సరిగ్గా పదకొండేళ్ళ క్రితం... ఇదే మే నెల్లో...ఓ రోజు
నేనూ, వేనెట్ ధీమాగా, ధిలాసాగా కూర్చున్నాం - కాఫీ షాపులో బార్ స్టూల్స్ మీద కాళ్ళూపుకుంటూ - ఎదురెదురుగా. మా ఇద్దరి మాటల్లో ఏదో తెలియని excitement. ఆ రోజే మొట్టమొదటిసారిగా Surplus letter అన్న మాట విన్నాం.
పొద్దున్న ఆఫీసుకి రావడంతోనే ఓ ఈ-మెయిల్. మూడింటికి ఏదో అత్యవసర, అనివార్యమైన మీటింగులో అందరూ చేరండి అంటూ.
గత వారం రోజులుగా ఏదో హడావిడి నడుస్తోందని తెలుసు. టీముల మధ్య ఏవో మార్పులూ, చేర్పులూ జరుగుతాయని గాలికబుర్లు.
అప్పుడెప్పుడో చదూకునేటప్పటి జ్ఞాపకమైన కూన్ట్జ్ ఓ డొనెల్ నిర్వచించిన ఇన్ఫార్మల్ గ్రేప్‌వైన్ అంటే ఏంటో ఈ రోజుకి అనుభవంలోకి వస్తున్న వైనం.
ఇద్దరం చెరో కాఫీ తెచ్చుకున్నాం - తను ఎప్పట్లాగే Hot Mocha with కోల్డ్ క్రీమీ ఫోమ్. నేను స్ట్రాంగ్ గా వుండే రెడ్-ఐ వెర్షనూ. మేము పనిచేసే టీములో ఎవరికీ కనిపించని అతి క్లిష్టమైన Design Issues ని పరిష్కరిస్తామని మాకో పేరు. అసలు మేము లేని టీముని మేమే ఊహించలేము. అసలు మేం చేసినంత quick analysis ఇంకెవ్వరూ చెయ్యలేరని ఓ చిన్న పిసరు పొగరు కూడా వుంది మా ఇద్దరికీ. ఆ పొగరు తాలూకు పొడిగింపే ఆ ధీమా, ఆ థిలాసా, ఆ కాళ్ళూపుడూ...
అందుకే ఆ ఈ-మెయిల్ చూసినా దాని గురించి అంతగా పట్టించుకోలేదు. అందులోనూ ఆ మీటింగ్ మూడింటికి. ఆ లోగా కాఫీ తాగొద్దామని కాఫీ షాపుకొచ్చి ఎత్తు-కుర్చీల్లో కాళ్ళూపుకుంటూ కూర్చుని కబుర్లాడుకున్నాం. ఆ కబుర్లలో ముప్పావు వంతు నా కొత్త laptop గురించే.
అన్నట్టు చెప్పనేలేదు కదూ... అంతకు ముందు వారమే పాతిక్కిలోల రాయిలా వుండే నా పాత office laptop ని దాని మూడేళ్ళ lease-roll అయిపోయి వెనక్కి పంపేస్తే, దానికి బదులుగా మా ఆఫీస్ వాళ్ళు పల్చటి పూతరేకు లాంటి కొత్త లాప్టాప్ ఒకటి పంపించారు. అదొచ్చినప్పట్నుంచి వేనెట్‌తో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా నా కొత్త లాప్టాపందచందాలు వర్ణించి వర్ణించి చెప్పానో లెక్కే లేదు. ఆ వేళా అవే కబుర్లు.
వేడివేడి కాఫీ-సిప్పులూ, కొన్ని లాప్టాప్-మెప్పులూ, ఇంకొన్ని సరదా-గాసిప్పులూ అయ్యాయి.
ఎప్పట్లాగే నవ్వుకుంటూ, తుళ్ళుకుంటూ ప్రపంచంలో వున్నది మేమే అనుకుంటున్నట్టూ, మా ప్రపంచంలో మేముంటూ,కబుర్లాడుకుంటూ - మేమిద్దరం ఎదురెదురుగా వున్న మా cubicles కి వచ్చేశాం.
Desktop గడియారం మూడో గంట చూపెట్టీ చూపెట్టకుండానే మా floor లో వున్న మా టీం వాళ్ళందరం టిక్కు-టిక్కుమని ఫోను మీటలు నొక్కి మీటింగులో join అయ్యాము.
చేరగానే తెలిసింది అది one-way-muted మీటింగ్ అని. అంటే నేను, వేనెట్, మాలాగే చేరిన మా టీమ్ అందరూ మీటింగులో మాట్లాడుతున్న మా ఏవీపీ (Asst. Vice President) మాటలు వినగలం కానీ మేమేమీ అనలేము, అడగలేము.
ఇంతకీ ఆ ఒక-పక్క-మూగ మీటింగ్ సారాంశం ఏంటీ అంటే "ఓ ఎంతో విలువైన ఉద్యోగుల్లారా! మీ విలువ ఇహ నుంచి అక్కర్లేనిదయింది. అందుకని అదనమైన మీ పదవి ఊడబోతోంది. ఎవరు అందందే ఉందురో, ఎవరెవరు అదనమై పోదురో అందరి ముందూ చెప్పలేం. ఇవాళ సాయంత్రం మీ మీ ఈ-మెయిళ్ళకి పంపించి తెలియజేస్తాం." అని చెప్పి ఓ పదిహేను నిముషాల్లో సమావేశాన్ని చుట్టేశారు.
అంతటి సమాచారం విన్నప్పటికీ అది మాక్కూడా వర్తిస్తుందన్న వర్తమాన-సత్యం అప్పటికీ బోధపడలేదు వేనెట్‌కీ, నాకూ. ఇంకా మా పదవులు పదిలమే అన్న ధీమాతోనే వున్నాము.
సరిగ్గా సాయంత్రం నాలుగయ్యేటప్పటికి "టింగు" మని శబ్దంతో ఓ పది పేజీల డాక్యుమెంటటాచ్మెంటుతో ఈ-మెయిల్ వచ్చింది.
అన్ని పేజీలు చదివినా అర్థమయింది మాత్రం - ఉన్న ఉద్యోగం వుండబోయేది ఇంకో మూణ్ణెల్లు, ఆ లోగా ఇంకో ఉద్యోగం internal గానే వెతుక్కోకలేకపోతే ఇక చెల్లు - అని.
అది చూడగానే కలయో నిజమో వైష్ణవమాయో తెలిసీ తెలియని అయోమయంలో అంటూ సముద్రాల వారి పాట hum చేసుకుంటూ, ఒక్క గెంతులో నా cubicle బయటికి వెళ్ళేటప్పటికి, అటు నుంచి వేనెట్ కూడా అదే expression తో నా ఎదురు-cublicle లోంచి గెంతొచ్చి నా ఎదురుగా నించుంది.
"నాకేమో మెయిలొచ్చినది!... నీకూనూ వచ్చినట్లున్నది?!" అని ఒకరినొకరం పరామర్శించుకున్నాం.
మళ్ళీ వెంటనే "ఇంకో మూణ్ణెల్లు సమయముంది కదా... ఇంతోటి ఉద్యోగం ఇంకోటి వెతుక్కోలేకపోము" అని ఒకరికొకరం చెప్పుకున్నాం.
ఆ మరుసటి రోజు ఆఫీసుకి రాగానే వేరే వూళ్ళో వుండే - తానాడుండి, ఆణ్ణుంచి నన్నాడించే మా ఆడ బాస్ - జూలియా నుంచి ఫోను. ఏంటీ అంటే ఇవాళ మధ్యాహ్నం రెండింటికి నీకొచ్చిన ఈమెయిల్ చదివి వినిపిస్తానూ అని.
"అరె! నీకా శ్రమ ఎందుకు జూలియా? నేను చదివేసుకున్నా. అర్థమయిందిలే!" అన్నా.
నే పేజీ పేజీ లెక్క పెట్టి పదిపేజీలూ చదివానని చెప్పినా మా జూలియా వినక "నువ్వు చదువుకున్నది లెక్కలేదు. నేను చదివితే నువ్వు విన్నదే లెక్క - అది నా డ్యూటీ" అంది.
సరే! చేసేదేముంది ఇక! ఆ రోజు మధ్యాహ్నం lunch hour అయిపోగానే జూలియా ఫోన్ చేసి ఆ పదిపేజీల పత్రం చదవడం మొదలు పెట్టింది.
అప్పటికే దాన్ని నేను చదివేసి వున్నాను. పైగా లంచ్ చేసి వున్నాను. హెడ్-ఫోన్స్ లోంచి మంద్రంగా వినిపిస్తున్న జూలియా గొంతు వింటుంటే నిద్రొచ్చేస్తున్నట్టనిపించింది. కానీ మొత్తం విన్నాను.
దాదాపు పది-పదిహేను నిముషాలు అయ్యాక చదవడం ఆపి, జూలియా నన్ను "లలితా! నేను చదివింది విన్నావు కదా! ఏమన్నా అడగాలనుకుంటున్నావా?" అని అడిగింది.
"అంటే ...జూలియా! నువ్వు చెప్పింది అంతా బానే అర్థమయింది..కానీ...ఈ చివరి మూడు నెల్లూ ... !" తర్వాత నేనబోయేది వింటే అనవసరంగా ఆ విషయం గుర్తు చేసినట్లవుతుంది ఆగాను.
"ఊఁ ... ఈ చివరి మూడు నెల్లూ ... ?!" నేనన్న చివరి మాటలంటూ తర్వాతేంటో చెప్పూ అన్నట్టు ఆగింది జూలియా ఫోను లైనుకి అవతల.
"మ్మ్ ..."
"నాకు తెలుసు లలితా! ఇది ఊహించని వార్తే! కానీ ఈ మూడు నెల్లూ నీకు వచ్చే జీతం, ఇప్పటికే ఇచ్చేసిన బోనస్ అన్నీ వస్తాయి. నేను ఇప్పటికే మిగిలిన టీముల డైరెక్టర్లకి నీ పేరు పంపించాను. తొందర్లోనే నీకింకో టీంలో వచ్చేస్తుంది." నన్ను ఓదారుస్తున్నట్టుగా, ధైర్యం చెప్తున్నట్లుగా హామీలిచ్చేస్తోంది జూలియా.
జూలియా అలా మెత్తగా మాట్లాడుతుంటే ఇంతకు ముందు చెప్పకుండా ఆగిపోయినది ఇప్పుడు చెప్పేయాలనిపించింది.
ఏ మాటకామాట చెప్పుకోవాలి - అంతకు ముందు వేరే టీంలో వున్న నన్ను జూలియా కావాలని పట్టుబట్టి తన టీంలోకి తీసుకుంది. ప్రతిసారి ఏదైనా పెద్ద డిజైన్ సమస్యని పరిష్కరించినప్పుడు "You never cease to amaze me, Lalitha!" అని తెగ మెచ్చేసుకునేది కూడా!
అందుకే గబగబా "అది కాదు జూలియా... నాకు తెలుసు నేను నీ టీంలో ఉండబోయేది ఇంకో మూణ్ణెల్లే అని. నాకు కిందటి వారమే కొత్త లాప్టాప్ వచ్చింది. చాలా sleek గా వుంది. నాకు బోల్డు నచ్చింది. ఈ మూణ్ణెళ్ళూ అదే వాడుకుంటాను, కాదనకూ, please!" అనేశాను.
నేనలా అనగానే ఫోన్ లైన్ అవతల ఒక నిముషం నిశ్శబ్దం. ఒక నిట్టూర్పు.
నాకేమో అప్పటికీ అనుమానంగానే వుంది - నేనెలాగూ వెళ్ళిపోతాను, ఈ కొంచెం రోజులకి కొత్త లాప్టాప్ ఎందుకూ, టీంలో ఉండబోయే ఇంకెవరికైనా ఇచ్చేయ్ - అంటుందేమో అని. అందుకే అసలు నా కొత్త లాప్టాప్ గురించి మాటే ఎత్తకూడదనుకున్నాను. ఇపుడేమో తొందర పడి అడిగేశాను అని నన్ను నేనే తిట్టేసుకుంటున్నాను.
అప్పుడు నెమ్మదిగా జూలియా కూడబలుక్కుంటున్నట్టుగా అన్న మాటలు ఏంటంటే "ఇంతకీ నీ బాధంతా నీకు నచ్సిన కొత్త లాప్టాప్ వాడుకోలేకపోతానేమోననా? నా 30 ఏళ్ళ career లో నీలాంటి వాళ్ళను ఎప్పుడూ చూడలేదు. You never cease to amaze me, Lalitha!"
అలా అందే కానీ పాపం ... మా జూలియా నా కొత్త లాప్టాప్ నన్ను వాడుకోనిచ్చింది. అదే లాప్టాప్‌తో నేనింకో కొత్త టీం-ప్రవేశం కూడా చేశాను.
జూలియాతో ఫోన్ కాల్ అయిపోయాక నేను భలే ఆనందంగా వేనెట్ దగ్గరకెళ్ళి జూలియా ఏముందో చెప్తే, తనొక్క నిముషం కూడా ఆలోచించకుండా "That's her polite way of saying 'You're incorrigible, Lalitha!'" అనేసింది.
అన్నట్టు అప్పుడే నేను నా మొట్టమొదటి Terzanelle రాశాను కూడా... Cross-Roads
ఆ మొట్టమొదటి surplus letter తో నే నేర్చుకున్న పాఠమే నా ఈ సిన్మతీ గిద్యం:
కొలువున ఉండిన నీదే లెక్క
కొలువు ఊడెనా నీవొక అంకె
కొలువున్ననాడు మేనేజరమ్మ
కొలువు వీడితే కొలుపులో బొమ్మ సిన్మతీ!