10, ఫిబ్రవరి 2017, శుక్రవారం

నాని 'నేను లోకల్' - నాన్న 'నేను వోకల్'

కిందటి గురువారం  ఫోన్లో టింగుమని శబ్దం చేస్తూ వచ్చిన ఈమెయిల్లో - నమస్కార్దేశిడాట్కామ్ వాళ్ల నుంచి ఒక సినిమెయిల్ మెరిసింది - నాని "నేను లోకల్" విడుదల అవుతోంది - చూడండహో అంటూ.

అది చూడగానే - ముందుగా వచ్చిన ఆలోచన - టీవీలు, స్మార్ట్ ఫోన్లు లేని చిన్నప్పటి రోజుల్లో సినిమాగమనం ఎలా తెలిసేదా - గుర్తు చేసుకుందాం ఒకసారి - అని.

ఒక గూడు రిక్షాలో - ముందుపక్క రిక్షా అబ్బాయి నెమ్మదిగా తొక్కుతుంటే - వెనకగా కూర్చుని ఒక చేత్తో పట్టుకున్న మైకులో - "నేడ్డే చ్చూడండి (ఆ 'డే' మీద - 'చూ' మీద ఒత్తి పలుకుతూ) మీ అభిమాన థియేటర్ <పేరేదైనా కావొచ్చు>   మీ అభిమాన నటుడి <పేరేదైనా కావొచ్చు>  సినిమా" అంటూ - ఇంకో చేత్తో రంగురంగుల సినిమా వివరాలున్న పాంఫ్లెట్ / కరపత్రాలు వెదజల్లుతూ - వెళ్లే సినిమా-బండబ్బాయి ప్రతి శుక్రవారం వచ్చే సిని-మా-చుట్టం.

ఆ సినిమా-బండ్ల సరదాలనుంచి ఈమెయిళ్ల పరదాలకి అప్డేట్ అయ్యాము.

బదరి, నేను - సినిమాల్లో కూడా అప్డేట్ అయ్యాము బాగానే. భాషాభేదం సరే - వయోభేదం కూడా చూడం - బుజ్జిజింకలతో కలిసి Finding Dory చూడడానికైనా వాళ్లకన్నా ముందే మేం తయారు.

సినిమా అంటే - మాకు - ముఖ్యంగా నాకు - ఇలాగే వుండాలి - చూసే మూడుగంటల సినిమా ఇంకో ముప్పై గంటలు ఆలోచించేలా చేయాలి - అన్న పట్టింపులేం లేవు.

తెలుగు భాష - యాస ఏదైనా సరే - మంచి మాటలతో వుండి, పాటలు అంతో ఇంతో వినసొంపుగా వుండి, హాస్యం పేరుతో సాటి మనుషులని తన్నకుండా-వెక్కిరించకుండా వుండి, హీరో-హీరోయిన్లు చూడముచ్చటగా వుండి - తెరంతా రంగురంగులుగా - "అబ్బా! కాసేపు అన్నీ మర్చిపోయి హాయిగా వేరే లోకం చూసొచ్చాము" అనేలా ఉంటే చాలు.

అసలు నిజం చెప్పాలంటే మొదట 'నేను లోకల్' సినిమా పేరు వినగానే వెంటనే ఇది చూసి తీరాలి అనిపించలేదు.

కానీ అప్పుడెప్పుడో ఈ నానిదే భలే భలే మగాడివోయ్ తర్వాత - అసలే ఈ మధ్య థియేటర్లో  తెలుగు సినిమాలు చూడలేదేమో - మా సినిమాకలి మిక్కిలిగా వుంది.

సరే - మన అచ్చతెలుగబ్బాయి -  చలాకీగా చులాగ్గా సినిమాని నడిపించేస్తాడసలే - నాని సినిమా కదా - వెళ్దామా అనుకున్నాము - కిందటి శుక్రవారం.

మేము తలిస్తే సరిపోదు కదా - బుజ్జిజింక దయతలచాలి - అసలే వాడికి శనివారం ఏదో లెక్కల పోటీ స్కూల్లో.

శుక్రవారం రాత్రి - బుజ్జిజింక కలల వేళ - దుప్పటి చెవులదాకా కప్పి - బుగ్గ మీద ముద్దు పెడుతూ - నాన్నగారు అడిగారు - "నాన్నా! రేపు సినిమాకి వెడదామా? మనమ్మ సినిమా-బెంగ తీరుద్దామా?" అని.

"తెలుగు సినిమానా - అమ్మో - గట్టిగా అరుస్తారేమో , రక్తాలొచ్చేలా కొట్టుకుంటారేమో ?" - బుజ్జిజింక నిద్ర మత్తులో కూడా ఇంతకు ముందు అప్పుడెప్పుడో చూసిన సినిమా తాలూకు పలవరింతే.

బుజ్జిజింక కలవరపాటుతో కూడిన పలవరింత విన్న అమ్మ - స్వగతంగా - "(కృష్ణవంశీ మొగుడి దెబ్బా - మజాకానా)" అనుకుంది.
సావకాశమైన గొంతుతో - ప్రకాశంగా -  నాన్నగారిచ్చిన  భరోసా- "లేదు నాన్నగాడు - ఇది సరదా సినిమా - ఇంతకు  ముందు చూసిన సినిమాలో నీకు నచ్చాడు - అదే అన్నీ మర్చిపోతూ ఉంటాడు - భలే భలే మగాడివోయ్ హీరో - ఆ నాని సినిమా".

"సరే - లెట్స్ గో " - వరమిచ్చేసిన బుజ్జి-దేవుడు పవళించాడు.

శనివారం - పొద్దున్న అబ్బాయి లెక్కల పోటీ - మధ్యాహ్నం అమ్మా-నాన్నల తమిళ-భాషా-తరగతి-భేటీ అయిపోగానే - సాయంత్రం భోజనాలు కాగానే తొమ్మిదిగంటల సినిమాటకి వెళ్లాం ముగ్గురం.

మా సినిమాచారం ప్రకారం -
నాకో బుట్టెడు చిప్స్----
పక్కనే చీజు----
ఇంకో పక్క  జకారమునకు హకారమాదేశించుకుని రెట్టించిన కారంతో నా చేత హాహాకారం చేయించే  హాలాపిన్యోస్  (Jalapeños) అనబడే గుండ్రని పచ్చిమిరపకాయ ముక్కలు---
బుజ్జిజింకకి Crunch-a-Bunch పొట్లం---
- కొనిపెట్టేసి ఇద్దర్నీ పట్టుకెళ్లి అన్నిటికన్నా పై....న వున్న వరసలో తన సరసన కూర్చోపెట్టుకున్నారు బదరి / నాన్నగారు.

కర కర చిప్స్ - కటుకు కటుకు Crunch - మిల్లులాడడం మొదలయింది.
దాంతో ఈ నేపథ్య సంగీతంతో టాకీ-సినిమా కాస్తా మూకీలా చూడాలేమో అని నాన్న చెవులు అల్లలాడడం కూడా.

బోల్డు మంది తెలిసినవారు ముందు-పక్క సీట్లలో కూర్చుని కనిపించారు.
కరకరలాడే నోటితో నవ్వుతూ -  కరాల-చాలనతో (కరచాలనం కాదు) - శబ్దం రాని పెదవుల కదలికతో 'హాయ్' అంటూ - కాసేపు పలకరింపుల-హడావిడి సాగింది.

ఇంతలో సినిమా మొదలయింది.

మెరిసే కళ్లతో చలాకీగా - మనకి బాగా తెల్సిన ఓ మంచబ్బాయిలా కనిపించే నాని సెప్టెంబర్ లో పరీక్షలు రాసే సీను.

పక్కనే కూర్చుని వున్న - బుజ్జిజింక - చాక్లెట్టు కటుకు-కటుకులు నెమ్మది నెమ్మదిగా కుహు-కుహులయి బుగ్గలు పూరించిన నవ్వులయ్యాయి.

మొత్తానికి ఈ సినిమాలో మాకు అనిపించినవి - నచ్చినవి - అవీ-ఇవీ-అన్నీ 

సినిమా మొత్తం సరదా-సరదాగా సాగిపోయింది - అక్కడక్కడా ఇల్లాజికల్ గా అనిపించినా - అంత పట్టించుకోలేదు మేము. 

నాని  (సినిమాలో పేరు బాబు) ఏక్షన్, డాన్స్, డైలాగ్ డెలివరీ - అన్నీ బావున్నాయి. అతిగా అరవకుండా - నెమ్మదిగా మాట్లాడినా కూడా -  ఆయాసపడకుండా ఆవేశం బాగా చూపించగలడీ అబ్బాయి - చూపుతో, మాటతో. 

కీర్తి సురేష్ - అమ్మాయి ముద్దబంతిపూవులా, ముద్దమందారంలా బావుంది - చుడీదార్ వేసుకున్నా , చీర కట్టుకున్నా ఒద్దికగా వుంది - సినిమాలో పాత్రకి తగ్గట్టు. 

హీరో బాబు - నాన్న - పోసాని - అరిచినా చిరాకెయ్యలేదు - అమ్మాయిని చూడగానే కోడల్ని చేసుకోవాలనే మంచి మామయ్యగా - బాబుని సపోర్ట్ చేసే బాబుగా - బావున్నాడు. 

ఒకప్పటి బాపు-బొమ్మ - ఇందులో బాబు-అమ్మ - ఈశ్వరీ రావు - కనిపించేది అంత ఎక్కువసేపు కాకపోయినా గుర్తుండిపోయే అమ్మ. 

కీర్తి నాన్న మరాఠీ నుంచొచ్చిన సచిన్ ఖేడేకర్ అట - కొంచెం కళ్ల దగ్గర అరవింద్ స్వామి గుర్తొచ్చాడు. 
శంకరాభరణం తులసి అయితే నిజంగా కీర్తికి అమ్మేమో అనేంతగా కుదిరింది పోలిక.

తులసి చూసే 'మనసు-మమత' సీరియల్ 'ఆమ్మో ఇదింకా ఉందా' అనిపించింది.
[దాదాపు నాలుగేళ్ల క్రితం  మా అత్తగారు టీవీలో రోజూ చూస్తుండగా ఇంట్లో పనిచేసుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు - వినకూడదనుకున్నా, వినిపించుకోకూడదనుకున్నా, వినీ-వినకుండా వినేసిన - హాంటింగ్ మెమొరీ ఈ సీరియల్ నాకు.] 
కామెడీ / హాస్యం కోసం వున్న సీనులు కొత్త ఐడియాలతో నిజంగా నవ్వు తెప్పించేలా వున్నాయి - పక్కవాళ్లు నవ్వుతున్నారని మొహమాటపడి మరీ నవ్వేలా కాకుండా.
ముఖ్యంగా హీరో బాబుని అన్యాయంగా జైల్లో పెట్టారని తెలిసి విడిపించడానికి -  స్నేహితులు - ఇరుగు పొరుగు వారు - చిన్నపిల్లలతో సహా - వచ్చి పోలీస్ స్టేషన్లో బోల్డన్ని కేసులు పెట్టే సీను యునీక్ గా వుంది.

అందులో ఒక చిన్న బాబు పెన్సిల్ పోయిందని కేసు పెట్టడానికి వచ్చి పెన్సిల్ ఎలా పోయిందంటే - ఒక అరగంట షార్పెనర్ లో పెట్టి తిప్పితే పోయిందని చెప్పినది - బుజ్జిజింకకి బాగా నచ్చేసింది. సబ్-టైటిల్స్ చదువుకుని సినిమాని బాగా ఎంజాయ్ చేశాడు. 

నవీన్ చంద్ర సబిన్స్పెక్టర్ గా - గొంతు కొంచెం hollow గా అనిపించినా అంతగా బోర్ కొట్టలేదు - ఈ అబ్బాయి కూడా బాగానే చేశాడు అనుకున్నాము. 

అన్నిటికన్నా నచ్చిన విషయం -  కాబోయే మామగారు ఏమనుకోరు అని తెలిసి, ఆయనే చెప్పిన తర్వాత హీరో బాబుని తన కాలర్ పెట్టుకునేలా చేసి (అరెస్ట్ చేయడానికి కారణం కావాలి కాబట్టి ) - అరెస్ట్ చేసినా - ఆ పోలీస్ స్టేషన్ సీను కూడా అక్కర్లేని డ్రామాలు,  రక్తాలు వచ్చేలా కొట్టుకోవడాలు (మా బుజ్జిజింక అన్నట్లు) లేకుండా చాలా నీట్ గా సివిలైజ్డ్ గా వుంది.
నాకెంతో ఇష్టమయిన వంశీ సినిమా - ఏప్రిల్ ఒకటి విడుదల-గోపి - కృష్ణభగవాన్ కి ఇంకొంచెం పెద్ద రోలు (రాతి రోలు కాదు - సినిమా పాత్ర రోలు) ఇచ్చుంటే బావుండేదనిపించింది. 
పాటల్లో "నెక్స్ట్ ఏంటి" బావుంది. మిగిలిన పాటలు అంతగా గుర్తు లేవు - ఇంకోసారి విని చూడాలి. 
"అరెరే ఎక్కడ" పాటలో హీరో గొంతుకి, హీరోయిన్ గొంతుకి అంత తేడా లేదు. 

సినిమాలో మాటలు ఎక్కువ డ్రామా లేకుండా మామూలు భాషలో వినడానికి హాయిగా వున్నాయి.
ఒకచోట బాబు కీర్తితో  జీవితమంతా గడపాలని వుంది అని చెప్తూ "మన పెళ్లయాక కూరలో ఉప్పు తక్కువయిందని నిన్ను తిట్టాలి" - ఇలాంటిదేదో అంటాడు - అది వినగానే - సహజనక్షత్రం చెప్పిన అతి సహజమైన డైలాగిది అని మురిసిపోయాం మేమిద్దరం.
ఇంతకు ముందు సినిమాలలో సరిగ్గా ఇదిగో - ఇలాంటి సందర్భాల్లో - హీరో - "నీ కంట్లోంచి నీరు రానీయను - నీ కాలు కందనీయను" అని చెప్పే అతిశయోక్తులు గుర్తుకొచ్చి - పోల్చి నవ్వుకున్నాం.
చివరిలో లోకల్ ఫీలింగ్ తో గెలిచినవాళ్లం నేను-ట్రంపూ అని బాబు అనడం సినిమాకి contemporaneity-advantage పెంచింది.
ఈ సినిమా sensible team-work కి మంచి ఉదాహరణ

"నేను లోకల్"  అన్న నాని  హంబుల్
కాని అలా అన్న నాని కీర్తి మాత్రం గ్లోబల్ 



ఉపసంహారం - మా నాన్న 'నేను వోకల్ (వీడియో కాల్లో)'

సినిమా చూసొచ్చి - ఆ కబుర్లు చెప్పుకుని కొంచెం లేటుగా పడుకుని - ఆదివారమే కదా అని - మరి కొంచెం లేటుగా లేస్తూ ఉంటే - నా ఫోన్ మోగింది - Out of Area అని చూపిస్తూ. 
ఎవరయుంటారబ్బా అని తీసి - హలో - అనగానే, అవతల నుంచి నాన్న "గొంతేంటి అలా వుంది - ఒంట్లో బాలేదా?" అంటూ. 

"లేదు నాన్నా - ఇప్పుడే లేస్తున్నాను"

"ఫోన్ సరిగ్గా చూశావా - నేను వాట్సాప్ లోంచి కాల్ చేస్తున్నాను - ఓసారి ట్రై చేద్దామని"

"అవున్నాన్నా చూశాను"

"సరే - అదేదో ఫేస్ టైం వుంది కదా - ఓసారి చెయ్యి అది"

"అబ్బా వద్దు నాన్నా - రాత్రి 'నేను లోకల్' సినిమాకెళ్లి వచ్చాము - ఇప్పుడే లేస్తున్నాను - ఇలా చూస్తే భయపడతారు"

"పర్లేదులే చెయ్యి ఒకసారి - అవునూ - నేను లోకల్ బావుందంటున్నారు ఇక్కడ కూడా - అలాగే శతమానం భవతి కూడా - అద్సరే కానీ ముందు ఫేస్ టైం లోకి రా"

ఇంకొదలరు - అనుకున్నది అయ్యేదాకా ... 

సరే - ఫేస్ టైం లాంటిదే కదా అని - వాట్సాప్ వీడియో కాల్ చేశాను. 

అట్నుంచి నాన్న ఫోన్ తీశారు. 

ఫోన్ స్క్రీన్ మీద ఇన్సెట్ లో నా మొహం బానే కనిపిస్తోంది - కానీ అటుపక్కనుంచి నాన్న కనిపించట్లేదు - స్క్రీన్ అంతా నల్లగా - అక్కడక్కడా ఏదో మిణుకు మిణుకు మంటూ చుక్కలు చుక్కలుగా కనిపిస్తోంది. 

ఒక్క నిముషం ఏమీ అర్థం కాలేదు. 

"ఏంటి నాన్నా! ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టుంది - మీరసలు కనిపించట్లేదు నాకు "

అవతలి నుంచి "హహ్హహ్హహ్హ"

ఇవతలి నుంచి నేను అయోమయంగా - ఏంటా అనాలోచిస్తూ  -  "......"
"నేను చీకట్లో ఉంటే ఎలా కనిపిస్తాను?' అంటూ అటు నుంచి నవ్వులు
'మీరు చీకట్లో వుండి వీడియో కాలేంటి నాన్నా!"
"అసలెలా వస్తుందో చూద్దామని - హహ్హహ్హహ్హ - నేను వోకల్ గా ఓకే కదా"
"మీరు - బాబోయ్ - వుండాల్సిన వారు నాన్నా!" 

"హహ్హహ్హహ్హ"



28 కామెంట్‌లు:


  1. ఆహా మీరేమో సినిమా కల్చరు మీద ఓహో అంటారు
    దూర్వాసులు గారేమో ఏ దేశంబేగినా అంటారు

    అబ్బబ్బ యింతకీ సత్తు ఏదండీ ;)


    కరకరలాడే నోటితో నవ్వుతూ - కరాల-చాలనతో (కరచాలనం కాదు) - శబ్దం రాని పెదవుల కదలికతో 'హాయ్' అంటూ - కాసేపు పలకరింపుల-హడావిడి సాగింది.


    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబిగారు: ఆన్యగామిగారు (దూర్వాసులు గారంటే ఆయనే అనుకుంటున్నాను) చెప్పినదీ, నేను రాసినదీ - రెండూ "సత్" లే. మేము చాలా తక్కువగా థియేటర్ కి వెళ్తాము - అందుకని చాలా వరకు సినిమా-హాలు ఇబ్బందులు నాకు తెలియవు. అదీ కాక ఒకరకంగా I believe I am in a way fortunate as I'm selectively deaf and blind ;)

      తొలగించండి
  2. "అసలెలా వస్తుందో చూద్దామని - హహ్హహ్హహ్హ - నేను వోకల్ గా ఓకే కదా"
    నవ్వుకున్నా సుమా!
    అద్సరేగానమ్మాయ్! మరీ ఇంతపొదుపైతే ఎలా తల్లీ!! స్క్రీన్ లో దూరేలా మొహం పెట్టి చూసినా కనపడని అక్షరాలతో :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మగారు: అవును desktop version లో అక్షరాలు చిన్నవిగా వున్నాయి - Font size మార్చానండి. మీ అభిమానపూరిత వ్యాఖ్యకి ధన్యవాదాలు!

      తొలగించండి
  3. లోకల్ వోకల్ రెండూ
    ప్రాకటముగ జదివి బ్లాగు పాఠక ముఖముల్
    రాకేందు బింబ మంతై
    శ్రీకరముగ ట్యూబు లైట్లు చిరు నవ్వొలికెన్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట రాజారావు . లక్కాకుల గారు: నా బ్లాగ్ పోస్ట్ మీకు నవ్వులు పంచి మీ చేత ఈ పద్య వ్యాఖ్య రాయించింది - సంతోషం! నచ్చి మెచ్చి వచ్చి చెప్పినందుకు - ధన్యవాదాలు!!

      తొలగించండి
  4. లలిత గారు,
    మీ "నేను లోకల్" రివ్యూ దిల్ రాజుకు పంపితే తన కలెక్షన్స్ కు మరిన్ని కాసులు జత చేసికొనే వాడు. మీ రివ్యూ చూసాక మాకు కూడా ఈ సినిమా చూడాలనిపిస్తోంది. మరీ రొటీన్ రివ్యూస్ లా కాకుండా చక్కని చిన్న కథలా బాగా వ్రాసారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట్ గారు: అద్భుతమైన సినిమా - చూడకపోతే ఏదో మిస్ అవుతామని చెప్పను గానీండి - ఒక రెండున్నరగంటలు హాయిగా నవ్వుకోవడానికి ఒక మంచి సినిమా. కొన్నిచోట్ల ఇల్లాజికల్ గా అనిపిస్తుంది. నిజమే. కానీ కోతి కరిచిన అల్లు రామలింగయ్య కోతిలా నటిస్తే చిన్నప్పుడు ముత్యాలముగ్గు సినిమా చప్పట్లు కొట్టుకుంటూ నవ్వుకుంటూ చూసిన నాకు - అంతే open mind తో ఇప్పటికీ సినిమాలు చూసే నాకు - నచ్చింది - ఈ సహజ నక్షత్రపు సినిమా :)

      సినిమా గురించి నేను రాసిన నా "వ్యూ" మీకు నచ్చినందుకు సంతోషం! వీలుంటే తప్పకుండా చూడండి.

      తొలగించండి
  5. సినిమాని వేరేఅవాంతరాలేమి లేకుండా చివరి వరుసలో కూర్చొని, చూసి, ఆనందించివచ్చినందుకు మీకు అభినందనలు. ఇదేమి మామూలు విషయం కాదు. మంచి సినిమానే, దాని కంటే మీ సమీక్ష ఇంకా బావుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్యగామిగారు: నా ఈ బ్లాగ్ పోస్ట్ మీకు నచ్చినందుకు సంతోషం. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      తొలగించండి
  6. సమీక్ష చాల బాగుంది..మధ్యలో Gentleman అని ఒక చిత్రం వచ్చింది. వీలుంటే youtube లో చూడండి. అది కూడా బాగుంది. Last punch 'నాన్న వోకల్ ' సూపర్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గిరిరాజ్: మీరు చెప్పిన Gentleman సినిమా చూశాము. Thanks for your comment on "Naanna Vocal" :)

      తొలగించండి
  7. లలితా! నాని, 'నేను లోకల్' మీద నీ ' వ్యూ' కన్నా,
    మీ నాన్నారి, 'నేను వోకల్' కన్నా, తెలుగు సినిమాల మీద
    'నాన్ లోకల్' బుజ్జి జింక 'వ్యూ' ఇంకా బావుంది. :-)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మి: బుజ్జిజింక వ్యూ నీకు నచ్చిందని వాడికి చెప్పాలే :)

      తొలగించండి
  8. Good one! Chadavadaaniki eeroju kudirindi. Kadhanam kadam tokkutoo, free stylelo ramyamgaa vundi. Kanda padyam complement baagundi!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీనివాస్ గారు: మీ కందపద్య వ్యాఖ్య మెచ్చుకోలు వెంకట రాజారావు.లక్కాకుల గారికి - నా బ్లాగ్ తరపున అందజేస్తున్నాను. Thanks for your nice words about my blog post.

      తొలగించండి
  9. పవన్కళ్యాణ్ అన్నట్టు లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా అన్నట్టు బాబీ గారి పంచ్ అదిరిపోయింది.
    సినీమా సమీక్ష కు ధన్యవాదములు మేము ఇంకా చూడలేదు....

    రిప్లయితొలగించండి
  10. మేడం గారు,
    నాని లోకల్ కి మీ వ్యూ భలే ఫోకల్ మీ నాన్నగారి వెర్షన్ అయితే ఇంకా కేకల్ ...
    సినిమా ఏమో గానీ మీ రివ్యూ మాత్రం అసల్ సిసల్ నవ్వుల్ ... పువ్వుల్ ...
    బాగుందంటే బాగుందంతే. :)

    పొతే చిన్న రాయభారం ... మీ బ్లాగ్ ద్వారా ... పిచ్చాపాటీ వంశీ కృష్ణ గారికి ...
    మీ ఉప్మా బ్రేక్ఫాస్ట్ లో చిన్న గల్తీ జరిగింది. కామెంట్ పెట్టి, తిరిగి మార్చి
    పెడదామన్న తొందరలో టెంప్లేట్ ఏంటి అని చూసుకోకుండా డిలీట్ చెయ్యడం జరిగింది.
    డాష్బోర్డ్ లోకి వెళ్లి కామెంట్స్ లో నా deleted కామెంట్ ని
    దయచేసి డిలీట్ చెయ్యగలరు. అందాకా మీ బ్లాగ్ పోస్ట్ లో కామెంట్స్
    కనపడవు. పోస్ట్ చేయడం కుదరదు. నాది కూడా అదే టెంప్లేట్ అవడంతో
    సమస్య నాకు తెలుసు. వంశీ కృష్ణ గారూ కలిగించిన అసౌకర్యానికి క్షంతవ్యుడిని. :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బండివారు,
      మరొకరిమీద ప్రయోగం చేసి తేల్చుకున్నారనమాట, అమ్మవారి గొప్పతనం :)

      తొలగించండి
    2. అయ్యో గురువు గారూ,
      అంత పధక రచనా సంపత్తి లేదండి నావద్ద!
      నా శీలాన్నెలా రుజువు పర్చుకోగలను!?
      హే భగవాన్!!! అక్కడ చక్రం ఇంకా గిరా గిరా తిరుగుతూనే ఉంది...
      ఇంకా వంశీ కృష్ణ గారు చూడనే లేదు!
      నా కామెంట్ ను అక్కడ నేను ఎప్పుడు పెట్టాలి!?
      ఆయన గానీ నన్నో దుష్మన్ గా లెక్క కట్టారు గందా!?
      (బ్రహ్మ పుత్రి గారింకా రంగ ప్రవేశం చేయలేదెందుకో!?)
      :)

      తొలగించండి
    3. హహ్హా ... హహ్హహా ...
      అక్కడ చక్రం అలా గిర్రున తిరుగుతూ బ్లాగ్ప్రవేశాన్ని
      కర్కశంగా అడ్డుకున్నా, మిక్కిలి తెలివితేటలతో
      సెల్ ఫోన్ ద్వారా నా కామెంట్ ను దిగ్విజయంగా
      వంశీ కృష్ణ గారి పోస్ట్ లో అచ్చేశానోచ్ ...
      (అవును విన్నకోట గురువు గారూ, నాతో పాటే
      అక్కడ మీది కూడా ఒక deleted కామెంట్
      దర్శనమిస్తోందిగా! అమ్మా!
      బరువు దిగిపోయింది. నా తప్పు యాభై శాతం
      మాత్రమే. ఇప్పుడు హాయిగా ఉంది.)
      :)

      స్పేస్ అంతా కబ్జా చేసి మా కబుర్లు ఇక్కడ కూడా బోల్డు చెప్పేసుకున్నందుకు
      లలితా మేడం గారు అన్యధా తల్చక మమ్మల్ని సాదరంగా (నే) ఆదరిస్తారని ఆశిస్తూ ...
      :)jf ... __/\__ ...

      తొలగించండి
    4. అవును బండి వారు, నేను కూడా "మిక్కిలి తెలివితేటలతో" నా ఆండ్రాయిడ్ ద్వారా నా వ్యాఖ్యను లోపలకి తోసేసాను. కానీ ఉత్సాహం ఎక్కువై (ఉప్మా కదా) రెండు సార్లు వెళ్ళింది. అయ్యో ఇదేవిటని హడావుడిగా ఒకటి డిలీట్ చేశాను. ఫరవాలేదులెండి, మీ తప్పును సగం సగం పంచుకుందాం - ఎంతైనా రిటైరయినవాళ్ళం, మనం మనం బరంపురం, అంటూ ఐకమత్యంగా ఉండాలి కదా 👍 😀.

      తొలగించండి

    5. (బ్రహ్మ పుత్రి గారింకా రంగ ప్రవేశం చేయలేదెందుకో!?)
      :)
      BNM రావు గారు,
      మనమంతా వచ్చేస్తున్నామనుకుని అమ్మవారు ఏర్పాట్లలో పడిపోయినట్టున్నారు :) ఇప్పుడే చెప్పేస్తా! ''ఎవరం రావటం లేదూ, మీరేం కంగారు..పడి..పోకండీ'' అని :)

      తొలగించండి
    6. అదేదో తొందరగా చెప్పెయ్యండి గురువు గారు.
      ఆవిడ కబడి కబడి కూత బ్లాగుల్లో వినబడకుంటే
      చాలా వెలితిగా ఉంది. ఈ రోజు మాలిక పేజీల్లో
      రెండు వైపులా ఉప్పగా ఆవిడ పేరు కనబడకపోతే
      (అలా నేను ఎప్పుడూ చూడలేదు) చాలా చప్పగా ఉంది ...
      :) jf

      తొలగించండి
  11. హ్హ హ్హ హ్హ బండి వారూ, ఆ టెంప్లేట్ మీద మీరే అధారిటీ. ఇటీవలే బోల్డంత అనుభవం వచ్చిందిగా😀. నేనూ ఇప్పుడు మళ్ళా చూశాను, అక్కడ చక్రం ఇంకా తిరుగుతూనే ఉంది 😀.

    రిప్లయితొలగించండి