పొద్దున్నే ఎనిమిదిన్నరకల్లా - బదరి నన్ను అమెరికా's సెంటర్ దగ్గర దింపి - లోపలికి వెళ్ళి ఎవరైనా వున్నారో లేదో నేను చూసి - తనకి కాల్ చేశాక వెళ్తానని - బయటే కార్లో కూర్చుని వున్నారు.
ఇంతకీ బదరి బెంగేంటంటే ...
రోజూ విడవక తిరిగే తెలిసిన దారుల -
పూబాలల, పుప్పొడుల జాడల - అడుగులు కదిపి
కాళ్ళ వెంట నడిచి - నడకల నాపు పిల్లుల - జతగా నడుస్తూ
కాలి అలికిడికి దడిచి - పరుగాపని ఉడతల - వడిగా కలుస్తూ
ఏ దారి వెళ్తున్నానో మైమరచి -
నా దారిని మరిచి -
దొరికిన దారే "గో"దారని -
ఏ దారిన పడితే ఆ దారే నా దారని
ఏదో ఒక దారిన ఇంటికి చేరడమే నాకున్న దారని
తిరిగే తన నిజదార -
నైజం తెలిసిన బదరి - అలా వెయిట్ చేయడంలో వున్న దారి - తన జవాబుదారి తప్ప మరేం కాదు :)
లోపలికి వెళ్ళగానే - అక్కడ కూర్చున్న సెక్యూరిటీ లేడీకి గుడ్‌మార్నింగ్ చెప్పి - అలా చూశానో లేదో - లోపల అప్పటికే మెరిసిపోతున్న చీరలు, రకరకాల డ్రెస్సుల్లో హడావిడిగా మెయిన్ స్టేజ్ వైపు వెళ్తున్న అమ్మలు, అమ్మాయిలు కనిపించారు.
వెంటనే ఒక అడుగు వెనక్కి వేసి - బయట కార్లోంచి లోపలికి చూస్తున్న బదరికి - "పర్వాలేదు- నేనొక్కదాన్నే కాదు - ఇంకా లోపల చాలా మంది వున్నారు - మీరు ఇంటికి వెళ్ళొచ్చు" - అని చెప్పి తను వెళ్ళగానే - లోపలి వెళ్ళాను.
లోపల అందరూ బ్రేక్‌ఫాస్ట్‌రూం వైపుగా వెళ్తున్నారు.
ఎదురుగుండా చిన్నారి దేవాంశి - వాళ్ళమ్మ అంజలి కనిపించి - హాయ్ చెప్పారు. అంతకు కొన్నిరోజుల ముందు Tae-Kwon-Do టోర్నమెంట్‌లో - నాలుగేళ్ళ బుల్లిపాప - దేవాంశి - అమెరికన్ నేషనల్ Anthem - భలే పాడింది. అదే ఇంకోసారి గుర్తు చేసుకుని - చెప్పి - అంజలికి పుత్రికోత్సాహము కలిగించాను.
అప్పుడే అంజలి చేతిలో కాఫీ చూసి - నేనూ ఒక కప్ తెచ్చుకుందామని బ్రేక్‌ఫాస్ట్‌రూం వైపు కదిలాను. కానీ అక్కడున్న క్యూ చూసి - వద్దులే - అనేసుకుని - మళ్ళీ వచ్చి ఈరోజు తానా-సాహిత్య కార్యక్రమాల్లో మొదటిదైన అష్టావధానం జరగబోయే ఫెర్రార థియేటర్ ముందున్న కుర్చీల్లో ఒక దాంట్లో కూర్చున్నాను.
ఇంతలో - మా లిటరరీ కమిటీ మెంబర్ - సుధాకర్ - ఫెర్రార థియేటర్ లోపలనుంచి బయటికి వస్తూ కనిపించారు. తనని చూడగానే - నేనూ థియేటర్ లోపలికి వెళ్ళాను.
అక్కడ అమృతరెడ్డి-సుగుణ -గార్లు కనిపించగానే - నిన్నటి రోజు పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బు-సాయం చేసిన సుగుణగారికి డబ్బులు ఇస్తూ - దాంతోపాటు అమృతరెడ్డిగారికి - భరాగో కథలు పుస్తకం ఇస్తూ - మీరిచ్చిన అప్పుకి నా వడ్డీ అండీ - అనగానే - సుగుణ గారేమో - "మీరిలా పుస్తకాలు ఇస్తారనుకుంటే అసలు డబ్బులు ఇచ్చేదాన్నే కాదు" అనీ - అమృతరెడ్డిగారేమో "మీరిలా పుస్తకాలు ఇస్తారంటే మీకు రోజూ డబ్బులు అప్పిస్తాను" అనిన్నీ - మొత్తానికి రోజులో మొదటి నవ్వులు పూయించారు. అప్పుడే అమృతరెడ్డిగారు నేనెప్పటినుంచో చదువుదామనుకుంటున్న కాళీపట్నం రామారావుగారి కథలు - పుస్తకం నా చేతికందించారు - చదివి ఇవ్వండి అంటూ.
ఆ పక్కనే కొత్తపాళీ-నారాయణస్వామిగారు కనిపించారు. ఆయన నన్ను చూడగానే - దగ్గరికి వచ్చి - "అమ్మా! నిన్న మీరు పలకరించినప్పుడు మాట్లాడలేకపోయాను. నేను మీకు తెలుసన్నారు? ఎలా తెలుసు" - అనడిగారు. "మీ బ్లాగ్ చదివేదాన్నండి - మిమ్మల్ని ఇలా కలవడం ఆనందంగా వుంది" - అని చెప్తూ - ఆయనతో పరిచయ వాక్యాలు అయ్యాక - ఏవో బ్లాగుల విశేషాలు, నిడదవోలు మాలతిగారి బ్లాగులు, అనువాదాలు, అవీ మాట్లాడుతూ ఉంటే - ఇంతలో స.వెం. రమేష్‌గారు వచ్చి - అసలు అష్టావధానం అంటే ఏంటి అనడగ్గానే - నారాయణస్వామిగారు ఆయనకి శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి అవధానం ఎలా మార్పులు చెందింది - అసలు అష్టావధానంలో ఏమేమి అంశాలు ఉంటాయి - అనే విశేషాలు ఒక ఐదారు నిముషాలు చక్కగా వివరించారు.
అది వింటూ నిల్చుని ఉన్న నన్ను - ఆ పక్కగా కూర్చుని వున్న సదా-రమ దంపతులు వారి దగ్గరికి రమ్మని పిలిచారు. వెళ్ళిన నన్ను - పేరు, ఊరు - అడిగి - "మీ తెలుగు ఎంత బావుందోనండి - అసలు మీరు ఆయనతో మాట్లాడుతూ ఉంటే భలే ముచ్చటగా అనిపించింది - పైగా మీ పేరు మాకెంతో ఇష్టమైన గాయని శ్రీలలిత పేరు. మేము మెంఫిస్‌లో ఉంటాం - మా ఊళ్ళో మంచి గుడి ఉంది. మా ఇంటికొచ్చేయండి - మీకు చూపిస్తాం. వచ్చేముందు ఒక్కసారి కాల్ చేయండి చాలు" - అని అప్పటిదాకా ముక్కు-మొహం తెలియని నన్ను అంత ఇష్టంగా పలకరించి అభిమానంగా మాట్లాడుతూ - తాము తెచ్చుకున్న పాల-టీ పాలు పంచి ఇచ్చిన - నా వాక్కు మెచ్చిన - ఆ దంపతులని చూడగానే - ఒక్క నిముషం - అవాక్కయ్యాను.
వారి పక్కనే కూర్చుని అవధానం చూద్దామని రమగారి పక్కనే కూర్చున్నాను.
ఇంతలో నారాయణస్వామిగారు వచ్చి - అమ్మ! మీరు అవధానంలో పాల్గొనగలరా ?" అనడిగారు.
"పాల్గొనడం మాట అటుంచి - నేనింతవరకు - ఒక్క అవధానం కూడా పూర్తిగా చూడలేదు" - అని చెప్పాను.
"ఫర్వాలేదు - మీరు చేయగలరు - సమస్యకి పృచ్ఛకులు కావాలి - ఇదిగో సమస్య నేనిస్తాను మీకు - ఇందులో మొదటిది యుక్తంగా ఉంటుంది - అదే ఇవ్వండి" అంటూ ఒక చిన్న కాగితం నాచేతికిచ్చారు.
అది పట్టుకుని - నా చేతిలో వున్న పుస్తకాల సంచీని - సదా-రమ-గార్ల దగ్గర వదిలి -
యమాతారాజభానసలగం
భ ర న భ భ ర వ
న జ భ జ జ జ ర
మ స జ స త త గ
స భ ర న మ య వ -
అని ఎప్పుడో పదోతరగతిలో వదిలేసిన ఛందస్సు పాఠాలు గుర్తు తెచ్చుకుంటూ - వేదిక మీదికి వెళ్ళాను.
వేదిక మీద - అష్టావధానం చేయబోతున్న నరాల రామారెడ్డిగారు, సంధానకర్త రామారాజభూషణుడు గారితో పాటు - నాతో కలిపి వేదిక మీద ఉన్న ఎనిమిది మంది పృఛ్ఛకులు ఎవరంటే:
నిషిద్ధాక్షరి: జువ్వాది రమణగారు
**సమస్య: నేను
దత్తపది: గాజులపల్లి రామచంద్రారెడ్డిగారు
వర్ణన: కుప్పా విజయశ్రీగారు
న్యస్తాక్షరి: మద్దుకూరి విజయచంద్రహాస్‌గారు
ఆశువు: బండ్ల హనుమయ్యగారు
ప్రబంధపఠనం: దిట్టకవి సుందర్‌గారు
అప్రస్తుతప్రసంగం: కొత్తపాళీ-నారాయణస్వామిగారు
[**లలిత ఉవాచ: భలే - కుదిరింది - సమస్య నేనే అవడం ;) - ఆఫీస్‌లో Harry ఆత్మీయంగా నాకు ప్రసాదించిన బిరుదు: Trouble - Lalitha! The T in your name stands for Trouble - అంటూ. దానికి కారణం ఏంటంటే - బోల్డంత మాట్లాడేసుకుని, వాదించేసుకుని - హమ్మయ్య - అన్నిరకాలుగా ఆలోచించేశాం - Let's finalize this design - అని అందరూ ఊపిరి తీసుకోబోయే సమయంలో - Oh wait! This is all good - but I see an issue...- అంటూ అప్పటివరకూ కనిపించని ఇంకేదో సమస్యని బయటికి తెస్తానని - "అబ్బా! ఇలాంటివన్నీ నీకే ఎందుకు కనబడతాయి - ఎలాగైనా - ట్రబుల్‌వే కానీ మామంచి ట్రబుల్‌వి" - అంటుంటారు నన్ను. అసలు సమస్యా పూరణంకి మొదట అనుకున్నది ఆలూరి సురేంద్ర కుమార్‌గారిని - కానీ తానొకటి తలిచిన - తానా ఒకటి తలిచిందని - సమస్యాపూరణం కాదు - అక్కడ సమస్యే అవ్వాలంటే నేను తప్ప ఇంకెవ్వరు నాకు పోటీ? :) ]
వేదికకి అటు నలుగురు, ఇటు నలుగురుగా - పృచ్ఛకుల కోసం వేసిన కుర్చీల్లో కూర్చున్నామో - లేదో - అప్పుడు గుర్తుకొచ్చింది - నా ఫోన్ పుస్తకాలసంచీలో పెట్టేశానని - కనీసం అది ఉంటే అయినా - అంతకుముందే సేవ్ చేసుకున్న నారాయణస్వామిగారి నంబరుకి టెక్స్ట్ చేసి - నా సందేహాలు తీర్చుకోగలిగేదాన్ని కదా - అని తెగ బెంగ పడిపోయాను.
ఇంతలో - ఆయనకే ఏదో అనుమానం వచ్చినట్టుంది - నా దగ్గరికి వచ్చి - వరుసలు జూడగా మధురవాణి గిరీశము కూతురౌ గదా - అన్న చంపకమాల పద్య-పాదంలో అన్ని జ-గణాలూ సరిగ్గా ఉన్నాయో లేదో చూసి - అన్నీ సరిగ్గానే వున్నాయి అని చెప్పి వెళ్ళారు.
నేను కూడా - మనసులో లెక్కలేసేసుకుని - పోన్లే! అన్ని గణాలూ బానే వున్నాయి - ఏదో ఈ ఒక్క లైనూ చెప్పేస్తే నా అవధాన-అవస్థ తీరిపోతుంది అనుకున్నాను.
ఇంతలో నా పక్కన కూర్చున్న జువ్వాది రమణగారు - నా దగ్గరున్న సమస్య చూసి - "అవధానిగారు ఇదెలా పూర్తి చేస్తారో చూడాలి. ఒకవేళ ఆయన చెప్పలేకపోతే మీరు పూరించాల్సి ఉంటుంది" అన్నారు.
అంతే ! ఆ మాటతో నరాల రామారెడ్డిగారి అష్టావధానం - నా పాలిట కష్టావధానం కాబోతోందని అర్థమైపోయింది నాకు.
చేసేదేముంది - కష్టమో, క్లిష్టమో - మొట్టమొదటి అష్టావధానం - పార్టిసిపేటేద్దాం - అనేసుకునేశాను.
వేదిక మీద అందరి పృచ్ఛకుల పరిచయాలు మొదలయ్యాయి.
నా వంతు వచ్చేసరికి - "నా పేరు లలిత - తెలుగు ఇష్టం - తెలుగులో పుస్తకాలు చదువుతాను - అంతకన్నా చెప్పుకోవడానికి ఏం లేదు"- లాంటి మాటలేవో చెప్పి ఊరుకున్నాను.
ఒక మాట: మిగిలిన తానా-పోస్టులకి , ఈ అవధానం పోస్టులకి ఒక తేడా వుంది. మిగిలినవన్నీ - విన్నవి గుర్తు పెట్టుకుని రాస్తే - ఈ అవధానం పోస్టులు మాత్రం మా సాహిత్య కమిటీ సభ్యులు - కూచి శాస్త్రిగారు - రికార్డ్ చేసిన వీడియో ఆడియోని చెవిలో-ఇయర్‌బడ్స్ పెట్టుకుని రాశాను.
వీడియో ఇలా మొదలవుతుంది (వీడియో యూట్యూబ్ లింక్ ఈ అవధానం పోస్టుల చివర ఇస్తాను - ఓపిక పట్టండి ప్లీజ్!)
అందరికన్నా చివరిగా వచ్చిన మద్దుకూరి విజయచంద్రహాస్‌గారు తన ఆలస్యానికి క్షమాపణలు చెప్తుండగా వీడియో మొదలవుతుంది.
చంద్రహాస్‌గారికి ఇది మూడో అవధానం - ఇంతకుముందు మేడసాని మోహన్‌గారు, గరికిపాటి నరసింహారావుగారు చేసిన అవధానంలో పాల్గొన్నారట.
సంధానకర్త రామరాజభూషణుడుగారు అప్పటికే కాలాతీతమయింది - మరింత జాగు చేయకుండా కార్యక్రమం మొదలుపెడదామని చెప్పి - అవధానిగారిని సభకి పరిచయం చేశారు:
శ్రీ నరాల రామారెడ్డిగారు ప్రొద్దుటూరు వాస్తవ్యులు. పదహారో ఏటనుంచి అవధానం మొదలుపెట్టారు. వెయ్యికి పైగా అవధానాలు దేశ విదేశాల్లో దిగ్విజయంగా సాధించారు. వారు చేసిన రచనలు - గాథాత్రిశతి, కర్ణభారతం, అవధానకవిత మొదలైనవి. మీ మనసుల్ని తుమ్మెదల్లాగా ఈ కవితా ధారని గ్రోలడానికి విహరింపజేయండి - అంటూ శ్రీ నరాల రామారెడ్డిగారిని అవధానం ప్రారంభించమని కోరారు.
నరాల రామారెడ్డిగారి ఉపోద్ఘాతం:
నలభై వసంతాలు పూర్తిచేసుకుని ఇరవై ఒకటవ మహాసభగా రూపుదిద్దుకున్న ఈ తానా మహాసభలకు ఆత్మీయంగా, ఆప్యాయంగా ఆహ్వానించిన తానా అధ్యక్షులు శ్రీ జంపాల చౌదరిగారికి, కన్వీనరుగారికి, కార్యవర్గసభ్యులకు అందరికీ నా హార్దికాభినందనలు. 1992లో మొదటిసారిగా ఆటా ఆహ్వానం మీద న్యూయార్క్ నగరంలో అష్టావధానం చేశాను. ఆ తర్వాత ఆటా వారు పిలవగా మూడుసార్లు, నాట్స్ వారు పిలవగా మూడుసార్లు గత 20, 25 సంవత్సరాలుగా అమెరికా వచ్చి అవధానం, అవధానం మీద ఉపన్యాసాలు చేశాను. ఈ 21వ తానా మహాసభలకు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
అవధానానికి ముందుఉపోద్ఘాతంగా నాలుగైదు పద్యాలు చెప్పడం సంప్రదాయం. దానికి కారణం - సాహిత్యవాతావరణంలోకి ప్రేక్షకులని తీసుకుపోవడం. అందుకని సంక్షిప్తంగా నా అవధానం గురించి నాలుగైదు విషయాలు చెప్తాను.
కవితా ఆవాహనం:
ఒక తరుణ తరంగం సంచలిస్తే
ఒక కిరణ కురంగం సంచరిస్తే
ఒక వనవల్లిక పల్లవిస్తే
ఒక నవచంద్రిక పల్కరిస్తే
ఒక ప్రశాంత కాసారజలం కదలివస్తే
ఒక నిశాంత నీహారకణం నిలిచి చూస్తే
ఒక రాగమాలిక రవళిస్తే
ఒక మేఘబాలిక దిగివస్తే
అదే అదే నా కవితారూపం
అదే అదే నా హృదయ దీపం
అదే అదే నా విజయచాపం
తెలుగు భాషలో ఉండే అందమైన పదాలను పరిచయం చేయడం కోసం ఛందస్సులేని ఒక చిన్న వచన కవితలాగా చెప్పాను.
అవధానమన్నప్పుడు పద్యకవితలోనే సాగుతుంది. ఇప్పుడు పద్యం లోకి ప్రవేశిస్తాను.
ఏ తల్లి వర్ణింప కవీంద్రుల కలములు కదలివచ్చు
ఏ తల్లి కీర్తి గానింప గాయక కంఠముల రాగములు దేలి పొరలిపోవు
ఏ తల్లి రూపు చిత్రింపగ చిత్రకారుల చేతికుంచెలు తలలనూచు
ఏ తల్లి మూర్తి నిర్మింప శిల్పుల చీని ఉలులెల్ల నిలువెల్ల జలదరించు
ఆమె ... పారిజాత మనోజ్ఞ భూవిజాతజాత సుజాత ప్రపూత నేత్ర
భారతీ దేవి! జ్ఞాన పుష్పష్పాలతావి!
నాట్యమాడును గాక నా నాల్కపైన!
ఉపోద్ఘాతం ఇలా చెప్పిన సభలో ఈ "నాట్యమాడును గాక నా నాల్కపైన " అన్నమాట విన్న తర్వాత ఓ పృచ్ఛకుడు వర్ణనలో అడిగాడు - ఎక్కడో బ్రహ్మలోకంలో బ్రహ్మ సన్నిధానంలో ఉన్న సరస్వతిని మీరు ఆహ్వానించి మీ నాలుక మీద నిలుపుకున్నారు. సరస్వతి ఇప్పుడు మీ నాలుక మీద వుంది కదా ! మీరు బ్రహ్మదేవునికి సరస్వతీవియోగం కలిగించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఓ పద్యం చెప్పండి - అన్నాడు.
అప్పుడు ఓ ప్రార్థనగా - క్షమాపణ చెప్తూ - ప్రాయశ్చిత్తంగా చెప్పిన పద్యం
జననీ! నాథుని నాలుగు వక్త్రములలో సంచారమున్ జేసి
జీవనమాధుర్యము గ్రోలు నిన్నిచటి కాహ్వానించి
నీ ప్రాణనాథునకున్ నీకెడబాటు చేసితిని
నా దోషమ్ము మన్నించి మోహనభావములు కల్గు పద్యములు నాకందించవె భారతీ!
- అని పూజాపుష్పమును సమర్పించి అవధానమును ప్రారంభించాను.
నాట్యమాడునుగాక నా నాల్కపైన
ప్రత్యూష పవనాంకురములు సోకినయంత రింగున యెగురు తరంగమట్లు
శ్యామల శాద్వల సార కేదారాల చెంగున ఎగురు కురంగమట్లు
పూల మొక్కలవంటి పాలరెక్కలు సాచి హాల్లీసకించు విహంగమట్లు
తోకచుక్క విధాన తోయదాంగన వీధి తారాడి ఆడు పతంగమట్లు
ఒక తరంగమట్లు - ఒక కురంగమట్లు - ఒక విహంగమట్లు - ఒక పతంగమట్లు
కల్పతరుపుష్పకల్పిత తల్పమసృణకల్పనాకల్పశిల్పసంకల్పగరిమ
( కొత్తపాళీ - నారాయణస్వామిగారి - బలె!బలె! - ఇక్కడ భలేగా వినిపిస్తుంది )
ఈ మొత్తం సమాసానికి కవిత్వం మెత్తగా ఉండాలని - అంతే - మృదులంగా ఉండాలి - మధురంగా ఉండాలి
కల్పతరు పుష్ప కల్పిత తల్పమసృణ కల్పనాకల్ప శిల్ప సంకల్ప గరిమ
పలుకు పలుకున తేనెలు చిలుకరించి
కదలి వచ్చునుగాక నా కవనకన్య
నా కవనమ్ములో నిలుచు
నాకవనమ్మున పూయు
నా కవనం - నాక వనం (కొత్తపాళీ - నారాయణస్వామిగారి - బలె!బలె! - ఇంకోసారి)
[లలిత ఉవాచ: ఇక్కడ నాకు వేటూరిగారి ఎన్నో పాటలు గురుకొచ్చాయి - ముఖ్యంగా - కురుక్షేత్రం సినిమాలో - సాలూరి రాజేశ్వరరావుగారి సంగీతంలో వచ్చిన - మ్రోగింది కళ్యాణ వీణా - అనే పాటలో కల వరించి, కలవరించి పులకిత తనులత నిను చేరుకోగా అన్న వాక్యం]
కల్పకాలోక పుష్పగుచ్ఛముల నూత్న సుగంధము
దివ్య వాహినీ శీకర సిక్త రక్త సరసీజ మరందము
ఆమ్ర శాఖికా కోకిల గానమున్ నవ యువ చకోర మయూర విలాస నాట్యముల్
నాకవనమ్ములో నిలుచు
నాలో పూచిన పూల భావనలు - పెన్నా వాహినీ ...
ఇప్పుడు మా పెన్నలో నీళ్ళు లేవు కాబట్టి - దురదృష్టం - పెన్న ఎండిపోయింది - మా కడుపు మండిపోయింది - పెన్నేటి పాట - విద్వాన్ విశ్వం గారిది - మీ అందరికీ తెలుసు - నీళ్ళున్న గంగ చెప్పుకుందాం -
నాలో పూచిన పూల భావనలు
గంగా వాహినీ మోహినీ లీలా ఖేల భయత్పతంగములు
నారీ స్నిగ్ధ గండస్థలీ క్రీలావణ్య వయత్పురంగములు
మల్లీ వల్లికా హేలా షట్పద రాగ భృంగములో నర్తించున్ సభా వేదికల్
సాహిత్యామృత దివ్య నిర్ఝరుల్లో స్నానంబు గావించి
జ్యోత్స్నాహాసమ్ముల పూర్ణిమా నిశలలో సౌందర్యమున్ జూచి
కాంతా హల్లీసక రాగ భంగిమలలో తారుణ్యమున్ జూచి
నా ఊహా కీరము సాగు గావుత వసంతోద్యాన వీధీస్థలి
ఇప్పటికే ఉపోద్ఘాతం మరీ ఎక్కువ కాకుండా - పృచ్ఛకుల గురించి, పండితులను గురించి సభలో అందరికీ ఒక నివాళి అర్పించి - మళ్ళీ అవధానంలోకి ప్రవేశిద్దాం.
ప్రతిభావంతులు సాహితీ గగన భాస్వంతుల్
సుధావాహినీ ప్రతిభస్వాంతుల్ నిష్కళంక కరుణా స్వచ్ఛ స్రవంతుల్
వినిర్జిత దిగ్దంతులు సత్కవిత్వ రచనా చింతుల్
సభావేదికాగత ధీమంతులు -పండితోత్తములకు కైమోడ్పు కైసేసెదన్
సరే - ఈ సంక్షిప్తమైన ఉపోద్ఘాతము తరువాత - అధ్యక్షులు రామరాజభూషణుడుగారని చెప్పారు - ఆరోజు రామారాయల సభకు భూషణంగా ఉన్నవాడు భట్టుమూర్తి రామరాజభూషణుడు - ఈరోజు రామారెడ్డి అవధానసభకు భూషణంగా కూర్చున్నవాడు ఈ రామరాజభూషణుడు.
వారు చెప్పినట్లుగా నేను 1965వ సంవత్సరంలో తిరుపతిలో ప్రాచ్య కళాశాలలో విద్వాన్ చదివేటప్పుడే అవధానం చేయడం ప్రారంభించాను. కొన్ని వందల అవధానాలు చేయడం మీ అందరికీ తెలుసు. ఎన్నో విభిన్నమైనటువంటి రకరకాల అంశాల్లో మమ్మల్ని పరీక్ష చేశారు - చాలా బాధలు పెట్టారు. ఇబ్బందులు పెట్టారు.
అయితే ఎన్ని ఇబ్బందులు పెట్టినా - ఆ సమస్య లేక దత్తపది - అవి రెండూ చమత్కారానికి ప్రతీకలు.
న్యస్తాక్షరి, నిషిద్ధాక్షరి పాండిత్య పరీక్ష చేస్తాయి. వర్ణన, ఆశువు - కవితా పరీక్ష.
అప్రస్తుతప్రసంగము, తరవాత గంటలుంటే గంటలు - లేకపోతే ప్రబంధ పఠనం - ఏకాగ్రతకు పరీక్ష.
ఇలాగ రకరకాల పరీక్షల్లో - రకరకాల పృచ్ఛకులను మేము ఎదుర్కొంటుంటాము.
పృచ్ఛకులు సమస్య కానీ దత్తపది కానీ ఇచ్చేటప్పుడు విరుద్ధార్థం బాగా స్పష్టంగా ఉండాలి . అప్పుడే సమస్యాపూరణం కూడా అందంగా ఉంటుంది.
అలాగే దత్తపదులు కూడా ఆ భావాలకు ఒదిగేటట్లుగా పదాలు ఇవ్వాలి.
కొంతమంది ఏదో నాలుగు పదాలు ఇవ్వొచ్చు కదా అని - నోటికొచ్చిన నాలుగు ఊళ్ళ పేర్లో - నాలుగు వస్తువుల పేర్లో ఇచ్చి చెప్పమంటారు.
అవి ఒదుగుతాయా లేదా అన్నది విచారణ చేయరు.
కొందరిస్తారు - సమస్య - ఇప్పుడే సరస్వతీచతుర్ముఖులకు వియోగం అన్నాను కదా - ఆ పద్యం ఒకటి చెబుతాను.
ముక్కంటి నలువ చెలువకు ముద్దులు పెట్టెన్
ముక్కంటి - ఈశ్వరుడు - నలువ చెలువ - సరస్వతికి ముద్దులు పెట్టెన్ - ఇది విరుద్ధార్థం - ఇది పూరణ చేయమన్నారు.
బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడు. మనం కంప్యూటర్లో మునిగిపోయినట్లుగా ఆయన కూడా సృష్టిలో మునిగిపోయాడు. పాపం - సరస్వతీదేవికి ఏవిధమైన ఎంజాయ్మెంట్ లేదు. ఓ షాపింగ్ గానీ, ఓ సినిమాకు పోవడం గానీ - దేనికీ లేదు. ఆమెకు చాలా కోపమొచ్చింది.
ఇలా అంటున్నది:
ఎక్కడి సృష్టిది నాపై
మక్కువ చూపవని వాణి మౌనము పూనన్ ...మూతి ముడుచుకుని అలిగింది
చెక్కిలి నిమురుచూ చిలిపిగ
ముక్కంటి (ముక్కు అంటి ) నలువ (బ్రహ్మ) ... చెలువకు ముద్దులు పెట్టెన్.
అక్కడ ముక్కంటి అనేచోట విరుపులో మెరుపు పుట్టించడమే సమస్యాపూరణం.
ఆ సమస్యలో క్లూ దాచిపెట్టాలి పృచ్ఛకుడు.
ఒక్కొక్కసారి ఏమీ ఉండదు - వేగ్గా (vague గా) ఉంటుంది - మనం దాన్నిఒక సన్నివేశం కల్పించుకుని చెప్పాల్సి వస్తుంది.
అలా చిన్న చిన్న సమస్యలు చెప్పాం - చాలా కష్టమైన సమస్యలూ పూర్తిచేశాం.
ఈ తానా తెలుగుపలుకులో కూడా అవధానంలో సమయస్ఫూర్తి అనే వ్యాసంలో కొన్ని సమస్యలు, దత్తపదులు ఇచ్చాను.
ఆ క్లూ కనుక్కోవడమే చాలా కష్టమన్నమాట.
ఓసారి ఓ సమస్య - కులటం గూడి వసించె రాఘవుడహో కూర్ముల్ పిసాలింపగన్
శ్రీరామచంద్రుడు ఏకపత్నీవ్రతుడు - అంటువంటి మహానుభావుడు - ఒక కులటను గూడి - వేశ్యను కూడి హాయిగా కోర్కెలు తీర్చుకుని ఆనందిస్తున్నాడని సమస్య.
చాలా విరుద్ధార్థం కదూ! దాన్ని పూరణ చేయమన్నారు.
అక్కడ ఎక్కడ విరుపులో మెరుపు పుట్టించాలా అని ఆలోచించా.
సరే! రామలక్ష్మణులు అరణ్యవాసం వెళ్ళారు - సీతతో పాటు. నదీతీరంలో పర్ణశాల కట్టుకున్నారు - అప్పుడు సందర్భం ఒకటి ఇస్తున్నా -
కలతన్ జెందక తండ్రి మాట నిలుపన్ కష్టంబునన్ సైచి కా
నల లోలన్ పదునాలుగేండ్లు గడపన్ సౌమిత్రితో సీతతో
చెలువొప్పారగ పర్ణశాల రచియించెన్ హాయిగూర్పన్ కొలం
గులటం గూడి వసించె రాఘవుడహో కూర్ముల్ పిసాలింపగన్
(హాయి కూర్పన్ - కొలంకులు అటన్ - కొలనులు కొలంకులు అవుతుంది - అంటే లేక్ వ్యూ అన్నమాట).
అలాగే దత్తపదులు ఇచ్చేటప్పుడు కూడా - ఎన్నోరకాల దత్తపదులు చేశాను.
ఇటీవలనే - మే 13వ తేదీ అనుకుంటా - ఆంధ్రజ్యోతిలో వనం జ్వాలానరసింహారావుగారు ఒక వ్యాసం రాశారు - తెలంగాణలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న సందర్భంలో కెసిఆర్ ఆదేశాన్ననుసరించి చేస్తున్నామని ఒక వ్యాసం రాశారు.
(ఆ వ్యాసం ఇక్కడ చదువుకోవచ్చు: http://www.andhrajyothy.com/artical?SID=410742)
అందులో 1975 ప్రాంతం నుంచి జరిగిన మహాసభల గురించి అనేక విషయాలు చెప్పుతూ - ప్రత్యేకంగా చెప్పవలసినది ఒకటున్నది - ఎగ్జిబిషన్ గ్రౌండులో పట్టుమని పాతికేళ్ళు నిండని నరాల రామారెడ్డి అవధానం చూశాను - అప్పుడో పృచ్ఛకుడు నాలుగు పదాలిచ్చాడు. ఆ నాలుగు పదాలు - బీరు, బ్రాందీ, విస్కీ, రమ్. ఈ నాలుగు పదాలు తీసుకుని - మధువుల పేర్లు - వధువు మీద - ఒక అందమైన అమ్మాయి మీద పద్యం చెప్పమన్నాడు.
అప్పుడు నాకు గుర్తున్న పద్యం అంటూ జ్యోతిలో ఆ పద్యాన్ని ఉదాహరించారు.
ఆ పద్యం ఏంటంటే...
అతివా! గుండెల బీరువా తెరచి నీకర్పించు కుంటిన్ గదా!
అతుల ప్రేమ మనోజ్ఞ రత్నమట న భ్రాంధీ కృత శ్యామలా
న్విత మౌ నీ కచ సీమ వెల్గు హృదయా విష్కీర్ణ సౌందర్యమై
రతివో రంభవొ రాధికా రమణివో రావే జగజ్జిన్నుతిన్
(నా గుండెల బీరువా తెరచి ప్రేమ అనే మనోజ్ఞ రత్నం - అంటే డైమండ్ నీకర్పించుకున్నాను - అదెక్కడవెలుగు? నీ అభ్ర+అంధీకృత - అంటే నీలిమేఘాల్లాగ చీకటైపోయిన - అంటే కురులు అంత నల్లగా వున్నాయి - అభ్రాంధీ కృత శ్యామలా న్విత మౌ నీ కచ సీమ వెల్గు - అంటే శిరోమణిలాగా వెలుగు.
హృదయా విష్కీర్ణ - హృదయ + ఆవిష్కీర్ణ - ఆవిష్కృత వుంది కానీ - ఆవిష్కీర్ణ కల్పించాం - విస్కీ కోసం
రంభవొ - రం ; జగజ్జిన్నుతిన్ - జిన్ను కూడా కలిపాం)
నే ఇలా చెప్తే - ఆ పృచ్ఛకుడన్నాడు - ఏమండీ - నేను బ్రాందీ అని ఇస్తే - మీరు బ్రాంధీ అని ఒత్తి చెప్తున్నారు - ఏంటి - అని.
అప్పుడు నేనన్నాను - సెకండ్ రౌండు కదండీ కొంచెం కిక్కెక్కింది - అని.
ఇలా పద్యం చాలా అందంగావచ్చింది.
ఇలాగే ఇంగ్లీషు పదాలిస్తారు - తెలుగు పదాలిస్తారు - రకరకాల పదాలిస్తారు. టీవీల పేర్లిస్తారు - సినిమా యాక్టర్ల పేర్లిస్తారు - ఎన్నో వెరైటీస్ వున్నాయి .
అవన్నీ చెప్పడం సాధ్యం కాదు కానీ - జగ్గయ్య గారి అధ్యక్షతన 1975లో తిరుత్తణిలో అవధానం చేసినప్పుడు - నాకు నచ్చిన దత్తపది ఇంగ్లీషు పదాలిచ్చారు - రాకెట్లు, జాకెట్లు, పాకెట్లు, లాకెట్లు.
ఇవి శార్దూలంలో నాలుగు పాదాల్లో మొదటొచ్చేటట్లుగా అందమైన అమ్మాయిని వర్ణించమన్నారు.
అమ్మాయి రాకెట్లా ఉందని, జాకెట్టు అందమైందని చెప్పకూడదు. ఆ పదాలకి ఆ అర్థాలుండకూడదు.
అప్పుడు నేను చెప్పిన పద్యం - మళ్ళీ అమ్మాయిని ఊహించుకుంటూ భావకవిత ...
రాకెట్లుండునో నీదు రాక వలన్ రాకా శరద్రాత్రి రో
జాకెట్లుండును నీకపోల సుషమా సౌందర్య సౌరభ్యముల్
పాకెట్లున్ననూ పూలమేడ అగు నీ పాదాలు పారాడ రే
లాకెట్లుండును కోమలాంగి! ప్రణయాహ్లాదంబు పండింపవే
(పాకెట్లుండును - పూరి పాక ఎలా వున్ననూ
రోజా కెట్లుండును - గులాబీ పువ్వుకెలా ఉంటుంది - నీ చెక్కిళ్ళ సౌందర్యం
రేలాకెట్లుండును - రేలు + ఆకెట్లుండును - రేయికి అడ్డం ఎట్లుండును)
ఒక్కోసారి చాలా కష్టమైన పదాలిస్తారు. బళ్లారిలో అవధానం చేస్తున్నపుడు - ఓ దత్తపది ఇచ్చారు- చికెన్, మటన్, పోర్క్, బీఫ్ - వీటితో విశ్వామిత్ర తపోభంగం వర్ణించమని.
విశాఖపట్నంలో ఒక మితృడిచ్చాడు 1985లో - వూరబంది, కోడిపెట్ట, జెల్లచేప, కప్ప - ఇన్ నాలుగు మాటలతో బ్రాహ్మణుల పెళ్ళి భోజనాన్ని వర్ణించమని.
ఊర బందిరి వేసి నోరూరునట్లు
వేడి వేడిగ మంచి పకోడి పెట్ట
ఇంపు నింపు పాయసం మోజెల్ల చేప
చెప్పలేని రుచులు మా కప్పగించె
అంతకుముందు నెల్లూరులో రామారావుగారు విశ్వామిత్ర తీస్తుండగా - క్రౌన్, ఒనీడ, వీడియోకాన్, బుష్ - టీవీల పేర్లతో ఒక పద్యం చెప్పా :
ఔరా! మేనక వక్ర మార్గమున శక్రౌన్నత్యమున్ గోరి
స్వర్గ వనీడాంబికశోభ దేహమున పొంగన్ నాట్యమున్ జేసె
పల్లవచిత్తుండై భ్రాంతి చెందె తపమెల్లన్ వీడి యో కాంతా
నా సమిధన్ బుష్కళ సౌఖ్యమిమ్మనుచు విశ్వామిత్రుడర్థించెన్
అదో పధ్ధతి. కానీ చికెన్, మటన్, పోర్క్, బీఫ్ - పదాలతో కష్టం - వాటిని తెలుగు, సంస్కృత పదాలుగా మలచుకోవాలి. దానికిలా చెప్పాను:
రతి రాగమ్ములు వీచికెందలుకులూరన్ నేత్ర పోణంబులన్
వ్రత భంగమ్ము నేమటంచు ప్రణయ వ్యామోహ లీలాత్ముడై
కుతుకంబొప్పఁగా గాది సూనుడు తపోర్కుండౌరా చిత్తంబునన్
ధృతి క్షీణింపగా ధారపోసె తపంబీ ఫుల్ల పద్మాక్షికి
ఇలా ఎన్నో దత్తపదులు - చెరకును గానుగలో వేసి తిప్పినట్లుగా - అందమైన పద్యాలను రాబట్టారు.
ఇవీ నా అవధాన ప్రస్థానంలో కొన్ని అంశాలు.
తానాలో మొట్టమొదటి అవధానం చేస్తున్నాను కాబట్టి తానా సభ్యుల కోసం నాలుగు పద్యాలిప్పుడు జ్ఞాపకం చేశాను.
ఇప్పుడు అవధాన రంగంలో ప్రవేశించుదాం.
---------------------------------------------------------------------------------------------------------------------
మరొక్కమాట:
ఎక్కడైనా పై పద్యాల్లో - గణ, యతి, పాద, ప్రాస, అక్షర, శబ్ద - సంబంధిత తప్పులుంటే - అవి నా తెలుగు-తక్కువ-తనం, వినికిడి-దోషమే కానీ మరేమీ కాదు - మన్నించేయండి.
అసలెప్పుడూ అష్టావధానం పూర్తిగా చూసి వుండని నేను - నేను చూసిన, పాల్గొన్న మొట్టమొదటి అవధానాన్ని - ఒక యూట్యూబ్ లింక్ పెట్టేసి వదిలేయడానికి మనసొప్పక - ఉన్నది ఉన్నట్లుగా, కన్నది కన్నట్లుగా, విన్నది విన్నట్లుగా - అక్కడక్కడ - వీడియోకి సౌలభ్యమైనా - రాతకి అనువుగాని పునరుక్తి లేకుండా - ఇక్కడ రాయడానికి ప్రయత్నిస్తున్నాను.
అసలు అవధానము తదుపరి పోస్టులో...
చక్కగా 'భద్రాచలం' కల్యాణం లాగ చూసినది చూసినట్లు, విన్నది విన్నట్లు, జరిగినది జరిగినట్లు వ్రాయడం విశేషం. కనులారా కాంచిన, వీనులారా విన్న అనుభూతి కలిగింది.మీ ప్రయత్నము ప్రశంసనీయము. ధన్యవాదములు.
రిప్లయితొలగించండిశ్రీనివాస్గారు: మీ ప్రశంసకి ధన్యవాదాలు. త్వరలోనే తరువాయి భాగం కూడా ప్రచురిస్తాను.
తొలగించండిI studied Telugu as part of IASc in 52-54. I could not understand more than 50% of what AVADHANI garu said. I cannot understand how you guys mostly techies and doctors understood and also appreciated it. First,kudos to all of you. Of course, Avadhani garu must have been superb to merit the admiration of all of you. SUPER!.
రిప్లయితొలగించండిSir! Thank You for your appreciation. It was indeed a great honor for me to be part of Ashtaavadhaanam team. It was once-in-a-lifetime experience for me. I thoroughly enjoyed each and every word that was spoken. I am glad you found it so interesting.
తొలగించండి