20, ఫిబ్రవరి 2021, శనివారం

గీతం...సంగీతం...సతతహరితం - 9 - క్యా యహ్ హీ ప్యార్ హై? ఈ పాట భీ ప్యారా హై...

ఎప్పటిదో ఓ పాట... 

వినే చెవులకు కళ్ళుంటే - 
ఆ పాట రూపు... 
గాలి వాలున సోలు పూలవాన

వినే చెవులకు నోరుంటే - 
ఆ పాట చప్పుడు... 
మ్రోవి తాకుల మోగు పిల్లంగ్రోవి

వినే చెవులకు ఎద ఉంటే - 
ఆ పాట తలపు... 
మోయలేని హాయితనపు సోయి
 
అప్పటి ఆ పాట...  
విన్ననాటి నుంచి వదలక వెంబడిస్తూ ఉంది 
ఉన్నచోట ఉండనీక ఊహల ముసిరేస్తూ ఉంది 
అన్న నోట ఆగి ఆగి మోగుతూనే ఉంది 

అప్పటి నుంచీ ఆ పాట...  
అప్పుడప్పుడూ ఎద మాటునుంచి పలకరిస్తూనే  ఉంది
ఇప్పటికిప్పుడు అందుకో నన్నని పలవరిస్తూనే ఉంది  
ఎప్పటికప్పుడు పెదవుల మీద తారటలాడుతూనే ఉంది 

ఇక ఎప్పటికీ ఆ పాట... 
నాతోనే తానంటుంది 
నాతోనే ఉంటానంటుంది 
నాతో - నాదై - ఉండిపోతుంది 
నాలో - నాదయి - ఉండిపోతుంది 
*******
*******

    ఎప్పుడూ వింటూ ఉండేదే అయినా ఓ పాట రెండ్రోజులుగా తెగ వినేయ్యలనిపించేస్తోంది. 

    ఎడతెగక పాడేయ్యాలనిపించేస్తోంది. 

    "ఈ పాట भी प्यारा है" అనిపించేస్తోంది. 

    అంతగా వినాలని, పాడాలని, అనిపించేస్తున్న ఆ పాట దాకా సరాసరి వెళ్ళిపోతే - ఆ పాట గురించిన కబుర్లు, పిట్టకథల మాటేంటి? చెప్పుకోలేదని బిక్కమొహమేసి, గుక్కపెట్టి ఏడ్చేయవూ?!

    ఆ పాట తాలూకు కబుర్లు మొదలెట్టాలంటే - ఆ పాటలో కనిపించే 

    దత్ గారి పుత్తర్ 
    బల్ బహు ఎత్తర్  
    మత్తుకళ్ళ సొత్తర్ 

    గురించి చెప్పి తీరాల్సిందే! -  అంటే, అనుకుంటే చటుక్కున గుర్తుకొచ్చేవి ముత్యంగా మూడు పాటలుంటాయి. 

    కాలక్రమానుసారంగా ఆ మూడు పాటలు ఏవంటే... 

    మొట్టమొదటిది - ఇవాళ్టి కబుర్లకి కారణమైనది అయిన క్యా యహ్ హీ ప్యార్ హై? అని ప్రేమ గురించి ప్రేమికులిద్దరు "ఇది ప్రేమేనా? ఇదే ప్రేమా?" ఒకరినొకరు ప్రేమగా ప్రశ్నలేసుకుంటూ, వాటికి బదులుగా వాళ్ళే మళ్ళీ ప్రేమగా "ఇదే ప్రేమ! ఇదేలే ప్రేమ!" అని జవాబులు చెప్పుకునే పాట. ఇదంతా హిందీలోనే సుమండీ! ఈ పాట కబుర్లు ఇక్కడితో అయిపోలేదు. ఇంకా బోల్డన్ని - ఆనక చెప్పుకుందాం. 

    ఇహ పోతే రెండోది... 

తుమ్హే అప్‌నా బనానే కీ కసమ్ ఖాయీ హై...ఖాయీ హై! 
తేరీ ఆంఖోం మే చాహత్ హీ నజర్ ఆయీ హై...ఆయీ హై 

    అంటూ సాగే పాట - సడక్ సినిమా లోది. 

    ఇందులో సునీలుదత్తు తనయుడు సంజయ్ దత్తుతో పాటు మహేశుభట్టు తనయ పూజాభట్టు నటిస్తూ, నడుస్తూ కనిపిస్తుంది. 

    భాషాభేదాతీత, బహుభాషాచలనచిత్రవీక్షణాపేక్షితనైన నేను - ఈ సడక్ సినిమాని థియేటర్లో - ముప్పావు వంతు సినిమా - రెండు చేతులతో కళ్ళు మూసుకుని  వేళ్ళ సందుల్లోంచి చూశాను - అది కూడా సదాశివ్ అమ్రపుర్కర్ లేని సీన్లు మాత్రమే చూశాను. 

    నాగ్గుర్తుండి పూర్తిగా కళ్ళు తెరిచి చూసినది ఈ ఖాయీ హై...ఖాయీ హై! ఆయీ హై...ఆయీ హై  పాటొక్కటే. గరుకు కాయితంతో గొంతు తుడుచుకుని పాడుతున్నట్టుండే కుమార్ సాను గొంతులో ఈ పాట నొక్కుకుపోయినట్లనిపిస్తుంది. 

    ఇక చిట్టచివరిది - సాజన్ సినిమాలోది - 

మేరా దిల్ భీ కిత్‌నా పాగల్ హై...
యే  ప్యార్ తో తుమ్ సే కర్‌తా హై ... 
    
    ఇందులో క్లోజప్ టూత్ పేస్టు  మోడల్లా పళ్ళు మెరిపిస్తూ ఉండే మాధురీ దీక్షిత్ పక్కన హ్యాండు-స్టిక్కు పట్టుకున్న హాండ్సమ్ హీరో సంజయ్ దత్తే. ఈ పాట పాడిందీ కుమార్ సానునే. 

    నాకు ఈ మూడు పాటలూ ఇంత వరసగా, వరసాగ్గా గుర్తుండడానికి ఒక కారణం - ఆ పాటలు విన్న, కన్న వరస అలా ఉండడమే! ఇంకో తమాషా కారణం - పాటపాటకీ పెరిగిన సంజయుడి కేశపాశం. 

    అన్నట్టు ఇక్కడ కొన్ని సినీ-టిట్టుబిట్టులు. 
    
    ఇవన్నీ - డిగ్రీ చదివే రోజుల్లో - ఒక పక్క మాథ్స్ చేస్తూ - ఇంకో పక్క "స్టార్ డస్ట్" తెరిచిపెట్టుకుని - లెక్కలెక్కకీ మధ్యలో లెక్కగా ఆగుతూ - చదివిన సరదా స్లిప్పులు.  

    ఒకప్పటి హీరో-హీరోయిన్లైన సునీల్ దత్, నర్గీస్ దత్ పిల్లలైన సంజయ్ దత్, నమ్రతా దత్, ప్రియా దత్ లలో మధ్యదైన నమ్రతా దత్ - అదే ఒకప్పటి హీరో అయిన రాజేంద్ర కుమారుకి కోడలు - అనగా కుమార్ గౌరవ్ భార్య. 

    అన్నట్టు బావ-మరుదులైన కుమార్ గౌరవ్-సంజయ్ దత్ నటించిన సినిమా నామ్ లో పంకజ్ ఉధాస్ పాడిన "చిట్ఠీ ఆయీ హై ... వతన్ సే చిట్ఠీ ఆయీ హై" పాట కూడా బావుంటుందబ్బా! 

    నామ్ నైతే నే చూడలేదు కానీ ఉత్తరం అందుకున్న చాలా సార్లు "చిట్ఠీ ఆయీ హై ... ఆయీ హై ... చిట్ఠీ ఆయీ హై" అని పాడుకున్న జ్ఞాపకమైతే ఉంది. 

    ఆ పాటా, ఈ పాటా అంటూ ఈ కబుర్లన్నీ చెప్పేసుకుని అసలు చెప్పాలనుకున్న పాట మాటే మర్చిపోతే ఇలా?! 

    ఇహిప్పటికీ కోతి-కొమ్మచ్చి ఆపి రాకీ సంజయ్ దత్ , టీనా మునిమ్‌తో పాడిన క్యా యహ్ హీ ప్యార్ హై? పాట కబుర్లు మొదలెట్టేస్తా!

    మొదటగా ఆ పాట ఆనుపానులు:

    పాట పేరు: క్యా యహ్ హీ ప్యార్ హై?
    పాటున్న సినిమా పేరు: రాకీ 
    పాట రాసినవారి పేరు: ఆనంద్ బక్షీ 
    పాట కట్టినవారి పేరు: రాహుల్ దేవ్ బర్మన్ (RD బర్మన్)
    పాట పాడినవారి పేర్లు: కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ 
    పాటకు ఆడినవారి పేర్లు: సంజయ్ దత్, టీనా మునిమ్ 
    పాటకు యూట్యూబ్ లింక్https://www.youtube.com/watch?v=W1LTeqA7ykg


    చెవుల మీదకి జుట్టు కప్పుకున్న సంజయ్ దత్తు, చెవుల వెనక్కి జుట్టు కట్టుకున్న టీనా మునిమ్ము ఒకరినొకరు కళ్ళూ, నోళ్ళూ తెరుచుకుని చూసుకుంటుండగా మొదలవుతుంది - అద్భుతమైన ఆర్దీ బర్మన్ సంగీతంతో ఈ పాట. 

    కిషోర్ కుమార్ booming voice తో మొదలయి, Nightingale of  India లతా మంగేష్కర్ గళమాధురీలహరుల జారుతూ, జాలువారే ఈ పాట ఎప్పటినుంచో వింటున్నా - ఈ పాటని చూడడం మాత్రం ఇటీవలే. 


    ఇదే మొదటి సినిమా - అప్పుడే బాల్యకౌమారాలు దాటిన హీరో చేత భలే డాన్సాడించారు - ఎవరో గానీ. 

    మచ్చుకో రెండు-మూణ్ణాలుగు  కదలికల గురించి కిలకిలలు - నాకనిపించినవి మీకూ కనిపిస్తాయని ఇక్కడ చెప్తున్నా.  

    మొదటి చరణంలో పహ్‌లే మై సమ్‌ఝా - కుఛ్ ఔర్ వజహ్ - ఇన్ బాతోం కీ అన్న లైను దగ్గర - "బాబూ! సంజయ్ దత్తూ! సైకిలు టైరు దొర్లించినట్టు చేతులూపు" అన్నట్టున్నారు. 

    రెండో చరణం మొదలయ్యే ముందు (2:30 దగ్గర) టీనా మునిమ్ ఒక చిన్న మొక్కని ఎడమ చేత్తో పక్కకి తొలిగిస్తూ వస్తుంది. అది చూసినప్పుడల్లా అక్కడ కనిపించని గాలి తెరలేవో పక్కకి తొలగినట్లుగా అనిపించి - భలేగా ఉంటుంది నాకు. 

    మూడో చరణం మొదలయ్యే ముందు (3:42) దగ్గర ఫైట్-డాన్స్ చేశాడు సంజయ్ దత్తు - కాలు జాడిస్తూ. 

    ఇంతకు ముందు చెప్పిన రెండు పాటల్లో పూజా భట్, మాధురీ దీక్షిత్ లకు దీటుగా జుట్టు పెంచుకున్న సంజయ్ దత్ ఈ పాటలో జుట్టు కొంచెం మామూలుగానే ఉన్నా - మొదటి చరణంలో టీనా మునిమ్ ఓవరాల్స్  (Overalls)వేసుకుందని, రెండో చరణంలో తను కూడా వేసేసుకున్నాడు. 

    ఈ పాటనో సారి చూసేసి - ఇలాంటి సరదా-విషయాలు చూసి నవ్వేసుకుని - కళ్ళు గట్టిగా మూసుకుని వింటే మాత్రం ఇది అద్భుతమైన పాట. నాకు ఈ పాట అంతా బోల్డంత ఇష్టమైనా - మధ్యలో వచ్చే ఫ్లూట్ బిట్స్ మాత్రం ఇంకొంచెం ఎక్కువ ఇష్టం. 

    ఈ పాట కోసం వెతుకుతూ ఉంటే ఇవాళే తెలిసిన ఇంకో విషయం - ఈ పాటకి ఆశా భోంస్లే పాడిన "ఏకి భాలోబాషా... " ఓ బెంగాలీ కవల ఉండడం. 

ఏకి భాలోబాషా పాటకి యూట్యూబ్ లింక్https://www.youtube.com/watch?v=FTRtErb7We4




క్యా యహ్ హీ  ప్యార్ హై?
హా! యహ్ హీ ప్యార్ హై...
ఓ ... దిల్ - తేరే బిన్ - కహీ లగ్‌తా నహీ
వక్త్ గుజర్‌తా నహీ... 

క్యా యహ్ హీ ప్యార్ హై?
హా... హా.. హా! యహ్ హీ ప్యార్ హై...
ఓ... దిల్ - తేరే బిన్ - కహీ లగ్‌తా నహీ
వక్త్ గుజర్‌తా నహీ... 

క్యా యహ్ హీ ప్యార్ హై?
హా! యహ్ హీ ప్యార్ హై...

పహ్‌లే మై సమ్‌ఝా - కుఛ్ ఔర్ వజహ్ - ఇన్ బాతోం కీ
లేకిన్ - అబ్ జానా - కహా నీంద్ గయీ - మేరీ రాతోం కీ!
జాగ్‌తీ రహ్‌తీ హూ - మై భీ - చాంద్ నికల్‌తా నహీ 
ఓ ... దిల్ - తేరే బిన్ - కహీ లగ్‌తా నహీ
వక్త్ గుజర్‌తా నహీ... 

క్యా యహ్ హీ ప్యార్ హై?
బోలో... బోలో నా!
హా! యహ్ హీ ప్యార్ హై...

కైసే భూలూంగీ? - తూ యాద్ హమేషా ఆయేగా
తేరే - జానే సే - జీనా ముశ్‌కిల్ హో జాయేగా
అబ్ కుఛ్ భీ హో - దిల్ పే - కోఈ - జోర్ తో చల్‌తా నహీ
హో... దిల్ - తేరే బిన్ - కహీ లగ్‌తా నహీ
వక్త్ గుజర్‌తా నహీ... 

క్యా యహ్ హీ ప్యార్ హై?
హా! యహ్ హీ ప్యార్ హై...

జైసే - ఫూలోం కే మౌసమ్ మే - ఏ దిల్ ఖిల్‌తే హై
ప్రేమీ -  ఐసే హీ - క్యా - పత్‌ఝడ్ మే భీ మిల్‌తే హై?!
ఋత్ బద్‌లే - దునియా బద్‌లే - ప్యార్ బదల్‌తా నహీ... 
ఓ ... దిల్ - తేరే బిన్ - కహీ లగ్‌తా నహీ
వక్త్ గుజర్‌తా నహీ... 

క్యా యహ్ హీ ప్యార్ హై?
హా! యహ్ హీ ప్యార్ హై...
ఓ ... దిల్ - తేరే బిన్ - కహీ లగ్‌తా నహీ
వక్త్ గుజర్‌తా నహీ... 

*******
*******

   మొత్తానికి ఇది  RD బర్మన్! భళారే బర్మన్! అనేలా చేసే పాట. 
  "ఈ పాట भी प्यारा है" అనిపించే పాట... 
ఈ పూట ... ఈ పాట వింటారని... అనుకుంటూ 
మీరు వింటారని - మీతో పాటు నేనూ విందామని - అనుకుంటూ... 

~ పాటల భైరవి 

15, ఫిబ్రవరి 2021, సోమవారం

అవతారంగారి నారాయణగారి బాబి - 22 - ఎజ్దీ పోయి ఎలక వాహనమాయె - ఎస్కార్టుగా మారి అభిమానించె టంగుటూరే!

కిందటి మాటు కబుర్లు: అవతారంగారి నారాయణగారి బాబి - 21 - ఆత్మీయ అన్నాబత్తిన! 

    జులై 80 ప్రాంతానికి పర్చేజ్ సీజన్ అయిపోయింది. నేనేమో ఇక గ్రేడింగులు, ప్యాకింగులు అవీ చూసుకోవాలి.  

    సింగరాయకొండ, టంగుటూరు, ఒంగోలు - ఈ ఊళ్లన్నిటిలో కూడా మా  చైనా ప్యాకింగులు జరిగేవి.

     నాకేమో హెడ్డాఫీసు నుంచి ఒక ఎజ్దీ (Yezdi) మోటార్ సైకిలు ఇచ్చారు. ఆ మోటార్ సైకిలేసుకుని తిరిగేవాణ్ణన్నమాట గ్రేడింగ్ హాల్సుకి. అక్కడే ప్యాకింగులు అవీ జరుగుతూ ఉండేవి.  కొంతకాలం తర్వాత ఆ బైకు చెడిపోయింది. అదలా చెడిపోగానే "దీనికి రిపేర్లు అవీ చేయిస్తూ నేను తిరగలేను, కావలసినప్పుడు ఏ ప్యాకింగుకో వెళ్ళాలంటే కార్లో వెళ్తాను" అని చెప్పి ఆ బైకుని వెనక్కి తిప్పి హెడ్డాఫీసుకి పంపించేశాను. 

    ఈ లోగా నాకు ఆఫీసులో స్టాఫ్ కూడా పెరిగారు. నరసింహారావు అని ఓ క్యాషియర్, గ్రేడింగులో టోకెన్స్ ఇవ్వడానికి ఓ ఇద్దరు క్లర్కులు, గ్రేడింగ్ రిపోర్టులు తయారుచేయడానికి ఇంకో క్లర్కు - ఇట్లా మొత్తం ఐదారుగురు స్టాఫ్ పెరిగారు - పాత సూపర్వైజర్లు వాళ్ళూ కాకుండా. 

    గ్రేడింగులో ఏంటంటే - మా గ్రేడింగ్ హాల్లో నాలుగొందలమంది పని చేసేవాళ్ళు. జమ్ములపాలెం, కాకుటూరివారిపాలెం, ఆలకూరపాడు, ఉప్పలపాడు - ఇలా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వచ్చేవారన్నమాట. నాలుగొందలమంది గ్రేడర్సు - అంటే - వరసకి ఇరవై చొప్పున దాదాపు ఒక ఇరవై వరసలు. అందులో ఒక పదిమంది మేస్త్రీలు ఉండేవాళ్ళు. వాళ్లంతా ఆడ మేస్త్రీలు. తర్వాత ఓ పది మంది లైన్-గర్ల్స్ వుండేవాళ్ళు. వాళ్లేంటంటే - గ్రేడ్ చేసిన పొగాకు తీసుకొచ్చి టేబుల్స్ మీద వేసేవాళ్ళు. అలా ఓ పది టేబుల్స్ ఉండేవి. ఆ పది బల్లలకి ఇరవై మంది టేబుల్ చెకర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ పని ఏంటంటే గ్రేడింగ్ చేసి పంపించిన తర్వాత అందులో ఏమన్నా తేడా-పాడా ఉండి కొద్దిగా ఒకట్రెండు ఆకులు సరిగా లేకపోతే వాటిని తీసేసి పక్కన వేసేసి మంచి గ్రేడెడ్ పొగాకేమో పెట్టెల్లో వెయ్యాలి. టేబుల్స్ పక్కనే పెట్టెలు కట్టేవారన్నమాట బేలు తొక్కడానికి. ఆ పెట్టెల్లో మళ్ళీ పదిమంది అమ్మాయిలు ఉండేవాళ్ళు. వాళ్ళు పెట్టెలు తొక్కుతూ ఉండేవాళ్ళు. వీళ్ళు కాకుండా ఒక పది-పదిహేను మంది ముఠావాళ్ళు ఉండేవాళ్ళు. ఇవీ ఆ గ్రేడింగ్ హాలు - అందులో పని చేసేవాళ్ళ వివరాలు.  

    నేను గ్రేడింగ్ హాలుకి వెళ్తే మాత్రం చాలా భయపడేవారు జనం - "మేనేజరొస్తున్నాడు, మేనేజరొస్తున్నాడు" అని. ఎందుకంటే కొంతమంది చేస్తున్న పని ఆపేసి మధ్యమధ్యలో కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు . అలా కబుర్లు చెప్పుకునేవాళ్ళు నా క్కనిపిస్తే వాళ్ళని కూర్చున్న చోటు నుంచి లేపేసి బయటికి పంపించేసేవాణ్ణి.  అందుకే నేను వెళ్ళినప్పుడు ఎవ్వరూ మాట్లాడేవాళ్ళు కాదు. అలా ఆ గ్రేడింగులు నడుస్తూ ఉండేవి.

    అలా జరుగుతున్న టైములో ఓ సారి ఏమయ్యిందంటే -  సాధారణంగా లక్ష్మయ్య గారి కంపెనీలో ఏంటంటే ఈ కొనుగోళ్ళకు డబ్బు చెల్లించడం కొంచెం ఆలస్యం అయ్యేది. పొగాకు బయ్యింగ్ మేనేజ్ చెయ్యడం వరకే నా బాధ్యత. అదే కాకుండా  గ్రేడర్స్ పేమెంట్స్, ముఠా వాళ్ళ పేమెంట్స్ మాత్రం నేను చేసేవాణ్ణి. 

    రైతులకి ఇవ్వాల్సిన పేమెంట్లకి నా బాధ్యత లేదు. దానికి పెద్ది సాంబశివరావుగారని చెప్పేసి - ఆయనది గుంటూరు. ఆయన సర్కిల్ మేనేజర్. రైతుల చెల్లింపు బాధ్యత ఆయనది. ఆయన అప్పుడప్పుడు టంగుటూరు వస్తూ ఉండేవాడు. ఆయనొచ్చినప్పుడు రైతులు వచ్చి వాళ్ళకి రావల్సిన డబ్బుల గురించి అడిగితే ఆయనేదో సర్దిచెప్తూ ఉండేవాడు. ఇలా జరిగిపోతూ ఉండేది. 

    దీంట్లో ఓ సారి ఏవయిందంటే - ఆ జమ్ములపాలెంలోనో, ఎక్కడో ఇద్దరు కవలలు ఉండేవాళ్ళు. వాళ్ళు టీచర్స్. అందులో ఒకతను బాగానే ఉండేవాడు. రెండో అతను కొంచెం డ్రింక్ చేసేవాడు. సాయంత్రం అయేటప్పటికి రోజూ డ్రింక్ చేసేవాడు. 

    అతనోసారి ఏం చేశాడంటే - ఓ రోజు నేను సాయంత్రం ఏడు గంటలకి ఇంటికి వస్తూ ఉండగా - టంగుటూరు ఊళ్ళో రైల్వే ట్రాక్ దాటిన తర్వాత నన్ను ఆపి "నా దగ్గర పొగాకు కొనేశారు. నాకు పేమెంట్ ఇవ్వరు. ఎందుకివ్వట్లేదు? నాకర్జంటుగా ఇప్పుడు డబ్బులియ్యి." అని నన్ను పట్టుకు కూర్చున్నాడు. 

    నేనేమో విడిపించుకుంటూ "ఇలా రోడ్డు మీద ఆపి అడిగితే ఎలా? పైగా ... మీ డబ్బులకి నేను కాదు రెస్పాన్సిబిలిటీ. ఆ సాంబశివరావుగారొచ్చినప్పుడు అడగండి. నన్నడిగితే ఉపయోగం ఏంటి?" అంటే అతను వినలా. 

    "లేదు. నాకు ఇప్పుడు పేమెంటు ఇచ్చి కదులు" అని కూర్చున్నాడు. 

    లక్కీగా ఈ లోపులో ఎర్రబ్బాయి తమ్ముడు చిన్నా - అదే కరాటే ఫైటర్ అని చెప్పాను కదా - అతను నా ఫ్రెండు - అతను వస్తున్నాడు ఆ దార్లోనే. 

    వస్తూ నన్ను చూసి "ఏంది బాసూ...సంగతులు!" అన్నాడు. 

    "వీడెవడో చూడవయ్యా బాబూ! వీడి గోలెక్కువయింది. నేనిప్పుడు పేమెంట్ ఇవ్వాలంట వీడికి. నన్నింటికి పోనీకుండా ఆపేశాడు " అనగానే ఆ చిన్నా "నువ్వింటికెళ్ళిపో బాసూ... నేను చూసుకుంటా" అని వాడిని తీసుకుని వెళ్ళిపోయాడు. 

    ఈ విషయం తర్వాత అన్నాబత్తిన వెంకటసుబ్బయ్యకి తెలిసింది. 

    తెలిసి మర్నాడు పొద్దున్నే ఆ టీచర్ని పిలిచి - "ఏంది మా పంతులు జోలికొస్తావా? ఏమనుకుంటున్నావ్? అసలు ఆయనకి సంబంధమేంటి పేమెంట్సుతో ?" అని చీవాట్లేసేశాడు. 

    ఆ రోజు నుంచి నాకిద్దరు ఎస్కార్ట్స్ (escorts) ని కుదిర్చాడు అన్నాబత్తిన వెంకటసుబ్బయ్య. 

    అందులో ఒకడు ఆలకూరపాడులో నార్నె బాలయ్య అని అతను కూడా మా బయ్యరు. 

    రెండో ఎస్కార్టు -  అన్నాబత్తిన వెంకటసుబ్బయ్య రెండో కొడుకు నాగేశ్వర్రావు - వాడిని కూడా నేనే జేర్చాను - అసిస్టెంటు బయ్యరుగా. 

    వీళ్ళిద్దర్నీ పిలిచి "ఒరే! మీరిద్దరూ మేనేజరు ఇంటికి వెళ్ళేవరకు తోడుగా వెళ్ళి, ఆయన్ని ఇంటి దగ్గర దించి, అప్పుడు ఇళ్ళకి వెళ్ళండి మీరు" అని వాళ్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు వెంకటసుబ్బయ్య. 

    వాళ్ళేమో కుఱ్ఱాళ్ళు. ఒక్కోడూ ఐదడుగుల పదకొండు అంగుళాలు ఉండేవారు. 

    వాళ్ళు రోజూ నా తోటి రావడం. 

    "ఎందుకురా, బాబూ?! ఏదో ఆ రోజంటే వాడేదో తాగేసి నా మీదకొచ్చాడు కానీ రోజూ ఎవడొస్తాడు నా దగ్గరికి? నా కూడా రావక్కర్లేదు , పొండ్రా మీరు" అంటే నా మాట వినేవారు కాదు. రోజూ నాతో ఇంటి దాకా వచ్చి దిగబెట్టి కానీ వాళ్ళ ఇళ్ళకి వెళ్లేవారు కాదు. 

    అలా ఎక్కణ్ణుంచో గోదారి అవతల నుంచి ఉద్యోగ నిమిత్తమై వెళ్ళిన నన్ను తనవాణ్ణి చేసుకుని - కళ్ళలో పెట్టుకుని కాచినవారు టంగుటూరు ఊరివారు.  

    ఇక్కడో చిన్న విషయం - నాతో ఇప్పటికీ ఉన్న ఒకనాటి టంగుటూరు జ్ఞాపకం. 

    ఇంతకు ముందే చెప్పాను కదా రిపేర్లు వచ్చిందని ఎజ్దీ మోటార్ సైకిలు వెనక్కి పంపించేశానని?! ఆ  తర్వాత - ఈ నార్నె బాలయ్య దగ్గర లూనా ఒకటి ఉండేది - చిన్న మోపెడ్. అది కొన్నాను అతని దగ్గర. 

    కొని నేను అదేసుకుని తిరుగుతూ ఉండేవాణ్ణి. అది ఇంటికి, ఆఫీసుకి మాత్రమే. ఊరు దాటి బయటికి వెళ్లాలంటే టాక్సీ బుక్ చేసుకుని వెళ్ళేవాణ్ణి. అప్పటి వరకు నన్ను పెద్దబండి ఎజ్దీ మీద తిరగడమే ఎరిగున్న మా లల్లి, పప్పి, కుట్టి - చిన్న మోపెడ్ లూనాని చూసి - "ఎలక వాహనం" - అని పిలిచేవాళ్ళు. 

    అప్పుడే ఒంగోల్లో కొత్త  స్కీమొకటి పెట్టారు ఓ షాపు వాళ్ళు. అదేంటంటే పది నెల్లో, సంవత్సరమో నెలనెలా కొంత డబ్బు కట్టాలి. కడితే మధ్యలో మనకి లాటరీ తగిలితే ఆ వస్తువులు మనకిచ్చేస్తారు. లేదంటే స్కీం పూర్తయిన తర్వాత వస్తువులు ఇస్తారు. 

    దానికి నేనేంటంటే - ఒక డ్రెస్సింగ్ టేబులు, ఒక సుమీత్ మిక్సీ - ఈ రెంటికీ కట్టాను. నెలకింత అని ఇన్‌స్టాల్‌మెంట్ కడుతున్న నాకేమో మూడో నెల్లోనే లాటరీ తగిలేసింది. వెంటనే లూనా మీద మా ఆవిణ్ణి ఎక్కించుకుని ఒంగోలు వెళ్ళిపోయాను. వెళ్ళి ఆ పసుప్పచ్చ డెకొలాం వేసిన డ్రెస్సింగ్ టేబుల్, సుమీత్ మిక్సీ ఒక లారీలో వేయించి తెచ్చేసుకున్నాం. ఆ సుమీత్ మిక్సీ మా అన్నగారమ్మాయి బద్రు పెళ్ళికి గిఫ్ట్ కింద ఇచ్చేశాం. ఆ డ్రెస్సింగ్ టేబుల్ ఇవాళ్టికి కూడా నా దగ్గరుంది. అనాతవరంలో మా ఇంట్లో నా గదిలో పెట్టుకున్నాను. 

1981 నుంచి జరిగిన విశేషాలు ఇంకో మాటు... 


<వచ్చేమాటు తరువాయి కథ>



9, ఫిబ్రవరి 2021, మంగళవారం

To B.E., or not to B.E. ... అంటూ సాగే నా soliloquy!

    మొన్నటి ఆదివారం నుంచి ఎంత చలిగా ఉందో ఈ మా ఊళ్ళో!

        మా ఊళ్ళో చలిపులి "బ్‌ర్‌ర్‌ర్"మని గాండ్రిస్తోంది.  

    ఉన్నచోట - ఉన్న పళాన ఉష్ణోగ్రత ఎలా ఉందా అని చూస్తే ఇంట్లో థెర్మోస్టాట్ 16 డిగ్రీలు చూపించింది. 

    అది చూస్తూనే అప్పుడెప్పుడో - మా బుజ్జిజింక గాడన్నట్టు - pre-historic times లో FORTRAN లో రాసిన నా మొట్టమొదటి Fahrenheit to Celsius conversion program ని నెమరేసుకుంటూ - ఉరామరిగ్గా - ప్లస్సు పదహారు డిగ్రీల ఫేరన్‌హైట్ ఈజీక్వల్టూ మైనస్సు తొమ్మిది డిగ్రీల సెంటీగ్రేడు - అని మనసు లోనే లెక్కలేసుకున్నా.  

    అలా పాత ప్రోగ్రాముల రోజుల్ని నెమరేసుకునేటప్పుడు నేను మొట్టమొదటిసారిగా ఆ  FORTRAN ప్రోగ్రాం రాసినప్పుడు - Fahrenheit to Celsius conversion formula నన్ను ఎంత సతాయించిందో  గుర్తుకొచ్చింది. 

    వారానికో రోజు అరగంట మాత్రం దొరికేది  కంప్యూటర్ ల్యాబ్ టైం. మాకు FORTRAN చెప్పింది రమశ్రీ మేడం అనుకుంటా. 

    ఒక ఉష్ణోగ్రతని ఫేరన్‌హైట్ నుంచి సెంటీగ్రేడుకి మార్చాలంటే దాన్ని 32 లోంచి తీసేసి 5/9 తో హెచ్చవేయమంది. అదీ ఫార్ములా అని తీర్మానించి తేల్చి చెప్పేసింది. అంత వరకు బానే వుంది. సింటాక్స్ ప్రకారం ప్రోగ్రామ్ రాశానే కానీ నాకేంటో నచ్చలేదు అందులో. ఏం నచ్చలేదా అని తెగ ఆలోచించిన తర్వాత తట్టిందేంటంటే నాకు అందులో 5/9 అన్న క్రమభిన్నం సక్రమంగా అర్థం కాలేదు. మా మేడం "అది అంతే!" అని నొక్కి వక్కాణించింది కానీ "అంతే ఎందుకు?" నా ప్రశ్నని ఆట్టే పట్టించుకోలేదు.  

    ఇలా అర్థాలు ఆట్టే చెప్పకుండా స్టెప్పులేయించి లెక్కలు చేయిస్తున్నారనే కదా ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ కోచింగులు మానేసి సొంతంగా ఆడుతూ-పాడుతూ చదువుకుని ఇక్కడకొస్తే మళ్ళీ ఇక్కడ కూడా ఇదే ఫార్ములాల గొడవేంట్రా బాబూ అనిపించింది. కాకపొతే ఓ రెండో, మూడో కాయితాలు నలుపు చేసేసి, నలిపేసి - సెంటీగ్రేడ్ 100-0=100 కి,  ఫేరన్‌హైట్ 212-32=180 కి నిష్పక్షపాతంగా నిష్పత్తులు చూసేసుకుంటే 5/9 కిటుకు తెలిసిపోయింది. కానీ నాకింక క్లాసులో పాఠాలు వినాలనిపించలేదు.

     MCA మూడేళ్ళలో నేను పాఠాలు విన్నది ఇద్దరో ముగ్గురో చెప్పిన క్లాసులు - శుభ మేడమ్ చెప్పిన డిస్క్రీట్ మేథమేటికల్ స్ట్రక్చర్స్, రాజశేఖర్ సర్ చెప్పింగ్ అకౌంటెన్సీ, సత్యం సర్ చెప్పిన ఆర్గనైజషనల్ బిహేవియర్. మిగిలినవన్నీ నాకు తోచినట్టు నేనే చదువుకున్నా. 

    నాకు మొదట్నుంచి ఉన్న మంచిదో, చెడ్డదో ఒక అలవాటు ఏంటంటే - నాకు పాఠం మొదటిసారి వినగానే అర్థం కాకపోతే ఆ తర్వాత వాళ్ళేం చెప్పినా వినేదాన్ని కాదు. నేనే చదివేసుకుని నాకు తోచినట్లు అర్థం చేసేసుకునేదాన్ని. 

    అప్పటికీ మా అమ్మ చెప్పేది "చెప్పే గురువు మీద భక్తి ఉంటేనే శ్రద్ధ కుదిరి చదువొస్తుంది" అని. 

    "సరే! భక్తి కలిగేలా చెప్పగలిగే గురువు దొరికితే శ్రద్ధగా ఎలాగూ వింటాం. అలా కాకపోతే మహాశ్రద్ధగా వింటున్నట్టుంటాం!!!" అని ఓ విట్టేసేసేదాన్ని. అది విని మా అమ్మకి చిరాకెత్తి - "నీలాంటివాడే వెనకటికొకడు చిన్నప్పుడు కాకరకాయ్ అని పెద్దయ్యాక కీకరకాయ్ అన్నాట్ట" అనేసేది. 

    అసలివన్నీ ఇవాళ ఎందుకు గుర్తుకొచ్చాయీ అంటే రెండ్రోజుల క్రితం ఆదివారం నాడు - హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న పిల్లలున్న తల్లులిద్దరం కబుర్లు చెప్పుకున్నాం - నేనూ, మా ఆడపడుచు. 

    తనతో మాట్లాడడం అయ్యాక - ఆ ఫోన్ పెట్టేశాక - 


"అన్ని ఇంజినీరింగుల టెక్నాలజీలూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లోనే కలిసిపోయేటట్టయితే
To B.E., or not to B.E.?! that is the question" అంటూ మొదలెట్టి  ... 
  "- of that day, of today, of any day" 
అంటూ సాగే  నా soliloquy 
అనబడే స్వగతానికి గతం ఏంటీ అంటే... 

గతం... 

    అనగనగనగనగా... మా గుంటూరు. 

    ఆ మా గుంటూర్లో ఎఱ్ఱటి ఎండలు మొదలయీ మొదలవగానే - ఏడు రంగుల వానవిల్లులో ఇంకో వెయ్యి వన్నెలు కలిపినన్ని రంగురంగుల రెక్కలు తొడుక్కున్న సీతాకోకచిలకల గుంపుల్లా అమ్మాయిలూ - ఇన్ని రంగులు కళ్ళ ముందు కదులుతుంటే ఏ రంగు బట్టలేసుకుంటే ఏంటన్నట్టు తెలుపో-నలుపో-జానేదేవ్-ఆ తేడాలిక్కడ లేనేలేవ్ అన్నట్టున్న గండుతుమ్మెదల్లాంటి అబ్బాయిలూ - బిలబిల్లాడుతూ మా బ్రాడీపేట రోడ్లని కళకళలాడించేవాళ్ళు. 

    మా మేడ మీద పిట్టగోడెక్కి కూర్చుని అటూ-ఇటూ గుంపులుగుంపులుగా గలగల్లాడుతున్న వాళ్ళని చూడడంతో సరదాగానే గడిచింది గుంటూర్లో మా మొదటి వేసవి - జూనియర్ ఇంటెర్మీడియట్ సెలవులది. 

    "కప్పలు, బొద్దింకలు కోయిస్తారు, మా పిల్ల జడుసుకుంటుందమ్మా! ఎందుకొచ్చిన బైపీసీ? ఎంచక్కా లెక్కలు చేసుకుంటుంది" అని దగ్గరుండి మరీ మా అమ్మా, లక్ష్మి దొడ్డా కలిసి నన్ను బండ్లమూడి హనుమాయమ్మ జూనియర్ కాలేజీలో చేర్పించారు కదా! 

     తెల్లవారకుండా లేచేసి - ఒకటో-రెండో జళ్ళేసేసుకుని - జట్లుజట్లుగా - బుద్ధిగా - తలొంచుకుని మా ఇంటి ముందు నుంచి ట్యూషన్లకి వెళ్ళిపోతూ-వచ్చేస్తున్న ఆడపిల్లల్ని చూసి "ఓహో! ట్యూషన్లకి వెళ్తే ఇంత బుద్ధిగా ఉంటారు కామోసు" ననుకుని - అదే ఆశతో పొద్దున్నే నూనె రాసి జళ్ళేసి - నన్ను రాఘవేంద్రరావుగారి ఫిజిక్స్ ట్యూషన్లో కూర్చోపెట్టేసింది మా అమ్మ. 

    ఓ వారం రోజులు అవగానే నాకు ట్యూషన్ పడక జలుబు చేసేసింది. 

    పొద్దున్నే లేచి చలిలో వెళ్ళి నలిగిపోతున్నానని - తొమ్మిదింటికి వెచ్చగా పాలు తాగి వెళ్ళొచ్చని మా ఇంటి వెనకనే ఐదవ లైనులో రిటైర్డ్ టీచర్ భావన్నారాయణ గారి దగ్గర ట్యూషన్ చేర్పించింది అమ్మ. 

    ఆయన కొచ్చిందెంతున్నా - నన్నాట్టే కొశ్చెన్లు అడక్కుండా నాకు నచ్చింది మాత్రమే చెప్పే భావన్నారాయణ గారి చదివింపు నచ్చి ఇంటర్ రెండేళ్ళు ఆయన దగ్గరే లెక్కలు చేసుకొచ్చేదాన్ని. మిగిలిన ఫిజిక్స్, కెమిస్ట్రీ నాకు చేతనైనంత వరకు అర్థం చేసుకుంటూ చదువుకునేదాన్ని. 

    ఇక నా సీనియర్ ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోగానే - ఎంపీసీ గ్రూపు కదా - ఎంత కాదనుకున్నా తర్వాతి అంకం ఎంసెట్.  దాని కోసం ట్యూషన్లు చేరడం తప్పలేదు. తీరా చేరాక - ఈ లెక్క ఇలాగే ఎందుకు చెయ్యాలీ, ఆ ఫిజిక్స్ ఫార్ములా ఎలా వచ్చిందీ - అని సందేహాలొస్తే - "అదంతా ఎంట్రన్స్ అయిపోయాక తీరిగ్గా చర్చించుకుందాం, ప్రస్తుతానికి చెప్పింది చెయ్" - అనేవాళ్ళే అంతా. 

    అప్పుడు... అలాంటి ... అనేకానేక సందేహాలు అస్సలు తీరని అసహనపు వేసవి మధ్యాహ్నాల్లో - వట్టివేళ్ళ చాపల నీడలో కూర్చుని  -  నా చుట్టూ -  పొరలేసి కుడితే మూడు బొంతలయ్యేంత దొంతరల ఎంసెట్ మోడల్ టెస్ట్ పేపర్సూ, దాని మానాన అది కూనిరాగాలు తీస్తున్న ట్రాన్సిస్టరూ,  కొంటె బొమ్మల బాపు, ముళ్ళపూడి బుడుగు, ఆ పక్కనే Merchant Of Venice చదివిన మాయలో ఉండి - మోజుపడి కొనుక్కున్న షేక్స్పియర్ ట్రాజెడీ డ్రామా Hamlet  - ఇన్ని పెట్టుకుని - దీర్ఘంగా ఆలోచించా... 

    ఆ మాత్రం సమాధానాలు కూడా దొరకని అంతంతమాత్రపు చదువు కోసం గుంటూరు వీధుల్లో, వేసంకాలపు మిట్టమధ్యాహ్నపుటెండల్లో తిరగడం అంత అవసరమా అని. 

    అలా అనుకుని - ఇంట్లోనే ఉండి ఎంత చక్కగా చదువుకుంటానో చూడు - అని మా అమ్మని ఒప్పించి, అప్పటి దాకా వెళ్తున్న ట్యూషన్లన్నీ మానేశా. 

    ఇహ అప్పణ్ణించి - పొద్దున్న లేస్తూ చదివా. మధ్యాహ్నం భోంచేస్తూ చదివా. సాయంత్రం టీవీ త్యాగం చేస్తూ చదివా. "పుస్తకం హస్తభూషణం" అన్న నానుడికి బ్రాండ్-అంబాసడర్లా మసలా.  

    అంతా చేసి ఎంట్రెన్స్ రాస్తే వచ్చిన రాంక్  - అంకెల్లోనే కాదు, అంకెలని అక్షరాల్లోకి మారిస్తే కూడా ఘనంగా వినిపించే అంకె - ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు. ఆ రోజుతో కచ్చితంగా తెలిసిపోయింది - I am not meant to be B.E. అని. 

ఇప్పుడు... 
ఇలా ...  - 
"I am not meant to be B.E. దాకా ఎలా వచ్చానో చెప్పాక 
  -ఆ గతానికి కొనసాగింపుగా  
ఈనాటి స్వగతం ఏంటీ అంటే... 

స్వగతం: 

    ఇందాక అప్పుడెప్పుడో మా ఆడపడుచుతో చదువుల గురించి మాట్లాడానని చెప్తూ - నా చదువుల రోజుల్లోకి షికారెళ్ళొచ్చా కదా... తన ఫోన్ పెట్టెయ్యగానే - ఫోన్ పెట్టెయ్యడం అన్నది జరిగింది కానీ మాట్లాడడం మాత్రం ఆగలేదు. 

    "చిన్నప్పుడు ఏ సినిమా చూసినా హీరో బియ్యే చదివి ఫస్టు క్లాసులో పాసవుతూ ఉండేవాడు. అప్పడు BA ఎలాగో ఇప్పటి BE అలా వుంది. సివిల్ చదివినా, మెకానికల్ చదివినా అన్నిటికీ ఎండ్ పాయింట్ IT యే అయిపోయింది. ఆ మాత్రం దానికి అన్ని బ్రాంచులెందుకో? అసలింక కొన్ని తరాల పిల్లలు ఇంజనీరింగ్ చదవడం మానేసి వాళ్ళకి నచ్చిన కొత్త చదువులేమన్నా చదువుకుంటే బావుండును." అని నాలో నేను స్వగతానికి ఎక్కువగా, ప్రకాశానికి మిక్కిలిగా అనుకుంటూ ఉన్నాను. 

    అప్పటి దాకా నేను మాట్లాడుకుంటూ ఉన్నదంతా నిశ్శబ్దంగా వింటున్న బదరి అందుకుని "నీకో సంగతి చెప్తా విను...మనం చదువుకునే రోజుల్లో - మనతో చదివిన వాళ్ళు చాలా మంది ఇంజనీరింగ్ ఎందుకు చదివారంటే అదేదో ఆ సబ్జెక్టు అంటే ఏంటో తెలిసి, దాని మీద ఆసక్తి ఉండి కాదు. అమెరికా చదువుల మోడల్లో 12 ఏళ్ళు స్కూలు  + 4 ఏళ్ళ డిగ్రీ ఉంటే అమెరికాకి వీసా రావడం ఈజీ అవుతుందని ఆ awareness ఉన్న పేరెంట్స్ ఎవరో కొందరు వాళ్ళ పిల్లల్ని ఇంజనీరింగులో చేర్పించి ఉంటారు. వాళ్ళని చూసి ఇంకొందరు... అలా అలా కొన్నేళ్ళయ్యాక అసలు అలా ఎందుకు చదవడం మొదలు పెట్టారో అసలు కారణం మర్చిపోయి ఇంజనీరింగ్ కన్నా ఇక వేరే డిగ్రీయే లేదన్నట్టు అందరూ అదే చదివించడం మొదలు పెట్టారు. ఆంధ్రాలో సీట్లు రానివాళ్లు మహారాష్ట్ర వెళ్ళి కూడా చేరారు. " అంటూ ఇంకొన్ని విషయాలు గుర్తు చేశారు.  

    నాకు ఎప్పుడు చదువుల గురించి తలచుకున్నా బాధ - ఎంతో విలువైన పిల్లల సమయాన్ని, శక్తిని పనికిరాని కోచింగులు, అర్థం లేని కాంపెటిషన్లు మింగేస్తున్నాయని. 

    ఆడుతూ, పాడుతూ, అర్థం చేసుకుంటూ, బుద్ధిని వికసింప చేసేలా హాయిగా చదువుకోవాల్సిన చదువుని పరీక్షల్లో మార్కుల కోసం, ర్యాంకుల కోసం మాత్రం చదువుకోవాల్సి రావడం పువ్వుల్లాంటి, పసిగువ్వల్లాంటి పిల్లలకి జరుగుతున్న మహా  అన్యాయం. 

    అన్నట్టు మా బుజ్జిజింకలతో పాటు చదువుకుంటూ నేను నేర్చుకున్న ఒక చిన్న పాఠం - పరీక్షల ముందు ఏ పిల్లలకీ "All the Best ! Do well!" అని చెప్పొద్దు అని. 

    ఆ విశేషాలు ఇంకో సారి ...