నిన్న ఆదివారం (మే 29) సెయింట్ లూయిస్ కి ఒక గంట దూరంలో ఇల్లినాయి రాష్ట్రంలో కాలిన్స్ విల్ లో వున్న - కహోకియా మౌండ్స్ చూడడానికి వెళ్ళాము - నలుగురం. పిల్ల జింకలకి గైడెడ్ టూర్ ఇష్టం లేదన్నారు. జింకలు కదా - అటూ ఇటూ స్వేచ్ఛగా తిరుగుతూ చూద్దామని వాళ్ళ ఆరాటం. అమ్మా-నాన్నలకేమో మొదటి సారి గైడెడ్ టూర్ తీసుకుంటే అసలేమున్నాయో తెలుస్తుంది - ఇంకోసారి వచ్చినప్పుడు నచ్చినట్టు తిరగొచ్చు అని ఆలోచన. మొత్తానికి ఒక గంట గైడెడ్ గా + ఇంకో గంట అన్-గైడెడ్ గా తిరిగి వచ్చాము.
(కింద వున్న కహోకియా మౌండ్స్ పదం మీద క్లిక్ చేస్తే Legends of America సైట్ కి లింక్ అవుతుంది.)
కహోకియా మౌండ్స్ - UNESCO వారు వర్ల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించిన - ఉత్తర అమెరికా లోని అతి పెద్ద నేటివ్ అమెరికన్ ఆర్కెలాజికల్ సైట్. మిసిసిపి నదీ లోయ ప్రాంతం లో 700 AD నుంచి దాదాపు 1200 AD చివరి వరకూ ఇక్కడ నేటివ్ అమెరికన్లు నివసించారు. మౌండ్ అంటే తెలుగులో మట్టి దిబ్బ అని అర్థం.
కహోకియా లో నివసించిన నేటివ్ అమెరికన్లని మిసిసిపియన్స్ అని పిలిచేవారట. కహోకియా సమీపంలో వున్న మిసిసిపి నదికి వరదలు వచ్చినప్పుడల్లా ఈ ప్రాంతం వరద నీటిలో మునిగేదట. వరద నీటితో పాటు ఒండ్రు మట్టి కొట్టుకుని వచ్చి కహోకియా వున్న ప్రదేశంలో భూమి సారవంతమవడం వలనా, చుట్టుపక్కల ఆహారానికనుగుణమయిన రకరకాల జంతువులూ, జలచరాలూ పెరిగే విస్తృతమైన పర్యావరణ వ్యవస్థ వుండడం వలనా - వారి జీవనానికి అనుగుణంగా మిసిసిపియన్స్ ఇక్కడ ఒక నగరం నిర్మించుకున్నారు. నగరానికి చుట్టూ చెక్క స్తంభాలతో ఒక కంచె లాంటిది కట్టుకునేవారట. నగరం లోపల నేటివ్ అమెరికన్లు నిర్మించిన చిన్నవీ - పెద్దవీ అయిన మట్టి దిబ్బలు 120 కి పైగా వుండేవట. ఇప్పుడు వాటిలో 68 మాత్రం భద్రపరచగలిగారు.
కహోకియాలోని మౌండ్స్ మూడు రకాలు - మతసంబంధమైన కట్టడాలకి, నాయకులు నివసించడానికి, సమావేశాలకి వీలుగా వుండే ప్లాట్ ఫార్మ్ మౌండ్స్ (platform mounds) ఒక రకం అయితే, పోయినవారిని ఖననం చేయడానికి వాడిన కోణాకారపు (conical mounds), దీర్ఘ చతురస్రాకారపు (ridge top mounds) దిబ్బలు మిగిలిన రెండు రకాలు.
ఈ మౌండ్స్ తో పాటు మారే ఋతువులనీ, కదిలే కాలాన్ని కనిపెట్టడానికీ, కొలుచుకోవడానికీ వుడ్ హెంజ్ అనే చెక్క స్తంభాలతో గడియారాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు అప్పటి మిసిసిపియన్స్.
ఒక ఐదు వందల ఏళ్ళు కహోకియాలో వున్న మిసిసిపియన్స్ 1200 AD తర్వాత - భూమిలో సారం తగ్గి పంటలు సరిగా పండకపోవడం వల్లనో, ఇతర వనరులు తగ్గిపోవడం వల్లనో, నాయకత్వపు పోరుల వల్లనో, రాజకీయ కారణాలవల్లనో - కారణం ఏదైనా కానీ కహోకియా నుంచి వేరే ప్రాంతాలకి వలస వెళ్ళిపోయారు. వాళ్లకి మాట్లాడే భాష తప్ప రాసే లిపి లేకపోయినందువల్ల - అక్కడ బరియల్ మౌండ్స్ లో లభించిన అవశేషాలలో కనిపించిన పోషకాహార లేమిని బట్టి పురావస్తు శాస్త్రజ్ఞులు ఆహార వనరులు తగ్గడం మిసిసిపియన్స్ వలసలకి ఒక ముఖ్య కారణంగా పేర్కొంటారు.
గైడెడ్ టూర్ లో ఈ విశేషాలన్నీ తెలుసుకుని, కహోకియా మౌండ్స్ కి అనుబంధంగా వున్న మ్యూజియం + అందులో ఒక డాక్యుమెంటరీ చూసి, అక్కడ మ్యూజియం స్టోర్ లో ఒక బొమ్మ కొనుక్కుని బయటికి వచ్చి అక్కడ వున్న అన్నిటికన్నా పెద్దదైన మాంక్స్ మౌండ్ ఎక్కడానికి వెళ్ళాము.
బదరి - మాంక్స్ మౌండ్ పార్కింగ్ లాట్ లో కార్ పార్క్ చేస్తూ - బయట చాలా వేడిగా వుంది కదా - మౌండ్ ఎక్కి వచ్చేలోగా కార్ లో కొంచెం గాలి ఫ్లోట్ అవుతూ వుంటుంది - అని కార్ విండోస్ కొంచెం తెరిచిపెడదాము - అని అనుకోబోతూ వున్నారో లేదో - తన మాట ఇంకా పెదవి దాటనే లేదు - వద్దో వద్దో - అని క్లోజ్ చేయించేశాను. తీరా మాంక్స్ మౌండ్ వైపు నడుస్తూ ఎందుకో వెనక్కి తిరిగి చూసిన బదరికి - నేను దిగిన పక్క కార్ డోర్ తెరిచి వున్నట్లు కనిపించింది. అంత ఎర్రటి ఎండలో కూడా - చల్లగా నవ్వుతూ "చూశావా ! నాకు జాగ్రత చెప్తూ నువ్వేం చేశావో " అని నాతో అంటూ - జింకలని పరిగెత్తించారు - తలుపు వేసి రమ్మని.
మొత్తానికి 200 మెట్లు వున్న మాంక్స్ మౌండ్ ఎక్కి - కొన్ని ఫోటోలు తీసుకుని - దిగి - ఇంటికి తిరిగి వచ్చాము.
మాంక్స్ మౌండ్ నుంచి సెయింట్ లూయిస్ ఆర్చ్:
మాంక్స్ మౌండ్ మీద కనిపించిన అడవి పువ్వు:
అమ్మ-బొమ్మ:
అనిపించినవి - అనుకున్నవి:
- అమ్మని మెమోరియల్ డే వీకెండ్ లో బయటికి తీసుకెళ్ళాల్సిందే అని నాన్నగారు చాలా గా...ట్టిగా అనేసుకున్నారు - జింకలు సై అన్నారు
- పదహారేళ్ళుగా పక్కనే వున్నా, గత రెండు-మూడేళ్ళుగా అనుకుంటున్నా నిన్నటి వరకూ కహోకియా చూసే టైం రాలేదు
- స్థల,కాల-పరిస్థితులతో, సాంకేతిక అభివృద్ధితో సంబంధం లేకుండా ఒంటి నిండా బట్టలు కట్టుకోలేని జాతులలో కూడా రాజకీయాలు, ఎక్కువ-తక్కువలూ, మత గురువుల ఆధిపత్యాలూ, అతీంద్రియ శక్తులపై నమ్మకాలూ వుండేవి
- లేని వారు నడుము చుట్టూ ఆచ్ఛాదనగా ఒక వస్త్రమో, జంతు చర్మమో కప్పుకుంటే ఉన్నవారు మొక్క జొన్న నిల్వలతో వర్తకం చేసి విలాసవంతమైన రంగుల వస్త్రాలు, పూసలు, శంఖాలు, ఆల్చిప్పలు కొనుక్కుని ధరించేవారు : బీదా - గొప్పా తేడాలు అప్పుడూ వున్నాయి
- 700 AD - 1400 AD మధ్యలో కహోకియాలో నేటివ్ అమెరికన్లు మట్టిదిబ్బలు నిర్మించే కాలంలో భారత దేశంలో శక్తివంతమైన రాష్ట్రకూటులు, చోళులు, హొయసలులు, చాళుక్యులు, కాకతీయులు, రాజపుత్రులు - రాజ్యాలేలుతున్నారు. అజంతా చిత్రాలు గీస్తున్నారు , ఎల్లోరా శిల్పాలు చెక్కుతున్నారు. సంగీత, సాహిత్యాలలో, విద్యా-వైజ్ఞానిక రంగాలలో ముందంజలో వున్నారు - అని పోల్చి చూసి మురిశాం
- చరిత్రని డాక్యుమెంట్ చేయడం, చారిత్రిక స్థలాలని భద్రపరచడం భారత దేశంలోనూ నిబద్ధతతో చేస్తే ఎంత బావుంటుందో కదా - అనుకున్నాం
- అమ్మలో - ఎక్కడో దాగి వున్న చిన్నపిల్ల - బొమ్మని చూడగానే పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేసి - బొమ్మని కొనేస్కుంది :)
కొన్ని వందల ఏళ్ళ క్రితం నాటి మనుషుల లో ఉండేవనుకుంటున్న ఎక్కువతక్కువలు కాలగర్భంలో కలిసిపోయినా, ఈనాటికీ ఇంకా అక్కడక్కడా కనపడుతుంటే, నేటి మనుషుల మధ్య గల ఎక్కువతక్కువలు, అంతరిక్షం (ref to your previous post) లోంచి కూడా కనపడుతున్నాయి.
రిప్లయితొలగించండిప్చ్! ఫరవాలేదు. బాగానే పైకొస్తున్నట్లున్నాం.
As usual, your post made a good read. Keep'em coming.
నీ కమెంట్ కి చాలా థాంక్స్! - కానీ అమ్మాయ్! ఈ కబుర్లు కాదు గానీ నీ నెక్స్ట్ బ్లాగ్ ఎప్పుడో చెప్పు మరి! చదివి చాలా రోజులయింది.
తొలగించండిబొమ్మ కొన్న వైనం చాలా నచ్చింది.... keep up the good work😃
రిప్లయితొలగించండిబొమ్మ కదా - అది కనిపించాక ఇంక అక్కడ ఏం వున్నా ఇంక లెక్కుండదు. అది చేతిలోకి వచ్చేదాకా ఇంకేం తోచదు. Blissfully continuing the tradition that we started years ago :)
తొలగించండి