ఆ రెండు కనులవ్వి - ఇద్దరివి కలిసి
మది పాటయ్యి సాగీ - ఇద్దరితో చేరి
పాడింది ఆ వనమే...
జతిలో - పాడింది ఆ వనమే!
ఎన్నెన్నో కలలయ్యి - ఇద్దరిలో మెరిసి
ఎద పదమయ్యి కదిలీ - ఇద్దరిని కూడి
ఊగింది ఆ వనమే...
జతగా - ఊగింది ఆ వనమే!
మిణుగురుల మిలమిలలే
ఇద్దరి - కనులల్లో మెరిసే
కన్నుల్లో - వెన్నెల్ల జల్లయ్యి కురిసే
ఆ రెండు కనులవ్వి - ఇద్దరివి కలిసి
పాడింది ఆ వనమే...
జతిలో - పాడింది ఆ వనమే!
రాగాల వనమాయే...
ఆ రాల వనమే!
సెలయేటి కలకలలే
అద్దరి - కలలల్లో మెరిసే
కలల్లో - వలపు వెల్లువయ్యి విరిసే
ఎన్నెన్నో కలలయ్యి - ఇద్దరిలో మెరిసి
ఊగింది ఆ వనమే...
జతగా - ఊగింది ఆ వనమే!
పూచేటి వనమాయే...
ఆ రాలు వనమే!
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
పాటలు ఎప్పుడూ బావుంటాయి.
అందమైన మాటలు పేర్చి - వినసొంపైన రాగం కూర్చి - కట్టిన పాటలు - కదలనీయక కట్టిపడేస్తాయి. పదేపదే వినమంటాయి. వింటూనే వుండమంటాయి.
అలాంటి పాటలు ఎన్నో ఇంతకు ముందూ వున్నాయి. ఇవాళా వస్తున్నాయి. ఇక ముందూ రాబోతాయి.
కాకపోతే ఇంతకు ముందున్న, ఇప్పుడొస్తున్న, ముందు రాబోతున్న అన్ని పాటలూ వింటామా లేదా అనేది - విన్న తర్వాత అవి మనకు నచ్చుతాయా లేదా అన్నది - ఆయా విన్నప్పటి క్షణాన ఆయా చెవులు చేసుకున్న పుణ్యఫలం.
ఒక్కో వేళ అనుకోకుండా ఓ మంచి పాట నాకు తారసబడటం అన్నది నా తారాబలాన్ని బట్టే అని నాకొక బలీయమైన నమ్మకం.
కిందటి మంగళవారం అనగా డిసెంబర్ 10 వ తారీఖు, 2024 వ సంవత్సరం - మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు - నా పాట-తారాబలం బహు బాగా వున్నట్టుంది.
ఓ మాంఛి పాటొకటి విన్నాను, చూశాను.
వినడానికి అలనల్లన అలల మీద తేలుతున్నట్టు, చూడడానికి గాలితో తూలుతున్నట్టు గానూ వున్న ఆ పాట "విడుదలై-1" అనే ఓ తమిళ డబ్బింగ్ సినిమా లోనిది.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
శీతాకాలపు సాయంత్రం. పొద్దు తొందరగా వాలిపోయింది.
సాయంత్రం భోజనం కాగానే కాలక్షేపం వెతుక్కుంటూ వుంటే బద్రికి విజయ్ సేతుపతి సినిమా "విడుదలై-1" గుర్తొచ్చింది. ఈ మధ్యే ఎక్కడో దాని గురించి చదివారట. బావుంటుందని చదివినట్టు గుర్తుందట.
బద్రికి, నాకూ కూడా విజయ్ సేతుపతి సినిమాలు ఇష్టం.
బావుంటాయి. మేమిప్పటి వరకు చూసినవి కొన్నే అయినా చూసినవన్నీ నచ్చాయి.
ఈ మధ్యే చూసిన "మహారాజా" అయితే మరీ నచ్చేసింది. అది చూసినప్పట్నుంచి అతని పాత సినిమాలు అన్నీ వెతుక్కుని చూడాలనుకుంటూ వున్నాము.
అంతే కాకుండా నాకు పెద్దగా విజయ్ సేతుపతి గురించి ఏమీ తెలియకపోయినా - అతని గురించి చదివిన ఒక వార్త వల్ల నాకు అతనంటే గౌరవం.
అతను హీరోగా వున్న ఒక సినిమాలో కృతిషెట్టి అనే అమ్మాయిని హీరోయిన్‌గా పెడదామనుకుంటే విజయ్ సేతుపతి ఒప్పుకోలేదట. ఎందుకంటే అంతకు ముందు "ఉప్పెన" అనే తెలుగు సినిమాలో కృతిషెట్టి అతని కూతురుగా నటించింది. కూతురుగా చేసిన అమ్మాయితో romance చేయడానికి ఒప్పుకోలేదు విజయ్ సేతుపతి. నటన ఒక వృత్తే అయినా అందులో తనకంటూ కొన్ని నిబంధనలు పెట్టుకున్న విజయ్ సేతుపతి లాంటి వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి వాళ్ళని గౌరవించి precious గా చూసుకుంటే - వాళ్ళలా ఇంకొంతమంది మంచివాళ్ళు తయారయ్యే అవకాశం వుంటుంది. అందుకే అతనంటే మహా గౌరవం.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
అందుకే "విడుదలై-1" గురించి బద్రి గుర్తు చేయగానే చూడడం మొదలుపెట్టాము. సినిమా మొదలవుతూనే ఇంతకు ముందు సగం చూసినట్టు గుర్తొచ్చింది బద్రికి. సరే! ఇప్పుడు పూర్తి చేద్దాంలే అనుకుని continue చేశాం.
సినిమా మొదలైనప్పట్నుంచీ కుమరేశన్ అనే ఓ పరోపకారి పాపన్న పోలీసు, అతన్నిష్టపడే ఓ అమ్మాయి , ఇంకా మిగిలిన బోల్డంత మంది పోలీసులూ - వీళ్ళ చుట్టూనే కథ తిరుగుతూ వుంది.
మధ్యలో ఎక్కడో గానీ విజయ్ సేతుపతి రాలేదు.
అయినా సినిమా బావుండడం వల్ల ఇవేమీ పెద్ద పట్టించుకోదగిన విషయాలు అనిపించలేదు. పైగా ఆ కుమరేశన్‌గా చేసిన సూరి అనే అతను, ఆ అమ్మాయి భవానీ శ్రీ అందరూ చాలా బాగా నటిస్తున్నారు.
సినిమా అంతా కూడా ఎంతో సహజమైన పరిసరాల్లో, వాతావరణంలో చక్కగా సాగుతోంది. అక్కడక్కడా కొంచెం హింస వున్నా కూడా అలాంటి చోట్ల చూడకుండా forward చేసుకుంటూ చూసేస్తున్నాము.
ఇంతలో ఓ పాట వచ్చింది.
అదెలాంటి పాటంటే ... అలాంటిలాంటి పాట కాదు.
నేనింతకు ముందు అన్నట్టు ...
వినడానికి అలనల్లన అలల మీద తేలుతున్నట్టున్న పాట
చూడడానికి మెలమెల్లగ గాలితో తూలుతున్నట్టున్న పాట
మిణుగురులు మూగిన పాట
మురిపాలు మోసులు సాగిన పాట
కనుల కలయికలో నెయ్యాలు పూచిన పాట
తనువుల యెడమై డెందముల చేరువైన పాట
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
తెర మీద చూస్తున్నప్పుడు కుమరేశన్ (సూరి), పాప (భవానీ శ్రీ ) ఒక లాంతరు పట్టుకుని అడవి మధ్యలో - ఆ వెలుతురు-చుట్టులో - వాళ్ళని చుట్టుముట్టిన వలపు-మెరుపుతో - గాలిలో తేలుతున్నట్టుగా అడుగులు వేస్తూ (slow-motion లో తీశారు ఈ పాటంతా) వుండగా - నేపథ్యంలో ఉరుములు మువ్వలని అనుకరిస్తే ఎలా వుంటుందీ?! - అలాంటి drum sound - పాట వెనకాల మోగుతూ వుంటుంది.
అనుపల్లవిలో "ఈ వింత మాయంతా... నీ మహత్యమే!" అన్న వాక్యం దగ్గర వాళ్ళిద్దరి చుట్టూ ముసిరి మెరుస్తున్న మిణుగురుల మినుమించులు కళ్ళకి మిరుమిట్లు గొలుపుతాయి.
అనుపల్లవి ముగిసి - మొదటి చరణానికి ముందు వచ్చే interlude దగ్గర మెరిసేటి నీళ్ళ సెలయేరు ఒక అద్భుతం!
చిమ్మ చీకటి
చీకటి కమ్ముకున్న రేయి
రేయి మూగిన రాల కొండలు
కొండల మీద చిక్కగా పరుచుకున్న అడవి
అడవి నడుమ రాల బాట
రాల మీదుగా నీటి కాలవ
అమ్మాయి చేతి లాంతరు వెలుగు
ఆ వెలుగులో మెరిసిన అబ్బాయి కళ్ళు
ఆ మెరుపుకి విరిసి సోలిన అమ్మాయి కళ్ళు
మిలమిల మూగిన మిణుగురులు
జలజల పారిన సెలయేర్లు
చూడడానికి ఈ పాట ఒక painting-in-motion లా అనిపించింది నాకు.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
చూపుకి అబ్బురపు చిత్తరువనిపించిన ఈ పాటని చెవులకి అచ్చెరువపు పదమనిపించేటట్టు కట్టినది -
ఇలకి అమృతాన్ని స్వరాల రూపంలో పంచడానికి వచ్చిన ఇళయరాజా.
తెలుగులో ఈ పాట కార్తీక్ - అనన్య భట్ పాడారు. తెలుగులో పాటని రాసినవారు చైతన్య ప్రసాద్.
తమిళంలో కూడా విందామని వెతికాను. ముందు వినగానే ఇళయరాజానే పాడారేమో అనుకున్నాను. కానీ కాదట. తమిళంలో పాడిందెవరో తెలుసా? ధనుష్ - అనన్య భట్. తమిళంలో పాటని రాసిందేమో శుక అట.
ధనుష్ అంటే ఎవరో వేరే "పాటక్కార్" అనుకున్నా కానీ మన వేలై-ఇల్లద-పట్టక్కారన్ (VIP) హీరో అని తెలిసి భలే ఆశ్చర్యపడిపోయేశా!
భలే! "Why this కొలవెరి" అంటూ ఏదో సరదా పాటొకటి పాడాడు అని మాత్రమే తెలుసు కానీ సినిమాల్లో వేరే నటులకి కూడా పాడతాడని ఈ "ఉన్నోడ నడందా... కల్లాన కాడు - పూత్తాడుం పూవనం ఆగిడుమే" పాట విన్నాకే తెలిసింది.
అసలు ముందు తమిళ పాట విన్నప్పుడు ఇళయరాజా కొంచెం గొంతు మార్చి పాడారేమో అనుకున్నా. యూట్యూబ్‌లో ధనుష్ పాడుతుండగా తీసిన shorts చూడకపోతే ఈ పాట ధనుష్ పాడాడంటే నమ్మేదాన్ని కాదేమో! కానీ పాడింది ఖచ్చితంగా ధనుష్షే.
కాకపోతే తెలుగులో పాట కార్తీక్ గొంతులో ఒక చిన్న నవ్వుతో కలిపి వినిపిస్తే తమిళంలో ధనుష్ పాట మాత్రం ఓ పిసరు పొగులుతో సాగినట్టుంటుంది.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
అన్నట్టు ఈ పాటా, ఈ పాటలో నటించిన వారి వివరాల గురించి వెతుకుతున్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన tidbits దొరికాయి.
అవేంటంటే...
విడుదలై-1 లో కుమరేశన్‌గా ప్రధానపాత్రధారిగా నటించిన సూరి అనే తమిళ నటుడు ఇంతకు ముందు నటించినవన్నీ హాస్యపాత్రలే నట. కానీ ఈ సినిమాలో అతన్ని చూస్తే కుమరేశన్‌గా సూరి తప్ప ఇంకెవ్వరూ అంత బాగా చెయ్యరేమో అనిపించింది.
ఇక కుమరేశన్‌కి ఇష్టమై, అతన్ని ఇష్టపడ్డ పాప(తమిళరసి)గా నటించిన భవానీశ్రీ సంగీతదర్శకుడు రెహమాన్‌కి మేనకోడలు. ఇంకో సంగీతదర్శకుడు G.V.ప్రకాష్‌కి చెల్లెలు అట.
పాట మొదలైనప్పుడు పల్లవిలో అమ్మాయి చరణాలకి చెప్పులున్నాయి - కానీ పాట చరణానికి వచ్చేటప్పటికి అవెక్కడో పడేసుకున్నట్టుంది. ఉట్టికాళ్ళతో నడుస్తూ వుంటుంది.
అమ్మాయి చేతనున్న లాంతరు వెలుగులో అబ్బాయి కళ్ళే కాదు ఆ పోలీసు చొక్కాకి వున్న స్టీలుబొత్తాలు కూడా మెరుస్తుంటాయి
చాలా చాలా రోజుల తర్వాత ఓ పాటని వెతుక్కుంటూ వెళ్ళి దాని కథా-కమామీషూ కనుక్కోవడం బోల్డంత బాగా అనిపించింది.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
మళ్ళీ వెనక్కి మళ్ళి పాట దగ్గరికొస్తే ఈ పాట సందర్భం ఏంటంటే ఊరికి భయపడి తన ఉనికిని బయట పెట్టుకోలేకపోతున్న అమ్మాయికి ఆ వూరే నీ గురించి మంచిమాటలు చెప్పే మంచి రోజులొస్తాయి అని అబ్బాయి ధైర్యం చెబుతున్నట్టున్నట్టుంటుంది. అందుకే తెలుగు పాట పాడిన కార్తీక్ నవ్వుగొంతులో ఆ భరోసా వినిపించింది - తమిళపాట ధనుష్ గొంతులో కించిత్ బాధగా సాగింది.
తమిళంలో రాసిన పాటకి మక్కీకి మక్కీ అనువాదంలా వుంటుంది తెలుగు పాట.
కానీ మొట్టమొదటి వాక్యం దగ్గర మాత్రం "పిల్లా ...నువ్ నడిస్తే ... ఈ రాళ్ళదారే పూచేటి పూవనమాయెనులే" అనే కన్నా "పిల్లా...నీతో నడిస్తే ఈ రాళ్ళదారే పూచేటి పూవనమాయెనులే" అనుంటే ఇంకొంచెం అసలు-పాటకి దగ్గరగా వుండేది (ఉన్నోడ నడందా ...కల్లాన కాడు పూత్తాడుం పూవనం ఆగిడుమే) అనిపించింది.
ఎలాగూ నేపథ్యంలో వచ్చే పాటే కాబట్టి - పెదవుల కదలికకి అనుగుణంగా రాయక్కర్లేదు కాబట్టి - తెలుగులో ఇంకొంచెం స్వేచ్ఛగా చక్కటి మాటలు వాడి న-డబ్బింగ్ పాటలా రాసుంటే బావుండేది.
ఏదేమైనా ఎలా రాసినా విన్న పాట విన్నట్టుగా, వున్నట్టుగా నాకు మాత్రం నచ్చేసింది - తమిళంలో, తెలుగులో కూడా.
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
అంత నచ్చిన ఆ పాటని ఈ కింద రాసి పెట్టుకున్నా. తెలుగు పాట మాత్రమే రాశాను. తమిళ పాట చూస్తూ వినడానికి యూట్యూబ్ లింక్ మాత్రం పెట్టాను.
తెలుగు పాట యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=nCtt3fbpzZE
తమిళ పాట యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=TeB3Vw7rEMU
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
పిల్లా! నువ్ నడిస్తే... ఈ రాళ్ళ దారే
పిల్లా నువ్ నడిస్తే... ఈ రాళ్ళ దారే
పూచేటి పూవనమాయెనులే!
నీ కాళ్లు తాకి... ఈ ముళ్లదారే
బంగారుబాటగా మారెనులే!
పిల్లా నువ్ నడిస్తే... ఈ రాళ్ళ దారే
పూచేటి పూవనమాయెనులే!
నీ కాళ్లు తాకి... ఈ ముళ్లదారే
బంగారుబాటగా మారెనులే!
చూశావా - నీ వల్లే ఆకాశం మెరిసే
నీ కోసం - నా గుండె పూచిందిలే
చూశాను - ఆకాశం నీ వల్ల మెరిసే
నీ కోసం - నా గుండె పూచిందిలే
ఈ వింత మాయంతా... నీ మహత్యమే!
పిల్లా నువ్ నడిస్తే... ఈ రాళ్ళ దారే
పూచేటి పూవనమాయెనులే!
గాలి తెచ్చే దూళి వలే - ఇట్టా గేలి చేసే ఊరు ఇదే!
దుఃఖమొచ్చి సోలిపోతే - అది ఊరడించ ఇటు రాదే!
నువ్ సాగిపోగా - అడ్డమేది లేదు - నువ్ వెనక్కి పోరాదే...
నీకు దిక్కు నేనే - నాకు దిక్కు నీవే - ఎన్నడిది మారదులే!
ఈ మాట ఊరంతా చెప్పే క్షణం - వస్తుంది తానా - పోతారు ఈ తిట్టే జనం
ఈ రాళ్ల దారి పిల్లోడు నడిస్తే... పూచేటి పూవనమాయెనులే!
పూచేటి పూవనమాయెనులే!
హారతిచ్చే దీపముంది - ఒక్క దేవుడైన చూడడులే!
పేర్చుకున్న కలలు ఇవి - నెరవేర్చువారు లేనే లేరులే!
చిక్కేది కాదు - ఆగేటి కాలం - ఆ వేగమాగేదా?!
పేదోళ్ళు స్వర్గం - చూసేటి మార్గం - చూపించలేనందా?
నమ్మేటి అందరికి దారే వేస్తూ - గుండెల్లో ఎంతెంతో - సంతోషం పొంగిస్తుంది
ఈ రాళ్ల దారి పిల్లోడు నడిస్తే... పూచేటి పూవనమాయెనులే!
చూశావా - నీ వల్లే ఆకాశం మెరిసే
నీ కోసం - నా గుండె పూచిందిలే
చూశాను - ఆకాశం నీ వల్ల మెరిసే
నీ కోసం - నా గుండె పూచిందిలే
ఈ వింత మాయంతా... నీ మహత్యమే!
పిల్లా నువ్ నడిస్తే... ఈ రాళ్ళ దారే
పూచేటి పూవనమాయెనులే!
పూచేటి పూవనమాయెనులే!
*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***
నాకు నచ్చిన పాట - మీతో పంచుకుని
పూచింది నా మనమే
పువ్వై నవ్వింది నా మనమే!
~పాటల భైరవి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి