డిగ్రీ
చదివేటప్పుడు కొనుక్కున్న మొట్టమొదటి తెలుగు నవల - మొక్కపాటి
నరసింహశాస్త్రిగారి 'బారిష్టర్ పార్వతీశం'. అందులో పార్వతీశం పడ్డ అవస్థలు
చదివి - తర్వాత తల్చుకుని, తల్చుకుని నవ్వుకున్న రోజులు ఇంకా ఇప్పటికీ
గుర్తున్నాయి.
మరి పార్వతీశం గార్ని చూసి నవ్వుకున్న పాపం వూరికే
వదుల్తుందేంటి మరి? 'ఆయ్ - హన్నా - నన్ను చూసి నవ్వుతావూ ! ఇంతకింతా నువ్వూ
నవ్వుల పాలవుతావ్' - అని ఆయన పాత్రాత్మ అందేమో - ఆ విధంగా పార్వతీశంగారి
ప్రహసనపు వారసత్వం కొనసాగించే ఆ పరిహాసపు వరం నాకే దక్కిందేమో :)
పుల్లైన పుల్-హియర్
2001వ సంవత్సరంలో అప్పుడప్పుడే US లో రిసెషన్ మొదలయిన రోజులు-
ఏ షాపింగ్ మాల్ దగ్గర చూసినా ఖాళీగా వుండే పార్కింగ్ లాట్స్ చూస్తే దిగులు
వీకెండ్ వస్తే - ఏమన్నా కావలిస్తే అని కాక ఏమైనా కొని - అమెరికా వాడి ఋణం తీర్చేసుకోవాల్సిందే అన్న తీర్మానాలు
ప్రతీ నెలలో - ప్రతి శనివారం - అదేదో ఉద్యాపనే లేని వారాంతపు-నోము పట్టిన వాళ్లమై
'కదలి రండి మనుషులైతే - కొనుక్కుపొండి డబ్బులుంటే' అన్న స్వయం-ప్రకటిత నినాదంతో, రెట్టించిన సామానోత్సాహంతో
ఎక్కే మాలూ-దిగే మాలూ, నింపే సంచీ-మోసే సంచీ గా
మా వంతు అమెరికా ఆర్ధిక వ్యవస్థకి పునాది రాళ్ళం (మేమే అని ఫీల్) అయిపోతున్న రోజులవి.
అలాంటి
ఒకానొక రోజున వాల్-మార్ట్ కి వెళ్లాము. అప్పటికింకా ముగ్గురమే కదా -
ఎలెక్ట్రానిక్స్ వైపు నాన్న, బుజ్జి-జింక, వంటింటి సామాను వైపు అమ్మ - ఎవరి
డిపార్టుమెంట్ వాళ్లు గొడవలేకుండా పంచేసుకుని - మా తలలు వంచేసుకుని -
మనమింకా కొనకుండా ఏం మిగిలాయా - అని వెతికేసుకుంటున్నాం.
అదుగో
- అప్పుడే - అలా అక్కర్లేనివన్నీ కార్టులో నింపుకుని వస్తున్నవేళ - ఒక చోట
rack లో స్కార్ఫులు కనిపించాయి. రంగులు-రంగులుగా బావున్నాయి - చూద్దామని
ఆగాను. ఒక దాని మీద ఒకటిగా stack చేసి వున్న ఆ రాక్స్ లోంచి నాకు కావాల్సిన
దాని ఎలా బయటికి లాగాలో తెలీలేదు. చూస్తే ఒక చోట "Pull Here" అని రాసి
వున్న ఒక పసుపు రంగులో వున్న టాబ్ కనిపించింది.
అంతే - అమెరికా కనిపెట్టినప్పుడు
కొలంబస్ కూడా అంత ఆనందించి వుండడు - అంత పట్టరాని ఆనందంతో - కిందకి వంగి
రెండు చేతులు పెట్టి ఆ టాబ్ ని ఒక్క లాగు లాగాను - దెబ్బకి ఊడి వచ్చింది.
అప్పుడు తట్టింది నాకు - నేను pull చేయాల్సింది 'Pull Here' అని రాసి వున్న
ఆ టాబ్ ని కాదూ - అక్కడ పట్టుకుని లోపలకి వున్న ఆ rack నీ - అని. కిందకి
వంగిన దాన్ని అలాగే కింద కూర్చుండి పోయి - దొర్లడం ఒక్కటే తక్కువగా -
బుగ్గలు నొప్పొచ్చేలా నవ్వాను. పక్కనే ఏదో సర్దుతున్న ఎసోసియేట్ ఒకావిడ
ఉలిక్కిపడి ఒక్క గెంతులో అవతలకి దూకింది. అది మొట్టమొదటి ప్రహసన-సంబోధనా-యోగ్యానుభవం.
పలువిధముల్ - ఫాసెట్ వైఖరుల్
అసలు ఎప్పటికైనా Understanding the American Faucet అనే పుస్తకం రాయాలని నా కోరిక - తీరుతుందా లేదా అనేది తర్వాత సంగతి.
ఇండివిడ్యుయాలిటీకి అసలు-సిసలైన ఉదాహరణలా ఉంటాయి - ఇక్కడ కుళాయీ-మణులు.
అరె!- అసలు - ఒకటి వున్నట్టు ఒకటుండదు సరే! - ఒకటి పని చేసినట్టు ఇంకోటి చేయదు మరి !.
ఒక రకమేమో ఏక్-నిరంజన్ లాగా
వేడీ-చల్లా - అన్నిటికీ నేనే
వేడికి ఎడమా - చల్లకి కుడీ తిప్పు - అంటుంది
ఒకటేమో
ఇరుగడల ఉడుకూ-చల్లనా పిడులూ
ఏది కావలిస్తే అదే తిప్పూ - అనేలా వుంటుంది
ఇంకోటేమో నెత్తిన మొట్టు - నీళ్లిస్తా అంటుంది
ఇంకో కుళాయి మొడితే కుదరదు - చేతులాడించు నాముందు అంటుంది
ఇన్ని కుళాయి-హృదయాలూ నేర్చి
హమ్మయ్య - ఏ కుళాయి అయినా తిప్పేయగలనింక - అని అనుకుంటానో లేదో
వెళ్లిన ప్రతీ చోటా ఇంకోరకం - కొరకరానికొయ్య చుట్టరికం
మళ్లీ నా learning-curve మొదటికెళ్ళడం
ఇంకో కుళాయి-హృదయం నా అధ్యయన విషయం
ఇదింకోరకమయిన ప్రవాస ప్రహసన-పర్వం :)
ఈ కబుర్లు అసలెలా మొదలయాయంటే
పుట్టిన ఊరు - మెట్టిన నాడు వదిలి ప్రవాసం వచ్చి పుష్కరం-పావు దాటింది.
బోల్డంత తెలివిడి కలిగింది అని నేనెక్కడ అనుకునేసి రిలాక్స్ అయిపోతానో అని
అలా నేననేసుకుని నిజంగా నాకు తెలివొచ్చేస్తే తన వారసత్వం కొనసా....గించేదెవరూ అని
పార్వతీశంగారి బెంగేమో మరి -
ఎప్పటికప్పుడు కొత్త నవ్వుల పాలవడం -
ఆ నవ్వుల పాలు అందరికీ పంచడం నాకు మాత్రమే రాసున్న ప్రహసన-వరమేమో మరి
మళ్లీ ఇవాళ ఒక సరదా కబురు చెప్పే వేళయింది.
ఇవాళ రొటీన్ గా జరిగే ఒకానొక డాక్టర్ అపాయింటుమెంట్ కోసం వెళ్ళాము. బదరి రిసెప్షన్ డెస్క్ దగ్గర పేపర్ వర్క్ ఏదో నింపుతున్నారు.
నేను చుట్టూ చూస్తూ - నా ఎదురుగా ఒక అమ్మాయి కాఫీ తెచ్చుకుంటూ వుంటే - నేనూ తాగుదామా అని - తనెక్కడినుంచి కాఫీ తెచ్చుకుందా అని చుట్టూ చూస్తున్నాను.
ఎదురుగుండా గోడకి ఒక చిన్న డిస్పెన్సర్ లాంటిది - దాని పైన Coffee అన్న అక్షరాలూ కనిపించాయి.
"భలే - ఎంత ముద్దుగా వుందో - ఈ Coffee Maker - గోడకి ఫిక్స్ చేశారు. ఇంతకీ ఇందులోకి పాలు, నీళ్లు వచ్చే పైపులు ఎక్కడ ఉన్నాయో - అవి కూడా కనిపించకుండా ఎంత నీట్ గా వుంది" - అని తెగ ముచ్చట పడిపోయాను.
నయం - లేచి వెళ్లి దానికింద కప్పు పెట్టలేదు :))
అలాగే కూర్చుని - ఇంకా నా గోడ-కాఫీ-అబ్బురావస్థలో నేను వుండే - మళ్లీ దానికేసి చూస్తే అర్థం అయింది ఏంటీ అంటే -
అది ఒక Hand-Sanitizer-Dispenser అనిన్నీ
ఆ పైన Coffee అని రాసి వున్నది - ఆ వెనకాల వున్న Coffee-Break-Room ని గురించి అనిన్నిన్నీ
ఇంటికి వచ్చాక బుజ్జి-జింకకి నా కాఫీ-అయోమయం గురించి చెప్తే - ఇంతకూ ముందెప్పుడో మేమిద్దరం రీడర్స్ డైజెస్ట్ లో చదివిన ఒక జోక్ గుర్తు చేసుకుని నవ్వుతూ నేల మీద దొర్లినంత పని చేసాడు.
ముక్తాయింపుగా ఆ రీడర్స్ డైజెస్ట్ జోకిక్కడ :
మొదటిసారిగా ఫ్లయిట్ ఎక్కిన ఒకాయన తనకి సర్వ్ చేసిన డ్రింక్ తాగి ఇంకో సెర్వింగ్ కావాలనుకుని - అది ఎలా అడగాలో తెలియక - పక్కనే కళ్లు మూసుకుని వున్న ఇంకో ఆయన్ని కదిపి - 'ఇంకో డ్రింక్ కావాలి - ఎలా తెప్పించుకోవాలి' - అని అడుగుతాడు.
ఆ కళ్ళు తెరిచినాయన ఏం మాట్లాడకుండా - చెయ్యి పైకెత్తి పైన వున్న స్విచ్ చూపిస్తాడు - అది నొక్కి ఫ్లయిట్ అటెండెంట్ ని పిలవాలి అన్నట్టు.
వెంటనే ఆ డ్రింక్ కావాల్సినాయన - తన చేతిలోని - గ్లాసుని పైకెత్తి ఆ స్విచ్ కింద పెడతాడు - అందులోంచి డ్రింక్ వస్తుందేమో అన్నట్టు :))