అందమైన మాటలు పేర్చి - వినసొంపైన రాగం కూర్చి - కట్టిన పాటలు - కదలనీయక కట్టిపడేస్తాయి. పదేపదే వినమంటాయి. వింటూనే వుండమంటాయి.
అలాంటి పాటలు ఎన్నో ఇంతకు ముందూ వున్నాయి. ఇవాళా వస్తున్నాయి. ఇక ముందూ రాబోతాయి.
కాకపోతే ఇంతకు ముందున్న, ఇప్పుడొస్తున్న, ముందు రాబోతున్న అన్ని పాటలూ వింటామా లేదా అనేది - విన్న తర్వాత అవి మనకు నచ్చుతాయా లేదా అన్నది - ఆయా విన్నప్పటి క్షణాన ఆయా చెవులు చేసుకున్న పుణ్యఫలం.
ఒక్కో వేళ అనుకోకుండా ఓ మంచి పాట నాకు తారసబడటం అన్నది నా తారాబలాన్ని బట్టే అని నాకొక బలీయమైన నమ్మకం.
కిందటి మంగళవారం అనగా డిసెంబర్ 10 వ తారీఖు, 2024 వ సంవత్సరం - మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు - నా పాట-తారాబలం బహు బాగా వున్నట్టుంది.
ఓ మాంఛి పాటొకటి విన్నాను, చూశాను.
వినడానికి అలనల్లన అలల మీద తేలుతున్నట్టు, చూడడానికి గాలితో తూలుతున్నట్టు గానూ వున్న ఆ పాట "విడుదలై-1" అనే ఓ తమిళ డబ్బింగ్ సినిమా లోనిది.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
శీతాకాలపు సాయంత్రం. పొద్దు తొందరగా వాలిపోయింది.
సాయంత్రం భోజనం కాగానే కాలక్షేపం వెతుక్కుంటూ వుంటే బద్రికి విజయ్ సేతుపతి సినిమా "విడుదలై-1" గుర్తొచ్చింది. ఈ మధ్యే ఎక్కడో దాని గురించి చదివారట. బావుంటుందని చదివినట్టు గుర్తుందట.
బద్రికి, నాకూ కూడా విజయ్ సేతుపతి సినిమాలు ఇష్టం.
బావుంటాయి. మేమిప్పటి వరకు చూసినవి కొన్నే అయినా చూసినవన్నీ నచ్చాయి.
ఈ మధ్యే చూసిన "మహారాజా" అయితే మరీ నచ్చేసింది. అది చూసినప్పట్నుంచి అతని పాత సినిమాలు అన్నీ వెతుక్కుని చూడాలనుకుంటూ వున్నాము.
అంతే కాకుండా నాకు పెద్దగా విజయ్ సేతుపతి గురించి ఏమీ తెలియకపోయినా - అతని గురించి చదివిన ఒక వార్త వల్ల నాకు అతనంటే గౌరవం.
అతను హీరోగా వున్న ఒక సినిమాలో కృతిషెట్టి అనే అమ్మాయిని హీరోయిన్‌గా పెడదామనుకుంటే విజయ్ సేతుపతి ఒప్పుకోలేదట. ఎందుకంటే అంతకు ముందు "ఉప్పెన" అనే తెలుగు సినిమాలో కృతిషెట్టి అతని కూతురుగా నటించింది. కూతురుగా చేసిన అమ్మాయితో romance చేయడానికి ఒప్పుకోలేదు విజయ్ సేతుపతి. నటన ఒక వృత్తే అయినా అందులో తనకంటూ కొన్ని నిబంధనలు పెట్టుకున్న విజయ్ సేతుపతి లాంటి వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి వాళ్ళని గౌరవించి precious గా చూసుకుంటే - వాళ్ళలా ఇంకొంతమంది మంచివాళ్ళు తయారయ్యే అవకాశం వుంటుంది. అందుకే అతనంటే మహా గౌరవం.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
అందుకే "విడుదలై-1" గురించి బద్రి గుర్తు చేయగానే చూడడం మొదలుపెట్టాము. సినిమా మొదలవుతూనే ఇంతకు ముందు సగం చూసినట్టు గుర్తొచ్చింది బద్రికి. సరే! ఇప్పుడు పూర్తి చేద్దాంలే అనుకుని continue చేశాం.
సినిమా మొదలైనప్పట్నుంచీ కుమరేశన్ అనే ఓ పరోపకారి పాపన్న పోలీసు, అతన్నిష్టపడే ఓ అమ్మాయి , ఇంకా మిగిలిన బోల్డంత మంది పోలీసులూ - వీళ్ళ చుట్టూనే కథ తిరుగుతూ వుంది.
మధ్యలో ఎక్కడో గానీ విజయ్ సేతుపతి రాలేదు.
అయినా సినిమా బావుండడం వల్ల ఇవేమీ పెద్ద పట్టించుకోదగిన విషయాలు అనిపించలేదు. పైగా ఆ కుమరేశన్‌గా చేసిన సూరి అనే అతను, ఆ అమ్మాయి భవానీ శ్రీ అందరూ చాలా బాగా నటిస్తున్నారు.
సినిమా అంతా కూడా ఎంతో సహజమైన పరిసరాల్లో, వాతావరణంలో చక్కగా సాగుతోంది. అక్కడక్కడా కొంచెం హింస వున్నా కూడా అలాంటి చోట్ల చూడకుండా forward చేసుకుంటూ చూసేస్తున్నాము.
ఇంతలో ఓ పాట వచ్చింది.
అదెలాంటి పాటంటే ... అలాంటిలాంటి పాట కాదు.
నేనింతకు ముందు అన్నట్టు ...
వినడానికి అలనల్లన అలల మీద తేలుతున్నట్టున్న పాట
చూడడానికి మెలమెల్లగ గాలితో తూలుతున్నట్టున్న పాట
మిణుగురులు మూగిన పాట
మురిపాలు మోసులు సాగిన పాట
కనుల కలయికలో నెయ్యాలు పూచిన పాట
తనువుల యెడమై డెందముల చేరువైన పాట
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
తెర మీద చూస్తున్నప్పుడు కుమరేశన్ (సూరి), పాప (భవానీ శ్రీ ) ఒక లాంతరు పట్టుకుని అడవి మధ్యలో - ఆ వెలుతురు-చుట్టులో - వాళ్ళని చుట్టుముట్టిన వలపు-మెరుపుతో - గాలిలో తేలుతున్నట్టుగా అడుగులు వేస్తూ (slow-motion లో తీశారు ఈ పాటంతా) వుండగా - నేపథ్యంలో ఉరుములు మువ్వలని అనుకరిస్తే ఎలా వుంటుందీ?! - అలాంటి drum sound - పాట వెనకాల మోగుతూ వుంటుంది.
అనుపల్లవిలో "ఈ వింత మాయంతా... నీ మహత్యమే!" అన్న వాక్యం దగ్గర వాళ్ళిద్దరి చుట్టూ ముసిరి మెరుస్తున్న మిణుగురుల మినుమించులు కళ్ళకి మిరుమిట్లు గొలుపుతాయి.
అనుపల్లవి ముగిసి - మొదటి చరణానికి ముందు వచ్చే interlude దగ్గర మెరిసేటి నీళ్ళ సెలయేరు ఒక అద్భుతం!
చిమ్మ చీకటి
చీకటి కమ్ముకున్న రేయి
రేయి మూగిన రాల కొండలు
కొండల మీద చిక్కగా పరుచుకున్న అడవి
అడవి నడుమ రాల బాట
రాల మీదుగా నీటి కాలవ
అమ్మాయి చేతి లాంతరు వెలుగు
ఆ వెలుగులో మెరిసిన అబ్బాయి కళ్ళు
ఆ మెరుపుకి విరిసి సోలిన అమ్మాయి కళ్ళు
మిలమిల మూగిన మిణుగురులు
జలజల పారిన సెలయేర్లు
చూడడానికి ఈ పాట ఒక painting-in-motion లా అనిపించింది నాకు.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
చూపుకి అబ్బురపు చిత్తరువనిపించిన ఈ పాటని చెవులకి అచ్చెరువపు పదమనిపించేటట్టు కట్టినది -
ఇలకి అమృతాన్ని స్వరాల రూపంలో పంచడానికి వచ్చిన ఇళయరాజా.
తెలుగులో ఈ పాట కార్తీక్ - అనన్య భట్ పాడారు. తెలుగులో పాటని రాసినవారు చైతన్య ప్రసాద్.
తమిళంలో కూడా విందామని వెతికాను. ముందు వినగానే ఇళయరాజానే పాడారేమో అనుకున్నాను. కానీ కాదట. తమిళంలో పాడిందెవరో తెలుసా? ధనుష్ - అనన్య భట్. తమిళంలో పాటని రాసిందేమో శుక అట.
ధనుష్ అంటే ఎవరో వేరే "పాటక్కార్" అనుకున్నా కానీ మన వేలై-ఇల్లద-పట్టక్కారన్ (VIP) హీరో అని తెలిసి భలే ఆశ్చర్యపడిపోయేశా!
భలే! "Why this కొలవెరి" అంటూ ఏదో సరదా పాటొకటి పాడాడు అని మాత్రమే తెలుసు కానీ సినిమాల్లో వేరే నటులకి కూడా పాడతాడని ఈ "ఉన్నోడ నడందా... కల్లాన కాడు - పూత్తాడుం పూవనం ఆగిడుమే" పాట విన్నాకే తెలిసింది.
అసలు ముందు తమిళ పాట విన్నప్పుడు ఇళయరాజా కొంచెం గొంతు మార్చి పాడారేమో అనుకున్నా. యూట్యూబ్‌లో ధనుష్ పాడుతుండగా తీసిన shorts చూడకపోతే ఈ పాట ధనుష్ పాడాడంటే నమ్మేదాన్ని కాదేమో! కానీ పాడింది ఖచ్చితంగా ధనుష్షే.
కాకపోతే తెలుగులో పాట కార్తీక్ గొంతులో ఒక చిన్న నవ్వుతో కలిపి వినిపిస్తే తమిళంలో ధనుష్ పాట మాత్రం ఓ పిసరు పొగులుతో సాగినట్టుంటుంది.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
అన్నట్టు ఈ పాటా, ఈ పాటలో నటించిన వారి వివరాల గురించి వెతుకుతున్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన tidbits దొరికాయి.
అవేంటంటే...
విడుదలై-1 లో కుమరేశన్‌గా ప్రధానపాత్రధారిగా నటించిన సూరి అనే తమిళ నటుడు ఇంతకు ముందు నటించినవన్నీ హాస్యపాత్రలే నట. కానీ ఈ సినిమాలో అతన్ని చూస్తే కుమరేశన్‌గా సూరి తప్ప ఇంకెవ్వరూ అంత బాగా చెయ్యరేమో అనిపించింది.
ఇక కుమరేశన్‌కి ఇష్టమై, అతన్ని ఇష్టపడ్డ పాప(తమిళరసి)గా నటించిన భవానీశ్రీ సంగీతదర్శకుడు రెహమాన్‌కి మేనకోడలు. ఇంకో సంగీతదర్శకుడు G.V.ప్రకాష్‌కి చెల్లెలు అట.
పాట మొదలైనప్పుడు పల్లవిలో అమ్మాయి చరణాలకి చెప్పులున్నాయి - కానీ పాట చరణానికి వచ్చేటప్పటికి అవెక్కడో పడేసుకున్నట్టుంది. ఉట్టికాళ్ళతో నడుస్తూ వుంటుంది.
అమ్మాయి చేతనున్న లాంతరు వెలుగులో అబ్బాయి కళ్ళే కాదు ఆ పోలీసు చొక్కాకి వున్న స్టీలుబొత్తాలు కూడా మెరుస్తుంటాయి
చాలా చాలా రోజుల తర్వాత ఓ పాటని వెతుక్కుంటూ వెళ్ళి దాని కథా-కమామీషూ కనుక్కోవడం బోల్డంత బాగా అనిపించింది.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
మళ్ళీ వెనక్కి మళ్ళి పాట దగ్గరికొస్తే ఈ పాట సందర్భం ఏంటంటే ఊరికి భయపడి తన ఉనికిని బయట పెట్టుకోలేకపోతున్న అమ్మాయికి ఆ వూరే నీ గురించి మంచిమాటలు చెప్పే మంచి రోజులొస్తాయి అని అబ్బాయి ధైర్యం చెబుతున్నట్టున్నట్టుంటుంది. అందుకే తెలుగు పాట పాడిన కార్తీక్ నవ్వుగొంతులో ఆ భరోసా వినిపించింది - తమిళపాట ధనుష్ గొంతులో కించిత్ బాధగా సాగింది.
తమిళంలో రాసిన పాటకి మక్కీకి మక్కీ అనువాదంలా వుంటుంది తెలుగు పాట.
కానీ మొట్టమొదటి వాక్యం దగ్గర మాత్రం "పిల్లా ...నువ్ నడిస్తే ... ఈ రాళ్ళదారే పూచేటి పూవనమాయెనులే" అనే కన్నా "పిల్లా...నీతో నడిస్తే ఈ రాళ్ళదారే పూచేటి పూవనమాయెనులే" అనుంటే ఇంకొంచెం అసలు-పాటకి దగ్గరగా వుండేది (ఉన్నోడ నడందా ...కల్లాన కాడు పూత్తాడుం పూవనం ఆగిడుమే) అనిపించింది.
ఎలాగూ నేపథ్యంలో వచ్చే పాటే కాబట్టి - పెదవుల కదలికకి అనుగుణంగా రాయక్కర్లేదు కాబట్టి - తెలుగులో ఇంకొంచెం స్వేచ్ఛగా చక్కటి మాటలు వాడి న-డబ్బింగ్ పాటలా రాసుంటే బావుండేది.
ఏదేమైనా ఎలా రాసినా విన్న పాట విన్నట్టుగా, వున్నట్టుగా నాకు మాత్రం నచ్చేసింది - తమిళంలో, తెలుగులో కూడా.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
అంత నచ్చిన ఆ పాటని ఈ కింద రాసి పెట్టుకున్నా. తెలుగు పాట మాత్రమే రాశాను. తమిళ పాట చూస్తూ వినడానికి యూట్యూబ్ లింక్ మాత్రం పెట్టాను.
ఈ పూటకి నే ఏరికోరి తెచ్చుకున్న పాట - "మలరే ... మౌనమా!". పాటున్న సినిమా తమిళ "కర్ణ". పాటలో వున్నవారు - అర్జున్, రంజిత.
ఇది ఒక తీపిరాగాల మధుమంత్రం. ఎదను గిల్లు గాలిగానాల హాయిజంత్రం.
ఈ పాటకి సంగీత దర్శకుడు - తెలుగులో అంతగా ఎవరూ తలుచుకోని విద్యాసాగర్.
విద్యాసాగర్ ఎవరబ్బా అని కదా? అప్పుడెప్పుడో "ముగ్గురు మొనగాళ్ళు" లాంటి కొన్ని తెలుగు సినిమాలకి వృత్తిధర్మ-మాత్ర సంగీతం చేసి ఆ తర్వాత తమిళ, మలయాళ సినిమాల్లో మనోధర్మ-పాత్రమైన అద్భుతమైన పాటలు కూర్చిన సంగీత-స్వర-మాంత్రికుడు.
ఇంకా చప్పున ఈయనెవరో తలచుకుని-గుర్తు పెట్టుకోవాలంటే - ఇంకో పాట గురించి చెప్తా.
నయనతార గాలిపటాలెగరేసి, రజనీకాంత్ పిల్లిగడ్డమెట్టుకుని లకలకలాడిన సినిమా ఒకటుంది చూశారూ?
అదే... అందులో జ్యోతిక టార్చ్‌లైట్లలా వెలుగుతున్న కళ్ళ చుట్టూ ఇంత కాటుక పూసుకుని, జుట్టంతా పీక్కుని వినీత్‌తో కలిసి డాన్స్ చేస్తుందే - "రారా సరసకు రారా" అంటూ - గుర్తుందా? ఆ సిన్మా ఏదో మీరే కనుక్కోండి. ఆ పాటకు జాతీయపురస్కారం కూడా దక్కింది మన సంగీత-విద్యాసముద్రుడికి.
అదే కాదు - కాశీనాథుని విశ్వనాథుడి "స్వరాభిషేకం" సిన్మాకి కూడా విద్యాసాగరుడే సంగీత-గంగావతరణ-భగీరథుడు. సంగీతం బావుంటుంది - కాకపోతే ఆ సినిమా నాకంతగా సొక్కలేదు.
ఇవే కాకుండా - ఇంకో ఊరూపేరూ లేని రీలుముక్క లాగా గాలికెటో కొట్టుకుపోయిన ఒకానొక సినిమాలో ఒక అద్భుతమైన పాట వుంది ఈ విద్యాసాగర్‌దే. దాని గురించిన కబుర్లు మళ్ళింకోసారి చెప్తా. ఎందుకంటే ఆ పాట నాకు చాలా ఇష్టం. ఇక్కడ ఓ రెండు ముక్కలు చెప్పేసి ఆ ఇష్టాన్ని కొంచెపఱచుకోవడం నాకిష్టం లేదు.
అన్నట్టు ఈ విద్యాసాగర్‌గారిది మా అమలాపురమేనట. భలే!
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
ఇహిప్పుడు - అసలు పాట పాట గురించి.
నేనిన్ని కబుర్లు చెప్తుంటాను కానీ - మా ఇంట్లో లేస్తూనే పాట వింటూ - చెవికి నచ్చిన పాటనల్లా పాడుకుంటూ - రాత్రి పాట వింటూ నిద్ర లోకి జారుకుంటూ - ఎప్పటికైనా తనకు నచ్చిన పాటలన్నీ పాడుకోవాలనుకునే వీర-పాటాభిమాని బద్రి.
తను రకరకాల పాటలు వింటూ అందులో అనుకోకుండా దొరికిన మిణుకు-చుక్కల్లాంటి పాటల్ని పట్టి నాకిస్తూ వుంటారు. అలా దొరికిన బాల-గంధర్వ-జానకీ-మధురయుగళజనిత-గానమే ఈ "మలరే...మౌనమా?" పాట.
వేణుగానంతో మొదలయ్యే విద్యాసాగరుడి మధుర సంగీతం...
చెవికింపైన వైరముత్తు రాసిన తమిళ-పలుకులు...
పాలూ-తేనె-మీగడ-పంచదార-నవ్వు-అచ్చర పరిచే అచ్చరపు పలుకు... అన్నీ కలిపి చిలికిన హాయిపాటల మా సుబ్బయ్య గొంతు...
తమిళసలు పాటలో వున్న ఈ పూల-గాలి మాటలు నాకు బోల్డు నచ్చాయి.
కాట్రే! ఎన్నై కిళ్ళాదిరు...
(గాలీ! నన్ను గిల్లెయ్యకూ ...)
పూవే! ఎన్నై తళ్ళాదిరు...
(పూవా! నన్ను తోసెయ్యకూ!)
కాకపోతే ఈ పాటలో వినిపించే "అన్బే" అన్న మాట అనునాసిక / అనుస్వార సూత్రానికి విరుద్ధంగా అనిపించింది. లెక్కప్రకారం అది "అమ్బే" అన్నట్టు పలకాలి - కానీ ఎస్జానకి తమిళ ఉచ్చారణలో "అన్బే" అన్నట్టు వినిపిస్తుంది.
చేసేది ఏ పని అయినా అది పాటు అనిపించకుండా వుండాలంటే పనికి తోడుగా ఓ పాట ఉండాల్సిందే! పనిపాటలు అని ఊరికే అన్నారా మరి?!
నా వరకు నాకు...
పాట లేని పని...
అది పడరాని పాటు
ఎప్పటికీ తగ్గని పోటు
నా మటుకు నాకు...
పనికి తోడు పాటుంటే...
అది కలిసి వచ్చు సాయంలే!
అదే చెప్పరాని హాయంతే!
*******
*******
అందుకే నేను ఏ పని చేస్తున్నా - నేనన్నా పాడుతుండాలి - లేదా ఏ పాటన్నా మోగుతుండాలి.
ఆ పూటకి నే చేస్తున్న పనిని బట్టి, అప్పటికి వున్న నా మతిని బట్టి నేనెంచుకునే పాట వుంటుంది.
అలాంటప్పుడు ఒక్కోసారి - పుస్తకాల్లో దాచిపెట్టి మరిచిపోయిన నెమలీక మెరుస్తూ కనిపించి మురిపించినట్లు - ఎప్పుడో పాడుకున్న పాట కూనిరాగమై మూగి వస్తుంది. ఇక ఆ రోజంతా అదే మోగిపోతుంది.
కిందటి వారంలో ఒక రోజు అలా గుర్తొచ్చిన పాట - "జిందగీ ఏక్ సఫర్ హై సుహానా...".
ఈ పాటని చిన్నప్పట్నుంచీ వినడమే కానీ ఎప్పుడూ టీవీలో చూడలేదు. ఏ సినిమాలోదో కూడా తెలీదు. మొన్న గుర్తు రాగానే వెంటనే యూట్యూబులో వెతికి చూశా.
హాచ్చెర్యం! అది రాజేష్ ఖన్నా మోటార్ సైకిల్ మీద వెనకాల హేమమాలినిని ఎక్కించుకుని బొంబాయి ఊరంతా తిరుగుతూ - మధ్యమధ్యలో పార్కుల్లో, బీచుల్లో, రెస్టారెంట్లో- అక్కడక్కడా నడుస్తూ - పాట పాడేస్తూ వుంటాడు. హేమ్మాల్ని తెగ నవ్వేస్తూ వుంటుంది. పాట మధ్యలో కొంచెం ముక్క అరేబియా సముద్రమే కాకుండా గేట్ వే ఆఫ్ ఇండియా గోడ ముక్కలు కూడా ఓ రెండు కనిపిస్తాయి.
అన్నట్టు మన తెలుగు సినిమాల్లో హీరోయిన్లకి పాటల్లో డాన్స్ ఆడేటప్పుడు చెప్పులు వేయనట్లే - ఈ పాటలో ఓ చోట బీచులో నడిచేటప్పుడు రాజేష్ ఖన్నా కాళ్ళకి నల్లబూట్లు వేశారు కానీ హేమ్మాల్ని పాదాల్ని ఏ చెప్పుల తోనూ కప్పకుండా తెల్లగా వుంచేశారు.
సరే! ఇప్పుడు పాట పుట్టుపూర్వోత్తరాలు.
పాట: "జిందగీ ఏక్ సఫర్ హై సుహానా..." సినిమా: అందాజ్ పాటలో కనిపించే హీరో-హీరోయిన్ను: రాజేష్ ఖన్నా - హేమమాలిని పాటలో కనిపించని హీరో: షమ్మీ కపూర్ పాట రచయిత: హస్రత్ జైపురి సంగీత దర్శకులు: శంకర్ - జైకిషన్ పాడిన వారు: Yodeling-king కిషోర్ కుమార్
ఈ పాట మధ్యలో yodeling వచ్చినప్పుడల్లా - అక్కడ కళ్ళ ముందు కనిపించే రాజేష్ ఖన్నా కన్నా - కనిపించకుండా పాడుతున్న కిషోర్ కుమారే చెవులకి ఆనుతున్నట్టు అనిపిస్తుంది నాకు.
కాకపోతే ఈ పాట చూడక ముందు ఎప్పుడూ ఇలా అనిపించలేదు కానీ చూశాక ఇలా రాశారేంటబ్బా అని మాత్రం ఎన్ని సార్లు అనిపించిందో!
పాట చూస్తుంటే - ఒక హీరో లాంటి అబ్బాయి తనకెంతో ఇష్టమైన డ్రీం గర్ల్ లాంటి అమ్మాయిని మోటార్ బైకు మీద కూర్చోబెట్టుకుని - షికారుకి తీసుకెళ్తూ హుషారుగా పాడుతున్న సందర్భంలా వుంటుంది.
పాడిన వింటుంటే ఉత్సాహం ఉరకలు వేస్తున్న గొంతుతో - పాడే పాటకి "ఓడ్లెయ్ ఓడ్లెయ్..." అని హంగులద్ది మరీ కిషోర్ కుమార్ పాడిన తీరు, అందులో మళ్ళీ బోల్డన్ని నవ్వులు.
తీరా పాటలో మాటలు చూస్తేనేమో ...
మరణం వస్తే రానీ...
ప్రాణం పోతే పోనీ...
ఇలాంటివంటే
భయపడడమేంటి?
రేపేమౌతుందో
ఎవరికి తెలుసేంటి?
అంటూ దాసరి-వారి-ప్రేమవైరాగ్యం మార్కు సాహిత్యం.
ఈ పాట గురించి రాయబోతున్నానని చెప్పగానే అపర్ణ చెప్పనే చెప్పింది - ఆ పాట చివర్లో ఏక్సిడెంట్ అవుతుందని. అందుకే హస్రత్ జైపురి జనన-మరణ-భయభయాల గురించి yodeling-సహితంగా రాసినట్టున్నారు.
నాకిప్పుడు ఒక సినిమా-సూత్రం తడుతోంది.
సినిమాల్లో ఏదైనా పాటలో హీరో-హీరోయిన్లు "నేను నిన్ను ప్రేమిస్తున్నా... నువ్వు నన్ను ప్రేమించు" అన్న ప్రేమ-బేరాల దగ్గరే ఆగిపోకుండా "మనకు పెళ్ళవుతుంది - ఆ పైన పిల్లలొస్తారు - మనకి ఒళ్ళు హూనమవుతుంది" అంటూ పెళ్ళి అయిపోతున్నట్టు ఆ పాట లోనే కలలు కనేస్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ సవ్యంగా పెళ్ళవ్వదు.
ఓ రెండు-మూడు ఉదాహరణలు ఏంటంటే ...
"మంచి మనసులు" సినిమాలో సావిత్రి-నాగేశ్వర్రావు పాడుకున్న "నన్ను వదిలి నీవు పోలేవులే" అన్న పాటలో "సిగ్గు తెరలలో కనులు దించుకుని తలను వంచుకుని బుగ్గ మీద పెళ్ళిబొట్టు ముద్దులాడ రంగులీను నీ మెడలో బంగరపు తాళి గట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే" అని ప్రాసల మీద ప్రాసలుగా పాడిన నాగేశ్వర్రావు అసలు సావిత్రినే పెళ్లి చేసుకోడు ఆ సినిమాలో.
అలాగే "ముత్యాలపల్లకి" సినిమాలో "సన్నజాజికి-గున్నమావికి పెళ్లి కుదరింది" అని పాడుతూ పాటలో పిల్లలు-మనవలు పుట్టేసినట్లు కలగన్న జయసుధ-నారాయణరావులకి ఆ పెళ్ళే సవ్యంగా జరగదు.
పుష్ప-ఫలేంద్రరావు తీసిన "త్రిశూలం" సినిమాలో "పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు" అని పాడుకున్న శ్రీదేవి-కృష్ణంరాజు సినిమా చివరి దాకా పెళ్ళే చేసుకోలేరు.
ఆ కిందున్న పాటలో మాటలు చూశారుగా - మీరు కూడా పాడేసుకోండి!
జిందగీ - ఏక్ సఫర్ - హై సుహానా
యహా కల్ క్యా హో - కిస్‌నే జానా?
జిందగీ - ఏక్ సఫర్ - హై సుహానా
యహా కల్ క్యా హో - కిస్‌నే జానా?
ఆ ... జిందగీ - ఏక్ సఫర్ - హై సుహానా
యహా కల్ క్యా హో - కిస్‌నే జానా?
అరె... ఓడ్లెయ్ ఓడ్లెయ్ ఓఓఓ
ఓడ్లెయ్ ఓడ్లెయ్ ఓఓఓ
చాంద్ తారోం సే - చల్‌నా హై ఆగే
ఆస్‌మానోం సే - బఢ్‌నా హై ఆగే
అరె... చాంద్ తారోం సే - చల్‌నా హై ఆగే
ఆస్‌మానోం సే - బఢ్‌నా హై ఆగే
పీఛే రహ్ జాయేగా - యే జమానా
యహా కల్ క్యా హో - కిస్‌నే జానా?
ఆ ... జిందగీ - ఏక్ సఫర్ - హై సుహానా
యహా కల్ క్యా హో - కిస్‌నే జానా?
అరె... ఓడ్లెయ్ ఓడ్లెయ్ ఓఓఓ
ఓడ్లెయ్ ఓడ్లెయ్ ఓఓఓ
హస్‌తే గాతే - జహా సే గుజర్
దునియా కీ - తూ పర్‌వాహ్ న కర్
హస్‌తే గాతే - జహా సే గుజర్
దునియా కీ - తూ పర్‌వాహ్ న కర్
ముస్కురాతే హుయే - దిన్ బితానా
యహా కల్ క్యా హో - కిస్‌నే జానా?
ఆ ... జిందగీ - ఏక్ సఫర్ - హై సుహానా
యహా కల్ క్యా హో - కిస్‌నే జానా?
డి డి డి డి ఓ ఓ ఓ
ఓడ్లెయ్ ఓడ్లెయ్ ఓడ్లెయ్ ఓ ఓ ఓ
మౌత్ ఆనీ హై - ఆయేగీ ఏక్ దిన్
జాన్ జానీ హై - జాయేగీ ఏక్ దిన్
అరె... మౌత్ ఆనీ హై - ఆయేగీ ఏక్ దిన్
జాన్ జానీ హై - జాయేగీ ఏక్ దిన్
ఐసీ బాతోం సే - క్యా ఘబ్‌రానా?
యహా కల్ క్యా హో - కిస్‌నే జానా?
ఆ ... జిందగీ - ఏక్ సఫర్ - హై సుహానా
యహా కల్ క్యా హో - కిస్‌నే జానా?
డి డి డి డి ఓ ఓ ఓ
ఓడ్లెయ్ ఓడ్లెయ్ ఓడ్లెయ్ ఓ ఓ ఓ
ఓడ్లెయ్ ఓడ్లెయ్ ఓడ్లెయ్ ఓడ్లెయ్
ఓడ్లెయ్ ఓడ్లెయ్ ఓడ్లెయ్ ఓడ్లెయ్
*******
*******
పైన చెప్పిన "జిందగీ ఏక్ సఫర్" పాట వింటుంటే చిన్నప్పుడెప్పుడో విన్న ఓ యోడెలింగ్ తెలుగు పాట గుర్తుకొచ్చింది.
వెంటనే ఆ పాట కోసం యూట్యూబ్లో వెతికేశా "మనసైన ఓ చిన్నదానా!" అని టైపు చేసి.
ఆ పాట "దత్తపుత్రుడు" సినిమా లోది. పాడిన వారు - ఘంటసాల, ఎల్లారీశ్వరి. సంగీతం టి. చలపతిరావు. పాటకి ఆడినవారు నాగేశ్వర్రావు, వాణిశ్రీ.
"మనసైన ఓ చిన్నదానా!" అన్న పాటకి, ఇంతకు ముందు చెప్పిన "జిందగీ ఏక్ సఫర్" పాటకీ చాలా పోలికలున్నాయి.
రెండూ హుషారైన పాటలే. హిందీ పాటలో మోటారు బైక్ వుంటే తెలుగు పాటలో స్కూటర్ వుంది. హీరోయిన్లకి వేసిన బట్టలు కూడా కొన్నిచోట్ల ఒకేలా వున్నాయి.
అన్నిటికన్నా ముఖ్యంగా ఆ యోడెలింగ్. హిందీలో "ఓడ్లెయ్ ఓడ్లెయ్ ఓడ్లెయ్ ఓ ఓ ఓ" కాస్తా తెలుగులో "ఎట్లా ఎట్లా ఎట్లా ఎట్లెట్లెట్లా - అట్లా గట్లా గట్లా అట్లట్లట్లా - ఒడిలెహీ.. ఒడిలెహీ.. ఒడిలెహీ.." గా మారింది.
తెలుగు పాటలో విశేషం ఏంటంటే ""ఎట్లా ఎట్లా ఎట్లా ఎట్లెట్లెట్లా -" అంటూ ఎల్లారీశ్వరి, "అట్లా గట్లా గట్లా అట్లట్లట్లా - " అనంటూ ఘంటసాల ఎట్లాగోట్లా సర్దేసినా అసలైన yodeling "ఒడిలెహీ.. ఒడిలెహీ.. ఒడిలెహీ.." చెయ్యడం మాత్రం వింటుంటే అది ఘంటసాల పాడినట్లు అస్సలు అనిపించలేదు నాకు, నా చెవులకు.
ఓ రెండు-మూడు సార్లు పట్టిపట్టి విన్న తర్వాత నా చెవుల్లో మెరిసిన మెరుపులు నా కళ్ళ దాకా పాకాయి. ఎందుకో తెలుసా?
తెలుగు పాటలో "ఒడిలెహీ.. ఒడిలెహీ.. ఒడిలెహీ.." అని పాడిన గొంతు మన ఆబాలగోపాల-మనోహర-గళ-సదాబాల-బాల సుబ్రహ్మణ్యం గొంతు.
అది వినగానే సంబరం పట్టలేక అపర్ణకి ఫోన్ చేసి ఈ రెండు పాటల్లో యోడలింగ్ గురించి చెప్పి - "ఈ పాటలు దొరగ్గానే - నా పరిస్థితి ]'కోతికి కొబ్బరికాయ దొరికినట్టుంది'. వెంటనే బ్లాగ్ రాయాలనుంది" అని నేననగానే "కలిసొచ్చే నీ బ్లాగ్ కాలానికి నడిచొచ్చే కోతి వీడియో ఒకటిస్తానిదిగో" అంటూ అపర్ణ ఒక కొబ్బరికాయ దొరికిన కోతి వీడియో ఒకటి పంపింది.
ఒక్కోసారి - విన్నపాటునే - విన్న పాటొకటి విడవబోవని రాగమై చుట్టుకుంటుంది. ఆ రాగమే - ఇంకెప్పుడో ఇంకో పాటగా వినబడి వెదకబోవని తీగగా సాగి పట్టుకుంటుంది
ఇహ అప్పట్నుంచి - ఈ పాట కదిలితే ఆ పాటా - మెదులుతూనే వుంటుంది ఆ పాట మెదిలితే ఈ పాటా - కదులుతూనే వుంటుంది ఒకదానితో కలిసి మరొకటి - మెదులుతూనే వుంటుంది ఒకదాని తర్వాత ఇంకొకటి - కదులుతూనే వుంటుంది ఒకటి మొదలిడి సాగిన పూట మరొకటి - మెదులుతూనే వుంటుంది ఒకటి ముగిసి ఆగిన చోట ఇంకొకటి - కదులుతూనే వుంటుంది ఈ పాట - మెదులుతూనే వుంటుంది ఆ పాట - కదులుతూనే వుంటుంది
*******
*******
చిన్నప్పుడు ఆ పాట మొట్టమొదటిసారిగా విన్నది - మాటలు పలక మీద రాసుకుని చూసుకుంటూ, కనబడ్డ కాయితాల మీదున్న మాటల్ని కూడబలుక్కుని చదువుకుంటున్న రోజుల్లో.
విన్నప్పుడు పాట లోని మాటలు అర్థమయేంత భాష తెలీదు కానీ పాటని మెచ్చడానికి భాష అవసరమనిపించని వయసు కాబట్టి - వినీ వినగానే పాట నచ్చేసింది. ఇహప్పట్నుంచీ రేడియోలో ఆ పాట ఎప్పుడు వినిపించినా - నచ్చిన చుట్టమేదో చెవుల ముంగిటి లోకి వచ్చినట్టనిపించేది.
చాలా ఏళ్ళ తర్వాత - ఐదవ తరగతి పూర్తయ్యి - ఆ వేసవి సెలవుల్లో హైద్రాబాదు ప్రభావతి దొడ్డ ఇంటికి వెళ్ళినప్పుడు - అక్కడ బ్లాక్&వైట్ డయనోరా టీవీలో అసలుకి రంగురంగుల సినిమా అయుండీ నలుపు-తెలుపుల్లో కనిపించిన హిందీ సినిమా "రజనీగంధా" చూశాను. అప్పటికి హిందీ అక్షరాల స్థాయి లోనే వున్న నాకు ఆ సినిమాలో అర్థమయింది ఒకటే - రజనీగంధా అంటే - నాకు తెలిసిన - మంచి వాసనొచ్చే - తెలతెల్లని లిల్లీ పూలని!
అన్నట్టు లిల్లీ పూల గురించి ఇంకో ఇష్టమైన జ్ఞాపకం. కాకినాడలో మేము అద్దెకున్న సుబ్బారావు మాస్టారి ఇంటి ముందు నాయకర్ గారి మేడ వుండేది. ఆ ఇంట్లో పిల్లలు సపనా, సుమన, శ్రీనివాసులు నాకు స్నేహితులు. వేసవి సెలవుల మధ్యాహ్నాలు వాళ్ళింట్లోనో పాడుకుంటూనో , సాయంత్రాలు మా ఇంటి డాబా మీద ఆడుకుంటూనో మహ జోరుగా సాగిపోయేవి. ఆ నాయకర్ల ఇంట్లో చిన్నచిన్న కూజాల్లో మంచినీళ్ళలో లిల్లీపూలు వేసేవారు. మధ్యాహ్నపుటెండపూట ఆటపాటల్లో అలుపు తీరడానికి ఆగి - ఓ గుక్క ఆ లిల్లీపూల నీళ్ళు తాగుతుంటే - గొంతు లోకి చలచల్లగా జారిన ఒక పరిమళభరితమైన రుచి ఇప్పటికీ నాకు గుర్తే!
లిల్లీ పూల కబుర్లు ఇల్లిక్కడ ఆపి - మళ్ళీ వెనక్కి మళ్ళి ఆ హిందీ సినిమా దగ్గరకెళ్తే ...రజనీగంధా సినిమా చూస్తూ వుండగా, వుండగా - ఓ టాక్సీలో హీరోయిన్ను, ఇంకొకతను ఎక్కి వెళ్తుండగా - ఓ పాట మొదలవుతుంది. వాళ్ళు టాక్సీలో వెళ్తున్నంత సేపూ ఆ పాట వస్తూనే వుంటుంది. ఆ పాట గురించిన రెండు తమాషా జ్ఞాపకాలు ఏంటంటే...
ఒకటి - ఆ పాట అచ్చు నాకు అంతకు ముందు నచ్చిన తెలుగు పాటలా ఉండడం.
రెండో తమాషా విషయమేంటంటే... అదే మొదటి సారేమో నేను హైద్రాబాదు లాంటి పెద్ద సిటీకి వెళ్ళడం - అక్కడ టీవీలో సినిమా - అందులోనూ హిందీ సినిమా చూడడం.
ఆ పాట చూసింతర్వాత నేనేమనుకున్నానంటే - హైద్రాబాదు లాంటి ఊళ్ళలో మనం ఏదన్నా టాక్సీ ఎక్కితే అలా ఎక్కడో బ్యాక్-గ్రౌండులో మ్యూజిక్కూ, దాంతోపాటే హిందీ పాటలొస్తాయని.
అది సినిమాలో పాట అని నాకు తట్టనేలేదు. కాకపోతే అప్పుడు ఆటోలు, రిక్షాలు తప్ప టాక్సీ ఎక్కలేదు కాబట్టి - అలా నా వెనకాలే పాట పరిగెడితే వినే అవకాశం రాలేదని బోల్డు దిగులుగా అనిపించింది కూడా.
ఇప్పటికీ ఆ రజనీగంధా సినిమా పాట చూస్తే ఆ చిన్ననాటి అమాయకపు తలపు గురుతుకొచ్చి మురిపిస్తుంటుంది.
*******
*******
ముందుగా మొదట విన్న పాట - తెలుగు పాట - "చైర్మన్ చలమయ్య " సినిమా లోది. ఆ పాట "నయనాలు కలిసె తొలిసారి...". సినిమాలో ఆ పాటకి ఆంధ్రా-దిలీప్ కుమార్ అని పేరెన్నిక గన్న చలం, రివాల్వర్ రాణిగా గన్నులు పేల్చిన విజయలలిత - వీళ్ళిద్దరూ కలిసి తెలుగు సినిమా పాటలకి ఆటపట్టైన మైసూర్ బృందావన్ గార్డెన్సులో పరుగులు పెడుతూ ఆడుకున్నారని, పాడుకున్నారని మొన్ననే యూట్యూబ్ చెప్పింది.
ఈ పాట వివరాలు వెతుకుతుంటే దొరికిన వివరాల్లో - నాకు - మెరుపుల్లా బోల్డు తమాషాలు కనిపించాయి.
అందులో మొట్టమొదటిది - ముఖ్యమైనది ఏంటంటే - తెలుగులో ఆరుద్ర రాసిన పాటకి సంగీతం కట్టినవారు సలిల్ చౌధరి.
ఆయన ఇదే వరసలో ఒక హిందీ పాట (ముఖేష్), ముగ్గురు పాడిన రెండు బెంగాలీ పాటలు (పింటూ భట్టాచార్య, లతా మంగేష్కర్ విడివిడిగా పాడిన ఒక పాట, విడిగా గౌతమ్ దాస్‌గుప్తా పాడిన ఇంకో పాట), వీటన్నితో పాటు ఇద్దరు (బాలు, సుశీల) పాడిన ఒక తెలుగు పాట - వెరసి నాలుగు పాటలకి ఒకే ట్యూన్ వాడారు.
పై లెక్క గజిబిజిగా వుంది కదా?! అదే నా ఈ బ్లాగు శీర్షికకి మూలం, ఆధారం - వెరసి మూలాధారం. దాని లెక్క తేలుస్తా - కొంచెం ఓపిక పట్టండి మరి!
ప్రస్తుతానికి ఇక్కడ తెలుగు పాట గురించి ఓ పుంజీడు కబుర్లు. తెలుగు పాటలో మొదటి చరణంలో బృందావన్ గార్డెన్స్ కనిపిస్తే, రెండో చరణంలో కృష్ణరాజసాగర్ డామ్ దగ్గర పాలవెల్లువలా పొంగుతున్న కావేరీ నదీమతల్లి చిందులేస్తూ కనిపిస్తుంది.
ఇక పాటలో కనిపించే చెట్లూ, పూలూ, దూది మబ్బులూ, నీటి తుంపర్లూ, డామ్ పక్కనున్న మెట్లూ, హీరో-హీరోయిన్నుల క్లోజప్పులో పెట్టిన తళుకుబెళుకుల కెమెరా-ఫిల్టర్లూ - ఇవన్నీ కూడా ఒక పెద్ద visual bonus!
ఈ పాటలో పల్లవిలో మొదటి వాక్యం పాడినప్పుడు - ఎస్పీ బాలు, సుశీల - ఇద్దరూ కూడా ఆ ఎత్తుగడలో - బెంగాలీ సంగీత దర్శకుడు సలిల్ చౌధరి ఎలా పాడి చూపించారో - అచ్చు అల్లాగే తెలుగుని పట్టిపట్టి పాడారేమో అనిపిస్తుంది నాకు. అయినా అది కూడా పాటకి ఒక అందాన్నిచ్చింది. పాట మధ్యలో వినిపించే "లలల్లాల్లా, అహహా, ఎహెహే" లాంటి హమ్మింగులు కూడా కొత్తగా వినిపిస్తాయి.
ఇక ఇప్పుడు తెలుగు పాటకి కవల పాటైన హిందీ పాట గురించి - ఓ నాలుగు కబుర్లు.
హిందీ సినిమా "రజనీగంధా" లో "కయీ బార్ యూ హీ దేఖా హై" పాటని రాసినవారు యోగేష్ గౌర్.
సంగీతం సలిల్ చౌధరి.
పడిశపు-గొంతుతో పాడినట్టున్నా - ముఖేష్ పాడిన ఈ పసిడి పాట soothing గా అనిపిస్తుంది.
పాటలో కనిపించేవారు - నీలంచీర కట్టుకున్న విద్యా సిన్హా, గడ్డంజుట్టు-సిగరెట్టు-సహిత-దినేష్ ఠాకుర్, మధ్యలో ఓ రెండు నిముషాలు మెరుపులా మెరిసే అన్‌మోల్-అమోల్ పాలేకర్. వీళ్ళే కాకుండా పాట మొదలైన దగ్గర్నుంచి కనిపించే పచ్చకప్పు-నల్లటాక్సీ.
ఈ పాటలో నాకు నచ్చేవి ఓ మోస్తరు జాబితానే వుంది.
విద్యాసిన్హా కట్టుకున్న ప్రకాశవంతమైన తెల్లపూల నీలం రంగు చీర, అల్లుకున్న జడ, పెట్టుకున్న నల్లద్దాల కళ్ళజోడు బావుంటాయి.
దినేష్ ఠాకుర్ తొడుక్కున్న నీలం ముగ్గుల తెల్లచొక్కా కూడా బావుంటుంది విద్యాసిన్హా చీరకి మాచింగ్‌లా.
టాక్సీ కిటికీల్లోంచి కనిపించే ఆ నాటి బొంబాయి నగరపు డబుల్-డెకర్ బస్సులు, ఒకదానిమీద ఒకటిగా పేర్చినట్టున్న అపార్టుమెంట్లు, నెత్తి మీద మూటలు మోస్తూ హడావిడిగా పరిగెడుతున్న టాక్సీలు, మనుషులు - ఇదింకో visual bonus!
"రాహోం మే ..." అన్న చోట సాగుతున్న దారిని చూడమన్నట్టుగా కారు కిటికీ అద్దం మీద కనిపించే విద్యా సిన్హా చూపుడు వేలు ఆవిడ అనుకోకుండా పెట్టిందో, దర్శకుడు బసు ఛటర్జీ చెప్తే కావాలని పెట్టిందో కానీ - ఆ చేతి భంగిమ నాకు చూడడానికి బావుంటుంది.
"జో ఖిలే హై - ఫూల్ ఫూల్ - ముస్కురాకే" అన్న వాక్యం దగ్గర గాలికి ఎగిరెగిరి పడుతున్న చీరకొంగు పాటకి ఆడుతున్నట్టు కనిపిస్తుంది. భలే!
"జానూ న -జానూ న" అన్న దగ్గర తెల్లచీరలో - ఎఱ్ఱ రిబ్బన్లతో రెండు జళ్ళ-సీతలా కనిపించే బొద్దు-విద్య ముద్దుగా వుంటుంది. అక్కడే గడ్డం లేని దినేష్ ఠాకుర్ కూడా మబ్బు కమ్మని చంద్రుళ్ళా మెరుస్తాడు ఓ క్షణం పాటు.
ఏ పాట రాసే ముందైనా ఆ పాట గురించి సరైన వివరాలు రాద్దామని గూగుల్ చేస్తుంటాను. ఈసారి ఈ హిందీ-తెలుగు కవల పాటల గురించి రాస్తూ సలిల్ చౌధరి గురించి తెలుసుకుందామని వెతికితే ఈ రెండు పాటలకి తోడు ఇంకో మూడు బెంగాలీ పాటలు వున్నాయని తెలిసింది.
ఇప్పుడు ఈ పాటల గురించిన నాదైన పొడుపుకథ నేనే విప్పుతా!
"సలిల్ చౌధరి కన్న కవలలంటే - నాలుగు మంచంకోళ్ళలా - పంచపాండవులన్నమాట!"
అంత కన్నా ముందు ఇంకొక్క చిన్నమాట.
"సలిల్ చౌధరి" లో సలిల్ అన్న పేరు ఎంత సలలితంగా అనిపిస్తుందో నాకు. సలిల్ అంటే నీరు కదా! ఆ పేరూ అంతే చల్లగా ధ్వనిస్తుంది.
ఈ పాటల్లో నాకు తట్టిన కొన్ని అంకెలు, లెక్కలు, లాజిక్కులు కూడా చెప్పేస్తా!
6 - 5 - 4 - 3 - 2 - 1....
హిందీ, బెంగాలీ భాషల్లో విడివిడిగా ఏకగళగీతంగా, తెలుగులో కలివిడిగా యుగళగీతంగా పాడిన వారు ఆరుగురు (6) - ముఖేష్, పింటూ భట్టాచార్య, లతా మంగేష్కర్, గౌతమ్ దాస్‌గుప్తా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పీసుశీల.
ఇందులో అబ్బాయిలు నలుగురు (6), (2) .
పైన చెప్పుకున్నవి మొత్తం ఐదు పాటలు (5) - ఒక తెలుగు (1), ఒక హిందీ(1), మూడు బెంగాలీ(3).
కానీ సరిగ్గా చూస్తే అవి నాలుగే (4) - ఎందుకంటే బెంగాలీ పాటలు లెక్కకి మూడైనా - అందులో ఒక పాట రెండు సార్లు లెక్కకొచ్చింది. "ఆమి చొల్తే చొల్తే థెమె గేచ్చి" పాటని పింటూ భట్టాచార్య, లతా మంగేష్కర్ ఇద్దరూ విడివిడిగా పాడారు. ఇంకో పాట గౌతమ్ దాస్‌గుప్తాది. అలా బెంగాలీ పాటలు రెండయ్యాయి. (2).
అన్నిటికీ ఒక్కరే సంగీత దర్శకులు - సలిల్ చౌధరి (1).
నేను మొదట అనుకున్నది హిందీ-తెలుగు కవల పాటలే (2). కానీ తీరా చూస్తే ఐదు (5) పాటలున్నాయేమో అనిపించే నాలుగు (4) పాటలు మాత్రమే!
అందుకే అనుకున్నా "సలిల్ చౌధరి కన్న కవలలంటే - నాలుగు మంచంకోళ్ళలా - పంచపాండవులన్నమాట!" అని.
*******
*******
అవండీ ఇవాళ్టి పాటల కబుర్లూ, పాటల మాటున పొడుపు కథలూ, ఆ పొడుపు కథల విడుపు కబుర్లూ...