PAN అంటే Presence Across Nation అట.
ఇప్పుడు నాదైన ఒక మాట. నేనెప్పుడూ అనుకునే మాట - "నాల్కకో చవి - కంటికో చూడ్కి"
నాల్కకో చవి.
చూసిన సినిమా అదే అయినా అది చూసినప్పుడు - ఎవరి అనుభూతి వారిదే.
ಕಾಂತಾರ - ಒಂದು ದಂತಕಥೆ!
దీనికి ముందు కబుర్లు చదవాలంటే, ఒకసారి ఇక్కడికి వెళ్లి రండి: త్వామనురజామి 2.0 - 3 - కహా హై మేరే ప్యార్ కీ మంజిల్ ... తూ బత్‌లా తుఝ్‌కో హై పతా!
త్వామనురజామి - 10 - పద్మావతి చేర...ట్రంకు సర్దాము...
నాకు ఆ కారు ప్రయాణం అంతగా గుర్తు లేదు కానీ తిరుపతి దాటి పలమనేరు ఘాట్ రోడ్డు మీదుగా - బోల్డంత దూరం వెళ్ళీ వెళ్ళీ - మొత్తానికి ఏ రాత్రికో బెంగుళూరు చేరిన జ్ఞాపకం మాత్రం మిణుకుమిణుకుగా ఎక్కడో మెరుస్తోంది.
మేమెక్కిన కారు చక్రాలు అరిగేలా తిరిగీ-తిరిగీ బెంగుళూరులో బనశంకరిలో విద్యాపీఠ్ సర్కిల్లో వున్న ఓ చిన్న కామత్ హోటల్ పక్కగా కుడివైపుకి మలుపు తిరిగి కొంచెం ముందుకెళ్ళి ఓ రెండస్తుల ఆకుపచ్చని మేడ ముందు ఆగింది.
అది అలా ఆగగా మేము దిగి - ఓ చిన్న గేటు తెరుచుకుని - ఎదురుగా వున్న మెట్లెక్కి తిన్నగా పైకెళ్ళి - మెట్లకి ఎడమ పక్కగా వున్న తలుపు తీసుకుని - ఓ బుల్లింట్లో అడుగు పెట్టగానే - బద్రి నవ్వులో విరిసి నా కళ్ళలో మెరిసిన వెలుగులకి - ఆ రాత్రి నక్షత్రాలేవైనా చూసుంటే అవీ మురిసుండేవి.
అలా విరిసి మెరిసి మురుస్తున్న నవ్వులని కాస్సేపలా అల్లాగే వుండమని వదిలి - ఓ రెండు మాటలు ఆ పందిరి లాంటి ఆకుపచ్చని మేడ గురించి కొన్ని విశేషాలు చెప్తా.
విద్యాపీఠ్ సర్కిల్ దగ్గర్నుంచి బ్యాంక్ కాలనీ వైపుకి వెళ్దామని కుడివైపుగా బయల్దేరామనుకోండి.
అనుకున్నారా?!
సరే! అలా నడుస్తూ వుంటే ఓ నాలుగడుగులు వేసీ వెయ్యగానే రోడ్డుకి ఎడమ పక్కన "యశస్వి ఆటోమొబైల్సో & హార్డోవేర్సో" అనే ఒక అంగడి కనిపిస్తుంది. అందులో కళ్ళకి ఎండకి నల్లబడి చలవదేమో అనిపించే కళ్ళజోడొకటి పెట్టుకుని ఒకాయన కూర్చుని వుంటాడు. అతని పేరు మంజునాథ్.
ఆ మంజునాథ్‌దే చిలకలు వాలే చెట్టులా వున్న ఆ ఆకుపచ్చని మేడా - ఆ మేడ మీదుగా వాలి వున్న కొబ్బరిచెట్టూనూ.
ఆ మంజునాథ్ భార్య పేరు ముద్దమ్మ. వాళ్ళకో నాలుగేళ్ళ బాబు యశస్వి. వీళ్ళు ముగ్గురూ మొదటి అంతస్తులో కుడి పక్కనున్న వాటాలో వాళ్ళుండి, ఆ పక్కగా వున్న ఎడమ పక్క వాటా మాకు అద్దెకిచ్చారు. మా ఇద్దరి వాటా మధ్యగా ఇంకా పైకి - అంటే రెండో అంతస్తుకి వెళ్ళడానికి మెట్లుండేవి. ఆ మెట్లెక్కి పైకి వెళ్తే అక్కడ మేడ గోడల మీదుగా ఒక కొబ్బరిచెట్టు, దాని పక్కనే ఒక గదీ వుండేవి.
ఆ ఒక్క గదిలో ఇందిరమ్మ అని ఒకావిడ వుండేవారు. ఈవిడ NIIT లో డైరెక్టర్‌గా పని చేసే సుధ అనే ఆవిడ ఇంట్లో వంట చేసేవారు.
ఈ రెండంతస్తులకి కింద - మేము మొదటగా తీసుకొచ్చిన గేటుకి ఎదురుగుండా మెట్ల పక్కగా వున్న ఓ చిన్న వాటాలో మంజునాథ్ గారి తలిదండ్రులు వుండేవారు. వారు ఆ వీధిలో వున్న అందరికీ తాత-అజ్జి.
ఈ విశేషాలూ, వివరాలూ - మేమా ఇంట్లో అడుగు పెట్టగానే గోడల మీద రాసి పెట్టి లేవు. ఆ మరసటి రోజు పొద్దున్నే వెచ్చవెచ్చటి ఉప్పిట్టుతో పాటుగా మా ఇంటి ఓనర్లైన మంజునాథ్-ముద్దమ్మ దంపతులు చలచల్లగా పంచుకున్నవి.
అంతకు ముందు రాత్రేనా మేమొచ్చింది... ?! మరుసటి రోజు పొద్దున్న కల్లా నాన్న, మంజునాథ్ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు.
కన్నడ-తెలుగులో మంజునాథ్ "ఏమండీ చెప్పండి" అంటే , అచ్చ -కన్నడలో నాన్న "నంగూ కన్నడ సొల్ప సొల్ప బరత్తదే" అంటూ ఎవరికి వాళ్ళు అవతలి వారి భాష తమకొచ్చన్నట్టు బదులిచ్చుకుంటూ ఒకరినొకరు సెబాసనేసుకున్నారు.
ఇక ముద్దమ్మయితే చకచకా తన ఇంట్లో పని చేసుకుంటూనే వాళ్ళింట్లోకి కొత్తగా వచ్చిన మాకు ఏం కావాలో కనిపెట్టి అమరుస్తూ కమకమ్మటి కన్నడ వంటలు చేసి మాకు ఇస్తూ ఎంతో ప్రీతీ, ఇష్టం చూపించింది.
తెలుగు రాని ముద్దమ్మకి, కన్నడ తెలియని నాకు - మా ఇద్దరికీ ఒకరికొకరం కావలసినవారమనిపించుకోవడానికి మాటల-పలకరింపులు అక్కరలేని చిరునవ్వుల-చిలకరింపుల భాష సరిపోయింది.
ఈ పాట వినడం ఇదేం మొదటిసారి కాదు...
అలా అని దీన్ని పదేపదే పాడిందే పాటగా విన్నాననేం లేదు.
ఎప్పుడో, ఎక్కడో అనుకోకుండా ఎవరో ఏ రికార్డో పెట్టబట్టి వినడం తప్ప - నాకు నేనుగా వెతుక్కుని వినాలీ అని పట్టుబట్టి విన్న పాట మాత్రం కాదు.
కిందటి వారం ఎప్పట్లాగే రఫీ పాటల కోసం యూట్యూబులో వెతుక్కుని - ఒక్కో పాట వింటూ వుంటే - ప్రతీపాట తర్వాత ఈ పాట ఆ పక్కనే కనిపిస్తూ "నన్ను వినూ!" అంటున్నట్టు కనిపిస్తూనే వుంది.
నేనంతగా పట్టించుకోకుండా వేరేవేవో వింటూనే వున్నాను.
ఈ పాటేమో "వినవా?" అని బ్రతిమాలుతున్నట్టొకసారి, "ఓ సారి వింటే నీ చెవులేమైనా అరిగిపోతాయా? " అని దబాయిస్తున్నట్టొకసారి, "వినమని ఎన్ని సార్లడగాలీ, ఓహోహో?!" అని సాధిస్తు న్నట్టొకసారి, "వినమని చెప్తుంటే నీక్కాదూ?" అని చెవి మెలేస్తున్నట్టొకసారి - ఆ కిందున్న సజెషన్సులో పైకి ఎగిరెగిరి కనిపిస్తూనే వుంది.
చివరాఖరికి ఓ పాట తర్వాత తోసుకుంటూ ముందుకొచ్చేసి "వినెహే!" అని అదే మొదలైపోయింది.
సర్లే! ఒకసారి వినేస్తే దీని గోలేంటో తెలిసిపోతుంది ఇహ దీని జోలికెళ్ళక్కర్లేదు అనుకుని చెవులు ఫోను కప్పగించి - పాటని ఆట్టే పట్టించుకోకుండా బెట్టు పోతూ ఉతికిన బట్టలేవో మడత పెట్టుకుంటున్నాను.
పాట మొదలవుతూనే ఓ గిటారు టింగ్-టింగుమని వినిపించింది.
ఆ వెంటనే "ఓ మై లవ్!" అంటూ ఏ గంధర్వ లోకాల్లోంచో పిలుస్తున్నట్టు న్న రఫీ గొంతూ...
ఆ వెనకనే ఉరుం-మబ్బేదో కదం తొక్కుతున్నట్టు ఓ బేస్-గిటార్ మోతా...
అవి వింటూనే చెవులప్పగించిన ఫోనుకి కళ్ళు కూడా అద్దెకిచ్చా.
చూస్తే అక్కడ ఏముందీ?
హయలయల హొయలుకి గిటారు మోగిందా?
గిటారు గీర-రాగాలకి తురంగాలు తరంగమాడాయా?
అంతే! నా చెవులూ, కళ్ళూ కూడబలుక్కున్నట్టు నా తలకేం చెప్పాయో కానీ నా చేతులు - మడతెడుతున్న బట్టలని కాసేపలా గాలికి రెపరెపలాడుతుండమని చెప్పి - టీవీ రిమోట్ తీసుకుని - చకచకా యూట్యూబులో వెతికి ఆ పాట పెట్టేశాయ్. ఈలోగా నా కాళ్ళేమో సోఫాలో నన్ను కూర్చోబెట్టేశాయ్.
అప్పుడు కూర్చుని మొట్టమొదటి సారిగా ఆ పాట చూశా!
పూర్తిగా చూశాక - మళ్లింకొక్కసారి చూశా!
మళ్ళీ ... మళ్ళీ చూశా !
ఆ హయ-గతికి గిటారు పాడిన స్వర-జతికి - "నజర్ న లగ్ జాయే!" అనుకున్నా!
ఎంత అందమైన పాట అది?
ఇన్నాళ్లూ నేనెందుకు చూడలేదబ్బా? అనుకున్నా.
ఈ పాట నాకు దక్కాలని రాసుండబట్టి ఇవాళ్టికైనా నాకు చిక్కిందనుకున్నా.
నన్నలరించిన ఈ పాటలో నాకు కనిపించిన విషయాలూ, నాకనిపించిన విశేషాలతో ఆ పాట కథా-కమామీషూ మీతో ఇలా పంచుకుంటున్నా.
నే చెప్పే కబుర్లు చదివే ముందు మీరూ ఈ పాట చూడాలిగా!
ఈ పాటకి యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=Y2QLjRWXdAA
పాట చూసొచ్చారా?
ఇహిప్పుడు పాటలో తమాషాలేంటో చెప్తాను. మీకవి కనిపించాయో - కనిపించినా అనిపించాయో లేదో చూసుకోండి.
ఈ పాటలో అసలుకి మూడు చరణాలు ఉన్నట్టున్నాయి.
యూట్యూబుకి - ఆకలేసి నీరసమొచ్చి మింగేసిందో - పాడలేక ఆయాసమొచ్చి ఆపేసిందో - కానీ చూసే పాటలో చివరి చరణాలు రెండే కనిపిస్తాయి. మొదటి చరణం హుళక్కి!
కాకపోతే కనిపించే రెండు చరణాలే కాక కనిపించని ఆ మూడో చరణం కూడా నేను రాసి పెట్టాలెండి! (ఇక్కడెందుకో నాకు సాయికుమార్ - పోలీస్ స్టోరీ గుర్తుకొచ్చింది. ఎందుకో చెప్పుకోండి చూద్దాం!)
మీకెవరికన్నా ఆ మూడు చరణాలు కంటి నిండుగా కనిపించే పాట మీక్కనిపిస్తే నాకొచ్చి చెప్పండేం!
లండన్లో థేమ్స్ నది ఒడ్డున సాగే ఈ పాటలో ఎఱుపు రంగు భలేగా మెరుస్తుంది.
మొట్టమొదటగా కనిపించే చిన్న బోటుపై రెపరెపలాడుతున్న తెల్ల క్రాసున్న జండా ఎఱుపు.
ఆ బోటు మీద నించున్న గిటార్రాగాల అబ్బాయి వేసుకున్న పొడుగు చేతుల చొక్కా ఎఱుపు
ఆ తర్వాత కెమెరా చూపు సోకిన రహదారి మీద వెళుతున్న చిన్న కారు ఎఱుపు, ఆ పక్కనే రయ్యిమన్న ఓ మాదిరి ట్రక్కు ఎఱుపు
బ్లూస్ ఎండ్ రాయల్స్ - హార్స్ గార్డ్స్ పెట్టుకున్న ఇనుప కుళ్లాయిల మీద ఊగితూగుతున్న తురాయిలు (plumes) ఎఱుపు
"పీ-పీ" మంటూ ఊదుకుంటూ వస్తున్న గ్రెనడీర్ గార్డుల బ్యాండు వేసుకున్న యూనిఫార్మ్ రంగు ఎఱుపు
ఇంకా పాట సాగుతున్నంత సేపూ ఆ వెనకాల రోడ్ల మీద హడావిడిగా సిన్మాలో కనిపించాలన్నట్టు తిరుగుతున్న లండన్ బస్సులు ఎఱుపు.
పైన చెప్పిన ఎఱుపు రంగు చూసింతర్వాత ఈ పాటలో మెరిసినవారు బిశ్వజిత్, మాలా సిన్హా.
బిశ్వజిత్తుని చూడగానే బీఎస్సీలో మాథ్స్ ట్యూషన్ చెప్పిన కోటేశ్వర్రావుగారు గుర్తొచ్చారు.
ఏ ఆదివారమో టీవీలో ఓ మంచి హిందీ సిన్మా - ఏ షమ్మీ కపూర్ - తీస్రీ మంజిల్ - లాంటిదో వుందని ముందే తెలిసి - ఆ రోజు సెలవివ్వండి సర్ సిన్మా చూస్తాం - అనడిగితే - "చపాతీ మొహాలనేం చూస్తారు, ఎంచక్కా ట్యూషను కొచ్చి హాయిగా లెక్కలు చేసుకోండి - అని చెప్పేవారు.
ఇంకేం చేస్తాం! ఎలాగో మనసు చిక్కబట్టుకుని లెక్కలు చేసుకుంటూ కూర్చుంటే - ఇంతలో పక్కనే సర్ వాళ్ళింట్లోంచి "ఆజా ఆజా మై హూ ప్యార్ తేరా... అల్లా...అల్లా ...ఇన్‌కార్ తేరా...ఆజా...అహ్హహాజా... " అని పాట వినగానే "ఉండండయ్యా ... నన్ను ఎందుకో పిలుస్తున్నట్టున్నారు" అని కట్టుకున్న తెల్ల గ్లాస్కో లుంగీని కుడిచేతి గుప్పెట్లో కాళ్లకడ్డం పడకుండా గట్టిగా ఒడిసి పట్టుకుని గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయి - ఆ పాటయ్యాక - తీరిగ్గా వచ్చేవారు మా కోటేశ్వర్రావు సర్.
ఇదిగో ఇవాళ మళ్ళీ నున్నటి మొహమున్న బిశ్వజిత్తుని చూడగానే ఆ చపాతీరో-మోహపు రోజులు గుర్తుకొచ్చాయి. ఏ పుణ్యలోకాలనో లెక్కలు పాఠాలు చెప్పుకుంటున్నారో - మా ప్రియమైన కోటేశ్వరరావు గారు కూడా గుర్తొచ్చారు.
బిశ్వజిత్ పక్కనే వున్న మాలాసిన్హా కూడా బల్-హాయిగా అనిపించిందండోయ్.
ఎప్పుడో పెళ్ళికి ముందు రోజుల్లో డీడీలో తెలుపు-నలుపు హిందీ సినిమాల్లో ఒకట్రెండు సినిమాల్లో చూసినప్పుడు ఇదే మాలాసిన్హా "నైన్ కియే నీచే నీచే... రహూ తేరే పీఛే పీఛే" అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ, హీరో కాళ్ళావేళ్ళా పడిపోతూ వుండేది. ఈ పాటలో మాత్రం స్టైలిష్షుగా, పాలిష్డుగా బార్బీ బొమ్మలా భలే ఉంది.
ఇహ పోతే - ఈ పాట చూస్తుండగా కనిపించిన లండన్ వీధులు, థేమ్స్ నది, బిగ్గు బెన్నూ దాటి ఓ పడవెక్కి హీరో-హీరోయిన్లు ఇద్దరూ ఓ జలపాతం దగ్గరికి వెళ్తారు.
అది చూడగానే ఇదెక్కడి జలపాతమబ్బా అనుకుంటూ గూగుల్లో వెతికా!
అప్పుడు తెలిసింది - ఈ పాట లండన్ థేమ్స్ నది నీటి అలల మీదుగా - అలా అలా గాలిలో తేలి స్విజ్జర్లాండు రైన్ ఫాల్స్ (Rhine Falls) జలపాతంలో చిందులేసిందని.
ఈ పాటకి రైన్ జలపాతం పొందిన ఆనందం చూడాలంటే "సామ్‌నే జో ఏక్ తూ న హో... దిల్ మే కోఈ ఆర్‌జూ న హో!" అన్న వాక్యాల దగ్గర బిశ్వజిత్, మాలాసిన్హా నించున్న అబ్జర్వేషన్ డెక్ వెనకాల నీటి చిందులు చూడాల్సిందే! (వీడియోలో 3:09 నుంచి 3:25 దాకా).
నాకు నచ్చిన పాటని ఈ కింద రాసి పెట్టుకున్నా.
నాకైతే పాటలో వినిపించిన గిటార్ సంగీతం ఎంతో నచ్చింది.
దానికి జతగా కుదిరిన గుఱ్ఱపు-నడక కూడా - కనిపించింది కొన్ని సెకన్లయినా ఎంతో రాజసంగా వుంది.
ఈ పాట ఈ పూటకి దొరికిన పున్నెం.
నాకందిన ఈ నిన్నటి పున్నమల మించుని మీకూ పంచుకుంటూ...
~ పాటల భైరవి
దీనికి ముందు కబుర్లు చదవాలంటే, ఒకసారి ఇక్కడికి వెళ్లి రండి: త్వామనురజామి 2.0 - 2 - యాద్ కర్‌కే యే ఘర్ రోయీ ఆంఖే... మగర్ ముస్కురానా పడా...
గుంటూర్లో వేసవి ఎండల ఉసురుసురుల్లో ఆ మూణ్నెల్లు ఎలా గడిచాయో - గడిచాయి.
అప్పడు గుర్తున్నవి మాత్రం - మొట్టమొదటగా ... ఓ మంగళవారం నాడు పొద్దున్నే నన్ను తనతో తీసుకెళ్లి ఒక ఆంజనేయస్వామి గుళ్లో మా ఆడపడుచు తులసి చేయించిన ఆకుపూజ. వాళ్ళన్నయ్యతో నా పెళ్లి జరిగితే అంజనేయస్వామికి ఆకుపూజ చేయిస్తానని మొక్కుకుందట.
ఇంకోరోజు తులసి తోనే గుంటూరు జనరల్ హాస్పిటలుకి వెళ్లి తన డి-ఫార్మసీకి సంబంధించిన పనులేవో చేసుకొచ్చాము.
అప్పటిదాకా పప్పి, కుట్టి, ప్రశాంతి, అపర్ణలతో తప్ప ఇంకెవరితోనూ ఎక్కువగా మాట్లాడడం, ఎక్కడికీ వెళ్లడం అలవాటు లేని నాకు తులసితో - నడిచే నడకల్లో, చెప్పుకుంటున్న కబుర్లలో - కుదురుకుంటున్న స్నేహం కొంచెం కొత్తగా, కొంచెం గొప్పగా కూడా అనిపించింది. ఆ "గొప్పగా" అనిపించడం ఎందుకంటే - తులసి నన్ను పిలిచే "వదినా!" అన్న పిలుపు నాకేదో పదవిలా అనిపించడమే.
తులసితో మాత్రమే కాకుండా నా మరిది విజయ్‌తో కూడా నాకు మంచి నేస్తమే కుదిరింది.
నా పెళ్ళికి ముందు ఒకసారన్నా తులసిని చూశాను కానీ విజయ్‌ని సరిగ్గా చూడడం మాత్రం నా పెళ్ళిలోనే!
పాలద్దిన నా చేతులని తన అరచేతుల్లో అప్పగించుకుంటున్నప్పుడు - "లక్ష్మణమూర్తి లాంటి మరిదివి, మా లల్లీని మీకప్పగిస్తున్నాను" అని మా అమ్మ అంటుంటే - కాటుక్కరుగుతున్న కళ్ళెత్తి అప్పుడు విన్నా - "మా వదిన్ని మేం జాగ్రత్తగా చూసుకుంటాం- మీరేం బెంగ పెట్టుకోకండాంటీ" అన్న నవ్వులో అద్ది పలికినట్టున్న మాటల్ని.
అవి వింటున్నప్పుడే నాకు ఫ్రెండయిపోయారు విజయ్.
వేసట పరిచే వేసవి వడగాడ్పుల మధ్యాహ్నాల తోచీతోచని వేళల్లో - రెండు మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టుకుని - ఆ కుదురు మీద గడ్డమానించుకుని - గాలిలో రేపటి రోజుల ఆనమాళ్ళేవో వెతుక్కుంటూ - నాలో నేనే ఒంటరిననని అనుకుంటూ - వినీ వినిపించని వెక్కిలి తోడుగా కన్ను జారిన నీటిచుక్కనొకటి ఎవరికీ కనిపించకుండా చిటికే వేళ - ఆ చిటుక్కుమన్న సద్దు వినబడో ఏమో - మా విజయ్ "వదినా! పుల్లలాట ఆడదామా?" అంటూ గుప్పెడు పుల్లల్ని పట్టుకొచ్చి గుట్టగా నా ముందు పోస్తే - నా ఆ బెంగ "హుష్! కాకీ!" అని పుటుక్కుమనేది.
అలా మాటలతో, ఆటలతో మొదలయింది - తులసి, విజయ్‌లతో నా వదిన-రికం.
ఆ మూణ్ణెళ్లలోనే - ఒక రెండుమూడ్రోజులు అమ్మ, పప్పి, కుట్టీలతో కలిసి చిలకలూరిపేట రవి-శారదల దగ్గరికి వెళ్లి వచ్చాను.
అక్కడ చిలకలూరిపేట విజయభాస్కర్ థియేటర్లో మేమందరం కలిసి చూసిన సినిమా "అల్లరిప్రియుడు". చూస్తున్నప్పుడే ఇదెక్కడో చూశామే అనిపించింది.
తీరా చూస్తే అది సంజయ్ దత్తుని రమ్యకృష్ణగా, సల్మాన్ ఖానుని మధుబాలగా, మాధురీ దీక్షిత్తుని రాజశేఖరుగా మార్చి ఏమార్చి - కె. రాఘవేందర్రావు తెలుగులో "అల్లరిప్రియుడు"గా ఫ్రీ-మేకు చేసిన "సాజన్" సినిమా.
ఆ తర్వాత గుంటూరు తిరిగొచ్చేశాక - అప్పుడప్పుడే అనుకుంటా... అప్పటెప్పటివో అభిలాష-శుభలేఖల నాటి - అదేదో మేజిక్కు మిస్సయినట్టనిపించడం మొదలుపెట్టి చిరంజీవి సినిమాలంటే చూడాలనిపించపోవడం మొదలవడం.
సరిగ్గా అప్పుడే "ఇప్పటికి ఇదే ఆఖరు" అనుకుంటూ చూసిందే "మెకానిక్ అల్లుడు" సినిమా - అనారా-చిరంజీవీల ఒకానొక పల్టీ-స్టారరు. దానికి అమ్మ, పప్పి, కుట్టి, నేను వెళ్ళాము.
ఇది చెప్పుకునేంతగా ఎందుకు గుర్తుందీ అంటే ... అప్పటికి మా అత్తవారింట్లో వున్న నేను ఓ రోజు తులసితో చెప్పాను "నాకు కొంచెం కడుపు నొప్పిగా వుంది. మా అమ్మ దగ్గరికి వెళ్లాలని వుంద"ని.
నేనింకా అప్పటికి మా అత్తగారు చెప్పే విషయాలు, ఇచ్చే సలహాలు వినడం తప్ప తులసి, విజయ్ లతో మాట్లాడుతున్నంత చనువుగా ఆవిడతో మాట్లాడట్లేదు. అందుకే తులసితో చెప్పాను. తను వెళ్లి అత్తయ్యతో చెప్పింది. అత్తయ్య వెళ్ళమన్నారు. వెంటనే రెండో లైన్లో రిక్షా ఎక్కి నాలుగో లైన్లో మా ఇంట్లో ఉన్నా.
నన్ను చూసీ చూడగానే "టైముకొచ్చావే లల్లెమ్మా! పద పద మన చిరంజీవి సినిమా వచ్చింది. ఇవాళ మాట్నీకి వెళదాం" అంది కుట్టి.
అది వింటూనే "అమ్మో! నేను రానే బాబూ! నాకు బాలేదు" అన్నానో లేదో "సిన్మాకెళ్తే అన్నీ అవే బావుంటాయి - పద. గబగబ అన్నం తిను. మన పక్కింటబ్బాయిని టికెట్లు తెమ్మని పంపిస్తాను. నిన్ను సాగదీసేలోగా ఆ నాలుగు టికెట్లూ అయిపోతాయి కూడా. ముందు నువ్వు తినవే బాబూ!" అని తెగ హడావిడి చేస్తోంది కుట్టి.
ఈ సందడిలో, హడావిడిలో - ఉక్కిరిబిక్కిరి అవుతూ ఓ పక్క పొట్ట పట్టుకుని మూలుగుతూనే, ఇంకో పక్క సినిమాకి తయారవుతున్నాను - అంతకు మించి ఇంకేమన్నా అదొప్పుకోదని తెలుసు కాబట్టి.
అంతలోనే - "వదినగారూ! ఏం చేస్తున్నారు? మా కోడలికెలా వుందోనని ఉండబట్టలేక వచ్చాము నేనూ, మా చిన్నోడు" అంటూ వచ్చారు చిన్న-చిన్న పూల-పూల కాటన్ చీరలో ఫెళ-ఫెళలాడుతున్న కొత్త వందరూపాయిల నోటులా ఉన్న మా అత్తగారు, ఆవిడ వెనకాలే మా విజయ్.
అంతే! మా కుట్టి ఒక్క నిముషం మాటలు ఆపేసింది. మళ్ళీ అదే తమాయించుకుని "రండాంటీ! కూర్చోండి" అని గబగబా అంది.
ఓ పక్క సినిమాకి టైం అవుతోందని దానికి కంగారు.
ఇంకో పక్క - కడుపు నొప్పని వంక పెట్టి వచ్చేసి ఇక్కడ సినిమాకి వెళ్తోందని అనుకుంటారని - నాకు బెదురు, మొహమాటం.
చివరకు ఓ ఐదు నిముషాలు కాగానే మా పక్కింటబ్బాయి "కుట్టెక్కా! టికెట్లు దొరికాయి" అని రావడం, మేము సినిమాకి వెళ్తున్నామని మా అత్తగారికి అర్థమవడం, మరునిముషంలో ఆవిడ "వెళ్ళొస్తాం వదిన గారూ!" అని అమ్మతోనూ, "ఓ రెండ్రోజులుండి వచ్చేస్తావుగామ్మాయ్" అని నాతోనూ అనేసి "సినిమా చూసొచ్చి ఎలా వుందో చెప్పండ్రా, పప్పీ, కుట్టీ!" అని పప్పి, కుట్టీలతో అనేసి మా మరిదితో కలిసి వెళ్లిపోయారు.
నాకు బోల్డంత ఏదోగా అనిపించింది. ఎవరికీ ఏమీ చెప్పలేని నా పరిస్థితికి ఇంకా బోల్డంత ఉక్రోషంగా అనిపించింది. నేను చేయని తప్పుకేదో నాకు నేనే సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్టనిపించింది.
అలా అని సినిమా చూడడం - ఎంజాయ్ చేయడం మాత్రం మామూలే! అందులోనూ బెంగుళూరు ప్యాలెస్ ముందో పాట ఉందాయె సినిమాలో!
అన్నట్టు - ఆ మూణ్ణెల్లలోనే ఓ మాటు తిరుపతికి కూడా వెళ్ళొచ్చాను - నేనొక్కదాన్నే నారాయణాద్రి ఎక్కి - అచ్చం పద్మావతీ యూనివర్సిటీలో చదివే రోజుల్లోలా.
ఇంతకీ అది ఎందుకూ అంటే - బద్రి ఎంబీఏ క్లాస్మేటు జీఎం సత్యనారాయణ పెళ్లి కని వెళ్లి.
ఆ పెళ్ళికి బద్రి బెంగుళూరు నుంచి తిరుపతికి ఇటొస్తే, నేను ఇటు గుంటూరు నుంచి తిరుపతికి అటెళ్ళా. అప్పుడే మళ్ళీ బద్రి ఎంబీఏ ఫ్రెండ్స్ అందరినీ చూశా.
ఆ పెళ్లవ్వగానే బద్రి అటు బెంగుళూరు వెళ్లగా - నేనిటు బెంగతో గుంటూరు వచ్చేశా.