27, డిసెంబర్ 2011, మంగళవారం

నచ్చావులే...!!!


డిసెంబర్ నెల విహంగ లో నా వ్యాసం ఇక్కడ చదవండి.


అపూర్వ మిత్రద్వయం "బాపు-రమణ" ల శ్రీ రామ రాజ్యం విడుదలయింది కదా - మళ్ళీ మళ్ళీ పౌరాణికాలు రాబోయాయా-చూడబోయామా అనుకుని  ఒక 45 నిముషాల డ్రైవ్ లో వున్నఒకానొక ధియేటర్ కి వెళ్లి ఆ సినిమా చూసి అక్కడక్కడా లవ-కుశ తో పోల్చుకుని మనసు లో కలగబోయిన అసంతృప్తిని అంతగా లెక్కచేయక ఒక మంచి సినిమా చూశామనేసుకున్నాము. మరుసటి రోజు కలవడానికి వచ్చిన మిత్రులతో మాట్లాడుతుండగా శ్రీ రామ రాజ్యం ప్రస్తావన వచ్చింది. ఎలా వుంది అన్న ప్రశ్నకి తెగ ఉత్సాహపడి ఆ సినిమా లో నచ్చిన సన్నివేశాలు, బాలకృష్ణ నటన, నయనతార ఆహార్యం, అభినయం, లవకుశుల హావభావాలు, ఫోటోగ్రఫి, గ్రాఫిక్స్ గురించి నాదైన ధోరణిలో చెప్పుకుపోతూ వున్నాను. ఆ వచ్చిన వారు నన్ను మధ్యలోనే ఆపేసి - మిమ్మల్ని అడిగాను చూడండి ! అసలు ఆ బాలకృష్ణ నీలం సున్నం వేసుకున్నవాడిలా ఏమన్నా బాగున్నాడాండీ? ఆ ఇళయరాజా సంగీతం అసలు సంగీతమేనా- పాటలు అన్నీ చెడగొట్టాడు. కీరవాణి అయితే పాటలు గొప్పగా ఉండేవి. లవకుశ తో పోలిస్తే పాసు మార్కులు కూడా రావు ఈ సినిమాకి- మీరెంతైనా చెప్పండి- అనేశారు. అంతే! ఇంకేమీ చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. 

వారు "అస్సలు బాలేదు - మీరెంతైనా చెప్పండి" అని  తెల్చేయకుండా ఒక్క మాటైనా  మంచిగా  అంటే - ఏదో బాపు-రమణ కాంబినేషన్ లో ఆఖరి సినిమా, ఎక్కడా ఇంగ్లీష్ మాట-పాట లేని అచ్చ తెలుగు సినిమా, మన సీతారాముల్ని సరికొత్త రంగుల్లో చూపించిన సినిమా అని అనివుంటే మా సంభాషణ ఇంకొంచెం ఆహ్లాదం గా సాగేదేమో! 

అనుకోకుండా ఆ  మిత్ర కుటుంబాన్నే మళ్ళీ ఒక పుట్టిన రోజు పార్టీ లో కలిశాము- మరుసటి రోజే. పలకరింపులు, కుశల ప్రశ్నలు అయాక చుట్టు పక్కల వున్న ఇండియన్ రెస్టారెంట్స్ లో ఏది బాగుంటుంది అన్న మాట వచ్చింది. మేము గత ఆరేళ్లుగా మా పెళ్లి రోజు, పిల్లలపుట్టినరోజులు, ఇంకా ఏమైనా ముఖ్య సందర్భాలలో ఆలోచించకుండా అతి ఇష్టం గా వెళ్ళే ఒకానొక రెస్టారెంట్ పేరు చెప్పాము. వెంటనే " అదాండీ! మీకైతే ఎలా నచ్చిందో కానీండి. ఒకసారి వెళ్ళాము - ఆ ఓనరో, మరెవరోనండీ బొత్తిగా  మేనర్సు లేనివాడిలా వున్నాడు. మధ్యలో వచ్చి "ఈస్ ఎవ్రీతింగ్ ఆల్రైట్" అనడుగుతాడు. అసలు ప్రైవసీ నే వుండదు ఆ రెస్టారెంట్ లో " అనేశారు ఆ కుటుంబ పెద్ద. నిజంగా చెప్పాలంటే  వారు "బొత్తిగా మేనర్సు లేదన్న ఆ ఓనరు" మిగిలిన రెస్టారెంట్లలా  కాక మొదటిసారి ఇచ్చిన రైస్ కానీ, రోటీలు కానీ ఖాళీ అయితే అదనంగా ఛార్జ్ చేయకుండా మళ్ళీ సర్వ్ చేస్తాడు. అక్కడ లభించే పదార్థాలు ఎప్పుడు  తాజాదనం లోనూ, రుచిలోనూ తేడా లేకుండా వుంటాయి. అది దాదాపుగా అందరూ అంగీకరించారు - మా సంభాషణలో పాల్గొన్నవాళ్ళంతా - ఒక్క మా మిత్రులు తప్ప. అసలు రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ తిన్న వాటి గురించి మాట్లాడకుండా సంబంధం లేని ఏదో ఒక రెండు నిముషాలు వచ్చిపోయే ఓనర్  ప్రవర్తన గురించే అయేటప్పటికి ఆ సంభాషణ అంతటితో సరి.

తర్వాత ఆలోచిస్తే అనిపించింది - కొంతమంది చేత ఏదైనా సరే బావుంది అనిపించాలంటే చాలా కష్టం. నలుపంటే ఇష్టం లేదు అంటూ అన్ని రంగులూ కలిస్తేనే తెలుపు అవుతుంది - అంటే తెలుపులో కూడా నలుపు వుంది. అందుకే తెలుపు అంటే కూడా ఇష్టం లేదు అని వాదించి నెగ్గేస్తారు కూడా. 


అలాగే ఇంకొందరు పూర్తిగా విషయం తెలుసుకోకుండా ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు. అది తప్పని తెలిశాక కూడా అంత తొందరగా ఆ అభిప్రాయాన్ని మార్చుకోరు. ఒకసారి నాలుగు కుటుంబాలు కలిసి వారి ఊరికి దగ్గరగా వున్న సముద్రతీరానికి కార్తీక మాసం లో వనభోజనాలకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. అలా అనుకున్న తర్వాత చాలా ఉత్సాహంగా ఎవరు ఏమి వండి తీసుకుని వెళ్ళాలో మాట్లాడుకుని కావాల్సిన వస్తువుల జాబితా వ్రాసుకున్నారు. అందులో ఒకావిడ పులిహోర చేస్తానని చెప్పారు. తీరా ఆ రోజు వచ్చేసరికి అనుకున్న సమయానికి ఆ కుటుంబం నిర్ణీత స్థలానికి రాలేదు. కొంచెం ఎదురు చూశాక అందులో రామన్ అనే ఆయన  "నేను ముందు నుంచే అనుకుంటున్నాను. వీళ్ళిలా హ్యాండ్ ఇస్తారని- ఇలాంటి వాళ్ళతో ఎప్పుడూ పెట్టుకోకూడదు" అని. అది విన్న మరొకరు "అయ్యో! అలా అనకండి. రావుగారెప్పుడూ అందరి కన్నా ముందు వుంటారు. అసలు వాళ్ళ ఇంటికి వెళ్లి వద్దాము - సంగతేంటో తెలుస్తుంది కదా " అని బయల్దేరి వెళ్ళారు. ఆ రావుగారు వెళ్ళిన వారికి వారి ఇంటి గేటు బయటే కనిపించి "అనుకోని ఇబ్బంది వచ్చింది - రాలేకపోతున్నాము. ఏమీ అనుకోకండి" అని చెప్పి పంపించేశారు. తిరిగి వచ్చేదారిలో, మళ్ళీ పిక్నిక్ వెళ్లి వచ్చేదాకా రామన్ గారు ఆ పిక్నిక్ కి వస్తామని చెప్పి , చివరికి రాని రావుగారిని తిడుతూనే వున్నారు. రెండో రోజు ఆఫీసులో ఎవరో చెప్పగా తెలిసింది రావుగారి భార్య తెల్లవారుఝామున చీకట్లో కనపడక మెట్ల మీద జారిపడి కాలు ఫ్రాక్చర్ అయింది - హాస్పిటల్ లో వున్నారని. ఆ సంగతి తెలిస్తే అందరూ పిక్నిక్ మానేస్తారని రావుగారు భార్యని ఆసుపత్రి లో చేర్చి తాను ఇంటి గేటు దగ్గర వీరి కోసం వేచి వున్నారు. అలా కాకపోతే పక్కింటి వాళ్ళ వల్ల తన భార్య కాలు విరిగిన విషయం తెలిసి అందరి ప్రోగ్రాం పాడవుతుందని. ఇది విన్న తర్వాత పికినిక్ కి వెళ్ళిన అందరూ బాధ పడ్డారు - ఒక్క రామన్ గారు తప్ప. ఆయన ఇప్పటికీ పిక్నిక్ కి రావడం ఇష్టం లేకే ఏదో చిన్న దెబ్బ తగిలి  రావుగారి భార్య కాలు బెణికితే దానికి ఫ్రాక్చర్ అని అబద్ధం చెప్పారని అనుకుంటూ వుంటారు - అందరికీ చెప్తూ వుంటారు.

అన్నీ నచ్చాలని లేదు- నచ్చి తీరాలనీ కాదు. కానీ తటస్థ పడ్డ ప్రతీ వ్యక్తిలోనూ, ప్రతీ సంఘటన  లోనూ తప్పులే ఎన్నుకుంటూ పోతే చివరికి మనకి మనమే ఇష్టం లేకుండా పోతామేమో.

ఇక్కడ ఒక చిన్న సంఘటన చెప్పాలని వుంది. ఒకరోజు నేను మా ఏడేళ్ళ బాబుకి లంచ్ టైమ్లో అన్నం, పప్పు కలిపి తినమని ఇచ్చాను. వాడు అది తిన్న తర్వాత పెరుగు అన్నం కలపబోతూ అలవాటు ప్రకారం"ఏం నాన్నా! పప్పూ-ఆమ్ ఎలా వుంది" అని అడిగాను . వాడు ఒక నిముషం నిశ్శబ్దం గా వుండి "అమ్మా! నువ్వు బాగా చేశావు కానీ నాకు నచ్చలేదమ్మా" అన్నాడు. ఆ మాటకి పప్పు బాగా లేదన్నాడని బాధ వేసే బదులు నేనెక్కడ  బాధ పడతానో అని అలోచించి నా ప్రయత్నంగా నేను బాగా వండానని చెప్పాడని మురిసిపోయాను.

మనకి నచ్చని వాటిని పది కారణాలు  వెతికి ఎత్తి చూపేకన్నా నచ్చిన ఒక కారణం చెప్పగలిగితే మన ఇంటర్ - పెర్సనల్ రిలేషన్షిప్స్ పొడి-పొడి మాటలు దాటి స్నేహపూరిత వాగ్జ్హరులు అవుతాయి. 

మనకి పది మంది సన్నిహితులుంటే పదిమందీ మనలాగే ఆలోచించాలి , మనలాగే వుండాలి - అలా అయితేనే మెచ్చుతాము, నచ్చుతారు అనుకుంటే మన పరిధి అంతగా విస్తరించక  కూపస్థ మండూకాల్లా తయారవుతామేమో. 

ఇంట్లో గానీ, ఆఫీసుల్లో కానీ, స్నేహితులు /పరిచయస్తుల్లలో కానీ - ఎక్కడయినా ఎప్పుడయినా ఎవరినీ , ఏ పరిస్థితినీ మనకి తోచినట్టు అంచనా వేయకుండా, వున్నది ఉన్నట్టుగా తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ నచ్చుతారేమో / యేమో కదా! 

ఇంకొద్ది రోజుల్లో 2012 నూతన సంవత్సరం లో అడుగుబెట్టబోతున్నాము కదా....శుభాకాంక్షలతో పాటు 

మొన్న తొడిగిన భూతద్దాలు లేవులే
నిన్న పెట్టుకున్న  రంగుటద్దాలు కావులే
నిన్ను ఎలాగైనా మెచ్చాలనే నా కళ్ళులే
నిన్ను మెచ్చానులే! నువ్వు నువ్వుగా నచ్చావులే!

....అని చెబ్దామా?!!!!



21, డిసెంబర్ 2011, బుధవారం

మా నాన్న గారు నేర్పిన "సకల పప్పు సహిత ఓట్స్ పాకం"


అమ్మాయిలూ!

మీరంతా చాలా మంచి రెసిపీలు చెప్పారు (ఇప్పటివరకూ చెప్పినవాళ్ళు) మరియు చెప్పగలరు (ఇంకా చెప్పవలసినవాళ్ళు) - . నేనూ ఏదో వ్రాద్దామనుకున్నాను. కానీ ఎంత ఆలోచించినా ఏదో మా ఇంట్లో ముగ్గురు అబ్బాయిల కోసం వండే ఇంగువ పప్పులూ, బంగాళ దుంప, చేమదుంప వేపడాలు, నేను ఇష్టంగా తినే టమాటా బండ పచ్చడి (బండ అంటే బండలా వుండే టమాటా తో చేసేది కాదు - అప్పటికప్పుడు తాజా టమాటాలతో చేసేదన్నమాట!) తప్ప ఇంకేమీ తట్టట్లేదు. మా అమ్మ పుణ్యమాని (నిజ్జంగా ! పాపం ఆవిడ చేసిన ఏ పూర్వ పుణ్యమో -  ఎంత మంది వచ్చినా పగలు, రాత్రి అనకుండా వేడి వేడిగా వండి పెట్టగలిగే ఓపిక ఆవిడకి, ఇటు పెట్టిన మంచి నీళ్ళ గ్లాసు అటు పెట్టకుండా ఆవిడ చేసిన వంటలు తిని పెరిగే భాగ్యం ఆవిడ ముగ్గురాడపిల్లలకీ దక్కింది) "మావూరి వంటలే" కాదు ఏ వూరి వంటలూ రాకుండానే గడిపేస్తున్నాను. 

నా అదృష్టం కొద్దీ 
- నేను ఉట్టి పప్పు (అంటే ముద్ద పప్పు) చేసినా - "మామా! యు ఆర్ ది బెస్ట్ పప్పు కుకర్ " అని తినేసే బుజ్జిగాళ్ల మంచితనంతో, 
- బంగాళ దుంప తో ఏ వంటకం చేసినా కళ్ళు మూసుకుని (తన్మయత్వం తో) "చాలా బావుంది బుజ్జాయ్!!" అని ప్రశంసా పూర్వకం గా కళ్ళేగరేస్తూ  మరుసటి రోజే కాకుండా ప్రతీ రోజూ బంగాళ దుంపలు చేసేద్దామా అనిపించేలా చేసే నా ప్రియ పతి ఇచ్చే పాక-స్ఫూర్తితో,  
- అంతే కాకుండా నేను చేసే కోనసీమ-కర్నాటక కాక్టైలు వంటలు తిని మురిసిపోతూ "లలితా! ఆ ముద్ద ఉప్మా చేస్తావూ ఇవాళ" అని నా ఫేవరేట్ జారు-జారు పెళ్లుప్మా (అదే - బిర్యానీలు,  టొమేటో బాతులు రాకముందు తెలుగు వారి  పెళ్లి పందిళ్ళలో ఆప్యాయంగా రాజ్యమేలిన ఉల్లిపాయ-రహిత ఉప్మా) అడిగి మరీ చేయించుకుని తినే అత్తగారి ప్రోత్సాహం తో.....
నేను తరిగిందే కూర - వండిందే వంటగా కాలం గడిపేస్తున్నాను.

ఇంతలో ఒకసారి మన అన్నపూర్ణ "నేను చేసిన పెకాన్ పై (pecan pie) అందరికీ ఇష్టం లలితా! ఎన్ని చేసినా అందరూ ఇష్టంగా తింటారు" అంటే నేర్చేసుకుందామన్న ఉత్సాహంతో మన యాహూ గ్రూప్ లో ఆ రెసిపీ పోస్ట్ చేయమన్నాను. తను పోస్ట్ చేసిన వెంటనే  అమృతవల్లి పంపిన మాస్టర్ రెసిపీ కూడా చదివాను.  

నేనేం వ్రాయాలా అని అప్పట్నుంచీ ఆలోచిస్తూ వున్నాను. నేను దోశ వేయడమే ఒక ప్రహసనమైన నా వంటింటి పాక-కళాకౌశలంతో ఏం వంటకం గురించి చెప్పాలో తట్టట్లేదు.

 (దోశ-ప్రహసనం అంటే ఏం లేదు- నేను పిండి రుబ్బి పొద్దున్నే స్టవ్ ని భక్తిగా తుడిచి, నా అస్త్ర-శస్త్రాలైన పెనం-అట్లకాడ తో హారతి ఇస్తున్నట్లుగా తిప్పి, మనసులో మా ఆయన్ని తలచుకొని గరిటతో పిండి తీసుకుని పెనం మీద వేసీ వేయగానే - అదేదో ఎవరైనా దీపావళి బాంబు వెలిగిస్తుంటే దూరం గా నుంచుని అది పేలుతుందో లేదోఅని టెన్షన్ గా చూస్తూ వుంటామే - అలా బదరి వంటింటికి దూరంగా లివింగ్ రూం లో నుంచుని - దోశ వస్తోందా? వస్తోందా? - అని అడుగుతూ వుంటే వణికే చేతులతో దోశలు వేసిన వారాంతపు ఉదయాలెన్నో!!)

ఇలా నేనింత వంటింటి-మథన పడుతూ వుండగా ఆపద్బాంధవిలా మా నాన్నగారు  చెప్పిన "సకల పప్పు సహిత  ఓట్స్ పాకం" గుర్తుకి వచ్చింది.
అదేంటో వివరం గా వ్రాస్తాను - చదవండి :)

క్రిందటి  శనివారం అలవాటుగా ఇంటికి (రాజమండ్రి) కి ఫోన్ చేస్తే ...అబ్బే అలా చెప్పేస్తే మజా ఎలా...చదవండి క్రింద ఇలా...

"హలో! నాన్నా! బావున్నారా?"
"బ్రహ్మాండంగా వున్నాను. అది సరే గానీ లల్లీ! ఓ పెన్నూ పేపరూ తీసుకో. నీకో ప్రోటీన్-రిచ్ స్వీటు చెప్తాను. రాసుకో"
"అదేంటి నాన్నా!"
"ముందు రాసుకో- పెన్నూ పేపరూ తెచ్చావా"
"......."
"నిన్న మధ్యాన్నం బాలూ వాళ్లకి చేసి పెట్టాను. బ్రహ్మాండం గా వచ్చింది. మాంచి ఫైబర్ ఫుడ్డు - ఇంక రాసుకో"
"సరే నాన్నా! చెప్పండి"
"ఓట్సు 200 గ్రాములు, బెల్లం 180  నుంచి 200  గ్రాములు, జీడిపప్పు 25  గ్రాములు, బాదం 25  గ్రాములు, పిస్తా 25  గ్రాములు, నూపప్పు 15  గ్రాములు, వేరుశనగ పప్పు 25  గ్రాములు - ఇవన్నీ తీసుకో.
ఓ బూర్లి మూకుడులో వేయించి పక్కన పెట్టుకో - ఓట్స్ కూడా వేయించుకో నెయ్యి వేసి.
బెల్లం కోరి పడేయ్. నీళ్ళు పోయ్.
ముదురుపాకం తీయ్. పాకం స్టవ్ మీంచి దించేసి దాంట్లో ఇవన్నీ పోసెయ్. 
మొత్తం కలియబెట్టి బాగా కలిసిన తర్వాత పెద్ద కంచం లో వేసి, వేడి మీద చాకుతో కోసేయ్.
ఫ్లేవర్ కావాలంటే ఏలకుల పొడి వేసేయ్. ఇది పెట్టి చూడు. బదరీకి, పిల్లలకీ కూడా నచ్చుతుంది"

అదీ మా నాన్నగారు చెప్పిన "సకల పప్పు సహిత  ఓట్స్ పాకం" రెసిపీ. 

(మా నాన్నగారు జవహర్ లాల్ నెహ్రు పుట్టిన రోజుకి ఒక రోజు ముందు పుట్టారు - కొన్ని సంవత్సరాల తేడాతో. అందుకే నెహ్రు గారు ఇందిరా గాంధీకి వ్రాసినట్లు నాకూ ఉత్తరాలు వ్రాస్తూ వుంటారు - అలా పంపిన రెసిపీలు చాలా వున్నాయి కానీ ప్రస్తుతానికి ఇది చదివేసేయండి :) ఈ మధ్య ఇంకా ఉద్యోగం ఎందుకు నాన్నా రెస్ట్ తీసుకోండి అంటే పొద్దున్న మాత్రం ఆఫీసు కి వెళ్లి వచ్చి మధ్యాహ్నాలు ఇలా పాక-శాస్త్ర ప్రయోగాలు చేస్తున్నారు.)

జై పాక-మాతా! జయహో ఔత్సాహిక కుకర్లూ! 

~లలిత 

11, డిసెంబర్ 2011, ఆదివారం

కోతీ - డాం డాం

(నాన్నమ్మ చెప్పిన కథ. ఈ కథ చిన్న పిల్లలలు ఒక వరుసలో విషయాలు మననం చేసుకుని గుర్తుపెట్టుకోవడానికి అవసరమైన మానసిక అభ్యాసానికి  చాలా ఉపయోగపడుతుంది.)

అనగనగా ఒక కోతి వుంది.
ఒకరోజు అది ఒక అడవిలో వెళ్తూ వుంటే కాలులో ముల్లు గుచ్చుకుంది.
వెంటనే ఆ కోతి నేల మీద కూర్చుని కాలు చూసుకుని ఏడుస్తూ వుంది.
ఇంతలో అటుగా ఒక అబ్బాయి వచ్చాడు అతని చేతిలో ఒక కత్తి వుంది.
"కోతీ! ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగాడు.
కోతి తన కాలులో గుచ్చుకున్న ముల్లు చూపించగానే తన చేతిలో వున్న కత్తితో ఆ ముల్లు తీసేసి అవతల విసిరేశాడు.
వెంటనే కోతి కోపంగా "హన్నా! ముల్లు తీయమన్నాను కానీ పడేయమన్నానా? నా ముల్లిస్తావా? లేకపోతే నీ కత్తిస్తావా ? "అని అడిగింది.
ఆ అబ్బాయి ఏం చేస్తాడు, పాపం! కత్తి కోతికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు.
కోతి ఆ కత్తి తీసుకుని వెళ్తూ వుంటే అడవిలో ఒకచోట ఒక కట్టెలు కొట్టుకునే అతను చేతితో చెట్టు కొమ్మలను విరుస్తూ కనిపించాడు.
కోతి అతని దగ్గరికి వెళ్లి "అయ్యో! అలా ఎంతసేపని చేతితో విరుస్తావు. ఇదిగో ఈ కత్తి తీసుకో" అని అతనికి కత్తి ఇచ్చింది.
కత్తితో కొన్ని కట్టెలు కొట్టాక  కత్తి విరిగిపోయింది.
అంతే కోతి " నీ కట్టెలు కొట్టుకో అని ఇస్తే నా కత్తి విరిచేస్తావా? నా కత్తి ఇస్తావా? నీ కట్టెలు ఇస్తావా?" అని దబాయించింది.
ఇంకేం చేస్తాడు పాపం, ఆ కట్టెలు కొట్టుకునే అతను! తన కట్టెలు అన్నీ కట్ట కత్తి కోతికి ఇచ్చేశాడు.
కోతి కట్టెల మోపును తల మీద పెట్టుకుని వెళ్తూ వుంటే ఒక వూరిలో ముసలమ్మ కొబ్బరి ఆకులతో పొయ్యి వెలిగించడానికి సతమతమవుతూ కనిపించింది.
వెంటనే కోతి ముసలమ్మ దగ్గరికి వెళ్లి "అవ్వా! ఆ కొబ్బరాకులతో పొగే కానీ మంట మండదు. అలా ఏం అవస్థ పడతావు గానీ ఈ కట్టెలు తీసుకుని వంట చేసుకో " అని తన దగ్గరున్న కట్టెలు ఇచ్చింది.
ఆ అవ్వ ఆనందంగా కట్టెలు పెట్టి పొయ్యి రాజేసి పెనం కాల్చి అట్లు పోసుకుంది. అట్లు వేయడం పూర్తి అయేటప్పటికి కోతి ఇచ్చిన కట్టెలు అన్నీ కాలి బూడిద అయిపోయాయి.
అది చూసి కోతి "నా కట్టెలన్నీ కాల్చి బూడిద చేసేస్తావా? నా కట్టెలు ఇస్తావా? లేకపోతే నీ అట్లు ఇస్తావా?" అని పేచీ పెట్టింది.
పాపం ఆ అవ్వ చేసేదేమీ లేక అట్లన్నీ కోతికి ఇచ్చేసింది.
కోతి ఆ అట్లు మూట కట్టుకుని వెళ్తూవుంటే బజార్లో ఒక పిల్లాడు ఏడుస్తూ కనిపించాడు.
వెంటనే కోతి ఆ పిల్లాడి దగ్గరికి వెళ్లి " బాబూ! ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగింది.
దానికి ఆ పిల్లాడు " మా అమ్మ కొత్త కుండ కొనుక్కురా అని సంతకి పంపించింది. వున్న డబ్బులన్నీ కుండ కొనడానికే ఖర్చు అయిపోయాయి. నాకిప్పుడు ఆకలి వేస్తోంది. కానీ కొనుక్కోవడానికి డబ్బులు లేవు." అని ఏడ్చాడు.
అది వినగానే కోతి "అయ్యో! అలాగా! దా...నా దగ్గర అట్లు వున్నాయి. తిను. " అని అట్ల మూట ఆ అబ్బాయి చేతికి ఇచ్చింది.
వాడు బాగా ఆకలి మీద వున్నాడేమో - ఆవురు ఆవురని అట్లన్నీ తినేశాడు.
అంతే కోతికి మళ్ళీ కోపం వచ్చేసింది. "ఏదో ఒకటో రెండో తింటావని ఇస్తే అన్నీ తినేస్తావా? నా అట్లు ఇస్తావా? నీ కుండ ఇస్తావా? " అని అరిచింది.
ఆ పిల్లాడు బెదిరిపోయి కోతికి కుండ ఇచ్చేసి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు.
కోతి ఆ కుండ తీసుకుని వెళ్తూ ఒక తోట దగ్గర ఆగింది.
ఆ తోటకి చిల్లు కుండతో నీళ్ళు పెడుతూ తోటమాలి కనిపించాడు.
కోతి తోటమాలి దగ్గరికి వెళ్లి "ఆ చిల్లు కుండతో ఎన్ని సార్లని అటూ ఇటూ తిరుగుతావు? ఇదిగో ఈ కొత్త కుండ తీసుకో." అని ఇచ్చింది.
తోటమాలి ఆనందంగా ఆ కొత్త కుండతో తోటకి నీళ్ళు పెట్టుకున్నాడు. ఇంతలో నూతి లోంచి కొత్తకుండతో నీళ్ళు తోడుతూ వుండగా నూతి గోడకి తగిలి కుండ పగిలిపోయింది.
వెంటనే కోతి "నా కుండ ఇస్తావా? నీ పూల దండలు ఇస్తావా? " అని పట్టు పట్టి ఆ తోటమాలి దగ్గర పూలదండలన్నీ పట్టుకుపోయింది.
పూలదండలు పట్టుకుని కోతి అలా వెళ్తూ వుంటే ఒక చోట రాజుగారి కూతురి పెళ్లి జరుగుతూ కనిపించింది. ఆ పెళ్ళిలో పూలు దొరకలేదని అందరూ అనుకుంటూ వుంటే కోతి వెళ్లి " పూలు లేని పెళ్లి ఏం పెళ్లి? ఈ పూలు తీసుకోండి" అని తన దగ్గరున్న పూలదండలు పెళ్లికూతురుకి ఇచ్చింది.
కోతి ఇచ్చిన పూలతో అలంకరించుకుని రాజుగారి కూతురు పెళ్లి చేసుకుంది.
మర్నాటికి పూలదండలు వాడిపోవడం చూసి " నా పూల దండ ఇస్తారా? మీ పిల్ల నిస్తారా " అని పేచీ పెట్టి రాజుగారి కూతుర్ని తీసుకుని కోతి వేరే వూరికి బయల్దేరింది.
దారిలో ఒక సర్కస్ చేసేవాళ్ళు కనిపించారు. గడ ఎక్కడానికి పిల్ల లేదే అనుకుంటూ వుంటే "ఇదిగో నా దగ్గర పిల్ల వుంది. దీన్ని గడ ఎక్కించండి" అని కోతి రాజుగారి కూతుర్ని వాళ్లకి ఇచ్చింది.
సర్కస్ వాళ్ళు గడ ఎక్కించగానే కొంచెం నడవగానే అలవాటులేక తూలిపడి రాజుగారి కూతురుకి కాలు విరిగింది.
వెంటనే కోతి "హన్నా! నా పిల్ల కాలు విరక్కొడతారా? నా పిల్ల కాలు బాగు చేస్తారా? లేకపోతే మీ డప్పు ఇస్తారా? " అని అడిగింది.
కోతితో గొడవ ఎందుకని సర్కస్ వాళ్ళు డప్పు ఇచ్చేశారు.
కోతి ఆ డప్పు తీసుకుని ఒక చెట్టు కొమ్మ మీద ఎక్కి కూర్చుని ఇలా పాడింది.....

ముల్లు పోయి కత్తి వచ్చే డాం డాం డాం
కత్తి పోయి కట్టే వచ్చే డాం డాం డాం
కట్టే పోయి అట్టు  వచ్చే డాం డాం డాం
అట్టు పోయి కుండ వచ్చే డాం డాం డాం
కుండ పోయి దండ వచ్చే డాం డాం డాం
దండ పోయి పిల్ల వచ్చే డాం డాం డాం
పిల్ల పోయి డప్పు వచ్చే డాం డాం డాం - డాం డాం డాం