21, ఫిబ్రవరి 2022, సోమవారం

మళ్ళీ మొదలయింది - 1 - అహమపి some సమ్భాషణం కృతవతీ...

పలకా-బలపంతో మొదలైన చదువు 
తరగతి గదులు దాటి - చదువుల బడులు మీఱి
ఎన్నో ఏళ్ళు గడిచిన ఇన్నాళ్ళకి 
మళ్ళీ కలమూ - కాగితమూ పట్టించి  
లాప్టాపూ - జూమూ నెట్టించి 
మళ్ళీ మొదలయింది 

ఊరీ-ఊరని 
ఆ కథా  - కమామీషూ... 
గాలిరెక్కల ఊరేగించి 
కమ్మని కనికట్టు-కబురుల కమ్మగా 
చుట్ట చుట్టి ఈ-చిట్టిగా 
అంచెలంచెలుగా 
నా బ్లాగునుంచుతున్నా... 



*******
*******

    చిన్నప్పుడు వేసవి సెలవులకో, సంక్రాతి సెలవులకో  అనాతవరం వెళ్లినప్పుడు రోజూ రాత్రి నిద్ర పోయేముందు నాన్నమ్మ మా చేత శ్లోకాలు చెప్పించేవారు.  

    నాకు ఆ శ్లోకాలన్నీ ఇష్టమే అయినా - అన్నిటి కన్నా ఒక శ్లోకం చాలా ఇష్టం. 

యత్ర యత్ర రఘునాథకీర్తనమ్ 
తత్ర తత్ర కృతమస్తకాఞ్జలిమ్ 
భాష్పవారి పరిపూర్ణ లోచనమ్ 
మారుతిం నమత రాక్షసాన్తకమ్ 

    ఇదెందుకు ఇష్టమంటే - యత్ర యత్ర, తత్ర తత్ర అని rhyming కుదిరినందుకు. 

    అంతే కాకుండా కొంచెం హెడ్డు పైకి వచ్చాక  - అంటే హైస్కూలుకి వచ్చాక - నాకు ఈ శ్లోకం లోని చాలా పదాలకి అర్థం నాకు నాకే స్ఫురించేసింది. "యత్ర యత్ర" అంటే "ఎక్కెడెక్కడ" అని, "తత్ర తత్ర" అంటే "అక్కడక్కడ" అని, "వారి" అంటే "నీరు" కాబట్టి "భాష్పవారి" అంటే "కన్నీరు" అని - ఇలా ఒక్కొక్క పదం పలుకుతూ, దానికి అర్థం కూడబలుక్కుంటూ పాడుకుంటుంటే నాకు నేనుగా అర్థం చేసుకున్న మొట్టమొదటి సంస్కృత శ్లోకం ఇది. 

    నాకసలే ప్రాసలతో లయబద్ధంగా నడిచే శ్లోకాలు, పద్యాలు, స్తోత్రాలు, కవితలూ అన్నీ కూడా భలే ఇష్టంగా ఉండేవి. 

    అందుకని నాకు tune నచ్చిన అష్టకాలు, స్తోత్రాలు కంఠస్థం చేసి పాడుకుంటూ ఉంటాను. అలా పాడుకునేటప్పుడు అర్థం చేసుకుంటూ పాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. 

    అలా అర్థం చేసుకోవాలీ అనుకునే ప్రయత్నంలో ఒక్కోసారి అపార్థాలు కూడా అయిపోతూ ఉంటాయి. 

    ఉదాహరణకి - నేను చిన్నప్పుడెప్పుడో నేర్చుకుని పాడుకునే శివాష్టకంలో ఒక verse:  

హరం సర్పహారం చితాభూవిహారం 
భవం వేదసారం సదా నిర్వికారమ్ | 
శ్మశానే వసన్తం మనోజం దహన్తం 
శివం శఙ్కరం శమ్భుమ్ ఈశానమీడే


    ఇందులో "శ్మశానే వసన్తం మనోజం దహన్తం" అన్న వాక్యంలో "శ్మశానే వసన్తం" అన్న మాటలు నన్ను చాలా తికమక పెట్టాయి. 

    "శ్మశానంలో వసంతం" ఏంటబ్బా! అనిపించేది. 

    అలా అనిపించగా - అనిపించగా - కొన్నేళ్ళకి నాకు ఓ రోజు హఠాత్తుగా తట్టింది - అది వసంతఋతువు కాదూ, శ్మశానంలో వసించే శివుణ్ణి స్తుతించడం అని. ఆ రోజు కొత్తగా అర్థమైన "శ్మశానే వసన్తం" నాకెంతగా నచ్చిందో. 

    ఏదో అలా నాకు కుదిరినంతగా అర్థం చేసుకుంటూ శ్లోకాలు, స్తోత్రాలు పాడుకోవడం తప్ప సంస్కృతం నేర్చుకునే వీలుందా అని ఎప్పుడూ ఆలోచించలేదు. 

    అన్నట్టు ఇప్పటికీ నాకు "ఈశానమీడే" అంటే తెలుగులో అర్థం ఏంటో సరిగ్గా తెలీదు. 


*******
*******

    నేర్చుకున్న శ్లోకాలు, పాడుకునే స్తోత్రాలు కాకుండా - చిన్నప్పట్నుంచి - నేను తరచుగా విన్న సంస్కృత వాక్యాలు మూడో, నాలుగో  ఉన్నాయి. 

    అవన్నీ కూడా మా అమ్మ నాతో అన్నవి - ఆవిడ అనగా నేను వినీవిననట్లున్నా వినిపించుకున్నవి - వినాలనిపించి మళ్లీమళ్లీ అనిపించుకున్నవి. 

    నాకు గుర్తుండి చిన్నప్పుడు నాతో మా అమ్మ మాట్లాడిన భాషితాలు, సుభాషితాలు అన్నీ కూడా "All roads lead to Rome" అన్నట్టు   - చదువు దగ్గర మొదలై, చదువు దగ్గరే ఆగేవి. 

    అవేంటంటే... 

    చెప్పిన మాటేదైనా విననప్పుడు - పెంకిగా ఎదురు మాట్లాడబోయినప్పుడు - "విద్యా దదాతి వినయం"

    ప్రతిసారీ పరీక్షల ముందు పోటీ పడి చదవాలి అని గుర్తు చేస్తున్నట్టుగా - "స్పర్థయా వర్ధతే విద్యా"

    ఇంకో ముచ్చటైన మూడో వాక్యం - "శ్రద్ధావాన్ లభతే జ్ఞానం"

    నాకు నచ్చి గుర్తుంచుకున్న నాలుగో వాక్యం - "స్వదేశే పూజ్యతే రాజా - విద్వాన్ సర్వత్ర పూజ్యతే ". 

    అప్పటికి సంస్కృతంలో ఉన్న ఆ వాక్యాలు ప్రతి పదం అంతో ఇంతో అర్థం కావటంతో - ఆ భాషేదో నాకు తెలిసిపోతున్నట్టే అనిపించేది. 

    కానీ సంస్కృతం భాషగా నేర్చుకోవాలని అప్పటికీ అనిపించలేదు. 

    బడికి వెళ్లి ఒక తరగతి తర్వాత ఇంకో తరగతి చదవడం తప్పనిసరి కాబట్టి ఆ చదువు మాత్రం విన్నది గుర్తుపెట్టుకుంటూ నెట్టుకుంటూ వచ్చేసే నాకు అదనంగా ఏమన్నా నేర్చుకోవడం అన్న ఆలోచనే నచ్చేది కాదు. 

    దాన్ని రానిచ్చేదాన్నే కాదు. 

    అందుకే "అమ్మాయ్! ప్రాథమికకి కట్టూ" అని చెప్తున్న హిందీ మాష్టారు గుర్నాథం గారిని తప్పించుకోవడానికి ఇంట్లో మొక్కలకి పాదులు కట్టి, నీళ్లు పెట్టాలని ఆయన నమ్మలేని సాకులు చెప్పి తప్పించుకునే దాన్ని కూడా... కదా! 

*******
*******

     హైస్కూలు చదువు ముగిసి గుంటూరు బండ్లమూడి హనుమాయమ్మ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్మీడియట్ చేరినప్పుడు - బోల్డన్ని మార్కులు చులాగ్గా వచ్చేస్తాయని - సంస్కృతం సెకండ్ లాంగ్వేజ్‌గా తీసుకున్నాను. 

    అప్పుడు మొదటిసారిగా వాల్మీకి రామాయణం లోని శ్లోకాలు చదవడం ఎంతో గొప్పగా అనిపించింది. అందులో నాకు గుర్తున్న ఒకటిన్నర శ్లోకం...

ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ
ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా 

పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా... 

    ఇక్కడో తమాషా విషయం - నిజ్జంగా రామాయణంలో పిడకలవేటకి మంచి ఉదాహరణ - గుర్తుకొస్తోంది. 

    నాకు సంస్కృతం - కొంచెంకొంచెంగా - నేర్చుకుంటున్న భాషగా - పరిచయమవుతున్న కాలేజ్ రోజుల్లో ఒక పరపతి, పలుకుబడి ఉన్న ఒకానొక గొప్పాయన ఇచ్చిన ఉపన్యాసం విన్నాను. 

    ఆయన ఈ శ్లోకాన్ని"ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ" దగ్గర ఆపి చాలా తప్పు అర్థం తీస్తుంటే అది విని ఊరికే ఉండలేక, అలాగని ఏమీ చేయలేక ఎంత ఉక్రోష పడ్డానో నాకిప్పటికీ గుర్తే. 

    ఏదో గుర్తున్నాయని రాసుకోవడానికే తప్ప అంతగా తలుచుకోనవసరం లేని ఆ పిడకలవేటలూ- పిట్టకథల్లోంచి బయటికి వచ్చేస్తే - నా కాలేజ్ రోజుల్లోని సంస్కృతం "రామః - రామౌ - రామాః; హే రామ! - హే రామౌ! - హే రామాః!" అన్న రామ-శబ్దం దగ్గరే ఆగిపోయి అంతవరకే గుర్తుంది. 

*******
*******

    ఎప్పుడో అలా ఆగిపోయిన నా సంస్కృతం చదువు అనుకోకుండా మళ్ళీ మొదలయింది. 

ఎలా మొదలయిందీ అంటే... 
ఏదో అయిందంటే అయిందన్నట్టు కాదు 
అలాగిలాక్కాదు ... ఆషామాషీగా కాదు - 
అహమపి some సమ్భాషణం కృతవతీ...అనే లాగు 



 - 



    ఆ కాయితాల్లో నే రాసుకున్న సంస్కృత-సమ్భాషణం ఈ కింద తెలుగు-లిపిలో రాసుకున్నా...
    (ఏమన్నా  తప్పులుంటే - సంస్కృతం తెలిసిన వాళ్ళెవరైనా దయచేసి సంస్కరించండి.) 

*******
*******

లలిత: క్షమ్యతాం భగిని!

స్వాతి: హరిః ఓం, భగిని!

లలిత: ఏతత్ లోకయానే ఏకః ఆసన్దః అపి రిక్తః నాస్తి. అహం భవత్యాః సమీపే ఉపవిశామి వా?

స్వాతి: ఆం భగిని! ఉపవిశతు!

లలిత: ధన్యవాదాః, భగిని!
(లలితా ఉపవిశతి)

స్వాతి: చింతా మాస్తు!

లలిత: అద్య వాతావరణం సమీచీనమ్ అస్తి, కిల?

స్వాతి: ఆం, బహు సమ్యక్ అస్తి! మమ నామ స్వాతి. భవత్యాః నామ కిమ్?

లలిత: మమ నామ లలితా. భవతీ కుత్ర గచ్ఛతి?

స్వాతి: అహం కార్యాలయం గచ్ఛామి. మమ కార్యాలయం Pine Street మార్గే అస్తి. భవతీ కుత్ర గచ్ఛతి?

లలిత: ఆగామి శనివాసరే మమ పుత్రస్య జన్మదినం! తస్య కృతే ఉపాయనం క్రేతుం Toys R Us ఆపణం గచ్ఛామి.

స్వాతి: సః ఉత్తమః విచారః. Toys R Us  వాషింగ్టన్ మార్గే అస్తి. తత్ స్థానకం మమ స్థానకస్య పూర్వమ్ ఆగచ్ఛతి. 

లలిత: యదా లోకయానం వాషింగ్టన్ స్థానకాత్ గచ్ఛతి, తదా భవతీ కృపయా వదతు వా? అహం వాషింగ్టన్ స్థానకం కుత్ర ఆగచ్ఛతి ఇతి న జానామి. 

స్వాతి: చింతా మాస్తు! అహం సూచయిష్యామి. భవత్యాః శాటికా బహు సున్దరమ్ అస్తి. కుత్ర క్రీతవతీ?

లలిత: శాటికాయాః కృతే ఏకం సమ్యక్ జాలస్థలమ్ అస్తి. అహం మమ శాటికాం తత్ర అపి క్రీతవతీ. 

స్వాతి: తత్ జాలస్థలస్య అన్తర్జాలసఙ్కేతః కృపయా దదాతు వా? అహమ్ అపి ఏకా శాటికాం క్రేతుం ఇచ్ఛామి. 

లలిత: నిశ్చయేన భగిని. లిఖిత్వా దదామి. 

స్వాతి: ధన్యవాదాః, భగిని! Toys R Us గంతుమ్ అగ్రిమస్థానకే కృపయా లోకయానం అవతరతు.

లలిత: సూచనార్థం ధన్యవాదాః, భగిని! 

స్వాతి: చింతా మాస్తు!

*******
*******

    అలా ఇంటర్మీడియట్లో రామ-శబ్దం దగ్గర ఆగిపోయిన నా సంస్కృతం - కనీసం ఒక ఐదు నిముషాల పాటు సంభాషణ చేయగలిగే వరకు వచ్చిందంటే - అది సంస్కృతభారతి వాళ్ళ పుణ్యమే... 

   <<ఈ రోజుకి ఇక్కడ ఆపుతున్నా... మిగిలిన కబుర్లు  ఇంకో మారు.... >> 

6, ఫిబ్రవరి 2022, ఆదివారం

గీతం...సంగీతం...సతతహరితం - 14 - తూ జహాఁ జహాఁ చలేగా...

 
చుక్కల కేసి సారించిన నా చూపు 
చూసేది నిన్నల వెలుగులట 
వెలుగు చిలికిన ఆ ఉడువు -
మింటినంటి ఆ పట్టునే ఉన్నదో... 
మంటి కేసి ఏ గట్టుకో ఉరలుకొన్నదో... 
తెలియరాదట!

చెవుల తాకి పలకరించిన నీ పాట 
పుట్టింది గడచిన కాలాలనట  
పులక రేపిన నీ పదము - 
పెదవి దాటి ఎప్పుడు ఉరికిందో... 
ఎదను చేరి ఎక్కడ కుదురుకుందో... 
ఎఱుగలేమట!

ఆ చుక్క మిణుకు నిన్నలదే... 
ఈవేళ్టి చూపుకానినదే!

నీ పాట జిలుగు నిన్నలదే... 
ఏ నాటికీ చెవికి సోకునిదే!

*******
*******

    నల్లటి పట్టు ఆకాశం మీద ధగధగల కుట్టుపూలలా కంటికి కనపడే నక్షత్రాలు నిన్నో, ఈరోజో పుట్టినవి కావట. 

    ఎప్పుడో యుగాల కావల పుట్టిన ఆ చుక్కల వెలుగు ఇప్పటికి చూడగలుగుతున్నామట. 

    అప్పుడు పుట్టిన ఆ నక్షత్రం ఇప్పటికీ అక్కడే ఉన్నా ఈ రోజుటి వెలుగుని మాత్రం మన ముందు తరాలు మాత్రమే చూస్తాయట. 

    మనమింకా గతకాలపు వెలుగునే ఇంకా చూస్తున్నాం మరి...  ఇప్పటి వెలుగుని చూడాలంటే ఇంకెన్ని యుగాలు గడవాలో!

    అప్పటికి ఆ నక్షత్రం ఉండక పోయినా ఆ వెలుగు ఏ కంటికో కాంతినందిస్తూనే ఉంటుంది. 

    నాకు జిలుగు పలుకుల పాట సొగసు కూడా కూడా తళుకు బెళుకు నక్షత్రాల వెలుగు పోలికే అనిపిస్తుంది. 

    ఏ తేనెలూరే గొంతు లోనో ఎప్పుడో పుట్టిన పాట ఇప్పటికీ పల్లవిస్తూ ఉంటుంది. పరిమళిస్తూ ఉంటుంది. 

    అప్పుడు పుట్టిన పాట నాకు ముందూ ఉంది. నాతోనూ నడిచొస్తోంది. నను దాటీ ఉంటుంది. 

    పాడిన వారూ, పాటను విన్నవారూ తరతరాలుగా దాటిపోయినా పాట మాత్రం కాలచక్రపు ఎల్లలు దాటి  ఎల్లప్పుడూ ఉండిపోతుంది. 

*******
*******

    ఇక్కడో పాట కథ చెప్పాలనిపిస్తోంది. 

    అనగనగా... ఎప్పటి నుంచో వింటూ ఉన్న ఆ నాటి పాట ఒకటి ఉంది.  

    అదెలాంటి పాటంటే... 

వినకపోతే వినమని సతాయించే పాట 
విన్న తర్వాత ఇంకోసారి వినాలనిపించే పాట 
విన్న పాటున ఎదను గుచ్చే పాట 
ఉన్నచోటున ఉండనీయని పాట 
వినే కొద్దీ నీడలా వెన్నాడే పాట
విన్నవారి వెన్నుదన్నయ్యే పాట

    ఆ పాటలో మాటలెలా ఉంటాయంటే ... 

బాధను పొగిలిస్తాయి 
భళ్ళున ఏడవాలనిపిస్తాయి 
బతుకుటాస పొరయిస్తాయి  
బరువసా కూరుస్తాయి 


    ఈ నాటికీ ఆ పాట ఉంది -  
ఆ నాటి రాలు-చుక్క  పంపిన ఈ నాటి వెలుగులా 
ఈ నాటి వానకోయిల వదిలెళ్లిన నానాటి పాటలా 

*******
*******

ఆ పాటకి యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=Pdz0V0vqA4Y





తూ జహాఁ జహాఁ చలేగా... 
మేరా సాయా - సాథ్ హోగా
తూ జహాఁ జహాఁ చలేగా... 
మేరా సాయా - సాథ్ హోగా
మేరా సాయా - మేరా సాయా 
మేరా సాయా - మేరా సాయా 

కభీ ముఝ్‌కో యాద్ కర్‌కే - జో బహేంగే తేరే ఆఁసూ 
కభీ ముఝ్‌కో యాద్ కర్‌కే - జో బహేంగే తేరే ఆఁసూ 
తో... వహీ పే రోక్ లేంగే - ఉన్హే ... ఆకే మేరే ఆఁసూ 
తూ జిధర్ కా రుఖ్ కరేగా - మేరా సాయా సాథ్ హోగా

తూ జహాఁ జహాఁ చలేగా... 
మేరా సాయా - సాథ్ హోగా
తూ జహాఁ జహాఁ చలేగా... 
మేరా సాయా - సాథ్ హోగా
మేరా సాయా - మేరా సాయా 
మేరా సాయా - మేరా సాయా 

తూ అగర్ ఉదాస్ హోగా - తో ... ఉదాస్ హూంగీ మై భీ
తూ అగర్ ఉదాస్ హోగా - తో ... ఉదాస్ హూంగీ మై భీ
నజర్ ఆఊఁ యా న ఆఊఁ - తేరే పాస్ హూంగీ మై భీ
తూ కహీ భీ జా రహేగా - మేరా సాయా సాథ్ హోగా

తూ జహాఁ జహాఁ చలేగా... 
మేరా సాయా - సాథ్ హోగా
తూ జహాఁ జహాఁ చలేగా... 
మేరా సాయా - సాథ్ హోగా
మేరా సాయా - మేరా సాయా 
మేరా సాయా - మేరా సాయా 

మై అగర్ బిఛడ్ భీ జాఊఁ -  కభీ మేరా గమ్ న కర్‌నా
మై అగర్ బిఛడ్ భీ జాఊఁ -  కభీ మేరా గమ్ న కర్‌నా
మేరా ప్యార్ యాద్ కర్‌కే - కభీ ఆంఖ్ నర్మ్ న కర్‌నా
తూ జో... ముడ్‌కే దేఖ్ లేగా - మేరా సాయా సాథ్ హోగా

తూ జహాఁ జహాఁ చలేగా... 
మేరా సాయా - సాథ్ హోగా
తూ జహాఁ జహాఁ చలేగా... 
మేరా సాయా - సాథ్ హోగా
మేరా సాయా - మేరా సాయా 
మేరా సాయా - మేరా సాయా 

మేరా గమ్ రహాఁ  హై శామిల్ - తేరే దుఖ్ మే... తేరే గమ్ మే
మేరా గమ్ రహాఁ  హై శామిల్ - తేరే దుఖ్ మే... తేరే గమ్ మే
మేరే ప్యార్ నే దియా హై - తేరా సాథ్ హర్ జనమ్ మే
తూ కోఈ జనమ్ భీ లేగా - మేరా సాయా సాథ్ హోగా

తూ జహాఁ జహాఁ చలేగా... 
మేరా సాయా - సాథ్ హోగా
తూ జహాఁ జహాఁ చలేగా... 
మేరా సాయా - సాథ్ హోగా
మేరా సాయా - మేరా సాయా 
మేరా సాయా - మేరా సాయా 

మేరా సాయా - మేరా సాయా 
మేరా సాయా  - మేరా సాయా 
మేరా సాయా  - మేరా సాయా 

*******
*******


 ఏ నాటికీ ఆ పాట ఉంటుంది -  
వేవేల చుక్కలు వెదజల్ల - రాబోయే వెలుగులా... 
మౌనమెరుగని వెదురులో - మూగబోవని పాటలా... 

ఆ పాట వింటూ ఉన్న - నాతో పాటు - వినేవారుంటారనుకుంటూ ... 

~ పాటల భైరవి