20, జూన్ 2022, సోమవారం

విరాటపర్వమను అడవి గాచిన వెన్నెల కత

    "విరాట పర్వం" సినిమా చూసీ చూడగానే ప్రేమలో పడిపోయా. 
    కారణం - సినిమా మొదలైన దగ్గర్నుంచి ముగిసేదాకా పురి కొలిపేలా కైతల వెల్లువ.  

    సినిమా చూశాక కైత కట్టకుండా ఉండలేకపోయా. 
    ప్రేరణ - సినిమా మొదలైన దగ్గర్నుంచి ముగిసేదాకా పొంగి పొర్లిన కైతల వెల్లువ.  

    "విరాట పర్వం" మీద నాకు పుట్టిన ప్రేమ గురించి చెప్పే ముందు - ఆ సినిమా మీది ప్రేమతో రాసుకున్న ఓ చిన్ని కైత... 


*** *** *** *** ***
*** *** *** *** ***

మొగిలుత్రోవ నీడగా 
పచ్చనాకు తోడుగా 

పాట కట్టిన జోదు 
జోడు కోరి 

ఆ పాట పక్క జేరి 
గొంతు కలిపి పాడ  
మక్కువొచ్చి 

రెక్క జాచి  
పులుగు వోలె ఎగరబోయి 

పులుముకున్న ప్రేమ తోటి 
ఎఱ్ఱెఱ్ఱటి సీతాకోకచిలుక లాగై 
వలపు వోలె ఎదకు చేర 

తగని మాలిమై 
తెగడిక పాలై  

పూచిన నేలనే 
మలిగిన వెన్నెల కత ఇది 
కన్నీటి చాలున 
గెలవని వలపు వెత ఇది 

అచ్చంగా... 
అడవి పాలైన ఓ కన్నె వెత ఇది 
అడవి గాచిన వెన్నెల కత ఇది 

*** *** *** *** ***
*** *** *** *** ***

    

    "విరాట పర్వం" వచ్చింది ఊళ్లోకి అని తెలియగానే - సినిమా మీద నాకున్న ప్రేమ తెల్సిన బద్రి - నా మీద ప్రేమతో - ఆ సినిమాకి ఓ రెండు టికెట్లు కొన్నారు.

    శనివారం సాయంకాలపు ఆట. 

    చెస్టర్ ఫీల్డ్ మార్కస్ థియేటర్లో సరిగ్గా ఎనిమిది గంటల పది నిముషాలకి. 

       "విరాట పర్వం" గురించి చెప్పే క్రమంలో నన్ను నేను మర్చిపోయి - ఆ సినీమాయలో ఏదేదో చెప్పేసే ముందు - ఆ సినిమా చూసిన నాలుగున్నర మనుషుల గురించి ఓ నాలుగు ముక్కలు చెప్తాను. 

    సిన్మా మొదలయినప్పుడు ఐదుగురం ఉన్నాం థియేటర్లో. అందులో ఒకరు మధ్యలో పేలాలు తినేసి, కూల్డ్రింక్ తాగేసి వెళ్ళిపోగా - సినిమా చివరి వరకు ఉన్నవాళ్ళం - నలుగురం. 

    అదీ ఆ నాలుగున్నర మనుషుల లెక్క. 

*** *** *** *** ***
*** *** *** *** ***

    బద్రి ఉన్న రెండు టిక్కెట్లలో ఒకటి నా చేతిలో పెట్టి "ముందు నువ్వు పద...నేనో పది నిముషాల్లో వస్తా" అన్నారు. 

    సరిగ్గా ఎనిమిది గంటలకి పాప్‌కార్నున్న టబ్బు-సహిత-నేను వెళ్లి ఎనిమిదో నంబరు తలుపు లోకి వెళ్లి, F-18 సీట్లో కూర్చున్నా. 

    నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. "విరాట పర్వం సినిమా అంటే బోల్డుమంది రావాలి కదా - అసలెవరూ లేరేంటి? ఇంతకీ నేను సరైన థియేటర్‌కే వచ్చానా, ఒకసారి బయటికి వెళ్ళి చూసొద్దామా?!" అనుకుంటూ వున్నాను. 

    ఇంతలో ఒకతను పాప్‌కార్నూ-కూల్డ్రింకప్పూ రెండు చేతులా పట్టుకుని వచ్చి నా వెనకాల వున్న పై వరసలో కూర్చున్నాడు.

    నేను కూడా సర్దుకుని కూర్చుని - "అసలే ఇది కొంచెం సీరియస్సు సిన్మా - తీరా సినిమా మొదలయ్యాక ఆ తెర మీద వాళ్లు బాధ పడుతుంటే పాప్‌కార్న్ తినగలనో లేదో, అసలే ఇంట్లోంచి హడావిడిగా సగం భోంచేసి వచ్చాను. కొంచెం తిందాం ఇప్పుడు" అనుకుని ఓ రెండు మొక్కజొన్న పేలాలని నోట్లో వేసుకోబోతుండగా - నా ముందు నుంచి ఒక జంట వస్తూ కనిపించారు. 

    అందులో ఒకరు నన్ను చూసి - అంత చీకట్లోనూ, అంత మాస్కు పెట్టుకున్న నన్ను చూసి - "లలితా!" అని పిలవగానే ఎవరబ్బా అని ఆశ్చర్యపోయేశా. 

    తీరా చూస్తే తను వసుధ. పక్కనే తన జీవనసహచరుడు. భలే! వాళ్ళ సీటు నంబర్లు కూడా మా పక్కనే. F-19, F-20. 

    మంచి సినిమా చూడడానికి మా మంచి తోడే మా వసుధ అనుకుని మురిశా. 

    మొలకనవ్వులూ, పలకరింపులూ అయ్యాయో లేదో సిన్మా మొదలయ్యింది. 

    ఇంతలో బద్రి కూడా వచ్చారు. 

    మళ్లీ ఇంకొన్ని నవ్వులు, రింపులు. 

    ఇవన్నీ అవుతుండగానే తెర మీద నివేదా పేతురాజ్ పురుడు పోసి, బొడ్డు కోసి పేరెట్టిన వెన్నెల "యుద్ధం వల్ల కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోతారు. కానీ ఒక యుద్ధం నాకు ప్రాణం పోసింది" అని స్వగతిస్తూ  పుట్టేసింది. 

    వెన్నెలకి పేరెట్టి బొట్టెడుతూ ఉండగానే తుపాకీ గుండు తగిలి నివేదా పేతురాజ్ "లాల్ సలాం" అంటూ నేల కొరుగుతుంది. 

    అదే సమయంలో "స్స్" అని నా పక్కనే కూర్చున్న వసుధ నుంచి ఒక చిన్న శబ్దం. తెర మీద జరిగుతున్న హింసకి తన ప్రతిస్పందన అది. 

    ఆ తర్వాత కొన్ని క్షణాలకే - కనిపిస్తున్న పచ్చదనమో, వినిపిస్తున్న పల్లెపదమో - ఈ రెండిట్లో ఏదో ఒకటే కాకుండా - ఒకటికి ఇంకొకటి తోడై - రెండూ జోడై - ఒక్కసారిగా నన్ను కమ్మేశాయ్. 

    ఇహ ఇప్పట్నుంచీ ఇక అంతా - విరాట పర్వమను అడవి గాచిన వెన్నెలే!
    
    ఈ కథ నడిపించే కన్నియ - కబ్బపు చెలిమరి - వెన్నెల
    
    ఆ వెన్నెల మనసుపడ్డవాడు - కబ్బపు చేతరి - అరణ్య. 

  

    
*** *** *** *** ***
*** *** *** *** ***


    తెర నిండా... 
    పరచుకున్న పచ్చదనం
    తెలంగాణ పల్లెదనం
    తెలుగు వొలికె పదం-పదం. 

    అక్కడ పుట్టిన వెన్నెలకి - ప్రేమంటే ప్రేమ. 

    ఒగ్గుపాటల నాన్నంటే ప్రేమ. 

    తగవులాటల తల్లంటే ప్రేమ.

    చిన్నపాపగా వున్నప్పుడే కృష్ణుడి బొమ్మను ప్రేమిస్తుంది వెన్నెల. ఎంతగా అంటే బావిలో పడిన కృష్ణుడి బొమ్మనెతుక్కుంటూ తానూ దూకేలా. 

    అరణ్య రాసిన కవితలు చదివి - అతనెవరో, ఎలాంటివాడో తెలియకుండానే ప్రేమలో పడుతుంది వెన్నెల. 

    అతని కవితలు చదివి అరణ్యంటే ప్రేమ కలిగాక తన డైరీలో అతనంటే తనకెంత ఇష్టమోనని ఎన్నెన్నో ఉత్తరాలు రాసుకుంటుంది వెన్నెల. 

    చుట్టుపక్కల ఊళ్ళకి, తన చుట్టూ వున్న దళానికి అతను రవన్న. 

    అతను రాసిన పదాలని వలచి, అతని దారిలో తన పదం కలపాలని ఆశ పడ్డ వెన్నెలకి మాత్రం - అక్షరాలా - అతను అరణ్య.

    ప్రేమలో వున్నపుడు 
ఎవరికైనా సరే... 
మనసు నిండా ఒకే తలపు
మాట నిండా అదే పిలుపు
చేతలో అదే చెయివు. 

    కన్నెమది ఎవరినైతే ఇష్టపడుతుందో - 
    కనులు తెరిచినా
    కలల వెదికినా
    కన్నులెదుట నిలుపుకున్నా
    కన్నుల మాటున పొదవుకున్నా
    అతని జాడ, అతని నీడ, అతనిదన్న ఏదైనా సరే - 
    కన్నియ కది పెన్నిధే. 
  
    అందుకే - 

    అరణ్య మీది ప్రేమతో ఎఱ్ఱరంగు పులుముకున్న సీతాకోకచిలుకవుతుంది వెన్నెల.

    అరణ్య మీది ప్రేమతో కుట్టుడాకులో రెండుమూడాకులు వదిలి పెట్టి, ఆ ఖాళీతో సుత్తీ-కొడవలి గుర్తుగా కుట్టుకుని దీపపు వెలుగులో గోడ మీద ఆ ఆకు నీడ చూసి మురిసి పోతుంది వెన్నెల. 

    అరణ్య మీది ప్రేమతో లాంతరు మసి మీద వేలుతో అరణ్య పేరు రాసుకుని కన్నుల వెలిగించుకుంటుంది వెన్నెల.

    అరణ్య మీది ప్రేమతో ఊళ్లో ఇంటి గోడల మీదున్న సుత్తీ-కొడవలి చుట్టూ తన గుండె-గీత గీసి గాలిలో తేలిపోతుంది వెన్నెల. 

    ఇంత చేసి అంతటితో ఆగక - అరణ్య మీది ప్రేమతో అమ్మని, నాన్నని, మనువాడ వచ్చిన బావనీ, పుట్టి పెరిగిన ఊరినీ - వదిలి ప్రేమించిన అరణ్యని వెతుక్కుంటూ వెళ్తుంది వెన్నెల.  

    అనుకోకుండా అరణ్యని పట్టుకోవడానికో, మట్టు పెట్టడానికో వేసిన పథకంలో పావవుతుంది వెన్నెల. 

    పాపమనిపిస్తుని వెన్నెల. 

    అరణ్య(అడవి) కలం పేరు పెట్టుకున్న రవన్నని ప్రేమించి - ఆశించిన ప్రేమ దక్కక - అక్షారాలా "అడవి గాచిన వెన్నెలౌ"తుంది వెన్నెల. 


*** *** *** *** ***
*** *** *** *** ***





    ఈ "విరాట పర్వం" సినిమా గురించి రాయాలంటే బోలెడుంది. 

    ముందుగా సినిమా అంతటా వినిపించే కవితలు, మంచి సంభాషణలు. 

    అరణ్య రాసుకున్న కవితలు... 

"చిన్న ఎవడు
పెద్ద ఎవడు
సామ్యవాద పాలననే స్థాపించగ ఎన్ని నాళ్ళు"

... ... ... ... 

"ఆధిపత్య జాడలనే చెరిపివేయగ ఎన్నినాళ్ళు
తారతమ్య గోడలనే పెకిలించగ ఎన్ని నాళ్ళు?
దున్నెటోడి వెన్ను విరిచి భూస్వాములు ధనికులైరి"

    తనని ప్రేమించొద్దని వెన్నెలని ఒప్పించడానికి అరణ్య చెప్పిన మాటలు 

    "ఇక్కడ ప్రేమలు ఉండవ్
    ఊపిరికి ఊపిరికి మధ్య 
    ఊపిరి సలపని 
    యుద్ధమే ఉంటుంది"

    తనని ప్రేమించొద్దన్న అరణ్యతో కన్నీళ్లతో వెన్నెల చెప్పిన మాటలు... 

    "నీ రాతల్లో నేను లేకపోవచ్చు. 
కానీ నీ తలరాతలో ఖచ్చితంగా నేను ఉన్నాను. "

    తన ఇంటి నుంచి అరణ్యని కలవడానికి వెళ్తున్న వెన్నెలకి ఓ కాయితమ్మీద శకుంతలా టీచర్ రాసిచ్చిన సూఫీ వాక్యాలు... 

    "జీవితంలో ఏ అనుభవం ఎదురైనా స్వాగతించు. 
ప్రతి అనుభవం మన గుమ్మం లోకి వచ్చిన అతిథి లాంటిదే!"

    అరణ్యని కలవడానికి వెన్నెల వెళ్ళబోయేముందు ఆమెని కలిసిన తండ్రి ఒగ్గుకథలు చెప్పే గొల్ల రాములు చెప్పిన మాటలు...     
    
"జీవితంలో రెండే రోజులు ముఖ్యమైనవి
మనం పుట్టిన రోజు
మనం ఎందుకు పుట్టామో తెలుసుకున్న రోజు"


    అరణ్యని కలవడానికి వెన్నెల వెళ్ళబోయేముందు ఆమె తన తండ్రిని తనకిష్టమైన శేషప్ప కవి పద్యం పాడమని అడుగుతుంది. అప్పుడాయన పాడిన నృసింహశతకం లోని సీసపద్యం... 

    (ఇది నాకు కూడా ఇష్టమై నేను కూడా పాడుకునే పద్యం అవడంతో  - ఇది సినిమాలో వింటూనే పులకరించిపోయా! మా నాన్న కూడా నృసింహశతకం పాడతారు. ఆయన పాడే బాణీలో పాడుకుని పరవశించిపోయా !)

"అడవి పక్షుల కెవ్వడాహార మిచ్చెను
మృగజాతి కెవ్వడు మేత పెట్టె
వనచరాదులకు భోజనమెవ్వ డిప్పించెఁ-
చెట్ల కెవ్వడు నీరు చేఁదిపోసె
స్త్రీల గర్భంబున శిశువు నెవ్వడు పెంచె
ఫణుల కెవ్వడు పోసె బఁరగ పాలు
మధుపాళి కెవ్వడు మకరంద మొనరించె
పసుల కెవ్వఁ డొసగెఁ బచ్చిపూరి

జీవకోట్లను బోషింప నీవెకాని
వేఱె యొక దాత లేఁడయ్య వెదకి చూడ
భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర"


    (ఇంకా ఇందులో నేను చిన్నప్పుడు చదివిన మంచి కవిత ఒకటుంది... సినిమా చూసేటప్పుడు గుర్తు పెట్టుకున్నాననుకున్నాను కానీ ఇన్ని విషయాల మధ్య మర్చిపోయాను. ఈ సినిమా OTT లో వచ్చినప్పుడు చూసి మళ్ళొచ్చి రాసుకోవాలి ఇక్కడ.)



*** *** *** *** ***
*** *** *** *** ***


    
    ఇహిప్పుడు చెప్పుకోవాల్సింది సినిమా తీసినవారూ, సినిమాలో చేసినవారి గురించి.

    తను అనుకున్న కలని అనుకున్నట్టుగా తీయాలంటే ఆ కలని ఎంతో ప్రేమించాలి.

    ఆ ప్రేమ ఎంతుండాలంటే ఆ కలని కథగా చెప్పి కళగా మలిస్తే గెలుస్తుందని నమ్మి నలుగురూ తనతో నడిచేంతగా. 

    ఆ కలని కైతలతో కతగా చెప్పాలంటే తెలుగు భాష మీద అంతులేని ఇష్టముండాలి - ఎంతో పట్టుండాలి. 

    తను పుట్టిన గడ్డలో పుట్టీపుట్టగానే మట్టిలో కలిసిపోయిన నిజజీవితపు ప్రేమకథని అందరికీ అందించాలని కల గని, కథగా మలచుకొని, కళగా వెలయించిన దర్శకుడు - వేణు ఊడుగులకి నా లాల్ సలాం.

*** *** *** *** ***
*** *** *** *** ***



    ఈ కథ నేపథ్యాన్ని బట్టి చూస్తే పోలీసు జులుం ఎలా ఉండేదో నిరూపించే సాకుతో ఎంత హింసనైనా చూపించొచ్చు. కానీ అలా చేయలేదు. 

    ఈ సినిమాలో పోలీసులు వాడిన భాష కూడా ఉన్నంతలో సంస్కారవంతంగా ఉంది. ముఖ్యంగా బెనర్జీ మాట్లాడిన కొన్ని ఆంగ్లవాక్యాల్లో ఆయన వాడిన ఉచ్చారణ చాలా బావుంది. ఈ విషయంలో వేణు ఊడుగులకి లాల్ సలాం!

    అలాగే అడవులు-జలపాతాలు, అమ్మాయీ-అబ్బాయీ-ప్రేమలు - ఉంటే ఆ పేరు చెప్పి అమ్మాయిలని జలపాతాల కింద పాటలు పాడించి, డాన్సాడించొచ్చు. సహజత్వం పేరుతో ఎన్ని అసహజాలైనా చేయించొచ్చు. కానీ ఈ సినిమాలో అవేమీ చూపించనందుకు - వేణు ఊడుగులకి లాల్ సలాం! 

*** *** *** *** ***
*** *** *** *** ***

    దర్శకుడి తర్వాత లాల్ సలాం అందుకోవాల్సిన స్థానం - రానాది. 

    అంత ఎత్తు ఉండి, మంచి screen presence ఉండి, తను తలుచుకుంటే కథని తిరగ రాయించదగ్గ ఆర్థిక-సత్తా ఉండి కూడా కథకి తగ్గట్టు ఒదిగి తనని తాను తగ్గించుకుని - కథ ప్రకారం వెన్నెలనే ఎత్తి చూపగల స్వాతంత్ర్యాన్ని దర్శకుడికి ఇవ్వగలగడానికి - కావల్సినవి ఏంటంటే - సినిమా అంటే ప్రేమ, దానిని మించిన guts. అవి వున్న రానాకి లాల్ సలాం!

*** *** *** *** ***
*** *** *** *** ***

    మొదటి నుంచి చివరి దాకా అంతా తనే అయి - వెన్నెలలా వెలిగిన సాయి పల్లవి గురించి రాయలంటే అదే ఇంకో పెద్ద పోస్ట్ అవుతుంది. అందుకే ఒక్కమాటలో నాకనిపించింది చెప్తాను - సాయి పల్లవి లాంటి ఇంకో వెన్నెల ఉండదు, ఉండబోదు.  

    తనెప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నిజ్జంగా చెప్పాలంటే మేము థియేటర్‌కి సినిమా చూడడానికి వెళ్ళాలీ అనుకున్నది మాత్రం - సాయి పల్లవి వల్లే. 

*** *** *** *** ***
*** *** *** *** ***


    ఇక ఈ సినిమాలో కనిపించిన నివేదా పేతురాజ్ (వెన్నెలకి పురుడు పోసిన కామ్రేడ్), ఈశ్వరీ రావు (వెన్నెల తల్లి), నందితా దాస్ (శకుంతలా టీచర్), ప్రియమణి (భారతక్క), జరీనా వహాబ్ (అరణ్య తల్లి), నవీన్ చంద్ర (రఘన్న) - ఇంకా మిగిలిన అందరికీ పేరుపేరునా లాల్ సలాం!

*** *** *** *** ***
*** *** *** *** ***

    ఇందులో జరీనా వహాబ్‌ని చూడడం ఒక pleasant surprise నాకు. 

    ఈ మన అచ్చతెలుగావిడ హిందీ సీతామాలక్ష్మి (జరీనా నటించిన "సితార" అనే హిందీ సినిమా మన కె. విశ్వనాథ్ సీతామాలక్ష్మికి re-make). 

    గాజుల కిష్టయ్య సినిమాలో కృష్ణతో పాడించుకున్న"నవ్వులు రువ్వే పువ్వమ్మా" పాట, ఘరోండా సినిమాలో అమోల్ పాలేకర్‌తో పాడిన "దో దివానే శహర్ మే" అనే పాట ఒకదాని తర్వాత ఒకటి గుర్తొచ్చాయి ఈమెని చూడగానే. 


*** *** *** *** ***
*** *** *** *** ***

    ఇక చివరాఖరిగా ఒకట్రెండు విషయాలు...

    అంతా బానే ఉంది కానీ... అసలు ఈ సినిమాకి "విరాట పర్వం" అనే పేరు ఎంత వరకు సరిపోతుందా అని నేను ఎంతగా ఆలోచిస్తున్నానో! 

    ఏదో సినిమా పేరుని justify చేసుకోవడానికన్నట్లు రవన్నని (అరణ్యని) పట్టుకోవడానికి ఎలాంటి పథకం వేద్దామా అని ఆలోచిస్తూ -  మహాభారతంలో విరాటపర్వంలో జరిగినంతటి కుట్రల లాంటివి చెయ్యాలీ అంటాడు ఓ పోలీసాయన (బెనర్జీ). 

    కానీ మహాభారతంలో విరాటపర్వంలో అంత పెద్ద కుట్రలూ, కుతంత్రలూ ఏమున్నాయబ్బా?

    కురుసభలో జూదమాడి ఓడి పందెం ప్రకారం అజ్ఞాతవాసం చేస్తున్న పాండవులని ఎలాగైనా ఏడాది లోగా బయటికి రప్పించి నియమోల్లంఘనమయ్యిందని మళీ పన్నెండేళ్లు వనవాసం చేయిద్దామనుకుని దుర్యోధనుడు చేయించిన ఉత్తరగోగ్రహణంలో పంపించిన ఆవుల మందతో పోల్చదగ్గదా అరణ్యని ప్రేమించిన వెన్నెలనే అతని దళం లోకి పంపేలా ప్లాన్ చేయడం? 

    నిజానికి - హాస్యానికి పోల్చాలీ అంటే - పాడవులు విరాటరాజు కొలువులో చేరడాన్ని - ఏనుగుల గుంపు దోమ గొంతులో చేరినట్టు పోల్చారు ఒకప్పుడు. ("కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్").

    కానీ ఈ విరాట పర్వం సినిమా ప్రకారం  అది - దోమ కుత్తుక చిక్కెన్ కుంజర యూధంబునన్  - అన్నట్లయ్యింది  - ఎలా అంటే - ఏమీ తెలియని ఓ ఆడపిల్ల సాయుధ దళం లోకి వెళ్ళింది మరి! 

    అన్నట్టు - వెన్నెల అడవి దారుల్లో అరణ్య  దగ్గరికి వెళ్ళడానికి బయల్దేరినప్పుడు వలలో చిక్కినట్టు - సాలెగూడు Symbolic గా తెర నిండా చూపించడం బాగు - బహు బాగు! 


*** *** *** *** ***
*** *** *** *** ***


    సినిమా చూసాక నాకనిపించిన ఇంకో విషయం కూడా చెప్పాలండోయ్! 

    ఇంత గొప్ప కథ కదా! అంత మంచిగా తీశారు కదా! అందరూ ఎంతో బాగా చేశారు కదా! ఇంకింతకన్నా చెయ్యడానికి ఏమీ లేదు కదా!

    నిజానికి కథ చూస్తున్నంత సేపూ ఎంతో ఏడుపు రావాలి కదా! 
 
    కానీ అదేంటో - చూస్తున్నంత సేపూ - ఏదో న్యూస్‌రీల్ చూస్తున్నట్టు - ఎప్పుడూ వినే ఓ కాల్పుల వార్తని వింటున్నట్టు అనిపించింది. 

    అంతే !

    కానీ కన్ను చెమర్చి గొంతు పట్టెయ్యలేదు. గుటక పడని బాధ పుట్టలేదు. 

    ఎంచేత?

*** *** *** *** ***
*** *** *** *** ***

    చిట్ట చివరిగా ఇంకొక్క మాట. 

     ఈ సినిమా రెండు రకాలు గా అడవి గాచిన వెన్నెల అయింది.

    ఒకటి - అరణ్య (అడవి) ప్రేమ దక్కని వెన్నెల కథ అవడం వల్ల.

    రెండు - తెలుగే రాని తెలుగు ప్రేక్షకులకి తియ్యనైన తెలుగుదనం నిండిన ఆ మాటలూ, పాటలూ, కైతలూ వినిపించబోయినందువల్ల. 

*** *** *** *** ***
*** *** *** *** ***

    ఏదేమైతేనేం... ఈ సినిమాలో పని చేసిన వారందరికీ బోల్డన్ని లాల్ సలాములతో... 

~ సినీ-మా-లక్ష్మి 


16, జూన్ 2022, గురువారం

గమ్మత్తు పాటలు - 2 - ఛూ లేనే దో నాజుక్ హోఠోం కో...

ఏదో చెప్పాలనుకుంటూ...

చెప్పాలనుకున్నది
అనుకున్నది అనుకున్నట్టుగా 
చెప్పేస్తున్నాననుకుంటూ...

తీరా... చెప్తుండగా 
చెప్పాలనుకున్నది
చెప్పాలనుకున్నట్టుగా 
చెప్పగలుగుతున్నానో లేదో
అనుకుంటూ...

అలా అనిపిస్తుండగా
నే చెప్పాలనుకున్నది ఇదీ... 
కాకపోతే - చెప్పినది ఇదీ...  అని 
వివరించి చెప్తున్నాననుకుంటూ

చివరికి...
అసలేం చెప్పాలనుకున్నానో 
అదసలు చెప్పగలిగానా అనుకుంటూ

చెప్పలేని కబుర్లు మొదలెట్టినందుకు 
నాకు నేనే ప్రైవేట్లు చెప్పుకుంటూ 

ఇంతవరకూ వచ్చాక
ఏదో ఒకటి చెప్పేద్దాం 
పనిలోపనిగా పాటొహటి పట్టుకొచ్చేద్దాం 
అనుకుంటే - 

ఏమౌతుందంటే ...
కలగాపులగమౌతుంది
కబుర్ల కలగూరగంపౌతుంది


*** *** *** ***
*** *** *** ***


 "మంచీ - చెడు తెలిసి కూడా చెప్పలేనివారు 
    ఎవ్వరికీ పనికిరారు - ఏమీ చేయలేరు"

    ఈ రెండు లైన్లూ దాశరథి రాసిన "పెళ్ళంటే నూరేళ్ళ పంటా..." అనే పాట లోవి. 

    ఆ పాటొచ్చేసేమో క్రిష్ణా-విజీనిర్మలా నటించేసిన "మీనా" అనే సిన్మా లోది. 

    ఆ సిన్మా ఏమో తెలుగు-జేన్ ఆస్టెన్ అనదగ్గ యద్దనపూడి సులోచనారాణి రాసిన్నవల. 

*** *** *** ***
*** *** *** ***

    అన్నట్టు నేను ఆరో తరగతి లోనే - జంగారెడ్డిగూడెం లైబ్రరీ నుంచి అమ్మ తెచ్చుకున్న యద్దనపూడి నవలలు చదివినప్పుడు అందులో నాగ్గుర్తున్నవి రెండే రెండు. 

    ఒకటి డబ్బులున్న కథానాయకుడు. ఆయనకి అప్పుడప్పుడూ బిగుసుకునే దవడ కండరాలు. 

    రెండోది డబ్బుల్లేని కథానాయిక. ఆవిడకున్న అంతులేని అత్మాభిమానం. 

    ఇవి రెండూ కూడా ఆనక డిగ్రీలో నేను చదివిన జేన్ ఆస్టెన్ నవలల్లో అచ్చుగుద్దినట్టు కనిపిచేసరికి - భలే వీళ్ళిద్దరూ కూడబలుక్కున్నట్టుగా ఒకేలా రాశారే అనుకుందామనుకున్నా. 

    కానీ వారివారి జీవీతకాలాల్ని బట్టి ఇద్దరి మధ్యా రెండు శతాబ్దాల అంతరం వుందని తెలిశాక పద్ఢెనిమిదో శతాబ్దపు జేన్ రాతల నుంచి ఇరవయ్యో శతాబ్దపు సులోచనారాణి ప్రభావితమవ్వడానికే ఎక్కువ అవకాశం ఉన్నట్టనిపించింది నా మటుక్కి నాకు. 

    అందుకే యద్దనపూడి నా వరకు నాకు తెలుగు-ఆస్టెన్ ఆయెన్.

    సరే! ఇక్కణ్ణుంచి మళ్లొక్కసారి ఇందాకటి పాటకేసి వెళ్లొస్తా! 

*** *** *** ***
*** *** *** ***

    అనగనగా ... మా ఇంట్లో ... ఓ రోజు... 
    
    ఓ బద్ధకపు మధ్యాహ్నప్పూట - నోటికొచ్చిన పాటేదో - పాటలో ఉన్న మాటలన్నీ  ... అటు తిప్పి, ఇటు తిప్పి - పాడిందే పాటగా - పాడుకుంటున్నా... 

 "మంచీ - చెడు తెలిసి కూడా చెప్పలేనివారు
    
తెలిసి కూడా చెప్పలేనివారు - ఎవ్వరికీ పనికిరారు
    ఎవ్వరికీ పనికిరానివారు  - ఏమీ చేయలేరు
    మంచీ-చెడు తెలిసి కూడా చెప్పలేక - ఎవ్వరికీ పనికిరాక - ఏమీ చేయలేక 
    ఏమౌతారు?"

    అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులా - నోటికొచ్చిన నాలుగు లైన్లనీ - అటు తిప్పి, ఇటు తిప్పి - పాటని తిప్పలెట్టి - పడరాని పాట్లు పెట్టి - నోటి పాటికి నోరేదో పాడుకుంటోంది. 

    చెప్పలేని పోటుతో చెవులదే వింటున్నాయి. 

    పాడుతున్న నోరూ నాదే. 

    అది పాడుతున్న పాట వింటున్న చెవులూ నావే. 

    పాట పాడుతున్న నా నోటికి చెవుల్లేవు. 

    తనే పాడుతున్నా - తను వినలేని పాట కాబట్టి... బ్రతికిపోయింది! 

    ఆపాలన్న ధ్యాసే లేకుండా ఉత్సాహంగా పాడుకుంటూనే ఉంది. 

    పాట వింటున్న నా చెవులకి నోరు లేదు. 

    ఆపమని అనాలని ఉన్నా - అనలేని మాట కాబట్టి... దొరికిపోయాయి! 

    "నువ్వు పాడకే నోరూ - మేం వినలేకపోతున్నాం ..." అని చెప్పే ఛాన్సే లేకుండా విధి లేక వింటూనే ఉన్నాయి. 

    

*** *** *** ***
*** *** *** ***

    అలా పాడుతుండగా - అదాటుగా - నాకనిపించింది ఏంటంటే... నా చుట్టూ ఉన్న ప్రపంచంలో అసలు చెడు అన్నదే లేదేమోనని. 

    "చుట్టూ ఇన్ని దుర్మార్గాలు జరుగుతుంటే - నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో  చెడు లేదంటావా - హన్నా?" అని నాకు నేనే ప్రైవేటు చెప్పేసుకున్నా. 

    అలా నా నుంచి నేనే విడివడి - నాతో నేనే వాదిస్తుంటే - నాతో  నేనే చెప్పుకున్నదేంటంటే... 

    "'చెడు' అన్న మాటే చెవులకి చేదుగా ఉంది. అందుకే దాన్ని "మంచి అనిపించనిది" అనుకుని మాటాడుకుంటే మంచిగా అనిపిస్తుందిగా?!" అని. 

*** *** *** ***
*** *** *** ***

    అసలు - అది లేదేమో అని తర్కించుకునే ముందు - "చెడు" గురించి ఇక్కడో మాట అనేసుకోవాలి. 

    ఈ ప్రపంచం మొత్తంలో - అచ్చమైన "చెడు" అనేదొహటి ఉంది. 

    మాట్లాడగల మనుషులనైనా, మాట్లాడలేని జంతువులనైనా, అసలు శబ్దమే చేయలేని చెట్లనైనా సరే  - తన్నో, కొట్టో - పట్టో, కట్టో - తట్టో, నెట్టో - ఎంత చిన్న మోతాదులో ఐనా - కనిపించేలా దెబ్బలు కొట్టో - కనిపించకుండేలా మనసుని బాధ పెట్టో - నొప్పి కలిగించేది ఏదైనా మాత్రం అది చెడే. కానీ దానికి తగిన పేరు "దుర్మార్గం". దాని జోలికి నేనెళ్లట్లేదు. 

    ఆ దుర్మార్గాన్ని - మినహాయిస్తే ఇహ మిగిలిందల్లా - మామూలు సాదా-సీదా ప్రపంచం. 

    ఇందులో  - స్వచ్ఛమైన మంచి ఉందేమో కానీ - సంపూర్ణమైన చెడు - అనగా అచ్చమైన absolute చెడు అస్సలు లేనే లేదు. 

    కొంచెమైనా సరే - మంచిగా ఉన్న మంచిని - "నువ్వెంత మంచివే!" అని మెచ్చుకుని ఇంకొంచెం పెంచక - మంచిని మంచిగా ఉండనీయక - మంచిని చెడనిచ్చి తగ్గనిస్తున్నాం.  ఇక్కడ మంచిని అపేక్షించి పెంచాలి. 

    అలా చెడ్డ మంచిని - చెడినది అతికొంచెమైనా  - "నువ్వు మహా చెడ్డవి సుమా!" అని మరింత ఎత్తి చూపి - మంచిగా మారనీయక - చెడుని మంచిగా పైకి తెస్తున్నాం.  ఇక్కడ చెడుని ఉపేక్షించి తుంచాలి. 

 

*** *** *** ***
*** *** *** ***

    నాకు సంబంధించినంతవరకు వ్యక్తులైనా, వారి వర్తనలైనా, వారు వాడే వస్తువులైనా - ఏదైనా సరే రెండే రకాలు. 

    ఒకటి - ఎవరో ఒకరికి మంచి అనిపించేది - ఇది అందరికీ మంచి అనిపించక్కర్లేదు - అలా అని కచ్చితంగా చెడు అయి ఉండక్కర్లేదు. 

    రెండోది - ఎవరో ఒకరికి మంచి అనిపించనిది - ఇది కచ్చితంగా చెడు అయి ఉండక్కర్లేదు - ఇంకెవ్వరికీ మంచి అనిపించదనీ కాదు. అందుకే దీన్ని "మంచి కానిది" అని కూడా అనలేను. 

*** *** *** ***
*** *** *** ***

    అప్పుడెప్పుడో Will Durant అనే ఓ అమెరికన్ పెద్దాయన చెప్పినట్లు మంచి-చెడులు అనేవి relative అనే అనుకుందాం. 

    Relativity అనగా సాపేక్షత. 

    సాపేక్షత అంటే?

    తనంతట తానుగా ఉండడానికి, తనంటూ ఉన్నానని అనిపించుకోవడానికి వేరే దాని మీద ఆధారపడమే సాపేక్షత. 

    ఆ లెక్క ప్రకారం చూస్తే - ఇంచుమించుగా అంతా ఉన్నది మంచే. 

    అది మంచో, కాదో - అవడమూ కాకపోవడమూ - మనకి కనిపించిన దాని గురించి మనకనిపించడం లోనే వుంది.

    ఎందులోనైనా - మనకి కనిపించినదే మంచి. మనకనిపించినదే మంచి.

    ఆ మంచి ఇంచుక - ఒక ఇంచు -  అటూఇటూ అనిపించినా  - చటుక్కున దాన్ని చెడనేస్తున్నాం. 

    ఇదే విషయాన్ని ... అప్పుడెప్పుడో  రఫీ సాబ్ కూడా - ఓ మత్తు పాటలో  - "అఛ్చోం కో బురా సాబిత్ కర్‌నా - దునియా కీ పురానీ ఆదత్ హై" అని గమ్మత్తుగా పలికించారు తన గొంతులో. 

    ఇక్కణ్ణించి ఆ మామంచి పాట గురించి కొన్ని మంచి కబుర్లు.... 


*** *** *** ***
*** *** *** ***


    పాట: ఛూ లేనే దో నాజుక్ హోఠోం కో... 
    సినిమా: కాజల్ 
    పాట రాసినవారు: సాహిర్ లూధియాన్వీ 
    పాటకి బాణీ కట్టినవారు: రవి 
    పాటకి ప్రాణం ఇచ్చినవారు: రఫీ 
    పాటలో మంచి అనిపించేవారు: మీనాకుమారి 
    పాటలో మంచి అనిపించనివారు: రాజ్ కుమార్ 
    పాటకి యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=SZTBAdhBgTw

*** *** *** ***
*** *** *** ***

    
    రఫీ సాబ్ గొంతులో గారాలు పోతున్నట్టుగా సాగే ఈ రాలుగాయి-పాట నాకు భలే ఇష్టం. 

    మొదటిసారిగా దీన్ని విన్నది మాత్రం ఎప్పుడంటే - తిరుపతి యూనివర్సిటీ కేంపస్‌ రోజుల్లో. 

    ఏ చిన్న విషయానికో అరువుదెబ్బలాడుతున్న నా పక్కనే నడుస్తూ "అఛ్చోం కో బురా సాబిత్ కర్‌నా - దునియా కీ పురానీ ఆదత్ హై" అని పాడుతూ తన నవ్వుతో మంచితనాన్ని మరింతగా ఎస్టాబ్లిష్ చేసేసుకుంటూ బద్రి పాడినప్పుడు. 

    వింటుండగానే నచ్చేసిన ఆ రెండు లైన్ల పాట - ఆ తర్వాత పూర్తిగా విన్నప్పుడు ఎంత నచ్చేసిందో!

    పాట మొదలవడమే - గాజు నేల మీద నీటి ముత్యాలు రాలుతున్న శబ్దంతో మొదలవుతుంది. 

    దాని వెంటనే వచ్చే వాద్యశబ్దం అదే నేలమీద నెమలి పురి విప్పి అడుగులు వేస్తున్నట్టు అనిపిస్తుంది. 

    అంతలోనే మెల్లగా, మెత్తగా ఉరిమీ-ఉరమని మొయిలులాగా రఫీ గొంతు మోగుతుంది. 

    ఇహ అక్కణ్ణించీ - నిలకడగా ఒకే ధారగా కురిసే వానపాటలా, మధ్యమధ్యలో చినుకుల చిందుల్లాంటి శబ్దాలతో - సాగుతుంది ఈ పాట. 

*** *** *** ***
*** *** *** ***


    పాట యూట్యూబ్లో చూసినప్పుడు పాటలో కనిపించే ఇద్దరిలో రాజ్‌కుమార్ వైఖరి అంత మంచిగా అనిపించదు. 

    కానీ మీనాకుమారి అంత మంచి కథానాయికకి జతగా నటించే రాజ్‌కుమార్ మంచివాడు కాకపోతే ఎలా? సినిమా చివరి వరకూ చూసేవాళ్ళకి బహుశా అతని మంచితనమేంటో తెలుస్తుందేమో!

    ఒక సినిమా పాటలో కనిపించిన దాన్ని బట్టి ఒక పాత్ర మంచిదో కాదో అంచనా వెయ్యలేకపోతున్నాను. అది తెలియడం కోసం సినిమా చివరివరకూ చూడాల్సిందే అనుకుంటున్నాను.  తర్వాతెప్పుడో కుదిరినప్పుడు చూద్దామని లిస్టులో పెట్టుకున్నాను. 

    ప్రస్తుతానికి మీరు కూడా ఈ పాట వింటూ చూస్తూ - వీలైతే పాడుకుంటారని....  








ఛూ లేనే దో... నాజుక్ హోఠోం కో 
కుఛ్ ఔర్ నహీ హై - జామ్  హై యే 
ఛూ లేనే దో... నాజుక్ హోఠోం కో 
కుఛ్ ఔర్ నహీ  హై - జామ్  హై యే 
కుద్రత్ నే - జో హమ్  కో - బక్షా హై 
వో సబ్‌సే హసీ - ఇనామ్ హై యే 
ఛూ లేనే దో... నాజుక్ హోఠోం

షర్‌మాకే - న యూహీ - ఖో దేనా
రంగీన్ జవానీ కీ - ఘడియా 
షర్‌మాకే - న యూహీ - ఖో దేనా
రంగీన్ జవానీ కీ - ఘడియా 
బేతాబ్ - ధడక్‌తే సీనోం - కా 
అర్‌మాన్ భరా - పైగామ్ - హై యే 

ఛూ లేనే దో... నాజుక్ హోఠోం కో 
కుఛ్ ఔర్ నహీ హై - జామ్  హై యే 
ఛూ లేనే దో... నాజుక్ హోఠోం కో 

అఛ్చోం కో - బురా - సాబిత్ కర్‌నా 
దునియా కీ - పురానీ ఆదత్ హై 
అఛ్చోం కో - బురా - సాబిత్ కర్‌నా 
దునియా కీ - పురానీ ఆదత్ హై 
ఇస్ మయ్ కో - ముబారక్ చీజ్ - సమఝ్ 
మానా కే - బహుత్ బద్‌నామ్  - హై యే

ఛూ లేనే దో... నాజుక్ హోఠోం కో 
కుఛ్ ఔర్ నహీ హై - జామ్  హై యే 
ఛూ లేనే దో... నాజుక్ హోఠోం కో 


*** *** *** ***
*** *** *** ***

    చివరాఖరికి - నాకు నేను చెప్పుకుంటున్న ఓ మంచిమాట ఏంటంటే... రోజూ నా చుట్టూ జరిగే విషయాలని అంత తేలిగ్గా ఇది మంచీ-అది మంచి కాదూ అనేసుకోవడం అంత మంచిది కాదు అనుకుంటూ  - ఈ రోజు నేను మొదలుపెట్టిన కలగాపులగపు కలగూరగంప కబుర్లకి మంచి ముగింపే ఈ పాట ప్రస్తావన. 

~ పాటల భైరవి 

    


    

7, జూన్ 2022, మంగళవారం

అవతారంగారి నారాయణగారి బాబి - 26 - కోబ్రా కాదట... "కో.బ్రా." అట!

కిందటి మాటు కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 25 - గాబరా పెట్టిన కోబ్రా! 

    ఆ ఐటీసీ మేనేజర్ తోటి కొంచెం సీరియస్‌గా I am a cobra అంజెప్పేసి  "రండి ఆఫీసులో కూర్చుని మాట్లాడుకుందాం" అని ఆఫీసు లోకి వెళ్ళిపోయాను కదా!?

    అలా నేను వెళ్ళాక - కొంసేపట్లో - నా వెనకాలే ఆయన కూడా నా రూంలోకి వచ్చాడు కదా!?

    ఈలోపులో ఓ చిన్న విషయం జరిగింది. 

*** *** ***
*** *** ***

    నేను  వెళ్ళిపోయాక ఈయన స్టన్నయ్యాడు మనిషి. 

    కొంచెం చెమటలు పట్టినయ్. 

    విశ్వనాథం గారని చెప్పేసి ఐటీసీ గోడౌన్ ఇన్‌ఛార్జ్ ఉన్నాడు కదా మా దగ్గర - ఆ పెద్దాయన!

    ఈ మేనేజరు విశ్వనాథం గారి దగ్గరికెళ్లి "ఏంటి...వీడి సంగతీ? కోబ్రా అంటాడూ, చాలా సీరియస్‌గా వెళ్ళాడూ, ఏంటీడి పరిస్థితి? అసలు వీడెవరు?" అంజెప్పేసి అడిగాట్ట. 

    అడిగితే ఆ విశ్వనాథంగారేంమో కొంచెం గొంతు తగ్గించి "సార్! ఈ గుంటూరు ముఠా వాళ్ళు తొంభై మందున్నారు ఆయన దగ్గర. అందులో రౌడీ షీటర్సు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళని మేనేజ్ చేస్తున్నాడాయన. పైగా... రెండోది ఈయనుండేది బ్రాడీపేట నాలుగూ పజ్జెనిమిది. దానికి దగ్గర్లోనే కోబాల్టు పేట. వాళ్ళతో కూడా సంబంధాలున్నాయేమో ఈయనకి. తర్వాత... ఈయన రోజూ అరండల్ పేట డొంకరోడ్డు లోంచి వస్తాడు. ఆ డొంకరోడ్డులో కూడా ఈ కంపెనీకి బొగ్గు వేసేవాళ్ళు ఉన్నారు కదా? వాళ్ళతో కూడా ఈయనకి సంబంధాలు ఉన్నాయేమో? కొంచెం ఎందుకైనా మంచిది ఆయనతో జాగ్రత్తగా మాట్టాడండి" అని చెప్పాడట.  

    అది విని ఈయన కొంచెం భయపడుతూనే వచ్చాడు ఆఫీసు లోకి. 

*** *** ***
*** *** ***

    వచ్చాక కూర్చున్నాడు. 

    నేను కూడా రిలాక్స్ అయి కూర్చున్నాను. 

    నాకో ఆఫీసు బాయ్ వుండేవాడు వెంకటేశ్వర్లు. 

    ఆ వెంకటేశ్వర్లుని పిల్చి "ఓ రెండు కాఫీ తీసుకురా మంచి స్ట్రాంగ్‌గా" అని చెప్పాను. 

    వాడు కాఫీ తేవడానికి వెళ్ళాడు. 

    ఈలోపులో ఈయనతో "ఒక ఐదు నిముషాలు బయటికి వెళ్ళొస్తాను. ఇక్కడే కూర్చుని ఉండండి" అని చెప్పి బయటికెళ్ళాను. 

    అప్పటికి మిగిలిన స్టాఫు వచ్చారు ఆఫీసుకి.   

    ఆఫీసులో ముఠా మేస్త్రులు ఇద్దరుండేవారు - వీరాస్వామి, పెదకోటయ్య అని. వాళ్ళిద్దర్నీ పిలిచాను.  

    శర్మ అనే క్లర్కుండేవాడు. అతన్నీ పిలిచాను. 

    వాళ్ళు ముగ్గుర్నీ పిలిచి  "ఒకసారి పదో నంబర్ గోడౌన్‌కి వెళ్ళి రండి. ప్రతీ కేసు జార్తగా చూడండి. ఎక్కడైనా కేసులు తడిసినయ్యా అని చూసి నాకో అరగంటలో రిపోర్టు ఇవ్వండి" అంజెప్పి వాళ్ళకి చెప్పి మళ్ళీ ఆఫీసు లోపలికి వచ్చాను. 

    వచ్చి కూర్చున్నా. 

    సరే...కాఫీలొచ్చినయ్. 

    నేనూ, ఐటీసీ మేనేజర్ - ఇద్దరం కాఫీలు తాగాం. 

    సిగరెట్టు ఆఫర్ చేశాను. ఆయనో సిగరెట్టు, నేనో సిగరెట్టు తాగాం. 

    అవన్నీ అయింతర్వాత ఆయనే మొదలుపెట్టాడు. 

    "ఆ... ఇప్పుడు చెప్పు! ఏంటీ ఇందాకేంటో కోబ్రా అన్నావ్. అంటే ఏమిటసలు నీ పరిస్థితి? కోబ్రా అంటే ఏంటి?" అనడిగాడు నన్ను. 

    "అంటే ...సరే... ఏదో అన్నాను. అక్కడ స్టాఫున్నారు. లైను కుఱ్ఱాళ్ళు వాళ్ళూ ఉన్నారు. వాళ్ళ ముందెందుకు గొడవపడడం? ఆఫీసులోకి రండి మాట్లాడుకుందాం అని చెప్పాను. మీరు వినకుండా ఏదో రెచ్చిపోతున్నారు. అందుకని కొంచెం సీరియస్‌గా చెప్పాను. ఏం లేదు లెండి. దాని సంగతెందుకు మనకి. ఇప్పుడు కేసులేం తడిసుండవు. నేను మనుషుల్ని పంపించాను చూసి రమ్మని. వాళ్ళు చూసొస్తారు ఒక అరగంటలో మనకి రిపోర్టు వస్తుంది" అని చెప్పా. 

    "నో నో... అలా కాదు. ఆ కోబ్రా అనే మాటెందుకొచ్చింది నీ నోటెంబట? అది చెప్పాలి నాకు." అని కూచున్నాడు. 

    నేనోసారి నవ్వి "ఏం లేద్సార్! మాది కోనసీమ. అమలాపూరం దగ్గర్ అనాతవరం అనే గ్రామం మాది. మేం ద్రావిళ్ళం. ఆ ఊళ్ళో బ్రాహ్మణ కుటుంబం లోంచి వచ్చాన్నేను. కోనసీమ బ్రాహ్మణ్ణి కాబట్టి "కో...బ్రా...". ఇంతకన్నా ఇంకేం లేదండీ బాబూ" అన్నా! 

    ఆయనొక్కసారి బిత్తరపోయి - తేరుకుని - పకపకా నవ్వి "నీ దుంపతెగ! ఎంత భయపెట్టావు నన్ను...ఏదీ ఇంకో సిగరెట్టియ్యి" అని ఇంకో సిగరెట్టడిగి తీసుకుని తాగి నవ్వుతూనే ఉన్నాడు. 

    మనిషొక్కసారిగా బోల్డు రిలాక్స్ అయినట్టు కనిపించాడు. 

    ఆ తరవాత ఇద్దరం కూర్చుని  ఏవో మాటాడుకుంటూ ఉన్నాం. 

    ఇంతలో శర్మొచ్చి "ఒక్క కేసు కూడా తడవలేదండి. అన్నీ బావున్నాయి" అని చెప్పాడు. 

    విశ్వనాథం గారు కూడా వచ్చి "రాత్రంతా ఈయనిక్కడే వున్నాడండి. కుఱ్ఱాళ్ళని పెట్టి గోతులు తవ్వించి నీళ్ళు తోడిస్తూనే వున్నాడు. నేను చెప్తూనే ఉన్నాను మీకు. ఏమీ పాడవలేదని చెప్పేసి. మీరు ఊరికే ఇదైపోయారు" అని.

    "అబ్బే! చూశా కదా...గమ్మున ఏమన్నా నీళ్ళెళ్ళినయ్యేమో - పొగాకు పాడవుతుందేమో అని భయమేసి అలా అన్నాలే. సరే...ఇక మీరెళ్ళండి... " అని వాళ్ళని పంపించేశాడు ఆ ఐటీసీ మేనేజర్.  

*** *** ***
*** *** ***

     ఈ " కో. బ్రా. " అనే మాటని ఐటీసీ మేనేజరు  మా కంపెనీలో అజిత్ గారని చెప్పేసి ఒక మైసూరు నుంచొచ్చిన ఫేక్టరీ మేనేజర్ ఉండేవాడు కదా -.ఆయనా, ఈయనా ఫ్రెండ్స్ - ఆ అజిత్ గారికి ఫోన్ చేసి మరీ చెప్పాడు.

    అంతే కాకుండా గుంటూరు టొబాకో సర్కిల్స్ అన్నిట్లో అంటించాడు - కామేశ్వరావు "కో. బ్రా. " అని చెప్పి. 

    ఆ అజిత్ గారు కర్ణాటక మొత్తం - బయ్యింగ్‌కి వెళ్తాం కదా మేము - రామనాథపుర, షిమోగా, పెరియపట్న, హున్సూరు - మొత్తం అన్ని చోట్లా కూడా ఆయన - ఈ విషయం అక్కడ చెప్పి "ఒరే! వీడు కోబ్రాగాడురోయ్ వీడు" అని చెప్తుండేవాడు. 

    ఆయనే లక్ష్మయ్యగారికి కూడా చెప్పాడు. 

    లక్ష్మయ్య గారు జరిగింది తెలుసుకుని -  "ఇంత జరిగిందా" అని నవ్వి -  "అందుకే కామేశ్వర్రావుని అక్కడ పెట్టాను. ఇటువంటి తమాషాలు చేస్తాడనే కదా" అని అన్నాట్ట ఆయనా! 

    ఇప్పటికి నా "కో. బ్రా." పొడుపుకథ విప్పా కదా - ఇక్కడ ఆపుతున్నా! తతిమ్మా విషయాలు మళ్ళీ ఇంకోసారి చెప్తా! 


<వచ్చేమాటు తరువాయి కథ>