28, జనవరి 2018, ఆదివారం

తెలుగు వెలుగు - 1 - తొలి వినివ్రాత

బుజ్జిజింకతో తెలుగు రాయించి చా...లా రోజులా -  ...కాదు కాదు - నెలలు అయింది.

ఆ మధ్య అన్నజింకతో ఇంటికి వచ్చిన కెవినుడికి - వాడడిగాడని అత్యుత్సాహంతో తెలుగులో బోల్డన్ని పదాలు చెప్పేస్తూ - ఓ నెల నా దగ్గరుంటే నీకు బోల్డు తెలుగు నేర్పేస్తానని అనగానే - అన్నజింక "వాడికి కాదు ముందు - తమ్ముడికి మొదలుపెట్టింది పూర్తి చెయ్యి" అని గుర్తు చేశాడు.

అప్పుడు "నిజమే ...ప్చ్ ప్చ్ " అని కొరుక్కున్ననాలుక ఇప్పటికీ చురచురమంటూనే వుంది - పాఠం మళ్ళీ ఎప్పుడెప్పుడని అడుగుతూనే వుంది.

నాకూ బుజ్జిజింకకీ ఇప్పటికి కుదిరింది.

అప్పుడెప్పుడో బోల్డంత తెలుగు నేర్పేసుకున్నానని నేనూ - నేర్చేసుకున్నానని వాడూ - మురిసి మురిసి పరస్పరం మెచ్చుకోళ్ళు ఇచ్చేసుకుని - మేకతోళ్ళు కప్పుకున్నంత హడావిడి చేసేసి - ఆ మురిపెంలో తెలుగు రాసుకున్న పుస్తకాన్ని కూడా ఎక్కడో భద్రంగా దాచేసుకున్నాం.

ఆ దాచుకున్న నిధిని ఇవ్వాళే  - ఇప్పుడే - అంటే ఒక గంట క్రితం బయటికి పురా-పుస్తక తవ్వకాల్లోంచి బయటికి తీసి - "తెలుగు రాద్దాం రారా" అంటే - "ఆమ్ తిన్నాక" - అన్నాడు బుజ్జిజింక.

కంచమేసి - పప్పేసి, టొమాటో పచ్చడేసి, పెరుగేసి - ఆమ్ తినేసి - అనిపించాక - పదంటే పది నిముషాల్లో
"తల్లీ! నిన్ను దలంచి పుస్తకమున్ చేతం బూని నే తెలుగు revise చేసితి" అన్నాడు వాడు.

"నీకెంత గుర్తుందో చూద్దాం దా"  అనిపుస్తకం, పెన్సిలు తెమ్మనగానే ముందే బేరం పెట్టాడు - "ఎన్ని రాయాలో చెప్పు" అంటూ.

ఐదంటే ఐదు వాక్యాలు చాలు అని చెప్పి - వాడికింకా ఒత్తులు రావని - ఆట్టే నొక్కి-వక్కాణించకుండా ఓ ఐదు తేలికైన నిత్యసత్యాల్లాంటి వాక్యాలు చెప్పగా ... ఈ రోజుకి ఫలించిన వినివ్రాత:


ఇప్పటినుంచి వారానికి రెండు రోజులైనా తెలుగుని వెలిగిద్దామని - ఆ వెలుగులో బుజ్జిజింకని నడిపిద్దామని... అంతే అంతే !

అమ్మ తినిపించే వేడివేడి-ఆమ్ తెలుగు
అమ్మ వినిపించే జోలపాట తెలుగు
అమ్మని విసిగిస్తే వచ్చే కోపం తెలుగు
అమ్మని మురిపిస్తే పెట్టే ముద్దు తెలుగు 
తెలుగు నేరిస్తే జ్ఞానదీపం మరింత వెలుగు
ఆ వెలుగులోన తెలుగు ఎలుగు మరింత పెరుగు



26, జనవరి 2018, శుక్రవారం

కాఫీ విత్ కలిమి - 1 - ఫస్ట్ సిప్

అప్పుడప్పుడు పగళ్ళు మరీ పొడుగ్గా ఉంటాయి
సాయంత్రాలు కొంచెం దిగులుగా అనిపిస్తాయి
నడకలో అడుగులు కదలనని మొరాయిస్తాయి
గొంతులో పాటలు శృతి తప్పి విసిగిస్తాయి
అలాంటప్పుడు - కప్పుడు కాఫీ ఒక చేత -  ప్లెయిన్ ఓల్డ్ POTS లైనో, సెల్లుయుగపు స్మార్టు ఫోనో ఇంకో చేత బట్టి - మీటలు నొక్కగా - 'హలో' అంటూ కలిసే చెలిమి-తీగ కలిమి కాక మరేంటి?

ఆ చెలిమి-కలిమితో
కలిమి-చెలిమితో -
చేతిలోని కాఫీ కప్పుతో -
సిప్పు మీద సిప్పుతో -
కలిసిన మాట మీద మాట పెంచి -
ఎన్ని కబుర్లో!

ఎంత సేపని కాదు - ఎలాంటి కబుర్లనీ చెప్పడానికి లేదు - చెప్పుకున్నామా లేదా - అదీ లెక్క - అదే లెక్క!

అనగనగా మా వూళ్ళో ఉండేటప్పుడు -
గోడ వారగా ముక్కాలిపీటెక్కి -
పొద్దుటి నీరెండలో కళ్ళ-కమలాలు విచ్చుకుని -
పెదవి పగడాల నవ్వుల-ముత్యాల్ని దొర్లిస్తూ -
నేస్తంతో కబుర్లాడుకునే రోజుల్ని simulate చేసుకుంటూ -
ఇప్పుడూ ఆడుకుంటా కబుర్లు -
ఊసుపోని వేళల్లో
గాలివాటు పొద్దుల్లో 
ఉసురుసురనిపించినపుడల్లా
కుదిరితే పూసగుచ్చినట్టు - కుదరకపోతే నోటికొచ్చినట్టు
అచ్చమైన గాలికబుర్లు.
ఒక్కోసారి బావుంటాయి
ఒక్కోసారి.... ఉంటాయి
ఒక్కోసారి బోల్డుంటాయి
ఒక్కోసారి కొన్నే వుంటాయి
ఒక్కోసారి loooooong ear-time
ఒక్కోసారి quick (ear)bite
ఒక్కోసారి సిసలైన విశేషాలుంటాయి
ఒక్కోసారి అస్సలు విషయమే ఉండదు



అసల్చెప్పాలంటే - అప్పటికప్పుడు కాలక్షేపపు-బఠానీల-కరకరల్లా గలగలా నోట జాలువారే కబుర్ల వరస ఇదీ....

"హలో!"

"హలో"

"నీకు టైముందా? ఇప్పుడు మాట్లాడగలవా?"

"ఆ .. పర్లేదు - ఏంటి చెప్పు"

"హమ్మయ్య - ఐతే నీకు టైముంది - ఇప్పుడు చెప్పు - బావున్నావా?"

" బావున్నాను గాని - నువ్వెలా వున్నావ్? నాకు టైముందని చెప్తే కానీ కుశలమడగాలనిపించదా?"

"అవును మరి - నాతో నువ్వు మాట్లాడే sound నాకు వినిపించే టైం వున్నప్పుడే  నీకు sound mind in a sound body వుందో-లేదో నాక్కావాలి గానీ - ఉట్టప్పుడెల్లా ఉంటే నాకెందుకు?"

"మంచి దానివే! ఏం చేస్తున్నావింతకీ?"

"వంట చేస్తూ - నువ్వు గుర్తొచ్చావ్ - అంతే! కాఫీ కలుపుకుని నీకు ఫోన్ చేశా!"

"అయితే లైన్లో వుండు - నేనూ నా టీ కప్పు తెచ్చుకుంటా"

"వెళ్ళిరా మరి - తొరగా"

"తొరగానే - టీ మీద తొరక కట్టేలోగా వస్తా"

(అవతలి వాళ్ళొచ్చేలోగా ఇవతలవాళ్ళకి ear-time వృధా అయిపోతోందని బెంగ - అందుకే తనకి తనే పాడేసుకుని వినేసుకుంటుంది - వస్తా - వెళ్ళొస్తా - మళ్ళెప్పుడొస్తా - లైను కట్టయ్యేలోగ వస్తా అంటూ.)

"ఏంటీ - పాడేస్తున్నావ్?"

"మరెంత సేపేంటి? - నోరాడుతూనో, పాడుతూనో ఉండాలి"

(ఇటు పక్కనుంచి చుయ్-చుయ్ నేపథ్యసంగీతం - బూర్లుమూకుడులో మరుగుతున్న నూనె-లయకి చిటపటలాడుతున్న ఆవాల శృతితో.)

"నీ నోటాడేపాటా నా చెవులారా విన్నాను కానీ ... ఇంతకీ నీ కాఫీ తాగడం అయ్యిందా? స్టవ్ మీదేంటి? పోపేస్తున్నావా?"

"అర్రే! నీకెలా తెల్సింది?"

"స్మార్ట్ ఫోనమ్మా!"

"హహ హహ - బావుంది - వాసన పట్టేస్తుందన్నమాట"

"అదే గదా! దానికీ app ఉందమ్మా!  రకరకాల apps - అవెలా పని చేస్తాయో గుర్తుంచుకోడానికో app - ఆ app ఉందని గుర్తు చేయడానికో app - మొత్తానికి ఫోన్లు స్మార్ట్ అవుతున్నాయి - మనం అ-స్మార్ట్ అవుతున్నాము."

"కదా! - మొన్నెప్పుడో office లో ఏదో document చదువుతుంటే ఎవరికో ఫోన్ చేయాల్సి వచ్చింది - అప్పుడు నేనేం చేశానో తెల్సా - laptop keyboard మీద అంకెలు నొక్కి ఫోన్ పని చేయట్లేదేంటా అనేసుకున్నాను."

"అనుకున్నావూ! నువ్వలా అనుకోకపోతే అనుకోవాలి - అనుకుంటే అనుకోవడానికేమీ లేదు - సరే మరి - ఇంకేంటి విశేషాలు?"

"ఏం లేదూ... మొన్న నువ్వు ఫోన్ చేసినప్పుడు ఏం చేస్తున్నావూ అని నువ్వడిగినప్పుడు - కాఫీ తాగుతూ నీతో కబుర్లు చెప్తున్నాను అంటే "ఓహ్ అయితే కాఫీ విత్ మి అన్నమాట" అన్నావు కదా? ఆ మాట పట్టుకుని నేనొక కొత్త సిరీస్ మొదలు పెడదాం అనుకుంటున్నానని చెప్పాను కదా! దానికో పేరు కూడా పెట్టానని చెప్పాను కదా - కాఫీ విత్ కలిమి అని. ప్రస్తుతానికి అదే విశేషం."

"ఓ అదా ! హహ్హహ్హ"

"ఎందుకా నవ్వు?"

"ఏం లేదు - మొన్న దీనిమీదే జరిగిన నన్ను అవాక్కు చేసిన ఓ walk లో-వాక్కు గుర్తుకొచ్చి"

"ఎక్కడికా walk  - ఏంటా వాక్కు - నువ్వెందుకయ్యావ్ అవాక్కు???"

"చెప్తాగా! నీ ఈ పోస్టుకి అనుబంధంగా రాసుకో - నీకు copyrights ఇచ్చేశాను"

"భలే! నా Coffee-write కి నీ copyright! నచ్చేసిందమ్మాయ్!"

"ఇంకో పది నిముషాల్లో ఆఫీస్‌కి బయల్దేరాలి - మళ్ళీ మాట్లాడదాం!"

"బానే వుంది - భూమికవతలెక్కడో వున్నావు - పట్టుమని పది నిముషాలు కూడా మాట్లాడవ్ - ఈసారి నేను కూడా ఒక meeting request పంపిస్తా - అలా అయితేనే కుదిరేలా వుంది నీతో - bye మరి"

"Bye!"


Walk లో అవాక్కు చేసిన వాక్కు (Coffee-Write with Copyright ):

"లలిత కొత్త సిరీస్ మొదలు పెడుతోందట - కాఫీ విత్ కలిమి అని"

"ఆహా!"

"దానికి నేనే ఇన్స్పిరేషనట - అయినా ఫోన్ కబుర్లు అని రాయడానికి ఏముంటాయి కదా?"

"కబుర్లేముంటాయో తర్వాత సంగతి కానీ - నువ్వు ఇన్స్పిరేషన్  అవడం ఏంటి?"

"అంటే మేమిద్దరం కుదిరితే రోజూనో, కుదరకపోతే కుదిరిన రోజునో ఫోన్లో కబుర్లు చెప్పుకుంటాం కదా! అప్పుడు అటు పక్క తాను కాఫీ, ఇటు పక్క నేను టీ తాగుతూ చెప్పుకుంటామన్నమాట. అందుకని ఈ సిరీస్ అంతా ఫోన్ కాన్వర్సేషన్ లా నడుస్తుందన్నమాట - రకరకాల టాపిక్కులతో"

"ఐడియా బానే వుంది కానీ - నీకేమీ బాధగా అనిపించలేదా - ఆ సిరీస్‌కి పేరలా పెడితే?"

"పేరుకేమయింది - బానే ఉందిగా - కాఫీ విత్ కలిమి?"

" అదే - ఆ కలిమి అంటే నీకు ఏమీ అనిపించలేదా?"

"ఏమనిపించాలి?"

"అదంత మంచి మాట కాదు కదా ?"

"ఎందుకు కాదు?"

"కలిమి అంటే కష్టం కదా! కలిమిలేములు అంటే కష్టనష్టాలు కదా! నిన్ను అంత మాటనేసిందేంటి?  నీకేం అనిపించలేదా? పైగా ఆనందంగా చెప్తున్నావ్... కలిమి అని నా పేరే పెట్టింది అనీ..."

"అబ్బా! అసలు నిన్ను తెలుగులో పాస్ చేసిందెవరు? కలిమిలేములు అంటే okey-dokeyలాంటి usage కాదు. తెలుగులో ద్వంద్వసమాసం అది - కలిమి అంటే wealth, లేమి అంటే poverty."

"ఓ హో "

"లలిత వాడే అర్థంలో కాఫీ విత్ కలిమి అంటే talking to a friend over a cup of coffee"

"అర్థం అయింది"

"హ్మ్.... "

"ఏంటాలోచిస్తూ నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావ్? ఇదంతా లలితతో చెప్పేయాలనుకుంటున్నావా? చెప్పేస్తావా?"

"మరి... చెప్పక? నాకు దక్కిన ఈ నవ్వులు పంచక మా చెలిమి-కలిమిని లేమి చెయ్యనా?"

"తల్లీ ! నీకో దండం - మీది చెలిమి-కలిమి; నాది బుద్ధి-లేమి. ఒప్పుకుంటున్నాను"

<<ఈ పోస్ట్ మరియు సిరీస్ 100 శాతం  నా చెలిమి-కలిమికి బోల్డన్ని ధన్యవాదాలతో దఖలు>>


19, జనవరి 2018, శుక్రవారం

త్వామనురజామి - 21 - చిట్టిపిట్టలు మా చుట్టాలే - వచ్చీ పోయే అతిథులే!

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి:  త్వామనురజామి - 20 - ఆ పంథొమ్మిదికి baseఏదమ్మా ౘందమామా?

కానీ అసలింతకు ముందు ఏం జరిగిందో తెలియాలంటే మాత్రం ఇదిచదవండి: త్వామనురజామి - 19 - बोलనంత సేపు స్నేహమా - నేను बोలాక కోపమా? 

నేను తెచ్చిన లగేజ్ అంతా నాన్న డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన ఫియట్ డిక్కీలో పెట్టేసుకుని - చలికాలపు పొద్దుటివెలుగులో - ఒకరి తర్వాత ఒకరుగా మూడు ప్రశ్నలూ - ఆరు ఆన్సర్లుగా అసలేంటో - కొసరేంటో, మొదలేంటో - చివరేంటో అంతుబట్టని కబుర్లాడుకుంటూ, నవ్వులేరుకుంటూ ఇంటికి చేరాం.

అప్పటికే - అమ్మ, లక్ష్మిదొడ్డ - ఇద్దరూ కాఫీలు, టిఫిన్లూ - చేయాలి అనుకుంటూ - స్నానాలకి బాయిలర్లో నీళ్ళు కాగాయా లేదా చూసుకుంటూ తెగ హడావిడి పడుతున్నారు.

ట్రెయిన్ దిగి ఇంటికి చేరిన నన్ను చూసి - "వచ్చింది త్రిపురసుందరి. ఇంక కూర్చోనీయదు, నించోనీయదు...ఒకటే హడావిడి" - నన్ను చూసిన ఆనందం లోనే కుసింత విసుగుని కూడా కలిపి అంటూ ఎదురొచ్చింది అమ్మ.

కుశలప్రశ్నలు - కులాసా సమాధానాలు అన్నీ అయ్యాక - కడుపునిండా వేడివేడి ఉప్మా తిని, కప్పు నిండా పాలు తాగి - తెచ్చిన పెట్టెలు తెరిచి - పప్పీ, కుట్టీలకి, ప్రశాంతికి శిల్పంలో కొని తెచ్చినవి ఇచ్చి - మళ్ళీ చాలా రోజుల తర్వాత విజయవాడ- వివిధభారతిలో జనరంజనిలో బోల్డన్ని పాటలు విని ఓ బద్ధకపు-చలికాలపు-రోజుని తెగ ఎంజాయ్ చేశాను.

నాకంటే సెలవులు. పప్పి, కుట్టీలకి ఇంకా కాలేజులు జరుగుతున్నాయి. నేను ఇంటికి వచ్చింది శనివారం - తర్వాతి రోజు ఆదివారం ఇంట్లోనే వున్నారు. సోమవారం ఇద్దరూ కాలేజ్‌కి వెళ్ళారు.

సోమవారం పొద్దున్న గుర్తొచ్చింది - నేను మా క్లాస్‌మేట్స్‌కి పంపిద్దామని కొన్న న్యూఇయర్ గ్రీటింగ్స్. ఆ రోజు అప్పుడే డిసెంబర్ 24. అప్పుడు పోస్ట్ చేయకపోతే టైంకి అందవు.

వెంటనే అమ్మకి పోస్ట్ఆఫీస్‌కి వెళ్ళి స్టాంపులు కొని అక్కడే పోస్ట్ చేసి వస్తానని చెప్పి ప్రశాంతిని నాతో తీసుకుని బ్రాడీపేట 2/11 లో వున్న పోస్ట్ఆఫీస్‌కి బయల్దేరాను.

వెళ్తున్నప్పుడు నా కనిపించింది - ఎప్పుడూ కాలేజ్ కబుర్లన్నీ అమ్మ, పప్పీ, కుట్టీలతో షేర్ చేసుకునే నేను మొదటిసారిగా మూగబ్బాయితో నా పరిచయం గురించి అస్సలేమీ చెప్పలేదని.  ఆ రాత్రి పేపర్ మీద మాట్లాడుకోవడం, ఆ తర్వాత మాటలొచ్చని తెల్సిన తర్వాత భయంతో ఏడవడం తల్చుకుని నాలో నేనే నవ్వుకున్నాను.

ఇంతలో పోస్టాఫీస్ దగ్గరికి వచ్చేశాం - అక్కడే కూర్చుని అందరి అడ్రెస్సులు రాసి స్టాంపులు కొని అంటిద్దామని చూస్తే అక్కడ ఎప్పుడూ వుండే గమ్ బాటిల్ కనిపించలేదు.

ఏదో ఒకటో రెండో అయితే నా నాలుక - ఐదో ఆరో అయితే నాదీ, ప్రశాంతిదీ కలిపి రెండు నాలుకలూ వాడి అంటించేసేదాన్ని.  కానీ మొత్తం 26 కవర్లు, వాటి మీద స్టాంపులు - అబ్బే! వద్దు అనిపించింది.

అప్పుడు మూగబ్బాయి రాత-మాటలో ఇంక్-రంగు బదులు ఇష్టం-హంగు కనపడేలా - "మా ఇల్లు బ్రాడీపేట 2/11 లో పోస్టాఫీస్ ముందు. మా అమ్మ, ఒక మంచి తమ్ముడు, ఇంకా మంచి చెల్లెలు - మొత్తం నలుగురం. మేం నలుగురం ఏం చేసినా, ఎక్కడికెళ్ళినా నలుగురం కలిసే వెళ్తాం. మా అమ్మకి నా ఫ్రెండ్స్ - అమ్మాయిలూ, అబ్బాయిలూ అందరూ తెలుసు - నా ఫ్రెండ్స్ అందరూ మా అమ్మ ఫ్రెండ్స్ కూడా!" - అంటూ రాసిన పేపరిచయం గుర్తొచ్చింది.

వెంటనే వాళ్ళిల్లు, ఇంట్లో వాళ్ళు ఎలా వుంటారో చూడాలని చిన్న కుతూహలం - అందులోనూ నన్ను చాలా పకడ్బందీగా తనకి మాటలొచ్చని తెలియనీకుండా అంతసేపు నమ్మించడం కూడా తెగ ఇంప్రెస్ చేసేసిందేమో - ఒక్కసారి మళ్ళీ పలకరిద్దామా అనిపించింది.

పోస్టాఫీస్ లోంచి బయటికి వచ్చి - ప్రశాంతితో కలిసి ఎదురుగుండా వున్న ఇంటికి వెళ్ళి లోపల్నుంచి గడియ వేసి వున్న చెక్కగేటు మీద రెండుసార్లు తట్టాను.

వెంటనే లోపల్నుంచి "ఎవరూ" అంటూ ఒకావిడ గేటు గడియ తీశారు.

"నా పేరు లలితండి" - అబ్బాయి వచ్చి తలుపు తీస్తాడనుకుంటే వాళ్ళమ్మగారు వచ్చి తలుపు తీయడం అసలు ఊహించలేదేమో ఒక్క నిముషం ఏమని చెప్పాలో తెలియక గబగబా నా పేరు చెప్పాను - అదేదో నేనూ, నా పేరూ  universally recognized అన్నట్లు.

"రా రా లోపలి రా - ఈ అమ్మాయి ఎవరూ? మీ చెల్లెలా?" - నేనేదో బాగా తెలిసినట్లు - నా సంగతి ఎరిగినట్లు - నేనొస్తానని ముందే ఊహించినట్లు - రాబోతున్న నవ్వు దాచుకుంటున్నట్లు - స్నేహంగా లోపలికి ఆహ్వానించారు ఆవిడ.

నేను, ప్రశాంతి గేటు దాటి లోపలికి వెళ్ళి ఇంటికి ముందున్న కటకటాల కివతల నించున్నాము.   ఈలోగా ఆవిడ గేటు వేసి గడియ పెట్టి మా వైపు తిరిగేలోగా చుట్టూ చూసిన నాకు కనిపించిందేంటంటే -

చలికాలపు బంగారపుటెండ 
తెలి సింగారపు ముగ్గు 
చల్లిన బియ్యపు గింజలు 
వాలిన పిచుకల భోజనాల సందడి 
గేటు పై నుంచి వాలిన బోగన్‌విలియా పూలు 
వాటి గుబుర్ల మధ్య నుంచి ఎలాగోలా కింద వాలి 
వెన్నముద్దలయిన ఎండ జాడలు 
పక్కనే అరుగు 
అరుగు పక్కనే చిన్న గులాబీల తోట




పిచుకల్ని చూస్తూ నించుండిపోయిన నన్ను చూసి - "అవి మా చుట్టాలు - రోజూ వచ్చి పలకరించి వెళ్తాయి" అని చెప్తూ లోపలికి నడిచారు ఆవిడ.

నేనూ, ప్రశాంతి కూడా ఆవిడ వెనకాలే లోపలికి - ముందరున్న కటకటాలు, ఆ తర్వాత టీవీ వున్న గది దాటి - డైనింగ్ టేబుల్ దగ్గర ఆగి ఆవిడ కూర్చోమన్న కుర్చీల్లో కూర్చున్నాము.

నాకెలా అడగాలో తెలియలేదు - ఆవిణ్ణి చూస్తే ట్రెయిన్లో బోల్తా పడ్డ అమ్మాయిని నేనే అని తెలిసి పోయింది అనిపిస్తోంది. ఇంట్లో ఆవిడ తప్ప ఇంకెవరూ లేనట్లుంది.  నా అంతట నేను - "మీ అబ్బాయి నాకు తెలుసు" - అని  చెప్పడం మించి ఇంకెలా పరిచయం చేసుకోవాలో తెలీలేదు - అలా చెప్పడానికి కూడా మొహమాటం వేసింది.

నా మొహం చూసి - చుట్టూ వెతుకుతున్న నా చూపులు చూసి - నేను పడుతున్న ఇబ్బంది కనిపెట్టి - ఇంకాసేపుంటే ఏడ్చేస్తానేమోనని పసిగట్టి - నన్ను రక్షించడానికన్నట్టు - "బాబు ఇంట్లో లేడు - చెల్లాయితో కలిసి బజారెళ్ళాడు - వచ్చేస్తాడు ఇంకో గంటలో" అన్నారు నవ్వుతూ.

"అహహ - అది కాదండి - అంతసేపుండను - నేను గ్రీటింగ్ కార్డ్స్ పోస్ట్ చేయడానికి వచ్చాను - తీరా చూస్తే పోస్టాఫీస్ లో గమ్ లేదు - అయిపోయినట్లుంది  - మీ ఇల్లు ఇక్కడే అని మీ ఇంట్లో గమ్ ఉంటుందేమోనని అడగడానికి వచ్చాను" - అన్నాను మాటలని నాలుక మీద పరిగెట్టిస్తూ.

ఆవిడ మనసులో "కొయ్ కొయ్ - నీ సంగతి నాకు తెలుసులే" అనుకుంటున్నట్టు నవ్వి "ఉండు - తెస్తాను" అని చిన్న నీలం రంగు బాటిల్ తెచ్చిచ్చారు.

గబగబా నా దగ్గరున్న కవర్లకి అది రాసేసి అంటించేసి ఒక పది నిముషాల్లో ఆవిడకి "థాంక్స్ " చెప్పి బయటికి వచ్చి - పోస్టాఫీస్ ముందున్న పోస్టుబాక్స్ లో కవర్లు వేసేసి ఇంటికెళ్ళిపోయాను. అంతసేపూ ప్రశాంతి ఏమీ మాట్లాడకుండా - అసలే పెద్దకళ్ళు ఇంకా పెద్దవి చేసుకుని నన్నూ, ఆవిణ్ణీ చూస్తూ - మా కబుర్లు వింది.

ఇంటికి వెళ్ళే దారిలో అడిగింది - "ఎవరు లల్లీ వాళ్ళు?" - అంటూ.

"అది నా ఫ్రెండ్ ఇల్లులే" - ఏదో పెద్ద అడ్వెంచర్ చేసిన ఉత్సాహంతో నే చెప్పిన సమాధానం.
.........................................................................................................................................

డిసెంబర్ 31కి వరంగల్ నుంచి బాబొచ్చాడు - శ్రీను ఇంట్లోనే వున్నాడు. ఆడపిల్లలం నలుగురం, బాబు, శ్రీను - మొత్తం ఆరుగురం కలిసి 31 సాయంత్రం శంకర్‌విలాస్‌కి వెళ్ళాం - న్యూఇయర్ ఈవ్ సెలబ్రేషన్ అంటూ.

అక్కడ వాళ్ళందరూ ఎవరిక్కావాల్సినవి వాళ్ళు ఆర్డర్ చేశాక - నేను కూడా ఒక ప్లేట్ సమోసా చెప్పాను. దాంతోపాటే ఒక ఫ్రూట్ సలాడ్.

అందరి ఆర్డర్లూ వచ్చేశాయి కానీ ఎంత సేపటికీ నేనడిగిన సమోసా రాలేదు. అప్పటికీ అటూఇటూ తిరుగుతున్న సర్వర్ ఎవరెవరికో ప్లేట్లు అందిస్తూ ఉంటే నా పక్క నుంచి వెళ్ళిన ప్రతీసారి నాకు తెలియకుండానే - అది నాకేనేమో అన్నట్టు చెయ్యి చాస్తున్న నన్ను చూసి "దీనికి బాగా ఆకలేస్తున్నట్టుంది - ఏమే లల్లెమ్మా! ఇంకాసేపుంటే నువ్వే హోటల్ లోపలికి వెళ్ళి తెచ్చేసుకునేలా వున్నావ్" అంటూ ఆట పట్టిస్తున్న కుట్టి మాటలకి నవ్వుతూ శుభ్రంగా అన్నీ ఖాళీ చేసేస్తున్న వాళ్ళందర్నీ చూస్తే భలే ఉక్రోషంగా అనిపించింది. నిజంగానే ఆకలి కూడా వేసేస్తోంది.

ఒక పది నిముషాల తర్వాత  ఒక స్పూను-ఫోర్కు-సహిత-సమోసా ప్లేటు వచ్చి నిలిచింది నా ముందు. తిన్నగా అది చేత్తో తీసుకుని తినొచ్చు కదా నేను?! - అబ్బే - అలా చేస్తే అంతా సవ్యంగా జరిగిపోదూ? చెప్పుకోవడానికి విశేషాలు ఏముంటాయ్?

ఫోర్కుతో సమోసాని కట్ చేయడానికి ప్రయత్నించాను. మొదటిసారి కొంచెం జారింది. అది చూస్తూనే నా ఎదురు సీట్లో కూర్చున్న బాబు అననే అన్నాడు  - "అది నా ప్లేట్లో పడితే మాత్రం నేను తినేస్తాను" అని.

బాబు కేసి ఒకసారి గీరగా చూసి - అంతకన్నా గీరగా ఫోర్కు పెట్టి సమోసాని గట్టిగా అడ్డంగా కట్ చేయబోయాను.

అంత పెద్ద సమోసా కూడా ఎగిరి బాబు అన్నట్లే తన ప్లేట్లోనే పడింది. తాను కూడా అన్నట్లే తీసుకుని చేత్తో పట్టుకుని శుభ్రంగా తినేశాడు.

ఇంతలో సర్వరు బాగా మాగిపోయిన పళ్ళతో - కరిగిపోయి కారిపోవడానికి సిద్ధంగా వున్నపేస్టుకి  ఫ్రూట్ సలాడ్ అని పేరు పెట్టి తీసుకొచ్చాడు.

అంతే ! నాకు - అసలే ఆకలి మీద వున్నానేమో -కోపమొచ్చేసింది - "నాకొద్దు ఈ పేస్టు -వెనక్కి తీసుకుపో" అనరిచి వెనకనుంచి కుట్టి పిలుస్తున్నా వినకుండా మెట్లు దిగి కిందకి వచ్చి పేవ్‌మెంట్ మీద నించున్నాను - మళ్ళీ ఒక్కదాన్నీ వెళ్ళడానికి ఇష్టం లేదు మరి - నా కోసం వాళ్ళు పరిగెత్తుకుంటూ రావాలి - నేను వాళ్ళని ఏడ్చి సాధించాలి కదా!

వాళ్ళందరూ తినేసి - బిల్లు ఇచ్చేసి గబగబా వచ్చారు - నేనెక్కడకెళ్ళిపోయానో అని.

కింద నించుని వున్న నన్ను చూడగానే ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుని నవ్వుకుంటూ నా పక్కనే వచ్చి నించున్నారు అందరూ వరసగా.

వాళ్ళని చూడగానే - నేను పట్టించుకోనట్టు నడవడం మొదలు పెట్టాను.

వెనకాల ఇంక కథా-కాలక్షేపం మొదలయింది - బాబు మొదలు పెడితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా ఆశువుగా పూరించుకుంటూ ...

అనగనగా ఒకూళ్ళో బాబిగారున్నారట 
ఆ బాబిగారికి ముగ్గురమ్మాయిలట 
ఆ ముగ్గురూ కలిసి ఓ రోజు హోటల్ కెళ్ళారట 
మూడు ప్లేట్లు ఆర్డర్ ఇచ్చారట 
అందులో ఇద్దరి పొట్టలే నిండాయట 
మూడో పొట్ట నిండలేదట 
పొట్టా పొట్టా ఎందుకు నిండలేదూ అంటే 
నా ఫోర్కుకి సమోసా అందకుండా ఎగిరిపోయిందీ అందట 
సమోసా సమోసా ఎక్కడకు ఎగిరావూ అంటే 
ఎదురుగా వున్న బాబు ప్లేటులోకీ అందట 
బాబూ బాబూ నీ ప్లేట్లో పడ్డ సమోసా ఏదీ అంటే 
నా ప్లేట్లో పడితే నే మింగేయనా అన్నాట్ట


- నా ఉక్రోషం మీద, నే పోగొట్టుకున్న సమోసా మీద కథ చెప్పేసుకున్నారు.

వాళ్ళ మాటలు వినబడుతున్నా - నాకూ నవ్వొస్తున్నా పట్టించుకోకుండా చేతులు కట్టుకుని నడుస్తున్న నా వెనకనుంచి - పప్పి, కుట్టి - కోరస్‌గా పాడడంమొదలు పెట్టారు:

ఆ నడక చూడు - హైస్సా 
ఆ నవ్వు చూడు - హైస్సా

(అది మేమెప్పుడూ మా ఇంటి మేడ మీద కూర్చుని ఎవరైనా మాకు తెలిసిన అమ్మాయిలు రోడ్డు మీద బుద్ధిగా తలొంచుకుని వెళ్తుంటే - ఏడిపిస్తూ పాడే పాట.)

ఈలోగా రాయల్ ఐస్‌క్రీంస్ దగ్గర వాళ్ళు ఊహించలేనంత స్పీడుగా లోపలికెళ్ళి ఒక కుర్చీలో కూర్చున్నాను. వెంటనే వాళ్ళూ బిలబిల్లాడుతూ లోపలికి వచ్చేశారు.

ఒక్కసారిగాఅందరం అప్పటివరకూ చేసిన అల్లరికి నవ్వేసుకుని - నాకిష్టమైన ఫ్రూట్ సలాడ్ తినేసి నడుచుకుంటూ ఇంటికెళ్ళి - రాత్రి పన్నెండింటి దాకా దూర్‌దర్శన్‌లో చూపించిన కార్యక్రమాలు అన్నీ చూసేసి - చివర్లో ఆశా భోంస్లే పాడిన "నయా సాల్ హో - ఆప్ సబ్ కో ముబారక్" పాట వింటూ ఆవిణ్ణి ఆనందంగా చూసేస్తూ (అప్పుడు ఎప్పుడో కానీ కనిపించేవారు కాదేమో - రెప్ప వేయకుండా చూసేవాళ్ళం సినిమా వాళ్ళని) - హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పుకుని - మా దొడ్డ కలిపిచ్చిన టీ తాగేసి కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నాం.

(రాత్రి చాలా సేపు కబుర్లు చెప్పుకుని పడుకునే ముందు మా అమ్మనో, దొడ్డనో లేపి టీ అడిగి - వాళ్ళు టీ పెట్టిస్తూనే - దాంతో పాటుగా పెట్టే చీవాట్లు నంచుకుంటూ టీ తాగడం - పసందైన అనుభవం.)

టీలు తెచ్చుకుని తిట్లు నంచుకుని 
వెచ్చగ సిప్పులు చెయ్యాలోయ్ 
ఎల్లరు హాయిగ నవ్వాలోయ్ 
మేమెల్లరు ఎంజాయ్ చేయాలోయ్ ...


<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>







17, జనవరి 2018, బుధవారం

వెబ్ వాకిట అందరాని కొమ్మ







 
ఏదో నాలుగు రకాల గాలివాటు కబుర్లాడే నేను - ఓనాడు - ఆ కబుర్లే - అనగనగా ... అంటూ - కథలా చెబ్దామని మొదలెట్టి - మొదలూ-తుదీ లేని కబురులాగే సాగించాను.

"నీలాంటి వాడే ఒకడు వెనకటికి - చిన్నప్పుడు కాకరకాయ - పెద్దయ్యాక కీకారకాయ - అన్నాడట" - అనేది మా అమ్మ చిన్నప్పుడు నేను మాట విననప్పుడో - విన్నమాటని నాక్కావాల్సినట్టు తిప్పి అన్నప్పుడో.


మరిన్నాళ్ళకి - నా బ్లాగ్ ముంగిట - అచ్చూ, హల్లూ పోగుచేసుకుని - రెమ్మరెమ్మన చిగురేసి, ఆకేసి - కొమ్మ కొమ్మన మొగ్గేసి, పూతపూసి - అంటుకట్టిన కబురుకొమ్మ - ఇంతై అంతై - డ్రాఫ్టులో ఇమడనంతై - వాకిలి సంపాదకులకు ఒప్పై - వెబ్ వాకిట అందరాని కొమ్మ అయిన నా కథ చదివిందంటే - కబుర్లప్పుడు కాకరకాయ - కథయ్యాక కీకారకాయ అంటుందేమో!

మొత్తానికి నా కథ బ్లాగు గడప దాటింది - అందరాని కొమ్మై వాకిలి మొగసాల నిలిచింది. 

కాకరో, కీకరో, ఆకాకరో - తినగ తినగ తీపి కాకపోయినా - చేదైతే కచ్చితంగా కాదు :)

వాకిలిలో నా కథ "అందరాని కొమ్మ" ఈ లింక్ మీద క్లిక్ చేస్తే అందుతుంది:)


13, జనవరి 2018, శనివారం

గతించిన సంక్రాంతిని స్వాగతిస్తూ...

గుళ్ళో ధనుస్సు పూజలు
నెలపట్టు ముగ్గులు
ఇంటిముందు వేసిన ముగ్గులు - పద్మాలో, శివుడి మూడు కళ్ళో - ఆ ముగ్గుల్లో కుదురుకున్న గొబ్బెమ్మలు.

ఆ గొబ్బెమ్మలు చేయడానికి కావల్సిన ఆవుపేడ - అనాతవరంలోనో, శివకోడులోనో అయితే ఇంటిపాలేరో, పొలంలో పాలేరో తెచ్చిపెట్టేవాళ్ళు.

అదే అప్పటికి నాన్న ఉద్యోగరీత్యా వున్న వూళ్ళో ఆవుపేడ కావాలంటే ఆ ఊరి పెద్దరైతుల పశువులకొట్టాల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిందే -  

తెల్లా ఆవమ్మా - గొబ్బి పేడియ్యవే 
నల్లా ఆవమ్మా - నువ్వూ వేయవే
ముందుకి వస్తే - కొమ్ములు విసరకే 
వెనకాల్నుంచి - తోకతో కొట్టకే -అనుకుంటూ.

ఒక్కోసారి ఆవుపేడ కోసం మిట్టమధ్యాహ్నం వెళ్ళాల్సి వచ్చేది.

అప్పుడైతే ఆవులు కొట్టాల్లో కాకుండా - ఏ ఆరుబయటో గడ్డి మేస్తూ ఉంటాయి - తాజా పేడ దొరుకుతుంది.

ఇలాంటి లాజిక్కులతో నేను, పప్పి, కుట్టి - ఒక ప్లాస్టిక్ బేసిన్ పట్టుకుని - మధ్యాహ్నం భోంచేసి అమ్మ ఏ పుస్తకమో చదువుకుంటూనో, లేకపోతే లక్ష్మి దొడ్డతో కలిసి పండక్కి పిండివంటలు చేయడానికి పిళ్ళూ అవీ కొట్టించే హడావిడిలో ఉండగానో - ఎర్రటి ఎండలో - ప్రపంచంలోకెల్లా అన్యోన్యమైన అక్కచెల్లెళ్ళకి నమూనాల్లా - మా గొబ్బి-పేడ-సేకరణకి బయలుదేరేవాళ్ళం.

అప్పటికి మేమున్న ఊరుని బట్టి ఏ రాధాయో (గణపవరం), హోటల్ వారి అమ్మాయి పద్మో (జంగారెడ్డిగూడెం), ఏడుకొండలో (టంగుటూరు) - మాతో పాటు - మేమందరం కలిసి ఊరేగింపు.

ఆ ఆవులేమో ఊరి చివర - వాగు పక్క సరివితోటల దగ్గరో, చింతచెట్ల కిందో గడ్డి మేస్తూ ఉండేవి.

వాటి దగ్గరికి వెళ్ళే దారి పొడుగునా - వెళ్ళేటప్పుడు మా ధ్యాసంతా పేడ మీదే ఉండేదేమో - మా కబుర్లన్నీ - అది కింద పడిన ఎంత సేపటి వరకు ఫ్రెష్షుగా ఉంటుంది? ఎక్కువ మట్టి అంటుకోకుండా పేడ ఎలా తియ్యాలి? - ఆవుల దగ్గర కాసేవాళ్ళతో ఎలా మాట్లాడితే ఎక్కువ పేడ ఇస్తారూ? - మేం ముగ్గురం అక్కచెల్లెళ్ళం అని చెప్పకుండా - విడివిడిగా తెచ్చుకుంటే బోల్డు పేడ తెచ్చుకుని పే...... ద్ద గొబ్బెమ్మలు ఎలా చేసుకోవచ్చో? - ఇల్లాంటి strategic planning - మీదే ఉండేవి.

తీరా అక్కడికి వెళ్ళాక - మా నక్షత్రాలు బావున్న రోజు - ఆ ఆవులు కాసేవాళ్ళ కడుపులు నిండి, అరమూత కళ్ళవాళ్ళై - ఏ చెట్టు కిందో కాలు మీద కాలేసుకుని పడుకుని - కాసేపు మా కాలక్షేపపు కబుర్లు విని - ఆ కబుర్లకి అక్షర-ముద్దలుగా ఆవుపేడని అనుగ్రహించేవారు.

ఇంక ఇంటికి తిరిగి వచ్చే దారిలో - ఎలా వచ్చేవో తెలీదు - చందమామ, బొమ్మరిల్లు కథలేవో చెప్పుకుంటూ వెళ్తుంటే - మాలో ఎవరో ఒకరు కచ్చితంగా - ఆ కథల్లోని తెల్లతోక దయ్యాల కబుర్లు మొదలుపెట్టేవారు. ఇంకంతే  - సినిమాల్లో రాత్రి పూట తెల్ల చీర కట్టుకుని వచ్చే దెయ్యాల దగ్గర్నుంచి మిట్టమధ్యాహ్నపు కొరివిదయ్యాల దాకా - దెయ్యాలు, వాటిల్లో రకాలు, కాళ్ళ కేసి చూసి వాటిని గుర్తు పట్టటం ఎలా (వాటికాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయి మరి!)  -  లాంటి విషయాలన్నీ తెగ ధైర్యంగా మాట్లాడుకుంటూ వచ్చేవాళ్ళం. పగలే కదా అన్న ధైర్యం.

ఆ మాటలకి ఎవరికి వాళ్ళకి మనసులో ఏదో భయముంన్నా బయటపడేవాళ్ళం కాదు.

ఒకసారలాగే - ఎండలో వస్తూ ఉంటే దూరంగా ఒక ముసలావిడ ఎండకి చీర ముసుగేసుకుని వస్తూ కనిపించింది.
అంతే - మాలో మేము అనేసుకున్నాం - ఆవిడ దగ్గరికి రాగానే పాదాలు ఎటు తిరిగున్నాయో తప్పకుండా చూడాలని. తీరా ఆవిడ మాకు ఒక అడుగు దూరంలో వుండగా - ఆ రోజు - దెబ్బకి ఠా-దెయ్యం కబుర్లటా - అన్నట్లు కబుర్లన్నీ ఆపేసి - అప్పటికే నేర్చుకుని వున్న మంత్రం లంబాడి దెయ్యం - నాకేం భయ్యం పాడుకుంటూ - పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేశాం. అలా పరిగెట్టిన మమ్మల్ని చూసి విషయం అర్థం కాక ఆ ముసలావిడ హడిలిపోయింది - అది వేరే సంగతి.

ఎంత పరిగెత్తినా పేడ మాత్రం పదిలం పదిలం :))

సరి - గొబ్బెమ్మ తయారు.

మరి అలంకారం మాటేంటి? రోజూ పెట్టే గొబ్బెమ్మకి బంతిపూలు బానే ఉంటాయి.

కానీ ఏదో ఒక రోజు మనింట్లో గొబ్బెమ్మలు పెట్టామని అందర్నీ పిలుస్తాం కదా!
గొబ్బెమ్మ చుట్టూ తిరుగుతూ గొబ్బి పాటలు పాడి - ఆ ఆ తర్వాత అమ్మ చేసిచ్చిన పాఠోళీ ప్రసాదం పెడతాం కదా!
మరప్పుడు కూడా బంతిపూలే అంటే గొబ్బెమ్మ చిన్నబుచ్చుకుంటుంది కదా!
మధ్యలో పిల్లను మోసే తల్లిగొబ్బెమ్మకి, చుట్టూ పెట్టే నాలుగు గొబ్బెమ్మలకి కలిపి కనీసం ఐదు గుమ్మడిపూలు కావాలి కదా!
మరెవక్కడుంటాయి?
ఎత్తుగోడల కవతల పశువుల కొట్టాలుండి - వాటిమీదకి పాకించిన గుమ్మడిపాదులున్న మోతుబరి రైతులిళ్ళలో ఉంటాయి.

ఎలాగోలా ఆ రైతుల పెరళ్ళలో చేరి గుమ్మడిపూలు కోసుకొచ్చేవాళ్ళం.

పొరపాటున ఆ ఇంటివారో, వారి పాలేరో చూసి పూలు కోసినందుకు ఎందుకు కసిరేవారో అప్పుడు అర్థమయ్యేది కాదు. తర్వాతెప్పుడో ఇంకొంచెం హెడ్డు పైకొచ్చాక ఆ పూలే కాయలవుతాయని అర్ధమయ్యే టైంకి గొబ్బెమ్మలు పెట్టడం మానేశాం :)

ఇంక గొబ్బెమ్మలు పెట్టే రోజు - అప్పటికి రెండో, మూడో ఫిల్టులు వేసి కుట్టించి ఆరేళ్ళయ్యి -  ఒక్కో ఫిల్టు విప్పుకుని ఇప్పటికి సరిపోయిన, ఇంకా కొత్తవాటిల్లా ఫెళఫెళలాడుతున్న నెమలికంఠపు రంగుకి గులాబీ రంగు అంచున్న పట్టు పరికిణి, నెమలికంఠం రంగు జాకెట్టు వేసుకుని, లక్ష్మిదొడ్డ వేసిన ఈతపాయల-రెండు-జడలకీ జడగంటలు వేసుకుని -  గొబ్బీయళ్ళో... గొబ్బీయళ్ళో... దుక్కూ దుక్కూ దున్నారంట - ఏమీ దుక్కూ దున్నారంట - రాజావారి తోటలో జామ దుక్కూ దున్నారంట - అంటూ మొదలు పెట్టి

అటవీ స్థలముల కరుగుదమా అన్న పాటలో చల్లని గంధం తీయుదమా - సఖియా మెళ్ళో పూయుదమా - అని ఒకరి మెళ్ళో ఒకరు పూస్తున్నట్లు నటిస్తూ ఆ గిలిగింతకి నవ్వుకుంటూ

సుబ్బీ గొబ్బీమ్మా  సుబ్బణ్ణీయవే అనడుగుతూ మొగలీ పువ్వంటి మొగుణ్ణీయవే అని సిగ్గులొలకబోస్తూ (అప్పటికి మొగుడంటే అస్సలేం తెలీకపోయినా...) - మా గొబ్బెమ్మ పెట్టడం అయ్యేది.

వారానికి ఒకరింట్లో - అందరం కలిసి - మళ్ళీ - అదే డ్రెస్సు - అదే ఆట - అదే పాట. ఏం వేసుకున్నామా అన్నది ఎప్పుడూ పట్టింపు లేదు - ఇస్త్రీ మడత వుండి, కలరాఉండల వాసనొస్తే - అవి కొత్త బట్టలే :)

ఈలోగా సంక్రాతిసెలవులొచ్చేవి.

ఎప్పుడైనా సంక్రాంతికి శివకోడులో ఉండడం కుదిరితే - మా భోగిదండలు మేమే చేసుకునేవాళ్ళం - మా చెల్లాయత్త ఆధ్వర్యంలో. గొబ్బెమ్మలు పెట్టడం - గొబ్బెమ్మలని రెండో రోజు వాటికి కేటాయించిన గోడకి కొట్డడం - సరిగ్గా చూసి మధ్యలో చిల్లు పెట్డడం- అవి ఎండేదాకా ఆగడం - ఎండిపోయాక గొబ్బిపిడక విరక్కుండా ఒలవడం - పురికొసకి గుచ్చి దండలు కట్టడం - ఇదీ వరస.  

అదే అనాతవరపు సంక్రాంతి అయితే - అద్దెకున్న ఇంటివారికి మా అమ్మ-నాన్న "ఇంటికి వెళ్ళొస్తామండీ " అని చెప్పి - అందరం కలిసి బస్సెక్కి - మేం ముగ్గురం ఒక సీట్లో - వంతులు వేసుకుని - కిటికీ పక్కన కూర్చుని పాటలు పాడుకుంటూ - ఆగిన ప్రతి బస్టాండులో - ఈ బొమ్మ-మాట ఎక్కడుందో కనుక్కో చూద్దాం - అంటూ బస్టాండు గోడలమీద వున్నవన్నీ చదువుకుంటూ - సాయంత్రానికి అనాతవరం చేరేవాళ్ళం - భోగి ముందు రోజుకి.

అప్పటికే ఇంట్లో భోగిదండలు తయారుగా ఉండేవి.

తెల్లవారుఝామున నాలుగు గంటలకు నలుగుస్నానాలు - ఒకరి తర్వాత ఒకరు తయారయి, కొత్తబట్టలు వేసుకుని - భోగిదండలు పట్టుకుని భంగిమలు పెట్టుకుని - శ్రీనన్న ఫోటోలు తీస్తూ ఉంటే - పోటీలు పడి భోగిమంటల్లో దండలేసి - అక్కడే కాసేపు చలికాగి ఇంట్లోకి వచ్చేవాళ్ళం.

ఆ రోజు సాయంత్రం ఇంట్లో చిన్నపిల్లలని కుర్చీలో కూర్చోబెట్టి పోసిన భోగిపళ్లు - పేరంటం.
ఆ కుర్చీ దగ్గరగా కూర్చుని ఏరుకున్న రేగుపళ్ళు, అక్కడక్కడా దొరికిన ఐదు-పది పైసల బిళ్ళలు.

భోగి తర్వాత - పెద్ద పండగ - దండాల పండగ.
ఇంట్లో పెద్దలకి దండం పెడితే దీవెనలతో పాటు డబ్బులిచ్చే పండగ.
నాన్నమ్మ తప్పకుండా మున్సబుగారింట్లో వున్న ఇండియన్ ఓవర్సేస్ బ్యాంకునుంచి కొత్త రూపాయి బిళ్ళలు తెప్పించి మా అందరికీ పదేసి ఇచ్చేవాళ్ళు.
రవన్నకాళ్ళకి దండం పెడితే - జేబులో చెయ్యి పెట్టి చేతికి ఎంతొస్తే అంత ఇచ్చేవాడు. ముందుగా దండమెట్టిన వారికి దండిగా దొరికేది. 
అప్ప, నాన్న, సోమేశ్వర్రావు తాతగారు (విస్సుబాబాయి వాళ్ళ నాన్నగారు) - వీళ్ళందరి దగ్గరా దండాలు పెట్టి డబ్బులు తీసుకున్న తర్వాత - పప్పి, కుట్టి, స్వాతి - రెడీగా వుండేవాళ్ళు - నువ్వు మాకన్నా పెద్దదానివి - నీ కాళ్ళకి మేం దండం పెడతాం అంటూ :)

దండాలపండగ అయ్యాక కనుమ రోజుకి శివకోడు ప్రయాణం - పుంతలో ముసలమ్మ తీర్థానికి.
అక్కడ కొనుక్కున్న రంగు కళ్ళజోళ్ళు, చేత్తో తిప్పితే గుయ్-గుయ్ మంటూ తిరిగే  గిలక్కాయలు.
చెల్లాయత్త చేసిన గారెలు, ఆవళ్ళు.
ఒంటెద్దు బండిలో రాజోలు విహారాలు - పండగ సరదా అయినవారితో అలా తీరేది.

ఇన్నేళ్ళ తర్వాత - సంక్రాంతి వస్తోంది అంటే -
ఇన్ని వేలమైళ్ళ దూరంలో కూర్చుని
ఒకప్పటి ఉన్న ఊరుని తలుచుకుని
వీలైతే ఇంటి ముందో ముగ్గు వేసుకుని
వీల్లేని చలైతే కంటి ముందు గత-జ్ఞాపకాల-రంగవల్లులల్లుకుని 
సంక్రాంతికి ఏమేం కావాలి ... అనుకుంటే - అని తలుచుకుంటే
తట్టినవి - పూలో, పళ్ళో, పాలో, ఇండియన్ స్టోర్లో దొరికే మామిడాకులో, వాట్సాపుల్లో forward-మెసేజులో కాదు - 
నెమరేసుకున్న చిన్నప్పటి సరదా-ఆటల జ్ఞాపకాలు - మళ్ళీ పాడుకున్న గొబ్బిపాటలు.


ఆ జ్ఞాపకాలకు ఊతగా - గతించిన సంక్రాంతిని స్వాగతిస్తూ ... 
మా చిన్నపాప్పిన్ని, జ్యోతి పిన్ని, చెల్లాయత్త ఆడి-పాడిన గొబ్బిపాట -
దానికి మా నాన్న వేసిన దరువు -
మా అమ్మ గొంతు-కలుపు -
చివర్లో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ చిన్నపాప్పిన్ని 
శుభోజ్జయం అంటూ మా తంబి మామయ్య పలుకు ...





5, జనవరి 2018, శుక్రవారం

అవతారంగారి నారాయణగారి బాబి - 8 - అరటికాయ బజ్జీ న-ఖాదనం - కుయ్‌కుయ్ వయొలిన్ నహినహి-వాదనం


గతనెల కబుర్లు : అవతారంగారి నారాయణగారి బాబి - 7 - బీటీలో గట్టెక్కిన ఎస్సెసెల్సీ 

ఒకే వరసలో కబుర్లు చెప్పేయకుండా - కొంచెం ముందుకీ వెనక్కీ వెళ్తూ అప్పుడోటీ అప్పుడోటీ జరిగినవి చెప్తాను - మా అమ్మ( మీ నాన్నమ్మ) కాశీమజిలీకథలు చెప్తూ మధ్యలో పిట్టకథలు చెప్పేది కదా - అలాగన్నమాట! 

(ఈ ఉపోద్ఘాతానికి కారణమేంటంటే కొన్ని చెణుకులు మర్చిపోయానూ - అవిప్పుడు చెప్తానూ అని అర్థం.)

అరటికాయ బజ్జీ న-ఖాదనం:

చిన్నప్పుడు మా వీధిలో అనిపిండి సన్యాసిరావు మాష్టారని ఒకాయనుండేవారు.

మనిల్లు - పక్కనే చిన్నరాజుగారి ఖాళీ స్థలం - దాని పక్కిల్లు అనిపిండి వారిది.

సన్యాసిరావు మాష్టారని - ఎలిమెంటరీ స్కూల్ ఆయన. కొంచెం అమాయకత్వంతో కూడిన టీచర్ ఆయన. చాలా మంచాయన పాపం!

చిన్నరాజుగారి పేరు నరసింహరాజుగారు. సత్తికొండకి, సూరికి  తాతగారు ఆయన.

ఆయన ఇంటి ఎదుగుండా స్థలంలో అరటితోట వేసుకున్నారాయన. ఆ తోటకి ముందు పక్క దడి కట్టేసి ఉండేది.

ఒకసారి ఆ తోట మంచి కాపొచ్చింది - బోల్డు గెలలూ అవీ వేసి - మంచి అరటికాయలు బాగా వచ్చాయి.

ఓ రోజు సాయంత్రం - సత్తికొండ, సూరి, నేను వీధిలో అరుగు మీద కూర్చున్నాము.  సన్యాసిరావు మాష్టారు కూడా వచ్చి మా పక్కనే కూర్చున్నారు.

రాజుగారి తోటలో అరటికాయలు చూస్తూనే నాకు అరటికాయ బజ్జీలు తినాలనిపించింది.
 
అనిపించిందే తడవు - నేను సత్తికొండతో - " ఒరే! అరటికాయ బజ్జీలు తినాలని వుంది. మన చిన్నరాజుగారి తోటలో అరటికాయలు బావున్నాయి. అరటికాయలు లోపలున్నాయి - మరి అవి కోసి తెచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే నూనె అదీ నేను పట్టుకొస్తాను. బజ్జీలు వేసుకు తింటే బావుంటుంది కదా" - అన్నాను.

అది వింటూనే సన్యాసిరావు మాష్టారు కూడా - "అవున్రా! - బావుంటుంది - అరటికాయ బజ్జీలు తిందాం - సరదాగా వేడి వేడిగా" - అన్నారు.

"సరదాగా తిందాం అంటే ఎవరన్నా వెళ్ళి వాటిని కోసుకు రావాలి కదా - మేమెళ్ళ లేము - మీరెళ్ళండి - అరటి కాయలు  తీసుకురావడం ఒంతు మీది - నూనె, సెనగపిండి తీసుకురావడం ఒంతు మాది"  అన్నాన్నేను.

సన్యాసిరావు మాష్టారి ఇంటి దగ్గర ఒక చిన్న సిమ్మెంటు కుర్చీలా కట్టారొకటి.

ఆ కుర్చీ దాటితే తోటలోకి వెళ్ళిపోవచ్చు. దూకెళ్ళాలి.

నేనలా అరటికాయలు మీరు తెండి అన్నానో లేదో ఆయన - "సరే! నేనెళ్ళి పట్టుకొస్తాను ఆగరా" అనే చెప్పి - ఆ సిమ్మెంటుకుర్చీ దూకి అరటితోటలో దిగారు.

అది సాయంత్రం మునిమాపువేళ. ఆరూ ఆరున్నర అవుతోంది - చిరుచీకటి పడుతోంది.

అప్పుడే చిన్నరాజుగారు బయటికొచ్చి పడక్కుర్చీ వేసుక్కూర్చున్నారు.


సన్యాసిరావు మాష్టారిని తోటలోకి వెళ్ళనిచ్చి - ఆయనో నాలుగు కాయలు కోసింతర్వాత - "ఏమండోయ్! చిన్నరాజుగారు! మీ తోటలో ఎవరో దొంగ దిగి అరటికాయలు కోసుకు పోతున్నాడు - దొంగ! దొంగ!"- అని అరిచాను.

ఆయన వెంటనే లేచి  - "ఎవడాడు?! తోట్లో ఎవుడ్రా వాడు - అర్టికాయలు కోసేవాడు?" - అంటూ కర్రట్టుకుని ఒచ్చారు.

ఈ లోపులో సన్యాసిరావు మాష్టారు - చిన్నరాజుగారి కేకలకు భయపడి - ఆ తోటలోంచి కుర్చీ మీదుగా ఇంటిలోపలికి దూకేసి - "అమ్మ వెధవల్లారా! నన్నాటాడించేసి తోటలో దింపి నన్ను దొంగంటారా? నన్ను పట్టుకుంటే కొట్టేసేవాడిప్పుడాయన" - అని గోలగోల చేశారు.

ఆ రోజలా ...
అరటికాయ బజ్జీ ఖాదనం
మేమెప్పుడూ కాదనం అనుకున్నాం
కానీ అయింది మాత్రం
అరటికాయ బజ్జీ న-ఖాదనం!

కుయ్‌కుయ్ వయొలిన్ నహినహి-వాదనం

శ్రావణమాసంలో శ్రావణీకులు వచ్చేవారు మనింటికి - ఉర్లాం బ్రాహ్మలు అనేవాళ్ళం వాళ్ళని - ఒక శ్రావణ-భాద్రపద మాసాల్లోనే వస్తారు.

వాళ్ళు కృష్ణా జిల్లా - తెనాలి అటువైపు నుంచి వచ్చేవారు. మనవేపు నుంచీ వచ్చేవారు కానీ - ఎక్కువగా అటువైపు నుంచి వచ్చేవారు.

వాళ్ళొచ్చినప్పుడు ఏం చేస్తారంటే - మన ఇంట్లో వండిన వంట వాళ్ళు తినరు.

వాళ్ళకి స్వయంపాకం ఇచ్చేసి ఓ పొయ్యా అదీ చూపెడితే - మనింట్లోనే ఒండేసుకుని ఆ రాత్రి అక్కడ పడుకుని మరసటి రోజు పొద్దున్నే లేచి వెళ్ళిపోతారు.

ఒక రోజు సాయంత్రం మనింటికి దాదాపు ఓ పది మందొచ్చారు.  ఏవో పన్నాలు అవీ చెప్పారు. మా నాన్నగారు వాళ్ళకి ఏదో సంభావన ఇచ్చారు.

ఆ తర్వాత వాళ్ళు - "అమ్మా! మేం రాత్రికి ఇక్కడే భోంచేస్తాం" అన్నారు మా అమ్మతో.

మన ఇంటి వెనకాల సందులో ఓ రెండు పొయ్యిలుండేవి.

మామూలు పొయ్యొకటి, పెడా పొయ్యొకటి - మట్టితో చేసినవి ఉండేవి.

అక్కడో రుబ్బుగుంటుండేది.

వాళ్ళక్కావాల్సిన సరుకులు అన్నీ ఇచ్చి మా అమ్మగారు - "సరే! మీరు ఒండుకు తిని అరుగుమీద పడుకోండి" - అని చెప్తే వాళ్ళు వంట ఒండుకున్నారు - తిన్నారు.

మన నట్టింట్లోనే - ఈ పదిమంది ఆకులు గట్రా వేసుకుని కూర్చుని ప్రశాంతంగా భోజనాలు అవీ కానిచ్చారు.

భోజనాలు అయిపోగానే వచ్చి అరుగుమీద వేసుంచిన ౘాపల మీద అంగోస్త్రాలు పరుచుకుని పడుకున్నారు.

ఈలోపు నేనేం చేశానంటే - మా వదినగారు వయొలిన్ వాయించేవారు - ఆ వయొలినేమో వీధిగదిలో అలమారులో పెట్టేవారు.

నేను సరదాగా ఆ వయొలిన్ -  తీసి తీగలు బిగించి - దాన్ని కుయ్-కుయ్ అని అటూ ఇటూ ఆడిస్తున్నాను.

ఆడిస్తుంటే - ఈ బ్రాహ్మల్లో ఒకాయన - "ఏం నాయనా! నువ్వు వయొలిన్ కూడా వాయిస్తావా?" - అనడిగాడు నన్ను.

"అబ్బే  - నేం దీని మీద చాలా సాధన చేస్తున్నానండి. ఏ పాట కావాలంటే అది వాయిస్తాను - సంగీతం కూడా నేర్చేసుకుంటున్నాను నేను" - అని చెప్పాను.

"ఐతే నాయనా! ఒక్కసారి ఒచ్చి - ఏదీ - రెండుమూడు కీర్తన్లు వాయించు" - అన్నారు.

"అయ్యో - అంతకన్నానా - తప్పకుండానండి" - అని నేననగానే - భుక్తాయాసంతో ౘాపల మీద వాలిన వాళ్ళందరూ లేచి కూర్చున్నారు.

నేను కూడా వెళ్ళి వాళ్ళ మధ్యలో - శుభ్రంగా మఠం వేసుకుని కూర్చుని - ఈ వయొలిన్ దగ్గర పెట్టుకుని - ముందేమో శృతి చేస్తున్నట్టుగా కుయ్-కుయ్ -కుయ్ మనిపించి - అటుతిప్పి ఇటుతిప్పి పదినిముషాలు ఆటాడాను అల్లాగా - ఇల్లాగా తిప్పుతూ. .

పదినిముషాలయ్యాక - "ఏం నాయనా ఎంతసేపు శృతేనా? వాయించేదేమన్నా ఉందా?" - అన్నాడొకాయన.

"అబ్బెబ్బే - ఇదిగో వాయిస్తున్నాను - ఆగండి" - అంజెప్పేసి ఆ వయొలిన్ కమాను పట్టుకుని ఆపకుండా "కుయ్-కుయ్-కుయ్" అని వాయించేస్తున్నాను.

వెంటనే వాళ్ళు - నా వాయులీన-వాదనా-బాధ భరించలేక - చెవులు మూసేసుకుని  - "బాబూ! వద్దులేమ్మా! నీ సంగీతం వద్దు, వయొలిన్నూ వద్దు. నువ్వది లోపల పెట్టేయమ్మా - మాకూ నిద్రొస్తోంది - పడుకుంటున్నాము" - అని  బ్రతిమలాడి నాచేత వాదన ఆపించి అలసి-సొలసి పడుకుండిపోయారు.

అద్దీ - అత్యుత్సాహం కొద్దీ ...
నువ్వెంత వాయించినా వద్దనం అన్నవారి చేతే
వద్దు-బాబోయ్! నీకు వందనం అనిపించిన
నే వినిపించిన కుయ్‌కుయ్ వాయులీన-వాదనం!

<వచ్చేనెల తరువాయి కథ>