దేశీ మజిలీ కబుర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
దేశీ మజిలీ కబుర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, జులై 2018, శనివారం

ఆ గాలి... ఆ నేల....ఆ ఊరు...(దేశీ మజిలీ కబుర్లు) - 2 - ఈవల ఓ చిరుమజిలీ



ముందటి కబుర్లు ఇక్కడ క్లిక్ చేసి చదవండి : ఆ గాలి... ఆ నేల....ఆ ఊరు...(దేశీ మజిలీ కబుర్లు) - 1 - వీడు వీడాం!

గాలి రెక్కలమీద
నీటి అలలపై ఎగిరి
ఆ నేల చేరేలోగా
ఈవల ఓ చిరుమజిలీ - బర్క్‌లీ.

అక్కడ గడిపిన కాలం  - నాలుగు రోజుల, రెండర-రోజులు.
ఆ సమయంలో జరిగిన విశేషాలు ఏంటంటే...

మే 12 పొద్దున్నే బర్క్‌లీలో వున్న చిన్న ఉడిపి హోటల్లో ఇడ్లీ-ఖాదనం. 

తొమ్మిదిన్నరకి కాలిఫోర్నియా మెమోరియల్ స్టేడియంలో జరిగిన UC Berkeley 150వ గ్రాడ్యుయేషన్ సెరమనీలో పాల్గొన్న 5,000 మంది పిల్లలు - చుట్టూ కూర్చుని చూసిన 20,000 మంది పిల్లల తాలూకు కుటుంబాలు, స్నేహితులు - ఆ లెక్కలోనే చేరిన అన్నజింక, మేం ముగ్గురం.

స్టేజ్ మీంచే ఇచ్చేశాం అన్న డిగ్రీలు - అది వినగానే టోపీలెగరేసిన పిల్లలు.





టోపీలెగరేసిన తర్వాత సుహాస్ వాడి ఫ్రెండ్స్‌తో  వెళ్ళిపోయాడు. మేం ముగ్గురం కూడా నడుచుకుంటూ వెళ్లి క్యాంపస్‌కి దగ్గరలోనే భోంచేసేసి మా విడిదికి వచ్చేశాం.

సాయంత్రం మళ్ళీ బర్క్‌లీకి వెళ్లి అన్నజింకని, వాడి ఫ్రెండ్ కెవిన్‌ని తీసుకుని ఓ అరగంట డ్రైవ్ చేసుకుంటూ శరవణ భవన్‌కి వెళ్ళాం అందరం. క్రితం ఏడాది ఏప్రిల్లో వాడి పుట్టిన రోజుకి బర్క్‌లీకి వచ్చినప్పుడే సుహాస్ చెప్పాడు - ఎప్పుడైనా ఒకసారి కెవిన్‌ని ఇక్కడికి తీసుకొద్దామని. కెవిన్ ఇడ్లీలు, పొంగల్, దోసెలు అన్నీ ooh! - aah! అనుకుంటూ మంచిగా తిన్నాడు. వాడికి అవి నచ్చినందుకు మురిసి - మేము ఆర్డర్ చేసుకున్న పదార్థాలు కూడా వాడికి కొసరి కొసరి రుచి చూపిస్తూ - కబుర్లు చెప్పుకుంటూ భోంచేసేసి వాళ్ళిద్దరినీ బర్క్‌లీలో వాళ్ళ అపార్ట్‌మెంట్ దగ్గర దింపేసి వచ్చేశాం. అప్పుడే చెప్పాడు సుహాస్ మళ్ళీ 15 సాయంత్రం దాకా ఇంక మా దగ్గరికి రానని - ఫ్రెండ్స్ దగ్గరే ఉంటానని. సరే! పాపం! మళ్ళీ అందరూ తలా ఒక చోటికి వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పటికి కలుస్తారో - అని మా కాలేజ్ చివరి రోజులు తలుచుకుంటూ - బుజ్జిజింకతో కలిసి మా రూంకి వచ్చేశాం.


మే 13 ఆదివారం.  పొద్దున్నే బదరి, నేను నడుచుకుంటూ వెళ్లి పక్కనే వున్న బర్గర్ కింగ్‌లో నాకిష్టమైన హ్యాష్-బ్రౌన్స్ తినేసి వచ్చాం. నాకైతే బయటికి ఎక్కడికీ వెళ్లాలని లేదు - చాలా కాలం తర్వాత ఉద్యోగం నుంచి దొరికిన ఆటవిడుపు. విశ్రాంతి తీసుకోవాలని వుంది. అందులోనూ సెయింట్ లూయిస్ దాటితే తగ్గుతుందన్న నా స్ప్రింగ్ అలెర్జీ తగ్గనే లేదు. అలాగే వుంది - కళ్లలో ఇసక వేసినట్లు దురద, మంటలు. కానీ పాపం- బుజ్జిజింకకి బోర్ కొడుతుంది కదా - అందుకని దగ్గర్లోనే వున్న Mystery Spot చూద్దామని వెళ్ళాం మధ్యాహ్నం భోంచేసి రెండింటికల్లా.  తీరా అక్కడికి వెళ్ళాక తర్వాతి టూర్ సాయంత్రం ఏడింటి దాకా లేదని చెప్పారు. అంతసేపు అక్కడ కూర్చోలేక అక్కడి నుంచి తిరిగొస్తూ దార్లో  ఓరుగంటి వారి ఇంట ఆగాం.

అక్కడే అమెరికా సందర్శనానికి వచ్చిన ఓరుగంటి రమేష్ వాళ్ళ అమ్మగారు, నాన్నగార్లని కలిశాం.రమేష్ వాళ్ళ నాన్నగారు - రాంబాబు మాష్టరుగారు - ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రపతి పురస్కార గ్రహీత. ఆయన మా నాన్నకి బాల్యమిత్రులు కూడా. నేను, బదరి ఆయనని చూడడం, మాట్లాడడం అదే మొదటిసారి. చాలా ఆత్మీయంగా పలకరించి ఆదరంగా మాట్లాడారు. చివరిలో వచ్చేముందు నాతో అన్నారు - బదరి academically చాలా తెలివైనవాడు - అని. అది నా మేలు-సగానికి ఒక మంచి మాష్టారి నుంచి దొరికిన బహు మంచి ప్రశంస.

మాటల సందర్భంలో రమేష్ తమ్ముడు ప్రసాద్ అక్కడికి దగ్గరగా వున్న థియేటర్లో 'మహానటి' సినిమా ఉందని చెప్పారు. అది విన్న వెంటనే నా వైపు చూసిన బదరీకి నా కళ్ళ-మంటల వెనకాల మెరుపులు మెరిసినట్లనిపించిందో ఏమో వెంటనే ఫోన్ లోంచే మూడు టికెట్లు బుక్ చేశారు. అప్పుడెప్పుడో ఫిబ్రవరిలో అ! చూసి అడలిపోయి ఇంక ఈ ఏడాదికి ఇదే ఆఖరి సినిమా అనుకున్న తర్వాత రంగస్థలం వచ్చినా అందరూ అద్భుతంగా వుంది అన్నా - "అబ్బే ! మేం చూడం గాక చూడం" అంటూ మా ఒట్టుని గట్టిగా పట్టుకుని అట్టేపెట్టేసుకున్న మేము  - "ఈ ఒక్కసారికే , సరేనా!" అని ఒకరికొకరం చెప్పుకుని ఇప్పుడా ఒట్టుని తీసి గట్టు మీద పెట్టి ఆరున్నరాటకి "మహానటి" చూసేద్దామని భోజనం కూడా చేయకుండా వెళ్లిపోయాం.

మహానటి ఒక మంచి ప్రయత్నం. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఎప్పుడో చదివిన పల్లవి అనే ఆవిడ రాసిన "మహానటి సావిత్రి - వెండితెర సామ్రాజ్ఞి" అన్న పుస్తకమే గుర్తుకొచ్చింది. దానికి ముందు మాట రాస్తూ రావూరి భరద్వాజగారు - "చెప్పింది బావుంది. చెప్పవలసింది ఇంకా ఉంది! ..... కొందరు వ్యక్తులను గురించి, కొన్ని కొన్ని అంశాలను గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా ఇంకా తెలుసుకొనవలసింది మిగిలి పోతూనే ఉంటుంది. తెలిసిన అన్ని అంశాలను గురించి చెప్పలేం. తప్పనిసరిగా చెప్పవలసివస్తే ఆయా అంశాలలోని తీవ్రతను, విషాదాన్ని బాగా తగ్గించి, బాగా బాగా తగ్గించి చూచాయగా మాత్రమే చెప్పవలసి వస్తుంది!" - అంటూ రాసిన వాక్యాలు మహానటి సినిమాకి సరిగ్గా సరిపోతాయి.

మహానటి నుంచి కొన్ని కంట్లో నలుసులు, చెవిలో జోరీగలు: 

సావిత్రి, జెమినీ గణేశన్ చాముండేశ్వరి ఆలయంలో పెళ్లి చేసుకుని ఆ దేవీ విగ్రహం చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు హీరో కాలి బూట్లు, హీరోయిన్ కాలికున్న చెప్పులు - అవి మరి నిజంగా ఉన్నాయో, లేకపోతే మరి అవి కళ్ళ-మంటల వల్ల సగమే తెరుచుకుని చూస్తున్న నా కన్ను చెదరడం వల్ల ఉన్నట్లు కనిపించాయో - ఏదేమైనా కానీ ఏది కరెక్టో రుజువు చేసుకోవడానికి ఇంకోసారి ఆ సినిమా చూసే ఓపిక లేదు.

సినిమాలో సావిత్రి నటించిన తమిళ సినిమాలలో డైలాగులు తమిళంలోనే వినిపించిన దర్శకులు - మిస్సమ్మ తమిళ్ వెర్షన్ జెమినీ గణేశన్, సావిత్రి చేశారని చెప్తూ "రావోయి చందమామా" అన్న తెలుగు పాట వినిపించారు - మళ్ళీ సినిమా చివర్లో తమిళ పాటే వేసినట్లున్నారు.

సినిమాలో చిన్నపాత్ర అయినా సమంత చేసింది - చాలా గొప్ప విషయం. కానీ ఆ జర్నలిస్ట్ పాత్ర కాకుండా షాలినీ పాండే చేసిన సావిత్రి స్నేహితురాలు సుశీల పాత్ర అయితే చేసేదా?! 

ఇంతకీ ఈ సినిమా గురించి సినిమాని తీసిన దర్శకులు, నిర్మాతలు సావిత్రి జీవితం గురించి చేసిన రీసెర్చ్ ఏంటబ్బా?! అంతా అక్కడా ఇక్కడా విన్నదేగా! పల్లవిగారి పుస్తకంలో వున్నదేగా!

ఇడ్లీకి ముక్కూ- చెవులూ పెట్టినట్లుండే జెమినీ గణేశన్‌ని  దుల్కర్ సల్మాన్ లాంటి అబ్బాయిలా చూపించడానికి మనసెలా ఒప్పిందబ్బా?!

అసలు నేను సావిత్రి సినిమాలు కొన్నే చూడగల(గలిగా)ను - కన్యాశుల్కం, గుండమ్మ కథ, అప్పు చేసి పప్పు కూడు, మిస్సమ్మ, మాయాబజార్. ఆ సినిమాల్లో మాత్రమే ఆవిడ ఏక్షన్, దానికి తగినట్లు మిగిలిన వాళ్ళ రియాక్షన్ నచ్చుతుంది నాకు.

ఒకసారి ఇలాగే "ఆడవే జలకమ్ములాడవే" అన్న పాట నచ్చిందని అది "విచిత్ర కుటుంబం" అనే సినిమాలోది అని తెలిసి చూద్దామని మొదలుపెట్టి ఒక పది పన్నెండు నిముషాల తర్వాత ఎన్టీఆర్ సావిత్రిని సెకనుకొకసారి "ఏంటే, ఏమే" అనడం వినడం నావల్ల కాక - అందులోనూ ఆవిడ మీదమీదకెళ్తూ అన్న ఒక డైలాగు - "ఏంటే నువ్వనేది? ఒట్టి మట్టి బుర్ర. అందుకే ఒళ్ళు పెరిగి బుర్ర చిన్నదైపోతోంది - భూతంలా" - అది  విన్న వెంటనే ఆపేశాను. ఆ సినిమా డైరెక్ట్ చేసిన K.S. ప్రకాశరావుని తెగ తిట్టుకున్నాను.

మహానటి చూసినప్పుడు మళ్ళీ ఈ విషయాలన్నీ ఒకసారి మళ్ళీ తలుచుకున్నాం నేను, బదరి. అప్పుడే అనుకున్నాం - ఈ సినిమా ఒక డాక్యుమెంటరీలా వుంది - కానీ ఒక మంచి ప్రయత్నం. ఇలాంటి వాటిని చూడకపోతే డబ్బులు రాకపోతే  నిరుత్సాహపడి ఈ మాత్రం కూడా తీయరు. తినగ తినగ వేము తీపి - కనగ కనగ సినిమా వాసి అనేసుకుని మహానటికి మావంతు ప్రోత్సాహమిచ్చేశాం - ముందే చెప్పానుగా - ఈ ఒక్కసారికీ 2108లో థియేటర్‌కి వెళ్లి సినిమా చూడబోమన్న ఒట్టు తీసి గట్టునెట్టి మరీ!

ఇంక మే 14న చేసిందేం లేదు - "అంజప్పర్" ఎక్కడుందో వెతుక్కుని వెళ్లి అక్కడభోజనం చేసి రావడం, హోటల్ రూంలో నేనూ, బుజ్జిజింకా కబుర్లు చెప్పుకోవడం తప్ప. ఆ రోజు హోటల్ పక్కనే AMC థియేటర్లో వున్న Avengers కి బుజ్జిజింక కోసం వెళ్దామనుకుంటే వాడేమో రేపు అన్న వచ్చాక అన్నతో కలిసి చూద్దాం అన్నాడు.


మే 15 న Hearst Greek Theatre లో జరిగిన College Of Engineering గ్రాడ్యుయేషన్ సెరమనీ - పేరుపేరునా పిలిచి స్టేజ్ మీద డిగ్రీలు ఇచ్చారు.





సాయంత్రానికి సుహాస్ వాడి రూమ్ ఖాళీ చేసి అక్కడున్న సామానంతా రెంటెడ్ స్టోరేజ్‌లో పెట్టుకుని, వాడు  ఇండియాకి తెచ్చుకునే లగేజ్ తీసుకుని మాతో హోటల్‌కి వచ్చేశాడు. అప్పటికే చాలా అలిసిపోయి ఉన్నాడేమో తొందరగా పడుకుండి పోయాడు. వాడితో కలిసి సినిమా చూద్దామనుకున్న బుజ్జిజింక వాడి మీద చెయ్యేసి వాడూ పడుకున్నాడు.

మే 15 తో మా చిరుమజిలీ చివరిరోజుకొచ్చింది. మర్నాడు 16 న మా ప్రయాణం.
ఇప్పటికీ కబుర్లు సరి - ఆ కబుర్ల-కొనసాగింపు ఇంకోసారి.

ఆ హోటల్ కిటికీలోంచి నేను తీసుకున్న బే-బ్రిడ్జ్ ఫోటోలు:

ఒకటి పగటి వెలుగుది...



ఇంకోటి రాత్రి జిలుగుది...










<< మరిన్ని దేశీ మజిలీ కబుర్లు తరవాతి పోస్టులో >>


 .

24, జూన్ 2018, ఆదివారం

ఆ గాలి... ఆ నేల....ఆ ఊరు...(దేశీ మజిలీ కబుర్లు) - 1 - వీడు వీడాం!

2017 ఆగస్టులో మొదలు - ఇండియా వెళ్దాం అన్న ఆలోచన. కానీ పడలేదు. అన్నజింక ఆగస్టులో వెళ్తే రెండు వారాలు మాత్రమే వుంటాను అన్నాడు. ఇంక బుజ్జిజింక అయితే ఆగస్ట్ 21, 2017 న ఏర్పడబోయే సంపూర్ణ సూర్యగ్రహణం చూడడానికి ప్రపంచంలో ఎక్కడ వున్నా సెయింట్ లూయిస్‌కి తిరిగి రావాల్సిందే అని చెప్పనే చెప్పేశాడు.

అలా ఆ ఆగస్టు ప్రయాణం వాయిదా పడింది. డిసెంబర్ సెలవుల్లో అన్నజింక జపాన్ వెళ్లి వచ్చాడు. వస్తూనే వాడి undergrad గ్రాడ్యుయేషన్ సెరమనీ తేదీలు చెప్పాడు మే 12 (యూనివర్సిటీ లెవెల్లో), మే 15 (ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ లెవెల్లో).

అప్పుడు మొదలయింది - బదరి పంచమాస-ప్రయాణ-ప్రణాళిక. అదేంటంటే మే 11కల్లా బయల్దేరి కాలిఫోర్నియా వెళ్ళి అన్నజింక గ్రాడ్యుయేషన్ చూసేసుకుని అట్నుంచటే ఇండియా వెళ్ళాలీ అని. అలా చేస్తే సెలవులు కలిసి వస్తాయి అని. అనుకున్నదే తడవు కాలిఫోర్నియాకి, అక్కణ్ణుంచి హైదరాబాదుకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేశారు.

ఆ తర్వాత ఇండియాలో ఉండబోయే నాలుగు వారాలు ఎలా ప్లాన్ చేశారంటే - నేను చూడాలనుకున్న పెద్దలనూ, వెళ్లాలనుకున్న ప్రదేశాలనూ, కలవాలనుకున్న స్నేహితులనూ దృష్టిలో పెట్టుకుని 95 శాతం ట్రిప్పుని నాకనుగుణంగా ఉండేలా.

ఇంతకు ముందు ఇండియా వెళ్లి తిరిగి వచ్చిన ప్రతిసారీ 'అరె! ఆ వూరు వెళ్ళలేదు' అనో, 'అయ్యో-వాళ్ళని పలకరించలేదు' అనో ఏదో ఒకటి మిస్ చేశాను అన్న బాధ ఉండేది. అందుకే ఈసారి బదరి ముందే చెప్పారు - 'ఏ ఊరు వెళ్ళాలో, ఎవరిని కలవాలో అన్నీ ముందే రాసుకుందాము - దాని ప్రకారమే ప్రయాణాలు ప్లాన్ చేసుకుందాము. ఈసారి వెనక్కి వచ్చాక నువ్వు గడిచిపోయిన రోజుల్ని తలుచుకుని హాపీగా ఉండాలి తప్పితే బెంగ పెట్టుకోకూడదు' అని. అలా చెప్పడమే కాదు అన్నట్లుగానే ట్రిప్ మొత్తాన్ని ఒక స్ప్రెడ్‌షీట్‌లో స్టార్టింగ్ & ఎండ్ పాయింట్స్ - బ్రేక్‌ఫాస్ట్ ఎక్కడ, లంచ్ ఎక్కడ, నైట్‌హాల్ట్ ఎక్కడ - వెళ్లిన చోట ఎవరిని కలవాలి - ఇలాంటివన్నీ రాసి ఒక కాపీ నాన్నకి, ఒక కాపీ బాలాజీకి, ఒక కాపీ మా మరిది విజయ్‌కి మెయిల్ చేశారు. ఒక రకంగా మా ఇండియా ట్రావెల్-2018 ఒక డిజైనర్-ట్రావెల్ - డిజైన్డ్ బై బదరి.

అలా తయారు చేసుకున్న ప్రయాణ-ప్రణాళికను బట్టి ఇండియాలో మేము వెళ్లే ఊర్లలో వుండే వాళ్లకి మేమొస్తున్నట్లు చెప్పి - వీలైతే కలుద్దామని ముందే చెప్పి ఉంచాము. అందులో భాగంగా జూన్ 2వ తారీఖుకి అన్నపూర్ణమ్మగారు గణపవరంలో వుంటారని అపర్ణా మెహర్‌తో అడిగి confirm చేసుకున్నాను. జూన్ 3 న టంగుటూరులో స్నేహితులని కలవాలని వస్తున్నామని వీలైనంత మందికి చెప్పమని హరికి చెప్పాను. హరికి చేసినప్పుడే ఒంగోలులో పేరున్న డాక్టరు, నాకు చిన్ననాటి స్నేహితురాలు కృష్ణకుమారికి (కృష్ణ), పిల్లలకి పాఠాలు చెప్తూ వారి భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తున్న ఉపాధ్యాయినులైన నా ఒకప్పటి సహాధ్యాయినులు ఈశ్వరమ్మ, ఎలిజబెత్, ఇందుమతిలకూ ఫోన్ చేసి చెప్పాను - జూన్ 3 కి టంగుటూరులో కలుద్దామని. ఇంకా పూర్ణశ్రీ, పుట్టా శ్రీనివాసులకి కూడా ఫోన్ చేసి చెప్పాను.

ఇందుమతి టంగుటూరు రాలేనని చెప్పింది. కృష్ణ అదేరోజు వాళ్ళమ్మాయికి విజయవాడలో JIPMER exam ఉందనీ - సాధ్యమైనంతవరకూ సాయంత్రానికైనా రావడానికి ప్రయత్నిస్తానని చెప్పింది. 

అలాగే అపర్ణకి ఫోన్ చేసి ఈసారి బెంగళూరు రావడం కుదరదని చెప్తే - నీ ట్రావెల్ ప్లాన్ చెప్పు. వీలు చేసుకుని నువ్వున్న చోటుకే నేనొస్తాను - అంది. అలా అయితే మేమిద్దరం ఎక్కడ కలవాలో ఇండియా చేరాక మాట్లాడుకుందాము అనుకున్నాము.

మేము నలుగురం (బదరి, నేను, బుజ్జిజింకలు) కలిసి ఇండియా వెళ్లి 10 ఏళ్ళు అయింది. ఈ సారి ట్రిప్ ముఖ్య ఉద్దేశ్యం పెద్దవాళ్ళని చూడడంతో పాటు - బదరి, నేను చిన్నప్పట్నుంచి పోస్ట్-గ్రాడ్యుయేషన్ దాకా చదివిన స్కూళ్ళు, కాలేజులు పిల్లలకి చూపించాలని. అందులో భాగం గానే గుంటూరు, గణపవరం, టంగుటూరు, తిరుపతి వెళ్లాలని అనుకున్నాము. తీరా తిరుపతి ప్లాన్ లోకి వచ్చేటప్పటికి అన్నజింక కోసం అమ్మ చిన్నప్పుడు వాడెత్తు పటికబెల్లం ముడుపుగా ఇస్తానని తిరుపతి వేంకటేశ్వర స్వామికి మొక్కిన మొక్కు జ్ఞాపకం వచ్చింది. పైగా అత్తయ్య కూడా గుర్తు చేశారు ఫోన్ చేసినప్పుడు. దాంతో అందరం కలిసి వెళ్దామని - చిన్నా పెద్దా అందరితో కలిపి 18 మందితో తిరుపతి ప్రయాణం ప్లాన్ చేశాము. దర్శనం ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే ప్రస్తుతానికి మూడు వందల రూపాయల దర్శనం బాగానే వుంది - అది బుక్ చేసుకోమని బాలాజీ చెప్పారు. అదే చేశాము. తిరుమలలో ఉండడానికి గెస్ట్-హౌస్ బాలాజీ బుక్ చేస్తానని చెప్పారు. ఎందుకైనా మంచిదని హనుమాన్‌కి ఫోన్ చేసి అడిగాను - ఒక మూడు రూములు ఎక్కడైనా దొరుకుతాయా అని. వెంటనే - అక్కా! నువ్వంతగా అడగాలా అని - వాళ్ళ పుష్పగిరి మఠం తరఫున ఒక మూడు గదులు బుక్ చేశాడు. 

మా ప్లానుని బట్టి ఇండియాలో బస్సులు, ట్రెయిన్లు ఎక్కడం కుదరదని - వెళ్లిన ప్రతిచోటా టాక్సీ మాట్లాడుకుందామని ముందుగానే అనేసుకున్నాము.

ప్రయాణం హడావిడి ఏప్రిల్ నుంచి మొదలయింది. ఇండియా నుంచి ఎవ్వరూ ఇది కావాలని అడగలేదు. పైగా అన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి - మీరు రండి చాలు అన్నారు. పిల్లలకి చాకొలెట్స్, మొట్టమొదటిసారిగా చూడబోతున్న బుజ్జి జైత్రకి ప్ర్రాక్స్, బొమ్మలు - ఇలా ఏవో చిన్నపాటి షాపింగ్ చేశామంతే. అయినా ఏంటో హడావిడి - ఎప్పుడూ బయటికీ, ఇంట్లోకి తిరుగుతున్నట్లే ఉండేది.

ఈలోగా స్ప్రింగ్ అలెర్జీస్ మేమూ నీతో వస్తామంటూ తయారు - ముక్కు, కళ్ళు సొంతం చేసేసుకుని.

అప్పటికి పదమూడేళ్ల నుండి వేసిన ప్రతి మొక్కా జింకలు తినేస్తున్నాయని ఇంటి ముందు చిన్నపాటి తోట కూడా పెంచని మేము - ఈ ఏడాది ఎలాగైనా కొన్ని deer-resistant మొక్కలు వేసి చూద్దామనుకుని ఇంటి దగ్గరే వున్న Matt అనే అతనితో ల్యాండ్-స్కేపింగ్ చేయిద్దామని అనుకున్నాము - అది కూడా మా ప్రయాణపు చివరి నిముషం దాకా సాగింది. అదొక హడావిడి. 

ఈ సందడిలో ఇంకా సందడి ఏంటంటే ఆఫీసులో జరిగిన రీ-ఆర్గ్. మారిన టీములు. వెళ్ళేలోగా పూర్తి చేయాల్సిన డాక్యుమెంట్లు.

అంతకన్నా మహా సందడి - మేము ఇండియాలో అడుగు పెట్టే సమయానికి పూర్తయి బుక్ చేతికి రావాలి అని ముచ్చటపడి బదరి ప్లాన్ చేసిన నా బ్ల్లాగ్-బుక్ ప్రింటింగ్. దానికోసం మేమిద్దరం - ప్రయాణపు హడావిడి, ఆఫీస్ పని ఒత్తిడి మధ్య దొరికిన ప్రతీ నిముషం నా బ్లాగ్-బుక్ ఎడిటింగ్ కోసం పని చేశాం.

ప్రయాణానికి ముందు పెట్టాల్సిన అప్పగింతలు - అంటే నా వంటింటి-కల్పభూజమైన కరివేపాకు మొక్క, అప్పుడే మొలక-నవ్వులు రువ్వుతున్న తులశమ్మ - రెంటినీ నా వాకింగ్-నేస్తం హేమకి అప్పజెప్పాను. ఇంట్లో వున్న మనీ-ప్లాంట్, అలో-వెరాలకి ఐదు వారాలకి సరిపడా నీళ్లు పోశాను.

అనుకున్నట్లుగా మే 11 న మా ఆస్థాన-క్యాబ్ డ్రైవర్ ఎఫిమ్ చోదనంలో - ముగ్గురు మనుషులు (బదరి, నేను, బుజ్జిజింక), మూడ్రెళ్ళారు సూట్కేసులు, రెండు క్యారీ-ఆనులతో సెయింట్ లూయిస్ ఎయిర్-పోర్ట్ చేరి విమానమెక్కి సాయంత్రానికి ఓక్‌లాండ్-కాలిఫోర్నియా చేరాము. అన్నజింక వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు. మా అంతర్జాతీయ-ప్రయాణపు సామాను పట్టగలిగే, ఇంకొంచెం పెట్టగలిగే అంత రథాన్ని రెంట్ చేసుకుని ఎమరీవిల్‌లో వున్న - ముందుగానే బుక్ చేసుకున్న Mariott కి వెళ్ళాము. అప్పటి నుంచి మే 16 దాకా ఆ Mariott-ఎమరీవిల్‌ మా ఇల్లన్నమాట.

మేము వెళ్లిన సమయానికి హోటల్ రూమ్ కిటికీ లోంచి కనిపించినవి - నీలిరంగులో మిలమిలలాడుతున్న మిన్ను- సూర్యుడి వెలుగులో తళతళలాడుతున్న సముద్రపు నీరు - అటూ ఇటూ  తిరుగుతున్న కార్లతో కళకళలాడుతున్న రోడ్డు... 




<< మరిన్ని దేశీ మజిలీ కబుర్లు తరవాతి పోస్టులో >>