ప్రతీ సారి శలవులు మొదలవగానే - ఏదైనా సినిమా చూద్దామా నలుగురం కలిసి అనగానే మా ఇంట్లో ఒక చిన్న అభిప్రాయ సేకరణ, దాని వెంటనే ఎన్నికల పోలింగ్ లాంటి హడావిడి మొదలవుతుంది - ఇంట్లోనా, థియేటర్ లోనా - కార్టూన్ మూవీయా, మనుషులుండేదా - ఇండియనా, ఇంకోటా - ఇలా రకరకాల తలపోతలు, వడపోతలు అయాక ఎప్పుడూ గెలిచేది పిల్లలే అని తెలిసినా అదో వాదించి-ఇష్టంగా-ఓడిపోయే-సినిమా-సరదా :)
పిల్లలిద్దరూ కలిసి ముందే చెప్పేస్తారు - తెలుగు సినిమా అయితే రానే రామని - 2011 లో కృష్ణ వంశీ సినిమా - మొగుడు కొట్టిన దెబ్బ ఇంకా గుర్తుంది వాళ్లకి. అప్పట్నుంచీ ఏ తెలుగు సినిమాకైనా కొలమానం అదే వాళ్లకి.
ఒకానొక శనివారం (మే 20) అలాంటి ఒక ఏక (పక్ష) అభిప్రాయానికి వచ్చి సెయింట్ లూయిస్ సైన్స్ సెంటర్ Omni Max థియేటర్ లో భూమిని - భూమికి అవతల నుంచి ఎలా వుంటుందో కెమెరా కన్నుతో చూసి వచ్చాము - ఎ బ్యూటిఫుల్ ప్లానెట్ సినిమాలో.
ఎ బ్యూటిఫుల్ ప్లానెట్ - 16 దేశాలు కలిసి భూమికి దాదాపు 270 మైళ్ళ దూరంలో ఏర్పరుచుకున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) - అబ్జర్వేటరీ డెక్ అయిన క్యూపొల నుంచి ఏస్ట్రోనాట్స్ తీసిన ఒక డాక్యుమెంటరీ సినిమా.
(ISS లోని 16 దేశాలు: కెనడా, జపాన్, రష్యా, అమెరికా, బెల్జియం, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్. )
ఈ సినిమాలో చూసిన వింతలూ విశేషాలు + అవి చూస్తూ నాకొచ్చిన ఆలోచనలు:
సినిమా మొదట్లో ఓ ముగ్గురు ఏస్ట్రోనాట్స్ ISS కి వస్తారు ట్రైనింగ్ కి. వాళ్ళు రాగానే ISS లో అప్పటికే వున్న ఏస్ట్రోనాట్స్ లో కనిపించిన సంబరం భలే బావుంది - భూమికి అంత దూరంగా వున్నప్పుడు అప్పటివరకూ వున్న ముగ్గురో నలుగురో కాక కొత్త వాళ్ళు వస్తే నిజంగా ఎంత బావుంటుందో వాళ్ళ కళ్ళల్లో, నవ్వుల్లో తెలుస్తుంది.
ఇంక కొత్తగా వెళ్ళిన టీం అయితే ఆ క్యూపొలలో కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు ఆత్రుతతో అన్ని గదులూ చూసుకుంటూ, వచ్చేశామన్నఆనందంతో పిల్లలు గంతులు వేసినట్లు - ఆ zero gravity atmosphere లో పల్టీలు కొడుతూ వుంటారు. వాళ్ళు అక్కడినుంచి గుంపులుగా వున్న చిన్న చిన్న మబ్బుల కిందనుంచి కనిపించే భూమిని మెరిసే కళ్ళతో చూసి మురిసిపోతుంటారు.
గంభీరమయిన గొంతుతో మేఘుడు తధిగిణ-తోం అంటుంటే వానలో తడుస్తున్న మెరుపు తీగలు నాట్యం చేస్తూ వుంటే భూమి మీద నుంచి చూసే నాకే ఇంత బావుంటే - మేఘాలకావల నుండి మబ్బుల మేలిముసుగులో కనిపించే ఆ విద్యుల్లతలు ఇంకెంత అద్భుతంగా వుంటాయో - వాళ్ళు చూస్తూ, చూసిన దాన్ని కెమెరా కన్నుతో చూపించిన - ఆ NASA ఏస్ట్రోనాట్స్ కి వాన చినుకులన్ని వందనాలు - అభివందనాలు చెప్పేయాలనిపించింది.
మురిపించే దీపావళి తారాజువ్వల వెలుగులాంటి మెరుపులే కాక సముద్రంలో కేంద్రీకృతమయ్యే పెద్ద పెద్ద తుఫానులు, హరికేన్లు ఎలా ఉంటాయో కూడా చూడగలం ఈ సినిమాలో.
వాటన్నిటినీ చూస్తూ ఇంతకీ క్యూపొలలో జీవితం ఎలా వుంటుందా అని చూడబోతే - ఉరుములతో మెరుపులతో ఉత్సాహంగా కురిసే వానని తమ కింద వున్న మేఘాలలో వుంచుకుని కూడా క్యూపొలలో నీళ్లు ఎంత పొదుపుగా వాడతారో!
ఒక ఏస్ట్రోనాట్ - ఒక నాలుగు చుక్కలు షాంపూ తలమీద వేసుకుని, ఒక నీళ్ళ ప్యాకెట్ లోంచి ఇంకొన్ని చుక్కలు తలమీద చల్లుకుని, వెంటనే ఒక తడి నాప్కిన్ తో తల తుడిచేసుకుంటారు. అంతకు ముందే భూమిమీద కాలిఫోర్నియాలో నీళ్ళు లేక భూమి ఎంత ఎర్రగా అయిపోతోందో చూపించినప్పుడు, ఇండియా లో జీవనది అయిన మన దేవ(తా)నది గంగలో నీళ్ళు తరిగిపోతున్నాయని చెప్పినప్పుడు - నేను కాకపోయినా నీళ్ళు దొరక్క ముందు ముందు తరాలు పడబోయే ఇబ్బందులు ఊహించుకుని చాలా దిగులుగా అనిపించింది.
నీటి సంగతి అలా వుంటే మరి భోజనం మాటో ?! ఇంట్లో ఎన్ని వున్నా, రకరకాలు వండుకుని తింటున్నా ఎప్పుడయినా కొత్త రుచులు కావాలనిపించడం, అనుకున్నదే తడవుగా వెళ్లి ఏ హోటల్ లోనో తినాలనుకున్నదేదో తిని రావడం - పెద్ద చెప్పుకునే విషయం కాదు - నిజమే - కానీ అది నేనున్నది క్యూపొల కానంత సేపే! క్యూపొలలో వుంటే ఏ మూడు నెలలకో, ఆరు నెలలకో ప్రైవేటు కార్గో స్పేస్ షటిల్ తెచ్చే తాజా పళ్ళు, ఆహారం అమృతాన్ని మరిపిస్తాయి మరి!
కప్పులో కాఫీ తాగడం అతి మామూలు విషయం కదా - అందులో అంతగా సంతోషించి సంబరపడాల్సింది ఏముంది ? కదా?! కానీ స్పేస్ లో కాఫీ తాగాలంటే ఒక ప్యాకెట్ లోంచి పీలుస్తూ తాగాలి. లేకపోతే ఏ ఆకర్షణ శక్తీ (భూమ్యాకర్షణ / గురుత్వాకర్షణ) లేని ఆ క్యూపొలలో వేడి వేడి కాఫీ తేలుతూ మీద పడిపోతుంది మరి! మరలాంటప్పుడు ఏడాదిగా ISS లో వుంటూ మొట్ట మొదటి సారిగా ఒక జీరో-G కప్ లో కాఫీ తాగితే ఎంత బావుంటుంది - అంటే అలా తాగుతున్న ఏస్ట్రోనాట్ ఆనందం చూడాల్సిందే.
తినడం తాగడమే కాకుండా భూమ్యాకర్షణ కి దూరంగా వుండడం వల్ల శరీరంలో ఎముకలకి వచ్చే సమస్యల నుంచి కాపాడుకోవడానికి ఏస్ట్రోనాట్స్ క్యూపొలలో ట్రెడ్ మిల్ మీద చేసే జాగింగ్, వెయిట్ లిఫ్టింగ్ మొదలైన వ్యాయామాలు, ఇంకా ఒకరికొకరు చేసుకునే జుట్టు-కత్తిరింపులు, అవసరమయినప్పుడు చేసే టాయిలెట్ రిపైర్లు, ప్లంబింగ్ అన్నీ చూపిస్తారు ఈ సినిమాలో.
స్పేస్ వాక్ చేయడం అంటే --- ఒక ఎర్ర తువ్వాలు వీపుకి కట్టుకుని మన సూపర్ మాన్ పాడే -
మబ్బుల్లో చంద్రమ్మా - చంద్రమ్మ చంద్రమ్మ చంద్రమ్మా
... పాట కాదండోయ్ ... అసలా స్పేస్ సూట్ వేసుకోవడం ఒక ఎత్తయితే తరవాత తీయడానికి - ఒక మనిషి వేసుకున్న వాళ్ళ మీదకి ఎక్కి కాలితో బలంగా తోస్తూ వుంటే - చాలా సేపు అటు కదిలీ, ఇటు కదిలీ ఎప్పుడు వదులుతుందిరా బాబూ అనిపించేంత ఇదిగా ఒంటిని పట్టేసుకుని వుంటుంది. తీరా స్పేస్ వాక్ కని బయటికి వెళ్తే అదేమీ వెన్నెలలో విహారం కాదు - క్యూపొల బయట చాలా వైర్లు, రేకులు వేళ్ళాడుతూ వుంటాయి. అంతే కాక సూర్యుడి నుంచి వచ్చే వేడి 250 F డిగ్రీలు వుంటుంది. ఏ రేకో తగిలి పొరపాటున స్పేస్ సూట్ ఏ మాత్రం చిరిగినా అక్కడికక్కడే ప్రాణం పోతుంది :( ఇన్ని కష్టాలకోరుస్తూ, ఇంటికి - ఇంటివారికి దూరంగా ఉంటూ, మానవ కల్యాణానికి పనికి వచ్చే ప్రయోగాలు చేస్తూ వుండే ఆ ఏస్ట్రోనాట్సే కనిపించే దేవుళ్ళేమో అనిపించింది.
పగలు క్యూపొలలోంచి చూస్తే మన భూమి నీరున్నంత వరకూ అంటే మూడింట రెండు వంతులు నీలంగా, మిగిలిన భాగం లో కొంత ఆకుపచ్చగా, కొంత గోధుమ రంగులో కనిపిస్తుంది. అదే భూమి రాత్రి వేళల చూస్తే -
जब तारें ज़मीन पर जलते हैं...
आकाश ज़मीन हो जाता है...
అన్నట్లు - నక్షత్రాలన్నీక్యూపొల నుంచి చిత్రీకరిస్తున్న ఏస్ట్రోనాట్ కెమెరా దృష్టి లో పడాలనుకుంటున్నాయేమో - అందుకే ఒకరితో ఒకరు నువ్వు జరుగు - నువ్వు జరుగు అనుకుంటూ ఫోటోకి పోజివ్వడానికి భూమి మీద గుంపులుగా నించున్నట్టు అనిపించింది.
ఆ రాత్రి పూట నక్షత్ర కాంతిని మించే వెలుగులతో కనిపిస్తున్న భూమి మీద విద్యుద్దీప మాలికలను చూస్తే అందులో కొన్ని మా ఇంటివి కూడా వుంటాయనుకోవడం భలేగా అనిపించింది. ఆ దీపకాంతులని వివరిస్తూ చూపించిన ఇండియా-పాకిస్తాన్ బోర్డర్ - మరిచిపోదామనుకున్నా మరపుకు రాని చేదు జ్ఞాపకంలా తోచింది.
ఆ పక్కనే ధగ ధగమని బంగారు కాంతులతో వెలుగుతూ దక్షిణ కొరియా - పక్కనే మిణుకు మిణుకు మంటూ అతి తక్కువ దీపాలతో నిట్టూరుస్తున్న ఉత్తర కొరియా - చూడగానే
ఇరుగింటిలోన ఖేదం - పొరుగింటిలో ప్రమోదం
- అన్న ఘంటసాల వారి పాట గుర్తుకురాక మానదు.
చివర్లో - మసక వెలుతురులో - అటు తిరిగి క్యూపొలకి వున్న ఏడు కిటికీల్లోంచి బయటికి చూస్తూ - బాగ్ పైపర్ వాయిస్తూ - నించుని వున్న ఆ ఏస్ట్రోనాట్ ని చేయి పట్టుకుని - సినిమా అయిపోగానే మనతో తీసుకొచ్చేసి వాళ్ళింట్లో దింపగలిగితే ఎంత బావుంటుంది కదా అనిపించింది.
భూమికి దూరంలో వున్న ఆ వ్యోమగాములు చెప్పినట్టు - మేము వచ్చిన దేశాలు వేరే అయినా మాలో భేదాలు లేవు - అని భూమి మీద వున్న అందరూ అనగలిగిన రోజు మన భూమి చూపుకి అందంగానే కాదు తలపుకీ ఆనందంగా అనిపిస్తుంది.
Nijame,varu yentho sramakorchi manavalikosa m. Tama jivithanni ankitham chestunnaru hats of them
రిప్లయితొలగించండిఅవును లలితా! అలా సాహసం చేసి స్పేస్ లోకి వెళ్ళేవాళ్ళే లేకపోతే ఇంత అభివృద్ధి వుండేదే కాదు మరి! మీ కమెంట్ కి థాంక్స్!
తొలగించండిఈ డాక్యుమెంటరీ గురించిన ట్రైలర్స్ చూశాను. చూడాల్సిన సినిమా అనుకున్నాను. నీ రివ్యూ చదివాక పిల్లలతో కలిసి తప్పకుండా చూడాలని నిర్ణయించేసుకున్నాను :)
రిప్లయితొలగించండిచూసొచ్చెయ్యండి మరి :)
తొలగించండిచాల బాగుంది.అక్కా మొత్తము నా కళ్ళ కి చూపించారు నీ బ్లాగ్ లో అక్షరాల మెరుపులు విరుపులు చాలా బాగున్నాయి లాస్ట్ ఆదివారం త్రివిక్రమ్ ఇంటికి బోజనాలు కి వెళ్ళాము అప్పుడు మాటల్లో నీ బ్లాగ్ చూపించా లక్ష లైకుల నోము చదివి చాల ఎంజాయ్ చేసారు అందరూ. అక్షరాలతో ఆటలు అంటే ఇవే తెలుగు లో ఉన్న గొప్పతనం అని నీకు అభినందనలు చెప్పమన్నారు.నిజ్జంగా నువ్వు ఏ న్యూస్ పేపర్లో నో ఎడిటర్ గా చాలా బాగా సెట్ అవుతావు లేదా తెలుగు సినిమా కి స్క్రీన్ప్లే రైటర్ గానో సెట్ అవుతావు
రిప్లయితొలగించండినీ కమెంట్ కి చాలా థాంక్స్, హనుమాన్! వీలు చేసుకుని నా బ్లాగ్ చదివి అభినందనలు పంపినందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి నా ధన్యవాదాలని చెప్పు.
తొలగించండిబాగున్నాయండీ విశేషాలు.. అంతరీక్షమెపుడూ ఓ అద్భుతమే..
రిప్లయితొలగించండిఅంతరిక్షం అద్భుతం - అక్కడినుంచి సినిమా తీయాలనుకోవడం, తీయడమూ అద్భుతం గా అనిపించిందండీ. మీ కమెంట్ కి థాంక్స్!
తొలగించండిLovely thoughts, well-expressed. Beautiful end-note. Great read!
రిప్లయితొలగించండిI really appreciate the way you appreciate :) Thanks for your nice words!
తొలగించండిInteresting.. చూడాల్సిన సినిమా అయితే.
రిప్లయితొలగించండిఅవునండీ! కొంచెం హఠాత్తుగా ముగించేసినట్టు అనిపిస్తుంది కానీ - స్పేస్ లొ అంత కష్టపడి తీసినందుకు ఏమీ అనాలనీ, అనుకోవాలనీ అనిపించలేదు. వీలైతే చూడండి.
తొలగించండిVery interesting! I like the way you brought different aspects together in such a fun way :)
రిప్లయితొలగించండిI too like the way you take time to read my blog & comment - Thank You :)
తొలగించండి