25, అక్టోబర్ 2026, ఆదివారం

మునుముందుగా ఓ సినీ-అస్వీకరణోపోద్ఘాతం - ఆనక ఓ రెండు సిన్మాల ఊనికా-పూనికా నచ్చిన కథా-కమామీషూ...

    బద్రీ, నేనూ కలిసి కాలక్షేపానికి సినిమాలు చూస్తాం - కొన్నిసార్లు థియేటర్లో, చాలాసార్లు ఓటీటీలో. 

    ఎక్కడ చూసినా, ఎలా చూసినా ఒక సిన్మాలో మేం చూసుకునే కొన్ని కొలతలు - 

    1) సినిమాలో కత్తులూ, కటార్లూ వూర్కూరికే వాడెయ్యకూడదు - కూరలు తరుక్కున్నట్టు తలలూ తనువులూ నరుక్కోకూడదు 
    2) గావుకేకలుండకూడదు - హీరో గొణుక్కోకుండా స్పష్టంగా మాట్లాడాలి 
    3) అచ్చ తెలుగు సిన్మా ఐతే - ఏ యాసైనా చూసేస్తాం - కానీ మాట బావుండాలి
    4) పిల్లలు పిల్లల్లాగే వుండాలి - పెద్ద కబుర్లూ, పిచ్చి వేషాలూ వెయ్యకూడదు
    5) హాస్యనటులని హీరో ఉట్టుట్టినే కొట్టకూడదు
    6) నవ్వించే మాటలుంటే మాకు బ్రహ్మానందం! 
    7) పాటలు బావుంటే మాకింకా మహదానందం!


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఒక సిన్మా థియేటర్లో చూడడానికి పైన చెప్పిన కొలతలకి తోడు - మాకున్న కొన్ని లెక్కలు -

    1) సూపర్-డూపర్ స్టార్లు లేనివీ 
    2) వందల కోట్లు ఖర్చు పెట్టనివీ 
    3) కథ వుంటుందేమో అనిపించేవీ, 
    4) కథ వుంటే-గింటే బావుంటుందేమో అన్న ఆశ పుట్టించేవీ 
    5) నేడే చూడకపోతే రేపుండవేమో అనిపించేవీ...
    6) "ఎంక సీన నొణ" టైపు సినిమాలేమో అని మాకనిపించేవీ (అంటే ఏంటో చెప్తా...చెప్తా... - ఇది నిన్ననే  అపర్ణ దగ్గర నేర్చుకున్నా - నాకు భలే నచ్చేసి ఇలా వాడుకున్నా) 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    మునుముందుగా  ఓ సినీ-అస్వీకరణోపోద్ఘాతం (అంటే ముందుగా ఓ disclaimer ...)

    నాకైతే ... 

    ఏదన్నా సిన్మా చూశాక - ఒక్కో  సిన్మా బోల్డు నచ్చేస్తుంది. ఇంకో సిన్మా ఫర్వాలేదనిపిస్తుంది. 

    ఏ సిన్మా ఎంత నచ్చినా తర్వాత మళ్లీ ఇంకెప్పుడూ చూడాలనిపించదు. . 

    ఏదన్నా సిన్మా చూశాక - ఆ సిన్మా నచ్చితే - చూశానని చెప్పాక  - ఎవరైనా - చూసిన సిన్మా ఎలా వుందీ అనడిగితే నా సమాధానం "నాకు నచ్చింది". 

    నాకు తెలిసినంతవరకు - నా జీవితంలో నేను చూసినంతవరకు - భక్తి, భుక్తి, మతం, రాజకీయం, పిల్లలూ, సినిమాలూ - చాలా వ్యక్తిగతమైన విషయాలు. 

    ఏ దేవుడిని ఎలా కొలవాలో - ఏం, ఎలా వండితే ఎవరికి నచ్చుతుందో - ఏ మతం ఎవరికి ఎందుకు సమ్మతమో - ఏ పక్షం ఎవరికెందుకు ప్రతిపక్షమో - పిల్లలనెలా పెంచాలో - ఏ సిన్మాని ఎలా, ఎందుకు చూడాలో - ఇలాంటి ఏ విషయాల్లోనూ - ఏ ఇద్దరి రుచులూ, అభిరుచులూ ఒకేలా వుండాలనే రూల్లేదు - ఒకేలా వుంటాయనుకోవడానికి వీల్లేదు. 

    అందుకే ఏ సినిమా అయినా నాకు నచ్చితే - బావుందీ - అని generalize చేసి చెప్పి - నేను చెప్పాను కదా అని వెళ్లిన ఒకళ్ళో ఇద్దరో చూసొచ్చి - ఏం బావుంది? నీ మొహంలా వుంది - అని అస్సలు మొహమాటమే లేకుండా నా మొహమ్మీద చెప్పాక - కొంచెం జాగ్రత్త పడి - "నాకు నచ్చింది" అని మాత్రం అని వూరుకోవడం అలవాటు చేసుకున్నాను. 

    అన్నట్టు సినిమాలు చూసే ముందు రివ్యూలు చదవడం కానీ, ఎవరి వ్యూలు వినడం కానీ నాకలవాటు లేదు. చూడబోయే సినిమా గురించి ఏమీ తెలియకుండా వెళ్లడం బావుంటుంది నాకు. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఇంత ఉపోద్ఘాతం అయ్యాక - ఇప్పుడు ఈ ఏడాదికి -  వచ్చినవి వచ్చినట్టు - భాషాబేధం లేకుండా - మా సిన్మా-కొలతలూ లెక్కలకి సరిచూసుకుని - ఎంచుకుని - మా ఇంటి సోఫాలో కాళ్లు చాపుకుని కూర్చుని - చూసిన  తెలుగు, హిందీ, తమిళ-మళయాళ-డబ్బింగు సినిమాలన్నీ ఒకెత్తైతే - అవి కాక - కోరుకుని - ఏదో ఒక కారణం చూసుకుని - థియేటర్‌కి వెళ్లి చూసిన సినిమాలు పుంజీడుకి ఒకటెక్కువ - పంచపాండవుల్లెక్క. 

     ఈ 2026 సంవత్సరంలో మేము థియేటర్లో చూసిన సినిమాలూ - అవి చూడడానికి ఇంటి నుంచి వెళ్లడానికో ముప్పావు గంట, చూసి ఇంటికి తిరిగి రావడానికో ముప్పావు గంట, చూస్తూ హాల్లో గడిపిన ఓ రెండున్నర గంటలు - అంటే నాలుగ్గంటల సమయం ఒక్కో సినిమాకీ గడపడానికి కొన్ని కారణాలూ ఏంటంటే.... 

    అనగనగా ఒక రాజు - ఈ సినిమా చూడడానికి రెండు కారణాలు - ఒకటి నవీన్ పోలిశెట్టి, రెండు మీనాక్షి చౌదరి. నవీన్ మాట్లాడితే నవ్వొస్తుంది. మీనాక్షి నవ్వితే బావుంటుంది. ఇంకంత కన్నా ఏం కావాలి? థియేటర్లో మాతో కలిపి ఓ ఏడుగురు. అనగనగా ఓ రాజు - ఏడు ప్రేక్షకుల కథ అన్నమాట. అంటే "ఎంక సీన నొణ" టైపు.

    సింగ్ గీతం - ఇది చూడడానికి ఒకే ఒక్క కారణం - సింగీతం శ్రీనివాసరావు గారు. ఆయన తీసిన సినిమాల్లో నేను చూసినవి -అమెరికా అమ్మాయి, పంతులమ్మ, సొమ్మొకడిది సోకొకడిది, ఆదిత్య 369, పుష్పక విమానం, మైఖేల్ మదన కామరాజు. అవన్నీ కూడా నాకు నచ్చాయి. కానీ "సింగ్ గీతం" చూడడానికి కారణం మాత్రం ఆ సినిమాలు నచ్చడం మాత్రం కానీ కాదు. 93 ఏళ్ల వయసులో సినిమా తీసిన ఆయన ఉత్సాహానికి ప్రోత్సాహంగా గౌరవపూర్వకంగా చూడాలనుకుని చూసిన సినిమా ఇది. మాటలన్నీ పాటలుగా వున్న సినిమా అక్కడక్కడా బానే అనిపించినా అంత ఎంగేజింగ్‌గా అనిపించలేదు.  మా వూళ్లో థియేటర్లో ఈ సినిమా "ఎంక సీన నొణ" టైపు.

    ఇరుముడి - మేము ఒకప్పుడు రవితేజ సినిమాలు ఇష్టంగా చూసినా - ఈ మధ్య వచ్చిన రవితేజ సినిమాలు ఓటీటీలో కూడా చూడడం మానేశాము. కానీ "ఇరుముడి" మాత్రం  పాత రవితేజని గుర్తు చేసుకుని - ఆ పాత రవితేజ రవితేజ కోసం థియేటర్లో చూద్దామనుకున్నాము. ఏమీ తెలియకుండా వెళ్లినా మాకు బాగానే నచ్చింది. మా వూళ్లో థియేటర్లో ఈ సినిమా "ఎంక సీన నొణ" టైపు.

    కామ్రేడ్ కళ్యాణ్ - శ్రీవిష్ణు సినిమాలకి మా వూళ్ళో పెద్దగా జనం రారు. అందుకే చూద్దామనుకున్నాం. సినిమా మాకైతే చాలా నచ్చింది. థియేటర్లో మేమిద్దరం, మా పక్క సీట్లలో ఇద్దరు - మా ముందు సీట్లలో ముగ్గురు. పట్టుమని పది మంది కూడా లేరు. మళ్లీ ఏడుగురే. అందుకే మా వూళ్లో థియేటర్లో ఈ సినిమా కూడా "ఎంక సీన నొణ" టైపు.

గరివిడి లక్ష్మి - ఉత్తరాంధ్రకి చెందిన బుఱ్ఱకథ(?) కళాకారిణి గరివిడి లక్ష్మి అనే ఆవిడ జీవితకథ ఆధారంగా తీసిన సినిమా. మాకు బాగా నచ్చింది. మా వూళ్లో థియేటర్లో ఈ సినిమా అపి (అపి ... అంటే - కూడా...)"ఎంక సీన నొణ" టైపు.

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    పైదంతా అయ్యాక - ఆనక ఓ రెండు సిన్మాల ఊనికా-పూనికా నచ్చిన కథా-కమామీషూ... 

    నేను చూసిన సిన్మాల కథలూ, కబుర్లూ అస్సలు చెప్పబోవట్లేదిప్పుడు. 

    అన్ని సినిమాల కథలూ ఎక్కడో ఒక చోట రివ్యూల్లాగానో, ఇంకో రకంగానో వుండే వుంటాయి. 

    ఇదివరకట్లా ఆ సిన్మాలు నాకు ఎందుకు నచ్చాయో అని చెప్పాలని కూడా లేదు. మా బద్రి కూడా అన్నారు నువ్వింక బ్లాగ్ రాస్తున్నావూ అంటే అదేదో సినిమా చూస్తేనే రాస్తావు అన్నట్టనిపిస్తోంది - అని. అందుకే నా సినీ-మాయ లోంచి బయటికి వచ్చేద్దామని ఆ కబుర్లెక్కువ చెప్పట్లేదు. 

    కానీ ఇటీవల చూసిన ఒక రెండు సినిమాల గురించి మాత్రం చెప్పకుండావుండలేకపోతున్నానబ్బా!

    అసలా సినిమాలు నచ్చిన కారణం కూడా చెప్పాలని బాగా అనిపిస్తోంది. 

    అక్కడికి వెళ్లే ముందు నేను బాగా నమ్మి ఆచరించే ఒక విషయమేంటంటే... చిన్నప్పట్నుంచి నేను నమ్మినదీ, నాలో నేను అనుకున్నదీ, నాకు నేను చెప్పుకున్నదీ ఓ మాటుంది. అది If you love, show it. If you feel, say it. 

    అంటే ఎవరి మీదైనా ఇష్టం కలిగితే, ఎవరిలో ఏమైనా నచ్చితే వాళ్లకి చెప్పాలి. వాళ్ల కళ్లలో ఆ చిన్ని మెరుపోటి చూడాలి. 

    మనిషి వుండగానే - వారు చక్కగా చూడగలిగి, వినగలిగిన రోజుల్లోనే వారి మీద ఇష్టాన్ని వాళ్లకి తెలియచెప్పాలి, చూపించాలి తప్ప - వాళ్లు వెళ్లిపోయాక - వాళ్లు వినలేని, చూడలేని "ఆహా - ఓహో" లు ఎందుకబ్బా అనిపిస్తుంది నాకు. 

    అలాంటి సందర్భమే ఇక ఇప్పుడు నేను ప్రస్తావించబోయే ఆ రెండు సినిమాలకి వర్తిస్తుంది - అవి ఏవంటే - సింగ్ గీతం, గరివిడి లక్ష్మి.



*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ముందుగా సింగ్ గీతం గురించి. 

    93 ఏళ్ల వయసులో ఇంకా సినిమాలు తీయాలీ అని ఎంతో ఉత్సాహంతో ఉరకలు వేస్తూ వుండేవారు దర్శకులు సింగీతం శ్రీనివసరావుగారు. ఆయన ఇంటర్వ్యూలలో ఆయన పని మీద ఆయనకున్న ఇష్టం ముచ్చటగా అనిపించేది - కానీ నిజంగా ఆలోచిస్తే అంత పెద్ద వయసులో ఆయనంతట ఆయన ఏం చేయగలరబ్బా అని కూడా అనిపించేది. 

    కానీ ఆయన ఆశనీ, ఆశయాన్ని అర్థం చేసుకుని - ఆయనకున్న పరిథిలో ఆయన ఏం చేయగలరో అంచనా వేసుకుని - ఆయన మీదున్న గౌరవాన్ని, భక్తిని - మెళ్లో వేసే దండల దగ్గర, కాళ్లకి పెట్టే దండాల దగ్గర  ఆపేయకుండా - ఆయన కన్న musical కలని magical గా నెరవేర్చిన నాగ్ అశ్విన్ చేసిన పని నాకు బో...ల్డంత నచ్చింది. 

    ఇప్పుడు సింగీతం శ్రీనివాసరావు గారు లేరు. వెళ్లిపోయారు. కానీ ఖచ్చితంగా వెళ్లిపోయేముందు "హమ్మయ్య! నేను అనుకున్నవన్నీ చెయ్యగలిగాను" అనుకునైతే వుండివుంటారు. 

    ఆయనకి అలాంటి ఒక సంతృప్తి దక్కే పరిస్థితిని కల్పించిన దర్శక-నిర్మాత నాగ్ అశ్విన్ సింగీతం శ్రీనివాసరావుగారికి ఇంకెవ్వరూ ఇవ్వలేని గొప్ప బహుమతిని ఇచ్చారు. May his tribe increase...


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఇప్పుడు గరివిడి లక్ష్మి సినిమా గురించి.

    తన పాట తనది కాకుండా పోయి - తన పాట తన చేతే పాడిస్తానని తనకిచ్చిన మాట కానిదైపోయి - తన ఉనికినే కోల్పోయి - తెరమరుగైన ఓ కళాకారిణి మీద గౌరవంతో, ఆమె పాట మీద ఇష్టంతో - ఆమె బతుకుబాటలో ఎక్కిన మెట్లనూ, దాటిన గతుకులనూ, పడ్డ పాట్లనూ, పాడిన పాటలనూ - సినిమా రూపంగా వెలుగులోకి తెచ్చిన "గరివిడి లక్ష్మి" నాకు ఇంకా బోల్డంత నచ్చింది. 

    గరివిడి లక్ష్మి అనే ఆవిడ తన కథ తనే చెప్పుకుని - తన కథలో తానే కనిపించేలా ఆవిడని తెర మొందుకి, తెర మీదకి తీసుకొచ్చి - తన పాటకి తనే హక్కుదారని లోకానికి చాటిచెప్పిన - దర్శకులు జమ్ము గౌరీనాయుడు ధన్యజీవి. May his tribe increase...


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    కొసా...కి ఓ కిసుక్కుమనిపించే కబురు... 

    మా వూళ్లో థియేటర్లో వచ్చే తెలుగు సినిమాలు చూడడానికి వెళ్లే మా గురించి మేమే వాడుకుని నవ్వుకోదగ్గ ఓ కన్నడ పదసముదాయము..."ఎంక సీన నొణ..."

    నేను ముందే చెప్పాను కదా - మేము ఏ సినిమా చూద్దామని వెళ్ళినా - సరాసరికి సరిగ్గా ఏడుగురి కన్నా మించరు సినిమా-చూపఱు, 

    అది మాతో కలిపి కానీ, కలపకుండా కానీ - ఎప్పుడూ ఏడే. 

    ఇదే విషయం నా ఫ్రెండ్ అపర్ణతో అంటే తను కన్నడలో అలాంటి సందర్భంలో "యారూ జనానే ఇల్ల రీ - ఏనో ఎంక-సీన-నొణ అష్టే" అంటారని చెప్పింది. 

అంటే "ఎవరూ జనమే రాలేదండీ - 'ఏదో ఎంకడూ-సీనా-ఓ ఈగా' అంతే" అన్నట్టు. 

    నాకది భలే నచ్చేసింది. ఈసారి నుంచి బద్రీ, నేనూ సిన్మాకి వెళ్తే అక్కడున్న  మిగిలిన వాళ్లు "ఎంకా-సీనా..." అయితే మేమిద్దరం రెండు "నొణగళు" OR vice versa".




*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    "ఎంకా - సీనా - నొణా" సహిత బోల్డన్ని కబుర్లు చదివినవారికీ - నేను చదవబోగా వినబోయేవారికీ ....
    బో....ల్డన్ని   న-మస్కా-రాలతో ....

    ~సినీ-మా-లక్ష్మి వ్రాలు 







11, అక్టోబర్ 2026, ఆదివారం

నేనూ, నా పెద్దొకటీ - అచ్చు మా నాన్నలాగే...

    నా చదువు మళ్లీ మొదలయింది. 

    మళ్లీ మొదలైందీ అని చెప్పడానికి నా చదువు ఆగింది ఎప్పుడూ లేదు.

    రోజూ ఏదో వొక కొత్త పాఠం - ఎక్కడోక్కడ - ఎవరో ఒకరి దగ్గర - నేర్చుకుంటూనే వున్నాను, వుంటాను కూడా!

    నిత్యవిద్యార్థినన్నమాట. 

కలిసిన మనిషి 
చెప్పిన మాటా, చూసిన చూపూ, చేసిన చేతా
కలయికలో దక్కిన - 
ఎవరనే ఎఱుకా, ఏమిటనే చవీ, ఎందుకనే తెలివిడీ
ఈ చదువంతా ఒక ఎత్తైతే

చుట్టూ వున్న చెట్టూ - గుట్టా
చూపుకానే పులుగూ - పసరం
కదల్లేని రాయీ - రప్పా
కదలకుండలేని నీరూ - గాలీ
చెప్పకుండానే చెప్పే చదువు ఇంకో ఎత్తు. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    ఇప్పుడొక్కసారి - తొలిగా నాకు చదువు చెప్పిన - చెప్తున్న ఒజ్జలందరిని ఓ సారి  తలచుకుని వారికి జోతలిచ్చి ఆ తర్వాత నా చదువు కబుర్లకొస్తా...

గురురేవ గతిః - గురుమేవ భజే |
గురుణైవ సహాస్మి - నమో గురవే ||
న గురోః పరమం - శిశురస్మి గురోః |
మతిరస్తి గురౌ మమ - పాహి గురో ||


    అన్నట్టు - ఈ గురువందనశ్లోకంలో ప్రత్యేకత ఏంటంటే ఉకారాంత పుంలింగ శబ్దమైన గురు-శబ్దం యొక్క అష్టవిభక్తుల ఏకవచన రూపాలూ ఈ శ్లోకంలో వరసగా వుంటాయి. 

గురురేవ గతిః - గురువే నాకు దిక్కు (ప్రథమా విభక్తి)
గురుమేవ భజే - గురువునే సేవిస్తాను (ద్వితీయా విభక్తి)
గురుణైవ సహాస్మి - గురువు తోనే వుంటాను (తృతీయా విభక్తి)
నమో గురవే - గురువుకి నా నమస్కారం (చతుర్థీ విభక్తి)
న గురోః పరమమ్ -  గురువు కంటే ఏదీ మిన్న కాదు (పంచమీ విభక్తి)
శిశురస్మి గురోః - గురువుకి నేను శిష్యుణ్ణి (షష్ఠీ విభక్తి)
మతిరస్తి గురౌ మమ - నా తలపు గురువునందే స్థిరమై వుంటుంది (సప్తమీ విభక్తి) 
పాహి గురో! - ఓ గురు! నన్ను కాపాడు (సంబోధన-ప్రథమా విభక్తి)

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    ఇహ ఇప్పుడు మళ్లీ మొదలైన నా చదువు కబుర్లు.

    ఓ పక్కేమో "నా చదువు అగింది లేదు, నేను నిత్యవిద్యార్థిని" అంటున్నానా? 
    మరి ఆగని చదువు మళ్లీ మొదలవ్వటమేంటి కదా? 
    మరంటే ఇదేదో ఆగిన చదువేనన్నమాటే కదా! 
    మరింకా అంటే ఇది అన్ని చదువుల్లాంటి చదువు కాదన్న మాట. 

    ఈ చదువేంటంటే - ఒక online తరగతిలో చదువుకునే సంస్కృత పాఠం. 

    సంస్కృతభారతి వారి S2S అంటే "సంభాషణతః శాస్త్రపర్యంతమ్" అనే నాలుగేళ్ల సంస్కృత వ్యాకరణ పాఠాల  కోర్స్ 2024 వ సంవత్సరం జూన్ నెలలో పూర్తి చేశాను. 

    ఆ కోర్సులో చివరి సంవత్సరం - అంటే నాలుగో సంవత్సరంలో రెండు electives ఉంటాయి -   శాస్త్రం (న్యాయశాస్త్రం) కానీ, సాహిత్యం (సంక్షేపరామాయణం) కానీ తీసుకోవచ్చు. నేను సాహిత్యం కింద సంక్షేపరామాయణం ఎంపిక చేసుకున్నాను. 

    అలా నా నాలుగేళ్ల కోర్స్ అయిపోయింది. సంస్కృతభారతి వారి ప్రమాణపత్రమూ (certificate) వచ్చింది. 

    కానీ నాకు "న్యాయశాస్త్రం" నేర్చుకోవాలని ఎంతో అనిపించేది. 

    నేనెంతో గట్టిగా అనుకున్నానో ఏమో -  సంస్కృతభారతి ఆ నాలుగో సంవత్సరంలో శాస్త్రం చదువుకున్నవారికి సాహిత్యం, సాహిత్యం చదువుకున్నవారికి శాస్త్రం కోర్సులు మొదలుపెడుతున్నామని ప్రకటించారు. 

    నాలా ఆసక్తి వున్న వారికి "న్యాయశాస్త్రం" నేర్చుకోండీ అని ఇంకో అవకాశం ఇచ్చారు. అలా సెప్టెంబర్ 2024 లో న్యాయశాస్త్రంలో చేరాను. 

    కానీ అది నేర్పే గురువు గారికి కుదరక ఆగిపోయింది.

    మళ్లీ 2025 సెప్టెంబర్లో మళ్లీ ఇంకోసారి "న్యాయశాస్త్రం" లో చేరాను. 

    నేర్పే గురువుగారికి నేర్పూ, ఓర్పూ వున్నా - నాకు నేర్చుకునే వీలు కుదరక - మళ్లీ ఆగిపోయింది. 

    ఇక ఈ న్యాయశాస్త్రం నాకు అందని పండే అని వదిలేసుకున్నా.


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    కానీ ఈ సంవత్సరం ఆగస్టులో "న్యాయశాస్త్రం" సెప్టెంబర్ నుంచి మొదలవుతోంది అన్న సంస్కృతభారతి (SB) ప్రకటన చూడగానే నాకిష్టమైన తర్కం (న్యాయశాస్త్రం) చదువుకోవాలనే ఆశ పుట్టింది. 

    వెంటనే register చేసుందామని SB site కి వెళ్తే - అక్కడ ఒక "న్యాయశాస్త్రం" బదులు "న్యాయశాస్త్రం 1, న్యాయశాస్త్రం 2" అని రెండు కోర్సులు కనిపించాయి. 

    అంటే - ఇంతకు ముందు నాతో పాటు 2025 లో "న్యాయశాస్త్రం" క్లాసులో చేరి - బుద్ధిగా మానేయకుండా చదువుకుని పూర్తి చేసి - విస్తారంగా తర్కం నేర్చుకోవాలనుకునే వారి కోసం "న్యాయశాస్త్రం 2" అన్న కొత్త కోర్స్ మొదలుపెట్టారన్నమాట. 

    న్యాయంగా చదవాల్సిన తర్కం చదవకుండా - అన్యాయంగా మధ్యలోనే మానేసిన నా కోసమేనేమో అన్నట్టు - "న్యాయశాస్త్రం 1" కూడా వుంచారు. 

    అది చూడగానే ఉత్సాహంగా fees కట్టేసి "న్యాయశాస్త్రం 1" లో చేరిపోయాను. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    అప్పుడే నాకు నేనూ మా నాన్న లాగే "పెద్దొకటి" లో చేరుతున్నాననిపించింది. 

    ఆయనుంటే తప్పకుండా నా "పెద్దొకటి" గురించి ఆయనకి చెప్పి వుండేదాన్ని - ఇద్దరమూ నవ్వుకుని వుండేవాళ్లం. 

    ఇప్పుడు మాత్రమేమయ్యింది?! 

    మా నాన్న "పెద్దొకటి" గుర్తు చేసుకుంటూ - నా "పెద్దొకటి" గురించి రాసుకుంటూ - నేను నవ్వుకుంటున్నాను. 

    ఇదిగో - కిందటి వారమే - అంటే అక్టోబర్ 5 నుంచి నా "పెద్దొకటి" మళ్లీ మొదలయింది. 

    ఈసారైనా "న్యాయశాస్త్రం 1" జాగ్రత్తగా చదువుకుని - ఈ పెద్దొకటి "ఇంకా ...పే...ద్ద ఒకటి" కాకుండా వచ్చే ఏడాది "న్యాయశాస్త్రం 2" కి ఏ ఆటంకమూ లేకుండా చేరుకుంటానని నాకు నేనే చెప్పుకుంటూ...

ఈ కింద మా నాన్న "పెద్దొకటి" కబుర్లు కూడా పంచుకుంటున్నాను....


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


అవతారంగారి నారాయణగారి బాబి - 1 - పెద్దొకటి నుంచి .....(మా నాన్న ఐదేళ్ల వయసప్పటి ఫోటోతో)

    ఐదేళ్ళ వయసువరకూ పుట్టు వెంట్రుకలు లేవు. నా ఫోటో వుంది - పుట్టువెంట్రుకలు తీయకుండా వున్నది - కింద బూట్లు, పైన గిరజాల జుట్టూ నేను. 


        ఐదో సంవత్సరంలో నాకు పుట్టు వెంట్రుకలు తీశారు. 

        ఆరో సంవత్సరంలో అక్షరాభ్యాసం, బళ్ళో వేయడం జరిగింది. 

        స్కూలుకి వెళ్ళేవాడిని కాదు. 

        మా వూళ్ళో అనుపిండి రామ్మూర్తిగారని ఉండేవారు - మునసబుగారి అన్నగారు. 

        ఆయనొక బెత్తం పట్టుకుని వెనకాల నిక్కరు పిఱ్ఱ మీద కొడుతూ బడికి తీసికెళ్ళి అక్కడ పడేసేవారు మమ్మల్ని - నన్నూ, కాళత్తయ్యగారి నాగన్నని. 

        ఏదో ఏడ్చుకుంటూ కూర్చునే వాళ్ళం బళ్ళో. 

        ఈలోగా నాతో చేరిన వాళ్ళందరూ ఒకటో క్లాసు నుంచి రెండో క్లాసుకెళ్ళారు. 

        రాజూ మాష్టారని ఒకాయన - "ఒరే! నువ్వింకా ఒకటేరా" అన్నాడు. 

        అంటే మనం ఒకటో క్లాసే ఫెయిల్ అన్నమాట. 

        ఫెయిల్ అంటే ఏడుస్తానని - "నువ్వు పెద్దొకటిరా" - అనేవారు. 

        అలా పెద్దొకటి కూడా చదివాను నేను.


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***





5, అక్టోబర్ 2026, సోమవారం

మొదలాడి - ముందువెనకలాడి - మెదలాడిన Lego కబుర్లు

    Lego అంటే వినడానికి ఒకటే మాటలా వున్నా - అనడానికి మాత్రం రెండు మాటలట. 

    Lego block పుట్టింది డెన్మార్క్ దేశంలోనట. 
    డెన్మార్క్‌లో మాట్లాడే డానిష్ భాషలో leg godt అంటే play well అని అర్థమట. 

    Lego అన్న మాట అలా పుట్టిందన్నమాట. 

    మాటగా ఎక్కడ ఎలా పుట్టినా ఆటగా మాత్రం ఇప్పటికీ నాతోనే వుంది Lego. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    లెగో అంటే ఒక ప్లాస్టిక్ బ్లాక్. ఒక్కో బ్లాక్ పది సెంట్లు. అంటే ఒక డాలర్‌కి పది లెగో బ్లాకులు వస్తాయి.    

    ఈ లెగో బ్లాకులూ, వాటికయ్యే సెంట్లూ-డాలర్ల లెక్కలు ఇప్పుడెందుకంటే...
    నా లెగో ముక్కలు కొనుక్కోవడానికో లెక్కుంది - 
    దానికో trick ఉంది. 
    అదెప్పట్నుంచో  రాసిపెట్టుకుందామని ఓ మక్కువుంది. 
    అదిప్పటికిలా click అయ్యింది. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    అప్పుడెప్పుడో - ఆ మార్చ్ నెల మొదట్లో   - చెట్లు చిగిర్చి పూలు పూస్తున్న పూటల్లో - చెబ్దామనుకుని మొదలు పెట్టిన "నేను Lego లు ఎలా కొనుక్కుంటానంటే.... "  అన్న లెగో కొనుగోలు-కమామీషు-కబుర్లు ఇవి. 

    ఇదిగో ఇప్పటికి - అంటే చెట్లు చిగిర్చి-పూచి-కాచి-పళ్లై-పండిన పళ్లకి కొమ్మలు వంచి-అందిన వాళ్లకి పళ్లను పంచి-ఆకులను రంగులలో ముంచి సింగారించే హడావిడిలో మునిగి-మురిసే - ఈ అక్టోబర్ నెల మొదట్లో - ఆ మొదలెట్టి ఆపిన కబుర్లకి ఓ ముగింపు నిద్దామని మళ్ళీ మొదలెట్టాను. 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

తీరిక చిక్కక కొన్నాళ్ళూ, 
తీరిక చిక్కినా - రాయాలనిపించక ఇంకొన్నాళ్ళు
తీరా రాయాలనిపించాక - రాయడానికి కుదురు కుదుర్చుకోక మరింకొన్నాళ్ళు
ఇలాగే సాగితే 
నా ఈ రాత 
ఓ తీరూ-వాకూ లేక 
ఏ తీరమూ చేరని గోదావరి కాలువ లోని బల్లకట్టు లాగా
తీరని కోరికై మిగిలిపోయేలా వుందని అనిపించి 
ఇవాళ ఎలాగైనా తీరిక చేసుకుని రాసేద్దామని
తీర్మానించుకున్నాను. 


    (పైన నే రాసిన రాతలు చదివి నాకు నాకే ఎవరు గుర్తొచ్చారో తెలుసా? 

    ఒక హింట్ ఇస్తా... ఒకప్పుడు ఆ దర్శకుడు తీసిన సినిమాల గురించి ఒక పెద్ద సిరీసే రాశాన్నేను. 

    చెప్పుకోండి ఎవరో...?
    
    ఇవాళ ఆయన పూనినట్టున్నాడు నన్ను!!!)


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    సరే! మొదలెట్టిందే మార్చ్ నెల్లో కదా! 

అసలే మార్చ్ నెల. 
ఆకులు విడిచి మోడులై - మాటలు మరిచిన మౌనులల్లే - నిద్దరోతున్న చెట్లన్నీ కళ్లు విప్పుతున్నాయి. 
ఒక ఎండ పొడకి ఒడలు చురుక్కని
ఒక చినుకు తడికి తనువు తళుక్కని
కొమ్మా-రెమ్మా పులకలై చిగుళ్లు కప్పుకుంటున్నాయి. 

    అప్పటికి తగ్గట్టు ఓ హైకూ stanza ఒకటి రాసి పెట్టే వుంచా. 

    రాసిన దాన్ని తుంచలేక ఇక్కడే వుంచా ... 


March has sprung on here
With Spring marching along
To wake trees, make blooms... 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    ఇహిప్పుడు - నేను Lego లు ఎలా కొనుక్కుంటానో చెప్తాను. 

    మామూలుగా ఇల్లు  కట్టుకున్నప్పుడు ఆ ఇంటికో పేరు పెట్టుకుని ఇంటి ముందు ఓ రాతిపలక మీద "సాయికృప, వేంకటేశ్వర కృప" లాంటి పేర్లు రాసుకుంటూ వుంటారు కదా కొందరు. 

    అలాగే నేను ఇటీవల రెండు-మూడేళ్ళుగా కొనుక్కున్న  లెగోలన్నిటి మీదా రాసుకోవాలంటే "Costco కృప" అని రాస్కోవాలి నేను. 

అసలు లెగోలు అంటే ఏంటి? 
బోల్డన్ని రంగురంగుల ప్లాస్టిక్ ముక్కలు. 
బిల్డింగ్ బ్లాక్స్. 
పిల్లలాడుకునేవి. 
పిల్లలాటలనిపించేవి. 
ఆడడం మొదలెట్టాక  పెద్దలు కూడా  పిల్లలైపోయేవి. 
ఒక్కో ప్లాస్టిక్ ముక్క 


    చిన్న పిల్లలకైతే ముందూ వెనకా ఆలోచించకుండా కొనిచ్చేయాలనిపిస్తుంది ఎవరికైనా. కుదురుగా కూర్చుని ఆడుకుంటారని. 

    పెద్దైన పిల్లలున్న నేను కొనుక్కోవాలంటే  - అందులోనూ ఎలాంటి "గిల్ట్-ఫీలింగూ" -  అనగా అచ్చదో, సంస్కృతం నుంచి అరువు తెచ్చుకున్న మాటో - "అపరాధ భావన" అనేది లేకుండా  - కొనుక్కోవాలంటే ఆ డబ్బులు అనుకోకుండా వచ్చినవి అయుండాలి నాకు. 

    అంటే లాటరీలో వచ్చినట్టన్నమాట. 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

    అల్లాంటి డబ్బులకి నాకు దొరికిన బహు మంచి దారి - కాస్ట్‌కో రివార్డ్స్. 

    కాస్ట్‌కోకి వెళ్ళామంటే అలా వెళ్ళి ఇలా వచ్చేస్తామా ఏంటి? 

వంటకి కావల్సిన పప్పూ-నూనె, 
ఒంటికి బలమిచ్చే పాలూ-వెన్నా, 
పంటికి పంజెప్పే పళ్ళూ-ఫలహారాలూ, 
అన్నానికి ఆధరవయ్యే కూరలూ-ఆక్కూరలూ, 
ఎండాకాలానికి పానీయాలూ, 
వానాకాలానికి గొడుగులూ, 
శీతాకాలానికి కంబళ్ళూ, 
ఏ కాలానికైనా వేసుకోవల్సిన మందూ-మాకులూ, 
ఇవే కాక 
గిన్నెలూ, డబ్బాలూ, 
కుర్చీలూ, టేబుళ్ళూ
పిండి రుబ్బే రుబ్బర్లూ 
కిటికీ సందులు కప్పే రబ్బర్లూ
పుస్తకాలూ, పెన్నులూ
అవీ - ఇవీ - అన్నీ - ఎన్నోలూ....

    ఇలా షాపింగ్ కార్టులో పట్టేవీ, పట్టించలేక కార్టు దాటి పొంగి పొర్లేవీ బోల్డన్ని - "కొను వారం... వారం ... వారం..." అని పాడుకుంటూ కొనుక్కుంటే - ఆ కొనుక్కున్న ప్రతీ దానికి ఖర్చు పెట్టిన దాని మీదా రెండు శాతం డబ్బులు వెనక్కి ఇస్తుంది కాస్టుకో. 

    ఆ... ఇంతోటి రూపాయికి రెండు పైసలిచ్చే స్కీముకే అంత పొంగిపోవాలా అంటే --- ఉచితంగా వస్తున్న - ఆ రెండుపైసలే - పరమోచితంగా అనిపిస్తాయి నా మటుకు నాకు. కాస్టుకో ఇవ్వకూడదూ అనుకుంటే నేనిచ్చిన ఏ రూపాయికీ ఆ రెండుపైసలూ వెనక్కి రావు కదా?!

    అందులోనూ "పైసా మే హై పరమాత్మా" అన్నారు కదా! ఇక మరి రెండు పైసల్లో ఆ పరమాత్మ రెండింతలవడూ! 

    అన్నట్టు ఇక్కడ ఓ విషయం చెప్పాలబ్బా! 

    ఒక్క సెంటూ, ఒక్క రూపాయీ అని చులకనగా అంటూ చులాగ్గా తీసి పక్కన పడేస్తూ వుంటాం. 

    కానీ అదే సెంటూ-రూపాయీ తక్కువైతే online shopping cart "పోన్లే ఒక్కటంటే ఒక్క రూపాయి తక్కువుంది నీ బాంకులో ...ఒక్క రూపాయే కదా ఫర్లేదు... continue to checkout" అని అంటుందా ఎక్కడైనా? 

    అంటే ఆ సెంటో - ఆ ఒక్క రూపాయో - అప్పటికి ఆ ఆన్లైన్-షాపింగ్-జలధి దాటించగలిగే పరమాత్మే కదా! 

    కాదా? 

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


    సర్సరే! అసలు విషయానికి వస్తే కాస్టుకో వాడిచ్చే ఆ రూపాయికి-రెండుపైసలు "ఇంతై  - అంతై  - ఎంతెంతో ఐ - బోల్డంతై" అన్నట్టు ఏడాదికి ఓ రెండో-మూడో లెగో సెట్లు కొనుక్కునేంత అవుతాయి.  

    ప్రతి మార్చ్‌లో లాగే ఈసారీ లెగోలు కొనుక్కున్నా. 

    మార్చ్ లోనే కొనుక్కోవడం ఎందుకూ - అంటే మరప్పుడే కదా - వాసంతిక సంగాతము చిక్కిన మొక్కల మీద రంగురంగుల పూలు విచ్చుకునేదీ, దక్కిన చెట్ల మీద రకరకాల ఆకులు పచ్చుకునేదీనూ.

     ఆ రంగురంగుల పూలు విచ్చుకున్న మొక్కలూ, పచపచ్చటి ఆకుల్ని కప్పుకున్న చెట్లూ, రంగవల్లుల్లాంటి తీగలూ - వాటిని మోసుకుంటూ వున్న ఇళ్ళూ, వాకిళ్ళూ బొమ్మరిళ్ళలా కొలువు తీరేది! 

    ఆ ప్రేరణ తోనే కాబోలు లెగో వాళ్ళు కూడా మార్చ్ నెల వచ్చిందంటే చాలు - బోల్డన్ని పూలు - ఎక్కడైనా విచ్చుకునే పొద్దుతిరుగుడు పూలు, ఎక్కడున్నా మనస్విచ్చుకునే ఎఱ్ఱగులాబీలు, ఎక్కడో జపాన్లో విరులెత్తే చెర్రీ బ్లాజమ్లూ, నీటి అలల తళతళలలో కలకలలాడు తామరలు - ఇలా ఎన్నెన్నో రంగురంగుల పూలని ఇంకెన్నెన్నో రంగురంగుల ప్లాస్టిక్కు బ్లాకుల రూపంలో వున్న సంతోషపు-పొట్లాల్లా అమ్ముతూ వుంటారు.  

    నేనేమో  Costco నుంచొచ్చిన cash-back డబ్బులతో నాకు నచ్చిన లెగో-పూలు కొనేసుకుంటూ వుంటాను.   

    అసలు ఈ లెగో-పూలు కొనుక్కోవడానికి ఇంకో కారణం - మా ఇంటి ముందు పూలమొక్కలు వేసుకోవడానికి అంతగా వీల్లేకపోవడం. అదెందుకూ అంటే... మళ్లీ వెళ్ళి నా పాత బ్లాగ్ చదువుకోవాల్సిందే.... 






*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***


అవండీ !

అప్పుడెప్పుడో 
అల్లప్పటి
ఆ మార్చ్ నెలలో - మొదలాడి 

ఎప్పటికీ సాగక - ముందువెనకలాడి ...
చప్పున అక్కడే తారాడక ...

ఇప్పటికిప్పుడు
ఇల్లిప్పటి
ఈ అక్టోబర్ మాసంలో మళ్ళీ - మెదలాడి 
నే బ్లాగాడిన Lego కబుర్లు... 


*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***

అన్నట్టు ఈ కిందనున్న నా ఖండ-కళని కూడా చూసెయ్యండి మరి!



కుదురుగా కూర్చి 
ఒబ్బిడిగా పేరిస్తే
తయారయ్యేది 
లెగో - కళాఖండం 
అంటే a piece of art

అదే చిందరవందర చేసి
ఒక్కుప్పగా చేరిస్తే
చూపులకానేది
లెగో - ఖండ-కళ
అనగా art-in-pieces

*** *** *** *** *** *** ***
*** *** *** *** *** *** ***