అమెరికబుర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అమెరికబుర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, అక్టోబర్ 2026, ఆదివారం

నేనూ, నా పెద్దొకటీ - అచ్చు మా నాన్నలాగే...

    నా చదువు మళ్లీ మొదలయింది. 

    మళ్లీ మొదలైందీ అని చెప్పడానికి నా చదువు ఆగింది ఎప్పుడూ లేదు.

    రోజూ ఏదో వొక కొత్త పాఠం - ఎక్కడోక్కడ - ఎవరో ఒకరి దగ్గర - నేర్చుకుంటూనే వున్నాను, వుంటాను కూడా!

    నిత్యవిద్యార్థినన్నమాట. 

కలిసిన మనిషి 
చెప్పిన మాటా, చూసిన చూపూ, చేసిన చేతా
కలయికలో దక్కిన - 
ఎవరనే ఎఱుకా, ఏమిటనే చవీ, ఎందుకనే తెలివిడీ
ఈ చదువంతా ఒక ఎత్తైతే

చుట్టూ వున్న చెట్టూ - గుట్టా
చూపుకానే పులుగూ - పసరం
కదల్లేని రాయీ - రప్పా
కదలకుండలేని నీరూ - గాలీ
చెప్పకుండానే చెప్పే చదువు ఇంకో ఎత్తు. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఇప్పుడొక్కసారి - తొలిగా నాకు చదువు చెప్పిన - చెప్తున్న ఒజ్జలందరిని ఓ సారి  తలచుకుని వారికి జోతలిచ్చి ఆ తర్వాత నా చదువు కబుర్లకొస్తా...

గురురేవ గతిః - గురుమేవ భజే |
గురుణైవ సహాస్మి - నమో గురవే ||
న గురోః పరమం - శిశురస్మి గురోః |
మతిరస్తి గురౌ మమ - పాహి గురో ||


    అన్నట్టు - ఈ గురువందనశ్లోకంలో ప్రత్యేకత ఏంటంటే ఉకారాంత పుంలింగ శబ్దమైన గురు-శబ్దం యొక్క అష్టవిభక్తుల ఏకవచన రూపాలూ ఈ శ్లోకంలో వరసగా వుంటాయి. 

గురురేవ గతిః - గురువే నాకు దిక్కు (ప్రథమా విభక్తి)
గురుమేవ భజే - గురువునే సేవిస్తాను (ద్వితీయా విభక్తి)
గురుణైవ సహాస్మి - గురువు తోనే వుంటాను (తృతీయా విభక్తి)
నమో గురవే - గురువుకి నా నమస్కారం (చతుర్థీ విభక్తి)
న గురోః పరమమ్ -  గురువు కంటే ఏదీ మిన్న కాదు (పంచమీ విభక్తి)
శిశురస్మి గురోః - గురువుకి నేను శిష్యుణ్ణి (షష్ఠీ విభక్తి)
మతిరస్తి గురౌ మమ - నా తలపు గురువునందే స్థిరమై వుంటుంది (సప్తమీ విభక్తి) 
పాహి గురో! - ఓ గురు! నన్ను కాపాడు (సంబోధన-ప్రథమా విభక్తి)

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    ఇహ ఇప్పుడు మళ్లీ మొదలైన నా చదువు కబుర్లు.

    ఓ పక్కేమో "నా చదువు అగింది లేదు, నేను నిత్యవిద్యార్థిని" అంటున్నానా? 
    మరి ఆగని చదువు మళ్లీ మొదలవ్వటమేంటి కదా? 
    మరంటే ఇదేదో ఆగిన చదువేనన్నమాటే కదా! 
    మరింకా అంటే ఇది అన్ని చదువుల్లాంటి చదువు కాదన్న మాట. 

    ఈ చదువేంటంటే - ఒక online తరగతిలో చదువుకునే సంస్కృత పాఠం. 

    సంస్కృతభారతి వారి S2S అంటే "సంభాషణతః శాస్త్రపర్యంతమ్" అనే నాలుగేళ్ల సంస్కృత వ్యాకరణ పాఠాల  కోర్స్ 2024 వ సంవత్సరం జూన్ నెలలో పూర్తి చేశాను. 

    ఆ కోర్సులో చివరి సంవత్సరం - అంటే నాలుగో సంవత్సరంలో రెండు electives ఉంటాయి -   శాస్త్రం (న్యాయశాస్త్రం) కానీ, సాహిత్యం (సంక్షేపరామాయణం) కానీ తీసుకోవచ్చు. నేను సాహిత్యం కింద సంక్షేపరామాయణం ఎంపిక చేసుకున్నాను. 

    అలా నా నాలుగేళ్ల కోర్స్ అయిపోయింది. సంస్కృతభారతి వారి ప్రమాణపత్రమూ (certificate) వచ్చింది. 

    కానీ నాకు "న్యాయశాస్త్రం" నేర్చుకోవాలని ఎంతో అనిపించేది. 

    నేనెంతో గట్టిగా అనుకున్నానో ఏమో -  సంస్కృతభారతి ఆ నాలుగో సంవత్సరంలో శాస్త్రం చదువుకున్నవారికి సాహిత్యం, సాహిత్యం చదువుకున్నవారికి శాస్త్రం కోర్సులు మొదలుపెడుతున్నామని ప్రకటించారు. 

    నాలా ఆసక్తి వున్న వారికి "న్యాయశాస్త్రం" నేర్చుకోండీ అని ఇంకో అవకాశం ఇచ్చారు. అలా సెప్టెంబర్ 2024 లో న్యాయశాస్త్రంలో చేరాను. 

    కానీ అది నేర్పే గురువు గారికి కుదరక ఆగిపోయింది.

    మళ్లీ 2025 సెప్టెంబర్లో మళ్లీ ఇంకోసారి "న్యాయశాస్త్రం" లో చేరాను. 

    నేర్పే గురువుగారికి నేర్పూ, ఓర్పూ వున్నా - నాకు నేర్చుకునే వీలు కుదరక - మళ్లీ ఆగిపోయింది. 

    ఇక ఈ న్యాయశాస్త్రం నాకు అందని పండే అని వదిలేసుకున్నా.


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    కానీ ఈ సంవత్సరం ఆగస్టులో "న్యాయశాస్త్రం" సెప్టెంబర్ నుంచి మొదలవుతోంది అన్న సంస్కృతభారతి (SB) ప్రకటన చూడగానే నాకిష్టమైన తర్కం (న్యాయశాస్త్రం) చదువుకోవాలనే ఆశ పుట్టింది. 

    వెంటనే register చేసుందామని SB site కి వెళ్తే - అక్కడ ఒక "న్యాయశాస్త్రం" బదులు "న్యాయశాస్త్రం 1, న్యాయశాస్త్రం 2" అని రెండు కోర్సులు కనిపించాయి. 

    అంటే - ఇంతకు ముందు నాతో పాటు 2025 లో "న్యాయశాస్త్రం" క్లాసులో చేరి - బుద్ధిగా మానేయకుండా చదువుకుని పూర్తి చేసి - విస్తారంగా తర్కం నేర్చుకోవాలనుకునే వారి కోసం "న్యాయశాస్త్రం 2" అన్న కొత్త కోర్స్ మొదలుపెట్టారన్నమాట. 

    న్యాయంగా చదవాల్సిన తర్కం చదవకుండా - అన్యాయంగా మధ్యలోనే మానేసిన నా కోసమేనేమో అన్నట్టు - "న్యాయశాస్త్రం 1" కూడా వుంచారు. 

    అది చూడగానే ఉత్సాహంగా fees కట్టేసి "న్యాయశాస్త్రం 1" లో చేరిపోయాను. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    అప్పుడే నాకు నేనూ మా నాన్న లాగే "పెద్దొకటి" లో చేరుతున్నాననిపించింది. 

    ఆయనుంటే తప్పకుండా నా "పెద్దొకటి" గురించి ఆయనకి చెప్పి వుండేదాన్ని - ఇద్దరమూ నవ్వుకుని వుండేవాళ్లం. 

    ఇప్పుడు మాత్రమేమయ్యింది?! 

    మా నాన్న "పెద్దొకటి" గుర్తు చేసుకుంటూ - నా "పెద్దొకటి" గురించి రాసుకుంటూ - నేను నవ్వుకుంటున్నాను. 

    ఇదిగో - కిందటి వారమే - అంటే అక్టోబర్ 5 నుంచి నా "పెద్దొకటి" మళ్లీ మొదలయింది. 

    ఈసారైనా "న్యాయశాస్త్రం 1" జాగ్రత్తగా చదువుకుని - ఈ పెద్దొకటి "ఇంకా ...పే...ద్ద ఒకటి" కాకుండా వచ్చే ఏడాది "న్యాయశాస్త్రం 2" కి ఏ ఆటంకమూ లేకుండా చేరుకుంటానని నాకు నేనే చెప్పుకుంటూ...

ఈ కింద మా నాన్న "పెద్దొకటి" కబుర్లు కూడా పంచుకుంటున్నాను....


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


అవతారంగారి నారాయణగారి బాబి - 1 - పెద్దొకటి నుంచి .....(మా నాన్న ఐదేళ్ల వయసప్పటి ఫోటోతో)

    ఐదేళ్ళ వయసువరకూ పుట్టు వెంట్రుకలు లేవు. నా ఫోటో వుంది - పుట్టువెంట్రుకలు తీయకుండా వున్నది - కింద బూట్లు, పైన గిరజాల జుట్టూ నేను. 


        ఐదో సంవత్సరంలో నాకు పుట్టు వెంట్రుకలు తీశారు. 

        ఆరో సంవత్సరంలో అక్షరాభ్యాసం, బళ్ళో వేయడం జరిగింది. 

        స్కూలుకి వెళ్ళేవాడిని కాదు. 

        మా వూళ్ళో అనుపిండి రామ్మూర్తిగారని ఉండేవారు - మునసబుగారి అన్నగారు. 

        ఆయనొక బెత్తం పట్టుకుని వెనకాల నిక్కరు పిఱ్ఱ మీద కొడుతూ బడికి తీసికెళ్ళి అక్కడ పడేసేవారు మమ్మల్ని - నన్నూ, కాళత్తయ్యగారి నాగన్నని. 

        ఏదో ఏడ్చుకుంటూ కూర్చునే వాళ్ళం బళ్ళో. 

        ఈలోగా నాతో చేరిన వాళ్ళందరూ ఒకటో క్లాసు నుంచి రెండో క్లాసుకెళ్ళారు. 

        రాజూ మాష్టారని ఒకాయన - "ఒరే! నువ్వింకా ఒకటేరా" అన్నాడు. 

        అంటే మనం ఒకటో క్లాసే ఫెయిల్ అన్నమాట. 

        ఫెయిల్ అంటే ఏడుస్తానని - "నువ్వు పెద్దొకటిరా" - అనేవారు. 

        అలా పెద్దొకటి కూడా చదివాను నేను.


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***





26, జూన్ 2024, బుధవారం

ఈ ఏటికి హాల్లో సినిమావలోకానికో చెల్లుచీటీ...అను చలనచిత్రోపాఖ్యానం-2024 AD

    2024 AD - మొదలై రెండు మూళ్లు ఆరు నెలలు పూర్తవుతూ వున్నాయి ఇంకో మూడు రోజుల్లో. 

    ఇప్పటికి ముత్యంగా మూడు సినిమాలు థియేటర్లో చూశాం. 

    ఇహ ఈ ఏడాదికి హాలుకెళ్లి సినిమా చూడద్దు బాబూ అనుకుని సినిమాలకో  చెల్లుచీటీ ఇచ్చుకున్నాం. 

    ఆ ఖబరే ఇవాళ్టి కబుర్లు. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఈ ఏడాదికి హాలులో చూసిన మొట్టమొదటి సినిమా టిల్లు స్క్వేర్.  

    ఆ టిల్లుగా చేసిన సిద్ధు జొన్నలగడ్డకి ఎవరు పెట్టారో కానీ Star Boy అనే పేరు  -   "టిల్లు స్క్వేర్" సినిమా చూస్తున్నంత సేపూ "ఈ   సిద్ధు  స్టార్ బోయ్ కాదు చాలా స్మార్ట్-బోయ్" అనిపించాడు. 

    చాలా తెలివిగా - "డీజే టిల్లు" లో బావున్నాయి అనిపించిన సీన్లని పట్టుకొచ్చి "టిల్లు స్క్వేర్" లో అక్కడక్కడా పేర్చేశాడు. 

    దాంతో అంతకు ముందు "డీజే టిల్లు" చూసిన వాళ్లకి  తలా-తోకా లేని "టిల్లు స్క్వేర్" సినిమా బావుందేమో అని డౌటొచ్చేస్తుంది. 

    "డీజే టిల్లు" చూడని వాళ్ళకెలాగూ అందులో మిస్సైన ఆ కొన్ని సీన్లూ "టిల్లు స్క్వేర్" లో కనిపించడంతో ఇదేదో బానే వుందే అనిపిస్తుంది. 

    అంతే ! అంతకు మించి ఇంకేం లేదు. 




*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    థియేటర్‌కి వెళ్లిన రెండో సినిమా "ప్రసన్న వదనం". 

    సుహాస్ హీరో. 

    కొత్త కథ. 

     తన మొహం తనకే తెలియని హీరో. 

    జుట్టుకి రంగేసుకుంటేనే స్నేహితులని గుర్తు పడతాడు. 

    సినిమా చివర్లో జుట్టుకి ఒకేలాంటి రంగేసుకున్న ఇద్దరమ్మాయిల్లో తన హీరోయిన్ ఎవరో కనుక్కోవడానికి తంటాలు పడతాడు. 

    సినిమా చాలా బావుంది. 

    కానీ థియేటర్లో పట్టుమని పది మంది కూడా లేరు. 

    ఈ సినిమా చూసి బయటికి రాగానే బద్రి, నేను ఏమనుకున్నామంటే ... "ఇంత కొత్త concepts తో సినిమాలు తీస్తున్నారు ఈ కొత్త దర్శకులు. ఇదే మలయాళంలో తీసి dub చేస్తే గొప్ప సినిమా అని పొగుడుతారు కానీ మన తెలుగు సినిమా అయేటప్పటికి ఎవరో స్టార్ హీరో వుంటే తప్ప థియేటర్లో చూడ్డానికి రారు. ఇప్పట్నుంచి మనిద్దరం చిన్న హీరోల సినిమాలు థియేటర్లోనే చూద్దాం" అని. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    "ప్రసన్న వదనం" చూసిన ప్రసన్న హృదయంతో వెళ్లిన మూడో సినిమా "గం గం గణేశ". 

    తమ్ముడు దేవరకొండ హీరో. 

    సినిమా మొదలవుతూనే ఓ చిన్న అనుమానం - మనం రావల్సిన సినిమాకే వచ్చామా - లేకపోతే పొరపాట్న వేరే దానికి వచ్చామా - అని! 

    సినిమా మొదలైన పది  నిముషాలకి  ఇన్నేళ్ల నా సినీ-వీక్షణ-కాలంలో మొట్టమొదటి సారిగా - నాకు తెలియకుండా నిద్రపోయా. 

    ఓ అరగంట తరవాత నిమెలకువ వచ్చింది. 

    నేనెప్పుడు లేస్తానా అని ఎదురు చూస్తున్న బద్రి నేను కళ్ళు తెరవడం చూసి "బుజ్జాయ్! ఇంటికి వెళ్లి పోదామా?" అనడిగారు. 

    అమ్మో ! ఇప్పుడు ఇంటికెళ్ళిపోతే ఇంకేమన్నా వుందా? 

    ఏం జరిగి వుంటుందా అని మళ్ళీ ఏ OTT లోనో వెతుక్కుని మరీ చూస్తాం. మళ్ళీ అదో time waste - ఇంకో తలనొప్పి. 

    ఆ మిగిలిన కొంచెం సినిమా కూడా ఎలాగో ఓపిక పట్టి చూసేస్తే - ఇప్పటిది సరి అనుకుని - "ఉహూ! వద్దు. చూసేద్దాం." అన్నాను.  

    మొత్తానికి "గం గం గణేశ" చూసి బయటికి వచ్చి కారెక్కగానే బద్రి అన్న మొట్టమొదటి మాటలు "ఈ ఏడాదికి ఇక థియేటర్లో సినిమాలకి రావద్దు. చాలు". 

    అంత కన్నా ఇంకొక్క మాట చూసిన సినిమా గురించి మాట్లాడుకున్నా అది ఎక్కువే అనుకున్నాం. 



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఏప్రిల్  నెలలో "టిల్లు స్క్వేర్" చూసి రాగానే రాసుకున్న ఓ పుంజీడు కబుర్లు అప్పుడు పోస్ట్ చేయడానికి కుదరలేదు. రాసినంత వరకు చాల్లే అనుకుని అలాగే వదిలేశాను.  అవిప్పుడు ఈ కింద పోస్ట్ చేశాను. 

 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

"టిల్లు స్క్వేర్"  అనబడు ఓ ఎంటర్టెయిన్మెంటు టిల్లర్ 


    పుష్ప, కాంతారా సినిమాలకి తరువాయి భాగాలు వస్తాయని తెలిసినప్పుడు అవి తప్పకుండా థియేటర్లో చూడాలని గట్టిగా అనుకున్నా. 

    అవి రెండూ కూడా అప్పుడొస్తాయి, ఇప్పుడొస్తాయి అని వింటుండగానే "టిల్లు స్క్వేర్" అనే ఇంకో టిల్లు-సినిమా మార్చ్ 29 న వస్తోందని తెలియగానే నాకు అంతకు ముందు చూసిన డీజే టిల్లు సినిమా గుర్తొచ్చింది. 

    ఆ  సినిమా బద్రీకి, నాకు బాగా నచ్చింది కూడా. అది చూసిన ఉత్సాహంలో రాసుకున్న బ్లాగ్ కబుర్లు గుర్తుకొచ్చాయి. 


    ఈలోగా టిల్లు స్క్వేర్ సినిమా మా వూళ్ళో వున్న థియేటర్కి వచ్చేసిందని తెలిసింది. నాకు చూస్తే బావుండుననిపించింది. 

    ఏదైనా సినిమా చూసే ముందు ఆ సినిమాకి సంబంధించిన రివ్యూలు చదవను, వినను. 

    సినిమా చూస్తే నాదైన fresh view తో చూడడమే నాకిష్టం. ఈ "టిల్లు స్క్వేర్" కూడా అలాగే చూశాను. 

    ఆ సినిమా చూడడానికి ముందు ఏం జరిగిందో, చూసేటప్పుడు ఏమనిపించిందో, చూశాకా ఎందుకిది రాయలనిపించిందో - ఆ విశేషాలే ఈ రోజు కబుర్లు.

టిల్లు స్క్వేర్ సినిమాకి వెళ్లే ముందు... 

    ఏప్రిల్ 1 సోమవారం నాడు రాత్రి  ఎనిమిదింపావు ఆటకి బద్రి టికెట్లు తీసుకున్నారు. 

    తీరా సోమవారం వచ్చేటప్పటికి - ఆ రోజు మధ్యాహ్నం నుంచి మా ఊళ్ళో severe weather alerts రావడం మొదలుపెట్టాయి. 

    ఆ రోజు సాయంత్రం ఏడుంపావు దాకా టోర్నెడో వార్నింగ్ వుంది అని టీవీలో, ఫోనుల్లో హెచ్చరికలు వస్తూనే వున్నాయి. 

    నేను మాత్రం ఆఫీస్ అయిపోగానే రాత్రి వంట చేసేసి సినిమాకి వెళ్ళడానికి తయారవుతున్నా. 

    కాకపోతే టోర్నెడో వార్నింగ్ వుంది కాబట్టి బద్రీది, నాదీ ఆఫీస్ లాప్‌టాపులు రెండూ వాటి వాటి bags లో  పెట్టి బేస్మెంటులో పెట్టొచ్చా. 

    టోర్నెడో హెచ్చరికలు వచ్చిన ప్రతిసారీ ఇంట్లో వున్న విలువైన వస్తువులు పట్టుకుని బేస్మెంటు లోకి వెళ్ళడం మా కలవాటు. 

    అవి అక్కడ పెట్టి పైకొచ్చి ఇంట్లో వున్న సుహాస్‌తో "జాగ్రత్త నాన్నగాడూ... టోర్నెడో అంటున్నారు" అనగానే వాడు వెంటనే "అమ్మా! ముందు మీరు జాగ్రత్త. బయటికి వెళ్తున్నారు" అన్నాడు. 

    "థియేటర్లో వుండగా అక్కడ టోర్నెడో వస్తే మేమొక్కళ్ళమే కాదుగా. అక్కడింకా చాలా మంది వుంటారు. అదో రకమైన ఎక్స్పీరియన్స్ అవుతుంది" అంటూనే నేను కారెక్కేటప్పటికి టైము ఏడుంపావు. 

    అప్పటికి ఆ టోర్నెడో కూడా నా మీద దయ తలిచినట్లు మా వూరు దాటిపోయింది. 

    సినిమా మీద నాకున్న మక్కువకి ప్రకృతి కూడ మద్దతిచ్చింది. 

    అలా బయల్దేరి - మధ్యలో AT&T స్టోర్ దగ్గర ఆగి అక్కడ పని చూసుకుని - థియేటర్‌కి చేరేటప్పటికి ఎనిమిది గంటలు.  

    చిప్పులూ -చీజూ కొనుక్కుని సరిగా ఎనిమిది గంటల ఐదు నిముషాలకి కుడికాలు పెట్టి హాలు-ప్రవేశం చేయబోతుండగా అక్కడున్న ద్వారపాలకుడొకడు ఆపేశాడు. 

    "ఏంట్రా - ఎందుకాపేడూ?" అనుకుంటూ, అదే పైకనబోతుండగా ఇంతలో అతనే చెప్పాడు "ఇందాక టోర్నెడో సైరన్ రావడం వల్ల ఇంతకు ముందు షో కాసేపు ఆపాలసి వచ్చింది. అదే ఇంకా నడుస్తోంది. మీ సినిమా ఎనిమిదింపావుకి కదా. అప్పుడే రండి" అని.

    మొత్తానికి ఎనిమిదింపావుకి లోపలికెళ్ళి సీట్లలో కూర్చున్నాము. 

    ముందేవో రాబోయే ఇంగ్లీషు సినిమాల ట్రైలర్లు ఓ మూడో నాలుగో వేశారు. అవేమీ కూడా అంత ఆసక్తికరంగా అనిపించలేదు. 


టిల్లు స్క్వేర్ సినిమా చూస్తున్నప్పుడు, చూశాక ...

    ఓ పది నిముషాల తర్వాత టిల్లు స్క్వేర్ సినిమా మొదలయింది. 

    సినిమా చూశాం. 

    బయటికి వచ్చాం. 

    మామూలుగా సినిమా చూడడం అయిపోయాక ఇంటికి వస్తూ చూసిన సినిమా గురించి నచ్చిందనో, నచ్చలేదనో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వచ్చే బద్రి, నేను ఈ సారి మాత్రం అసలు సినిమా గురించే మాట్లాడుకోలేదు.

    సినిమా అస్సలు బాగాలేదు అని మాలో మాకు చెప్పుకోవడానికే మొహమాట పడ్డట్టున్నాం. 

    ఇంతకు ముందు "డీజే టిల్లు" సినిమా చూశాక - తడుముకోకుండా మాట్లాడే సిద్దు జొన్నలగడ్డ spontaneity ని అంతగా ఇష్టపడ్డ మాకు టిల్లు స్క్వేర్‌లో డైలాగులు అంత గొప్పగా అనిపించలేదు. ఏదో అక్కడక్కడా తప్ప అంతగా నవ్వు రాలేదు. 

    సినిమా మొత్తానికి నాకు గుర్తున్నది టిల్లు మాత్రమే. 

    టిల్లుగా చేసిన సిద్దు జొన్నలగడ్డ screen presence బావుంది. 

    పసుపు రంగు మీద గుల్లబీ రంగు పూలపూల చొక్కా, పైడ్-పైపర్ లాగా ఒక పక్కంతా తెలుపు, ఇంకో పక్కంతా ఎరుపూ వున్న పేంటూ-చొక్కా,  మెరిసే చెమ్కీల పసుప్పచ్చ కుర్తా - ఇలా ఏ బట్టలు వేసుకున్నా ఇవి సిద్దు జొన్నలగడ్డ వేసుకున్నాడు కాబట్టి బావున్నాయి, ఇంకెవరికైనా అయితే అంతగా నప్పేవి కాదేమో అనిపించేంతగా నచ్చాడు టిల్లు. 

    కానీ ఒక సినిమా చూడాలంటే హీరో బావున్నాడనిపిస్తే చాలదు. 

    ఈ సినిమాలో సిద్దు తప్ప వున్న అందరూ వున్నారంతే - అన్ని చోట్లా వుండలేని సిద్దు వుండని చోట ఖాళీలు పూరించడానికి వున్నట్లు. 

    ఇందులో వున్న ఇద్దరమ్మాయిల కన్నా సిద్దునే బాగా వున్నట్టు అనిపించాడు, కనిపించాడు నాకు. 

    టిల్లు జీవితంలో అంతకు ముందు జరిగిన సంఘటనలని గుర్తు చేయడానికన్నట్టు అక్కడక్కడా చూపించిన "డీజే టిల్లు" సినిమా నుంచి ఎత్తుకొచ్చి చూపెట్టిన సీన్లు తప్ప "టిల్లు స్క్వేర్" సినిమాలో నాకు గుర్తుంచుకోదగ్గవి కానీ, ఇప్పుడిది రాస్తుండగా గుర్తొచ్చి నవ్వు తెప్పిస్తున్నవి కానీ ఏమీ లేవు. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    ఎండలో ఎండిన కొత్త వడియాల్లా గలగల్లాడాల్సిన కబుర్లు చప్పగా చల్లారిపోయిన వడల్లా సాగితే ఆ తప్పు నాదే - ఎప్పటి కబుర్లు అప్పుడు చెప్పలేక ఇప్పుడు చెప్పాలనుకోవడమే! 


~ సినీ-మా-లక్ష్మి 





29, ఫిబ్రవరి 2024, గురువారం

ఏంటీ! ఇంతోటి అదనపు ఇరవైనాలుగ్గంటలకే ఇన్నేసి అంతూ-పొంతూ లేని కబుర్లా?

 "ఉరుకుల పరుగులలో 
ఆదమరచి అర-మరచిన పొద్దొకటుంది
అగ్గలమైన పొద్దది
అదనమైన పొద్దది
అప్పనంగా అబ్బిందని  అనుకోవద్దు
అగ్గువని అరగొరగా చూడొద్దు
అరుదైన పొద్దది సుమా!" 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    అనుకుని  .... ఒక్కసారి ఆగి - ఊపిరి గా...ఠిగా పీల్చి
    తర్వాత ఏం పాట గుర్తొస్తుందా మొట్టమొదటగా అనుకుంటే 
    అబ్బురంగా అబ్బరమైన దేవులపల్లివారి పదమొకటి పెదవులపై కదలాడింది. 

"తరులెక్కి యల నీలి గిరినెక్కి మెలమెల్ల
ౘదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఆకలా... దాహమా... చింతలా...వంతలా...!?
ఈ కరణి వెఱ్ఱినై ఏకతమ తిరుగాడ... "
(దేవులపల్లి "కృష్ణ" పక్షం)

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    పాట పాడుకుంటున్న తుటిపై చిట్లిందొక చిన్నినవ్వు. 

    ఆ నవ్వు గుల్జార్ చెప్పినట్టు పెదవులకి ఎప్పుడో తీర్చాల్సిన అప్పు లాంటి వచ్చీరాని అరువు-నవ్వు కాదు. 

    ఆ నా నవ్వు 
    కాసేపక్కడే పెదవిపై చిందులాడి -
    చినుకు చినుకు చేరి జల్లువానై ముంచినట్లు -
    మది పట్టలేని సంబరమై ఎద దాకా వెల్లువైంది.

    నవ్వంటే అంతే కదా మరి?! 

    అందందె మొదలై 
    పెదవి మించి 
    ఎదను ముంచి 
    కదలి ఉరికి
    ఒడల కుదిపి
    మదిని కదిపి
    మరిక వదలనని
    అందందే వుంటానంటుంది... 

    ఎలాగూ గుర్తొచ్చాడు - గుల్జార్ రాసిన ఈ అరువు-నవ్వు పాటేదో మీకు తెలుసాండీ?

"ముస్కురాయే తో ముస్కురానే కే కర్జ్ ఉతార్‌నే హోంగే
ముస్కురాఊ కభీ తో లగ్‌తా హై...
జైసే హోఠోం పే కర్జ్ రఖా హై"
(గుల్జార్ విరచితం)

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    ఏంటీ! ఇంతోటి అదనపు ఇరవైనాలుగ్గంటలకే ఇంత సంతోషమా? 

    మరి ఒద్దా?

    ఒకటా...? రెండా...? 

    ఏడుకేడు తోడుకొని నాలుగేళ్ళు దాటుకుని - గడియ గడియ కూడుకుని ఒక రోజైతే  - ఆ రోజులో వీలు చిక్కిన ఏ కొద్ది క్షణాలనో  పాట పాడుకుని పండగ జరుపుకోక ఊరికే పొద్దు పోనిస్తానా?

    అదే మా సరదా-సిరి దర్శకరత్న బహుపద-దాసరి వుండుంటే ఈ రోజుని ఊరికే అట్టా పోనిచ్చేవాడా?

"దొరకక ... దొరకక ... 
దొరకక దొరకక దొరికిన రోజు
దొరికీ దొరకక దొరకని రోజు 

మిగలక... మిగలక... 
మిగలక మిగలక మిగిలిన రోజు
మిగిలీ మిగలక మిగలని రోజు

ఒకే ఒక్క రోజు...
తిరిగి రాని రోజు..."

    అన్న పాటని పదేపదే పాడుకుంటూ పదం కలపకుండేవాడా? 

    అన్నట్టు ... నాలాగే మీకూ ఒక అందమైన రోజొకటి అదనంగా దొరికింది కదా....? 
    పైన రాసిన దాసరివారి పాట మొదలేదో పట్టగలరా?

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

ఇంతకీ ---

"అదొక పొద్దు - 
అదొక అందమైన పొద్దు - 
అదొక అందమైన అదనమైన పొద్దు - 

    --- అంటూ ఇన్నేసి అంతూ-పొంతూ లేని కబుర్లల్లడమేనా - లేక ఇంకేమన్నా గుర్తుండే పని చేశావా ఈ పొద్దు?" -  అని అడిగితే ఏమీ ఆలోచించకుండా టక్కున చెప్పేసేలా ఏమన్నా అచ్చెరువు పుట్టించే పనో-పాటో చేద్దామనుకుని కిటికీ లోంచి బయటికి చూస్తే - బంగరపుటెండ కిటికీ ఊసల్లోంచి ఇంట్లోకొచ్చి వెలుగు-నీడల ముగ్గులెయ్యాలని ఉత్సాహపడి ఉరుకుతోంది కానీ ఉడుకు పుట్టించే ఉద్దేశ్యం ఏ కోశానా లేనట్టుంది. 

అయినా ...పైనున్న సూరీడు ఉడుక్కోకుండా ఉలికిపడకుండా ఉన్నమాట అనుకుంటే -

ఆ అడవి గాచిన వెన్నెల
ఈ మా వూర గాచిన ఎండా ఒకటేనబ్బా!
అది చూపుకి సోకని చల్లదనం
ఇది ఒంటికి తాకని వెచ్చదనం





        ఇహ చేసేదేముందీ? 
    
    ఇంటి పట్టునే 
    ఇరవుగా వుండి 
    ఇంకాసేపట్లో 
    ఇసకలా జారిపోబోతున్న 
    ఇంగిలీషు రెండో నెలని 
    ఇలా నా బ్లాగులో 
    ఇచ్చకాల రాతల్లో 
    ఇడుముకుంటున్నా... 

    

    

21, నవంబర్ 2023, మంగళవారం

కారులో... షికారులో...వాక్కులూ - పకపకలూ - అవాక్కులూ...


    మా సేంటా ఫే (Santa Fe)...
    వైటు (white) గా, వెయిటు (weight) గా వుంటుంది.
    ఇంచుమించు ఎలిఫెంటులాగే లాగే వుంటుంది. 
    ఇప్పుడిప్పుడే వైటెలిఫెంటులా తయారవుతోంది. 





    దాదాపు పదిహేనేళ్ళుగా - మేమెక్కడెక్కడికి పదపదమంటే - అక్కడక్కడికి సరిసరియని - రయముగ రయ్-రయ్‌మంటూ ఆగక, అలుపెరుగక - పరుగులు తీస్తుంటూ వుంది. 

    అలాంటిది - ఈ మధ్య ఎక్కడైనా ఆపితే - అక్కడే ఆగిపోతానంటోంది. 

    ఒక్కోసారి కదలనని మొరాయిస్తోంది. 

తెల్లకారది - వెల్లకరి యాయె!
శ్వేతవాహనమది - శ్వేతవారణమాయె 
మా వైటు సేంటా ఫే - వైటెలిఫెంటాయె!!


    అందుకే మా సేంటా ఫేని నేను ముద్దుగా "ఫెంటీ" అని పిలిచుకుంటున్నా. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    మా ఈ వైటెలిఫెంటు గురించి బద్రి చెప్పే ఉట్టుట్టి గొప్పలు మాగొప్పగా ఉంటాయి. 

    "చూశావురా బుజ్జిగాడూ! మన వెనకాల వచ్చే కార్లు మన పక్క నుంచి వెళ్ళిపోకుండా మన కారు వెనకాలే ఎలా వస్తున్నాయో? అందరికీ మన కారుని ఎంత చూసినా తనివి తీరదు అందుకే!" అని ఒకసారీ....

    "అదుగదుగో... ఆ వెనకాల వస్తోందే ...ఆ నల్ల కారు చూశావూ?! అది సీక్రెట్ సర్వీసు వాళ్ళ కారు. మన సేంటా ఫేని వాళ్ళు ఎప్పుడూ follow చేస్తూ వుంటారు ... ఎందుకో తెలుసా? ఒకటి... ఎవరూ మన కారుని ఎత్తుకుపోకుండా చూడడానికి, రెండు...  వీలైతే వీళ్ళే తీసుకెళ్ళిపోయి దీన్ని collectible లా దాచుకోవడానికి..." అంటూ ఇంకొకసారీ... 

    అవి వింటూ ముందూ వెనక సీట్లలో కూర్చున్న నేనూ, పిల్లలూ respectively నవ్వుకుంటూ వుంటాం. 

    ఒక్కోసారి మా sub-division లోకి పోలీస్ కార్లు ఏమైనా వస్తే "అదిగో... చూశారా! మనింటి ముందు మన కారు భద్రంగా వుందో లేదో అని కాపలా కాస్తున్నారు పోలీసులు " అని గొప్పగా అంటూ కన్ను గీటుతారు మహ-గీరగా. 

    తనలా అన్న ప్రతీసారీ కిరణ్ గాడు మా సేంటా ఫే ప్రస్తుత మార్కెట్ విలువ కేవలం తొమ్మిదివందల డాలర్లు మాత్రం అని గుర్తు చేస్తూ వుంటాడు. 

    మా ఇంట్లో ఆగి-ఆగి-కదులుతున్న కారు-సరదాలు ఇలానే నడుస్తూ వుంటాయి. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

     కాకపోతే  వున్న  ఈ ఒక్క కారు పూర్తిగా కదలకుండా ఆగిపోయేలోగా ఇంకో కారు కొనుక్కోవాలి కదా! 

    అసలే దీనికి తోడుగా వుండే రెండో కారు - అతి ముచ్చటైన ఎఱ్ఱటి convertible - ఒక్క పూట వర్షంలో తడిసిన పాపానికి పైన కప్పు, కిటికీలు అన్నీ బిగుసుకుపోయి టోటలైపోయి - షెడ్డుకెళ్లి - అట్నుంచి అటే ఎటో వెళ్ళిపోయింది. 

    ఇహ కొన్నాళ్ళుగా  ఇంట్లో - ఏ కారు కొనుక్కోవాలా, ఎలా కొనుక్కోవాలా, ఎంతకి కొనుక్కోవాలా, ఎక్కడ కొనుక్కోవాలా - అన్న ఆలోచనలూ, అందరితో -సమాలోచనలూ, అన్నదమ్ముల-సంభాషణలూ, నాన్నగారి-భాషణలూ  -  ప్రతి పూటా, ప్రతి రోజూ అవే కారుకతలూ, కారుకబుర్లూనూ. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఈ ఏడాది ఆగస్టులో ఒకానొక శుక్రవారం పూట బద్రి, కిరణ్, నేను కలిసి మా ఇంటికి దగ్గర్లో వున్న Costco కి వెళ్ళి పాలు-వెన్నలూ, నిమ్మకాయలూ-రామ్ములక్కాయలూ లాంటివన్నీ కొనుక్కుని మా ఫెంటీలో ఇంటికెళ్తున్నాం. 

    ఇంతలో సుహాస్ నుంచి ఫోన్. 

    బద్రి డ్రైవ్ చేస్తున్నారు కదా అని తనకి మాట్లాడదానికి వీలుగా తన ఫోన్‌లో స్పీకర్ ఆన్ చేశాను. 

    ఫోన్లో అవతల్నుంచి సుహాస్ గొంతు వినిపించింది. 

     [కాలిఫోర్నియాలో చదువుకుంటున్న సుహాస్ ఈ ఏడాది మొదట్లో తను కూడా కారు కొనుక్కుందామా అని కొన్నాళ్ళు అనుకున్నాడు. కాకపోతే ఆ తర్వాత వద్దనుకున్నాడు - అది వేరే సంగతి.]

    "నాన్నగారూ! SUV కొనుక్కుంటే బావుంటుంది అనుకుంటున్నాను. కెవిన్, సాక్, జాష్, నేను ఎప్పుడైనా రోడ్ ట్రిప్ వెళ్ళాలన్నా SUV అయితే వీలుగా వుంటుంది" అంటున్నాడు వాడు. 

    ఎప్పుడైతే SUV అన్న మాట విన్నారో వెంటనే బద్రీకి హుషారొచ్చేసింది. 

    గొంతంతా నవ్వు నింపుకుని  "నాన్నగాడూ...SUV కొనుక్కుందామనుకుంటున్నట్టైతే సేంటా ఫే కూడా ఒక సారి చూడు - బావుంటుంది" అని అన్నారు. .

    "ఎందుకు నాన్నగారూ! ఈ మధ్య US లో ఎక్కువగా దొంగిలించబడుతున్న కారు సేంటా-ఫేనే... మీకు తెలీదా?" అని అవతల్నుంచి అన్నజింక సవాలు. 

    దానికి బద్రి ఏదో బదులిచ్చే లోగా అన్నజింక "నేను దిగాల్సిన స్టాప్ వచ్చింది నాన్నగారూ! మళ్ళీ రాత్రికి కాల్ చేస్తాను మీకు" అని ఫోన్ పెట్టేశాడు. 

    వాడలా ఫోన్ పెట్టేశాడో లేదో - బద్రీ తల కొంచెం వెనక్కి తిప్పి - వెనక సీట్లో కూర్చున్న బుజ్జిజింక కిరణ్‌ని చూస్తూ "విన్నావా, బుజ్జిగాడూ, అన్న ఏం చెప్పాడో? కార్లన్నిట్లోకి సేంటాఫేనే అందరూ ఎత్తుకుపోతున్నారట. అంటే అర్థం ఏంటీ? అది అంత గొప్ప కారనే కదా?" అని వాక్రువ్వుతూ కళ్ళెగరేశారు. 

    అది వింటూనే బుజ్జిజింక బుగ్గల్లో నవ్వు దాచుకోలేక "నాన్నగారూ! దానర్థం సేంటా ఫే లో security features సరిగ్గా లేవని..." అని కిలకిలలాడాడు.



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఇంతలో నేను హడావిడిగా పక్కనున్న స్టోరేజ్ కంపార్టుమెంటులో వెతకడం మొదలుపెట్టా. 

    అది చూసి బద్రి నన్ను "ఏంటి! అంత కంగారుగా వెతుకుతున్నావ్?  ఏవన్నా పెట్టి మర్చిపోయావా?" అనడిగారు.

    "అహ ... . నేనేమీ ఎక్కడా ఏమీ పెట్టి మర్చిపోలేదు.  కాకపోతే మొన్న - ఓ ఏభై డాలర్లూ, ఇంకో  ఇరవై డాలర్లూ - రెండు గిఫ్ట్ కార్డ్స్ ఈ లోపల పెట్టా. అవి అడుక్కి వెళ్ళిపోయినట్టున్నాయి. ఎందుకైనా మంచిది కార్లోంచి తీసేసి నా పర్సులో పెట్టుకుంటా. ఇంట్లో ఐతే safe గా వుంటాయి" అంటూ ఇంకా వెతుక్కుంటూనే వున్నా. 

    అంతే .... 

    వెనక సీట్లో నుంచి బుజ్జిజింక పకపకా... 

    నా పక్క సీట్లో నుంచి "You too, Brutus" అన్నట్టు  నన్ను చూస్తూ  అవాక్కైన బద్రి... 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

అవీ... 
కారులో... 
షికారులో... 
వాక్కులూ -
పకపకలూ -
అవాక్కులూ!!


30, అక్టోబర్ 2023, సోమవారం

వంగూరి చిట్టెన్ మహారాజ్యపు వార్తలు - 1 - కవలకథలతో మొదలు

     అక్టోబర్ 20 వ తేదీ నుంచి 22 వ తేదీ వరకు కాలిఫోర్నియా రాష్ట్రంలోని మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగిన 13వ వంగూరి ఫౌండేషన్ సాహితీ సదస్సుకి వెళ్ళి వచ్చాను. 



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఈ మధ్య కబుర్లు రాసి చా...లా రోజులయింది. 

    అందుకే జూన్ ఒకటో తేదీన మొదలుపెట్టి అక్టోబరు 22వ తేదీ వరకూ జరిగిన విశేషాలన్నీ మరీ పూస గుచ్చినట్టు కాకపోయినా పూల మధ్య దవనం పేర్చినట్టు అక్కడక్కడా కొన్ని గుర్తున్నవీ, చెప్పాలనుకుని గుర్తుంచుకున్నవీ, గుర్తుంచుకున్న వాటిల్లో చెప్పాలనుకున్నవీ - ఇప్పుడు చెప్తా.  

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఈ కబుర్లు నెలలవారీగా నేస్తా...కలబోస్తా...

    ముందుగా వంగూరి వారి సదస్సులో చెప్పిన కవల-కథల కబుర్లతో మొదలుపెడతాను. 

చదవబోయేవారికి 
చదవలేక పారిపోబోయేవారికి
చదివి బోరు-బోరు మనేవారికి 
అందరికీ ముందస్తు  దండాలు! 
చివరి వరకూ చదివేవారికి మళ్ళింకొన్ని దండాలు!

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
జూన్ 1, 2023

    వంగూరి చిట్టెన్ రాజు గారి దగ్గర్నుంచి 13వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు గురించిన మొట్టమొదటి ప్రకటన ఈ-మెయిల్లో వచ్చింది. 

    నేను దాన్నంతగా పట్టించుకోలేదు. అదెక్కడో కాలిఫోర్నియాలో మిల్పిటాస్‌లో జరుగుతుంది - అంత దూరం వెళ్ళాలా అనుకున్నాను. 

    అసలదే కాకుండా ఈ 13వ సాహితీ సదస్సు జరిగే లోగా నాకు ఇంకో రెండు ప్రయాణాలు వున్నాయి. 

    ఒక ప్రయాణమేమో న్యూజెర్సీలో సెప్టెంబర్లో సంస్కృతభారతి వాళ్ళు నిర్వహిస్తున్న "జాహ్నవి" వేసవి శిబిరం. 

    రెండో ప్రయాణం మా కిరణ్‌ని అండర్-గ్రాడ్‌లో చేర్చడానికి వెళ్ళాల్సిన శాన్ డియేగో. 

    ఎక్కే విమానం, దిగే విమానం అనుకోవడానికి బాగానే వుంటుంది కానీ వెళ్ళి వచ్చామనుకోవడానికి తప్ప ఆ సదస్సులో నేను చేయబోయేదీ, చెందబోయేదీ ఏముంటుంది కదా అనిపించింది. 

    ఇది మనక్కాదులే అనుకుంటే మర్చిపోవడం సులువు నాకు.

    అలా అనుకునే 13వ సాహితీ సదస్సు ఈమెయిల్ గురించి మర్చిపోయాను. 

*** **** *** *** *** *** ***
*** **** *** *** *** *** ***

    కానీ ఆ సాహితీసదస్సు పుటల మీదో, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయపు ప్రాంగణం మీదుగా వీచే గాలి రెక్కల మీదో నా పేరెక్కడో రాసి పెట్టబడి వున్నట్టుంది. 

    అలాగే ఈ బ్లాగ్ ఇలా రాయాలని రాసిపెట్టి వున్నట్టుంది. 

    అసలు వెళ్లాలనే అనుకోని నేను - వెళ్ళడమే కాకుండా - వెళ్ళి వేదిక నెక్కి మాట్లాడి మరీ వచ్చాను - అది కూడా "కకవి"గా.  

    ఇక్కడ ... చదవడం ఆపి "కవీ, సుకవీ, కుకవీ- అన్న మాటలు కవుల గురుంచి విన్నాం. ఈ కకవి ఏంటబ్బా?" అనాలోచించేవాళ్ళు ఎవరన్నా వుంటే - ఇక్కడే ఆగిపోకుండా ఈ కబుర్లు కొసాకి చదివితే మీకే ఇట్టే అర్థమైపోతుంది. 


*** **** *** *** *** *** ***
*** **** *** *** *** *** ***

జులై 23, 2023

    ఓ ఆదివారపు మధ్యాహ్నప్పూట ఎప్పట్లాగే సుబ్బుతో మాట్లాడదామని ఫోన్ చేశాను.  

    సుబ్బు అంటే ఎవరో కాదు అగ్రహారం కథలు, మహానగరం కథలు రాసిన ప్రముఖ కథారచయిత్రి వేదుల సుభద్ర. 

    2019 లో వంగూరి వారి 11 వ సాహితీ సదస్సుకి ఆర్లాండో వెళ్ళినప్పుడు లలిత-సుభద్రలుగా ఒకరికొకరం పరిచయమయ్యి - ఒక వారం రోజుల్లోపునే లల్లి-సుబ్బులమై పోయాము. 

    అప్పట్నుంచి వారానికోసారి ఏ వారానికా వారం చదివిన పుస్తకాల గురించి, సినిమాల గురించి కబుర్లాడుకోవడం మాకలవాటు. 

    ఆ రోజు ఫోన్ ఎత్తగానే సుబ్బు అడిగిన మొదటి ప్రశ్న "లల్లీ! వంగూరి సదస్సుకి ఏమన్నా పంపిస్తున్నావా?" అని. 

    "లేదు సుబ్బూ! వెళ్ళేదా, పెట్టేదా అప్పుడే పక్కకు పెట్టేశాను. కాకపోతే కిందటి మాటు 2019 లో వెళ్ళినప్పుడు చిట్టెన్ రాజు గారిని కలవలేకపోయాను. ఇప్పుడు వెళ్ళాలన్నా ఆయన్ని చూడడానికి వెళ్ళాలంతే! అసలు అక్కడికి వెళ్ళి మాట్లాడాలన్నా నాకేమీ తట్టట్లేదు" అన్నాను. 

    తను వెంటనే "పోనీ మనిద్దరం కలిసి ఏమన్నా చేస్తే బావుంటుందేమో, ఆలోచించు" అంది. 

    నాకు ఆ ఆలోచన కొంచెం బాగానే వున్నట్టనిపించింది. 

    అందులోనూ నేనెప్పట్నుంచో నాకు ఎంతో ఇష్టమైన రెండు గొప్ప కథల గురించి ఏమైనా రాద్దామనుకుంటూనే ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్నాను. 

    అసలు 2019 లో వంగూరి సదస్సుకి వెళ్ళే ముందు అక్కడ శ్రీపాద వారి "మార్గదర్శి" గురించి మాట్లాడదామనుకున్నాను కానీ, అప్పుడు ఇండియా వెళ్ళి వచ్చిన హడావిడిలో నాకు ఆ వ్యాసం రాయడానికి సమయం సరిపోక అప్పటికప్పుడు పుట్టించిన నా "బోల్డన్నికబుర్ల" గురించిన కబుర్లేవో చెప్పేశాను. 

    సుబ్బుతో మాట్లాడి ఫోన్ పెట్టేశాక నాకు చటుక్కున గుర్తుకొచ్చింది. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి "మార్గదర్శి" కథ, శ్రీరమణ గారి "ధనలక్ష్మి " కథ దాదాపుగా ఒకే విషయాన్ని చెప్పే రెండు కవల-కథల్లా వుంటాయని. 

    నాకసలే పాటల్లో కవల-పాటలూ, కథల్లో కవల-కథలూ వెతుక్కోవడం మహ సరదా. 

    ఇక ఆగలేక వెంటనే సుబ్బుకి వాట్సాప్ చేశాను. 

    "సుబ్బూ --- ఒక రెండు గొప్ప కథలు - మంచి పోలిక వున్న కథలు - నేనెప్పట్నుంచో విశ్లేషిద్దామని అనుకుంటున్న కథలు - శ్రీపాద వారి మార్గదర్శి , శ్రీరమణ గారి ధనలక్ష్మి . మనిద్దరం వీటి మీద ఒక combined analysis చేస్తే బావుంటుందని. ఏమంటావ్?"

    "తప్పకుండా చేద్దా" మంటూ సుబ్బు సమాధానం, 

    "నువ్వు ధనలక్ష్మి చేస్తావా ? మిథునం కధాసంపుటి వుందా నీ దగ్గర ?" ప్రశ్న మీద ప్రశ్న అడుగుతున్నా నేను. 

    "చేస్తాను... ఉంది." తను  ఇండియా ప్రయాణం హడావిడిలో వుండి కూడా  నా ప్రశ్న మీద ప్రశ్నకి ఓపిగ్గా జవాబులు చెప్తూనే వుంది. 

    ఆ రోజు సాయంత్రం ఫోన్ చేసినప్పుడు మాటల్లో సుబ్బు "ధనలక్ష్మి నాకు చాలా ఇష్టమైన కథ. ఎప్పుడో ఆ కథ గురించి నేనొక బ్లాగ్ కూడా రాసుకున్నాను" అంది.

    జులై 25 న  సుబ్బు ఇండియాకి వెళ్తోంది. మళ్ళీ ఆగస్టు 30 కి కానీ న్యూ జెర్సీకి తిరిగి రాదు. మా ఇద్దరికీ కొంచెం తీరిగ్గా మాట్లాడుకుని - అసలెలా చేద్దామా అని ఆలోచించుకునే సమయమే లేకపోయింది. 

    కాకపోతే నాకొక ధైర్యం - తను ఎలాగూ ధనలక్ష్మి గురించి రాసి పెట్టి వుంది. తను ఇండియా వెళ్ళి వచ్చేలోగా నేను మార్గదర్శి గురించి రాసి వుంచితే - తను తిరిగి రాగానే రెండిటినీ కలిపి పంపించొచ్చు అనేదే నా ధైర్యం. 

    ఇహనేం! లేడికి లేచిందే పరుగు - లలితకి తోచిందే తలపు కదా! 

    వెంఠనే.... చిట్టెన్ రాజు గారికి వాట్సాప్‌లో "నమస్తే సర్ ! నేను లల్లీ నండి (బోల్డన్ని కబుర్లు రాసే లలిత). అక్టోబరులో జరగబోయే 13 సాహితీ సదస్సులో సుభద్ర వేదుల (అగ్రహారం కథల రచయిత్రి) , నేను కలిసి కొత్తగా ఒక యుగళ - విశ్లేషణ చేద్దామనుకుంటున్నాము. దీని గురించి మీతో మాట్లాడడానికి కుదిరితే బావుండునని అనుకుంటున్నాను. మీకు వీలున్నప్పుడు చెప్పగలరు." అని సందేశం పంపించాను కొంచెం సందేహం గానే. 

    ఎందుకంటే 2021 తర్వాత ఆయనతో అస్సలు మాట్లాడలేదు. నువ్వెవరూ అనడిగితే ఏం చెప్పాలా అనుకుంటున్నా.  

    కానీ ఇవతల్నుంచి నా మాటలిలా వెళ్ళాయో లేవో - వెంటనే - "భలే...నీ టైమింగ్ బావుంది, లల్లీ....ఇప్పుడే నీకూ, సుభద్రకీ ప్రత్యేక ఆహ్వానాలు తయారు చేస్తున్నాను....నీది జత పరిచాను.......యుగళ విశ్లేషణ ఆలోచన బావుంది. నువ్వు ఎప్పుడైనా  పిలవ వచ్చును...పగలు 11 దాటాక.. " అని బదులిచ్చారు. 

    ఆహా! అన్నీ మంచి శకునములే! వేదిక ఎక్కే సూచనలే ...లలలా...లలలా... అని పాడేసుకున్నా...

    సుబ్బుకీ, నాకూ ఆహ్వానాలొచ్చేశాయి. 

    అవి అందుకోగానే చిట్టెన్ రాజు గారికి ఫోన్ చేసి "సుబ్బు ఇండియా వెళ్ళింది కదండీ - అందుకని మా ఇద్దరికీ మా ప్రసంగవ్యాసం తయారు చేసి పంపించడానికి కొంచెం ఎక్కువ సమయం కావాలీ" అనగానే "సుబ్బూనా ? అంటే సుభద్రా? సుభద్ర కన్నా సుబ్బుయే బావుంది, ఇహ నుంచి నేనూ అలాగే పిలుస్తాను" అన్నారు. 

     సభావిశేషసంచిక ప్రచురణ పనులు చూస్తున్న తాటిపాముల మృత్యుంజయుడు గారికో మాట చెప్పమన్నారు. 

    నేనదే మొదటిసారి మృత్యుంజయుడు గారి పేరు వినడం. చాలా ప్రత్యేకంగా అనిపించింది. 

    ఆయనకీ ఈమెయిల్ ఇచ్చాను కొంచెం వెసులుబాటు కావాలని. 

    "ఫర్వాలేదు... సెప్టెంబర్లో మొదటి వారం-పది రోజుల్లోగా పంపించండి" అన్నారు. 

    సుబ్బు ఇండియా నుంచి రాగానే ఇద్దరం మేమనుకున్న కథల గురించి రాసిన వ్యాసాన్ని  సెప్టెంబర్ 10 వ తేదీ అర్ధరాత్రికి ఈ-మెయిల్ చేశాను. 

    కానీ మాదసలే ప్రత్యేకవ్యాసం - ప్రత్యేకంగా సమయం అడిగి మరీ పంపించినది కదా... 

    అందుకే... దాన్నంతే ప్రత్యేకంగా సభావిశేషసంచికలో ప్రచురించకుండా మహా-ప్రత్యేకంగా ఓ పక్కనెక్కడో అట్టేపెట్టుకున్నట్టున్నారు. 

    సరే! నా ఇంతోటి కథ-కబుర్లు వెయ్యకపోతే సభావిశేషసంచికకి తగ్గే విశేషమేమీ లేదు కానీ - పాపం! నాతో పాటు సుభద్రదీ అసింటా వుండిపోయిందే అనుకున్నాను. 

    నాదో బ్లాగ్ ఎలాగూ వుంది కదా ! ఇదిగో - ఇక్కడే మా కవలకథల కబుర్లు కూడా పంచుకుంటా. 


*** **** *** *** *** *** ***
*** **** *** *** *** *** ***

    ఇవాళ్టికి మాత్రం సరాసరి అక్టోబర్ 21,  2023 తేదీన మధ్యాహ్నభోజనానంతరకార్యక్రమం చూసెయ్యండి. సదస్సు గురించిన ఇంకొన్ని మంచి కబుర్లు వీలైతే వచ్చేవారమో - వీలు కుదరకపోతే ఆ పై వారమో చెప్తాను. 






    
    చూశారా? నేన ఆ "ఉన్నత"వేదిక మాటున - ఉన్నానో లేనో అన్నట్టు  - కనీ కనపడకుండా వినబడి - కకవి నైన వైనం కన్నారా? 

    పైనున్న వీడియోలో మేము చెప్పిన కవలకథల కబుర్లు ఈ కింద కూడా చదవొచ్చు. 

    కాకపోతే నా వాటాకొచ్చిన పదినిముషాల్లో నేను నాకు నచ్చిన  శ్రీపాదవారి వాక్యాలేవీ చదవలేకపోయాను కానీ వాటిని ఈ కింద ఇచ్చిన వ్యాసంలో చదువుకోవచ్చు. 

  

*** **** *** *** *** *** ***
*** **** *** *** *** *** ***



ఇవాళ్టి ప్రసంగాంశం -  తెలుగు కథాప్రపంచంలో వస్తుస్వారూప్యము కలిగిన కథాయుగళ పరిచయం. 

 

    మేము పరిచయం చేయబోతున్న కథల జంట ఒకదానితో ఒకటి పోలినవి. రెండు వేర్వేరు తరాలకి చెందిన ఇద్దరు గొప్పరచయితలు రాసినవి. 

1.     అందులో ఒకటి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 1920 పరిసరాల్లో వ్రాసిన "మార్గదర్శి" కథ ఐతే...

 

2.     రెండోది 1990ల్లో శ్రీరమణ గారు రచించిన "ధనలక్ష్మి". 

 

కథాకాలాన్ని గమనిస్తే, రెంటికీ డెబ్భై ఏళ్ల వార.. రచయితలిద్దరి మధ్యా కనీసం ఒక తరం అంతరం.. అయినా ఈ రెండుకథల మధ్యా గల సారూప్యత మమంల్ని ఆకర్షించింది. గట్టిగా చెప్పాలంటే శ్రీపాద వారి కథలో చెప్పిన పాఠాలు, సూత్రాలుశ్రీరమణ గారి కథలో పాత్ర ఆకళింపు చేసుకుని వ్యాపారాన్ని, జీవితాన్ని తీర్చిదిద్దుకుందా? అనిపించేంతగా..

 

అందుకే ఈ రెండు కథలనీ కలిపి ఒకటిగా చూస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచనకి మేమిచ్చుకున్న రూపమే ఇది.. మొదటగా..


    మార్గదర్శి కథని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు తెలుగు పాఠకులకి చేసిన వాణిజ్యగీతాబోధన అనవచ్చు. ఆద్యంతం మధ్యమపురుషలో సాగే ఓ ఉత్తమోత్తమ కథాకథనం. 

    చదువుకున్న ప్రతి చదువుకీ పెట్టిన ఖర్చునంతటినీ జీతం రూపంలో నూరూ వెయ్యి రెట్లుగా రాబట్టుకోవాలన్న దృక్పథంతో - సొంతంగా వ్యవసాయమో, వ్యాపారమో చేసుకోకుండా - ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి, ఆత్మవిశ్వాస లేమితో, ఆత్మజ్ఞానమన్నదిఒకటుండాలి అన్న ఎఱుక లేకుండా నౌకరీలకి ఎగబడుతున్న స్కూలు ఫైనళ్ళు, బి ఏ లు చదివిన బ్రాహ్మణ యువకులకి సిఫార్సులు చెయ్యనని ప్రతిజ్ఞ చేసిన అరవయ్యేళ్ళ చేబోలు శంభుశాస్త్రి గారి కథనమీ కథ. 

    ఈ కథలో వర్ణాశ్రమ ధర్మపరమైన  ఆత్మగౌరవం ఉండాలీ అని చెబుతూనే విదేశీయుల అభివృద్ధిని గురించిన మెచ్చుకోలుఉంటుంది. ఇంగ్లీషు చదువుకున్న విద్యావంతులెవరికీ కూడా విజాతీయ క్రమవికాసం గురించి అవగాహన లేదని ఓ చిన్నపాటికినుక వుంటుంది. అదీ కాకుండా అసలు కథలెందుకు చదవాలీ అని ఒక ఒక తులనాత్మక వివరణ కూడా వుంటుంది. ఇవే కాకశ్రీపాదవారి బాల్యం గడిచిన మునికూడలి, మహేంద్రవాడల ప్రస్తావన, చెరుకుపానకపు మొదటిపొంగు వాసనల కబుర్లు ఇలాఅక్కడక్కడా ఆయన ఆత్మకథ "అనుభవాలూ-జ్ఞాపకాలూను" నుంచి కొన్ని చిరుమెఱుపులూ వుంటాయి. కానీ ఇవాళ్టి అంశంమాత్రం ఈ కథలో శ్రీపాదవారు ఉటంకించిన వర్తకపు కిటుకుల గురించి మాత్రమే.

    శ్రీరమణ గారి "ధనలక్ష్మి" కథ - ధనలక్ష్మి భర్తయిన సీతారామాంజనేయులి స్నేహితుడి మాటల్లో ఉత్తమపురుషలో సాగుతుందిఒక్క మాటని కూడా వదలకుండా చదవాలనిపించే సరళమైన, అధ్బుత కథనం

రామాంజనేయులు తండ్రి ఈశ్వరయ్య గారి హయాంలో గుమాస్తాల మోసం వల్ల పోయిన ఆస్థినీ, వ్యాపారాన్ని ధనలక్ష్మితెలివితేటల వల్ల మళ్ళీ నిలబెట్టుకోవడమే కాక, దానికి నాలుగింతలు ఎలా పెరిగారు అనేది స్థూలంగా కథ. భార్యాభర్తలిద్దరూచదువుకోలేదు, అయినా బి.ఏ చదివిన మన కథకుడినీ(కథ ఈయన పరంగా చెప్పారు కనక సౌలభ్యం కోసం ఇలా అంటాను), చిన్నప్పుడు చదువు చెప్పిన మేస్టారినీ కూడా వారిదగ్గర పనిలో పెట్టుకుంటారు. అదీ ధనలక్ష్మి చాకచక్యం.

    ముందుగా మార్గదర్శి  కథకి పూర్వరంగం ఏంటో చూద్దాం. 

    కథాప్రదేశం రాజమండ్రి. కథాకాలం 1920 ల్లో. కథానాయకుడు అరవయ్యేళ్ళ చేబోలు శంభుశాస్త్రి గారు. బట్టల వర్తకుడు. 

    ఆయన దగ్గరికి ఒక రోజు ఓ యువకుడు వస్తాడు. అతనెలాటి వాడంటే పెళ్ళాయ్యీ ఇంకో రెండేళ్ళ దాకా భార్య కాపురానికి రానివాడు. తండ్రి పోగా చదువుకున్న స్కూలు ఫైనలుకి తగ్గట్టుగా సబ్ కోర్టులో నౌకరీకి సిఫార్సు కోసమని శంభుశాస్త్రి గారి దగ్గరికివస్తాడు. 

    అంతే! 

    ఆయన ఉత్తమవాగ్ధారకి మారు మాట లేకుండా మధ్యమపురుషామూర్తిమంతుడౌతాడు ఆ ఇరవయ్యేళ్ళ పంతులు. 

    అసలీ మార్గదర్శి కథ సద్బ్రాహ్మణుడైన  శంభుశాస్త్రి గారు తన దగ్గరికి ఉద్యోగానికి సిఫార్సుకి వచ్చిన ఒక బ్రాహ్మణనవయువకునికి స్వంతంగా, స్వేఛ్చగా ఒకరికి లోబడకుండా జీవించాలంటే వర్తకం ఎంతటి మహత్తరమైన జీవనవిధానమోమప్పడానికి తన జీవితాన్నే దృష్టాంతంగా చూపబోవడమే. 

    కేవలం ఒక్క రూపాయి పెట్టుబడితో నాలుగు తువాళ్ళు, ఒక అంగాస్త్రం సరుకు కొని అంచెలంచెలుగా ఎనిమిది లక్షల ఆస్తిసంపాదించిన శంభుశాస్త్రికి మొట్టమొదటి వ్యాపార మార్గదర్శి - చిన్ననాటి జతగాడు కోమటి సుబ్బయ్య. 

    పదకొండేళ్ల వయసులో తీర్థంలో పకోడీలు కొనుక్కోమని తల్లి ఇచ్చిన ఒక్క అణా పెట్టుబడిగా తీర్థంలో కిళ్ళీలు అమ్మి - ఆఒక్కగానొక్క అణాని పాతిక అణాలు చేసి చూపిస్తాడు కోమటి సుబ్బయ్య. అతని దగ్గర శంభుశాస్త్రి నేర్చుకున్న మొట్టమొదటి పాఠం- వ్యాపారం చేయడానికి డబ్బు కన్నా పెద్ద పెట్టుబడి సంపాదించాలీ అనే  బుద్ధి అని. అప్పుడే అతనికి పట్టుబడుతుంది "చిల్లరశివాలక్ష్మి" అనే మంత్రం. 

    శంభుశాస్త్రికి బలమూ, వెన్నుదన్నూ ఆయన తల్లి. "చేతిలో రూపాయి వుంటే యెంతో దిలాసా, ఎంతో ధైర్యం" అని నచ్చచెప్పేఆవిడ శంభుశాస్త్రికి చెప్పిన కథలెలాంటి వనుకున్నారూ? - దీపావళికి రూపాయి పెట్టి కొనుక్కున్న బాణాసంచాని అమ్మి ఐదురూపాయలు సంపాదించిన కోమటి పిల్ల కథ ఒకటైతే, పేలాల కోమటి కథ ఇంకోటి. 

    ఈ పేలాల కోమటి కథ మరీ తమాషా. పగిలి పోయిన కుండపెంకుల్లో ఒక పెంకుని మూడు మట్టి గడ్డలు పేర్చిన పొయ్యి మీదపెట్టి, ఎండు చితుకులతో నిప్పు రాజేసి - చేయబోయే పేలాల గురించి నోరూరించేలా చెప్పి "వడ్లకి సగం, బియ్యానికి సరికి సరి" అనిఎవరు తెచ్చుకున్న వడ్లు, బియ్యాలతో వాళ్లకే పేలాలు చేసిచ్చి కుంచెడు బియ్యం, నాలుక్కుంచాల వడ్లూ మిగుల్చుకుంటాడు. 

    ఇల్లాంటి కథలు చెప్పి శంభుశాస్త్రిని వర్తకం చేయడానికి ప్రోత్సాహిస్తుంది. అలాంటి తల్లి ఆశీస్సులే శంభుశాస్త్రి వర్తకవిజయానికిహేతువు. 

ఉగ్గుపాలతో కాకపోయినా యుక్తవయసులో వ్యాపారధోరణిని పెంచి ప్రోత్సహించిన తల్లితో పాటు మొట్టమొదటి తువాళ్ళవ్యాపారానికి రూపాయి పెట్టుబడినిచ్చి, ఆ తర్వాత రోజుల్లో వ్యాపారం పెరిగాక నూటికి పదణాల వడ్డీతో నోటు లేకుండా ఇరవై ఐదువందలు అప్పిచ్చిన సోదెమ్మక్కయ్యగారు కూడా శంభుశాస్త్రికి మార్గదర్శి.

    మార్గదర్శి కథలో నుంచి కొన్ని ఆణిముత్యాలైన మాటలు: 

    "ఎవరెన్నెన్ని ధర్మపన్నాలు చెప్పినా ఐహికాలికి డబ్బే ప్రధానం. జగత్తంతా మిధ్య అయితే మరి అలా బోధించేవాడి మాట?

    పెట్టుబడి తక్కువా, బుద్ధి ఎక్కువా - వర్తకశాస్త్రంలో ఇదొక సూత్రం. 

    వర్తకులకు పెట్టుబడి కంటే ముందు మాట పొందిక చాలా అగత్యం. 

    వర్తకం చేసేవాడు విసుగు కనపడనివ్వకూడదు. 

    పనిచేసేవాడికి పరికరాలు కాదు ప్రధానం, దీక్షా ఏకాగ్రతానూ. 

    మనిషి వల్ల వర్తకం పాడవుతుంది గాని వర్తకం వల్ల మనిషి యెన్నడూ పాడయిపోడు. 

    ప్రకటన మీద యెక్కువ శ్రద్ధ పెట్టాలన్నది వర్తకశాస్త్రంలో ఒక గొప్ప సూత్రం. పాశ్చాత్యులు యింకో ఆరుమాసాలకు వస్తువుతయారవుతుందనగా యివాళే ప్రకటన ప్రారంభిస్తారు. 

    వర్తకుని చేతిలో వుండవలసింది సరుకు గాని డబ్బు కాదు. 

    పరపతికి నిదర్శనం అప్పు పుట్టడం కాదు, అణాపైసలతో అది తీర్చెయ్యగలగడం. 

    ధైర్యంగా ముందుకి వెళ్ళు. వెనకబడ్డవాళ్ళని వెంటబెట్టుకుని ముందుకి వెళ్ళు. సంపాదించు. కష్టపడి సంపాదించు. ఒకళ్ళనిచెరపకుండా సంపాదించు. అనుభవించు. ఆనందించు. అది ఐహికానికి పరమావధి."

    పైన ఉదహరించినవి మచ్చుక్కొన్ని మెచ్చుతునకలు మాత్రమే! అసలీ కథ చదువుతున్నంతసేపూ నాకనిపించిందేంటంటే ఈకథని మా ముందు తరాల్లో తప్పనిసరి పాఠంగా చదివించి వుంటే భారతదేశంలో చదువుల పరిస్థితి, యువకుల మనఃస్థితి వేరేగా వుండేవని. 

 మన కథానాయిక ధనమ్మ కథలోకి వస్తే.. కారణాంతరాల వల్ల తమ పూర్వవైభవాన్ని కోల్పోయి వీధిన పడబోయిన ఒక జంట తిరిగి నిలదొక్కుకున్న వైనమే కథాంశం. బడి చదువు లేకపోయినా, జీవితాన్ని అద్భుతంగా చదివిన తెలివితో, లౌక్యంతో  వ్యాపారాన్ని, ఇంటినీ తీర్చిదిద్దుకున్న ఆ ఇల్లాలి గడసరితనమే కథంతా.. 

 గారాబంగా పెరిగిన దత్తుడు సీతారామాంజనేయులూ, అష్టవర్షాత్.. అనే మాటకి ఊపిరులూదుతూ ఎనిమిదేళ్ళకే అతని భార్య అయిన ధనలక్ష్మీ, ‘నేను ‘ అని ప్రథమ పురుషలో కథ మనకి చెప్పే పాత్రా, ఆయన బ్రాకెట్ బి.ఏ అర్ధాంగి శకుంతలా కథలో ముఖ్య పాత్రలు.

మితభాషిగా కనిపించే ఆంజనేయులి తెలివీ మితమైనదానిలాగే కని పిస్తుంది.  సమయానికి సరిపోయేట్టు తెలివిగా మాట్లాడుతూ, ముందుచూపుతో, తెలివితేటలతో పన్లు చక్కబెట్టుకునే ధనలక్ష్మి , దానికి సరిగ్గా వ్యతిరేకంగా, చలాకీగా వ్యాపారపు మెళకువలన్నీ ఔపోసన పట్టినట్టుగా కనిపిస్తుంది..

కథానాయకి ప్రదర్శించిన లక్షణాలన్నీ సమగ్రంగా పరిశీలిస్తే ఒక సరికొత్త బిజినెస్స్ మేనేజ్మెంట్ పుస్తకం రాయవచ్చు. ఇదేమాట మన కథకుడి భార్య శ్రీమతి శకుంతల కూడా అంటుంది. “ఓవర్ టైముకి ఓదార్పన్నమాట. తెలివంటే మీ చెల్లిదే. ఈ వ్యాపార మర్మాలన్నీ ఒక పుస్తకం రాయించడి. ఎం.ఏ బిజినెస్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఓ పుస్తకంగా పెట్టొచ్చు” అని. నాదీ అదే మాట. 

వ్యాపారానికీ బడిలో చదివిన చదువుకీ ఏ మాత్రం సంబంధం లేదు అని నిజజీవితంలో చూపించిన గొప్ప వ్యాపారవేత్తలకి నిలువెత్తు దర్పణం మన ధనలక్ష్మి.

గడ్డురోజులకి ఎదురొడ్డడమే ధైర్యం.. వ్యాపారానికి మూలం అదే.. ‘చీమలకింత చక్కెర దొరకగా లేనిది మనకి నాలుగు మెతుకులు దొరకవా?’ అంటూ తన మొదటి ప్రణాళిక అమలుచేస్తుంది.. అవకాశం అనుకున్నదేదీ వదిలిపెట్టని గడసరి..

అది  పిండి మరలోనే సరుకు నిలవచేయడమైనా, 'చిల్లర శ్రీ మహాలక్ష్మి ' అంటూ వందకి పదిరూపాయల లాభంతో అమ్మిన చిల్లర పొట్లాలైనా.. వాణిశ్రీ బొమ్మతో అమ్మే ధనశ్రీ సున్నిపిండైనా.. ఆవిడ ఆచరణకి శభాష్ అనక తప్పదు.. తామిద్దరికీ చదువులేదు కనక, చదువుకున్నవాడు, తెలిసిన వాడు ఉంటే మంచిదనే కథకుడిని పార్ట్ టైం ఉద్యోగానికి ఒప్పించేయడమే కాక, ‘సరుకే లాయకి.  మీ ఇంటికి నెలకి సరిపడా సరుకులన్నీ మన కొట్లోంచే, అయినా నువ్వెవరు? మేమెవరు?’ అని అతన్నీ, ఎప్పుడైనా కొట్లో  ఆలస్యమైతే  మల్లెపూలూ, జిలేబీలు ఇచ్చి అతని కుటుంబాన్ని ప్రసన్నం చేసుకోమని ఇచ్చి పంపి అక్కడా మార్కులేయించుకుంటుంది..

అదనంగా అందే ఆ సాయమే కథకుడితో ' ధనమ్మ చెప్పినట్టు లక్ష మాటలైనా గుప్పెడు కొర్రలకి సరికావు కదా అనిపిస్తుంది

తలపెట్టినంత తేలిక కాదు ఏ పనినైనా నిర్వహించడం.. అది భద్రాచలం యాత్రా స్పెషల్ బస్సు యాత్రైనా, ఎక్కడ దొరకని వస్తువులక్కడకి తెలివిగా తెచ్చి అమ్మి సొమ్ము చేసుకోవడమైనా..

అమ్మకానికి పునాది నమ్మకమే. వినియోగదారులకి అది కల్గించడం లోనే వ్యాపా రానికి విజయం.. అదే నాయుడిగారి పచారీ ఖాతా ధనమ్మ కొట్లోకి మారడానికి కారణం.. ‘మంత్రసానితనం ఒప్పుకున్నాకా ఏదొచ్చినా పట్టాల’ అన్నధనమ్మ సూత్రం..

ఎరువుల ఏజెన్సీలంటే తలనొప్పి, డబ్బుంటే మన దగ్గరే ఉంటుంది కదా అంటూ ఏజెన్సీ తీసుకోవడానికి వెనకా ముందూ ఆడుతున్న భర్తకి..  ‘డబ్బు కూడా పచ్చి సరుకు లాంటిదే, ఇంట్లో ఉంటే గుండ్రాయి, బయటకెళితే కోడిపెట్ట’ అంటూ తర్కం విడమరిచి చెప్పి అతను విసుక్కున్నా సరే ఈశ్వర్ ఏజెన్సీస్ ని తెరిపిస్తుంది

ఇందిరాగాంధీ హత్య సమయం లో జరిగిన యూరియా బస్తాల ఉదంతంలో వచ్చిన లాభాలని చూసి ' తంతే గారెల బుట్టలో పడినట్టయిం ది’ అంటాడు కథకుడు.

' సమయం చూసి తన్నేవాళ్ళుందడ ద్దూ' అంటూ విషయాన్ని వివరించి ఆరుకాసుల నగని గుట్టు చప్పుడు కాకుండా ఆఫీసర్ గారికి ఇవ్వమన్నప్పుడు కథకుడి చేత ‘ఔరా’ అనిపిస్తుంది..

‘తాడిలోతు గుంట, ఏం చేసుకుంటాం?నిన్ను నిలబెట్టి సమాధి చెయ్యడానికి పనికొస్తుంది. అంటూ ఎద్దేవా చేసిన భర్తని సమాధాన పరిచి, అతనికి తెలియకుండా చిట్టీ డబ్బులు వేసి ఆ స్థలాన్ని కొని గోడౌవున్ కట్టించి,

‘ మీ రామాంజనేలు నివురుకప్పిన నిప్పు _ పైకి తేలడు గాని బుర్రంతా గుజ్జే … మా మగపురుషుడు మంకుపట్టుతో కూర్చోబట్టి ఆ ధరకి నిక్షేపంలాంటి స్థలం వచ్చింది. ఆ నిదానం … నిబ్బరం నిమ్మకి నీరెత్తినట్టు కూచున్నాడు. దానివల్ల పాతిక వేలు లాభించింది …” ఊరోళ్ళంతా నీ గురించి చెప్పుకుంటున్నారు … దిష్టి తగుల్తుందో ఏం పాడో …’ అని రామాంజనేలుకి నిమ్మకాయ దిగతుడిచి..

            తన సమర్ధత వల్ల భర్తలో పొడసూపుతున్న అసూయని అడ్డుకొవడానికే ఆ కిరీటాన్ని అతనికి పెట్టానని అన్నగా భావించే కథకుడికి చెప్తుంది..

చిన్నప్పుడు గుదిబండ అన్నాడనీ, తనవల్లే అతని చదువు ఆగిపోయిందని చిరాకు పడ్డాడనీ ఆమె ఆడ మనసు బాధపడినా,  పదిపైసల బేరం కోసం కక్కుర్తి పడిందని తిట్టాడని కన్నీళ్ళు పెట్టుకున్నా అది తాత్కాలికమే.. ఆమె మనసెపుడూ కావలసిన పరిష్కారం మీదే...

‘అన్నీ ఉండి సంసారంలో సుకం లేకపోతే ఏంటి లాబం? లక్కా బంగారం అంటిపెట్టుకుని ఉంటేనే కదా తాళిబొట్టు నిండుగా ఉండేది. అంటుంది..

అలాగే వాళ్ళ నాన్న ఉప్పూ, చింతపండు అమ్ముకుంటే ఈశ్వర్  ఏబీసీడీ  లు అమ్ముకోవాలి అన్నది ఆమె కల.. దానికే " దేవకమ్మ ఎనిమిదో కానుపు కంసుడికి ప్రాణగండం అయినట్టు మన వంశంలో ఎనిమిదో క్లాస్ గండం ఉంది రా నాన్నా! అంటూ వెటకారమాడి, తెలీకుండానే గారబాంతో కొడుకుని చెడగొడుతున్న భర్తని రెచ్చగొట్టి అతనంతట అతనే ' ఈశ్వరయ్యని ఎదైనా హాస్టల్ ఉన్న మంచి స్కూల్లో చేర్పించాలండి, ఇక్కడుంటే ఆడాళ్ళ గారాబంతో గాడిదైపోతాడు ' అనేలా చేస్తుంది..

ఇలా ఎన్ని సార్లు చదివినా ఎదో కొత్త వ్యాపార సూత్రమో, జీవితపు పాఠమో చెప్తూనే ఉంటుంది ధనమ్మ..

            శ్రీపాద వారు చెప్పిన సూత్రాలు అలవర్చుకుని అత్యంత సమయస్పూర్థితో, చతురతతో జీవితాన్ని మలచుకున్న పాత్ర శ్రీ రమణ గారి ధనలక్ష్మి అనిపించడం ఎంతవరకూ కాకతాళీయం? అనిపించక మానదు.. 

గొప్పవారందరూ గొప్పగా ఆలోచిస్తారు, జీవితాన్నీ గొప్పగా మలచుకునే గొప్ప కథలే చెప్తారు అనిపించకా మానదు..

ఇదీ ఈ అద్వితీయకథాయుగళాన్ని గురించిన మా యుగళ-పునఃకథనం. 

 

** **** *** *** *** *** ***
*** **** *** *** *** *** ***