గీతం...సంగీతం...సతతహరితం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
గీతం...సంగీతం...సతతహరితం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, ఫిబ్రవరి 2024, శనివారం

గీతం...సంగీతం...సతతహరితం - 17 - ఈ పాట విన్న - దిల్ వో చలా... ఆ గాలిలో అలా...అలా...

ఈలపాటల గాలి ఆగి ఆగి వీచె
తూలు గాలి అలల మీద 
మెఱుపంచు కోక గట్టి
తువ్వర మువ్వ గజ్జె కట్టి
తూగి సోలుతున్నదెవరది?

చిందులేయు చిన్నారి 
చినుకుదారి చిఱుతుక
నీలిమబ్బు తునక కాక
ఇంకెవరది?
ఆగి ఆగి వీచు గాలి తోన తానె సాగివచ్చె

పాట వినగోరు వీనులకి
గాలి అలల ఈలపాట...
గాలి పాడు పదమది ముందో?
గాలి యీల విన్న మబ్బుకన్నె తానాడెనో?!

ఆట కనగోరు కనులకి
నీలిమబ్బు తునక ఆట...
చింది కదులు పదమది ముందో?
మొయిలు చిందు కన్న గాలి పాట పాడెనో!?

గాలిమబ్బుల వెనకముందుల పంతాల్లో
ఆటపాటల వేడుకలు నా సొంతాలే!
నే జెప్పబోవు ఊసుపోని ఉదంతాలు 
ఆ సంగతుల-గతుల సంగతులే!


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    ఎప్పట్నుంచో - ప్రతి వారం వారం - "స్మర వారంవారం" - అనుకుంటూ వింటుంటున్నా - వింటూ వింటూ ఆ పాటలో లీనమై తేలిపోతూ వుంటున్నా - ఇప్పటి దాకా ఆ పాట గురించి చెప్పాలనుకున్నది చెప్పడానికి కుదరలేదు - కుదురూ చిక్కలేదు. 

    ఇవాళ మాత్రం - ఎలాహైనా రాహెయ్యాలంతే! - అని కూర్చున్నా. 

    సూద్దారి... ఈ దారి నెంత మాత్రం సాగుతానో మరి!

    అస్సలిదీ... - ఇదంటే - ఈ పాట వుందే - ఇది నిజ్జంగా ఓ గాలిపాట. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    గాలికి మొదలు ఎక్కడైనా వుండొచ్చు కదా! 

అప్పటిదాకా 
సద్దు లేకుండా 
స్తబ్దుగా వున్న గాలి 
అలలు అలలుగా 
కదలి మెదలి
ఒక్కసారిగా 
పాలుమాలిక వీడి
పడి లేచే కెరటమైతే
ఎక్కడ సడి అడుగులు పడితే
అక్కడే మొదలనుకుంటే

    అదుగో...అచ్చంగా అల్లాగే వున్నట్టుండి వున్నపాటున మొదలైన పాట గాలిపాట కాక ఇంకేంటి మరీ?!


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    మరసలు ...కుదురైన పాటంటే ఏమిటీ...?

    తాళాలూ, కాలాలూ, స్వరాలూ, రాగాలూ, జతులూ, శ్రుతులూ, గతులూ,  సంగతులూ - ఇన్ని వరసలూ వ్యవహారాలూ వున్నదే కదా... !


    పలకరింపు లాంటి పల్లవి
    వెనువెంటనే చిరునవ్వు చిలకరింపు లాటి అనుపల్లవి
    ఆ తర్వాత వడివడిగా కలివిడిగా సాగే కబుర్ల లాంటి చరణాలు
    కదా! 

    కానీ అదే - 
    తొరపడో, తడబడో - 
    వాక మార్చి వరస విడిచి -
    పల్లవిని దాటి వురికి 
    అనుపల్లవి మాటే మరిచి 
    సరాసరి చరణానికి చరచరలాడితే ?!
    అది ఖచ్చితంగా గాలి తోడైన పాటే! 
    గాలికీడూజోడైన పాటే! 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    "ఈ పాటికి ఆ పాటేదో చెప్పెయ్యకుండా - 
    ఇప్పటి దాకా - 
    ఇదిగో పాటా, అదో గాలిపాటా - 
    అని ఆకుకి అందకుండా, పోకకి పొందకుండా - 
    గాలికబుర్లాడడమే తప్ప - 
    అసలా పాటేదో చెప్పడానికి పాటు పడకుండా - 
    అలాగని మా పాటికి మమ్మల్నొదిలేసి 
    మా పాట్లేవో మమ్మల్ని పడనీకుండా - 
    ఈ పాట-పోటు మాకేమిటి బాబోయ్!" 

    అని పాట కట్టి పాడేసుకోవాలనిపిస్తోందా? 



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఇంతసేపు ఎలాగూ ఆగారు - ఇంతవరకు ఎలాగోలా చదివారు. 

    ఇంకో గాలిపాట గురించి ఇంకొన్ని మాటలు కూడా చదివేస్తే - పాటమర్యాద పాటించినవారవుతారు.  

    అప్పుడెప్పుడో - బోల్డంత కథున్నా కూడా - "ఇది కథ కాదు" అనే ఓ సిన్మా వచ్చింది. 

    దాన్ని తీసింది బాధే చందమనే బాలచందర్. 

    అందులో "గాలికదుపు లేదు... కడలికంతు లేదు" అనే పాటొకటుంది. 

    నేనీ రోజు రాయబోతున్న హిందీ పాటుందే... అది విన్నప్పుడల్లా - వెంటనే ఈ తెలుగు పాట కూడా గుర్తొస్తుంది. 

    ఆ పాటలో కొన్ని వాక్యాలు....

    ఆ నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో...
    ఈ నేలపై నెమలినై ఆడనా ఆటలు ఎన్నో...
    తుళ్ళితుళ్ళి గంతులు వేసే లేడికేది కట్టుబాటు...?
    మళ్ళిమళ్ళి వసంతమొస్తే మల్లెకేల ఆకుచాటు...?

    ఆ పైన రాసిన  తెలుగు పాట చరణం అచ్చు ఈ కింద రాసిన హిందీ పాట చరణం లాగానే అనిపిస్తుంది నాకు.... 

    విన్న ప్రతిసారీ మాటలు కొంచెం అటూ-ఇటూగా వున్నా - మొత్తమ్మీద రెండిట్లో వున్న పాటాత్మ ఒకటేలా వుంటుంది. 

కల్ కే - అంధేరోం సే - నికల్‌కే
దేఖా హై - ఆంఖే - మల్‌తే మల్‌తే
హో... కల్ కే - అంధేరోం సే - నికల్‌కే
దేఖా హై - ఆంఖే - మల్‌తే మల్‌తే
హో...ఫూల్ హీ ఫూల్  - జిందగీ బహార్ హై
తయ్ కర్ లియా ఆ... ఆ... ఆ...



    ఇహిప్పుడు అసలు విషయానికొస్తా! 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    మన స్వామీ, వాడి స్నేహితుల గురించి మాల్గుడి కబుర్లు చెప్పిన ఆర్కే నారాయణ్ రాసిన "The Guide" అనే నవల ఆధారంగా తీసిన హిందీ సినిమా "గైడ్" అని ఒకటుంది. 

    బావుంటుంది. 

    యూట్యూబ్‌లో వుంటుంది. 

    ఇప్పటిదాకా చూసుండకపోతే ఓ పాలి చూసొచ్చేస్తే కూడా బావుంటుంది. 

    దాంట్లో కథానాయకుడు దేవానంద్. దానికి దర్శకుడు ఆతని తమ్ముడు విజయ్ ఆనంద్. కథానాయిక వహీదా రెహమాన్. 

    అన్నట్టు ఈ సినిమాని అమెరికాలో ఇంగ్లీషులో కూడా తీశారట. కానీ అందులో వహీదా లేదట. ఫ్లాప్ అయిందంటే అవదా మరి?!

    సరి! ఆ సినిమా ఇంగ్లీషులో హిట్టు కాదు ఫట్టు అని చెప్పేసుకున్నాం కదా!  

    హిందీ సినిమాలో బావుండే అన్ని పాటల్లోంచి అన్నిటి కన్నా నాకు బాగా అనిపించే పాట గురించి - హమ్మయ్య! - ఇహిప్పుడు చెప్తా. 

    ఆ పాట "కాంటోం సే - ఖీంచ్‌కే - యే ఆంచల్".
    రాసింది శైలేంద్ర.
    పాట కట్టింది సచిన్ దేవ్ (SD ) బర్మన్. 
    పాడింది లతా మంగేష్కర్.
    పాటకు ముందు మాట్లాడింది దేవానంద్.
    పాటలో ఆట్లాడింది వహీదా.

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఈ పాటలో అన్నిటి కన్నా ముందు, వెనక, ఆ తర్వాత కూడా వహీదా గురించి చెప్పుకోవాలబ్బా!

    మెరుపుతళుకులు కుట్టిన పచ్చనీలపు చీరా...
   
    జడ మొదట్లో మువ్వల జడబిళ్ళా...
    ఆ కింద జడ మధ్యలో పొదిగిన ఓ మువ్వ
     పొడుగాటి జడకి వేలాడుతూ జడకుచ్చులూ...

    చెవులకి లోలకాల్లా వూగుతున్న లోలాకులూ...
    కంబువంటి కంబువున తాల్చిన మిలమిలలదౌరు
    మోచేతిని తాకుతున్న చోళీ చేతులకి తళతళ మెరుస్తున్న గాజులు 
    ఎడమచేతి ఉంగరంవేలికో పూలవుంగరం 
    
    చీర మీదున్న మెరుపులని మించి తళతళలాడుతూ తళుకులీనే కళ్ళూ...
    ఆ కళ్ళని వెలిగించి - వాటిని మించి - పెదవుల మీద మించిమించారిన నవ్వులూ... 
    ఆ నడకలో లయలూ - నటనలో హొయలూ...
    చిత్తోడ్‌ఘర్ కోట మీద గాలి అలలలో అలలా - కలలోని కలికిలా - చిలికించిన అలవోక కదలికలూ...






    బావుంది వహీదా...

    ఎండుగడ్డిలో దొర్లుతూ
    కుండ ఎత్తి బద్దలుగొడుతూ
    ఒంటె మీద ముసుగులో కులుకుతూ
    కోటగోడల మీద కెరటంలా ఉరుకుతూ
    "కహీ న ఖో న జాఊ..." అని పరిసరాలు మరిచి మైమరచిపోతూ
    గుడి గోడల మీదున్న నాట్యాంగనల్లా భంగిమలు పెడుతూ
    అల్లా-ఉద్దీన్-ఖిల్జీ చూసిన రాణీ పద్మినిలా అద్దంలో కనిపిస్తూ
    కాదనుకున్న నిన్నని వదిలి రేపటి ఆమని నాదేనని ధీమాగా చెప్తూ... 

    దాక్కుంటూ ... దోబూచులాడుతూ... 
    ఎగురుతూ....గెంతుతూ... పరిగెడుతూ...
    పాదాలు గాలిలో తేలుతున్నట్టు సోలుతూ ... 
    
    ఎలా చూసినా - ఎన్నిసార్లు చూసినా 
    పాట ప్రతి frame లో 
    ఎంత బావుందో... వహీదా... 

   నాకు ఈ పాట చూసినప్పుడు కనిపించేది వహీదా మాత్రమే! 

   ఊపిరి సలపని బంధనాలు దాటి బయటపడిన గాలి సంబరంగా వేసే చిందులు  - కళ్ళకి కట్టినట్టు నర్తించి చూపిన వహీదా నటన ఎంత బావుందో చూసే కళ్ళకి రాయడం వస్తేనే సరిగ్గా చెప్పడానికి కుదురుతుంది. 

   కెమెరా కూడా వహీదాని ఎంత అందంగా చూపిద్దామా అని తహతహలాడినట్టనిపిస్తుంది.  

    ఆ కెమెరాని పట్టుకుని వహీదా ఎటెళ్తే  అటు - ఆమె చుట్టూ తిప్పిన  - ఫాలి మిస్త్రీకి కోటి దండాలు!
    


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    

      అప్పుడే జీవించాలనే ఆశ - 
    అలా జీవిస్తూనే మరణించాలనే లాలస -
    అదే .... ఈ పాటలో వినిపించే స్వేచ్ఛాన్వేషిత లిలీష!

    అవన్నీ కలిసున్న ఈ  పాట ఇష్టం. 
    ఈ పాటలో వహీదాని చూడడం ఇష్టం. 
    ఈ పాటలో వహీదానే పాడిందా అనిపించేంత లలితంగా పాట పాడిన లతా మంగేష్కర్ గొంతు ఇష్టం. 
    ఈ పాటలో వినిపించే వేణునాదం ఇష్టం, 

    ఈ పాటకి వున్న ప్రత్యేకత - పల్లవితో కాకుండా చరణంతో మొదలవడం. 

    ఈ పాటలో పల్లవి "ఆజ్ - ఫిర్ - జీనే కీ తమన్నా హై... ఆజ్ - ఫిర్ - మర్‌నే కా ఇరాదా హై... ". 

    కానీ మొదలవడం "కాంటోం సే - ఖీంచ్‌కే - యే ఆంచల్" అనే చరణంతోనే మొదలవుతుందనేమో -
ఎదురు చూడనపుడు వీచడం మొదలు పెట్టే కుదురు లేని గాలిలా అనిపిస్తుంది ఈ పాట.

    
   
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


ఈ పాటకి యూట్యూబ్ లింక్: 

పాట కూడా రాసి పెట్టా ఈ కింద! 

కాంటోం సే - ఖీంచ్‌కే - యే ఆంచల్
తోడ్‌కే బంధన్ - బాంధీ పాయల్
హో...కోఈ న రోకో - దిల్ కీ - ఉడాన్ కో
దిల్ వో చలా...  ఆ... ఆ... ఆ...

ఆజ్ - ఫిర్ - జీనే కీ తమన్నా హై... 
ఆజ్ - ఫిర్ - మర్‌నే కా ఇరాదా హై... 
ఆజ్ - ఫిర్ - జీనే కీ తమన్నా హై... 
ఆజ్ - ఫిర్ - మర్‌నే కా ఇరాదా హై... 

అప్‌నే హీ బస్ మే - నహీ మై
దిల్ హై కహీ - తో - హూ కహీ మై
హో...అప్‌నే హీ బస్ మే - నహీ మై
దిల్ హై కహీ - తో - హూ కహీ మై
హో... జానే క్యా పాకే - మేరీ జిందగీ నే
హస్‌కర్ కహా... హా... హా... హా...

ఆజ్ - ఫిర్ - జీనే కీ తమన్నా హై... 
ఆజ్ - ఫిర్ - మర్‌నే కా ఇరాదా హై... 
ఆజ్ - ఫిర్ - జీనే కీ తమన్నా హై... 
ఆజ్ - ఫిర్ - మర్‌నే కా ఇరాదా హై... 

మై హూ గుబార్ - యా - తూఫాన్ హూ
కోఈ బతాయే - మై కహా హూ
హో... మై హూ గుబార్ - యా - తూఫాన్ హూ
కోఈ బతాయే - మై కహా హూ
హో... డర్ హై - సఫర్ మే - కహీ ఖో న జాఊ మై
రస్తా నయా... ఆ... ఆ... ఆ...

ఆజ్ - ఫిర్ - జీనే కీ తమన్నా హై... 
ఆజ్ - ఫిర్ - మర్‌నే కా ఇరాదా హై... 
ఆజ్ - ఫిర్ - జీనే కీ తమన్నా హై... 
ఆజ్ - ఫిర్ - మర్‌నే కా ఇరాదా హై... 

కల్ కే - అంధేరోం సే - నికల్‌కే
దేఖా హై - ఆంఖే - మల్‌తే మల్‌తే
హో... కల్ కే - అంధేరోం సే - నికల్‌కే
దేఖా హై - ఆంఖే - మల్‌తే మల్‌తే
హో...ఫూల్ హీ ఫూల్  - జిందగీ బహార్ హై
తయ్ కర్ లియా ఆ... ఆ... ఆ...

ఆజ్ - ఫిర్ - జీనే కీ తమన్నా హై... 
ఆజ్ - ఫిర్ - మర్‌నే కా ఇరాదా హై... 
ఆజ్ - ఫిర్ - జీనే కీ తమన్నా హై... 
ఆజ్ - ఫిర్ - మర్‌నే కా ఇరాదా హై... 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

ముందు వెనకైన గాలిపాట 

గాలి లాగా అదాటుగా తేలి వచ్చి 
చెవికి సోకె ఈ పాట 

  ఈ పాట విన్న  - దిల్ వో చలా...  ఆ గాలిలో అలా...అలా...


~ పాటల భైరవి 

30, ఏప్రిల్ 2023, ఆదివారం

గీతం...సంగీతం...సతతహరితం - 16 - బంగరు సంజె పొద్దుల్లో ఓ పాట విన్నా... "పొన్ మాలైప్ పొళుదు"




జిలుగుల ముగ్గులేసే 
మలిసంజ వెలుగులు

కిలకిలమని పాటలాడే 
పులుగు ఎలుగులు

బిరబిరమని నేల చేరే 
కడలి పొర్లింతలు

కలకలమని నింగికెగసే 
పిల్లల కేరింతలు

వీటన్నిటికీ తోడుగా...

"హే...ఓ....మ్మ్...లల్లల్లా" మంటూ 
పాటే ప్రాణమన్నట్టున్న 
ప్రాణమే పాటైనట్టున్న 
"బాల" గంధర్వుడి 
ప్రాణస్వరం 


అలలు అలలుగా నీటిపై తేలుతున్నట్టు
అల్లరల్లరిగా గాలిలో తూలుతున్నట్టు
పువ్వుల పుప్పొడిని అద్దుకున్నట్టు 
నవ్వులో ముంచి తీసినట్టు 
తళుక్కుమన్న తమిళ తేనె పదాలు 
కూనిరాగాలు... 
హాయిగానాలు... 

ఇలాతలంపై 
ఈ పాటని ఇంకెవరు పాడినా 
ఇలా - తళుకు మలాము - రాసినట్టుండదండీ... 
అలాగని నే రాసిస్తానండీ!
ఒట్టండీ! 
ఒప్పుకోవాలండీ!

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***



ఇల కోడి కూతతో తెల్లవారి మెలకువలైనది మొదలు 
ఇలకోడి సద్దుతో సద్దుమణిగి కలలూరు వేళల వరకు... 

చెప్పాలంటే - నాకది మామూలే! 

తలచిన తలపుకి నవ్వొస్తే ఆ నవ్వుకి ఇంకో నవ్వు కలుపుకోవడానికో -
ఏదో గుర్తొచ్చి ఎదలో ఎక్కడో ఏదో గుచ్చిన కంటి తడుపుకి తుడుపుగానో -
ఓ పాటని తోడు తెచ్చుకోవడం...
ఆ పాటలో నవ్వు పెంచుకోవడం...
ఆ పాటతో నొవ్వు తుంచుకోవడం...
చెప్పానుగా... నాకిది మామూలే! 

ఏ నాటికీ - పాటకది పరిపాటే!

ఒక్కోసారి - ఒక పాట - పాతనేస్తమల్లే చేరి - వాడుకగా - అందేస్తుంది. 
అంది - అప్పటికి మురిపించి - మళ్ళొస్తానని - మనసు మఱగున - ఒదుగుతుంది. 
ఇంకో మాటు - ఒక పాట - అనుకోని అతిథిలా వచ్చి - వేడుకగా - అలరిస్తుంది. 
అలరించి - ఎప్పటికీ మరవకని - నను వీడనని - మదిని నెయ్యమై - ఒద్దికౌతుంది. 
ఏనాటికైనా ... పాటకిది పరిపాటే!

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    సరిగ్గా నెల క్రితం - పైన నే చెప్పినట్టు - అచ్చు అలానే - అనుకోని అతిథిలా - నాకో పాట దొరికింది. 

    అదెలాగో - అదేం పాటో - ఆ పాట ఊసులే ఈనాటి నా కబుర్లు. 

    ఇళయరాజా పాటలు ఇప్పటివి కాదు కానీ 80 లు - 90 ల నుంచి వెతుక్కుని వినడం - ఆ nostalgia తో ఒకప్పుడు వుండొచ్చిన వూళ్ళన్నిటిలో నడిచొచ్చిన దారుల్లో ఆ పాటల్ని విన్న మొట్టమొదటి క్షణాల్ని గుర్తు చేసుకోవడం నాకిష్టమైన వ్యాపకం. 

    ఓ రోజలాగే ఇళయరాజా పాటల్ని వెతుక్కుంటున్న నేను - యూట్యూబ్లో "SPB | Ilaiyaraja song" అన్న మాటలు చూసి అనుకోకుండా ఓ పాట మీద click చేశాను. 

    ముందు కొన్ని పిట్ట కుహుకుహూలు - వెంటనే ఇళయరాజా గిలిగింతల జంత్ర గతులు - ఆ వెంటనే.... "హే... ఓ.... మ్మ్... లలల్లా... అంటూ సుబ్బయ్య గొంతూ... విన్నాను. 

    అంతే! 

    అప్పట్నుంచీ ఇప్పటి దాకా ఆ పాట ఎన్నిసార్లు  మళ్లీ మళ్లీ విన్నానో లెక్కలేదు. 

    విన్నకొద్దీ చెవులకి చవులూరించే పాట. 

    వినకపోతే "నన్ను వినవా?!" అంటూ వీనుల చేరే పాట. 

    ఇంత ఆరాట పెడుతున్న పాట పుట్టుపూర్వోత్తరాలు ఏంటా అని ఆరా తీస్తే తెలిసింది ఏమిటీ అంటే ఇది వైరముత్తు రాసిన మొట్టమొదటి పాటట. భారతీరాజా తీసిన నిళగళ్  (1980) అనే సినిమా లోది. ఈ పాటలో కనిపించిన S. రాజశేఖర్‌కి ఇది మొదటి సినిమాలాగా అనిపించింది. 

    ఈ పాటలో సముద్రపుటొడ్డు  దగ్గర మొదలుపెట్టి, సరివి తోటలు దాటి, రోడ్డు మీద చెట్ల దాకా పరిగెడుతూ - మధ్యమధ్యలో డాబా ఎక్కి ఆకాశం కేసి కళ్ళు తిప్పి చూస్తూ ఈ ఎస్రాజశేఖరుడు చేసిన అభినయం రొంబ నల్లా ఇరుక్కు! 

    పాడింది ఎస్పీబీ, పాడించింది ఇళయరాజా కాకపొతే ఈ పాట గురించి ఈ నాటి ఈ రాతే లేదు కాబట్టి వాళ్ళ గురించి ముందే చెప్పేశా కదా! 

    పైన చెప్పిన పెద్ద వాళ్లందరికీ పేరుపేరునా దండాలెట్టుకుంటూ ఇహిప్పుడు అసలు పాట గురించి. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఈ పాట వినగానే - ఇందులో చప్పున అర్థమైన ఒక వాక్యం "వానమ్ ఎనక్కొరు  బోధి మరమ్". ఇంతకు ముందు విన్న కొన్ని తమిళ పాటల వల్ల నాకు "వానమ్***" అంటే ఆకాశం అని తెలుసు. 

    కన్నడ "మర" పరిచయం వుండడం వల్ల "మరమ్" అంటే తరువు అనిన్నీ తెలుసు. 

    "ఎనక్కు", "ఒరు" - అంతమంది తమిళ నన్బర్గళ్ ఉన్న నాకు ఈ మాటలు తెలీవంటే ఎల్లాగూ?!

    మొత్తానికి ""వానమ్  ఎనక్కొరు  బోధి మరమ్" అనగా "ఆకాశం నాకొక బోధి తరువు" అన్న తాత్పర్యం బోధపడింది. 



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఆ ఒక్క వాక్యం అర్థం కాగానే నాకమాంతం ఆ పాట మీద అభిమానం అంతై ఇంతై ఎంతెంతో ఐపోయింది. 

    దాంతో పాటలో మాటమాటనీ పలకడమెలాగో నేర్చుకుని - మాటమాటకీ తెలుగు పలుకేదో రాసుకుందామనుకున్నా. 

    ఇదిగో - ఇప్పుడదే చేస్తున్నా!

    ముందుగా పాట చూస్తూ   వినడానికి వీలుగా యూట్యూబ్ లింక్ ఇస్తున్నా:  https://www.youtube.com/watch?v=Ux0LERGc1cc

    ఆ తర్వాత ఆ కింద పాటలో మాటలు - మాటమాటకీ తెలుగు మాటలు కూడా రాసుకున్నా. 

    అన్నట్టు ఇక్కడో మాట చెప్పాలి. 

    ఈ పాటలో పల్లవీ, మొదటి చరణం అర్థమయ్యాయి - నాకు చాలా నచ్చాయి. 

    రెండో చరణంలో మాటలు తమిళంలో వినడానికి చాలా బావున్నాయి కానీ వాటి అర్థం పూర్తిగా తెలియాలంటే "నిళగళ్"సినిమా అయినా చూడాలి లేకపోతే తమిళ పాటలు బాగా వినే స్నేహితులని అడిగి తెలుసుకోవాలి. అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి ఈ కబుర్లు update చేసుకోవాలి. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***





హే... ఓ.... మ్మ్... లలల్లా... 

పొన్ మాలైప్ పొళుదు - బంగరు సంజె పొద్దు
ఇదు ఒరు ... పొన్ మాలైప్ పొళుదు - ఇది ఒక ...బంగరు సంజె పొద్దు
వానమగళ్ - నానగిరాళ్ - నింగికన్నె సిగ్గుపడుతోంది
వేరు ఉడయ్ - పూనగిరాళ్ - వేరే (రంగు) వలువ కట్టుకుంటోంది  

ఇదు ఒరు... పొన్ మాలైప్ పొళుదు
  మ్మ్...  హే... ఆ.... ఓ ... మ్ మ్ మ్మూ ... 

ఆయిరమ్ నిఱంగళ్ - జాలమిడుమ్ 
రాతిరి - వాసలిల్  - కోలమిడుమ్ 
ఆయిరమ్ నిఱంగళ్ - జాలమిడుమ్ - వేల రంగులు మాయ చేస్తాయి 
రాతిరి - వాసలిల్  - కోలమిడుమ్ - రాత్రి వాకిట ముగ్గులేస్తాయి 
వానమ్ ఇరవుక్కుప్  పాలమిడుమ్ - నింగి రాత్రికి వంతెన వేస్తోంది
పాడుమ్ పరవైగళ్ తాళమిడుమ్ - పాడే పక్షులు తాళమేస్తున్నాయి
పూ మరంగళ్ - సామరంగళ్ - వీసాదో?! - పూల తరువులు చామరలు వీచవో?

ఇదు ఒరు ... పొన్ మాలైప్ పొళుదు
వానమగళ్ - నానగిరాళ్
వేరు ఉడయ్ - పూనగిరాళ్

ఇదు ఒరు... పొన్ మాలైప్ పొళుదు

వానమ్ - ఎనక్కొరు బోధి మరమ్ 
నాళుమ్ - ఎనక్కదు - సెయ్‌ది తరుమ్ 
వానమ్ - ఎనక్కొరు బోధి మరమ్ - నింగి నాకొక బోధి తరువు
నాళుమ్ - ఎనక్కదు - సెయ్‌ది తరుమ్ - రేపు నాకది సుద్ది (కబురు) తెస్తుంది
ఒరు నాళ్ ఉలగం నీది పెరుమ్ - ఒక నాటికి లోకం న్యాయం పొందు 
తిరునాళ్ నిగళుమ్ తేది వరుమ్ - మంచి జరిగే రోజు వచ్చు
కేళ్విగళాల్ వేళ్విగళై నాన్ సెయ్‌వెన్ - అడుగుటతో నా విన్నపం నేను చేస్తాను

ఇదు ఒరు ... పొన్ మాలైప్ పొళుదు
వానమగళ్ - నానగిరాళ్
వేరు ఉడయ్ - పూనగిరాళ్

ఇదు ఒరు... పొన్ మాలైప్ పొళుదు

ఆ... హే... ఓ... లలల్లా... 
మ్మ్...  హే... ఆ.... ఓ ... మ్ మ్ మ్మూ ... 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    మళ్ళీ అదే చెప్తున్నా... చెప్పకుండా వుండలేకపోతున్నా... 

ఇలాతలంపై 
ఈ పాటని ఇంకెవరు పాడినా 
ఇలా - తళుకు మలాము - రాసినట్టుండదండీ... 
అలాగని నే రాసిస్తానండీ!
ఒట్టండీ! 
ఒప్పుకోవాలండీ!
ఆయ్! అంతేనండి మరీ!

~ పాటల భైరవి 



2, అక్టోబర్ 2022, ఆదివారం

గీతం...సంగీతం...సతతహరితం - 15 - నజర్ న లగ్ జాయే - కిసీ కీ... రాహోం మే

 

 
ఏ లోకాలదో ఆ పాట... 
మబ్బు మెరిసిన ఎలుగు పాటై  
నీటి దారుల తుళ్లింది 
మెరుపు కురిసిన వెలుగు పాటై 
గాలి వాలుల సోలింది

థేమ్స్ నది ఒడ్డున ఆ పాట 
పదము వెంట పదము పరువులెత్తింది 
గిటార్రాగాల గింగురులెత్తింది
పదము మీద పదము కదను తొక్కింది 
హయలయల హొయలొలికింది  

విన్నకొద్దీ విడిపోని పరిపాటై 
మెలఁకువనే  కలలా తోచింది  

విన్న పాట వీడలేని అలవాటై 
కలలలోనూ వినిపించింది

ఎద మోయలేని హాయిపాటై  
కలల దాటి రమ్మంటే 
మది ఓపలేని తీపిపాటై 
కలవరింతై కమ్ముకుంది 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

ఆ పాటకి పదం పేర్చింది -  ఆనంద్ బక్షీ. 
ఆ పాటకి నాదం కూర్చింది - లక్ష్మీకాంత్-ప్యారేలాల్. 
ఆ పాటని పాడుతున్నట్టనిపించింది - బెంగాలీ బాబు బిశ్వజిత్. 
ఆ పాటని వింటున్నట్టు కనిపించింది - నేపాలీ లేమ మాలా సిన్హా. 
ఇన్ని వున్న ఆ పాట వున్న - సినిమా - "నైట్ ఇన్ లండన్". 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

ఆ పాటని ఎవరు పుట్టించినా, 
దానినెవరు చూపెట్టినా - 
ఆ పాటకి ప్రాణం పోసిన గరిమ మాత్రం 
తనివాఱు మహ-తీరు రాగాల 
లక్ష్మీకాంత్-ప్యారేలాల్ జోడీదే...  

ఆ ప్రాణానికి ప్రణవం తెచ్చిన గాత్రం 
మది సోలు మహ-హాయి గానాల 
మహ... మహ... మహ... మహ... 
మహ... మహ... రఫీదే... 
మహమ్మద్ రఫీదంటే రఫీదే ... 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఈ పాట వినడం ఇదేం మొదటిసారి కాదు... 

    అలా అని దీన్ని పదేపదే పాడిందే పాటగా విన్నాననేం లేదు. 

    ఎప్పుడో, ఎక్కడో అనుకోకుండా ఎవరో ఏ రికార్డో పెట్టబట్టి వినడం తప్ప - నాకు నేనుగా వెతుక్కుని వినాలీ అని పట్టుబట్టి విన్న పాట మాత్రం కాదు. 

    కిందటి వారం ఎప్పట్లాగే రఫీ పాటల కోసం యూట్యూబులో వెతుక్కుని - ఒక్కో పాట వింటూ వుంటే - ప్రతీపాట తర్వాత ఈ పాట ఆ పక్కనే కనిపిస్తూ  "నన్ను వినూ!" అంటున్నట్టు  కనిపిస్తూనే వుంది. 

    నేనంతగా పట్టించుకోకుండా వేరేవేవో వింటూనే వున్నాను. 

    ఈ పాటేమో "వినవా?" అని బ్రతిమాలుతున్నట్టొకసారి, "ఓ సారి వింటే నీ చెవులేమైనా అరిగిపోతాయా? " అని దబాయిస్తున్నట్టొకసారి, "వినమని ఎన్ని సార్లడగాలీ, ఓహోహో?!" అని సాధిస్తు న్నట్టొకసారి, "వినమని చెప్తుంటే నీక్కాదూ?" అని చెవి మెలేస్తున్నట్టొకసారి - ఆ కిందున్న సజెషన్సులో పైకి ఎగిరెగిరి కనిపిస్తూనే వుంది. 

    చివరాఖరికి ఓ పాట తర్వాత తోసుకుంటూ ముందుకొచ్చేసి "వినెహే!" అని అదే మొదలైపోయింది. 

    సర్లే! ఒకసారి వినేస్తే దీని గోలేంటో తెలిసిపోతుంది ఇహ దీని జోలికెళ్ళక్కర్లేదు అనుకుని చెవులు ఫోను కప్పగించి - పాటని ఆట్టే పట్టించుకోకుండా బెట్టు పోతూ ఉతికిన బట్టలేవో మడత పెట్టుకుంటున్నాను. 

    పాట మొదలవుతూనే  ఓ గిటారు టింగ్-టింగుమని వినిపించింది. 

    ఆ వెంటనే "ఓ మై లవ్!" అంటూ ఏ గంధర్వ లోకాల్లోంచో పిలుస్తున్నట్టు న్న రఫీ గొంతూ...

    ఆ వెనకనే ఉరుం-మబ్బేదో కదం తొక్కుతున్నట్టు ఓ బేస్-గిటార్ మోతా... 

    అవి వింటూనే చెవులప్పగించిన ఫోనుకి కళ్ళు కూడా అద్దెకిచ్చా. 

    చూస్తే అక్కడ ఏముందీ?

    హయలయల హొయలుకి గిటారు మోగిందా? 

    గిటారు గీర-రాగాలకి తురంగాలు తరంగమాడాయా? 

    అంతే! నా చెవులూ, కళ్ళూ కూడబలుక్కున్నట్టు  నా తలకేం చెప్పాయో కానీ నా చేతులు - మడతెడుతున్న బట్టలని కాసేపలా గాలికి రెపరెపలాడుతుండమని చెప్పి - టీవీ రిమోట్ తీసుకుని - చకచకా యూట్యూబులో వెతికి ఆ పాట పెట్టేశాయ్. ఈలోగా నా కాళ్ళేమో సోఫాలో నన్ను కూర్చోబెట్టేశాయ్. 

    అప్పుడు కూర్చుని మొట్టమొదటి సారిగా ఆ పాట చూశా! 

    పూర్తిగా చూశాక - మళ్లింకొక్కసారి చూశా! 

    మళ్ళీ ... మళ్ళీ చూశా !

    ఆ హయ-గతికి గిటారు పాడిన స్వర-జతికి - "నజర్ న లగ్ జాయే!" అనుకున్నా!

    ఎంత అందమైన పాట అది? 

    ఇన్నాళ్లూ నేనెందుకు చూడలేదబ్బా? అనుకున్నా. 

    ఈ పాట నాకు దక్కాలని రాసుండబట్టి ఇవాళ్టికైనా నాకు చిక్కిందనుకున్నా. 

    నన్నలరించిన ఈ పాటలో నాకు కనిపించిన విషయాలూ, నాకనిపించిన విశేషాలతో ఆ పాట కథా-కమామీషూ మీతో ఇలా పంచుకుంటున్నా. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    నే చెప్పే కబుర్లు చదివే ముందు మీరూ ఈ పాట చూడాలిగా! 

    ఈ పాటకి యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=Y2QLjRWXdAA

    పాట చూసొచ్చారా? 

    ఇహిప్పుడు పాటలో తమాషాలేంటో చెప్తాను. మీకవి కనిపించాయో - కనిపించినా అనిపించాయో లేదో చూసుకోండి. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఈ పాటలో అసలుకి మూడు చరణాలు ఉన్నట్టున్నాయి. 

    యూట్యూబుకి - ఆకలేసి నీరసమొచ్చి మింగేసిందో - పాడలేక ఆయాసమొచ్చి ఆపేసిందో - కానీ చూసే పాటలో చివరి చరణాలు రెండే కనిపిస్తాయి. మొదటి చరణం హుళక్కి!

    కాకపోతే కనిపించే రెండు చరణాలే కాక కనిపించని ఆ మూడో చరణం కూడా నేను రాసి పెట్టాలెండి! (ఇక్కడెందుకో నాకు సాయికుమార్ - పోలీస్ స్టోరీ గుర్తుకొచ్చింది. ఎందుకో చెప్పుకోండి చూద్దాం!)

    మీకెవరికన్నా ఆ మూడు చరణాలు కంటి నిండుగా కనిపించే పాట మీక్కనిపిస్తే నాకొచ్చి చెప్పండేం!

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    లండన్లో థేమ్స్ నది ఒడ్డున సాగే ఈ పాటలో ఎఱుపు రంగు భలేగా మెరుస్తుంది. 

    మొట్టమొదటగా కనిపించే  చిన్న బోటుపై రెపరెపలాడుతున్న తెల్ల క్రాసున్న జండా ఎఱుపు. 

    ఆ బోటు మీద నించున్న గిటార్రాగాల అబ్బాయి వేసుకున్న పొడుగు చేతుల చొక్కా ఎఱుపు 

    ఆ తర్వాత కెమెరా చూపు సోకిన రహదారి మీద వెళుతున్న చిన్న కారు ఎఱుపు, ఆ పక్కనే రయ్యిమన్న ఓ మాదిరి ట్రక్కు ఎఱుపు 

    బ్లూస్ ఎండ్ రాయల్స్ - హార్స్ గార్డ్స్ పెట్టుకున్న ఇనుప కుళ్లాయిల మీద ఊగితూగుతున్న తురాయిలు (plumes) ఎఱుపు 

    "పీ-పీ" మంటూ ఊదుకుంటూ వస్తున్న గ్రెనడీర్ గార్డుల బ్యాండు వేసుకున్న యూనిఫార్మ్ రంగు ఎఱుపు 

    ఇంకా పాట సాగుతున్నంత సేపూ ఆ వెనకాల రోడ్ల మీద హడావిడిగా సిన్మాలో కనిపించాలన్నట్టు తిరుగుతున్న లండన్ బస్సులు ఎఱుపు. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    పైన చెప్పిన ఎఱుపు రంగు చూసింతర్వాత ఈ పాటలో మెరిసినవారు బిశ్వజిత్, మాలా సిన్హా. 

    బిశ్వజిత్తుని చూడగానే బీఎస్సీలో మాథ్స్ ట్యూషన్ చెప్పిన కోటేశ్వర్రావుగారు గుర్తొచ్చారు. 

    ఏ ఆదివారమో టీవీలో ఓ మంచి హిందీ సిన్మా - ఏ షమ్మీ కపూర్ - తీస్రీ మంజిల్ - లాంటిదో వుందని ముందే తెలిసి - ఆ రోజు సెలవివ్వండి సర్ సిన్మా చూస్తాం - అనడిగితే - "చపాతీ మొహాలనేం చూస్తారు, ఎంచక్కా  ట్యూషను కొచ్చి హాయిగా లెక్కలు చేసుకోండి - అని చెప్పేవారు. 

    ఇంకేం చేస్తాం! ఎలాగో మనసు చిక్కబట్టుకుని లెక్కలు చేసుకుంటూ కూర్చుంటే - ఇంతలో పక్కనే సర్ వాళ్ళింట్లోంచి "ఆజా ఆజా మై హూ ప్యార్ తేరా... అల్లా...అల్లా ...ఇన్‌కార్ తేరా...ఆజా...అహ్హహాజా... " అని పాట వినగానే "ఉండండయ్యా ... నన్ను ఎందుకో పిలుస్తున్నట్టున్నారు" అని కట్టుకున్న తెల్ల గ్లాస్కో లుంగీని కుడిచేతి గుప్పెట్లో కాళ్లకడ్డం పడకుండా గట్టిగా ఒడిసి పట్టుకుని గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయి - ఆ పాటయ్యాక - తీరిగ్గా వచ్చేవారు మా కోటేశ్వర్రావు సర్. 

    ఇదిగో ఇవాళ మళ్ళీ నున్నటి మొహమున్న బిశ్వజిత్తుని చూడగానే ఆ చపాతీరో-మోహపు రోజులు గుర్తుకొచ్చాయి. ఏ పుణ్యలోకాలనో లెక్కలు పాఠాలు చెప్పుకుంటున్నారో - మా ప్రియమైన కోటేశ్వరరావు గారు కూడా గుర్తొచ్చారు. 

    బిశ్వజిత్ పక్కనే వున్న మాలాసిన్హా కూడా బల్-హాయిగా అనిపించిందండోయ్. 

    ఎప్పుడో  పెళ్ళికి ముందు రోజుల్లో డీడీలో తెలుపు-నలుపు హిందీ సినిమాల్లో ఒకట్రెండు సినిమాల్లో చూసినప్పుడు ఇదే మాలాసిన్హా  "నైన్ కియే నీచే నీచే... రహూ తేరే పీఛే పీఛే" అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ, హీరో కాళ్ళావేళ్ళా పడిపోతూ వుండేది. ఈ పాటలో మాత్రం స్టైలిష్షుగా, పాలిష్డుగా బార్బీ బొమ్మలా భలే ఉంది. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    ఇహ పోతే - ఈ పాట చూస్తుండగా కనిపించిన లండన్ వీధులు, థేమ్స్ నది, బిగ్గు బెన్నూ దాటి ఓ పడవెక్కి హీరో-హీరోయిన్లు ఇద్దరూ ఓ జలపాతం దగ్గరికి వెళ్తారు.     

    అది చూడగానే ఇదెక్కడి జలపాతమబ్బా అనుకుంటూ గూగుల్లో వెతికా! 

    అప్పుడు తెలిసింది - ఈ పాట లండన్  థేమ్స్ నది నీటి అలల మీదుగా - అలా అలా  గాలిలో తేలి స్విజ్జర్లాండు రైన్ ఫాల్స్ (Rhine Falls) జలపాతంలో చిందులేసిందని. 

    ఈ పాటకి రైన్ జలపాతం పొందిన ఆనందం చూడాలంటే "సామ్‌నే జో ఏక్ తూ న హో... దిల్ మే  కోఈ ఆర్‌జూ న హో!" అన్న వాక్యాల దగ్గర బిశ్వజిత్, మాలాసిన్హా నించున్న అబ్జర్వేషన్ డెక్ వెనకాల నీటి చిందులు చూడాల్సిందే! (వీడియోలో 3:09 నుంచి 3:25 దాకా). 

    నాకు నచ్చిన పాటని  ఈ కింద రాసి పెట్టుకున్నా. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***





ఓ మై లవ్ !
నజర్ న లగ్ జాయే -  కిసీ కీ... రాహోం మే
ఛుపా కే రఖ్ లూం - ఆ... తుఝే నిగాహోం మే
తూ ఖో న జాయే - ఓ మై లవ్!

నజర్ న లగ్ జాయే -  కిసీ కీ... రాహోం మే
ఛుపా కే రఖ్ లూం - ఆ... తుఝే నిగాహోం మే
తూ ఖో న జాయే - ఓ మై లవ్!

దేఖ్ కర్ - తేరీ తరఫ్ - బహార్
ఆజ్  హో రహీ హై - బేకరార్
దేఖ్ కర్ - తేరీ తరఫ్ - బహార్
ఆజ్  హో రహీ హై - బేకరార్
ఛూ రహే ఫూల్ హై యూ తుఝే 
జైసే హో ఇన్హే భీ తుఝ్‌సే ప్యార్
యే హో న జాయే - ఓ మై లవ్!

నజర్ న లగ్ జాయే -  కిసీ కీ... రాహోం మే
ఛుపా కే రఖ్ లూం - ఆ... తుఝే నిగాహోం మే
తూ ఖో న జాయే - ఓ మై లవ్!

ఏ మేరీ హసీన్ దిల్‌రుబా! 
మేరే దిల్ మే - ఛుప్‌కే బైఠ్ జా... 
ఏ మేరీ హసీన్ దిల్‌రుబా! 
మేరే దిల్ మే - ఛుప్‌కే బైఠ్ జా... 
తుఝ్‌మే ముఝ్‌మే ఫరక్ నా రహే 
ఆ... కరీబ్ - ఆ... కరీబ్ - ఆ... 
తూ ఖో న జాయే - ఓ మై లవ్!

నజర్ న లగ్ జాయే -  కిసీ కీ... రాహోం మే
ఛుపా కే రఖ్ లూం - ఆ... తుఝే నిగాహోం మే
తూ ఖో న జాయే - ఓ మై లవ్!

సామ్‌నే జో ఏక్ తూ న హో... 
దిల్ మే  కోఈ ఆర్‌జూ న హో!
సామ్‌నే జో ఏక్ తూ న హో... 
దిల్ మే  కోఈ ఆర్‌జూ న హో!
మంజిలే హజార్ హో మగర్
మంజిలోం కీ జుస్తుజూ న హో
యే హో న జాయే -  ఓ మై లవ్!

ఓ మై లవ్ !  ఓ మై లవ్ !
ఓ మై లవ్ ! ఓ మై లవ్ !

నజర్ న లగ్ జాయే -  కిసీ కీ... రాహోం మే
ఛుపా కే రఖ్ లూం - ఆ... తుఝే నిగాహోం మే
తూ ఖో న జాయే - ఓ మై లవ్!


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

     నాకైతే పాటలో వినిపించిన గిటార్ సంగీతం ఎంతో నచ్చింది. 

    దానికి జతగా కుదిరిన గుఱ్ఱపు-నడక కూడా - కనిపించింది కొన్ని సెకన్లయినా ఎంతో రాజసంగా వుంది. 

    ఈ పాట ఈ పూటకి దొరికిన పున్నెం. 

    నాకందిన ఈ నిన్నటి పున్నమల మించుని మీకూ పంచుకుంటూ... 

~ పాటల భైరవి 

6, ఫిబ్రవరి 2022, ఆదివారం

గీతం...సంగీతం...సతతహరితం - 14 - తూ జహాఁ జహాఁ చలేగా...

 
చుక్కల కేసి సారించిన నా చూపు 
చూసేది నిన్నల వెలుగులట 
వెలుగు చిలికిన ఆ ఉడువు -
మింటినంటి ఆ పట్టునే ఉన్నదో... 
మంటి కేసి ఏ గట్టుకో ఉరలుకొన్నదో... 
తెలియరాదట!

చెవుల తాకి పలకరించిన నీ పాట 
పుట్టింది గడచిన కాలాలనట  
పులక రేపిన నీ పదము - 
పెదవి దాటి ఎప్పుడు ఉరికిందో... 
ఎదను చేరి ఎక్కడ కుదురుకుందో... 
ఎఱుగలేమట!

ఆ చుక్క మిణుకు నిన్నలదే... 
ఈవేళ్టి చూపుకానినదే!

నీ పాట జిలుగు నిన్నలదే... 
ఏ నాటికీ చెవికి సోకునిదే!

*******
*******

    నల్లటి పట్టు ఆకాశం మీద ధగధగల కుట్టుపూలలా కంటికి కనపడే నక్షత్రాలు నిన్నో, ఈరోజో పుట్టినవి కావట. 

    ఎప్పుడో యుగాల కావల పుట్టిన ఆ చుక్కల వెలుగు ఇప్పటికి చూడగలుగుతున్నామట. 

    అప్పుడు పుట్టిన ఆ నక్షత్రం ఇప్పటికీ అక్కడే ఉన్నా ఈ రోజుటి వెలుగుని మాత్రం మన ముందు తరాలు మాత్రమే చూస్తాయట. 

    మనమింకా గతకాలపు వెలుగునే ఇంకా చూస్తున్నాం మరి...  ఇప్పటి వెలుగుని చూడాలంటే ఇంకెన్ని యుగాలు గడవాలో!

    అప్పటికి ఆ నక్షత్రం ఉండక పోయినా ఆ వెలుగు ఏ కంటికో కాంతినందిస్తూనే ఉంటుంది. 

    నాకు జిలుగు పలుకుల పాట సొగసు కూడా కూడా తళుకు బెళుకు నక్షత్రాల వెలుగు పోలికే అనిపిస్తుంది. 

    ఏ తేనెలూరే గొంతు లోనో ఎప్పుడో పుట్టిన పాట ఇప్పటికీ పల్లవిస్తూ ఉంటుంది. పరిమళిస్తూ ఉంటుంది. 

    అప్పుడు పుట్టిన పాట నాకు ముందూ ఉంది. నాతోనూ నడిచొస్తోంది. నను దాటీ ఉంటుంది. 

    పాడిన వారూ, పాటను విన్నవారూ తరతరాలుగా దాటిపోయినా పాట మాత్రం కాలచక్రపు ఎల్లలు దాటి  ఎల్లప్పుడూ ఉండిపోతుంది. 

*******
*******

    ఇక్కడో పాట కథ చెప్పాలనిపిస్తోంది. 

    అనగనగా... ఎప్పటి నుంచో వింటూ ఉన్న ఆ నాటి పాట ఒకటి ఉంది.  

    అదెలాంటి పాటంటే... 

వినకపోతే వినమని సతాయించే పాట 
విన్న తర్వాత ఇంకోసారి వినాలనిపించే పాట 
విన్న పాటున ఎదను గుచ్చే పాట 
ఉన్నచోటున ఉండనీయని పాట 
వినే కొద్దీ నీడలా వెన్నాడే పాట
విన్నవారి వెన్నుదన్నయ్యే పాట

    ఆ పాటలో మాటలెలా ఉంటాయంటే ... 

బాధను పొగిలిస్తాయి 
భళ్ళున ఏడవాలనిపిస్తాయి 
బతుకుటాస పొరయిస్తాయి  
బరువసా కూరుస్తాయి 


    ఈ నాటికీ ఆ పాట ఉంది -  
ఆ నాటి రాలు-చుక్క  పంపిన ఈ నాటి వెలుగులా 
ఈ నాటి వానకోయిల వదిలెళ్లిన నానాటి పాటలా 

*******
*******

ఆ పాటకి యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=Pdz0V0vqA4Y





తూ జహాఁ జహాఁ చలేగా... 
మేరా సాయా - సాథ్ హోగా
తూ జహాఁ జహాఁ చలేగా... 
మేరా సాయా - సాథ్ హోగా
మేరా సాయా - మేరా సాయా 
మేరా సాయా - మేరా సాయా 

కభీ ముఝ్‌కో యాద్ కర్‌కే - జో బహేంగే తేరే ఆఁసూ 
కభీ ముఝ్‌కో యాద్ కర్‌కే - జో బహేంగే తేరే ఆఁసూ 
తో... వహీ పే రోక్ లేంగే - ఉన్హే ... ఆకే మేరే ఆఁసూ 
తూ జిధర్ కా రుఖ్ కరేగా - మేరా సాయా సాథ్ హోగా

తూ జహాఁ జహాఁ చలేగా... 
మేరా సాయా - సాథ్ హోగా
తూ జహాఁ జహాఁ చలేగా... 
మేరా సాయా - సాథ్ హోగా
మేరా సాయా - మేరా సాయా 
మేరా సాయా - మేరా సాయా 

తూ అగర్ ఉదాస్ హోగా - తో ... ఉదాస్ హూంగీ మై భీ
తూ అగర్ ఉదాస్ హోగా - తో ... ఉదాస్ హూంగీ మై భీ
నజర్ ఆఊఁ యా న ఆఊఁ - తేరే పాస్ హూంగీ మై భీ
తూ కహీ భీ జా రహేగా - మేరా సాయా సాథ్ హోగా

తూ జహాఁ జహాఁ చలేగా... 
మేరా సాయా - సాథ్ హోగా
తూ జహాఁ జహాఁ చలేగా... 
మేరా సాయా - సాథ్ హోగా
మేరా సాయా - మేరా సాయా 
మేరా సాయా - మేరా సాయా 

మై అగర్ బిఛడ్ భీ జాఊఁ -  కభీ మేరా గమ్ న కర్‌నా
మై అగర్ బిఛడ్ భీ జాఊఁ -  కభీ మేరా గమ్ న కర్‌నా
మేరా ప్యార్ యాద్ కర్‌కే - కభీ ఆంఖ్ నర్మ్ న కర్‌నా
తూ జో... ముడ్‌కే దేఖ్ లేగా - మేరా సాయా సాథ్ హోగా

తూ జహాఁ జహాఁ చలేగా... 
మేరా సాయా - సాథ్ హోగా
తూ జహాఁ జహాఁ చలేగా... 
మేరా సాయా - సాథ్ హోగా
మేరా సాయా - మేరా సాయా 
మేరా సాయా - మేరా సాయా 

మేరా గమ్ రహాఁ  హై శామిల్ - తేరే దుఖ్ మే... తేరే గమ్ మే
మేరా గమ్ రహాఁ  హై శామిల్ - తేరే దుఖ్ మే... తేరే గమ్ మే
మేరే ప్యార్ నే దియా హై - తేరా సాథ్ హర్ జనమ్ మే
తూ కోఈ జనమ్ భీ లేగా - మేరా సాయా సాథ్ హోగా

తూ జహాఁ జహాఁ చలేగా... 
మేరా సాయా - సాథ్ హోగా
తూ జహాఁ జహాఁ చలేగా... 
మేరా సాయా - సాథ్ హోగా
మేరా సాయా - మేరా సాయా 
మేరా సాయా - మేరా సాయా 

మేరా సాయా - మేరా సాయా 
మేరా సాయా  - మేరా సాయా 
మేరా సాయా  - మేరా సాయా 

*******
*******


 ఏ నాటికీ ఆ పాట ఉంటుంది -  
వేవేల చుక్కలు వెదజల్ల - రాబోయే వెలుగులా... 
మౌనమెరుగని వెదురులో - మూగబోవని పాటలా... 

ఆ పాట వింటూ ఉన్న - నాతో పాటు - వినేవారుంటారనుకుంటూ ... 

~ పాటల భైరవి 

19, జులై 2021, సోమవారం

గీతం...సంగీతం...సతతహరితం - 13 - కుఛ్ దిల్ నే కహా?! - మది ఏమి పలికిందో?

 
అనుకున్న మాటలన్ని
పెదవి చాటునాగిపోయి 
చెప్పలేని ఊసులాయె  
ఊసులన్ని ఊహలూరె 
చెప్పబోతె పలుకు చాలదాయె 

అనలేని మాటలేవో 
ఎదల మాటు దాగి పోయి  
చెప్పరాని ఊహలూరె 
ఊహలన్ని ఊసులాయె 
చెప్పలేక పలుకు మూగబోయె 

*******
*******

    మాట, నవ్వు - మనిషికే దక్కిన వరాలు. 

    మన్ననగా వాడుకుంటే మనిషికి మనిషిని దగ్గర చేసేవి ఆ రెండే. 
    మేర మీరితే మనసులు విరిచి దూరం పెంచేవీ ఆ రెండే. 

    అదసలెలా మొదలవుతుందంటే... తిరుగులేని చూనమా-మంత్రంతో.  
    తెలుగు నేర్వడానికి ఓనమాలెలాగో - చెలిమి చెయ్యడానికి చూనమాలు అలాగన్నమాట!. 

    పెదవి కదపక ముందే కన్ను కన్ను కలిస్తే చూపు నిలుస్తుంది. 
    పెదవులాని మొలిచిన చిరునవ్వు నిలవరిస్తుంది. 
    పెదవి దాటిన మాటతో పరిచయం నిలకడౌతుంది. 

    ఇంత జరిగిన తర్వాత ఆ మొదటి మాట దగ్గరే ఆగిపోంగా?!
    మాట మీద మాట వేసుకుంటూ - ఊసులాడుకుంటాం. 
    ఉబుసుపోక మాటల్లో ఒకరి మనసొకరికి తెలుస్తుంది. 
    ఎరిగిన మనసుతో పెరిగిన పరిచయం నెయ్యంగా మారుతుంది. 
    మనసెరిగి మసలడం అలవోకగా అలవడుతుంది. 

    అక్కడితో ఆగిపోతే కథేముంది?
    చనువు పెరుగుతుంది. 
    తెలిసిన మనసు అలుసవుతుంది. 
    పలుకుతున్న మాట పలచనవుతుంది. 
    ఇద్దరుగా వున్నప్పుడు మేలమాడిన మాట - నలుగురిలో పడ్డప్పుడు నవ్వులాటవుతుంది. 

    ఏదో ఆదమరచిన ఆవేశపు వేళలో అదుపు తప్పిన మాట పెదవి మీరుతుంది. 
    
    అంతే! అప్పటివరకు అర్థవంతంగా వున్న మాట - మాట మీద మాటై - మాట మీరి ఎద మీద పోటై - ప్రతి పదార్థం అనేకార్థాల అపార్థమై మిగులుతుంది. చెలిమితీగ వాడుతుంది. 

    అసలెందుకు మాట్లాడేమా అన్న తీరని బాధ మొదలవుతుంది. 

    మాటలతో ఒకరినొకరు గుచ్చుకుని నొచ్చుకున్న గడిచిన క్షణాలన్నీ - తిప్పగలిగిన గడియారం ముళ్ళలా మళ్ళొక్కసారి వెనుతిరిగి - అది నాటికీ, నేటికీ, ఏనాటికీ గడవని కాలమైతే  ఎంత బావుండుననిపిస్తుంది. 

    అనిపించింది, అనుకున్నది - అనుకున్నట్టుగానే జరిగితే  - ఇంక అనుకునేదేముంది? అలా జరగనే జరగదు. 
    
    జారిన మాట ఆరని గాయమై, మాయని జ్ఞాపకమై అట్టే నిలబడిపోతుంది. తదుపరి మాటల తూనికకి ఊనికౌతుంది. నేరవకనే నేర్చుకున్న మరపురాని పాఠమౌతుంది. నేర్చిన పాఠం నిశ్చలమై నిచ్చలౌతుంది. 
    
    *******
    *******

    ఒంటికి నొప్పి కలిగితే మందుంటుంది. 

    మనసుకి నొప్పి కలిగితే మంచి మాట మందల్లే పని చేస్తుంది. కానీ అనుకున్న అన్ని వేళలా మనసైన మాట అందుబాటులో వుండదు. 

    మరప్పుడెలా? 

    మాటైతే దొరకదు కానీ మాయ చేసి మనసుకి మలాము పూసే హాయిపాట ఒకటి ఎప్పుడూ 'నీకు నేను తోడున్నా' నంటూ గుర్తుకొస్తుంది. 

    అలాటిదే ఒకానొక పాట - తనకు తానే సాటైన పాట - ఒకనాటి మేటి పాట. 

    ఆ పాట కథా-కమామీషూ ఏంటంటే... 

    పాట: కుఛ్ దిల్ నే కహా...?!
    సినిమా పేరు: అనుపమ 
    పాట తీసినవారు: హృషీకేశ్ ముఖర్జీ 
    పాట రాసినవారు: కైఫీ అజ్మీ 
    పాట చేసినవారు: హేమంత్ కుమార్ 
    పాట పాడినవారు: గానకోకిల - లతా మంగేష్కర్ 
    పాట పాడుతున్నట్టు నటించినవారు: షర్మిలా ఠాగూర్ 
    పాట వింటున్నట్టు కనిపించినవారు: ధర్మేంద్ర 
    పాటకి యూట్యూబ్ లింక్https://www.youtube.com/watch?v=uc8RBLMFLgI

   *******
   *******


    ఇహిప్పుడు ఈ పాటకి పని చేసిన వారి గురించి కొన్ని చమక్కులు - తళుక్కులు. 

    'అనుపమ' సినిమాని హృషీకేశ్ ముఖర్జీ ప్రఖ్యాత దర్శకుడు బిమల్ రాయ్‌కి అంకితమిచ్చారు. 

    బిమల్ రాయ్ తీసిన 'మధుమతి' సినిమా లోని పాట 'సుహానా సఫర్' పాటని చాలా రోజులు పాడిందే పాటగా పాడా!

    పాట రాసిన కైఫీ అజ్మీ ఇద్దరు పిల్లలూ మనకి బాగా తెలిసిన వాళ్ళే! ఒకరు బాపు సినిమాల కెమెరా మాంత్రికుడు బాబా అజ్మీ అయితే ఇంకొకరు హిందీ సినిమా నటి షబానా అజ్మీ. అన్నట్టు ఒకప్పటి హిందీ సీరియల్ నటి తన్వి అజ్మీ బాబా ఆజ్మీకి భార్య. 

    ఇక పోతే పేరు లోనే ఠాగూర్ వంశనామం చేర్చుకున్న షర్మిలా ఠాగూర్ అచ్చంగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చుట్టమే!

    చివరాఖరుగా నే చెప్పబోతున్న ధర్మేంద్ర అందరికీ తెలిసినట్టే డ్రీం గర్ల్ హేమమాలినికి నిజజీవితకథానాయకుడు. అంతకు ముందే సన్నీ దేవల్, బాబీ దేవల్ అనబడు ఇద్దరబ్బాయిల తండ్రి కూడా. 

    
 *******
  *******

    పాట ఆనుపానులు తెలిశాయి కదా! 

    మరిప్పుడు ఈ పాటలో నాకు నచ్చిన విశేషాలు. 

    మొదటగా - పాట మొదలవుతుండగా కనిపించిన చెట్లు. 

    వరసగా ఆకాశాన్ని తాకుతున్నట్టుగా నించున్న ఆ చెట్లేమిటో గానీ నలుపు-తెలుపుల తెర మీద కూడా ఎంత రాజసంగా కనిపిస్తాయో!

    ఆ చెట్లని చూస్తూ మురుస్తుండగా - ఆ చెట్ల మీదుగా తేలి వస్తున్న గాలిపాటలా తీగ సాగే  లతామంగేష్కర్ గొంతు ఎంత నచ్చుతుందంటే - ఆ పాటని దోసిటిలో పట్టి అట్టే పెట్టేసుకోవాలన్నంతగా. 

    ఈ పాటలో మంద్రస్థాయిలో వినిపించీ వినిపించనట్టుండే లతాజీ గాత్రం అద్భుతంగా వినిపిస్తుంది. విచ్చీవిచ్చని మొగ్గేదో తనలో తాను గుసగుసలాడుకున్నట్టుంటుంది. మోయలేని తీపిహాయినేదో మనసుకి పూసిపోతున్నట్టుంటుంది. 

    ఈ పాటకి హేమంత్ కుమార్ కూర్చిన సంగీతానికి హేమంత మాసపు మంచుతెరల సున్నితపు చాలు ఏదో పొసగినట్టనిపిస్తుంది. 

    అన్నిటికన్నా ఎక్కువగా నాకు ఈ పాటలో నచ్చినది ఏమిటీ అంటే - విరిసీ విరియని మొగ్గలా అనిపించి, ముక్కుపచ్చలారని అచ్చరలా కనిపించే షర్మిలా ఠాగూర్. 

    పాట సాగిన ఆసాంతం గాలికి అల్లలాడే తెల్లగులాబీ తీగ లాగా సున్నితంగా కదులుతూ కనిపిస్తుంది ఆవిడ. పెదవుల మీద కనీకనిపించని చిరునవ్వు, చెంపలలో దాచలేని చిఱుసిగ్గు, లతాజీ పాడిన పాటకి తగినట్టు అలవోకగా కదిలిన పలుచని పెదవులు - ఓహ్! ఎంత సుకుమారమో! అది నటనేనా లేక ఆవిడకి సహజమైన ప్రవర్తనా అని అనిపిస్తుంది. 

    కట్టుకున్న పూల పూల చీర - దానికి తగినట్టు మెడ చుట్టూ, బుట్టచేతుల అంచులకి కుట్టిన పూలపూల అంచు రవికతో - షర్మిల పూబాలలా కనిపిస్తుంది ఈ పాటలో. 

    ఈ పాటలో నాకనిపించిన, కనిపించిన ఒక ప్రత్యేకత - షర్మిలా ఠాగూర్ కనిపించిన ప్రతి ఫ్రేము - ఒక అందమైన ఛాయాచిత్రంలా అనిపిస్తుంది. 

    యూట్యూబులో పాట మాత్రమే వున్న వీడియో ఉన్నా - పాటకి ముందు కనిపించే చెట్లూ, పాటకి చివర్లో ధర్మేంద్ర చెప్పే డైలాగులు నాకిష్టం - అందుకని ఈ వీడియో అప్పు తెచ్చుకున్నా! 

    కైఫీ అజ్మీ తన కలాన్ని ఆకుల కొనల నుండి జారే చల్లని పాలమంచులో ముంచీ,  పూల రెక్కల అంచులకి తాకించీ పాటని రాశారేమో ! అందుకే ఆ సౌకుమార్యం మహ సౌఖ్యంగా అమరింది ఈ  పాటలో. 

    లేకపోతే కనురెప్పల చల్లని పానుపుపై  - కలల వేలుపులు పవళించేనన్న ఊహ ఉట్టుట్టినే అందిపోదు కదా! 

    అర్థం చదివినప్పుడు కొంచెం melancholic గా అనిపించినా - పాటలో రాసిన పదాల అందమూ, పాట పాడిన వారి గళమాధుర్యమూ, షర్మిలా ఠాగూర్ graceful beauty ఆ విషాదాన్ని మదికి అంటనీయవు. 

    నాకు ఈ పాట ఎంతగా నచ్చిందంటే - ప్రతి పదార్థం రాసుకుని మీ అందరితో పంచుకునేంతగా! 
    

    



కుఛ్ దిల్ నే కహా?!  - మది ఏమి పలికిందో?
కుఛ్ భీ నహీ... - అరె! ఏమీ లేదింకా!
కుఛ్ దిల్ నే సునా?! - ఎద విన్నదేమిటో?
కుఛ్ భీ నహీ...-  ఉహుఁ! ఏదీ కాదింకా!

ఐసీ భీ - బాతే హోతీ హై - అప్పుడప్పుడు అలా అవుతుందంతే!
ఐసే భీ - బాతే హోతీ హై - అప్పుడప్పుడు అలా అవుతుందంతే!

కుఛ్ దిల్ నే కహా?!  - మది ఏమి పలికిందో?
కుఛ్ భీ నహీ... - అరె! ఏమీ లేదింకా!

లేతా హై దిల్ అంగ్‌డాయియా - నా ఎదకేమో ఆగామి చింతా!
ఇస్ దిల్ కో  సమ్‌ఝాయే కోఈ - ఈ మదికెవరైన చెప్పండి సుంత! 

అర్‌మాన్ న ఆంఖే ఖోల్ దే - నాలో కోరిక కనుతెరవనీక!
రుస్‌వా న హో జాయే కోఈ - ఎవరికో పెనునింద పడనీక!

పల్‌కోం కీ ఠండీ సేజ్ పర్ - కనురెప్పల చల్లని పానుపుపై
సప్‌నోం కీ పరియా సోతీ హై - కలల వేలుపులు పవళించే! 

ఐసీ భీ - బాతే హోతీ హై - అప్పుడప్పుడు అలా అవుతుందంతే!
ఐసే భీ - బాతే హోతీ హై - అప్పుడప్పుడు అలా అవుతుందంతే!

కుఛ్ దిల్ నే కహా?!  - మది ఏమి పలికిందో?
కుఛ్ భీ నహీ... - అరె! ఏమీ లేదింకా!

దిల్ కీ తసల్లీ కే లియే - మది ఊరడింపు కోసమే... 
ఝూఠీ చమక్,  ఝూఠా నిఖార్! - ఈ కపటపు తళుకు, కపటపు మిణుకు!

జీవన్ తో సూనా హీ రహా - జీవితమిది శూన్యమనిపించునిలా...   
సబ్ సమ్‌ఝే ఆయీ హై బహార్! - ఆమని వచ్చెనని ఎవరేమనినా!

కలీయోం సే - కోఈ పూఛ్‌తా ? - ముకుళమునెవరైన అడిగిరా?
హస్‌తీ హై వో - యా రోతీ హై?! - అది నగవేమో, మరి వగపేమో?! 

ఐసీ భీ - బాతే హోతీ హై - అప్పుడప్పుడు అలా అవుతుందంతే!
ఐసే భీ - బాతే హోతీ హై - అప్పుడప్పుడు అలా అవుతుందంతే!

కుఛ్ దిల్ నే కహా?!  - మది ఏమి పలికిందో?
కుఛ్ భీ నహీ... - అరె! ఏమీ లేదింకా!
కుఛ్ దిల్ నే సునా?! - ఎద విన్నదేమిటో?
కుఛ్ భీ నహీ...-  ఉహుఁ! ఏదీ కాదింకా!


 *******
  *******

తెలిసినదే అయినా నాకు నేను మళ్ళీమళ్ళీ నేర్పుకునే పాఠం 

అనలేని మాట
అనకపోతే - 
అది అవసరమైన అదుపు 

అనదగ్గ మాట
అనకపోతే - 
అది అనవసరపు పొదుపు 

~ పాటల భైరవి 


20, జూన్ 2021, ఆదివారం

గీతం...సంగీతం...సతతహరితం - 12 - జీనా... ఇసీ కా నామ్ హై!

    నాకు నేను - గురుతుగా గుది గుచ్చుకుని - గమనంగా మననం చేసుకునే - మాటలు కొన్ని - ఈ పూటకి - ఇక్కడ పంచుకుంటున్నా... 

మనసుకి - బాసటగా - నమ్మకమవ్వు 
మనిషికి - ఆసరావై  - నిమ్మళమివ్వు 
అద్దిరా! అదీ జీవించడం!

చిరునవ్వు మొలకల కోసం - ఇవ్వగలిగినంత వదులుకో 
కడ లేని నొవ్వులు ఎదురైతే  - కొమ్ము కాసి అందుకో 
అద్దిరా! అదీ జీవించడం!

ఉండినంత ప్రేమ ఎడద నింపుకో 
అండదండవై ఎదను పెంచుకో 
అద్దిరా! అదీ జీవించడం!

అక్కరుంటే అదను పట్టి  - ఆశించక  ఆశ తీర్చు
ఉస్సురన్న ఊహకి - ఊపిరూది ఉసురు పెంచు
అద్దిరా!  అదీ జీవించడం!

లేనినాడు కూడా మనసు నిండ ఉండిపో 
తలచుకున్నవారి కన్నీట తళుకువై వెలిగిపో  
అద్దిరా! అదీ జీవించడం!

********
********


    పైనున్న నా రాతలకి ఊతమేమోననిపించేదీ, రాయాలన్న నా పూనికకి ఊనిక ఐనదీ - ఏనాటిదో పాత పాటొకటుంది. 

    ఆ పాట ఎన్నేళ్ళైనా వన్నె తరగని - పాత బంగారమంటిది.  

    ఆ పాట విన్న కొద్దీ వినాలనిపించేది.  

    ఆ పాట కన్న కొద్దీ కను-ముఱుపయ్యేది. 

    ముందుగా ఆ పాట ఆనుపానులేంటో చెప్తా... 

    అనగనగా అనాడీ అని ఓ నలుపుతెలుపుల హిందీ సినిమా. 

    అందులో ఉంది కిసీ కీ ముస్కురాహటోం పే - హో నిసార్... అన్న ఈ పాట. 

    చిన్నచిన్న మాటలనే  గొప్ప పాటగా పేర్చిన హిందీ-ఉర్దూ కవి శైలేంద్ర

    ఆ పేర్చిన మాటల్ని అందమైన గీతమాలగా కూర్చింది శంకర్-జైకిషన్

    ఆ కూర్చిన గీతమాలని అందుకుని అలవోకగా తన గళం నుంచి జాలువార్చింది ముఖేష్

    ఆ పాట తనని చూసే రాశారేమోనన్నట్టు - ఆ పాట తనదే అన్నట్టు - అద్భుతంగా నటించి, పాటకి తగిన నటనమాడింది రాజ్ కపూర్


********
********


    పాట గురించిన కథ పూర్తయ్యింది కదా... 

    పాటలో నాకు కనిపించినవీ, నాకు నచ్చినవీ చెప్పేసి, చిరకాలంగా వెలుగుతున్న ఈ పాటని పదికాలాల పాటు నా రాతలో నిలుపుకోవాలన్నదే నేనీ పూటకి పడబోతున్న పాటు. 

    ఇక్కడి వరకు చదివారంటే - మరి నాతో పాటు మీరు కూడా ఈ పాటని విని, చూసి - ఆనందిస్తారని అనుకోవడం పొరబాటు కాదేమో?!


********
********

    చూడడానికి ఈ పాట ఎంత బావుంటుందో... ఇందులో ఎన్ని విశేషాలున్నాయో! 

    అవన్నీ వరసగా ఒకదాని తర్వాత ఒకటిగా - ఒక సరదా-పట్టికగా - రాసుకున్నాను. 
  
    నా ఇష్టాల పట్టిక: 

   దొరలా ముస్తాబు చేసుకున్న ఓ అబ్బాయి - ఇంటి గేటు ముందు వాగులా సాగుతున్న రహదారి మీదకి దూకిన - పరుగుతో మొదలవుతుంది ఈ పాట. 

    రోడ్డుకవతల హద్దుగా కనిపిస్తున్న పిట్టగోడ మీదుగా కనిపిస్తున్నది - అది అరేబియా సముద్రమేనేమో!

    ఆ పైన గాలిదారుల ఎగురుతున్న దారాల్లేని గాలిపటాల్లా పక్షులు. 

    తలకిందులుగా చూస్తున్న ఆకాశానికి వింజామరలు వీస్తున్నట్టున్న చెట్లు.
 
    ఊగుతున్న చెట్ల కొమ్మల పైన - పైపైన ఆకాశం మీద - దొంతరలుగా పరచుకున్న దూది మబ్బులు. 

    వాటిని తలెత్తి చూస్తూ - వాటన్నిటికీ పలకరింపుగా చెయ్యి ఊపుతూ, టోపీ సవరించుకుంటూ, పాదాలని ఉరికించుకుంటూ - ఆనందాన్ని భుజానున్న సంచీలో మోసుకెళ్తున్నట్టున రాజ్ కపూర్. 

    రోడ్డు మీద ముగ్గులేసిన చెట్ల నీడలు. 

    ఏ పొరుగునున్న పచ్చికబయలుకో మేతకని బయల్దేరి - బుద్ధిగా రెండు-మూడు వరుసల్లో తలలోంచుకుని నడుస్తున్న గొఱ్ఱెలు, వాటికి వెనకాల వాటిని వరస తప్పకుండా నడిపిస్తున్నట్టు అనుసరిస్తున్న ఓ నల్లమేక. 

    బ్యాండ్-బాజాతో కవాతు చేసుకుంటూ బడికి వెళ్తున్న ఆరుగురు స్కౌట్-బాయ్స్‌కి - పరుగు ఆపి -  రాజ్ కపూర్ చేసే సెల్యూట్. 

    రోడ్డు మీద మునికాళ్ళ మీద పెళ్ళినడక నడుస్తున్న ఆకుపచ్చ గొల్లభామ మీద వేయబోయిన బూటు తొడిగిన పాదాన్ని గాలి లోనే ఆపి, కొంచెంకొంచెంగా - అంచెలంచెలుగా కిందకి వంగి - ఓ ఆకు మీద ఆ ఆకుపురుగు నెక్కించి పక్కనున్న మొక్కల మీదుగా వదిలి పదిలించిన జీవకారుణ్యం. 

    ఆ పై మెలికలుగా అడుగులేస్తూ సాగిన పరుగు. 

    (అన్నట్టు ఈ మెలికల పరుగు దగ్గర మా ఇంటికి సంబంధించిన ఓ చిన్న జ్ఞాపకం - పిల్లల చిన్నప్పటిది. వాళ్ళు బళ్ళో నేర్చుకున్న Caterpillar walk - అంటే మెలికలుగా అడుగులేసుకుంటూ నడవడం అన్నమాట - అది నాకూ నేర్పారు. పిల్ల-Caterpillar కి తోడుగా అమ్మ-Caerpillar కూడా నడవాలి కాబట్టి. ఈ పాటలో రాజ్ కపూర్ మెలిక-కాళ్ళ పరుగు చూశాక మా Caterpillar-walk ఇంకోసారి గుర్తొచ్చి చిరు-నవ్వించింది.)

    పరుగులెడుతున్న రాజ్ కపూరుకి ఎదురొచ్చి గుండ్రంగా చేతులు పట్టుకు తిరిగిన ఇద్దరాడపిల్లల్లో ఒక పాప వేసుకున్న రెండు జళ్ళు, ఆ జళ్ళ చివరి రిబ్బను కుచ్చులు. 

    సైకిలు మీద ఎదురొచ్చిన ఇద్దరు ఈల-రాయుళ్ళు. 

    రోడ్డు పక్కన కూర్చుని జంగిడీలో వేయించిన వేరుశనగగుళ్ళో, వేరొకటో అమ్ముకుంటున్న అబ్బాయి తాలూకు నూనె రాసి దువ్విన నున్నటి తల. 

    ఆ నున్నటి తల తాలూకు అబ్బాయికి ఎదురుగుండా కూర్చుని - "నేను చెప్పే సత్యం వినూ!" అన్నట్టుగా రాజ్ కపూర్ చేతి వేలు ఊపుతూ - పాడిన నాలుగు లైన్లు 

మిటే జో - ప్యార్ కే లిఏ - వో జిందగీ (ప్రేమ కోసమేదైతే త్యాగమౌనో - అదీ జీవితం!)
జలే - బహార్ కే లిఏ - వో జిందగీ (ఆమని కోసమేదైతే తపించునో  - అదీ జీవితం!)
కిసీ కో హో న హో - హమే తో ఐత్‌బార్ (ఎవరికైనా ఉందో లేదో - నాకు మాత్రముంది నమ్మకం)
జీనా ... ఇసీ కా నామ్ హై! (జీవించడమంటే ఇదేననీ!)

    ఆ పాట వింటూ -  నవ్వుతో వెలిగిన మొహం. 

    ఆ నాలుగు వాక్యాలకీ - బహుమతిగా అన్నట్టు జంగిడీ- అబ్బాయి తీసిచ్చిన నాలుగైదు గింజలో, పళ్ళో - తీసుకుని - బదులుగా ఒక వందనం, నాలుగు చిందులతో అలరించిన రాజ్ కపూర్ నటన. 

    చేతికఱ్ఱ సాయంతో కనిపించని దారిని కనుగొంటూ నడుస్తున్న మనిషిని - ఒక సైకిలు గుద్దబోతే - చప్పున వెళ్ళి ఆ చేతికఱ్ఱ-మనిషిని ఇవతలికి లాగి భద్రంగా రోడ్డు దాటించి - తన చేతిలో ఉన్న నాలుగు గింజలూ అతనికిచ్చిన మంచితనం. 

    జిందా  హై - హమీ సే - నామ్ ప్యార్ కా (ప్రేమ అన్నది నా వల్లే ఇంకా జీవించి ఉంది) అనిపించిన జీవితం మీద ఇష్టం.  

    చివరిగా - రెండు చేతులతో జీవితాన్ని ఉన్నదున్నట్టుగా అందుకుని - అందిన దానిలో ఆనందాన్ని పొంది - ఆ ఆనందాన్ని ఎదురొచ్చిన అందరితో పంచుకుందామన్నట్టు - ఆ ఉదయపు నీరెండ దారుల్లో గెంతులేసుకుంటూ వెళ్తున్న - ఆనందవిహారిలా  - రాజ్ కపూర్ కనిపించే ఈ పాట చూసినప్పుడల్లా - నేను ప్రతీ ఫ్రేముని - అదే మొదటి సారన్నట్టుగా చూస్తాను. పాటలో ప్రతీ మాటనీ అదే మొదటిసారన్నట్టుగా వింటాను. 

    పాట విన్న ప్రతీసారీ - కొన్ని పదుల వేసవులు వెనక్కి మరలి - అక్కడెక్కడో వదిలొచ్చిన పసిదారుల్లో మసలి వస్తాను. పాటలో వినిపించే ఈలపాటని టీ-లపాటగా మార్చుకుని - టిట్టి టిట్టిడీ... టిట్టి టిట్టిడీ... టిట్టి టిట్టి టిట్టి టిట్టి టిట్టి టిట్టిడీ... అని నేనూ పాడుకుంటాను. 

    కొంచెం జలుబు-గొంతుతో ముఖేష్ పాడిన ఈ పాట - వినడానికి, కనడానికి - పైన చెప్పినవన్నీ కారణాలైనా - వీటన్నిటినీ మించిన ఇంకో కారణముంది. 

    అదేంటంటే... 

    పాటలో కనిపించే జంగిడీ-అబ్బాయి, కళ్ళు కనిపించని చేతికఱ్ఱ మనిషి - నాకెందుకో స్టూడియో మనుషులో, ఎక్స్‌ట్రా-ఆర్టిస్టులో అనిపించదు. 

    ఒకవేళ వాళ్ళు నిజజీవితపు మనుషులే అయి ఉన్నా, కాకపోయినా - ఒకవేళ చిన్నపాటి  ఎక్స్‌ట్రా-ఆర్టిస్టులే అయినా - ఆ పాటలో కొన్ని క్షణాల పాటైనా రాజ్ కపూరుతో దగ్గరగా గడిపినందుకు - ఆ కొన్ని క్షణాల గురించి తర్వాత ఎన్నేళ్ళపాటు ఆనందంగా తలచుకుని, చెప్పుకుని మురిసిపోయి ఉంటారో!  

    "నటనే అయినా - తనకి తెలియకుండానే అలాంటి ఆనందాన్ని వాళ్ళకి దక్కేట్లు చేసుంటాడేమో రాజ్ కపూర్!" అనిపించడం - ఈ పాట నాకు నచ్చడానికి - ఇంకో కారణం కాని కారణం. 

********
********


    తెలుపు-నలుపు రంగుల్లో అందమైన కదిలే చిత్రపటంలా ఉండే - ఈ పాట చూడాలనుకుంటే యూట్యూబ్ లింక్ ఇదిగో ఇక్కడ: https://www.youtube.com/watch?v=69pPYkGiEAQ



కిసీ కీ ముస్కురాహటోం పే - హో నిసార్... 
కిసీ కా దర్ద్ మిల్ సకే తో - లే ఉధార్... 
కిసీ కే వాస్తే హో - తేరే దిల్ మే - ప్యార్... 
జీనా ... ఇసీ కా నామ్ హై!

కిసీ కీ ముస్కురాహటోం పే - హో నిసార్... 
కిసీ కా దర్ద్ మిల్ సకే తో - లే ఉధార్... 
కిసీ కే వాస్తే హో - తేరే దిల్ మే - ప్యార్... 
జీనా ... ఇసీ కా నామ్ హై!

మానా - అప్‌నీ జేబ్ సే ఫకీర్ హై... 
ఫిర్ భీ యారో - దిల్ కే హమ్ అమీర్ హై!
మానా - అప్‌నీ జేబ్ సే ఫకీర్ హై... 
ఫిర్ భీ యారో - దిల్ కే హమ్ అమీర్ హై!
మిటే జో - ప్యార్ కే లిఏ - వో జిందగీ... 
జలే - బహార్ కే లిఏ - వో జిందగీ... 
కిసీ కో హో న హో - హమే తో ఐత్‌బార్!
జీనా ... ఇసీ కా నామ్ హై!

రిష్తా - దిల్ సే దిల్ కే - ఐత్‌బార్ కా... 
జిందా  హై - హమీ సే - నామ్ ప్యార్ కా!
రిష్తా - దిల్ సే దిల్ కే - ఐత్‌బార్ కా... 
జిందా  హై - హమీ సే - నామ్ ప్యార్ కా!
కే మర్ కే భీ - కిసీకో - యాద్ ఆయేంగే... 
కిసీ కే ఆసుఓం మే - ముస్కురాయేంగే... 
కహేగా - ఫూల్ హర్ కలీ సే - బార్ బార్!
జీనా ... ఇసీ కా నామ్ హై!

కిసీ కీ ముస్కురాహటోం పే - హో నిసార్... 
కిసీ కా దర్ద్ మిల్ సకే తో - లే ఉధార్... 
కిసీ కే వాస్తే హో - తేరే దిల్ మే - ప్యార్... 
జీనా ... ఇసీ కా నామ్ హై!


********
********

పాట ముచ్చట ముగించే ముందు - ఒకే ఒక్క చిన్న మాట... 

 అక్కరున్న చోట - అడగనవసరం లేకుండా 
అవసరం కనిపెట్టి - ఇచ్చినది ఎంతైనా 
ఇచ్చుటలో ఉన్న ముచ్చటేంటంటే 
ఇచ్చిన వారి మనసు విచ్చును 
ఇచ్చిన చోట నవ్వు విచ్చును 
"అద్దిరా! అదీ జీవించడం!" అనిపించును. 


~ పాటల భైరవి