రాముడు
శివుడు
కృష్ణుడు
చిన్నప్పట్నుంచీ మూడు దశలుగా ఈ ముగ్గురూ నాకెఱుకే...
వీళ్ళు ముగ్గురూ
నేనెరిగినంతలో
కరకు రాతి గుళ్లల్లో వుంటారు
కొలుచు జాతి గుండెల్లో వుంటారు
ఊహకందని ఉనికై వుంటారు
మనిషిని మించిన మనికై వుంటారు
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
చిన్నప్పట్నుంచీ ఎప్పుడు ఏ గుడికి వెళ్లినా కళ్ళు మూసుకుని ఆ గుళ్లో వున్న మూర్తికి సంబంధించిన శ్లోకమో, స్తోత్రమో మనసులో అనుకోవడం నాకు అలవాటు. అంతకు మించి ఇంకో ఆలోచనే ఎప్పుడూ రాలేదు ఇప్పటి దాకా.
నిజం చెప్పాలంటే నేను తఱచు వెళ్లే గుళ్లు కూడా తక్కువే. నేనెప్పుడూ వెళ్ళే గుళ్లు - మా శివకోడు శివాలయం, పుంతలో ముసలమ్మ గుడి - అనాతవరంలో శివాలయం, విష్ణాలయం, ముత్యాలమ్మ, మరిడమ్మ, కట్లమ్మ - అయినవిల్లి వినాయకుడు - వానపల్లి పళ్ళాలమ్మ - ఎప్పుడో వెళ్లిన తిరుపతి - ఈ మధ్యే చూసిన ఒంటిమిట్ట రాముడు - అంతే!
ఏ గుడికి వెళ్లినా నిర్నిమిత్తంగా చేసే ఓ ప్రదక్షిణం, పళ్లెంలో వేసే దక్షిణ, చేతికి చిక్కే పటికబెల్లపు పలుకు, నోటికి దక్కే ఉద్ధరిణెడు తీర్థం, జడలో చేరే ఓ పువ్వు, నొసటన చేరే కుంకుమో, విభూతి బొట్టో.
ఆ గుడి మెట్ల మీదో, కోనేరు గట్టు మీదో ఓ పది నిముషాలు కూర్చుని ఏ రావిచెట్టు గాలో ఊపిరి నిండా నింపుకోగలిగితే గుళ్లో వున్న దేవుడు కనికరించి కళ్లెదుట నిలిచినట్టే.
గుడికి వెళ్లినా ఏమైనా కోరుకోవడం అసలెప్పుడూ లేనిదే. దేవుడే దిగొచ్చి తీర్చాల్సినంత పెద్ద కోరికలేమీ లేకపోవడం ఒక కారణం.
అంతే కాకుండా అసలు నా నమ్మకమేంటంటే మనవన్నీ ముందే రాసేసున్న కథలు.
ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది.
కొందరికి వాళ్ళు అనుకున్నది, వారి కథలో రాసున్నది దాదాపుగా coincide అవుతుంది. అంటే ఒక సినిమా చూస్తూ దర్శకుడు తీద్దామనుకున్న కథని మనం ముందే ఊహించగలిగినట్టన్నమాట.
ఇంకొందరికి వాళ్ళనుకున్న దానికి భిన్నంగా జరుగుతుంది - అంటే సస్పెన్సు సినిమాలాగా అన్నమాట.
ఇలా జరగాలని అనుకోవడం, అనుకోకపోవడం కూడా ఎవరెవరు ఎంత సంతోషించాలీ, ఇంకెవరు ఎంత బాధ పడాలీ అన్న లెక్కల్లోనే జరుగుతాయి.
అలాంటప్పుడు నేను కోరుకున్నా కోరుకోకపోయినా నాకు జరగాల్సినవాటిల్లో ఏ మార్పూ వుండదేమో, ఆ మాత్రం దానికి - పిపీలకమాత్రపు నేను - ఆ దేవుణ్ణి ఎందుకబ్బా disturb చేయడం అనిపించడం కూడా - నేను దేవుడికి పెట్టే దండంలో ఒట్టి దండం తప్ప కోరికల-దండకం లేకపోవటానికి ఒక కారణం.
అన్నిటికన్నా ఇంకో పెద్ద కారణమేంటంటే 'ఏమన్నా కావాలీ' అని దేవుణ్ణి అడగడానికి నాకు బోల్డు మొహమాటం. ఇవ్వాల్సిందేదో ఇచ్చే పంపించి వుంటాడు కదా- ఇంకా ఏమడుగుతాంలే అని.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
ఒక ఉదాహరణ చెప్తా.
మా వంటింటి గోడ వారగా అప్పుడప్పుడూ చీమలొస్తుంటాయి. వాటికి నేను ఒక్కోసారి బెల్లమ్ముక్కలు పెడుతుంటాను.
అది ఎందుకూ అంటే "పాపం - అంత చిన్నచీమ, తనకు మించిన బరువు మోసుకెళ్తూ కష్టపడుతుందీ, నేను చిటికెడు బెల్లప్పొడి పెడితే దానికి బోల్డంత అనిపిస్తుంది కదా!"అని.
ఒక్కోసారి అలాక్కాకుండా వాటి దార్లో పొరపాట్న ఒలికిన పంచదారేదో మోసుకెళ్ళిపోతుంటాయి మా వంటింటి చీమలు.
అలాగే ఒక్కోసారి చీమలొచ్చినా ఏ పని హడావిడిలోనో వుండి నేను పట్టించుకోను. అసలేమీ పెట్టను.
వాటి ప్రాణానికి ఏదో దొరికింది అని పట్టికెళ్ళడం తప్ప "ఆ బెల్లమ్ముక్క ఎవరో మనకి పెట్టినది, ఈ పంచదార మనకి ఉట్టినే దొరికినది" అని లెక్కలేసుకుంటాయని నేననుకోను.
అసలు వాటికి నా ఉనికి కూడా తెలీదేమో.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
నాకు చీమలెలాగో దేవుడికి నేనలాగ అనిపిస్తుంది నాకు.
అలాంటప్పుడు నా ఉనికే తెలియని దేవుడిని "నాకు అదియ్యి ఇదియ్యి" అని అడగడం ఏం బావుంటుందబ్బా అనుకుంటాను.
ఆందుకే "గాలికి పోయిన పేలపిండి కృష్ణార్పణం" అన్న మాటల్ని నా వరకు నాకు "చేతికి చిక్కిన పేలపిండి కృష్ణదత్తం" అనుకుంటాను.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
అసలూ .... ఒకప్పుడు దేవుళ్ళు భూమికి దగ్గర్లోనే వుండేవాళ్ళనుకుంటా.
అందుకే తపస్సులు చేస్తే ప్రత్యక్షమయ్యి వరాలు ఇచ్చేవాళ్ళు.
ఆ తర్వాత ఆ ప్రత్యక్షమవడాలు తగ్గించుకుని నిష్కామంగా ఎవరు పూజ చేసినా కనీసం కలలో అయినా కనిపించేవారు.
తర్వాత్తర్వాత పవళింపు సేవకీ, సుప్రభాత సేవకీ మధ్య విరామం కూడా ఇవ్వకుండా IST (Indian Standard Time) లోనే కాకుండా అమెరికన్, బ్రిటిష్, ఆస్ట్రేలియన్ - ఇలా అన్ని కాలమానాల్లో - రోజులో వున్న ఇరవైనాలుగ్గంటలూ దండాలూ, దండలూ, దర్శనాలూ అంటే ఎంతటి దేవుడికైనా "భూమ్మీదుంటే సుఖం లేదంతే" అనిపించి "ఈ ఇహము నాకహితము, నాకమే నాకు హితమూ" అని ఎవరికీ అందక ఎంచగ్గా ఎందో వుండి వుంటాడు.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
ఇదే నాతో నాకున్న పేచీ.
ఏదో చెబ్దామని మొదలుపెట్టి అది తప్ప ఇంకేవో చెప్పేసుకోవడం.
ఇవాళసలు నాకు అంచెలంచెలుగా ఎఱుకైన ముగ్గురు దేవుళ్ళ గురించి మూడంచెల్లో గుర్తు చేసుకుందామని మొదలుపెట్టి మొదటి అంచె దరిదాపుల్లోకి కూడా రాకుండా ఎక్కడెక్కడో సంచరిస్తున్నాను.
ఇదిగో... ఇప్పుడు మళ్ళీ రాముడి అంచె దగ్గరికి వస్తున్నాను.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
రాముడితో నా మొదటి పరిచయం మా నాన్న నాకు పాడిన జోలలో.
రాంరాం రాంరాం రాంరాం రాంరాం రాంరాం రాంరాం రాంరాం
రాంరాం రాంరాం రాంరాం రాంరాం రాంరాం రాంరాం రాంరాం
గోవింద రాంరాం
గోవింద హరిహరి
గోవింద జయజయ
గోవింద రాధేశ్యాం
హరే రామా గోవిందం
అర్జునసారథి గోవిందం
పాండవపక్షా గోవిందం
పరమపవిత్రా గోవిందం
గోవింద రాంరాం
గోవింద హరిహరి
గోవింద జయజయ
గోవింద రాధేశ్యాం
రాంరాం రాంరాం రాంరాం రాంరాం రాంరాం రాంరాం రాంరాం
రాంరాం రాంరాం రాంరాం రాంరాం రాంరాం రాంరాం రాంరాం
నాకు పాడిన ఆ జోలపాటే నా పిల్లలకూ పాడారు నాన్న.
అదే వరసలో నేనూ పాడాను.
ఒక మాట అటూ - ఇటూగా మరచి మార్చి పాడానేమో కూడా ---
రాముడితో మొదలుపెట్టి గోవిందమైన ఈ పాట ఇక్కడ చదివి మా నాన్న రేప్పొద్దున్న నాకు ఫోన్ చేసి "హన్నా! పాట తప్పు రాశావు - సరి చెయ్" అనెలాగూ చెప్తారు. అప్పుడొచ్చి మళ్ళీ తప్పులు దిద్దుతా.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
రామా లాలీ .... మేఘశ్యామా లాలీ...
తామరసనయనా.... దశరథతనయా లాలీ...
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
"అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ..." అంటూ మాటలు రాయడం నేర్చుకుంటున్న నాకు మా అమ్మ పాడిన పాటలో రాముడు దర్శనమిచ్చాడు.
జయ జయ శ్రీరామా...
రఘువరా - శుభకర శ్రీరామా
త్రిభువనజననయనాభిరామా...
త్రిభువనజననయనాభిరామా...
జయ జయ శ్రీరామా...
రఘువరా - శుభకర శ్రీరామా
(జయసింహ సినిమాలోది)
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
ఆ తర్వాత ఆరో తరగతి చదువుతున్నప్పుడు నాకు తమాషాగా అనిపించి పాడుకున్న పాటలోనూ రాముడే...
నీ కాలి దుమ్ము సోకి రాయి ఆడది ఐనాదంటా...
నా నావ మీద కాలు పెడితే ఏటవుతాదో తంటా...
రామయ తండ్రీ...ఓ రామయ తండ్రీ
(సంపూర్ణ రామాయణం సినిమాలోది)
పదో తరగతి సెలవుల్లో నేర్చుకున్న పాటలోనూ రాముడే.
రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా
బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా
పడవనైనా కాకపోతిని స్వామికార్యము తీర్చగా
పాదుకైనా కాకపోతిని భక్తిరాజ్యమునేలగా
(శ్రీరామగానామృతం అనే ఒక ప్రైవేట్ ఆల్బంలో వచ్చిన
ఈ పాటంటే నాకు భలే అబ్బురం -
నాస్తికులని విన్న ఆరుద్ర ఎంత ఆస్తికమైన పాట
తెలుగువారికి ఆస్తిగా ఇచ్చారా అని!)
ఇంకొన్నాళ్ళకి పాటల్లో సాహిత్యం బాగా అర్థం కావడం మొదలయింది.
అప్పుడు నాకు ఇష్టమైన పాటల రచయిత వేటూరి సుందరరామమూర్తి రాసిన 'పంతులమ్మ' సినిమా పాట విన్నాక "హమ్మయ్య! నాకు రాముడు తెలీదని బెంగ లేదు - ఎదుట పడే మనుషుల్లో కనబడే మంచే రాముడయ్యుంటాడు" అనిపించింది.
ఆ పాటేంటంటే...
ఎరిగిన వారికి ఎదలో వుంటాడు...
ఎరుగని వారికి ఎదుటే వున్నాడు...
... .... ... .... ...
మనసెరిగినవాడు మాదేవుడు - శ్రీరాముడు
(పంతులమ్మ సినిమాలోది)
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
పైన చెప్పిన పాటలే కాకుండా ఇంకా ఎన్నోఎన్నో రాముడి పాటలు విన్నాను, నేర్చుకున్నాను - నేర్చుకుంటూనే వున్నాను.
ఆ నేర్చుకున్న పాటలూ, ఆ పాటల్లో నేర్చుకున్న జీవితపాఠాలూ ఇంకోసారెప్పుడైనా బోల్డన్ని కబుర్లు చెప్తాను - కానీ ఇప్పటికి చెప్పాల్సిన విషయం ఒకటీ, విశేషం ఇంకోటీ ఉన్నాయి.
ముందుగా విషయానికొస్తే - మొన్న జూన్ 25వ తేదీన నా సంస్కృతభారతి కోర్స్ "సంభాషణతః శాస్త్ర పర్యన్తమ్" నాలుగవ పరీక్షా (శాస్త్రమ్) ఫలితాలు వచ్చాయి. మొత్తానికి నాలుగు పరీక్షలు పాస్ అయి KKSU (కవికులగురు కాళిదాసు సంస్కృత విశ్వవిద్యాలయం) వారి నుంచి ఒక యోగ్యతాపత్రం అందుకున్నాను.
ఇహిప్పుడు విశేషం ఏంటంటే.... ఆ నాలుగో లెవెల్లో నా పాఠ్యాంశం "సంక్షేప రామాయణం".
సంక్షేప రామాయణం అంటే వాల్మీకి రచించిన రామాయణ కావ్యంలో బాలకాండలోని ప్రథమసర్గలోని వంద శ్లోకాలు. ఇందులో లోకంలో సర్వోత్తమగుణాలు కలిగి మహనీయుడైన వారెవరని అడిగిన వాల్మీకికి నారదుడు టూకీగా రాముడి కథ చెప్తాడు.
ఆ కథ మన లవకుశ సినుమాలో రెండు పాటలంత కథ.
"వినుడు వినుడు రామాయణ గాథ వినుడీ మనసారా" అంటూ రామపట్టాభిషేక సంభారాలతో మొదలు పెట్టి "శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా" అంటూ సీతారాములు అయోధ్యకి తిరిగొచ్చి రాజ్యం ఏలే దాకా సంక్షిప్తంగా వుంటుంది.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
మా శాస్త్రం కోర్సులో భాగంగా మొదటి ముప్ఫై శ్లోకాలు ప్రతిపదార్థతాత్పర్యసహితంగా, వ్యాకరణంతో సహా నేర్పారు. ఆ 30 శ్లోకాలు కంఠస్థం కూడా చేయాలీ అన్నారు.
అలా ముప్ఫయ్యే కంఠస్థం చేస్తే మరింకో డెబ్భై శ్లోకాలు మిగిలిపోతాయి కదా!
అందుకని ఫిబ్రవరి 5 వ తేదీన మొదలుపెట్టి వంద శ్లోకాలూ కంఠస్థం చేద్దామని మొదలుపెట్టాను.
రోజుకొకటి నేర్చుకుంటూ - మరుసటి రోజున ముందురోజుకి నేర్చుకున్నంతవరకు వల్లె వేసుకుంటూ - మొన్న జులై మూడో తారీఖుకి మొత్తం వంద శ్లోకాలూ నేర్చేసుకున్నాను. అంటే నూటయాభై రోజుల్లో నూరు శ్లోకాలు - మూడుపొద్దులకి నాలుగు పాదాలన్నట్టు - ఒకటిన్నర రోజుకి ఒక శ్లోకమన్నట్టు.
అన్నట్టు ఈ వంద శ్లోకాల్లో చదివిన రాముడి విశేషణాల్లో నాకు బోల్డంత నచ్చినది "అదీనాత్మా" - అంటే దైన్యము, దీనత్వమూ దరికే చేరనివాడు.
అద్దీ! అలాక్కదరా ఎవ్వరైనా వుండాలీ అనిపించింది నాకు.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
ఎక్కడో వున్న తనని తెలుసుకోలేకపోతున్నాననీ,
వున్నాడో లేదో తేల్చుకోలేకపోతున్నాననీ
"దైవం మానుషరూపేణా" అంటే ఏంటో చూపిద్దామని ఆ రాముడే దిగి వచ్చినా నాకు తెలీదేమో....
అందుకే....
ఈ సంక్షేపరామాయణ నిత్యపారాయణతో...
ఎఱుక లేని నా ఎదటే...
పలుకు పాటై నా ఎదనే...
మారాము మాని ఆ రాముడే
మాలిమయ్యె మా రాముడే...
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
కొసమెరుపు: కష్టపడో, ఇష్టపడో విడవకుండా వంద శ్లోకాలు నేర్చుకున్నానని నాకు నేనే ఒక లెగో కొనుక్కున్నాను :) నా సంబరానికి గుర్తుగా లెగో-బాణాసంచా పేల్చుకున్నా.
