24, అక్టోబర్ 2020, శనివారం

వోటరిని నేనే! ఓటరిని నేనే !

జన్మతః కలిగినదో, 

వారసత్వంగా వచ్చినదో, 

చదువులలో గమనించినదో, 

నా మేలి-సగం సాహచర్యంలో గ్రహించినదో ,  

నా పిల్లలని పెంచుతూ నేర్చుకున్నదో  - 

ఎంతోకొంత - నాదంటూ సొంతబుద్ధి - అంతోఇంతో ఉన్న నేను - 

నాకుగా నేను పేర్చుకున్న జీవనసూత్రాలు కొన్ని ఉన్నాయి. 


కలిగిన దాంట్లో కలకలలాడుతూ ఉండాలి. 

ఉన్నదాంట్లో ఉన్నతంగా ఉండాలి. 

పొసగని చోట మసలకుండాలి. 

విలువ లేని చోట నిలవకుండాలి. 

స్నేహంలో అంతరాలు ఎంచకుండాలి. 

భేదం కలిగిన మరి మది తలచకుండాలి. 

వీలైనంత వరకూ మంచిని ఎంచుకోవాలి. 


కానీ ఇప్పుడు అనుకోకుండా ఇంకో కొత్త పాఠమేదో నేర్చుకోవాలేమో అనిపిస్తోంది. 

అదెలాంటిదంటే ... 

ఎంచుకోక తప్పకపోతే... 

ఎంచుకోవడానికి మంచే లేకపోతే - 

ఎంచుకోక ఉండాలంటే మనసొప్పకపోతే - 


ఉన్న ఇద్దరు మంచి-కానివాళ్ళలోంచి 

ఇంచుక తక్కువ-మంచి-కాని వాళ్ళని 

ఎంచుకోవాల్సిందే! 


ఒకరిని ఒప్పని, ఒకరిని కాదని 

గెలుపోటముల వోటరిని నేనే! 


ఎవరు గెలిచినా, ఎవరు తొలగినా 

ఓటమిపోటుల ఓటరిని నేనే!


అటు గొయ్యి - ఇటు నుయ్యి 

దేంట్లో పడతావో చెప్పమంటే?


అటు చాకు  - ఇటు బాకు 

ఏదో  ఒకటి పొడుచుకొమ్మంటే?


ఇది గరళం  - అది హాలాహలం 

ఏదో ఒకటి ఎంచుకొమ్మంటే?


అది చచ్చు - ఇది పుచ్చు 

ఉన్నవివే పుచ్చుకోమంటే?


ఇటు ట్రంపరి - అటు ట్రంపారి 

ఎవరో ఒకర్ని ఎన్నుకోమంటే?


దిగ్గురని, దిమ్మెర పోయి 

దిక్కులెన్ని ఉన్నా 

ఏ దిక్కూ తోచక 

తూరుపు దిక్కుకి తిరిగి 

చేతులెత్తి దణ్ణమెట్టుకుంటున్న 

చేతకాని, చేవలేని వోటరిని! 


ఒడ్డలేని పందెం గెలవలేక 

వట్టిపోయిన ఎంపికల ఓటరిని!


వోటరిని నేనే!

 ఓటరిని నేనే !



18, అక్టోబర్ 2020, ఆదివారం

ఆకురాలుకారు పాట - యే పత్‌ఝడ్ కా మౌసమ్ - ఘడీ దో ఘడీ హై...

 మా ఊళ్ళో అక్టోబర్ కాలం - ఆకురాలు మొదలవు కాలం. 

ఎటు చూసినా రంగురంగుల ఆకులతో సింగారించుకున్న చెట్లు కనిపిస్తాయి. 

ఆ రంగుల హంగులెలాంటివంటే... అపరంజి మెఱుగుల నారింజ - పసిడి వన్నెల పసుపుపచ్చ - పగడపు జిలుగుల తొగరు - నిప్పు కణిక వెలుగుల కెంజాయ - మధ్య మధ్య ఇంకా నేనున్నానంటున్న పసిమి-పసరుల ఆకుపచ్చ. 

రాబోయే శీతవేళ చెట్లకి నిదురవేళ. 

అన్ని నెలలు కదలక, మెదలక పడుకుని ఉండి, పూలకారు వేళకి కొమ్మారెమ్మా చిగురేసి, మొగ్గేసి, పూత పూసి పువ్వుల నవ్వులు రువ్వాలంటే - ఇప్పటికిప్పుడు ఆ ఆకులు తమలోని రసమూ, బలమూ - తమకి ఆటపట్టైన పుడమిపుట్టువుకిచ్చి నేలకి చేరాల్సిందే. 

అలా - ఆ చిక్కనైన ఆకుపచ్చ సత్తువ చెట్టులోకి చేరుకోగా - రాలబోయే ఆకులు చేసుకునే రంగుల పండుగే ఆకురాలుకారు. 

రాలబోయే ఆకులు - గాలి తగిలి, ఆకూ ఆకూ రాసుకుని, పూసుకునే వేళ కూడబలుక్కుంటాయేమో! 

వీడుకోలు వేళ వేసట రాకుండా ఉండాలంటే, వేదన పడకుండా రాలాలంటే - ఏ రంగు పూసుకుంటే బావుంటుందో! 

"నవ్వుతూ బ్రతికాను, నవ్వుతూనే వెళ్తాను" అంటూ రాలే ఆకు నారింజ నాదంటుంది. 

నే వెళ్ళి నా చోటు ఇంకో చిగురుకిస్తాననుకునే ఆకు విచ్చి పచ్చనవుతుంది. 

ఉండాలనే ఆశ, వెళ్ళక తప్పదనే నిరాశల రాపిడికి లొంగిన ఆకు సిగ్గిలి కెంపవుతుంది. 

అంటిపెట్టుకున్న తరువు నొదిలి వెళ్ళలేని పొగులు బాధతో కనలు ఆకు ఒడలు మండి ఎఱ్ఱనవుతుంది. 




రాలు ఆకులకి బాసటగా - 

ఆకురాలు దారులలో ఆసరాగా - 

ఉన్నట్టుండి మొదలవుతుంది 

కనీకనిపించని చినుకు ఆట... 

వినీవినిపించని వాన పాట... 

కాఱుమబ్బు పాడు ఉరుము పల్లవి

గాలి చేర్చు అనువైన తాళం

సృష్టి కూర్చు ఒనరైన మేళం


అది మొదలు ...

ప్రతికాలపు ఆ మలుపులో 

పదే పదే అదే పాట... 

ఆగకుండ సాగు పాట... 

అలుపు లేని 

ఆకురాలుకారు పాట... 


ఆ పాట వింటూనే ... 

చిటి రెమ్మల - చిటారు కొమ్మల 

కిటకిటలాడుతు - గలగలమను ఆకులు... 

బిలబిలమంటూ - జలజల రాలుతాయి  

కిలకిలమంటూ - కలకలమను ఆకులు...  

ఇలకు చేరుదమంటూ - బిరబిర ఉరలుతాయి  





ఎంత ఒద్దనుకున్నా , శిశిరమన్న మాట తలవకుండా - ఆకురాలుకారులో ... రంగు పూసుకుని... హంగు చేసుకుని... ఆకు ఆకు రాలు - అని poetic గా నా మాటలతో నన్నే మాయ చేసుకుని - ఎంత సర్ది చెప్పుకున్నా - బోసివవుతున్న చెట్లని చూసి ఒక్కోసారి వదిలించుకోలేని బెంగ చుట్టుముడుతుంది. 

అప్పుడేం చెయ్యాలీ? 

నచ్చిన పాటేదో తోడు తెచ్చుకోవాలి. 

తోడొచ్చిన పాటతో దిగులు-గుబులుని తరిమికొట్టాలి. 

గాలి వాలున అలవోకగ సోలి తూలు ఆకు రీతిగా - ఆ పాట జాలువారాలి. 

ఈ కాలం ఇలాగే ఎల్లకాలం ఉండబోదనీ - రాలిన ప్రతి ఆకు తావునా క్రొంజివురులు మొలకెత్తుననీ -  ఆ పాట మాటమాటలో చెప్పాలి.  

ఆ పాట పాడిన గొంతు మెత్తగా సాగాలి - మెల్లగా పాడాలి. 

వెచ్చని ఊర్పులా తాకాలి - చల్లని ఓదార్పు కావాలి. 


అల్లాంటి పాటే... "బాతోం బాతోం మే" సినిమాలో కిషోర్ కుమార్ "యే పత్‌ఝడ్ కా మౌసమ్ - ఘడీ దో ఘడీ హై..." అని భరోసా ఇస్తున్న  పాట ... 



కహా తక్ - యే మన్ కో - అంధేరే ఛలేంగే?

ఉదాసీ భరే దిన్ - కభీ తో ఢలేంగే! 

కహా తక్ యే మన్ కో - అంధేరే ఛలేంగే?

ఉదాసీ భరే దిన్ - కభీ తో ఢలేంగే!


కభీ సుఖ్, కభీ దుఖ్ - యహీ జిందగీ హై.. 

యే పత్‌ఝడ్ కా మౌసమ్ - ఘడీ దో ఘడీ హై... 

యే పత్‌ఝడ్ కా మౌసమ్ - ఘడీ దో ఘడీ హై... 

నయే ఫూల్ ... కల్ ఫిర్ - డగర్ మే ఖిలేంగే!

ఉదాసీ భరే దిన్ - కభీ తో ఢలేంగే!


భలే తేజ్ కిత్‌నా - హవా కా హో ... ఝోంకా!

మగర్ అప్‌నే మన్ మే - తూ రఖ్ యే భరోసా...

మగర్ అప్‌నే మన్ మే - తూ రఖ్ యే భరోసా...

జో బిఛ్‌డే సఫర్ మే - తుఝే ఫిర్ మిలేంగే!

ఉదాసీ భరే దిన్ - కభీ తో ఢలేంగే!


కహే కోఈ కుఛ్ భీ - మగర్ సచ్ యహీ హై...

లహర్ ప్యార్ కీ జో - కహీ ఉఠ్ రహీ హై...

లహర్ ప్యార్ కీ జో - కహీ ఉఠ్ రహీ హై...

ఉసే - ఏక్ దిన్ తో - కినారే మిలేంగే!

ఉదాసీ భరే దిన్ - కభీ తో ఢలేంగే!


కహా తక్ - యే మన్ కో - అంధేరే ఛలేంగే?

ఉదాసీ భరే దిన్ - కభీ తో ఢలేంగే!

********************

********************


ఈ పాట తోడుగా - చోటియ్యకూడదనుకున్నా చొచ్చుకువచ్చే శిశిరాలనీ, రానీయకూడదనుకున్నా మంచుతో ముంచెత్తే  శీతవేళల్నీ - ఆడుతూపాడుతూ దాటెయ్యలనుకుంటూ... 


~ పాటల భైరవి 

12, అక్టోబర్ 2020, సోమవారం

చమక్కుమన్న చక్కుపగడ - 7 7 7


ఈ ఏడు నాకు అనుకోకుండా కలిసొచ్చిన అంకె ఏడు. 

అక్టోబర్ 10, 2020 ఏడవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో నా కథ చదివే అవకాశం దొరికింది. 

నేను పాల్గొన్న వేదిక ఏడవది. 

ఏడవ  ప్రసంగ వేదికని నిర్వహించిన పెండ్యాల శ్రీనివాస్ గారితో మొదలుపెట్టి - మాట్లాడిన వారి వరసలో - ఏడవ దాన్ని నేను. 

అన్నట్టు - నా పేరులో ఆంగ్ల అక్షరాలు ఏడు (L.A.L.I.T.H.A.). 

ఇంతగా కలిసొచ్చేసిన "ఏడు" కి నాకు తెలిసి ఎన్ని పేర్లున్నాయా అని ఆలోచిస్తే నాకు ఏడుకి ఒకటి తక్కువగా - తెలుగులో రెండు, సంస్కృతంలో ఒకటి, కన్నడలో ఒకటి, హిందీలో ఒకటి, ఇంగ్లీషులో ఒకటి - మొత్తం ఏడుకి ఒకటి తక్కువగా "ఏడు"కి ఉన్న పేర్లు తట్టాయి. 

అయ్యో! ఇంత మంచి "ఏడు"కి  ఇంకొక్క పేరు తెలిస్తే బావుండేదే అని వెతుకుతూ ఉంటే దొరికేసింది - "చక్కుపగడ". 

తెలుగులో ఆరు తర్వాత ఏడు

తెలుగులోనే ఆరున్నొక్కటి ఏడు 

సంస్కృతంలో సంఖ్య సప్త 

కన్నడద సంఖ్యె ఏళు

హిందీలో సంఖ్యా సాత్

ఇంగ్లీషులో హెవెన్ కి rhyme అయ్యే సెవెన్ 

ఈ ఒకటి-తక్కువ-ఏడు పేర్లని చేస్తూ "ఏడు" 

దొరికేసిందొక చక్కదనపు మాట తోడు 

ఏడు ఏడని మనమనే ఏడుకి

 చమత్కారమైన ఏడో పేరు 

"చక్కుపగడ"

 చమక్కుమన్న చక్కుపగడ

******* ******* ******* 

******* ******* ******* 


ఏడవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పాల్గొన్న తర్వాత "ఏడు" అంకె మీద మక్కువ పెరిగి - ఆ ఏడు గురించి రాసుకున్న ముచ్చట్ల తర్వాత నేను ఇక్కడ పంచుకోబోయేవి ఏంటంటే.... 

మొదటగా - నేను చదివిన కథ

తర్వాత - 7 వ వేదిక ప్రసంగాలు

అటు తర్వాత - 7 వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు అన్ని వేదికల play list:


ఏడక్షరాల పేరున్న నేను చదివిన (నేను రాసిన) కథ: "అమ్మకి హాఫర్లీ పరీక్ష ":


https://www.youtube.com/embed/jwvmQ5OzU7s?start=3540&end=4110


7 వ వేదిక ప్రసంగాలు: 

https://youtu.be/jwvmQ5OzU7s?list=PLJs1zqc22OGHW2Hagr_L9tmexHMJKGfv1


7 వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు (యూట్యూబ్ ప్లే లిస్ట్): 

https://www.youtube.com/playlist?list=PLJs1zqc22OGHW2Hagr_L9tmexHMJKGfv1


******* ******* ******* 

******* ******* ******* 

 

ముచ్చటైన ఏడుని ముత్యం మూడు సార్లు తలుచుకుంటూ ... 

7 వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పాల్గొనే సదవకాశం నాకిచ్చిన వంగూరి చిట్టెన్ రాజుగారికి, వంగూరి ఫౌండేషన్ కార్యనిర్వాహక వర్గం వారికి కృతజ్ఞతలు. 

7 వ వేదిక ప్రసంగాలని నిర్వహించిన స్నేహశీలి పెండ్యాల శ్రీనివాస్ గారికి, 7 వ వేదికలో పాల్గొన్న మా అందరికీ సాంకేతిక సహకారం అందించిన మధు పెమ్మరాజు గారికి, శేషగిరి నలబోతు గారికి ధన్యవాదాలు. 

7 వ వేదికలో నాతో పాటు పాల్గొన్న మిగిలిన వక్తలందరికీ అభివందనాలు, శుభాభినందనలు. 



4, అక్టోబర్ 2020, ఆదివారం

గీతం...సంగీతం...సతతహరితం - 7 - అణువూ అణువున వెలసిన దేవా!



వెలిగే సూర్యుడు 
ఊపిరి నింపే గాలి
మోసే భూమి 
దప్పిక తీర్చే నీరు
ఆకలి కొదగే - గింజా, ఆకూ, కాయా, పండూ 
అడక్కుండా వరమిచ్చే దేవుళ్ళు   

మౌనాన్ని కలిపే మాట
మదిని వెలిగించే నవ్వు
కన్నీటిని తుడిచే స్నేహం
ఆర్తికి అందే ఆసరా 
మనసై కలిసే - తోడూ, నీడా, నేస్తం, బంధం 
వెతుక్కుంటే వెన్నంటి నిలిచే దేవుళ్ళు 

ఉనికి అందని దేవుడు... 
ఉన్నాడంటే ఉన్నాడు 
లేడన్న చోటా ఉన్నాడు 
అణువణువున ఉన్నాడు 
అడుగడుగున ఉన్నాడు 

మనికి నింపిన దేవుడు... 
మంచి తలచి, మంచి చేసి
మనసు నవ్విన ప్రతి పూటా
మన తోనే ఉన్నాడు 
మన లోనే ఉన్నాడు 

******************
******************

ఏనాటి పాట అది?!
ఎప్పట్నుంచి వింటున్న పాట అది?!
ఎన్ని సార్లు విన్నా ఎప్పటికప్పుడు కొంగొత్తగా వినిపించే  పాట అది?!

వెన్నపూస పూసినట్లు 
వెండి తీగ మోగినట్లు 
వెన్నెల మించు అద్దినట్లు 
వెల కట్టలేని గళం లోంచి జాలువారిన పాట అది!

నేనింతగా చెప్తున్న పాట - మానవుడు-దానవుడు సినిమాలోది. సినారె రచనకి స్వరకల్పన చేసినది అశ్వత్థామ. 

పాటలో తెర మీద ప్రముఖంగా కనిపించేవారు - అమ్మ తొడిగిన చొక్కా-లాగు వేసుకుని, అమ్మ చేత తల దువ్వించుకుని బడికెళ్ళే బుద్ధిమంతుడైన బాలుడిలా కనపడుతూ, పాట పాడుతున్న  శోభన్ బాబుకి ఒక పక్కగా కృష్ణకుమారి, ముక్కామల, ఇంకో పక్కన శారద. 

ఆ పాట అణువణువునా ప్రాణం పోసి జీవం నింపింది మాత్రం ఎస్పీబీ గాత్రం. 

పాటలో ఉన్న మూడు చరణాలనీ మూడు రకాలుగా - ఆ చరణంలో ఉన్న భాషకి, భాషకి జతపడిన అనుభూతికి తగినట్టు భావస్ఫోరకంగా పాడిన విధానం అద్భుతం. ఆ పాడిన తీరు చెవుల్లో పోసిన అమృతం. 

పాట మొదటి చరణంలో  సాక్షాత్కరించే అమృతగుణోపేతులైన అమరజీవులు - ధ్యానముద్రలో ఉన్న బుద్ధుడు, కరుణామయుడు ఏసుక్రీస్తు, నిరాకారస్వరూపుడు అల్లా, ఏడుకొండల ఱేడు వేంకటేశ్వరుడు. 

ఈ చరణంలో ఆబాలగోపాల-ప్రియ-బాలు-స్వరం... శాంతరస-భరితం

పాట రెండో చరణంలో సజీవమూర్తులుగా గోచరించే ధన్యచరితులైన త్యాగమూర్తులు - మహాత్మా గాంధీ, స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ,  రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్, ఆజాద్ హింద్ ఫౌజ్ సేనాని సుభాష్ చంద్ర బోస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు, భాషాప్రయుక్తరాష్టంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావాన్ని నిరాహారదీక్షాబద్ధుడై సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములు. వీళ్ళే కాకుండా గోడకి తగిలించిన చిత్రపటాల్లో భారత రాష్ట్రపతులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ జాకీర్ హుస్సేన్ కూడా కనిపిస్తారు. 

ఈ చరణంలో ఆవేశ-భరిత-బాలసుబ్రహ్మణ్య-గళం... వీరరస-పూరితం

పాట మూడో చరణంలో  కనిపించే జీవనదాతలూ, సేవామూర్తులైన వైద్యనారాయణుల గురించి నా కంతగా తెలియదు. ఎవరికైనా తెలుసునేమో అడిగి వారి పేర్లు రాసుకోవాలి ఎప్పటికైనా.  

ఈ చరణంలో దయా-పూరిత-ఎస్పీ బాలసుబ్రహ్మణ్య-గానం ... కరుణరస-ప్లావితం. 

ఒకే పాటలో ఇన్ని రకాల భావాలు పలికించి - పాటను చిరంజీవిని చేసిన ధన్యజీవి మా సుబ్బయ్య. 

రోజుకోసారైనా - 
ఈ పాట వింటుంటాను. 
ఆ గొంతులోని మాధుర్యానికి తబ్బిబ్బవుతుంటాను. 
పాటని చూస్తూ - ఆ చిత్రపటాల్లో కనిపించే మహనీయులని మరొక్కసారి తలుచుకుంటుంటాను. 
వాళ్ళు చేసిన త్యాగాలకి జోహార్లనుకుంటుంటాను.  

నాకు అందిన హాయిని అందరికీ పంచుకోవాలని - నాకు ఇష్టమైన పాటని ఇక్కడ ... ఇలా... 
 






అణువూ అణువున వెలసిన దేవా! 
కనువెలుగై మము నడిపించ రావా!
అణువూ అణువున వెలసిన దేవా!

మనిషిని మనిషే కరిచే వేళ
ద్వేషం విషమై కురిసే వేళ
నిప్పులు మింగీ... నిజమును తెలిపీ
చల్లని మమతల సుధలను చిలికి... 
అమరజీవులై వెలిగిన మూర్తుల...

ఆ ఆ ఆఆ ఆ... ఆఆఆ ఆ ఆఆ ఆఆఆ ఆ ఆఆఆ... ఆఆఆ... ఆ... 
అమరజీవులై వెలిగిన మూర్తుల
అమృత గుణం మాకందించ రావా!
అమృత గుణం మాకందించ రావా!
 
అణువూ అణువున వెలసిన దేవా! 
కనువెలుగై మము నడిపించ రావా!
అణువూ అణువున వెలసిన దేవా!

జాతికి గ్రహణం పట్టిన వేళ
మాతృభూమి మొఱ పెట్టిన వేళ
స్వరాజ్య సమరం సాగించీ
స్వాతంత్య్ర ఫలమును సాధించీ
ధన్యచరితులై వెలిగిన మూర్తుల...

ఆ ఆ ఆఆ ఆ... ఆఆఆ ఆ ఆఆ ఆఆఆ ఆ ఆఆఆ... ఆఆఆ... ఆ...
ధన్యచరితులై వెలిగిన మూర్తుల
త్యాగనిరతి మాకందించ రావా!
త్యాగనిరతి మాకందించ రావా!

అణువూ అణువున వెలసిన దేవా! 
కనువెలుగై మము నడిపించ రావా!
అణువూ అణువున వెలసిన దేవా!

వ్యాధులు బాధలు ముసిరే వేళ
మృత్యువు కోరలు సాచే వేళ
గుండెకు బదులుగా గుండెను పొదిగీ
కొనవూపిరులకు ఊపిరులూదీ...
జీవనదాతలై వెలిగిన మూర్తుల...

ఆ ఆ ఆఆ ఆ... ఆఆఆ ఆ ఆఆ ఆఆఆ ఆ ఆఆఆ... ఆఆఆ... ఆ...
జీవనదాతలై వెలిగిన మూర్తుల
సేవాగుణం మాకందించ రావా!
సేవాగుణం మాకందించ రావా!

అణువూ అణువున వెలసిన దేవా! 
కనువెలుగై మము నడిపించ రావా!
అణువూ అణువున వెలసిన దేవా! 

******************
******************

తరలిపోయిన మేటి-తరాలకి, మరలిరాని హాయి-తనాలకి జేజేలు చెప్పుకుంటూ... 


~ పాటల భైరవి