Lego అంటే వినడానికి ఒకటే మాటలా వున్నా - అనడానికి మాత్రం రెండు మాటలట.
Lego block పుట్టింది డెన్మార్క్ దేశంలోనట.
డెన్మార్క్‌లో మాట్లాడే డానిష్ భాషలో leg godt అంటే play well అని అర్థమట.
Lego అన్న మాట అలా పుట్టిందన్నమాట.
మాటగా ఎక్కడ ఎలా పుట్టినా ఆటగా మాత్రం ఇప్పటికీ నాతోనే వుంది Lego.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
లెగో అంటే ఒక ప్లాస్టిక్ బ్లాక్. ఒక్కో బ్లాక్ పది సెంట్లు. అంటే ఒక డాలర్‌కి పది లెగో బ్లాకులు వస్తాయి.
ఈ లెగో బ్లాకులూ, వాటికయ్యే సెంట్లూ-డాలర్ల లెక్కలు ఇప్పుడెందుకంటే...
నా లెగో ముక్కలు కొనుక్కోవడానికో లెక్కుంది -
దానికో trick ఉంది.
అదెప్పట్నుంచో రాసిపెట్టుకుందామని ఓ మక్కువుంది.
అదిప్పటికిలా click అయ్యింది.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
అప్పుడెప్పుడో - ఆ మార్చ్ నెల మొదట్లో - చెట్లు చిగిర్చి పూలు పూస్తున్న పూటల్లో - చెబ్దామనుకుని మొదలు పెట్టిన "నేను Lego లు ఎలా కొనుక్కుంటానంటే.... " అన్న లెగో కొనుగోలు-కమామీషు-కబుర్లు ఇవి.
ఇదిగో ఇప్పటికి - అంటే చెట్లు చిగిర్చి-పూచి-కాచి-పళ్లై-పండిన పళ్లకి కొమ్మలు వంచి-అందిన వాళ్లకి పళ్లను పంచి-ఆకులను రంగులలో ముంచి సింగారించే హడావిడిలో మునిగి-మురిసే - ఈ అక్టోబర్ నెల మొదట్లో - ఆ మొదలెట్టి ఆపిన కబుర్లకి ఓ ముగింపు నిద్దామని మళ్ళీ మొదలెట్టాను.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
తీరిక చిక్కక కొన్నాళ్ళూ,
తీరిక చిక్కినా - రాయాలనిపించక ఇంకొన్నాళ్ళు
తీరా రాయాలనిపించాక - రాయడానికి కుదురు కుదుర్చుకోక మరింకొన్నాళ్ళు
ఇలాగే సాగితే
నా ఈ రాత
ఓ తీరూ-వాకూ లేక
ఏ తీరమూ చేరని గోదావరి కాలువ లోని బల్లకట్టు లాగా
తీరని కోరికై మిగిలిపోయేలా వుందని అనిపించి
ఇవాళ ఎలాగైనా తీరిక చేసుకుని రాసేద్దామని
తీర్మానించుకున్నాను.
(పైన నే రాసిన రాతలు చదివి నాకు నాకే ఎవరు గుర్తొచ్చారో తెలుసా?
ఒక హింట్ ఇస్తా... ఒకప్పుడు ఆ దర్శకుడు తీసిన సినిమాల గురించి ఒక పెద్ద సిరీసే రాశాన్నేను.
చెప్పుకోండి ఎవరో...?
ఇవాళ ఆయన పూనినట్టున్నాడు నన్ను!!!)
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
సరే! మొదలెట్టిందే మార్చ్ నెల్లో కదా!
అసలే మార్చ్ నెల.
ఆకులు విడిచి మోడులై - మాటలు మరిచిన మౌనులల్లే - నిద్దరోతున్న చెట్లన్నీ కళ్లు విప్పుతున్నాయి.
ఒక ఎండ పొడకి ఒడలు చురుక్కని
ఒక చినుకు తడికి తనువు తళుక్కని
కొమ్మా-రెమ్మా పులకలై చిగుళ్లు కప్పుకుంటున్నాయి.
అప్పటికి తగ్గట్టు ఓ హైకూ stanza ఒకటి రాసి పెట్టే వుంచా.
రాసిన దాన్ని తుంచలేక ఇక్కడే వుంచా ...
March has sprung on here
With Spring marching along
To wake trees, make blooms...
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
ఇహిప్పుడు - నేను Lego లు ఎలా కొనుక్కుంటానో చెప్తాను.
మామూలుగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంటికో పేరు పెట్టుకుని ఇంటి ముందు ఓ రాతిపలక మీద "సాయికృప, వేంకటేశ్వర కృప" లాంటి పేర్లు రాసుకుంటూ వుంటారు కదా కొందరు.
అలాగే నేను ఇటీవల రెండు-మూడేళ్ళుగా కొనుక్కున్న లెగోలన్నిటి మీదా రాసుకోవాలంటే "Costco కృప" అని రాస్కోవాలి నేను.
అసలు లెగోలు అంటే ఏంటి?
బోల్డన్ని రంగురంగుల ప్లాస్టిక్ ముక్కలు.
బిల్డింగ్ బ్లాక్స్.
పిల్లలాడుకునేవి.
పిల్లలాటలనిపించేవి.
ఆడడం మొదలెట్టాక పెద్దలు కూడా పిల్లలైపోయేవి.
ఒక్కో ప్లాస్టిక్ ముక్క
చిన్న పిల్లలకైతే ముందూ వెనకా ఆలోచించకుండా కొనిచ్చేయాలనిపిస్తుంది ఎవరికైనా. కుదురుగా కూర్చుని ఆడుకుంటారని.
పెద్దైన పిల్లలున్న నేను కొనుక్కోవాలంటే - అందులోనూ ఎలాంటి "గిల్ట్-ఫీలింగూ" - అనగా అచ్చదో, సంస్కృతం నుంచి అరువు తెచ్చుకున్న మాటో - "అపరాధ భావన" అనేది లేకుండా - కొనుక్కోవాలంటే ఆ డబ్బులు అనుకోకుండా వచ్చినవి అయుండాలి నాకు.
అంటే లాటరీలో వచ్చినట్టన్నమాట.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
అల్లాంటి డబ్బులకి నాకు దొరికిన బహు మంచి దారి - కాస్ట్‌కో రివార్డ్స్.
కాస్ట్‌కోకి వెళ్ళామంటే అలా వెళ్ళి ఇలా వచ్చేస్తామా ఏంటి?
వంటకి కావల్సిన పప్పూ-నూనె,
ఒంటికి బలమిచ్చే పాలూ-వెన్నా,
పంటికి పంజెప్పే పళ్ళూ-ఫలహారాలూ,
అన్నానికి ఆధరవయ్యే కూరలూ-ఆక్కూరలూ,
ఎండాకాలానికి పానీయాలూ,
వానాకాలానికి గొడుగులూ,
శీతాకాలానికి కంబళ్ళూ,
ఏ కాలానికైనా వేసుకోవల్సిన మందూ-మాకులూ,
ఇవే కాక
గిన్నెలూ, డబ్బాలూ,
కుర్చీలూ, టేబుళ్ళూ
పిండి రుబ్బే రుబ్బర్లూ
కిటికీ సందులు కప్పే రబ్బర్లూ
పుస్తకాలూ, పెన్నులూ
అవీ - ఇవీ - అన్నీ - ఎన్నోలూ....
ఇలా షాపింగ్ కార్టులో పట్టేవీ, పట్టించలేక కార్టు దాటి పొంగి పొర్లేవీ బోల్డన్ని - "కొను వారం... వారం ... వారం..." అని పాడుకుంటూ కొనుక్కుంటే - ఆ కొనుక్కున్న ప్రతీ దానికి ఖర్చు పెట్టిన దాని మీదా రెండు శాతం డబ్బులు వెనక్కి ఇస్తుంది కాస్టుకో.
ఆ... ఇంతోటి రూపాయికి రెండు పైసలిచ్చే స్కీముకే అంత పొంగిపోవాలా అంటే --- ఉచితంగా వస్తున్న - ఆ రెండుపైసలే - పరమోచితంగా అనిపిస్తాయి నా మటుకు నాకు. కాస్టుకో ఇవ్వకూడదూ అనుకుంటే నేనిచ్చిన ఏ రూపాయికీ ఆ రెండుపైసలూ వెనక్కి రావు కదా?!
అందులోనూ "పైసా మే హై పరమాత్మా" అన్నారు కదా! ఇక మరి రెండు పైసల్లో ఆ పరమాత్మ రెండింతలవడూ!
అన్నట్టు ఇక్కడ ఓ విషయం చెప్పాలబ్బా!
ఒక్క సెంటూ, ఒక్క రూపాయీ అని చులకనగా అంటూ చులాగ్గా తీసి పక్కన పడేస్తూ వుంటాం.
కానీ అదే సెంటూ-రూపాయీ తక్కువైతే online shopping cart "పోన్లే ఒక్కటంటే ఒక్క రూపాయి తక్కువుంది నీ బాంకులో ...ఒక్క రూపాయే కదా ఫర్లేదు... continue to checkout" అని అంటుందా ఎక్కడైనా?
అంటే ఆ సెంటో - ఆ ఒక్క రూపాయో - అప్పటికి ఆ ఆన్లైన్-షాపింగ్-జలధి దాటించగలిగే పరమాత్మే కదా!
కాదా?
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
సర్సరే! అసలు విషయానికి వస్తే కాస్టుకో వాడిచ్చే ఆ రూపాయికి-రెండుపైసలు "ఇంతై - అంతై - ఎంతెంతో ఐ - బోల్డంతై" అన్నట్టు ఏడాదికి ఓ రెండో-మూడో లెగో సెట్లు కొనుక్కునేంత అవుతాయి.
ప్రతి మార్చ్‌లో లాగే ఈసారీ లెగోలు కొనుక్కున్నా.
మార్చ్ లోనే కొనుక్కోవడం ఎందుకూ - అంటే మరప్పుడే కదా - వాసంతిక సంగాతము చిక్కిన మొక్కల మీద రంగురంగుల పూలు విచ్చుకునేదీ, దక్కిన చెట్ల మీద రకరకాల ఆకులు పచ్చుకునేదీనూ.
ఆ రంగురంగుల పూలు విచ్చుకున్న మొక్కలూ, పచపచ్చటి ఆకుల్ని కప్పుకున్న చెట్లూ, రంగవల్లుల్లాంటి తీగలూ - వాటిని మోసుకుంటూ వున్న ఇళ్ళూ, వాకిళ్ళూ బొమ్మరిళ్ళలా కొలువు తీరేది!
ఆ ప్రేరణ తోనే కాబోలు లెగో వాళ్ళు కూడా మార్చ్ నెల వచ్చిందంటే చాలు - బోల్డన్ని పూలు - ఎక్కడైనా విచ్చుకునే పొద్దుతిరుగుడు పూలు, ఎక్కడున్నా మనస్విచ్చుకునే ఎఱ్ఱగులాబీలు, ఎక్కడో జపాన్లో విరులెత్తే చెర్రీ బ్లాజమ్లూ, నీటి అలల తళతళలలో కలకలలాడు తామరలు - ఇలా ఎన్నెన్నో రంగురంగుల పూలని ఇంకెన్నెన్నో రంగురంగుల ప్లాస్టిక్కు బ్లాకుల రూపంలో వున్న సంతోషపు-పొట్లాల్లా అమ్ముతూ వుంటారు.
నేనేమో Costco నుంచొచ్చిన cash-back డబ్బులతో నాకు నచ్చిన లెగో-పూలు కొనేసుకుంటూ వుంటాను.
అసలు ఈ లెగో-పూలు కొనుక్కోవడానికి ఇంకో కారణం - మా ఇంటి ముందు పూలమొక్కలు వేసుకోవడానికి అంతగా వీల్లేకపోవడం. అదెందుకూ అంటే... మళ్లీ వెళ్ళి నా పాత బ్లాగ్ చదువుకోవాల్సిందే....
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
అవండీ !
అప్పుడెప్పుడో
అల్లప్పటి
ఆ మార్చ్ నెలలో - మొదలాడి
ఎప్పటికీ సాగక - ముందువెనకలాడి ...
చప్పున అక్కడే తారాడక ...
ఇప్పటికిప్పుడు
ఇల్లిప్పటి
ఈ అక్టోబర్ మాసంలో మళ్ళీ - మెదలాడి
నే బ్లాగాడిన Lego కబుర్లు...
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
అన్నట్టు ఈ కిందనున్న నా ఖండ-కళని కూడా చూసెయ్యండి మరి!
కుదురుగా కూర్చి
ఒబ్బిడిగా పేరిస్తే
తయారయ్యేది
లెగో - కళాఖండం
అంటే a piece of art
అదే చిందరవందర చేసి
ఒక్కుప్పగా చేరిస్తే
చూపులకానేది
లెగో - ఖండ-కళ
అనగా art-in-pieces
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
