19, జనవరి 2018, శుక్రవారం

త్వామనురజామి - 21 - చిట్టిపిట్టలు మా చుట్టాలే - వచ్చీ పోయే అతిథులే!

కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ చదవండి:  త్వామనురజామి - 20 - ఆ పంథొమ్మిదికి baseఏదమ్మా ౘందమామా?

కానీ అసలింతకు ముందు ఏం జరిగిందో తెలియాలంటే మాత్రం ఇదిచదవండి: త్వామనురజామి - 19 - बोलనంత సేపు స్నేహమా - నేను बोలాక కోపమా? 

నేను తెచ్చిన లగేజ్ అంతా నాన్న డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన ఫియట్ డిక్కీలో పెట్టేసుకుని - చలికాలపు పొద్దుటివెలుగులో - ఒకరి తర్వాత ఒకరుగా మూడు ప్రశ్నలూ - ఆరు ఆన్సర్లుగా అసలేంటో - కొసరేంటో, మొదలేంటో - చివరేంటో అంతుబట్టని కబుర్లాడుకుంటూ, నవ్వులేరుకుంటూ ఇంటికి చేరాం.

అప్పటికే - అమ్మ, లక్ష్మిదొడ్డ - ఇద్దరూ కాఫీలు, టిఫిన్లూ - చేయాలి అనుకుంటూ - స్నానాలకి బాయిలర్లో నీళ్ళు కాగాయా లేదా చూసుకుంటూ తెగ హడావిడి పడుతున్నారు.

ట్రెయిన్ దిగి ఇంటికి చేరిన నన్ను చూసి - "వచ్చింది త్రిపురసుందరి. ఇంక కూర్చోనీయదు, నించోనీయదు...ఒకటే హడావిడి" - నన్ను చూసిన ఆనందం లోనే కుసింత విసుగుని కూడా కలిపి అంటూ ఎదురొచ్చింది అమ్మ.

కుశలప్రశ్నలు - కులాసా సమాధానాలు అన్నీ అయ్యాక - కడుపునిండా వేడివేడి ఉప్మా తిని, కప్పు నిండా పాలు తాగి - తెచ్చిన పెట్టెలు తెరిచి - పప్పీ, కుట్టీలకి, ప్రశాంతికి శిల్పంలో కొని తెచ్చినవి ఇచ్చి - మళ్ళీ చాలా రోజుల తర్వాత విజయవాడ- వివిధభారతిలో జనరంజనిలో బోల్డన్ని పాటలు విని ఓ బద్ధకపు-చలికాలపు-రోజుని తెగ ఎంజాయ్ చేశాను.

నాకంటే సెలవులు. పప్పి, కుట్టీలకి ఇంకా కాలేజులు జరుగుతున్నాయి. నేను ఇంటికి వచ్చింది శనివారం - తర్వాతి రోజు ఆదివారం ఇంట్లోనే వున్నారు. సోమవారం ఇద్దరూ కాలేజ్‌కి వెళ్ళారు.

సోమవారం పొద్దున్న గుర్తొచ్చింది - నేను మా క్లాస్‌మేట్స్‌కి పంపిద్దామని కొన్న న్యూఇయర్ గ్రీటింగ్స్. ఆ రోజు అప్పుడే డిసెంబర్ 24. అప్పుడు పోస్ట్ చేయకపోతే టైంకి అందవు.

వెంటనే అమ్మకి పోస్ట్ఆఫీస్‌కి వెళ్ళి స్టాంపులు కొని అక్కడే పోస్ట్ చేసి వస్తానని చెప్పి ప్రశాంతిని నాతో తీసుకుని బ్రాడీపేట 2/11 లో వున్న పోస్ట్ఆఫీస్‌కి బయల్దేరాను.

వెళ్తున్నప్పుడు నా కనిపించింది - ఎప్పుడూ కాలేజ్ కబుర్లన్నీ అమ్మ, పప్పీ, కుట్టీలతో షేర్ చేసుకునే నేను మొదటిసారిగా మూగబ్బాయితో నా పరిచయం గురించి అస్సలేమీ చెప్పలేదని.  ఆ రాత్రి పేపర్ మీద మాట్లాడుకోవడం, ఆ తర్వాత మాటలొచ్చని తెల్సిన తర్వాత భయంతో ఏడవడం తల్చుకుని నాలో నేనే నవ్వుకున్నాను.

ఇంతలో పోస్టాఫీస్ దగ్గరికి వచ్చేశాం - అక్కడే కూర్చుని అందరి అడ్రెస్సులు రాసి స్టాంపులు కొని అంటిద్దామని చూస్తే అక్కడ ఎప్పుడూ వుండే గమ్ బాటిల్ కనిపించలేదు.

ఏదో ఒకటో రెండో అయితే నా నాలుక - ఐదో ఆరో అయితే నాదీ, ప్రశాంతిదీ కలిపి రెండు నాలుకలూ వాడి అంటించేసేదాన్ని.  కానీ మొత్తం 26 కవర్లు, వాటి మీద స్టాంపులు - అబ్బే! వద్దు అనిపించింది.

అప్పుడు మూగబ్బాయి రాత-మాటలో ఇంక్-రంగు బదులు ఇష్టం-హంగు కనపడేలా - "మా ఇల్లు బ్రాడీపేట 2/11 లో పోస్టాఫీస్ ముందు. మా అమ్మ, ఒక మంచి తమ్ముడు, ఇంకా మంచి చెల్లెలు - మొత్తం నలుగురం. మేం నలుగురం ఏం చేసినా, ఎక్కడికెళ్ళినా నలుగురం కలిసే వెళ్తాం. మా అమ్మకి నా ఫ్రెండ్స్ - అమ్మాయిలూ, అబ్బాయిలూ అందరూ తెలుసు - నా ఫ్రెండ్స్ అందరూ మా అమ్మ ఫ్రెండ్స్ కూడా!" - అంటూ రాసిన పేపరిచయం గుర్తొచ్చింది.

వెంటనే వాళ్ళిల్లు, ఇంట్లో వాళ్ళు ఎలా వుంటారో చూడాలని చిన్న కుతూహలం - అందులోనూ నన్ను చాలా పకడ్బందీగా తనకి మాటలొచ్చని తెలియనీకుండా అంతసేపు నమ్మించడం కూడా తెగ ఇంప్రెస్ చేసేసిందేమో - ఒక్కసారి మళ్ళీ పలకరిద్దామా అనిపించింది.

పోస్టాఫీస్ లోంచి బయటికి వచ్చి - ప్రశాంతితో కలిసి ఎదురుగుండా వున్న ఇంటికి వెళ్ళి లోపల్నుంచి గడియ వేసి వున్న చెక్కగేటు మీద రెండుసార్లు తట్టాను.

వెంటనే లోపల్నుంచి "ఎవరూ" అంటూ ఒకావిడ గేటు గడియ తీశారు.

"నా పేరు లలితండి" - అబ్బాయి వచ్చి తలుపు తీస్తాడనుకుంటే వాళ్ళమ్మగారు వచ్చి తలుపు తీయడం అసలు ఊహించలేదేమో ఒక్క నిముషం ఏమని చెప్పాలో తెలియక గబగబా నా పేరు చెప్పాను - అదేదో నేనూ, నా పేరూ  universally recognized అన్నట్లు.

"రా రా లోపలి రా - ఈ అమ్మాయి ఎవరూ? మీ చెల్లెలా?" - నేనేదో బాగా తెలిసినట్లు - నా సంగతి ఎరిగినట్లు - నేనొస్తానని ముందే ఊహించినట్లు - రాబోతున్న నవ్వు దాచుకుంటున్నట్లు - స్నేహంగా లోపలికి ఆహ్వానించారు ఆవిడ.

నేను, ప్రశాంతి గేటు దాటి లోపలికి వెళ్ళి ఇంటికి ముందున్న కటకటాల కివతల నించున్నాము.   ఈలోగా ఆవిడ గేటు వేసి గడియ పెట్టి మా వైపు తిరిగేలోగా చుట్టూ చూసిన నాకు కనిపించిందేంటంటే -

చలికాలపు బంగారపుటెండ 
తెలి సింగారపు ముగ్గు 
చల్లిన బియ్యపు గింజలు 
వాలిన పిచుకల భోజనాల సందడి 
గేటు పై నుంచి వాలిన బోగన్‌విలియా పూలు 
వాటి గుబుర్ల మధ్య నుంచి ఎలాగోలా కింద వాలి 
వెన్నముద్దలయిన ఎండ జాడలు 
పక్కనే అరుగు 
అరుగు పక్కనే చిన్న గులాబీల తోట




పిచుకల్ని చూస్తూ నించుండిపోయిన నన్ను చూసి - "అవి మా చుట్టాలు - రోజూ వచ్చి పలకరించి వెళ్తాయి" అని చెప్తూ లోపలికి నడిచారు ఆవిడ.

నేనూ, ప్రశాంతి కూడా ఆవిడ వెనకాలే లోపలికి - ముందరున్న కటకటాలు, ఆ తర్వాత టీవీ వున్న గది దాటి - డైనింగ్ టేబుల్ దగ్గర ఆగి ఆవిడ కూర్చోమన్న కుర్చీల్లో కూర్చున్నాము.

నాకెలా అడగాలో తెలియలేదు - ఆవిణ్ణి చూస్తే ట్రెయిన్లో బోల్తా పడ్డ అమ్మాయిని నేనే అని తెలిసి పోయింది అనిపిస్తోంది. ఇంట్లో ఆవిడ తప్ప ఇంకెవరూ లేనట్లుంది.  నా అంతట నేను - "మీ అబ్బాయి నాకు తెలుసు" - అని  చెప్పడం మించి ఇంకెలా పరిచయం చేసుకోవాలో తెలీలేదు - అలా చెప్పడానికి కూడా మొహమాటం వేసింది.

నా మొహం చూసి - చుట్టూ వెతుకుతున్న నా చూపులు చూసి - నేను పడుతున్న ఇబ్బంది కనిపెట్టి - ఇంకాసేపుంటే ఏడ్చేస్తానేమోనని పసిగట్టి - నన్ను రక్షించడానికన్నట్టు - "బాబు ఇంట్లో లేడు - చెల్లాయితో కలిసి బజారెళ్ళాడు - వచ్చేస్తాడు ఇంకో గంటలో" అన్నారు నవ్వుతూ.

"అహహ - అది కాదండి - అంతసేపుండను - నేను గ్రీటింగ్ కార్డ్స్ పోస్ట్ చేయడానికి వచ్చాను - తీరా చూస్తే పోస్టాఫీస్ లో గమ్ లేదు - అయిపోయినట్లుంది  - మీ ఇల్లు ఇక్కడే అని మీ ఇంట్లో గమ్ ఉంటుందేమోనని అడగడానికి వచ్చాను" - అన్నాను మాటలని నాలుక మీద పరిగెట్టిస్తూ.

ఆవిడ మనసులో "కొయ్ కొయ్ - నీ సంగతి నాకు తెలుసులే" అనుకుంటున్నట్టు నవ్వి "ఉండు - తెస్తాను" అని చిన్న నీలం రంగు బాటిల్ తెచ్చిచ్చారు.

గబగబా నా దగ్గరున్న కవర్లకి అది రాసేసి అంటించేసి ఒక పది నిముషాల్లో ఆవిడకి "థాంక్స్ " చెప్పి బయటికి వచ్చి - పోస్టాఫీస్ ముందున్న పోస్టుబాక్స్ లో కవర్లు వేసేసి ఇంటికెళ్ళిపోయాను. అంతసేపూ ప్రశాంతి ఏమీ మాట్లాడకుండా - అసలే పెద్దకళ్ళు ఇంకా పెద్దవి చేసుకుని నన్నూ, ఆవిణ్ణీ చూస్తూ - మా కబుర్లు వింది.

ఇంటికి వెళ్ళే దారిలో అడిగింది - "ఎవరు లల్లీ వాళ్ళు?" - అంటూ.

"అది నా ఫ్రెండ్ ఇల్లులే" - ఏదో పెద్ద అడ్వెంచర్ చేసిన ఉత్సాహంతో నే చెప్పిన సమాధానం.
.........................................................................................................................................

డిసెంబర్ 31కి వరంగల్ నుంచి బాబొచ్చాడు - శ్రీను ఇంట్లోనే వున్నాడు. ఆడపిల్లలం నలుగురం, బాబు, శ్రీను - మొత్తం ఆరుగురం కలిసి 31 సాయంత్రం శంకర్‌విలాస్‌కి వెళ్ళాం - న్యూఇయర్ ఈవ్ సెలబ్రేషన్ అంటూ.

అక్కడ వాళ్ళందరూ ఎవరిక్కావాల్సినవి వాళ్ళు ఆర్డర్ చేశాక - నేను కూడా ఒక ప్లేట్ సమోసా చెప్పాను. దాంతోపాటే ఒక ఫ్రూట్ సలాడ్.

అందరి ఆర్డర్లూ వచ్చేశాయి కానీ ఎంత సేపటికీ నేనడిగిన సమోసా రాలేదు. అప్పటికీ అటూఇటూ తిరుగుతున్న సర్వర్ ఎవరెవరికో ప్లేట్లు అందిస్తూ ఉంటే నా పక్క నుంచి వెళ్ళిన ప్రతీసారి నాకు తెలియకుండానే - అది నాకేనేమో అన్నట్టు చెయ్యి చాస్తున్న నన్ను చూసి "దీనికి బాగా ఆకలేస్తున్నట్టుంది - ఏమే లల్లెమ్మా! ఇంకాసేపుంటే నువ్వే హోటల్ లోపలికి వెళ్ళి తెచ్చేసుకునేలా వున్నావ్" అంటూ ఆట పట్టిస్తున్న కుట్టి మాటలకి నవ్వుతూ శుభ్రంగా అన్నీ ఖాళీ చేసేస్తున్న వాళ్ళందర్నీ చూస్తే భలే ఉక్రోషంగా అనిపించింది. నిజంగానే ఆకలి కూడా వేసేస్తోంది.

ఒక పది నిముషాల తర్వాత  ఒక స్పూను-ఫోర్కు-సహిత-సమోసా ప్లేటు వచ్చి నిలిచింది నా ముందు. తిన్నగా అది చేత్తో తీసుకుని తినొచ్చు కదా నేను?! - అబ్బే - అలా చేస్తే అంతా సవ్యంగా జరిగిపోదూ? చెప్పుకోవడానికి విశేషాలు ఏముంటాయ్?

ఫోర్కుతో సమోసాని కట్ చేయడానికి ప్రయత్నించాను. మొదటిసారి కొంచెం జారింది. అది చూస్తూనే నా ఎదురు సీట్లో కూర్చున్న బాబు అననే అన్నాడు  - "అది నా ప్లేట్లో పడితే మాత్రం నేను తినేస్తాను" అని.

బాబు కేసి ఒకసారి గీరగా చూసి - అంతకన్నా గీరగా ఫోర్కు పెట్టి సమోసాని గట్టిగా అడ్డంగా కట్ చేయబోయాను.

అంత పెద్ద సమోసా కూడా ఎగిరి బాబు అన్నట్లే తన ప్లేట్లోనే పడింది. తాను కూడా అన్నట్లే తీసుకుని చేత్తో పట్టుకుని శుభ్రంగా తినేశాడు.

ఇంతలో సర్వరు బాగా మాగిపోయిన పళ్ళతో - కరిగిపోయి కారిపోవడానికి సిద్ధంగా వున్నపేస్టుకి  ఫ్రూట్ సలాడ్ అని పేరు పెట్టి తీసుకొచ్చాడు.

అంతే ! నాకు - అసలే ఆకలి మీద వున్నానేమో -కోపమొచ్చేసింది - "నాకొద్దు ఈ పేస్టు -వెనక్కి తీసుకుపో" అనరిచి వెనకనుంచి కుట్టి పిలుస్తున్నా వినకుండా మెట్లు దిగి కిందకి వచ్చి పేవ్‌మెంట్ మీద నించున్నాను - మళ్ళీ ఒక్కదాన్నీ వెళ్ళడానికి ఇష్టం లేదు మరి - నా కోసం వాళ్ళు పరిగెత్తుకుంటూ రావాలి - నేను వాళ్ళని ఏడ్చి సాధించాలి కదా!

వాళ్ళందరూ తినేసి - బిల్లు ఇచ్చేసి గబగబా వచ్చారు - నేనెక్కడకెళ్ళిపోయానో అని.

కింద నించుని వున్న నన్ను చూడగానే ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుని నవ్వుకుంటూ నా పక్కనే వచ్చి నించున్నారు అందరూ వరసగా.

వాళ్ళని చూడగానే - నేను పట్టించుకోనట్టు నడవడం మొదలు పెట్టాను.

వెనకాల ఇంక కథా-కాలక్షేపం మొదలయింది - బాబు మొదలు పెడితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా ఆశువుగా పూరించుకుంటూ ...

అనగనగా ఒకూళ్ళో బాబిగారున్నారట 
ఆ బాబిగారికి ముగ్గురమ్మాయిలట 
ఆ ముగ్గురూ కలిసి ఓ రోజు హోటల్ కెళ్ళారట 
మూడు ప్లేట్లు ఆర్డర్ ఇచ్చారట 
అందులో ఇద్దరి పొట్టలే నిండాయట 
మూడో పొట్ట నిండలేదట 
పొట్టా పొట్టా ఎందుకు నిండలేదూ అంటే 
నా ఫోర్కుకి సమోసా అందకుండా ఎగిరిపోయిందీ అందట 
సమోసా సమోసా ఎక్కడకు ఎగిరావూ అంటే 
ఎదురుగా వున్న బాబు ప్లేటులోకీ అందట 
బాబూ బాబూ నీ ప్లేట్లో పడ్డ సమోసా ఏదీ అంటే 
నా ప్లేట్లో పడితే నే మింగేయనా అన్నాట్ట


- నా ఉక్రోషం మీద, నే పోగొట్టుకున్న సమోసా మీద కథ చెప్పేసుకున్నారు.

వాళ్ళ మాటలు వినబడుతున్నా - నాకూ నవ్వొస్తున్నా పట్టించుకోకుండా చేతులు కట్టుకుని నడుస్తున్న నా వెనకనుంచి - పప్పి, కుట్టి - కోరస్‌గా పాడడంమొదలు పెట్టారు:

ఆ నడక చూడు - హైస్సా 
ఆ నవ్వు చూడు - హైస్సా

(అది మేమెప్పుడూ మా ఇంటి మేడ మీద కూర్చుని ఎవరైనా మాకు తెలిసిన అమ్మాయిలు రోడ్డు మీద బుద్ధిగా తలొంచుకుని వెళ్తుంటే - ఏడిపిస్తూ పాడే పాట.)

ఈలోగా రాయల్ ఐస్‌క్రీంస్ దగ్గర వాళ్ళు ఊహించలేనంత స్పీడుగా లోపలికెళ్ళి ఒక కుర్చీలో కూర్చున్నాను. వెంటనే వాళ్ళూ బిలబిల్లాడుతూ లోపలికి వచ్చేశారు.

ఒక్కసారిగాఅందరం అప్పటివరకూ చేసిన అల్లరికి నవ్వేసుకుని - నాకిష్టమైన ఫ్రూట్ సలాడ్ తినేసి నడుచుకుంటూ ఇంటికెళ్ళి - రాత్రి పన్నెండింటి దాకా దూర్‌దర్శన్‌లో చూపించిన కార్యక్రమాలు అన్నీ చూసేసి - చివర్లో ఆశా భోంస్లే పాడిన "నయా సాల్ హో - ఆప్ సబ్ కో ముబారక్" పాట వింటూ ఆవిణ్ణి ఆనందంగా చూసేస్తూ (అప్పుడు ఎప్పుడో కానీ కనిపించేవారు కాదేమో - రెప్ప వేయకుండా చూసేవాళ్ళం సినిమా వాళ్ళని) - హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పుకుని - మా దొడ్డ కలిపిచ్చిన టీ తాగేసి కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నాం.

(రాత్రి చాలా సేపు కబుర్లు చెప్పుకుని పడుకునే ముందు మా అమ్మనో, దొడ్డనో లేపి టీ అడిగి - వాళ్ళు టీ పెట్టిస్తూనే - దాంతో పాటుగా పెట్టే చీవాట్లు నంచుకుంటూ టీ తాగడం - పసందైన అనుభవం.)

టీలు తెచ్చుకుని తిట్లు నంచుకుని 
వెచ్చగ సిప్పులు చెయ్యాలోయ్ 
ఎల్లరు హాయిగ నవ్వాలోయ్ 
మేమెల్లరు ఎంజాయ్ చేయాలోయ్ ...


<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>







16 కామెంట్‌లు:

  1. 👌👌 గా ఉంది స్టోరీ అక్కా..ఇంతకీ ఆ మూగ అబ్బాయి ఎవరో చెప్పచ్చు కదా!

    రిప్లయితొలగించండి
  2. మీ న్యూ ఇయర్ కబుర్లు బాగున్నాయి. సూపర్ లలితగారు!
    అమ్మ తిడుతూ మనకోసం చేసేది ఏదైనా ప్రేమగా ఉంటుంది బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవును కాత్యాయిని! నా బ్లాగ్ క్రమం తప్పకుండా చదువుతున్నందుకు థాంక్స్!

      తొలగించండి
  3. లల్లీ, సమోసా స్టోరీ 👌👌👌

    రిప్లయితొలగించండి
  4. ఎంత unpredictable లలితా నువ్వు! ఇంక నువ్వు ఆ మూగబ్బాయి మొహం కూడా చూడవేమో అనుకుంటే, ఇంటికే వెళ్ళావా? ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు.
    పడుకునే ముందు టీ తాగడం.... really!?
    ఆ పిచ్చుకల ఫోటో భలే బావుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేనెప్పుడు predictable చెప్పు- ఒకప్పుడు un- అవడానికి ?
      అవును - నిద్రకు ముందు టీ :)) అర్థరాత్రి కబుర్లు చెప్పుకుంటూ తాగడం భలే వుంటుంది - అందులోనూ ఎవరైనా కలిపిస్తే.
      పిచ్చుకల photo అడిగి మరీ ఒక కాపీ తీసుకున్నాను - నచ్చి ;)

      తొలగించండి
  5. "మూగ"బ్బాయి సస్పెన్స్ ఎప్పటికి తేలుస్తారో, వెయిట్ చేస్తున్నాం.
    ఇంతకీ ఆ పిచుకల ఫోటో వాళ్ళింట్లో తీసినదేనా? (ఐతే, అప్పటికే మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉండేదా? just for fun 😊)
    ఆశాభోంస్లే "నయా సాల్ హో ..." పాడడం గుర్తుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇంకెక్కువ కాలం సస్పెన్స్ వుంచలేను లెండి - తొందర్లోనే చెప్పేయాల్సొస్తుంది :)
      పిచ్చుకల ఫోటో అబ్బాయి వాళ్ళింట్లోదే - అడిగి మరీ తీసుకున్నాను. మామూలు camera తో తీసింది :) మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు, YVR గారు!

      తొలగించండి
  6. పిచ్చుకల ఫొటో మీరు చెప్పే బోల్డన్ని కబుర్లంత అందంగా ఉందండీ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ కమెంట్ అంతకన్నా బావుందండి :) బోల్డన్ని థాంక్స్!

      తొలగించండి
  7. కబుర్లు చాలా బావున్నాయి లలిత గారు. సమోసా కథ హిలేరియస్.. పిచ్చుకల ఫోటో బావుండడం ఓ ఎత్తైతే ఇంత అపురూపంగా దాచుంచడం అద్భుతం. మీ అర్ధరాత్రి టీలు గురించి చదివితే మేం వైజాగ్ హాస్టల్ లో చదువుకోవాలని అర్ధరాత్రి అరకిలోమీటర్ పైగా నడిచెళ్ళి టీ తాగి వచ్చి పడుకోవడం గుర్తొచ్చింది :-)

    అన్నట్లు టైటిల్ లో పాట గుర్తొచ్చినట్లే ఉంది కానీ పదాలు గుర్తురావడం లేదండీ. చివరి పాట మాత్రం పెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకుని అని అర్ధం ఐంది..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాకు నచ్చిన పిచ్చుకల ఫోటో మెచ్చుకున్నారు. చాలా థాంక్స్, వేణూశ్రీకాంత్‌గారు ! నా కబుర్లు మీ హాస్టల్ రోజులు గుర్తు చేశాయన్నమాట :)

      టైటిల్ పాట ఇట్టే పట్టేయగలరు - కుంచెమంటే కుంచెం [Typo intended :)] ప్రయత్నిస్తే :)

      తొలగించండి
  8. "అన్నీ మనకు చుట్టాలే, వచ్చీ పోయే అతిధులే" of "చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలు" ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా పాత పోస్టులన్నీ మీ పుణ్యమా అని మళ్ళీ చదువుకుంటున్నానండి, దీపా! Thanks for your comment!

      తొలగించండి