ఆకాశవాణి (AIR) కబుర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆకాశవాణి (AIR) కబుర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, జులై 2022, ఆదివారం

ౘదలచూలి పాట - 3 - చల్లగా... సాకగా... ఇటు వస్తివే!



    చిన్నప్పట్నుంచి ఎన్ని కథలు విన్నానో, ఇంకెన్ని కథలు చదివానో లెక్కలేదు. 

    కథలదేముంది - వాటి పాటికి అవి "అనగనగా..." అంటూ మొదలైపోతాయి. 

    సాగినంతసేపు సాగి - తిరగ్గలిగినన్ని మలుపులు తిరిగి - చివరికి - "కథ కంచికి - మనమింటికి" అంటూ ముగిసిపోతాయి. 

    నేను కుదురుగా కూర్చుని విన్న కథలన్నీ మాత్రం - మా నాన్నమ్మ చెప్పగా విన్నవి మాత్రమే.

     చిన్నప్పుటి వేసవి సెలవుల్లో - పగటి వేళలన్నీ  - ఆటవిడుపులు. 
    
    సందెవేళకి - అరుగు మా కథల-విడిది. 

    పిల్లలందరం అరుగు మీదకి చేరేవాళ్ళం.

    పగటి ఎండకి వెచ్చబడి ఉండేది అనాతవరం ఇంటి అరుగు. 

    ఆ అరుగుకున్న పైమెట్టు మీదున్న స్తంభం దగ్గర నాన్నమ్మ కూర్చునేవారు. ఒక కథ లోంచి ఇంకో కథ లోకి వెళ్తూ  బోల్డన్ని కథలు చెప్పేవారు. 

ఆ వేసవి సెలవులన్నాళ్ళు ... 
సాయంకాలాలు... 
మా కథల వేళలు... 

*** *** *** *** ***
*** *** *** *** ***

    నిజం చెప్పాలంటే - నేనడిగే ప్రశ్నలకి చెప్పదగిన సమాధానాలు మాత్రం చెప్పి - చెప్పదగని చోట "చండికవి నువ్వు" అన్న ఒక్క వాక్యంతో "ఇప్పుడు నీకు దీని అర్థం అవసరం లేదు" అని చెప్పకనే చెప్తూ - నన్ను ఒప్పించగలిగిన కథలు చెప్పినవారు మా నాన్నమ్మ మాత్రమే. 

    అలా విన్న కథల్లో అన్నీ ఒకేలా ఉండవు కదా! 

    ఒక్కో కథ విన్నాక - "హమ్మయ్య! అంతా బాగానే జరిగింది" అనిపిస్తుంది. నిద్రలో కూడా ఆ కథే కలగా కనాలనిపిస్తుంది. 

    ఇంకో రకం కథ విన్న దగ్గర్నుంచీ భలే సతాయిస్తుంది. "ఇది సరి కాదు కదా! ఇలా జరిగుండకూడదు కదా!" - అని పదేపదే అనిపిస్తుంటుంది. 

*** *** *** *** ***
*** *** *** *** ***

    అలా అనిపించిన ఒకానొక కథ - గజేంద్ర మోక్షం. పోతన భాగవతంలో అష్టమస్కంధంలోని పద్యాలతో సహా చెప్తున్నప్పుడెప్పుడూ - ఈ కథా, నాన్నమ్మ పాడే పద్యాలూ ఎంతో నచ్చేవి. 

    ఒకటా - రెండా? బోల్డన్ని పద్యాలు... పూర్తిగా పద్య-పాఠాలు అన్నీ గుర్తులేకపోయినా కనీసం గజేంద్రమోక్షంలో ఈ పద్యాలు ఉన్నాయీ అని గుర్తున్నవి:

    "ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై"  ----- "కలఁ డందురు దీనుల యెడ"  ----- "కలుగఁడే నా పాలి కలిమి సందేహింప గలిమిలేములు లేక గలుగువాఁడు?"  ----- "లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె"  ----- "అల వైకుంఠపురంబులో నగరిలో"  ----- "సిరికిం జెప్పఁడు"  ----- "అడిగెద నని కడువడిఁ"

    చివర్లో శాపవిమోచనమై గంధర్వుడైన మొసలి అసలు పేరు "హూహూ" అని వినగానే ఎందుకో నవ్వొచ్చేసేది. "హూహూ" "హూహూ" అని పదేపదే అనుకుంటూ నవ్వుకునేదాన్ని. 

    ఈ పద్యాలూ, శాపవిమోచనాలూ ఇవన్నీ పక్కన పెడితే అసలా కథ వింటున్నంతసేపూ తలలో ఏవో పెంకి ఆలోచనలు నడుస్తూ ఉండేవి. 

    "నాన్నమ్మా! దెబ్బలాటలో ఏనుక్కెన్ని దెబ్బలు తగిలాయో మొసలికీ అన్నే తగిలాయి కదా? పైగా ఏనుగొచ్చి ఆ మడుగులో అంత సేపు కాకుండా కొంచెం సేపే స్నానం చేసి వెళ్ళిపోయి ఉంటే మొసలికి అంత కోపం వచ్చుండేది కాదేమో కదా? నాకు మొసలిని విష్ణువు అలా శిక్షించడం నాకు నచ్చలేదు. విష్ణువు దేవుడైతే ఏనుగునీ, మొసలినీ సమంగా చూడాల్సిందే" అని వాదించేదాన్ని. 

    దాంతో విష్ణువు అలా ఎందుకు చేశాడో నాకు సర్ది చెప్పడానికి ఇంకో కథ చెప్పేవారు నాన్నమ్మ. అలా ఒక కథ లోంచి ఇంకో కథ లోకి బోల్డన్ని కథలు చెప్పేవారు. 

    చిన్నప్పుడు విన్న ఆ గజేంద్రమోక్షం కథా, ఆ కథ విని మా నాన్నమ్మతో చేసిన వాదనా ఇన్నాళ్ళకి గుర్తుకు రావడానికి కారణాలు బోలెడు.  

    ఆ కారణాల వెనకాల కబుర్లు చెప్తా... వినుడు! 


*** *** *** *** ***
*** *** *** *** ***


    నాకు ఏ భాషలో అయినా rhyming words ఉన్న కవితలు చదవడం చాలా ఇష్టం. 

    అలాంటి ప్రాస కుదిరే మాటలు పేర్చుకుంటూ చిన్నచిన్న కవితలు రాసుకోవడం ఇంకా ఇష్టం. 

    అందులోనూ వీలైనన్ని లఘువులతో free verse లు రాయడం ఇంకాఇంకా  ఇష్టం. 

    నాకు నచ్చిన గజేంద్రమోక్షం కథలో వున్న కరి-మకరి మాటలు తీసుకుని అదే కథని నా మాటల్లో ఓ కవితగా రాసుకున్నా. ఇది కూడా ఇప్పుడు కాదు - అప్పుడెప్పుడో కరుణ లేని కొరోనా మొదలైన రోజుల్లో. 



*** *** *** *** ***
*** *** *** *** ***


    అన్నట్టు ఇంకొక్క విషయం. 

    అప్పుడెప్పుడో రాసిన ఆ  కైత ఇప్పుడిలా బయల్పడడానికి కారణం ఇటీవల దొరికిన ఓ బొమ్మ. 

    ప్రవీణ్‌మోహన్ అనే అతను పురాతన దేవాలయాల గురించి యూట్యూబులో పెట్టే వీడియోలు బద్రి చూస్తూ ఉంటారు. 

    నేనూ అప్పుడప్పుడూ చూస్తుంటాను. 

    ఈ మధ్య చూసిన ఒక వీడియోలో ప్రవీణ్‌మోహన్ చూపించిన ఈ గజేంద్రమోక్షం పోస్టర్ నాకు బోల్డు నచ్చింది. 

    నా చిన్నప్పటి ఆకతాయి ప్రశ్నకి జవాబిచ్చింది. 

    మొసలి కరుస్తుందేమోనని బెదిరి నారాయణుడి ఎడమ భుజమ్మీద చేరి మొహం దాచుకున్న ఓ బొద్దు -ఏనుగు. 

    ఏనుగుని భయపెట్టినందుకు తనని కోప్పడతాడేమోనని - అదిరి - "నన్నేమీ అనకు, ఇంకెప్పుడూ ఇలా చేయను"- అని అంటున్నట్టు బిక్కమొహమేసుకుని హరి దరికి చేరిన మొసలి. 

    ఆ రెండిటినీ రెండు చేతులతో దగ్గరికి తీసుకుని అలిగి కొట్టుకుని - తగవు తీర్చమని చెంత చేరిన అన్నదమ్ములని సముదాయిస్తున్నట్టున్న అమ్మలాంటి మొహమున్న విష్ణువు. 

    ఇంతటి అందమైన చిత్రమును - కనుగొనిన నా కనుగవదే ...కలిమి మరి!

    వీళ్ళందరూ వున్న - నాకు నచ్చిన - ఆ పోస్టర్ కూడా ఈ కింద వుంది. చూడుడు! 

    దానికన్నా ముందు నా కైతని చదువుడు! 


*** *** *** *** ***
*** *** *** *** ***

"హరి హరి" యనుచు మునకకని 
కరి మడుగున కరిగె

"అరి యీ కరి" యనుకొని 
 మడుగున మఱుగుగ ఒదిగె మకరి 

మడుగున మునిగిన కరిని కమ్మె మకరి 
కరవగ కమ్మిన మకరికి జిక్కె  కరి

కమ్మిన మకరికి - జిక్కిన కరి - హరిని వేడె  
కమ్మిన మకరికి జిక్కిన కరి వేడిన హరి - సిరిని వీడె
కమ్మిన మకరికి జిక్కిన కరి వేడిన హరి వీడిన సిరి - తొడరె 

సిరి తొడరిన హరి 
వడివడి మడుగున కరిగె 

మడుగున 
కరిపై పరివెడలిన మకరిని 
గదిమె హరి 

 అడగున
మకరికి అడలిన కరిని
గైకొనె హరి

మకరిని గదిమి కరిని గైకొనిన హరి 
నెనరున - కరి నొక కరమున - అలముకొనె  
కనికరమున - మకరినింకొక కరమున - అందుకొనె  

ఇరుకరముల
కరిమకరులను 
అనగిపెనగిన 
కరివరదుని 
కనుగొనిన కనుగవదె కలిమి మరి! 

అనువుగ  
శరణొసగి
అరసిన  
సిరిపెనిమిటిని 
కనుగొనిన కనుగవదె కలిమి మరి! 

*** *** *** *** ***
*** *** *** *** ***









*** *** *** *** ***
*** *** *** *** ***


  
    మీకింకో విషయం కూడా చెప్పాలండోయ్! 

    ఈ మధ్య విన్న ఒక All India Radio (AIR) - ఆకాశవాణి భక్తిరంజని - భక్తిగీతం ఒకటుంది. 

    అది దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రిగారు రాసినదట. 

    దానిని పాడిన వారు - శ్రీమతి శేషుబాయి గారట. 

    "కావేరి రంగ రంగ!" అంటూ మొదలయే ఆ పాట వినగానే నాకు మొట్టమొదటగా తట్టినది గజేంద్రమోక్షమే. 

    మొదటి చరణం - మడుగులో అడుగిడి, మకరితో పోరాడి - అలసి - అభయమడుగుతున్న కరి దీనాలాపనలా వుంది కదూ! 

సగము పోయిన ప్రాణము -
నా స్వామి! 
తగని దారుణ భారము...
అడుగిడగనే నేరము
నా తండ్రి! 
అభయ మిడి కాపాడుము


    కానీ - ఇది విన్నాక - ఈ చరణం లోని పదాలు - జీవితంలో ఏదో చేద్దామనుకుని - ఏదీ కలిసి రాక - ముందుకి సాగలేక - అలాగని వెనక్కి మరలలేక - "అన్యథా శరణం నాస్తి - త్వమేవ శరణం మమ" అనుకుని ఉనికికి అందకపోయినా, ఉన్నాడనుకునే వాడి మీద భారం వేసిన వారి మాటల్లా అనిపించాయి నాకు. 


    ఇంక రెండో చరణం: ఆదుకోరమ్మని అడుగుతున్న గజేంద్రుని - చేరి, కాపాడిన వైకుంఠవాసుని మెచ్చుకుంటున్నట్టు  వుంది. 

వైకుంఠ నగరి విడిచీ...
లోకాల నెల్ల కడచీ...
నా కంటి నీరు తుడిచీ...
చల్లగా... సాకగా... ఇటు వస్తివే!


    ఇహ మిగిలింది మూడో చరణం. 

    దయకి, దేవుడవడానికి దామోదరుడు తనకు తానే సాటి అంటూనే తనను మించిన దీనత ఇంకెవరికీ వుండబోవదు అనేది కూడా సాటిలేనితనంగా చెప్పుకోవడం కవి చమత్కారం. 

    లెక్క ప్రకారం ఈ మూడో చరణం రెండోదిగా వుంటే ఈ పాట ఇంకాఇంకా బావుండేది. 

    ముందేమో - "నను పాలింపగ నడచీ వచ్చితివా! " అని పాడేసి, తర్వాతేమో "ఎంత పిలిచినా ఎంత వేడినా ఈనాటికి దయ రాదేలా?" అని పాడితే ఎలా? 

    అసలే పిలవగానే ముందూవెనకా చూసుకోకుండా పరిగెట్టుకొచ్చేసే సిరి తోడు లేని వెన్నుడాయె! 

    తికమకపడి తిరిగి తిన్నగా వైకుంఠానికెళ్లిపోడూ?! 



ఏలాటి కరుణ నీది?
నా యన్న! 
నీలాటి దైవమేది?
నా బోటి దీన యేది?
నా తండ్రి !
యీ పాటికైన రావే!

*** *** *** *** ***
*** *** *** *** ***


    ఏదేమైనా కానీ - కొంచెం ముందువెనకలుగా అనిపించినా - తేలికైన మాటలతో - ఎంతో గొప్పగా రాసిన పాట. అంతే గొప్పగా కుదిర్చిన సంగీతం. ఇంకెంతో భక్తిగా పాడిన స్వరం. 

    యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=QgVlyld0xDI







కావేరి రంగ రంగ!
నాయన్న! 
కస్తూరి రంగ రంగ!
దేవేరి యైన నీతో... 
మా మనవి తెలిపి రక్షింప లేదా?!

సగము పోయిన ప్రాణము -
నా స్వామి! 
తగని దారుణ భారము...
అడుగిడగనే నేరము
నా తండ్రి! 
అభయ మిడి కాపాడుము

వైకుంఠ నగరి విడిచీ...
లోకాల నెల్ల కడచీ...
నా కంటి నీరు తుడిచీ...
చల్లగా... సాకగా... ఇటు వస్తివే!


ఏలాటి కరుణ నీది?
నా యన్న! 
నీలాటి దైవమేది?
నా బోటి దీన యేది?
నా తండ్రి !
యీ పాటికైన రావే!

కావేరి రంగ రంగ!
నాయన్న! 
కస్తూరి రంగ రంగ!
దేవేరి యైన నీతో... 
మా మనవి తెలిపి రక్షింప లేదా?!

మా మనవి తెలిపి రక్షింప లేదా?!
మా మనవి తెలిపి రక్షింప లేదా?!

*** *** *** *** ***
*** *** *** *** ***

నే రాసుకున్నట్టు .... 


ఇరుకరముల
కరిమకరులను 
అనగిపెనగిన 
కరివరదుని 
కనుగొనిన కనుగవదె కలిమి మరి! 

మీరేమంటారో మరి?!

~ పాటల భైరవి 

10, ఏప్రిల్ 2022, ఆదివారం

ౘదలచూలి పాట - 2 - పటికబెల్లపు పలుకుల రాముడి పాట, శ్రీరామనవమి పానకాల గురుతులతోనట...



పండగంటే ఏంటంటే... 
మదిని చిలుకు తలపొకటి  
పెదవి నొలుకు నవ్వొకటి 
కనుల వెలుగు దివ్వొకటి 

పండగంటే ఏంటంటే... 
తుంచగల వగపొకటి 
పెంచుకున్న ఒరిమొకటి
పంచుకున్న బువ్వొకటి 

పండగంటే ఏంటంటే... 
పనిలేని పూటొకటి 
పాతరోజుల గుర్తొకటి 
పటికబెల్లపు పలుకుల పాటొకటి 

*******
*******



    
    చిన్నప్పట్నుంచి ఏ పండగకాపండగే పండగ-పండగ్గా జరిగి ప్రతి పండగ గురుతూ - గుర్తొచ్చిన ప్రతీసారీ దేనికదే పండగ్గా అనిపించినా - శ్రీరామనవమి మాత్రం ఒక ప్రత్యేకమైన గుర్తుగా గుర్తుంది. 

    అలా గుర్తుండడానికి కారణం మాత్రం - గణపవరంలో ఉన్న రోజుల్లో చూసిన శ్రీరామనవమి ఉత్సవాలు. 

*******
*******

    మేము అద్దెకున్న కరణం గారు - అంటే అనుమంచి లక్ష్మీనారాయణగారి ఇల్లు ఉన్న వీధిలో ఈ చివర రామాలయం, ఆ చివర సంతానవేణుగోపాలస్వామి ఆలయం ఉండేవి. అదే గణపవరానికి మెయిన్ రోడ్డు. ఈ రెండుగుళ్ళూ ఉన్న రోడ్డులో సరిగ్గా మధ్యలో శ్రీనివాసరావు కాఫీ హోటలు, ఆ పక్కనే చిలకలూరిపేట వెళ్దామనుకునేవారి కోసం గూడురిక్షాలు ఉండే రిక్షా స్టాండు ఉండేది.

    శ్రీరామనవమి వచ్చే పదిరోజుల ముందు - అంటే ఉగాది ముందు నుంచే రోడ్డు మీద దుమ్ము లేవకుండా నీళ్ళు జల్లి, రోడ్డుకి అటూఇటూ రాటలు పాతి, తాటాకు పందిళ్ళు వేసేవారు. ఒక పందిరి అటు వేణుగోపాలస్వామి గుడి నుంచి మొదలుపెట్టి రిక్షాస్టాండుకి అవతల ఆగేది. ఇంకో పందిరి రామాలయం దగ్గర మొదలై రిక్షాస్టాండుకి ఇవతల ఆగేది.

    ఇక ఆ పందిళ్ల ముస్తాబు ఎలా ఉండేదంటే ...రకరకాల రంగు కాయితాలతో తోరణాలు, అక్కడక్కడా చిన్నవీ పెద్దవీ రంగుకాయితాల గుమ్మటాలూ, మెరిసే ప్లాస్టిక్ పూల తోరణాలూ, రాత్రి కాగానే మిలమిలలాడే మిణుకుమిణుకు బల్బుల రంగురంగుల ఎలెక్ట్రిక్ దీపతోరణాలూ - మబ్బుల్లో ఉండే దేవేంద్ర లోకమేదో కిందకి దిగి గణపవరం ఊళ్లో వెలిసినట్లు ఉండేది.

    ఇప్పటికీ ఎక్కడైనా ఒకటికి రెండు దీపాలు ఎక్కువగా వెలిగించే ఇల్లో, షాపో చూసినప్పుడల్లా - శ్రీరామనవమి పందిరిలా ఉంది - అనిపిస్తుంది. 

    ఆ రంగు కాయితాలు, రంగురంగుల దీపాలకి తోడు - రోజంతా మోగిపోయే పాటల హడావిడి. ప్రతి శ్రీరామనవమికి పొద్దున్నే భక్తిపాటలతో మొదలుపెట్టి మధ్యాహ్నం కాగానే ఏ అడవిరాముడి లోవో, యమగోల లోవో, జేబుదొంగ లోవో - బోల్డన్ని సినిమా పాటలు వేస్తూనే ఉండేవారు. 

    చెవులు హోరెత్తిపోతున్నా సరే - ఆ పాటలు వింటూ హడావిడిగా పరిగెడుతూ ఆడుకోవడం మరపురాని పండగ.



*******
*******

    నాకేమో రెండుజళ్ళకి జడగంటలు వేసుకోవడం ఇష్టం. 

    మిగిలిన రోజుల్లో కుదిరేది కాదు కానీ ఉగాది నుంచి శ్రీరామనవమి దాకా ఆ పది రోజులూ - రెండు జడలకి జడగంటలు వేసి - రెండు జడల్లోనూ మల్లెపూలు పెట్టేది అమ్మ. నా రెండు జడలూ వెనకాల అలా బరువుగా బరువుగా ఊగుతుంటే - ఆడుకుంటూ పరిగెత్తేటప్పుడు తలని అటూఇటూ తిప్పుతూ - ఆ జడగంటల చప్పుడు వినడం కూడా - అదొక పండగ నాకు. 

*******
*******

    అలా జడగంటలేసుకున్న నేనూ; 
    నాతోపాటు హైమవతమ్మ గారి శ్రీదేవి, రమణ, కృష్ణ; 
    సువర్చల గారి రాధాయి;
    తులశమ్మ గారి రాధిక; 
    బడి పక్కింట్లో ఉండే రాజ్యలక్ష్మిగారి అబ్బాయి చివుకుల వెంకట రమణ;
    శివాలయం కెళ్ళే దార్లో ఉండే రాజేశ్వరమ్మగారి మనవరాలు చైనం రమ; 
    కంసాలి వారబ్బాయి  శ్రీను; 
    ధనమ్మగారి అమ్మాయి; 
    పాతబాపారావు కూతురు పద్మ...

    మేమందరమూ బడి అయిపోతూనే ఇంటికి వచ్చి అన్నం తినేసి పరిగే...ట్టుకుంటూ వెళ్లిపోయి పందిట్లో నాలుగుస్తంభాలాట, ఎంచగ్గా కాళ్ళు కాలకుండా నేలా-బండా ఆడుకునేవాళ్లం - అలా ఆ ఆటా ఓ పండగే! 

   అప్పుడప్పుడే ఎండలు ఎఱ్ఱగా మారుతుండేవేమో ఆ పందిళ్ళు చలవఱాతి ఇళ్ళలా అనిపించేవి. దానికి తోడు ఒంటిపూటబళ్ళ హుషారు. ఒక పూట మాత్రమే బడి ఉండి మధ్యాహ్నమంతా ఆడుకోగలగడం - అద్దీ...  అసలు పండగ! 

*******
*******

        ఈ ఆటల సరదాయే కాకుండా సపోటాపళ్ల విందొకటి ఉండేదండోయ్! ఇంటింటికీ వచ్చి అమ్మే సపోటా పళ్లవాళ్లు రోడ్డు మీద కనిపించగానే 'మా ఇంటికి రా... మా అమ్మ సపోటాపళ్లు కొంటుందీ అని పళ్లమ్మే అబ్బాయిని సాదరంగా ఇంటిదాకా తీసుకెళ్లి దగ్గరుండి మరీ అమ్మ చేత సపోటాలు కొనిపించడం - అవి ఒలుచుకుని తినడం - అదో తిండి పండగ. 

    అప్పటిదాకా ఏ పేరంటాల్లోనో వచ్చినవో, పండగ రోజుల్లో కొన్నవో తమలపాకులు గులాబీ రంగు సెంటెడ్ సున్నం తోనూ, త్రివేణి సుగంధ వక్కపలుకు తోనూ - అమ్మ, నాన్న, అన్నపూర్ణమ్మగారూ, కరణంగారూ -  ఇలా ప్రతీ ఇంట్లోనూ అమ్మలూ, నాన్నలూ మాత్రం తింటూ - వాళ్ల ఎఱ్ఱబారిన నాలుకలు చూస్తున్న పిల్లలం మమ్మల్ని 'చదువుకునే పిల్లలు తాంబూలం వేసుకోకూడదూ అని అస్సలు ఆ తమలపాకుల జోలికే రానిచ్చేవాళ్లు కాదు. 

    కానీ - ఈ శ్రీరామనవమి రోజుల్లో మాత్రం - అప్పటివరకు ఎక్కడుండేవాడో, అప్పుడు మాత్రం ఎక్కణ్ణించి వచ్చేవాడో - తెలీదు కానీ - ౘందమామలోని మంత్రదండపు సృష్టిలా కిళ్ళీలబ్బాయి ఒకడు శ్రీరామనవమి పందిట్లో ఓ రాట దగ్గర అవతరించి మా కిళ్ళీ-ప్రశ్నలని అవధరించేవాడు. 'అర్థరూపాయి తెచ్చుకో - కిళ్ళీ తినే అదృష్టం కొనుక్కో" అనేవాడు.

    చకచకా ఓ మూడాకుల్ని తొడిమలు తుంచి - మంచిమంచి వాసనలొచ్చే లేహ్యాలు పూసి, చూర్ణాలు రాల్చి, వక్కపలుకులు చేర్చి - అమృతం పొట్లం కట్టాడేమో అనిపించేలాంటి మిఠాయికిళ్ళీలు చుట్టి ఒక అల్యూమినియం కంచంలో గుండ్రంగా పేర్చేవాడు. 

    ఆకుపచ్చగా మెరిసిపోయే ఆ మిఠాయికిళ్ళీలని చూడగానే ఇక ఆగలేక అమ్మ దగ్గరికి వెళ్ళి 'ఈ ఒక్కసారికే..." అని బ్రతిమాలి కొనుక్కు తిన్న అబ్బురపు మిఠాయికిళ్ళీ ఒక పే...ద్ద తీపి-పండగ


*******
*******
 
    ఇహ అసలు - ఆ తొమ్మిది రోజులూ రోజుకో రకమైన పండగ. 

    చెక్కభజనలూ, కోలాటాలు, నాజర్‌వారి బుఱ్ఱకథలూ, హరికథలూ, శివకుమారి బృందంవారి రికార్డింగ్ డాన్సులూ, తెరలు కట్టి సినిమాలూ, చింతామణి నాటకం, గుంటూరు నుంచి వచ్చే అనిల్ కుమార్ గారి సత్యసాయి భజనలూ - చూసే కళ్లకి పండగ. వినే చెవులకి పండగ. 

    అన్నట్టు... నాకు పల్నాటియుద్ధం, బొబ్బిలియుద్ధం కథలూ, బ్రహ్మయ్యగారి చరిత్రలో సిద్ధడి పరిచయం, బనగానపల్లి, కందిమల్లయపల్లి లాంటి ఊరుపేర్లు - ఇవన్నీ తెలిసింది నాజర్‌గారి బుఱ్ఱకథల వల్లే.  

*******
*******


    చిన్నప్పటి పండగ కబుర్లు అయ్యాయి. 

    ఇప్పుడు రాముడితో నా పరిచయం గురించి. 

    పుట్టిన తర్వాత మొట్టమొదటగా గుర్తు పట్టటం నేర్చుకున్న "అమ్మ" అన్న మాట, శబ్దం చేయటం మొదలుపెట్టాక అనడం మొదలుపెట్టిన 'అత్త" అన్న మాట తర్వాత - నాకు గుర్తుండి నేను విన్న మొదటి జేజి పేరు "రాముడు".  

    నాన్న జో కొడుతూ - 

    "రాం రాం రాం రాం రాం రాం...
    రాం రాం రాం రాం రాం రాం... 
    సీతారాం రాం రాం ...
    జానకి రాం రాం రాం" అంటూ పాడిన జోలపాటలోనూ రాముడే!

    నాన్నమ్మ పక్కలో పడుకుని విన్న 

    "రామా లాలీ... 
    మేఘశ్యామా లాలీ....
    తామరస నయనా ...
    దశరథతనయా లాలీ" అన్న లాలిపాటలో  పరిచయమైన మొదటి దేవుడూ రాముడే!

    ఎదుగుతూ వుండగా - శివకోడు సెలవులకి వెళ్ళినప్పుడు - మా ప్రసాద్ మామయ్య మీద అలిగినప్పుడు - ఆయనకి నాన్నమ్మ, నాకు తాతమ్మ అయిన - శివకోడు మామ్మ పప్పు సూరమ్మగారు పాడిన - 

    "లలాటలిఖితం ఇటుండగా 
    శ్రీరామ! నిన్నన పనేలరా?! - అన్న పాటలోనూ రాముడే! 

    ఆ తర్వాత - పాట అంటూ ఇదీ అని తెలిసిన వయసులో - 

    "చీకటి వేళల నడిపించేది
    ఒంటరి ఘడియల వినిపించేది
    ఏది ఏది నీ చేయూత? ఏది ఏది నీ పిలుపు?
    రామా ఓ రామ రావా కనరావా?" - అన్న దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి గారి కవితలోనూ రాముడే!

    "ఎరిగిన వారికి ఎదలో ఉన్నాడు
    ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు
    తలచిన వారికి తారకనాముడు
    పిలిచిన పలికే చెలికాడు సైదోడు" - అన్న వేటూరి సుందరామమూర్తుల వారి గీతి లోనూ రాముడే! 
 

    ఆ తర్వాత పదోతరగతి వేసవి సెలవుల్లో  - ఆరుద్ర రాసిన - "రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా" విని అమాంతం ఆ పాట ప్రేమలో పడిపోయి - ఉన్నపళంగా నేర్చేసుకుని -  వైజాగ్‌లో లలితత్తయ్య ఇంట్లో మేడ మీద పాడుకుంటున్నవేళ - సముద్రపుగాలికి - అలనల్లన తేలొచ్చిన- కాఱుమొయిలు అంచున మెరుపై తోచినదీ రాముడే! 

    ఇలా - ఇంకా ఇంకా - చెప్పాలంటే రాముణ్ణి పదాల్లో ఎంతో అందంగా పట్టిన పాటలెన్నో నాకిష్టం. ఆ రామకబుర్లు ఇంకెప్పుడో కుదిరినప్పుడు. 

    ఇప్పటికి మాత్రం - అసలు శ్రీరామనవమి అన్న పండగ నాకెందుకు అంత ఇష్టమో చెప్పేస్తా... కడుపు చలవకి వడపప్పు నానబోసుకుని, గొంతు సొలుపుకి మిరియాలు, యాలకులు వేసిన బెల్లప్పానకం చేసేసుకుని - శ్రీరామార్పణం - అనుకోగలిగే మహా సులువైన పండగ శ్రీరామనవమి.  
  
*******
*******


    అసలు - ముందే చెప్పానుగా ... నా మటుకు నాకు - పండగంటే... పనిలేని పూటా - పాతరోజుల గురుతూ -  పటికబెల్లపు పలుకుల పాటా అని. 

    ఈ రోజు ఆదివారం - పని అంటే ఆఫీస్ లేని పూట. 

    పాతరోజుల గురుతులన్నీ పైన చెప్పేసుకున్నా. 

    ఇహ కావలసిందల్లా - పటికబెల్లపు పలుకుల పాటొహటి!  

దాన్ని కూడా పట్టుకున్నా - 
పట్టుకున్న పాటని 
పదే పదే - పదం పదం - కలిపి పలికి
అదే అదే - పదం పదం - పలికి కలిపి
పదే పదే అనుకున్నా
అదే అదే పాడుకున్నా
నే పాడుకున్న పాటని
అందరికీ పంచుదామనుకుని 
ఇక్కడ రాసి పెట్టుకున్నా 
పానకంలా పంచిపెట్టుకున్నా 

*******
*******

    ఈ పాట పాత ఆకాశవాణి పాటల గురించి వెతుకుతుంటే - వెలలేని పెన్నిధిలా దొరికింది. 

    మనోరంజకంగా పాటకి సంగీతం కూర్చినవారు, పాట పాడిన వారిలో ఒకరు - చిత్తరంజన్ గారట. పాడినవారిలో ఇంకొకరు వందనగారట. ఇద్దరూ కూడా వందనీయులు. 

    యూట్యూబ్‌లో ఉన్న అన్ని వీడియోల కన్నా నాకు ఈ వీడియో నచ్చడానికి ఒక కారణం ఆ నీలినీలి కాంతి వలయాలు చూసి - చిన్నప్పటి శ్రీరామనవమి గుర్తుకు రావడం. 

    ఇక పాటలో వాద్యసంగీతం ఎంత బావుందీ అంటే పాటతో పాటుగా 

టింగ్ టింగ్ టింగ్ టింగ్ - టింగ్‌టింగ్‌టింగ్‌టింగ్‌టింగ్
టింగ్ టింగ్ టింగ్ టింగ్ - టింగ్‌టింగ్‌టింగ్‌టింగ్‌టింగ్ 
అని పాడుకునేంతగా... 

*******
*******

    ఇక చివరాఖరిగా - మృదుమధురమైన పదాలతో, మనసుకి హాయి నిచ్చే సంగీతంతో ఉత్తేజంగా సాగిన ఈ పాటలో పాటలో నాకు నచ్చిన మాటలు....

    దానవవంశవిరామా... - కటువుగా ఉండే రాక్షసాంతక అనే మాటకి మృదువైన రూపం ఈ పదం. 
    భండనపండిత... రామా! - ఈ భండనపండిత అనే పిలుపు కొత్తగా ఉంది - అంటే యుద్ధశాస్త్రంలో పండితుడనేమో! 
    భూమిజసుహృదయసీమా! - సీతామనోవిహారిని ఇలా పిలవడం ఎంత బావుందో! 
    ధైవలలామా... - దైవశ్రేష్ఠుడట రాముడు! 
    తరణికులేశ్వర - అంటే సూర్యవంశజుడట! 
    కరివరపాలక... రామా! - గజేంద్రరక్షక విష్ణువూ రాముడేనట!

ఆ పాటకి యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=6PjoSVyoUhc






జై జై శ్రీరామా... పావనరఘురామా!
జై జై శ్రీరామా... పావనరఘురామా
పతితజనావన - పాపవిమోచన - హే సీతారామా! 
పతితజనావన - పాపవిమోచన - హే సీతారామా! 


దశరథనందన... రామా!  ఘనశ్యామా - మునికామా - దానవవంశవిరామా... 
దశరథనందన... రామా!  ఘనశ్యామా - మునికామా - దానవవంశవిరామా... 

వారిజలోచన వైకుంఠధామా - పాపభంజన పట్టాభిరామా 
వారిజలోచన వైకుంఠధామా - పాపభంజన పట్టాభిరామా 
భండనపండిత... రామా! ఘనశ్యామా - మునికామా - దానవవంశవిరామా... 
దశరథనందన... రామా!  ఘనశ్యామా - మునికామా - దానవవంశవిరామా... 

మేరుధీరఘనమేఘశ్యామా - ఘోరధైత్యసంహారక రామా 
మేరుధీరఘనమేఘశ్యామా - ఘోరధైత్యసంహారక రామా 
కారుణ్యాకర... రామా! ఘనశ్యామా - మునికామా - దానవవంశవిరామా... 
దశరథనందన... రామా!  ఘనశ్యామా - మునికామా - దానవవంశవిరామా... 

కామితశ్రితజన కౌసల్యరామా - కాంచనచేల కారుణ్యధామా 
కామితశ్రితజన కౌసల్యరామా - కాంచనచేల కారుణ్యధామా 
భూమిజసుహృదయసీమా! ఘనశ్యామా - మునికామా - దానవవంశవిరామా... 
దశరథనందన... రామా!  ఘనశ్యామా - మునికామా - దానవవంశవిరామా... 

నరసదాసనుతఅరిజనభీమా - తరణికులేశ్వర ధైవలలామా
నరసదాసనుతఅరిజనభీమా - తరణికులేశ్వర ధైవలలామా
కరివరపాలక... రామా! ఘనశ్యామా - మునికామా - దానవవంశవిరామా... 
దశరథనందన... రామా!  ఘనశ్యామా - మునికామా - దానవవంశవిరామా... 

దశరథనందన... రామా!  ఘనశ్యామా - మునికామా - దానవవంశవిరామా... 
దశరథనందన... రామా!  ఘనశ్యామా - మునికామా - దానవవంశవిరామా... 

జై శ్రీరామా! జై జై శ్రీరామా!!
జై శ్రీరామా! జై జై శ్రీరామా!!
జై శ్రీరామా! జై జై శ్రీరామా!!
జై శ్రీరామా! జై జై శ్రీరామా!!

*******
*******

15, జనవరి 2022, శనివారం

ౘదలచూలి పాట - 1 - రామచరణం...రామచరణం...రామచరణం...మాకు శరణం (కృష్ణశాస్త్రిగారి రామగానామృతం)

ఓనాటి పాట...
మెలమెల్లగ వీచెనదె
మువ్వ మొరసినటుల మెరసెనదె
మెలపైన మోత అదె
మైమఱపు తీర్చి మేలుకౌలిపెనదె

ఆనాటి పాట... 
అల్లనల్లన తేలివచ్చెనదె 
అలలు తాకినటుల సోకెనదె
అలుపెఱుగని అలికిడి అదె
అలుపారగ నిద్రబుచ్చెనదె

నానాటి పాట...
చలచల్లగ చెవుల మీటెనదె
చవులూరునటుల ఉసురు తాకెనదె
చెలిమి చేయ చేరవచ్చెనదె
ౘదలచూలి పాట అదె

*******
*******


*******
*******

    అనుకోకుండా  ఈ మధ్యనే  కొన్ని వెలలేని ఆకాశవాణి (AIR - All India Radio) పాటలు విన్నాను. 

    అందులో కొన్ని చిన్నప్పుడు విన్నవి. కొన్ని నా చిన్నప్పటికన్నా ముందువి. కొన్నేమో భక్తిరంజని కార్యక్రమంలో వినిపించిన ఆర్తిపూరిత భక్తిగీతాలు. ఇంకొన్నేమో సలలితరాగాల లలితగీతాలు. 

    వాటినెవరో పుణ్యాత్ములు సేకరించి అందరికీ అందుబాటులో యూట్యూబులో పెట్టారు. 

    పాటేమో తెగ అల్లరిది. కాలెక్కడా నిలవనిది. 

    గాలంటూ పుట్టాక వీచక ఎలా ఉండలేదో - పాట కూడా స్వరం కట్టి పదం పట్టాక  - చెవుల సోకాక - పెదవుల మీద కదం తొక్కకుండా ఉండలేదు. 

    అదిగో అలా .. ఒకప్పటి ఆకాశవాణి పాట ఒదిగుండక నన్ను చేరింది. 

    ఒదిగుండలేని ఆ పాటని ఒడిసి పట్టుకున్నా!

    ఒడిసిపట్టుకున్న పాట చుట్టూ గాలికబుర్లల్లుకున్నా!

    అల్లుకున్న గాలికబుర్లకి "ౘదలచూలి పాట" అని పేరెట్టుకున్నా. 

    
*******
*******

    మొట్టమొదటగా దొరికిన ఆకాశవాణి భక్తిగీతం ఎలాటిదనుకున్నారూ? దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన రామగానామృతం. 

    ఆ పాటకి యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=h2QbPI0P2Kc

    నేను విన్న ప్రతీ పాటలో నాకు నచ్చే మాటలు కొన్ని పట్టుకుని అట్టేపెట్టుకుంటా. 

    అదెందుకంటే విన్నపాటని మళ్లీమళ్లీ వినడానికి - నన్ను నేను పాట కేసి మళ్లించుకోవడానికి - నాకు నేనే ఇచ్చుకునే  మళ్లు-లంచమది. 

    ఈ దేవులపల్లివారి సాహిత్యంలో నాకు నచ్చినవేంటో చెబుతాను. 

 1.    "రాగయై ఈ బ్రతుకు చెడి రాయైన వేళల" అంటూ చెప్పీ చెప్పనట్టున్న అహల్యవేదన.    

 2.   "సేతువై భవజలధితారణహేతువైతే" అన్న వాక్యం వినగానే చిన్నప్పుడెప్పుడో విన్న ఓ పాట "సంసార జలధి దాటించగలది - రెండక్షరముల నామమే... జై! శ్రీరామా చంద్రుని నామమే" అన్నది గుర్తుకు రావడం. 

    (సంసార జలధి పాటకి యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=B-IxhABKpEA)
    
3. పాట పాడిన వారెవరో కానీ ఆ గొంతుల్లో "ఏది ఏమైనా కానీ రామచరణమే మాకు శరణం" అంటూ వినిపించిన నమ్మకం. 

    ఒక విశేషం ఏంటంటే దేవులపల్లి వారు రాసిన పాటలో ఉన్న ఒక చరణం - ఆకాశవాణివారు పాడిన పాటలో లేదు. అది ఈ కింద రాసి పెట్టుకున్నాను: 

ఎదురు చూచే పేదకై - తానెదురు వచ్చే - రామచరణం 
ముదిసి వాడిన - బ్రతుకు కాన్కల - మురిసి మెచ్చే - రామచరణం 
ఆదరించే - రామచరణం 
సేదదీర్చే - రామచరణం 
మాకు చాలును - రామచరణం నుండి రాలిన - మధుకణం 






రామచరణం - రామచరణం - రామచరణం - మాకు శరణం
మాకు చాలును మౌనిమస్తకభూషణం - శ్రీరామచరణం
మాకు చాలును మౌనిమస్తకభూషణం - శ్రీరామచరణం

రామచరణం - రామచరణం - రామచరణం - మాకు శరణం
రామచరణం... 


రాగయై - ఈ బ్రతుకు చెడి - రాయైన వేళల - రామచరణం
మూగయై - పెంధూళి పడి - మ్రోడైన వేళల - రామచరణం
రాగయై - ఈ బ్రతుకు చెడి - రాయైన వేళల - రామచరణం
మూగయై - పెంధూళి పడి - మ్రోడైన వేళల - రామచరణం

ప్రాణ మీయగ - రామచరణం
పటిమ నీయగ - రామచరణం

మాకు చాలును - జరయు మరణం రాకపోతే - రామచరణం
మాకు చాలును - జరయు మరణం రాకపోతే - రామచరణం

రామచరణం - రామచరణం - రామచరణం - మాకు శరణం
రామచరణం... 

కోతియై - ఈ మనసు నిలకడ కోలుపోతే - రామచరణం
సేతువై - భవజలధితారణహేతువైతే - రామచరణం
కోతియై - ఈ మనసు నిలకడ కోలుపోతే - రామచరణం
సేతువై - భవజలధితారణహేతువైతే - రామచరణం

ఏడుగడ - శ్రీరామచరణం 
తోడుపడ - శ్రీరామచరణం

మాకు చాలును ముక్తిసౌధ-కారణం - శ్రీరామచరణం
మాకు చాలును ముక్తిసౌధ-కారణం - శ్రీరామచరణం

రామచరణం - రామచరణం - రామచరణం - మాకు శరణం
రామచరణం... 

నావలో - తానుండి - మము - నట్టేట నడిపే - రామచరణం
త్రోవలో - కారడవిలో - తొత్తోడ నడిపే - రామచరణం
నావలో - తానుండి - మము - నట్టేట నడిపే - రామచరణం
త్రోవలో - కారడవిలో - తొత్తోడ నడిపే - రామచరణం

నావ యయితే - రామచరణం
త్రోవ యయితే - రామచరణం

మాకు చాలును వికుంఠమందిరతోరణం - శ్రీరామచరణం
మాకు చాలును వికుంఠమందిరతోరణం - శ్రీరామచరణం

రామచరణం - రామచరణం - రామచరణం - మాకు శరణం
రామచరణం... 

దారువునకును - రాజ్యధూర్వహ దర్పమిచ్చే - రామచరణం
భీరువునకును - అరిని దీర్చే - వీరమిచ్చే - రామచరణం
దారువునకును - రాజ్యధూర్వహ దర్పమిచ్చే - రామచరణం
భీరువునకును - అరిని దీర్చే - వీరమిచ్చే - రామచరణం

ప్రభుతనిచ్చే - రామచరణం
అభయమిచ్చే - రామ చరణం

మాకు చాలు మహేంద్రవైభవ-కారణం - శ్రీరామచరణం
మాకు చాలు మహేంద్రవైభవ-కారణం - శ్రీరామచరణం

రామచరణం - రామచరణం - రామచరణం - మాకు శరణం
రామచరణం... 

*******
*******

ఇంతకీ నేను చెప్పొచ్చేదేంటంటే... 

తానంటూ ఒకసారి పుట్టిన తర్వాత -
ఉన్న చోట ఉండదు పాట. 
ఊరికే ఉండదు పాట. 
మోగకుండా ఉండదు పాట. 
మదిని తాకకుండా ఉండదు పాట. 
అది పాట స్వర-స్వభావం. 

*******
*******

ఎప్పుడూ విన్న పాట వినకుండా ఉండాలనుకుంటూ - 
ఒక్కోసారి విన్నదే వింటూ ఉందామనుకుంటూ 
ఎప్పటిదో గుర్తొచ్చిన పాత పాటని వెతుక్కుంటూ 
అప్పటివరకు వినని కొత్త పాటనేదో కనుక్కుంటూ 
విన్నదే వింటూ - విసుగు లేక 
అన్నదే అంటూ - ఉడుగడుగక 
పాట-బాటల పోక ఉండక 
ఊరికే ఉండలేను నేను. 
అది నా స్వ-స్వభావం. 

*******
*******

నా పాటల-బాటల నాతో నడవాలనుకునే వారుంటారని అనుకుంటూ... 

~పాటల భైరవి