అనగనగా తూర్పుగోదావరిజిల్లాలో ఒక అందమైన పల్లెటూరు.
ఆ పల్లెటూర్లో ఒక అబ్బాయి .
ఆ అబ్బాయిపెరిగి పెద్దయ్యి, పెళ్ళై - తండ్రై - తాతై తన కథ తనే చెప్పుకోవాలనుకున్నప్పుడు - ఆ కథకి నా బ్లాగు ఊతమయ్యింది.
ఆ పల్లెటూర్లో ఒక అబ్బాయి .
ఆ అబ్బాయిపెరిగి పెద్దయ్యి, పెళ్ళై - తండ్రై - తాతై తన కథ తనే చెప్పుకోవాలనుకున్నప్పుడు - ఆ కథకి నా బ్లాగు ఊతమయ్యింది.
సినిమాకి వెళ్దామంటే రాలేదని అమ్మ గుడికి వెళ్తుంటే పూజ బుట్టలో ఇసక పోసేయడం-
కోపం వస్తే ఇంట్లో ఎవ్వరికీ లేకుండా అన్నం, కూరలు అన్నీ తినేయడం-
గుఱ్ఱాలెక్కడం-
గుఱ్ఱం దొరక్కపోతే గాడిదకి తాటాకులు కట్టి పరిగెత్తించడం-
మంగళగిరి పానకాల స్వామి గుడిలో పూజారి పానకం బిందెలు తెచ్చేలోగా ఆలశ్యం అయిపోతోందని మడి కట్టుకున్న అమ్మన్నత్తయ్యతో అందరికీ తీర్థ-ప్రసాదాలు ఇప్పించెయ్యడం-
సింహాచలం వెళ్దామనుకున్న వారిని సింహాచలం నుండి తిరిగొచ్చేసిన బస్సెక్కిచ్చడం-
- అబ్బో ఒకటి కాదు ఇలా చెప్పుకుంటే ఓ పే........ద్ద లిస్టే అవుతుంది.
ఇంతకీ ఈ కథ ఎవరిదో వారి మాటల్లోనే చెప్తేనే బావుంటుంది ...
ఇదిగో నా కథ చెప్తున్నాను - నేను చెప్పినట్లే నా మాటల్లోనే రాయి.
కథకి పేరు - అవతారంగారి నారాయణగారి బాబి - అని పెట్టు.
అల్లా ఎందుకంటే మా వూళ్ళో ఐదుగురం బాబీలు వున్నాం - పంచబాబీలు పంచభీముళ్ళలా.
నేను పుట్టడం 1945 -కొత్తింట్లో.
అప్పటికే పుట్టి వున్నవారు, పుట్టిపోయినవారితో కలిపి ఏడుగురి తర్వాత అష్టమగర్భం నేను. నాకు ముందు పుట్టిన పిల్లాడికి మా తాత అవతారంగారి పేరు పెడితే వాడు పోయాడని వాడి తర్వాత పుట్టిన నాకు అవతారంగారి తండ్రిగారు - కామయ్యగారి పేరు పెట్టారు - కామేశ్వర్రావని.
మా నాన్నగారు 1942లో ఇల్లు కట్టారు - అనాతారంలో - మిగతావాళ్ళందరూ శివకోడులో పుట్టారు గానీ నేను కొత్తింట్లో పుట్టాను - 1945 నవంబర్ 13వ తారీఖు.
నెహ్రూగారికి నాకు ఒక రోజే తేడా.
ఒక రోజు తేడాతో ఆయన ప్రైమ్మినిస్టర్ అయాడు - నేనిలాగయిపోయాను.
లేపోతే ప్రైమ్మినిస్టర్ అయిపోయేవాణ్ణి నేను కూడాను.
అదో - అలా - 45 లో పుట్టి చిన్నంగా పెరుగుతూ వస్తో ఉంటే నాకప్పుడు మూడో - ఐదో నెలలు వచ్చాయి నాకు.
ఈ స్టోరీ ఎర్రమామ్మ చెప్పింది నాకు.
ఎర్రమామ్మంటే మా నాన్నమ్మ తోడికోడలు.
ఆవిడ సరదాగా అందరినీ తిడుతూ ఉండేది - ఎవరు కనపడ్డా - ఆఖరికి ఊరి ప్రెసిడెంట్ కనపడ్డా అలాగే తిట్టేసేది. పన్ను కట్టలేదని ప్రెసిడెంటొచ్చి సామాను బయటపడి ఇల్లు జప్తు చేయిస్తానంటే - నా సామాను బైట పడేస్తానంటావురా - అని తెగ తిట్టి పోసేది.
ఆవిడేం చెప్పిందంటే - ఓ రోజు ఆ ఎర్రమామ్మ, మా నాన్నమ్మ తులసి కోట పళ్ళెంలో కూర్చుని కబుర్లు చెపుకుంటున్నారట.
ఈలోపులో మా కాళత్తయ్యొచ్చిందట - నాకు మూణ్ణెళ్లు ముందు పుట్టింది - కాళత్తయ్య కూతురు - దాన్నెత్తుకుని.
ఆ కాళత్తయ్యొచ్చీ - మా నాన్న దగ్గర - "అన్నయ్యా అన్నయ్యా - మళ్ళీ కామయ్యగారు, కావమ్మగారు పుట్టేశారూ" అంటే "నువ్వూ - నీ వెర్రి కబుర్లు - వీడికన్నా అది మూడు నెలలు పెద్దది కదా" అని మా నాన్న అన్నారట .
అంటే "రాముడి కన్నా సీత పెద్దది కాదేంటి - వీళ్లిద్దరికీ పెళ్లి చేసేద్దాం" అన్న కాళత్తయ్యని పట్టుకుని తెగతిట్టి ఇంకా కోపం తగ్గక - "ఈ వెధవకి ఇప్పుడే పెళ్లా" అని ఆ రెక్కట్టుకుని ఆ ఐదునెలల పిల్లాణ్ణి నన్ను కటకటాల్లో ఉయ్యాలా బల్ల దగ్గర్నుంచి విసిరేశారట పెరట్లోకి.
విసిరేస్తే ఎర్రమామ్మ ఒళ్ళో పడ్డాను. "భడవకానా - నా ఒళ్ళో పడి బతికావ"నేది.
ఇంకక్కడనుంచి దినదిన ప్రవర్ధమానం.
ఐదేళ్ళ వయసువరకూ పుట్టు వెంట్రుకలు లేవు. నా ఫోటో వుంది - పుట్టువెంట్రుకలు తీయకుండా వున్నది - కింద బూట్లు, పైన గిరజాల జుట్టూ నేను.
ఐదోసంవత్సరంలో నాకు పుట్టు వెంట్రుకలు తీశారు.
ఆరో సంవత్సరంలో అక్షరాభ్యాసం, బళ్ళో వేయడం జరిగింది.
స్కూలుకి వెళ్ళేవాడినికాదు.
మా వూళ్ళో అనుపిండి రామ్మూర్తిగారని ఉండేవారు - మునసబుగారి అన్నగారు.
ఆయనొక బెత్తం పట్టుకుని వెనకాల నిక్కరు పిఱ్ఱ మీద కొడుతూ బడికి తీసికెళ్ళి అక్కడ పడేసేవారు మమ్మల్ని- నన్నూ, కాళత్తయ్యగారి నాగన్నని.
ఏదో ఏడ్చుకుంటూ కూర్చునే వాళ్ళం బళ్ళో.
ఈలోగా నాతో చేరినవాళ్ళందరూ ఒకటో క్లాసునుంచి రెండో క్లాసుకెళ్ళారు.
రాజూ మాష్టారని ఒకాయన - "ఒరే! నువ్వింకా ఒకటేరా" అన్నాడు.
అంటే మనం ఒకటో క్లాసే ఫెయిల్ అన్నమాట.
ఫెయిల్ అంటే ఏడుస్తానని - "నువ్వు పెద్దొకటిరా" - అనేవారు.
అలా పెద్దొకటి కూడా చదివాను నేను.
<వచ్చేనెల తరువాయి కథ>
అంకుల్ బ్లాగ్బయోగ్రఫీ అన్నమాట.
రిప్లయితొలగించండిఇంకో మంచి సిరీస్ నీ నుంచి.
Waiting to read further posts in this series.
అవును - నాన్న కథ ఆయన మాటల్లోనే- రాతే నాది :)
తొలగించండిBalance ఎప్పుడు లల్లి
రిప్లయితొలగించండినెలకొకటి, శ్యామల!
తొలగించండిబాగుందండీ లలిత గారు మీ కొత్త సిరీస్
రిప్లయితొలగించండిథాంక్స్, పవన్‌గారు!
తొలగించండిహహహ పెద్దొకటి బాగుందండీ... నేనింకా కోపమొస్తే ఎక్కువ తినేయడం త్రివిక్రమ్ కనిపెట్టాడనుకుంటున్నా.. మీ నాన్నగారు ఎపుడో వాడేశారనమాట :-) మరో డేట్ మా కేలండర్లో మార్క్ చేయిస్తున్నందుకు మీకు నాన్నగారికి కూడా థాంక్స్ :-)
రిప్లయితొలగించండికాలెండర్లో మార్క్ చేసుకుని మరీ నా బ్లాగ్ చదువుతున్నందుకు బోల్డన్ని థాంక్స్ మీకు!
తొలగించండిభలే బాగుంది లలితా.. అంకుల్ మాట్లాడినట్టే ఉంది. ఈ సిరీస్ కి చాలా potential కనిపిస్తున్నది... waiting for the next instalment
రిప్లయితొలగించండిఅపర్ణే! నాన్న మాటలే అవి - రాతే నాది :)
తొలగించండిబాబిగారి కబుర్లు బావున్నాయండి, అనాతారాన్ని అడుగడుగునా కళ్ళకి కట్టించేస్తున్నారు రాతల్లో.
రిప్లయితొలగించండిబాబి గారు కబుర్లపోగుకీ,ఆకతాయి తనానికీ, నానిగారు(అప్పా)అసలు మాట్లాడకపోడానికి రెండు విభిన్న ధృవాల్లా ఉంటారు.ఆయనకి ఎంతసేపూ ఆ రేడియో,పుస్తకాలూ,పేపరూ, పొలం వెళ్ళి రావడం భలే ఉండేది అప్పా టైం టేబుల్/షెడ్యూల్.
మమ్మల్ని, అనాతారాన్ని గుర్తుచేసుకుంటూ మీర్రాసిన ఈ కమ్మటి కమెంట్‌కి బోల్డన్ని థాంక్స్!
తొలగించండి