1, జులై 2017, శనివారం

తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి అపరాహ్ణం - కొసరు కబుర్లు



మే 28 - ఆదివారం - అపరాహ్ణ వేళ - అంతకు ముందు జరిగిన అష్టా(నా కష్టా)వధానం అయిపోగానే - పెద్దలైన - ఒజ్జ ఇనాక్‌గారు, వెజ్జులు రామరాజ భూషణుడు గారు, బాబ్జీగారు - వీరి సహపంక్తిన కూర్చుని బల్-పసందైన వారి చిన్ననాటి కబుర్లు వింటూ తానా-వారి మధ్యాహ్నపు విందు చేయడం అచ్చంగా నాకే దక్కిన ఒక వీనుల-విందానుభవం.

వారి మాటల మధ్యలో మా ఏసీ కాలేజ్‌లో నానా-రకాల కెమిస్ట్రీల్లో నాకెంతో ఇష్టమైన ఆర్గానిక్ కెమిస్ట్రీ బోధించిన భవభూతిశర్మగారి తండ్రిగారైన జమ్మలమడక మాధవరాయశర్మగారి ప్రసక్తి రావడం - ఇంకా అదే మాటల్లో వాళ్ళందరూ కూడా ఏసీ కాలేజ్‌ పూర్వ విద్యార్థులని తెలియడం -మనందరం ఒకే కాలేజ్ అని నే మురిసిపోవడం - అంత పెద్దవారూ  దశాబ్దాల-జూనియర్ నైన నన్ను - వాళ్ళతో సమానంగా మాట్లాడనివ్వడం - అమ్మో - తానాకి వెళ్ళకపోతే ఎంతో మిస్ అయిపోయేదాన్ని!

భోజనం అయింది - అవగానేఅందరితో కలిసి మళ్ళీ మా 132కి వెళ్దామని బయలుదేరాను  - కాకపోతే ఒక అడుగు ముందుగా వెళ్లాల్సి వచ్చింది - ఎందుకంటే తర్వాతి కార్యక్రమానికి వచ్చే అతిథుల కంటే ముందుండాలి కదా!

132కి వెళ్ళే దారిలో ఒక పక్కగా గోడ వారగా పెట్టి వున్న వాటర్ బాటిల్స్ ఒక ఎనిమిది పట్టుకుని  - గబగబా వెళ్ళానా! - అక్కడ ఎవరూ లేరు.

వెనకాల వరసలో స. వెం. రమేష్‌గారు, సంజనా పద్మం, కవిత, వసంత్ నాయుడుగార్లు కూర్చుని వున్నారు.

ఒక పక్కగా ఒకాయన - చేతిలో పుస్తకంతో - ఒక్కరే కూర్చుని వున్నారు.

ఎందుకో ఆయన్ని చూడగానే ఆయనే మ్యూజికాలజిస్ట్ రాజాగారేమో అనిపించింది.

ఇంతలో ఆయనే నన్ను చూడగానే - ఏమ్మా! మీరిక్కడి వారేనా? ఇక్కడ ఒక్క మైకే వుంది. మేము నలుగురం ఉంటాం స్టేజ్ మీద. నలుగురం ఒకరితో ఒకరు సంభాషిస్తున్నట్టు ఉంటుంది కార్యక్రమం. ఒక్క మైకు సరిపోదు. ఇంకో మూడు మైకులకి ఏర్పాటు చెయ్యండి - అన్నారు.

నాకొక్క నిముషం ఏం చెప్పాలో అర్థం కాలేదు.

ఆయనకి నమస్కారం చేసి - అలాగేనండి - అనేసి బయటికి వస్తున్న నాకు - వసుధ ఎదురొచ్చింది. పక్కనే ఒకతను వున్నారు.

అప్పటికే ముందు రోజు వసుధ కలిసినప్పుడు చెప్పింది - అయోధ్య కుమార్ అనే కొత్త డైరెక్టర్ ఒకతను సిరివెన్నెలగారు, దర్శకుడు క్రిష్‌లతో కలిసి ప్రస్తుత కార్యక్రమంలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు - రవి పసుపులేటిగారికి చెప్పి ఉంచమని.

ఇప్పుడు తన పక్కన వున్నది ఆ అయోధ్య కుమారే.

వాళ్ళిద్దరినీ పలకరించి "మీరు 132 లోకి వెళ్ళండి ఇప్పుడే వస్తాను"  అని కొంచెం ఎడంగా వెళ్లి మా తానా-సాహిత్య కమిటీ వాట్సాప్ గ్రూపులో రవిగారికి టెక్స్ట్ చేశాను - "రవిగారు! 132లో నాలుగు మైకులు కావాలని మ్యూజికాలజిస్ట్ రాజాగారు చెప్పారు. అంతే కాకుండా అయోధ్య కుమార్ కూడా వచ్చారు. ఎవరైనా 132 కి వచ్చి ఆ మైకుల ఏర్పాటు చూడండి" అంటూ.

బదుల్లేదు.

సరే - ఏం  చేస్తాను?  ఏం చేయగలను?  లోపలికి వెళ్తే రాజాగారు మళ్ళీ మైకులడుగుతారు.

అందుకని బయటే కాసేపు నించుని మా కమిటీలో వాళ్ళెవరైనా కనిపిస్తారా అని అటూ-ఇటూ చూడడం మొదలు పెట్టాను.

ఎవరూ కనిపించనే  లేదు. ఈలోగా సతీసమేత-నారాయణ స్వామిగారు కనిపించారు. వారి దగ్గరికి వెళ్లి చెప్పాను - 132లో సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి కార్యక్రమం వుంది- అని. సావిత్రిగారికి పొలిటికల్ ఫోరమ్ అంటే ఆసక్తి అని - ఆ దంపతులిరువురూ - చెట్టా పట్టగా చేతులు పట్టి తానా-నీడన నడిచెళుతుంటే  - చెప్పలేని హాయితో ముందుకి సాగారు.

సరే - ఇంక నేను - మనసులో - ఇదిగో - ఈ కింది పాట  -  (నా ఈ కొసరు పాటకి అసలు పాట గుర్తు పట్టగలరా - ఇది చదువుతున్న మీరు? ఊరికే సరదాకి ...)

నేనూ వసుధా ఎదురెదురు
రాజా మైకడుగునని  ఎంతో బెదురు
దొరకని బదులులు దొరకవని
తెలిసి టెక్స్టులు చేయటమెందుకని 
నా టెక్స్టుకి బదులేది - ఈ రూముకి మైకేది 

పాడుకుంటూ - 132కి వెళ్ళాను. 

132లో అడుగు పెట్టగానే - ఒక్కనిముషం అది - అంతకు ముందు కార్యక్రమాల్లో - ఇదెప్పటికైనా నిండేనా అని అనిపించిన మా నూటముప్ఫైరెండేనా - అన్న అనుమానం వచ్చింది. 

ఇసక వేస్తే రాలనంత మంది కాకపోయినా వెయ్యి పిన్నులు పడేసినా ఆ శబ్దం వినిపించనంత సందడిగా వుంది.




ఇంతకు ముందు వరకూ - అసలుందని అందరికీ తెలుసో లేదో అనిపించిన - మా 132కి రావాలని వీళ్ళందరికీ ఇవాళే ఎందుకనిపించిందబ్బా - వీళ్ళకెవరైనా పేరుపేరునా చెప్పి పిలుచుకొచ్చారా - అనాలోచిస్తే - అప్పుడు గుర్తొచ్చింది - తానా ప్రోగామ్ గైడ్‌లో చూసిన - సినిమా సాహిత్యము, పాటలు - సిరివెన్నెల సీతారామశాస్త్రి - అన్న మా 132 కార్యక్రమ పట్టిక.

సినిమా-సిరివెన్నెల అన్న జంటపదాలు మా 132-పంట పండించాయి.

అసలు ఈ కార్యక్రమం వివరాలు - గీత సాహిత్యంలో కవిత్వమెంత? - చేంబోలు సీతారామశాస్త్రి - అని ప్రచురించుంటే ఎంత మంది వచ్చేవాళ్ళో ?

వెంటనే - మా సాహిత్య కమిటీలో విజిటింగ్-మెంబరైన నానీలు రాసే విజయశ్రీ కుప్పాగారిని తల్చుకుని - జై-విజయశ్రీ గారూ - అనేసుకుని ఒక నానీననేసుకున్నా-

ఔరా సినీమాతా!
 తెలుగు తల్లి చుట్టమా!
కట్టిరి  ఎల్లరు 
నీకే పట్టమా ! 

- అంటూ.

అంత మందిని చూసేటప్పటికి ఆనందం ప్లస్ రాజాగారు మైకులడగరని సంతోషం ప్లస్ మా కమిటీ అధ్యక్షులు, నాతోటి మెంబర్లను చూసిన సంబరం - గాల్లో తేలుకుంటూ వెళ్లి రెండో వరసలో సుగుణగారి పక్కన కూర్చున్నాను. 

నా పక్క సీట్లో కూర్చుని వున్న అయోధ్య కుమార్‌గార్ని పలకరించాను. ఐదు నంది అవార్డులు గెలుచుకున్న  తను దర్శకత్వం వహించిన మిణుగురులు సినిమా గురించి ఉత్సాహంగా చెప్తుంటే విన్నాను. తను అంతకుముందు ఫ్లోరిడాలో వుండేవాణ్ణని, సినిమా మీద ఇష్టంతో ఇప్పుడు హైదరాబాదులో వుంటున్నానని చెప్పారు.

ప్రతి వీకెండ్ సినిమాలు చూసేటప్పుడు బదరి ఎప్పుడూ అంటుంటారు - ఆర్పీ పట్నాయక్ తన సినిమా బ్రోకర్ యూట్యూబులో రెండు డాలర్లకి చూపించినట్టు మంచి సినిమాలని ఆ నిర్మాతలో, దర్శకులో పూనుకుని ఇంటర్నెట్లో వచ్చేలా చేస్తే - పైరేటెడ్ కాపీస్ అంతగా ప్రోత్సహించబడవని. 

అదే మాట అయోధ్య కుమార్‌గారికి చెప్పాను - "మాకేమీ సినిమా ఊరికే వచ్చేస్తే చూడాలని ఉండదండి. మేము డబ్బులిచ్చి చూస్తేనే మీరు ఇంకొన్ని మంచి సినిమాలు తీయగలరు కదా! ఇంటర్నెట్లో ఐదు డాలర్లకి సినిమా  పెట్టినా మా ఇంటి లివింగ్‌రూం సోఫాలో కూర్చుని ఇంటిల్లిపాదీ చూడడానికి - ఆమాత్రం పెట్టొచ్చు అనుకుంటాం కదా మేము?!. మీలాంటి కొత్త దర్శకులు అలాంటి ఐడియాలేవో చేస్తే బావుంటుంది" - అని. 

తనప్పుడు చెప్పారు మిణుగురులు అలా అందరికీ అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని. ఆ తర్వాత తన విజిటింగ్ కార్డు తీసి నాకు ఇచ్చారు. తప్పకుండా మిణుగురులు చూసి నా అభిప్రాయం చెప్తానని చెప్పాను. ఆ సినిమా దొరికితే చూడాలి అనేసుకున్నాను. 

ఇంతలో కలకలం - చుట్టూఅందరూ నించుంటున్నారు. ఏంటా అని నేనూ నించుని చూస్తే - సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు, క్రిష్‌గారు విచ్చేశారు. 

వేదిక మీద క్రిష్‌గారు, పక్కనే సీతారామశాస్త్రిగారు, అటు పక్క కార్యక్రమ సంధానకర్త మద్దుకూరి చంద్రహాస్‌గారు, చివరగా మ్యూజికాలజిస్ట్ రాజాగారు - నాలుగు కుర్చీల్లో - కూర్చున్నారు. 

వాళ్ళ ముందు ఒకటే మైకు. 

అప్పుడింక అసలు కార్యక్రమం మొదలయింది. 

ఇప్పటికీ కొసరు కబుర్లు చాలంట
అప్పటి అసలు కబుర్లు బహు మేలంట 
వాటికి ఇంకొక వారం ఆగాలంట 
ఎదురుచూపులో అతిశయిల్లు రాగాలంట 
మీరు స్టే-ట్యూన్‌డంట 
నేనొస్తా నెక్స్ట్ వీకెండంట!!!

8 కామెంట్‌లు:

  1. ఇదిగోండి మీ పేరడీకి అసలు పాట.. :-)

    తూర్పూ పడమర ఎదురెదురు
    నింగి నేల ఎదురెదురు
    కలియని దిక్కులు కలవవని
    తెలిసీ ఆరాటం దేనికని
    ఈ ప్రశ్నకు బదులేది ఈ సృష్టికి మొదలేది?

    రిప్లయితొలగించండి
  2. ఒక మైకు, నలుగురు ఉపన్యాసకులు
    ఏక్ ఫూల్, చార్ మాలి,

    ఏం కబుర్లు, నానీలు! నివేదిక తుదిదాకా ఆసక్తిగా చదివించింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా తానా కబుర్లు మీకు నచ్చుతున్నందుకు సంతోషం. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు!

      తొలగించండి