ఈ పాట వినడం ఇదేం మొదటిసారి కాదు...
అలా అని దీన్ని పదేపదే పాడిందే పాటగా విన్నాననేం లేదు.
ఎప్పుడో, ఎక్కడో అనుకోకుండా ఎవరో ఏ రికార్డో పెట్టబట్టి వినడం తప్ప - నాకు నేనుగా వెతుక్కుని వినాలీ అని పట్టుబట్టి విన్న పాట మాత్రం కాదు.
కిందటి వారం ఎప్పట్లాగే రఫీ పాటల కోసం యూట్యూబులో వెతుక్కుని - ఒక్కో పాట వింటూ వుంటే - ప్రతీపాట తర్వాత ఈ పాట ఆ పక్కనే కనిపిస్తూ "నన్ను వినూ!" అంటున్నట్టు కనిపిస్తూనే వుంది.
నేనంతగా పట్టించుకోకుండా వేరేవేవో వింటూనే వున్నాను.
ఈ పాటేమో "వినవా?" అని బ్రతిమాలుతున్నట్టొకసారి, "ఓ సారి వింటే నీ చెవులేమైనా అరిగిపోతాయా? " అని దబాయిస్తున్నట్టొకసారి, "వినమని ఎన్ని సార్లడగాలీ, ఓహోహో?!" అని సాధిస్తు న్నట్టొకసారి, "వినమని చెప్తుంటే నీక్కాదూ?" అని చెవి మెలేస్తున్నట్టొకసారి - ఆ కిందున్న సజెషన్సులో పైకి ఎగిరెగిరి కనిపిస్తూనే వుంది.
చివరాఖరికి ఓ పాట తర్వాత తోసుకుంటూ ముందుకొచ్చేసి "వినెహే!" అని అదే మొదలైపోయింది.
సర్లే! ఒకసారి వినేస్తే దీని గోలేంటో తెలిసిపోతుంది ఇహ దీని జోలికెళ్ళక్కర్లేదు అనుకుని చెవులు ఫోను కప్పగించి - పాటని ఆట్టే పట్టించుకోకుండా బెట్టు పోతూ ఉతికిన బట్టలేవో మడత పెట్టుకుంటున్నాను.
పాట మొదలవుతూనే ఓ గిటారు టింగ్-టింగుమని వినిపించింది.
ఆ వెంటనే "ఓ మై లవ్!" అంటూ ఏ గంధర్వ లోకాల్లోంచో పిలుస్తున్నట్టు న్న రఫీ గొంతూ...
ఆ వెనకనే ఉరుం-మబ్బేదో కదం తొక్కుతున్నట్టు ఓ బేస్-గిటార్ మోతా...
అవి వింటూనే చెవులప్పగించిన ఫోనుకి కళ్ళు కూడా అద్దెకిచ్చా.
చూస్తే అక్కడ ఏముందీ?
హయలయల హొయలుకి గిటారు మోగిందా?
గిటారు గీర-రాగాలకి తురంగాలు తరంగమాడాయా?
అంతే! నా చెవులూ, కళ్ళూ కూడబలుక్కున్నట్టు నా తలకేం చెప్పాయో కానీ నా చేతులు - మడతెడుతున్న బట్టలని కాసేపలా గాలికి రెపరెపలాడుతుండమని చెప్పి - టీవీ రిమోట్ తీసుకుని - చకచకా యూట్యూబులో వెతికి ఆ పాట పెట్టేశాయ్. ఈలోగా నా కాళ్ళేమో సోఫాలో నన్ను కూర్చోబెట్టేశాయ్.
అప్పుడు కూర్చుని మొట్టమొదటి సారిగా ఆ పాట చూశా!
పూర్తిగా చూశాక - మళ్లింకొక్కసారి చూశా!
మళ్ళీ ... మళ్ళీ చూశా !
ఆ హయ-గతికి గిటారు పాడిన స్వర-జతికి - "నజర్ న లగ్ జాయే!" అనుకున్నా!
ఎంత అందమైన పాట అది?
ఇన్నాళ్లూ నేనెందుకు చూడలేదబ్బా? అనుకున్నా.
ఈ పాట నాకు దక్కాలని రాసుండబట్టి ఇవాళ్టికైనా నాకు చిక్కిందనుకున్నా.
నన్నలరించిన ఈ పాటలో నాకు కనిపించిన విషయాలూ, నాకనిపించిన విశేషాలతో ఆ పాట కథా-కమామీషూ మీతో ఇలా పంచుకుంటున్నా.
నే చెప్పే కబుర్లు చదివే ముందు మీరూ ఈ పాట చూడాలిగా!
ఈ పాటకి యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=Y2QLjRWXdAA
పాట చూసొచ్చారా?
ఇహిప్పుడు పాటలో తమాషాలేంటో చెప్తాను. మీకవి కనిపించాయో - కనిపించినా అనిపించాయో లేదో చూసుకోండి.
ఈ పాటలో అసలుకి మూడు చరణాలు ఉన్నట్టున్నాయి.
యూట్యూబుకి - ఆకలేసి నీరసమొచ్చి మింగేసిందో - పాడలేక ఆయాసమొచ్చి ఆపేసిందో - కానీ చూసే పాటలో చివరి చరణాలు రెండే కనిపిస్తాయి. మొదటి చరణం హుళక్కి!
కాకపోతే కనిపించే రెండు చరణాలే కాక కనిపించని ఆ మూడో చరణం కూడా నేను రాసి పెట్టాలెండి! (ఇక్కడెందుకో నాకు సాయికుమార్ - పోలీస్ స్టోరీ గుర్తుకొచ్చింది. ఎందుకో చెప్పుకోండి చూద్దాం!)
మీకెవరికన్నా ఆ మూడు చరణాలు కంటి నిండుగా కనిపించే పాట మీక్కనిపిస్తే నాకొచ్చి చెప్పండేం!
లండన్లో థేమ్స్ నది ఒడ్డున సాగే ఈ పాటలో ఎఱుపు రంగు భలేగా మెరుస్తుంది.
మొట్టమొదటగా కనిపించే చిన్న బోటుపై రెపరెపలాడుతున్న తెల్ల క్రాసున్న జండా ఎఱుపు.
ఆ బోటు మీద నించున్న గిటార్రాగాల అబ్బాయి వేసుకున్న పొడుగు చేతుల చొక్కా ఎఱుపు
ఆ తర్వాత కెమెరా చూపు సోకిన రహదారి మీద వెళుతున్న చిన్న కారు ఎఱుపు, ఆ పక్కనే రయ్యిమన్న ఓ మాదిరి ట్రక్కు ఎఱుపు
బ్లూస్ ఎండ్ రాయల్స్ - హార్స్ గార్డ్స్ పెట్టుకున్న ఇనుప కుళ్లాయిల మీద ఊగితూగుతున్న తురాయిలు (plumes) ఎఱుపు
"పీ-పీ" మంటూ ఊదుకుంటూ వస్తున్న గ్రెనడీర్ గార్డుల బ్యాండు వేసుకున్న యూనిఫార్మ్ రంగు ఎఱుపు
ఇంకా పాట సాగుతున్నంత సేపూ ఆ వెనకాల రోడ్ల మీద హడావిడిగా సిన్మాలో కనిపించాలన్నట్టు తిరుగుతున్న లండన్ బస్సులు ఎఱుపు.
పైన చెప్పిన ఎఱుపు రంగు చూసింతర్వాత ఈ పాటలో మెరిసినవారు బిశ్వజిత్, మాలా సిన్హా.
బిశ్వజిత్తుని చూడగానే బీఎస్సీలో మాథ్స్ ట్యూషన్ చెప్పిన కోటేశ్వర్రావుగారు గుర్తొచ్చారు.
ఏ ఆదివారమో టీవీలో ఓ మంచి హిందీ సిన్మా - ఏ షమ్మీ కపూర్ - తీస్రీ మంజిల్ - లాంటిదో వుందని ముందే తెలిసి - ఆ రోజు సెలవివ్వండి సర్ సిన్మా చూస్తాం - అనడిగితే - "చపాతీ మొహాలనేం చూస్తారు, ఎంచక్కా ట్యూషను కొచ్చి హాయిగా లెక్కలు చేసుకోండి - అని చెప్పేవారు.
ఇంకేం చేస్తాం! ఎలాగో మనసు చిక్కబట్టుకుని లెక్కలు చేసుకుంటూ కూర్చుంటే - ఇంతలో పక్కనే సర్ వాళ్ళింట్లోంచి "ఆజా ఆజా మై హూ ప్యార్ తేరా... అల్లా...అల్లా ...ఇన్‌కార్ తేరా...ఆజా...అహ్హహాజా... " అని పాట వినగానే "ఉండండయ్యా ... నన్ను ఎందుకో పిలుస్తున్నట్టున్నారు" అని కట్టుకున్న తెల్ల గ్లాస్కో లుంగీని కుడిచేతి గుప్పెట్లో కాళ్లకడ్డం పడకుండా గట్టిగా ఒడిసి పట్టుకుని గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయి - ఆ పాటయ్యాక - తీరిగ్గా వచ్చేవారు మా కోటేశ్వర్రావు సర్.
ఇదిగో ఇవాళ మళ్ళీ నున్నటి మొహమున్న బిశ్వజిత్తుని చూడగానే ఆ చపాతీరో-మోహపు రోజులు గుర్తుకొచ్చాయి. ఏ పుణ్యలోకాలనో లెక్కలు పాఠాలు చెప్పుకుంటున్నారో - మా ప్రియమైన కోటేశ్వరరావు గారు కూడా గుర్తొచ్చారు.
బిశ్వజిత్ పక్కనే వున్న మాలాసిన్హా కూడా బల్-హాయిగా అనిపించిందండోయ్.
ఎప్పుడో పెళ్ళికి ముందు రోజుల్లో డీడీలో తెలుపు-నలుపు హిందీ సినిమాల్లో ఒకట్రెండు సినిమాల్లో చూసినప్పుడు ఇదే మాలాసిన్హా "నైన్ కియే నీచే నీచే... రహూ తేరే పీఛే పీఛే" అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ, హీరో కాళ్ళావేళ్ళా పడిపోతూ వుండేది. ఈ పాటలో మాత్రం స్టైలిష్షుగా, పాలిష్డుగా బార్బీ బొమ్మలా భలే ఉంది.
ఇహ పోతే - ఈ పాట చూస్తుండగా కనిపించిన లండన్ వీధులు, థేమ్స్ నది, బిగ్గు బెన్నూ దాటి ఓ పడవెక్కి హీరో-హీరోయిన్లు ఇద్దరూ ఓ జలపాతం దగ్గరికి వెళ్తారు.
అది చూడగానే ఇదెక్కడి జలపాతమబ్బా అనుకుంటూ గూగుల్లో వెతికా!
అప్పుడు తెలిసింది - ఈ పాట లండన్ థేమ్స్ నది నీటి అలల మీదుగా - అలా అలా గాలిలో తేలి స్విజ్జర్లాండు రైన్ ఫాల్స్ (Rhine Falls) జలపాతంలో చిందులేసిందని.
ఈ పాటకి రైన్ జలపాతం పొందిన ఆనందం చూడాలంటే "సామ్‌నే జో ఏక్ తూ న హో... దిల్ మే కోఈ ఆర్‌జూ న హో!" అన్న వాక్యాల దగ్గర బిశ్వజిత్, మాలాసిన్హా నించున్న అబ్జర్వేషన్ డెక్ వెనకాల నీటి చిందులు చూడాల్సిందే! (వీడియోలో 3:09 నుంచి 3:25 దాకా).
నాకు నచ్చిన పాటని ఈ కింద రాసి పెట్టుకున్నా.
నాకైతే పాటలో వినిపించిన గిటార్ సంగీతం ఎంతో నచ్చింది.
దానికి జతగా కుదిరిన గుఱ్ఱపు-నడక కూడా - కనిపించింది కొన్ని సెకన్లయినా ఎంతో రాజసంగా వుంది.
ఈ పాట ఈ పూటకి దొరికిన పున్నెం.
నాకందిన ఈ నిన్నటి పున్నమల మించుని మీకూ పంచుకుంటూ...
~ పాటల భైరవి
కనిపించని నాలుగో సింహమేరా ఈ పోలీస్
రిప్లయితొలగించండిభలే దీపగారూ! నా బ్లాగ్ ఇంత శ్రద్ధగా చదువుతున్న మీకు బోల్డన్ని థాంక్స్!
తొలగించండి