అవీ-ఇవీ-బోల్డన్ని లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అవీ-ఇవీ-బోల్డన్ని లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, ఫిబ్రవరి 2021, మంగళవారం

To B.E., or not to B.E. ... అంటూ సాగే నా soliloquy!

    మొన్నటి ఆదివారం నుంచి ఎంత చలిగా ఉందో ఈ మా ఊళ్ళో!

        మా ఊళ్ళో చలిపులి "బ్‌ర్‌ర్‌ర్"మని గాండ్రిస్తోంది.  

    ఉన్నచోట - ఉన్న పళాన ఉష్ణోగ్రత ఎలా ఉందా అని చూస్తే ఇంట్లో థెర్మోస్టాట్ 16 డిగ్రీలు చూపించింది. 

    అది చూస్తూనే అప్పుడెప్పుడో - మా బుజ్జిజింక గాడన్నట్టు - pre-historic times లో FORTRAN లో రాసిన నా మొట్టమొదటి Fahrenheit to Celsius conversion program ని నెమరేసుకుంటూ - ఉరామరిగ్గా - ప్లస్సు పదహారు డిగ్రీల ఫేరన్‌హైట్ ఈజీక్వల్టూ మైనస్సు తొమ్మిది డిగ్రీల సెంటీగ్రేడు - అని మనసు లోనే లెక్కలేసుకున్నా.  

    అలా పాత ప్రోగ్రాముల రోజుల్ని నెమరేసుకునేటప్పుడు నేను మొట్టమొదటిసారిగా ఆ  FORTRAN ప్రోగ్రాం రాసినప్పుడు - Fahrenheit to Celsius conversion formula నన్ను ఎంత సతాయించిందో  గుర్తుకొచ్చింది. 

    వారానికో రోజు అరగంట మాత్రం దొరికేది  కంప్యూటర్ ల్యాబ్ టైం. మాకు FORTRAN చెప్పింది రమశ్రీ మేడం అనుకుంటా. 

    ఒక ఉష్ణోగ్రతని ఫేరన్‌హైట్ నుంచి సెంటీగ్రేడుకి మార్చాలంటే దాన్ని 32 లోంచి తీసేసి 5/9 తో హెచ్చవేయమంది. అదీ ఫార్ములా అని తీర్మానించి తేల్చి చెప్పేసింది. అంత వరకు బానే వుంది. సింటాక్స్ ప్రకారం ప్రోగ్రామ్ రాశానే కానీ నాకేంటో నచ్చలేదు అందులో. ఏం నచ్చలేదా అని తెగ ఆలోచించిన తర్వాత తట్టిందేంటంటే నాకు అందులో 5/9 అన్న క్రమభిన్నం సక్రమంగా అర్థం కాలేదు. మా మేడం "అది అంతే!" అని నొక్కి వక్కాణించింది కానీ "అంతే ఎందుకు?" నా ప్రశ్నని ఆట్టే పట్టించుకోలేదు.  

    ఇలా అర్థాలు ఆట్టే చెప్పకుండా స్టెప్పులేయించి లెక్కలు చేయిస్తున్నారనే కదా ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ కోచింగులు మానేసి సొంతంగా ఆడుతూ-పాడుతూ చదువుకుని ఇక్కడకొస్తే మళ్ళీ ఇక్కడ కూడా ఇదే ఫార్ములాల గొడవేంట్రా బాబూ అనిపించింది. కాకపొతే ఓ రెండో, మూడో కాయితాలు నలుపు చేసేసి, నలిపేసి - సెంటీగ్రేడ్ 100-0=100 కి,  ఫేరన్‌హైట్ 212-32=180 కి నిష్పక్షపాతంగా నిష్పత్తులు చూసేసుకుంటే 5/9 కిటుకు తెలిసిపోయింది. కానీ నాకింక క్లాసులో పాఠాలు వినాలనిపించలేదు.

     MCA మూడేళ్ళలో నేను పాఠాలు విన్నది ఇద్దరో ముగ్గురో చెప్పిన క్లాసులు - శుభ మేడమ్ చెప్పిన డిస్క్రీట్ మేథమేటికల్ స్ట్రక్చర్స్, రాజశేఖర్ సర్ చెప్పింగ్ అకౌంటెన్సీ, సత్యం సర్ చెప్పిన ఆర్గనైజషనల్ బిహేవియర్. మిగిలినవన్నీ నాకు తోచినట్టు నేనే చదువుకున్నా. 

    నాకు మొదట్నుంచి ఉన్న మంచిదో, చెడ్డదో ఒక అలవాటు ఏంటంటే - నాకు పాఠం మొదటిసారి వినగానే అర్థం కాకపోతే ఆ తర్వాత వాళ్ళేం చెప్పినా వినేదాన్ని కాదు. నేనే చదివేసుకుని నాకు తోచినట్లు అర్థం చేసేసుకునేదాన్ని. 

    అప్పటికీ మా అమ్మ చెప్పేది "చెప్పే గురువు మీద భక్తి ఉంటేనే శ్రద్ధ కుదిరి చదువొస్తుంది" అని. 

    "సరే! భక్తి కలిగేలా చెప్పగలిగే గురువు దొరికితే శ్రద్ధగా ఎలాగూ వింటాం. అలా కాకపోతే మహాశ్రద్ధగా వింటున్నట్టుంటాం!!!" అని ఓ విట్టేసేసేదాన్ని. అది విని మా అమ్మకి చిరాకెత్తి - "నీలాంటివాడే వెనకటికొకడు చిన్నప్పుడు కాకరకాయ్ అని పెద్దయ్యాక కీకరకాయ్ అన్నాట్ట" అనేసేది. 

    అసలివన్నీ ఇవాళ ఎందుకు గుర్తుకొచ్చాయీ అంటే రెండ్రోజుల క్రితం ఆదివారం నాడు - హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న పిల్లలున్న తల్లులిద్దరం కబుర్లు చెప్పుకున్నాం - నేనూ, మా ఆడపడుచు. 

    తనతో మాట్లాడడం అయ్యాక - ఆ ఫోన్ పెట్టేశాక - 


"అన్ని ఇంజినీరింగుల టెక్నాలజీలూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లోనే కలిసిపోయేటట్టయితే
To B.E., or not to B.E.?! that is the question" అంటూ మొదలెట్టి  ... 
  "- of that day, of today, of any day" 
అంటూ సాగే  నా soliloquy 
అనబడే స్వగతానికి గతం ఏంటీ అంటే... 

గతం... 

    అనగనగనగనగా... మా గుంటూరు. 

    ఆ మా గుంటూర్లో ఎఱ్ఱటి ఎండలు మొదలయీ మొదలవగానే - ఏడు రంగుల వానవిల్లులో ఇంకో వెయ్యి వన్నెలు కలిపినన్ని రంగురంగుల రెక్కలు తొడుక్కున్న సీతాకోకచిలకల గుంపుల్లా అమ్మాయిలూ - ఇన్ని రంగులు కళ్ళ ముందు కదులుతుంటే ఏ రంగు బట్టలేసుకుంటే ఏంటన్నట్టు తెలుపో-నలుపో-జానేదేవ్-ఆ తేడాలిక్కడ లేనేలేవ్ అన్నట్టున్న గండుతుమ్మెదల్లాంటి అబ్బాయిలూ - బిలబిల్లాడుతూ మా బ్రాడీపేట రోడ్లని కళకళలాడించేవాళ్ళు. 

    మా మేడ మీద పిట్టగోడెక్కి కూర్చుని అటూ-ఇటూ గుంపులుగుంపులుగా గలగల్లాడుతున్న వాళ్ళని చూడడంతో సరదాగానే గడిచింది గుంటూర్లో మా మొదటి వేసవి - జూనియర్ ఇంటెర్మీడియట్ సెలవులది. 

    "కప్పలు, బొద్దింకలు కోయిస్తారు, మా పిల్ల జడుసుకుంటుందమ్మా! ఎందుకొచ్చిన బైపీసీ? ఎంచక్కా లెక్కలు చేసుకుంటుంది" అని దగ్గరుండి మరీ మా అమ్మా, లక్ష్మి దొడ్డా కలిసి నన్ను బండ్లమూడి హనుమాయమ్మ జూనియర్ కాలేజీలో చేర్పించారు కదా! 

     తెల్లవారకుండా లేచేసి - ఒకటో-రెండో జళ్ళేసేసుకుని - జట్లుజట్లుగా - బుద్ధిగా - తలొంచుకుని మా ఇంటి ముందు నుంచి ట్యూషన్లకి వెళ్ళిపోతూ-వచ్చేస్తున్న ఆడపిల్లల్ని చూసి "ఓహో! ట్యూషన్లకి వెళ్తే ఇంత బుద్ధిగా ఉంటారు కామోసు" ననుకుని - అదే ఆశతో పొద్దున్నే నూనె రాసి జళ్ళేసి - నన్ను రాఘవేంద్రరావుగారి ఫిజిక్స్ ట్యూషన్లో కూర్చోపెట్టేసింది మా అమ్మ. 

    ఓ వారం రోజులు అవగానే నాకు ట్యూషన్ పడక జలుబు చేసేసింది. 

    పొద్దున్నే లేచి చలిలో వెళ్ళి నలిగిపోతున్నానని - తొమ్మిదింటికి వెచ్చగా పాలు తాగి వెళ్ళొచ్చని మా ఇంటి వెనకనే ఐదవ లైనులో రిటైర్డ్ టీచర్ భావన్నారాయణ గారి దగ్గర ట్యూషన్ చేర్పించింది అమ్మ. 

    ఆయన కొచ్చిందెంతున్నా - నన్నాట్టే కొశ్చెన్లు అడక్కుండా నాకు నచ్చింది మాత్రమే చెప్పే భావన్నారాయణ గారి చదివింపు నచ్చి ఇంటర్ రెండేళ్ళు ఆయన దగ్గరే లెక్కలు చేసుకొచ్చేదాన్ని. మిగిలిన ఫిజిక్స్, కెమిస్ట్రీ నాకు చేతనైనంత వరకు అర్థం చేసుకుంటూ చదువుకునేదాన్ని. 

    ఇక నా సీనియర్ ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోగానే - ఎంపీసీ గ్రూపు కదా - ఎంత కాదనుకున్నా తర్వాతి అంకం ఎంసెట్.  దాని కోసం ట్యూషన్లు చేరడం తప్పలేదు. తీరా చేరాక - ఈ లెక్క ఇలాగే ఎందుకు చెయ్యాలీ, ఆ ఫిజిక్స్ ఫార్ములా ఎలా వచ్చిందీ - అని సందేహాలొస్తే - "అదంతా ఎంట్రన్స్ అయిపోయాక తీరిగ్గా చర్చించుకుందాం, ప్రస్తుతానికి చెప్పింది చెయ్" - అనేవాళ్ళే అంతా. 

    అప్పుడు... అలాంటి ... అనేకానేక సందేహాలు అస్సలు తీరని అసహనపు వేసవి మధ్యాహ్నాల్లో - వట్టివేళ్ళ చాపల నీడలో కూర్చుని  -  నా చుట్టూ -  పొరలేసి కుడితే మూడు బొంతలయ్యేంత దొంతరల ఎంసెట్ మోడల్ టెస్ట్ పేపర్సూ, దాని మానాన అది కూనిరాగాలు తీస్తున్న ట్రాన్సిస్టరూ,  కొంటె బొమ్మల బాపు, ముళ్ళపూడి బుడుగు, ఆ పక్కనే Merchant Of Venice చదివిన మాయలో ఉండి - మోజుపడి కొనుక్కున్న షేక్స్పియర్ ట్రాజెడీ డ్రామా Hamlet  - ఇన్ని పెట్టుకుని - దీర్ఘంగా ఆలోచించా... 

    ఆ మాత్రం సమాధానాలు కూడా దొరకని అంతంతమాత్రపు చదువు కోసం గుంటూరు వీధుల్లో, వేసంకాలపు మిట్టమధ్యాహ్నపుటెండల్లో తిరగడం అంత అవసరమా అని. 

    అలా అనుకుని - ఇంట్లోనే ఉండి ఎంత చక్కగా చదువుకుంటానో చూడు - అని మా అమ్మని ఒప్పించి, అప్పటి దాకా వెళ్తున్న ట్యూషన్లన్నీ మానేశా. 

    ఇహ అప్పణ్ణించి - పొద్దున్న లేస్తూ చదివా. మధ్యాహ్నం భోంచేస్తూ చదివా. సాయంత్రం టీవీ త్యాగం చేస్తూ చదివా. "పుస్తకం హస్తభూషణం" అన్న నానుడికి బ్రాండ్-అంబాసడర్లా మసలా.  

    అంతా చేసి ఎంట్రెన్స్ రాస్తే వచ్చిన రాంక్  - అంకెల్లోనే కాదు, అంకెలని అక్షరాల్లోకి మారిస్తే కూడా ఘనంగా వినిపించే అంకె - ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు. ఆ రోజుతో కచ్చితంగా తెలిసిపోయింది - I am not meant to be B.E. అని. 

ఇప్పుడు... 
ఇలా ...  - 
"I am not meant to be B.E. దాకా ఎలా వచ్చానో చెప్పాక 
  -ఆ గతానికి కొనసాగింపుగా  
ఈనాటి స్వగతం ఏంటీ అంటే... 

స్వగతం: 

    ఇందాక అప్పుడెప్పుడో మా ఆడపడుచుతో చదువుల గురించి మాట్లాడానని చెప్తూ - నా చదువుల రోజుల్లోకి షికారెళ్ళొచ్చా కదా... తన ఫోన్ పెట్టెయ్యగానే - ఫోన్ పెట్టెయ్యడం అన్నది జరిగింది కానీ మాట్లాడడం మాత్రం ఆగలేదు. 

    "చిన్నప్పుడు ఏ సినిమా చూసినా హీరో బియ్యే చదివి ఫస్టు క్లాసులో పాసవుతూ ఉండేవాడు. అప్పడు BA ఎలాగో ఇప్పటి BE అలా వుంది. సివిల్ చదివినా, మెకానికల్ చదివినా అన్నిటికీ ఎండ్ పాయింట్ IT యే అయిపోయింది. ఆ మాత్రం దానికి అన్ని బ్రాంచులెందుకో? అసలింక కొన్ని తరాల పిల్లలు ఇంజనీరింగ్ చదవడం మానేసి వాళ్ళకి నచ్చిన కొత్త చదువులేమన్నా చదువుకుంటే బావుండును." అని నాలో నేను స్వగతానికి ఎక్కువగా, ప్రకాశానికి మిక్కిలిగా అనుకుంటూ ఉన్నాను. 

    అప్పటి దాకా నేను మాట్లాడుకుంటూ ఉన్నదంతా నిశ్శబ్దంగా వింటున్న బదరి అందుకుని "నీకో సంగతి చెప్తా విను...మనం చదువుకునే రోజుల్లో - మనతో చదివిన వాళ్ళు చాలా మంది ఇంజనీరింగ్ ఎందుకు చదివారంటే అదేదో ఆ సబ్జెక్టు అంటే ఏంటో తెలిసి, దాని మీద ఆసక్తి ఉండి కాదు. అమెరికా చదువుల మోడల్లో 12 ఏళ్ళు స్కూలు  + 4 ఏళ్ళ డిగ్రీ ఉంటే అమెరికాకి వీసా రావడం ఈజీ అవుతుందని ఆ awareness ఉన్న పేరెంట్స్ ఎవరో కొందరు వాళ్ళ పిల్లల్ని ఇంజనీరింగులో చేర్పించి ఉంటారు. వాళ్ళని చూసి ఇంకొందరు... అలా అలా కొన్నేళ్ళయ్యాక అసలు అలా ఎందుకు చదవడం మొదలు పెట్టారో అసలు కారణం మర్చిపోయి ఇంజనీరింగ్ కన్నా ఇక వేరే డిగ్రీయే లేదన్నట్టు అందరూ అదే చదివించడం మొదలు పెట్టారు. ఆంధ్రాలో సీట్లు రానివాళ్లు మహారాష్ట్ర వెళ్ళి కూడా చేరారు. " అంటూ ఇంకొన్ని విషయాలు గుర్తు చేశారు.  

    నాకు ఎప్పుడు చదువుల గురించి తలచుకున్నా బాధ - ఎంతో విలువైన పిల్లల సమయాన్ని, శక్తిని పనికిరాని కోచింగులు, అర్థం లేని కాంపెటిషన్లు మింగేస్తున్నాయని. 

    ఆడుతూ, పాడుతూ, అర్థం చేసుకుంటూ, బుద్ధిని వికసింప చేసేలా హాయిగా చదువుకోవాల్సిన చదువుని పరీక్షల్లో మార్కుల కోసం, ర్యాంకుల కోసం మాత్రం చదువుకోవాల్సి రావడం పువ్వుల్లాంటి, పసిగువ్వల్లాంటి పిల్లలకి జరుగుతున్న మహా  అన్యాయం. 

    అన్నట్టు మా బుజ్జిజింకలతో పాటు చదువుకుంటూ నేను నేర్చుకున్న ఒక చిన్న పాఠం - పరీక్షల ముందు ఏ పిల్లలకీ "All the Best ! Do well!" అని చెప్పొద్దు అని. 

    ఆ విశేషాలు ఇంకో సారి ... 

18, డిసెంబర్ 2016, ఆదివారం

మొదటి మంచు పూత...



 రజత రజనును 
తోసిరాజను 
తొలి హిమపు రజను 

 పుడమికి పూసిరెవరో
మాసిపోవని
పిండారబోసినట్లాయెను 

ముదము పంచెనెదకు 
మొదటిదాయిన
మంచు పూత ఈలాగు







గణితమంటే మా వూరికీ 
గజ గజ వణుకేమో 
గణనకెక్కె వణుకు గణన 
(Temperatures  in Centigrade)





16, డిసెంబర్ 2016, శుక్రవారం

మాటల పాటల తోట - ఈ రేడియో తోట (Radio Garden)

బ్లాగ్ తర్వాత నాకున్న ఒకే ఒక social-netoworking opportunity - Whatsapp.

పేరుకి ఒక నాలుగు Whatsapp సమూహాల్లో -  నూకల సతీష్ నడిపే మన ఊరు అనాతవరం అనే గ్రూపు, అమ్ములు-లలిత నడిపే వడ్లమానీస్ గ్రూపు, నేనే సృష్టించిన శివకోడు కజిన్స్, టంగుటూర్ ఫ్రెండ్స్ అనే రెండు గ్రూపులు  - మొదలైన వాటిల్లో వున్నా-  ఆ గ్రూపుల సంభాషణల్లో నేను కలిపించుకుని మాట్లాడడానికి, ఏమైనా పంచుకోవడానికి అంత పెద్ద విశేషాలు నా దగ్గర రోజూ ఏమీ ఉండవు.

అదీ కాక రోజూ అక్కడ పోస్ట్ చేసే మెసేజెస్ చూడడానికి కూడా కుదరదు.

అలా అని ఆ గ్రూపుల్లోంచి బయటికి రావాలని కూడా అనిపించదు .

నా మటుక్కి నాకు - ఏధైనా పెళ్ళో, పార్టీయో జరుగుతూ వుంటే  ఓ పక్కన కూర్చుని - అక్కడ హడావిడిగా అటూ ఇటూ తిరిగే వాళ్లని చూస్తూ - వాళ్ల మాటలని వినడం ఎంత బావుంటుందో  - వారానికి ఒక్కసారైనా - కుదిరినప్పుడు Whatsapp చూడడమూ అంతే బావుంటుంది.

ఫోటోలు, వీడియోలు, తమాషా కబుర్లు, జోకులు, వూళ్లో జరిగే పండగల విశేషాలు - ఇలా ఎంతో కాలక్షేపం నాకు - వారానికి ఒక అరగంటో-గంటో.

ప్రతీ శుక్రవారం పొద్దున్నేWhatsapp సంభాషణలు చూస్తాను - ఒక పది నిముషాలు.

ఇవాళా అలాగే చూస్తున్న నాకు  -  మా అనాతవరం గ్రూపులో - శారద, మా టంగుటూర్ ఫ్రెండ్స్ గ్రూపులో చిన్ననాటి స్నేహితుడు - విక్రమ్ పోస్ట్ చేసిన ఒక చిన్న మెసేజ్  కనిపించింది.

"Radio Garden 
Explore live radio by rotating the globe 
http://radio.garden/live/warsaw/star883/ 
This is incredible - అంటూ.

ముందు అంతగా పట్టించుకోలేదు.

కానీ అసలే పాటలు అందులోనూ రేడియో లో వచ్చేవి - నాకెందుకో ఎప్పుడూ తర్వాత ఏం పాట వస్తుందో తెలియకుండా రేడియో లో వినే వివిధభారతి - జనరంజని లాంటి కార్యక్రమాలంటే ఇష్టం - CDలూ, కేసెట్లకన్నా.  

అందుకే - ఇదేదో రేడియో అని వుంది - అదేంటో చూద్దామని వెనక్కి వెళ్లి URL మీద click చేశాను.

అంతే ! నా ఫోన్ స్క్రీన్ మీద ఒక నీలపు తెర ---ఇలా....






అక్కడ చెప్పినట్టుగానే వేలితో press చేశాను - ముందుగా ఏడు కిటికీల క్యూపొల నుంచి చూస్తే కనిపించేలా పచ్చగా, నీలంగా, తెల్లగా - రంగురంగుల అందమైన  భూమి ఫోన్ స్క్రీన్ మీద ప్రత్యక్షం - ఇలా ....



ఆ తర్వాత ఇలా ... ఏదో ఇంగ్లీష్ పాట మొదలయింది - Star 88.3 అనే FM స్టేషన్ నుంచి.



ఎడమ పక్కనున్న కిందగా వున్న ప్లస్సు, మైనస్సు  (+, - ) గుర్తుల్లో మైనస్సు మీద వేలుని పెట్టి ఆ భూమిని కొంచెం zoom-out చేస్తూ, చేస్తూ - తిప్పుతూ మొత్తానికి ఇండియా లో హైదరాబాదు Teluguone Radio FM స్టేషన్ పట్టుకున్నాను.

ఒక మాట - ఆ కుడిపక్క కింద ఆకుపచ్చ రంగులో కనిపించే FM స్టేషన్ - active station. దానిని bookmark చేసుకుంటే : http://radio.garden/live/hyderabad/teluguone/ - అని direct URL సేవ్ చేసుకోవచ్చు.




అబ్బా - ఎన్ని రోజులకి బో... ల్డన్ని తెలుగు పాటలు, ఇం.... కా.... బో... ల్డన్ని తెలుగు మాటలు విన్నానో - అనుకోకుండా ఎవరో మల్లాది వారి టాక్-షోకి  - వైరాగ్యం, వేదాంతం, విరక్తి - అనే విషయం మీద ఏదో సందేహం అడగడానికి కాల్ చేసిన ప్రముఖ రచయిత్రి  బలభద్రపాత్రుని రమణి గారి గొంతు విన్నాను - ఇంకా బే-ఏరియా సత్యలత గారు నడిపే బృందావనం కార్యక్రమం విన్నాను.

నాకైతే చాలా నచ్చేసింది ఈ రేడియో గార్డెన్ - ఎందుకంటే -
  1. ప్రపంచంలో ఎన్ని దేశాల్లో, ఎన్ని భాషల్లో FM స్టేషన్లు వున్నాయో అన్నీ వినొచ్చు.   
  2. ఏ కొత్త App installation అవసరం లేదు 
  3. Browser - based 
  4. కాసేపు గ్లోబు తిప్పుకుంటూ - ఆడుకుంటూ - వేరే వేరే భాషల్లో పాటలు-మాటలు వినచ్చు 
  5. ముఖ్యంగా మన తెలుగు పాటల ట్యూన్లకి ఏ పర-భాషా పాట "ఇన్స్పిరేషనో" ఎంచక్కా తెలుసుకుని కొలంబస్సులా మురిసిపోవచ్చు. 
ఈ రేడియో గార్డెన్ గురించిన వివరాలు ఇక్కడ ఇంకా బోల్డు వున్నాయి: http://www.transnationalradio.org/node/79 

ఈ  మాటల పాటల తోట గురించి చెప్పిన శారద, విక్రమ్ లకి బోల్డన్ని Thank You లు !!!


ఈరోజుకి నాదైన ఒక చిన్న  కబురు:

ఇవాళ - బుజ్జిజింక - పాపం - బాగా చలిగా వుందేమో - స్కూల్ నుంచి రావడమే ముక్కు పీల్చుకుంటూ, తలనొప్పని వచ్చాడు ఇంటికి.

రాగానే వెచ్చగా స్నానం చేసి సోఫాలోనే పడుకుని నిద్రపోయాడు.

లేవగానే -ఇంకా తగ్గని వాడి తలనొప్పికి మందు వేసి, తలకి నూనె రాసి - ఏవో కబుర్లు చెప్తూ - గిన్నెలు డిష్-వాషర్ లో పెడుతూ - ఇల్లు-ఇల్లాలు సినిమాలోంచి - వినరా సూరమ్మ కూతురు మొగుడా - అని గట్టిగా పాడుకుంటూ - రాజబాబు వెర్షనూ, రమాప్రభ వెర్షనూ - రెండూ నేనే అయి - నాలో నేనే నవ్వుకుంటూ ఉంటే - వెనకాలే నించుని నాకేసే చూస్తున్న బుజ్జిజింక ఉన్నట్టుండి - అమ్మా! When you do something that is not that fun, you make it fun by making strange sounds - I wish I could do that అన్నాడు.

That statement made this mom's day!



30, మే 2016, సోమవారం

కహోకియా మౌండ్స్


నిన్న ఆదివారం (మే 29) సెయింట్ లూయిస్ కి ఒక గంట దూరంలో ఇల్లినాయి రాష్ట్రంలో కాలిన్స్ విల్ లో వున్న - కహోకియా మౌండ్స్ చూడడానికి వెళ్ళాము - నలుగురం. పిల్ల జింకలకి గైడెడ్ టూర్ ఇష్టం లేదన్నారు. జింకలు కదా - అటూ ఇటూ స్వేచ్ఛగా తిరుగుతూ చూద్దామని వాళ్ళ ఆరాటం. అమ్మా-నాన్నలకేమో మొదటి సారి గైడెడ్ టూర్ తీసుకుంటే అసలేమున్నాయో తెలుస్తుంది - ఇంకోసారి వచ్చినప్పుడు నచ్చినట్టు తిరగొచ్చు అని ఆలోచన. మొత్తానికి ఒక గంట గైడెడ్ గా + ఇంకో గంట అన్-గైడెడ్ గా తిరిగి వచ్చాము.

(కింద వున్న కహోకియా మౌండ్స్ పదం మీద క్లిక్ చేస్తే Legends of America సైట్ కి లింక్ అవుతుంది.)
కహోకియా మౌండ్స్ - UNESCO వారు వర్ల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించిన - ఉత్తర అమెరికా లోని  అతి పెద్ద నేటివ్ అమెరికన్ ఆర్కెలాజికల్ సైట్. మిసిసిపి నదీ లోయ ప్రాంతం లో 700 AD నుంచి దాదాపు 1200 AD చివరి వరకూ ఇక్కడ నేటివ్ అమెరికన్లు నివసించారు.  మౌండ్ అంటే తెలుగులో మట్టి దిబ్బ అని అర్థం. 




కహోకియా లో నివసించిన నేటివ్ అమెరికన్లని మిసిసిపియన్స్ అని పిలిచేవారట. కహోకియా సమీపంలో వున్న మిసిసిపి నదికి వరదలు వచ్చినప్పుడల్లా ఈ ప్రాంతం వరద నీటిలో మునిగేదట. వరద నీటితో పాటు ఒండ్రు మట్టి కొట్టుకుని వచ్చి కహోకియా వున్న ప్రదేశంలో భూమి సారవంతమవడం వలనా, చుట్టుపక్కల ఆహారానికనుగుణమయిన రకరకాల జంతువులూ, జలచరాలూ పెరిగే విస్తృతమైన పర్యావరణ వ్యవస్థ వుండడం వలనా - వారి జీవనానికి అనుగుణంగా మిసిసిపియన్స్ ఇక్కడ ఒక నగరం నిర్మించుకున్నారు. నగరానికి చుట్టూ చెక్క స్తంభాలతో ఒక కంచె లాంటిది కట్టుకునేవారట. నగరం లోపల నేటివ్ అమెరికన్లు నిర్మించిన చిన్నవీ - పెద్దవీ అయిన మట్టి దిబ్బలు 120 కి పైగా వుండేవట. ఇప్పుడు వాటిలో 68 మాత్రం భద్రపరచగలిగారు. 


కహోకియాలోని మౌండ్స్ మూడు రకాలు - మతసంబంధమైన కట్టడాలకి, నాయకులు నివసించడానికి, సమావేశాలకి వీలుగా వుండే ప్లాట్ ఫార్మ్ మౌండ్స్ (platform mounds) ఒక రకం అయితే, పోయినవారిని ఖననం చేయడానికి వాడిన కోణాకారపు (conical mounds), దీర్ఘ చతురస్రాకారపు (ridge top mounds) దిబ్బలు మిగిలిన రెండు రకాలు. 


ఈ మౌండ్స్ తో పాటు మారే ఋతువులనీ, కదిలే కాలాన్ని కనిపెట్టడానికీ, కొలుచుకోవడానికీ వుడ్ హెంజ్ అనే చెక్క స్తంభాలతో గడియారాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు అప్పటి మిసిసిపియన్స్. 


ఒక ఐదు వందల ఏళ్ళు కహోకియాలో వున్న మిసిసిపియన్స్ 1200 AD తర్వాత - భూమిలో సారం తగ్గి పంటలు సరిగా పండకపోవడం వల్లనో, ఇతర వనరులు తగ్గిపోవడం వల్లనో, నాయకత్వపు పోరుల వల్లనో, రాజకీయ కారణాలవల్లనో - కారణం ఏదైనా కానీ కహోకియా నుంచి వేరే ప్రాంతాలకి వలస వెళ్ళిపోయారు. వాళ్లకి మాట్లాడే భాష తప్ప రాసే లిపి లేకపోయినందువల్ల - అక్కడ బరియల్ మౌండ్స్ లో లభించిన అవశేషాలలో కనిపించిన పోషకాహార లేమిని బట్టి పురావస్తు శాస్త్రజ్ఞులు ఆహార వనరులు తగ్గడం మిసిసిపియన్స్ వలసలకి ఒక ముఖ్య కారణంగా పేర్కొంటారు. 


గైడెడ్ టూర్ లో ఈ విశేషాలన్నీ తెలుసుకుని, కహోకియా మౌండ్స్ కి అనుబంధంగా వున్న మ్యూజియం + అందులో ఒక డాక్యుమెంటరీ చూసి, అక్కడ మ్యూజియం స్టోర్ లో ఒక బొమ్మ కొనుక్కుని బయటికి వచ్చి అక్కడ వున్న అన్నిటికన్నా పెద్దదైన మాంక్స్ మౌండ్ ఎక్కడానికి వెళ్ళాము. 




బదరి - మాంక్స్ మౌండ్ పార్కింగ్ లాట్ లో కార్ పార్క్ చేస్తూ - బయట చాలా వేడిగా వుంది కదా - మౌండ్ ఎక్కి వచ్చేలోగా కార్ లో కొంచెం గాలి ఫ్లోట్ అవుతూ వుంటుంది - అని కార్ విండోస్ కొంచెం తెరిచిపెడదాము - అని అనుకోబోతూ వున్నారో లేదో - తన మాట ఇంకా పెదవి దాటనే లేదు - వద్దో వద్దో - అని క్లోజ్ చేయించేశాను. తీరా మాంక్స్ మౌండ్ వైపు నడుస్తూ ఎందుకో వెనక్కి తిరిగి చూసిన బదరికి - నేను దిగిన పక్క కార్ డోర్ తెరిచి వున్నట్లు కనిపించింది. అంత ఎర్రటి ఎండలో కూడా - ల్లగా నవ్వుతూ "చూశావా ! నాకు జాగ్రత చెప్తూ నువ్వేం చేశావో " అని నాతో అంటూ - జింకలని పరిగెత్తించారు - తలుపు వేసి రమ్మని. 


మొత్తానికి 200 మెట్లు వున్న మాంక్స్ మౌండ్ ఎక్కి - కొన్ని ఫోటోలు తీసుకుని -  దిగి - ఇంటికి తిరిగి వచ్చాము. 



 మాంక్స్ మౌండ్ నుంచి సెయింట్ లూయిస్ ఆర్చ్:






 మాంక్స్ మౌండ్ మీద కనిపించిన అడవి పువ్వు:









 
అమ్మ-బొమ్మ:
 



అనిపించినవి - అనుకున్నవి:


  • అమ్మని మెమోరియల్ డే వీకెండ్ లో బయటికి తీసుకెళ్ళాల్సిందే అని నాన్నగారు చాలా  గా...ట్టిగా అనేసుకున్నారు - జింకలు సై అన్నారు 
  • పదహారేళ్ళుగా పక్కనే వున్నా, గత రెండు-మూడేళ్ళుగా అనుకుంటున్నా నిన్నటి వరకూ కహోకియా చూసే టైం రాలేదు 
  • స్థల,కాల-పరిస్థితులతో,  సాంకేతిక అభివృద్ధితో సంబంధం లేకుండా ఒంటి నిండా బట్టలు కట్టుకోలేని జాతులలో కూడా రాజకీయాలు, ఎక్కువ-తక్కువలూ, మత  గురువుల ఆధిపత్యాలూ, అతీంద్రియ శక్తులపై నమ్మకాలూ వుండేవి 
  • లేని వారు నడుము చుట్టూ ఆచ్ఛాదనగా ఒక వస్త్రమో, జంతు చర్మమో కప్పుకుంటే ఉన్నవారు మొక్క జొన్న నిల్వలతో వర్తకం చేసి విలాసవంతమైన రంగుల వస్త్రాలు, పూసలు, శంఖాలు, ఆల్చిప్పలు కొనుక్కుని ధరించేవారు : బీదా - గొప్పా తేడాలు అప్పుడూ వున్నాయి
  •  700 AD - 1400 AD మధ్యలో కహోకియాలో నేటివ్ అమెరికన్లు మట్టిదిబ్బలు నిర్మించే కాలంలో భారత దేశంలో శక్తివంతమైన రాష్ట్రకూటులు, చోళులు, హొయసలులు, చాళుక్యులు, కాకతీయులు, రాజపుత్రులు - రాజ్యాలేలుతున్నారు. అజంతా చిత్రాలు గీస్తున్నారు , ఎల్లోరా శిల్పాలు చెక్కుతున్నారు. సంగీత, సాహిత్యాలలో, విద్యా-వైజ్ఞానిక రంగాలలో ముందంజలో వున్నారు - అని పోల్చి చూసి మురిశాం
  •  చరిత్రని డాక్యుమెంట్ చేయడం, చారిత్రిక స్థలాలని భద్రపరచడం భారత దేశంలోనూ నిబద్ధతతో చేస్తే ఎంత బావుంటుందో కదా - అనుకున్నాం
  • అమ్మలో - ఎక్కడో దాగి వున్న చిన్నపిల్ల - బొమ్మని చూడగానే పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేసి - బొమ్మని కొనేస్కుంది :)
 






15, మార్చి 2016, మంగళవారం

మొట్టమొదటిసారిగా...

ఓటేసేశా ....
మొదటిసారిగా ...
జీవితం లో మొట్టమొదటిసారిగా...

నిజమే ....ఒక రకంగా ఇదేమీ గొప్పపని కాదు ...
పుట్టిన ఇన్నేళ్ళకి - నాకు పుట్టిన వాడికి ఓటు హక్కు వచ్చాక...
నేను వెళ్లి ఓటు వేయడం - అబ్బే అని తీసి పడేయాల్సిన విషయమే...

కానీ - ఇన్నేళ్ళకయినా వెళ్ళగలిగానని ఒక ఆనందం.

ఎప్పుడో 15 రోజుల క్రితం ఎలక్షన్ సెంటర్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు డేట్ కూడా మార్క్ చేసి పెట్టుకున్నాను - మార్చ్ 15 అని.

ఇవాళ సాయంత్రం అయిదున్నరకి కిరణ్ ని టై క్వాన్ డో క్లాసు లో వదిలి పిల్లలరూం కి తెల్ల పెయింట్ కొనుక్కువద్దామని ప్లాన్.

వాడి క్లాస్ దగ్గరకి వెళ్ళగానే గుర్తొచ్చింది - ఇవాళ US ప్రెసిడెన్షియల్ ప్రైమరీ ఎలెక్షన్, ఏడింటికి ముగిసిపోతుందని. అంతే - ఇంక పెయింట్ షాపింగ్ ని ఏడింటి తర్వాతకి వాయిదా వేసి సెల్విడ్జ్ మిడిల్ స్కూల్ కి వెళ్లాం - నేను, బదరి.

ఇద్దరం టచ్ స్క్రీన్ ఆప్షన్ తీసుకున్నాము - తనది తొందరగానే అయిపోయింది.  ఓటర్ నమోదు లో నా మిడిల్ నేం తప్పు వుండడంతో ఒక పదిహేను నిముషాలు ఆలశ్యం అయింది.

ముందు ఆ ఎలెక్షన్ సూపర్వైజర్ మిడిల్ నేం సరి చేయందే ఓట్ చేయకూడదంటే ఒక నిముషం ఉసూరుమనిపించింది. ఆయన నా మొహం చూసి - ఒక నేం కరెక్షన్ ఫాం నింపేసి ఇస్తే ఓటు వేయొచ్చు అనగానే మళ్ళీ ప్రపంచం అంతా వెలుగ్గా జిగేలుమనిపించింది.

అన్నీ ముగించుకుని ఓటు వేసి రాగానే - ఎలాగైనా గుర్తుగా బ్లాగ్ చేయాలనిపించింది - అది కూడా ఇవాళే ...