8, డిసెంబర్ 2024, ఆదివారం

ఓ పుష్పోత్తరం - టు పుష్ప-2 డైరెక్టర్ ఫ్రమ్ పుష్ప-వాచర్...






పుష్ప-2 డైరెక్టర్‌కి,

    శానా శానా పుష్పాభినందనలతో ఓ పుష్ప-వాచర్ రాస్తున్న ఓ పుష్పోత్తరం (దుషట సమాసంలా అనిపిస్తే - ఈ తూరికి మన్నించేయప్పా, సుక్కప్పా!). 

    పుష్ప చుట్టూ వుండేవోళ్లంతా వాళ్లవాళ్లోళ్ల పేర్లతో, ఇంటిపేర్లతో గాకుండా పుష్ప-అమ్మ, పుష్ప-అన్న, పుష్ప-మేనేజరు, పుష్ప-డ్రయివరు అంటా పేమస్సు అయిపోయుండారుగా...అందికే పుష్ప-సిన్మా తీసినోడు పుష్ప-డైరెక్టరు, పుష్ప సిన్మా చూసుండిన నేను పుష్ప-వాచరు గాక ఇంకేమిటి అయ్యుండేది? అదీ పుష్ప-లెక్క!

    సుక్కప్పా! బలేనప్పా! సిన్మా మొదలవుతూనే బలే క్యామెడీ చూపిచ్చినావే. 

    అదెట్లెట్లా! 

    జపాన్లో గూడా విలన్లు మన దగ్గరి మాదిరే నెత్తి మీద జులపాల జుట్లేస్కుని, ఒంటి మీద సూట్లేస్కుని - ఫైటింగనేటప్పటికి కత్తులూ, గొడ్డళ్లేసుకొస్తారా? పైగా అందరూ ఒక్క తూరి మీద బడి తన్నక ఒక్కోళ్ళే వరసలో బోయి పుష్పతో  తన్నిచ్చుకున్నారు గదా!

    పుష్ప అనుకుంటే ప్యానిండియా అనుకుంటి గానీ జపానిండియా అనుకోనేలేదబ్బా! 

    మన పుష్పా నలఫైరెండ్రోజులు గాలీ, ఎలుతురూ రాకుండా నాలుగు పక్కలా మూసేసిన కంటెయినర్లో 30 రోజుల్లో జపాన భాష పుస్తకం సదివినాడంటే ఆడెట్టాంటి మనిషబ్బా! వాళ్ళావిడ శ్రీవల్లి జెప్పినట్టు బగమంతుడెట్టా?! ల్యాపోతే ఆ కంటెయినర్లో ఆ ఎఱ్ఱచందనం దుంగల మద్దెన పరుపేసి, పక్కేసి , ఏసీ గూడా పెట్టించావా ఏంది పుష్ప వస్తుండాడని? 

    అవునూ....పుష్పరాజుని జపాన్లో సముద్రంలో ముంచావు. అక్కణ్ణుంచి ఊరికి సీను తిప్పిచ్చి  పిల్ల-పుష్పరాజ్ నీళ్ళల్లో మునిగిన మాదిరి చూపించావ్. ఆమిటికి  మళ్ళీ పెద్దోణ్ణి చేసి పీడకలేదో కన్నట్టు నిద్ర లోంచి లేపిచ్చినావ్. ఇంతకీ  ఆ జపాన్ ఫైటు కలంటావా? కలపలేక మర్సిపోయిన కతంటావా? 

    మూడు గంటల పైగా తీస్తే తీశావ్ గానీ సినిమా అంత బాగుండనట్టు అనిపిచ్చకుండుండె.  ఎట్టనిపిచ్చిద్దిలేబ్బా! సిన్మా మొదలైన పద్నిమిషాలకే తల పంజేయడం ఆగిపోయుండుండ్లా? ఇంక ఎంత సేపు చూసుండామో లెక్కపత్రం తెలిసేదెట్టా? నోరెళ్ళబెట్టుకుని చూస్చానే వుండిపోయా. 

    ఆ పుష్ప నోటెంబడి మాట సరింగా ఇనిపిస్తే గదా... దాంతోడు నాటకాల్లో హార్మనీ పెట్టె తొక్కిన మాదిరి ఒకటే కుయ్యి-కుయ్యి BGM సాగతానే వుండే సిన్మా పొడుగూకి. 

    పుష్పకి ఎదురే ల్యాకుండా ఏకపాత్రాభినయమనిపిచ్చింది. విలను షెకావత్తు వేషమేసిన ఫహాదుతో క్యామెడీ చేపిచ్చి అంతటి విలన్నూ నవ్వులపాలు జేపిచ్చినావే!

    సుక్కప్పా! హీరోయిన్ల మీద పూలూ, పళ్ళూ ఏపిచ్చిన రాఘవేందర్రావుని నువ్వు మించిపోయుండావబ్బా... పుష్ప బొడ్డు మీద పచ్చిమిరపకాయేసి. 

    పుష్ప-1 లో ఒక పాటలో ఆడిచ్చిన సమంతాని పుష్ప-2 రష్మికాలో పాటపాటకీ గుర్తు చేపిచ్చినావే! ఒగ టికెట్టుకి మూడు సిన్మాలన్నట్టు. 

    జాతర్లో కాంతారాని దించినట్టనిపిచ్చింది. 

     పుష్పరాజ్ కాళ్ళూ-చేతులూ కట్టిపిచ్చినా ఎగిరెగిరి విలన్లందరినీ కరిచి, కరిచి మరీ చంపె కదప్పా! స్పైడర్-మ్యాను దారాలేసుకుని గోడలెక్కగా లేంది మన వైల్ద్-ఫైర్ మ్యాన్ పుష్ప ఆ మాత్రం జేయకూడదా అంటావా.

    నాకైతే సిన్మా ఏదో చుట్టేసినట్టనిపిచ్చిందిలేబ్బా! 

    ముందు చూపించిన జపాన్కి, చివరాఖర్లో చూపించిన శ్రీలంకకి లింకు చూపిచ్చలేక పుష్పాల్లో బాంబు పెట్టి పేలిపిచ్చి పుష్ప-3 వున్నట్టు చూపిచ్చినావు. 

    ఇంకో మూడేళ్లకి అయిడియాలు దండిగ రావా ఏంది? ఇప్పటికి చూసిందంతా మర్చిపోయి మేమంతా ఇంకో తడవ పుష్ప-3 చూసేదానికి ఎగబడమా ఏంది? నీ బుద్ధి సూక్ష్మమబ్బా! 

    ఎట్లైనా మాష్టార్వి గదా - పిలకాయలకి ముందు చదివిన సిలబస్సు మతికుండేదేల్యా అని నీకు తెల్సిపాయె. 

    ఇంకో తూరి "పార్టీ వుండాది, పుష్పా" అనుకుంటా నువ్వొచ్చేదీ, మందికి పుష్ప-3, 4, 5, 6, 7....అనుకుంటా హారీపాటర్ సిరీసు మాదిరి  పుష్పాలు పంచిపెట్టిచ్చేదీ ఖాయమనిపిస్చాందప్పా! 

ఇంకో పుష్పాకి ఎదురు చూస్చా ఇంకుంటా మరి,
పుష్ప-వాచర్



17 కామెంట్‌లు:

  1. అకట ! ' రామాయణంలో పిడకల వేట '
    యనగ వింటి , నేదియొ తెలియదు , కనంగ
    నయ్యె నేడు , నడుమ ' పుష్ప ' నగవు గొల్పె ,
    విబుధ ! రామాయణ కథను వీడ వలదు .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నమోనమః, మాష్టారూ! రామాయణం ప్రతి శనివారం క్రమం తప్పదు - మధ్యమధ్యలో ఇలాంటి పిడకలవేటలు ఎన్ని వున్నా :)

      తొలగించండి
  2. 😀. చానా చక్కా బ్లాగినారప్పా!
    - పుష్ప ఇంటర్నేషనల్ వాచర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరూ ఇంకా చానా చక్కగా చదివి పొగిడినారప్పా! థాంక్సు మరి!

      తొలగించండి
  3. -
    సామి అని బిల్చు పెండ్లా
    మేమొ! కిసుక్కని బిలుచుసుమీ మరొకతెయున్
    ప్రేముడి కై తపియించు త
    నేమొ! వయిల్డు ఫయరాతడేనోయ్ పుష్పా!





    ‌నలభై రోజులతను ట్రా
    వెలు జేయును కంటయినరు పెంజీకటిలోన్
    అలుపన్నది తెలియదు త
    న్నులు తినెదరు విలనులెల్ల నూత్నపు రీతు

    దుంగల స్మగ్లర్ల కతలు
    పొంగెడు ఫీలింగ్సు కతలు తోయలుల పరి
    ష్వంగముల కిసికిసుక్కుల్
    దొంగా పోలీసు కతలు ధూర్తుల కతలున్ :)



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నమస్తే! మీ పద్యవ్యాఖ్యలకి ధన్యవాదాలు, జిలేబీజీ!

      తొలగించండి
  4. రిప్లయిలు
    1. “గట్టిగా అనుకో”..కండి, “అజ్ఞాత” గారూ (9 Dec 2024 at 8:10 pm), , అయిపోయినా అయిపోతుంది 😳😳.

      తొలగించండి
    2. Elaina pushpa 10 chudalabha?

      అన్న మీరెవరో కానీ మనలాంటి చూసేవాళ్లుంటే పుష్ప-10 మాత్రమే కాదు పుష్పాష్టోత్తరమే చూస్తామేమోనండి. తథాస్తు!

      విన్నకోట నరసింహారావు గారూ! నమస్తే! అనుకున్నా, అనుకోకపోయినా కొన్ని ఎలాగైనా అయిపోతాయండి :)

      తొలగించండి
  5. “అడుసు తొక్కనేల, కాలు కడగనేల” అని పెద్దల మాట.
    Once bitten, twice shy అంటాడు తెల్లోడు.
    పుష్ప-1 చూసి కూడా మళ్ళీ అటువైపు పోనేల !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నీ తనకే తెలుసనుకుని అలా అన్న తెల్లోడికి కూడా తెలియంది ఒకటుందండి - ఒకానొక తెలుగు దేశంలో నా లాంటి won't-shy-away-from-being-bitten-more-than-twice-as-long-as-it-is-a-movie జాతి ఒకటుంటుందని. అది సినిమా-అడుసు తొక్కి మరీ కాళ్ళు కడుక్కుంటుందని :)

      తొలగించండి
  6. 1."పెళ్ళాం మాట వింటే ఎట్టుంటాదో ప్రపంచానికి చూపిస్తా”, “నా మొగుడు దేవుడు, ఎందరో నా మొగుడి పేరు చెప్పుకుని బతుకుతున్నారు, నా మొగుడిని ఒక్క మాటంటే ఊరుకోను”…ఇలా ఒకర్నొకరు బహిరంగంగా భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటే కుటుంబాలలో బంధాలు ఎంత బలంగా ఉంటాయి. “ఎన్ని అనుకున్నా మనం ఒక కుటుంబం, ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు ఆదుకోవాలి”, “అన్నయ్య పిలిస్తే వస్తాడు”, “ఇంట్లో పెళ్ళి పత్రిక కుటుంబంలో పెద్దావిడ పేరు మీద వేయించడం, అదీ రెండు కుటుంబాల మధ్య రాకపోకలు లేకపోయినా”….

    ఇలాంటి డైలాగ్స్ ఏదో బీ నాగిరెడ్డి, విజయా వారి సినిమాలోనో, 60లు, 70 ల కాలం ఆర్టిస్టులో పలికేవి కావు. బంధాలు పీలికలై, ప్రేమ పేరుతో చేసుకున్న పెళ్ళిళ్ళలో కూడా కొంత కాలానికే విడాకులు, చిన్న చిన్న గొడవలతో శాశ్వతంగా సంబంధాలు తెంచేసుకోవడం మామూలై పోయిన కాలంలో…అన్ని సంబంధాలూ ఆర్ధిక సంబంధాలే అని మార్క్స్ లేదా అయాన్ రాండ్ బోధలు పూర్తిగా పాటిస్తున్న కాలంలో వినడానికి వింతగా, ఈ జనరేషన్ ఇవి ఆమోదిస్తారా అని అనుమానపడే భావాలు ఒక సినిమాలో కనిపిస్తే ఆశ్చర్యపడాలి మరి. ఎంత ధైర్యం!

    నిజమే. 2024 చివర్లో వచ్చిన పుష్ప 2 లో కుటుంబ బంధాలు ఎంత బలంగా ఉండాలో, ఉంటే ఎంత బాగుంటుందో, పెళ్ళి అంటూ చేసుకున్నాక ఆ దంపతులు ఒకరి మనసు ఒకరు తెలుసుకుని మసులుకుంటే, అత్తింటి వారిని కోడలు ‘తన’ అనుకుంటే ఎంత బాగుంటుందో చూపించారు. ఇదంతా పుష్ప లో ఉందా, జనం చూస్తున్నారా అంటే చూస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ బంధాల, దంపతుల మధ్య సన్నివేశాలు వచ్చినప్పుడు కళ్ళప్పగించి చూస్తున్నారు. యువత చూస్తున్నారు. బాక్సాఫీస్ వసూళ్లు డబ్బు సంగతెలా ఉన్నా, హాళ్లకు వచ్చి చూస్తున్న జనాన్ని లెక్క చూపిస్తున్నాయి. నమ్మాలి మరి. కమర్షియల్ ఫార్మాట్ లో వచ్చే సినిమాల వల్ల లాభం ఇది. అది - ఎక్కువ మందికి మెసేజ్ చేరడం. రీచ్ అంటారు ఇంగ్లీష్ లో. అవార్డు సినిమాలు, క్లాస్ సినిమాలు, రియలిస్టిక్ సినిమాలు, వాస్తవాలకి దగ్గరగా ఉండే సినిమాలు తీస్తారని చెప్పుకునే తమిళ, మలయాళ, బెంగాలీ సినిమాలకి లేనిది - రీచ్. ఒక సందేశం ఎంత గొప్పదైనా అది సామాన్య జనానికి చేరకపోతే వృధాయే. నిస్సందేహంగా పుష్ప సాధించిన విజయం ఇది.

    రిప్లయితొలగించండి
  7. 2.ఒక నేరస్థుడి కథని హైలైట్ చేశారన్నది ఈ సినిమా మీద విమర్శ. నిజమే. అయితే ఇందులో ఒక నేరస్తుడి జీవితమే కాదు, ప్రజలకి సేవ చేయాల్సిన బాధ్యత లో ఉండి, అవినీతికి తప్పుడు మార్గాలకి అలవాటు పడి ప్రజల సొమ్ముని దోచుకునే వ్యవస్థలకి ప్రతినిధులు - షెకావత్, సిద్దప్ప, ప్రతాప రెడ్డి లని కూడా చూపించారు. ఒక దశలో “నా దగ్గర అడుక్కునే నీకు మర్యాద ఇచ్చే కన్నా, నిజాయితీ గా ఉండే డీఎస్పీ గోవిందప్ప కి సెల్యూట్ చేస్తా” అని పుష్ప ఐపీఎస్ షెకావత్ కి చెప్పడం ఎంత గొప్ప సన్నివేశం. నేరస్థుడు అని మొహమాటం లేకుండా చెప్పుకునే వాడు కూడా అసహ్యించుకునే లోతుకి మన అధికార యంత్రాంగం, నేతలు జారిపోయారు మరి. సర్వీస్ గ్యారంటీ, పెన్షన్ సౌకర్యాలు ఉన్నా కక్కుర్తిపడి ప్రజల సొమ్ము దోచుకుంటున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకి చెంప పెట్టు లాంటి మాటలు అవి. “ఆడపిల్ల కి రక్షణ కల్పించలేని తొక్కలో సీఎం…ఉంటే ఎంత పోతే ఎంత “ అని ఆ నేరస్థుడే అసహ్యించుకునే డైలాగ్స్ సుకుమార్ తప్ప ఈ దేశంలో ఎవరు రాయగలరు? రాసినా, ఎక్కువ మందికి(లక్షల మందికి, కొన్ని రోజుల్లో కోట్ల మందికి) చేర్చగలిగే నేర్పు ప్రస్తుతం ఎవరికి ఉంది? భారీ బడ్జెట్ సినిమా అంటే కేవలం కంప్యూటర్ గ్రాఫిక్స్, యాక్షన్ సీన్స్ మాత్రమే అనే భావన ఉంది. ఈ సినిమా మొదటి సగంలో ఒక్కటే ఫైట్ ఉంది. మిగతా అంతా ఆర్టిస్టుల క్లోజ్ అప్ సీన్స్. పెర్ఫార్మన్స్ మాత్రమే. డైలాగ్స్ తో ఉత్కంఠ, పాత్రల మధ్య నడిచే సన్నివేశాలు తో కన్ను రెప్ప వేయకుండా చూసేలా ఉంది. పాటలు కూడా మంచి సాహిత్యం అని చెప్పవచ్చు. ప్రేమ ప్రకటించడానికి అశ్లీలత లేకుండా పాటలు తీశారు. భర్త గొప్పతనాన్ని గురించి చెబుతూ భార్య పాడే పాట తక్కువ సంగీతంతో, చంద్రబోస్ చక్కటి సాహిత్యంతో ఎంత బాగుంది (చూసేకి…). ఇంత భారీ సినిమాలో ఇంత మెలోడీ పాటా, అదీ క్లీన్ సాంగ్?

    రిప్లయితొలగించండి
  8. 3.
    ఇక ఈ సినిమాలో వివాదాస్పదమైన నేపథ్యం గురించి వద్దాం. శేషాచలంలో అరుదైన ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. మొదటి భాగం నించీ ఈ సినిమా మీద అదే విమర్శ. దాని గురించి చూద్దాం.

    భారత దేశంలో వివిధ ప్రాంతాల్లో ఒక్కో సహజ వనరుని దోచుకునే వర్గాలు ఉంటాయి. తూర్పు ప్రాంతంలో బొగ్గు, ఇతర మైనింగ్, మహారాష్ట్ర లో చక్కెర మాఫియా, తెలుగు ప్రాంతంలో ముఖ్యంగా రాయలసీమ లో మైనింగ్, ఎర్ర చందనం స్మగ్లింగ్ మాఫియాలు రాజ్యమేలుతాయి. ఇవి కేవలం ఒక నేరస్తుల వల్ల మాత్రమే కాదు. నేరస్థులు, బ్యూరోక్రాట్స్, రాజకీయ నాయకులు - ఈ మూడు రంగాల మధ్య పెనవేసుకున్న గాఢమైన బంధాలు రాష్ట్ర ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. వీళ్ళ అరాచకాలని డాక్యుమెంటరీ గా తీస్తే చూసేవాళ్ళు ఉండరు కాబట్టి, కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుని ఓపెన్ గా ఎండగట్టారు. సినిమా కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇలాంటి అంశాలు చర్చకి తేవడం ఆషామాషీ కాదు, ఎంతో క్రియేటివిటీ, ధైర్యం అవసరం. సుకుమార్ ఆ విషయంలో తగ్గేదే లే అన్నట్టు తీసుకుంటూ వెళ్ళిపోయారు. అల్లు అర్జున్ కి మొదటి పార్ట్ లో నేషనల్ అవార్డ్ ఎందుకు ఇచ్చారు అనే దాని మీద బానే చర్చ నడిచింది (ముఖ్యంగా మొదటి తెలుగు వాడు కావడం, నేరస్థుడి పాత్ర కావడం). ఈ సినిమా చూసాక, ముఖ్యంగా జాతర సన్నివేశం చూశాక, నేషనల్ అవార్డ్ ఎందుకు ఇవ్వరు అనిపించేలా చేశాడు. ఇక ఈ సినిమాలో సర్ప్రయిజ్ రష్మిక. ఆమె పెర్ఫార్మన్స్ కి కూడా నేషనల్ అవార్డు ఇవ్వాల్సిందే. ఇక దర్శకుడు - ఒక కమర్షియల్ సినిమా, అదీ మేల్ ఓరియెంటెడ్, మాస్ మసాలా ఎంటర్టైనర్ తీస్తూ, హీరోయిన్ని హీరో తో సమానంగా, కొన్ని చోట్ల ఎక్కువగా ఎలివేట్ చేయడం గొప్ప విషయం. హీరోయిన్స్ కి సినిమాల్లో విలువ ఉండట్లేదు, బొమ్మల్లాగే ఉంటారు అన్న విమర్శలకి ఇందులో పుష్పవల్లి పాత్ర సమాధానం. మహిళలకి ఎంతో గౌరవం ఇచ్చిన సినిమా ఇది. ఆడపిల్లల బాధ్యత అందరి బాధ్యత అని సుకుమార్ బలంగా చెప్పడం ఇప్పటి యువతకి అవసరం. ఏ పబ్లిసిటీ లేకుండా ఆయన ఆ పని సుతిమెత్తగా చేసేశాడు.

    సామాజిక అంశాలు చాలా సున్నితంగా వ్యాఖ్యానించాడు. మొదటి పార్ట్ లో - కూలోడు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండు అని కొండారెడ్డి పాత్రతో చెప్పించాడు. కింది స్థాయి వ్యక్తులు ఒక స్టేజి వరకే పరిమితం కావాలి. అలా కాకుండా పెద్ద స్థాయిలు ఆశిస్తే అప్పటికే ఉన్న వ్యవస్థ ఒప్పుకోదు. అది మొదటి పార్ట్ లో చూపించాడు. రెండో పార్ట్ లో దాన్ని మరింత చిక్కగా ప్రదర్శించాడు. “ కాళ్ళు మోస్తున్నాయి కదాని, చెప్పుల్ని చేత్తో పట్టుకుంటామా” - ఈ డైలాగ్ సీఎం పాత్ర చెప్పడం గొప్ప సామాజిక వాస్తవం. ఇటీవల బాగా వైరల్ అయిన ఒక వీడియో లో బ్రహ్మానందం కృష్ణ వంశీ తో చెప్పినట్టు- ఎవరైనా నువ్వు బాగుండాలని కోరుకుంటారు. కానీ నాకన్నా ఎక్కువ బాగుండాలని కోరుకోరు - అని చెప్పినట్టు - “నీకో చోటుంది. అక్కడే ఉండు. పైకి రావాలని ఆశలు పెట్టుకుంటే అంతే” - అనే మెసేజ్ ఎప్పుడూ ఉన్నత వర్గం బడుగు వర్గాలకి ఇస్తూనే ఉంటుంది. అది ఛాలెంజ్ చేసిన వాడు చాలా కష్టపడాలి. లేదా అంతం అయిపోవాలి. అధికారులు, పోలీసులు, రాజకీయ నాయకులు, నేరపూరిత శక్తులు తమ అస్తిత్వానికి భంగం కలిగిస్తే ఎలా ప్రతిస్పందిస్తాయో చూడాల్సిందే.

    ఇది సుకుమార్ సినిమా. రంగస్థలం తర్వాత మరో గొప్ప సామాజిక సినిమా. సమాజపు పోకడల మీద లోతైన అవగాహన ఉన్న వ్యక్తి ఒక థీసిస్ రాసినట్టు, పెయింటింగ్ వేసినట్టు, శిల్పం చెక్కినట్టు ఈ సినిమా ని సుకుమార్ చెక్కాడు. మనల్ని నిత్యం ప్రభావితం చేస్తున్న వాళ్ళ వికృత రూపాన్ని ఆవిష్కరించాడు. దానితో పాటు కుటుంబ వ్యవస్థ, విలువలు, దాంపత్య సంబంధాల మీద చక్కని సందేశమూ ఇచ్చాడు. తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత.

    రిప్లయితొలగించండి
  9. 4.
    కొసమెరుపు: ఈ సినిమా మీద ఆవేశంగా, లాజిక్ లతో చేస్తున్న కామెంట్స్, డిబేట్స్ చూశాను. అందులో సమాజంలో ప్రముఖులుగా, తెలివైన వాళ్లుగా ప్రచారం పొందుతున్న వాళ్ళూ ఉన్నారు. అందరూ చేసే ప్రధాన విమర్శ - ఒక స్మగ్లర్ ని హీరోగా చూపిస్తే యువత ఏమి నేర్చుకుంటుంది? తప్పకుండా పాడై పోతుంది అని. పైపైన చూస్తే మంచి లాజిక్ . ఇది ఒక సినిమా. నచ్చితే చూస్తాం. లేకపోతే లేదు. కానీ నిజ జీవితంలో జరుగుతున్నదేమిటి? అక్రమ మైన్స్ తో స్వాతంత్రం వచ్చినప్పటి నించీ రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేస్తున్న నేరస్థులు, నేతల్ని మనం ఎందుకు గౌరవిస్తున్నాం? ఎర్ర చందనం స్మగ్లర్లు కొంతమంది టీటీడీ మెంబర్లు కూడా అయ్యారని వార్తలు వచ్చాయి. అప్పుడు ఏమయ్యారు ఈ మేధావులు? లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా కుటుంబాలు రాజకీయాల్లో చక్రం తిప్పి సీఎంలు అవుతుంటే, అన్నీ తెలిసిన “మేధావులు”, టీచర్లు, అధికారులు,పోలీసులు పిల్లలకి గత కొన్ని దశాబ్దాలుగా ఆ నేతల గురించి ఏమి చెప్తున్నారు - గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, మహా నేత, రైతు బంధు, విజనరీ, సంక్షేమ ప్రదాత…ఇలాంటి మాటలు పిల్లలతో పాఠశాలల కార్యక్రమాల్లో చెప్పిస్తున్నారు. అది ఈ మేధావులకి కనపడడం లేదా? లేక భయమా? కల్పిత పాత్ర ఏదో ప్రభావితం చేస్తుంది అని బోలెడు బాధ పడుతున్నవారు - సీబీఐ కేసుల్లో బెయిలు మీద ఉన్న వారికి, హత్య కేసుల్లో నిందితులకు స్కూలు పిల్లలకి “నిజాలు” చెప్పకుండా ఉండడం ఏ రకం ఆత్మవంచన?



    ____________________



    ఈ రివ్యూ వ్రాసిన వారు విన్నకోట రవికుమార్ గారు. ఎవరు అని అడక్కండి. నాకు తెలియదు. ఈ రివ్యూ తో ఏకీభవిస్తున్నాను కాబట్టి షేర్ చేసాను.

    రిప్లయితొలగించండి
  10. రివ్యూ బావుంది.

    రవి నరసరాయలవారికి బంధువని అనుకుంటా

    రిప్లయితొలగించండి