బాధేసిన కబుర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
బాధేసిన కబుర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, అక్టోబర్ 2018, ఆదివారం

కలి ముందా? ఆకలి ముందా?



అప్పుడెప్పుడో దినపత్రికలో వార్త చదివా
జులై ఇరవై నాలుగో తారీఖు, రెండువేల పద్ధెనిమిదో సంవత్సరం
ముగ్గురు బుల్లితల్లులకు ఆకలేసిందని
మతి కుదురు లేని అమ్మ ఆమ్ పెట్టలేదని
ఎటో వెళ్లిన నాన్నకి ఇంటిదారి గుర్తు లేదని 
అందుకని ఆ ముగ్గురూ అమ్మ ఎత్తుకుని పాడిన "ౘందమామ రావే - జాబిల్లి రావే" పాటలో పాలబువ్వ తాయిలం వున్న వెండిగిన్నె ఏదని ఆ మామనే అడుగుదామని ఆకసానికెగిరెళ్ళారని.


తర్వాత ఇన్ని రోజులకు ఈ రోజు "ఆకలి" అనే మాట మీద గూగుల్ చేసి చూశా 
ప్రజలెవరైనా ఎక్కడైనా ఇదేమన్యాయం అని పాలకులని నిలదీస్తారేమోనని
సమస్యని భుజానికెత్తి మోసే సున్నిత మనస్కులు మన సుకవులు కలలోనైనా ఆకలి కేకల కవితలను కలవరిస్తారేమోనని
ఇది మా ఉనికి అని చాటుకునే ఏ కులంవారైనా మా ఆడపడుచులపై వివక్షని సహించబోమంటారేమోనని
ఏ మతగురువైనా ఆ చిన్నారుల ఆత్మశాంతికి ఓ రెండు నిముషాలైనా మౌనం పాటిస్తారేమోనని
శాసనసభల్లో చిన్నారి ప్రాణాలు కాపాడలేకపోయామని భాద్యత వహిస్తూ రాజీనామాలు  సమర్పిస్తారేమోనని
పదవులు, పార్టీలు  తలకిందులౌతాయేమోనని
ప్రధానమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారేమోనని
రాష్ట్రపతి నిర్ఘాంత పోతారేమోనని...

ఉహూఁ ... అంతటా నిశ్శబ్దం! గప్ చుప్!
ఆ పాపలు ఏ కులం వారని అక్కున చేర్చుకుంటారు?
ఎవరికీ చెందని పేదకులం కదా!
ఆ పిల్లలు ఏ మతం వారని ఎత్తుకు మోస్తారు?
ఏదీ కాని బీదమతం కదా!
వాళ్ళ ఆయిష్షు అంతే!
కాలం తీరిపోయింది
అలా జరగాల్సి వుంది
జరిగిపోయింది
భేష్! కర్మసిద్ధాంతం అన్వయించుకోవడానికి ఇంతకు మించిన దృష్టాంతం ఇంకెక్కడ దొరకును?

స్ట్రైకులు లేవు ధర్నాలు లేవు
కొవ్వొత్తుల జాగరణలు లేవు
గిడ్డంగుల్లో ఎలుకల కడుపుల్లో చేరుతున్న తిండిగింజను బయటికి తేవాలని ఆందోళనల్లేవు
రేషన్ షాపుల్లోని మూటల బియ్యం ముక్కిపోకుండా వండి వారుద్దామన్న ఆలోచనల్లేవు

ఒకవేళ ఆ పాపలు రోడ్డు మీదకొచ్చి కారు పక్కన నించుని ఆకలేస్తోంది అన్నం పెట్టమని చేయి చాచితే ఏం జరిగేదో?
ఎవరైనా ఇచ్చేవారా?
అమ్మో! వీళ్లకిస్తే ఇంకో పది మంది వస్తారని తల తిప్పుకునేవారా?
ఒక్కసారిస్తే రోజూ ఇదే అలవాటయిపోతుంది అని పో-పొమ్మనేవారా?
మనమివ్వకపోతే ఇంకొకరిస్తార్లే అని ఉదాసీనులయ్యేవారా?
నిజంగా ఆకలేసే అడుగుతున్నారా?
ఆ వంకతో  డబ్బులు పట్టుకు పోదామనుకుంటున్నారేమో అనుకుని కసిరి పంపిస్తారా?
అందుకే అర్జెంటుగా ఇప్పుడు చేయిచాచే వారి యాచన-యాతన నిజమా కాదా అని  కొలిచే ఆకలి-మీటరొకటి కనిపెట్టాలేమో!
అప్పుడు అసలు-సిసలు ఆకలి ప్రాణులకి మాత్రమే అంతో ఇంతో ఇచ్చి అపాత్రదానదోషం అంటకుండా ఎంతో పుణ్యాత్ములైపోదుము.
ఆ ఆకలి-మీటరు కూడా మనందరికీ ఉచితంగా ఇవ్వాలని అడగాలి
ఊరికి ఉపకారం చేయబోయేవారం కదా!
ఆ మాత్రం ఉద్ధారక హోదా ఉండాల్సిందే!

ఇంకో విషయం...
పందికి మనిషి పుట్టాడని
తిరుపతి గుడి తలుపులు వేసేస్తామన్నారని
విని, చదివి కలికాలం అంతమయ్యే రోజు వచ్చేస్తోందని గగ్గోలు పెడుతున్న వారందరికీ
తెలియని రహస్యమొకటుందండోయ్!
ఆ కలి పురుషుణ్ణి మించిన ఆకలి-పురుషుడు వచ్చేశాడు!
అకాల(మృత్యు)జ్ఞానం రాసే వెళ్తాడు...
ఇప్పుడింక ఎవరికి వారు వేసుకోవాల్సిన ఇంకో అంతులేని ప్రశ్న...
కలి ముందా? ఆకలి ముందా?

(https://www.epw.in/te/journal/2018/31/editorials/who-accountable-starvation-deaths.htm)