26, ఆగస్టు 2011, శుక్రవారం

అద్య ధారా-సదాధారా -నిరాధారా

(చిన్నప్పుడు వేసవిలోశలవులకి అనాతవరం వెళ్ళినప్పుడు  మా ఇంటి అరుగుమీద నాన్నమ్మ ఒళ్ళో పడుకుని విన్న ఎన్నో కథల్లో ఇది ఒకటి. )


ఒకసారి భోజరాజుకి, కాళిదాసుకి ఏదో కావ్యచర్చల్లో భిన్నాభిప్రాయం వచ్చింది. అప్పుడు కాళిదాసు భోజ రాజాస్థానానికి దూరంగా వెళ్లి ఒక చెట్టు క్రింద ధ్యానం చేసుకుంటూ వున్నాడు.     

కొంతమంది ఆకతాయిలు కాళిదాసు వద్దకి వెళ్లి - స్వామీ! ఏం చెప్పమంటారు. మీరిలా రాజాస్థానం లోంచి అడుగు బయట పెట్టారో లేదో భోజ రాజుగారు కాలం చేశారు అని.


అది వినగానే కాళిదాసు నోటినుంచి ఇలా ఒక శ్లోకం వెలువడింది:
అద్య  ధారా  నిరాధార  నిరాలంబా  సరస్వతీ
పండితః  ఖండితః  
సర్వే భోజ   రాజే దివం  గతే



(ఈరోజు ధారా నగరం నిరాధారమయింది. సరస్వతీ దేవికి ఆలంబన లేకుండా పోయింది. పండితులందరూ చెల్లాచెదురయారు.  ఇదంతా భోజరాజు దివంగతుడవడం వల్లనే కదా!!!)


అదే సమయానికి రాజ్యసభలో మంత్రులతో కాళిదాసుతో తనకి వచ్చిన భేదాభిప్రాయాన్ని ఎలా పరిష్కరించాలా అని మంతనాలు జరుపుతున్న భోజరాజు సింహాసనం మీదనే ఒరిగిపోయాడు.


రాజుగారికి ఏమయిందో అర్థం కాక సభలో అందరూ దిగ్భ్రాంతులై చూస్తుండగా కాళిదాసుకి అబద్ధం చెప్పిన ఆకతాయిలు సభలోకి భయపడుతూ వచ్చి జరిగినది ఏమిటో చెప్పగానే మంత్రులందరూ వెళ్లి కాళిదాసుకి అసలు విషయం వివరించారు.


వెంటనే కాళిదాసు ఈ క్రింది శ్లోకం పలికాడు.
అద్య  ధారా  సదాధారా  సదాలంబా సరస్వతీ
పండితః  మండితః  సర్వే భోజ   రాజే   భువం  గతే 

(ఈ రోజు భోజరాజు భువికి వచ్చాడు. ఆయన రావడంతోనే ధారా నగరానికి ఆధారం దొరికినట్లయింది. సరస్వతీ దేవికి ఆలంబన దొరికింది. పండితులు ఆదరింపబడ్డారు.)
వెంటనే సింహాసనం మీద తెలివి తప్పి పడి  వున్న భోజరాజు స్పృహ లోకి వచ్చాడు.
పుంభావ సరస్వతి అయిన  కాళిదాసు వాక్శుద్ధిని తెలిపే కథ ఇది.

25, ఆగస్టు 2011, గురువారం

దేవ దేవ మము ...

నాన్నమ్మ పాట


దేవ దేవ మము కాపాడుము 
నీ పాదములే గతి మురళీ మోహన ...


కనుపడరాదా కనులకు మాధవ
హరి నారాయణ గో..ఓ..ఓ..వింద...||దేవ దేవ మము||


అనుదినమును నీ నామామృతమే
పారాయణ జేసెద శ్రీ...ఈ..ఈ...కృష్ణ...||దేవ దేవ మము||

16, ఆగస్టు 2011, మంగళవారం

లివింగ్ రూం సిండ్రోం

మే నెల వనితా మాలికలో నా వ్యాసం ఇక్కడ చదవండి.


మా ఇంటికి ఎవరు వచ్చినా మా బుజ్జి జింక (అంటే మా జింక కళ్ళ కిరణ్ అన్నమాట)ఎగురుకుంటూ - ఇది మా అన్న మ్యూజిక్ రూం, ఇది మా అన్న బెడ్ రూం, మా మాస్టర్ బెడ్రూం,మా బొమ్మల క్లోసెట్ - అంటూ ఒక చిన్న టూర్ ఆఫ్ ది హౌస్ కార్యక్రమం జరిపిస్తాడు. అదృష్ట వశాత్తూ వీలైనంత వరకూ ప్రతీ వారం క్లీనింగ్ పేరుతో ఇల్లు పీకి పందిరేసే అలవాటు నాకు, నా ఇద్దరి బుడుగులకి వుంది కాబట్టి మా అతిథులకి మనస్తాపం కలిగించే దృశ్యాలు ఎక్కువ వుండవు మా ఇంట్లో :) )

కాని అప్పుడప్పుడూ ఆఫీసులో మేజర్ రిలీజ్ టైం లోనో, ఇంకే కారణాలవల్లనో  ఒక్కోసారి ఎక్కడివి అక్కడే వదిలేసి చిన్న కిష్కింధని మరిపించేలా చేసి మా సృజనాత్మకతకి మేమే జై చెప్పుకుంటూ, చేతికి, కాలికి అడ్డు వచ్చిన వాటిని కంటికి ఆననీయకుండా (దీనికి నా ముద్దు పేరు - becoming selectively blind) – మా జీవ వ్యాపారాలు- అంటే వంట, హోమ్వర్కులు-అన్నీ కానిచ్చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు  హఠాత్తుగా మా శ్రీవారు బదరి మా ప్రశాంత జీవితాల్లో ఒక కలకలం వచ్చేలా ఒక అనూహ్య ప్రకటన చేస్తారు - సాయంత్రం మనింటికి చంద్ర శేఖర్ వస్తున్నారు - తెలుగు సినిమా డివిడిల కోసం అని. అసంకల్పిత ప్రతీకార చర్యలా కళ్ళు ఇల్లంతటినీ ఒకసారి స్కాన్ చేస్తాయి. ఇంకేముంది గబగబా పోటీలు పడుతూ నేనూ, నా సుపుత్రులూ ప్లానింగ్ డెస్క్ మీద వున్న పుస్తకాలు, కాగితాలు అన్నీ హడావిడిగా క్రింద నున్న సొరుగుల్లో తోసేస్త్తాం . లివింగ్ రూం సోఫాల్లో వున్న ఆఫీసు లాప్ టాపులు, హోమ్వర్క్ పేపర్లు,సగం మడతేసిన బట్టలు - వగైరాలు పై ఫ్లోర్ కి రవాణా చేసేస్తాం. అలా యుద్ధ ప్రాతిపదిక మీద ఇల్లంతా సర్దేసి (క్రింద భాగమే సుమా!) డివిడిల సముదాయాన్ని సిద్ధంగా ఉంచుతాం. మేము కూడా బొమ్మల కొలువులో అప్పుడే అమర్చిన బొమ్మల్లా కూర్చుంటాం. రావాల్సినవారు వచ్చి కావలసినవి తీసుకువెళ్లగా మళ్ళీ మా పనుల్లో పడిపోతాం. అసలు తమాషా ఇక్కడే ప్రారంభం.పాపం వచ్చినాయన కాలికి తట్టుకుంటాయనో, కంటికి బాధ కలిగిస్తాయనో అనేక దిక్కులకి రవాణా కాబడ్డ వస్తువులన్నీ ఎక్కడికి చేరాయో అక్కడే ఉండిపోతాయి (సెలెక్టివ్ మెమరీ :) ).ఆ తదుపరి వచ్చు దినాల్లో ఎవరికి ఏం కావాలన్నా అంజనం వేసి కనిపెట్టాల్సిందే :) ).అలాంటప్పుడే అనిపిస్తుంది - ఛ! ఇంకెపుడూ ఏదీ వాయిదా వేయకూడదు అని. దానితోపాటు ఇంకో ఆలోచన కూడా వస్తుంది - అసలెందుకు, ఏ ఉద్దేశ్యంతో అంత పడుతూ లేస్తూ ఎవరో వస్తున్నారని లివింగ్ రూం మాత్రం శుభ్రం చేశాం అని.

అంటే ఎవరికైనా ఇల్లు   చూపించేటప్పుడు గాని, మనని మనం పరిచయం చేసుకునేటప్పుడుగాని ఎందుకు మన “మంచి” వైపునే చూపించడానికి ఇష్టపడతాం? అలా అని మన ఇంట్లో ప్రతీ గదిని,మన వ్యక్తిత్వంలో ప్రతీ కోణాన్ని ఎప్పుడూ ఎందుకు శుభ్రంగా, స్వచ్ఛముగా ఉంచుకోం?

ఉదాహరణకి ఒక ఇంట్లో పిల్లాడి చదువు విషయమై హోరా-హోరీ గొడవ జరుగుతోంది అమ్మ,నాన్న, అబ్బాయిల మధ్య. తండ్రి అంటాడు - ఒరే! ఇలా చదివితే ఆఫీసుల్లో కాఫీ కప్పులు మోయడానికి కూడా పనికిరావు. ఆ సుబ్బారావు గారి అబ్బాయిని చూడు - ఎప్పుడూ చదువుతూనే ఉంటాడు. వాడిని చూసి బుద్ధి తెచ్చుకో- అలా గాడిదలా తిరక్క అని. ఆ తల్లి కూడా తమ పుత్రరత్నం బాగుపడాలనే మంచి ఉద్దేశ్యంతోనే తన వంతు అక్షింతలు కూడా వేస్తుంది. ఒక్కోసారి చదివిన చదువులకి, వ్యక్తిగత ప్రపంచంలో వాడే భాషకి ఏమీ సంబంధం వుండదు అనిపిస్తుంది- కొందరి పదాల వాడుక వింటుంటే. ఆరకంగా ఆ తలిదండ్రుల నుంచి తన వారసత్వపు పదసంపదని మననంతో వృద్ధిచేసుకుంటూ ఆ సుపుత్రుడుండగా - ఇంటి కాలింగ్ బెల్ మ్రోగుతుంది. అంతే డైరెక్టర్ కట్ చెప్తే మారిపోయే సీనులా గబగబా ముఖాలకి నవ్వు రంగులద్దుకుని తలుపులు తీస్తారు. చాల సభ్యతాయుతమైన ప్రవర్తనతో, భాషతో అతిథిని అలరిస్తారు, అవే నవ్వులతో సాగనంపుతారు. తలుపు మూయగానే మళ్ళీ ఇందాకటి అంకానికి తెర తీస్తారు. మరి అంతకు ముందు వాడిన “అచ్చ” తెలుగులోనే అతిథితో కూడా మాట్లాడవచ్సుగా? అమ్మో! అలా అయితే ఇంకేమైనా ఉందా? మన పరువు పోదూ? పోనీ ఆయనతో మాట్లాడినట్టే ఇంట్లో సమస్యలు కూడా సామరస్యంగా, అనునయంగా మాట్లాడి సాధించుకోరాదూ? ఆ! బయటి వాళ్ళతో ఎలాగూ తప్పదు - ఇంట్లో కూడా మనం మనలా ఉండకపోతే ఎలా? చాలా విచిత్రమైన, ఒప్పుకోదగిన వాదనే ఇది :) 

ఇంకో కోణంలో చూస్తే కొందరుంటారు. జీవితం అంటే సరైన అవగాహన వుండదు. మనం, మన సుఖం తప్ప ఇంకోటి పట్టదు. ఇతరుల కష్టసుఖాలకి తమ ప్రమేయం లేదు కాబట్టి పట్టించుకోవక్కర్లేదు అంటూ ఉంటుంటారు. కానీ వీరికి అన్నివేళల్లోనూ తాము చేసే ప్రతీ పనిని ఎవరో గుర్తించాలనే కోరిక వుంటుంది. దానితో గొప్పకోసం తమ ఇంటికి వచ్చేవారికి (ఈ వచ్చేవారికి అన్నీ వుంటాయి- డబ్బూ, హోదా - మరి అలాంటి వారికి చేస్తేనే కదా గుర్తింపు!)అవసరం అయిన దానికన్నా ఎక్కువ మర్యాదలు చేస్తారు - మనసులో వారంటే నిజంగా ఇష్టం లేకపోయినా. ఆ వున్న కాసేపట్లో తమ గురించి అవతల వాళ్ళ మనస్సులో మంచి ఇంప్రెషన్ కలిగించడానికి తాపత్రయ పడతారు. వాళ్ళు వెళ్ళాక షరా మామూలే - వారి మీద తమదైన చెడు ఉద్దేశ్యాన్ని బయటపెట్టడానికి ఆలోచించరు, వెనకాడరు. దురదృష్ట వశాత్తూ ఇలాంటి ప్రవర్తనకే చాలా మంది అలవాటు పడ్డారు.

ఇదిగిదిగో ఇలా వుండే, వుండాలనిపించే వైఖరికే నేను పెట్టుకున్న పేరు - లివింగ్ రూం సిండ్రోం.ఎవరైనా వస్త్తున్నారంటే-సర్దబడే ఇల్లు - చుడిదార్లోకో, చీరలోకో మారే నైటీలు - కొత్తగా ఇంగ్లీషు,కొంచెం సంస్కారం చేరే భాష - ముక్కులు తుడవబడి ముద్దు చేయబడే పిల్లలు -సందర్భానుసార ముసుగేసుకున్న వ్యక్తిత్వాలు - ఇవీ ఈ లివింగ్ రూం సిండ్రోం లక్షణాలలో కొన్ని. దీనికి మందేమిటయ్యా అంటే ఎవరికి వారి మనస్సాక్షి, విచక్షణ. పరిసరాల శుభ్రతే కాదు ఆలోచనకీ, మాటకీ, మనసుకీ శుభ్రత ఉండాలనే ఎరుక
.