ఇంతలో... ౘలికి వణికి వడలిపోకుండా - ఇంట్లో వెౘ్చగా ఉండి - పౘ్చగా పెరుగుతాయని - సన్‌రూం లోంచి ఇంటి లోపలికి తెచ్చి - ఎండ తగిలే కిటికీల దగ్గర పెట్టిన మొక్కలు గుర్తొచ్చాయి. మేము ఊరెళ్ళి వచ్చేలోగా ఎండి వాడి పోకూడదు కదా! అందుకని - వాటన్నిటినీ ఓ సారి చేత్తో తాకి పలకరించి - వాటి మొదళ్ళలో కాసిన్ని నీళ్ళు చిలకరించాను.
మొత్తానికి పదిన్నరకల్లా పప్పు ఆములూ, ఉప్మాలూ తినేసి - సూట్కేసు, బాక్పాకులూ సర్దేసుకుని - తలుపులన్నీ వేసేసుకుని - మాస్కులు పెట్టుకుని - "ఎయిర్ పోర్టుకి దారేద్దారేది?" అనుకుంటూ ఉండగానే పెద్దాయన ఎఫిమ్ తన నల్ల-కాఱ్ఱథం (క్యాబ్) మా ఇంటి ముందు నిలిపాడు.
మాతో పాటు కారెక్కుతున్న బుజ్జిజింకని చూసి ఎంత పెద్దవాడయ్యాడో అని తెగ ఆశ్చర్యపోయాడు. ఆయన వాణ్ణి 2019 డిసెంబర్ తర్వాత ఇదే చూడడం మరి.
ఎయిర్ పోర్ట్ చేరగానే - బోర్డింగ్ పాసుల్లో చూస్తే - బద్రికి, బుజ్జిజింకకి TSA ప్రి-చెక్ ఉంది, నాకు లేదు. బద్రి వెళ్ళి నన్ను కూడా వాళ్ళిద్దరితో పాటే TSA ప్రి-చెక్ లైన్లో వెళ్ళనిస్తారా అనడిగితే ఆ ఎయిర్ పోర్ట్ వాళ్ళు "కావాలంటే మీ ఇద్దరూ కూడా మీ ఆవిడతో మామూలు లైన్లో వెళ్ళండి" అని ఉదారమైన ఉచిత సలహా ఇచ్చారు. అలా వద్దులే అనుకుని నేనొక్కదాన్నీ మామూలు లైన్లో సెక్యూరిటీ చెక్‌కి వెళ్ళాను.
మొత్తానికి అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో ఎక్కాము.
ఫ్లైట్లో రెండున్నర గంటల ప్రయాణం. అందుకని నాకూ, బుజ్జిజింకకీ బోర్ కొడితే ౘదువుకోవడానికి ఉంటాయని బద్రి తన బాక్‌పాక్‌లో ఓ మూడు పుస్తకాలు తెచ్చారు - ఒకటి రీడర్స్ డైజెస్ట్, రెండోది కొత్తగా కొన్న "డైరీ ఆఫ్ ఎ వింపీ కిడ్" 16 వ పుస్తకం (బిగ్ షాట్), మూడోది వోడ్‌హౌస్ పుస్తకం (సమ్మర్ లైట్నింగ్).
ఫ్లైట్లో కిటికీ పక్క సీట్లో కూర్చోగానే - విమానం కిటికీ లోంచి ఎండ నేను పెట్టుకున్న తళతళల మాస్క్ మీద పడి పరావర్తనం చెంది నా చుట్టూ బోల్డు మిలమిలలు మెరిశాయి.
ఆ తళతళల మిలమిలల్ని కెమెరాతో ఒడిసి పట్టుకున్నాం.
ఫ్లయిట్ పైకి వెళ్ళి కుదుపు లేకుండా కదులుతుండగా కాసేపు వింపీ కిడ్ పుస్తకం చదివాను. నాకు జెఫ్ కిన్నీ రాసిన వింపీ కిడ్ సిరీస్ పుస్తకాలు అంతగా నచ్చవు - కానీ నాకు నచ్చిన చోట్లు వెతుక్కుని మరీ చదువడం నచ్చుతుంది.
ఇంకాసేపు ఎయిర్-హోస్టెస్ ఇచ్చిన టొమాటో జ్యూస్ తాగి, ప్రెట్జెల్స్ నమిలాను.
ఆ తర్వాత కాసేపు ఆకాశపు నీలం కింద గాలిపొర ఒకటి అద్దంలా అమరగా - ఆ గాలి-అద్దమ్మీద బోర్లా పడుక్కుని కిందున్న చెట్లూ, పుట్టల కేసి చూస్తున్న బొద్దు-అబ్బాయిల్లా ఉన్న దూది-మబ్బుల కేసి చూశాను.
ఇంతలో ఫ్లయిట్ న్యూ యార్క్ - లగ్వార్డియా ఎయిర్ పోర్టులో దిగింది. అప్పటిదాకా ఎగిరొచ్చిన ఆయాసాన్ని తీర్చుకుంటూ నేల మీద నెమ్మదిగా దొర్లుతున్నట్టుగా కదులుతోంది.
నన్నప్పటికే కిటికీ సీటు లోంచి మధ్య సీటు లోకి పంపేసిన బుజ్జిజింక వాళ్ళ స్నేహితులకి ""నేను చూసిన వింత పక్షులు మీరూ చూస్తారా?" అని టెక్స్ట్ చేసి - వెంటనే వాడి ఫోన్‌తో నేల మీదున్న విమానాల ఫోటోలు తీసి పంపించాడు. అలా పంపిస్తున్నానని నాకు చెప్పి అల్లరిగా నవ్వాడు. వాడూ, నేనూ కాసేపు వాడి ఫ్రెండ్స్ ఆ మెసేజ్ ౘదివి, ఆ తర్వాత వచ్చిన ఫోటో చూసి ఎలా రియాక్ట్ అయుంటారో ఊహించుకుని నవ్వుకున్నాం.
ఎయిర్ పోర్టు లో దిగగానే అన్నజింకకి ఫోన్ చేశారు బద్రి. వాడు తనున్న అపార్ట్‌మెంట్ దగ్గర్నుంచి బయల్దేరి సరాసరి హోటల్ దగ్గరికి వచ్చేస్తానని చెప్పాడు.
ఎయిర్ పోర్ట్ నుంచి టైమ్స్ స్క్వేర్‌లో ఉన్న హోటల్ దగ్గరికి వెళ్ళడానికి మాట్లాడుకున్న టాక్సీ వస్తుందని చాలాసేపు ఎదురు చూశాం. విమానం దిగి గంట పైగా అవుతున్నా టాక్సీ రాలేదు. ఆ డ్రైవర్ ఫోన్ చేసి ట్రాఫిక్ ఎక్కువగా వుందీ, ఇంకా ఆలస్యం అవుతుందీ అని చెప్పాడు. అప్పుడు బద్రి ఆ టాక్సీని వద్దని చెప్పి ఊబర్ తీసుకున్నారు.
మేమెక్కిన ఊబర్ డ్రైవర్ పేరు సీజర్. ఎయిర్ పోర్టులో ఎక్కిన దగ్గర్నుంచి హోటల్ దగ్గర దిగేవరకు మమ్మల్ని ప్రశ్నలు అడుగుతూ, మా సమాధానలు వింటూ, బదులుగా మా చేత ప్రశ్నలు అడిగించుకుంటూ, తను సమాధానాలు చెప్పుకుంటూ - బోల్డన్ని కబుర్లు చెప్పాడు.
మమ్మల్ని "మీరు ఎక్కడి నుంచి - ఇండియానా, పాకిస్తానా?" అనడిగాడు సీజర్.
అతనిది హోండురాస్ దేశం అని చెప్పాడు.
అలా చెప్తూ "మీ ఇండియా-పాకిస్తాన్ లాగే మా దేశాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు రెండు ముక్కలు చేశారు - హోండురాస్‌కే పక్కనున్న బెలీజ్‌కి 'బ్రిటిష్ హోండురాస్' అని పేరు పెట్టి ఇంకో దేశాన్ని చేశారు. కాకపోతే మా రెండు దేశాల్లో భాష, ఆహారం, ఆచారవ్యవహారాలు అన్నీ ఒకేలా వుంటాయి. అందుకే మా మధ్య అంతగా గొడవలు ఉండవు." అని సీజర్ చెప్తుండగా వింటున్న నాకు ఎప్పుడో రీడర్స్ డైజెస్టులో ౘదివిన సెర్బియా-క్రోషియా యుద్ధం గురించిన వ్యాసమొకటి గుర్తొచ్చింది.
ప్రపంచం మొత్తం లోనూ ఇలాంటి ఎన్నో ఇరుగు-పొరుగు దేశాల మధ్య చిచ్చులు - ఈ పడమటి సంపన్న దేశాలకి - మా తూర్పుగోదావరి జిల్లాల సంక్రాంతి కోడిపందాల్లాంటి - వినోదమైపోయాయనిపిస్తుంది నాకు.
అలా కబుర్లు వింటూ అప్పటికే చిక్కబడుతున్న చీకట్ల ఆసరాతో మిడిసిపడుతున్న దీపతోరణాల వెలుగుల్లో మెరిసిపోతున్న న్యూ యార్క్ నగర వీధులని కళ్ళార్పకుండా చూసుకుంటూ - సాయంకాలపు రష్ అవర్ ట్రాఫిక్కులో ఆగుతూ-సాగుతూ, సాగుతూ-ఆగుతూ మొత్తానికి హోటల్‌కి చేరుకున్నాం.
హోటల్లో మా రూం నంబర్ 3935 - అంటే 39వ అంతస్తులో 35వ గది.
మా గది నుంచి చూస్తే టైమ్స్ స్క్వేర్ - ధగధగలాడుతున్న లైట్ల వెలుగులో ఎలా కనిపించిందంటే
చీకటెరుగని -
పట్టపగటి ౘందంగా...
చీకూ-చింతా తెలియని -
పట్టపగ్గాల్లేని ఆనందంలా...
అంత ధగధగల టైమ్స్ స్క్వేర్ ఫోటో తీయబోతే - నా కంటికి అంతగా అడ్డమనిపించని దుమ్ము పొర కెమెరా కంటికి మసగ్గా ఆనింది.
ఆ మసక-చిత్తరువే దాచుకున్నా - తొలిచూపు మైమఱపుకి గుర్తుగా.
అన్నజింక హోటల్లో ఉన్న మా దగ్గరికి వచ్చేటప్పటికి రాత్రి ఏడుంపావు అయ్యింది.
టైమ్స్ స్క్వేర్ నుంచి భోజనం చేయడానికి వెళ్ళేటప్పుడు నలుగురం - బద్రి-నేను, అన్నజింక-బుజ్జిజింక - రెండు జట్లుగా (టీమ్ స్క్వేర్) నడుచుకుంటూ వెళ్ళాం.
ఆ పూటకి మా భోజనం "బెంగాల్ టైగర్" అనే రెస్టారెంటులో.
వాక్సినేషన్ కార్డులు చూశాకే కూర్చోవడానికి కుర్చీలు చూపెట్టారు. నలుగురం భోంచేశాక సబ్-వే ట్రెయిన్ ఎక్కి 49-th స్ట్రీట్ స్టాప్ దగ్గర దిగగానే సుహాస్ మమ్మల్ని అక్కణ్ణించి నడుచుకుంటూ 46-th స్ట్రీట్‌లో వున్న మా హోటల్ రూంకి వెళ్ళండని చెప్పి, వాడు తన అపార్ట్‌మెంట్‌కి వెళ్ళిపోయాడు.
వెళ్తూ మరుసటి రోజు పొద్దున్నే తొమ్మిదింటికల్లా తయారుగా వుంటే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూడడానికి వెళ్దామని చెప్పాడు.
సుహాస్ వెళ్ళిన తర్వాత బద్రి స్నానం చేసి నిద్రపోయారు.
నేను, బుజ్జిజింక ఎదురుగుండా వెలుగుతున్న లైట్లు - అక్కడ పెద్దపెద్ద ఎలెక్ట్రానిక్ బిల్‌బోర్డుల మీద కనిపిస్తున్న అడ్వర్టైజ్‌మెంట్లు చూస్తూ - కాసేపు కబుర్లు చెప్పుకున్నాం.
ఆ తర్వాత వాడు ఫోన్లో - స్పాటిఫైలో పాటలేవో వింటానన్నాడు.
నేనేమో కాసేపు సంస్కృతం హోంవర్క్ చేశాను.
మిరుమిట్లు గొలిపే విరోధాభాస (oxymoron) కొసమెఱుపు ఏంటంటే -
హోటల్ రూంలో టీవీ పెట్టగానే వస్తున్న వార్తల్లో ఆ వార్తలు చదివే అమ్మాయి "అభివృద్ధి చెందుతున్న ఇండియా లాంటి దేశాల్లో విద్యుచ్ఛక్తి వాడకం బాగా పెరుగుతోంది" అని చెప్తుండగా - అది విన్న చెవులూ - టైమ్స్ స్క్వేర్‌లో పగలూ, రేయీ ఆగకుండా వెలిగే వేయి సూర్యుళ్ళ వెలుగుల లైట్లు - అవి చూసిన కళ్ళూ - నావే కావడం.