ఏదో చెప్పాలనుకుంటూ...
చెప్పాలనుకున్నది
అనుకున్నది అనుకున్నట్టుగా
చెప్పేస్తున్నాననుకుంటూ...
తీరా... చెప్తుండగా
చెప్పాలనుకున్నది
చెప్పాలనుకున్నట్టుగా
చెప్పగలుగుతున్నానో లేదో
అనుకుంటూ...
అలా అనిపిస్తుండగా
నే చెప్పాలనుకున్నది ఇదీ...
కాకపోతే - చెప్పినది ఇదీ... అని
వివరించి చెప్తున్నాననుకుంటూ
చివరికి...
అసలేం చెప్పాలనుకున్నానో
అదసలు చెప్పగలిగానా అనుకుంటూ
చెప్పలేని కబుర్లు మొదలెట్టినందుకు
నాకు నేనే ప్రైవేట్లు చెప్పుకుంటూ
ఇంతవరకూ వచ్చాక
ఏదో ఒకటి చెప్పేద్దాం
పనిలోపనిగా పాటొహటి పట్టుకొచ్చేద్దాం
అనుకుంటే -
ఏమౌతుందంటే ...
కలగాపులగమౌతుంది
కబుర్ల కలగూరగంపౌతుంది
*** *** *** ***
*** *** *** ***
"మంచీ - చెడు తెలిసి కూడా చెప్పలేనివారు
ఎవ్వరికీ పనికిరారు - ఏమీ చేయలేరు"
ఎవ్వరికీ పనికిరారు - ఏమీ చేయలేరు"
ఈ రెండు లైన్లూ దాశరథి రాసిన "పెళ్ళంటే నూరేళ్ళ పంటా..." అనే పాట లోవి.
ఆ పాటొచ్చేసేమో క్రిష్ణా-విజీనిర్మలా నటించేసిన "మీనా" అనే సిన్మా లోది.
ఆ సిన్మా ఏమో తెలుగు-జేన్ ఆస్టెన్ అనదగ్గ యద్దనపూడి సులోచనారాణి రాసిన్నవల.
*** *** *** ***
*** *** *** ***
అన్నట్టు నేను ఆరో తరగతి లోనే - జంగారెడ్డిగూడెం లైబ్రరీ నుంచి అమ్మ తెచ్చుకున్న యద్దనపూడి నవలలు చదివినప్పుడు అందులో నాగ్గుర్తున్నవి రెండే రెండు.
ఒకటి డబ్బులున్న కథానాయకుడు. ఆయనకి అప్పుడప్పుడూ బిగుసుకునే దవడ కండరాలు.
రెండోది డబ్బుల్లేని కథానాయిక. ఆవిడకున్న అంతులేని అత్మాభిమానం.
ఇవి రెండూ కూడా ఆనక డిగ్రీలో నేను చదివిన జేన్ ఆస్టెన్ నవలల్లో అచ్చుగుద్దినట్టు కనిపిచేసరికి - భలే వీళ్ళిద్దరూ కూడబలుక్కున్నట్టుగా ఒకేలా రాశారే అనుకుందామనుకున్నా.
కానీ వారివారి జీవీతకాలాల్ని బట్టి ఇద్దరి మధ్యా రెండు శతాబ్దాల అంతరం వుందని తెలిశాక పద్ఢెనిమిదో శతాబ్దపు జేన్ రాతల నుంచి ఇరవయ్యో శతాబ్దపు సులోచనారాణి ప్రభావితమవ్వడానికే ఎక్కువ అవకాశం ఉన్నట్టనిపించింది నా మటుక్కి నాకు.
అందుకే యద్దనపూడి నా వరకు నాకు తెలుగు-ఆస్టెన్ ఆయెన్.
సరే! ఇక్కణ్ణుంచి మళ్లొక్కసారి ఇందాకటి పాటకేసి వెళ్లొస్తా!
*** *** *** ***
*** *** *** ***
ఓ బద్ధకపు మధ్యాహ్నప్పూట - నోటికొచ్చిన పాటేదో - పాటలో ఉన్న మాటలన్నీ ... అటు తిప్పి, ఇటు తిప్పి - పాడిందే పాటగా - పాడుకుంటున్నా...
"మంచీ - చెడు తెలిసి కూడా చెప్పలేనివారు
తెలిసి కూడా చెప్పలేనివారు - ఎవ్వరికీ పనికిరారు
తెలిసి కూడా చెప్పలేనివారు - ఎవ్వరికీ పనికిరారు
ఎవ్వరికీ పనికిరానివారు - ఏమీ చేయలేరు
మంచీ-చెడు తెలిసి కూడా చెప్పలేక - ఎవ్వరికీ పనికిరాక - ఏమీ చేయలేక
ఏమౌతారు?"
అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డులా - నోటికొచ్చిన నాలుగు లైన్లనీ - అటు తిప్పి, ఇటు తిప్పి - పాటని తిప్పలెట్టి - పడరాని పాట్లు పెట్టి - నోటి పాటికి నోరేదో పాడుకుంటోంది.
చెప్పలేని పోటుతో చెవులదే వింటున్నాయి.
పాడుతున్న నోరూ నాదే.
అది పాడుతున్న పాట వింటున్న చెవులూ నావే.
పాట పాడుతున్న నా నోటికి చెవుల్లేవు.
తనే పాడుతున్నా - తను వినలేని పాట కాబట్టి... బ్రతికిపోయింది!
ఆపాలన్న ధ్యాసే లేకుండా ఉత్సాహంగా పాడుకుంటూనే ఉంది.
పాట వింటున్న నా చెవులకి నోరు లేదు.
ఆపమని అనాలని ఉన్నా - అనలేని మాట కాబట్టి... దొరికిపోయాయి!
"నువ్వు పాడకే నోరూ - మేం వినలేకపోతున్నాం ..." అని చెప్పే ఛాన్సే లేకుండా విధి లేక వింటూనే ఉన్నాయి.
*** *** *** ***
*** *** *** ***
అలా పాడుతుండగా - అదాటుగా - నాకనిపించింది ఏంటంటే... నా చుట్టూ ఉన్న ప్రపంచంలో అసలు చెడు అన్నదే లేదేమోనని.
"చుట్టూ ఇన్ని దుర్మార్గాలు జరుగుతుంటే - నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో చెడు లేదంటావా - హన్నా?" అని నాకు నేనే ప్రైవేటు చెప్పేసుకున్నా.
అలా నా నుంచి నేనే విడివడి - నాతో నేనే వాదిస్తుంటే - నాతో నేనే చెప్పుకున్నదేంటంటే...
"'చెడు' అన్న మాటే చెవులకి చేదుగా ఉంది. అందుకే దాన్ని "మంచి అనిపించనిది" అనుకుని మాటాడుకుంటే మంచిగా అనిపిస్తుందిగా?!" అని.
*** *** *** ***
*** *** *** ***
అసలు - అది లేదేమో అని తర్కించుకునే ముందు - "చెడు" గురించి ఇక్కడో మాట అనేసుకోవాలి.
ఈ ప్రపంచం మొత్తంలో - అచ్చమైన "చెడు" అనేదొహటి ఉంది.
మాట్లాడగల మనుషులనైనా, మాట్లాడలేని జంతువులనైనా, అసలు శబ్దమే చేయలేని చెట్లనైనా సరే - తన్నో, కొట్టో - పట్టో, కట్టో - తట్టో, నెట్టో - ఎంత చిన్న మోతాదులో ఐనా - కనిపించేలా దెబ్బలు కొట్టో - కనిపించకుండేలా మనసుని బాధ పెట్టో - నొప్పి కలిగించేది ఏదైనా మాత్రం అది చెడే. కానీ దానికి తగిన పేరు "దుర్మార్గం". దాని జోలికి నేనెళ్లట్లేదు.
ఆ దుర్మార్గాన్ని - మినహాయిస్తే ఇహ మిగిలిందల్లా - మామూలు సాదా-సీదా ప్రపంచం.
ఇందులో - స్వచ్ఛమైన మంచి ఉందేమో కానీ - సంపూర్ణమైన చెడు - అనగా అచ్చమైన absolute చెడు అస్సలు లేనే లేదు.
కొంచెమైనా సరే - మంచిగా ఉన్న మంచిని - "నువ్వెంత మంచివే!" అని మెచ్చుకుని ఇంకొంచెం పెంచక - మంచిని మంచిగా ఉండనీయక - మంచిని చెడనిచ్చి తగ్గనిస్తున్నాం. ఇక్కడ మంచిని అపేక్షించి పెంచాలి.
అలా చెడ్డ మంచిని - చెడినది అతికొంచెమైనా - "నువ్వు మహా చెడ్డవి సుమా!" అని మరింత ఎత్తి చూపి - మంచిగా మారనీయక - చెడుని మంచిగా పైకి తెస్తున్నాం. ఇక్కడ చెడుని ఉపేక్షించి తుంచాలి.
*** *** *** ***
*** *** *** ***
నాకు సంబంధించినంతవరకు వ్యక్తులైనా, వారి వర్తనలైనా, వారు వాడే వస్తువులైనా - ఏదైనా సరే రెండే రకాలు.
ఒకటి - ఎవరో ఒకరికి మంచి అనిపించేది - ఇది అందరికీ మంచి అనిపించక్కర్లేదు - అలా అని కచ్చితంగా చెడు అయి ఉండక్కర్లేదు.
రెండోది - ఎవరో ఒకరికి మంచి అనిపించనిది - ఇది కచ్చితంగా చెడు అయి ఉండక్కర్లేదు - ఇంకెవ్వరికీ మంచి అనిపించదనీ కాదు. అందుకే దీన్ని "మంచి కానిది" అని కూడా అనలేను.
*** *** *** ***
*** *** *** ***
అప్పుడెప్పుడో Will Durant అనే ఓ అమెరికన్ పెద్దాయన చెప్పినట్లు మంచి-చెడులు అనేవి relative అనే అనుకుందాం.
Relativity అనగా సాపేక్షత.
సాపేక్షత అంటే?
తనంతట తానుగా ఉండడానికి, తనంటూ ఉన్నానని అనిపించుకోవడానికి వేరే దాని మీద ఆధారపడమే సాపేక్షత.
ఆ లెక్క ప్రకారం చూస్తే - ఇంచుమించుగా అంతా ఉన్నది మంచే.
అది మంచో, కాదో - అవడమూ కాకపోవడమూ - మనకి కనిపించిన దాని గురించి మనకనిపించడం లోనే వుంది.
ఎందులోనైనా - మనకి కనిపించినదే మంచి. మనకనిపించినదే మంచి.
ఆ మంచి ఇంచుక - ఒక ఇంచు - అటూఇటూ అనిపించినా - చటుక్కున దాన్ని చెడనేస్తున్నాం.
ఇదే విషయాన్ని ... అప్పుడెప్పుడో రఫీ సాబ్ కూడా - ఓ మత్తు పాటలో - "అఛ్చోం కో బురా సాబిత్ కర్నా - దునియా కీ పురానీ ఆదత్ హై" అని గమ్మత్తుగా పలికించారు తన గొంతులో.
ఇక్కణ్ణించి ఆ మామంచి పాట గురించి కొన్ని మంచి కబుర్లు....
*** *** *** ***
*** *** *** ***
పాట: ఛూ లేనే దో నాజుక్ హోఠోం కో...
సినిమా: కాజల్
పాట రాసినవారు: సాహిర్ లూధియాన్వీ
పాటకి బాణీ కట్టినవారు: రవి
పాటకి ప్రాణం ఇచ్చినవారు: రఫీ
పాటలో మంచి అనిపించేవారు: మీనాకుమారి
పాటలో మంచి అనిపించనివారు: రాజ్ కుమార్
పాటకి యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=SZTBAdhBgTw
*** *** *** ***
*** *** *** ***
రఫీ సాబ్ గొంతులో గారాలు పోతున్నట్టుగా సాగే ఈ రాలుగాయి-పాట నాకు భలే ఇష్టం.
మొదటిసారిగా దీన్ని విన్నది మాత్రం ఎప్పుడంటే - తిరుపతి యూనివర్సిటీ కేంపస్ రోజుల్లో.
ఏ చిన్న విషయానికో అరువుదెబ్బలాడుతున్న నా పక్కనే నడుస్తూ "అఛ్చోం కో బురా సాబిత్ కర్నా - దునియా కీ పురానీ ఆదత్ హై" అని పాడుతూ తన నవ్వుతో మంచితనాన్ని మరింతగా ఎస్టాబ్లిష్ చేసేసుకుంటూ బద్రి పాడినప్పుడు.
వింటుండగానే నచ్చేసిన ఆ రెండు లైన్ల పాట - ఆ తర్వాత పూర్తిగా విన్నప్పుడు ఎంత నచ్చేసిందో!
పాట మొదలవడమే - గాజు నేల మీద నీటి ముత్యాలు రాలుతున్న శబ్దంతో మొదలవుతుంది.
దాని వెంటనే వచ్చే వాద్యశబ్దం అదే నేలమీద నెమలి పురి విప్పి అడుగులు వేస్తున్నట్టు అనిపిస్తుంది.
అంతలోనే మెల్లగా, మెత్తగా ఉరిమీ-ఉరమని మొయిలులాగా రఫీ గొంతు మోగుతుంది.
ఇహ అక్కణ్ణించీ - నిలకడగా ఒకే ధారగా కురిసే వానపాటలా, మధ్యమధ్యలో చినుకుల చిందుల్లాంటి శబ్దాలతో - సాగుతుంది ఈ పాట.
*** *** *** ***
*** *** *** ***
పాట యూట్యూబ్‌లో చూసినప్పుడు పాటలో కనిపించే ఇద్దరిలో రాజ్‌కుమార్ వైఖరి అంత మంచిగా అనిపించదు.
కానీ మీనాకుమారి అంత మంచి కథానాయికకి జతగా నటించే రాజ్‌కుమార్ మంచివాడు కాకపోతే ఎలా? సినిమా చివరి వరకూ చూసేవాళ్ళకి బహుశా అతని మంచితనమేంటో తెలుస్తుందేమో!
ఒక సినిమా పాటలో కనిపించిన దాన్ని బట్టి ఒక పాత్ర మంచిదో కాదో అంచనా వెయ్యలేకపోతున్నాను. అది తెలియడం కోసం సినిమా చివరివరకూ చూడాల్సిందే అనుకుంటున్నాను. తర్వాతెప్పుడో కుదిరినప్పుడు చూద్దామని లిస్టులో పెట్టుకున్నాను.
ప్రస్తుతానికి మీరు కూడా ఈ పాట వింటూ చూస్తూ - వీలైతే పాడుకుంటారని....
ఛూ లేనే దో... నాజుక్ హోఠోం కో
కుఛ్ ఔర్ నహీ హై - జామ్ హై యే
ఛూ లేనే దో... నాజుక్ హోఠోం కో
కుఛ్ ఔర్ నహీ హై - జామ్ హై యే
కుద్రత్ నే - జో హమ్ కో - బక్షా హై
వో సబ్సే హసీ - ఇనామ్ హై యే
ఛూ లేనే దో... నాజుక్ హోఠోం
షర్మాకే - న యూహీ - ఖో దేనా
రంగీన్ జవానీ కీ - ఘడియా
షర్మాకే - న యూహీ - ఖో దేనా
రంగీన్ జవానీ కీ - ఘడియా
బేతాబ్ - ధడక్తే సీనోం - కా
అర్మాన్ భరా - పైగామ్ - హై యే
ఛూ లేనే దో... నాజుక్ హోఠోం కో
కుఛ్ ఔర్ నహీ హై - జామ్ హై యే
ఛూ లేనే దో... నాజుక్ హోఠోం కో
అఛ్చోం కో - బురా - సాబిత్ కర్నా
దునియా కీ - పురానీ ఆదత్ హై
అఛ్చోం కో - బురా - సాబిత్ కర్నా
దునియా కీ - పురానీ ఆదత్ హై
ఇస్ మయ్ కో - ముబారక్ చీజ్ - సమఝ్
మానా కే - బహుత్ బద్నామ్ - హై యే
ఛూ లేనే దో... నాజుక్ హోఠోం కో
కుఛ్ ఔర్ నహీ హై - జామ్ హై యే
ఛూ లేనే దో... నాజుక్ హోఠోం కో
*** *** *** ***
*** *** *** ***
చివరాఖరికి - నాకు నేను చెప్పుకుంటున్న ఓ మంచిమాట ఏంటంటే... రోజూ నా చుట్టూ జరిగే విషయాలని అంత తేలిగ్గా ఇది మంచీ-అది మంచి కాదూ అనేసుకోవడం అంత మంచిది కాదు అనుకుంటూ - ఈ రోజు నేను మొదలుపెట్టిన కలగాపులగపు కలగూరగంప కబుర్లకి మంచి ముగింపే ఈ పాట ప్రస్తావన.
~ పాటల భైరవి
Thank you so much for the invaluable words!
రిప్లయితొలగించండిI don't have words to say or may be can't express what i feel after reading this
It's all good !
పాట ఎంత గొప్పదో!
అది కదిలించడం వల్లనే కదా ఈ అణిముత్యాలు దొరుకుతున్నాయి
Thank You for understanding the intent of the post. పాట గొప్పదనం రాసినవారి వల్ల, పాడినవారి వల్ల! నన్ను కదిలించినందువల్లో, ఓ నాలుగు అల్లిబిల్లి కబుర్లల్లినందువల్లో కొత్తగా గొప్ప ఐనది ఏమీ లేదు...ఎందుకంటే పాట ఎప్పుడూ గొప్పదే!
తొలగించండిజేన్ ఆస్టన్ - యద్దనపూడి సులోచనారాణి గారి గురించి ఇలాంటి చర్చ మా ఇంట్లో జరిగింది ఈ మధ్య.... అప్పుడు అనిపించింది 'మీనా' కి 'ఎమ్మా' కి పోలికలు ఉన్నాయి కదా అని!
రిప్లయితొలగించండిఆస్టెన్ నవలల పోలికలు యద్దనపూడి నవలల్లో చాలా ఉంటాయండి. నా బ్లాగ్ చదివినందుకు థాంక్స్!
తొలగించండి