19, ఫిబ్రవరి 2025, బుధవారం

చేవ గలిగిన దర్శకుడు కన్న కల - ఛావా

 ఊళ్ళో వున్నా
ఊరికెళ్ళినా
ఉన్న ఊళ్ళో
ఓ మంచి సినిమా వుందీ అంటే
ఊసుపోని వేళేదైనా కుదిరిందంటే
ఉన్నపళంగా వెళ్దాం-వెళ్దామనుకుంటూ
ఉరుకులపరుగుల మీద సినిమాకెళ్ళేవాళ్ళని 
ఏమంటారు?
సినీ-మా-రాజపోషకులంటారు అనుకుంటే
అందులో మొదటివరసలో వుండేదెవరనుకుంటున్నారు?
మేమే!

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    బద్రి ఆఫీసు పని కోసమని నార్ఫోక్ (Norfolk, Virginia) కి వస్తుంటే ఒక్కదాన్నీ ఇంట్లో వుండలేక నా వర్క్ లాప్టాపూ, బ్లాగ్ లాప్టాపూ, నా సంస్కృతం పుస్తకాలూ, ఇంకా టైముంటే చదువుకోవడానికి తెలుగూ-ఇంగ్లీషు పుస్తకాలు - ఇవన్నీ pack చేసుకుని నేనూ తనతో వచ్చేశా క్రిందటి ఆదివారం అంటే ఫిబ్రవరి 9వ తారీఖు. మళ్ళీ 23వ తేదీన ఆదివారం ఇంటికి తిరిగి వెళ్తాం. 

    బద్రీకి ఇక్కడ శని-ఆదివారాలు కూడా సెలవు లేదు అని చెప్పారు. కానీ ఆదివారం (2/16) రోజు సాయంత్రం నాలున్నరకల్లా ఆఫీసు పనైపోయిందని హోటల్ రూంకి వచ్చేశారు తను. 

    వస్తూనే "తొందరగా రెడీ అవ్వు, పది నిముషాలు నడిచి వెళ్తే ఒక మాల్లో 'ఛావా' సిన్మా వుంది. చూసొద్దాం పద" అన్నారు. 

    తనా మాటన్న తొమ్మిదో నిముషంలో రోడ్డుమీద నడుస్తున్నాం. 

    అంతలో నాకే అనిపించింది ఇప్పుడు సినిమాకి వెళ్ళకపోతే ఏం అని? అంటే సినిమా చూడడం మానేద్దామని అనుకుంటున్నానని కాదు  ఏదో కొంచెం మొహమాటపడ్తున్నట్టు అనిపిద్దామని, కనిపిద్దామని అంతే! 

    అదే మాట బద్రీతో అంటే "నువ్వు నార్ఫోక్‌లో సినిమా మళ్ళీ ఎప్పుడు చూడాలీ?! పద పద" అన్నారు.

    ఎంతైనా "మనసెరిగినవాడు ..." కదా! 

    అందుకే తన "పద-పద"కి నేను "సరి-సరి" అన్నా!


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    Apple maps పెట్టుకుని Norfolk Downtown లో వున్న Mac ArThur - Regal Crown Club అనే సినిమా హాలుకి వెళ్ళి  - పతీ-సమేత-ముగా (అనగా సినిమా హాల్లో నా మేతకి కొనుక్కున్న చిప్స్‌తో సహా) - ఎక్కే  ప్రతి మెట్టు మీదా కుడికాలు పెట్టి ఎక్కుతూ వెళ్ళి సీట్లో కూర్చున్నాను. 

    మేమెళ్లినప్పుడు అక్కడక్కడా కూర్చున్నవాళ్ళు కొంతమంది మాత్రమే కనిపించారు. ఇంత చలిలో, ఈ డౌన్టౌన్ సినిమాకి ఎవరొస్తార్లే అనుకుంటూ వున్నాం. 

    ఇంతలో "ఆపణ్ కసే ఆహత్?" అంటూ ఒకరినొకరు పలకరించుకుంటూ, మరాఠీలో పరామర్శించుకుంటూ బోల్డంత మంది సకుటుంబ-సపరివార-స"మేత"-సహితంగా  - పెద్దపెద్ద పాప్‌కార్న్ టబ్బులు, పెప్సీ-కోక్ డబ్బాలు పట్టుకుని బిలబిల్లాడుతూ వచ్చి కూర్చున్నారు. 

    సిన్మా-హాలుకే మాటలొచ్చి వున్నట్లైతే "నేనేనా  ఇంత నిండిందీ - ఇలా నిండి ఎన్నిరోజులయ్యిందో ?!" అని గాఠి...గా హా-శ్చర్యపడిపోయేంతగా నిండిపోయింది. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***





    "ఛావా" సినిమా పేరు వినగానే ఇదెక్కడి మాటా, దీని అర్థం ఏంటా అని వెతికితే "సింహం పిల్ల" అని కనిపించింది. సంస్కృతంలో "శావః" లేక "శావకః" అంటే కూడా అదే అర్థం. 

    అంటే సింహం ఒక్కదానికే కాదు ఏ జంతువుకి cub అయినా అది శావః / శావకః అనే పిలవబడుతుంది. ఆ 'శావః' కి హిందీ / మరాఠీ వాడుక పదం 'ఛావా' అయుంటుంది.  


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఇప్పటిదాకా సినిమాకి ఎలా బయల్దేరామో, పేరు వెనకాల భాషా-భావ-విశేషాల గురించి ఏమాలోచించానో చెప్పడం అయిపోయింది. 

    ఇప్పుడు అసలు సినిమా చూశాక నాకు ఏమనిపించిందో చెప్తా.  


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    "ఛావా" సినిమా ఛత్రపతి శివాజీ మహారాజు కొడుకు ఛత్రపతి శంభాజీ మహారాజు గురించి. 

    ఈ సినిమా కథకి ఆధారం శివాజీ సావంత్ అనే ఆయన రాసిన మరాఠీ నవల "ఛావా" అట. 

    ఒకవేళ ఆ నవల నేను చదవగలిగిన తెలుగు లోనో, ఇంగ్లీషు లోనో వున్నా కూడా నేను పూర్తిగా చదవలేనేమో. 

    (హంపీ-విజయనగరం అంటే ఇష్టమని అప్పుడెప్పుడో కొనిపించుకున్న A Forgotten Empire Vijayanagar ఇప్పటిదాకా చదవడం పూర్తి చేయలేకపోయాను - అందులో వున్న యుద్ధాలూ, రక్తపాతాల వర్ణనల వల్ల. ఇక ఈ "ఛావా" అయితే అస్సలు చదవనేలేను. దాదాపు పావు భాగం సినిమా కళ్లు మూసుకుని చూశాను.) 

    ఈ సినిమాలో నేను గుర్తు పట్టిన నటులు - వికీ కౌశల్, రష్మిక మందన్న, దివ్యా దత్తా, అశుతోష్ రాణా, ప్రదీప్ రావత్, డయానా పెంటీ. 

    సినిమాలో వచ్చే నటుల పేర్లలో అలోక్ నాథ్ పేరు చూశాను. కానీ ఇప్పటికీ అతని పాత్ర ఏదో గుర్తు కూడా రావట్లేదు. OTTలో వచ్చినప్పుడు సావకాశంగా చూస్తే కనిపిస్తాడేమో!

    సినిమా సగమైపోయి బద్రి చెప్పేదాకా తెలీలేదు - ఔరంగజేబు ఎవరో! అక్షయ్ ఖన్నా అని తెలిశాక నిజ్జంగా ఆశ్చర్యపోయా! 

    నాకు పేర్లు తెలిసి సినిమాలో గుర్తు పట్టిన నటులూ, పేరు తెలిసినా గుర్తు పట్టలేని అలోక్ నాథూ, బద్రి పేరు చెప్పాక గుర్తు పట్టిన అక్షయ్ ఖన్నా, ఇంకా పేర్లు కూడా తెలియని మిగిలిన నటులూ - అందరూ ఎంత బాగా నటించారంటే  - జరిగిపోయిన కథేదో కళ్ల ముందు కనిపిస్తున్నట్టే అనిపించింది. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఇహ పోతే "ఛావా" సినిమాలో నాకు నచ్చిన విషయాలు:

    1. శంభాజీ మహారాజు మరాఠా సైన్యంతో బర్హన్‌పూర్ మీద దాడి చేసినప్పుడు అక్కడున్న ఔరంగజేబు సైన్యం మరాఠా సైన్యం కోట లోకి ప్రవేశించకుండా చెక్క దూలాల్లాటివి అడ్డం వేస్తారు. వాటి మధ్య ఖాళీలు వుండడం వల్ల మరాఠా సైనికుల గుఱ్ఱాలు వాటి మీద ఎక్కి రాలేవని. కానీ కొందరు మరాఠా సైనికులు జఱ్ఱున జారుకుంటూ ఆ చెక్క దూలాల కిందకి దూరి ఆ దూలాల మధ్య నున్న ఖాళీలన్నింటినీ తమ చేతుల్లో వున్న డాళ్లతో (అంటే shields) కప్పేస్తారు. అప్పుడు గుఱ్ఱాల మీదున్న మిగిలిన మరాఠా సైనికులు సులువుగా ఆ డాళ్ల మీదుగా దాటి వెళ్లి అవతల పక్కనున్న మొఘల్ సైనికులతో యుద్ధం చేస్తారు. ఇది చాలా బాగా చిత్రీకరించారు. 

    2. శంభాజీ మహారాజు పాత్రలో పరకాయప్రవేశం చేసిన వికీ "కౌశలం" మహ-గొప్పగా వుంది. కొన్ని కొన్ని పాత్రల్లో జీవించాలంటే ఆ పాత్రకు తగ్గ వేషం (అంటే ఆహార్యం) వేసుకుంటే చాలదు. చాలా గొప్ప పరిశ్రమ కావాలి. అందులోనూ ఒక మహాయోధుడైన ఛత్రపతిలా చేసి మెప్పించాలంటే నోటితో పలికే పలుకు క్లుప్తంగా, గంభీరంగా వుండాలి. చేతల్లో నేర్పరితనం, నైపుణ్యం కనిపించాలి. వికీ కౌశల్ ఎంత కృషి చేసి వుంటాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

    3. తన రాణి యేసుబాయితో మాట్లాడేటప్పుడు శంభాజీ మహారాజు కళ్ళల్లో కనిపించింది అభిమానపూర్వకమైన ప్రేమ. ఎక్కడా వెగటు పుట్టించని హుందా అయిన ప్రవర్తన. మరాఠీ చీర కట్టులో శంభాజీ మహారాజు భార్య యేసుబాయిగా నటించిన రష్మిక మందన్న సినిమా మొదటి నుంచి చివరి వరకు ఎంతో మర్యాదగా, ఒద్దికగా, వీరుడైన భర్తకు ధీర అయిన భార్యగా చాలా చక్కగా నటించింది. హిందీ కూడా చాలా బాగా మాట్లాడింది.  

    4. శంభాజీ మహారాజుకి మామ హంబీర్ రావ్‌గా నటించిన అశుతోష్ రాణా కళ్లల్లో మహారాజు మీద ఇష్టం, వాత్సల్యం  - అదే సమయంలో - మహారాజన్న గౌరవం - ఎంతో గొప్పగా అనిపించాయి. శంభాజీ మహారాజుకి, మామ అయిన హంబీర్ రావ్‌కి మధ్య జరిగిన సంభాషణలు ఎంతో ఉదాత్తంగా వున్నాయి.

    5. శంభాజీ మహారాజుకి సవతితల్లిగా, అనుక్షణం అతన్ని తప్పించి తన కొడుకు రామ రాజేని ఛత్రపతినిగా చేయాలని ఆశపడి కుట్రలు పన్నుతూ వుంటుంది రాజమాత సోయరాబాయి. ఎంత ద్వేషం వున్నా అది ప్రకటించడంలో - ఊరికే గొంతు చించుకుని అరవడమో, మొహం చిట్లించుకోవడమో చేయకుండా - సంతులితంగా నటించిన దివ్యా దత్తా subtelity భళా! అంతలా తనని ద్వేషిస్తోందని తెలిసీ ఆవిడ ఆఖరిక్షణాల్లో చూడడానికి వచ్చిన శంభాజీ మహారాజు తన పాదాలు తాకినప్పుడు స్పృహలో లేని సోయరాబాయి కంటి చివర కనిపించిన కన్నీటి బొట్టుకి భళ-భళా! 

    6. తెలుగు సినిమాల్లో కౄరుడైన విలన్ లాగానో, అస్తవ్యస్తపు హాస్యాలతో నవ్వులపాలుగానో కనిపించే ప్రదీప్ రావత్ "ఛావా" లో శంభాజీ మహారాజు పక్కన ఒక మంచి పాత్రలో కనిపించడం ప్రదీప్ రావత్ కేమో కానీ నాకు మాత్రం బహు మంచిగా అనిపించింది.  

    7. ఔరంగజేబు కూతురుగా చేసిన డయానా పెంటీ మొదటి నుంచి చివరి దాకా చిరునవ్వనేది మొహమ్మీదికి రానీకుండా నిలువెత్తు ద్వేషానికి పేష్వాజ్ వేసి నగలు పెడితే ఇలా వుంటుందేమో అనిపించేలా చేసింది. 

    8. అంతటి సినిమా - ప్రతి ఫ్రేమూ, సీనూ ఎంతో ఇష్టంగా చూశానని అనుకున్నానా - ఇప్పటికీ అందులో అలోక్‌నాథ్ చేసిన పాత్ర ఏదో గుర్తు రావట్లేదు. తప్పకుండా OTTలో వచ్చినప్పుడు చూసి పట్టుకోవాలి. 

    9. అందరి కన్నా ప్రత్యేకంగా నాకు నచ్చింది ఔరంగజేబుగా కౄరించిన అక్షయ్ ఖన్నా. నిర్వ్యాపారంగా బాలీసుల మీద పడుకుని ద్రాక్షపళ్లు తింటూ, తనకు నచ్చని వార్త చెప్పారని తనవారినే నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ, క్షణక్షణం శంభాజీ మహారాజు మీద పగతో ఊగిపోతున్నట్టుంటాడు. ముందసలు నేను గుర్తు పట్టలేదు. ఎక్కడో చూసిన మొహంలా వుందనుకున్నా కానీ అది ఈ ఖన్నా దనుకోలేదు. ఇంటర్వెల్‌లో బద్రి "ఔరంగజేబుని గుర్తు పట్టావా?" అనడిగి "అక్షయ్ ఖన్నా" అని చెప్పగానే "అబ్బా! భలే!" అనుకున్నా - "అబ్బా! భలే!" అని పైకే అన్నా!
 
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


"ఛావా" సినిమాలో అర్థం కాని ఒకే ఒక విషయం: 

    సినిమాలో ఒక చోట శంభాజీ మహారాజు కోటకి ఎదురుగా వున్న ఒక కొండ మీదికి గురి పెట్టి  ఫిరంగి గుండుని పేలుస్తాడు. 

    ఆ సమయంలో అక్కడొక అమ్మాయి మేకలను కాస్తూ వుంటుంది. ఆ ఫిరంగి గుండు పేలిన శబ్దానికి భయపడుతున్న మేకలని అక్కడికి దూరంగా తోలుకుంటూ వెళ్తుంటుంది. 

    ఇంతలో కొండకి అవతల పక్క నుంచి మొఘల్ సైన్యం గుఱ్ఱాల మీద వస్తూ కనిపిస్తారు. ఆ మేకలు కాచుకునే అమ్మాయి మంటల్లో కాలిపోతూ, అరుస్తూ కనిపిస్తుంది. ఆ sequence మాత్రం నాకర్థం కాలేదు. ఫిర్ సే OTT మే దేఖ్‌నా హై! 

    రెహ్మాన్ సంగీతమూ అంతే - బావున్నట్టుంది కానీ - ఫిర్ సే OTT మే సున్‌నా హై! 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    లక్ష్మణ్ ఉటేకర్ - తను కన్న కలని అందంగా, తీద్దామనుకున్న కథని ఉన్నతంగా - శంభాజీ మహారాజు మీద భక్తితో - ఒక సినిమాలా తీసినట్టు కాకుండా పూజ చేసినట్టనిపించింది.  

    చిన్నప్పుడు కథల్లో  చదువుకున్న ఛత్రపతి శివాజీ మహారాజు ప్రత్యేకతైన గెరిల్లా యుద్ధాలని  - మట్టిలో మట్టిగా, నీటిలో నీరుగా, గాలిలో గాలిగా - దాక్కుని మరాఠా సైన్యం మొఘల్ సైన్యాలని చికాకు పెట్టినట్టు  ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. 

    రష్మిక మందన్నని మహారాణిగా నిండుగా చూపించినా  - flashback లో పెళ్లికి ముందు కన్నె రాజకుమారిలా చూపించే వంకతో దేవతావస్త్రాల్లాంటి ఉల్లిపొర బట్టలు వేసో, పాటల్లో చెమ్మచెక్కలాడించో - చూపించకుండా వున్నందుకు లక్ష్మణ్ ఉటేకర్‌కి వందకి రెండొందల మార్కులు. 

    రష్మిక అనే కాదు సినిమాలో వున్న నాలుగైదు స్త్రీ పాత్రలను చాలా మర్యాదగా చూపించారు. 

    ఈ సినిమాలో ఒక పాటలో శంభాజీ మహారాజు, రాణి యేసుబాయి డాన్స్ చేస్తున్నట్టు - యూట్యూబ్‌లో - ఒక వీడియో వుంది కానీ అది సినిమాలో లేదు. 

    మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్ణవీస్ శంభాజీ  మహారాజు చేత డాన్స్ చేయించడమేంటని తీసెయ్యమని చెప్తే లక్ష్మణ్ ఉటేకర్ "నాకు సినిమాలో డాన్స్ కన్నా శంభాజీ మహారాజు కథ చెప్పటం ముఖ్యం" అని ఆ డాన్స్ తీసేశారట. 

    హవ్వ! ఇది ఈ రోజుల్లో జరిగింది అంటే ఎవ్వరన్నా నమ్ముతారా? 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    వారెవా ! 
    అది కదా రాష్ట్రం! 
    అది కదా ప్రభుత్వం! 
    అది కదా చరిత్రకి ఇవ్వాల్సిన  గౌరవం! 
    జయహో మహారాష్ట్ర! జయహో మరాఠా! జయహో మరాఠీ భాషా! 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    "ఛావా" - ఒక కథగా విషాదాంతమనిపించినా - ఒక గొప్ప సినిమాగా విజయోత్సవం. 

    మంచి కథని మర్యాదగా తీస్తే మంది మెచ్చే సినిమా అవుతుందని చేసి చూపించిన చేవ గలిగిన దర్శకుడు  కన్న కల - "ఛావా"! 

    చాలా రోజుల తర్వాత  - సినిమా చూశాక  - చూసీ చూడనట్టుండనీయక - చూసినదాన్ని తలుచుకుంటూ రాస్తూ - మళ్ళీ ఇంకోసారి చూద్దామా అనిపిస్తున్న సినిమా "ఛావా"! 

    నాకు నచ్చిన ""ఛావా" ఇంకొందరికన్నా నచ్చుతుందని అనుకుంటూ 

~సినీ-మా-లక్ష్మి 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


14 కామెంట్‌లు:

  1. చాలా బాగా వ్రాశారు ఎప్పటిలానే, నాకూ థియేటర్ కి వెళ్ళి చూడాలనిపించేలాగా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నమస్తే దీపగారు! చాలా రోజుల తర్వాత చూసిన మీ ఈ వ్యాఖ్య నాకు చాలా సంతోషం కలిగించింది. "ఛావా" మంచి సినిమా - థియేటర్లో చూడడానికి చాలా బావుంది.

      తొలగించండి
  2. ఈ "యేసు" బాయి నేము కొంజెం ఒదైక్కిరదు నడువులె :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీజీ! "యేసు" శబ్దం ఏ యశస్సు లాంటి సంస్కృత పదానికో మరాఠీ భాషలో వాడుక పదమయ్యుంటుంది (శావః ఛావా అయినట్టు).

      ఎప్పుడో వాళ్లు పెట్టేసుకున్న ఆ పేరుని మనమిప్పుడు "ఒదైక్కిరదు" అన్నా, "ఒద్దూ" అన్నా - ఇప్పోదు ముక్కియమిల్లై :)

      తొలగించండి

    2. ఈ "యేసు" , "బాయి" నడుమ శావ చిక్కుకునే రోజులు మళ్లీ వస్తున్నాయంటారా ?


      తొలగించండి
    3. మీరు నన్ను చిక్కుల్లో పెట్టాలనుకుంటున్నారన్నట్టున్న రోజులు మాత్రం వచ్చేశాయ్!

      అత ఊర్థ్వం న సంశయః!

      తొలగించండి
  3. మనసున మల్లెల మాలలూగెనే,
    కన్నులముందరె
    ఛావా కదలాడెనే,
    ఎంత హాయి ఈనాడు కలిగెనో,
    ఛావా చూచూటకై,
    ఎద ఉరకలు వేసెనో! 😊

    రిప్లయితొలగించండి
  4. లలితమ్మాయ్!
    కాకినాడలో ఉన్నరోజుల్లో ఒక ఇంట్లో అద్దెకున్నా! ఆ ఇంటి ఓనరమ్మ చూడని సినిమా లేదు. సినిమాచూసివచ్చి ఆమె సినిమాలో అన్ని డిపార్ట్మెంట్లు ఎలా పని చేసేయోవి వివరించేది, అనర్గళంగా. నాటికాలం లో నేటిలా మాధ్యమాలుండి ఉంటే ఆమెకు తప్పక అవార్డ్ వచ్చి ఉండేదని నా నమ్మిక. బాగోలేదనే సినిమా ఆమె మరో సారి మరో సారి చూసేది. బాగో లేదన్నారుగా మళ్ళీ ఎందుకు చూస్తారంటే, వాడు డబ్బులు పెట్టుబడిపెట్టి సినిమా తీసాడు. ఎక్కడ తగలేసుకున్నాడో చూడద్దండీ అనేది.వీరే కదా సినిమాకి మహరాజ పోషకులు. నీ సినిమాకత విన్నాకా అది గుర్తొచ్చింది,మరేం లేదు సుమా!
    నీవు రాసే సినిమా రివ్యూ లు చదువుతాను. పి.హెచ్ డ్ తీసిస్ రాసినట్టుంటాయి. నేటి కట్ పేస్టులకంటే చాలా మేలు కదా! పి.హెచ్ డికి ప్రయత్నించచ్చు. ఉబోస మాత్రమే. ఎండుకంటే దీనికో కత ఉంది, నా ఇరవైల వయసులోది. ఒక తెలుగు మాస్టారు ఎప్పుడూ డిటెక్టివ్ సాహిత్యం,కొవ్వలి,జంపన ఇలా ఈ సాహిత్యమే చదువుతూ ఉండేవాడు. ఎప్పుడూ ఇదే పుస్తకం ఒకటి చేత ఉండేది. ఒక సారి అడిగా తెగించి, దీనిమీద రిసెర్చ్ చేస్తున్నా ప్.హెచ్. డి కి అన్నారు. ఔరా! అని అశ్చర్యపోయా.
    నీ ఛావా సినిమా రివ్యూ థీసిస్ లా ఉంది. ఎక్కువ చెప్పేనా!
    విజయోస్తు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నమోనమః! మీ ఆత్మీయపూరిత ఆశీర్వాదానికి ధన్యవాదాలు! ఇదొక గొప్ప ప్రశంస! ధన్యా అస్మి!

      తొలగించండి
  5. ఫేస్బుక్కులో బోలెడన్ని కబుర్లనే ప్రొఫైల్ కనపడితే వచ్చిన అతిథిని. నిజంగానే బోలెడన్ని కబుర్లు. 2011 నుంచి. :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నమస్తే మూర్తిగారూ! అపురూపంగా నా బ్లాగుని పలకరించి, ఆ పలుకు నాతో కూడా పంచుకున్న అతిథి మీరు! ధన్యవాదాలు!

      తొలగించండి