30, సెప్టెంబర్ 2018, ఆదివారం

తా(నా) సంబరాల తాజా(-2)కబుర్లు - తొలినాటి whole మొత్తం టోకు talks - Penultimate ముచ్చట్లు

ఇప్పటికి పదహారు నెలల క్రిందట మా వూళ్ళో పదహారణాల తెలుగు తానా పండగ తెగ సంబరంగా, అంగరంగ వైభవంగా, గరం-గరం భోజనంగా,  బహు పసందుగా జరిగింది.

ఆ తానాయణంలో  సాంస్కృతిక-సాహిత్య వారధికి నా వంతుగా, ఓ వాలం-టీరుగా ఓ చిన్నబెడ్డని చేర్చిన నేను అప్పుడెప్పుడో మొదలుపెట్టి  చెప్పదలుచుకున్న తానా-కబుర్లలో ఒక అసలు కబురు, ఇంకో కొసరు కబురు ఇంకా మిగిలే వున్నాయి.

ఇన్ని రోజులూ నా కబుర్లే బోల్డన్ని చెప్పేసుకుని, అక్కడెక్కడో ఆగిపోయిన తానా-కబుర్లు మళ్ళీ చెప్పాలంటే - అసలెక్కడ మొదలు పెట్టి ఇంకెక్కడ ఆపానో ఒకసారి గుర్తు చేసుకోవాలి కదా! అందుకని ఒకసారి నెమరేసుకుంటూ - ఇదీ, ఈ కిందదీ చెప్పేసిన తానా-కబుర్ల వరస:

తా(నా) సంబరాల తాజాకబుర్లు - రాం-రాబర్ట్-రహీం మా ఇంటికి వచ్చినవేళ...
తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి మధ్యాహ్నం, మలిసంజ - 1
తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి మధ్యాహ్నం, మలిసంజ - 2
తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి మధ్యాహ్నం, మలిసంజ - 3
తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి అపరాహ్ణం - కొసరు కబుర్లు
తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి అపరాహ్ణం - అసలు కబుర్లు
తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి తొలిసంజ - అష్టావధానం-ఉపోద్ఘాతం
తా(నా) సంబరాల తాజా(-1)కబుర్లు - ముగింపునాటి తొలిసంజ - అష్టావధానం-ముక్తాయింపు
ఎల్లలు దాటే - ఎల్లెడలా వెలిగే ( తానా జ్ఞాపిక నుంచి నా జ్ఞాపకం)

ఏదో అప్పుడా వేడిలో, వేడుకలో రాసేశాను కాబట్టి - తొలిసంజ మలిసంజ; అసలు, కొసరు; ఉపోద్ఘాతం, ముక్తాయింపు - అంటూ ఆపసోపాలు పడుతూనైనా ముందూ-వెనకగా బోల్డన్ని విశేషాలు  రాయగలిగాను.

మరిప్పుడు దాదాపుగా ఏడాది మీద ఇంకో పావు-ఏడాది రోజుల తర్వాత రాయబోతున్న తానా సంబరాల మొదటి రోజుని అలా విడగొట్టి రాయాలంటే కొంచెం కష్టంగా అనిపించింది. అందుకే ఆ తొలిరోజు కబుర్లని టోకున ఒక్క flow లో, ఈ ఒక్క పోస్టులో రాసేద్దామని అనేసుకున్నాను. కానీ కుదరదేమో అని అనుమానం వచ్చి మళ్ళీ రెండుముక్కలుగానే రాయదల్చుకున్నాను. అలా మొదలీ penultimate ముచ్చట్లు.

మే 27, 2017 - శనివారం.

ఆ రోజు పొద్దున్నే ఎనిమిదిన్నరకల్లా సెయింట్ లూయిస్ డౌన్‌టౌన్‌లో వున్న అమెరికా సెంటర్ దగ్గర నన్ను డ్రాప్ చేస్తానని కార్లో తీసుకెళ్తున్నారు బదరి. అసలు తానా సభలకి రిజిస్ట్రేషన్ చాలా ఆలస్యంగా చేసుకున్నాను నేను. అంతకు ముందు రోజే రిజిస్ట్రేషన్ ప్యాకెట్ల పంపిణీ జరిగిందని తెలిసింది. అదసలు ఎక్కడ జరిగిందో, అక్కడికి ఎప్పుడు వెళ్ళాలో తెలుసుకునేలోగా పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. నేనేమో ఇదే మొదటిసారి తానాకి వెళ్లడం. అసలింతకు ముందు ఎక్కడ జరిగాయో, ఎలా జరిగాయో తెలీదు - తెలుసుకోవాలనే ఆసక్తి కూడా లేనే లేదు. ఇప్పుడు కూడా అనుకోకుండా సాహిత్య కమిటీలో వలంటీర్ని కాబట్టి వెళ్లడమే. లేకపోతే అసలా ఆలోచనే ఉండేది కాదేమో.

సరే! కార్లో వెళ్తున్నామా!? నా ఆలోచనలు, మాటలు, ప్రశ్నలూ అన్నీ తానాకి వెళ్ళాక నేనేం చెయ్యాలో అన్న దాని గురించే. నా తానా-బాధ భరించలేక బదరి రవి కోడూరికి ఫోన్ చేసి - "రవీ! లలిత రిజిస్ట్రేషన్ ప్యాకెట్ తీసుకోలేదు. తనకొకటి తీసుంచుతావా?" - అనడిగారు. అవతల్నుంచి రవి "సరే" అన్నారు అన్నమాట నాకు బదరి చెప్పేదాకా నాకు బెంగగానే వుంది - అదేదో మొదటిరోజు స్కూలుకెళ్తూ పుస్తకాలు మర్చిపోయినట్లు.

అమెరికా కన్వెన్షన్ సెంటర్ దగ్గర నన్ను దింపి, నేను లోపలి వెళ్ళేదాకా ఆగి, అప్పుడు ఇంటికి వెళ్లారు బదరి. లోపలికి వెళ్ళగానే రవి ఎదురొచ్చి రిజిస్ట్రేషన్ ప్యాకెట్ ఎక్కడ తీసుకోవాలో చెప్పారు. తను చెప్పిన కౌంటర్ దగ్గరికి వెళ్తే అక్కడున్న సుధీర్ నన్ను చూసి అక్కడున్న సంచులేవో వెతికి - "మీ ప్యాకెట్ లేదండి. అయినా పర్వాలేదు ఇదిగో ఈ బ్యాండ్ వేసుకోండి చేతికి" - అంటూ ఒక పసుపుపచ్చ ప్లాస్టిక్ కంకణం అందించారు నా చేతికి. నా ఎడమ చేతి మణికట్టుకి ధరించా ఆ తానా-దీక్షాబంధనాన్ని.



ఆ తర్వాత ఏం చేయాలా అని చూస్తూ ఉంటే, పక్కనే వున్న ఇంకో కౌంటర్ దగ్గర ఇద్దరు తానా జ్ఞాపికలను (souvenirs) సంచుల్లో సర్దుతూ కనిపించారు. నేను రాసిన నా తెలుగు మీద మక్కువని గురించిన వ్యాసం "ఎల్లలు దాటే - ఎల్లెడలా వెలిగే" అందులో ఉంటుంది కదా, ఒకసారి చదివేసుకుందాం అనేసుకుని గబగబా వాళ్ల దగ్గరికెళ్లి నాకో సంచీ ఇవ్వండి అనడిగా. వాళ్ళు నన్ను చూసీ చూడగానే - "ఇప్పుడే కాదండి. పదకొండింటికి రండి" - అని చెప్పారు. అప్పటికి పదే అయింది. మా సాహిత్య కమిటీ వారి మొదటి కార్యక్రమం "ఎల్లలులేని తెలుగు" మధ్యాహ్నం ఒంటిగంటకు కానీ మొదలు కాదు. ఇంకా మూడు గంటలు టైం వుంది. ఏం చేద్దామా అనుకుంటూ కొంచెం ముందుకి వెళ్ళగానే మైకులోంచి ఎవరో చెప్తున్నారు (పసుపులేటి రవిగారనుకుంటాను) - "సాహిత్య కమిటీ వలంటీర్లు మెయిన్ స్టేజ్ దగ్గరికి వచ్చి వలంటీర్ బాడ్జెస్ తీసుకోవాలి" అంటూ. అది వినగానే గబగబా ఆ మెయిన్ స్టేజ్ ఎక్కడా అని వెతుక్కుంటూ వెళ్లిన నాకు చేతిలో బ్యాడ్జ్ పట్టుకుని అమృతరెడ్డిగారు ఎదురొచ్చారు. ఆయన నా చేతిలో పెట్టిన వలంటీర్ బ్యాడ్జ్ చూసీ చూడగానే - అసలిప్పటికీ తానా సాహిత్య కమిటీలో నేనేం చేయాలో, చేయబోతున్నానో ఏమీ తెలియని నేను - చేయబోయే ఇంతోటి ఉడతా-భక్తి పనికి అంత గొప్పగా నానా-వర్ణ పతకంలా వున్న ఆ బ్యాడ్జ్ పెట్టుకోవాలా అనుకుని అమృతరెడ్డి గారితో అదే అన్నాను - "నేను ఇది ధరించనండి, దాచుకుంటాను" - అని. ఆయన కూడా - "నేనూ మీలాగే" - అని నవ్వేశారు.

ఇదిగో ఈ కిందదే నే దాచుకున్న తానా వలంటీర్ బ్యాడ్జ్:



ఆ బ్యాడ్జ్ తీసుకుని bag లో పెట్టేసుకుని ఇవతలికి రాబోయేంతలో - మెయిన్ స్టేజ్ మీద కార్యక్రమమేదో మొదలయింది. సరే - పదకొండింటికి వెళ్లి తానా souvenir తీసుకునేదాకా నేను చేయబోయే పని ఏమీ లేదు కదా కాసేపు పెద్దలు చెప్పే మాటలు విందామని కూర్చున్నాను. అప్పటికి  పొద్దున్న 10:30అయింది. ముందుగా జంపాల చౌదరిగారు చక్కటి తెలుగులో సభకు స్వాగతం పలికారు. ఆ తర్వాత మాట్లాడినాయిన AP హైకోర్టు జస్టిస్ అట. ఆయన చెప్పిన మిగిలిన విషయాలు ఎలా వున్నా, ఆయన ప్రసంగంలో అమెరికాలో తెలుగువాళ్ళు చేసుకునే పండగ తానా అంటూనే, ఆ మధ్యలో ఒక ప్రసక్తిగా తెచ్చిన మా ఊరి డాక్టర్ - వడ్లమాని సుబ్రహ్మణ్యం గారి అమ్మాయి ముచ్చట అసందర్భంగా అనిపించింది. అంతకు ముందు రోజు TANA Banquet లో ఈ జస్టిస్ గారిని కలిసిన ఆ డాక్టర్ గారి అమ్మాయి తను తెలుగు ఎందుకు నేర్చుకోలేకపోయిందో అంటూ పంచుకున్న కారణం (ఆ కారణం నా బ్లాగ్ కి కూడా అప్రస్తుతమే!) హైకోర్టు జస్టిస్ గారు సభాముఖంగా ప్రస్తావించటం అస్సలు బాగా అనిపించలేదు.

తర్వాత ఇంకా ఎవరెవరో మాట్లాడారు కానీ - నాకు బాగా గుర్తున్నవి ఇద్దరి ప్రసంగాలు మాత్రమే. ఒకటి పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజుగారిది, రెండవది మాగంటి మురళీమోహన్ గారిది.

ముందుగా కృష్ణంరాజుగారేమన్నారంటే -  ఎన్టీఆర్ పుట్టినరోజు మే 28 అవడం , తానా 1977 మే 28న మొదలవడం, ఈ తానా లో మే 28, 2017 న ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ ఎంటీఆర్ తో "అడవిరాముడు" తీసిన రాఘవేంద్రరావు ప్రారంభోత్సవం చేయబోవడం - ఇవన్నీ భగవన్నిర్ణయాలుగా అనిపిస్తున్నాయని మహా-రామా(రావు) భక్తితో మాట్లాడారు. అంతే కాకుండా ఆంధ్రదేశంలో తెలుగులో బోర్డులు పెట్టట్లేదని వాపోయే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి లైఫ్ ఎచీవ్మెంట్ అవార్డు ఇవ్వబోవడం Make In India లాగా Talk In Telugu ఉద్యమాన్ని మొదలెట్టండి అని గుర్తు చేయడానికట. ఇవన్నీ అంటూ - అటూ ఇటూ హడావిడిగా తిరుగుతున్న మా సెయింట్ లూయిస్ ఆడపడుచులని చూసి ఇంకా కృష్ణంరాజుగారేమన్నారంటే "ఆంధ్రదేశంలో ఎవరూ లంగా-ఓణీలు వేసుకోవట్లేదు. తెలుగుదనం అమెరికాలోనే వుంది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో కూడా కనపడాలి అని ఆశిస్తున్నాను" - అంటూ.

[లలిత ఉవాచ: ఆంధ్రరాష్ట్రాల్లో మధ్యతరగతి ఆడపిల్లలు మండే ఎండల్లో పరికిణీలు, ఓణీలు వేసుకుని - జారిపోయే వాటిని సవరించుకుంటూ చదువులకి, ఉద్యోగాలకి తిరగడం ఏమంత ప్రాక్టికల్? ఆడతనం ఒలికించే ఆ పరికిణీ-ఓణీల కన్నా ఒంటినిండా వుండే చుడీదార్లే కొంచెం నయం. పండగల్లో అయితే మాత్రం పరికిణీ-ఓణీల్లో ఆడపిల్లలు అందంగా వుంటారు - అది మాత్రం నిజం]

కృష్ణంరాజు గారి ప్రసంగం విని, ఇంకెవరో ఇద్దరు ముగ్గురు మాట్లాడాక లేచి ఇవతలికి వద్దామనుకునే సరికి "ఇప్పుడు మాగంటి మురళీ మోహన్ గారి కీలకోపన్యాసం" అన్న మాట మైకులో చెప్పగా విని ఒక్క నిముషం ఆగాను. నాకు సినీనటుడు మురళీమోహన్ తెలుసు. కానీ ఈ మాగంటి వారెవరా అని చూస్తే వారు సాక్షాత్తూ మన "జయభేరి" వారే. "అర్రే! మన సినిమాప్త  బంధువులేం చెప్తారో వినకపోతే ఎలాగా - అందులోనూ కీలకోపన్యాసం కూడానూ"  అనుకుంటూ మళ్ళీ కూర్చున్నాను.

మురళీమోహన్ గారు చెప్పిన మాటలేంటంటే: "ఇంతకు ముందు చాలా సార్లు అమెరికా వచ్చాను. ఇంతకు ముందు వచ్చినప్పుడు మొదట్లో ఆసియా ఖండవాసుల్ని చూస్తే ఆనందంగా, తర్వాత భారతీయులని చూస్తే ముచ్చటగా అనిపించేది. ఇప్పుడు ఇంతమంది తెలుగు వారిని చూస్తుంటే ఆత్మీయులని కలిసినట్లనిపిస్తోంది. వేంకటేశ్వరస్వామి ఎన్ని ఊళ్ళల్లో వున్నా తిరుపతి ప్రత్యేకత తిరుపతిదే. అలాగే అమెరికాలో ఎన్ని సంఘాలున్నా తెలుగు వాళ్ళ సంఘమంటే TANA మాత్రమే. TANA మహావృక్షమైతే మిగిలిన తెలుగు సంఘాలు శాఖలు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు. కానీ అది TANA విషయంలో నిజం కాదు*." అని చెప్తూ ఈయన కూడా "ఆంధ్రాలో వున్న లంగా-ఓణీలు, జడకుప్పెలు, వడ్డాణాలు అమెరికా వచ్చేశాయి**" అని తెగ దిగులుపడిపోయారు.

[లలిత ఉవాచ: * ఇదే మురళీమోహన్ గారు NATS కి వెళ్తే ఇలా చెప్తారేమో అనిపించింది: "ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు. అది NATS విషయంలో అక్షర సత్యం."
** అబ్బా! అమెరికాలో వడ్డాణాలు, వంకీలు పెట్టుకుని తిరగడాన్ని మెచ్చుకోవడం బానే వుంది కానీ ఆంధ్రాలో అవి పెట్టుకుని తిరిగాలనుకునే వాళ్లకి తలకో gunman ని ఇవ్వగలరేమో కనుక్కోవాలి.]

సరే! ఇంకా ఎవరెవరో మాట్లాడుతున్నారు. ఇంతలో TANA souvenir ఆవిష్కరణ అని మైకులో చెప్పారు. అప్పుడు అర్థమయింది - ఇందాక ఆ souvenirs సంచుల్లో సర్దుతున్న వాళ్ళు ఎందుకు నన్ను తర్వాత రమ్మన్నారో. వెంటనే లేచి గబగబా souvenir కౌంటర్ దగ్గరికి వెళ్ళాను. నన్ను చూడగానే వాళ్ళు దూరం నుంచే చేతులు విదిలించారు - "ఇప్పుడే కాదు, రాకు హుష్.. హుష్" - అన్నట్లు. అల్లాంటి విదిలింపులు, హుష్హూ-హుష్షూలు పట్టించుకోవడానికి నేనేమన్నా వాయస-వంశదీపాన్నా :) అస్సలా హస్త-చాలన-భాష నాకు అర్థమే కానట్టు వెళ్లి చెయ్యి చాపి నా చేతుల్లో ఓ సావనీరు-సహిత-సంచీ పెట్టేవరకూ కదలని-మెదలని సాలభంజికలా అక్కడే నించున్నా -  పదే పదే అడిగి "సాధించి" మరీ సాధించా. 

ఆ పుస్తకం తీసుకుని వస్తూ ఉంటే దారిలో అల్లు అరవింద్ గారు, ఇంకో పక్క నుంచి రాఘవేంద్రరావు గారు వారి వారి పరివారాలతో వెళ్తూ కనిపించారు. సరదాగా వాళ్ళని చూసుకుంటూ ముందుకెళ్లగానే భోంచేయ రమ్మంటూ ఒక ఆహ్వానతోరణం  కనిపించింది. 




అది చూడగానే బహుముచ్చటగా అనిపించి ఓ ఫోటో తీసేసుకున్నా. ఎలాగూ పన్నెండవ్వ బోతోంది. పొద్దున్న ఎప్పుడో ఇంట్లో తిన్న ఉప్మా అప్పటికే అరిగిపోయింది. తొందరగా భోంచేసేస్తే - కొంచెం ఓపిక తెచ్చుకుని తెలుగు సాహిత్య కార్యక్రమం జరగబోయే 132 సంఖ్యాంకిత-అంకణానికి వెళ్లి అక్కడ ఏమైనా అవసరమైన పని చేయొచ్చు కదా అనుకుని భోజనానికి రమ్మని ఆహ్వానిస్తున్న ఆ తోరణాన్ని మురిపెంగా చూస్తూ మాయాబజార్-ఘటోత్కచులవారి పాటని తానా వారి విందుకి వాడుకున్న వారి పేరడీని మెచ్చుకుంటూ అప్పటికే లైనులో నించున్న వారందరి కన్నా వెనకగా నించున్నాను. నెమ్మదిగా లైను కదులుతోంది. 

నేను చుట్టూ వున్న ఎలక్ట్రిక్ దీపతోరణాల వెలుగులో నక్షత్ర మాలలు ధరించిన దేవకన్యల్లా TANA పండక్కి వచ్చిన అమ్మలూ, అమ్మాయిలూ కళకళలాడుతూ తిరుగుతుంటే వాళ్ళు ఎటు తిరిగితే అటు వాళ్ళ తళతళల వెంటే నా కళ్ళు తిప్పుతూ మైమరచిపోతూ వున్నాను. 

అంతలో చాలా గా...ఠిగా, అంతకన్నా ధాటిగా, అథారిటీగా ఎవరో శ్యామల-వర్ణ తన్వి - ఒక ఆఫ్రికన్-అమెరికన్ లేడీ ఆ భోజనశాల ద్వారం దగ్గర ఒకతన్ని ఆపి అరుస్తోంది. ఒక్కసారిగా నా మైమరపు లోంచి మేల్కొని ఏంటబ్బా ఆవిడ అంటోంది అని వింటే - దాని సారాంశం ఏంట్రా అంటే - పాపం అతను చేతికి పర్పుల్-కంకణం బదులు పచ్చ-కంకణం ధరించాడట. ఈ ఆహ్వానతోరణం కట్టిన భోజనశాల ద్వారం లోంచి పర్పుల్-వాళ్ళే తప్ప పచ్చ-కంకణ-ధారులు వెళ్లకూడదట. ఆవిడ కేమో TANA వాళ్ళు అలా అరవమనే చెప్పారట. ఆవిడ అరుపులకి జడుపు-జ్వరం వచ్చిన పిల్లాళ్ళా హడిలిపోయాడు అతనెవరో పాపం! 

చటుక్కున నాకూ తట్టింది - నేనూ సాదా-సీదా పచ్చ-కంకణ-ధారిణినే అని. "అమ్మో! ముందుకెళ్తే ఇంకేమన్నా ఉందా? బతికుంటే బ్రెడ్డూ-బటరూ తినొచ్చు" అనుకున్న దాన్నై ఓ గెంతు గెంతి ఆ లైన్ లోంచి బయటపడి కొంచెం ముందుకెళ్తే అక్కడ పచ్చ-లైను కనిపించింది. ఏదో "ఆకొన్న కూడు అమృతం" అన్న మాట నమ్ముకున్నదాన్నై ఉన్నదాన్ని కాబట్టి వేళకింత ఉట్టి పప్పు అన్నమో, వెన్న రాసీ రాయని పచ్చిబ్బ్రెడ్డో తినగలిగే నాకు ఆ లైన్లో వెళ్లి తినడం అంత అవసరమా అని ఒక్క నిముషం అనిపించింది కానీ మళ్ళీ సాయంత్రం దాకా ఉండాలి కదా అని నాకు నేనే నచ్చచెప్పేసుకుని నేను తినగలిగే మసాలా-రహిత-ఆదరువు ఒకటి వెతుక్కుని గబగబా తినేసి బయటికి వచ్చాను. 

[లలిత ఉవాచ: అంత చక్కగా అన్నీ ప్లాన్ చేసిన తానా వారూ! డబ్బులిచ్చి తానా-పల్లకి ఎత్తించే ముఖ్యులైన దాతలకి ప్రాముఖ్యత ఇవ్వాల్సిందే - అందులో ఏమాత్రం అనుమానం లేదు, ఆక్షేపణా లేదు. కానీ అన్నం అప్పటికి కడుపు నింపుతుంది, ఆదరణ ఎప్పటికీ మనుసుని నింపుతుంది. నా మటుకు నాకు అన్నంలో ఆదరువులు ఎన్నున్నాయో అనే లెక్క కన్నా పెట్టేవారి ఆదరణ ఎంతుందీ అనేదే లెక్క! అందుకని నా విన్నపం ఏంటంటే ఈసారి తానా సమావేశాలప్పుడు "తానా వారి విందు - హో హో హో నాకే ముందు" అన్న దాని కింద మయూరి సినిమాలో ఎస్పీబీ గారు స్వరబద్ధం చేసిన "నీ పాదం ఇలలోన నాట్య వేదం - నీ నాట్యం నటరాజుకే ప్రమోదం" అన్న పాట వరసలో "ఈ ద్వారం... డోనర్ల వారి కోసం... ఆ ద్వారం ... పచ్చ-కంకణాల కోసం" అని  ఇంకో రెండు లైన్లు రాయిస్తిరా నాలాంటి తానా-అజ్ఞానులను ద్వారపాలికల అరుపుల నుంచి రక్షించిన వారౌతారు. నాకు మాత్రం ఈ రోజుకీ మా ఊరి తానా పండగని తలుచుకున్నప్పుడల్లా  అన్నంలో పలుకుబెడ్డలా ఆనాటి ఆ ద్వారపాలిక అరుపులు జ్ఞాపకం రాక మానవు. నాలా ఇంకెవరికీ జరగకూడదని అంతే ..అంతే!]

ఈ రోజుకి చాలా చెప్పేశాను - ఇంకొన్ని కబుర్లు మాత్రమే వున్నాయి - అవి వీలయితే వచ్చే రెండు మూడు వారాల్లో...

మా ఊళ్ళో తానా అంటే 
సంతోషమై చిందేశా తందానా 
చెప్పేశా తానా-ఊసులునా బ్లాగునా
తానా (2017) అయ్యి ఆయె నాళ్ళు చానా  
మిగిలుంది కబుర్లు కొన్నే అయినా 
చెప్పెయ్యాలి మొదలయ్యేలోగా ఇంకో తానా (2019)


22, సెప్టెంబర్ 2018, శనివారం

నా నేస్తు పుస్తకమస్తు - ఆమని, వేసవి, వానకారు - 2

ఈ పుస్తకంలో ముందు పేజీలు: నా నేస్తు పుస్తకమస్తు - ఆమని, వేసవి, వానకారు-1

అల్లప్పుడెప్పుడో మొదలెట్టిన నా పుస్తకమస్తుకి కొన్నాళ్లు విరామమస్తు అయింది ఇన్నాళ్లూ... మళ్ళీ ఈ రోజుకి కుదిరింది - షుల్‌మన్‌గారి డైరీ కబుర్లు చెప్పుకోవడానికి.

ఇంతకు ముందే చెప్పినట్లు షుల్‌మన్‌గారి డైరీ  2006 వ సంవత్సరం ఫిబ్రవరి 5 న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో మొదలవుతుంది. మొదటి 66 పేజీలు Vasanta, Spring శీర్షికన ఏప్రిల్ 25 దాకా ఆమని పూల పరాగాల దారుల సరాగాలతో సాగుతుంది.

రాజమండ్రి లోని మహాలక్ష్మి హోటల్లో చేరిన షుల్‌మన్‌గారు కొత్త ప్రదేశానికి, పరిసరాలకి అలవాటు పడటానికి ప్రయత్నిస్తున్నారు. తెల్లవారుఝామున ఐదున్నర గంటలకి తనకప్పుడప్పుడూ వచ్చే పంటినొప్పిని గురించి, తనకొచ్చే నొప్పిని తాను ఒంటరిగా భరించలేనేమోనని తలచుకుని నొచ్చుకునే ఆత్మీయుల గురించి అస్పష్టమైన కలలు కంటూ - ఆ కలత నిదుర లోంచి మేలుకొని - హోటల్ పై కప్పు మీంచి చూస్తూ - చుట్టూ వున్న పరిసరాల జీవ(న) గీతానికి నేపథ్య సంగీతంగా - మూర్ఛనలు, అలంకారాలతో* కూడిన భూపాలరాగమా అనిపించే పక్షుల కూతలు, సైకిల్ బెల్లుల శబ్దాలు, పిల్లల అరిచే అమ్మలు, పళ్ళు అమ్మేవాళ్ల కేకలు, ఇంకో పక్క రేడియోల్లో వినవచ్చే సంసృత సుప్రభాతాలు - వీటన్నిటినీ ఆస్వాదిస్తూ షుల్‌మన్‌గారి ఉదయపు ప్రసారం ప్రారంభం.

[*లలిత ఉవాచ: ఈ మూర్ఛనలూ, అలంకారాలూ, భూపాలరాగం అన్న కర్ణాటక సంగీతానికి సంబంధించిన పదాలు అచ్చంగా షుల్‌మన్‌గారు వాడినవే... ]

రాజమండ్రి రాగానే మొట్టమొదటగా షుల్‌మన్‌గారు ఫోన్ చేసింది స్మైల్ గారికి. అది కూడా వచ్చీ రాని బుకిష్ తెలుగులో. అది వినగానే స్మైల్ గారికి ముందు అర్థం కాకపోయినా కొద్ది నిముషాల్లోనే ఆయనకి చటుక్కున గుర్తొస్తుంది - వెల్చేరు నారాయణరావుగారు షుల్‌మన్‌గారి రాజమండ్రి రాక గురించి చెప్పిన విషయం. వెంటనే వెళ్లి షుల్‌మన్‌ని హోటల్లో కలుస్తారు. అలా వున్న పళాన వచ్చేసిన  స్మైల్ గారిని "every inch a poet" అని వర్ణిస్తారు షుల్‌మన్‌.

స్మైల్ గారు మాట్లాడే స్వచ్ఛమైన తెలుగు షుల్‌మన్‌ గారికి అంతగా అర్థం కాకపోయినా అద్భుతంగా, అపురూపంగా అనిపిస్తుంది . స్మైల్ గారు షుల్‌మన్‌ని దాక్షారామం, బిక్కవోలు, అమరావతి, గుంటూరు - ఈ ఊళ్లన్నీ తీసుకెళ్తానని చెప్తారు.

మరి మన షుల్‌మన్‌ గారు రాజమండ్రిలో కొన్నాళ్ళు ఉండాలి కదా! హోటల్లో ఎన్ని రోజులని వుంటారు? ఎవరో ఒకరు అద్దెకుండడానికో ఇల్లు చూసి పెట్టాలి కదా! అదెవరు చేస్తారంటే...  1992-93 ప్రాంతాల్లో షుల్‌మన్‌ గారికి తిరుపతిలో* స్నేహితులైన ఆనంద్ గారు ప్రస్తుతానికి AIDS  మీద Yale Project చేస్తూ రాజమండ్రి లోనే వున్నారు. ఆనంద్ గారు, వారి ఆఫీస్ మేనేజర్ సతీష్ గారితో కలిసి షుల్‌మన్‌ గారు ఉండడం కోసం ఇళ్ళు వెతుకుతూ వుంటారు. అలా వెతుకుతూ కొంచెం వసతిగా కనిపించిన రెండు ఇళ్లను షుల్‌మన్‌ గారికి చూపిస్తారు.

[*లలిత ఉవాచ: ఆనంద్ గారి గురించి రాసేటప్పుడు from Tirupati Gangamma days అని రాస్తారు - షుల్‌మన్‌ గారు. అంటే వీరిద్దరూ కలిసి తిరుపతిలో గంగమ్మ జాతరకి వెళ్లి ఉంటారేమో అనుకున్నాను.]

మొదటి ఇల్లు ఆనం వెంకటఅప్పారావు రోడ్డు*లో వున్న ఒక అపార్టుమెంట్. శుభ్రంగా, విశాలంగా వున్న ఆ అపార్టుమెంటు తనకంటూ తనదైన వ్యక్తిత్వం (గృహత్వం అనాలేమో - ఇల్లు కదా!) లేక అసలు ఇల్లు లాగే అనిపించలేదు  షుల్‌మన్‌ గారికి. అందుకే అందులో చేరననేశారు.

[*లలిత ఉవాచ: ఆనం వెంకటఅప్పారావు రోడ్డు అనగానే ఇండియా వెళ్ళినప్పుడు అక్కడ నడిచినప్పుడల్లా షుల్‌మన్‌ గారి కనిపించని అడుగు జాడలేవో నాకూ దొరికినట్లనిపించింది.]

తర్వాత చూసిన రెండో ఇల్లు - ఊరికి కొంచెం దూరంగా జీడిమామిడి తోటల అంచున కొలువై వుంది. అది చూడగానే షుల్‌మన్‌ గారికి నచ్చుతుంది. ఆ రెండు ఇళ్లూ చూసింతర్వాత హోటల్‌కి తిరిగి వచ్చేస్తారు.

ఆ రోజు చీకటి పడింతర్వాత స్మైల్ గారు పతంజలి శాస్త్రిగారిని, ఎండ్లూరి సుధాకర్ గారిని షుల్‌మన్‌ గారి దగ్గరికి తీసుకుని వస్తారు. పతంజలి శాస్త్రిగారి పేరు ravishing (మనోహరం) గా అనిపిస్తుంది.

పతంజలి శాస్త్రిగారి గురించి షుల్‌మన్‌ గారు రాసుకున్న విషయాలేంటంటే ఆయన కూచిపూడి నాట్యానికి తరంగాలు (శ్రీ కృష్ణలీలాతరంగిణి*) రాసిన తల్లాఝ్ఝల నారాయణతీర్థుల వారి వంశానికి చెందిన తల్లాఝ్ఝల శివశంకర శాస్త్రిగారి మనవలు. నారాయణ తీర్థుల వారి సమాధి తమిళనాడులోని తిరుప్పుంతురుట్టి (Tiruppunturutti) అనే ఊళ్ళో ఉందట.

[*లలిత ఉవాచ: నారాయణ తీర్థుల వారి గురించి చదవగానే ఒకసారి - బాలగోపాలకృష్ణా! పాహి పాహి - నీలమేఘ శరీరా! నిత్యానందం దేహి దేహి - అనే ఎప్పుడూ పాడుకునే - నా చిన్నప్పుడు నాన్నమ్మ నేర్పిన తరంగం పాడేసుకున్నాను. అలాగే  - ఎప్పుడో మా నాన్నమ్మ దగ్గర్నుంచి నేను తెచ్చుకున్న శ్రీ కృష్ణలీలాతరంగిణి పుస్తకం ఇంకోసారి తీసి చదువుకోవాలనిపించింది. ఇప్పటికే ఓ నాలుగైదు పుస్తకాలు సగం సగం చదివినవి ఇంట్లో వంటింటితో సహా అన్ని గదుల్లోనూ వున్నాయి -వాటన్నిటికీ తోడు ఈ పాత-మేలిమి బంగారాలు కూడా. పుస్తకం సర్వకాల సర్వావస్థ హస్త భూషణం - అంటూ అమ్మ చెప్పిన మాట ఉండనే వుంది - అలాక్కానిద్దాం మరి!]




స్మైల్ గారితో ఎండ్లూరి సుధాకర్ గారు కూడా వచ్చారు కదా! సుధాకర్ గారు రాజమండ్రికి దగ్గరలో బొమ్మూరులో వున్న తెలుగు విశ్వవిద్యాలయంలో లెక్చరర్ గా పని చేస్తూ వుంటారు. ఆయన షుల్‌మన్‌ గారి దగ్గరికి వస్తూ తను రాసిన రెండు కవితా సంపుటాలని తెచ్చి ఇస్తారు. అందులో ఒకటి ఒక మంచి bilingual edition* (ఉభయ భాషా కవిత్వం) అని రాసుకున్నారు షుల్‌మన్‌ గారు.

[*లలిత ఉవాచ: ఎండ్లూరి సుధాకర్ గారి bilingual poetry అనగానే నాకు 2012 లో రాజమండ్రిలో వాళ్ళింట్లో కలిసినప్పుడు పుట్ల హేమలతగారు నాకు ఇచ్చిన నల్లద్రాక్ష పందిరి / DARKY అనే పుస్తకం గుర్తుకొచ్చింది.]



సరే! షుల్‌మన్‌గారు, స్మైల్ గారు, పతంజలి శాస్త్రిగారు, సుధాకర్ గారు లాంటి సాహితీ పిపాసులు, సాహిత్యమూర్తులు కలిస్తే వాళ్ళు మాట్లాడుకునే సాహిత్యం గురించిన కబుర్లు వినడానికి ఎంత బావుంటాయో కదా! ఆ రోజు రాత్రి  వాళ్ళు నలుగురూ సాహిత్యం గురించి బోల్డన్ని కబుర్లు చెప్పుకున్నారట. అంతే కాదు... షుల్‌మన్‌గారు హిబ్రూ బైబిల్ లోంచి The Song of  Songs పాదడమే కాకుండా దానికి అర్థం కూడా చెప్పారట.

ఆ కబుర్లు, పాటలు, వాటి అర్థాలు - వారు చెప్పడం, వీరు వినడం - అసలు ఈ పుస్తకం చదువుతూ - బ్లాగ్ రాస్తూ - ఊహించుకోవడానికే నాకు ఎంత బావుందో! ఇంక ఆ రోజు ఎలా ఉండి ఉంటుందో కదా?! కలియుగ భువన విజయమే!

అంతలో ఫోన్ చేసిన వెల్చేరు నారాయణరావుగారికి "I'm happy" అన్న ఒక్క వాక్యానికి మించి ఇంకేమీ చెప్పలేనంతగా ఉక్కిరిబిక్కిరి అవుతారు షుల్‌మన్‌గారు - ఆ సాహితీసంపన్నమైన సంభాషణలతో.

-------------------------------------------------------------------------------------------------------------

ఇప్పటికి నేనూ ఆపుతాను. కృష్ణశాస్త్రిగారు అన్నట్లు తీయ తేనియ బరువు మోయలేదీ బ్రతుకు... అందుకని కొంచెం కొంచెమే చెప్పుకుంటాను ఈ కబుర్లు.

చదవడానికో మంచి పుస్తకం
వినడానికో మంచి పాట
చూడడానికో మంచి సినిమా
మాట్లాడుకోవడానికో మంచి నేస్తం
తలవడానికో మంచి తలపు
పలకడానికో మంచి మాట  
ఇంతకు మించిన మంచి ఉంటుందా లోకంలో?!
ఈ మంచిని అందరికీ పంచి
పంచిన మంచి అంతకు అంతై
అంతటా మంచై
మరింత మంచగుగాక!

19, సెప్టెంబర్ 2018, బుధవారం

త్వామనురజామి - 28 - సెమావలోకనం - అదేమి అల్లరీ - అదేమి పోరెడీ...

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి: త్వామనురజామి - 27 - నాకింకా ...మేడమ్‌తో పని ఏముంది?

దీపావళికి ఇంటికొచ్చాను కదా - నా కథ ఇంకొంచెం ముందుకు నడిచేలోగా ఇక్కడ ఒక్కసారంటే ఒక్కసారి ఆగి ఇప్పటివరకూ గడిచిన సెమిస్టర్లలో జరిగిన సరదా సంగతులు జ్ఞాపకం చేసుకుంటూ ఈ సెమావలోకనం (Sem-అవలోకనం) ...

మా SPMVV లో 1991 మార్చ్‌ ఎనిమిదో తారీఖుకి ఉమెన్స్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి. అందులో భాగంగా చాలా పోటీలు జరిగాయి. నాకు ఆ రోజు ఎందుకో ఒంట్లో కొంచెం బావుండక రూంలోనే పడుకుని వున్నాను. ఇంతలో మా క్లాసు నుంచి ఎవరో వచ్చారు -  "లలితా! పద! మన క్లాస్‌లో డిబేట్ టీంకి ఒక్కళ్ళు తక్కువయ్యారు. నిన్ను సాహితీ మేడం పిలుచుకు రమ్మన్నారు" అంటూ.

"నేనేంటి? ఏమీ ప్రిపేర్ అవకుండా డిబేట్ ఏంటి?" అని నేను తప్పించుకోబోయాను .

"అదేం కుదరదు - నీకు ప్రిపరేషన్ ఏంటి? మేడం కూడా చెప్పారు లలితొస్తే చాలు, ఏ టాపిక్కైనా మాట్లాడేస్తుంది అని. నువ్వింక పద పద" అంటూ తొందర పెట్టారు.

తీరా వెళ్ళాక టాపిక్ - అమ్మాయిలు చదువుకుని ఉద్యోగం చేయాలా, వద్దా?

నేనేమో చదువుకున్న అమ్మాయిల మీద యూనివర్సిటీ బోల్డంత ఖర్చు పెడుతుంది కాబట్టి దాన్ని జస్టిఫై చేయడానికి ఉద్యోగం చెయ్యాలి, ఎంతో కొంత సమాజానికి తిరిగివ్వాలి అంటూ మాట్లాడితే, మా క్లాసులో హైదరాబాదు నుంచొచ్చిన అపర్ణేమో చదువుకున్నంత మాత్రాన అమ్మాయిలు ఉద్యోగం చెయ్యక్కర్లేదు, వాళ్ళ చదువుని పిల్లలని చక్కగా పెంచడానికి ఉపయోగించొచ్చు అంటూ మాట్లాడింది. చివరికి నేను - అమ్మాయిలు ఉద్యోగం చేస్తే కట్నం అడిగే అబ్బాయిలు ఆ మాటే మర్చిపోయి పెళ్లి చేసుకోమని అమ్మాయిల చుట్టూ తిరుగుతారు అనగానే చుట్టూ వున్న అమ్మాయిలందరూ చప్పట్లు కొట్టి నన్ను గెలిపించేశారు.

అదవ్వగానే మా సీనియర్స్ - శ్రీలత. సంగీత, గుత్తి పద్మజ వచ్చి "కాలేజ్ మెయిన్ బిల్డింగ్‌లో ఫాన్సీ డ్రెస్ కాంపెటిషన్ జరుగుతోంది లల్లీ! నువ్వు కూడా రా!" అని తీసుకెళ్లారు. అప్పటికప్పుడు ఫాన్సీ డ్రెస్ అంటే నా దగ్గర ఏమీ props లేవు. తెచ్చుకోవడానికి టైం లేదు. ఏం చేద్దామా అంటే వెంటనే తట్టింది - ఒక పిచ్చి అమ్మాయి వేషం. అప్పటికే నా జుట్టు గాలికి బాగా చెదిరిపోయింది. వేషం బానే కుదిరిపోయింది - ప్రయిజు కూడా వచ్చింది.

1991 ఆగస్టులో కాలేజ్‌లోకి మా సబ్-జూనియర్ బేచ్ కూడా వచ్చేసింది. వాళ్ళ రాకతో పాటే స్టూడెంట్ బోర్డు ఎన్నికల హడావిడి కూడా మొదలయింది. ఈసారి గుత్తి పద్మజ ప్రెసిడెంట్ పోటీకి నించుంది. ఇక ప్రతి సాయంత్రం డిన్నర్ అయిపోయాక రూము రూముకీ వెళ్లి పద్మజకి ఓటు వేయమని అడిగేవాళ్ళం. అలా తిరుగుతున్నప్పుడు కొత్తగా చేరిన MCA అమ్మాయిలు కనిపించగానే వాళ్ళని తొమ్మిదిన్నరకల్లా మా 603 వింగుకి రమ్మని చెప్పేవాళ్ళం.  వచ్చిన వాళ్ళ గురించి తెలుసుకుందామని సరదాగా మొదలుపెట్టిన ఆ కార్యక్రమం ఆ కొత్త batch లో ఒకరో, ఇద్దరో అమ్మాయిలు "అసలు మీరెవరు ఇవన్నీ అడగడానికి?" అన్నట్లు మాట్లాడిన తీరుతో కొంచెం serious గా మారి చిన్న సైజు ragging లా మారింది. కానీ చివరికి సరదాగానే ముగిసింది.

నా MCA, హాస్టల్ కబుర్లలో ఒక ప్రత్యేకమైన బుల్లి చాప్టర్ గుత్తి పద్మజ సొంతం. గుత్తి పద్మజ నాకు ఒక ఏడాది సీనియర్. తనని వర్ణించమంటే ఇప్పటికీ కళ్ళ ముందు కదిలేవి - ఎప్పుడూ నవ్వుతున్నట్టుండి కళకళలాడే మొహం,  కళకళలాడే మొహంలో తళతళలాడే గుండ్రటి నక్షత్రాల్లాంటి కళ్ళు,  తళతళలాడే కళ్ళకి తోడుగా నవ్వే పెదవులు, నవ్వే పెదవులకి అలంకారంగా అటూఇటూ రెండు బుగ్గల్లో పడే సొట్టలు. ఇంకో ప్రత్యేకతేంటంటే తనది దువ్వెనకి లొంగని గిరజాల జుట్టు.

తన నవ్వేమో pealing laughter.  ఎంత మందిలో వున్నా తను నవ్వగానే అందరి కళ్ళూ పద్మజ పైనే. చాలా బాగా పాడేది - అచ్చు అలీషా చినాయ్‌లా.

తన దగ్గరే మొట్టమొదటిసారిగా అలీషా చినాయ్‌ హిందీలో పాడిన Madonna పాటలు విన్నాను - తనే పాడుతుండగా. "మోరే పాపా దేదో మేరా ప్యార్ - ఐసే తో న హోనా తుమ్ ఉధాస్..." (Madonna's - Papa! Don't preach...) పాటతో మొదలు పెట్టి ఆ cassette లో వున్న పాటలన్నీ పాడేది. ఆదివారమో, ఇంకేదైనా సెలవురోజో వస్తే మా 603 వింగ్‌లో పాటల పండగే! వేసవి కాలంలో పవర్ కట్ రోజుల్లో కరెంట్ పోగానే గుత్తి పద్మజ గొంతెత్తి "నందికొండ వాగుల్లోన - నల్లతుమ్మ నీడల్లో.... నీడల్లే వున్నా... నీతో వస్తున్నా ...నీ భరతం పడతా ....నిన్నెత్తుకు పోతా ...ఓఓఓఓఓ " అని పాడుతుంటే ఆ టైంకి బాత్రూముల్లో వుండి బయటికి రాలేక, భయపడి తిట్టుకున్న అమ్మాయిలని తల్చుకుని, తల్చుకుని నవ్వుకునేవాళ్ళం.

పద్మజ పాటలు బాగా పాడడమే కాకుండా ఫ్లూట్ కూడా వాయించేది. SPIC-MACAY కార్యక్రమాల్లో భాగంగా  హరిప్రసాద్ చౌరాసియా మా కాలేజ్‌కి వచ్చినప్పుడు ఆయన ముందు పద్మజ ఫ్లూట్ వాయించింది కూడా. అంతే కాదు డాన్స్ ప్రోగ్రాములు, స్కిట్స్ - తను పాల్గొనని ఈవెంట్ ఉండేదే కాదు.

అన్నట్లు - పాత ఫొటోలేవో వెతుకుతూ ఉంటే మా SPIC-MACAY ఫోటోలు చాలా కనిపించాయి. అందులో ఓ మెచ్చుతునక.... [ఈ ఫొటోలో వున్నవారు: హరిప్రసాద్ చౌరాసియా, ఫజల్ ఖురేషి (జాకీర్ హుస్సేన్ తమ్ముడు - తబలా వాయిస్తూ), స్మిత అనే ఆవిడ]




ఇప్పుడు నేనున్నది నాలుగో సెమిస్టర్ అంచున కదా! సెమిస్టర్ల వరసలో కొంచెం ముందుకు వెళ్తే మూడో సెమిస్టర్లో మాకు CSA (Computer System Architecture) ఉండేది. కొంచెం కష్టంగా ఉండేది. అందులోనూ ఆ క్లాస్ మధ్యాహ్నం లంచ్ తర్వాత ఉండేది. పాఠం విందామని ఎంత sincere గా వుందామనీ, విందామని ప్రయత్నించినా కళ్ళు తేలిపోతూ ఉండేవి. చెవులు నిద్ర పోతూ ఉండేవి. దాన్ని రాఘవేంద్ర సర్ టీచ్ చేసేవారు. అల్లాంటి బద్ధకపు మధ్యాహ్నాలు నా కపితలకి, పోరెడీలకీ భలే ప్రేరణగా ఉండేవి.

కపిత అంటే కపిత్వం ఆవహించినప్పుడు రాసే కవిత్వం.

పోరెడీ అంటే క్లాస్ లోంచి పో(వడానికి) రెడీ గా వుండి కూడా, లేచి వెళ్లిపోలేనప్పుడు సదరు సబ్జెక్టు నోట్సులో రాసుకునే పేరడీ పాట. అప్పుడు రాసిన కపితలూ, పోరెడీలు కొన్ని ఇక్కడ ...

కపిత నంబర్ 1:

(మా రాఘవ సర్ గొంతు ఖంగుమంటూ ఉండేది - పాపం! చాలా sincere గా కంప్యూటర్ సైన్సులో ఎంటెక్ చేసిన SV ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ - అంతే sincere గా పాఠం చెప్పేవారు. మంచివారు. కానీ నా కపితలకి అంతకన్నా మంచి matter అయేది ఆయన చెప్పే సబ్జెక్టు.)

రాఘవా!
ఓ గర్జించే మేఘమా!
మధ్యాహ్నం క్లాస్ పెడితే మేం తూగమా!?
ఈ పాఠమేమన్నా రాగమా?
చెయ్యాలి మేము ఆగమా?
వెయ్యాలి నీ నోటికి బీగమా!

కపిత నంబర్ 2:

ఇది ఆర్కిటెక్చరా?
మా బుర్రలకు ఆక్యుపంక్చరా?
ఎపుడాగేను ఈ లెక్చర్?
రాసుకోవాలి మా గాయాలకు టింక్చర్! 

పోరెడీ నంబర్ 1:

(అప్పుడప్పుడూ internals లో మార్కులు తగ్గినప్పుడు పర్లేదులే అని భుజం తట్టుకోవడానికి పాడుకున్న పోరెడీ.)

చదవమంటే చదివేది చదువు కాదు...
రాయమంటే రాసేది టెస్టు కాదు...
ఇవ్వమంటే ఇచ్చేవి మార్క్స్ కావు
సున్నైనా వందైనా నీకోసం వేయరు...

పోరెడీ నంబర్ 2:

(ఇది ప్రతిరోజుమధ్యాహ్నం లంచ్ తర్వాత అదీ-ఇదీ అని కాకుండా ఏ క్లాసు జరిగినా ప్రార్థనాగీతంలా పాడుకున్న పోరెడీ పాట.)

వెడలినాడు మా సారు క్లాసు తీయగా
Chalk piece, Register రెండు చేతులా
భోరు భోరునా students ఘొల్లుమన్నారు
వేయకుమా సుత్తింక ఆపమన్నారు
తడబడిపోయి.. సారూ! ఆగమన్నారు
అరచి అరచి కన్నీరై కరుగుతున్నారు...

పోరెడీ నంబర్ 3:

(SPMVV లో మాది MCA third batch. అప్పుడే కొత్తగా మొదలయిన కోర్సేమో...  టీచింగ్ స్టాఫ్ అంతా అంతకు ముందు వేరే యూనివర్సిటీల్లో MCA చదివిన వాళ్ళో, ఎంటెక్ చేసిన వాళ్ళో అయివుండేవాళ్లు. అలా మాకోసారి CSA చెప్పడానికి ఒకానొక శ్రీనివాస కుమార్ అనే SV Engg College లో ఎంటెక్ చదివిన అతను వచ్చారు. రావడమే అం...త మంది అమ్మాయిలున్న క్లాసులో నించుని "నా పేరు..S ...  S. Kumar" అని చెప్పారు. అంతకు మించి ఆ రోజుకింకేమీ చెప్పలేక,  అలా అని మా క్లాసుని వీడి వెళ్లలేక మొత్తానికి ఓ అరగంట మా పేర్లడుగుతూ కాలక్షేపం చేసి నా చేత "నా పేరు లలితా T S , సర్! Yes  సర్" అని చెప్పించుకుని, నా పేరు నే చెప్పిన తీరు, ఎస్ ఎస్ అంటూ S మీద stress చేసిన తీరు వినీ వినగానే బోల్డంత stressful అయిపోయి క్లాసు ముగించేసి వెళ్లిపోయారు. రెండోరోజు మధ్యాహ్నం ఎస్కుమార్ గారు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిన ధైర్యాన్ని కూడదీసుకుని కుడికాలు పెట్టి మరీ మా క్లాసులోకి అడుగు పెట్టబోయే సరికి - ఆ లోపల కనిపించిందేంటా అంటే - బ్రౌన్ కలర్ చుంగిణీ స్కర్ట్‌ని రెండుపక్కలా బుట్టలా లాగి పట్టుకుని - గుండ్రంగా తిరుగుతూ -  S. Kumar's S. Kumar's- అని టీవీలో వచ్చే S. Kumar's Textiles adevrtaisement పాడుతున్న నేను, నన్ను చూసి నవ్వుతున్న మా క్లాస్ అమ్మాయిలు. అంతే ముందుకు పడబోయిన ఎస్కుమార్ గారి కుడిపాదం ఒక్క కుదుపుతో వెనక్కి తీసుకోబడినదై గిరుక్కున మళ్లిపోయింది. ఆ మళ్లడం ఇంక మరి తిరిగి చూడకుండా, ఇంకసలు తిరిగి రావడమనేది లేకుండా వెళ్లడమే! అదిగో...అప్పుడు కట్టిన పోరడీ ఇది - అప్పుడెట్టిన ఆరడికి గుర్తిది)


అంతలో సారుగారు లేచినారు
Board మీద చేయి వేసినారు
Class వంక ఓరగా చూసినారు
మరిచిపోయి వెర్రినవ్వు నవ్వినారు
ఒక్క పరుగులో class వదిలి పెట్టినారు
కలకల కలకల - నవ్విరి stundents
దబదబ దబదబ -బాదిరి బెంచీలు
పో పో సారూ - పోయిరా సారూ
పో పో సారూ - పోయిరా సారూ
చెప్పేవారు లేరా? CSA చెప్పేవారు లేరా!

ఇప్పటికి ఈ పోరెడీల అసలు పాటలేవో పోల్చుకుంటూ - ఈ కింది పాటని పాడుకుంటూ  మీరిక్కడ ఉండండీ ... 

అదేమి అల్లరీ -
అదేమి పోరెడీ...
కాలేజులోన గోల చేసి ఎంత  సందడీ ...


<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>


16, సెప్టెంబర్ 2018, ఆదివారం

విరిసి... మెరిసి... మురిసె... ఆమని


గడిచిన పూలకారు నెమరులో - నే రాసిన కవిత కౌముది సెప్టెంబర్ నెల సంచికలో - కవితా కౌముది శీర్షికన: http://www.koumudi.net/Monthly/2018/september/sept_2018_kavitha_koumudi.pdf





ఏటి దరిన అది ఏమని?
కూయు కోయిలలు ఊయలలూగే కొమ్మల రెమ్మల తరువని.
తరువులుండే తావది ఏదని?
తరువుల చివురులు తొడిగిన వని
ఆ వని దరి జేరెను ఆమని
దరి జేరిన ఆమనిని కొసరెను ఆ వని
వినుమిదె నా మనవిదె వినమని
విని విరుల సిరుల వరమీయమని
ఆ వని మనవి వినిన ఆమని
చిలకరించె చిఱునగవుల వానని
ఆ నగవులు కురిసి విరిసి విరులాయెనని 
విరులైన నగవులు తరువుల తనువుల నగలాయెనని
నగలైన విరుల తొడిగి తరువులు మెరిసెనని
మెరిసిన విరుల నగల తరువుల వగల గని
మరల మరల విరిసి...  మెరిసి...  మురిసె...  ఆమని

9, సెప్టెంబర్ 2018, ఆదివారం

అవతారంగారి నారాయణగారి బాబి - 13 - సంతానపర్వం

గతనెల కబుర్లు : అవతారంగారి నారాయణగారి బాబి - 12 - పని-పాటా? బాడ్మింటన్ ఆటా?

సరే! ఇప్పుడూ కొంచెం నా ఉద్యోగ విషయాలు, కంపెనీ విషయాలు అవన్నీ ఆపి కొంత నా సొంత విషయాలకి మళ్ళీ వెనక్కి వస్తున్నాను. ఏమిటనంటే 1970లో మెడికల్ షాపు పెట్టాం కదా?!  ఆ మెడికల్ షాపు 1970 అక్టోబర్ దసరా పండక్కి మొదలుపెట్టాం, 71 ఆగస్టుకి మూసేశాం. పదినెలల వ్యాపారం అది.

ఇదయింతర్వాత ఏంటంటే ఈ లోపులో నా ఇల్లాలు మళ్ళీ గర్భవతి అయింది. రెండో సంతానం. ఆ మెడికల్ షాపు అయిపోయింతర్వాత నేను పొలంలో కూర్చోవడం ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నపుడు అక్టోబరులో మా ఆవిడ ప్రసవించింది. శివకోడులో నున్నా నారాయణమూర్తిగారని చెప్పేసి ఆయన హాస్పటల్లోనే రెండోసారి కూడా అమ్మాయే పుట్టింది. మూణ్ణెళ్ళకి బారసాల అదీ పెట్టారు శివకోడులో. బారసాలకి శివకోడు వెళ్ళా. అలా వెళ్ళినప్పుడు డాక్టర్ నారాయణమూర్తిగారిని కలిశాను. కలిసి "ఏమయ్యా! ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారు - ఇంక నేను బెడ్డెక్కేస్తాను -  ఆపరేషన్ చేసేయ్. నాకు చాల్లే ఇద్దరాడపిల్లలు." అంటే ఆయన "అబ్బే ! అలా కాదు - ఇంకో సారి చూడు  నువ్వు. తప్పకుండా మగపిల్లాడు పుడతాడు. తొందర పడకు. వంశోద్ధారకులుండాలి" అన్నాడు. సరే - ఆయన మాటెందుకు కాదనడం అని ఊరుకున్నా. బారసాల్లో చంటిపిల్లకి అరుణ అని పేరు పెట్టాం. అరుణ అంటే సూర్నారాయణమూర్తి పేరు. అది పుట్టడం భరణీ నక్షత్రంలో పుట్టింది. అప్పటికి నేను వ్యాపారంలో అదీ దెబ్బతిని వున్నాను కదా! మా అమ్మమ్మగారు పప్పు సూరమ్మగారు, మా అమ్మగారు పేరిందేవిగారు - వాళ్లిద్దరూ కూడా "ఒరే! అరుణ అని సూర్నారాయణమూర్తి  పేరు పెట్టావు. పైగా దీనిది భరణి నక్షత్రం. భరణి నక్షత్రం వాళ్లు ధరణి నేల్తారట! అంచాత నీకిప్పట్నుంచి మంచిదశ పడుతుంది." అని నన్ను బాగా ఉత్సాహపరిచారు.

మా రెండో పిల్ల పుట్టినప్పుడే "లేతమనసులు"సినిమా వచ్చింది. అందులో కుట్టి పద్మిని లల్లి, పప్పి అనే కవలపిల్లలుగా యాక్ట్చేసింది. ఆ లల్లి, పప్పి పేర్లే మా పిల్లలకిముద్దు పేర్లయ్యాయి.

అటు తర్వాత 72లో ఉద్యోగానికి గణపవరం వచ్చేశాను కదా! మా ఆవిడ, ఇద్దరాడ పిలల్లూ శివకోడులోనే వున్నారు. గణపవరం ఊళ్ళో  కృష్ణారావని చెప్పేసి  ఏలూరు నుంచి వచ్చాడొకాయన. గణపవరంలో చుండూరి రంగనాయకులు కాలేజ్ వుంది . దాంట్లో కృష్ణారావుగారు ఇంగ్లీష్ లెక్చరర్. ఆయన భార్యాబిడ్డలు ఏలూరు లోనే ఉండేవారు. ఈయన ప్రతి వారం ఏలూరు వెళ్ళి వస్తూ ఉండేవాడు. నేను, మా బావమరిది మణి (దత్తు), కృష్ణారావుగారు, మేం ముగ్గురం కలిసి ఒక గోడౌన్‌ అద్దెకు తీసుకున్నాం. ఒకటే హాలు - పెద్ద హాలు ఈ చివర్నించి ఆ చివరి దాకా. కాకపోతే ఏంటంటే పల్లెటూరు కాబట్టి అక్కడ బాత్రూమ్స్, టాయిలెట్స్ ఉండేవి కాదు. కానీ ఈ గోడౌన్ దగ్గర అవి రెండూ ఉండేవి. ఎవరో కమ్మవారిది అది. మేమేమో అది అద్దెకి తీసుకుని - నేను, దత్తుగారు, కృష్ణారావుగారు - ముగ్గురం అందులో ఉండేవాళ్ళం. అందులో ఓ కిరోసిన్ స్టవ్వు పెట్టుకుని మేమే వండుకుంటూ - మేమిద్దరం కంపెనీకి వెళ్తూ ఉండేవాళ్ళం, ఆయనేమో కాలేజీకి వెళ్తూ ఉండేవాడు. ఈరకంగా 72 జూన్ దాకా మేం ముగ్గురం కలిసున్నాం.

కృష్ణారావుగారేంటంటే కాలేజీలో పని కదా! ఆయనకి ట్రాన్స్ఫర్ అయి వేరే వూరికి వెళ్ళిపోయాడు. ఇంక నేనూ, దత్తుగారూ మిగిలిపోయాం.

గణపవరంలో అనుమంచి లక్ష్మీనారాయణగారని కరణం గారుండేవారు. ఆయన భార్య అన్నపూర్ణమ్మగారు. వాళ్లకి ఐదుగురు సంతానం - ముగ్గురాడపిల్లలు, ఇద్దరు మొగపిల్లలు. పెద్దావిడ నాగలక్ష్మి, రెండో అమ్మాయి రాజ్యం, మూడో అమ్మాయి హనుమాయమ్మ. హనుమాయమ్మ అపుడు హైస్కూల్లో చదువుతూ ఉండేది. కొడుకుల్లో పెద్దవాడు ప్రకాశం, రెండోవాడు చంద్రుడు. కరణంగారిది పెద్ద ఇల్లు, చుట్టూ కాంపౌండ్ వాలు, పెద్ద గేటు , ఓ బావి. గేటు పక్కగా ఓ చిన్న వాటా ఉండేది - ముందు ఒక వరండా, వెనకాల రెండు రూములుండేవి రైల్వే కంపార్టుమెంటులాగా.  నేనూ, మణి (దత్తుగారు) కరణం గారింట్లో చిన్నవాటాలోకి చేరిపోయాం. దానికి బాత్రూం, టాయిలెట్ మేమే కట్టించుకున్నాం. అవి కట్టించుకున్నాక వెళ్లి చేరాం - 1972 జూన్, జులై ప్రాంతంలో.

ఈలోగా కాపరానికి మా ఆవిడొచ్చింది. వస్తూ ఒక పిల్లనే తీసుకొచ్చింది. "అదేంటి! లల్లీ నొక్కదాన్నే తీసుకొచ్చావు? పప్పి ఏదీ?" అనడిగాను. మా ఆవిడకి పెద్దక్కగారు లక్ష్మీ దేవని చేప్పేసి వుంది మా వదినగారు. ఆవిడ భర్త  ఐసోల సుబ్బారావుగారు. ఆయన మెడికల్ రిప్రజెంటేటివ్. వాళ్లకి పిల్లల్లేరు. వాళ్ళేం చేశారంటే మా పప్పీని వాళ్ళు తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్ళిపోయి "మా దగ్గరుంచుకుంటాం , మేం చూసుకుంటాం" అంటే మా ఆవిడ ఇచ్చేసింది.  ఇదంతా జరిగిందని నాకు తెలియదు. ఒక్క పిల్లతోనే వచ్చింది. సరే! వాళ్ళూ మావాళ్లే - మా వదినగారు, తోడల్లుడూను. పైగా పిల్ల మీద ప్రాణం పెట్టుకున్నారు. పోన్లే ఎక్కడో అక్కడ బాగా పెరిగితే చాలు అని సర్ది చెప్పుకున్నాను. అలా మా పప్పి వాళ్ళ దగ్గరే పెరిగింది. మధ్యమధ్యలో పిల్లని తీసుకుని  గణపవరం వస్తూ ఉండేవారు. అలా వచ్చినప్పుడు పిల్లలిద్దరూ - లల్లి, పప్పి - ఓ రెండ్రోజులు బానే ఆడుకునేవారు. మూడోరోజు ఇద్దరూ కొట్టేసుకునేవాళ్లు - చిన్నపిల్లలు కదా! కొట్టుకుని, జుట్లు పీక్కుని, కళ్ళ నిండా కాటుక కారిపోయేలా ఏడుస్తున్న వాళ్ళని చెరికో భుజం మీద ఎత్తుకుని నేనటూ ఇటూ తిప్పేవాణ్ణి.


1972 లో మా బావమరిది మణికి పెళ్లయ్యింది. అప్పటివరకు మేమందరం ఒకే వాటాలో ఉండేవాళ్ళం. మరిప్పుడు దత్తుగారికి పెళ్లయ్యిది కదా! కరణంగారు ఏం చేశారంటే డాబాపైన గోడలు కట్టేసి పైన రేకులు వేశారు. ఒకటే పెద్దగది అది. అది నాకు అద్దెకిచ్చారాయన. నేను కాపరానికి పైకెళ్లి పోయాను. ఆ ఒక్క గదే మాకు వంటిల్లు, డైనింగు, డ్రెస్సింగు, బెడ్రూము - అన్నీ అక్కడే, అక్కడక్కడే. అందులోనే ఓ సీలింగు ఫ్యాను బిగించుకున్నాను. వేసవికాలం వచ్చేటప్పటికేమోను.. నా దగ్గర మూడు మంచాలుండేవి. ఓ పెద్ద నవారు మంచం, ఇంకో చిన్న మంచం. ఈ చిన్నమంచం ఆ పెద్ద మంచం కిందకెళ్ళి పోయేది. పిల్లని దాని మీద పడుకోబెట్టేవాళ్ళం. ఇంకో మడతమంచం బయట ఉండేది. వేసంకాలం వస్తే చిన్నమంచం, మడతమంచం బయట వేసుకుని చగ్గా డాబా మీద పడుకునే వాళ్ళం చల్ల గాలి పీల్చుకుంటూ.

ఈలోగా 73లో మా ఆవిడ మూడోసారి గర్భవతి అని తెలియగానే ఆఫీసులో ఓ వారం రోజులు సెలవు అడిగి రాజోలు నున్నా నారాయణమూర్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేయమన్నా. వెంటనే ఆయన "అదేంటి! ఎందుకంత తొందర? మూడోది కూడా ఆడపిల్లో, మగపిల్లాడో చూసి ఆ తర్వాత ఆలోచిద్దాం" అన్నాడు. నేను వెంటనే "నాకే పిల్లైనా ఒకటే! నువ్వు చేస్తావా, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్లి చేయించేసుకోనా?"అనడిగాను.

ఆరోజుల్లో ఏంటంటే ప్రైవేట్ డాక్టర్లకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తే కొన్ని బెనిఫిట్లు ఉండేవి. నేనలా అనగానే నారాయణమూరిగారు "ఒద్దులే బాబూ! రేప్పొద్దున్న వచ్చేయ్ చేసేస్తాను" అన్నాడు. రెండోరోజు పొద్దున్నే వెళ్లి "ఇదిగో డాక్టరుగారూ! నాకు జనరల్ అనస్థీషియా ఇవ్వొద్దు. నువ్వు చేసే ఆపరేషన్ ఏంటో నేనూ చూడాల" అంటే "నీలాంటి వాణ్ణి ఇప్పటిదాకా చూళ్ళేదయ్యా బాబూ!" అంజెప్పి లోకల్ అనస్థీషియా ఇచ్చి చేసేసాడు. తర్వాత ఓ వారం రోజులు శివకోడులో రెస్టు తీసుకుని మళ్ళీ గణపవరం వచ్చి నా ఉద్యోగం రోటీన్లో పడిపోయాను. 

1974 లో మా మూడో అమ్మాయి పుట్టింది. మా మూడోది కిరణ్మయి అసలు పేరు - ముద్దు పేరు కుట్టి. దానిక్కొంచెం అల్లరెక్కువ. దానికి ఏడాది వయసున్నప్పుడు - మా ఆవిడ - వంటకి కిరోసిన్ స్టవ్వు కదా - ఆవిడేదో పిల్లకి స్నానం చేయిద్దామని నీళ్లు కాస్తోంది. నీళ్లు కాగాయి బకెట్లో పోద్దామని దించుతోంది. ఇంతలో ఈ  కుట్టి వెళ్లి ఆవిడ చీర కుచ్చిళ్ళు పట్టుకుని నించోబోయింది. ఆ పళంగా ఆ కాగే కాగే నీళ్లు కుట్టీ మీద పడిపోయాయి. మెడ కింద నుంచి అంతా కాలిపోయింది. చర్మం లేచిపోయింది. అప్పుడు ఫోన్లూ అవీ  లేవు కదా. వెంబడే నా ఆఫీసుకి కబురొచ్చింది - "ఇలాగ మీ అమ్మాయికేమో ఒళ్ళు కాలింది" అంటూ.  వెంటనే మా సుబ్బన్నగారి దగ్గరి కెళ్లి "సర్! ఇలా అయింద"ని చెప్తే వెంటనే ఆయన కారిచ్చాడు. ఆ కారు తీసుకుని మా కుట్టిని తీసుకుని చిలకలూరిపేటలో డాక్టరు దగ్గరికెళ్ళాం. ఆయన చూసి "ఏం ప్రమాదం లేదు, చర్మం పైనే కాలింది. చిన్నపిల్లే కదా తొందరగానే మాని పోతుంది" అని చెప్పి డ్రెస్సింగ్ చేసి పంపించేశాడు. ఆయనన్నట్లే తొరగానే తగ్గిపోయింది.

మా దగ్గర ఇద్దరు పిల్లలు, అప్పుడప్పుడు లక్ష్మీదేవితో వచ్చే మా రెండో పిల్ల - ముగ్గురూ, కిందుండే మా దత్తుగారి పిల్లలు అందరూ ఆడుకుంటూ వుండేవాళ్ళు.

గణపవరంలో శ్రీరామనవమి చాలా బాగా చేసేవాళ్ళు. ఎదురెదురుగా రెండు పందిళ్లు వేసేవారు. ఓ పందిట్లో చింతామణి డ్రామా వేస్తే, ఇంకో పందిట్లో సత్యహరిశ్చంద్ర నాటకం వేసేవాళ్ళు. అల్లా పోటా-పోటీగా మంచి మంచి కార్యక్రమాలు ఉండేవి. ఎడ్లపోటీలు ఉండేవి. శ్రీరామనవమి తొమ్మిది రోజులూ కోలాటాలు, చెక్క భజనలు, హరికథలు, బుర్రకథలు, రికార్డింగ్ డాన్సులు, సినిమాలు - మహా హడావిడిగా ఉండేది ఊరంతా.

గణపవరంలో మహిళామండలి కూడా వుండేది సంకా తులిశమ్మగారి ఆధ్వర్యంలో. అక్కడ మా ఆవిడొకసారి పాట కూడా పాడింది "పాడవోయి భారతీయుడా!" అంటూ. గణపవరంలో రోజులు చాలా సరదాగా గడిచిపోతుండేవి.

 ఈలోగా మా ఇంటి ఓనరు కరణంగారు ఇంటికి తూర్పు పక్కగా వున్న ఖాళీ స్థలంలో ఇంకో రెండు పోర్షన్లు కట్టించారు. వరసగా మూడు గదులు రైల్వే కంపార్టుమెంట్లలాగా. వాటిని కూడా అద్దెకిచ్చారు. వాటిల్లో ముందు పోర్షన్లోనేమో ఆంజనేయులు ఉండేవాడు. ఈ ఆంజనేయులు మా మావయ్య ఉమామహేశ్వర్రావు (ఆడిటర్) దగ్గర సూర్యనారాయణమూర్తిగారని ఆఫీస్ మేనేజర్ ఉండేవాడు,  ఆయన బావమరిది. అతను గణపవరంలో పత్తి కంపెనీలో పని చేసేవాడు.  అతనికి నలుగురు పిల్లలు - ఇద్దరు మొగపిల్లలు, ఇద్దరాడపిల్లలు. అతను మొదటి పోర్షన్లో ఉండేవాడు కదా! ఆ పక్క పోర్షన్లో ఒక షావుకారు ఉండేవాడు, పాత బాపారావు అతని పేరు. అతనికో కిరాణా కొట్టుండేది.

గణపవరంలో మూడు కిరాణా కొట్లుండేవి - పాత బాపారావు, కొత్త బాపారావు, మాణిక్యం. కొత్త బాపారావు దగ్గర మా ఖాతా. పాత బాపారావు మా పక్కనే కాపరం ఉండేవాడు. ఈ మాణిక్యం అనే అతను ఓ వింత మనిషి. అతనేవిటంటే సంవత్సరానికొకసారి ఆగస్టు పదిహేనుకి తిరుపతి వెళ్లి తలా, గడ్డం, మీసం మొత్తం నున్నగా చేయించుకొచ్చేవాడు.తిరిగొచ్చింతర్వాత మళ్ళీ ఆగస్టు పదిహేను వరకూ పెంచేవాడు. పెంచి తిరుపతి వెళ్లి మళ్ళీ చేయించుకొచ్చేవాడు.

మేము కూరలూ అవీ - ఫరీద్ అని చెప్పేసి ఒక కూరల కొట్టు - బూబు అని ఓ ముసలమ్మా, ఆవిడ కొడుకు ఉండేవారు. కూరలు మేము అక్కడే కొనుక్కునేవాళ్ళం.

ఇలా గణపవరంలో రోజులు నడుస్తున్నప్పుడేమయ్యిందంటే - నేను నా పాత అలవాట్లు - కంపెనీలో చేరిందగ్గర్నుంచీ డ్రింకు మానేశాను. తర్వాత సిగరెట్లు. నేనసలా రోజుల్లో రెడ్ విల్స్, బ్రిస్టలు - ఆ సిగరెట్లు కాల్చేవాణ్ణి. అటువంటిదీ ఉద్యోగానికి వచ్చినప్పుడు ఏంటంటే - జీతాలు తక్కువ. తరవాతేంటంటే పక్కన ఈ ఆంజనేయులు అనే అతను కాటన్ డివిజన్లో వర్క్ చేసేవాడు. అతను ఫీల్డ్ లో చేసేవాడనుకుంటాను. అతనికో మోటార్ సైకిలుండేది. కొంచెం మాకన్నా జీతాలు ఎక్కువ వాళ్లకి. దాంతోటి ఏంటంటే ఇంటికొచ్చేటప్పుడు పిల్లలకి చాక్లెట్లో, నిమ్మతొనలో, ఏవో ఒకటి తీసుకొచ్చేవాడు. నేను కూడా ఇంటికెళ్ళేటప్పటికి  చిన్నచిన్న పిల్లలుండేవారు కదా! పాపం! వీళ్లెదురొచ్చినప్పుడు అస్సలేం తీసుకెళ్లకపోతే బావుండదని సిగరెట్లు కూడా కంట్రోల్ చేసుకుని రెడ్ విల్స్ తాగేవాణ్ణి కాస్తా చార్మినార్ సిగరెట్లు అవసరమైనప్పుడే బయటికెళ్లి ఒక సిగరెట్టు కొనుక్కుని కాల్చేవాణ్ణి. అల్లా పదిపైసలు మిగిలినా పదిపైసలు పక్కన పెట్టుకుని ఒకటో రెండో చాక్లెట్లు కొనుక్కుని ఇంటికి రాగానే పిల్లల చేతికిస్తే వాళ్ళ మొహాలు వెలిగిపోయేవి - డాన్సు చేసేసేవారు. ఆ రకంగా సిగరెట్లు కూడా కంట్రోల్ అయిపోయాయి నాకు.

ఇంత దాకా గోదారి దాటొచ్చిన వాణ్ణి కాదు నేను.  అలాగే డబ్బు ఖర్చు లెక్క పెట్టిన వాణ్ణీ కాదు. ఇప్పుడేమో చూసి చూసి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. అలా అని ఇంటి నుంచి నా పొలం శిస్తులు అడిగి తెచ్చుకోవడానికి పౌరుషం. మరెలాగా? మా ఆవిడకి మా అమ్మగారు పెళ్ళిలో 26కాసుల వడ్డాణం పెట్టింది. పండగో పబ్బమో వచ్చినప్పుడు ఆ వడ్డాణాన్ని ఆంధ్రాబ్యాంకులో పెట్టి డబ్బు తెచ్చి పండగ చేసుకునేవాళ్లం.

అది కాకుండా ఎప్పుడైనా ఏమైనా అర్జెన్సీ వస్తే మా ఆఫీసులో క్యాషియర్ మాజేటి నాగేశ్వర్రావు గారని లక్ష్మయ్య గారి బావగారు ఉండేవాడు. ఆయన వేంకటేశ్వరస్వామి భక్తుడు. తిరుపతి అంటే ఇక్కణ్ణించే దండాలు పెట్టేస్తాడు. ఆయన దగ్గరికి వెళ్లి కూర్చునేవాణ్ణి. కూర్చుని "నాగేశ్వరావుగారూ! నేను రేపు బయల్దేరి తిరుపతి వెళ్తున్నాను" అనగానే అడక్కుండా ఓ రెండొందలు అడ్వాన్స్ ఇచ్చేవాడాయన. పైగా ఆయన సొంత డబ్బులు ఓ పదో, పదిహేనో హుండీలో వేయమని ఇచ్చేవాడు. ఆ రెండొందలూ తెచ్చుకుని అవసరం గడుపుకునేవాణ్ణి.

ఓ మూడ్రోజులు ఆఫీసుకి వెళ్లకుండా నాలుగో రోజు వెళ్ళగానే నాగేశ్వరరావుగారు అడిగేవాడు - "ఏమయ్యా! దర్శనం బాగా జరిగిందా?" అంటూ. "బ్రహ్మాండంగా జరిగిందండి" అనేవాణ్ణి. "మరి తిరుపతి వెళ్ళావు. తలనీలాలు ఇవ్వలేదా?" అనడిగేవాడాయన. నేను తిరుపతి వెళ్తే కదా తలనీలాలివ్వడానికి! నేను వెంటనే  "అబ్బే! నేను దర్శనం చేసుకోవడమే కానీ తలనీలాలు ఇవ్వడం, లడ్డూలు కొనుక్కోవడం ఇటువంటివి నాకెందుకో నచ్చవ్. అక్కడ వాళ్ళిచ్చిన లడ్డూ ఏదో అక్కడే తినేసి వచ్చేస్తాను. ఇదీ నా పద్ధతి. నేను ఫస్టు నుంచీ ఇంతేనూ" అంజెప్పేసి అనేటప్పటికి "సర్లే! పోనీ నేనిచ్చిన డబ్బులైనా హుండీలో వేశావా?" అనేవాడాయన. "ఆ! వేసేశాన్లెండి" అనేవాణ్ణి. ఆయనిచ్చిన డబ్బులన్నీ కూడా పక్కన పెడుతూ వుండేవాణ్ణన్నమాట. పక్కన పెట్టి ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు ఈ మొత్తమంతా ఒకేసారి వేసేసేవాణ్ణన్నమాట హుండీలో. ఈ రకంగా ఏదో మేనేజ్ చేసేవాణ్ణి.

ఇలా జరుగుతుంటే ఏమయ్యిందంటే అమలాపురంలో వుండే మా పెదబావగారు కఱ్ఱా భాస్కరంగారు "అసలు వీడేం చేస్తున్నాడు? ఏ వుద్యోగం చేస్తున్నాడో, వాడికేం వస్తోందో?" అనుకుని మా అన్నగారి దగ్గరికి వెళ్లారు. ఆయన మమ్మల్ని "ఒరే ఒరే" అనే పిలిచేవారు. ఎందుకంటే మా నాన్నమ్మకి మేనల్లుడే ఆయన. మా అన్నగారి దగ్గరికి వెళ్లి "ఒరే! అసలక్కడ వాడేం చేస్తున్నాడో, వాడికేం వస్తోందో తెలీట్లేదు కదా? కనీసం వాడి వంతు వాడికి పంపించెయ్. ఏదో చన్నీళ్ళకి వేణ్ణీళ్ళు తోడుగా అన్నట్లుగా ఉంటుంది కదా! వాడసలే ముగ్గురు పిల్లలతో వున్నాడు అక్కడ" (నేను ముగ్గురు పిల్లలతో వున్నాననుకుంటున్నాడాయన నేనిక్కడ ఇద్దరు పిల్లలతోనే వున్నానన్న సంగతి ఆయనకీ తెలీదు పాపం!) అనేటప్పటికి మా అన్నగారేం చేశారంటే అప్పట్నుంచీ నా ఒంతుకి రావల్సిన శిస్తు పంపించేస్తూ ఉండేవారు. ఇంకది రావడం మొదలు పెట్టాక బంగారం బ్యాంకులో పెట్టాల్సిన అవసరం వచ్చేది కాదు. అలా బాగానే గడిచిపోతూ ఉండేది.

ఇక పోతే మా ముగ్గురి పిల్లల పేర్లూ - లలితా త్రిపుర సుందరి, అరుణ, కిరణ్మయి కదా! మా అమ్మమ్మ - ఈవిణ్ణి  శివకోడు మామ్మ అని కూడా అంటారు - మా పెద్దమ్మాయి లల్లీని పొద్దున్నే ఆడిస్తూ "ప్రాతస్మరామి లలితా వదనారవిందం" అంటూ పాడేది. అది సరిగ్గా గుర్తులేదు నాకు.

ఇంక మా అమ్మగారేమో మా రెండో అమ్మాయి అరుణని ఆడిస్తూ - సూర్నారాయణమూర్తి పేరని "కమలములు వికసించే కమలాప్తుడుదయించే" అంటూ మేలుకొలుపు పాట పాడేది. ఎలా అంటే... నాగ్గుర్తున్నంతలో ఇదీ పాట...


మా మూడో పిల్ల కుట్టీవి పెద్దపెద్ద కళ్ళు. అందుకని దాన్నెత్తుకుని మా అమ్మగారు పాడిన పాట "కలువ రేకుల బోలు కనులు చూచితె చాలు కడుపు నిండును కన్నతల్లీ!" అంటూ. అది కూడా నాకు జ్ఞాపకం ఉన్నంతవరకూ పాడాను - ఇలా...



ఇక్కడితో సంతానపర్వం ఆపి - ఇక్కణ్ణించి మళ్ళీ ఉద్యోగ-పర్వంలోకి వెళ్తానింక!


<వచ్చేనెల తరువాయి కథ>

1, సెప్టెంబర్ 2018, శనివారం

సర(దా)సరిగమలు - 1 - ప్రేమ అన్నది కల, వల, నావ, లేడి...అంతే కాదు కాకి కూడా!

ముందస్తు disclaimer: ఈ పాటల కబుర్లకి ఉపోద్ఘాతం అసలు విషయానికి సంబంధం లేకుండా వుండుననిన్నీ, అది కూడా కొంచెం మామూలు కన్నా కొంచెం ఎక్కువ మామూలుగా వుండదనినిన్నీ, తీరా కొసాకూ కబుర్లు చదివాక అసలు మనమే పాట రెక్కనెక్కితే ఏ పాట దగ్గర తేలామా అని నిస్సంశయంగా అందరికీ సంశయంబనిపించుననినినిన్నీ, ఇది నేనింకో ని" ని ఎక్కువ రాయడానికే రాస్తున్నాననినినినిన్నీ చెప్పేసుకుంటున్నాను - ఆనక ఏమన్నా పేచీ ఉంటే మీదే పూచీ!

అసలుదో, ఎసరుదో మొదలెట్టేస్తున్నాను మరి! కాచుకోండి!

(ఇక్కడ మీతో నే పడబోతున్న పోటీ ఏమీ లేదు కనక అది "కాస్కోండి" కాదండోయ్! మిమ్మల్ని మీరు నా పాటకొమ్మచ్చి పాట్లాట నుంచి మిమ్మల్ని మీరే కాచుకొమ్మని - అంతే ...అంతే!)

కొన్ని పాటలు వినగానే ఆ పాటలో మాటలు పేర్చిన వరస, ఆ పేర్చిన మాటల నడకా-నడతా చూస్తే  ఇది తప్పకుండా ఫలానా రచయిత రాసిందనో, లేకపోతే ఇంకో ఫలానా దర్శకుడి సినిమాలోదనో నాలో నేనే అనేసుకోవడం - నాతో నేనే చెప్పేసుకోవడం నాతో నేను సరదాగా ఆడుకునే పాట్లాట. 

ఎప్పుడో పదోతరగతి తెలుగు వాచకంలో దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి "నేటిరేయి" చదివినప్పుడు - ఆ పాట పాఠాన్ని బెల్‌బాటం వేసుకుని, ఇంకో అరంగుళం పెరిగితే జులపాలనేయచ్చేమో అన్నట్లుండే క్రాఫుతో - అచ్చు ఆ రోజుల్లో ఒచ్చిన విశ్వనాథ్ వారి సప్తపది  సినిమా హీరోలా వుండే మా చిట్టిబాబు మాష్టారు సన్నగా పాడుతూ, మాటమాటకీ పరవశిస్తూ (ఆయనప్పటికి ఎంత ప్రేమలో వున్నారో మరి!) "కాలు చల్లదనాలో... కనలు తీయదనాలో ...వలపు పిల్లనగ్రోవి పిలుపులో, సొలపులో" అన్న మాటలకే కాకుండా, వాటి భావానికి కూడా అర్థం చెప్పీ చెప్పకుండా చెప్పిన తీరు నచ్చీ నచ్చినట్టుగా ఉండగానే - ఆ మరుసటిరోజు ఆకాశవాణి-వివిధభారతిలో ఈ మాసపు పాట కార్యక్రమంలో అదే పాట విన్న వెంటనే కృష్ణశాస్త్రిగారి కవితా-పక్షమైపోయాను నేను.

"నీవు వచ్చేవని నీ పిలుపే విని కన్నుల నీరిడి కలయజూచితిని - ఘడియ యేని ఇక విడిచిపోకుమా - చెదరిన హృదయము పగులనీకుమా ..." అంటూ ఒకరి తర్వాత ఒకరు అందుకుంటూ అమ్మా-నాన్న మల్లీశ్వరితో సమానంగా పాడుతూ - ఆడేపాడే పిల్లలం మమ్మల్ని నడిపించుకుంటూ తీసుకెళ్లి ఒక మబ్బట్టిన శనివారం సాయంకాలం  టంగుటూరు మారుతి థియేటర్లో - మల్లీశ్వరిని చూపించినప్పుడు నాకు పదిహేనేళ్ళు.

ఆ తర్వాత అన్నపూర్ణమ్మగారిని చూడడానికి వేసవి సెలవుల్లో అమ్మ, నేను గణపవరం వెళ్ళినప్పుడు ఎదురింటి తెలుగు లెక్చరర్ గారు నేను పాటలు బాగా పాడతానని ఏదో గాలివార్త  విని (అక్షరాలా ...గాలివార్తే అది - నేను కరణంగారింటి పిట్టగోడ మీద కూర్చుని నోటికొచ్చిన పాటలు పాడుకుంటుంటే ఆ పాటలను మోసుకెళ్లిన గాలి చెప్పిన వార్తది మరి!) "అమ్మాయ్ లల్లీ! పాటలు భలే పాడతావే!" అంటే "అవునండి - నాకు దేవులపల్లి పాటలంటే ఇష్టం" అని కోనసీమ-యాస-సహిత-భాషలో చెప్తే - "అబ్బా - ఆహా - దేవులపల్లి పాటలే !" అన్న ఆ తెలుగు మాష్టారి మాటల వెనకాల పైకి  ఆయన అన్నట్లనిపించని   'పిల్ల వేలెడు - బడాయి బోలెడు' అన్న మాటలు నాకు మాత్రం బాగానే విన్నట్లుగానే వినిపించాయి.

సరి, సరి - ఏదో సర(దా)సరిగమలు అంటూ దాసరి నారాయణరావు పాటల గురించి రాద్దామని మొదలెట్టానా? మరి దేవులపల్లి దగ్గరే నిస, నిస మని నిలబడిపోతే ఎలా?! అసలు దాసరి పాటకీ, ఈ దేవులపల్లి గురించిన రాతకీ ఏమన్నా సంబంధం ఉందా? ఏదో ఆవు-వ్యాసం రాసినట్లు ప్రపంచంలో నాకు నచ్చిన ఏ పాట గురించి చెప్పాలన్నా దేవులపల్లి దగ్గరే మొదలెట్టాలా? ఆయ్...  హన్నా!

అబ్బే! లేదు లేదు. అసలు సంగతికొస్తున్నా... ఇదిగో ... ఇప్పుడే!

అల్లప్పుడెప్పుడో దాసరి నారాయణరావు తీసిన "గోరింటాకు" సినిమా వుంది కదా! అదే శోభన్బాబు, సుజాత డాక్టర్లుగా నటించిన సినిమా. అందులో వాళ్లిద్దరూ తెగ మూగగా ప్రేమించేసుకుంటూ వుంటారు. ఎక్కడో సినిమా మధ్యలో సుజాత శోభన్బాబు రాసిన డైరీ చదివేసి కలలో ఓ పాట పాడేసుకుంటుంది - ఎలా ఎలా దాచావు అలవికాని అనురాగం ఇన్నాళ్లూ, ఇన్నేళ్లూ - అంటూ. 

సినిమాలో సుజాత (పి సుశీల), శోభన్బాబు (ఎస్పీ బాలు) అదేదో వాళ్ళే రాసి, రాగం కట్టేసినట్టు పాడేస్తారు కానీ అది దేవులపల్లివారి పాటమ్మా!

ఆ పాటలో మొదటి చరణం ఎలా ఉంటుందంటే...
సుజాతేమో ... 
పిలిచి పిలిచినా..పలుకరించినా ..పులకించదు కదా నీ ఎదా!
ఉసురుసురనినా...గుసగుసమనినా ఊగదే మది నీ మది?.

అని పాడితే -
దానికి మన బాబేమో ...
నిదుర రాని నిశిరాతురు లెన్నో...నిట్టూరుపు లెన్నో...
నోరులేని ఆవేదన లెన్నో...ఆరాటము లెన్నో...

అంటూ బదులిస్తాడు.

ఇంతకీ ఈ చరణం లోని లైన్లు ఎక్కడివీ అంటే దేవులపల్లి వారి శర్మిష్ఠ అనే శ్రవ్య-నాటికలోవి.  అసలు వాక్యాలివీ:
పిలిచి పిలిచినా, పలుకరించినా 
చలియింపదు జడశిలయో, నీ ఎద?
...... 
..... 
ఉసురుసు రనినా, గుసగుస మనినా
ఊగి తూగ దే కొరడో, నీ ఎద?

ఎంత బావున్నాయో కదా! సరే! ఇవి stock లో వున్నాయి కదా అని కొంచెం మార్చి మొదటి చరణంలో వాడేశారు. మరి రెండో చరణం రాయబోయేటప్పటికి చప్పున తట్టలేదేమో కృష్ణశాస్త్రి గారికి! అందులోనూ దానికి దాసరి గారి సినిమా కదా - ఆ వరసలో కిట్టించారు.

"అంటే ఎలా?" - అంటే...ఇలా!

 సుజాతేమో ఇలా అడుగుతుంది...
తలుపులు తెరుచుకొని వాకిటనే నిలబడతారా ఎవరైనా?
తెరిచి ఉందనీ వాకిటి తలుపు... చొరబడతారా ఎవరైనా?
దొరవో... మరి దొంగవో ?
దొరవో... మరి దొంగవో ?
దొరికావు ఈనాటికీ....


దానికి శోభన్బాబు ఉడుక్కుని - ఆ ఉడుక్కోవడం ఎందుకంటే.... మొదటి చరణంలో ఎంచక్కా ఎద, మది, పులకించడం, ఊగడం  అంది - ఇప్పుడేమో - దొంగ, తలుపులు తెరవడం, చొరబడడం - అంటోంది కదా మరి! - అందుకే వెంటనే అనేశాడు...
దొంగను కానూ...దొరనూ కానూ..
దొంగను కానూ...దొరనూ కానూ...నంగనాచినసలే కానూ....
అంటూ.

ఈ రెండో చరణం అచ్చుగుద్దినట్లు దాసరి గారి formaటుల్లో ఒకటైన  - ప్రశ్న-జవాబు.

ఇంకా ఆయన మిగిలిన formaట్లు ఏంటంటే IF-THEN-ELSE, Switch statement వగైరాల్లాంటి కార్యకారణ భావాలు, లేకపోతే అర్థ-metic series లాంటి మాటల-వరసలు.

ఆ ఫార్మాటు లేవో ఊహించుటకు పాటుపడి, ఆత్ర పడి, ఆయాస పడకుడి, పాట-ప్రేమిలార! ఈ పాటల-బ్లాగుల-పరంపరలో వాటన్నిటినీ దేని వాటా దాని కేసి, వాటంగా వివరించెద -విశదీకరించెద.

ఇప్పటికి మాత్రం ఓ  పాటని పట్టేసుకుని, దాని పని పట్టేసి, రాసి పెట్టేసి, అట్టేపెట్టేసుకుంటానేం!?

దాసరి గారి దర్శకత్వంలో సినిమాకి పాటైనందుకు కృష్ణశాస్త్రిగారి పాటే భావుకత-ఊయలలూగుట వీడి కార్యకారణ-భావ-ఊగిసలాటలో పడిపోతే, ఇంక స్వయానా దాసరి గారు పుట్టించిన పాట తీరెలా ఉంటుందో మచ్చుకోటి చూద్దాం.

ముందు యూట్యూబ్ లో జేసుదాస్‌గారనబడే K. J. ఏసుదాస్‌గారు పాడిన బ్రహ్మముడి సినిమాలో పాట వినేస్తే ఓ పనయిపోతుంది. ఆ పాటేంటో తెల్సిపోతుంది.




ప్రేమ అన్నది ఒక కల...  కల...  కల...
చిక్కుకుంటే అది వల...  వల...  వల...
మొదట సాగుతుంది నావలా...
పరుగు పెడుతుంది లేడిలా...
పిదప ఎగిరిపోతుంది కాకిలా...
కడకు విడిచి పోతుంది ఏకాకిలా...  ఏకాకిలా...

ప్రేమ అన్నది ఒక కల...  కల...  కల...
చిక్కుకుంటే అది వల...  వల...  వల...

మనసు అనే మల్లె మొగ్గపై - ఆశ అనే తుమ్మెదల్లే
వాలుతుంది రసవంతంగా - చేరుతుంది బలవంతంగా
చేరి మొగ్గపై మొగ్గలేస్తుంది - అది ముక్కలైతే ఎగిరిపోతుంది
మరో మొగ్గపై వాలుతుంది కొత్తగా...  కొత్తగా...

ప్రేమ అన్నది ఒక కల...  కల...  కల...
చిక్కుకుంటే అది వల...  వల...  వల...

వయసు అనే పూలబండిపై - పెళ్లి అనే గూడును కట్టి
ఆపుతుంది నెమ్మదిగా - ఎక్కుతుంది ఆనందంగా
ఎక్కి బండినే పడదోస్తుంది - అది పడుతుంటే పారిపోతుంది
మరో బండిపై ఎక్కుతుంది కొత్తగా...  కొత్తగా...

ప్రేమ అన్నది ఒక కల...  కల...  కల...
చిక్కుకుంటే అది వల...  వల...  వల...
మొదట సాగుతుంది నావలా...
పరుగు పెడుతుంది లేడిలా...
పిదప ఎగిరిపోతుంది కాకిలా...
కడకు విడిచి పోతుంది ఏకాకిలా...  ఏకాకిలా...

చిన్నప్పట్నుంచీ ఈ పాట ఎప్పుడు విన్నా నా చెవులు "పిదప ఎగిరిపోతుంది కాకిలా" అన్న వాక్యం వచ్చేదాకా భలే ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లనిపించేది. అది వినీ వినగానే భళ్ళుమని ఓ అట్టహాసం పెటిల్లని నా పక్కనున్నవాళ్ళని దడిపించేది - ఇప్పటికీ దడిపిస్తూనే వుంది - ఇక ముందు కూడా దడిపిస్తుందని నాదీ హామీ!

అసలా పల్లవి ఒక classic - దాని ప్రకారం  ప్రేమ అనే ఓ క్రాపు-పదార్ధం (మరి పాట మగగొంతులో వుంది కాబట్టి - అదే ఏ పీసుశీల్లాంటి గాయకమ్మో పాడుంటే జడ-పదార్థమయ్యేది) పడవలా నీళ్ల మీద ఊక్కుంటూ వచ్చి, జింకలా రోడ్డు మీద పరిగెట్టేసి, చివరికి కాకిలా గాల్లోకి ఎగిరిపోతుందట. అందులోనూ ఆ ప్రేమ కలలా మొదలెట్టి వలలా చుట్టేసిందని ఆ పాటలో ఏకాకిలా నడుస్తున్న అబ్బాయి మొహం వలవలా ఏడ్చేస్తున్నట్లుండడం పాటకి మరింత తగినట్లుందండోయ్!

ఇంకా ఈ పాట ఏం చెప్తోంది?  మనసనే మల్లెమొగ్గ పై  ఆశ అనే తుమ్మెద లాంటి ప్రేమ చేసే విన్యాసాలు ఏంటంటేటా  - వాలుడు, చేరుడు, గెంతుడు, ముక్కలవ్వుడు, ఎగురుడు!  మళ్ళీ ఇంకో మొగ్గ మీద ... వాలుడు, చేరుడు, గెంతుడు, ముక్కలవ్వుడు, ఎగురుడు!  ప్రేమంటే లవ్వాడుడు గదా మరి ఈ ముక్కలవ్వుడేందో! 

వయసు అనే పూలబండి మీద పెళ్లి అనే గూడు కడితే -  ప్రేమ ఆ బండిని బొటనవేలెత్తి లిఫ్టు అడిగి ఆపుతుందట , ఎక్కుతుందట, పడదోస్తుందట, పారిపోతుందట. మళ్ళీ ఇంకో బండిని... ఆపుతుందట , ఎక్కుతుందట, పడదోస్తుందట, పారిపోతుందట. ప్రేమకి కుదురు బొత్తిగా లేనట్టుంది (భలే! "లేనట్టుండడం" oxymoron అనబడే విరోధాభాసాలంకారం - ఇన్నాళ్లూ తట్టనేలేదు - ఇది తట్టించిన ఈ పాటకి చప్పట్లు).

పై పాట విన్న తర్వాత నాకు దాసరి నారాయణరావుగారి హాస్యప్రియత్వం మీద నమ్మకం పెరిగిపోయింది. నవ్వు-నవ్వించు అనే సూత్రాన్ని బాగా నమ్మినవారు కనుకనే ఏడుప్పాటతో కూడా నన్ను నవ్వించగలిగారు.

అర్థ-మెటిక్ సిరీస్ లాంటి ఈ పాటతో నా ఈ దాసరిగారి పాటల సరదా సిరీస్ ప్రారంభం.

పెదవులు చెవులదాకా సాగే నవ్వులతో మీరిక్కడ.... మళ్లింకో సరదా పాటతో వచ్చేలోగా ఆ నవ్వుల పువ్వులేరుకుంటూ నేనూ ఇక్కడే...ఎక్కడో!

~పాటల భైరవి