28, జులై 2019, ఆదివారం

మనసే జతగా పాడిందిలే - 16 - కవలపాటలు - మళై తెచ్చు తమిళ మేఘాన్ని మోసుకొచ్చిన తెలుగు చిరుగాలి

పిలిచే చోట పిల్లలూ, కొలిచే చోట దైవమూ ఉంటారని అంటుంది అమ్మ.
దానికి కొనసాగింపూ, నాదైన మాటొకటి అంటింపూ - పలికే చోట పాట ఉంటుందని.
అది నిజం!

చిన్నప్పట్నుంచీ ఇప్పటిదాకా కొన్ని వేల పాటలు వినుంటాను. ఇంకా వింటూ వున్నాను. ఇక మీదట వింటూనే వుంటాను.

అన్ని పాటల్నీ అన్నివేళలా మోసుకు తిరగలేను కాబట్టి తడవకో పది పాటల్ని వేళ్ళ మీద లెక్కించుకుని, పలువరసల మీటల మోగించుకుంటూ, పెదవుల మీదెక్కించుకుని, పూటకో పది పాటలుగా, మరీ నచ్చితే ఒకే పాట పదేపదే పది పూటలుగా పాడుకుంటూ, పలుక్కుంటూ పాటని నాతో పట్టి వుంచుకుంటుంటానని అనుకుని మురుస్తానే కానీ ఎక్కడో ఏదో పాటని ఆదమఱపున వదిలేసే వుంటాను.

నే పలకలేదని ఆ పాట అలిగే ఉంటుంది. అమ్మ పట్టించుకోలేదని అలిగిన బుజ్జిపాపాయిలా ఏ మఱపు తెరల మాటునో దోబూచులాడుతూ ఆదమరచి అక్కడే ఉండిపోయుంటుంది.

నే పలకలేదని అలిగిన పాట ఎన్నాళ్ళో అలాగే ఉండిపోదు.

గానే గానే పే లిఖా హై సున్‌నేవాలే కా నామ్ అని కదా నా పలుకుబడి?!

ఎలాగోలా నన్ను వెతుక్కుంటూ వస్తుంది. "నేన్నీకు గుర్తున్నానా?" అని పలకరించాలనుకుంటుంది కానీ నేను పలకడం మరిచానని అలిగింది కదా - తనంతట తను నా దగ్గరికి రావాలంటే  బెట్టన్నమాట!

అందుకని ఏం చేస్తుందంటే నాలాంటి పాటిష్టులింకెవరున్నారా అని వెతుకుతుంది.తనని ఇష్టంగా పట్టుకున్న వాళ్ళ చేత  "ఇదిగో..ఈ పాటుంది చూశారూ?!" అని నాతో ఓ మాటనేలా చేస్తుంది. మళ్ళీ నాకు చిక్కేస్తుంది. నాతో నేస్తు కట్టేస్తుంది.

అదుగో...అలా నన్ను వెతుక్కుంటూ వచ్చిన పాటే... పయనించే ఓ చిరుగాలీ! 


అసలు పాట:

తమిళ సినిమా: మనిదరిల్ ఇత్తనై నిరంగళా?
తమిళ పాట రాసినవారు: కణ్ణదాసన్
తమిళ పాట కట్టినవారు: శ్యామ్
తమిళ పాట పాడినవారు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ
తమిళ పాటకి నడుస్తూ పెదవులు కదిపినవారు: మురళీమోహన్
తమిళ పాటకి నడకలో పదములు మాత్రం కదిపిన వారు: శ్రీదేవి


మొట్టమొదటగా చెప్పుకోవాల్సిందేంటంటే ఈ తమిళ సినిమా పేరు మనిదరిల్ ఇత్తనై నిరంగళా? (ఒక మనిషిలో ఇన్ని రంగులా?) , అందులో మళై తరుమో ఎన్ మేఘం? (ఈ మేఘం వర్షాన్ని తెస్తుందా?) అంటూ మొదలయ్యే పాట నాకు భలే పొయెటిక్‌గా అనిపించాయి.

"ఎనక్కు కొంజెం కొంజెం తెరియుమ్" అంటూ కూడబలుక్కుని పలికే నాకు అంత మాత్రం తమిళం అర్థమయిందీ అన్న ఆనందం ఓ పక్కా, ఆ పదాల అందం ఇంకో పక్కా  ఎప్పుడెప్పుడు ఈ పాట గురించి రాసి అట్టేపెట్టుకుందామా అనిపించేలా చేశాయి. అందుకే ఈ పూటకిలా నా రాతలో ఈ పాట కిలకిలా!

తమిళ పాట నా రాతలో రాస్తే ఏ చెలువైన మాటైనా పొల్లవుతుందేమోనని నా భయం. అందుకే ఇప్పటికి చూసి, విని ఆనందించండి. ముందెప్పుడో నేను ఇంకా కొంజెం తమిళం నేర్చుకున్నాక మళ్ళొచ్చి ఆ పాటా రాస్తా.






సిసలు పాట:

తెలుగు సినిమా: పట్నంపిల్ల
తెలుగు పాట రాసినవారు: వేటూరి సుందరరామ మూర్తి
తెలుగు పాట కట్టినవారు: చక్రవర్తి 
తెలుగు పాట పాడినవారు: జి. ఆనంద్, ఎస్పీ శైలజ
తెలుగు పాటకి నడుస్తూ పెదవులు కదిపినవారు: మురళీమోహన్
తెలుగు పాటకి నడకలో పదములు మాత్రం కదిపిన వారు: శ్రీదేవి


ఏమాటకామాట చెప్పుకోవాలంటే అసలు పాట పాడిన ఎస్పీబీ పాట కన్నా జి. ఆనంద్ గొంతు లోనే ఈ పాట అందంగా వినిపించింది నాకు.

అపురూపంగా పాడే అవకాశం దొరికితే జి. ఆనంద్ ఎంత ప్రాణం పెట్టి ఈ పాట పాడుంటారు కదా! అని కూడా అనిపించింది. ముఖ్యంగా తమిళ పాట మొదటి లైనులో "మళై తరుమో ఎన్ మేఘం?" అనడుగుతున్న ఎస్పీబీ సందేహం కన్నా తెలుగు పాటలో "పయనించే ఓ చిరుగాలీ!" అంటూ జి. ఆనంద్ చేసిన విన్నపం వినసొంపుగా వుంది. పైగా పాటలో కనిపించిన పల్లెటూరి వాతావరణానికి జి, ఆనంద్ గొంతులో వున్న ఓ subtle rustic tinge చాలా చక్కగా సరిపోయింది.

పాట మధ్యలో గొంతు కలిపిన శైలజ కూడా చాలా హాయిగా వినిపించింది. ఆ గొంతు వింటే గాల్లో తేలుతున్నట్లుగా అనిపించింది.

ఇక పాటలో కనిపించిన తమిళ అడ్డ లుంగీ కట్టుకున్న మురళీ మోహన్, తమిళ అడ్డబొట్టు పెట్టుకున్న శ్రీదేవిల గురించి చెప్పుకోవడానికి ఆట్టే ఏమీ లేదు కానీ బావున్నారు. పాటంతా నడుస్తూ పాటని నడిపించారు.

ఇన్నేళ్ల తర్వాత గుర్తొచ్చిన, ఇంతగా నాకు నచ్చిన తెలుగు పాట ఇదిగో, ఇక్కడ మీకోసం - చూచుటకు, చూస్తూ పాడుకొనుటకు!




పయనించే చిరుగాలీ!
నా చెలి సన్నిధికే చేరీ...
నా పిలుపే వినిపించాలీ
నా ప్రేమే తెలపాలీ
వలపుల పూలవాన జల్లే కురియాలీ...

ఆ హ హా ... ఓ హొ హో ... ఊఁ ఉ ఊఁ...

అందమంతా ఆరబోసి ఆ చిన్నది
అందకుండా కందకుండా పోతున్నది
అందమంతా ఆరబోసి ఆ చిన్నది
అందకుండా కందకుండా పోతున్నది
మనసున మోహం రేపి మాటాడకున్నది
జవరాలి అందం వేసేను బంధం
జవరాలి అందం వేసేను బంధం
క్షణమైన ఆగలేనని చెలితో తెల్పవా?

పయనించే చిరుగాలీ!
నా చెలి సన్నిధికే చేరీ...
నా పిలుపే వినిపించాలీ
నా ప్రేమే తెలపాలీ
వలపుల పూలవాన జల్లే కురియాలీ...

ఆ హ హా ... ఓ హొ హో ... ఊఁ ఉ ఊఁ...

గుండెలోన ప్రణయదేవి కొలువైనది
నిండువలపు స్వీకరించే తరుణం ఇది
గుండెలోన ప్రణయదేవి కొలువైనది
నిండువలపు స్వీకరించే తరుణం ఇది
ఏకాంత సమయం లోనా ఈ మౌనమేలా?
నా లోన రేగే మోహాల జ్వాల
నా లోన రేగే మోహాల జ్వాల
మనసారా ఏలుకొమ్మని చెలితో తెల్పవా?

పయనించే చిరుగాలీ!
నా చెలి సన్నిధికే చేరీ...
నా పిలుపే వినిపించాలీ
నా ప్రేమే తెలపాలీ
వలపుల పూలవాన జల్లే కురియాలీ...

ఆ హ హా ... ఓ హొ హో ... ఊఁ ఉ ఊఁ... 


నా మీద అలిగి, నన్ను వదిలి ఎక్కడో దాగి, ఇంకెక్కడో తిరుగుతున్న ఈ పాటని మళ్ళీ నాగ్గుర్తు చేస్తూ, ఇదే పాట తమిళంలోనూ, తెలుగులోనూ ఉందని చెప్పి, నా కవలపాటల సరణికి ఇంకో మంచి పాటల సరాన్ని చేర్చే వీలు కల్పించిన మా ఆత్మీయ నేస్తం, మా సాటి పాటిష్టు, ఓ మంచి గిటారిస్టు గిరిరాజ్‌కి బోల్డన్ని పాటాభినందనలు, పాటాభివందనాలు! (సమాసాలు దుష్టైనా, పాటల మీద నా ఇష్టాన్ని చూసి మన్నించేయండేం?!)

 ~ పాటల భైరవి


12 కామెంట్‌లు:

  1. మీరు శీర్షికలో పెట్టిన మనసే జతగా పాడిందిలే పాట కూడా చాలా బాగుంటుందండి. మీరు గుర్తు చేయటంవలన ఇవాళ దానిని వెతికి యూట్యూబ్ లో చూశాను. థ్యాంక్స్. మీరు చూడాలనుకుంటే లింక్ ఇదిగో - https://www.youtube.com/watch?v=zTL_OQcTxQ8

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆ పాటకీ ఓ హిందీ కవల వుందండి - ఎప్పుడో రాయాలి దాని గురించి కూడా. పాట షేర్ చేసినందుకు థాంక్సండి!

      తొలగించండి
  2. 😊👌🏻👌🏻 Can never get my head around as to how you find these songs let alone finding the symmetry.

    రిప్లయితొలగించండి
  3. Lalli
    Thoroughly enjoyed this post and thanks for ee song ni Malli vinipinchi nanduku.
    I also liked Anand voice for the song.
    -Uma

    రిప్లయితొలగించండి
  4. ఈ సినిమా పేరు అలాగే పాట కూడా వినలేదు, మంచి కవల పాటలు పరిచయం చేసినందుకు థాంక్స్ లలిత గారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ మంచి పాట మీకు నచ్చినందుకు సంతోషం, పవన్‌గారు!

      తొలగించండి
  5. 'మనిదరిల్ ఇత్తనై నిరంగళా' సినిమాపైన రివ్యూలాంటి ఒక వ్యాసం ఇక్కడ చదవొచ్చు - https://csrags.wordpress.com/2015/02/25/r-c-sakthis-manitharil-ithanai-nirangala/

    రిప్లయితొలగించండి
  6. Lalli Ee paatkann... mee Matale Ee pata vinali annatu chesi... vinipinchayi kuda.... Meeru ila parichayam chestunte... Inka vintuntamu...

    రిప్లయితొలగించండి