31, డిసెంబర్ 2018, సోమవారం

నాతో నేనే!

ఇంకొద్ది సేపట్లో ఇప్పటి 'ఈ ఏడు' అప్పుడే రేపటి 'నిరుడు'
ఎప్పట్లాగే పోగు చేసుకున్న ఎన్నో జ్ఞాపకాలు
నే కలిగించిన ఖేదాలు
నా కనిపించిన మోదాలు
నే గుచ్చిచ్చిన ఇచ్చకపు మాటల మెచ్చుకోళ్ళు వెలిగించిన చిరునవ్వుల పూలు
నాకే తెలిసీ తెలియక, నే నొప్పించిన బాధల నలిగి, నేనే అనుభవించిన నొచ్చుకోలు
జారిపోయిన క్షణాలు, నిన్నెప్పటికీ చేరుకోలేనంటూ పెరిగిపోయిన దూరాలు కొన్ని
దరికి చేరిన స్నేహాలు, ఇంకెప్పటికీ వదిలిపోనన్న హామీలు కొన్ని

ఆదికి అంతం కానిదీ, అంతపు మొదలెరుగనిదీ 
ఈ అనాది కాలపు దారిలో ఓ కొత్త మలుపు మొగసాల - ఈ పూట.
ఇలా ఇక్కడ ఆగి - ఒక్కసారి ఇప్పటివరకూ నడిచొచ్చిన ఆ పాత మలుపులో పోగేసుకొచ్చిన తలపుల్ని నెమరేసుకుంటే... తరచి చూసుకుంటే ...
రాసుకుంటే నాకై నేను నా గడిచిన సంవత్సరపు నొప్పొప్పుల బేరీజుల పంచాంగం...
తేలిన లెక్కేంటంటే...
మోదమూ నాదే, ఖేదమూ నాదే...
నవ్వూ నాదే, నొప్పీ నాదే...
మాటా నాదే, మాటకి మాటా నాదే
ఇంతకు ముందు నేనుగా నాతో కలిసి
ఇప్పటి దాకా నాతో నేను చేస్తున్న ప్రయాణం
ఇటుపైన కూడా నాతో నేనే
నాకు నేర్పుకుంటూ నేనే
నాతో కలిసి నేర్చుకుంటూ నేనే
నే నేర్పినది నెమరేసుకుంటూ నాతో నేనే!

29, డిసెంబర్ 2018, శనివారం

మనసే జతగా పాడిందిలే - 13 - కవలపాటలు - వానమ్ అనబడే తమిళ ఆకాశం తెచ్చిచ్చిన పాట

అనగనగా... అప్పుడెప్పుడో...  బుజ్జిజింక చంటప్పుడు ...
ఎంచక్కా పగలంతా బుజ్జిజింకతో పాటు వాడి ఉంగా-ఉంగా భాషలో కబుర్లు చెప్పుకుంటూ, సాయంత్రం అన్నగాడితో పాటు సైన్సూ-లెక్కల పాఠాలు చదువుకుంటూ, ఆకలేస్తే తింటూ, నిద్రొస్తే పడుకుంటూ, ఇంటి వీధిగుమ్మం, పెరటిగుమ్మం దాటి అడుగు బయటికి పెట్టకుండా హా...యిగా పదకొండు నెలలు ఇట్టే గడిచి పోయాయి.

ఆ పదకొండు నెలల పాటు అమ్మ తరగాలనుకునే కూరలు, వండాలంటే సామానులు, అన్నగాడికి పుస్తకాలు, పెన్సిళ్లు, బుజ్జిపాపడికి డైపర్లు, బేబీ పౌడర్లు, క్రీములు ... ఇలా కోరుకున్నవారికి కోరుకున్నన్ని, కోరలేనివారికీ  కోరల్లేనివారికీ కోరుకోకపోయినా బొమ్మలు, Teether లు కొన్ని - ఇలా ఏవి కావాలన్నా అన్నీ బదరినే తీసుకొచ్చేవారు.  అమ్మ lived happily ever after - హమ్మయ్య!

అప్పటికి అన్నజింకకి పదో ఏడు
బుజ్జిజింకకి పదకొండో నెల
చేస్తున్న ఉద్యోగానికి విరామమిచ్చి ఏడాది
అన్నజింకతో ఆడుకుని బుజ్జిజింకతో పాడుకుని
దో ...బూచీ... అని కళ్ళు మూసి తెరిచేలోగా ఆ ఒక్క ఏడాది హుష్... కాకీ!
ఆ ఆటా-పాటలకి మరిగి, విరామమిచ్చిన కొలువుకి ఎప్పటికీ సెలవు ఇచ్చేయాలనిపించింది.
అలా అనిపించడానికింకో కారణం కూడా వుంది...
ఒకేడాది పాటు ఈడ నున్న నన్ను ఆడేడో కాలిఫోర్నియాలో వున్న ఆడ-మలయాళం-బాసు (lit.ly & fig.ly) చూలింతనని కూడా చూడకుండా పెట్టిన ఆరడి మళ్ళీ ఇంకోసారి ఆ పక్కక్కూడా తొంగి చూడకూడదు అనిపించేలా చేసింది.

ఆడుకుంటూ, పాడుకుంటూ నా కాలక్షేపం ఎలా అవుతోందీ అంటే... 
ఆకలి వేళ అమ్మనౌతూ
పప్పు వండి ఆమ్ పెడుతూ 
ఆటల వేళ అల్లరౌతూ 
పంటా లేసి పంతం పోతూ
అమ్మని నన్ను ఉడికిద్దామని గుక్కే పెడితే 
కీ ఇచ్చిన బొమ్మల్లె బుజ్జిజింకతో పాటు రాగం పెడుతూ - రాగాల, సరాగాల, హాసాల, విలాసాల - కులాసాగా నడుస్తోంది కాలం.

అప్పుడో రోజు ఆఫీసు నుంచి ఇంటికొచ్చిన బదరి చెప్పిన కబురేంటంటే ఎవ్వరో పుణ్యాత్ములు పిలిచి మరీ నాకు ఉద్యోగం ఇస్తామంటున్నారని.
"అబ్బే! నాకొద్ద"న్నా.
మళ్ళీ రెండో రోజూ అదే మాట. పైగా నా CV ఇమ్మని ఒకటే అడుగుట అట.
"అమ్మో! మళ్ళీ అక్కడికే..?! నే రా" నన్నా.
మూడో రోజొచ్చి "అబ్బే! ఆ పాత టీము కాదు. ఎంచక్కా ఇది కొత్తది. అన్నిసార్లు అడిగాడు పాపం! ఒకసారి నీ CV ఇచ్చి చూద్దాం" అంటూ పట్టుకెళ్లారు బదరి.

మొత్తానికి మళ్ళీ డబ్బా లంచూ, లాప్టాప్ సంచీ సర్దుకుని ఆఫీసుకి ప్రయాణం.
పగలంతా బుజ్జిజింక నొక్కడినీ, సాయంత్రం బడయ్యాక వాడికి తోడుగా అన్ననీ చూసుకొమ్మని ఒకరింట వదిలి వెళ్ళేవాళ్ళం.
మా ఇంటి నుంచి డౌన్‌టౌన్‌లో వున్న ఆఫీసుకి ఒక గంట ప్రయాణం. ఆ గంటా గంట కొట్టినట్లు నేను గణ-గణా మాట్లాడకుండా ఉండాలంటే, తను ప్రశాంతంగా డ్రైవ్ చెయ్యాలంటే "ఏం చేస్తే బావుంటుందబ్బా?!" అనాలోచించి పాతవో, కొత్తవో పది పాటలుంటే - అవి నేను వినే వీలుంటే - ఆట్టే మాట్లాడి, ఆ మాటలతో ఆట్లాడి, ఆ మాటల ఆటల్లో పోట్లాడి, ఆ మాటల ఆటల పోట్లాటల్లో పడరాని పాట్లు పెట్టనని అనుకుని, అనుకున్నదే తడవు కొన్ని MP3 లని పట్టుకుని ఓ CD లో పట్టి అట్టేపెట్టేశారు బదరి.

మళ్ళీ ఆ పాటలెలా ఉండాలంటే - ఒకే భాషవి కాకూడదు, వినగానే నచ్చెయ్యాలి, పాట బావుండాలి, మాట నచ్చాలి, మ్యూజిక్ బావుండాలి, మ్యాజిక్ చేసినట్టుండాలి.

ఇన్ని షరతులతో కొత్తవీ, పాతవీ, తెలుగువి, ఇంగ్లీషువీ, తమిళంవీ, శాస్త్రీయ సంగీతం, అన్నమాచార్య దేశికవితాగానం - ఇలా అన్నీ కలిపేసిన పాటల వరసేంటంటే ... (మచ్చుకి కొన్ని మెచ్చుతునకలు మాత్రం)...

చుక్కల తోటలో ఎక్కడున్నావో   (కృష్ణ, జయప్రద)
నాదారి ఎడారి నా పేరు బికారి (కృష్ణ)
భో శంభో శివ శంభో (మహారాజపురం రామచంద్రన్)
I know you think that I shouldn't still love you (Dido - White Flag)
తెన్మేరు పరువక్కాట్రు (కరుత్తమ్మ - ఉన్ని కృష్ణన్, చిత్ర)
మరీ ...  మరీ...  కలవరం (సినిమా పేరు శ్రీ ) 
Daddy Cool (Boney M)
కన్నుల్లో మియ్యా మియ్యా 
లాలీ లాలీ లాలీ లాలీ జో (అన్నమయ్య దేశికవితాగానం - ఎస్జానకి). 

పైన లిస్టిన పాటల్లో ఒకటి - కన్నుల్లో మియ్యా మియ్యా - అన్న పాట ఎందులోదో తెలీదు కానీ మా ఇద్దరికీ కూడా ఇష్టమయ్యింది అప్పుడు. ఎంత నచ్చిందీ అంటే ముందొచ్చే మ్యూజిక్ ఒక చిన్న ముక్క మా ఫోన్లకి రింగ్‌టోన్‌గా వాడుకునేంతగా.

ఆ తర్వాత నెమ్మదిగా సీడీల కాలం చెల్లింది. ఒకే కార్లో ఆఫీసుకెళ్లే వీల్లేకపోయింది. ఆ పాటల లిస్టులు మాత్రం మిగిలాయి.

మళ్ళీ ఇన్ని రోజులకి మాకు నచ్చిన కన్నుల్లో మియ్యా మియ్యా పాట అసలే సినిమా లోదో, ఎక్కడైనా ఉందేమో అని వెతికితే అసలు చిక్కితేనా? యూట్యూబ్ లో ఒక రోజు వెతుకుతూ ఉంటే అనుకోకుండా "kannullo miya miya" అని టైప్ చేయబోయి "kannale miya miya" అని తప్పు టైప్ చేశా. ఆ తప్పే నా పాలిట పాట-ఒప్పు అయింది. కళ్ళ ముందు "అళ్ళి తంద వానమ్" అన్న తమిళ సినిమా లోంచి "కణ్ణాలే మియా మియా" అంటూ నేను వెతుకుతున్న న్నుల్లో మియ్యా మియ్యా పాటకి తమిళ-కవల కనిపించింది. 



ఆ పాట అంచు పట్టుకుని వెతుక్కుంటూ వెళ్తే దానికి తెలుగు డబ్డ్ వెర్షన్ పేరు సత్తి అని కనిపించడం
కనిపించిన ఆ సత్తి సినిమా పాటల కోసం నేను మళ్ళీ గూగుల్తో వెతకడం
వెతికిన నాకు ఎక్కడో ఆ పాటల MP3లు కనిపించడం
కనిపించిన ఆ పాటని పట్టి యూట్యూబ్ కెక్కించమని బదరిని అడగడం
అడిగిందే తడవు బదరి నాకొక యూట్యూబ్ లింక్ ఇవ్వడం...
ఇచ్చిన లింక్ క్లిక్కి నేనా పాట వినడం
విన్న పాటని రాయడం
రాసిన పాట వెనక కథ చెప్పడం
చెప్తున్న కథని బ్లాగు కెక్కించడం
అంతా - భలేగా జరిగిపోయిందిగా...
డం డం డిగా డిగా - పాటే దొరికిందిగా ...

అసలీ తెలుగు పాటలో మాటలు అంత గొప్పగా వుండవు కానీ...మ్యూజిక్ హుషారుగా, తమాషాగా - ఉయ్యాలూగిస్తుంది...  
పైన తమిళపాటలో వున్న ప్రభుదేవా, లైలాల డాన్సు వీడియోనే ఈ తెలుగు పాటక్కూడా applicable. తమిళ పాట వీడియో మ్యూట్ లో పెట్టి, తెలుగు పాట వినేస్తే సరి.  



ఈ పాట రాసింది: బోస్ గోగినేని.
పాట వరస కట్టింది: విద్యాసాగర్ (చంద్రముఖి మ్యాజిక్ మ్యూజిక్ డైరెక్టర్).
పాడినవారు: ఉన్ని మీనన్, ఉష

ఈ పాటలో ఉన్ని మీనన్ గొంతు క్లాసిక్‌గా వుంది. తెలుగులో కూడా అతని చేతే పాడించడం చాలా బావుంది. కాకపోతే అసలు పాటలో కొన్ని మాటలు అర్థం కాలేదు. నాకు తోచినవేవో పెట్టి రాసేశాను ప్రస్తుతానికి - అవెక్కడెక్కడంటే.... కింద underline చేసి పెట్టుకున్నా తరవాతెప్పుడో సరి చేసుకుందామని...

కన్నుల్లో మియ్యా మియ్యా - గిల్లుళ్లే కియ్యా కియ్యా
ఒళ్లేదో ఉయ్యాలెయ్యా-ఇదేం ప్రేమయా 
కారణం...  నువ్వే ప్రియా - కవ్వించే...  కళ్ళేనయ్యా 
సరసం...  ముద్దే కియా - అధరాలు దూరమేలయా 

కన్నుల్లో మియ్యా మియ్యా - గిల్లుళ్లే కియ్యా కియ్యా
ఒళ్లేదో ఉయ్యాలెయ్యా-ఇదేం ప్రేమయా


వాలు కన్నుల మౌనం - వాడి కన్నుల గీతం  
మూసీ  వున్నా కన్నుల భాషేముందో 
బరువై రెప్పలు సోలీ - నాలో చప్పుడు చేసీ 
కోరిక కూడా కొంచెం కొసరే మదిలో
వలపుల ఎదలో ... హొయ్ ... పిలుపే స్వరమా
మనసే తెలిసీ ... హొయ్...  దూరం తగునా 
హేయ్...  కొంచెం చుమ్మావని... వెంటే పడి కవ్వించకు 
ప్రేమే... కోరీ...  వస్తే - నన్నే...  నెట్టేవేలా ... 
ఇలా... జంటై... ఉందాం -  ఒకే జగం మనం 

కన్నుల్లో మియ్యా మియ్యా - గిల్లుళ్లే కియ్యా కియ్యా
ఒళ్లేదో ఉయ్యాలెయ్యా - ఇదేం ప్రేమయా 

నీతో చేరే తీరం - దేహం కోరును దాహం
మోహం కొంచెం ముద్దే కోరుకోదా 
కాముని ఆటలు చాలు -  మాటలు చెప్పకు నాకు 
ఆశే  పెట్టుకొని చేరకు ఒళ్ళో 
తలగడ పలికే...  హొయ్...  కోర్కెల  అలలై 
ఇరవై వయసే...  హొయ్...  తీయని కలగా 
హేయ్... నన్నే వేధించకు...  ఓ కోరికే చల్లార్చకు 
ఏలా...  నాతో...  పంతం - ఒళ్ళే... చేస్తా... సొంతం 
ఇలా...  జంటై...  ఉందాం -  ఒకే జగం మనం 
కన్నుల్లో మియ్యా మియ్యా - గిల్లుళ్లే కియ్యా కియ్యా
ఒళ్లేదో ఉయ్యాలెయ్యా-ఇదేం ప్రేమయా 
కారణం...  నువ్వే ప్రియా - కవ్వించే...  కళ్ళేనయ్యా 
సరసం...  ముద్దే కియా - అధరాలు దూరమేలయా

ఇంతకీ అళ్ళి తంద వానమ్ అంటే ఆకాశం చాలా ఇచ్చింది అని అర్థమట (అళ్ళి= a  lot  తంద=gave  వానమ్=sky) - నా ఫ్రెండూ, తమిళ consultant అయిన హేమ చెప్పింది. అర్థం చెప్తూ పేరు poetic గా ఉందని సినిమా చూడొద్దూ, pathetic కావొద్దూ అని మరీ మరీ చెప్పింది. సినిమాల విషయంలో నా adventurous gene గురించి తనకి తెల్సిపోయినట్టుంది కాబోలు! :)

ఈ ఏడాదికి ఇది ఆఖరి బ్లాగ్ పోస్ట్... మళ్ళీ వచ్చే ఏడాది - ఇంకొన్ని పాటలు మోసుకొస్తా ...

~ పాటల భైరవి

23, డిసెంబర్ 2018, ఆదివారం

చిత్రహింస అనబడు Self-Inflicting Wounడోపాఖ్యానం

శీతాకాలం
కిటికీ కావల కనబడే బంగారం లాంటి ఎండ
అది కనువిందే కానీ ఒంటి కందదు, అది తగిలి ఒళ్ళు కందదు
కురచైన పగళ్లు, తరచైన రాత్రులు
ఆకు రాలిన చెట్లు, పూలు పూయని కొమ్మలు 
మిణుకు నక్షత్రాలకి పోటీగా తళుకుమనే క్రిస్మస్ దీపాలున్నా, అవేవీ ఒదిలించలేని చీకటి బెంగ
ఇంటా బయటా ఒణికించే చలి
కనిపించక, వినిపించక, వున్నట్టు కూడా అనిపించని మనిషి అలికిడి


ఈ మాత్రం కారణాలు చాలు, వెచ్చవెచ్చగా కంబళేదో కాళ్ళ దాకా కప్పుకుని, కదలకుండా కూర్చుని కుడిచెయ్యి మాత్రం బయట పెట్టి రిమోటు-మీటలు నొక్కుతూ, చలంటని కళ్ళు మాత్రం కదుపుతూ చేయగలిగే పని చెయ్యడానికి, అదే! సినిమాలు చూడడానికి.

నెట్‌ఫ్లిక్సో, అమెజాన్ ప్రైమో ఏదైతేనేమి, ఏ ఛానెలైతేనేమి బుర్ర వాయగొట్టుకోవడానికి అననిపించిన నటవారస ప్రసాదాలైన చిత్రరాజాలు మూడైతే, కారెక్కి గంటసేపు పడీపడీ ప్రయాణం చేసి వెళ్లి చూసి ఠారెత్తి మళ్ళీ లేవకుండా పడ్డవాళ్ళను చేసిన retrograde amnesiatic సిన్మా ఇంకోటి. ఆ సినిమాలు, వాటి వల్ల నా శారీరక, మానసిక ఆరోగ్యాల మీద నాక్కలిగిన అనుమానాలు రాసేసుకోవాలి ఇవాళే, ఇప్పుడే. అలా రాసుకోకపోతే ఎప్పట్లాగే ఏదో ఓ నా నక్షత్రాలు బావుండని సాయంత్రం ఇవే సినిమాలు చూడలేదేమో నని పెట్టేసుకుని, సగం దాకా చూశాక "అరే! ఇంతకు ముందే చూశానే ఇది, అయినా ఏంటబ్బా కథ గుర్తుకు రావట్లేదు" అనుకుని మళ్ళీ చూసి చిత్రహింసకి గురవుతానేమో నన్న భయం. ఎందుకంటే చదువుకునే రోజుల్లో బళ్ళో మా మాష్టార్లు,  ఇంట్లో మా అమ్మ పదేపదే చెప్పిన ఒకసారి రాస్తే పదిసార్లు చదువుకున్నట్లన్న చద్దిమూట లాంటి మాటని నమ్ముకుని ఈ వేళ్టికి ఇలా రాసేసుకుంటే, రేపో వేళ పొరపాట్న నా ఆధీనంలో లేని నా కవల కుడిచెయ్యో, కవల ఎడం చెయ్యో రిమోటు నొక్కేసినా ఇంకా retrogade amnesia పాలబడని నా ఈ రాసుకున్న పాత జ్ఞాపకాలు నన్ను కాపాడతాయన్న ఆశే నాతో ఇలా రాయిస్తోంది.

మొదలెట్టేస్తున్నా మరి ... ఇది చదివి మనో-నేత్ర-ప్రక్షాళన చేసుకోవాలంటే మాత్రం ఏ మిస్సమ్మో, మాయాబజారో, సాగరసంగమమో చూసుకోమని మనవి. 

శైలజారెడ్డి అల్లుడు:

ఆరడుగులకి అరడుగు మాత్రమే తక్కువైన హీరోగారి అందం, ఎంతో ఎత్తుకి ఎగిరెగిరి విలన్లని ఎగిరి తన్నిన అద్భుతం
పరిచయంతోనే కనిపించిన ఆరంగుళాల హీలున్న హీరోయిన్ గారి పాదం
అ! సినిమాతోనే అడలుగొట్టించిన మురళీశర్మ పలికే ఆంధ్రలో ఏ యాసో తెలియని భాష
బాహుబలిలో పూనిన శివగామి ఇంకా దిగని రమ్యకృష్ణ పాలబడినపెద్ద నరేష్ ఘోష
వూళ్ళో ఆడవాళ్ళ బాధలు తీర్చడానికి పుట్టిన అమ్మ శైలజారెడ్డి తన కూతురుతో మాత్రం మాట్లాడదు - వాళ్ళిద్దరికీ మాటలు మోసే తడికలా పృథ్వీ, ఆయన చేయబోయిన అపహాస్యపు కామెడీ
అస్సలు నవ్వకుండా, ఆరబెట్టుకున్నపుడు అనుకోకుండా కురిసిన వర్షానికి తడిసి ఎప్పుటికీ పేలని చిచ్చుబుడ్లలా మొహాలు పెట్టుకుంటేనే అదేదో చాలా గొప్ప ఏక్షన్ అనుకునే హీరోయిన్లు, పనీపాటా లేకుండా వారి వెనక పడి విన్యాసాలు చేసే నటశూన్యత్ అనదగ్గ హీరోలు
ఒక్కటంటే ఒక్కటి కూడా గుర్తు లేని మాటలు, పాటలు
సినిమా మొదలెట్టిందగ్గర్నుంచీ సోఫాలో ఇబ్బందిగా కదుల్తూ, నాకేసి "ఇంత జాలి లేదేంటి నీకు?" అన్నట్లు చూస్తూ, ఇంకోసారి అడిగితే ఆపేస్తానేమో అని ఆశతో "ఇంకాపేద్దామా బుజ్జీ!?" అనడుగుతూ, "వుండండి... రమ్యకృష్ణ ఇంకా రాందే? అప్పుడు బావుంటుందేమో?!" అన్న నా మాటతో ఆరిపోతున్న ఆప్టిమిజానికి ఆజ్యం పోసుకొంటూ, నాతో పాటే చివరాఖరి "శుభం" కార్డు దాకా సిన్మా చూసి, పట్టీపట్టని నిద్రలోంచి దడుచుకుని లేచి మరీ "నువ్వెంత రాక్షసివే! నా చేత శైలజారెడ్డి అల్లుడు చూపిస్తావా?" అనిపించుకున్న ఆ రాత్రి చిరు-స్మైలీయం, చిరస్మరణీయం.


సాహసం శ్వాసగా సాగిపో: 

ఇది నేనొక్కదాన్నేచూశా
Life After Google చదువుకుంటూ బదరి, Wodehouse నవ్వుల్లో మునిగి తేలుతూ అన్నగాడు, కీబోర్డ్ మీద సన్నగా కూనిరాగాలు తీస్తున్న బుజ్జిజింక, వాళ్ళు ముగ్గురూ ఎవరి వ్యాపకాల్లో వాళ్ళుంటే నాకు మాత్రం కొంచెం dumb-time కావాలనిపించింది. అనుకున్నదే తడవు సిన్మాలు వెతుక్కుంటూ ఉంటే నటవారసుడి ఇంకో సిన్మా, సాహసం శ్వాసగా సాగిపో  తెర మీద మెరిసింది. "హన్నా! నీకు మరీ prejudice ఎక్కువై పోతోంది. ఒకటి బాలేపోతే అన్ని బావోనట్లు కాదు కదా! చూడు, చూడు" అని నాకు నేనే సినీ-ప్రోత్సాహమిచ్చేసుకుని చూడడం మొదలు పెట్టాను.

ఇంజినీరింగ్ చదివి "నెక్స్ట్ ఏంటి?" అనాలోచిస్తున్న హీరో, హీరో గారి బైకు
హీరో గారి మీద హీరోయిన్ను లైకు
రాత్రి పూట హీరో గారు ఎక్కించే గోడలు దూకే హీరో గారి ఫ్రెండు
కన్యాకుమారిలో సూర్యోదయం చూడడానికి బయలుదేరిన హీరో, హీరోయిన్నూ
దార్లో వీళ్ళిద్దరూ తలుపు కొట్టి, "నేనూ నా చెల్లెలి ఫ్రెండూ వచ్చాం - మీ ఇంట్లో ఉంటాం, తింటాం" అని హీరో చెప్పగానే ఆకేసి, పప్పేసి, అన్నం పెట్టి సాగనంపే ఓ తమిళ కుటుంబం
రోడ్డు మీద ప్రమాదం జరగ్గానే హాస్పిటల్లో హీరోని చేర్చి మాయమైన హీరోయిన్
కదిపితేనే నొప్పి అంటూనే, ఆ విరిగి కట్టు కట్టుకున్న చేత్తోనే హీరోయిన్ కోసం హీరో చేసే ఫైట్లు, ఫీట్లు 
ఎందుకు చంపుతున్నారో తెలీకుండా హీరోయిన్ కుటుంబాన్ని, ఆమెకు ఆశ్రయమిచ్చిన అందర్నీ చంపే విలన్లు, వాళ్ళకి సహాయపడే పోలీసులు
తీరా చూస్తే అంతగా convincing గా అనిపించని హీరోయిన్ తన కూతురు అని ఎవ్వరికీ తెలియకూడదని ఆమె తండ్రే చేయిస్తున్న హత్యలు
చివర్లో పట్టుబట్టి సివిల్స్ రాసి, IAS వద్దనుకుని IPS అయి వచ్చే హీరో


అబ్బబ్బబ్బా!What an inspiring story! ఇందులో కూడా మాటలు, పాటలు ఏమీ గుర్తు లేవు. మరీ రాత ఎందుకంటే మరోసారి దీని జోలికెళ్ళే సాహసం చేయకుండా సాగిపోవడానికి.


సవ్యసాచి:

ముచ్చటగా మూడో నటవారసులవారి వరప్రసాదం. 


పుట్టిన ఒక్క కొడుకులో అసలు కొడుకు విక్రమ్.
ఎడం చెయ్యిలో ఇరుక్కుపోయిన కవల ఆదిత్య.
వెరసి హీరో విక్రమాదిత్య.
ఆతని సోదరి పేషేంటుకి పేటెంటులాంటి భూమిక.
ఏ సిన్మాలోనైనా ఈవిడ కొంచెం చురుగ్గా ఉంటే చూడాలనే తీరని కోరిక.
ఇందులో హీరోయిన్ను ఉందా అంటే వుంది.
ఆమె ఉందన్న జ్ఞాపకమే నాకు లేదు.
ఆరేళ్ళ తర్వాత హీరోయిన్ని కలుసుకున్నా అస్సలు ఆ excitement నటనలో ఏ కోశానా కనిపించనివ్వని  హీరోగారి నట-స్థితప్రజ్ఞత్వం

సినిమా అంతటికీ అబ్బాయి వాళ్ళ నాన్న దగ్గర అరువు  తెచ్చుకున్న వేటూరి వారి లగాయిత్తు-పాట తప్ప ఇంకేమీ గుర్తు లేదు.

ఇది చూశాక మాత్రం ఒకటి మాత్రం ఖాయం అయిపోయింది నాకు. అదేంటంటే రావురమేష్ చెప్పినట్లు ప్రతి ముగ్గురిలో ఒకరికి pregnancy లో  కవలలు form అయి, అందులో ఆహారం సరిగ్గా అందని కవలని ఇంకో కవల తనలో కలిపేసుకున్నా- ఆకలేసి కలిసిపోయిన ఆ కవల ఎడం చేతిలోనో , కుడి చేతిలోనో చేరి అసలు పుట్టిన కవలలో కనిపించని ఇంకో కవలగా మిగిలిపోవడం నిజమే ననిపిస్తోంది. ఎందుకంటే, నా కుడి చెయ్యి నా ప్రమేయం లేకుండా రిమోట్ బటన్లు నొక్కి "నేను చూడను మొర్రో!" అంటున్నా ఈ సిన్మాలన్నీ నేను చూసేలా చేస్తోంది ఎవరనుకున్నారు? నాలో వున్న అసలైన నేను కాదు. నా కుడి చేతిలో వున్న ఆకలేసి, అన్నం అందక నాలోకి ఆవిరైపోయిన నా కవల. ఇది అర్థం కావాలంటే సవ్యసాచి చూడాల్సిందే.  మధ్యలో రిమోట్ నొక్కి సినిమా ఆపెయ్యకుండా చూడాలంటే మీ కుడి చెయ్యి ఓ రుమాలతో వెనక్కి కట్టేసుకుని మరీ చూడండేం!

పడిపడి లేచె మనసు:

అసలీ మధ్య  "పాత్రల్లో ఒదిగిపోయారు, జిడ్డు వదిలేలా తోమి వదిలారు" అని రాసే ఆన్లైను రివ్యూలు చదవట్లేదు, ఒకవేళ ఆత్రం ఆపుకోలేక చదివినా ఏమాత్రం నమ్మట్లేదు మేము. అలాంటిది ఈ మధ్య - ఇండిపెండెంట్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తున్నారు, కొంచెమైనా నిజం చెప్తున్నారు - అనిపించే ఒక వెబ్సైట్ లో పడిపడి లేచె మనసు ముచ్చట చదివి, ముచ్చట పడి ఒక గంట కార్లో డ్రైవ్ చేసుకుంటూ పడీపడీ వెళ్లి మరీ మధ్యలో లేచి రావాలన్న విషయం గుర్తు కూడా రానంత retrogade amnesia కి గురయ్యాం.

నేనైతే మాత్రం సాయి పల్లవి డాన్సులు చూద్దామని వెళ్లాను. అందులోనూ రివ్యూలో కూడా ఆ అమ్మాయి డాన్స్ ప్రసక్తి వుండేటప్పటికి, ఏమీ లేకపోయినా ఆ fluid movements చూద్దామని బోల్డంత ఆశతో వెళ్ళాను. తీరా చూస్తే పొడుగు పొడుగు షిఫాన్ గౌన్లు వేసి, గాల్లో ఎగిరింది అంతే.

ఇందులో కూడా హీరోకో బైకు. టీవీ చూడ్డం తప్ప ఇంకో పనేమీ లేనట్లు కనపడే హీరో తల్లి ప్రియా రామన్. శుభసంకల్పం సిన్మా తర్వాత ఇదే ఈవిణ్ణి చూడడం. ఈవిడుండి పెద్దగా చేసిందేం లేదు, వర్షంలో తడిసొచ్చిన కొడుకుని విసుక్కోవడం తప్ప.

హీరోయిన్ డాక్టర్. తండ్రి మురళీశర్మ మేజిస్ట్రేట్. తన్ను కాపాడిన హీరోని ఇంటికి కాఫీకి పిలవడం, నేపాల్లో దెబ్బ తగిలిన హీరోయిన్ని తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చడం, ఓ ట్రాక్ సూటేస్కుని జాగింగ్ చేస్తున్నట్లు కనబడ్డం తప్ప ఈయనకి పెద్ద రోలేం లేదు.

హీరోయిన్ తల్లి - వంటింట్లోనో , సినిమాలో కనపడని పెద్దకూతురి కూతురికి స్నానం చేయిస్తూనో వుండే ఈవిడకి Bread-Bath & No-Beyond. లండన్ చదువుకోవడానికి వెళ్లిన డాక్టర్ కూతురు నేపాల్ లో వుంది, ఆక్కడ భూకంపం వచ్చిందని టీవీలో చూసి కూడా "ఇంటికి తిన్నగా వద్దామన్న ఇంగితం లేదు దీనికి" అని విసుక్కుంటుందే తప్ప "అయ్యో! పిల్ల అక్కడ ఏమయ్యిందో" అని కొంచెం కూడా కంగారు పడదు.

హీరో తండ్రి ఒక పెద్ద పుస్తక రచయిత.  ఈయన తగ్గిపోయిన హీరో కోపం పెంచడానికి పనికొచ్చే catalyst. ఈయన రాసే ఇంతోటి పుస్తకాలకి ఇంట్లో ఏదో ఓ గదిలో కూర్చుని రాసుకోక, అదేదో ప్రపంచాన్ని ఉద్ధరించే ఏ మందో, మాకో కనిపెట్టే  సైంటిస్టేమో అన్నంతగా "నా కెరీర్‌కి మీరు అడ్డు" అని వాళ్ళ పాటికి వాళ్ళు టీవీ చూసే అమ్మా-కొడుకుల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోతాడో నాకర్థమే కాలేదు.

హీరోయిన్ సాయిపల్లవి. ఈ అమ్మాయి నిజంగా డాక్టరట. ఈ సిన్మా లోనూ డాక్టరే. అప్పుడప్పుడు కోల్కత్తా వీధుల్లో బెంగాలీలో "హింషా, అహింషా" అని అరుస్తూ వీధినాటకాలూ వేస్తూ ఉంటుంది. ఎక్కడో రోడ్డు మధ్యలో ట్రాఫిక్ ఆగిపోయినప్పుడు, ఎదురుగా ఆగిన బస్సులోంచి డాన్స్ డ్రెస్ వేసుకున్న పిల్లలు కొందరు దిగి "అక్కా! డాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళాలి, లేట్ అవుతోంది. హెల్ప్ చెయ్యక్కా" అంటే ఈ సాయిపల్లవి కళ్ళు మెరిపిస్తూ తలూపితే "ఏదో ఉపాయం చేసి పిల్లల్ని సమయానికి వాళ్ళు వెళ్లాల్సిన చోటుకు చేరుస్తుందేమో, ఏం చేయబోతోందబ్బా" అని కూర్చున్న సీటు అంచుకి జరిగి మరీ చూడబోతే ఈ పిల్ల కూడా ఆ పిల్లలతో పాటు బస్సు టాపెక్కి ఓ భరతనాట్యం స్టెప్పు వేస్తుంది. ఇంకా ఈ సిన్మాలో ఏదో ఉంటుంది అనుకునే నన్ను నా కుడి చెయ్యి నా ప్రమేయం లేకుండానే "సాచి" పెట్టి కొట్టి ఆట్టే ఆశించక "సవ్యం"గా వుండమంది.

ఇంక నేపాలు, భూకంపం...ఏడాది తర్వాత అక్కడ కలుసుకుందామనుకున్న హీరో, హీరోయిన్లు భూకంపం వల్ల కలుసుకోలేక పోవడం,  ఎప్పుడో దాసరి-గోరింటాకు రోజుల్లో హీరో-హీరోయిన్లలా ఈ సినిమాలో కూడా ఎదురెదురుగా ఉంటూనే ఒకళ్ళతో ఒకళ్ళు సరిగ్గా కమ్యూనికేట్ చేసుకోకుండా వాళ్ళిద్దరి మధ్యా జరిగిన మహా-డ్రామా...ఇంత జరుగుతున్నా, సీట్లోంచి మేము లేచి రాలేకుండా మమ్మల్ని కూర్చోపెట్టిన మాలోని మాకే తెలియని మా ఇంకో కవలలు.

సిన్మాలో నాకు నచ్చినవి ఏంటంటే కోల్కత్తాలో హీరో-హీరోయిన్ల ఇళ్ళు  - కొంచెం చూడ్డానికి బావున్నాయి. ఆ వీధుల్లో తిరిగిన ట్రాములు. కురిసిన వర్షాలు. హీరోయిన్ వేసుకున్న కొన్ని డ్రెస్సులు. హీరో గురించి చెప్పడానికేమీ లేదు. ఇందులో ఇంకో డాక్టరుగా వేసిన అజయ్‌ని  చూసినప్పుడల్లా అనిపించేది మళ్ళీ ఈ సినిమా లోనూ అనిపించింది - ఈ అబ్బాయికి ఎవరైనా మంచి రోల్స్ ఇస్తే బావుండును అని. సునీల్‌ వున్నాడు. వెన్నెల కిషోర్ ఉండక తప్పదేమో మరి.

నిన్ననే చూశామీ సినిమాని. అయినా సరే ఇంతకు మించి ఏమన్నా చెబ్దామంటే గుర్తు రావట్లేదు. జై బోలో Retrogade Amnesia కి!

ఈ సినిమాలు చూసిన ఆవేశంలో, ఆక్రోశంలో  శ్రీశ్రీ గారిని అరువు తెచ్చుకున్నా...
దుఃఖితులార !
ప్రేక్షకులార !
తెలుగు సినీ ద్రష్ట లార !
ఆశించకండాశించకండి !
వచ్చేస్తాయొచ్చేస్తాయి...
రీమేక్, డబ్బింగ్ సిన్మాల్ 
వచ్చేస్తాయొచ్చేస్తాయి !


~ సినీ-మా-లక్ష్మి












19, డిసెంబర్ 2018, బుధవారం

త్వామనురజామి - 31 - నాన్న మది పువ్వువలె మెత్తనమ్మా...

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 30 - థియేటర్లో సిన్మా వుంది - ఇంటర్నల్లు టెస్టు వుంది - దేనినీ మానుకోముగా...

మాకు శీతాకాలపు సెలవులు డిసెంబర్లో క్రిస్‌మస్ ముందు మొదలై సంక్రాతి తరవాత ముగిసేవి. ఈసారి కూడా సెలవుల డేట్లు చెప్పారు. ఇంటికెళ్లడానికి అమ్మాయిలం అందరం టికెట్లు బుక్ చేసుకున్నాం. మేమున్నది ఫిఫ్త్ సెమిస్టర్ కదా! వచ్చే ఏడాది ఈ టైంకి ఇక్కడ ఉండం కదా - అని ఒక చిన్న బెంగ అప్పుడే మొదలయింది. మళ్ళీ అంతలోనే "సెలవుల తర్వాత మళ్ళీ వెనక్కి వస్తాం, ఆ తర్వాత ఇంకో నాలుగు నెలలు వుంటాం, ఇప్పట్నుంచే బెంగెందుకు" అని మాకు మేమే అనేసుకుని ఇంటికి వెళ్లే హడావిడిలో పడిపోయాం.

ఇంతలో నాన్న నుంచి మళ్ళీ ఫోన్. రెండ్రోజుల్లో బయల్దేరి శనివారం పొద్దున్నకి తిరుపతి వస్తున్నాము అంటూ. ఆ రోజు సాయంత్రం అలిపిరికి వాకింగ్‌కి వెళ్ళేటప్పుడు బదరికి చెప్పాను - నాన్న, రవి వస్తున్నారని. అది వినీ వినగానే తన కళ్ళల్లో - తనకి మాత్రమే చేతనయిన - కళ్ళలో మెరిసి పెదవుల మీద పూసిందో, పెదవి మీద పూసి కళ్ళలోకి వెలుగై పాకిందో - ఓ చిన్న వెలుగుపువ్వు లాంటి మెరిసే నవ్వు... షికారుకై నడిచే నడకలో వేసే అడుగులో అప్పటికప్పుడు చేరిన ఓ చిటికెడు హుషారు... ఈ అబ్బాయి సంబరమేంటబ్బా అనుకుంటున్న నాతో "పోన్లే! నేనే ఇంకా మీ నాన్నగారిని ఎలా కలవాలా, ఎప్పుడు కలవాలా అనుకుంటూ వున్నాను. ఆయనే ఇలా రావడం మనకీ మంచిదే! కాకపోతే ఈసారి నేను రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్‌కి వెళ్ళక్కర్లేదు కదా! వాళ్లొచ్చాక ఎక్కడ కలుద్దామనుకుంటారో మాత్రం కనుక్కో! తయారై వస్తా. మా కాబోయే మామగారికి నేను నచ్చాలి కదా మరి!" అంటూ సరదాగా అంటూ సెలవు తీసుకున్నారా పూటకి.

తనతో ఉన్నంతసేపూ, తనలా మాట్లాడుతున్నంత సేపూ నాకూ సంబరంగా, సరదాగా అనిపించింది కానీ ఆ రాత్రి నాన్న ఫోన్ చేసినప్పుడు "ఆ అబ్బాయిని శనివారం మధ్యాహ్నం రెండింటికి మీ హాస్టల్ దగ్గరికి రమ్మని చెప్పు. నేనూ, రవి అక్కడికొస్తాం" అని చెప్పగానే కొంచెం బెంగగా అనిపించింది. కాకపోతే ఏదైనా జరుగుతుంది, జరిగి తీరుతుంది అని తెలిసినప్పుడు అదేదో జరిగేదాకా దాని గురించి అంతగా ఆలోచించి, దాని కోసం ప్రిపేర్ అవడం అనేది నాకస్సలు అలవాటు లేదు. అందులోనూ అమ్మ ఎపుడూ చెప్పే మాట ఉండనే వుంది - ఏమదీ? "రాత్రి పడుకోబోయే ముందు ఓ గ్లాసుడు పాలు తాగితే బాగా నిద్ర పడుతుంది, పొద్దున్నే లేవడానికి బద్ధకం అనిపించదూ" అనే ఓ క్షీరోపదేశం.  అందుకే హే...ప్పీగా ఓ కప్పు వేడిపాలు తాగి హాయిగా పడుకుండి పోయాను - "అన్యథా శరణం నాస్తి... Him ఏవ అభయం మమ... His మామేవ మా నాన్నః "అనుకుని, అలా అనుకున్న నా మాటలకి నేనే నవ్వుకుని.


ఆ మర్నాడు బదరికి చెప్పాను శనివారం మధ్యాహ్నం మా హాస్టల్ దగ్గరికి నాన్న రమ్మని చెప్పారని. అది విన్న మా చిద్విలాస మూర్తి మోము అయింది మరింత ప్రకాశమానం.

శనివారం వచ్చింది. పొద్దున్న క్లాసులు అయిపోగానే లంచ్ చేసేసి రూమ్ కొచ్చేశాను. ఒంటిగంటన్నరకి మా కరుణాకర్-బొమ్మ నాగలక్ష్మి వచ్చి "లల్లీ! మీ కోసం మీ నాన్నగారు వెయిటింగ్ రూంలో కూర్చుని వున్నారు" అని చెప్పింది.

అద్దీ! అప్పుడు ఆ క్షణంలో మొదలయింది మదిలో ఓ చిన్న బెరుకు.  ఇంతకు ముందు దీపావళికి ఇంటికెళ్లినప్పుడో, అంతకు ముందు అమ్మ వచ్చినప్పుడో ఒక్కసారన్నా నాన్న నన్నుకొంచెమైనా కోప్పడి ఉంటే నాకీ బెరుకు వుండకపోను. ఆయనేమన్నా చిన్న మాటన్నా నేను ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేనేమో, హాస్టల్లో ఒక్కదాన్నే వుండి బెంగ పెట్టుకుని నాలో నేనే ఏడుస్తానేమో అనుకుని ఇప్పటిదాకా పల్లెత్తు మాట కూడా అనలేదు.

నిజ్జంగా...
మా నాన్న మది పువ్వువలె మెత్తనమ్మా…
ఆటవిడుపె నాదిగా మురిసెనమ్మా...
హాస్టల్లో చదువుకుని అలసిపోతినా…!
ఆడుకుని పాడుకుని అలుపు మరవమనెనమ్మా… 

అలా అనుకుంటూ, రెండేసి మెట్లు దాటుకుంటూ దిగేసి వెళ్లి నాన్ననీ, రవిని చూసి "బావున్నారా నాన్నా? అమ్మా, పప్పి, కుట్టి అందరూ బావున్నారా? నువ్వెలా వున్నావు రవీ? లంచ్ చేశారా? ఎక్కడా? భీమాస్ లోనేనా?" అని నా బెదురు కనిపించకుండా ఉండాలని హడావిడిగా మాట్లాడేస్తూ ఉంటే నాన్న కొంచెం సీరియస్‌గా "అందరం బావున్నాం కానీ మీ పాత హాస్టల్ దగ్గరకెళ్దాం పద!" అన్నారు.

నాన్న అలా అనగానే నాన్న, రవి నాకు అటూ ఇటూ నడుస్తూ మా సినీగేటు దాటి మా పాత హాస్టల్ బిల్డింగ్ ఎదురుగుండా వుండే బజ్జీల కొట్టు దగ్గర ఆగాం. ముగ్గురం ఏమీ మాట్లాడుకోకుండా అక్కడకి ఎదురుగుండా వున్న పెద్ద గేటు కేసి చూస్తూ నించున్నాం.

[ఈ పార్ట్ ఆఫ్ స్టోరీ అందించుడు బై బదరి] ఇక్కడిలా మూకీ సినిమా నడుస్తూ ఉంటే అక్కడ SVU మెన్స్ హాస్టల్లో పెళ్ళివారి హడావిడి. ఓ నల్ల పాంటూ, పింకు చారల ఫుల్హాండ్స్  చొక్కా తొడిగేసుకుని బదరి బయల్దేరగానే "ఆయ్! మేమందరం నీ స్నేహ-బృందరం ఇందరం నీకండగా ఉండగా నువ్వొక్కడివే అక్కడికి వెళ్లడమే?! మేమూ వస్తాం నీ తోటి" అంటూ ఒకటిన్నర బైకుడు MBA అబ్బాయిలు ఒకే బైకు మీదెక్కి వచ్చారు. అందులో ఒకరు అసలైన అబ్బాయి అయితే మిగిలిన వారిలో నాగ్గుర్తున్నవారు - చిరుభాయ్ అని మేం పిలుచుకునే మోహన్, రాజశేఖర్ రెడ్డి.

[చిరుభాయ్ అన్న పేరు మోహన్‌కి ఎలా వచ్చిందంటే మా మొదటి ట్రెయిన్ ప్రయాణంలో తను డాన్స్ చేయడం చూసిన మా సీనియర్స్ పెట్టిన పేరది అన్నట్లు గుర్తు.]

సరిగ్గా రెండు గంటలకి మా పాత హాస్టల్ దగ్గర ఇరు పక్షాల వారమూ ఏదో వారు కోసమై వచ్చిన వారుగా ఒకరినొకరు నవ్వీ నవ్వకుండా చూసుకుంటూ ఒకరికెదురుగా ఒకరం నించున్నాం.

వాళ్ళు వచ్చీ  రాగానే పేరుపేరునా నాన్నకీ, రవికీ పరిచయం చేశానో లేదో, నాన్న నాకేసి తిరిగి "లల్లీ! నువ్వు మీ హాస్టలుకి వెళ్ళు. నేనొచ్చి కలుస్తాను ఆనక" అన్నాక ఇంకక్కడ నేనుండడం నాన్నకి ఇష్టం లేదని అర్థమై వెనక్కి తిరిగి నా రూంకి వచ్చేశాను.

[ఈ పార్ట్ ఆఫ్ ద స్టోరీ నేరేటెడ్ బై నాన్న]

వచ్చిన ముగ్గురబ్బాయిలు,  నాన్న, రవి మా పాత హాస్టల్ లాన్‌లో ఎదురెదురుగా కూచున్నారు. సంభాషణ అంతా నా తండ్రీ-తనల మధ్యనే....

"అంకుల్! బావున్నారా? మీ ప్రయాణం బాగా జరిగిందా?"

"అంతా బానే జరిగింది కానీ - నేనసలు ఎందుకొచ్చానంటే నీతో మాట్లాడి అసలు సంగతేంటో తేల్చుకుందామని! "

"ఏ సంగతి, అంకుల్?"

"అదే... నీ సంగతి, మా లల్లీ సంగతి... "

"ఓ అదా! చెప్పండి అంకుల్!"

"మా బాగ్గ్రౌండ్ వేరు, మీది వేరు. పైగా ఇంటికి పెద్దపిల్ల ఇది. ఇదే ఆఖరుపిల్ల అయ్యుంటే అసలాలోచించే వాణ్ణే కాదు. ఇది కాక ఇంకో ఇద్దరారాడపిల్లలకి నేను పెళ్లిళ్లు చెయ్యాల. అటువంటి పరిస్థితిలో నువ్వు ఈ డెసిషన్ తీసుకుని మీరీ పని చేస్తే  ...అసలేం అనుకుంటున్నారు? నా గురించి ఏమాలోచిస్తున్నారు మీరు? అంత పిచ్చోణ్ణనుకుంటున్నారా? చేతకాని వాణ్ణనుకుంటున్నారా? నా సంగత్తెలీదు మీకు! ఏమనుకుంటున్నారో!" - అప్పటివరకూ అణచుకున్న కోపం పొంగుకొచ్చింది నాన్నకి.

"బుజ్జాయ్ - అదే లల్లీ ... ఎప్పుడూ మీ గురించే చెప్తూ ఉంటుంది, అంకుల్! మా నాన్న మాతో ఇలా మాట్లాడతారు, ఎంతో సరదాగా వుంటారు అంటూ ఎప్పుడూ మీ కబుర్లే. మిమ్మల్ని ఇన్నాళ్లూ పర్సనల్ గా కలవలేదు కానీ ఈ రోజేదో కొత్తవాళ్లని కలిసినట్లు లేదు. మీరు నాకెప్పట్నుంచో తెల్సినవారు అన్నట్లే వుంది. మిమ్మల్ని కాదని పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే మాకు లేదంకుల్! ఎప్పటికైనా మీరొప్పుకుంటేనే - ఒప్పుకునేదాకా వెయిట్ చేస్తాం ఫర్వాలేదు"

"ఏంటి ఫర్వాలేదు? చెప్తుంటే అర్థం కావట్లేదా? మీకూ మాకూ కుదరదు. మీ ఇంట్లోనూ ఓ ఆడపిల్లుంది. ఆ సంగతి గుర్తుంచుకోవాలి ఇంకో ఆడపిల్ల గురించి ఇలా ఆలోచించే ముందు... !"

".... .... ... "  అబ్బాయి మొహంలో నవ్వు కొంచెం వెలుగు తగ్గీ తగ్గనట్లు తగ్గి మళ్ళీ వెలిగింది.

"ఏం మాట్లాడట్లేదు... ఇబ్బందిగా అనిపించిందా? నాది కూడా అదే పరిస్థితి. పిచ్చిపిచ్చి ఆలోచనలు మానుకుని  చక్కగా చదువుకోండి. ఎవరి దారిన వాళ్ళు వుండండి"


ఇలా అన్నా అబ్బాయి తొణకడు - బెణకడు. చిరునవ్వు చిలకరింపుడు ఆపడు.

"మీరెంత చెప్పినా, ఏమని బెదిరించినా నా డెసిషన్ నాదే, అంకుల్! మీరేం బెంగ పెట్టుకోకండి మా గురించి" అన్నాడు.

అంతే! ఇంక మాటలు అనడానికి, వినడానికి, వినిపించుకోలేదు అనుకోవడానికి ఏమీ లేదు. అబ్బాయిలత్రయం SVU హాస్టల్ కేసి. బాబాయి-అబ్బాయీ-ద్వయం (నాన్న-రవన్న) మా హాస్టల్ కేసి.

నాన్న, రవి నా దగ్గరకొచ్చి మా హాస్టల్ వెయిటింగ్ రూంలో ఓ అరగంట సేపు కూర్చున్నారు. వాళ్ళిద్దరికీ  నేనూ. మా నాగలక్ష్మి కలిసి మా డైనింగ్ హాల్లోంచి టీ తెచ్చి పెట్టాము.

టీ తాగి బయల్దేరుతూ నాన్న " లల్లీ! చదువు మీద concentrate చెయ్యి. ఇంకో వారంలో పొంగల్ హాలిడేస్ కదా! జాగ్రత్తగా ఇంటికొచ్చెయ్" అని మాత్రం చెప్పి రవితో కలిసి గుంటూరు తిరిగి వెళ్లారు.

ఇంకిప్పట్నుచీ నా కథ కొంచెం కుదుపులతో సాగుతుంది... ఎలాంటి కుదుపులంటే ఎండుగడ్డేసి, దానిమీద పరుపేసుకుని కూర్చున్నా అప్పుడప్పుడూ అటూ ఇటూ ఊపేసి, బండి గూడుకి తల తగిలినా బొప్పి కట్టించని గూడు కట్టిన ఒంటెద్దుబండి ప్రయాణం లాంటి కుదుపులు...

ఈ పూటకీ కబుర్లు ఆపుతూ... నాకెంతో ఇష్టమైన ఈ డిసెంబర్ 19కి నన్ను కన్నవారి - నాతో వున్న మావారి ప్రేమని తలుచుకుంటూ - వారివారి పొగడిక వాటా వారికిస్తా... ఇలా...

మా నాన్నది మాట మామిడల్లం - మనసు పటికబెల్లం - అచ్చంగా నా పోలికే :)
ఆయన మాటకి-మనసుకి బలం మాత్రం మా అమ్మ పట్టిన ఓర్పు... ఆడపిల్ల మనసులని పట్టి వారికేది ఇష్టమో తెలుసుకుని అందించగలిగే నేర్పు...

మా నాన్న పెద్దల్లుడిది మాట మధురం - మనసు మధురం - నవ్వు మధురం - లలితాపతే సకలం మధురం :)
తను నాకు నేర్పిన జీవనమంత్రం - ఓ Terzanelle రూపంలో: https://magazine.saarangabooks.com/life-is-beautiful/ 


<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>


9, డిసెంబర్ 2018, ఆదివారం

తా(నా) సంబరాల తాజా(-2)కబుర్లు - తొలినాటి whole మొత్తం టోకు talks - ఆరంభంతో అంతం

ముందటి కబుర్లు ఈ లింక్ మీద క్లిక్ చేసి చదివేసుకోండి : తా(నా) సంబరాల తాజా(-2)కబుర్లు - తొలినాటి whole మొత్తం టోకు talks - Penultimate ముచ్చట్లు


దాసరి గారి పాట వరసలో... 

దొరకక... దొరకక...  దొరకక దొరకక... దొరికిన ఛాన్సు 
దొరికీ దొరకక దొరకని ఛాన్సు 
ఒకే ఒక్క ఛాన్సు
తిరిగిరాని ఛాన్సు

... అంటూ 

పాడేసుకుంటూ రాసేయడం మొదలు పెట్టా... 
నా తానా వరసలో చివరాఖరి కబురు ... 
అంతంలో ఆరంభం రాస్తూ... 
ఆరంభంతో అంతం చేస్తూ...  

తానా వారి విందు అయింది. ఇక సాహితీ ఉపన్యాసాల వీనుల విందు కోసమని TANA Program Guide లో సాహితీ సదస్సులు 132వ నంబర్ గదిలో జరుగుతాయని రాసుంది కదా - ఆ గదిని వెతుక్కుంటూ వెళ్ళాను.



ఆ వెళ్లే దారిలో ఒక పక్కగా వేసి వున్న ఒక సోఫా మీద - అమ్మా, నాన్న, ఓ పధ్నాలుగేళ్ల తెలుగమ్మాయి - కనిపించారు. అందులో పెద్ద విశేషమేమీ లేదు కానీ - ఆ పక్కనుంచి వెళ్తున్న ఓ అమెరికన్ పెద్దాయన ఆగి మరీ "What a pretty outfit!" అని ఆ అమ్మాయి వేసుకున్న గులాబీ రంగు పరికిణీ-జాకెట్టుని మెచ్చుకుంటూ ఉంటే ఆ గులాబి-బాల Thanks చెప్తూ సిగ్గు పడడం మనోహరంగా అనిపించింది. ఆ అమ్మాయిని, తన కుటుంబాన్ని చూస్తే అమెరికాకి రావడం మొదటి సారేమో అనుకున్నాను. తానా కోసం ఇండియా నుంచి కూడా వచ్చారెవరో - ఎవరి చుట్టాలో అని కూడా అనుకున్నాను.

ఆ అమ్మాయి కళ్ళలో మెరుపుని చూస్తూ, ఆ మెరిపించిన అమెరికన్ పెద్దాయన మంచితనానికి మురుస్తూ, ఆ మురిపెపు చిరునవ్వుని మోసుకుంటూ ఒకటింపావు కల్లా 132-ప్రవేశం చేశా. 

వేదిక మీద ఓ బల్ల, ఓ నాలుగో ఐదో కుర్చీలు. వేదిక ముందు వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఓ ప్ఫదో-ప్ఫన్నెండో వరసల కుర్చీలు. ఆ కుర్చీల వరసలో చివర వరసలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న ఓ నలుగురు. అంతే! ఇంకెవరూ లేరు. 

ఆ మాట్లాడుకుంటున్న నలుగురి మాటల వల్ల నాకర్ధమయ్యిందేంటంటే వాళ్ళలో ఇద్దరు తానాకి ఆహ్వానితులు - సామల రమేష్ బాబు గారు, స.వెం. రమేష్ గారు. ఒక్క నిముషం భలే మొహమాటంగా అనిపించింది. వాళ్ళు తానాకే కాదు మా ఊరి కొచ్చిన అపురూప అతిథులు. నా అంతట నేను వెళ్లి తానా లిటరరీ కమిటీ వలంటీర్ని అని పరిచయం చేసుకోవడానికి మనసొప్పలేదు. ఎందుకూ అంటే చెప్పలేను కానీ అలా ఉట్టి చేతులతో వెళ్లాలని అనిపించలేదు. వెంటనే బయటికి వెళ్లి ఓ పది మంచినీళ్ల బాటిల్స్ పట్టుకుని లోపలికి వచ్చి ఓ అరడజను వేదిక మీదనున్న బల్ల మీద పెట్టి, మిగిలిన నాలుగూ పట్టుకుని స.వెం. రమేష్ గారి దగ్గరికి వెళ్లి నన్ను నేను పరిచయం చేసుకుని ఓ మంచినీళ్ల బాటిల్ ఆయన చేతికి అందించాను. నేను ఆయన రాసిన ప్రళయ కావేరి కథల గురించి విని వున్నాను కానీ చదవలేదు. అందుకని అసలేం మాట్లాడాలో తోచక ఆలోచిస్తూ అక్కడే నించుని వున్నాను. 

ఇంతలో అంతకు ముందు నేను బయట చూసిన గులాబీ-బాల మాతా-పిత-సమేతగా లోపలికొచ్చింది. అప్పుడు తెలిసింది ఆ అమ్మాయి కొంగునాడు తెలుగులో కథలు రాసే సంజనా పద్మం అని. అది తెలియగానే ఎంత ముచ్చటగా అనిపించిందో... తెలుగులో పట్టుమని పది కబుర్లు రాయాలంటే తెగ కష్టపడిపోతాను నేను, ఇంత చిన్నపిల్ల అంత గొప్ప కథలు భలే రాస్తోంది కదా అని! సంజనా పద్మంతోనూ, వాళ్ళమ్మగారు కవితతోనూ మాట్లాడుతూ ఉన్నాను. ఆ మాటల మధ్యలో కవితగారు TANA souvenir లో సంజనా పద్మం కథ కూడా ఉందని. తప్పక చదువుతానని చెప్పగానే ఆ పాప భలే మురిసిపోయింది - చదివి ఎలా ఉందో చెప్పమంటూ. 

ఇంతలో ఒక పెద్దాయన ఎవరో వస్తూనే - నేను పలకరించి, మంచినీళ్ల సీసా అందిస్తూ, పరిచయం చేసుకున్నానో లేదో విసుక్కున్నారు - ఏంటమ్మా! ఎవరూ లేరేంటి ఇక్కడ? ఈ నీళ్లు మేం తెచ్చుకోలేమా? - అంటూ. తర్వాత తెలిసింది ఆయన అవధానం చేయడానికి వచ్చిన నరాల రామారెడ్డి గారని. తెలుగు మాష్టారి మొట్టికాయలు ఎప్పుడూ బొప్పి కట్టవు, గట్టి మేలే చేస్తాయి అనేసుకుని, ఆయన విసుగుకి నవ్వేసుకుని - మా వాళ్ళు వస్తున్నారండి, కూర్చోండి - అని ఆయనకి చెప్పి ఇవతలికి వచ్చేసి నేనొక కుర్చీ చూసుకుని కూర్చున్నాను. 

ఇంతలో మా లిటరరీ కమిటీ నుంచి సుధాకర్ బోల్డన్ని మంచినీళ్ల బాటిల్స్ మోసుకుంటూ తెచ్చి వేదిక దగ్గరగా పెట్టారు. మిగిలిన కమిటీ మెంబర్లు పసుపులేటి రవిగారు, అమృతరెడ్డిగారు, వారితో పాటు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, వాసిరెడ్డి నవీన్ గారు వీళ్ళందరూ వచ్చేశారు. ఈ తెలుగు ప్రముఖుల రాకతో ఒక్క సారిగా వెలుగొచ్చేసింది మా 132 కి.  అందరూ కలిసి హడావిడి చేస్తూ "ఎల్లలు లేని తెలుగు" బానర్ కట్టించారు వేదిక మీద. 

నేననప్పటికే ఓ కుర్చీలో కూర్చుని వున్నాను కదా - నా వెనక వరసలో "కొత్తపాళీ" నారాయణస్వామి గారు, వారి సతీమణి సావిత్రిగారు కూర్చుని వున్నారు. అప్పటికే ఈమాట రచయితల పరిచయాల్లో నారాయణస్వామిగారి ఫోటో చూసి వున్నాను. సాక్షాత్తూ ఆయనే సతీసమేతంగా కనిపించేటప్పటికి ఇంక ఆగలేక వెనక్కి తిరిగి నన్ను నేను సావిత్రి గారికి, నారాయణస్వామిగారికి పరిచయం చేసుకుని  "నేను మీకు తెలీదు కానీ - మీరు నాకు బాగా తెలుసండి మీ బ్లాగ్ చదివాను" అని చెప్పాను సంబరంగా.

రెండు గంటలకి వక్తలందరూ వేదిక మీద, శ్రోతలందరూ వేదిక ముందు కుర్చీల్లో సర్దుకుని కూర్చున్న తర్వాత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు సభ ప్రారంభించారు. 

ముందుగా స.వెం. రమేష్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడే ముందు మార్టూరి వసంత్ నాయుడు గారు (ఈయన సంజనా పద్మం వాళ్ళ నాన్నగారు) కూడా ఒకటి రెండు విషయాలు చెప్పారు తెలుగువాణి ట్రస్ట్ గురించి. ఆ ప్రసంగ విశేషాలు ఇవీ... 
-------------------------------------------------------------------------------------------------------
స.వెం. రమేష్ గారు:
తమిళనాడులో 42 శాతం మంది తెలుగు మాట్లాడే వాళ్ళున్నారు. వాళ్లకి నోరుంది కానీ కళ్ళు లేవు. అంటే మాట్లాడగలరు, కానీ అక్షరం తెలీదు. ఇంట్లో అందరూ తెలుగే మాట్లాడతారు. మేము తెలుగువాణి ట్రస్ట్ ద్వారా పల్లెపల్లెకీ తిరిగి తెలుగు నేర్పడానికి ప్రయత్నిస్తున్నాము. ఇక్కడ తెలుగు నేర్పేవారికి తమిళం, తెలుగు రెండు భాషలూ తెలియాలి. తమిళం లిపి తెలిసినవారికి కొత్త లిపి నేర్పడం చాలా కష్టం. 

తెలుగు, తమిళం తెలిసిన 18-20సంవత్సరాల వయసున్న అబ్బాయిలు తెలుగు నేర్పుతూ వుంటారు. కానీ వాళ్ళని స్థానిక తమిళులు చాలా ఇబ్బందులకి గురిచేస్తుంటారు. ఆ పిల్లల మీద రకరకాల కేసులు పెట్టిస్తారు, కొడతారు, రాళ్లు విసురుతారు. 

మేమేమీ ఉద్యమాలు చెయ్యట్లేదు. సమానహక్కులు అడగట్లేదు. బళ్ళో తెలుగు చెప్పమని అనట్లేదు. తీరిక వేళల్లో నేర్పుకుంటామని, నేర్చుకుంటామని మాత్రమే అంటున్నా చాలా వ్యతిరేకత ఎదురవుతోంది. 

ఎప్పుడైనా బుస కొట్టడం తప్పు కాదు, కరవడం తప్పు కానీ. 

[లలిత ఉవాచ: స. వెం. రమేష్ గారి ఈ మాట వినగానే నాకు మా నాన్నమ్మ దగ్గర విన్న పాము - బుస్ కథ గుర్తొచ్చింది.]
తెలుగు వాళ్లలో చాలా పట్టనితనం వుంది. వారిలో మిగిలిన ఒకే ఒక బుస యార్లగడ్డ. తమిళనాడులో తెలుగువారిని చాలా కించపరుస్తారు. జల్లికట్టుని ఆంధ్రా గొల్టీలే  నడిపించారంటారు. కమల్ హాసన్ తమిళ పత్రికల్లో తెలుగు "బాహుబలి"ని దుమ్మెత్తి పోస్తున్నారు. మీరేమో ఇక్కడ తానాలో తమిళుల తిరుక్కురళ్, ఆండాళ్ పాశురాలు, రుక్మిణీదేవి అరుండేల్ భరతనాట్యాలు వీటన్నినీ  ప్రదర్శించడానికి వీలు కలిపించారు. 

తమిళనాడులో కులాల వారీగా వరస కట్టి తెలుగువారిని బయటికి పొమ్మంటున్నారు. నిజం చెప్పాలంటే తమిళనాడులోని దేవాలయాలన్నిటినీ తెలుగు వడ్డెరలు కట్టారు. 110 జానపద కళారూపాలున్న తమిళ సంస్కృతిలో 105 కళారూపాలు తెలుగువారివి.  తమిళం తెలుగు సంస్కృతిని మింగేస్తోంది. 

ఉడుముల పేటలో కుమ్మరులు, అరుంధతి కులస్తులు, వడ్డెర, మేదర - అందరూ తెలుగు వాళ్ళే. తమిళులకు చేతివృత్తులు, వ్యవసాయం తెలీదు. బట్టల్లేవు, చెప్పుల్లేవు, కుండల్లేవు. ఉత్పత్తి తెలుగువాళ్ళని చూసి నేర్చుకున్నారు. 

-------------------------------------------------------------------------------------------------------

ఇలా స.వెం. రమేష్ గారి ప్రసంగం చాలా ఆవేదనతో, ఆవేశంగా సాగింది. 

తర్వాత వక్త: గులాబి-బాల సంజనా పద్మం. కొంగునాడు యాసలో అమ్మభాష గురించి తన వయసుకి మించిన  పరిణతితో మాట్లాడింది ఆ అమ్మాయి. ఆ విశేషాలివీ ...
-------------------------------------------------------------------------------------------------------
కొంగునాడు, చోళనాడు, పాండ్యనాడు, మొరసనాడు, తొండనాడు ప్రాంతాల్లో ప్రతి 20 మందిలో పదిహేను మంది అమ్మభాష మాట్లాడతారు. మేము తమిళనాడులో ఉంటూ చాటుమాటుగా నైనా నేర్చుకుని అమ్మభాషలోనే మాట్లాడాలి అనుకుంటున్నాము. మాట్లాడుతున్నాము. కానీ ఆంధ్రాలో అమ్మభాషని వద్దనుకుంటున్నారు. అది తెలిసి చాలా బాధగా అనిపిస్తుంది. 
-------------------------------------------------------------------------------------------------------

[లలిత ఉవాచ: సంజనా పద్మం "గుజ్జుబొమ్మ ఎద్దుల నాయుడు అనే ఒక ఉద్యమకారుడి గురించి, అతని కూతురు కొండమ్మ గురించి చెప్తూ తమిళులు వాళ్ళిద్దరినీ ఎలా తమవారుగా చెప్పుకుంటారో, ఆ కొండమ్మని ఎలా ఒక కొండదేవతగా మార్చేశారో చెప్తూ మన భాషనే కాదు మన మనుషుల్ని కూడా తమిళనాడు తనవారిగా చెప్పుకుంటోంది అని ఎంతో ఆవేదనతో మాట్లాడింది. అసలు ఆ అమ్మాయి మాట్లాడింది విన్న తర్వాత ఆంధ్రలో తెలుగు నేర్చుకోని వాళ్ళని, తెలుగు రాదు అని చెప్పుకునే వాళ్ళని తలచుకుని తెలుగు ఇక ఎల్లలు దాటితే మాత్రమే వెలుగుతుందేమో అనిపించింది. ఇక మన భవిష్యత్తు తెలుగు నినాదం: ఎల్లలు దాటితేనే తెలుగు - ఎప్పటికైనా వెలుగు.] 

సంజనా పద్మం మాట్లాడిన తర్వాత సురేష్ కొలిచాల గారు మాట్లాడినట్లు గుర్తు. ఆయన లాప్టాప్‌లో రాసుకొచ్చిన తెలుగు భాష గురించిన ప్రసంగ పాఠాన్ని చదివారు. దాని వల్ల అదేదో తరగతి గదిలో పాఠం వింటున్నట్లుగా అనిపించింది - అంతగా ఆ స్టాటిస్టిక్సూ, లెక్కలూ మనసుకెక్కలేదు. ఇప్పుడు ఎంత గుర్తు తెచ్చుకుందామన్నా గుర్తు రావట్లేదు. Loss is mine - literally & figuratively  ప్చ్!

తర్వాతి వక్త: సామల రమేష్‌బాబుగారు. ఈయన తెలుగు భాషోధ్యమ సమాఖ్య అధ్యక్షులు, అమ్మనుడి పత్రిక సంపాదకులు. ఈయన ప్రసంగ విశేషాలు ... 
-------------------------------------------------------------------------------------------------------

ఎన్నోభాషాప్రయుక్త రాష్త్రాల్లో భాషకి మంత్రులున్నారు. మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రంలో తెలుగుకి మాత్రం మంత్రి లేరు. పాలక పక్షం, ప్రతిపక్షం కలిసి తెలుగు భాషని మోసం చేశారు. ఎన్టీఆర్, పీవీ నరసింహారావు మినహాయింపు. 

తెలుగు సంస్కృతి అంటేముగ్గు, పంచె ఇవి మాత్రమే కావు. అవి ఒక భాగం మాత్రమే. 

సంజనా పద్మం చేసేది భాషా రక్షణ. మిగిలిన వాళ్లంతా తెలుగు కోసం పాటుపడుతున్నామనేది వాళ్ల వాళ్ళ సిద్ధాంతాల కోసం, భావవ్యాప్తి కోసం తప్ప తెలుగుని రక్షించడం కోసం కాదు. 

వాడకపోతే ఏదైనా నశించి పోతుంది. "దేశభాషలందు తెలుగు లెస్స, కానీ తెలుగు less అయిపోతోంది" అనే వ్యంగ్యాలు మానేయండి. 

ముగ్గులు వేసి, అర్థం పర్థం లేని పాటలు పాడి, ఆటలు ఆడితే భాషోద్యమం కాదు. భాషని వాడాలి. శాస్త్రీయ, సాంకేతిక రంగాల్లో భాషని చొప్పించాలి. 

తెలుగు భాష లేకపోతే మీరు చూసే టీవీ ఉండదు, సినిమా ఉండదు. తెలుగుని కాపాడడానికి వచ్చినన్ని G. O లు ప్రపంచంలో ఇంకే భాష కోసం రాలేదు. 

తెలుగుని కాపాడడం ముఖ్యంగా రెండు రంగాల్లో జరగాలి. ఒకటి విద్యారంగంలో తెలుగు బోధించండం ద్వారా. రెండోది పరిపాలనా రంగంలో తెలుగుని అమలు చేయడం ద్వారా. అప్పుడే తెలుగు ఎల్లకాలమూ నిలుస్తుంది. ఎల్లెడలా వెలుగుతుంది.  

-------------------------------------------------------------------------------------------------------

సామల రమేష్‌బాబుగారి ప్రసంగం సుతిమెత్తగా కొట్టినట్లనిపించినా కొంచెం గట్టిగానే తగిలిన చెంపదెబ్బ. నాకు బాగా నచ్చింది. ఆ ఏటు తెలుగు పట్ల మన ఏమరుపాటుకి తగిన చికిత్సే!

ఆయన ప్రసంగం పూర్తయిన తర్వాత సామల రమేష్‌బాబుగారు మా అందరికీ "అమ్మనుడి"  మాసపత్రిక ప్రతులందజేశారు.


ఆ తర్వాత మా సాహిత్యకమిటీ అధ్యక్షులు పసుపులేటి రవిగారు మా కమిటీ మెంబర్ల చేత వేదిక మీదనున్న వారందరికీ TANA మెమెంటోలు ఇప్పించారు. ముందు నన్ను సంజనా పద్మంకి ఇమ్మని చెప్పారు. మళ్ళీ అంతలోనే సంజనా పద్మంకి అరుణా జంపాలగారు ఇస్తారు, మీరు సామల రమేష్‌బాబుగారికి ఇవ్వండి అన్నారు. సరే! ఎవరికి ఇచ్చినా ఎవరు ఇచ్చినా తానా-సొమ్ము :) ఇచ్చిపుచ్చుకోవటాలు ముగిశాయి.

అప్పటికే ఐదయింది. అప్పటికే పంచెకట్టుతో మూర్తీభవించిన తెలుగుదనమా అనిపించేలా మూర్తిదేవి పురస్కారగ్రహీత కొలకలూరి ఇనాక్ గారు, వారితో పాటే తెలుగు పద్య "రసధుని"కి "రజనీగంధాన్ని" అద్దిన మా గుంటూరు తెలుగు మాష్టారు పాపినేని శివశంకర్ గారు వచ్చి వున్నారు. తర్వాతి కార్యక్రమం వారిదే మరి.

వేదిక మీద - ఇద్దరు వక్తలు ఇనాక్ గారు, శివశంకర్ గారు; ఒక సభాధ్యక్షులు ఆలూరి సురేంద్ర కుమార్ గారు - ముత్యం ముగ్గురు.

వేదిక ముందు - ముందు వరసంతా ఖాళీ కుర్చీలు. ఆ తర్వాతి వరసల్లో చెవులు లెక్కేస్తే కొంచెం మర్యాదగా వుంటుందేమో - నావో రెండు, నావి కాక ఇంకో ముప్పై - వెరసి పదహారణాల తెలుగు వినడానికి అంకెలారా పదహారు జతల చెవులు.




కానీ వక్తలైన ఇనాక్ గారు, పాపినేని శివశంకర్ గారు ఈ మాత్రం నిరుత్సాహపడకుండా రెట్టించిన ఉత్సాహంతో వారివారి ప్రసంగాలు చేశారు. కొలకలూరి వారిది "నా సాహితీ యాత్ర" అయితే, పాపినేని వారిది "నా కథాయానం". ఆ రెండు ప్రసంగాలూ కూడా వారిద్దరూ తానా జ్ఞాపికకి ఏవైతే రాశారో అవే వ్యాసాలు అలాగే వేదిక మీద చెప్పారు. వాటిని ఇక్కడ రాసే కన్నా వారి మాటల్లోనే చదవగలిగితే బావుంటుంది అనిపించింది కానీ నాగ్గుర్తున్నంత వరకూ కొన్ని విశేషాలు ఇక్కడ....

-------------------------------------------------------------------------------------------------------

కొలకలూరి ఇనాక్ గారు:

చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో కనిపించిన పుస్తకమల్లా చదివేవాణ్ణి. తర్వాత చందమామ, బాలమిత్రలకు చిన్నచిన్న కథలు పంపేవాణ్ణి. కానీ ఎప్పుడూ వాళ్ళు వేసుకోలేదు. 

నా జీవితంలో చుట్టుపక్కల ఏమైనా నాకు ఇబ్బంది కలిగించేది జరిగినప్పుడు ఏమీ చేయలేక ఏడుపొచ్చేది. అలా అని ఏడవలేను కదా! పైకి నవ్వుతూ కనిపించాలి. అంత బాధని నాలో దాచుకోలేక సతమతమయ్యేవాణ్ణి. ఆ బాధని రాత రూపంలో బయటపెడితే తీరిపోయి తేలికగా అనిపించేది. నా రచన అలా మొదలయింది. 

నా "మునివాహనుడు" కథ చదివి దాశరథి కృష్ణమాచార్యులు ఎంతో మెచ్చుకున్నారు. 

-------------------------------------------------------------------------------------------------------

పాపినేని శివశంకర్ గారు:  

నా బాల్యం నెక్కల్లు అనే గ్రామంలో హరికథలు, బుర్రకథలు వింటూ, బ్రహ్మంగారి నాటకాలు చూస్తూ, పల్లె పైరుల మధ్య హాయిగా సాగింది. హైస్కూల్లో పద్యాల పోటీ పెడితేమొదటి బహుమతి వచ్చింది. అప్పుడు "పిల్లల టాగూరు" అనే పుస్తకం ఇచ్చారు నాకు. పదో తరగతిలో రవీంద్రుడి గీతాంజలి అర్థం కాకపోయినా చదివేశా. 

మా ఊరి గ్రంథాలయంలో వున్న చందమామ మొదలుకొని టాగోర్, శ్రీశ్రీ, శరత్ - అక్కడ వున్న పుస్తకాలన్నీ చదివేశా. నాకు నేనే పద్యాలల్లటం, కథలు రాయటం మొదలు పెట్టాను. నన్ను మా హైస్కూల్లో  "పిల్లకవి" అని పిలిచేవారు. 

వాసిరెడ్డి నవీన్ గారితో కలిసి ఒక ఏడాదిలో వచ్చిన కథలన్నీ చదివి అందులో కొన్ని మంచి కథలతో  ప్రతి ఏడాదీ కథాసంకలనాలు ప్ర చురిస్తున్నాము. 

-------------------------------------------------------------------------------------------------------

నిజంగా చెప్పాలంటే ఇనాక్ గారు, శివశంకర్ గారు ఇంకా చాలా గొప్పగొప్ప విషయాలు చెప్పారు. ఈ కబుర్లు తానా సిరీస్ మొదలు పెట్టిన కొత్తలో రాసి ఉంటే అందులో ఒక వంతైనా రాయగలిగి ఉండేదాన్ని. ఇప్పటికి ఇంతే మరి - మర్చిపోయాను చాలా విషయాలు. ఎక్కడైనా TANA-2017 జ్ఞాపిక upload చేశారోమో కనుక్కుని ఆ pdf లింకులు ఇక్కడ చేరుస్తాను.

మొదటి రోజు సాహితీ ప్రసంగాలు అయిపోగానే అక్కడ పుస్తకప్రదర్శనలో పాపినేని శివశంకర్ గారు రాసిన "తల్లీ! నిన్ను దలంచి...", "రజనీగంధ" అనే పుస్తకాలు తీసుకున్నాను.

కొలకలూరి ఇనాక్ గారి దగ్గరికి వెళ్లి పరిచయం చేసుకుని మా ఇంటికి తప్పకుండా రావాలని బదరి మాటగా, నా మాటగా కూడా చెప్పాను.

ఇక్కడికి నా TANA కబుర్ల సిరీస్ సమాప్తం!

నేను ఈ సిరీస్ మొదలు పెట్టినప్పుడు చెప్పినట్లే ఇదే ముందూ-వెనకలుగా రాసిన సిరీస్ (Memento అని ఇంగ్లీష్ సినిమాల అదే మన గజిని సినిమాలా...). అందుకని దీని తర్వాత ఏం జరిగిందో తెల్సుకోవాలంటే... ఈ కింది లింక్ మీద క్లిక్కుడి!

తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి తొలిసంజ - అష్టావధానం-ఉపోద్ఘాతం

తానా తెనుగు తాన, చానా మురిసిన నేనననా,  అమ్మనుడిన ఓ నెనరు?! 

తపమేమి చేసితినో ...
తానా నెపమున
తనివి తీర
తెనుగు వాగున
తేనె మునకల మునిగితి తేలితి

తపమేమి చేసితినో ...
ఘనమైన ఒజ్జల చేరి
పలుకు పటిక బెల్లపు
తునకల నేరితి
వారి కూర్మి ప్రేమల బొందితి

తపమేమి చేసితినో ...
ఏ తెలుగుల తపమేమి చేసితినో ...
నే యే తెలుగుల తపమేమి చేసితినో ...
వెలుగు తెలుగుల జిలుగు నొందితి 

తా. క.  or తోక : నా ఈ తానా కబుర్లు చదివే మీరందరూ ఒకటి కనిపెట్టారా? మాది లిటరరీ ఫోరమ్ (Literary Forum) కాదండోయ్... లిటరసీ ఫోరమ్ (Literacy Forum) - సాహిత్యంలో ఓనమాలు నేర్చునే నాలాంటి వాళ్లకు సరిగ్గా సరిపోతుంది కదూ... !

చివరిగా ఒక్క మాట, ఎప్పుడో ముందే చెప్పి ఉండాల్సిన మాట : 2017సెయింట్ లూయిస్ తెలుగు ఎసోసియేషన్ సంక్రాంతి సంబరాలకి వెళ్ళినప్పుడు ఎదురొచ్చి "లలిత గారూ!మన ఊళ్ళో జరగబోయే తానా సాహిత్య కమిటీలో మీరు పాల్గొనాలండి" అని ఆహ్వానించిన పసుపులేటి రవి గారికి, వారికి నా పేరు నందించిన శ్రీకాంత్ సరస్వతుల గారికి బోల్డన్ని ధన్యవాదాలు. అలాగే తానా జ్ఞాపిక కోసం ఎన్నో సార్లు జ్ఞాపకం చేసి నా చేత ఎల్లలు దాటే - ఎల్లెడలా వెలిగే  వ్యాసం రాయడానికి ప్రోత్సహించిన వల్లూరుపల్లి వెంకటేశ్వర రావు గారికి, అడుగడుగునా నన్ను మా సెయింట్ లూయిస్ ఆస్థాన రచయిత్రి అని ఆత్మీయంగా గుర్తు చేసుకునే అమృత రెడ్డి గారికి, నేస్తులైన వసుధ, కమల బాంధవిలకు, నేనేం రాసినా మెచ్చుకునే కామేష్ కడియాల గారికి, గిరిధర్ గొట్టిపాటి గారికి, అయినాపురపు శ్రీనివాస్ గారికి, మా "నానీల" విజయశ్రీ కుప్పా గారికి ఇంకా బోల్డన్ని ధన్యవాదాలు. అడగ్గానే అష్టావధానం రికార్డింగ్ షేర్ చేసిన శాస్త్రి కూచి గారికి, కమిటీలో సహకరించిన కుమార్ రెడ్డి గారికి, సుధాకర్ కల్వ గారికి  కృతజ్ఞతలు. వీరందరి సహకారం లేనిదే నా ఈ తానా-సిరీస్ లేనే లేదు.

2, డిసెంబర్ 2018, ఆదివారం

తెలుగు వెలుగు - 4 - "అ" పాట



అల్లిబిల్లి పాట - అచ్చతెలుగు పాట
అమ్మనుడి పాట - కమ్మనైన పాట
ఆడేపాడే పాపలు - ఆడుతు పాడుతు - ఆ-ఆలు నేర్చే పాట 
పాపలూ - పాపలూ! పాటను పాడండి...
పాడుతూ... పాడుతూ... పొడుపుకథలని విప్పండి

ఓనమాల తర్వాత ఏవి వచ్చు?
పిల్లల నెవరు ప్రీతితో పెంచు?
తమ్ముడున్న బాబు ఎవరు?
చెల్లెలున్న పాపని ఏమంటాం?

సముద్రంలో లేచునట ఇది
అన్నిట్లో సగమట ఇది
పొలములో దున్నునట ఇది
ఒక కాపే కాయు చెట్టు ఇది

ఇదీ ఏదీ కానిదట ఇది
ఇక్కడా ఎక్కడా కానంటోంది ఇది
ఇన్నీ కొన్నీ కానివట ఇవి
ఎందరో ఇందరు కలిస్తే అవుతారట వీరు

బంగారానికి సింగారమైన పేరు ఇది
చెవులకి వినికిడి కూర్చునిది
అదుపులేని ఆటలాడ వచ్చునిది
ఆకలేస్తే అడుగు - అమ్మ పెట్టునిది

ఆదిశక్తి మరో పేరు ఇది
ఆవుదూడ అరుపు ఇది
క్షరము కానిది వరము భాషకిది
ఈ పొడుపు కథల జవాబులన్నిటి మొదలిది -
చెప్పుకోండి ఏంటో అది!

(జవాబులు: అఆలు, అమ్మా-నాన్నలు, అన్న, అక్క, అల, అర, అరక, అరటి, అది, అక్కడ, అన్నీ, అందరు, అపరంజి, అలికిడి, అలుపు, అన్నం, అంబ, అంబా, అక్షరం, అ)