఉండును.
చిన్నప్పుడు ఎక్కాల పుస్తకంలో చదువుకున్న ఋతువుల వర్ణన అది.
బెంగుళూరులో మబ్బులు తు. చ. తప్పకుండా పాటిస్తాయేమో ఋతువుల్ని... ఊరు ఊరంతా తలంటోసుకుని - తార్రోడ్లు నల్లగా నిగనిగలాడుతూ, చెట్ల ఆకులు పచ్చగా తళతళలాడుతూ, కొమ్మల విరిసిన రంగురంగుల పూలు కళకళలాడుతూ - శ్రావణ మాసపు పేరంటాలకి ముస్తాబు చేసుకుని మెరిసిపోతూ ఉండేది.

పొద్దున్న అమ్మా, నేనూ గుడికి వెళ్ళొచ్చేటప్పటికి అప్పటి దాకా ఎండ మండించిన సూరీణ్ణి మూసేస్తూ మబ్బులు...ఆ వెనకనే బడొదిలి పెట్టగానే బూట్లు టకటకలాడించుకుంటూ, ఖాళీ టిఫిన్ డబ్బాలు డబడబలాడుతూ  గబగబా ఇంటికి పరిగెట్టే పిల్లల్లాగా ఫెళఫెళ ఉరుములు, తళతళ మెరుపులతో బోల్డన్ని చినుకులు - ఇంకేముంది ఓ   పెద్ద వాన.

అసలే బెంగుళూరు మధ్యాహ్నం - అందులోనూ చల్లగా వుంది - ఆ పైన వాన కురిసింది. బద్ధకం నేనొచ్చాలే నీకు తోడంది. ఇంకేముంది... నా చేతి లోంచి  పుస్తకం కిందకి, నేనేమో నిద్ర లోకి ఒకేసారి జారాము. సాయంత్రం నాలుగింటికో ఏమో అమ్మ లేపుతుంటే కళ్ళు విడవే! వాటికీ పగలో, రాత్రో తెలియని అయోమయమేమో... అలవాటు లేని చలవ-ఝాముకి పగటికలలు, రాత్రికలలు అన్నీ కనేసుకుంటూ బిజీగా ఉన్నట్టున్నాయి. తెరవమంటే కుదరదని మొండికేశాయి.

ఇంతలో అమ్మ నెమ్మదిగా "లే! లల్లీ... లేచి మొహమదీ కడుక్కుని రా.  జడ వేస్తాను.  పాలు కలిపిస్తాను" అంటూ తడుతోంది.

అమ్మ గొంతు వినగానే చటుక్కున లేచాను. ఆవిడ చెప్పినట్లే బుద్ధిగా జడ వేయించుకుని, దానికి ఎప్పట్లా చివర్న నల్లరిబ్బను అల్లుకుని పైక్కట్టుకోకుండా ఓ రబ్బర్ బాండ్ పెట్టుకున్నాను. ఆ తర్వాత పాలు తాగి ఎవరితో ఏం మాట్లాడాలో అర్థం కాక మళ్ళీ సోఫాలో ఓ పక్కక్కూర్చుని బుక్ చదువుదామని తీసుకున్నాను. కానీ చదవాలనిపించలేదు. అంతకు మించి మంచి excuse లేదు కాబట్టి చదివిన పేజీనే పదిసార్లు ఒక్కో సెంటెన్సులో a, an, the ఎన్నిసార్లు వస్తున్నాయి, వాటికేదన్నా pattern ఉందా అంటూ ఏదో పనిలేని పజిల్ ఒకటి నాకు నేనే అడిగేసుకుని లెక్కలేసేస్తున్నాను. నాకు లోపలంతా ఒకటే గాబరా. అప్పటికప్పుడు బయటికెళ్ళిపోయి విజయనగర్ రోడ్లన్నీ తిరిగి రావాలనిపించింది. ఆ మాట బైటికంటే ఇంకేమన్నా ఉందీ? మా అమ్మ నన్ను మళ్ళీ సంస్కృతంలో తిడుతుంది. అందుకని కంగార్లూ, గాబరాలూ వగైరావగైరాలన్నీ పక్కకి పెట్టి సైలెంటుగా కూర్చున్నాను.

ఐదూ, ఐదున్నర అవుతుండగా శ్రీను, నాన్న వెళ్లి ఇంటి గేటు దగ్గర నించున్నారు. ఓ పది నిముషాల్లో "బావున్నారా?" అంటూ పలకరింపులు, "రండి. రండి" అంటూ ఆహ్వానాలతో హడావిడి మొదలయింది. పెద్ద సుందరి పిన్ని, బాబయ్య, వాళ్ళతో వచ్చిన ఇంకొకతను - ముగ్గురినీ దగ్గరుండి శ్రీను, నాన్న లోపలికి తీసుకొచ్చారు.

అమ్మ, శ్యామల కూడా వచ్చిన వాళ్ళు ముగ్గురినీ పలకరించి "మంచి నీళ్లు కావాలా? కూర్చోండి " అంటూ సోఫాలు చూపించారు.

సుందరిపిన్ని నన్ను చూస్తూనే "జ్ఞాపకం ఉన్నానా? అప్పుడో సారి మీ శ్రీనన్న జయనగర్లో మా ఇంటికి తీసుకొచ్చాడు. పేరూర్లో శ్రీను పెళ్ళికి నువ్వు, నేను, ప్రశాంతి పల్లకి ఊరేగింపులో కలిసి తిరిగాము" అంటూ చనువుగా మాట్లాడుతూ ఇంతకు ముందు మేమెక్కడెక్కడ కలిసిందీ ఇష్టంగా గుర్తు చేసుకున్నారు. నేను కూడా మొహమాటంగా నవ్వి వాళ్ళ ఇద్దరమ్మాయిలు - కాము, ప్రశాంతిల - గురించి అడిగాను.

ఆ తర్వాత ఇంకేం మాట్లాడాలో తోచక నా చేతిలో వున్న పుస్తకం అట్ట కేసి చూస్తూ దాని డైమెన్షన్స్ మనసులో ఎస్టిమేట్ చెయ్యడం మొదలుపెట్టాను. ఏమీ లేదు... ముందు ఏం జరగబోతోందో, దాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకంతగా క్లారిటీ లేదు. అందుకే అటూ, ఇటూ పరిగెడుతూ అడ్డదిడ్డంగా ఆలోచిస్తున్న నా బుర్రని కొంచెం కంట్రోల్లో పెడదామని ఆ తిప్పలు అంతే ... అంతే!

ఈలోగా కాఫీలు తాగుతూ, పకోడీలు పలారం చేస్తూ, కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటూ ఓ అరగంట గడిచింది. అవీ, ఇవీ, అన్నీ అయ్యాక నాన్న నాకేసి చూసి "లల్లీ! తనేదో నీతో మాట్లాడాలంటున్నాడు. చగ్గా ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుకోండి సరదాగా" అన్నారు ఏదో చులాగ్గా తేల్చేస్తున్నట్లు.

సరే! మాటలేగా! అవెలాగూ నాకు బానే ఒచ్చుగా! మా అమ్మ కూడా అంటూ వుంటుందిగా - "నీకు చిన్నప్పుడు వసెక్కువ పోసినట్టున్నాం" అని! నా ప్రాజెక్టుల కోసం ఎలిసిటేషన్లు, ఇంటర్వ్యూలు చేసినట్లే ఇది కూడా - ఇలా నాకు నేనే చెప్పుకుంటూ వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను. నాతో మాట్లాడాలనుకున్న తను కూడా వచ్చి నాకెదురుగా వున్న కుర్చీలో కూర్చున్నాడు.

కుర్చీలో వెనకాల చిక్కుకున్న జడని తప్పించుకుంటున్నట్టు ఓ పక్కకి ఒంగి ఇంట్లో వున్న మిగిలినవాళ్ళందరూ ఏం చేస్తున్నారా అని చూస్తే వాళ్ళు ఇంటి గడపకి అవతల గేటు దగ్గర నించుని మాటలతో గలగల్లాడుతూ, నవ్వులతో కిలకిల్లాడుతున్నారు.

హ్మ్! చూద్దాం! ఎలా జరుగుతుందో మా మాట్లాట! పేర్లు ముందే తెలుసు కదా - పూర్తి పేర్లు కాకపోయినా ఇంట్లో పిలుచుకునే ముద్దుపేర్లు - అందుకని పేరేంటంటే పేరేంటని అనుకోలేదు.

మా వింటర్వ్యూ మొదలు.

నేను గట్టిగా అనుకున్నా - నన్నేమడిగినా సరే  - రెండు మార్కుల ప్రశ్నకి ఐదు మార్కుల సమాధానంలా కాక - ఒక్కటంటే ఒక్క మార్కొచ్చే బిట్టు పేపర్లా ఏన్సర్ చెయ్యాలని.

“ఏం చేస్తున్నారిప్పుడు?” మొదటి ప్రశ్న నాకే. 

“MCA ఫైనలియర్ ప్రాజెక్ట్ కోసం వచ్చాను. రేపు థర్డ్ నుంచి NAL లో మొదలవుతుంది.” నా స్టూడియస్ సమాధానం బిట్టు పేపర్ ఒట్టుని పక్కన పెట్టి.

“ఎందులో?” మళ్ళీ ఇంకో ప్రశ్న నాకు.

“అంటే?” NAL లో అన్నాక ఇంకా 'ఎందులో' ఏంటి? అనుకుంటూ ప్రశ్నకు సమాధానంగా నా ప్రశ్న. 

“అదే, ఏ లాంగ్వేజ్ లో?”

“సి++” బ్యాక్ టు బిట్టు పేపర్.

“హ హ హ”

“ఎందుకు నవ్వుతున్నారు?” ఉక్రోష-ప్రశ్న.

“ఏం లేదూ, మా ఆఫీసులో నేను ఇంటర్వ్యూలు చేస్తూ వుంటాను. ఇదిగో ఇలాగే మీలాగే C ఒచ్చూ, ఇంకోటొచ్చూ అనుకుంటూ వస్తారు. తీరా ఓ రెండు ప్రశ్నల తర్వాత తెలుస్తుంది చెప్పినంత ఏదీ రాదనీ” ఓ బ్లాంకెట్-స్టేట్మెంట్ ఇంటర్వ్యూల్లో సమాధానాల గురించి.

“నేనెప్పుడూ ఇంటర్వ్యూలకి వెళ్ళను. వెళ్ళినా నాకు రానిదాన్ని ఒచ్చని చెప్పను.”

“అదేం? MCA చదువుతున్నారు.  ప్రొఫెషనల్ కోర్స్. ఉద్యోగం చేయరా?”

“నాకు ఒకళ్ళు చెప్పే మాట వినడం అలవాటు లేదు. ఉద్యోగం నా ఒంటికి పడదు." కచ్చితంగా చెప్పాను.

“అంటే, ఎవరి మాటా వినరా?” ఆశ్చర్యం-ప్రశ్న.

“వినను” స్థిర-సమాధానం.

“మీ మంచి కోసం చెప్పినా వినరా?” Poking-ప్రశ్న. 

“ఉహూ!”

“అంటే, ఇదిగో టేబుల్ మీద ఈ నూనెగిన్నుంది. చేయి తగిలితే ఒలికిపోతుంది, జాగ్రత్త అని చెప్పాననుకోండి…” ఇంకా అతని మాట పూర్తి కానే లేదు-

చటుక్కున అందుకుని “చేయి తగిలించి పారబోసి, ఒలికిపోయిన నూనెని - ఇదిగో ఈ స్పాంజ్‌తో తుడిచి క్లీన్ చేస్తాను” అని గబగబా అనేశా పెంకితనంగా.

అంతే ! ఇంక అడిగించుకోవడానికి ప్రశ్నలూ, అడిగి వినిపించుకోవడానికి సమాధానాలు ఏమీ మిగల్లేదు.

ఇద్దరం డైనింగ్ టేబుల్ దగ్గర్నుంచి లేచి ఇవతలికి లివింగ్ రూం లోకి వచ్చాము.  మళ్ళీ అందరం అక్కడే కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకున్నాక శ్రీను, నాన్న వచ్చిన వాళ్ళని పంపించి వస్తామని వెళ్లారు.

ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర అసలా సాయంత్రం జరిగిన విషయాలేవీ మాట్లాడుకోకుండా మరసటి రోజు అమ్మా, నాన్నల గుంటూరు ప్రయాణం గురించి మాత్రమే జరిగింది మా సంభాషణ. ఏం మాట్లాడితే నేనేం హర్ట్ అవుతానో అన్నట్లు చాలా డెలికేట్‌గా ఆ సాయంత్రాన్ని నడిపించిన మా అమ్మకీ, నాన్నకీ ఎంత థాంక్స్ చెప్పుకున్నానో నేను మనసులో.

ఇక ఆ రోజు రాత్రి అమ్మ,నాన్న, నేను గెస్ట్ బెడ్‌రూమ్‌లో పరుపులు వేసుకుని పడుక్కున్నామే కానీ ముగ్గురం చాలా సేపటి దాకా నిద్ర పోలేదు. మాలో ఎవ్వరూ ఇంకా నిద్రపోలేదని మా ముగ్గురికీ తెలుసు. కానీ కదలకుండా మెదలకుండా నిశ్శబ్దంగా వున్నాము. నాకైతే నా ఊపిరి తీసే శబ్దం కూడా బయటికి వినిపించకపోతే బావుణ్ణు అనిపిస్తోంది.

ఇంతలో నాన్న నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టారు... "లల్లీ! నీకెంత చెప్పినా అర్థం కావట్లేదు. ఆ తిరపతబ్బాయి వాళ్ళింట్లో పెద్దకొడుకు. వాళ్ళ నాన్నగారు లేరు. అతని తర్వాత ఇంకా ఇద్దరున్నారు. భాద్యతలెక్కువ. కష్టపడతావ్. నువ్వే ఆలోచించుకో" అని ఆపేశారు.

అంతే! అలా అని పక్కకి తిరిగి పడుకుండిపోయారు. నాన్న గొంతులో కన్సర్న్ తప్ప కోపం వినిపించలేదు.

అమ్మ మాత్రం ఏమీ మాట్లాడలేదు. అమ్మ మౌనంలో బెంగ తప్ప నేనంటే వెగటు అనిపించలేదు.

వాళ్ళిద్దరినీ బాధ పెడుతున్నానని నాకూ తెలుసు ...కానీ ఆ బాధకి లొంగి నా ఇష్టాన్ని కాదనుకుంటే కలగబోయే కష్టాన్ని తలుచుకుంటే...అమ్మో!  దానికన్నా ఎలాగోలా అమ్మా, నాన్నలని ఒప్పించడమే నయం! వాళ్ళు ఒప్పుకుంటేనే ముందుకి సాగడం... దానికెన్ని రోజులూ, నెలలూ పట్టినా ఫర్వాలేదు - అలా అనుకోగానే హాయిగా అనిపించింది...

అలీషాని అడిగో హిందీ పాట అప్పు తెచ్చుకున్నా... మా నాన్న కోపం తగ్గాలని నా మాటల్లో పాడుకుంటూ... పడుక్కున్నా!

రూఠియే న, నాన్నా! ఆప్ యూ రూఠియే న!
జరా సా సోచియే మేరే లిఏ
క్యా కోఈ ముఝ్‌సే హుఈ ఖతా?!

ముఝే వో హర్ కిసీసే ప్యారా హై...
జైసే ఆప్ ముఝే ప్యారే హై !
మై ఉస్‌కే బినా కైసే జీఊంగీ బోలియే!

నహీ హూ ఐసీ మై నాదాన్…
జానే న దూంగీ ఆప్‌కీ షాన్...
జరా తో సమఝియేనా, నాన్నా!  హా భీ కహ్ దే! 

మేరే నాన్నా! దీజియే  మేరా సాథ్!
ఐసే తో న హోనా ఆప్ ఉధాస్
ఆప్‌కో  మేరీ కసమ్!  ముఝే ఐసే న రోకియే !
ఐసే న రోకియే! 

  <<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>

14, జులై 2019, ఆదివారం

కాఫీ విత్ కలిమి - 6 - హింసధ్వని విని ఆయె హంసానంది!



ఒక్కోసారి చెప్పుకోవాలీ అనుకునేవో, చెప్పేసుకోవాలీ అనిపించేవో, అవేవీ కాక ఊసుపోక ఉట్టినే చెప్పుకుందామనుకునేవో మాటలుంటాయి కానీ మాట్లాడే సమయమూ, వీలూ వుండవు - నాకో, నేను మాట్లాడాలీ అనుకున్న ౘనవైన చెలిమికో.

అల్లాంటప్పడు నేనేం చేస్తానంటే వాట్సాప్ వాడుకుంటా...
ఓ పక్కనో కాఫీ కప్పు, ఆరారగా ఆ కాఫీ సిప్పుతో పాటు, ఇంకో పక్క నా ఫోనులో మీట-నొక్కులతో పాట-పంపుల ఏర్పాటు చేసుకుంటా.
అందులోనే మధ్యమధ్యలో గొంతు సర్దుకుంటూ - పాటలతో మాట్లాడుకునే ఆటాడుకుంటా.
ఇందులో అసలు పాటలుంటాయి.
పాటల్లో మాటలు మార్చేసి పాడుకునే కొసరు పాటలూ ఉంటాయి.

కాకపోతే ఈ ఆటలో ఒక్కోసారి అవతలినుంచి బదులు రావడం ఆలస్యమైతే, అటు పక్కనుంచి <రికార్డింగ్> అని కనిపిస్తున్నా కూడా, అదొచ్చేదాకా ఆగలేక,  ప్రశ్నా- జవాబూ నావే అయ్యి రెండుపక్కలా నేనే ఆడే క్యారమ్ బోర్డు ఆటలా ఉంటుంది.

అయినా బావుంటుంది.

నాతో ఈ ఆటాడే చెలిమి-కలిమి కుదురైన రాగతాళభరిత శంకరాభరణం పాటైతే, నేను కుదురెరగని గాలిపాటల బీటన్నమాట.

నా బీటుకి కలిమి చెవికొచ్చు నీలిపన్ను-పోటన్నమాట.



అదెలాగంటే... 



"నీతో మాట్లాడాలనుంది. కానీ టైము లేదు. కొంచెం పనుంది. అందుకని నీకు వీలైతే దీనికి బదులుగా నీ వాయిస్ మెసేజ్ పంపించేం? లేపోతే ఓ పాట పాడి పంపించు. సరేనా?
'ఓ నేస్తం ... పాడవే హాయిగా ... నాకోసం ఈవేళా ... తీయగా ...'  నీ వరసేం బాలేదు అని నన్ను విసుక్కోక ఈ వరసలో వచ్చే అసలు పాటేదో కనుక్కో చూద్దాం!"


<... రికార్డింగ్>
"పైది హింసధ్వని పార్ట్ 1."

<... రికార్డింగ్>  

"నువ్వు బదులు-పాట పాడి పంపించలేదనుకో నీ పాట ... ఇలాగే నే పాటలు పాడి పంపిస్తూ వుంటాను. నీ పాట నాకొచ్చేదాకా నీకీ హింస తప్పదు. నీది హంసధ్వనైతే నాది హింసధ్వని. కాచుకో నీ ఇష్టం మరి... హహహ!"

"నువ్వూ...చాలా తెలివైందానివని అనుకున్నాను. అంటే బోల్డంత అమామయకత్వం వున్న అతి పెద్ద తెలివైందానివని అనుకున్నాను. కానీ నేను పప్పులో కాలేసేశానని  నాకర్ధమయ్యింది. ఎందుకంటే ... ఎవరైనా గానీ నువ్వు పాడి పంపించకపోతే నేనిలాగే పాడి పంపిస్తానంటే, అందులోనూ...నాలాంటిది బదులు పంపిస్తుందా? పంపించేస్తే, మళ్ళీ నువ్వు పంపించడం ఆగిపోతుందేమో అని పంపించను కదా? ఆ మాత్రం నీకెందుకు వెలగలేదూ ?
ఎన్ని పార్టులుంటాయో అన్ని పాటలూ పంపించేదాకా నేనూరుకోను కదా? నాకింకా ఇంకా కావాలంటాను కదా? నీకా విషయం తెల్సు కదా? ఎన్ని పాడతావో పాడు."
 
"హింసధ్వని పార్ట్ 2: 
'దాహమణగిన తత్త్వమెరిగెదనన్న... దాహమేలణగు?
ఆ తత్త్వమేమెరుగు? 
దేహంబు గల అన్ని దినములకును పదార్థ మోహమేలణగు? 
ఆ ముదమేల కలుగూ?    
కడలుడిపి నీరాడగా తలచు వారలకు 
కడలేని మనసుకు కడమ ఎక్కడిదీ?'

ఆ పైది నాకెంతో ఇష్టమైన అన్నమాచార్య కీర్తనలో ఓ ముక్కన్నమాట.

హింసధ్వని పార్ట్ 3:  
'ముందరెరిగిన వెనుక మొదలు మరచెదనన్న .... ముందరేమెరుగు? 
ఆ మొదలేల మరచు? 
అందముగా తిరు వేంకటాద్రీశు మన్ననల కందువెరిగిన మేలు కలనైన లేదు
కడలుడిపి నీరాడగా తలచు వారలకు 
కడలేని మనసుకు కడమ ఎక్కడిదీ?' "

" చాలా పెద్ద coincidence ఏంటంటే బాలకృష్ణప్రసాద్ గారి అన్నమయ్య కృతుల్లోకి నువ్వు పాడిన ఆ కృతి నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా ఆ ట్యూన్, ఆయన పాడిన విధానం చాలా చాలా ఇష్టం. కానీ నాకు పల్లవి తప్ప ఇంకేం రాదు." 
"This is హింసధ్వని పార్ట్ 4: 
'కుశలమా ... ? నీకు కుశలమేనా ? ఇంతసేపు ఆగలేక ఏదో ఏదో పాడాను అంతే... అంతే...' "

"అది నువ్వు హింసధ్వని అనుకుంటున్నావు కానీ నాకది హంసనాదంలా వుంది. అప్పుడేమో నేను హంసానంది అన్నమాట. సరే గానీ...ఇదిగో నీకూ నాకూ ఇష్టమైన అన్నమాచార్యులవారి పల్లవి... 
'కడలుడిపి నీరాడగా తలచు వారలకు కడలేని మనసుకు కడమ ఎక్కడిదీ? 
కడలేని మనసుకు కడమ ఎక్కడిదీ?' "


"పాట పాడమంటే నేను పాడిందే ఓ ముక్క పాడి తిప్పి పంపించడం కాదు. ఓ పే... ద్ద పాట - అంటే పల్లవి, అనుపల్లవి, చరణం పాడి పంపించాలి. అదీ పాటంటే సరేనా? బాలకృష్ణ ప్రసాద్ గారు పాడిన విధానం నచ్చుతుందని మెచ్చుకున్నావ్.  ఏం నాది బాలేదా? హన్నా!"

"ఆ రొంపట్టిన గొంతుతో పట్టిపట్టి పాడుతూ ఎంత తిక్కగా వున్నావ్, పిల్లా?! ఇంకా పాటలు రానీయ్! ఆపేశావేం?"

"ఒకే ఆత్మ ఉంటుంది... రెండు శరీరాలలో... 
ఒకే పాట పలుకుతుంది వేరువేరు గుండెల్లో 
ఒక్కటే దొరుకుతుంది జీవితంలో
అది ఓడిపోదు, వాడిపోదు కష్టసుఖాల్లో..."

<... రికార్డింగ్> 

"అవునూ.... ఇందులో 'ఒక్కటే దొరుకుతుంది జీవితంలో' అనెందుకన్నారో కదా? ఫ్రెండ్షిప్ బోల్డు చోట్ల దొరుకుతుంది కదా? ఒక్కచోటే కాదు కదా? ఆత్రేయ ఎందుకలా రాశారో? ఇప్పటికీ నాకర్థం కాదు. కానీ ఆ ప్రశ్న అడుగుదామని పాడానన్నమాట. 'స్నేహబంధమూ ఎంత మధురమూ..చెరిగిపోదు కరిగిపోదు జీవితాంతము' - ఇది ఇంతకు ముందు పాడిన చరణానికి పల్లవన్నమాట ...అందుకే పాడాను."

"ఇంత రాత్రి పూట ఆత్మల గురించి ఎందుగ్గానీ? ముందు పాడిన ఆ ఆత్మల చరణం కన్నా చివరిగా పాడావు చూడూ...  ఆ పల్లవి ముక్క బావుంది 'స్నేహబంధమూ ఎంత మధురమూ..' అంటూ.  ఆ లైను తర్వాత పాట ఎలా ఉంటుంది? నాకు చాలా సినిమా పాటలు అంతగా తెలీవు, ఇళయరాజావి తప్ప. ఈ పాటేదో బావుంది. రేపు వింటా.  సర్లే గానీ... నీకోసం ఏ పాట పాడనూ?"

"నీకు తెలిసిన ఇళయరాజా పాటల్లోదే ఓటి 'అరె ఏమైందీ? ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ' పాడు. అద్సరే నా హింసధ్వని పార్ట్ 1 లో పాట మాటేం చేశావ్? ఏంటా పాట? ఎవరు కట్టారా వరస?"

"మళ్ళీ అదే మాటా? హింసధ్వని కాదూ అన్నానా లేదా? అదీ... చెప్తానుండు...ఇళయరాజా కదా ... 'ఆమనీ పాడవే హాయిగా - మూగవైపోకు ఈ వేళా...' అది చెప్పేశాగా! ఇప్పుడు నువ్వడిగిన పాట పాడుతున్నా విను మరి ! 'అరె ఏమైందీ? ఒక ముక్కుకు రొంపొచ్చి తిక్క పెంచి గుచ్చుతోందీ...' "

"అహ్హహ్హహ్హ... నేనే అనుకుంటే పాటల్ని పాట్లు పెట్టడంలో నన్ను మించిపోయావ్... అసలు ఫోన్ కాల్ కన్నా ఈ వాట్సాప్ ఆట బావుంది కదా! చిన్నప్పుడు అగ్గిపెట్టెలకి దారం కట్టి ఆడుకున్న ఫోనాట గుర్తుకొస్తోంది ఎందుకో."

"నేనా పాట పాడింది నీ గురించే...అదేదో కల్లు తాగింది, ఆపై నిప్పు తొక్కింది, ఆపై తేలు కుట్టింది సామెత లాగా వుంది నీతో వ్యవహారం."

"అవునూ... నీకో సంగత్తెలుసా? కల్లు తాగి, నిప్పు తొక్కి, తేలుకుట్టిన మన పూర్వీకులవారి కన్నా రొంపట్టి, దగ్గొచ్చి, గొంతుపోయిన నేనే డేంజర్. ఇవాళ్టికింక నీ నీలిపన్నుకి  పోటెత్తించనులే! చివరాఖరిగా నీకో పాట- నీకు తెలియని చక్రవర్తి గారి వరసలే ... 'వాట్సాపులోనా వాయిస్ల వానా ... ఆ వాన లోనా మునిగేనా? తేలనా?' ఇదేం పాటో ఈసారి మాట్లాడినప్పుడు చెప్తా... అప్పటిదాకా నీకు నచ్చిన వరసలో పాడేస్కో!" 


"నీ నీలిపన్ను అన్న మాటకి ఓ రెండు వీరతాళ్ళు... Bye!"
"హహ్హహ్హ... నువ్వు నాకిచ్చిన ear-time కి, నీ వీనులకి ... 'ఏమివ్వనూ...నీకేమివ్వనూ?!'  ఇంకోసారెప్పుడైనా ఇలాగే పాట్లాడుకుందాం, Bye!!!" 

చివరాఖరి సిప్పు:
To lighten the heart...
To brighten a day...
Listen to a song!  
~meSayit
 

7, జులై 2019, ఆదివారం

నే...డ్డే చదవండి - 7 - శ్రీవారి ముచ్చట్లు










ముక్కుపుడకెట్టుకుని కాశ్మీరం నుంచొచ్చిన రాధ
కాళ్ళాగజ్జా-కంకాళమ్మా ఆడుకుంటూ ఎగిరొచ్చే ప్రియ 
వీళ్లిద్దరి మధ్యా సితారట్టుకుని ప్రేమ రాకపోకలని రాగాలాపన చేసేసిన గోపీ 
వీళ్లందరి ముచ్చట్లతో దా.నా.రా పేనిన కథ ఏంటో తెలుసుకోవాలంటే... 

 నే...డ్డే చదవండి...
కౌముది మాసపత్రికలో ...
జులై నెల సంచికలో...
ఈ కింది లింక్ దారి వెంబడి నడిచి అలా అలా... 


~ సినీ-మా-లక్ష్మి వ్రాలు