24, జూన్ 2017, శనివారం

తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి మధ్యాహ్నం, మలిసంజ - 3


మే  28, 2017 - ఆదివారం మధ్యాహ్నం - ఇంతకు ముందు జరిగిన ప్రసంగాల విశేషాలు ఇక్కడ చదువుకోవచ్చు: తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి మధ్యాహ్నం, మలిసంజ - 2

బాబ్జీ గారి - పుస్తక ప్రచురణ - సాధక బాధకాలు:

నేటి సాహిత్యం - తీరుతెన్నులు ప్రసంగాలలో తదుపరి అంశంగా పుస్తక ప్రచురణలో సాధక బాధకాల గురించి మాట్లాడినవారు ప్రముఖ ప్రచురణ కర్త - బాబ్జీ గారు.

ఆయనకి కేటాయించిన ఐదారు నిముషాల్లో చాలా విషయాలు పంచుకున్నారు :

"చాలా చెప్పాలని రాసుకొచ్చినా సమయం తక్కువగా వుంది - క్లుప్తంగా చెప్తాను.  1970లలో నవలా సాహిత్యానికి, కాల్పనిక సాహిత్యానికి పెద్దపీట వేశారు - తెలుగు సాహిత్యంలో. 1990 దాకా నవలలు బాగా అమ్ముడయ్యాయి.

తొలిగా యద్దనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచనాదేవి, కోడూరి కౌసల్యాదేవి - తర్వాత యండమూరి, మల్లాది, కొమ్మనాపల్లి, సూర్యదేవర - నవలా సామ్రాజ్యానికి స్వర్ణయుగం.

రచయిత్రుల పుస్తకాలు బాగా అమ్ముడవుతూ ఉండడం వల్ల రచయితలు ఆడవాళ్ళ పేర్లు కలం పేర్లుగా పెట్టుకుని రాసుకునే రోజులవి.

వీధి వీధినా లెండింగ్ లైబ్రరీలు ఉండేవి. ఇంట్లో వుండే ఆడవాళ్లు పుస్తకాలు బాగా చదివే వాళ్ళు.

ప్రచురించిన పుస్తకాల్లో సగం లెండింగ్ లైబ్రరీలు కొనేవి. మిగిలినవి పుస్తకప్రియులు, ప్రభుత్వ గ్రంథాలయాలు కొనేవారు.

టీవీలు రావడం వల్ల దెబ్బతిన్న  ప్రచురణరంగాన్ని పరిరక్షించడానికి మొబైల్ లైబ్రరీ వ్యాన్లు నడుపుతున్నా, పుస్తక ప్రదర్శనలు జరుపుతున్నా పుస్తకాలు అంతగా అమ్ముడవట్లేదు.

ఎవరూ కొనక ప్రచురణరంగం కుదేలైనా అదే జీవనాధారం కాబట్టి పాపులర్ పుస్తకాలు ప్రచురించడం జరుగుతోంది.

Publishing is a matured art.

మంచి రచనను పుస్తకముగా మలచడానికి చాలా ప్రత్యేకమైన కృషి కావాలి.

సాహిత్య జ్ఞానం, సాంకేతిక జ్ఞానం, సృజనాత్మకత, ఓర్పు - ఇవన్నీ కావాలి.

తెలుగు పాఠకులకు పుస్తకాలు కొని చదివే అలవాటు లేదు.

ఒక నవల ప్రచురించడానికి DTP ఖర్చులు చాలా అవుతాయి. ప్రచురించిన నవల వెయ్యి కాపీలు అమ్ముడవడానికి రెండేళ్లు పడుతుంది. రూపాయికి తయారయిన పుస్తకాన్ని నాలుగు రూపాయలకి అమ్మాలి. దాంతో ఆర్ధిక పరమైన  కష్టాలు ఎక్కువగా ఉంటాయి.

ఒక పుస్తకం అమ్ముడవడానికి దోహద పడేవి - పాఠకుల అభిరుచి, డబ్బులు, ఎంపిక.

ప్రచురణ రంగంలోని ప్రధానమైన ఇబ్బందులు ఏంటంటే - చౌకరకం నకళ్లు దొరకడం.

ఒక పుస్తకం రివ్యూ చేశాక సరైన గ్రేడింగ్ సిస్టం లేకపోవడం.

తెలుగులో తప్పులు లేకుండా వాక్య నిర్మాణం చేయగలిగేవాళ్ళు, వాక్యాలని సరిచేయగలిగేవాళ్లు లేకపోవడం. అవి తెలిసిన పెద్దవాళ్ళకి కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడం.

తెలుగు పుస్తక ప్రచురణ రంగం బాగుపడడానికి మీలాంటి ప్రవాసాంధ్రుల కృషి, సంకల్పం కావాలి. ఈ వేదిక పురిటిగడ్డ కావాలి-

అంటూ బాబ్జీగారు తన ప్రసంగాన్ని ముగించగానే అప్పటికే అనుకున్న దానికంటే సాహిత్య కార్యక్రమాలు ఆలస్యం కావడంతో తర్వాతి కార్యక్రమాన్ని మధ్యలో విరామం లేకుండా వెంటనే ప్రారంభించారు.

తానా సాహిత్య సమావేశాల్లో ఆఖరి అంశం - సాహిత్య పరిశోధన:



ఇందులో పాల్గొన్నవారు: సుందరవల్లి వింజమూరి, సుధా కలవగుంట, డాక్టర్ విజయశ్రీ కుప్పా, డాక్టర్ త్రివేణి - గార్లు. వక్తల పట్టికలో డాక్టర్. రాజేశ్వరిగారి పేరు వుంది కానీ నాకు ఆవిణ్ణి వేదికమీద చూసిన జ్ఞాపకం లేదు.

వీళ్ళకి ఒక్కొకళ్ళకి ఐదు నిముషాల కన్నా ఎక్కువ సమయం దొరకలేదు.

వీరి ప్రసంగాలు జరిగే సమయంలోనే  - నేను తర్వాతి రోజు మా ఇంటికి రాబోతున్న అపురూప అతిథుల  హోటల్ అడ్రసులు అవీ కనుక్కుంటూ - వాళ్ళ వీలు ప్రకారం వాళ్ళని మా ఇంటికి తీసుకుని రావడానికి ఏ సమయంలో బదరి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలో - ఇలాంటివన్నీ మాట్లాడుతూ సాహిత్య పరిశోధనా ప్రసంగాలు అంత శ్రద్ధగా వినలేకపోయాను :( - అది తలుచుకుంటే ఇప్పటికీ - అయ్యో- అనిపిస్తుంది.

షికాగో నుంచి వచ్చిన శ్యామ్ గారు తన ఫోన్‌లో ఈ ఆఖరి ప్రసంగాలు రికార్డ్ చేయడం చూశాను - ఎప్పటికైనా ఆయనకి వీలు కుదిరి పంచుకోగలిగితే నేను మిస్ అయిన ఆ భాగం తర్వాత పోస్ట్ చేద్దామనుకుంటున్నాను.

ఇప్పటికి - వీలైనంత వరకూ నేను విన్న ప్రసంగ భాగాలు ఇవి:

ముందుగా సుందరవల్లి వింజమూరిగారు తమ నేటి సాహిత్యంలో స్త్రీ పాత్ర అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.

తర్వాత సుధా కలవగుంట గారు - తాము గత పదేళ్లుగా ప్రతి సంవత్సరం ఇండియా వెళ్లి అక్కడ వున్న ఎంతోమంది నృత్య కళాకారులని కలుసుకుంటూ పది సంవత్సరాలు పరిశోధన చేసి రెండు డాక్టరేట్లు సంపాదించిన - తమ అభిమాన విషయమైన - యక్షగానం గురించి మాట్లాడారు.

సుధా కలవగుంట గారిని తానా-సాహిత్య సమావేశాల్లో అతిథిగా, వక్తగా చూడగానే చాలా ఆనందంగా అనిపించింది - దానికి ఒక కారణం వుంది. లిటరరీ కమిటీ మొదలుపెట్టిన కొత్తలో బదరి కూడా చాలా ఇష్టంగా వాలంటీర్ చేద్దామనుకున్నారు. కానీ రాను రాను తనకి అంతగా ఉత్సాహంగా అనిపించక డ్రాప్ అయ్యారు. కానీ అప్పటికే తానా-2017 వెబ్‌సైట్‌లో తన పేరు, ఫోన్ నంబర్ చేర్చబడ్డాయి.

ఒక శనివారం మధ్యాహ్నం బదరి సెల్‌ఫోన్‌కి ఒక కాల్ వచ్చింది. తెలియని పేరు - అయినా ఎవరో అనుకుంటూ తీస్తే టెక్సస్ నుంచి సుధ అనే ఆవిడ మాట్లాడుతూ తనకి తానాలో యక్షగానం గురించి ఒక ప్రసంగం ఇవ్వాలని ఆసక్తిగా వుంది - లిటరరీ కమిటీ అధ్యక్షులు రవి పసుపులేటి గారికి ఫోన్ చేస్తే ఆయన దొరకట్లేదని బదరికి ఫోన్ చేశానని చెప్పారు. ఆవిడ యక్షగానంలో రెండు డాక్టరేట్లు చేశారని వినగానే - బదరి చాలా మెచ్చుకుని - ఆవిడకి చెప్పారు - తను లిటరరీ కమిటీలో లేకపోయినా రవిగారికి ఆవిడ గురించి చెప్తానని.

కానీ ఆ తర్వాత - ఎన్నిసార్లు ప్రయత్నించినా - మా ఇద్దరికీ సుధగారికి తానా సమావేశాలకి వచ్చే అవకాశం దొరికిందో లేదో , ఆహ్వానం అందిందో లేదో - తెలియలేదు. అదీ  - సుధగారిని తానా సాహిత్య సమావేశాల్లో చూడగానే నా ఆనందానికి కారణం.

ఆవిడ స్పీచ్ కూడా - నేను పూర్తిగా అసలు వినలేకపోయాను కానీ - విన్న కొంచెం చాలా authentic గా, తాను  మాట్లాడే విషయం మీద ఎంతో command వున్న వారిలా అనిపించారు. మరి - పదేళ్ల పరిశోధన- రెండు డాక్టరేట్లు అంటే మాటలా మరి?!  తర్వాత ఇంట్లో మాటల్లో ఆవిడ గురించి చెప్పగానే బదరి కూడా చాలా సంతోషించారు - ఆవిడ తానాకి రాగలిగినందుకు.

సుధగారి తర్వాత  తన బుల్లి మనవడి మీద ఎన్నో నానీలు రాసిన గ్రానీ విజయశ్రీ కుప్పాగారు నానీల గురించి పరిచయం చేశారు.

విజయశ్రీ గారి - నానీల ప్రక్రియ ఒక పరిశీలన - ఆవిడ మాటల్లో:

"ఇప్ప్పుడు ఈ రోజుల్లో అన్నీ స్పీడే - రెండు నిముషాల కవిత ఒక నిముషంలో వినాలి. 

కాలంతో మారక పోతే కవిత బతికి బట్టకట్టదు . 

ఎన్. గోపీగారు నానీల సృష్టికర్త. 

నానీ చట్రం ఏంటంటే 20 అక్షరాలకి ఎక్కువ, పాతిక అక్షరాలకి తక్కువగా ఉండాలి. 

నానీలో నాలుగు పాదాలు ఉంటాయి. మొదటి రెండు పాదాల్లో ఏదో ఒక వృత్తాంతం ఉండాలి - తరువాయి రెండు పాదాలు సమర్థవంతంగా మొదటి రెండు లైన్లని సమన్వయం చేస్తూ, చాకచక్యంగా, చమత్కారంగా - ఒక మెరుపు ఉండేలా పూరించాలి. 

నానీ అంటే ఏవో కొన్ని పరిమిత భావాలు కాదు. నానీల ప్రపంచం విస్తారం. 

గద్యరూపంలో చెప్పే గడుసు పద్యం నానీ. 

చిల్లర భవానీ దేవిగారు నానీలు రాసిన మొదటి మహిళ. నేను ఆరవదాన్ని. 

ప్రాణం-ప్రణవం అనే 108 నానీలతో ఒక పుస్తకం రాశాను. 

నా నానీల నుంచి కొన్ని మీతో పంచుకుంటున్నాను

< ఈ కింది నానీల ఫార్మాట్ సరిగా ఉండకపోవచ్చు - విజయశ్రీ గారి లైన్లు గుర్తున్నాయి కానీ పదాలు-పాదాల లెక్కలు తెలీక  free-form లో రాసేశాను >


వివాహమా ఎంత పని చేశావు ?
నా పుట్టింటికి నన్ను అతిథిని చేశావు

ఆదిశక్తి అంటే ఊరుకోను 
ఆమె శక్తి అనండి చాలు

అర్థ నారీశ్వరమంటే సగభాగమే కదా 
మరి సమానత్వమెందుకు?

మగాళ్లు మంచివారంటారా ?!
అది ఆడవాళ్ల చలవే!"

- అంటూ తన నానీల ప్రసంగం ముగించారు విజయశ్రీగారు.

చివరిగా తెలంగాణ మహిళా కథలు (ప్రోగ్రాం లిస్టులో ఉన్నట్లు కవితలు కాదు) అనే అంశం మీద మాట్లాడడానికి -  పట్టుచీర కట్టుకుని, పొడుగైన జడతో - అచ్చతెలుగు-తెలంగాణ ఆడపడుచు డాక్టర్ త్రివేణిగారు మైకు దగ్గరికి రాబోతూ ఉండగా - ఇంతలోనే విజయశ్రీగారు - ఒక్క ముఖ్యమైన విషయం మర్చిపోయానంటూ మళ్ళీ మైకు దగ్గరికి వచ్చారు.

అసలే సమయం మించిపోయింది -  త్రివేణిగారికి సమయం సరిపోదేమోనని మా 132-గదిలో వున్న మేమందరం - చెప్పొద్దూ - కొంచెం బెంగ పడ్డాం.  పాపం! - ఇండియా నుంచి విమానమెక్కి ఎంతో  మాట్లాడదామని ఆశతో వచ్చారు - కనీసం ఐదు నిముషాలైనా ఆవిడకి దొరుకుతాయో లేదో - అని.

విజయశ్రీ గారు తన నానీల పుస్తకాన్ని మొదటగా పరిశీలించి తన అభిప్రాయం చెప్పిన రవి పసుపులేటి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పి కూర్చున్నారు.

చివరికి తన వంతు వస్తుందో రాదో అనుకుంటూనే - ఆ చిట్టచివరి ఐదు నిముషాల కోసం ఎంతో ఓపిగ్గా ఎదురుచూసిన త్రివేణిగారు మైకు దగ్గరికి వస్తూనే "ఆఖరి స్పీచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా"అని ఎంతో స్పోర్టివ్‌గా తన ప్రసంగం మొదలుపెట్టి "తెలంగాణ మహిళలు రాసిన కథల గురించి మాట్లాడడానికి వచ్చాను - మీ ప్రోగ్రాంలో రాసినట్లు కవితల గురించి కాదు" అని చెప్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

అంతటితో 40వ తానా - సాహిత్య సంబరాలు ముగిశాయి.

వీలైనంతవరకూ అతిథుల్ని పేరు పేరునా పలకరించి అభినందించాను.

సాయిబ్రహ్మానందం గొర్తిగారి దగ్గరికి వెళ్లి పలకరించి ఆయన ఆంధ్రజ్యోతిలో రాసిన "ఆనాటి చెలిమి ఒక కల" కథ గురించి కాసేపు మాట్లాడాను.

అలా మాట్లాడుతూ ఉండగానే - సాయిబ్రహ్మానందంగారు "మీకు నవలలు చదివే అలవాటు ఉందా?" అనడిగి తన నవల - అంతర్జ్వలన - కాపీ ఒకటి సైన్ చేసి ఇచ్చారు - చదివి అభిప్రాయం చెప్పండి అంటూ.

నాకు వెంటనే పుస్తకప్రియులు అమృతరెడ్డిగారు గుర్తొచ్చారు- వెంటనే పక్కనే ఎవరితోనో మాట్లాడుతున్న అమృతరెడ్డిగారిని సాయిబ్రహ్మానందంగారి దగ్గరికి తీసుకెళ్లి - "నాతోపాటు ఇంకొక మంచి పుస్తకప్రియులు వున్నారిక్కడ - ఆయనకీ ఓ కాపీ ఇవ్వండి " అని చెప్పి మొహమాటపెట్టి మరీ ఇప్పించేశాను.

డబ్బులిచ్చి పుస్తకాలు ఎక్కడైనా, ఎప్పుడైనా కొనుక్కోగలం - కానీ రచయిత స్వహస్తాలతో సంతకం చేసి ఇచ్చిన కాపీ మాత్రం ఎక్కడా కొనుక్కోలేం కదా - మరి?!

ఆఖరుగా ఆహ్వానితులైన గెస్టులు, ఆహ్వానించిన హోస్టులు - అందరం కలిసి ఒక పే... ద్ద గ్రూప్ ఫోటో తీసుకున్నాం.  ఫోటోకి రానంటున్న నరిశెట్టి ఇన్నయ్యగార్ని మొత్తానికి ఎలాగో ఒప్పించి ఆయన్నీ మా ఫోటోలోకి తెచ్చేసుకున్నాం.



ఆ ఫోటో తీసుకునే టైంలో - మా వెనక వరసలో నిల్చుని - ఒకరి తరవాత ఒకరుగా చేరుతున్నవాళ్లకి చోటు ఇస్తూ - వెనక్కి వెనక్కి జరుగుతున్న నారాయణస్వామి గారు ఫొటోలో (కన)పడతారో, పడరో అని వారి సతీమణి సావిత్రిగారు కుంచెం బెంగ పెట్టేసుకున్నట్టు క(వి)నిపించారు.

ఫోటోల హడావిడి అయ్యాక - బయట కలిసినప్పుడు త్రివేణి గారి జడను నేను, నా ముక్కు-బులాకీని ఆవిడ పరస్పరం నచ్చేసుకుని - మెచ్చేసుకుని -  మురిసిపోయాం.

నేను ముందే చెప్పినట్టు ఈ ఆఖరి ప్రసంగాల గురించి ఎవరి దగ్గరైనా రికార్డింగ్ దొరికితే మళ్ళీ రాయాలనివుంది.

మొత్తానికి తానా - లిటరరీ కమిటీ వాలంటీర్ పేరుతో - లిటరల్‌గా నేనేమీ చేయలేకపోయినా - నావంతుగా నేను ఒక శ్రద్ధ గల శ్రోతగా - తెలుగుని నిలపడానికి ఎంతో కృషి చేస్తున్న ఈ గొప్ప గొప్ప వ్యక్తులందరికీ - ఉడతా-భక్తిగా చెవులప్పగించాను. వారి మాటలని నా బ్లాగ్ముఖంగా మీకందించగలిగాను.

అన్నటికన్నా నచ్చిన విషయం ఏంటంటే - వక్త:శ్రోత నిష్పత్తి 1:3 - అయినా కూడా ఎక్కడ చిన్నబుచ్చుకోకుండా - అయ్యో మనమాటలు వినడానికి వున్నది ఇంత మందేనా అనుకోకుండా - పెద్ద మనసుతో వారి స్థాయి కబుర్లని నాలాంటి వారికి కూడా అర్థమయేంత సరళమైన భాషలో ఎంతో ఇష్టంగా పంచుకున్న మా తానా-అతిథులందరికీ వందల-వందనాలు.

నేను శ్రోతగా పాల్గొనాలనుకున్న తానా- సాహిత్య సమావేశాలు అయిపోయాయి. ఆదివారం సాయంత్రం దాదాపు ఏడు కావొస్తోంది.

అమృతరెడ్డి-సుగుణ దంపతులతో కలిసి తానా-వారి-సాయంకాలపు-విందు అందుకుని - నేను సుగుణ గారితో కలిసి ఒక గంట మెయిన్ స్టేజ్ ప్రోగ్రాం చూడడానికి వెళ్ళాను - బదరి వచ్చి నన్ను పిక్ చేసుకునేలోగా టైం ఉందని.

సుజాత వింజమూరి గారి "కృష్ణవేణి" నృత్యరూపకం - అంతకుముందు చూసిందే అయినా - మళ్ళీ చూడడానికి చాలా బావుంది.

దాని తర్వాత ఫేషన్ షో అని ప్రకటించారు.

అప్పుడు గుర్తొచ్చింది - నిన్నమా  లిటరరీ కమిటీ మెంబర్ అయిన గిరిధర్ - తను ఫేషన్ షో లో పాల్గొంటున్నాను అని చెప్పిన సంగతి.

మంచి టైంకి వచ్చాను అనుకుని - గిరిధర్ స్టేజ్ మీద కనిపించే దాకా వుండి - చూసి - బయటికి వచ్చేశాను.



ఇంతలో బదరి నుంచి ఫోన్ - పది నిముషాల్లో కన్వెన్షన్ సెంటర్ దగ్గరకి వస్తున్నానని.

గబగబా బయటికి వస్తున్న నాకు - అక్కడ వరసలుగా పేర్చిన సావనీర్లు కనిపించాయి.

ఒక్క సావనీర్ కాపీ కోసం - నిన్న - అంటే శనివారం రోజున (మే 27) - సావనీర్-కమిటీ వాళ్ళకి - స్వాతిముత్యంలో ఉద్యోగం కోసం సోమయాజుల్ని వెంబడించిన కమల్‌హాసన్‌ని గుర్తు తెచ్చేలా - విసిగించిన నేను గుర్తొచ్చి నాకే నవ్వొచ్చింది.

అక్కడే కూర్చుని వున్న చంద్ర గుమ్మిగారిని - తీసుకోవచ్చా- అని అడిగి ఇంకో కాపీ సావనీర్ "లాభం" అనుకుంటూ ఇంటికి తెచ్చుకున్నాను.

ఇంటికి వస్తూ కార్లో మా సంభాషణ అంతా రేపటి - సోమవారం మే 28, 2017- గురించే.

ఆ సోమవారం ఎలా జరిగిందంటే - ఇక్కడ  చదవాల్సిందే: తా(నా) సంబరాల తాజాకబుర్లు - రాం-రాబర్ట్-రహీం మా ఇంటికి వచ్చినవేళ...

ఇక్కడితో ఆదివారం - మే 27, 2017 మధ్యాహ్నం కబుర్లు ముగిశాయి - ఆ ముందు జరిగిన విశేషాల కబుర్లు తదుపరి పోస్టులో - జ్ఞాపకాలలో వెనక్కి నడుస్తున్నాను కదా నేను :)

నేనూ అననా ఓ నానీని ?!

తెలుగు మాట్లాడితే
వినేవాళ్లేరి?
నేనా, తానా ?
తానాలో మేమా? హహ్హహ్హ!


7 కామెంట్‌లు:

  1. ముక్కుబులాకీ తాలూకు వారెవరో తెలియడంలేదు - ఫొటోలో బులాకీ స్పష్టంగా కనబడకపోవడం వలన 🙂

    తానా సంబరాల విశేషాలు ఆసక్తికరంగా వ్రాస్తున్నారు. మీ జ్ఞాపకశక్తి ని మెచ్చుకోవాలి. చదువుకుంటున్న రోజుల్లో పరీక్షల కోసం మీకు పెద్దగా ప్రిపరేషన్ అవసరం లేకపోయుండాలి 🙂.

    "నానీ"ల మీద మీరు అప్పుడే పట్టు సాధించేసినట్లున్నారే! 👌

    < "తెలుగు పాఠకులకు పుస్తకాలు కొని చదివే అలవాటు లేదు" అనే ఆ ప్రచురణకర్త గారు పలికిన పడికట్టు. మాటలతో నేనేకీభవించను. ఆయన అభిప్రాయం ఆయనది అనుకోండి. నేననేది కొనే ఆసక్తి, స్తోమత ఉన్నవారు కొనక ఊరుకోలేరని. ఆరోజుల్లో లెండిగ్ లైబ్రరీలు, రీడింగ్ రూములు వర్ధిల్లాయి. అయినప్పటికీ స్వంతానికి కొనుక్కునేవారూ ఉండేవారు (నేనయితే పుస్తకాలు కొనడం మీద చాలానే ఖర్చు పెట్టేవాడిని. నాలాంటి వారే నా స్నేహితులున్నూ). తరవాత తరవాత జరిగిన సాంకేతిక విస్ఫోటనం వలన జనాలకి ఇతర కాలక్షేప మార్గాలు / సాధనాలు దొరికాయి. అంతకు మించి ముఖ్యంగా సోకాల్డ్ ప్రపంచీకరణ వలన, కార్పోరటైజేషన్ వలన జీవితాలలో వేగం / ఉరుకులూ పరుగులూ / ఊపిరి సలుపుకోలేనితనం / ఒత్తిడి బాగా పెరిగిపోయాయి. అటువంటి ఆధునిక బానిసజీవనం పుస్తకపఠనం పడిపోవడానికి ఒక కారణమని నా అభిప్రాయం. ఆ కారణంగా అమ్మకం సంఖ్యలు గణనీయంగా తగ్గిపోయి ప్రచురణకర్తలకు ఔత్సాహకరంగా ఉండకపోవచ్చు. అంతమాత్రాన తెలుగువారు పుస్తకాలు కొనరు అనడం చాలా జనరలైజేషన్. ఆ మాటకొస్తే పైన నేను నా పరిధిలో చేసిన విశ్లేషణ ఇతర భాషల వారి పుస్తకపఠనాసక్తి, కొనుగోలుతనం విషయంలో కూడా అన్వయించుకోవచ్చని నా అభిప్రాయం.

    అన్ని వేల మైళ్ళ నుంచి రప్పించి అయిదారు నిమిషాలే సమయం ఇవ్వడం ఏ మాత్రం సబబుగా లేదు. ప్రతి వక్తకు - కనీసం - పావుగంట కేటాయిస్తే ఎంతమందికి అవకాశం ఇవ్వగలరో అంతమంది వక్తలను - మాత్రమే - ఆహ్వానించాలని నా అభిప్రాయం. తానా వారు, అటువంటి తదితర సంస్ధలు పునరాలోచించుకుంటే ఆహ్వానితులకు, శ్రోతలకు నిరుత్సాహం కొంతయినా తగ్గించినవారవుతారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నానీలు ఏదో సరదాగా ప్రయత్నించానండి. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. మొట్టమొదటి వరసలో చిట్టచివరన - కుడివైపుగా వుంది బులాకీ-ఆచూకీ!

      తొలగించండి
  2. మీ తానా కబుర్లు చాలా బాగున్నాయండీ.. చక్కగా అన్నీ గుర్తుంచుకుని వివరంగా రాశారు. మేమూ అటెండ్ అయిన ఫీలింగ్ వచ్చేట్టుగా :-)

    రిప్లయితొలగించండి