31, మార్చి 2017, శుక్రవారం

వనచరకొండల్లో నక్షత్ర దర్శనం - ముక్తాయింపు


అమ్మతో, పప్పితో రోజూ ఫోన్లో మాట్లాడుతూ - ఎప్పటికప్పుడు నాన్న ఆరోగ్యం గురించి, డాక్టర్లు చెప్తున్న ఆపరేషన్ వివరాల గురించి వింటూ - వాటిని బట్టి రాసినవి ఇంతకు ముందు కబుర్లు:  వనచరకొండల్లో నక్షత్ర దర్శనం - నాంది

నాన్నకి డాక్టర్ గూడపాటి రమేషు అంతకుముందు ఆంజియోగ్రామ్ చేశారు. స్టార్  హాస్పిటల్లో ఒకరోజు ICU లో వున్నారు.


నాన్న ICU లో వున్నప్పుడు మలయాళీ నర్సులు పక్కనే వుండి మలయాళం లో మాట్లాడుకుంటూ వుండేవాళ్ళు.

నాన్న వాళ్ళని పిలిచి చెప్పారు  - "మీరు తెలుగు నేర్చుకుని తెలుగులో మాట్లాడకపోతే నామీద మీరేదో చెప్పేసుకుంటున్నారని  గోపీచందుకి చెప్తాను" - అని.

వాళ్ళు వెంటనే నవ్వి - "తాతగారు - మీ మీద ఏమీ చెప్పుకోవట్లేదండి" - అని నవ్వేసేవాళ్లు.

డిసెంబర్ లో హైదరాబాదు వెళ్లిన అమ్మ, నాన్న చివరివారంలో ప్రతీ ఏడాది లాగే నాన్న SKBR క్లాసుమేట్స్ సరదాగా కలిసే ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ కి వెళ్లి వచ్చారు.


ఆ  ఓల్డ్ స్టూడెంట్స్ మీటు కెళ్లే ముందు రోజే నాన్న డాక్టర్ గోపీచంద్ తో ఆపరేషన్ వద్దు అని చెప్పి - ఆయన అమ్మతో మాట్లాడతానంటే వద్దొద్దని చెప్పి - ఆపరేషన్ చేయించుకోవడానికి ఒప్పుకున్నది.

అప్పుడే డాక్టర్ని " ఈలోపు నాకొక ఓల్డ్ స్టూడెంట్ మీటొకటుంది తెలంగాణ లో - దానికి వెళ్లొచ్చా? " అడిగారు నాన్న.

"ఆ.. వెళ్ళచ్చు - దాందేవుంది వెళ్ళిరండి ఇబ్బందేం లేదు . ఎన్ని రోజులుంటుంది?" - డాక్టరుగారి ప్రశ్న.

"జస్ట్ టూ  డేస్ "- అన్న నాన్నతో  - " ఏం  చేస్తారు  మీ ఓల్డ్ స్టూడేంట్సూ" - అంటూ డాక్టర్.

"ఏం చేస్తారు?  - వెళ్తామక్కడికి - ఏదో అంతా సీనియర్  సిటిజెన్స్ కదా - ఏదో గుళ్ళూ గోపురాలు చూస్తారు పొద్దున్న. - మధ్యాహ్నం  మీటింగ్ పెట్టుకుని చిన్నప్పటి కాలేజ్ కబుర్లు అవీ చెప్పుకుంటారు - సాయంత్రం మా కుర్రాళ్ళు ఎంజాయ్ చేస్తాం " అన్నారు నాన్న.

డాక్టర్ కళ్లింతవి చేసి - "ఏంటి మీరు కుర్రాళ్ళా?"  అని నవ్వు.

"ఏవయ్యా - అరవై ఏళ్ళు దాటింతర్వాత సెకండ్ లైఫే కదా - ఆ లెక్కన ఇప్పుడు నాకు పదేళ్లే కదా - సాయంత్రం ఆరు తర్వాత నేను కుర్రాణ్ణై పోతా " అంతకన్నా నవ్వుతూ నాన్న.

"సరే వెళ్లి  రండి" అని నవ్వుతూ సాగనంపారు డాక్టర్.

2015 సంవత్సరం: 


జనవరి మొదటి వారంలో మాట్లాడినప్పుడు పప్పి చెప్పింది - నాన్నని 26వ తారీఖునొచ్చి హాస్పిటల్లో చేరమని డాక్టర్లు  చెప్పారని. పైగా పెద్ద వయసు మూలంగా రిస్క్ ఎక్కువ అని, ఆపరేషన్ సక్సెస్ కి 50:50 ఛాన్స్ అని చెప్పారనీ చెప్పింది.

అది తెలిసినప్పటినుంచీ ఎంతొద్దనుకున్నా కొంచెం బెంగగానే అనిపించింది.

ఈలోగా బదరి ఒకరోజు బాలాజీతో ఎప్పట్లాగే ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు - మాటల సందర్భంలో "బాలాజీ! అంకుల్ కి హార్ట్ సర్జరీ - హైదరాబాదులోనే వున్నారు ఇప్పుడు " అని చెప్పారు.

అంతే - ఆ తర్వాత బాలాజీ నాన్నకి ఫోన్ చేసి విషయాలు కనుక్కుని - మా కన్నా ఎక్కువగా ఆదుర్దా పడుతూ - నాన్న ఆపరేషన్ విషయాలు ఎప్పటికప్పుడు కనుక్కుంటూ బదరికి చెప్తూ వుండేవారు.

నేను దాదాపు రోజూ ఫోన్ చేసి పప్పితో మాట్లాడుతూ వుండేదాన్ని.

ఓరోజు చెప్పింది - ఆపరేషన్ కి ఎనిమిది మంది  బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పారని. దానికి నాన్న - "నాకు యంగ్ బ్లడ్ కావాలి, ఆపరేషన్ తర్వాత నాది కొత్త లైఫ్ , యువక రక్తం ఉండాలీ" అని - అన్నారన్నది తలుచుకుని నవ్వుకున్నాము - ఈయనకి ఇక్కడ కూడా సెలక్షనే అని.

జనవరి 17 - శనివారం ఫోన్ చేసినపుడు నాన్న ఏం చేస్తున్నారు అనడిగితే - "అనాతవరంలో ప్రసాదు వాళ్లు భజన చేస్తున్నారు - బయట కుర్చీలో కూర్చుని స్పీకర్ ఫోన్లో  ఆ భజన వింటున్నారు" - అని చెప్పింది పప్పి. దాని గొంతు అంత హుషారుగా లేదు. నేనంటే దూరంగా వున్నాను నాకంతగా తెలియట్లేదు - కానీ పప్పి పక్కనే వుండి నాన్నతో పాటు హాస్పిటల్సుకి, టెస్టులకి వెళ్తూ చాలా స్ట్రెస్ తీసుకుంది.

 సరే - ఇంకో వారంలో సర్జరీ అనుకున్నాము.

జనవరి 24 శనివారం మామూలుగా ప్రతీ రోజులాగే పొద్దున్నే ఎనిమిదింటికి ఫోన్ చేశాను. పప్పి ఫోన్ తీసింది - 26 పొద్దున్న హాస్పిటల్ కి వెళ్తున్నాము అంది. ఇంకా తర్వాత ఏమీ మాట్లాడలేకపోతోంది - ఏడుస్తున్నట్టుగా అనిపించింది. నాకూ కంగారుగా అనిపించి గబగబా మాట్లాడి ఫోన్ పెట్టేశాను.

పక్కనే వుండి నన్ను చూస్తున్న బదరి "బెంగగా ఉందా బంగారం? పోనీ నేను వెళ్లిరానా?" అన్నారు.

అంతలోనే నా మొహం చూసి - అసలే - మనసు-చదివే-విద్య తెలుసు కదా "వద్దులే అందరం వెళ్దాం - ఫ్లైట్ టిక్కెట్లు చూడనీ" అని వెంటనే లాప్టాప్ ఆన్ చేశారు.

ఒక అరగంటలో - జనవరి 25కి షికాగో నుంచి హైదరాబాదుకి డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేశారు - మా నలుగురికీ - అంటే -  బదరి, నేను, బుజ్జిజింక-కిరణ్, అప్పటికి ఇక్కడేవున్న మా అత్తగారు.

ఇంక వీకెండ్ కావడంతో ఇద్దరం ఆఫీసులకి, బుజ్జిజింక స్కూలుకి అర్జెంటుగా ఇండియా వెళ్తున్నామని - రెండు వారాల్లో తిరిగి వస్తామని ఈ-మెయిళ్లు ఇచ్చి గబగబా ప్రయాణానికి కావలసినవి సర్దుకున్నాము.

పప్పికి వెంటనే ఫోన్ చేసి చెప్పాను - బయల్దేరి వస్తున్నామని. అమ్మతో కూడా మాట్లాడాను - కానీ నాన్నకి చెప్పొద్దని చెప్పాను - ఆయన్ని సర్ప్రైజ్ చేద్దామని.

ఎయిర్-ఇండియా ఫ్లైట్లో పదిహేను గంటల పాటు రకరకాల భాషల్లో సినిమాలు చూసుకుంటూ - చూడనప్పుడు నిద్రలో తూగుకుంటూ మొత్తానికి జనవరి 26 సాయంత్రానికి హైదరాబాదులో దిగాము.

ఎయిర్ పోర్ట్ కి బాలాజీ వచ్చారు. వస్తూనే - "బదరి! నిన్ను, కిరణ్ ని ఇంటికి తీసుకెళ్తాను - మనం ఇంటికి వెళ్లేదారిలోనే స్టార్ హాస్పిటల్ - లలితనక్కడ అంకుల్ దగ్గర దింపేసి వెళ్దాం" అని చెప్పారు - మనసు చదవడం బాలాజీకి తెలుసు మరి.

హాస్పిటల్ దగ్గర దిగగానే - అమ్మకి ఆల్రెడీ ఫోన్ చేశారెమో - అమ్మ బయటకొచ్చి నించుని వుంది. అమ్మని పలకరించి ఆవిడ దగ్గర సెక్యూరిటీ పాస్ తీసుకుని సెకండ్ ఫ్లోర్ లో వున్న నాన్న రూమ్ కి వెళ్లాను. నీలం రంగు హాస్పిటల్ గౌన్లో మంచం మీద పడుకుని టీవీ చూస్తున్న నాన్న నన్ను చూసి సంబరాశ్చర్యపోయారు. అందరం వచ్చామని తెలిసి బోల్డంత సంతోషపడ్డారు. నాన్నతో కాసేపు, కింద అమ్మ, లక్ష్మి దొడ్డతో కాసేపు మాట్లాడేసి ఈలోగా బాలాజీ వస్తే తనతో ఇంటికి వెళ్లాను. ప్రియని, పిల్లలని పలకరించి - ప్రియ పెట్టిన వేడివేడి భోజనం తిని కాసేపు కబుర్లు చెప్పి పడుకున్నాము.

మామూలుగా నాన్న దగ్గర ఒకళ్లనే వుండనిచ్చేవారు.

జనవరి 27 సాయంత్రం మాత్రం ఫామిలీ మొత్తాన్ని రావొచ్చు అని చెప్పారు. డాక్టర్లు వచ్చి - మరుసటి రోజు ఆపరేషన్ ముందు ప్రొసీజర్లు అవీ మాట్లాడతారని చెప్పారు.

27 పొద్దున్నించీ - పప్పి, నేను - స్టార్ హాస్పిటల్ బయటే వుండి నాన్నని చూడడానికి వచ్చేవాళ్లని పలకరిస్తూ వున్నాము.

అప్పుడే నాన్న చిన్ననాటి  స్నేహితులు భూషి బాబుగారు, వాళ్లబ్బాయి శంభన్నశాస్త్రి, అమ్మాయి పద్మ హాస్పిటల్ దగ్గర కలిశారు. భూషిబాబుగారు నాన్నని పలకరించి వచ్చి నాతో  "మీ నాన్నది గట్టి గుండె. మొండివాడు - నవ్వుకుంటూ తిరిగొస్తాడు - బెంగ లేదు" అని చెప్పి వెళ్లారు. ఆ మాటలు వినగానే బోల్డంత ధైర్యంగా అనిపించింది - మా నాన్న మొండితనం గురించి ఆయనకన్నా ఇంకెవరు అంత గట్టిగా ఎండార్స్ చేయగలరు గనక!

ఆ రోజే హాస్పిటల్ దగ్గర అనుకోకుండా బదరి తిరుపతిలో MBA ఫ్రెండ్ సాయి ప్రసాద్ కలిశారు. ఏమైనా హెల్ప్ కావాలంటే తప్పకుండా చెప్పమని పదేపదే చెప్పారు.

ఆ రోజు సాయంత్రం - ఎప్పుడూ హాస్పిటల్ దగ్గరే ఉంటున్న నన్ను - అక్కడ తప్ప ఇంకెక్కడా కలవలేమని - నన్ను చూడడానికి - ప్రసాద్ రెడ్డి, అనిత వచ్చి - ఎంతో ఇష్టంగా బెంగళూరులోని పాతరోజులు గుర్తు చేసి మాట్లాడి వెళ్లారు.

వీళ్లు కాక బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చిన మా నాన్న యువ-బంధువులు వచ్చి పలకరించేవారు.

ఎంత బయటికి ధైర్యంగా కనిపిస్తూ వచ్చే వాళ్లందరితో సరదాగా మాట్లాడుతున్నా - నాన్న ఆపరేషన్ టెన్షన్లో వున్న నాకు - మధ్యమధ్యలో వచ్చి పలకరించి - "మేమంతా మీ వెనక వున్నాం"  - అని చెప్పీ చెప్పకుండానే చెప్తున్న వీళ్లందరూ ఆపద్బంధువుల్లా, మనస్స్నేహితుల్లా (ఈ మాటలు - intended-టైపోలు) - మా ఆత్మీయ-సంపదలా  అనిపించారు. 

సాయంత్రమయింది. నేను, బదరి, బాలాజీ, అమ్మ, పప్పి, కిరణ్, లక్ష్మి దొడ్డ, రవి, బాబు - అందరం నాన్న రూంలో వున్నాం. డాక్టర్ గోపీచంద్, డాక్టర్ గూడపాటి రమేష్, ఇంకొకరెవరో అనెస్తెటిస్టు, నర్సులు వచ్చారు.

నాన్న మా అందరినీ వాళ్లందరికీ పరిచయం చేశారు.

ఇంతలో డాక్టర్ గోపీచంద్ నాన్నని అడిగారు - "సిగరెట్లు మానేయమన్నాను - మానేశారా ?" అని.

నాన్న " అప్పుడే మానేశాగా! " అన్నారు.

"అదే ఎప్పుడు?" అనడిగారు డాక్టర్.

"ఎప్పుడంటే - మొన్న గురువారం నుంచి" - నాన్న తడుముకోకుండా ఇచ్చిన జవాబు (అంటే జనవరి 22 నుంచి).

డాక్టర్ మాట్లాడుతూ ఉండగానే - బదరి, బాలాజీ - హాస్పిటల్ ఆడ్మిన్ తో ఏదో మాట్లాడాలని బయటికి వెళ్లారు.

నాన్న సమాధానం విన్న అనెస్తెటిస్టు - నన్ను, బాబుని, రవిని - బయటికి పిలిచి "ఈయనేంటండీ బాబూ - సిగరెట్లు మానేయమని నెలనుంచి చెప్తుంటే మొన్న గురువారం మానేశానని చెప్తున్నారు. ఆయనది ఎంత క్రిటికల్ ఆపరేషనో తెలుసాండీ? ఇప్పుడింక అసలు 50:50 కాదు ఇంకా ఎక్కువ రిస్క్ ఉండేలా వుంది" అని తెగ బాధపడి - ఆయన కంగారు పడి - మమ్మల్ని కంగారుపెట్టి వెళ్లిపోయాడు.

అతను మాట్లాడుతున్నంత సేపు కొంచెం బెంగగా విన్న మేము - అతనటు వెళ్లగానే - కాసేపు ఏమీ మాట్లాడకుండా కుర్చీల్లో పక్కపక్కన కూర్చుండిపోయాం.

ఒక రెండు నిముషాల్లో ఒకళ్ల మొహం ఒకళ్ళు చూసుకుని తెగ నవ్వుకున్నాము - పొద్దున్నించీ నాన్న హాస్పిటల్ వాళ్లతో వేస్తున్న జోకులు తలచుకుని.  ఒక్కోసారి ఏమీ చేయలేనప్పుడు అయినవాళ్లతో కలిసి నచ్చిన మాటలు మాట్లాడుకుని నవ్వుకుంటే మనసులో గుచ్చుతున్న బాధ అంతగా నొప్పనిపించదు మరి.




28 పొద్దున్న పదింటికి అనస్తేషియా ఇస్తామని చెప్పారు. కానీ పన్నెండున్నర  అయింది. 

మొదటి ఆపరేషన్ డాక్టర్ గోపీచందు చేసారు.

29న  కేర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ PCగుప్తా వచ్చి స్టెంట్స్ వేసారు.

ఆపరేషన్ అయ్యాక తెలివి రావడానికి నాన్నబాగా ఇబ్బంది పడ్డారు. ఆపరేషన్ జనవరి 28 అయితే, ఫిబ్రవరి 2 కి పూర్తిగా తెలివొచ్చింది.

ICU లో వుండే నర్సులు, అక్కడ టెక్నిషియన్స్  - "మీకు తెలివొస్తోంది - కళ్లు  తెరుస్తారు - మీకు అంతా  తెలుస్తోంది" అని హిప్నొటైజ్ చేస్తున్నట్టు అంటూ తట్టి తట్టి లేపారట.

ఒక టెక్నిషియన్ వచ్చి గొంతులోంచి ట్యూబ్ లాగబోతే రాలేదు - నాన్నకి నొప్పి తెలుస్తోంది. కళ్ళెర్ర జేసారట. ఎలాగోలా ట్యూబ్ తీశాడు అతను.



ఈ లోపులో ఏమైందంటే నాన్న బెడ్డు తలకింద స్క్రూ  లూజయి కిందకెళ్ళిపోతోందట.
  ... ... ... ...
.... ... ....

నాన్న మాటల్లో

" అసలు పెయిన్ ఒచ్చేస్తోంది - తట్టుకోలేకపోతున్నాను - సిస్టర్ని పిలిచాను - నేను మాట్లాడుతున్నాను  అనుకుంటున్నాను - మాట బయటికి రావట్లా . నేను తిట్టేస్తున్నానని నాకనిపిస్తోంది - తిట్టేస్తున్నాను కూడా - ఇంతలో ఇంకోసిస్టర్ వచ్చి బెడ్డు రిపేర్ చేసేవాణ్ణి పిలుచుకొచ్చింది . వేరే రెండు మూడు దిళ్లు పట్టుకొచ్చి నా తలకింద పెట్టి తన చెయ్యి పెట్టి  నా తల  పైకెత్తిందన్నమాట. ఈలోగా బెడ్డు రిపేర్ అయ్యింది. మధ్యాహ్నం, సాయంత్రం వరకు ఉంచారు అందులో - సాయంత్రం రూంకి షిఫ్ట్ చేశారు".
 ... ... ...
... ... ...


ఆపరేషన్ అయ్యాక నాన్నకి మాట రాలేదు. మాకందరికీ కంగారుగా అనిపించింది.

రెండో రోజు - పక్కనే కొంచెం దూరంలో ఇంకో హాస్పిటల్ బిల్డింగ్ లో వున్న స్పీచ్ థెరపిస్టు దగ్గరికి అంబులెన్సు లో నాన్నని తీసుకెళ్లాను.

స్పీచ్ థెరపిస్ట్ నాన్నని పరీక్ష చేసి "ఈ ఆపరేషన్ కి ఇదొక సైడ్ ఎఫెక్ట్ - వోకల్ కార్డు పారలైజ్ అయింది. కొంచెం ప్రయతంమీద మళ్లీ మాటొస్తుంది - కనీసం ఒక మూడు నెలలు పడుతుంది" అని చెప్పి నాన్నకి స్పీచ్ ఎక్సర్సైజులు చేయమని చెప్పారు.

నాన్న మాటల్లో ఇంకొన్ని కబుర్లు: 

ఆపరేషన్ అయ్యాక - తెలివొచ్చాక డాక్టర్ గోపిచంద్ వచ్చాడు.

వచ్చి "ఎలా వుంది" అన్నాడు.

నేను "పాతిక లక్షలు - బానే అయింది" అన్నాను.

"ఎన్నిసిగరెట్లు తాగుంటారు?"  అన్నాడు

"చిన్నప్పట్నుంచీ కదా - అవీ పాతిక లక్షలయుంటాయి"  అన్నాన్నేను.

"అయితే బాలన్స్ అయిపోయాయిలే" -  అన్నాడు.

అసలాపేరేషనుకి ముందు టెస్టులూ  అవీ చేసే టైములో - నాకు అనూరాధ , చందనారెడ్డి అని పల్మనాలజిస్టులు టెస్టులవీ చేసేవారు.

ఒకరోజు టెస్టుకు సిగరెట్టు తాగేసి వెళ్లాను

డాక్టర్ అనూరాధ "ఏవండీ హాస్పటల్ కి వస్తున్నారు కదా ఇప్పుడైనా సిగరెట్టు మానొచ్చు కదా?!"  అంది

"నేను సిగరెట్టు మానేశాను - పొద్దున్నే కాఫీ ఇచ్చారు - సిగరెట్ తాగాలనిపించింది - ఒకటి కాల్చాను - ఈలోగా మా అమ్మాయి - పదండి - డాక్టర్ దగ్గరికెళదామని మీ దగ్గరికి తీసుకొచ్చింది"  అని చెప్పాను.

అది విని ఆవిడ "మళ్ళీ మీరు నేను ఎందుకు సిగరెట్టు కాల్చానా అని బాధ పడే రోజొస్తుంది" అంది.

అందుకే  ఆపరేషన్ అయాక వెళ్లి అనూరాధకి థాంక్స్ చెప్పి వచ్చాను - నువ్వు చాలా కరెక్టుగా చెప్పావమ్మా అని.

విచిత్రం ఏంటంటే - హాస్పిటల్లో నర్సులు, ఫ్లోర్ లీడర్ యుగంధర్, పరశురామ్ - నాకు ఫ్రెండ్స్ అయిపోయారు.

వచ్చేసేముందు డాక్టర్ గోపీచంద్ "మీకు మందులేమీ అక్కర్లేదు - ప్రతి మూడు నెలలకి ఒకసారి PC గుప్తా రాజమండ్రి వస్తాడు - ఆయన దగ్గర చెకప్ కి వెళ్తే చాలు " అని చెప్పాడు.


PC గుప్తాగారు ఏప్రిల్ లో రాజమండ్రి వచ్చినప్పుడు మొదటి అపాయింట్మెంట్ కి వెళ్ళాను. అప్పటికి మాట కొంచెం బాగానే వచ్చేసింది.

"కామేశ్వరావుగారు ఏంటిసంగతి - ఎలా వున్నారు" అనడిగాడు

"నేను కార్  డ్రైవ్ చెయ్యాలి"  అన్నాను

A. V. సుబ్బారావుగారని డాక్టరే - ఆయన కారుంది అక్కడ - ఆ కారెక్కమని నాకు చెప్పి "పదండి"  అని PC  గుప్తా నాపక్కనే కార్లో కూర్చున్నాడు.

తీసుకెళ్లి చుట్టుపక్కల రోడ్లన్నీ తిప్పుకొచ్చాను.

PC  గుప్తా నా డ్రైవింగ్ చూసి - "సరే డ్రైవ్ చేయండి -ఎక్కువ  దూరం వెళ్లొద్దు" అని చెప్పారు.

ఆ తర్వాత - హైదరాబాదు - గోపీచందు దగ్గరికి వెళ్లి బెల్లం పూతరేకులు, పాలకోవా పట్టుకెళ్ళాను.


గోపీచందు నన్ను చూసి "ఏంటి మీరొచ్చారు?" అనడిగాడు.

"మిమ్మల్ని చూద్దామని వచ్చాను" అని "పాలకోవా, పూతరేకులు మీకోసమే తెచ్చాను" అని అవన్నీ ఇచ్చాను. .

"ఏంటి డాక్టర్ చేతే  షుగర్ తినిపిస్తారా ?" అనడిగాడు

"ఇవి బెల్లం పూతరేకులు - బెల్లం ఐరను - పాలకోవా లో పాలు కాల్షియమ్ - తినొచ్చు" అనగానే నవ్వి తీసుకున్నాడు.


... ... ... ...
... ... ... ...

అలా - బంజారా హిల్సులో (వనచర కొండల్లో) - ఖర్చు విషయంలో చుక్కలు చూపించే సార్ధక-నామధేయ అయిన స్టార్ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగి అప్పుడే రెండేళ్లు - పోయిన గొంతూ వచ్చేసింది - హాయిగా పాడుకుంటున్నారు నాన్న.










28, మార్చి 2017, మంగళవారం

ఉషస్సు ఎటూ లేదు - ఉగాది! నువ్వెక్కడ?

మా వూర - నాల్గు రోజులై
ముసురేసిన  ఆకాశం
ముసుగేసిన ప్రకాశం
ఉషస్సు ఎటూ లేదు!

తగులు-మిగుళ్ల నిశిలో చైత్ర పాడ్యమి మసిబారింది
ఉన్నపళాన - నింగి నిచ్చెననెక్కి అందుకోలేని వేప్పూత ఆకాశకుసుమమైంది
తన తర్వాత అందుకోవడానికి విళంబి ఏడాదికావల వేచివుండగా 
తనలో చేరిన మునుపెన్నడూ ఎరగని '(హే)మలంబ' ని  పోల్చుకోలేక
తన పేరు తానే - ఇల్లలకకుండానే - మర్చిపోయి బిక్కమొహం వేసిన హేవిళంబి -
వెతుక్కోవాలేమో ఇక
ఉగాది! నువ్వెక్కడ?



పంచాంగాల పట్టింపుల్లో
మారు-పేర్ల ఉగాదుల్లో
నీరుకారిన మనసులో
మెరుపులా మెరిసింది
చిరునవ్వు మొలిచింది 
ఈరోజు - ఈలాగుండునని
ఆ రోజే - ఊహించి రాశారేమో అనిపించి -
అనుకోకుండానే గుర్తొచ్చిన - కృష్ణశాస్త్రి గారి కవిత
కారుమబ్బు అంచున మెరిసిన తటిల్లత

నాకుగాదులు లేవు - నాకుషస్సులు లేవు 
నేను హేమంత కృష్ణానంత శర్వరిని 
నాకు కాలమ్మొక్కటే  కారురూపు 
నా శోకమ్ము వలెనే - నా బ్రతుకు వలె  - నా వలెనే
  
భావమేదైతేనేం - పొల్లులేని ఆ  భాష
నిలిపింది నా మదిన - వెల్లువైన వసంతం
చిరునవ్వు - చిరుజల్లు - కలిసి కురిసి
వెల్లవేయగా - హేవిళంబి ఉగాది - నా సొంతం





25, మార్చి 2017, శనివారం

మనసే జతగా పాడిందిలే - 1 - కవలపాటలు (భాగ్యరేఖ)


మాట మనుషుల్ని కలిపితే
పాట మనసుల్ని కదుపుతుంది
ఒక్కో పాట కళ్ళు మూసుకుని వినాలనిపిస్తుంది
ఇంకో పాట కాళ్లు కదిపి నిలవనీయనంటుంది
విరజాజుల సువాసన ఓ పాట గాలై మోసుకోస్తే
సిరిమువ్వలసందడి ఇంకో పాట గజ్జై మోగిస్తుంది.

పుట్టినప్పటినుంచి పాట వింటూ - పాట తోడుగా - పాడిందే పాటగా - పాడుతూ పెరిగాను.

నచ్చిన పాట - అదున్నట్టూ కాక - నే విన్నట్టూ కాక - నాకొచ్చినట్టు పాడుకోవడం - నాకిష్టం - నా ఇష్టం. 
నే మెలకువగా వున్నంతసేపూ - నా పాట పొలకువ వుండాల్సిందే .

నేను వినే పాటల్లో రకరకాలుంటాయి -
నేను కావాలని వినే - తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళం - భాషలవి.
నేను కావాలనుకోకపోయినా - వినిపించే - కొరియన్ భాషవీ ఉంటాయి - అన్నగాడు ఇంటి పట్టున వుండే సెలవు రోజుల్లో.

అందులో కొన్ని -
>>>వినగానే నేర్చేసుకోవాలి అనిపించేవి.

>>>వింటుంటే ఇదెక్కడో విన్నానే అనిపించేవి.

>>>విన్నాక రాసేసుకుని దాచేసుకోవాలనిపించేవి.

>>>వింటూనే - "అసలు పాట ఇదా - మొన్నే కదా మన తెలుగు సినిమాలో విన్నాం - ఇన్స్పిరేషనో ఏమోలే" అని ముచ్చటపడిపోయేవి; అసలు పాటని-కొసరు పాటని పక్కపక్కనే విని - అయినవారితో పంచుకుని మురిసిపోయేవి  - కవల (కాపీ?) రాగాలనబడేవన్నమాట.

>>>వినేసి - గబగబా నేర్చేసుకుని - చులాగ్గా పాడేయగల్గే - కూనిరాగాలు కొన్ని. 

>>>ఇది నన్ను వినకపోతే బావుండును - అని అనుకుంటూనే - తప్పించుకోలేక  - నా పాల బడి - పాట్లు పడలేక  - పాటే పాటుపడి దాక్కోవాలనుకునే - ఖూనిరాగాలు ఇంకెన్నో.

ఇన్నిరకాల పాటల్లోనూ - నాకు  కవల-పాటలంటే భలే సరదా.
కవల-పాటలంటే ఇంచుమించుగానో, అచ్చుగుద్దినట్టుగానో ఒకేలా వినిపించేవి.

అసలీ కవల-పాటలు పలు రకాలు.
ఒకే సినిమాలో - ఒకే భాషలో -
 
>నవ్వు రకం, ఏడుపు రకం (దసరా బుల్లోడు)

>ఆడ పాట, మగ పాట (భాగ్యరేఖ)

>చిన్నప్పుడు, పెద్దప్పుడు (దేవదాసు)

ఒకే సినిమాలో (డబ్బింగో, రీమేకో) - పలు భాషల్లో -

>(సువర్ణసుందరి - తెలుగు, హిందీల్లో; ఆహ్ - హిందీ, ప్రేమలేఖలు - తెలుగు )

>(పూజ-తెలుగు, ఎరడు కణసు - కన్నడ)

వేరే వేరే సినిమాల్లో - 

>పాత సినిమా పాట మెల్లిగా సాగుతూ , కొత్త సినిమా పాట గబగబా పరిగెడుతూ (బుల్లెమ్మ-బుల్లోడు, వాన)

>పాత సినిమాలో తండ్రి హీరోగా, కొత్త సినిమాలో కొడుకు హీరోగా (ఘరానా మొగుడు, మగధీర)

>ఒకే సంగీత దర్శకుడు ఒక ట్యూనునే రెండు వేరే వేరే పాటలకి వాడుతూ - (ఇళయరాజా - అన్వేషణ, అభినందన); (కీరవాణి - అక్టోబర్ 2, ఛత్రపతి)

>ఇలాగే కాక వేరే భాషలోంచి దిగుమతి అయి తెలుగాస్తి అయిన పాటలు - సినిమాల మధ్య ఏ  పోలికా లేకుండా కొన్ని - అసలు  సినిమాలతోనే  సంబంధం లేకుండా ఇంకొన్ని. 

అసలు ఒక్క పద్యంలో చెప్పాలంటే -  మాటలతో ఆడుకునే వెలదినే కానీ ఆటవెలదులు రాయలేను కాబట్టి - ఇదిగో గిద్యంలో చెప్పేశా -

ఆపాట ఈపాట ఒక్కరాగమునుండు
పాడి జూడ మాటల జాడ వేఱు
పాటలందు కవల పాటలు వేరమ్మా 
వీనులవిందే మళ్లిమళ్లి  వినవె భామ! 


కవల-పాటలంటే ఏంటో చెప్పేశాను మరి - నాకు తెలిసిన కొన్నిపాటల-జతల్ని  - నాలాగే పాటలంటే ఇష్టమున్న హితులతో, స్నేహితులతో, సన్నిహితులతో - ఈమెయిళ్లలో, వాట్సాప్పుల్లో, ఫోనుల్లో - టైపు చేసి, చెప్పి - ఆట్టే ఆయాసపడకుండా - నా బ్లాగులో పోస్ట్ చేసేస్తే - ఒక్క పోస్టుకి పలు రీడ్లు - అనేసుకోవచ్చని - సునాయాసపడిపోతున్నాను.

ఆ వరసలో ముందుగా నాకిష్టమైన భావకవి - అందమైన ముగ్గు-గుమ్మల్లా వుండే తెలుగు అక్షరాలమీద నాకు మరింత మక్కువ కలిగేలా చేసిన దేవులపల్లి వారి పాటలు - వేణువుని వెన్నలో ముంచి తీశారా అనిపించేలా వినిపించే పెండ్యాల వారి సంగీతంలో - అపర-జయంతుడు ఎన్టీఆర్, ఆయనకి తెరీడూ-జోడూ అయిన  జమున అభినయించిన ఈ రెండు పాటలూ - (ఒకే సినిమాలో - ఒకే భాషలో - ఆడ పాట, మగ పాట) కి - అద్భుతమైన ఉదాహరణలు.


మొదటి పాటలో - తెలతెలవారుతున్న సమయంలో చలచల్లని గాలి వీస్తుంటే - ఒక ఒద్దికైన అందమైన అమ్మాయి ఏడుకొండలవాడిని స్మరిస్తూ - పాటపాడుతూ - పూజకై పూలు కోస్తుంటే - ఆ పాటకి మెలకువ వచ్చిన అబ్బాయి వచ్చి- ఆ అమ్మాయిని ముచ్చటగా చూడడం - నిజంగా చూడముచ్చటే  ... (వీడియో  కోసమైతే కింద చూడొచ్చు  -  కానీ పాట మంచిగా వినాలంటే : https://www.youtube.com/watch?v=ThPHJ8mYp-o)

తేనె నింపుకున్న గొంతుతో పి. సుశీల పాట - వనలక్ష్మిలా జమున ఆడిన ఆట... 


ఊఁ ... .... ....
నీవుండేదా కొండపై - నా స్వామి - నేనుండేదీ నేలపై
ఏ లీల సేవింతునో  - ఏ పూల పూజింతునో

ఊఁ ... .... ....
శ్రీ పారిజాత సుమాలెన్నొ పూచే  - ఈ పేదరాలి మనస్సెంతో వేచే
శ్రీ పారిజాత సుమాలెన్నొ పూచే  - ఈ పేదరాలి మనస్సెంతో వేచే
నీ పాదసేవ మహాభాగ్యమీవా నాపై నీ దయజూపవా నా స్వామి

నీవుండేదా కొండపై - నా స్వామి - నేనుండేదీ నేలపై
ఏ లీల సేవింతునో  - ఏ పూల పూజింతునో
 
దూరాన నైనా కనే భాగ్యమీవా - నీ రూపు నాలో సదా నిల్పనీవా
ఏడు కొండల పైన వీడైన స్వామి - నాపై నీ  దయజూపవా నా స్వామి 

నీవుండేదా కొండపై - నా స్వామి - నేనుండేదీ నేలపై
ఏ లీల సేవింతునో  - ఏ పూల పూజింతునో


ఆ అమ్మాయిని అనుసరిస్తూ - ఆమె పాటని అనుకరిస్తూ - తమాషా చేస్తూ - అతనుడి లాంటి అతను పాడిన పాట వినాలంటే - కిందనున్న వీడియో చూడాలి మరి.

వెన్నపూస తిని నున్ననైందా అనిపించే ఏ. ఎం. రాజా స్వరం  - కనుబొమల కదలికలోనే  చిలిపిదనం, వలపుధనం కురిపిస్తూ ఎంటీవోడి అభినయం...




నీవుండేదా కొండపై - నాస్వామి - నేనుండేదీ నేలపై 
ఏ లీల సేవింతునో  - ఏ పూల పూజింతునో ... 

- అంటూ మొదలుపెట్టి అబ్బాయి పాడుతుంటే - ఒక చిన్నపాప చేయి పట్టుకుని స్నానం చేయించడానికి వెళ్తోందో ఏమో - భుజమ్మీద తువ్వాలుతో - హఠాత్తుగా ఆగి  -  సిగ్గు పడుతూ కళ్లు మాత్రం ఎత్తి  అతని కేసి చూడబోయిన అమ్మాయి -  నాకైతే - రాబోయే తుమ్మునాపుకున్నట్టనిపించింది.

నీ సిగ్గే సింగారమే ... నీ సొగసే బంగారమే ... 

నీ సిగ్గే సింగారమే - ఓ చెలియా - నీ సొగసే బంగారమే
కనులార గని మెచ్చెనే - ఓ వనలక్ష్మి - మనసిచ్చి దిగివచ్చెనే 
ఉఁహూహూ ... 


ఓ ... ... ...
నీ నవ్వు పూలు అవే మాకు చాలు  - నీ ఒయ్యారాలు అవే వేనవేలు
ఓ పేదరాల - మరే పూజలేల - మాపై నీ  దయజూపవా ఓ నా చెలీ


నీ సిగ్గే సింగారమే - ఓ చెలియా - నీ సొగసే బంగారమే
నీ సిగ్గే సింగారమే

ఓ ... ... ...
మా తోటపూచే వసంతమ్ము నీవే - మా బాట చూసే ప్రభాతమ్ము నీవే
మాలోనకొలువైన మహాలక్ష్మి నీవే - మాపై నీ  దయజూపవా ఓ నా చెలీ 
అక్కా... ...      (అబ్బాయి పాటకి మైమరచిన అమ్మాయి ఉలికిపడేలా - అమ్మాయి చేత జడ వేయించుకుంటున్న చిన్నపాప పిలుపు) 


నీ సిగ్గే సింగారమే - ఓ చెలియా - నీ సొగసే బంగారమే
కనులార గని మెచ్చెనే - ఓ వనలక్ష్మి - మనసిచ్చి దిగివచ్చెనే 
ఊ ఉ ఊఁ ...

బావున్నాయి కదూ ఈ కవలపాటలు?!
ఇలాంటివే ఇంకొన్ని పాటలతో - మరెన్నో కబుర్లతో
నెలలో ఒక వారంలో - ఒక పాటల పోస్టుతో
మీతో నా పాటల సరదా పంచుకోవాలనుకునే

~ పాటలభైరవి 




19, మార్చి 2017, ఆదివారం

త్వామనురజామి - 11 - చేరానండి హాస్టల్లో మరి - అంకె వరసలో ఆరున్నొక్కటై...

కిందటి 19 చెప్పిన కబుర్లు

తెల్లవారుతూనే తిరుపతిలో దిగి వెంటనే టాక్సీలో తిరుమల వెళ్లాము - అమ్మ, నాన్న, నేను.

అక్కడ వైఖానసలో రూం తీసుకుని - దేవుడి దర్శనం చేసుకుని - తర్వాత రామారావుగారిని కలిసి - ఆ రెండో రోజు పొద్దున్నే కొండ దిగి పద్మావతి యూనివర్సిటీకి వెళ్లాం - ముగ్గురం.

పద్మావతి యూనివర్సిటీకి రిక్షాలోనో, ఆటోలోనో వెళ్లాలంటే - పద్మావతి డిగ్రీ కాలేజ్ గోడనానుకుని కుడిపక్కగా వున్న రోడ్డులో వెళ్లి - పద్మావతి పాలిటెక్నిక్ హాస్టల్ గేటులోంచి లోపలి వెళ్లి - అక్కడ కుడిపక్క వున్న ఒక చిన్న గేటు దగ్గర దిగి లోపలకి నడిచివెళ్లాలి.

మా దగ్గర ట్రంకంత లగేజ్ వుండడంతో - ఆ లగేజ్ ని పాలిటెక్నిక్ హాస్టల్ దగ్గర వదిలి - అమ్మని అక్కడే వుండమని - నాన్న, నేను - యూనివర్సిటీ ఆఫీస్ కి వెళ్లాం.

ఆ వెళ్లే దారిలోనే యూనివర్సిటీ హాస్టల్ బిల్డింగ్స్ కనిపించాయి.

అది పొద్దున్నే అవడంతో అప్పుడే బోల్డు మంది అమ్మాయిలు రంగురంగుల బట్టల్లో పూలగుత్తుల్లా క్లాసులకి వెళ్తూ కనిపించారు.

నేను వాళ్లందరి కేసి చూస్తూ వుంటే - వాళ్లల్లో నాతో పాటు ఇంటర్ BH లో చదివిన నిరుపమ, మల్లిక కనిపించారు. యూనివర్సిటీ ఆఫీసుకి వైపు వెళ్తున్న మమ్మల్ని చూసి దగ్గరికి వచ్చి పలకరించారు. అప్పుడే చెప్పారు -  క్లాసులు మొదలయి దాదాపు నెలరోజులయిందని - ప్రస్తుతానికి వస్తున్న కొత్త బ్యాచ్ స్తూడెంట్స్ కి పాలిటెక్నిక్ హాస్టల్ లోనే రూములు ఎలాట్ చేశారని - వాళ్లిద్దరూ ఒక రూంలోనే వున్నారని.

ఇంతలో క్లాసుకి టైం అయిపోయిందని - మళ్లీ సాయంత్రం హాస్టల్లో కలుస్తామని చెప్పి వెళ్లిపోయారు.

నాకొచ్చిన టెలిగ్రామ్, రాంక్ కార్డు, డిగ్రీ సర్టిఫికెట్ - ఇలా కావాల్సినవన్నీ పట్టుకుని వెళ్లిన నాన్నని, నన్నూ చూసి - ఆఫీసులో వున్న ఇద్దరు ముగ్గురు క్లర్కులూ, అసిస్టెంటులూ - మా దగ్గరికి వచ్చి - "ఓ - ఈ అమ్మాయేనా కోర్టుకెళ్ళొచ్చిందీ?" అంటూ పలకరించారు. అక్కడ పద్మావతిలో-లలిత-చేరుట అనే కార్యక్రమం పూర్తయింది.

యూనివర్సిటీ బిల్డింగ్ మొదటి అంతస్తులో ఆంధ్రా బ్యాంకు బ్రాంచ్ ఉండేది - యూనివర్సిటీ స్టూడెంట్ల కోసం. నేను తర్వాత వెళ్లి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పారు - ఆఫీసులో వాళ్ళు.

హాస్టల్-రూం కోసం హాస్టల్-ఆఫీసులో వార్డెన్ని కలవాలని చెప్పటంతో - నాన్న, నేను మళ్ళీ నడుచుకుంటూ వెనక్కి వచ్చి యూనివర్సిటీ హాస్టల్ దగ్గర అసలు-వార్డెన్ సెలవులో వున్నారని చెప్పటంతో - అసిస్టెంట్-వార్డెన్ అరుణా చంచలని కలిసాం. అదే మొదలు - నేనలాంటి పేరు వినడం.

ఆవిడతో మాట్లాడేటప్పుడు నాన్న చెప్పారు - "మొదటిసారి ఇల్లు దాటిరావడం - బెంగ పెట్టుకుంటుంది - తెలిసిన అమ్మాయిలున్నారు - వాళ్ల రూంలోనే వేయండి" అని.

ఆవిడ "సరే" అని నన్ను పేర్లడిగి కనుక్కుని - నన్ను నిరుపమ, మల్లిక వాళ్లున్న రూంలో చేరమన్నారు.

అప్పుడే "ప్రస్తుతానికి వున్న సీనియర్ అమ్మాయిలు పరీక్షలు లేట్ అవడంతో ఇంకా వున్నారని - అందుకే యూనివర్సిటీ హాస్టల్లో ఖాళీ లేక కొత్త బ్యాచులకి ప్రస్తుతానికి పాలిటెక్నిక్ హాస్టల్లో రూమ్స్ ఎలాట్ చేస్తున్నారని - సీనియర్ బ్యాచ్ వెళ్ళిపోగానే మాకు యూనివర్సిటీ హాస్టల్లో రూములిస్తా"రని - కూడా చెప్పారు.

సరే - అవ్విధంబుగా - హాస్టల-పురాణం విని - నాన్న, నేను - కొండల-బండల-మీదనుంచి-పరావర్తనం చెంది- జుట్టులేని గుండులను-జుట్టు కింది మాడులను-ఒకేరకంగా ఎండగొట్టే- తిరుపతి ఎండలో నడుచుకుంటూ - మళ్లీ ఓల్డ్ హాస్టల్ అనబడే పాలిటెక్నిక్ హాస్టల్ దగ్గరికి వచ్చాము.

అప్పటికే అమ్మ - అక్కడ కాపలాగా వున్న వాచ్మన్ తోనూ, ఆ పక్కనే చిన్న బడ్డీకొట్టులో బజ్జీలమ్మే అతనితోనూ, ఇంకా హాస్టల్ శుభ్రం చేసే ఆయాలతోనూ - ఎవరికి తగిన వెర్షన్ తో వాళ్లకి రకరకాల అప్పగింతలు మొదలు పెట్టేసింది.

నెమ్మదిగా ఆయాల సాయంతో నా ట్రంకు, మిగిలిన లగేజ్ మొదటి అంతస్తులో వున్న రూములోకి చేరింది.

ఆ రూంలో నేను ఏడో అమ్మాయిని.

పెద్ద గదిలో మూడు వరసల్లో -   నాలుగు గ్రూపుల్లో - ఏడు ఇనప మంచాలు వున్నాయి.

మొదటి వరస - మొదటి గ్రూపు - ఒకటే మంచం : గదిలోకి రాగానే రోడ్డువైపుకి కిటికీకి దగ్గరగా ఒక మంచం - అది ఖాళీగా వుంది.

మొదటి వరస - రెండో గ్రూపు - రెండు మంచాలు: దానికి కొంచెం ఎడంగా దగ్గరగా జాయిన్ చేసిన రెండు మంచాలు - వాటిమీద పుస్తకాలు తెరిచిపెట్టి - కళ్లు మూసిపెట్టి - ముందుకి, వెనక్కి ఊగుతూ - మనసులోనే చదివేసుకుంటున్న  ఇద్దరమ్మాయిలు - వాళ్ళ రాష్ట్రం తమిళనాడు  - ఊళ్లు కాట్పాడి, అరక్కోణం - పేర్లు వీసీ ఉష, ఎల్ ఇందు - MCA కొత్త బ్యాచ్.

రెండో వరస - ఒకటే గ్రూపు - మూడు మంచాలు : జాయిన్ చేసిన మూడు మంచాలు - నిగమ, మల్లిక, నిరుపమ - లవి. మల్లిక, నిరుపమ - చిన్నప్పట్నుంచి ఇప్పటిదాకా కలిసి చదువుతూ వున్న ఫ్రెండ్సయితే - నిగమ కొత్తగా చేరిన ఫ్రెండ్ - MCA కొత్త బ్యాచ్.

మూడో వరస - ఒకటే గ్రూపు - ఒకటే మంచం: పేరు ఝాన్సీ - MCA కాదు - M.Sc మాథ్స్.

రూంలోకి వెళ్లగానే నాకు తెలిసిపోయింది మొదటి వరస - మొదటి గ్రూపు - ఒకటే మంచం నాకే అని.  అమ్మ నాతో రూంలోకి వచ్చి నా లగేజ్ సర్దేసి - మిగిలిన ఆరుగురితోనూ కాసేపు మాట్లాడుతూ ఉండగానే సాయంత్రం అయిపోయింది.

ఇంతలో  అమ్మా, నాన్న రైల్వే స్టేషన్ కి వెళ్లాల్సిన టైం కూడా అవడంతో ఇంక వెళ్ళొస్తామని చెప్పి బయల్దేరారు. అప్పటిదాకా బానే వున్న నాకు బోల్డు ఏడుపు వచ్చేసింది. వాళ్లిద్దరూ కూడా కొంచెం బెంగగా నాకేసి చూసి  "తొందర్లోనే దసరా సెలవులు వస్తాయి కాబట్టి ఇంటికి వచ్చేయొచ్చు"  అని నాతో అంటూ "ఉత్తరాలు అదీ రాస్తూ వుంటాము - హాస్టల్ ఆఫీసుకి ఫోన్ చేస్తాము" అని చెప్పి బయల్దేరేశారు.

వాళ్లలా వెళ్లగానే పరిగెత్తుకుంటూ మెట్లెక్కి రూంలోకి వెళ్లాను. కిటికీ లోంచి చూస్తే దూరంగా గేటులోంచి బయటకు వెళ్తున్న అమ్మ-నాన్న కనిపించారు. వాళ్లు కనిపించేదాకా చూస్తూ అక్కడే నించున్నాను.

ఆ తర్వాత - వెంటనే వెనక్కి తిరగాలంటే మొహమాటం వేసింది - కళ్ల నిండా నీళ్లు వున్నాయి - అమ్మ కోసం ఏడుస్తున్నానని ఆట పట్టిస్తారేమో అని.

కానీ ఇంతలో వెనకనుంచి "ఏయ్ నిగమా - ఊర్కోవే" అంటూ నిరుపమ గొంతు వినిపించింది. నన్ను వదిలి పెట్టటానికి వచ్చిన అమ్మని చూసి వాళ్ల ఇంట్లో వాళ్లు గుర్తొచ్చి నిగమ ఏడుపు మొదలు పెట్టిందట.

గబగబా కళ్ళు తుడుచుకుని రూంలో అందరికేసి చూసి నవ్విన నాకు చెప్పారు - అందరికీ హోమ్-సిక్ గానే ఉందని.

ఆ రాత్రి హాస్టల్ డైనింగ్ హాల్లో భోజనానికి వెళ్లే ముందు నిరుపమ మిగిలిన రూముల్లో వున్న మా క్లాసుమేట్స్ - అన్నపూర్ణ, సోనియా శామ్యూల్, రేఖ, అరుణ, అపర్ణ, సునీత, పద్మప్రియ, ఉషశ్రీ, మాధవీలత,  ప్రగతి, ఉమాదేవి, గంగాదేవి, అనిత, సునీల, మారుతి, మేరీరూత్ - ఇలా అందరినీ పరిచయం చేసింది.

అప్పటికి అమృతవల్లి, కురుబ ఉషారాణి ఆల్రెడీ యూనివర్సిటీ హాస్టల్లో ఉన్నట్టున్నారు - వాళ్లని పాత హాస్టల్లో కలిసిన గుర్తు లేదు.

ఇంకొక అమ్మాయి - అపర్ణ - అని డే స్కాలర్ ఉందని - తిరుపతిలోనే వాళ్ళింట్లోనే వుండి రోజూ క్లాసెస్ కి వస్తుందని చెప్పారు.

ఆరోజు రాత్రి భోజనం అయ్యాక -  మొదటిసారి - మొట్టమొదటిసారి - నేను అన్నం తిన్న కంచం, గ్లాసు నేనే కడిగాను.  రాత్రి పడుకునే ముందు ఇంట్లో అందరికీ ఒక ఉత్తరం రాసి పడుకున్నాను.

ఆ రెండో రోజు పొద్దున్న బ్రష్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అన్నపూర్ణ, సోనియా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడి - తెగ నచ్చేశారు.

బ్రేక్ఫాస్ట్ అయ్యాక క్లాస్ కి నిరుపమతో వెళ్లాను. లంచ్ బ్రేక్ కి ముందు తనే బ్యాంకుకి కూడా తీసుకెళ్లింది - అకౌంట్ ఓపెన్ చేయడానికి.

నేను, అపర్ణ, నిరుపమ ఇంటర్ BH లో చదివాము. నిరుపమ కూడా కన్నడ అమ్మాయి అవడంతో - అపర్ణ, నిరుపమ - ఎప్పుడూ కన్నడలో మాట్లాడుకుంటూ వుండేవాళ్లు. నేను పక్కన వున్నప్పుడు కూడా నిరుపమ కన్నడలోనే మాట్లాడేది అపర్ణతో - అదొక కోపం.

పైగా ఎప్పుడైనా ట్యూషన్లో కూర్చుని, కూర్చుని లేవగానే కాలు తిమ్మిరెక్కితే - అలా అని చెప్పీ చెప్పగానే నిరుపమ వచ్చి కాలు గట్టిగా తొక్కేది - అలా తొక్కితే కాలు తిమ్మిరి తగ్గుతుందని చెప్పేది. నాకు అలా తొక్కినప్పుడల్లా తిమ్మిరి వదలడం అటుంచి కాలు నొప్పి కూడా తోడయ్యేది - అదింకో కోపం. అందుకని గుంటూర్లో చదివే రోజుల్లో నిరుపమతో తక్కువ మాట్లాడేదాన్ని.

కానీ తిరుపతిలో నిరుపమ కనబడగానే A known devil is better than an unknown friend అనేసుకుని తనతోనే వెళ్లేదాన్ని ;)

ఒకసారెవరో నిరుపమని అడిగారు - "లలిత మీ చెల్లెలా?" - అని.

నిరుపమ ముక్కుకి అప్పుడు రింగ్ పెట్టుకునేది - నా ముక్కుకి ముత్యపు-బులాకీ వుండనే వుంది.

తన వెనకాల తోకలా తిరిగే దాన్నేమో - వాళ్లకేదో పోలిక తోచినట్టుంది - అలా అడగ్గానే నిరుపమకి కొంచెం కోపం వచ్చింది.

ఒకరోజు మధ్యాహ్నం లంచ్ అయ్యాక మా క్లాసులు జరిగే CC  (Computer Centre) కి వెళ్తుంటే - దారిలో ఆగి "ఎందుకే ఎప్పుడూ నా వెనకాలే వస్తావ్? ఇంక రాకు" అంది.

నేను వెంటనే "నాకిక్కడ నువ్వొక్కదానివే తెలుసు - నీతోనే వస్తాను" అని ఇంకా కోపంగా చెప్పాను. అలా నిరుపమని ఫస్ట్ సెమిస్టర్ లో తెగ విసిగించేదాన్ని.

హోమ్-సిక్ , డే స్కాలర్ - ఇలా కొత్త కొత్త మాటలు, కొత్త కొత్త స్నేహాలు, కొత్త చోటు, కొత్త పద్ధతులు - బాగానే అలవాటు అయ్యింది - యూనివర్సిటీ లైఫ్.

నాన్న ఇంట్లో అందరికీ చెప్పినట్టున్నారు - నాకు బెంగగా అనిపించకుండా వుండాలంటే ఉత్తరాలు రాస్తే బావుంటుందని.

నాకు వారానికి కనీసం రెండు ఉత్తరాలు వచ్చేవి.

అనాతవరం నుంచి లలిత దొడ్డ - "కష్టాలకోర్చుకున్ననే సుఖాలు దక్కునోయ్ ... జయమ్ము నిశ్చయమ్మురా ..." అని పాటలు రాస్తూ మంచి కవితల్లాంటి ఉత్తరాలు -

హైద్రాబాదునుంచి లక్ష్మి దొడ్డ "ఇప్పుడే మధ్యాహ్నం అయింది - టీ తాగి నీకు లెటర్ రాస్తున్నాను " అంటూ మినీ-డైరీలు -

నైవేలీ లో ఇంటర్న్షిప్ చేస్తున్న వేణు, బెంగళూరునుంచి శ్రీను, రియాద్ నుంచి సుబ్బారావు పెదనాన్న - అందరూ రెగ్యులర్ గా ఉత్తరాలు రాసేవారు - నాకు బోల్డంత ధైర్యం చెప్తూ.



ఫస్ట్ సెమిస్టర్ లో శుభ మేడం - DMS (Discrete Mathematical Structures), రమాసుందరి మేడం - FORTRAN ల్యాబ్, సుధా మేడం - Linear Algebra - టీచ్ చేసేవారు. బుద్ధిగా క్లాసులకెళ్లడం, అతితక్కువగా దొరికే ల్యాబ్ టైంలో computer basics నేర్చుకోవడంతో రోజులు ఎక్సయిటింగ్ గా గడిపోయేవి.

దసరా, సంక్రాతి సెలవులకి ఇంటికి వెళ్లడం - వెళ్లేటప్పుడు తిరుపతిలో నాకిష్టమైన 'శిల్పం' అనే - గ్రీటింగ్ కార్డులు, చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్ అమ్మే షాప్ నుంచి - పప్పి, కుట్టీలకి బ్లాక్ మెటల్ గాజులు, చెవులకి పెట్టుకునే హ్యాంగింగ్స్  లాంటివన్నీ కొనుక్కెళ్లడం - మొదటి సెమిస్టర్ బాగానే గడిచిపోతోంది.

ఫ్రెషర్స్ పార్టీ అయిన తర్వాత మా సీనియర్స్ - ముఖ్యంగా శ్రీలత, సంగీత - మంచి ఫ్రెండ్స్ అయ్యారు.

శ్రీలత వాళ్ల నాన్నగారు మా ఏసీ కాలేజ్ మేనేజర్ - చంద్రపాల్ గారని తెలిశాక ఇంకా దగ్గరయామిద్దరం.

రోజూ సాయంత్రం క్యాంపస్ లో వాకింగ్ చేసే శ్రీలత, సంగీత - వాళ్లుండే యూనివర్సిటీ హాస్టల్ నుంచి మా ఓల్డ్ హాస్టల్ కి వచ్చి - వాళ్లతోపాటు వాకింగ్ కి తీసుకెళ్లేవాళ్లు - నన్ను, నాతో పాటు షిప్లీని.

ఫిబ్రవరిలో మొదటి సెమిస్టర్ పరీక్షలు అని టైం టేబుల్ ఇచ్చారు. జనవరిలో సంక్రాతి సెలవులకి ఇంటికి వెళ్లి వచ్చాము. పరీక్షలకి ప్రిపరేషన్ మొదలయింది. అందరూ చాలా సీరియస్ గా చదువుకుంటున్నారు. నాకది అసలలవాటు లేని పని - అయినా ఒక నెల మిస్ అయిన పాఠాలు ఉండడంతో నేను కూడా పుస్తకాలు తెరిచి చదవడం మొదలుపెట్టాను.

ఒకరోజు రాత్రి భోజనం అయ్యాక డైనింగ్ హాల్నుంచి రూంకి వెళ్దామని మెట్లెక్కుతున్న నన్ను ఎవరో ముందున్న కటకటాల దగ్గర్నుంచి "లలితా! నీకు టెలిగ్రామ్" అని పిలిచారు. అప్పటికి రాత్రి ఎనిమిది అయ్యింది. ఆ టైంలో టెలిగ్రామ్ అంటే - ఒక్కసారిగా ఏంటో భయం వేసేసింది - ఇంట్లో ఎవరికి ఏమయిందో అని.

చేతిలో వున్న కంచం, గ్లాసు అలాగే పట్టుకుని పరిగెత్తుకుంటూ కటకటాల దగ్గరికి వెళ్లాను.

రోజూ ఆరున్నర తర్వాత దానికి తాళం వేస్తారు.

కటకటాల అవతల పోస్ట్ మాన్ - చేతిలో టెలిగ్రామ్ పట్టుకుని -  కటకటాల్లోంచి అందించడానికి ట్రై చేస్తున్నాడు.

నేనసలు అతనికేసి చూడకుండా కళ్ళు మూసుకుని ఏడవడం మొదలు పెట్టాను.

పక్కనే నా రూమ్మేట్ - ఝాన్సీ వుంది - తను నన్ను పట్టుకుని "లలితా - కళ్ళు తెరు - సంతకం పెట్టు" అని చెప్తూనే వుంది - నేనవేమీ పట్టించుకోకుండా తన భుజం గట్టిగా పట్టుకుని తల అడ్డంగా తిప్పుతూ కళ్ళు తెరవకుండా ఏడుస్తూనే వున్నాను.

<<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>



17, మార్చి 2017, శుక్రవారం

నేర్పించిరి (చదివించని) గురువులు - 6 - మణి మావయ్య

ముగ్గురన్నదమ్ముల్లో మధ్యముడు -
ఆత్మీయత పంచడంలో ఎక్కడా తగ్గని ఉత్తముడు. 

మాయ-మర్మమెరుగని అమాయకుడు -
కామ్ గా బికాం చదువుకున్నవాడు.


ఇంటి గాది-సావిడి వేదికగా ఎదిగి కళాశాల రంగస్థలం మీద మెరిసిన మంచి నటకుడు -
నటనని వేదికకే వదిలిన నిష్కపటి.

అకౌంటెన్సీ అంటే కౌంటు లేనంత ఇష్టం వున్నవాడు -
దాని ముందు ఇంక దేనినీ కౌంటు చేయనివాడు. 

లెక్కలెన్నుటలో - చేసిన కొలువులన్నిటిలో - ఎన్నదగిన పేరెన్నిక గన్నవాడు -
లెక్కలు నిక్కచ్చిగా తప్ప ఇంకోలా ఎక్కిచ్చడం రానివాడు.

మెడికల్ షాప్-వ్యవహారం వ్యయభారమైన వేళ  - గోదారి దాటితే బ్రతుకు లేదన్న మా నాన్నని గోదావరి దాటించి - వ్యాపకం కలిపించి -  ఈరోజుకి నాన్న తాను ఈదేసిన-గోదార్ని చూసి "హమ్మయ్య" అనుకోగలగడానికి - హేతువైన హితుడు - దూరాబారమైన ఊర అన్నగా చెల్లికి అండ-దండైన దత్తుగారు - బావ బ్రతక గోరిన బావమరిది. 

తాతల-మామ్మల, తండ్రుల-తల్లుల పరంపరలో తనకు దక్కిన వారసత్వపు హుందాతనపు ఛాయలు, బుద్ధికుశలత మెరుపులు - నాకూ పంచిన మేనమామ.
ఈరోజుకీ "పాండురంగడు" అని నన్ను సరదా చేసే మణిమావయ్య (చిన్నప్పుడు పొన్నకాయలాంటి తిరుపతి-గుండుతో - పప్పులో ఉండ్రాళ్లలాంటి కళ్లతో వున్న నాకు మా మణిమావయ్య చేసిన బిరుదు-ప్రదానం అది  - భక్తతుకారాం స్ఫూర్తితో. 


తానొచ్చిన దారిలో అన్నీ ఎగుడు-దిగుడులే అయినా ఏమాత్రం దిగులు పడక -
ఎన్నో విధాల - విధివల్ల తానోడినా - తొణకక -
Where there is మణి - there is money - అంటూ సరదాగా చిటికలేసే -
మన్ననైన "మణి"పూస -
మా ఇంటి హీరోదాత్తుడు  - సుబ్రహ్మణ్యదత్తు అనబడు
మంచి మనసున్న మనిషయ్య - మా మణి మామయ్య!

10, మార్చి 2017, శుక్రవారం

ఏంటండో అచ్చట? - నింటెండో స్విచ్చట!

అచ్చంగా... ముత్యం-మూడు నెలల కిందట - శీతాకాలపు సెలవులట
అన్న ఇంటికి వచ్చినప్పుడట  - మొదలయిందట - ఆ  ముచ్చట
అదేంటో గేమింగ్ టాబ్లెట్టట  - ఇద్దరు ఆడుకోవచ్చట
అదే పనిగా  - అన్నాతమ్ముళ్ళట - చెప్పుకుని తలచుకుని మరీ మురిశారట

ఎక్కడైనాట - ఎప్పుడైనాట 
ఒక్కరట - అపుడో-ఇపుడోట 
ఇద్దరట  - ఇంట్లోనట
ఇంకొందరట  - ఇంటర్నెట్లోనట
ఇలా రకరకాలుగా ఆడుకోవచ్చట

ఒక ముక్కుకి అటూ-ఇటూ రెండుకళ్లున్నట్లు
ఓకే - ఎంజాయ్ అనుకోవడానికి 
ఒకే జాయ్-కాన్ కి  రెండు కంట్రోళ్లట
ఒకటి అన్నకిచ్చి - ఇంకోటి తమ్ముడికట 

ఒకటే టాబ్లెట్టట - స్విచ్చాటకైనా - అది తెచ్చే అమ్మ-నెత్తి-పోటుకైనా
ఆ టాబ్లెట్టు టీవీకి కలపొచ్చట - కలపకనూ ఆడొచ్చట

అమ్మ కావాలనుకుంటే - టీవీలో - పాటలు చూడాలనుకుంటే
అడ్డం లేకుండా చూడొచ్చట - ఒక్కతే - గొంతు కలిపి పాడుకోవచ్చట
అన్నదమ్ములు అమ్మ పక్కనే కూర్చుని ఆడుకోవచ్చట
అందరూ కలిసి గువ్వపిట్టల్లా ఒక్కచోటే కువకువలాడొచ్చట

ఇలా వినక తప్పని - ఎన్నో ఎన్నెన్నో పొగడికలట
ఇంక కొనక తప్పించుకోవటం - పగటికలట

సరే ! ఇంతకీ ఎక్కడ దొరుకుతుందటా?
ఎప్పుడు - ఎక్కడ - ఎవరు అమ్ముతారటా ?
అది కనుక్కోవడం నాన్నగారి ఒంతటా
దానికి పిల్లలతో పాడే అమ్మ వంతటా

అమ్మా-నాన్న - తమ్ముడూ-అన్న - నలుగురూనట
ఐఫోనులూ, లాప్టాపులూ - సెర్చించారట
అవన్నీ చెప్పేశాయట  - స్విచ్చొచ్చేది మార్చిలోనట
అదీ మూడో తారీఖట - అర్థరాత్రి దాటాకనేట

మన-స్విచ్చు కబుర్లతో - కాలక్షేపాలతో గడిచినవి పగళ్లట
మనస్విచ్చు కలలతో - కలవరింతలతో తెల్లారినవి రాత్రుళ్లట

కిందటి గురువారం మార్చి రెండట
బుజ్జిజింక బడి - తర్వాత వాయులీన-వాదనమట
ఆపై కొరియన్ మార్షలాట - టేక్వాండోట
అవన్నీ అయ్యాక - పదండి వెళ్దాం టాటా - అని సందడట 
స్విచ్చొచ్చి సెలవిచ్చె అమ్మ వంటింటికట 

అర్థరాత్రి పన్నెండు వరకూ - ఏ కొట్టుముందు ఎంత జనముందురోనని బెంగపడిరట
చలికాలపు వణుకు నెదిరించుటకట - కారు ట్రంకులో - కుర్చీలు-దుప్పట్లు సర్దిరట
రాజు-వెడలె అన్న తీరుగానట - కారు-రథంలో కదిలారట
బంగ్లాదేశపు "శాఫ్రాన్" రెస్టారింటికట - (తెలుగులో)మాడని (కన్నడ)ఊట మాడు-టకట
వెళ్లే దారిలో అమ్మ కంట బడిరట - బెస్ట్-బై దగ్గర టెంట్లు కట్టి నించున్నవారట
అమ్మ స్వగతంగా అందట -  "ఏంటండో అచ్చట?"
నాన్న సంగతేంటో చెప్పారట - "నింటెండో స్విచ్చట!"
ఇంకా అన్నారట - "పన్నెండింటికే  బెస్ట్-బై తలుపు తెరుస్తార" నిట

అమ్మ - "అమ్మో చలి! ఇప్పుడే వణుకొస్తోందన్న" దట
బెస్ట్-బై కాక ఇంకెక్కడ అమ్ముతున్నారో అని వెతికిందట
పక్కనే ఇరవై-నాలుగ్గంటల వ్వాల్మార్టొకటుందట  
అక్కడైతే ఎంచక్కా - వెచ్చగా లోపల కూర్చోవచ్చట

వెచ్చవెచ్చని భోజనమారగించిరట
వచ్చె-వచ్చేమంటూ వాల్మార్టున అడిగిడిరట
తొమ్మిది గంటలకి మొదలెట్టిన వరసలో -  తొమ్మిదోవారైరట
తొమ్మిదిలో-మూడోవంతు-గంటల పాటు - వేచి-వేచి నిద్ర-వాలు-కళ్లవారైరట





గడియారపు ముల్లు - పన్నెండు దాటి ఒక నిముషమైనదట
మార్చి రెండు - ఏమార్చక - తేదీ మార్చి -  మూడైనదట
లెండి-లెండి అని అందరితో పాటు లేచిరట
వరస కదలగా - అడుగు కదిపిరట
స్విచ్చు చేతికొచ్చినది - ఒంటిగంటకట
బుజ్జిజింక నవ్వు విచ్చుకొనెనట  - నాన్నగారికో 'హగ్గు' నిచ్చుకొనెనట
అమ్మా-నాన్నకి  ఈ స్విచ్చిచ్చిన-ముచ్చట బహు-ఇచ్చకమైనదట

ఒక బహు-ముచ్చటైన చిన్న-ముచ్చట:

ఆ రాత్రి - నింటెండో స్విచ్ కోసం వచ్చిన - ముప్పై మందిలో - ముప్పైకి-ఒకటి తక్కువగా అందరూ అమెరికన్లే.

వరసలో బుజ్జిజింక కన్నా ముందు వున్న పంథొమ్మిదేళ్ల అబ్బాయి తన స్విచ్ కొనుక్కోబోతూ - అక్కడ వున్న నాలుగు రంగుల్లో - ఒకటి ఎరుపు, ఇంకొకటి నీలం, మరో రెండు బూడిద రంగువి వుండడం చూసి - వెనక్కి తిరిగి బుజ్జిజింకకేసి చూసి: "Which color do you like?" - అనడిగాడు.

బుజ్జిజింక "Grey" అని చెప్పాకే ఆ అబ్బాయి తనకి కావలిసిన ఎరుపు తీసుకున్నాడు - ఒకవేళ వీడు "Red" అని వుంటే అతను ఎరుపు తీసుకునేవాడు కాదు.

అది గమనించి బుజ్జిజింక ఎంతో పొగిడేశాడు ఆ అబ్బాయిని.
బుజ్జిజింకకి అదొక స్విచ్చిచ్చిన - మనస్విచ్చిచ్చిన - మరువరాని-ముచ్చట. 





3, మార్చి 2017, శుక్రవారం

ఒక టి నుంచి ప(ది)ల దాకా...

రోజులు ఒక వారగా వచ్చి వారమై  - వారాల నెలవు నెలై  - నెలల కూడిక ఏడాదై
ఏడుకొకయేడు తోడై - బడి రోజుల అమ్మాయి నుండి - బడికంపే అమ్మనయినా

ఆమని పచ్చని - ఎండ ఎరుపుని - తొలకరి మేఘపు సన్నటి మెరుపుని
శిశిరపు పసుపుని - శీతలపు తెలుపుని - చుక్కల వెలుగులో తళుకుమనే నలుపుని

పూటేదైనా - అది పూసుకున్న రంగేదైనా
వేళేదైనా - కలలదైనా - తలపోసుకున్న కలతదైనా

ఎదలో - ఏమూలనుంచో - ఎప్పుడూ పలకరించి - కలవరింపజేసి 
పెదవిపై  - చిట్టి బుడగలా పగిలి - పెగిలి పెగిలి - వరదలా వెలికివచ్చి

దో ...బూ... చీ - అని అలరించే ఆ పసితనపు గిలిగింత జాడ నాకింకా తోడే

ఆ తోడుందన్న ధీమాతోనే కాబోలు - అప్పుడప్పుడే కాదు - ఎప్పుడంటే అప్పుడు - బుజ్జిజింకల లోకంలోకి పరిగే...త్తుకుంటూ వెళ్లిపోతుంటా.

వెళ్లి ఊర్కుంటానా? -
చెట్టెక్కి ఊగే కొమ్మల వాలి - కింద తూగే ఊడల జారుతా
పోటెత్తే కడలి నురగల అలల వుయ్యాలలూగుతా
రెక్కల-పిట్టల విమానాల చంద్రుని చేరి వెన్నెల కోసుకొస్తా
వెలుగు పూసల దారుల సూర్యుని చిన్నెల పూసుకొస్తా
చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర, రోజులు దాటిపోయాయని బెంగ పడనుగా
Green Eggs And Ham, Hop on  Pop, The Cat In The Hat - ఇలా ఇంకెన్నో వున్నాయిగా.

అదుగో ...అలా ...
Dr. Seuss పుస్తకాల ప్రేమలో పడి
కలల-దోనెలో వాలి
కథల-కబుర్ల-వాగులో అల్లి-బిల్లిగా వెళ్తున్న నాకు -
ఓ రెండు వారాలముందు ఏమనిపించిందంటే ...
ఈ Seuss గారు ఇన్ని మంచి పుస్తకాలు ఎన్నో పిల్లల కోసం రాశారు కదా -
ఇవన్నీ చదువుతున్న -  చదువుతూ మురిసిపోతున్న నేను  -
ఆయనంత బాగా కాకపోయినా -
కొంతైనా తెలుగులో రాయగలనా? - రాయనా? - రాసి చూడనా? - అని.

వెంటనే గబగబా నాకెంతో ఇష్టమైన అంకెల లెక్కలు మాటల్లో పెట్టి రాసేశాను -
ఒక-టి నుంచి ప-ది-ల దాకా...
ఒకటంటే ఒక 'టి'  నుంచి పది 'ది' ల దాకా.
రాసి ఊర్కున్నానా ?-
ఇంకా...  వెంటనే 'ఈమాట' వారికి పంపించాను.


ఈమాట వారు - మంచి మాటల వారు - మామంచివారు
ఇంకా...  ఇంకా...  వెంటనే వేసేసుకుంటామన్నారు
ఇంకా - పనిలోపనిగా - మీ ఈ అంకెల మాటలని పాట కట్టిద్దామమనుకుంటున్నాము - పోనీ మీరే పాడతారా? - అనడిగారు
నే రాసిన మాట - నేనే పాట కట్టటమా - ఇకంతకన్నా పసిడిమూట ఏముంటుంది నాకు ?!
అడిగిందే తడవు - మాటల్ని పాట-కాని-పాట కట్టేశా.
ఈమాట వారు మెచ్చేశారు - నా మాటని అచ్చేశారు - నా పాటని అక్కడే మాల గుచ్చేశారు. 


నా పాట-కాని-పాట చదివి వినాలంటే ఈమాట  మీద క్లిక్ చేయండి.
అక్కడ బోల్డన్ని కథలూ, కవితలూ, కబుర్లూ - గొప్ప గొప్ప రచయితలు రాసేవి బోల్డు వుంటాయి.
 వాటి పక్కనే - నా చిన్ని-చిన్ని మాటల అంకెల-పాటా వుంటుంది.

అక్కడకి - వెళ్లి పై బొమ్మలో కనిపిస్తోందే - Dr. Seuss గారి అందమైన బొమ్మతో నా కవిత ఒకటి నుంచి పదిల దాకా...

దానిమీద కూడా క్లిక్ చేశారనుకోండి -  చదివే టైమూ, వీలూ- మీకుంటే ఇప్పుడే చదవొచ్చు 
మీ కళ్లు బిజీ గా వున్నాయనుకోండి - హాయిగా వినేయొచ్చు - ఆ హాయి వినగలిగే వీలుకే!
వినడం మాత్రం - ఏ మాత్రం నా పూచీలేని - ఎట్ యువర్ ఓన్ రిస్కే!